k ramachandra murthy
-
చిరస్మరణీయ నేత పీవీ
ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారత దేశానికి ప్రధానమంత్రులుగా ఎందరో పని చేశారు. చరిత్రలో ఒకానొక ప్రధానమంత్రి స్థానం ఏమిటో నిర్ణయించే క్రమంలో పరిశీలనకు వచ్చే అంశాలలో యుద్ధం ప్రధానమైనది. యుద్ధం గెలిచిన ప్రధానులకు దేశప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఉంటుంది. పాకిస్తాన్‌పైన 1965లో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది కనుక నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి పట్ల భారతీయులకు అపారమైన అభిమానం. 1971లో తూర్పు పాకిస్తాన్లో సంభవించిన తిరుగుబాటు సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన మరో యుద్ధంలో ఘనవిజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధిని ప్రజలు ఎప్పటికీ విజయేందిరగానే గుర్తు పెట్టుకుంటారు. కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు. పరిమితమైన యుద్ధమైనప్పటికీ పాకిస్తాన్ సేనలను కార్గిల్ నుంచి తరిమికొట్టినందుకు వాజపేయికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 1999 ఎన్నికలలో గెలిపించారు. రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా అప్పటి ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఫ్రాన్స్ అధినేత చార్లెస్ డీగాల్ ఆయా దేశాల ప్రజలకు ప్రాతఃస్మరణీయులైనారు. 1962లో చైనా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి వరకూ నవభారత నిర్మాతగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, గాంధీజీ ప్రియశిష్యుడుగా, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ప్రగతిరథ సారథిగా, అలీనోద్యమ నేతగా పేరుప్రఖ్యాతులు గడించిన నెహ్రూ చైనా చేతిలో ఓటమితో అపఖ్యాతిపాలైనారు. 1962 నవంబర్‌లో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకుండానే 1964లో నెహ్రూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చైనాతో భారత్‌కు సరిహద్దు యుద్ధం ఇంతటితో ఆగిపోతుందో లేక కొనసాగుతుందో తెలియదు. అంతిమ ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ ప్రభ నిలిచి వెలుగుతుంది. ఒక ప్రధాని లేదా ఒక దేశాధ్యక్షుడి జీవితంలో యుద్ధం అత్యంత ప్రధానమైనది. యుద్ధంలో గెలిచి నిలిచిన ప్రజానాయకుల రాజకీయ జీవితాలలో అపజయాలు ఉన్నప్పటికీ చరిత్ర వాటిని పెద్దగా పట్టించుకోదు. దేశాల చరిత్రను మలుపు తిప్పినవారికి పెద్ద పీట వేస్తుంది. దేశ తొమ్మిదవ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) చేసిన యుద్ధం సరిహద్దులో కాదు, విపణిలో. ప్రజల మస్తిష్కాలలో. దిగజారిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పీవీ చేసిన పోరాటం చరి త్రాత్మకమైనది. బాబరీమసీదు విధ్వసం, జార్ఖండ్ ముక్తిమోర్చా పార్లమెంటు సభ్యుల కొనుగోలు వ్యవహారం, సెయెంట్ కిట్స్ కేసు, హర్షద్ మెహతా ఉదంతం, లక్కూభాయ్ పాఠక్ కేసు వంటి నిందలు వచ్చినప్పటికీ ఆయన స్వయంగా కోర్టులకు హాజరై నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతనే కన్నుమూశారు. తక్కిన కేసుల సంగతి ఏమైనా, జేఎంఎం ఎంపీల ముడుపుల వ్యవహారం మాత్రం పీవీకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. 1993 జులైలో లోక్‌సభలో బలపరీక్ష జరిగినప్పుడు పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా 244 మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 269 సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయాలి. విపక్షాలలో చీలిక తెచ్చి, ఏదో ఒక చాణక్యం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని, ఆర్థిక సంస్కరణలు గాడి తప్పకుండా ఉండాలంటే రాజ కీయ, నైతిక విలువలతో రాజీపడక తప్పదని పీవీ భావించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్, మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బూటాసింగ్లకు ప్రభుత్వాన్ని గట్టెక్కించే బాధ్యత అప్పగిం చారు. జెఎంఎం ఎంపీలనూ, జనతాదళ్‌లో అజిత్ సింగ్ వర్గీయులనూ సుముఖులను చేసుకున్నారు. టీడీపీని చీల్చారు. ములాయంసింగ్ మద్దతు సైతం స్వీకరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 265 ఓట్లూ, వ్యతిరేకంగా 251 ఓట్లూ వచ్చాయి. ఆ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పీవీ చేసింది నైతికంగా తప్పే అయినప్పటికీ, అప్పుడు కనుక ప్రభుత్వం కూలిపోయి ఏ దేవగౌడ వంటి నాయకుడో ప్రధానిగా వచ్చి ఉంటే ఆర్థిక సంస్కరణలు దిశ కోల్పోయేవి. చరిత్ర మరోరకంగా ఉండేది. ఆరోపణలు కానీ, కోర్టు కేసులు కానీ, నైతిక తప్పిదాలు కానీ, బాబ్రీమసీదు వంటి కీలకమైన అంశంలో వైఫల్యం కానీ పీవీ సాధించిన ఆర్థిక విజయం ముందు దిగదుడుపే. చరిత్ర పీవీని దేశంలో లైసెన్స్–పర్మిట్ రాజ్ నడ్డివిరిచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడిగానే నమోదు చేస్తుంది. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది. అందుకే ఆయనకు సముచితమైన స్థానం కేటాయిస్తుంది. హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రధానకార్యదర్శిగా చేరి 1951లో రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ ఎంఎల్ఏగా, ఎంపీగా అనేక పర్యాయాలు గెలుపొందారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసి భూస్వాములు ఆగ్రహానికి గురైనారు. జైఆంధ్ర ఉద్యమం కారణంగా పదవి నుంచి వైదొలిగారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ కొలువులో ముఖ్యమైన పాత్ర పోషించారు. బహుభాషాకోవిదుడిగా, రచనావ్యాసంగంలో దిట్టగా పేరుప్రఖ్యాతులు కలిగిన పీవీ ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాల రూపకల్పన బాధ్యత నిర్వహించేవారు. కాంగ్రెస్ నాయకుడిగా అనేక పనులు చేస్తూనే విశ్వనాథవారి వేయిపడగలు హిందీలో సహస్రఫణ్‌గా అనువదించారు. ప్రణబ్ ముఖర్జీ లేక మరెవరైనా తీర్మానం రాసినా దాన్ని చదివి పీవీ ఆమోదించిన తర్వాతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్‌గాంధీ కానీ చర్చకు పెట్టేవారు కాదు. కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. అన్ని శాఖలలో రాణించారంటే అబద్ధం అవుతుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖనూ, విదేశీ వ్యవహారాల శాఖనూ అద్భుతంగా నిర్వహించారు. ఏ శాఖ నిర్వహించినా, ఏ పని చేసినా సృజనాత్మకంగా ఆలోచించి, కొత్త పోకడలు పోవడం, అదనపు విలువను జోడించడం పీవీ ప్రత్యేకత. స్వరాష్ట్రంలో జైళ్ళ శాఖను నిర్వహించినప్పుడు బహిరంగజైలు పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను పర్యవేక్షించినప్పుడు గురుకుల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మావన వనరుల మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. విదేశాంగ మంత్రిగా వందకు పైగా దేశాలను సందర్శించడమే కాకుండా చైనాతో చాలా ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిహద్దు సమస్యపై చర్చలు కొనసాగిస్తూనే ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవాలని ఇండియా–చైనా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్‌పై బీజింగ్‌లో సంతకాలు చేశారు. ఫలితంగా అప్పటి నుంచి మొన్నటి వరకూ భారత్–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందింది. వాణిజ్యంలో పరిస్థితి చైనాకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చైనాకు భారత్ ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ పది రెట్లు ఎక్కువ. నిజమే. కానీ చైనా ఎగుమతులలో 3.5 శాతం కంటే తక్కువే భారత్‌కు చేరుతున్నాయి. భారత్ ఎగుమతులలో 5 శాతానికి పైగా చైనాకు చేరుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు అయిదు రెట్లు ఎక్కువ అనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే చైనా వస్తువులను బహిష్కరించాలనీ, చైనాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలనీ ఎవ్వరూ వాదించరు. చైనాతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఎగుమతులను పెంచుకోవడం శ్రేయస్కరం. 1993లో చైనాతో పీవీ కుదుర్చుకున్న ఒప్పందం ఉభయతారకమైనది. దూరదృష్టితో చేసుకున్నది. నెహ్రూ అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రసిద్ధి గడించినప్పటికీ పక్కనే ఉన్న తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. భారత దేశానికి తూర్పు దిశగా ఉన్న సింగపూర్, మలేసియా, ఇండోనీసియా వంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆసియన్ టైగర్లుగా అంతర్జాతీయ విపణిలో గాండ్రిస్తుంటే ఆ దేశాలను విస్మరించడం సరి కాదని లుక్ ఈస్ట్ పాలసీని పీవీ ప్రతిపాదించారు. తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెంపొందించారు. వాణిజ్యం సంబంధాలను వృద్ధి చేశారు. ఇప్పుడు నరేంద్రమోదీ సర్కార్ అదే పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మరింత పదును పెట్టి అమలు చేస్తున్నది. ప్రధానిగా పీవీ ప్రమాణస్వీకారం చేసినప్పటి దేశ ఆర్థికస్థితి ఎట్లా ఉన్నది? రెండు వారాల దిగుమతులకు మాత్రం చెల్లించడానికి సరిపోను విదేశీమారకద్రవ్యం ప్రభుత్వ ఖజానాలో ఉంది. రెండు వారాలు దాటితే దిగుమతులకు డబ్బు చెల్లించలేని డిఫాల్టర్‌గా మిగి లిపోయే దుస్థితిలో దేశం ఉండేది. ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. భయపడుతున్న మన్మోహన్ సింగ్‌కు ధైర్యం నూరిపోసి, తాను అండగా ఉంటానని నచ్చజెప్పి ఆర్థికమంత్రిగా చేర్చుకున్నారు. పరిశ్రమల శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. నాటి ఆర్థికశాఖ సహాయమంత్రి (అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు) కురియన్ చేత పరిశ్రమల విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టించారు. రూపాయి విలువను 18 శాతం తగ్గించారు. లండన్ బ్యాంక్‌కి బంగారం నిల్వలు తరలించి విదేశీ మారక ద్రవ్యం సంపాదించారు. మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ (ఎంఆర్ టీపీ) చట్టాన్ని రద్దు చేసి లైసెన్స్ –పర్మిట్ రాజ్‌కు భరతవాక్యం పాడారు. దిగుమతి సుంకాలనూ, ఆదాయం పన్నునూ, కార్పొరేట్ పన్నునూ క్రమంగా తగ్గించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ఉదారంగా అనుమతించారు. ఫలితంగా 1992–97 ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధి రేటు సగటున 6.5 శాతం సాధించారు. ఇది అపూర్వం. పీవీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్ళలో ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతం. 1991లో అడుగంటిన విదేశీమారక ద్రవ్యం 1995 నాటికి 25.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరు తెచ్చుకున్నది. ఈ రోజున దేశం కరోనా కల్లోలంలో సైతం ఈ మాత్రం నిలబడి ఉందంటే అందుకు కారణం 1991లో పీవీ నాటిన బీజమే. పీవీ నిరాడంబరజీవి. ఆయనపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా అవినీతిపరుడని ఆయన బద్ధశత్రువులు కూడా అనరు. 1991 నాటికి సుదీర్ఘమైన తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చి రామానందతీర్థ ఆశ్రమంలోనో, కుర్తాళం పీఠాధిపతిగానో సమాజ సేవ చేయాలనే సంకల్పంతోనే పీవీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఎన్నికలలో మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం నుంచి శ్రీపెరంబదూరు వెళ్ళిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హంతకి మానవబాంబు రూపంలో వచ్చి పాదాల దగ్గర పేలిపోయి హత్య చేసిన కారణంగా రెండవ దశ పోలిం గ్లో ఎక్కువ స్థానాలు సంపాదించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. దుఃఖంలో మునిగిపోయిన సోనియాగాంధీ నమ్మకస్తుల మాట నమ్మి ముందు శంకర్ దయాళ్ శర్మకు కబురు పెట్టారు. ప్రధానమంత్రి వంటి గురుతర బాధ్యత నిర్వహించే ఆరోగ్యం తనకు లేదని ఆయన ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరించారు. శర్మకు ముసలితనంతోపాటు ఆరోగ్యం కూడా సరిగా లేదు కనుక పీవీకి ప్రధాని బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అర్జున్‌సింగ్ చేసిన సూచనను సోనియా అమలు పరిచిందని శరద్ పవార్ తన ఆత్మకథలో రాశారు. అలెగ్జాండర్ ఆత్మకథ ప్రకారం పీవీ పేరు సూచించిన వ్యక్తి హక్సర్. తన మాట జవదాటకుండా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే సోనియా పీవీకి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. పీవీ ప్రధానమంత్రిగా ఆత్మగౌరవంతో, స్థిరచిత్తంతో వ్యవహరిస్తూనే సోనియా పనులన్నీ చేయడానికి చిదంబరంను పురమాయించారు. కానీ అర్జున్‌సింగ్, ఎన్డి తివారీ, శివశంకర్, మాధవరావ్ సింథియా వంటి నాయకుల మాటలు విశ్వసించి పీవీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న సోనియా కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు. పీవీ పార్థివకాయాన్ని ఏఐసీసీ ప్రాంగణంలో ఉంచడానికి అనుమతించకుండా అవమానిం చారు. 1996లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన పీవీ రాజకీయంగా ఒంటరి జీవితం గడిపారు. కోర్టు కేసులు ఎదుర్కొంటూ, లాయర్ ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బం దిపడిన సందర్భాలు సన్నిహితులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పీవీని మాజీ ప్రధానిగా కూడా గుర్తించక పోయినా దేశ ప్రజలు ఆయన చేసిన సేవను ఎన్నటికీ మరచిపోరు. ఏళ్లు గడిచినకొద్దీ దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు పెరుగుతూ వస్తోంది. రాజకీయ జీవితం పూర్తయిం దని భావించిన తరుణంలో చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన దేశానికి ఆర్థికరంగంలో నూతన దిశా నిర్దేశం చేసిన సమర్థుడైన ప్రధానిగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు -
‘ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు’
సాక్షి, విజయవాడ: ప్రముఖ కాలమిస్ట్, కమ్యూనిస్ట్ నేత డాక్టర్ ఏపీ విఠల్ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం విఠల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విఠల్ గొప్ప మేధావి. కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్యకి ప్రియమైన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైద్యుడిగా పేదప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించారు. కమ్యూనిస్టు భావాలను నరనరాలలో జీర్ణించుకున్న వ్యక్తిగా.. నిబద్ధత గల కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. అలాంటి వారు ప్రస్తుతం మన మధ్య నుంచి దూరం కావడం తీరని లోటు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందుండి అనేక వ్యాసాలు రాశారు. జీవితంలో చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన' అంటూ విఠల్‌తో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా షుగర్, హృద్రోగంతో బాధపడుతున్న ఏపీ విఠల్ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. (సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత) -
ఫ్యాక్ట్ రాయాలి.. ఫిక్షన్ కాదు
-
‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మీడియాకు సంకెళ్లు అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే రామచంద్రమూర్తి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా నిరాధారమైన, తప్పుడు వార్తల రాసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ప్రతిపక్షాలు వక్రీకరించడాన్ని రామచంద్రమూర్తి తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు అవాస్తవాలు రాయడం సరికాదన్నారు. ఆధారాలు లేని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు వార్తలు రాసినప్పుడు వాటిని ఖండించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. తాము రాసిన వార్తలకు.. రిజాయిండర్‌ను(ప్రతిస్పందన) కూడా ప్రచురిండం లేదని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణంకాదని.. చట్టవిరుద్ధం అసలేకాదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే జీవో జారీ చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదన్నారు. సమాజానికి మేలు చేయడానికికే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు : అమర్ ఏపీలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ విలేకర్లతో మాట్లాడారు. మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని గతంలోనే పలు చర్చలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచకపోయినా.. ఎన్నో ఏళ్లుగా మీడియాకు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. కానీ కొంతకాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. వ్యక్తికి గానీ, సంస్థకు గానీ నష్టం కలిగేలా, బురద చల్లే ప్రయత్నాలు ఏ మీడియా చేయకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవోపై కొందరు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని.. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రాసిన వార్తలు నిజమైతే.. కోర్టుల ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు. -
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మహానేతకు నివాళి
సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతిని పురస్కరించుకొని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధికారులు డా. సుబ్రహ్మణ్యం, సాల్మన్ వెస్లీలను ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి ఉండ్రు రాజశేఖర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చల్లప్ప, సాక్షి మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారిగా పి సుబ్రహ్మణ్యం ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారని, మహానేత వైఎస్సార్ హయాంలో వచ్చిన అన్ని సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఏడేళ్ళ పాటు వివిధ దేశాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యం తన అనుభవాన్ని ఏపీలో ఆచరణలో చూపారని తెలిపారు. అంతేకాక సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారుల సేవలు స్పూర్తిదాయకమని తెలిపారు. చల్లప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు ఉన్నత విద్యావంతులు కావాలని కోరారు. అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తూ.. సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అలాంటి వారిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ మరణం తెలుగు ప్రజలను కలచి వేసిందని గుర్తుచేశారు. పదేళ్ల కిందట జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మహానేత వైఎస్సార్, అధికారులు మరణించడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దివంగత వైఎస్సార్‌ను గుర్తుచేసేలా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సంక్షేమంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే వైఎస్ జగన్ ప్రజల ఆదరణను పొందుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల రూపకల్పనలో మహానేత వైఎస్సార్ తోడుగా నిలిచిన సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు ప్రజలకు అత్యంత చేరువయ్యారని తెలిపారు. వారి అకాల మరణం సమాజానికి, ముఖ్యంగా దళిత సమాజానికి తీరని లోటు అని రామచంద్రమూర్తి పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన సుబ్రహ్మణ్యం పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరారని.. అటువంటి అధికారులు సమాజానికి అవసరమని అన్నారు. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వరాదని ప్రతీ క్షణం ఆలోచిస్తూ ఆ దిశగా పరిపాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రపై సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ’జయహో’ పుస్తకావిష్కరణ సభ ఎమెస్కో ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పేజీలకు పేజీలు ముద్రిస్తాయని, వైఎస్సార్సీపీ మాత్రం రెండు పేజీల్లోనే ప్రజలకిచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. 19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విజయవంతమైన యువనేత: శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే విజయవంతమైన, యువకుడైన కొత్త తరం నాయకుడని ‘ది ప్రింట్’ ఎడిటర్ ఇన్‌చీఫ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శేఖర్ గుప్తా పేర్కొన్నారు. జయహో పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మరెవరిలోనూ చూడని ఆత్మవిశ్వాసాన్ని తాను దివంగత వైఎస్సార్‌లో చూసినట్లు తెలిపారు. జగన్ రూపంలో వైఎస్సార్ వారసత్వం మన మధ్యే ఉందన్నారు. సొంతంగా ఓటింగ్ బలం ఉన్న 30 మంది ప్రాంతీయ నాయకులతో దేశం సుస్థిరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుగా నాలుగున్నర దశాబ్దాల తన వృత్తి జీవితంలో నూటికి నూరుపాళ్లు సంతృప్తినిచ్చిన కార్యక్రమం ‘జయహో’ పుస్తకరచన అని సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రచురణకర్త ఎమెస్కో విజయకుమార్ తదితరులు మాట్లాడారు. పాదయాత్ర ఫొటోలు తీసిన జర్నలిస్టులను ఈ సందర్భంగా అభినందించారు. పాదయాత్ర గుర్తొస్తే గొప్ప ఉత్తేజం: ముఖ్యమంత్రి జగన్ ‘పాదయాత్ర నిజంగానే గొప్ప అనుభవం. అంత దూరం నడిచానని గుర్తు చేసుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుంది. జగన్ వచ్చాడు.. మమ్మల్ని కలుస్తాడు... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారు. మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడనే వారి నమ్మకమే ఒక ఉప్పెనై అదే ఓటుగా మారింది. 50 శాతం ఓట్లతో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని విజయాన్ని ప్రజలు అందించారు. దేవుడి ఆశీర్వాదంతో వారి నమ్మకాన్ని నిజం చేసేలా ముందుకు వెళుతున్నాం’’ -
నవ్యాంధ్రలో ‘నవ’శకం
రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ విశ్వసనీయతే ప్రాణం. అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకులను ప్రజలు ఆరాధిస్తారు. మాటలకూ, చేత లకూ పొంతనలేని నాయకులను తిరస్కరిస్తారు. ఇది అత్యంత సరళమైన విషయం. ప్రజల కళ్ళు కప్పవచ్చుననీ, వారిని మభ్యపెట్టవచ్చుననీ, ప్రచార బలంతో నమ్మించవచ్చుననీ నాయకులు అనుకుంటే భంగపాటు తప్పదు. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో సమర్పించిన 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను నిజాయతీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఈ బడ్జెట్ వెల్లడిస్తుంది. ప్రభుత్వ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. జగన్ మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని ఆధిక్యంతో ఎన్నికలలో విజయం సాధించడానికి ఒకానొక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు పదేళ్ళపాటు కఠోర పరిశ్రమ, ప్రజలే కేంద్రంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాలూ, బీసీ డిక్లరేషన్ వగైరా కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్సీపీకి పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానం కల్పించాయి. రాజన్న రాజ్యం రూపంలో సంక్షేమ రాజ్యం నెలకొల్పుతానంటూ జగన్ మోహన్‌రెడ్డి బహిరంగసభలలో వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలనీ, వారిని అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలనీ సంకల్పం చెప్పుకున్నారు. పాదయాత్రలో కోటిమందికిపైగా సాధా రణ ప్రజలను కలుసుకొని వారి బాధలగాథలు ఆలకించి, ఆకళింపు చేసు కున్నట్టు బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయి. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా చేసేది చెప్పడం, చెప్పిందే చేయడం అనే ధర్మాన్ని ప్రభుత్వాలు పాటిస్తే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. ఆ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయా ణిస్తున్నట్టు బడ్జెట్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయిం పులు వేరు, వాస్తవంగా ఖర్చు చేయడం వేరు. ఊహించిన ఆదాయం అందక పోయినా, ప్రభుత్వాల ప్రాథమ్యక్రమం మారిపోయినా కేటాయింపులు ఘనంగా ఉంటాయి కానీ నిధులు విడుదల కావు. బాధ్యతాయుతమైన రాజ కీయ నేతలూ, పార్టీలూ ఎన్నికల ప్రచారంలో వినియోగించిన ప్రణాళికకు కట్టు బడి పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తారు. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమా వేశం (ప్లీనరీ)లో ప్రకటించిన నవరత్నాలనూ, బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశా లనూ సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదల ప్రభుత్వానికి దండిగా ఉన్నట్టు బుగ్గన బడ్జెట్ స్పష్టం చేస్తున్నది. సామాజికస్పృహ బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలలో సామాజిక సమతౌల్యం సాధించే ప్రయత్నం కనిపిస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనక» డిన వర్గాలకు చేయూతనిచ్చి ఆ వర్గాలను వేగంగా ముందుకు నడిపించాలనే తాపత్రయం ఉన్నది. వివిధ వర్గాల సంక్షేమానికి ఏమేమి చేయాలని సంకల్పించారో పాదయాత్ర సందర్భంగా బహి రంగ సభలలో జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రకటించిన అంశాలన్నింటినీ క్రమంగా, వేగంగా అమలు చేస్తూ వస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజ లను కలుసుకోవడం వల్ల, మాట్లాడటం వల్ల సమాజంలో ఎంతటి వైవిధ్యం ఉన్నదో, సమస్యల స్వభావం ఏమిటో, వందకుపైగా ఉన్న వెనుకబడిన కులా లవారికి మేలు చేయడం ఎలాగో ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మనసులో ఒక సామాజికన్యాయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం రూపు దిద్దుకొని ఉంటుంది. దాని ప్రభావం టిక్కెట్ల పంపిణీపైన ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ నిర్మాణంలోనూ ఉంది. ఆ వ్యూహం ప్రాతిపదికగానే ప్రాథమ్యాలు నిర్ణయించుకొని ఉంటారు. అదే పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తున్నది. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా సాగించాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు కేటాయింపులు నిరుటి కంటే పెరి గాయి. రూ. 2,27,974 కోట్ల బడ్జెట్వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలకోసం కేటాయించిన మొత్తం రూ. 75 వేల కోట్లు. దళితులలో మాలలకూ, మాదిగ లకూ, రెల్లి కులస్తులకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. ఎస్సీ ఉపప్రణాళికకు కేటాయించిన మొత్తం నిరుటి కేటాయింపు కంటే 33.60 శాతం అధికం. బీసీ ఉపప్రణాళికకు 15,000 కోట్లు కేటాయించడం కూడా విశేషం. నిరుటి కేటాయింపు కంటే ఇది 17.03 అధికం. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. టిక్కెట్ల కేటాయింపులోనూ, నిధుల మంజూరులోనూ బీసీలకు పెద్దపీట వేసి బీసీ డిక్లరేషన్‌లో చేసిన బాసలను నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఉపప్రణాళికకు నిధులు కేటా యించారు. అదే విధంగా నామినేషన్‌పైన ఇచ్చే చిన్న కాంట్రాక్టు పనులలో సగం బీసీలకు ఇస్తామంటూ జగన్మోహన్రెడ్డి వాగ్దానం చేశారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్ళలో పదివేల కోట్లు కేటాయిస్తామంటూ చేసిన వాగ్దానానికి అను గుణంగానే ఈ వార్షిక బడ్జెట్లో ఆ సామాజికవర్గానికి రెండు వేల కోట్లు ప్రత్యే కించారు. ఆయన సాధించిన అద్భుతమైన విజయంలో అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల పాత్రా ఉన్నది. పైగా కులాలకూ, ప్రాంతాలకూ, మతా లకూ, రాజకీయాలకూ, పార్టీలకూ అతీతంగా సర్వజన సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలన్నది వైఎస్ఆర్సీపీ అధినేత అభీష్టం. అందుకే అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం. మొత్తం 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. మేనిఫెస్టోనే మంత్రం ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలే. ఇచ్చిన వాగ్దానాలను మసిపూసి మారేడుకాయ చేయకుండా, షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుటిల యత్నాలకు ఒడిగట్టకుండా చెప్పినవి చెప్పినట్టు చేసే సంకల్పాన్ని బడ్జెట్ ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. నేలవిడిచి సాము చేయకుండా ఉన్న ఆర్థిక పరిమితులలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు అవసరమైన కేటాయిం పులు సముచితంగా జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మూడు ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రతిగ్రామానికీ తాగునీరు ఇవ్వాలని ప్రయత్నం. పింఛన్లకు కేటాయింపు లను మూడు రెట్లు పెంచారు. ఆటో డ్రైవర్లకూ, నాయీ బ్రాహ్మణులకూ, రజ కులకూ, మత్స్యకారులకూ, దర్జీలకూ, చేనేత కార్మికులకూ, బ్రాహ్మణులకూ, యువన్యాయవాదులకూ చేసిన వాగ్దానాలను విస్మరించలేదు. ప్రతి చేనేత కుటుంబానికీ సంవత్సరానికి రూ. 24వేలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. దీని వల్ల 98 వేల చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. ఆరోగ్యశ్రీ, 108 వంటి ఆరోగ్య పథకాలను పునరుద్ధరించి వైఎస్ హయాంలో ఎంత సమర్థంగా వినియోగించారో అంతే సమర్థంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించాలన్న తపన బుగ్గన బడ్జెట్లో కనిపిస్తున్నది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు కల్పించేందుకు అవసరమైన కేటాయింపులు కూడా చేశారు. అదే విధంగా ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా కార్యక్రమంలో విద్యుత్ వినియోగం పరిమితిని 200 యూనిట్ల వరకూ పెంచడం వల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎంత కేటాయించారన్నది కాదు ప్రశ్న. ఎంత ఖర్చు చేశారన్నది ముఖ్యం. నిగూఢ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయా, నిధులు దారిమళ్లాయా అనేవి బడ్జెట్ ప్రతిపాదనలలో నిశితంగా గమనించ వలసిన అంశాలు. ఈ బడ్జెట్లో అటువంటి నిగూఢమైన కోణాలు ఏవీ ఉన్నట్టు లేదు. బుగ్గన చెప్పినట్టు సింగపూర్ అంతర్జాతీయ విమా నాలకు లోటుభర్తీ (వయబిలిటీ గ్యాప్ ఫండ్) సమకూర్చాలా లేక వేలాది తల్లులకూ, పిల్లలకూ పోషకాహారం అందించాలా అనే ప్రశ్నే ఉదయించకూడదు. సింగపూర్ వ్యామోహంతో టీడీపీ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన ఉన్నది. విభజన కారణంగా నష్టబోయిన రాష్ట్రం, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న రాష్ట్రం. రుణభారం అధికంగా ఉన్న రాష్ట్రం. ఈ పరిమితులకు లోబడి పొదుపు చర్యలు తీసుకుంటూనే బడుగు వర్గాలకు పెద్ద పీట వేసే ప్రయత్నం బుగ్గన చేశారు. రైతన్నకు వెన్నుదన్ను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్పించిన వ్యవసాయ బడ్జెట్ సైతం అన్నదాతలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తగినట్టుగానే ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో 12.66 శాతం వ్యవసాయరంగానికి కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన రూ. 28,866 కోట్లు నిరుటి కంటే రూ. 9,796 కోట్లు అధికం. పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతుభరోసా పథకం కింద రూ. 12,500ల వంతున రూ. 8,796 కోట్లు అవసరం. కౌలురైతులకు సైతం ఇది వర్తిస్తుంది. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంపైనా శాసనసభలో ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సున్నా వడ్డీ రుణం తన హయాంలో ఇప్పించా మంటూ చంద్రబాబునాయుడు ప్రకటిస్తే, సత్యదూరమంటూ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు మైనస్ 4.12 శాతం ఉన్న దంటూ ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకటిస్తే వ్యవసాయంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి బిగ్గరగా చెప్పు కున్నారు. రెండు పక్షాలు భిన్నమైన ప్రకటనలు చేసినప్పుడు నిజం నిగ్గు తేల్చడానికి స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇందుకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త చెల్లిం పులు ఏప్రిల్, మే మాసాలలో జరుగుతాయి కనుక ఆ భారం వచ్చే బడ్జెట్‌పైన ఉంటుందనీ, ఇప్పుడు రుణాలు తిరిగి చెల్లించేవారు ఎక్కువమంది ఉండరు కనుక కేటాయించిన చిన్న మొత్తం సరిపోతుందనీ ప్రభుత్వ వర్గాల వివరణ. వడ్డీలేని రుణం, పంట ధరల స్థిరీకరణ, కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వా లన్న ప్రతిపాదనలు వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభాన్ని చాలా వరకూ పరిష్కరిస్తాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచక ఆత్మహత్యను ఆశ్ర యించిన రైతుల కుటుంబాలకు ఏడు లక్షల వంతున పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం కూడా స్వాగతించదగినదే. కడచిన అయిదు సంవత్సరాలలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పరిహారం అందని కుటుంబాలకు తన ప్రభుత్వం కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వంతున చెల్లిస్తుందంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. రైతును కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా, ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. సమాజంలో వివిధ వర్గాలకూ, దాదాపు అన్ని వర్గాలకూ ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు పాళ్ళూ అమలు చేయడానికి అవసరమైన భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’, సంకల్పం ఉంటే మార్గం ఉంటుం దనే సామెత ఉంది. ఇంతకు మునుపు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి కానీ విశ్వసనీయత కలిగిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం వెనుక విశ్వసనీయత ప్రధానమైన హేతువు. జగన్మోహన్రెడ్డి యూఎస్పీ (యునీక్ సెల్లింగ్ పాయింట్–ఆయనకే ప్రత్యేకమైన ఆకర్షణీయమైన లక్షణం) అదే. వాగ్దానాలు చేసే ముందే వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు గెలిపించిందీ, మున్ముందు గెలిపించేదీ ఆ విశ్వసనీయతే కనుక యూఎస్పీ దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికీ, ఆచరణశీలతకూ, వాస్తవిక దృష్టికీ అద్దం పట్టే విధంగా బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగం లాగానే బడ్జెట్ కూడా సదుద్దేశాలతో నిర్మించుకున్నది. దాని అమలులోనే సాఫల్య వైఫల్యాలు ఉంటాయి. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రమ శిక్షణతో బడ్జెట్లో ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల లక్ష్యాలను సాధించగలిగితే నవ్యాంధ్రలో నవశకానికి నవరత్నాలతో శ్రీకారం చుట్టినట్టే. కె. రామచంద్రమూర్తి -
ఇదేనా ప్రజాస్వామ్యం?
చట్టాలు చేసిన పెద్దలు అవే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వర్ధిల్లుతున్న ‘ప్రజాస్వామ్య’ దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే. ఇతర ప్రజాస్వామ్య దేశా లలో అమలు చేయడానికే చట్టాలు చేస్తారు. మనలాగా ఉల్లంఘించడానికి కాదు. కొన్నేళ్ళుగా అత్యంత భ్రష్టుపట్టిన చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టం. ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు విశ్వసి స్తున్నారని ప్రతిపక్షాల సభ్యులు చెప్పడం, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారపార్టీలో చేరుతున్నామంటూ బొంకడం నిస్సిగ్గుగా సాగుతున్న జాతరలో భాగమైపోయింది. గోవా నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను ఢిల్లీకి విమానంలో పిలిపించుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వారి మెడలో బీజేపీ కండువా వేసి స్వాగతం పలికితే, పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు చెబుతుంటే, ప్రతిపక్ష సమావే శానికి హాజరైన కారణంగానే జేడీ (యూ) నేత శరద్యాదవ్పైన అనర్హత వేటు వేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇచ్చిన కొన్ని గంటలలోనే టీడీపీ సభ్యులను బీజేపీ సభ్యులుగా పార్లమెంటు వెబ్సైట్లో పరిగణిస్తే ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని ఎవరు రక్షించాలి? విభిన్నమైన పార్టీ (పార్టీ విత్ ఎ డిఫరెన్స్)అంటూ తరచు స్వోత్కర్షకు ఒడిగట్టే బీజేపీ అడ్డగోలు ఫిరాయింపులను అనుమతిస్తే ఏమని చెప్పాలి? పార్టీ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేసే నైతిక హక్కు కానీ, ఫిరాయించేవారిని తప్పుపట్టే అధికారం కానీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వీసమెత్తు కూడా లేదు. అనైతిక, అవకాశవాద రాజకీయాలలో పండిపోయిన టీడీపీ అధినేతకు చట్టాల గురించీ, విలువల గురించీ మాట్లాడే స్థాయి లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమైన సాధారణ ప్రజలకు తమ ప్రతినిధుల అక్రమాలనూ, అవినీతినీ ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించవలసిన అవసరం, బాధ్యత కూడా ఉన్నాయి. తమ తీర్పును తుంగలో తొక్కి తాము ఓడించిన పార్టీలో తమ శాసనసభ్యుడు లేదా లోక్‌సభ సభ్యుడు చేరిపోవడం ఆ నియోజకవర్గం ప్రజలు సహించకూడదు. ఇది గోవాలో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగినా ప్రజావంచనే. ‘ఆయారాం, గయారాం’ ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తు న్నదని గుర్తించిన రాజీవ్‌గాంధీ 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. చట్టసభలోని ఒక పార్టీ సభ్యులలో మూడింట ఒక వంతు మంది విడిపోతే అది చీలిక అవుతుంది కానీ ఫిరాయింపు కాదని ఈ చట్టం నిర్దేశించింది. ఈ లొసుగును ఉపయోగించుకొని అవకాశవాదులు పార్టీలు ఫిరాయించినా సభ్యత్వం కాపాడుకున్నారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభు త్వంపైన అవిశ్వాసతీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టినప్పుడు టీడీపీ లోక్‌సభ పక్షం చీలిపోయింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు భూపతిరాజు విజయ కుమార్రాజు నాయకత్వంలో ఆరుగురు లోక్‌సభ సభ్యులు చీలిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడుగురు టీడీపీలో మిగిలారు. ఈ లోపం పూడ్చే ప్రయత్నంలో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం పిరాయింపుల నిరోధక చట్టం, 1985కు సవరణ చేసింది. సవరించిన చట్టం ప్రకారం లెజిస్లేచర్ పార్టీలో లేదా పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. అనర్హత వేటు పడదు. సవరించిన చట్టంలో కూడా మిగిలిపోయిన కీలకమైన లొసుగు ఏమిటంటే శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే, వారిపైన అనర్హత వేటు వేయమని సదరు పార్టీ నాయకత్వం సభాపతికి ఫిర్యాదు చేస్తే సభాపతి వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన లేదు. ప్రధానికీ లేదా ముఖ్యమంత్రికి విధేయులైన సభాపతులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఏళ్ళ తరబడి సభాపతి నిర్ణయం తీసుకోకుండా సాచి వేత ధోరణి ప్రదర్శించినా ప్రశ్నించే వెసులుబాటు న్యాయవ్యవస్థకు లేదు. సభా పతిని కాదని వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి సైతం లేదు. చట్టంలోని ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావూ (కేసీఆర్) సంపూర్ణంగా వినియో గించుకున్నారు. 2014–19లో ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది శాసనసభ్యులనూ, ముగ్గురు లోక్‌సభ సభ్యులనూ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయింపజేశారు. తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడానికీ, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. ఈ రోజున దేశంలో ఫిరాయింపులకు వ్యతి రేకంగా మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే. ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేయవలసిందిగా సభాపతి తమ్మినేని సీతారాంను జగన్ అభ్యర్థించారు. ఫిరాయింపుల జాఢ్యాన్ని నిరోధించకపోతే ఎన్నికలు అర్థరహితం అవుతాయి. పార్టీల భావజాలాలూ, సిద్ధాంతాలూ బూటకమై ప్రజలను వంచిస్తాయి. పరాజయ ప్రభావమా? ఇక నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, ఇందులో కనిపించేదంతా నిజమో, కాదో అనే అనుమానం కొందరు వెలి బుచ్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులలోనూ, అధికారం చెలాయించిన కాలంలోనూ చంద్రబాబునాయుడితో అంటకాగిన సుజనాచౌదరీ, సీఎం రమేష్‌లు నిజంగా ఆయన అనుమతి లేకుండా, మరి కొందరు పెద్దల ఆశీస్సులు లేకుండా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి సంచలనం సృష్టించారంటే కొందరికి నమ్మశక్యంగా లేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి సమర్థంగా నిర్మిస్తున్నారనీ, ఆ కారణంగా ప్రజలలో ఆయన ప్రాబ ల్యం విశేషంగా పెరుగుతున్నదనీ గ్రహించిన చంద్రబాబునాయుడు ప్లేటు ఫిరా యించారు. అంతవరకూ ప్రశంసించిన ప్యాకేజీని పక్కన పెట్టారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని అప్పటి వరకూ దబాయించి అదే నినాదం పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. అప్పుడు సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రి అయినప్పటికీ ఆయనది కేబినెట్ మంత్రి అశోక్‌గజపతి రాజు కంటే ఎక్కువ పెత్తనం. బీజేపీ నాయకులతో సంబంధాలూ, హడావిడీ అంతా ఆయనదే. 2004 నుంచి 2014 వరకూ పార్టీ కార్యకలాపాలు సుజనాచౌదరి ఇంటి నుంచే జరిగేవి. పార్టీ కోసం చంద్రబాబునాయుడు హెరిటేజ్ బ్యాంకు ఖాతా నుంచి నయాపైసా తీయలేదు. సుజనాచౌదరి వంటి సంపన్న నాయకులే ఖర్చులు భరించారు. పార్టీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగిన కొద్దీ సుజనాచౌదరి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. సుజనా ఆధ్వర్యంలోని సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్యాంకులకు 5,700 కోట్ల మేరకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను శాఖల అధికారులు తమ కార్యాలయాలపైనా, నివాసాలపైనా దాడులు చేయడం ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించిన కారణంగానేనని సుజనాచౌదరి, మరో రాజకీయ వ్యాపారి సీఎం రమేష్ భావిస్తున్నారు. ‘నేను టీడీపీ ఎంపీని కనుకనే నన్ను టార్గెట్ చేశారు. మోదీనీ, బీజేపీని వ్యతిరేకించేవారిని వేధించే ప్రయత్నం ఇది. కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపైన ఆదాయంపన్ను శాఖ దాడులు చేస్తున్నది’ అంటూæ రమేష్ ఘాటుగా ఆరోపించి ఎన్నో మాసాలు కాలేదు. సుజనాచౌదరికీ, రమేష్‌కీ టీడీపీ ఎన్డీఏని వీడటం బొత్తిగా ఇష్టం లేదు. తమ నాయకుడు అపర చాణక్యుడనీ, మోదీ పరాజయం ఖాయమనీ, మోదీ వ్యతిరేకులను ఒక తాటిమీదికి తెచ్చి, రాహుల్‌గాంధీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి వెనక నుంచి ఆయనే చక్రం తిప్పుతాడనే ఆశతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ కించిత్ ఆశా భావంతో మౌనంగా ఉండిన సుజన, రమేష్‌లు ఓట్ల లెక్కింపులో టీడీపీ గల్లంతు కాగానే తమ దారి తాము చూసుకోవాలనీ, ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరడం వినా గత్యంతరం లేదనీ తీర్మానించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం భారీ ఖర్చు చేసిన టీజీ వెంకటేశ్‌కు పార్టీ పట్ల విధేయత ఉండాలనుకోవడం అత్యాశ. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదు కనుక బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చిందని గరికపాటి మోహనరావు చెప్పవచ్చు. నలుగురికీ చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది. వ్యూహంలో భాగమా? ఈ నలుగురు ఎంపీలు తామంతట తామే బీజేపీలోకి వెళ్ళారా లేక టీడీపీ అధి నేత వ్యూహంలో భాగంగానే బీజేపీ పంచన చేరారా? అనే ప్రశ్న ఒకటి వినిపి స్తున్నది. ఈ విధంగా అనుమానించడానికి చంద్రబాబునాయుడు మార్కు రాజ కీయం కారణం. ఆత్మరక్షణతో పాటు తమ అధినేతపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడకుండా మోదీ, షాలను ప్రభావితం చేయడం కోసమే సుజన, రమేష్‌లను బీజేపీలోకి పంపించారనేది కొందరి వాదన. పార్టీలో చేరినంత మాత్రాన దర్యాప్తులు ఆగవంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిం చారు. విచారణ జరిగి తనను దోషిగా నిర్ధారిస్తే తనకు అభ్యంతరం లేదంటూ సుజనాచౌదరి ‘ఇండియా టుడే’తో అన్నారు. అటువంటిది ఏమీ జరగదనే విశ్వాసం ఆయన మాటలలో ధ్వనించింది. ‘చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా మీరు అప్రూవర్‌గా మారబోతున్నారా?’ అంటూ ఒక న్యూస్‌చానల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ‘అటువంటిది ఏమీ లేకపోగా, టీడీపీకి ఏ మాత్రం ఉపయోగ పడినా నేను సంతోషిస్తాను,’ అని చౌదరి వ్యాఖ్యానించారు. మోదీ,షాలు ఏదీ మరచిపోరనీ, ఎవ్వరినీ క్షమించరనీ ప్రతీతి. అందుకే యూరోప్‌లో పర్యటిస్తూ కూడా చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి నప్పుడు తాను మోదీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడాననీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత 42 రోజులకు కానీ ఓట్ల లెక్కింపు జరగలేదు. ఆ వ్యవధిలో విహార యాత్రకు వెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు నారావారి కుటుంబం యూరోప్ వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అనంతరం ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వగైరా నగరాలను చుట్టి మోదీ వ్యతిరేకులను కూడగట్టి ప్రతిపక్షంలో ఐక్యత సాధించిన నాయకుడుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో కాలికి బలపం కట్టుకొని తిరిగారు కనుక తీరిక లేక విహారయాత్రకు వెళ్ళలేకపోయారా? నలు గురు ఎంపీలు పార్టీ నుంచి బీజేపీలోకి గెంతే సమయంలో తాను విదేశీపర్యట నలో ఉండాలన్నది ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్టా? అంటూ సందేహం వెలి బుచ్చుతున్నవారు ఉన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ముందరి కాళ్ళకు బంధం వేసినట్టు ఉన్నది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ ఇస్తున్న లెక్క ప్రకారం నలుగురు టీడీపీ సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 71 నుంచి 75కి పెరిగింది. ఎన్డీఏ ఎంపీల సంఖ్య 108కి చేరింది. ఇంకా 18 మంది ఎంపీలు చేరితే కానీ 245మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీఏకి సాధారణ మెజారిటీ సిద్ధించదు. రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలంటే మరో ఏడాది ఆగాలి. యూపీఏకి 66 స్థానాలు ఉండగా, ఎన్డీఏకీ, యూపీఏకీ చెందని పక్షాలకు చెందిన సభ్యుల సంఖ్య 66. తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పదికి పదీ గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి ఉంది. 16వ లోక్‌సభ ఆమోదించిన రెండు తీర్మానాలు–సిటిజన్‌షిప్ అమెండ్ మెంట్ బిల్లు, 2018, ముస్లిం మహిళల (వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ) బిల్లు, 2018 (త్రిపుల్ తలాఖ్ బిల్లు)– రాజ్యసభలో తగినంత బలం లేని కారణంగా మురిగి పోయాయి. 17వ లోక్‌సభలో మొదటి బిల్లుగా త్రిఫుల్ తలాఖ్ బిల్లును న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్ తిరిగి శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఈ సారైనా ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందకపోతే ఎన్డీఏ సర్కార్‌కు తలవంపులు తప్పవు. అందుకోసం నేపథ్యాలతో, నైతికతతో నిమిత్తం లేకుండా రాజ్యసభ సభ్యులు ఎవరైనా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి స్వాగతం చెప్పాలని అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు కనిపి స్తున్నది. కారణాలు ఏమైనా కావచ్చు, అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని చట్టుబండలు చేయడం రాజ్యాంగస్ఫూర్తిని మంట గలపడమే. -కె. రామచంద్రమూర్తి -
అయోమయమా, అతి లౌక్యమా?
నిజమే. ప్రజాతీర్పును అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు అమరావతిలో జరిగిన విస్తృత సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు. మే 23న ఓట్ల లెక్కింపు జరగ డానికి ముందు టీడీపీ విజయం పట్ల చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు. తన పిలుపును పురస్కరించుకొనే మహిళలంతా పనికట్టుకొని అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి తన పార్టీకి ఓట్లు వేశారని ఆయన సంపూర్ణంగా విశ్వసించారు. ఆ మాట ఢిల్లీలో, అమరావతిలో పదేపదే చెప్పారు. ఎన్నికలలో ఘోరపరా జయం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఆయన ఇంకా కోలుకోలేదనటానికి మొన్న అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ఎన్నిక సన్నివేశంలో ఆయన ముఖారవిందమే నిదర్శనం. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పద వులు నిర్వహించిన వ్యక్తి చిరునవ్వుతో సభలో ప్రవేశించి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన యువనాయకులను అభినందించి, సభాపతి ఆసనం వైపు నడుస్తున్న తమ్మినేని సీతారాం వెంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కదిలి ఉంటే హుందాగా ఉండేది. సభాపర్వం ఆదిలోనే సామరస్యపూరితమైన వాతావరణం నెలకొనేది. ప్రతిపక్ష నేత గౌరవం పెరిగేది. తల్లకిందులైన అంచనాలు ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకునే వ్యవస్థ ఉండి ఉన్నట్లయితే చంద్ర బాబును ఓటమి ఇంతగా ఆశ్చర్యపరిచేది కాదు. తన చుట్టూ తనకు ఇష్టమైన అధికారులనూ, అనధికారులనూ పెట్టుకున్నారు. వారు అధినేతకు ఏది నచ్చు తుందో అదే చెబుతారు. సానుకూల మీడియా సైతం పరిస్థితులు చేజారిపోతు న్నాయని హెచ్చరించలేదు. విజయం తథ్యమంటూ ఆశ్వాసించింది. వందిమా గ«ధుల వల్ల ఎంత ప్రమాదమో తెలిసింది. ఫీజు చెల్లించినవారికి ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ నిజమైన సర్వే ఫలితాలను వెల్లడించే సంస్థలు అరుదు. అశోక్ గజపతిరాజు వంటి నాయకులు నిర్మొగమాటంగా మాట్లాడగలరు కానీ వారికీ రాబోయే ఉపద్రవం సంగతి బొత్తిగా తెలిసినట్టు లేదు. ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులను నడిపించడంలో చంద్రబాబు శక్తిసామర్థ్యాల పట్లా, చాణక్యం పట్లా సీనియర్ నాయకులకు మితిమీరిన విశ్వాసం ఉండటం కూడా పార్టీకి నష్టం కలిగించింది. దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడైన వెంటనే ‘ప్రజలను మనం అంత కష్టపెట్టామా?’అంటూ టీడీపీ అధ్యక్షుడు సహచరులతో వాపోయారంటే చుట్టూ ఉన్నవారు ఆయనను ఎంత మబ్బులో పెట్టారో, ఆయన ఎన్ని భ్రమలలో జీవిస్తూ ఉన్నారో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు అర్థం కాలే దేమో కానీ నాబోటి రాజకీయ పరిశీలకులకు ఆయన దారుణంగా ఓడిపోతున్నారని కొన్ని మాసాలుగా అర్థం అవుతూనే ఉంది. ఆ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉన్నాం. నిజానికి, 2014లో టీడీపీ 1.6 శాతం ఓట్ల వ్యత్యాసంతో వైఎస్‌ఆర్‌సీపీపైన గెలుపొందిన క్షణం నుంచీ ఆ పార్టీ ఓటమికి అధినాయకుడే స్వయంగా బాటలు వేశారు. ఎన్నికల తంత్రంపైన ఆధారప డటం, డబ్బుతో ఎన్నికలలో విజయం సాధించవచ్చునని నమ్మడం, అందు కోసం అవధులు మించిన అవినీతిని అనుమతించడం, పశ్చిమబెంగాల్లో మార్క్సిస్టు కార్యకర్తలు వామపక్ష సంఘటన 33 సంవత్సరాలు అధికారంలో అప్రతిహతంగా కొనసాగడానికి తోడ్పడినట్టే జన్మభూమి కమిటీలు కూడా టీడీపీ అధికారాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తాయని అంచనా వేసుకోవడం, టీడీపీ పాల నలో ఒకే ఒక సామాజికవర్గం ప్రయోజనాలు నెరవేరుతున్నాయనే అభిప్రాయం జనసామాన్యంలో ప్రబలడం, పార్టీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా చంద్ర బాబులో విశ్వాసం కోల్పోవడమే కాకుండా తమను ఆయన మోసం చేస్తున్నారనే అనుమానం ప్రజలలో బలపడటం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు. ప్రతిద్వంది వైఎస్ జగన్మోహన్రెడ్డి చాకులాంటి యువకుడూ, ప్రతిభావం తుడూ, దీక్షాదక్షతలు కలిగిన నాయకుడూ కావడం, ఎన్నికల ప్రణాళికలో ప్రక టించిన హామీలనూ, పథకాలనూ టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన తీరును తన 3648 కిలోమీటర్ల చారిత్రక పాదయాత్రలో అత్యంత సమర్థంగా ప్రజలకు వివరించడం, నవరత్నాల పేరుతో చిన్న పిల్లల నుంచీ వృద్ధుల వరకూ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం, బీసీ డిక్లరేషన్‌తోనూ, టిక్కెట్ల పంపిణీ లోనూ వెనుకబడిన వర్గాల ప్రజల హృదయాలను దోచుకోవడం ద్వారా జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ఓటమిని అనివార్యం చేశారు. అన్నిటి కంటే మించి సామాన్య ప్రజల అనుభవం ప్రధానం. స్వానుభవం కంటే భిన్నంగా నాయకులు చెప్పినా, పత్రికలు రాసినా, టీవీ చానళ్ళు గ్రాఫిక్స్‌లో చూపినా ప్రయోజనం ఉండదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలలో ఎంత విశ్వాసం, అభిమానం ఉన్నాయో చంద్రబాబునాయుడి పట్ల అంత అవిశ్వాసం, ఆగ్రహం ఉన్నాయి. అభిమానం, ఆగ్రహం కలిసి సునామీని సృష్టించాయి. 2014 ఎన్నికల ప్రణాళికలో టీడీపీ పేర్కొన్న మొదటి మూడు అంశాలూ– వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం– సవ్యంగా అమలు జరగలేదు. బీసీ డిక్లరేషన్‌లో వందమంది బీసీలను టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికల రంగంలో దించుతామనే పదో హామీ ఆదిలోనే ఆవిరై పోయింది. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే నిర్ణయానికి బీసీలు వచ్చారు. తమకు బీసీ హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారని కాపులు భావిం చారు. అవినీతిరహిత సుపరిపాలన అందిస్తామన్న పన్నెండవ వాగ్దానాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జన్మభూమి కమిటీల వరకూ సర్వత్రా అవినీతిని అందలం ఎక్కించారు. ‘మేనేజ్మెంట్’పై విశ్వాసం అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్’ చేయడంలో తనకు తిరుగులేదనే విశ్వాసం చంద్ర బాబును దారుణంగా దెబ్బతీసింది. ప్రజలు అమాయకులనీ, వారిని తేలికగా మభ్యపెట్టవచ్చుననే ధోరణి కూడా టీడీపీ పతనానికి దారితీసింది. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, ఎన్నికలకు మూడు మాసాల ముందు వరాల జల్లు కురిపిస్తే ప్రజలు పొంగిపోయి ఓట్లతో ముంచెత్తుతారనే అంచనా తప్పింది. జగన్‌పైన చంద్రబాబునాయుడూ, కాంగ్రెస్ నేతలూ కలిసి పెట్టించిన సీబీఐ కేసులలో పసలేదనీ, అవి రాజకీయ ప్రతీకా రేచ్ఛతో బనాయించిన కేసులనీ ప్రజలలో అత్యధికులు విశ్వసించారు. పదేపదే నేరస్థుడంటూ జగన్‌ను అచ్చెన్నాయుడూ, బుచ్చయ్యచౌదరీ, బోండా ఉమా మహేశ్వరరావూ వంటి నాయకులు దూషించడాన్ని ప్రజలు సహించలేదు. జగన్‌ను అవినీతిపరుడంటూ, నేరస్తుడంటూ సంబోధించిన చంద్రబాబు విశ్వస నీయతనే ప్రజలు శంకించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నంత వరకూ, తాను కాంగ్రెస్‌లో కొనసాగినంత వరకూ తనపైన కేసులు లేవనీ, తనను గౌరవనీయుడుగానే పరిగణించారనీ, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాతనే తనపైన కేసులు పెట్టారంటూ జగన్ ఇచ్చిన వివరణను ప్రజలు మనస్పూర్తిగా నమ్మారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య బేరీజు వేసుకొని మోదీని రెండో విడత ప్రధానిగా ఎన్నుకోవాలని నిర్ణయించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్ర బాబునాయుడినీ, జగన్మోహన్రెడ్డినీ పోల్చుకొని వైఎస్ఆర్సీపీ అధినేతకు పట్టం కట్టాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలను అమలు పరచకపోగా ప్రణాళికలో ప్రస్తావించని పనులు చంద్రబాబునాయుడు చేశారు. విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రణాళికను పక్కనపెట్టి సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రాజధాని నిర్మాణం పేరుమీద 40 వేల ఎకరాలు సమీకరించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అస్మదీయులకు లబ్ధి చేకూర్చడం, అనవసరమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, కేంద్రం నిర్మించవలసిన పోలవరం బాధ్య తను అడిగి నెత్తికి ఎత్తుకోవడం వంటి అనేక అక్రమాలూ, తప్పుడు నిర్ణయాలూ జరిగాయి. అధికారంలో ఉండిన అయిదేళ్ళలో రూ. 1.69 లక్షల కోట్లు అప్పు చేసి ఫలానా నిర్మాణం చేశామని చెప్పుకోలేని, చూపించలేని దుస్థితి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నిర్మించి జగన్ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారనే ఆందో ళనతో చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. అంతటితో ఆగ కుండా, ఏవో లెక్కలు వేసుకొని మోదీ వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాలు సందర్శించి హడావిడి చేశారు. 35 సంవత్సరాలుగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి కండువా కప్పి వచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించారు. వ్రతం చెడినా ఫలం దక్కకపోవడం అంటే ఇదే. దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి మోదీ–అమిత్‌షా నాయ కత్వంలోని బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసిన జాతీయ నాయకుడికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళడానికి ముఖం చెల్లని పరిస్థితి. మూడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ నేతకు హస్తినలో గౌరవం ఏముంటుంది? భిన్న వైఖరులు చంద్రబాబు, జగన్‌ల భిన్నమైన రాజకీయ ధోరణులను సైతం ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఎటువంటి కేసులు వచ్చినా ‘స్టే’లు తెచ్చుకునే చంద్రబాబు ఒకవైపు. చట్టాలనూ, న్యాయస్థానాలనూ గౌరవిస్తూ కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర కొనసాగించిన జగన్ మరోవైపు. వైఎస్ఆర్సీపీ టిక్కెట్లపై నెగ్గిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రిపదవులతో సత్కరించిన ముఖ్యమంత్రి ఒక వైపు. వైఎస్ఆర్సీపీ పెట్టడానికి ముందే కాంగ్రెస్‌నుంచి నిష్క్రమించి, వెంటనే పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయడమే కాకుండా తన పార్టీలో చేరదలచిన కాంగ్రెస్ శాసనసభ్యుల చేతా, పార్లమెంటు సభ్యుల చేతా, టీడీపీకి చెందిన ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేతా రాజీనామా చేయిం చిన ప్రతిపక్ష నాయకుడు మరోవైపు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడు ఒకవైపు, నెరవేర్చడం సాధ్యం కాదనుకొన్న హామీని ఇవ్వడానికి నిరాకరించిన నేత మరోవైపు. మాయామర్మం చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఏదో విధంగా (చివరికి పాల్ వంటి విదూషకుడిని ప్రయోగించి) ఎన్నికలలో గెల వాలని ప్రయత్నించిన పార్టీ అధ్యక్షుడు ఒకవైపు. పారదర్శకంగా, ముక్కు సూటిగా వ్యవహరిస్తూ, మనసులో మాట నిస్సంకోచంగా చెబుతూ, ప్రజలతో మమేకమై, వారి విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ఎన్నికలలో విజయం సాధిం చాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత మరోవైపు. ఎవరిది నమ్మదగిన రాజకీయమో, ఎవరిది కపట రాజకీయమో, ఎవరిది నిజాయితీనో, ఎవరిది వంచనాశిల్పమో ప్రజలు అంచనావేసుకున్నారు. అందుకే, ఒక ప్రాంతం కాదు. ఒక కులం కాదు. ఒక మతం కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడబలుక్కున్నట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు చేసి ఘనవిజయం చేకూర్చారు. ఈ పాటి విశ్లేషణ చంద్రబాబునాయుడికి తెలియకపోలేదు. వాస్తవాలను అంగీకరించడం, తప్పులు ఒప్పుకోవడం కష్టం. పరాజయాన్ని అంతుపట్టని పరిణామంగా చిత్రించి, ఓటమికి దారితీసిన కారణాలను అన్వేషించడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీని వేసి, వాటి నివేదికలు తెప్పించుకొని, పార్టీ నాయకులను బీజేపీ వైపు చూడకుండా నిర్విరామంగా ఉంచడం చంద్ర బాబునాయుడికి ఇప్పుడు అవసరం. పార్టీని రక్షించుకోవాలి. తనయుడికి అప్ప గించాలి. 2004లో ఓడిపోయినప్పుడు అనుసరించిన పద్ధతులనే ఇప్పుడు కూడా అమలు చేస్తారు. అంతే కాని చంద్రబాబు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చు కొని, రాజకీయ దృక్పథం మార్చుకొని, ధనబలం, కండబలంతో నిమిత్తం లేని పరిశుభ్రమైన రాజకీయాలవైపు అడుగులు వేసే ఆలోచన చేస్తున్న దాఖలా లేదు. ప్రశాంతంగా ఆలోచించి, ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, నిర్మాణాత్మక రాజకీయాలవైపు దృష్టి సారిస్తే ఆయనకు చరిత్రలో స్థానం ఉంటుంది. నకారాత్మక (నెగెటివ్) రాజకీయాలకు స్వస్తి చెప్పి, సకారాత్మక (పాజిటివ్) రాజ కీయాలకు శ్రీకారం చుట్టినట్లయితే తనయుడు లోకేష్‌కు ఉత్తమమైన రాజకీయ వారసత్వం అందించిన సంతృప్తి మిగులుతుంది. డబ్బు రాజకీయంలోనే కొన సాగాలనుకుంటే, అదే బాటలో కుమారుడిని కూడా నడిపించాలనుకుంటే నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ ప్రస్థానం అర్థరహితం అవుతుంది. ఇంతవరకూ అనుసరించిన చంద్రబాబు మార్కు రాజకీయాన్ని ప్రజలు తిరస్క రిస్తారనే విషయం మాత్రం స్పష్టం. ఓటమిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే అంశంపైన చంద్రబాబునాయుడి భవిష్య ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. నిర్మా ణాత్మక రాజకీయాలను ఆచరిస్తే టీడీపీకీ, ఆ పార్టీ అధినాయకుడికీ, ప్రజలకీ మేలు. కె. రామచంద్రమూర్తి -
వడివడి అడుగులు!
త్రికాలమ్ రహస్య మంతనాలు లేవు. సుదీర్ఘమైన సమాలోచనలు లేవు. వీడియో కాన్ఫ రెన్స్‌లు లేవు. ఊహాగానాలు లేవు. శషభిషలు లేవు. ఒత్తిళ్ళు లేవు. ముందుకూ, వెనక్కూ లాగడాలు లేవు. చివరి క్షణంలో నిర్ణయాలు మార్చడాలూ, పేర్లు చేర్చడాలూ, తొలగించడాలూ లేవు. సస్పెన్స్ అసలే లేదు. ఎన్నికలలో అభ్య ర్థులను ఖరారు చేయడం, మంత్రివర్గంలో సభ్యులను నిర్ణయించడం, వారికి శాఖలు కేటాయించడం ఇంత తేలికా? అని ఆశ్చర్యబోయే విధంగా పనులు కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసినట్టు సాఫీగా, చకచకా జరిగిపోవడం పరిశీ లకులకు విస్తుగొలుపుతున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు అలవోకగా తీసుకుంటున్న తీరు ఇది వరకు ఎన్నడూ కనలేదు. వినలేదు. స్వభావ రీత్యా జగన్ ఆలోచనా విధానం సరళంగా, సూటిగా ఉండటం వల్ల అనాయాసంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించాలి. నవ్యాంధ్ర ప్రభుత్వ పగ్గాలు చేతపట్టినప్పటి నుంచి ముఖ్యమైన స్థానాలలో అధికారులను నియ మించడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం మొదలుకొని మంత్రులను నియమించి వారికి సముచితమైన శాఖలు అప్పగించడం వరకూ జరిగిన పరి ణామాలను పరిశీలిస్తే పూసల్లో దారంలాగా ఒక విధానం గోచరిస్తుంది. జగన్ నిర్ణయాలపైన ప్రభావం చూపే మూడు అంశాలు గమనించవచ్చు. ఒకటి– ప్రజాస్వామ్య స్ఫూర్తి. రెండు– సామాజిక న్యాయ సూత్రం. మూడు– విధేయత. భాగస్వామ్యస్ఫూర్తి ప్రజాస్వామ్యం సార్థకం కావాలంటే ప్రజలందరికీ తగిన ప్రాతినిధ్యం, భాగ స్వామ్యం ఉన్నదనే అనుభూతి కలగాలి. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గెటిస్బర్గ్ ప్రసంగంలో ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క పరిపాలనా వ్యవస్థ (గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్)’గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఇదే. ఈ అంతరార్థాన్ని జగన్ గ్రహించడమే కాకుండా సాధ్యమైనంత మేరకు అమలు పరచాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని శుక్రవారం వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు జాతీయ స్థాయి ఇంగ్లీషు చానళ్ళు విశేషవార్తగా ప్రసారం చేశాయి. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో వల్లభ్‌భాయ్ పటేల్ ఉపప్రధానిగా ఉండే వారు. చివరి ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీ. మన్మోహన్‌సింగ్‌కూ, నరేంద్ర మోదీకీ ఉపప్రధానులు లేరు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి 1956లో ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసినప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే తెలంగాణకు చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రిగా ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఎందుకు? తెలంగాణ ప్రజలకు కూడా తమ ప్రతినిధి ఉన్నత, నిర్ణాయక స్థాయిలో ఉన్నారనే ఒక భాగస్వామ్య భావన కలుగుతుంది. ఈ సూక్ష్మం అర్థం చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఉపముఖ్యమంత్రిని ఆరో వేలుతో పోల్చి అపహాస్యం చేశారు. ఉప ముఖ్య మంత్రిని నియమిస్తే ముఖ్యమంత్రిగా తన అధికారానికి భంగం వాటిల్లుతుందని అపార్థం చేసుకొని ఆదిలోనే హంసపాదు అన్నట్టు తెలంగాణ ప్రజల మనస్సులలో అనుమాన బీజాలు తొలినాళ్ళలోనే నాటారు. బిహార్‌లో జేడీ(యు) అధినేత నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి. బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రి. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా బీసీ నాయకుడు కేఈ కృష్ణమూర్తి, కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరిలో ఒకరు రాయలసీమలోని కర్నూలుకు చెందినవారైతే మరొకరు కోస్తాంధ్ర లోని తూర్పుగోదావరి జిల్లా నాయకులు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రిగా మొదట రాజయ్య, అనంతరం శ్రీహరి ఉండేవారు. ముస్లింల ప్రతినిధిగా మహమ్మద్ మహమూద్ అలీ పని చేశారు రెండో ప్రభుత్వంలో శ్రీహరి లేరు. అలీ ఉన్నారు కానీ ఉపముఖ్యమంత్రి హోదా లేదు. ఒక్కో సామాజికవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సదరు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పాల్గొంటున్నామనే భరోసా ఇచ్చినట్టు అవుతుందనీ, ఇతర సామాజికవర్గాలతో సమానంగా ఆ సామాజికవర్గాలను కూడా పరిగణించి గౌరవించినట్టు అవుతుందనీ జగన్ భావించి ఉంటారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకూ (పిల్లి సుభాష్ చంద్రబోస్), దళితులకూ (కళత్తూరు నారాయణస్వామి), ఆదివాసీలకూ (పాముల పుష్పశ్రీవాణి), ముస్లింలకూ (అంజద్ బాషా), కాపులకూ (ఆళ్ళ నాని) ఉపముఖ్యమంత్రి పద వులు కేటాయించాలన్న అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఒక మహిళకు హోంశాఖ కేటాయించడంలో తండ్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ హోంశాఖ అప్పగించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత ప్రజలను చకితులను చేసిన నాయకుడు నరేంద్రమోదీ. నిర్మలాసీతారామన్‌కు రక్షణ శాఖ, తాజాగా ఆర్థిక శాఖ కేటాయించి ముఖ్యమైన శాఖలపైన పురుషాధిక్యాన్ని అంతం చేశారు. మేకతోటి సుచరితకు హోంశాఖ ఇవ్వడం ఒక ప్రయోగం. సుచరిత సబిత లాగా అగ్రవర్ణానికి చెందిన ఆడపడుచు కాదు. దళిత మహిళ. అణగారిన వర్గాల ప్రతినిధులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి ఆయా సామాజికవర్గాలలో సమర్థులైన నాయకులు ఎదిగి రావడానికి అవకాశం కల్పించడం దార్శనికుల లక్షణం. అత్యధిక స్థానాలు గెలుచుకున్న రెడ్లతో సమానంగా కాపులకు కూడా నాలుగు స్థానాలు కల్పించడం విశేషం. బీసీలలో చేర్చవలసిందిగా కొంత కాలంగా ఉద్యమం చేస్తున్న కాపు నాయకులను అస్తిత్వ సమస్య వెంటాడుతూ వస్తున్నది. ఉపముఖ్యమంత్రి పదవి కొనసాగించడం వల్ల వారిలో భద్రతాభావం పెరుగవచ్చు. పాతికమంది మంత్రులలో ఎనిమిది మంది వెనుకబడిన కులాల వారూ, అయిదుగురు దళితులూ ఉండటం (దామాషా లెక్కన చూస్తే) తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే ప్రథమం. శాఖల కేటాయింపులో కూడా అగ్రవర్ణాలవారి కంటే వెనుకబడిన కులాలకు చెందినవారికీ, దళితులకూ, ఆదివాసీ మహిళకూ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలను బడుగువర్గాలకు సానుకూలంగా ఇంత పకడ్బందీగా ఎవ్వరూ సాధించలేక పోయారు. దీన్నంతటినీ చారిత్రక సందర్భంగా పరిగణించాలి. విధేయులకే అందలం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి నిష్క్రమించి కొత్త కుంపటి పెట్టుకున్న పరీక్షా సమయంలో తనకు తోడుగా నిలిచి, తనతోపాటు నడిచిన నాయకుల పట్ల విశ్వాసం ఉంచి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరో విశేషం. తనను నమ్మినవారికి ఉపకారం చేయడం ఫక్తు వైఎస్ తరహా రాజ కీయం. అందుకే వైఎస్ పట్ల రాజకీయవాదులకే కాకుండా రాజకీయాలతో సంబంధంలేని అనేకమందికీ వల్లమాలిన అభిమానం. సోనియాతో విభేదించి జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నప్పుడు మంత్రి పదవులను బేఖాతరు చేసి కాంగ్రెస్ నుంచి వైదొలగిన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్. బాలినేని ఎంఎల్ఏగా గెలిచి మంత్రిపదవి అందుకున్నారు. బోస్ వైఎస్ఆర్సీపీ టిక్కెట్టుపైన 2012, 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 పరాజయం తర్వాత ఎంఎల్సీగా ఎన్నికైనారు. మోపిదేవి వెంకటరమణారావు మంత్రి పదవి కోల్పోయి జైలులో కొంతకాలం ఉన్నారు. వైఎస్ కుటుంబానికి పరమ విధేయుడు. రేపల్లె నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మత్స్యకారుల ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రిగా, వక్తగా ధర్మాన ప్రసాద రావు ప్రసిద్ధుడు. వైఎస్ మంత్రివర్గంలో ముఖ్యుడు. జగన్‌తో పాటు ప్రసాద రావు కాంగ్రెస్‌ని వీడి రాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మాత్రం కాంగ్రెస్ నుంచి వైదొలిగి వైఎస్ ఆర్సీపీలో చేరిపోయారు. ఈ సారి ఎన్నికలలో సోదరులు ఇద్దరూ గెలుపొం దారు. కానీ మంత్రిపదవి ప్రసాదరావును కాకుండా కృష్ణదాస్‌ను వరించింది. సుచరిత కూడా జగన్ బాటలో నడిచి ఉపఎన్నిక ఎదుర్కొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానాన్ని వదులుకొని కాంగ్రెస్‌కి బైబై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిన మేకపాటి రాజమోహనరెడ్డి ఉపఎన్నికలోనూ, 2014లోనూ గెలిచారు. ఈ సారి ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డిని జగన్ పరిశ్రమల మంత్రి చేశారు. ఇరిగేషన్ వంటి అత్యంత ప్రధానమైన శాఖ పొందిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో నారాయణను ఓడించిన ధీరుడు. అనిల్ కుమార్, పుష్పశ్రీవాణి, ఆదిమూలం సురేష్, కొడాలినానీ, అంజద్‌బాషా, గుమ్మ నూరు జయరాం, కళత్తూరు నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వంటి శాసన సభ్యులు 2014లో కూడా గెలిచి టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా జగన్‌తో పాటు నడిచిన విధేయులు. అందుకే మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 13 స్థానాలు గెలిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవీ, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డికి లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం అప్పగించారు. తనతోపాటు జైలు జీవితం, ఇతర కష్టాలూ, నష్టాలూ సమా నంగా పంచుకున్న విజయసాయిరెడ్డికి పార్లమెంటరీపార్టీ నేతగా సముచిత స్థానం కల్పించారు. స్పీకర్‌గా ఎన్నిక కాబోతున్న తమ్మినేని సీతారాం బీసీ. ఆయన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఐదు విడతలుగా శాసన సభకు ఎన్నికైనారు. గతంలో మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీని అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు. నిజాయితీపరులైన అధికారుల ఎంపిక మంత్రుల ప్రమాణం కంటే ముందు అనేకమంది ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ నియామకాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం సూచనల మేరకు జరిగాయి. నిజాయితీ పరులుగా, సమర్థులుగా, సేవాతత్పరులుగా పేరు తెచ్చుకున్న అధికారులనే కీలకమైన పదవులలో నియమించారు. ఎన్నికల ప్రచారంలో, ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు ఆశావర్కర్ల జీతం మూడు వేల నుంచి పదివేలకు పెంచే ఉత్తర్వుపైన శనివారంనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెంటనే తొలి సంతకం చేశారు. ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయ డానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. తాత్కాలిక సహాయం (ఇంటీరియం రిలీఫ్) ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకూ యువ ముఖ్యమంత్రి పని నల్లేరు మీద బండిలాగానే వేగంగా సాగింది. ఒకే విడతలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడం, ఒకే ఊపులో మంత్రి వర్గాన్ని పూర్తిగా నిర్మించడం, మంత్రులు ప్రమాణం చేసిన వెంటనే వారికి శాఖలు కేటాయించడం, మంత్రులు ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు గానే లెజిస్లేచర్‌పార్టీ సమావేశం నిర్వహించి తన మనసులోని మాట భావో ద్వేగంగా చెప్పడం వంటి అనేక కొత్త పోకడలు కనిపించాయి. రెండున్నర సంవ త్సరాల తర్వాత తొంభై శాతం మంది మంత్రులు వైదొలిగి వారి స్థానంలో కొత్తవారు వస్తారనేది మరో ప్రయోగం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయమై అధ్యయనం చేయడానికి ఆంజనేయరెడ్డి నాయకత్వంలో ఒక కమిటీని నియమిం చాలన్న నిర్ణయం ఆహ్వానించదగినదే. ఆయనకు లోగడ ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పని చేసిన అనుభవం ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతికి ఆస్కారం ఉన్నదనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. టెండర్లను పిలవ డంలో, ఖరారు చేయడంలో పారదర్శకత పాటించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవసరమైన సందర్భాలలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను అమలు చేస్తామనీ, అవినీతికి ఆస్కారం లేకుండా సకల చర్యలూ తీసుకుం టామనీ చెప్పారు. అవినీతిలో కూరుకొని ఉన్న రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలన్న సంకల్పం ఉదాత్తమైనదే. దానిని సాకారం చేయాలంటే నాయకత్వానికి దృఢదీక్ష ఉండటంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అవసరం. నైతిక విలువలకు పెద్దపీట వేసే ఉన్నతాధికారులూ, ముఖ్యమంత్రి ప్రకటించిన చర్యలతో సంతుష్టులైనట్టు కనిపిస్తున్న ప్రభుత్వోద్యోగులూ, రాజ కీయ నాయకులూ ఏకోన్ముఖదీక్షతో కృషి చేసినప్పుడే నవశకోదయం సాధ్యం. ఇక నుంచీ ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలి. నిధులు కేటాయించగలగాలి. సంపద సృష్టించే వ్యవస్థను ఆవిష్కరించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. వైఎస్‌కు లేని సౌలభ్యం జగన్‌కు ఉన్నది. వైఎస్‌కు కాంగ్రెస్ అధిష్ఠానదేవత నెత్తిపైన ఉండేది. జగన్‌ను ప్రశ్నించేవారు లేరు. అందుకే జాగ్రత్తగా అడుగులేయాలి. కె. రామచంద్ర మూర్తి వ్యాసకర్త -
ఎందుకీ విన్యాసాలు?!
ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఏడవ దశ పోలింగ్ పూర్తియిన తర్వాత టీవీ న్యూస్ చానళ్ళు ఎగ్జిట్‌పోల్ వివరాలు వెల్లడిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు జనాభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు జరిపి ప్రకటించే ఫలితాల కంటే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు మే 23 న వెల్లడి కాబోయే అసలు ఫలితాల ఉప్పు అందిస్తాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను నమ్మవద్దంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగానే హెచ్చరించారు. సర్వే జరిపిన పెద్ద సంస్థలలో ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో ఐదారుకు మించి టీడీపీకి వస్తాయని చెప్పలేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 23 స్థానాలు రావచ్చునంటూ వివిధ సంస్థలు చాటాయి. ఇండియా టుడే, టైమ్స్ నౌ వంటి పెద్ద సంస్థలు, విశ్వసనీయత కలిగిన సర్వేసంస్థలతో కలిసి జరిపించిన సర్వేల ఫలితాలు ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నదని ఘంటాపథంగా చెప్పాయి. ఆ సంస్థలే నిర్వ హించిన ఎగ్జిట్ సర్వే ఫలితాలు అంతకంటే భిన్నంగా ఉండే అవకాశాలు లేవని చంద్రబాబునాయుడికి తెలియని విషయం కాదు. కానీ 23వ తేదీ మధ్యాహ్నం వరకూ గాంభీర్యం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మంత్రులూ, ఇతర నాయకులూ నేత చూపిన బాటలో నడుస్తున్నారు. పార్టీలో లేకపోయినా పార్లమెంటు మాజీ సభ్యుడు, పెప్పర్‌స్ప్రే ప్రవీణుడు లగడపాటి రాజగోపాల్ తన సహకారం అదిస్తున్నారు. కొంతకాలం కిందటి వరకూ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పడంలో లగడపాటి ఘనాపాటి అని చెప్పుకున్నారు. లగడపాటికి ఎవరు సాటి అంటూ ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పే సమయానికి ఇతరేతర కారణాలు కమ్ముకొని రావడంతో దృష్టి మందగించింది. తప్పులో కాలేశారు. దీనితో లగడపాటి రాజగోపాల్ ఏపాటి అంటూ ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. శనివారంనాడు కూడా తెలంగాణ తోవలోనే నడిచిన లగడపాటి మాటలు ఏ మాత్రం విలువలేని పిచ్చాపాటిగా పరిగణించవలసి వస్తుంది. తన అధికారం, ప్రాభవం కొనసాగే అవకాశాలు మృగ్యమని చంద్రబాబు నాయుడుకు పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ ఉదయం పది గంటలకే స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడే ఈవీఎంలపైన వీరంగం ప్రారంభించారు. పోలింగైన తర్వాత రెండు రోజుల వరకూ డీలాపడినట్టు కనిపించారు. అంతలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ దక్కడం ఖాయమని చెప్పడం ప్రారంభించారు. 95 సీట్లు అని ఒకసారీ, 105 అని మరోసారీ, 120 అని ఇంకోసారీ, 130 వరకూ రావడం తథ్యమని చివరిసారీ సంఖ్య పెంచుతూ పోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలింగ్ జరిగిన తర్వాత ఒకే ఒకసారి విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఘన విజయం సాధిస్తామని (ల్యాండ్ స్లైడ్) చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించలేదు. తన పార్టీ విజయం ఖాయమని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు ఆయన దేహభాష స్పష్టం చేస్తున్నది. 2014లో కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు సైతం ప్రజల తీర్పును గౌరవిస్తాననీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ వైఎస్ జగన్ అన్నారు. అంతేతప్ప చంద్రబాబులాగా ఈవీఎంలను నిందించలేదు. ఎన్ని కల కమిషన్‌పైన ఆరోపణలు చేయలేదు. ఇందుకు పూర్తిగా విరుద్ధం చంద్రబాబు నాయుడి వైఖరి. వార్తలలో ఉండటమే లక్ష్యమా? జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఈవీఎంలపైన యాగీ చేస్తున్నారనీ, ఎన్నికల కమిషన్‌పైన నిందారోపణలు శ్రుతి మించి చేస్తున్నారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల కమిషన్‌పైన దాడిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పునేఠాను తొలగించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలంటూ గోల చేశారు. ఎన్నికల సంఘం అనుమతితో జరిగిన సమావేశంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఆ విధంగా పంతం నెగ్గించుకున్నారు. అంతవరకే. ఈ నెల 19 న అయిదు చోట్ల రీపోలింగ్ జరపాలని నిర్ణయించినందుకు ఎన్నికల సంఘం పైన విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ని కలుసుకొని తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ నాయకులు దళితులను ఓటు వేయనీయకుండా అడ్డుకొని రిగ్గింగ్‌కు పాల్పడినట్టు స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యా దును ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి పంపిం చారు. ఈ విషయంపై నివేదిక పంపించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను ద్వివేదీ ఆదేశించారు. కలెక్టర్ సదరు ఫిర్యాదుపైన తన నివేదిక పంపుతూ దానితో పాటు సీసీ ఫుటేజీని కూడా పంపించారు. నివేదికనూ, సీసీ ఫుటేజీనీ కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేదీ పంపించారు. టీడీపీ నాయకుల నిర్వాకం కళ్ళారా చూసిన ఎన్నికల సంఘం మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది, ఇందులో తప్పు ఏమున్నది? నిజం గానే ఆ కేంద్రాలలో ఏప్రిల్ 11న ఓటర్లు టీడీపీకి ఓటు వేసి ఉంటే రీపోలింగ్‌లో కూడా టీడీపీకే ఓటు వేస్తారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయినవారు ఈసారి వినియోగించుకుంటారు. ఆ గ్రామాలలో 30 ఏళ్ళుగా దళితులను ఓటింగ్‌కు దూరంగా ఉంచు తున్నారు. ఎన్నికల సంఘం సభ్యులు చూపించిన సీసీ ఫుటేజీలు చూసిన చంద్రబాబునాయుడు అవాక్కైనట్టు సమా చారం. ఆయన కూడా పోటీగా కొన్ని కేంద్రాలలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు కేంద్రాల విషయంలో ఆయన మాట మన్నించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాతీయ స్థాయిలో మోదీతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష యోధుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం చంద్ర బాబు నాయుyì చేత నేలవిడిచి సాము చేయిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాదు. ఒకటి, రెండు సందర్భాలలో మినహా నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబునాయుడు ప్రస్తావన చేయలేదు. ఆయనను ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. టీడీపీ అధినేత ఎంత ఘాటైన ఆరోపణలు చేసినా, ఎంత కవ్వించినా నరేంద్ర మోదీ, అమిత్ షాలు రెచ్చిపోయి తమ దాడిని మమతా బెనర్జీ (దీదీ) నుంచి చంద్రబాబునాయుడివైపు ఏమాత్రం మర ల్చలేదు. దీదీపై మోదీ, షా దాడి పశ్చిమబెంగాల్లో పరిస్థితులు వేరు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొడు తున్న పార్టీ బీజేపీ. రెండు పార్టీలూ సర్వం ఒడ్డి పోరాడుతున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు పోరాటంలో లేవు. అమిత్‌షా రోడ్డు షో నిర్వహించిన సందర్భంలో సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రతిమను పగుల కొట్టిన దుండగులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీ నాయకులు వాదులాడుకున్నారు. కొన్ని రోజులుగా మోదీ, షాల బాణాలన్నీ మమతాదీపైనే ఎక్కుపెట్టారు. మమత కూడా ఇద్దరికి దీటుగా సమాధానాలు చెబుతూ వచ్చారు. ‘జైశ్రీరామ్’ అని మోదీ నినదిస్తే ‘కాళీమాతా కీ జై’ అంటూ మమతాదీ ఎలుగెత్తి చాటారు. బీజేపీ అగ్ర నాయకులు పశ్చిమబెంగాల్పైన ఎందుకంతగా దృష్టి కేంద్రీకరించారు? 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 71 సీట్లను బీజేపీ, రెండు సీట్లను బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్’ గెలుచుకున్నాయి. హిందీ రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మొత్తం 282 స్థానాలు లభించాయి. ఈ సారి యూపీలో బీజేపీ అంతటి సానుకూల వాతావరణం లేదు. అప్నాదళ్ చీలిపోయింది. 2014లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈ సారి ఒక్కటైనాయి. మరో ప్రతిపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్‌ని ఈ కూటమిలో కలుపుకున్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదని బీఎస్పీ అధినేత మాయా వతీ, ఎస్పీ నేత అఖిలేష్‌యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావిం చిన కారణంగానే కూటమిలో కాంగ్రెస్ లేదని కొందరి అభిప్రాయం. దళితులలో జాతవ్ (చమర్) కులానికి చెందిన నేత మాయావతి. బీసీలలో యాదవ్ కుల దీపుడు అఖిలేష్. జాతవేతర దళితులనూ, యాదవేతర వెనుక బడిన వర్గాలనూ సుముఖం చేసుకొని సంఘటిత పరిచిన కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ ఘనవిజయం సాధించగలిగింది. ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ కొనసాగించింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత, 2017లో ఎస్పీ అయిదేళ్ళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అయిదేళ్ళు పూర్తి చేసింది. రెండేళ్ళుగా యోగీ ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్నారు. మోదీ పట్ల వ్యతిరేకత లేదు. యోగీ పట్ల ప్రతికూలత ఉన్నది. ఈ నేపథ్యంలో యూపీలో ఎస్పీ– బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 30–35 స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయిదు స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదివరకు వచ్చినన్ని సీట్లు బీజేపీకి రావడం అసాధ్యం. హిందీ రాష్ట్రాలలో మొత్తం 70 సీట్ల వరకూ తగ్గే అవకాశం ఉంది. అందుకే పశ్చిమబెంగాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని శక్తివంచన లేకుండా ప్రయత్నం. బెంగాల్లో, ఒడిశాలో, అస్సాంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలిగితే బీజేపీకి స్వయంగా 200 సీట్లకు పైగా రావచ్చుననీ, పాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు కొత్త భాగస్వాములను చేర్చుకొని అధికారంలో బీజేపీ కొనసాగే అవకాశాలు ఉన్నాయనీ అంచనా. శుక్రవారం మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మాటలు జాగ్రత్తగా గమనించినవారికి ఈ విషయం బోధపడి ఉంటుంది. బీజేపీకి స్వయంగా 300 సీట్లు వస్తాయనీ, అయినా సరే మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంలో అంతరార్థం అదే. చంద్రబాబు చక్రవిన్యాసం 1996–97లో పరిస్థితులు వేరు. అప్పుడు సీపీఎం నాయకుడు హరికిషన్‌సింగ్ సూర్జిత్, డిఎంకె అధినేత ఎం కరుణానిధి ఉండేవారు. వారే ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా, అనుసంధానకర్తగా పని చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరి ప్రేరణ లేకుండానే వివిధ పార్టీల నాయకులు ఎన్నికలలో తాము గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా, తమ ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటారు. నాడు చంద్రబాబు నాయుడి చొరవతో ఏర్పడిన దేవగౌడ, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలు చెరి సంవ త్సరం కూడా నిలబడలేదు. అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్య మైతే దేశానికి అంతకంటే అపకారం మరొ కటి ఉండదు. సుస్థిర ప్రభుత్వమే దేశానికి క్షేమదాయకం. ఎన్నికల సంఘం సభ్యులను కలుసుకున్న అనంతరం చంద్రబాబు ఎన్సీపీ నాయకుడు శరద్‌పవా ర్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌నీ, శనివారంనాడు రాహుల్‌గాంధీనీ, మాయావతినీ, అఖిలేష్ యాద వ్నీ కలుసుకున్నారు. మమతా బెనర్జీతో సైతం సంప్రదింపుల్లో ఉన్నారు. వారం దరితో ఏమి మాట్లాడి ఉంటారు? వారంతా చంద్రబాబు నాయుడుకు ఏమి చెప్పి ఉంటారు? ఏమీ చెప్పరు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 23వ తేదీ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఏర్పాటు చేసిన సమా వేశానికి హాజరు కావాలా లేదా అని ఆలోచిస్తున్న మాయావతి, అఖిలేష్ చంద్రబాబు నాయుడుతో ఏమి చెబుతారు? ఆయన ఏదైనా చెబితే ఆలకించి ఉంటారు. ఎవరు ఎవరిని గుర్తిస్తారో, గౌరవిస్తారో. ఎవరు ఎవరితో కలసి నడు స్తారో ఈ సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఒకే ఒక అంశంపైన వారికి ఢిల్లీలో లభించే మన్నన ఆధారపడి ఉంటుంది. ఈ లోగా ఎవరి విన్యాసాలు వారు ప్రదర్శించవచ్చు. కె. రామచంద్రమూర్తి -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయే నాలుగు రోజుల ముందు కూడా మళ్లీ ఉదయం పేపర్ రావాలని కోరుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. దాసరి కోరిక మేరకు మళ్లీ ఏదో ఒక రూపంలో ‘ఉదయం’ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంపిటీషన్ బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితోపాటు సినీనటులు మోహన్‌బాబు, జయసుధ, ఆర్.నారాయణమూర్తి, దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. ఈ రోజు లీడింగ్‌లో ఉన్న అన్ని తెలుగు పేపర్ల ఎడిటర్లు దాసరి పెట్టి ఉదయం పేపర్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి దాసరి నారాయణే కారణమని మంచు మోహన్ బాబు అన్నారు. 153 సినిమాలు చేసి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మహా మనిషి దాసరి అని ఆర్ నారాయణ మూర్తి ప్రశంసించారు. దాసరికి పద్మభూషన్ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలని సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నానన్నారు. -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
-
మానవహక్కులకు దిక్కేది?
దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు. పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్కౌంటర్’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్ హ్యూమన్‌రైట్స్ యాక్టివిస్ట్స్’ అంటూ ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్ విత్ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాశారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్పూర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సన్నగిల్లిన సామాజిక స్పృహ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్కౌంటర్’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్‌గడ్‌లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటిస్తున్నారు. అండాసెల్‌లో సాయిబాబా ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్‌చైర్‌కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్‌కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్’ (డియర్ ప్రొఫెసర్, లెట్స్ బి క్రిమినల్స్ టుగెదర్) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు. 79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్ గొగోయ్ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్‌లో చంచల్గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. ఎవరి గొడవ వారిది ‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త వోల్తేర్ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్, స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ బి సుదర్శనరెడ్డి, ఎస్ఎస్ నిజ్జర్‌తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్‌గఢ్ సర్కార్ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్‌పైన సర్జికల్ స్ట్రయిక్స్ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు? కె. రామచంద్రమూర్తి -
ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఐదేళ్ళకు ఒక సారి చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్నికలు నిష్పాక్షికంగా, ధర్మంగా, స్వేచ్ఛగా జరగాలి. స్వాతంత్య్ర పోరాటం నాటి విలువలు కొన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగాయి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ సిద్ధాంతాలనూ, అభ్య ర్థుల అర్హతలనూ చూసి ప్రజలు ఓటు చేసేవారు. కాంగ్రెస్‌ను అధికారం చెడగొట్టింది. నైతిక, రాజకీయ విలువలకు పాతర వేసింది. ప్రజలకు ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. 1967 నుంచి ప్రతిపక్షాలను గెలిపించడం ప్రారంభించారు. కాలక్రమంలో అనేక ప్రయోగాలు జరిగాయి. కూటమి ప్రభు త్వాలు ఏర్పడినాయి. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ప్రయో గాలు విఫలమైన తర్వాత బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమాక్రాటిక్ అల యెన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వాలు నిలకడగా పరిపాలించాయి. 2014లో బీజేపీకి లోక్ సభలో మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమి తమైన జాతీయ పార్టీ కాగా 1984లో లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రమే గెలు చుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవైకి పైగా రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నది. ప్రభుత్వాలను మార్చడానికి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వలెనే అవినీతికీ, అక్రమాలకూ, ఆశ్రితపక్షపాతానికీ ఒడిగడుతున్నాయి. రాజకీయ ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడిన జూదంగా మారిపోయాయి. ఇది వరకు సంపన్నుల సరసన కనిపించడా నికి అగ్రనేతలు సంకోచించేవారు. క్రమంగా సంపన్నులూ, వ్యాపారులూ, పారి శ్రామికవేత్తలూ రాజకీయాలలోకి వచ్చారు. కార్పొరేట్ రంగానికీ, రాజకీయ పార్టీ లకూ అక్రమసంబంధం విడదీయలేనంతగా బలపడింది. ఇప్పుడు సంపన్నులకే రాజకీయాలలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. డబ్బు లేనిదే రాజకీయాలలో రాణించడం అసాధ్యం. టీఎన్ శేషన్ ఎన్నికల సంఘానికి అపారమైన ప్రతిష్ఠను సంపాదించి పెట్టారు కానీ ఎన్నికలలో డబ్బు పాత్రను తగ్గించలేక పోయారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ జాడ్యం జడలు విచ్చుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఎన్నికల ప్రధానాధికారులు ఎంతమంది మారినా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. నియమావళి ఉల్లంఘన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపైన చర్య తీసుకునే అధికా రాలు తమకు ఉన్నాయో లేవో ఎన్నికల సంఘం సభ్యులకు సుప్రీంకోర్టు చెప్పే వరకూ స్పష్టంగా తెలియదు. నియమావళిని ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్లపైన రెండు, మూడు రోజులు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. తొలి రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నియమావళి అవసరం లేకపో యింది. రాజ్యాంగ నిర్మాతలే పాలకులుగా ఉన్న రోజులవి. ఎన్నికల సమ యంలో అధికార దుర్వినియోగం చేయకుండా వారిని నియంత్రించవలసిన అవ సరం లేకపోయింది. డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు అప్పటికి సోక లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు. ఆ తర్వాత తరం నాయకులకు నిగ్రహం లేదు. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. కనుక నియమావళిని ప్రవేశపెట్టవలసి వచ్చింది. మొదటి సారిగా 1960లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అమలు చేశారు. అధికారంలో ఉన్నవారూ, ప్రతిపక్షానికి చెందినవారూ ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలో ఎన్నికల సంఘం నిర్దేశించింది. సమావేశాలు ఎట్లా నిర్వహించుకోవాలి, ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి నినాదాలు ఇవ్వవచ్చు అనే అంశాలకే మార్గదర్శకాలు పరిమితమై ఉండేవి. 1962 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకూ అందజేయవలసిందిగా కోరింది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎటువంటి నియమావళిని పాటించాలో 1979లో ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ నియ మావళిని గట్టిగా అమలు చేయడం 1991లోనే ప్రారంభమైంది. దాన్ని ప్రజా ప్రాతినిధ్యచట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951) లో భాగం చేయా లంటూ 2013లో లా, జస్టిస్ వ్యవహారాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్‌కోడ్) ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని అమలు చేయవచ్చునంటూ ఈ సంఘం సూచించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత 45 రోజులలో ఎన్నికల కార్యక్రమం పూర్తి చేయాలనీ, ఆ సమయంలో కోడ్ అమలు చేయవచ్చుననీ నిర్ణయించారు. అంటే, నియమావళి క్రమంగా రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యల పట్ల హర్షం ఇటీవల తనపైన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ మాయా వతి దాఖలు చేసిన రిట్పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు సమాజంలో హర్షం వ్యక్తమైంది. ఒక్క మాయావతిపైనే కాదు, హద్దుమీరిన రాజకీయ నాయ కులందరిపైనా నిషేధం విధించాలనీ, శిక్షాత్మక చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ పుల్వా మాపైన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలనూ, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన బాంబుల వర్షం కురిపించిన వైమానికదళానికి చెందిన సాహసికుల శౌర్యాన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడాన్ని ప్రశ్నించకపోవడంతో ఎన్నికల సంఘం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. ప్రధాని ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎన్ని కల సంఘం సస్పెండ్ చేయడంతో ఇది మరింత బలపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించారు. రెండు విడతలా ఎన్నికల సంఘం ఆయనపైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్ట్–ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేశారు. భారత సైన్యాన్నీ, సైనిక చర్యలనూ ప్రచారాంశాలుగా వినియోగించుకోవడాన్ని ఖండిస్తూ పదవీ విరమణ చేసిన పలువురు సైన్యాధికారులు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ పంపించారు. మాటలతో, చేతలతో హిందూ ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలన్న మోదీ–అమిత్‌షా ప్రయత్నంలో భాగమే భోపాల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్సింగ్పైన మాలేగాం ఉగ్రవాద ఘటనలో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇలా నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ స్థావరంగా చేసుకొని కశ్మీర్లో అగ్గి రగిలిస్తున్న ఉగ్రవాద సంస్థలపైన భారత దౌత్యాధికారులు చేస్తున్న విమర్శలకు విలువ ఏముంటుంది? ఎట్లాగైనా సరే ఎన్నికలలో గెలుపొందడం ప్రధానమని అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు కనిపి స్తున్నది. ప్రతిపక్షంలో ఐక్యత లేక, మోదీకి దీటైన నాయకుడు లేక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఈ ఎన్నికల అనంతరం కూడా అధికారంలో కొనసాగ వచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినట్టుగా లేదు. తనపైనే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్ అధికారులను కలుస్తుండగా తాను సమీక్షా సమావేశాలు పెడితే తప్పేమిటంటూ వాదిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు లేని ఆంక్షలు చంద్రబాబుపైన ఎందుకంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయవచ్చు. పోలవరంపైనా, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపైనా సమీక్షించినందుకు ప్రతిపక్షం ఫిర్యాదు చేసిన కార ణంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రమేయంతో ప్రభుత్వ ప్రధానాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోటీసులు ఇచ్చారు. మంచినీటి సమస్యపైన కూడా చంద్రబాబు సమీక్షించారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులకు నోటీ సులు ఇవ్వలేదు. మంచినీటి ఎద్దడి అత్యవసరమైన సమస్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికారులను దుర్వినియోగం చేసిన తీరు నియమావళికి మరింత పదును పెట్టవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటిం చడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి తనకు ఇష్టులైన అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించుకున్నారు. డీజేపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ విధేయులే. అందరినీ ఎన్నికలలో టీడీపీ కోసం వినియోగించినట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఈ దుర్వినియోగంతో పోల్చితే నలభై నాలుగు సంవత్సరాల కిందట చరిత్ర సృష్టిం చిన రాయ్‌బరేలీ కేసులో ఆరోపించిన అధికార దుర్వినియోగం చాలా స్వల్ప మైనది. చారిత్రక అలహాబాద్ కోర్టు తీర్పు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పైన అనుమానాలు వ్యక్తం చేస్తు న్నట్టుగానే 1971లోనూ ప్రతిపక్షాలు బ్యాలట్పత్రాలపైన రసాయనిక ప్రక్రియ జరిపారని ఆరోపించాయి. నాటి సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీలో ప్రధాని ఇందిరాగాంధీపైన ప్రతిపక్ష అభ్యర్థిగా రాజనారాయణ్ పోటీ చేశారు. ఇందిరకు 1,83,309 ఓట్లు వస్తే రాజ్‌నారాయణ్‌కు 71,499 ఓట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించకముందే రాజ్‌నారాయణ్ విజయోత్సవం నిర్వహించారు. తానే గెలు స్తానని అంత ధీమా. తీరా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించే సరికి డీలా పడి పోయారు. కానీ బ్యాలెట్‌పత్రంపైన రసాయనిక ప్రయోగం చేశారని ఆయన గట్టిగా విశ్వసించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనను బలపరి చారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించే సమయంలోనే దానిపైన కాంగ్రెస్‌పార్టీ గుర్తు ముద్రించారనీ, దాన్ని కప్పి ఉంచేందుకు రసాయనం ఉపయోగించారనీ, ఎన్నికలలో ఓటర్లు పెట్టిన గుర్తు కొద్ది సేపటికి అదృశ్యమై కాంగ్రెస్‌పార్టీ గుర్తు బయటికి వచ్చిందనీ, ఓట్ల లెక్కింపు సమయానికి రసాయన ప్రయోగం చేసిన అన్ని బ్యాలట్ పత్రాలపైనా కాంగ్రెస్ గుర్తు ఉన్నదనీ రాజ్‌నారాయణ్ అను మానం. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. శాంతిభూషణ్ ఆయన తరఫున వాదించారు. జూన్ 12, 1975నాడు అలహాబాద్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చారిత్రక తీర్పు ప్రకటించారు. యశ్పాల్ కపూర్ అనే ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్‌గా ఇందిరాగాంధీ నియమించారనేది న్యాయమూర్తి తప్పుపట్టిన చర్య. నిజానికి యశ్పాల్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వైదొలిగి ఇందిర ఎన్నికల ఏజెంట్‌గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ–ఓఎస్డీ)గా మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ తీర్పు కారణంగా ఇందిరా గాంధీ పదవి నుంచి వైదొలిగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే బహుశా అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసేదేమో. కానీ ఆ పని చేయకుండా ఆత్యయిక పరిస్థితి ప్రకటించడంతో చరిత్ర మలుపు తిరిగింది. ఒక ఉద్యోగిని ఎన్నికల కార్యక్రమంలో వినియోగించుకున్నందుకు దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించింది. ఆ రోజులతో పోల్చితే ఇప్పుడు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, కులం, మతం, ప్రాంతం, తదితర అపభ్రంశాలన్నీ ఆవహించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించాయి. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వంటి అరకొర సంస్కరణలతో పరి స్థితి బాగుపడదు. మొత్తం రాజకీయ వ్యవస్థకే కాయకల్ప చికిత్స జరగాలి. నియమావళిని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత సైతం ఎన్నికల సంఘమే స్వీకరించాలి. ఇప్పుడున్న ధోరణే కొనసాగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. అరాజకం ప్రబలు తుంది. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా పౌరసమాజం యావత్తూ సమష్టిగా సమాలోచన జరిపి పరిష్కరించుకోవలసిన సమస్య ఇది. -కె. రామచంద్రమూర్తి -
ఎందుకింత రాద్ధాంతం?
పోలింగ్ ముగిసిన తర్వాత యుద్ధవాతావరణం ముగుస్తుందనీ, శాంతి, సద్భావం వెల్లివిరుస్తాయనీ ఆశించినవారికి దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్కరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం రెండు గంటల సేపు మీడియాతో మాట్లాడిన తర్వాత అప్రజాస్వామికమైన ఆయన వ్యాఖ్యలపైన స్పందించక తప్పడం లేదు. ప్రతిపక్ష నేతను నేరస్థుడు అంటూ అభివర్ణించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సహనిందితుడనీ, కోవర్టు అనీ నిందించడం చూసినవారికి ముఖ్యమంత్రి మాన సిక స్థితిపైన అనుమానం కలుగకమానదు. తాను ముఖ్యమంత్రి, ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత కనుక ఏమి మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నట్టున్నారు. గురువారం ఉదయం పోలింగ్ ఆరంభమైన కొద్దిసేపటికే ముప్పయ్ శాతం ఎల క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు పని చేయలేదనీ, ఈ సమస్యను ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కావాలనే సృష్టించినట్టు కనిపిస్తున్నదనీ చంద్రబాబు ధ్వజమెత్తారు. మొత్తం 92 వేల పైచిలుకు ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్‌లో వినియోగిం చారు. 380 ఈవీఎంలు ఉదయం మొరాయించాయనీ, వాటిలో 330 ఈవీఎం లను మార్చి కొత్తవి ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించి వెంటనే ఉపయోగించామనీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వివరించినా ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. అంతకుముందు ఎన్నికల ప్రధా నాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, ఆయననూ, కేంద్ర ఎన్నికల సంఘాన్నీ దుర్భాషలాడటం అసహనం హద్దు మీరిందనడానికి నిదర్శనం. కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణిని గమనించినవారికి ఆయనను వైఫల్య భీతి వేధిస్తున్నదని గ్రహించి ఉంటారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజ యం సాధించి అధికారంలోకి వస్తారు. ఓడిపోతే అధికారం నుంచి తప్పుకుం టారు. ఇది సర్వసాధారణం. అధికారం తమ జన్మహక్కు అనీ, ఇతరులకు దాన్ని ఆశించే హక్కు లేదనే వితండవాదాన్ని చంద్రబాబు తల కెక్కించుకున్నారు. ఈవీఎంలపై ఇంత అపనమ్మకమా? వాస్తవానికి ఎన్నికల ఫలితాల కోసం మరి 40 రోజులు నిరీక్షించాలి. అంత వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి లెక్కలు వారివి. విజయాన్నీ, పరాజయాన్నీ ఎట్లా స్వీకరించాలో తెలిసినవాడే ప్రజానాయకుడు. అన్ని ప్రజాస్వామ్య వ్యవ స్థలూ పరస్పరం సహకరించుకుంటేనే కథ సజావుగా నడుస్తుంది. ద్వివేదీతో సహ కరించకపోగా ఆయనను శత్రువుల జాబితాలో చేర్చారు చంద్రబాబు. ఎన్నికల ప్రధానాధికారితో సహా ఆయనకు సహకరించే ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారే. ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వోగులతో పాటు అంగన్వాడీ, ఆశావర్కర్లనీ, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల ఉద్యోగులనూ నియమిం చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు చెడిపోతే మరమ్మతు చేయడానికి బిఇఎల్ నుంచి వచ్చిన అధికారులు శిక్షణనిచ్చింది స్థానిక మెకాని క్లకే. వారి సామర్థ్యాన్ని శంకిస్తూ, ‘మెకానిక్‌లు మరమ్మతు చేస్తున్నారా, మేని ప్యులేట్ చేస్తున్నారా, వేర్ ఆర్ వుయ్ గోయింగ్?’ అంటూ ముఖ్యమంత్రి ఆవే శపడితే ఏట్లా అర్థం చేసుకోవాలి? తన శత్రువుల జాబితాను చంద్రబాబు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి వరకూ జగన్, మోదీ, కేసీఆర్ ఆ జాబితాలో ఉండేవారు. ఇప్పుడు ద్వివేదీ, చీఫ్ సెక్రటరీగా నియమితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను ఎవరిని తిడితే వారిని ప్రతిపక్ష నాయకుడు కూడా తిట్టాలని ముఖ్యమంత్రి భావిస్తారు. తిట్టకపోతే వారితో కుమ్మక్కు అయినట్టు నిందిస్తారు. ‘ఎన్నికల ప్రధానాధికారిని జగన్ ఒక్క మాటైనా అన్నాడా?’ అన్నది అందు కోసమే. ద్వివేదీని దబాయించడం, సుబ్రహ్మణ్యంని కోవర్టు అనీ, కోఎక్యూజ్డ్ అనీ నిందించడం ముఖ్యమంత్రి సంస్కారానికి అద్దం పడుతుంది. నిందితుడికీ, దోషికీ భేదం పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం భావ్యమా? కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి తానే సీబీఐతో పెట్టించిన అనేక బూటకపు కేసుల్లో ఒకదానిలో సుబ్రహ్మణ్యం నిర్దోషి అంటూ హైకోర్టు ప్రకటించిన తర్వాత కూడా ‘సహనిందితుడు’ అంటూ అభివర్ణించడం ఏ సంస్కారానికి నిదర్శనం? ఓటుకు కోట్ల కేసులో ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ...’ అంటూ మాట్లాడిన చంద్రబాబుని ఏమని పిలవాలి? ఢిల్లీలో కూడా అదే ప్రవర. జగన్‌పైన 31 కేసులు ఉన్నాయనీ, తనపైన ఒక్క కేసు కూడా లేదనీ ప్రకటన. జగన్‌పైన ఉన్న కేసులన్నీ చంద్రబాబు పెట్టించినవీ, చంద్రబాబు ప్రభుత్వం పెట్టినవే. చంద్రబాబు న్యాయవ్యవస్థలోని పరిస్థితులను వినియోగించుకొని 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న సంగతి ఎవరూ మర చిపోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం నడ వడికను దూరం నుంచి గమనిస్తున్న నాబోటి పాత్రి కేయులకు ఆయన ఎంత నిజాయితీపరుడైన అధికారో, ఎంత ముక్కు సూటిగా వ్యవహరిస్తారో తెలుసు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆశీస్సులతో పాటు ఆయన విలువలను సైతం గుండె నిండా నింపుకొని ఎన్ని సమస్యలు ఎదురైనా చలించకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్న అధికారిని పట్టుకొని అనరాని మాటలు అనడం ముఖ్యమంత్రి పదవికి శోభనిస్తుందా? ఒక సీఎస్ ఒక డీజీపీని కలుసుకుంటే ముఖ్యమంత్రికి అభ్యం తరం ఎందుకు ఉండాలి? ఇది ప్రభుత్వ వ్యవహారాలలో సర్వసాధారణం. ‘ఎక్క డికి పోతున్నాం మనం? ఇట్ ఈజ్ మాకరీ ఆఫ్ డెమాక్రసీ’ అంటూ తీవ్రంగా ఆక్షేపించడంలో ఏమైనా అర్థం ఉన్నదా? చంద్రబాబుకు నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే పడనట్టు కనిపిస్తున్నది. చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం అంటే పడదు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అంటే వైరిభావం. తనకు విధేయంగా ఉంటూ, తాను చెప్పినట్టు చేసినందుకు మాజీ చీఫ్ సెక్రటరీ అనీల్‌చంద్రపునేఠా, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మూల్యం చెల్లించడం చూశాం. డీజీపీ ఠాకూర్ ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ సభ్యు లను రెండు విడతల కలుసుకొని తిరిగి వచ్చారు. పరాజయం అంగీకరిస్తున్నట్లేనా? ఎన్నికల సమయంలో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం కొత్త కాదు. ద్రోణంరాజు సత్యనారాయణ మృతి కారణంగా 2006లో విశాఖ సౌత్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల సంఘానికి చెప్పకుండా మార్చి వేశారు. మార్చిన తర్వాత చెప్పారు. ఫలితంగా ప్రవీణ్‌ను ఎన్నికలకు దూరంగా పెట్టి కలె క్టర్‌గా అనీల్ కుమార్సింఘాల్ని నియమించారు. అదే ప్రవీణ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వికారాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. లోగడ చేసిన తప్పిదం కారణంగా ఆయనను ఆ ఎన్నికలలో కూడా బదిలీ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో ఏకే మహంతిని డీజీపీగా నియమించినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘాన్ని కానీ, ప్రతిపక్ష నాయకుడిని కానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొనేశారంటూ బాబు అడ్డగోలుగా వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఇలా అమ్ముడుపోతారని నిందించడం విజ్ఞుల లక్షణమేనా? ఈ పరుష పదజాలం బాబు దుగ్ధకు నిదర్శనం. ఆయనకు తెలియకుండానే మనసులో ఉన్నమాట బయటపడుతు న్నది. ‘అయిదేళ్ళు లోట స్పాండ్ నుంచి పరిపాలిస్తాడు’ అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనీ, జగన్ ముఖ్య మంత్రి అవుతారనీ ఒప్పుకున్నట్టే కదా! అపోజిషన్‌లో ఉన్నవాడికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అంటే అధికారంలో ఉన్న తనకు డబ్బు వచ్చినట్టే కదా! ఓటమి భయం, ఆక్రోశం అనాలోచితంగా, అతిగా మాట్లాడిస్తుంది. కొన్ని భయాలూ, కొన్ని నిజాలూ, కొన్ని అర్థంపర్థంలేని మాటలూ దొర్లుతాయి. ఈవీఎంలో చిప్ తయారు చేసినవాడు తనకు అపకారం చేస్తాడని అనుకుంటారు. తనను ఓడించేందుకే ఎన్నికలు మొదటి దశలో పెట్టారంటూ ఎన్నికల కమిషన్ని తప్పుపడుతున్నారు. ‘నా ఓటు నాకే పడిందో లేదో నాకు తెలియదు’ అన్నారు. అమరావతిలో ఓటు చేసిన బాబు ఓటు ఆయనకు పడదు. ఆయన కొడుకు, మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు పడి ఉంటుంది. చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిలాగా రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు నిబ్బరంగా ఉన్నారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల టీడీపీ, ౖవైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. గతంతో పోల్చితే ఈసారి హింస కొంతమేర తగ్గిందంటూ ముఖ్యమంత్రికి ఇష్టుడైన డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు వైసీపీకీ, ఇంకొకరు టీడీపీకీ చెందినవారు. వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్నీ, వైసీపీ నాయకులనూ నిష్కారణంగా దూషిస్తూ హింసాకాండ యావత్తూ వైసీపీ ఒక పథకం ప్రకారం చేయించిందని చెప్పడం అదరగండపు ధోరణి. నేరం చేసి ఎదుటివారిపైన నిందవేయడం, అధికారంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం చంద్ర బాబుకి బాగా తెలిసిన విద్య. పరాకాష్టకు చేరిన ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు అన్ని రకాల ఎత్తుగడలూ అమలు పరి చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్, జనసేనలు విడివిడిగా పోటీ చేసే విధంగా వ్యూహరచన చే శారు. జనసేనతో సర్దుబాట్లు చేసుకున్నారు. కేఏ పాల్ అనే ఒక విచిత్రవీరుడిని రంగంలో ప్రవేశపెట్టి అతడి పార్టీకి వైఎస్ ఆర్సీపీ ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్‌ను పోలిన ఫ్యాన్సహిత హెలికాప్టర్ చిహ్నం సంపాదించిపెట్టారు. ఆయన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు వేసుకునే డిజైన్ కండువాలనే వేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లు గల అనామకులకు టిక్కెట్లు ఇప్పించారు. ఎన్నికలు పది రోజులు ఉన్నాయనగా డ్వాక్రా మహిళలకు రెండు చెక్కులు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రెండు వాయిదాలు ఇస్తానని చెప్పి ఒక వాయిదా సొమ్ము వారి ఖాతాలలో వేశారు. ఇన్ని చేసినా పరాజయభీతి పీడిస్తున్నదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పరాజయం అనివార్యమని ఆయనకు నెల రోజుల కిందటే తెలిసిపోయింది. పోలింగ్ రోజున ఓటర్లు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో తన అనుమానం రూఢి అయింది. అందుకే అందరిపైనా ఒంటికాలు మీద లేవడం. ఉదయం పది గంటలలోపే 30 శాతం ఈవిఎం మెషీన్లు పనిచేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం కూడా ఓటమికి సాకు వెతుక్కునే ప్రయత్నమే. మొత్తం 92వేల పైచిలుకు ఈవిఎంలు ఉంటే వాటిలో 30 శాతం అంటే ఎన్నో లెక్క కట్టే మాట్లాడారా? కేవలం 380 ఈవీఎంలు మొరా యించాయనీ, వాటిలో చాలావరకూ కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించామనీ ద్వివేదీ చెప్పారు. అయినా బాబు ధోరణి మారలేదు. ఢిల్లీలోనూ అదే పాట. ద్వివేదీ ఓటు వేయలేకపోయారని సీఎం ప్రచారం చేశారు. ఆయన గురువారం నాలుగు గంటలకు ఓటు వేసినట్టు వీడియో సాక్ష్యం విడుదల చేశారు. అయినా సరే అబద్ధాలు ఆగడం లేదు. ఆగడాలకు అంతులేదు. పోలింగ్ పూర్తియిన తర్వాత కూడా గ్రామాలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే వారు తమ అధినేతను అనుసరిస్తున్నారని భావించాలి. సహనిందితుడూ, కోవర్టు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంని నిందించడం, ఈసీని తూర్పారబట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం 324 అధికరణ కింద ఎన్ని కల సంఘానికి దఖలు పరచిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్) కిందా, భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) కిందా చంద్రబాబుlపైన కేసులు పెట్టవచ్చు. సుబ్ర హ్మణ్యంపైన విమర్శలు చేసిన తీరు ఎన్నికల సంఘానికి పరువునష్టం కలి గించినట్టే. ఎన్నికల సంఘాన్ని ధిక్క రించినట్టే. ఇలా ధిక్కరించే అధికారం సీఎంకి కాదు కదా ప్రధానికిSసైతం లేదు. ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుందో లేదో మే 23న మాత్రమే వెల్లడి అవుతుంది. ఈ లోగా ఓటమిని ఎట్లా స్వీకరించాలో చంద్రబాబు నేర్చుకున్నా, ఆయనకు హితైషులు నచ్చజెప్పినా ఆయనకు మంచిది. 2014లో పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత హుందాగా ఫలితాన్ని ఆమోదించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహ రిస్తామని చెప్పారు. 42 ఏళ్ళ యువకుడు అయిదేళ్ళ కిందట ఎంత సంయమ నంతో, రాజ్యాంగంపట్ల, ఎన్నికల ప్రక్రియపట్ల గౌరవంతో వినమ్రంగా ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు ఓడిపోతామనే అనుమానంతోనే 68 ఏళ్ళ చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పరిణతి లేని నేతగా వ్యవహరిస్తున్నారు. మే 23న ఆయన అనుమానం నిజమైతే ఏమి చేస్తారోనని ఆందోళనగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -కె. రామచంద్రమూర్తి -
ఆచితూచి వేయాలి ఓటు
ఎన్నికల ప్రచారానికి ఎల్లుండి సాయంత్రం తెరబడుతుంది. కొన్ని వారాలుగా ఎన్నికల ప్రచారం పేరుతో సాగిన రణగొణధ్వని ఆగిపోతుంది. ఓటర్లు ప్రశాం తంగా ఆలోచించి వివేకంతో తమ హక్కు వినియోగించుకునే సమయం ఆసన్న మైంది. ప్రజలకు తగిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యంలో వస్తుందంటారు (People get the government they deserve). ఎందుకంటే ప్రజలు ఎన్ను కున్న ప్రతినిధులే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. కడచిన అయిదేళ్ళ అనుభవం ఆధారంగా మన ప్రతినిధులుగా చట్టసభలకు ఎవరిని పంపించాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. కలమతాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా, సమాజశ్రేయస్సే పరమావధిగా పరిగణించి ఓటు వేయాలి. అధికారపక్షం, ప్రతిపక్షం, ఇతర పక్షాల నాయకులు ఎన్నికల సభలలో చెప్పింది విన్నాం. అన్ని రకాల ప్రచారాలనూ చూశాం. వివిధ పార్టీల ఎన్నికల ప్రణాళికల (మేని ఫెస్టోల)ను అధ్యయనం చేశాం. ఏ ఎన్నికల ప్రణాళిక జనజీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదం చేస్తుందో, మెరుగైన సమాజ నిర్మాణానికి దారి తీస్తుందో, మౌలిక రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందో, ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే ప్రగతిశీలమైన పరిపాలన అందిస్తుందో గుర్తించాలి. ముఖ్యంగా ఎవరిని విశ్వసించాలో, ఎవరి చేతుల్లో మనలను పరిపాలించే బాధ్యత, అధి కారం పెట్టాలో, ఎవరికి రాష్ట్ర, దేశ సారథ్యం అప్పగించాలో క్షుణ్ణంగా ఆలోచించి సవ్యంగా నిర్ణయించుకోవాలి. గురువారంనాడు (11వ తేదీ) జరిగే పోలింగ్‌లో పొరపాటు చేస్తే వచ్చే అయిదు సంవత్సరాలూ కష్టనష్టాలు అనుభవించక తప్ప దనే వాస్తవాన్ని గ్రహించాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఆశలూ, ఆకాంక్షలూ కార్యరూపం ధరించే అవకాశం ఉంటుంది. విధానాల కంటే వ్యక్తులే ప్రధానం బ్రిటన్‌లో వలె మన దేశంలోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ పార్టీలూ, సిద్ధాంతాలూ, మేనిఫెస్టోల కంటే నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల మాదిరి లోక్‌సభ ఎన్నికలలోనూ, చాలా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ పోటీ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాని పదవికి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన అభ్యర్థులు. ఫెడరల్ ఫ్రంట్ నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కానీ వారిద్దరితో పోల్చదగిన స్థాయిలో మరో నాయకుడు లేడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువుకంటే ముందే జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధించింది. అక్కడ లోక్‌సభ ఎన్నికలే జరుగుతున్నాయి. అంతగా సందడి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో సామాన్య ప్రజలతో మమేకమై, వారి బాధలనూ, సమస్యలనూ అవగాహన చేసుకున్నారు. ప్రతి సామాజికవర్గం ప్రతినిధులనూ కలుసుకొని వారు చేసిన అభ్యర్థనలను ఆలకించి వారి సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేశారు. పాదయాత్ర అనంతరం ఎన్నికల ప్రచారం ఆరంభించిన జగన్ ఎన్నికల సభలలో హుందాగా, సకారాత్మకంగా, ప్రభావవంతంగా ప్రసంగాలు చేస్తున్నారు. కడచిన నాలుగేళ్ళ పది మాసాలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం పని చేసిన తీరును నిశితంగా విమర్శించారు. సహజంగానే ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు కనుక ఆయనపైనే ప్రధానంగా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని ప్రజలు ఎన్ను కుంటే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలూ, అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టేది సవివరంగా చెప్పారు. రెండు వారాలుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి కూడా శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. పాద యాత్రలో భాగంగానూ, ఎన్నికల ప్రచారంలో భాగంగానూ జరిగిన జగన్ సభలకు పోటెత్తిన జనం అధికారపక్ష నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. విజయమ్మ, షర్మిల సభలకు సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రచారానికి పూర్తి భిన్నంగా అధికార టీడీపీ ప్రచారం జరిగింది. టీడీపీ అధినాయకుడిది ఆద్యంతం నకారాత్మక శైలి. అధి కారంలో దాదాపు అయిదేళ్ళు ఉన్నప్పటికీ ప్రజలకు చూపించేందుకు సాధించిన విజయం ఒక్కటీ లేదు. అమరావతి డిజైన్ల స్థాయిలోనే ఆగిపోయింది. ఖరీదైన తాత్కాలిక భవనాలు మినహా శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక పేర్చింది లేదు. ఏటా మూడు పంటలు పండే భూములు నాలుగేళ్ళుగా నిష్ఫలంగా పడి ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించి, అరవై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు పనులు 2018 వరకూ అంగుళం కదలలేదు. ఇప్పటికీ డ్యామ్ నిర్మాణం జరగలేదు. ఏదీ పూర్తి కాకముందే సంబరాలూ, సందర్శనలూ పేరిట నాలుగైదు వందల కోట్ల వృధావ్యయం. పోలవరం పూర్తి చేస్తే నిరర్థకంగా మిగిలే పట్టిసీమ నిర్మాణం కేవలం ముడుపుల కోసమే అని విషయపరిజ్ఞానం ఉన్నవారు వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకి పెద్దగా శ్రద్ధ లేదని అందరికీ తెలుసు. వ్యవసాయం దండుగ అంటూ మాట్లాడిన వ్యక్తి ఆయన. చేసింది రవ్వంత, ప్రచారం కొండంత. కొన్ని చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం, దానికి ప్రచారం చేయించుకోవడం ఆయన ప్రత్యేకత. చేతివాటం విచ్చలవిడిగా సాగింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం పెంపుదల అడ్డగోలుగా జరిగింది. ప్రతిపక్షం అంటే శత్రుభావం బీజేపీతో ఏకీభవించనివారిని ఎన్నడూ శత్రువులుగా, దేశద్రోహులుగా పరిగణిం చలేదని బీజేపీ వ్యవస్థాపకుడు లాల్‌కృష్ణ అడ్వాణీ తన బ్లాగ్‌లో రాసుకున్న వ్యాఖ్య నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకీ వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా చంద్రబాబుకి వర్తిస్తుంది. ప్రతిపక్షం అంటే శత్రుభావం, ఈసడింపు, ద్వేషం చంద్రబాబు ప్రతి మాటలో, ప్రతి కదలికలో స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అబద్ధపు అరోపణ చేసి, అదే ఆరోపణను పదేపదే తాను చేసి, తనవారిచేత చేయించి ప్రతిపక్ష నాయకుడినీ, ఇతర ప్రతిపక్ష సభ్యులనూ కించపరచడం, ఎద్దేవా చేయడం, అప్రతిష్టపాలు చేయడం ఆయనకు ఇష్టమైన క్రీడ. చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఇద్దరు ఉన్నతాధికారులు పదవీ విరమణ తర్వాత ముఖ్యమంత్రినీ, ఆయన చుట్టూ ఉన్న అధికార, అనధికార ప్రముఖులను అవినీతి అనకొండలుగా అభివర్ణించిన సందర్భం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత వరకూ లేదు. పైగా ఒకే సామాజికవర్గానికి చెందినవారి నియంత్రణలో ప్రభుత్వం నడుస్తున్నదని ఐఏఎస్ అధికారులు ఆరోపించడం అసాధా రణం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన క్షణంలోనే ఆరంభించిన ఆత్మస్తుతీ, పరనిందా ఎన్నికల ప్రచారంలో పతాకస్థాయికి చేరుకున్నది. నిర్హేతు కమైన విమర్శల శ్రుతి హెచ్చింది. వాగ్దాడుల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో కనీస మర్యాదలనూ, సంప్రదాయాలనూ తుంగలో తొక్కారు. నోటికి వచ్చిన ఆరోపణలు సంధిప్రేలాపనల స్థాయికి దిగజారాయి. ప్రతిపక్ష నాయకుడిని అవినీతిపరుడనీ, రౌడీ అనీ, హంతకుడనీ, దొంగలముఠా నాయకుడనీ, నోటికి వచ్చిన మాటలన్నీ మొరటుగా మాట్లాడటం చంద్రబాబును ఇంతవరకూ గౌర వించినవారికి కూడా అసహ్యం కలిగిస్తున్నది. పులివెందుల, కడప జిల్లా ప్రజ లను పదేపదే రౌడీలంటూ ముద్రవేయడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని మతిలేని పని. ఆయన దేహభాష సైతం అభ్యంతరకరంగా ఉంటున్నది. తనకు మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలో, అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ఏమి చేశారో, భవిష్యత్తులో ఏమి చేయబోతారో ప్రజలకు వివరించాలి. జగన్నీ, తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునీ, ప్రధాని మోదీనీ విలన్లుగా చిత్రించి, వారిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ద్వేషభావం పెంచి ఓట్లు సంపాదించా లని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురినీ దుర్భాషలాడుతు న్నారు. అబద్ధాలు అదే పనిగా చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన వెంటనే నరేంద్రమోదీ, కేసీఆర్ కూడబలుక్కొని ‘ఓటుకు కోట్ల కేసు’ను తిరగ దోడినా, పోలవరం నిధుల గోల్మాల్ విషయంలో, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణంలో, సింగపూర్‌తో అక్రమసంబంధాలపైన విచారణ జరిపించినా కథ మరో రకంగా ఉండేది. రాష్ట్రంలో ఎవరిపైన ఐటీ దాడులు జరి గినా ముఖ్యమంత్రి ఉలిక్కి పడుతున్నారు. తన మీద ఈగ వాలకుండానే మీడియా సహకారంతో తనకు ఘోరమైన అన్యాయం జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్న చంద్రబాబును నిజంగా ముట్టుకుంటే మిన్ను విరిగి మీదపడినట్టు గగ్గోలు పెట్టి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని మోదీకి తెలుసు. సీమాంధ్ర సమావేశాలలో ప్రధాని మాట్లాడుతూ ‘యూ– టర్న్బాబూ’ అంటూ సెటైర్లు వేయడం తప్పించి ముఖ్యమంత్రికి నష్టం కలిగించే ఆరోపణలు ఏమీ చేయలేదు. చర్యలు అసలే లేవు. మోదీకి ఎన్నికలైన తర్వాత ఎవరికి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటే వారితోనే పని. అన్ని సర్వేలూ వైఎస్ ఆర్సీపీకి 19 నుంచి 22 వరకూ ఎంపీ స్థానాలు వస్తాయని స్పష్టం చేస్తున్న ప్పటికీ, ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా చంద్రబాబును మోదీ ఎందుకు దూరం చేసుకుంటారు? అనరాని మాటలు అని రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి శాలువా కప్పిన వ్యక్తి మోదీ పంచన మళ్ళీ చేరరని పూచీ ఏమున్నది? ఎవరి సంస్కారం ఏపాటిది? కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేతులు కలిపి తనపైన సీబీఐని ప్రయోగించి, బూటకపు కేసులు బనాయించి, జైలులో పెట్టించి, పదహారు మాసాలు బెయిల్ రాకుండా చేసినప్పటికీ ఆ నాయకుల గురించి జగన్ ఒక్కసారైనా పరుషంగా మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్ నాయకులను మనస్పూర్తిగా క్షమించానని ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యువ నాయకుడు అత్యంత సంయమనం, హుందాతనం, మర్యాద, సంస్కారం ప్రదర్శిస్తుంటే దేశంలోనే సీనియర్ నాయకుడినంటూ చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అభి లషణీయం కాని ఒక విధానంపైన కానీ ఒక కార్యక్రమంపైన కానీ, ఒక ధోరణిపైన కానీ ఎవరిని ఎంత కటువుగా విమర్శించినా అర్థం చేసుకోవచ్చు. ధర్మాగ్రహం ప్రదర్శించినా ఒప్పుకోవచ్చు. కేవలం రాజకీయ లబ్ధికోసం అడ్డదారులు తొక్కుతూ ఇంత నైచ్యానికి ఒడిగట్టడం అవసరమా? ప్రభుత్వ ఖజానా నుంచి రూ 8000 కోట్లు అన్నదాతా సుఖీభవ పథకం కింద పోలింగ్ వారంరోజుల వ్యవధి ఉన్నాయనగా రైతుల ఖాతాలలో జమచేసినట్టు బహి రంగసభలో ప్రకటించిన చంద్రబాబుకి చట్టాల పట్లా, రాజ్యాంగం పట్లా ఏ మాత్రం విశ్వాసం లేదు. వైఫల్యభీతి మాత్రం వెంటాడుతోంది. అడ్డగోలుగా మాట్లాడిస్తోంది. 2014 ఎన్నికలలో జగన్‌పైనా, పులివెందుల ప్రజలపైనా, కడప జిల్లాపైనా ఏ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అటువంటి అర్థంపర్థం లేని ఆరోపణ లూ, కట్టుకథలూ, వదంతులూ మళ్ళీ విశ్వసించి మోసపోవడమా లేక జగన్‌కి ఒక అవకాశం ఇవ్వడమా? ఉగాదినాడు విడుదలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎన్నికల ప్రణాళికలు పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సంక్షిప్తంగా, సమగ్రంగా ఉంది. విద్యకూ, ఆరోగ్యానికీ, వ్యవసాయానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టో 32 పేజీలు ఉంది. అంతటా పునరుక్తి. అయిదేళ్ళ కింద విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోకీ, దీనికీ తేడా లేదు. తాజా మేనిఫెస్టోలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి కూడా నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీ అధికం. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు నిరుద్యోగుల గోడు పట్టించుకోకుండా, ఆ వైఫల్యానికి క్షమాపణ చెప్పకుండా, అంతకంటే ఖరీదైన హామీ ఇవ్వడం చంద్రబాబు వంటి తెంపరికే చెల్లింది. తాను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమిస్తు న్నారు. మేనిఫెస్టోలు పోల్చి చూసుకున్న తర్వాత, వారి నడతను పరిశీలించిన అనంతరం ఈ ఇద్దరు నాయకులలో ఎవరి మాటను విశ్వసించాలో, చెప్పిన మాటకు ఎవరు కట్టుబడి ఉంటారో, ఇచ్చిన హామీని ఎవరు నెరవేరుస్తారో, ఎవరి వ్యక్తిత్వం ఏమిటో గ్రహించాలి. ఒక వైపు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో దేశంలోని అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకొని అవకాశవాద రాజకీయాలను అను సరిస్తూ వచ్చిన చంద్రబాబు ఒక వైపు. పదేళ్ళ రాజకీయ జీవితంలో అత్యధిక సమయం మాట మార్చకుండా, మడమ తిప్పకుండా ప్రజల మధ్య గడిపిన యువనాయకుడు మరో వైపు. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోవాలి. ఈ కసరత్తు చేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. కె. రామచంద్రమూర్తి -
లాలూచీ రాజకీయం లాభిస్తుందా?
‘నేను విన్నాను. నేను ఉన్నాను.’ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచార సభలలో ప్రస్ఫుటంగా చెబుతున్న మాటలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరాంగ ణంలో ముగ్గురు యోధులు యుద్ధవిన్యాసాలు చేస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర బాబునాయుడికీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డికీ మధ్య సాగుతున్నదే నిర్ణాయక పోరాటం. మూడో యోధుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఈ ముగ్గు రిలో ఏ నాయకుడు ఏమని అన్నారో సగటు పౌరులు చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు. ఎవరు మాట మార్చుతున్నారో, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారో, ఎవరు సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు బండగా మాట్లా డుతున్నారో, ఎవరు యూటర్న్లు తీసుకుంటున్నారో, ఎవరు రహదారిలో నడుస్తున్నారో తెలుసుకోవడానికి అవసరమైన తెలివితేటలూ, వివేకం పౌరులకు దండిగా ఉన్నాయి. వారికి జ్ఞాపకశక్తి, తెలివి లేవనుకోవడం పొరబాటు. ఏ పార్టీకి ఓటు వేయాలో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఓటర్లలో అత్యధికులు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. ముగ్గురు నాయకులూ గడచిన 58 మాసాలలో ఏమేమి అన్నారో, ఏమేమి చేశారో గమనిస్తే ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపు తారో ఊహించడం కష్టం కాదు. గెలుపే గమ్యం, మార్గం అధర్మం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహారం చూద్దాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగిస్తుందనే ఆశతో చంద్రబాబునాయుడిని ప్రజలు గెలిపిం చారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరువం దల పైచిలుకు వాగ్దానాలనూ పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దించిన తర్వాత ప్రపంచబ్యాంకును మెప్పించాలనే రంధిలో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. 1999లో సైతం ఎన్నికల ప్రణాళికను అటకపైన పెట్టి విద్యుత్ సంస్కరణల వంటి అప్రకటిత కార్యక్రమాలు అమలు చేశారు. ఈ సారీ అంతే. ఎన్నికల సభలలో చెప్పిన పనులు చేయకుండా చెప్పని పనులు చేయడం మొదలు పెట్టారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం అయిదేళ్ళలో అంగుళ మైనా ముందుకు కదలలేదు. శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చ లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఒడిగట్టి అస్మదీయుల చేత భూములు కొనిపించి వారికి లబ్ది చేకూర్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని విభజన చట్టం నిర్దేశించింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ బాధ్యతను అడిగి నెత్తికెత్తుకున్నది అస్మదీయులకు ప్రయోజనం కలిగించడం కోసమే. అయిదేళ్ళ పదవీకాలం పూర్తవుతున్నా పోలవరం సశేషంగా మిగిలింది. చివరికి దుర్గ గుడి కింద ఫ్లయ్‌వోవర్ కూడా పూర్తి చేయలేకపోయారు. విజయవాడ నగరంలోకి ప్రవేశించేవారికి అది వెక్కిరిస్తున్నట్టు కనిపించి అసౌకర్యం కలిగి స్తున్నది. రుణాల మాఫీ పూర్తి కాలేదు. పసుపు కుంకుమ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ప్రారంభించారు. చాటుకోడానికి విజయం ఒక్కటీ లేదు. వైఫల్యాలు అనేకం. విద్యార్థుల ఫీజు రీయెంబర్స్‌మెంట్ కోసం మోహన్‌బాబు వంటి మాజీ మిత్రుడు ధర్నాకు దిగవలసి వచ్చింది. అంతులేని వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షంపైన దాడులు చేయడం. ప్రతిపక్ష నాయ కుడిపై బురద చల్లడం, వందిమాగధుల చేత అవాకులూచెవాకులూ మాట్లాడించ డమే ఎన్నికల ప్రచారంగా చెల్లుబాటు అవుతోంది. జగన్మోహన్రెడ్డిని ముఖ్య మంత్రి చేస్తే మిన్ను విరిగి మీద పడుతుందంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. శ్రేయోభిలాషులకు సైతం ఎబ్బెట్టుగా కని పిస్తున్నాయి ఆయన చర్యలు. 2014లో నరేంద్రమోదీ హవా, పవన్‌కల్యాణ్ ‘పుల్’, టీడీపీ బలం కలిస్తేనే ప్రతిపక్షం కంటే కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. అప్పటికి చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేదు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి జనాదరణ విశేషంగా పెరిగింది. ఒకప్పుడు మోదీ మహా నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు మోదీ హవా తగ్గిపోయిందని అంచనా వేసి ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. మోదీ వ్యతిరేకతను రాష్ట్రంలో సృష్టించి ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలలో గెలుపొందాలని ఆశిం చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగువా రిని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇంతలో పుల్వామాలో సైనిక శకటాలపైన ఉగ్రదాడి జరగడం, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం, కొద్ది రోజుల తర్వాత భారత వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించడం జరిగింది. ఈ పరి ణామాలను తన దేశభక్తికీ, తన ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమంటూ మోదీ ప్రచారం చేసుకోవడం, ప్రధానిగా కొనసాగడం తథ్యం అంటూ జనాభిప్రాయం బలపడటం చంద్రబాబును పునరాలోచనలో పడవేసింది. వెంటనే మోదీపైన దాడి తీవ్రతను పూర్తిగా తగ్గించారు. చంద్రబాబు తెలంగాణలో రాహుల్ గాంధీతో కలసి చెట్టపట్టాలేసుకొని ఎన్నికల ప్రచారం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ‘నేను కావాలా, చంద్ర బాబు కావాలా?’ అంటూ ప్రశ్నించి ప్రజల సంపూర్ణ మద్దతు పొందారు. అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగించాలనీ, కేసీఆర్‌ని విలన్‌గా చిత్రించా లనీ, ఆయనకు జగన్ బంటుగా వ్యవహరిస్తున్నారని జనాన్ని నమ్మించాలనీ ప్రయత్నం ముమ్మరం చేశారు. అందుకే చంద్రబాబు ప్రతి సభలో జగన్ నామ స్మరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి రహస్య ఒప్పందం ఉంది. కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి వంటి ఎంతోకొంత ప్రజా దరణ కలిగిన నాయకులు టీటీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేగువేరా–చంద్రబాబు రెండో వీరుడు పవన్‌కల్యాణ్. ఆయన అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. పవన్ రాజకీయాలలో ప్రవేశిం చినప్పుడు చేగువేరా అభిమాని. ఇప్పుడు చంద్రబాబు అనుయాయి. వామపక్ష భావజాలాన్ని అభిమానించే వ్యక్తిగా, గద్దర్ వంటి విప్లవ నాయకుల మిత్రుడుగా పరిగణన పొందిన పవన్ రాజకీయాలలో అడుగు పెడుతూనే బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని సంకల్పించడమే విడ్డూరం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక సందర్భాలలో ఆయన పిల్లిమొగ్గలు వేశారు. లోకేష్‌పైన అవినీతి ఆరోప ణలు చేసి ఆ తర్వాత మౌనం పాటించారు. మంగళగిరిలో లోకేశ్ పైన పోటీకి జనసైనికుడిని పెట్టకుండా సీపీఎం అడిగిన టిక్కెట్టును సీపీఐకి ఇచ్చారు. లోకేశ్‌కి ఇబ్బంది లేకుండా చూసేందుకే చంద్రబాబు అభీష్టం మేరకు జనసేన, సీపీఎం అభ్యర్థులను రంగంలో దింపలేదన్నది సామాన్య పౌరులకు సైతం తెలిసిపో తోంది. చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ అంతే. అతనిపైన ఉద్యమం నిర్వహించి నిప్పులు కక్కిన పవన్ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చి చింతమనేని విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో సత్యవతి అనే బీసీ మహిళను జనసేన అభ్యర్థిగా నిలబెట్టారు. విశాఖ, అమలాపురం, నరసాపురం లోక్‌సభ స్థానాలు జనసేనకు దక్కేటట్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నియోజకవర్గాలలో బలహీనమైన టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారు. విశాఖలో (జేడీ) లక్ష్మీనారాయ ణను గెలిపించాలన్నది చంద్రబాబు అభిమతం. బాలకృష్ణ ఒత్తిడి భరించలేక ఆయన రెండో అల్లుడూ, లోకేశ్ తోడల్లుడూ, దివంగత ఎంవీఎస్ మూర్తి మనుమడూ అయిన భరత్‌కు టిక్కెట్టు ఇచ్చినప్పటికీ టీడీపీ శ్రేణులు జనసేన అభ్యర్థి విజయానికే కృషి చేస్తాయని అంటున్నారు. అమలాపురంలో హర్షకుమా ర్కి టీడీపీ టిక్కెట్టు ఇస్తే జనసేన అభ్యర్థి శేఖర్ (ఓఎన్జీసీ మాజీ డైరెక్టర్)కు గట్టిపోటీ ఇస్తారని భావించి బాలయోగి కుమారుడికి టీడీపీ టిక్కెట్టు ఖరారు చేశారు. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని టీడీపీ అభ్యర్థిగా నిర్ణయిం చారు. ఆ తర్వాత సుబ్బారాయుడి స్థానంలో సంపన్నుడైన చైతన్యరాజును బరిలోకి దింపారు. కొంతకాలం ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఆయననీ పక్కనపెట్టి ఉండి శాసనసభ్యుడు శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ఫిక్సింగ్‌ల ఫలితంగా జనసేన అభ్యర్థులు ఖాయంగా గెలుస్తారని కాదు. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉన్నదని ఇటువంటి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. గాజువాక సీటును సీపీఎం అడిగింది. అక్కడ ఉద్యమాల నాయకుడు నరసింగరావును నిలబెట్టాలన్నది సీపీఎం ఉద్దేశం. పవన్ స్వయంగా ఆ సీటును వరించినప్పుడు వామపక్షాలు ఏమి చేయగలవు? మాయావతికి మూడు లోక్‌సభ స్థానాలూ, 21 శాసనసభ స్థానాలూ కేటాయించడం చంద్ర జాలంలో భాగమే. వామపక్షాలకు చెరి రెండు లోక్‌సభ స్థానాలూ, ఏడేసి అసెంబ్లీ స్థానాలూ కేటాయించారు. ఇది స్థానికంగా కొద్దోగొప్పో ఉనికి కలిగిన వామ పక్షాలను అవమానించడమే. సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ నియోజక వర్గంలోనూ, నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు తాజా సమాచారం. లాలూచీ రాజకీయానికి ఇది పరాకాష్ట. వైఎస్ఆర్సీపీకి పడే కాపు, దళిత ఓట్లను చీల్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కానీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, బీ–ఫారాలు ఎవరు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. ఉత్తరాది, దక్షిణాది వైరుధ్యం గురించి గంభీర ప్రసంగాలు చేసిన పవన్ పనిగట్టుకొని లక్నో వెళ్ళి మాయావతిని కలుసుకోవడం, పొత్తు పెట్టుకో మని అడగడం, ఆమె ప్రధాని కావాలని తాను అభిలషిస్తున్నట్టు చెప్పడం కపట రాజకీయానికి నిదర్శనం. స్వయంగా సినిమా నటుడు కనుక స్క్రిప్టు చదవడం సుఖంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారనే వ్యాఖ్య చేసినందుకు పవన్‌కల్యాణ్‌ను తెలుగు జాతి క్షమించదు. పవన్ లోగడ తన సినిమా రిలీజైనప్పుడు కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఆయన నాయకత్వం లక్షణాలను పొగిడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తాను టీఆర్ఎస్కే ఓటు వేశానంటూ నాగబాబు ప్రకటించారు. రాజకీయ లబ్ధికోసం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషం రగిలించే వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రవాహానికి ఎదురీదిన నేత మూడో యోధుడు జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీని ధిక్కరించడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ధిక్కారమును సైతునా అంటూ ఆగ్రహించిన సోనియా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడితో కలిసి పథకం ప్రకారం జగన్‌పైన బూటకపు కేసులు పెట్టించడం, దర్యాప్తు పేరుతో 16 మాసాల పాటు జైలులో నిర్బంధించడం చరిత్ర. 2014 ఎన్నికలలో శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు అధైర్య పడలేదు. నిరాశ చెందలేదు. కుంగిపోలేదు. 2019 ఎన్నికలకు అప్పటి నుంచే సన్నాహాలు ఆరంభించారు. పార్టీని పటిష్టంగా నిర్మించారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. కోట్ల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఆలకించారు. తనపైన హత్యాప్రయత్నం జరిగినప్పుడు హుందాగా ప్రవర్తించారు. అధికారపక్షం ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఎజెండాను నెలకొల్పారు. దానికి స్పందించక తప్పని స్థితిలో చంద్రబాబును పడవేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం జగన్ ఆరంభించి కడదాకా కొనసాగిస్తే ముందు హోదా దండగనీ, ప్యాకేజీ మెండుదనీ వాదించి, చివరికి హోదా నినాదంతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించింది. మోదీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా జగన్ ఎజెండాను చంద్రబాబు అనుసరించక తప్పలేదు. వైఎస్ఆర్సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి నప్పుడూ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. వృద్ధులకు పింఛన్లు పెంచడానికీ, పసుపు కుంకుమ కార్యక్రమానికీ జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలూ, అంతకు మందు పార్టీ ప్లీనరీలో పేర్కొన్న నవరత్నాలే ప్రేరణ. ఎజెండా నిర్ణయిం చిన నాయకుడే మార్గదర్శకుడు. అతడే విజేత. కె. రామచంద్రమూర్తి -
కప్పదాట్లు... కట్టుకథలు!
‘వాట్ ఈజ్ డెమాక్రసీ? సమ్‌బడీ విల్ గివ్ మనీ, సమబడీ ఎల్స్ విల్ స్పెండ్ దట్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్స్. వాట్ వే ఐ యామ్ కన్సర్న్డ్? (ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. మరొకరు ఎన్నికలలో ఖర్చు చేస్తారు. దీనితో నాకేమిటి సంబంధం?).’ ప్రజాస్వామ్యాన్ని ఇంత సరళంగా, ధనప్రధానంగా నిర్వచించిన మేధావి ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రజాస్వామ్యాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు అది. ప్రజాస్వామ్య వైతాళికులనూ, ప్రపంచ మేధా వులనూ ఉటంకించడం ఆయన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను సమున్నతంగా నిలపాలని త్రికరణశుద్ధిగా ప్రయత్నించే నాయకుల బాపతు కాదు ఆయన. ఆచరణయోగ్యమైన, తనకు అర్థమైన రీతిలో రాజకీయం చేయడం తిరుపతి విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా ఉన్న కాలం నుంచీ చంద్రబాబునాయుడికి బాగా అబ్బిన విద్య. రాజకీయాలంటే వివిధ కులాల మధ్య సమన్వయం సాధిస్తున్నట్టు కనిపిస్తూనే అస్మదీయులకు ప్రయో జనాలూ చేకూర్చుతూ పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడిపించడం అని ఆయన అవ గాహన. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎటువంటి చాణక్యం చేసినా, ఏ నియమం ఉల్లంఘించినా తప్పు లేదనీ, అధికారంలో కొనసాగడానికి అధికార దుర్వినియోగం చేయడానికి సంకోచించనక్కరలేదనీ ఆయన భావిస్తారు. అధి కారం కైవసం చేసుకునే క్రమంలో ఎవరి సహకారం అవసరమైతే వారి సహ కారం తీసుకోవాలనీ, అందుకు ఏ వాగ్దానం అవసరమైతే ఆ వాగ్దానం నిరభ్యం తరంగా చేసేయాలనీ, అధికారం జేజిక్కిన తర్వాత తన మనుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏమి చేసినా సమర్థనీయమేననీ నమ్మకం. అధికారం హస్తగతం చేసుకునే క్రమంలో తనకు సహాయం చేసినవారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న పట్టింపు లేదు. మాటపైన నిలబడాలన్న నిబద్ధత లేదు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని గట్టిగా విశ్వసించిన నాయకుడు ఆయన. ఫలితంగా, ఈ రోజు సామాన్యులు ఎవ్వరూ ఎన్నికలరంగం వైపు తేరి పార చూడలేని పరిస్థితి నెలకొన్నది. పదుల కోట్ల రూపాలయలు ఖర్చు చేసిన వారే ఎన్నికల రంగంలో దిగి తమ అదృష్టం పరీక్షించుకోగలరు. సేవానిరతి, నిస్వార్థచింతన, సమాజంపట్ల ప్రేమ, అంకితభావం ఉన్నంత మాత్రాన చాలదు. డబ్బు దండిగా ఉండాలి. ఎన్నికల వ్యవహారం ఇంతగా డబ్బుతో ముడిపడే విధంగా దిగజారడానికి కారణభూతులైన నాయకులలో చంద్రబాబు అగ్రగణ్యులు. అందుకే ప్రజాస్వామ్యాన్ని ధనభూయిష్టంగా అంత అలవోకగా నిర్వచించగలిగారు. మన సులోని మాట అప్రయత్నంగానే బయటికి వస్తుంది. రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో, తన పరిమితులను తెలుసుకొని వాటిని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆయన దిట్ట. ఏ ఎన్నికలలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరంగా పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఆయనకు పరాజయం అంటే భయం. అభద్రతాభావం, వైఫల్యభీతి ఆయనను ఎల్లప్పుడూ వెన్నా డుతూ ఉంటాయి. ప్రతిక్షణం, ప్రతిరోజూ తానే గెలుపొందాలనీ, అందుకోసం ఏమైనా సరే చేసేయాలనీ ఆయన భావిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం వేయని ఉప ఎన్నికలో గెలిచేందుకు ఆయన అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపుతారు. పది మంది మంత్రులనూ, పాతికమంది ఎంఎల్‌ఏలనూ, డబ్బు సంచులనూ ఉపఎన్నిక జరు గుతున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పరుగులు పెట్టించి ఘనవిజయం సాధిస్తారు. ఇందుకు నంద్యాల ఉపఎన్నిక తాజా ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలలో కాంగ్రెస్ చావుదెబ్బ తినడంలో తన ప్రమేయం ఉన్నప్పటికీ అసలు తెలం గాణలో ఎన్నికలు జరగనట్టూ, తాను ప్రచారం చేయనట్టూ మాట్లాడతారు. నీతినియమాలకు తిలోదకాలు రాజకీయాలలో నాయకులుగా జయప్రదంగా కొనసాగుతున్నవారందరికీ గొప్ప తెలివితేటలూ, మేధాసంపత్తీ ఉండాలన్న నియమం లేదు. సమాచారం తెలి సినవారితో సంపర్కం పెట్టుకొని వారి ఆలోచనలను సొంతం చేసుకొని తమ ఆలోచనలుగా చెప్పుకుంటూ ప్రజలను నమ్మించే నేర్పు కొందరికి ఉంటుంది. నియమనిబంధనలనూ, నీతీనిజాయితీలనూ తప్పకుండా కష్టపడి రాజకీయా లలో పైకి వచ్చిన నాయకులు కొందరు ఉంటారు. నియమాలతో నిమిత్తం లేకుండా నీతిని పట్టుకొని వేళ్ళాడకుండా విజయం సాధించడానికి ఏది అవ సరమైతే అది చేసి అధికారం సంపాదించి పదవులలో చాలా సంవత్సరాలు ఉన్నవారూ లేకపోలేదు. వీరికి అసాధారణమైన పోటీ మనస్తత్వం ఉంటుంది. అభద్రతాభావాన్ని కప్పి పుచ్చడానికీ లేదా అధిగమించడానికీ బుకాయించడం, దబాయించడం, స్వోత్కర్షకు దిగడం ఆనవాయితీ. కళ్ళెగరవేస్తూ, చూపుడు వేలుతో ఛాతిని చూపిస్తూ తాను ఎవ్వరికీ భయపడననీ, ఎవ్వరికీ లొంగే ప్రసక్తి లేదనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశాననీ ప్రకటనలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో తప్పు చేసి ఇతరులపైన తోసి అడ్డంగా దబాయిస్తూ ఉంటారు. అటువంటి ఘటనలలో డేటా చౌర్యం ఒకటి. మా సమాచారం దొంగిలించి మాపైనే దాడులు చేస్తారా?, ‘మా డేటాను దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు?,’అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పట్టుబడి విజయవాడకు పలాయనం చిత్తగించిన సమయం లోనూ ఇదే వరుస. ‘మీకు పోలీసులు ఉన్నారు. మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది,’అంటూ రభస. డేటా చౌర్యం కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం తొమ్మదిమంది అధికారులతో ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్) నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తొమ్మి దిమందితో ఒక సిట్ నియమించింది. తెలంగాణ సర్కార్ ఒక సిట్ నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సిట్లు నియమించింది. పైగా, తన రాజకీయ జీవితంలో నడవడిక (కేరెక్టర్)కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానంటూ చెప్పు కుంటారు. ఇంతవరకూ చంద్రబాబు పేరున కానీ లోకేశ్ పేరు మీద ఉన్న సంస్థ లపైన కానీ ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, సీబీఐ దాడులు నిర్వహించలేదు. నోటీసులు సైతం ఇవ్వలేదు. అక్రమాలు చేసినట్టు అను మానించిన సంస్థలపైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ సంస్థలు అక్ర మాలు చేయకపోతే వాటికి నష్టం జరగదు. మరి తనను మానసికంగా వేధిస్తు న్నారంటూ చంద్రబాబు ఎందుకు మనస్తాపం చెందుతున్నారు? అక్ర మంగా ఓటర్ల వ్యక్తిగత వివరాలను అపహరించిన సంస్థపైన వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు స్పందిస్తే దానిని రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ మంటూ అభివర్ణించడం దేనికి? ఆంధ్రప్రదేశ్‌లో 3.6 కోట్ల మంది ఓటర్ల కలర్ ఫొటోలతో సహా సకల వ్యక్తిగత వివరాలు రాష్ట్రప్రభుత్వం సేకరించి ఐటీగ్రిడ్స్ అనే సంస్థకు ఎందుకు అప్పగించిందో చంద్రబాబునాయుడు తెలిసినా చెప్పరు. ఎన్నికల కమిషన్ వద్ద మాస్టర్ కాపీలో మాత్రమే ఉండవలసిన ఓటర్ల కలర్ ఫొటోలు బ్లూఫ్రాగ్, ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకూ, సేవామిత్ర వంటి యాప్‌లకూ ఎట్లా లభించాయో వెల్లడించరు. ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ అనే వ్యక్తి రెండు, మూడు రోజుల్లో అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పి బయటకు వస్తారని చెబుతారు. అంటే అశోక్‌ను ఎక్కడ దాచారో ముఖ్యమంత్రికి తెలుసని అనుకోవాలి. తెలంగాణ పోలీసులు వెతుకుతున్న నిందితుడికి ఒక ముఖ్యమంత్రి రక్షణ కల్పించడం చట్టవిహితమా? చంద్రబాబు రాజకీయం అవకాశవాదానికి పరాకాష్ఠ. ప్లేటు మార్చిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గినట్టు కనిపించింది. బీజేపీని మోయడం కంటే ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో కరచాలనం లాభదాయకమని భావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్‌తో ఒప్పందం క్షేమదాయకం కాదని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు ఉండదు కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పని చేస్తాయని ప్రకటించారు. మొన్నటి వరకూ చంద్రబాబు తీవ్రస్వరంతో మోదీని విమర్శించేవారు. సవాలు చేసేవారు. ఆయన కంటే తాను సీనియర్‌నంటూ పదేపదే చెప్పేవారు. తనకూ, మోదీకీ మధ్య పోరాటం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేవారు. ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాలకు వెళ్ళి ప్రతి పక్షాలకు సంఘీభావం ప్రకటించేవారు. జగన్మోహన్రెడ్డికి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ల రహస్య మద్దతు ఉన్నదంటూ పదేపదే ఆరోపించారు. అంతలోనే సీను మారింది. చంద్రబాబునా యుడు ప్లేటు కూడా మారినట్టుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వాయుసేన దాడి చేసిన తర్వాత జరుగుతున్న ప్రచారం ఫలితంగా మోదీ పైచేయి సాధించారనీ, ఆయన ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం ఉన్నదనే అభిప్రాయం దేశప్రజలలో బలపడింది. ఇది గ్రహించిన చంద్రబాబు ఎందుకైనా మంచిదని మోదీపైన దాడులు తగ్గించారు. కేసీ ఆర్పైనా, తెలంగాణ పోలీసులపైనా ధ్వజమెత్తడానికి తాజాగా వెల్లడైన డేటా కుంభకోణాన్ని వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటాను తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్ నుంచి తస్కరించి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారంటూ సరికొత్త దాడికి తెరదీశారు. తాను కావాలో, కేసీఆర్ కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. ఇటువంటి వాక్యాలే ఎక్కడైనా వినినట్టు పాఠకులకు అనిపిస్తే అది వారి తప్పు కాదు. నాలుగు మాసాల కిందట తెలం గాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఇటువంటి ప్రశ్నే అడిగారు. తాను కావాలో చంద్రబాబు కావాలో కోరుకోమని ప్రజలకు పిలుపు నిచ్చారు. వారు నిర్ద్వంద్వంగా కేసీఆర్ కావాలనే సంకల్పం ప్రకటించారు. అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ప్రచారం చేయబోరు. చంద్రబాబులాగా పొరుగు రాష్ట్రంలో చక్రం తిప్పాలనే దురాశ కేసీఆర్‌కు లేదు. అయినా సరే, ఏదో ఒక విధంగా ప్రజలలో భావావేశం రగిలించాలని చంద్రబాబు తాపత్రయం. ఇందుకోసం డేటా చౌర్యం ఉదంతాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం. వృధాప్రయాస శనివారం అంతటా చంద్రబాబునాయుడు అసాధారణమైన అంశాలు వెల్లడిం చబోతున్నట్టు అనుకూల మీడియాలో ఊదర కొట్టారు. చివరికి సుదీర్ఘ మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంలో కొత్త అంశం ఏమీ లేదు. ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టుకొని అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్టు పేజీ నంబర్లు చెబుతూ, కొన్ని వాక్యాలు చదువుతూ చాలా ముఖ్యమైన విషయం కనిపెట్టినట్టు హడావిడి చేశారు. అంతా హుళక్కి. విజయసాయిరెడ్డి ఫిర్యాదు రహస్యం కాదు. అది బహిరంగ పత్రం. ‘అంతా విజయసాయిరెడ్డి చెప్పినట్టే జరుగుతోంది,’అంటూ, ‘దొంగతనాలు జరగవచ్చు, దాడులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి,’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు మీడియా సమావేశాన్ని అపహాస్యం చేశారు. అంతకు ముందు ఒక సారి ‘మీ ఇంట్లో ఆడపిల్లను ఎత్తుకొని పోవచ్చు,’ అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లా డవలసిన తీరేనా ఇది? ప్రజల వివేకాన్ని అంత తక్కువగా అంచనా వేయడం తప్పు. ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు ఓటర్ల సమాచారం సేకరించారో. ఓటర్ల బ్యాంకు ఖాతాల, లావాదేవీల వివరాలు సమస్తం ఒక బినామీ ప్రైవేటు కంపెనీకి ఎట్లా కట్టబెట్టారో, ఆ వివరాలను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో, ఓట్లు ఎట్లా తొలగిస్తున్నారో అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు ప్రజలు. దొంగతనాలూ, దాడులు జరగకుండా నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ప్రజలకు తెలుసు. వైఫల్య భీతి చంద్రబాబు చేత అసంబద్ధమైన, నిరాధార మైన ఆరోపణలు చేయిస్తున్నది. ముఖ్యమంత్రి పథకం ప్రకారం ఆవేశపడుతున్నారు కానీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. 2004, 2009లో లాగానే ఈసారి కూడా చంద్రబాబునాయుడు ఎత్తుగడలు ఫలించకపోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత బలంగా ఉన్నట్టు సమా చారం. స్వయంకృతం. కె. రామచంద్రమూర్తి -
యుద్ధం కాదు పరిష్కారం
ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్‌కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్‌కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి. యుద్ధమేఘాలు సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్‌లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్‌తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్‌కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్‌పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్‌కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్‌ను భారత్‌కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్‌ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు. సైన్యాధికారుల ఆమోదంతోనే... సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్షరీఫ్లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్‌కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. జైట్లీ సమరోత్సాహం అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న మసూర్ అజహర్‌ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు. అసలు సమస్య ఏమిటి? కశ్మీర్‌లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్‌కు పట్టించుకోదు. భారత్‌కూడా కశ్మీర్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్‌వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్‌ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్‌ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్‌ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్‌పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్‌పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్‌తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్‌తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్‌లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్‌పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం. -కె. రామచంద్రమూర్తి -
సమర్థ దౌత్యమే సరైన ఆయుధం
కశ్మీర్‌లోయలో పాకిస్తాన్ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్‌కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్‌ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్ తోడ్ జవాబ్’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు. టెలివి జన్ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల (సీఆర్ పీఎఫ్)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్ మహమ్మద్ దార్ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్‌కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్‌లో కశ్మీర్లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్‌కు చెందిన యువ కుడు. కశ్మీర్‌కు చెందిన యువకులను ఆకర్షించి పాక్ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్‌పైన ప్రయోగించడం పాకిస్తాన్ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. కశ్మీర్లో పాకిస్తాన్ చిచ్చు కశ్మీర్‌లోయలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్‌కు ఉన్నది. పాకిస్తాన్‌కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్ స్ట్రయిక్ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్ కంటే నేరుగా పాకిస్తాన్ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్ జరిపితే పాకిస్తాన్ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్ సైనికులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్‌ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు. సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్‌కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. సర్జికల్ స్ట్రయిక్‌లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్ స్ట్రయిక్‌కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు. తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దార్‌ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్ తల్లిదండ్రుల పుత్రశోకానికి కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్‌లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్‌లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్‌కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం. పాకిస్తాన్‌ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్‌కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్‌కు గొప్ప ఉపకారం చేస్తున్నది. వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్‌కు అఫ్ఘానిస్తాన్‌ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్ చేతు లలో అఫ్ఘానిస్తాన్‌ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో భారత్ ఒంటరి అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్సింగ్. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్ కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్‌ను పాకిస్తాన్ కశ్మీర్‌వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్ సైన్యంతో పోరాడిన తాలిబాన్‌ను కశ్మీర్‌పైకి పంపించింది పాకిస్తాన్. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై పోయింది. ఇప్పుడు కూడా తాలిబాన్‌ను ప్రయోగిస్తే కశ్మీర్ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్‌ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్ హఫీజ్, అజహర్ మసూద్ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్ స్నైపర్స్ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ను తాలిబాన్ సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు. న్యూయార్క్‌లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సైనికులను పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి. -కె. రామచంద్రమూర్తి -
నేతల జాతర–విలువల పాతర!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సామాన్య ప్రజలలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం సహజం. దృశ్యశ్రవణ ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు కనిపించవలసిన చోట కనిపించాలనీ, మాట్లాడవలసిన మాట మాట్లాడాలని రాజకీయ నాయకులు తాపత్రయ పడతారు. కొందరు రాజకీయ నాయకులు తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావించే దృశ్యాన్ని వదిలిపెట్టరు. లాభసాటి దృశ్యాలలో ఉనికి కోసం ఎంత దూరమైనా వెడతారు. ప్రత్యర్థులపై దారుణాఖండల శస్త్రతుల్యమైన పదజా లంతో దాడి చేస్తారు. నిన్న పొగిడిన నోటితోనే నేడు తెగుడుతారు. సంవత్సరం కిందట సంజీవని కానిది ఈ రోజు ప్రాణప్రదమైన ఔషధి అవుతుంది. పొత్తు ఉన్నప్పుడు ఇంద్రుడూచంద్రుడూ అంటూ నెత్తికెత్తుకొని ఊరేగినవారే పొత్తు రద్దయిన తర్వాత దుష్టుడూ దుర్మార్గుడూ అంటూ నేలకేసి కొడతారు. ఒకటి, రెండు మినహాయింపులు తప్పిస్తే అన్ని పార్టీల నాయకులదీ ఇదే వరుస. ఎన్నికల బరిలో దిగే ముందు మాటల ఈటెలకు పదును పెడుతున్నారు. ఇటు వంటి రాజకీయంలో నిజానిజాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. రాజ్యాంగస్ఫూర్తి అసలే లేదు. తాము నిన్నామొన్నా ఏమని చెప్పామో, ఇప్పుడు ఏమి చెబుతున్నామో అన్న స్పృహ బొత్తిగా లేదు. ప్రతిపక్షాలపై దాడే వ్యూహమా? అధికార పార్టీలు వ్యవహరించిన రీతినీ, ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను అమలు చేసిన తీరునీ ఎన్నికల సమయంలో చర్చించడం సంప్రదాయం. తమ సాఫల్యవైఫల్యాలను అధికార పార్టీలు గుర్తించి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయిందీ వివరించే రోజులు పోయాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా, సరికొత్త సంక్షేమపథకాలు పదవీకాలం ముగియనున్న తరు ణంలో అట్టహాసంగా ఆరంభించడం ద్వారా, లక్షల కోట్లు ఖర్చు చేయవలసిన ప్రాజెక్టులకు అలవోకగా శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజలను మెప్పించి మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగాలని కలలు కంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఈ విన్యాసాలు ఫలించవు. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకొని నాలుగు సంవత్సరాలు చెట్టా పట్టాలేసుకొని యుగళగీతాలు ఆలపించిన విషయాన్ని ప్రజలు మరచిపోవాలని మోదీ, బాబూ కోరుకుంటున్నారు. ప్రత్యేకహోదాపైన మోదీ, బాబూ ఇద్దరూ ఆడిన నాటకాన్ని ప్రజలు విస్మరించాలనీ, తాజా డ్రామాను మాత్రమే వీక్షించి మైమరచిపోవాలనీ వారి ఆకాంక్ష. రఫేల్ వివాదంపై రగడ చేస్తున్న కాంగ్రెస్ నాయకులనూ, ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులనూ దేశద్రోహులుగా, దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్న దుర్మార్గులుగా చిత్రించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ హయాంలో బోఫోర్స్ సహాlఅనేక కుంభకోణాలు జరిగిన వాస్తవాన్ని ప్రస్తావించ కుండా రఫేల్‌ను మాత్రమే ప్రజల ముందుకు ప్రముఖంగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకుల ఆరాటం. చిట్‌ఫండ్ అక్రమార్కుల కొమ్ముకాయడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తు న్నారని బీజేపీ ప్రవక్తల వాదన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపైన కేసులు బనాయించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించి అప్రదిష్టపాలు చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని మమతాదీదీ, తదితర ప్రతిపక్ష నేతల ఆరోపణ. ‘ఏమిటి నన్ను జైల్లో పెడతారా?’ అంటూ చంద్రబాబు బీజేపీ శాస నసభ్యులవైపు చూస్తూ హుంక రిస్తారు. ప్రజాధనాన్ని దుబారా చేశారనీ, నిధులు కాజేయడం కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టారనీ, పోలవరం నిధులకు లెక్క చెప్పడం లేదనీ, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నదనీ వస్తున్న ఆరోపణలపైన కేంద్రం విచారించలేదు. బీజేపీ నాయకులే స్వయంగా చేస్తున్న విమర్శలు గాలిలోకి కలసిపోతున్నాయి కానీ వాటిలోని నిజానిజాలు తేల్చే బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదు. ఇంతటి అనుకూల పరిస్థితులలో సైతం చంద్రబాబుకి జైలుభయం పట్టుకోవడం ఆశ్చర్యం. భయంలోనుంచి బుకాయింపు పుట్టుకొచ్చింది. సీబీఐ గీబీఐ జాన్తానై అంటున్నారు. ఈడీ లేదూ గీడీ లేదూ అంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు. కేంద్రంపైన ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తినా, మమతా బెనర్జీ తిరుగు బాటు బావుటా ఎగరవేసినా వారి పక్కన దృశ్యంలో కనిపించేందుకు చంద్ర బాబు అన్ని పనులూ వదులుకొని శ్రమకోర్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకీ, కోల్‌కతాకీ వెడుతున్నారు. మోదీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కానీ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. అందుకు అవసరమైన సామగ్రి వారి దగ్గర ఉన్నది. కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. చంద్రబాబుని తమ ప్రధాన ప్రత్యర్థిగా మోదీ భావించడం లేదు. ఈ రోజు గుంటూరు సభలో చంద్రబాబుపై నరేంద్రమోదీ అమిత్‌షా లాగానే విమర్శలు చేయవచ్చు. మామూలు విమర్శలతో సరిపెట్టకుండా మమతాబెనర్జీపై చేసినంత కరకుగా మోదీ తనపైన కూడా వాగ్దాడి చేయాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. అందుకే ‘ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కి వస్తారు మోదీ?’, అంటూ రెచ్చగొడుతున్నారు. మోదీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా తేలాలని తాపత్రయం. ఆంధ్రప్రదేశ్‌లో అంతటి దృశ్యం లేదు. పశ్చిమబెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అమిత్‌షా, నరేంద్రమోదీ, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్ తదితరులు పర్యటించి, దీదీని రకరకాల విమర్శలు చేసి వాతావరణం వేడెక్కించారు. బెంగాల్‌పైన ఎందుకు దృష్టి పెట్టారు? సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమా జ్పార్టీ (బీఎస్పీ)ల ఎన్నికల పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి తమ పప్పులు ఉడకవని బీజేపీ నాయకత్వానికి తెలుసు. 2014లో గెలుచుకున్న 71 స్థానాలలో సగం దక్కితే ధన్యులమనుకునే పరిస్థితి. యూపీలో కోల్పోయే స్థానా లను బెంగాల్లో సంపాదించాలని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో జనాదరణ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ తర్వాత స్థానం బీజేపీదే. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి విజ యావకాశాలు లేవు. అందుకే ఇక్కడికి మాటవరుసగా పర్యటనకు వచ్చి ఒకట్రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెడతారు కానీ ఆంధ్రప్రదేశ్‌పైనా, చంద్ర బాబుపైనా దృష్టి కేంద్రీకరించే దండగమారి పని బీజేపీ అధినేతలు చేయరు. చంద్రబాబు తన అనుయాయులతో కుండల ప్రదర్శన చేయించినా, నల్ల బ్యాడ్జీలు ధరింపజేసినా, ‘మోదీ గోబ్యాక్’ అంటూ టీవీ చానళ్ళ కేమేరాల ముందు విచిత్ర విన్యాసాలు వేసినా, తానే స్వయంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఇదే గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు. భావి ప్రధాని అంటూ పొగిడారు. అనంతరం శాసనసభలో మోదీ అత్యున్నతమైన ప్రధాని అంటూ కీర్తించారు. వాజపేయి కంటే ఉన్నతుడనే విధంగా ప్రశంసల వర్షం కురిపించారు. వైఫల్యాలను ఒప్పుకుంటే మేలు అధికారంలో ఉన్నవారికి ఇది పరీక్షాసమయం. సాధించిన విజయాలు ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. వైఫల్యాలు ఉంటే ఒప్పుకోవాలి. దొంగలను ఉపే క్షించనంటూ, అందుకే ఈ చౌకీదార్‌ను ప్రజలు నియమించారంటూ పార్లమెంటు లోనూ, వెలుపలా మోదీ మిడిసిపడుతూ గంభీరమైన ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలు ప్రభావితులై మూకుమ్మడిగా మళ్ళీ బీజేపీకి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. లక్షల కొద్దీ ఉద్యోగాలను ఏన్డీఏ ప్రభుత్వం కల్పించిందంటూ ఎంత గట్టిగా మోదీ దబాయించినా ప్రజలు విశ్వ సించరు. అనుకున్న విధంగా ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాలేదో, స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొని రావడంలో ఎందుకు విఫలమైనారో, గోరక్షకుల హింసాత్మక ధోరణిని ఎందుకు అరికట్టలేకపోయారో సవినయంగా వివరిస్తే ప్రజలు మన్నిస్తారు. రంకెలు వేసినంత మాత్రాన వైఫల్యాలు విజయాలుగా మారవు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ప్రసంగాలు చేసినా, సీబీఐని దుర్వినియోగం చేయడం లేదంటూ ఎంత గట్టిగా చెప్పినా లాభం లేదు. ఈ విషయం ప్రస్తావించే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదు. చంద్రబాబు చరిత్రా అటువంటిదే. కాంగ్రెస్‌తో చేతులు కలిపి సీబీఐతో ప్రధాన ప్రత్యర్థి వ్యక్తిత్వహననం చేయడానికి ప్రయత్నించిన ఘనుడాయన. విపక్షానికి చెందిన ఎంఎల్ఏలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చరిత్ర ఆయనది. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ వ్యవ స్థకూ తాను నిధులూ, విధులూ వికేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయనకు ఇతరులను తప్పుపట్టే యోగ్యత ఉంటుందా? నామినేషన్లపైన వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు కట్టబెట్టే వారికీ, వారి ప్రయోజనం కోసమే అమరావతి నగర నిర్మాణం విషయంలో రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించినవారికీ ఇతరులను ప్రశ్నించే నైతికత ఉంటుందా? ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోదీ చంద్ర బాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం. అందుకు మోదీని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. ప్రధాని పర్యటలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. కానీ బీజేపీతో మొన్నటివరకూ అంటకాగిన టీడీపీ నిరసన ప్రదర్శనలు చేయడం విడ్డూరం. తమ స్వానుభవానికి విరుద్ధంగా నేతలు ఏమి చెప్పినా ప్రజలు విశ్వసించరు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి అది కనిపించదు. చుట్టూ ఉన్న వందిమాగధులు కనిపించనీయరు. ఇందిర ఘోరపరాజయం ఉదాహరణకు ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 19 మాసాలు దేశాన్ని నిరంకుశంగా ఏలిన తర్వాత అంతే అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేయాలనీ, రెండు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాలనీ ఆమె 1977 జనవరి 18న ప్రకటించారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోతుందని ఆనాడు అత్యధికులు ఊహిం చలేదు. అంతవరకూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి పరాజయం లేదు. చుట్టూ ఉన్నవారు అదే ఎన్నికలకు అనువైన సమయం అంటూ ఊదరకొట్టబట్టే ఆమె ఎన్నికలు జరిపించడానికి నిర్ణయించారు. జైళ్లలో బంధించిన వందలాదిమంది ప్రతిపక్ష నాయకులకు అనూహ్యంగా స్వేచ్ఛ లభించింది. ఎన్నికల ప్రచారానికి రెండు మాసాలే వ్యవధి. నిధుల సేకరణ సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎదురు నిలిచే సత్తా కలిగిన పార్టీ లేదు. ఆత్యయిక పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందిందనీ, ప్రతిపక్షాల ఆందోళనలను అరికట్టగలిగామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ ఇందిరాగాంధీ భావించారు. సంజయ్‌గాంధీకి పూర్తిగా పగ్గాలు అప్పగించాలా లేక అర్ధసింహాసనం ఇవ్వాలా అన్నదే ఆలోచన కానీ పరాజయం గురించి ఆమెకు చింత లేదు. తనకు పోటీ ఎవరున్నారు? ‘తాను తప్ప దేశానికి వేరే దిక్కు ఎవ్వరూ లేరని ఆమె గట్టిగా విశ్వసించింది,’ అంటూ ఇందిర మేనత్త కూతురు, ప్రఖ్యాత రచయిత నయనతార సెహగల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాటి ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇందిరాగాంధీపై రాజ్‌నారాయణ్ గెలుపొందారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను జైలు జీవితం కలిపింది. రైతు నాయకుడూ, భారతీయ లోక్‌దళ్ అధినేత చరణ్ సింగ్, జనసంఘ్ నాయకులు అడ్వాణీ, వాజపేయి, సోషలిస్టు నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రాజ్‌నారాయణ్, కరడుకట్టిన మితవాది, కాంగ్రెస్ (వో) నాయకుడు మొరార్జీ దేశాయ్ వంటి నానాగోత్రీకులను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క తాటిపైకి తెస్తారని ఎవరు ఊహించారు? మొరార్జీ దేశాయ్‌ని ప్రధానిగా వీరంతా అంగీకరిస్తారని ఎవరు కలగన్నారు? తనకు ప్రత్యామ్నాయం లేరని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడు అనుకున్నా అది శ్రుతిమించిన స్వాను రాగమే. ఇప్పుడు మోదీకీ, చంద్రబాబుకీ భజన చేసినట్టే అప్పుడు ఇందిరా గాంధీకి పత్రికలు ఊడిగం చేశాయి (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని పత్రికలు తప్ప). ఇందిరమ్మకు అన్నీ సకారాత్మక ఊహా చిత్రాలే కనిపించాయి. పరాజయ సూచనలు కానరాలేదు. అప్పటికింకా ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్ళు రాలేదు. ఇప్పుడు టీవీల హంగామా అధికారంలో ఉన్న వారిని భ్రమలలో ముంచెత్తు తుంది. ఆకాశవీధిలో విహరింపజేస్తుంది. నేల విడవకుండా నిజాయతీగా సాము చేసేవారిదే విజయం. -కె. రామచంద్రమూర్తి -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్‌సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్‌గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్‌ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్‌చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్‌రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్‌లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
పూటకో మాట.. రోజుకో బాట!
‘అసూయాపరులంతా ఒక్కటై రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. గద్దల్లా వాలు తున్నారు. అవినీతి గొంగళిపురుగును కేసీఆర్ కౌగలించుకున్నారు.’ ఇవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నోటినుంచి వెలువడిన మాటలు. ఎవరు అసూయపడుతున్నారు చంద్రబాబు నాయుడిని చూసి? నరేంద్రమోదీనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావా (కేసీఆర్)? వైఎస్ జగన్ మోహన్‌రెడ్డా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్స రాలూ, సువిశాల దేశానికి ప్రధానిగా సుమారు అయిదేళ్ళూ పని చేసిన రాజకీయ నాయకుడు మోదీ. చంద్రబాబును చూసి ఆయన ఎందుకు ఈర్ష్య పడాలి? 2019 ఎన్నికలలో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో, మోదీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణం చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రాబల్యం కలిగిన నేత మోదీ అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. తమ కంటే గొప్ప భాషాపరిజ్ఞానం కలిగిన వక్త చంద్రబాబును చూసి మోదీ, కేసీఆర్ అసూయ చెందుతున్నారా? ఆయన తమ కంటే సమర్థ పాలకుడనీ, పరిపాలనా దక్షుడనీ మోదీ, కేసీఆర్ అసూయతో రగిలిపోతున్నారా? తమ కంటే ఎక్కువ విశ్వనీయత ఉన్నదనీ, ప్రజాదరణ ఉన్నదనీ మోదీ, కేసీఆర్, జగన్మోహన్రెడ్డీ ఈర్ష్యతో కుమిలిపోతున్నారా? జీవితంలో పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయలేని టీడీపీ అధినేతను చూసి ఒంటరిగా పోరాడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిపైన ఇటీవలనే ఘనవిజయం సాధించిన కేసీఆర్ ఉడుక్కుంటారా? ఎవరు గద్దలో, ఎవరు సింహాలో ప్రజలకు తెలి యదా? జగన్మోహన్రెడ్డిపైన కేసులు ఎవరు పెట్టించారో, కాంగ్రెస్ నాయకుడు శంకరరావు వేసిన పిటిషన్లో ఎర్రన్నాయుడు ఎట్లా ఇంప్లీడ్ అయ్యారో ఎవరికి తెలియదు? అది బహిరంగ రహస్యం కాదా? సోనియాగాంధీ, చిదంబరంలతో చేతులు కలిపి బూటకపు కేసులు పెట్టించిన సంగతీ, జైలులో పెట్టించి బెయిల్ రాకుండా 16 మాసాలు మేనేజ్ చేసిన విషయం ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పక్క రలేదు. ఎవరు అవినీతి గొంగళి పురుగు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 1984 నుంచి 1995 వరకూ ఎన్టీఆర్ ‘నమ్మిన’ బంటుగా పనిచేసిన చంద్ర బాబుకి అవినీతికి ఒడిగట్టే అవకాశం ఉన్నదా లేక ఒక్కరోజైనా అధికారంలో లేకుండా, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో హైదరా బాద్‌కు రాకుండా బెంగుళూరులోనే తన మానాన తాను వ్యాపారం చేసుకుంటూ ఉన్న జగన్మోహన్రెడ్డికి అవకాశం ఉన్నదా? గుజరాత్, కర్ణాటక, రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఆర్థిక సహాయం చేయడానికి బాబుకు అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు ఊహించు కోలేరా? ఇవన్నీ అసహ్యించుకోవలసిన పనులే కానీ అసూయపడవలసిన ఘన కార్యాలైతే కాదు కదా! సంపద తప్ప ఏమున్నది చంద్రబాబు దగ్గర ఇతరులు ఈర్ష్యపడేందుకు? స్వవచోవ్యాఘాతాలు లెక్కలేనన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, స్వవచోవ్యాఘాతాలూ, అస త్యాలూ దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడి నోటి నుంచైనా వచ్చాయా? గతంలో కానీ వర్తమానంలో కానీ ఇన్ని యూ–టర్న్‌లు తీసుకున్న మరో రాజ కీయ నాయకుడు దేశ చరిత్రలో ఉన్నాడా? 1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామా జరి గినప్పుడు టీవీలు లేవు. ఉన్న నాలుగు పత్రికలూ చంద్రబాబు చెప్పుచేతలలో ఉండేవి. ఎన్‌టిఆర్‌కు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు పత్రికలలో కానీ రేడి యోలో కానీ వచ్చేవి కావు. అందుకనే సింహంలాంటి ఎన్టీఆర్‌ని బోనులో పెట్ట గలిగారు. ఇప్పుడు ఆ ఆట సాగదు. అబద్ధాలు అతకవు. మీడియాలో బహు ళత్వం ఉన్నది. నాణేనికి రెండో పార్శ్వం చూపించే పత్రికలూ, చానళ్ళూ ఉన్నాయి. టీవీలు వచ్చిన తర్వాత నేతలు మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు అవు తుంది. ఆ రికార్డులు న్యూస్‌చానళ్ళ లైబ్రరీలలో భద్రంగా ఉంటాయి. టీవీ తెర మీద ముఖకవళికలను కూడా వీక్షకులకు గమనిస్తారు. ఎవరు నిజం చెబుతు న్నారో, ఎవరు బొంకుతున్నారో ఇట్టే పసిగట్టగలుగుతారు. చంద్రబాబు ఈ రోజు ఏమి మాట్లాడినా అందుకు విరుద్ధంగా గత నాలుగు సంవత్సరాల ఎని మిది మాసాలలోనే మాట్లాడి ఉంటారు. టీడీపీలో అధ్యక్షులవారే అందరికంటే ఎక్కువ మాట్లాడతారు. జన్మభూమి కమిటీల నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ అన్ని విషయాలపైనా శ్రీవారే వ్యాఖ్యానిస్తారు. నిర్ణయాలు అప్పటికప్పుడే, అక్క డికక్కడే ప్రకటించేస్తారు. వ్యూహరచన చేస్తారు. ఎత్తుగడలు వేస్తారు. తక్కిన వారంతా ఆయన చెప్పినట్టు చేయవలసిందే. అందుకని ప్రతి పరిణామం పైనా చంద్రబాబు ‘బైట్’ ప్రతి టీవీ న్యూస్చానల్లోనూ ఉంటుంది. యజమానులకు ఇష్టం లేకపోతే చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు చూపించరు. అది వేరే విషయం. చూపించాలని అనుకున్న చానళ్ళ దగ్గర బోలెడు సామగ్రి ఉంటుంది. తాజాగా చంద్రబాబు నిగ్రహం కోల్పోవడానికి దారి తీసిన పరిణామం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కలుసుకొని ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం గురించి ప్రాథమిక చర్చలు జరపడం. దీనికి చంద్రబాబు వక్రభాష్యాలు చెప్పారు. రాష్ట్ర ద్రోహులు కుట్ర చేస్తున్నారంటూ నిందించారు. గద్దల్లా వాలుతు న్నారన్నది ఈ సందర్భంలోనే. ఈ విమర్శలకు సమాధానంగా ఆయన చర్యలను గుర్తు చేస్తే చాలు. నానారాష్ట్ర సందర్శనం ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యేక విమానంలో కోల్ కతా, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ వెళ్లి బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ప్రయ త్నాలు చేయడం గుర్తు చేయవచ్చు. ఆ పర్యటనలో చంద్రబాబు పోలవరం నిర్మా ణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసు కున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న స్టాలిన్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి ఆయనతో కరచాలనం చేసినప్పుడు రాహుల్‌ని ‘పప్పు’ అంటూ అవహేళన చేయడం, సోనియాను ఇటలీ రాక్షసి అంటూ నిందించడం చూపించవచ్చు. కేటీఆర్–జగన్మోహన్ రెడ్డిల భేటీని ఆక్షేపించినప్పుడు కేసీఆర్‌ని చంద్రబాబు కౌగలించుకున్న దృశ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిం చినప్పటి సన్నివేశం, హరికృష్ణ పార్థివదేహం ఉండగానే తెలంగాణ ఎన్నికలలో పొత్తు గురించి కేటీఆర్‌తో ప్రస్తావించిన వైనం సచిత్రంగా గుర్తు చేయవచ్చు. 2009 ఎన్నికలతో టీఆర్ఎస్తో కలసి మహాకూటమి నిర్మించడం, ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్‌ని తూలనాడటం గురించి చెప్పవచ్చు. అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభ్యంతరం లేదంటూ అనుచరుల కమిటీతో చెప్పించి, ఆ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో చేత తీర్మానం చేయించి, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసిన సంగతి దృశ్యసహితంగా చెప్పవచ్చు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్ హాజరైనప్పుడు ఆయనకు స్వాగతం చెప్పిన తెలుగు తమ్ముళ్ళ ఆనందోత్సాహాలను ప్రస్తావిం చవచ్చు. మోదీతో కుమ్మక్కు అయ్యారని విమర్శిస్తే, మోదీకి తిరుపతి లడ్టూల సంచీ అందిస్తూ అతివినయం ప్రదర్శించిన చంద్రబాబు దృశ్యం ఎన్ని విడత లైనా ప్రదర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రతి పక్ష నాయకుడు నాలుగున్నరేళ్ళుగా చేసిన పోరాటాల వివరాలు చెప్పవచ్చు. ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి ధన్యవాదాలు చెప్పడం, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్య వాదాలు చెబుతూ అసెంబ్లీతో తీర్మానం చేయించడం, ప్యాకేజీ ఇప్పించినందుకు వెంకయ్యనాయుడినీ, ఇచ్చినందుకు అరుణ్‌జైట్లీని ఘనంగా సన్మానించడం, హోదా సంజీవని కాదంటూ దబాయించడం, హోదా కోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానంటూ యువతను హెచ్చరించడం గుర్తు చేయవచ్చు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు సమాధానంగా 1995లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమి మాట్లాడారో, ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నారో పత్రికలలో రాయవచ్చు. టీవీలలో చూపించవచ్చు. తప్పించుకోలేరు. ‘బైట్స్’ క్షేమంగా ఉన్నాయి. కోల్‌కతాలో నారావారి భేరీ శనివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ‘యునైటెడ్ ఇండియా’ బహిరంగ సభకు మోదీనీ, బీజేపీనీ వ్యతిరేకించే నేతలలో చాలామంది హాజరైనారు. 2018 మార్చి వరకూ మోదీతో స్నేహం చేసిన చంద్రబాబు కూడా వెళ్ళారు. సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ వంటి యువకులు మోదీని విమర్శిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు. వారు మోదీతో అంటకాగలేదు. ప్రధానిగా మోదీ తప్పులు చేయలేదని కాదు. ఆయన ఒప్పులకుప్ప కాదు. కానీ విమర్శించేవారికి విశ్వసనీయత ఉండాలి. మోదీ వంటి అద్భుతమైన ప్రధాని ఈ దేశానికి చారిత్రక అవసరమని చంద్రబాబు అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన విషయం ఆయన విస్మరించవచ్చు కానీ ప్రజలు ఎట్లా మరచిపోతారు? అంతగా పొగిడి ఇప్పుడు కేవలం ప్రచారంపైన ఆధారపడిన ప్రధాని అనీ, పని బొత్తిగా చేయడం లేదనీ విమర్శిస్తే నప్పుతుందా? కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించడాన్ని ప్రస్తావిస్తూ, ఎంఎల్ఏలను పశువులను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారనీ, మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాలనీ చంద్రబాబు గర్జించారు. తన పనుపున తెలంగాణ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షల నగదు చెల్లిస్తూ కెమెరాకు చిక్కిన ఉదంతం ఫలితంగా పదేళ్ళు ఉండవలసిన హైదరాబాద్ నగరం నుంచి ఆకస్మికంగా నిష్క్రమించి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులతో సహా లేని అమరావతికి వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు తెలంగాణలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్పైన ధ్వజమెత్తిన సంగతి మరచి పోయారు. అందుకే తలసాని ఇటీవల విజయవాడ, ఏలూరు వెళ్ళినప్పుడు చంద్రబాబుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో గుణపాఠం నేర్చుకున్నా టీడీపీ అధినేత పరువు కృష్ణాలో కలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అడ్డగోలుగా, పశువుల కంటే హీనంగా కొనుగోలు చేశారు. రవ్వంత సంకోచం కానీ, పిసరంత బిడియం కానీ లేకుండా పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి, పంచాయితీలను నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ అస్మదీయులతో నిండిన జన్మభూమి కమిటీలకు అక్రమంగా అప్పగించిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేం దుకు ఉద్యమించాలంటూ పిలుపునిస్తే ఇదేం బూటకమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకోరా? ‘నన్ను మించిన నటుడు చంద్రబాబు,’ అంటూ జీవిత చర మాంకంలో గుండె పగిలి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకోరా? పెద్దనోట్లు రద్దు చేయాలని మోదీకి సలహా ఇచ్చింది తానేనంటూ గొప్పగా చెప్పు కున్న ముఖ్యమంత్రే అది ఘోరమైన తప్పిదమంటూ నిందించారు. ఒక ప్రధాని లేదా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉంటాయి. నిజాయితీపరుడైన నాయకుడైనా, విమర్శకుడైనా, సంపాదకుడైనా ఏమి చేయాలి? సదరు చర్య సత్ఫలితాలు ఇస్తుందని తాము కూడా ఆశిం చామనీ, అందుకే మొదట్లో స్వాగతించామనీ, అమలు క్రమంలో అది ఆర్థిక వ్యవస్థకు హానికరంగా పరిణమించిందనీ చెప్పాలి. తప్పు ఒప్పుకోవాలి. అంతటి నిజాయితీ ఎక్కడుంది? అటువంటి విలువలు ఎక్కడున్నాయి? గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) విషయంలోనూ ఇదే అవకాశవాద ధోరణి. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు స్వాగతించి ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత అదే పనిగా విమర్శించడం సీనియర్ రాజకీయ నాయకుడికి శోభ నిస్తుందా? అక్షరం బలి కోరుతుందని ప్రముఖ కవి అజంతా తరచూ అనేవారు. తన అనుభవానికీ, వయస్సుకీ, హోదాకీ తగినట్టు ఆచితూచి మాట్లాడితే చంద్రబాబు మరింత నవ్వులపాలు కాకుండా మర్యాద కాపాడుకుంటారు. వైఖరి మార్చుకోవాలో లేక ఇదే విధంగా ముందుకు సాగిపోవాలో నిర్ణయిం చుకోవలసింది ఆయనే. కె. రామచంద్రమూర్తి -
రైతన్నలు గెలిచేదెలా?
ఈ దేశంలో రైతు జీవితం దుర్భరం. 1995 నుంచి రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. వ్యవస్థీకృతం కాని వ్యవసాయరంగంలో ఎంత సంక్షోభం నెలకొన్నా ఉద్యమాలు రగలవు. రైతులు ప్రదర్శన చేశారంటే వారిలో సహనం పూర్తిగా నశించిందని అనుకోవాలి. కొన్ని మాసాలుగా దేశంలో రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. మహారాష్ట్రలో వేలాదిమంది రైతులు 160 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ముంబయ్ చేరుకొని నిరసన ప్రదర్శన చేశారు. తమిళనాడు రైతులు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదనే వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు మెడలో పుర్రెల దండలు వేసుకొని, నోళ్ళతో సజీవంగా ఉన్న ఎలుకలను పట్టుకొని వినూ త్నంగా ప్రదర్శన చేశారు. వైద్యులూ, లాయర్లూ, టీచర్లూ, వివిధ రంగా లకు చెందిన యువతీయువకులు భోజనాలూ, నీళ్ళూ సరఫరా చేయడం ద్వారా ఢిల్లీ వీధులలో ఊరేగింపు జరిపిన వేలాదిమంది రైతులకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు మాఫ్ చేయాలనీ, కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ను న్యాయంగా నిర్ణయించాలనీ, పెట్టుబడికి సాయం చేయాలనీ వారు ఉద్ఘోషించారు. 2019 ఎన్నికలలో గెలుపొందాలంటే రైతులను శాంతింపజేయడం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకీ స్పష్టంగా తెలుసు. రైతులకు ఏ రకమైన సహాయం చేయాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాలి. అందుకే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు సమీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. కేంద్రానికీ, ఆర్బీఐకీ మధ్య వివాదం తలెత్తడానికి ఇదే ప్రధాన కారణం. తమకు నిధుల నిల్వలు ఉండాలనీ, ప్రభుత్వానికి ఇవ్వలేమనీ ఆర్బీఐ గవర్నర్లు వాదిస్తున్నారు. అంతలేసి నిధులు ఆర్బీఐలో మూలుగుతూ ఉండటం ఎందుకనీ, వాటిని సర్క్యులేషన్లో పెట్టాలనీ, అభివృద్ధికోసం ఖర్చు చేయాలనీ (సంక్షేమం అనడం లేదు) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెబుతున్నారు. ఈ వాదనతో వేగలేకనే ఆర్థికవేత్త ఊర్జిత్పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్ ఎంతకాలం పదవిలో ఉంటారో తెలియదు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని రఘురాంరాజన్ వంటి ఆర్థికవేత్తలూ, మాజీ గవర్నర్లూ ప్రబోధిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతోంది. అందుకే మాజీ గవర్నర్ బిమల్‌జలాన్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. కనీస నిల్వలు ఏ మేరకు ఉంటే ఆర్బీఐకి ఇబ్బంది ఉండదో నిర్ణయించ వలసిందిగా ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. నయానో, భయానో ఆర్బీఐ నుంచి నిధులు సేకరించినప్పటికీ వాటిని రైతులకు ఏ రూపంలో, ఏ పథకం కింద అందజేయాలో మోదీ ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్థికంగా శక్తికి మించిన భారంగా కాకుండా, రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండే పథకం కోసం అన్వేషణ కొంతకాలంగా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణలను విశ్వసించే ప్రవీణులు రైతుల రుణాలను మాఫ్ చేయడాన్ని ఆమోదించరు. వైఎస్ రాజ శేఖరరెడ్డి ఒత్తిడి చేయడం వల్ల 2004లో ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణ మాఫీకి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ కష్టం మీద ఒప్పుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ. 77 వేల కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫ్ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన మోదీ ఆచరణలో చేయవలసినంత చేయలేకపోయారు. 22 పంటలకు పెట్టుబడిపైన ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటించానంటూ శని వారంనాడు ఉత్తరప్రదేశ్ ఘాజీబాద్ బహిరంగసభలో మోదీ చెప్పారు. కానీ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో డాక్టర్ స్వామినాధన్ సూచించిన పద్ధతిని అనుసరించలేదు. పెట్టుబడి వ్యయం అంటే కేవలం విత్తనాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాల ఖర్చు మాత్రమే కాదు. ఆ ఖర్చుతోపాటు పొలంలో పని చేసే వ్యక్తులందరి వార్షిక వేతనాలనూ, పొలం అద్దెకు (కౌలుకు) ఇస్తే సాలీనా ఎంత ఆదాయం వస్తుందో ఆ మొత్తాన్నీ, పంట బీమాకోసం చెల్లించవలసిన మొత్తాన్నీ కూడితే వచ్చే మొత్తానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాధన్ చెప్పారు. అది జరగలేదు. కేసీఆర్ మోడల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం రెండు లక్షల మేరకు రుణం మాఫ్ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విస్తృత ప్రచారాన్ని రైతులు విశ్వసించడమే. అధికారంలోకి వచ్చిన పది రోజులలో రుణాలు మాఫ్ చేస్తానంటూ రాహుల్ వాగ్దానం చేశారు. అన్నట్టుగానే మూడు రాష్ట్రాలలో కొత్త ముఖ్యమంత్రులు కమల్‌నా«ద్, భూపేశ్ బఘేల, అశోక్ గహ్లోత్‌లు రుణాలు మాఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులను సుముఖం చేసుకోవడం ఎన్డీఏకి అత్యవసరం. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పాలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేసినట్టు పెట్టుబడి సాయం అందజేయాలా? స్వామినాధన్ చెప్పినట్టు రైతు పెట్టుబడి పోగా యాభై శాతం లాభం మిగిలే విధంగా మద్దతు ధర నిర్ణయించి, మద్దతు ధరకూ, మార్కెట్ ధరకూ ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లించాలా? కేంద్ర రాష్ట్రాలు కలసి భర్తీ చేయాలా? రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్న మోదీని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుసుకున్నారు. నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోగా అంత భారీ మెజారిటీలతో అన్ని సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలవడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, అన్ని పార్టీల నాయకులకూ ఉండటం సహజం. బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 వరకూ మోదీతో కేసీఆర్ సమావేశమైనారు. ఇతర విషయాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ చెప్పింది ఆలకించిన వెంటనే మోదీ రంగంలో దిగారు. అదే రోజు రాత్రి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌లను పిలిపించుకొని సుదీర్ఘ సమాలోచన చేశారు. మర్నాడు ప్రధాని కార్యాలయం (పీఎంవో) సంబంధిత శాఖల అధికారులను సమ న్వయం చేసి అభిప్రాయాలు సేకరించింది. కసరత్తు జరుగుతోంది. వాగ్దానం చేయగానే సరిపోదు రుణమాఫీ ప్రకటించడం సులువే. అమలు కష్టం. తెలంగాణలో వాయిదాలలో రుణాలు ప్రభుత్వం తీర్చింది. ఒకేసారి మాఫ్ చేస్తే బాగుండేదని రైతుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అంత మొత్తం సిద్ధంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అన్యాయం. 2014 జూన్8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు రైతులపైన ఉన్న రుణభారం రూ. 87,612 కోట్లు. అంత భారీ రుణం తీర్చే స్థోమత కొత్త రాష్ట్రానికి ఉండదనే ఉద్దేశంతో రుణమాఫీ వాగ్దానం చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకోచించారు. చంద్రబాబు నిస్సంకోచంగా వాగ్దానం చేసి గెలిచాక ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించడానికి అనేక అడ్డదారులు తొక్కవలసి వచ్చింది. అర్హతపైనా, చెల్లింపులపైనా పరిమితులు విధించి దాన్ని రూ. 24 వేల కోట్లకు కుదించారు. అంటే, వాగ్దానం చేసిన మొత్తంలో నాలు గింట ఒక వంతుకు తగ్గించారు. అది కూడా వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకూ మూడు విడతలలో చెల్లించిన మొత్తం రూ. 15,147 కోట్లు మాత్రమేనని చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. ఈ సంవత్సరం వాయిదా ఇంతవరకూ చెల్లించలేదు. కొత్తగా కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన మూడు హిందీ రాష్ట్రాలలో కూడా రైతుల రుణాలు మాఫ్ చేయాలంటే ఖజానాలో డబ్బు లేదు. బయటి నుంచి అప్పు తీసుకొని తీర్చవలసిందే. ఉదాహరణకు, రాజస్థాన్‌లో 2018–19 బడ్జెట్ వ్యయం మొత్తం రూ. 1,07, 865 కోట్లు. అందులో 70 శాతం నిధులు వసుంధరే రాజే ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతుల రుణాలు మొత్తం రూ. 18 వేల కోట్లు. ఈ మొత్తం రుణాల మాఫీకి కేటాయిస్తే రాష్ట్ర సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత ఏడు మాసాలలోనే నాలుగింట మూడు వంతుల బడ్జెట్ బీజేపీ ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అందుకే నిష్క్ర మించేముందు బీజేపీ ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేశాయంటూ కమల్‌నాథ్, గహ్లోత్ ఆరోపించారు. కేరళ ప్రయోగం రుణమాఫీకి మోదీ సుముఖంగా లేరని ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌పైన చేసిన విమర్శ స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ రుణ మాఫీ పేరుతో రైతులకు లాలీపాప్‌లు ఇచ్చి మోసం చేస్తున్నదనీ, అబద్ధాలు చెబుతున్నదనీ మోదీ ధ్వజమెత్తారు. ఏదో ఒక రూపంలో రైతులకు సాయం చేయవలసిన అవసరం మాత్రం ఉంది. 2006 కేరళ రైతుకు నరకం చూపించిన సంవత్సరం. కేరళలో వాణిజ్య పంటలు అధికం. రబ్బర్, మిరియం పండించి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ సంవత్సరం అంతర్జాతీయ విపణిలో ఈ రెండు పంటల ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులపైన అప్పుల భారం పెరిగింది. దాదాపు 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన రైతుల భార్యలతో ఢిల్లీలో జరిగిన ఊరేగింపునకు ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్ నాయకత్వం వహించారు. అప్పుడే యూడీఎఫ్ ప్రభుత్వం నిష్క్రమించి అచ్యుతానందన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ సర్కార్ ప్రవేశించింది. వామపక్ష ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్‌ను ఆయన కేరళ ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడిగా నియమించి రైతు సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. మన రాష్ట్రాలలో వలె కాకుండా కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ సుస్థిరంగా ఉంది. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాల విమోచన కమిషన్‌ను నియ మించింది. రైతు ప్రతినిధులూ, వ్యవసాయరంగ నిపుణులూ, సామాజిక కార్య కర్తలూ, రాజకీయ నాయకులూ కలసి బృందాలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి, రుణగ్రస్తులైన రైతులతో, వారికి రుణాలు ఇచ్చిన సహకార బ్యాంకుల అధికారులతో సమాలోచనలు చేసి ఏ మేరకు మాఫ్ చేయాలో అక్కడికక్కడే నిర్ణయించేవారు. సహకార బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళకు వెళ్ళి వడ్డీ వ్యాపారులలాగా అవమానించరు. బృంద సభ్యులు రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ చొరవ ఫలితంగా బలవన్మరణాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ అమలు చేస్తున్న పథకం చూసి జార్ఖండ్ ప్రభుత్వం కూడా రైతుబంధును పోలిన పథకం డిసెంబర్ 21న ప్రవేశపెట్టింది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తొలి బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. ఆ మర్నాడు ఒడిశా ప్రభుత్వం రైతుబంధులో స్వల్ప మార్పులు చేసి కొత్త పథకం ప్రకటించింది. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. భూమి ఎవరి పేరున ఉంటే వారి పేరనే చెక్కు ఇస్తున్నారు. భూమిపైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎనిమిది వేల చొప్పున చెల్లిస్తున్నారు. రుణభారంతో వేగలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో దాదాపు 75 శాతం కౌలు రైతులే. అటువంటి రైతులు తెలంగాణలో 15 లక్షల మంది ఉంటారని అంచనా. భూమి యజమానికీ, కౌలురైతుకీ మధ్య ప్రభుత్వం ఒక వారధిగా ఉంటూ యాజ మాన్య సమస్య ఉత్పన్నం కాకుండా, యజమానికి అభద్రతాభావం లేకుండా కౌలురైతుకు బ్యాంకు రుణాలు అందేవిధంగా, రైతుబంధు వంటి పథకం వర్తించే విధంగా ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టవలసిన బాధ్యత ఉన్నది. రైతు బంధు నమూనాను అమలు చేయాలని మోదీ తలపెట్టిన ట్లయితే ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నిజంగా రుణగ్రస్తులైనవారిని ఆదుకున్నట్టు అవు తుంది. పంట దిగుబడికి గిట్టుబాటు ధర చెల్లించడంతో పాటు ప్రాసెసింగ్ వ్యవస్థనూ, మార్కెటింగ్ సదుపాయాలనూ కల్పించగలిగితే రైతులు గౌరవ ప్రదంగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.37లోని దసపల్లా హోటల్లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు. -
విజయోత్సవంలో అపశ్రుతులేల?
చర్విత చర్వణమే అయినప్పటికీ తప్పు జరుగుతున్నప్పుడు ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. బధిరశంఖారావమైనా కళ్ళ ఎదుట జరుగుతున్న ఘోరాన్ని ఎత్తిచూపకపోవడం నేరం. అంచనాలకు మించిన విజయం సాధించిన తర్వాత పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రోత్సహించరనే ఆశ అడియాసై వెక్కిరిస్తున్నది. పార్టీ ఫిరాయించిన వారు సిగ్గుపడకుండా సగర్వంగా తిరుగాడుతున్నారు. ఎన్నికల తతంగం ముగిసి రెండు వారాలు కాలేదు. శాసనసభ్యులుగా ప్రమాణం చేయలేదు. అప్పుడే ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరి పోయారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మిం చేందుకు నడుం బిగించిన కేసీఆర్‌ను చూసి గర్వించాలో లేక విందు ఆరగించిన వెంటనే చిరుతిండ్లకు ఆశపడుతున్నందుకు నిందించాలో తెలియని పరిస్థితి తెలంగాణ ప్రజలది. మొత్తం 119 స్థానాలలో సొంతంగా 88 స్థానాలు గెలుచుకు న్నారు. మిత్రుడిగా చెప్పుకునే అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం ఏడు స్థానాలు కైవసం చేసుకున్నది. గతంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతున్నదనే అనుమానంతో ఎడాపెడా ఫిరాయింపులకు తెరలేపినప్పుడు అనేకులం ఆక్షేపించాం. అయినా బాధ్యులెవరూ పట్టించుకోలేదు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్‌లు పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్లో చేరినప్పుడే వారిపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు మహజరు సమర్పించుకొని ఏడాదిన్నర గడిచిపోయింది. స్వామిగౌడ్ స్పందించ లేదు. ఆకుల లలిత కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతుతో మండలి సభ్యురాలుగా గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు టిక్కెట్టు ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టి గౌరవిస్తే ఓడిపోయిన పది రోజులకే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఏ రాజనీతి కిందికి వస్తుంది? లలిత, సంతోష్‌కుమార్‌లు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని, లోగడ ఎప్పుడో ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్న దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌లను కలుపుకొని కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ నిర్వహించుకున్నామనీ, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించామనీ తెలియజేస్తూ లేఖ సమర్పించిన క్షణాలలో సభా ధ్యక్షుడు స్వామిగౌడ్ స్పందించడం, కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించడం, శనివారంనాడు గెజెట్నోటిఫికేషన్ విడుదల చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తున్న పరిణామాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్వామిగౌ డ్కు ఇది శోభాయమానమైన పరిణామం కాదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అదే సభాధ్యక్షుడిని కలుసుకొని ఫిరాయించిన సభ్యులపైన వేటు వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, దాన్ని స్వామిగౌడ్ స్వీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా తయారైనదో, ఎంత హాస్యాస్పదంగా మారిందో, ఎంత కపటంగా దిగజారిందో సూచిస్తున్నది. పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది పార్టీని చీల్చాలని తీర్మానిస్తే వారి సభ్యత్వం గల్లంతు కాకుండా ప్రత్యేక గ్రూపుగా పరిగణించవచ్చు. కానీ పార్టీ విలీనం కావా లంటే మరికొన్ని అదనపు ప్రక్రియలు అవసరం. మనకున్నది ఒకటే రాజ్యాంగం. పార్టీ ఫిరాయించినవారిపైన సభాపతులు అనర్హత వేటు వేయాలని చెబుతున్నది అదే రాజ్యాంగం. 1985లో రాజీవ్‌గాంధీ, 2003లో అటల్‌బిహారీ వాజపేయి చొరవ తీసుకొని తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం, దాని సవరణ ఫిరాయిం పుల నిరోధానికి ఉద్దేశించినవి. ఏ రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అనుసరించి మన నేతలు అధికారంలోకి వచ్చారో అదే రాజ్యాంగంలో ఉన్న ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అధికారానికి గులాములు ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్టుపైన గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చానాగేశ్వర రావు సైతం కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రజాస్వామ్య ప్రియులకు బాధ కలిగిస్తాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో నగదు అందజేస్తూ కెమేరాకు చిక్కిన రేవంత్‌రెడ్డిని చేర్చుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో గౌరవించిన కాంగ్రెస్ పార్టీనీ ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నాయకులు అదే కేసులో నిందితుడైన సండ్రను తమ పార్టీలోకి ఎట్లా ఆహ్వా నిస్తారో చూడాలి. ఈ సారి టీడీపీతో కూటమి కట్టి వ్రతం చెడినా ఫలం దక్కని కాంగ్రెస్ పార్టీకి చిక్కినవి కేవలం 19 స్థానాలు. అప్పుడే కాంగ్రెస్ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారనీ, దూకడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. తొమ్మిదిమంది ఎంఎల్ఏలను కొనుగోలు చేయగలిగితే శాసనసభలో కాంగ్రెస్ బలం పదికి పడిపోతుంది. ప్రతిపక్ష హోదా సైతం దక్కదు. ఆ విధంగా కాంగ్రెస్‌ను ‘బొంద పెట్టాల’ని కేసీఆర్ నిర్ణయించుకున్న ట్టున్నారు. ఎందుకంటే సోనియాగాంధీ హాజరైన ఎన్నికల సభలో ఉత్తమకుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ని ‘బొంద పెట్ట’వలసిందిగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసు. అదే ప్రజల నిర్ణ యాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతున్న శాసనసభ్యులను ఎంత అవహేళన చేసినా, ఎంత నిందించినా తక్కువే. కొనుగోలు చేయడం అంటే కేవలం రొక్కం ఇచ్చి కొనడం కానవసరం లేదు. పదవి ఆశతోనో, మరే ఇతర ప్రలోభాలతోనో పార్టీ ఫిరాయించినవారు అమ్ముడు పోయినట్టే లెక్క. రోషం ఉన్న వారైతే చీటికీ మాటికీ పార్టీలు మారరు. విలువలకు పాతరేసి కేవలం అధికారానికి గులాము లుగా వ్యవహరించేవారిని ప్రజాప్రతినిధులంటూ గౌరవించడం పొరపాటు. కొత్త శాసనసభ నిర్మాణం జరగడానికి ముందే దొంగ చూపులు చూసే వారినీ, అడ్డదారులూ తొక్కేవారినీ ఏమని నిందించినా తప్పులేదు. నైతికత ఎవరికుంది? ప్రశంసార్హమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకూ, సుస్థిరమైన పరి పాలనను అందజేస్తున్నందుకూ, శాంతిభద్రతలనూ పరిరక్షిస్తున్నందుకూ అభి నందనలు అందుకుంటూ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన ప్రభావం వేసేందుకు జైత్రయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంలో చట్టసభలలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న పంతంతో రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడం వంటి అపస్వరం అవసరమా? ఇదంతా రాబోయే లోక్‌సభ ఎన్ని కలలో అనుకున్నది సాధించేందుకే అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తినిన కాంగ్రెస్‌ను చావగొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్షం లేకపోతే అది చట్టసభ అనిపించుకుంటుందా? దౌర్భాగ్యం ఏమంటే ఏ పార్టీ సభ్యులు ఫిరాయించినా వారిని మందలించే నైతిక అధికారం ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా అడ్డగోలుగా సాగించిన కాంగ్రెస్ పార్టీకి లలితను కానీ, సంతోష్‌కుమార్‌ను కానీ తప్పు పట్టే నైతిక హక్కు ఉండదు. రేపు ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలు టీఆర్ఎస్లో చేరిపోయి టీడీపీఎల్పీని రద్దు చేస్తే ఆక్షేపించే అధికారం టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడికి ఉండదు. తలసాని శ్రీనివాసయాదవ్ 2014లో టీడీపీ టిక్కెట్టు పైన గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు హైదరాబాద్ వచ్చి హుంకరించిన చంద్రబాబు స్వయంగా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను కొనుగోలు చేసిన తర్వాత పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎంఎల్ ఏలను కానీ, ఎంఎల్సీలను కానీ మందలించే నైతిక స్థాయి కోల్పోయారు. జాతీయ స్థాయిలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రశ్నించే నాధులు లేరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అడపాదడపా ఖేదం వెలి బుచ్చుతూ ఉంటారు కానీ చట్టంలో ఉన్న లోపాన్ని సవరించాలని ప్రధాన మంత్రికి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మనస్తాపం వెలిబుచ్చుతున్న ఏకైక జాతీయ నాయకుడిగా ఆయనను చెప్పు కోవాలి. అంతవరకూ మెచ్చుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ విష యంలో నిరపరాధి కారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అనారోగ్యం కారణంగా పదవీబాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం బీజేపీ జాతీయ నాయకత్వం చేయలేకపోతోంది. ఎందు కైనా మంచిదని ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను కొనుగోలు చేసి వారిని విమా నంలో ఢిల్లీకి రప్పించుకొని కాషాయ కండువాలతో సత్కరించారు. అటువంటి పార్టీ నాయకులకు ఇతర పార్టీలకు చెందినవారిని ఆక్షేపించే అర్హత ఏముంటుంది? జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఫిరాయింపులను ప్రశ్నించడం మానుకున్నాయి. టీఆర్పీ రేటింగులు రావనో, అధికారంలో ఉన్న పార్టీని దుయ్యపట్టడం ఎందుకనో తెలియదు. ఎన్డీటీవీ, ఇండియా టుడే వంటి చానళ్ళు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో యధేచ్ఛగా సాగిన ఫిరాయింపులను ఆక్షేపించలేదు. ఢిల్లీలో చిన్న ఘటన జరిగినా, కేజ్రీవాల్ తుమ్మినా, దగ్గినా రోజంతా కథనాలు నడిపే చానళ్లు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 50 మంది ఎంఎల్ఏలు ఫిరాయించినా, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు కట్టబెట్టినా అదేమని అడిగిన పాపాన పోలేదు. న్యాయస్థానాలు ఫిరాయింపుల చట్టాన్ని అక్షరాలా పాటిస్తున్నారే కానీ అందులోని స్ఫూర్తిని పట్టిం చుకోవడం లేదు. సభాపతి నిర్ణయమే ఖరారనీ, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనీ 91 రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. సభాపతులపైన అటువంటి గురుతరమైన బాధ్యత పెట్టడం, అంతటి విశ్వాసం వారిపైన ఉంచడం నాటి పార్లమెంటు చేసిన పొరబాటు. దాన్ని సవరించుకోవాలనే సదు ద్దేశం ఎన్డీఏ నాయకత్వానికి ఉంటే అవసరమైన మెజారిటీ ఉన్నది. ఆ ఉద్దేశమే లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ద్రోహం చేసి నట్టే భావించాలి. తడబాటు లోగుట్టు ఇది ఇలా ఉంటే, చంద్రబాబునాయుడు తనకు తోచిన విధంగా ముందుకు పోతున్నారు. 2004లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నట్టే ఇప్పుడు ఎన్నికలు నాలుగు మాసాలు కూడా లేని తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారట. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమట. ఉత్తరాంధ్ర రైల్వే జోన్‌కోసం తన పార్టీ ఎంపీలు పోరాడుతున్నారంటూ శ్రీకాకుళం ‘ధర్మపోరాటం’ సభలో ఊదరగొట్టారు. నాలుగేళ్ళు బీజేపీ పరిష్వంగంలో మైమరచి ప్రత్యేక హోదా అడగలేదు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీ కాదంటే జైళ్ళలో కుక్కుతానంటూ ప్రతిపక్ష సభ్యులనూ, నిరసనకారులనూ బెదిరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. సింగపూరును కలవరించి అమరావతిని డిజైన్ స్థాయి దాటకుండా గ్రాఫిక్స్‌తో ప్రజలను అలరిస్తున్నారు. సింగపూరు సినిమా చూపిం చడానికి ఒక థియేటర్ సైతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని ప్రయత్ని స్తున్నారు. బయోస్కోప్ చూపించి మరోసారి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో వ్యూహం బెడిసి పరువు మూసీలో కలి సినా హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం వెనుక తన కృషి ఉన్నదని చాటుకుంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌కి చేసిన మేలు ఏమిటంటే ఆ మూడు రాష్ట్రాలలో అడుగుపెట్టకపోవడం. తెలంగాణలో ప్రవేశించకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి మరో పది స్థానాలైనా దక్కేవని పరి శీలకుల అభిప్రాయం. తన మనుషులపైన కేంద్ర సంస్థలతో దాడులు చేయి స్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీని ‘కోడికత్తి’ పార్టీ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆపలేదు. ఆయన మానసిక స్థితికి ఇది నిదర్శనం. తెలం గాణ దెబ్బతో మనోవ్యాధి మరింత ముదిరింది. చంద్రబాబు ధోరణికి భిన్నంగా కేసీఆర్ ఆగమేఘాల మీద దూసుకుపోతున్నారు. తెలంగాణలో సాధించిన అఖండ విజయం ఆయనకు కొత్త కాంతి ప్రసాదించింది. ఉరవడి పెరిగింది. కుమారుడికి పార్టీ పెత్తనం అప్పగించారు. మంత్రి వర్గ నిర్మాణం పూర్తి కాకుండానే ఫెడరల్ యాత్ర ఆరంభిస్తున్నారు. పెరిగిన ప్రతి ష్ఠతో ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకోబోతున్నారు. ఎన్నికలకు ముందు జరిపిన యాత్రకీ, ఈ రోజు ప్రారంభం కానున్న యాత్రకూ తేడా ఉన్నది. అప్పటి కంటే ఇప్పుడు హెచ్చిన ఉత్సాహంతో అడుగు ముందుకు పడు తోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి ఎంత బలహీనమైతే కేసీఆర్ నిర్మి స్తున్న ఫ్రంట్‌కు అంత బలం పెరుగుతుంది. ఎన్డీఏ కాకుండా రెండు కూట ముల నిర్మాతలూ తెలుగు నాయకులు కావడం, వారిలో ఒకరు ఇటీవల ఘన విజయం సాధించడం, మరొకరు పరాజయం చవిచూడటం విశేషం. ఇద్దరు చంద్రులలో ఒక్కరే ప్రకాశిస్తారు. ఇద్దరూ ప్రకాశించడానికి అవకాశం లేదు. ఒకరు క్షీణచంద్రుడైతే మరొకరు పూర్ణచంద్రుడు అవుతారు. ప్రస్తుతానికి తెలం గాణ చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో స్పష్ట మైన పరాజయ సంకేతాలూ, అటు జాతీయ స్థాయిలో పరాభవ సూచనలూ చంద్రబాబును వేధిస్తున్నాయి. అందుకే మాటపైన అదుపు తప్పుతోంది. కె. రామచంద్రమూర్తి -
కేటీఆర్ చేతిలో స్టీరింగ్
ఇందిరాగాంధీ, ఎన్‌టి రామారావు, అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్ఎస్ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు. ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్ నాయ కులు స్థాయి మరచి టీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు. కేసీఆర్ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్ నొక్కారు. టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఫలించిన కేసీఆర్ వ్యూహం ఏ ఫలితం ఆశించి కేసీఆర్ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్టిఆర్ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్ఎస్ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు. ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్ అభ్యర్థులకు జరగలేదు. చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్ఠానం దూతగా అశోక్ గహ్లోత్ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్‌కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్‌సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. కేటీఆర్‌కి ఉన్నత పదవి ఇదే మంచి సమయం అనుకొన్న కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్‌దే. మరో యువ నాయకుడు హరీష్‌రావు అవిభక్త మెదక్ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్ఎస్ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు. కేటీఆర్ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్‌కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్‌లో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్‌ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్‌కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్ఎస్తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్‌కూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు. మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్‌లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకే ఫ్రంట్‌లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఉపకరించవచ్చు. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్‌కు ఉండదు. వీపీ సింగ్ ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్ లాగా కాంగ్రెస్ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే, అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. కాంగ్రెస్‌కు కొత్త కళ ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది. మాయావతి, అఖిలేశ్ సహకారంతో మధ్యప్రదేశ్‌లో అందలం ఎక్కబోతోంది. పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్ బొటా బొటి మార్కులతో పాస్ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్‌కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్‌కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్‌సింహ్ చౌహాన్, రమణ్సింగ్ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ, కాంగ్రెస్ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నిర్ణయించి, పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్‌కు పంపించారు. కమల్‌నాథ్ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్‌కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్ ముఖ్యమంత్రిగా, సచిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నా«ద్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు. ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది. మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్‌కు ఆక్సిజెన్ అందించింది. రాహుల్ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?
శుక్రవారం పోలింగ్‌తో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ చరమాంకంలోకి వచ్చింది. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. పోలింగ్ రోజు సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూస్తే సంబరాలు జరుపుకునే స్థితిలో ఏ పార్టీ ఉండబోదని అనిపిస్తున్నది. రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోతుందనీ, కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందనీ సర్వే చేసిన సంస్థలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ఫలితాలలో సైతం పెద్దగా వ్యత్యాసం ఉండదు. మిజోరంలో మిజోనేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 18 స్థానాలు గెలుచుకొని, ఇండిపెండెంట్ల సహకారంతో కాంగ్రెస్‌ను గద్దె దింపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారంలో కొనసాగుతుందని అత్యధికుల అంచనా. ఒకే పార్టీ, ఒకే ముఖ్యమంత్రి మూడు విడతలు ఎన్నికై పదిహేనేళ్ళు పరిపాలించిన తర్వాత వారి పట్ల ప్రజలలో విముఖత ఏర్పడితే ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖియా రమణ్‌సింగ్ ఎంత ప్రజారంజకంగా పరిపాలించినా సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల వారంటే ప్రజలకు మొహం మొత్తుతుంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లు, కాంగ్రెస్ 109 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదనీ, బీఎస్పీకి రెండు స్థానాలు లభించవచ్చుననీ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల సగటు సూచిస్తున్నది. మూడు విడతలు గెలిచిన పార్టీని నాలుగోసారి సైతం ఖాయంగా ఓడిస్తామని ఘంటాపథంగా చెప్పలేని అసమర్థత కాంగ్రెస్‌దీ, దాన్ని పట్టిపల్లార్చుతున్న బహునాయకత్వానిదీ. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ రావచ్చునని సర్వేక్షకులు అంటున్నారు. వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ తరఫున తొలి ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పరిపాలించిన అజిత్‌జోగీ పార్టీ అధిష్ఠానంపైన అలిగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ) పేరుతో సొంత కుంపటి పెట్టు కున్నారు. సీజేసీ, బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ), సీపీఐ కలిసి ఒక కూట మిగా ఏర్పడినాయి. ఎగ్జిట్‌పోల్స్ సరాసరి చూసినట్లయితే 90 స్థానాలు కలిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బీజేపీకి 41, కాంగ్రెస్‌కి 42 స్థానాలు లభిస్తాయి. జోగీ కూటమికి నాలుగు స్థానాలు వస్తాయని అంచనా. 46 మంది ఎంఎల్ఏలు ఏ పక్షంతో ఉంటే దానిదే అధికారం. కాంగ్రెస్, జోగీ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. జోగీ కాంగ్రెస్‌వైపు మొగ్గుతారో, బీజేపీనే నయం అనుకుంటారో తెలియదు. ముగ్గురు ఇండిపెండెంట్లు ఎవరిని బలపరుస్తారో చూడాలి. మొత్తం మీద జోగీ కింగ్ కానీ, కింగ్ మేకర్ కానీ కావచ్చు. రాజస్థాన్‌లో 1993 నుంచి ఇంతవరకూ అయిదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారీ ప్రజలు అధికారపార్టీని ఓడించి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఈ రాష్ట్రంలో ప్రధానంగా పోటీ. 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో ఈసారి బీజేపీకి 78 స్థానాలు మాత్రమే దక్కుతాయనీ, కాంగ్రెస్ 110 స్థానాలు గెలుచుకుంటుందనీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏ మాత్రం సందేహం లేకుండా కాంగ్రెస్ ఆధిక్యం సాధిస్తుందని చెప్పగలుగుతున్న ఒకే ఒక రాష్ట్రం రాజస్థాన్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన పదకొండు సంస్థల ఫలితాల సగటు పరిశీలిస్తే టీఆర్ఎస్కు 67 సీట్లు వస్తాయని తేలుతోంది. ప్రజా కూటమికి 39, బీజేపీకీ 5 రావచ్చునంటున్నారు. 119 మంది సభ్యులు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 61 మంది ఎంఎల్ఏలు ఉన్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీపోలింగ్ అవసరం రాకుండా, హింసకు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు దోహదపడిన డీజీపీ మహేందర్ రెడ్డిని, పోలీసు యంత్రాంగాన్ని అభినందించాలి. టీఆర్ఎస్కే పట్టం తెలంగాణ అతి పిన్న రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలలో ఆరాధనాభావం ఉన్నది. ఆగ్రహం సైతం ఉన్నది. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ విశేష ప్రయత్నం చేసింది. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)నీ, సీపీఐనీ కలుపుకొని ప్రజా కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ఆజన్మ విరోధి అయిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని కూటమిలోకి ఆహ్వానించింది. వ్రతం చెడినా ఫలం దక్కక పోవచ్చునని ఎగ్జిట్‌పోల్స్ సూచిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో వేదిక పంచు కున్నారు. గతం గతః అనుకున్నామనీ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న గతాన్ని విస్మరించి దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, ప్రజాస్వామ్య సంస్థలనీ కాపాడేందుకు కలసికట్టుగా పోరాడాలని తీర్మానించుకున్నట్టు ఇద్దరూ చెప్పారు. కాంగ్రెస్‌ను పాతరేసేందుకే ఆవిర్భవించిన టీడీపీతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు ఏమిటనే ప్రశ్న సహజంగానే తెరపైకి వచ్చింది. కాంగ్రెస్–టీజేఎస్–సీపీఐ కూటమి టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తుందని భావించిన టీఆర్ఎస్ నేతలకు చంద్రబాబుతో కాంగ్రెస్ దోస్తీ ఒక వరప్రసాదంగా కలసివచ్చింది. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఒక పార్టీ గెలుస్తుంది. మరో పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మరోసారి గెలుపొందుతుంది. బిల్లీ గ్రాహం వంటి మతప్రచారకులూ, వుడ్రో విల్సన్ వంటి రాజకీయనాయకులూ చెప్పిన హితవాక్యం ఏమంటే, ‘ధనం పోతే నష్టం లేదు. ఆరోగ్యం పోతే కొంత నష్టం. శీలం (క్యారెక్టర్) కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే’. ఇది వ్యక్తిత్వవికాసంలో ముఖ్యమైన అంశం. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలే నిజమైతే తెలంగాణ ఎన్నికలలో ముగ్గురు నాయకులు నష్టబోతారు. జాతీయ స్థాయిలో మోదీ–అమిత్ షాల రాజ్యానికి ప్రత్యామ్నాయం నిర్మించాలనే ప్రయత్నానికి తెలంగాణలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాందీప్రస్థావన చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి లగడపాటి చెప్పినట్టు విజయం సాధిస్తే రాహుల్‌గాంధీకీ, చంద్రబాబుకూ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసే ప్రయత్నాలకు మంచి ఊపు లభిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కూడా విజయం సాధిస్తే రాహుల్‌గాంధీని పట్టుకోవడానికి పగ్గాలు ఉండవు. మోదీకి ప్రత్యామ్నాయంగా జాతీయ యవనికపైన రాహుల్ అవతరించినట్టే. మహాకూటమిలోకి మాయావతిని తీసుకొని రాగలిగితే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, కాంగ్రెస్, అజిత్‌సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) కలసి పోటీ చేస్తే బీజేపీ కోలుకోలేని దెబ్బతింటుంది. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలలోనూ ఈ కూటమికి 65 వరకూ వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటువంటి స్నేహమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో కూడా వెల్లివెరిస్తే బీజేపీకి కష్టాలు తప్పవు. మోదీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు కొత్త శక్తి అబ్బుతుంది. రాహుల్‌గాంధీకి స్ఫూర్తిప్రదాతగా, ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణంలో సూత్రధారిగా మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పడానికి చంద్రబాబుకు అవకాశం వస్తుంది. పాదయాత్రలో ప్రజలను అసాధారణ స్థాయిలో ఆకర్షిస్తూ వారి హృదయాలను గెలుచుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో ఎదుర్కోగలనని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రొఫెసర్ కోదడరామ్ ఆబోరు కొంతమేరకు దక్కుతుంది. గడ్డం ఉంచుకున్నా గీయించుకున్నా టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమకుమార్‌రెడ్డిని గబ్బర్ సింగ్‌గా ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అంగీకరించక తప్పదు. శీలం ప్రధానం ఎగ్జిట్‌పోల్ నిర్వహించిన సంస్థలలో అత్యధిక సంస్థలు చెప్పినట్టు ప్రజాకూటమి వీగిపోయి టీఆర్ఎస్కే మెజారిటీ లభిస్తే ఎన్డీఏ ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాలనే సంకల్పం బలహీనపడుతుంది. రాహుల్‌గాంధీ ప్రతిష్ట దెబ్బతింటుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు చలామణి తగ్గిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా ప్రాంతీయ పార్టీలను కలిపి ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనతో కేసీఆర్ తిరిగి ఢిల్లీ వెళ్ళి నేతలతో సంప్రదింపులు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మరింత బలహీనపడతారు. మూడున్నర దశాబ్దాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను ప్రతిఘటించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాహుల్‌గాంధీ ఏమి నిరూపించారు? గెలుపే ప్రధానమనీ, విజయం కోసం ఏ పనైనా చేస్తాననీ చాటి చెప్పారు. శీలం ప్రధానం కాదనీ, అవకాశవాదం పట్ల అభ్యంతరం లేదనీ తేల్చారు. ఎన్నికలలో గెలుపుకోసం ఎవరితోనైనా భుజం కలపవచ్చునని చెప్పకనే చెప్పారు. దశాబ్దాల తరబడి స్థానిక టీడీపీ నేతలతో ఘర్షణ పడి, కోర్టు కేసులు పెట్టుకొని, తరతరాలుగా వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడు పడని విధానం. ఇదే విధంగా టీడీపీ నాయకులు సైతం భావించి ఉంటారు. పదవే పరమావధిగా భావించే నాయకులకు ఎటువంటి అపవిత్ర కలయికల పట్లా అభ్యంతరం ఉండదు కానీ నికార్సయిన కార్యకర్తలకూ, మండల స్థాయి నాయకులకూ ప్రత్యర్థులతో రాజీపడటం సుతరామూ ఇష్టం ఉండదు. లగడపాటి జోస్యం నిజం కాకపోతే ఉత్తమ కుమార్‌రెడ్డి కల చెదిరిపోతుంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడుగా ఉత్తమ్ నిర్విరామంగా కృషి చేశారు. చంద్రబాబుతో స్నేహం చేటు చేసిందని మనసులో బాధపడవలసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరి కంటే అధికంగా నష్టపోయిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్. 2009 డిసెంబర్లో తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ–టీజాక్) ఆవిర్భవించినప్పటి నుంచీ దానికి నాయకత్వం వహిస్తూ ఉద్యమాన్ని కొనసాగించడంలో ముఖ్యమైన భూమిక పోషించిన కోదండరామ్‌కు తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నది. రాజకీయ అంశాలపైన పోరాడాలంటే రాజకీయ పార్టీ పెట్టాలనీ, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనీ వాదించినవారిలో ఈ రచయితా ఒకడు. పార్టీ పెట్టిన తర్వాత సమర్థులైన సహచరులు లభించకపోవడం, పార్టీ నిర్మాణానికి సమయం లేకపోవడం, ఎన్నికలు తరుముకుంటూ రావడం, కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులతో వ్యవహారం చేయవలసి రావడంతో కోదండరామ్ గందరగోళానికి గురి అయినట్టు కనిపించారు. ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టు కోవడానికి కాంగ్రెస్ సిద్ధపడిందో అప్పుడే ఆ కూటమి నుంచి టీజేఎస్ వైదొలగ వలసింది. చంద్రబాబును కోదండరామ్ నవ్వుతూ పలకరించడం, గద్దర్ ఆలింగనం చేసుకోవడం తెలంగాణ ఉద్యమంతో మమేకమైనవారికి నచ్చదు. ఆ ఇద్దరి సహకారం కేసీఆర్ సైతం తెలంగాణ ఉద్యమ స్వభావానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసి గెలిచినవారినీ, ఓడిన వారినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని సైతం ఆదరించడాన్ని జనం ఆమోదించలేదు. తప్పనిసరిగా ఓడిపోతారని తెలిసి కూడా చాలామంది ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్లు ఇచ్చారు. ఇన్ని పనులు చేసినా టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయంటే అందుకు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలు కారణం. ఆయన విజయం సాధిస్తే ఇద్దరు ప్రముఖులకు విధిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు మోదీ. మరొకరు చంద్రబాబు. మోదీ మూడు సభలలో పాల్గొని సమర్థంగా ప్రచారం చేయడమే కాకుండా అమిత్‌షానూ, డజను మందికిపైగా కేంద్ర మంత్రులనూ తెలంగాణలో ప్రచారానికి దించారు. బీజేపీకి సీట్లు పెద్దగా పెరగక పోయినా ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని సర్వేలు సూచిస్తున్నాయి. అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అధికభాగం ప్రజాకూటమికి పోకుండా బీజేపీ అడ్డుకొని టీఆర్ఎస్ను ఆదుకున్నదని అర్థం. ప్రజాకూటమి తరఫున విడుదల చేసిన ప్రచార సామగ్రిలో చంద్రబాబు ప్రముఖంగా కనిపించి, నాలుగైదు రోజులు ఖమ్మంలోనూ, హైదరాబాద్‌లోనూ విస్తృతంగా ప్రచారం చేసి కేసీఆర్‌కు గొప్ప మేలు చేశారు. ‘నిర్ణయాలు హైదరాబాద్‌లో జరగాలా, అమరావతిలో జరగాలా?’ ‘నేను కావాలా, చంద్రబాబు కావాలా?’ ‘రెండు రాష్ట్రాలనూ తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తెలంగాణకు అవసరమా?’ అంటూ ఎన్నికల సభలలో ప్రజలను ప్రశ్నించి సమాధానం చెప్పించే వీలు కేసీఆర్‌కు దొరికింది. చంద్రబాబు రంగంలో దిగకపోతే ఆయనను ఒక ఆయుధంగా వినియోగించుకునే అవకాశం కేసీఆర్‌కు ఉండేది కాదు. - కె. రామచంద్రమూర్తి -
మర్యాదలు మంటగలిసిన వేళ
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడేందుకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది. యోధానుయోధులు ప్రచారం చే శారు. రోజూ పదిహేను హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సభలు జరిగాయి. ఓటర్లపైన ప్రభావం వేయడానికి ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రచారం చేశారు. మూడు న్నర దశాబ్దాల వైరం మరచి భుజం కలిపిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కొత్త ప్రేమికుల వలె వ్యవహరిస్తున్నారు. వారికి ఇతరులు ఎవ్వరూ కనిపించడం లేదు. అంతా పక్కాగానే ఉన్నదనే అంచనాతో శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్ని కలకు సాహసించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒక వైపు కూటమినీ, మరో వైపు మోదీ పరివారాన్నీ ఎదుర్కొంటూ సవ్యసాచిలాగా పోరాడుతు న్నారు. ఆపద్ధర్మ మంత్రులు హరీష్‌రావూ, కల్వకుంట్ల తారకరామారావూ (కేటీఆర్) సమర్థంగా సేనానికి చేదోడువాదోడుగా పరిశ్రమిస్తున్నారు, పరా క్రమిస్తున్నారు. ప్రతిపక్ష కూటమిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి ఆలస్యంగా ఆరం భించినప్పటికీ శక్తివంచనలేకుండా పరుగెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రోజుకొక జాతీయ స్థాయి నాయకుడు వచ్చి ప్రచారం చేసి, మీడియాతో మాట్లాడి వెడుతున్నారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్ హెలికాప్టర్లో తిరిగి ప్రచార సభలలో ప్రసంగిస్తున్నారు. ఖమ్మంలో జరి గిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబునాయుడు ప్రప్రథమంగా వేదిక పంచుకొని ప్రసం గించారు. ప్రజాగాయకుడు గద్దర్ రాహుల్‌తోపాటు చంద్రబాబునాయుడు పొట్టలో కూడా తలపెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఖమ్మం సభకు అధ్యక్షత వహించిన భట్టి విక్రమార్క శీలం సిద్ధారెడ్డిని గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ పీవీ నరసింహారావు పేరు విస్మరించడం, జలగం వెంగళరావు ప్రస్తావన లేకపోవడం, వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించకపోవడం కృతఘ్నతగానే పరిగణించాలి. అదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో సభకు అధ్యక్షత వహించిన టీడీపీ నాయకుడు ఎల్ రమణ చంద్రబాబును అపరచాణక్యుడుగా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేయడం, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులూ, అన్ని రకాల అభివృద్ధీ తనవల్లనే అయిందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆమోదిస్తున్నట్లు రాహుల్‌గాంధీ చిరునవ్వులు చిందించడం ఎబ్బెట్టుగా కనిపించింది. రాజకీయాలలో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ ఉండరనే నానుడిని నూటికి నూరు పాళ్ళూ నిజమని నిరూపించిన దృశ్యం ఖమ్మంలో కళ్ళకు కట్టింది. ఇంతకాలం కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉండేది కానీ సైద్ధాంతిక విభేదాలు ఏమీ లేవని చంద్రబాబు చెప్పారు. రాహుల్, చంద్రబాబు పరస్పరం ఒకరిపైన ఒకరు ఆధారపడినట్టు కనిపించారు. ఇంత వరకూ జరిగిన ప్రచారంలో కొట్టవచ్చినట్టు కనిపించిన ధోరణులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి–అలవికాని వాగ్దానాలు చేయడం. రెండు– నోటికి వచ్చిన ఆరోపణ చేయడం, దుర్భాషలాడటం. మూడు–వాస్తవాలను యధేచ్ఛగా వక్రీకరించి తమ అవసరాలకు తగిన కల్పితాలను సత్యాలుగా ప్రచారం చేయడం. ఈ మూడు ధోరణులూ అన్ని ఎన్నికలలో ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఈ ఎన్నికలలో పరాకాష్ఠకు చేరాయి. అన్ని సరిహద్దులనూ అతిక్ర మించాయి. సకల మర్యాదలనూ మంట కలిపాయి. హామీల అమలు సాధ్యమా? నేతలు లెక్కలేనన్ని వాగ్దానాలు లెక్కలేకుండా చేశారు. ఎన్నికలలో హోరాహోరీ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలో కొన సాగినా, ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినా వారు చేసిన బాసలను అయిదేళ్ళపాటు సక్రమంగా అమలు చేయడం దాదాపు అసాధ్యం. అందుకు అవసరమైన నిధులు లభించే అవకాశం లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే తప్ప రాష్ట్ర వనరులకు పరిమితమై చేయడం సాధ్యం కాని పని. ఈ ఎన్నికలలో గట్టెక్కితే చాలు, వాగ్దానాల సంగతి తర్వాత చూసు కుందామనే ధోరణితో పోటాపోటీగా వాగ్దానాలు చేశారే కానీ వాటి అమలుకు ఎంత ఖర్చు అవుతుందో, దాన్ని భరించడానికి ఆదాయం ఎక్కడి నుంచి లభిస్తుందో ఆలోచించిన దాఖలా లేదు. ఒక వేలం(Ðð ర్రి)పాట పాడినట్టు కని పిస్తున్నది కానీ ఆచితూచి చేసిన వాగ్దానాల వలె కనిపించడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనూ, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలనూ మించి వాగ్దానాలు చేయాలనే తాపత్రయం కాంగ్రెస్‌లో కనిపిం చింది. ఒక వేళ గెలిచి అధికారంలోకి వస్తే ప్రతి హామీ నుంచి లబ్ధిపొందేవారి సంఖ్యను కుదించడానికి కసరత్తు చేయాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. తగిన ఆదాయం లేకుండా వాగ్దానాలు చేసినట్టే సాక్ష్యాధారాలు లేకుండా ప్రత్యర్థులపైన విపరీతమైన ఆరోపణ చేయడం అలవాటుగా మారింది. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే మొదటి రెండు స్థానాలలో నిలుస్తాయి. తర్వాత తమిళనాడు, కర్ణాటక. ఇంత వ్యయం భరించాలంటే రాజకీయ నాయకులు అక్రమంగా ఆర్జించడం అని వార్యం. ఉత్తరాదిలో ఇతర అవలక్షణాలు అనేకం ఉన్నాయి కానీ ఎన్నికలలో ధనబలం ఇంత పెద్ద మోతాదులో లేదు. అవినీతికి ఒడిగట్టినవారే నీతిసూత్రాలు వల్లెవేయడం, తమకంటే నీతిమంతులు దేశంలో మరెవ్వరూ లేరంటూ చెప్పుకోవడం, మీడియా ప్రశ్నించకుండా ప్రచారం చేయడం మన ప్రత్యేకత. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్‌గాంధీ కాస్త రాటు తేలినట్టు కనిపిస్తున్నారు. మోదీపైన రఫేల్ డీల్ ఆరోపణాస్త్రం సంధించడమే కాకుండా ప్రత్యర్థులందరిపైనా అవినీతి ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిం చినవారు తాము అధికారంలోకి వస్తే వైఫల్యాలను సాఫల్యాలుగా ఏ విధంగా మార్చదలిచారో వివరిస్తే అది సకారాత్మక రాజకీయం అవుతుంది. ప్రత్య ర్థులపైన ఒంటి కాలిపైన లేస్తున్న రాహుల్‌గాంధీ కొత్త మిత్రులపట్ల అసా ధారణమైన ఆదరణ, గౌరవం ప్రదర్శిస్తున్నారు. దేశాన్ని రక్షించడానికి తానూ, చంద్రబాబూ పెద్ద బాధ్యతను భుజాలపైన ఎత్తుకున్నట్టు చెబుతున్నారు. తాము జాతీయ స్థాయికి కూటమిని విస్తరించి మోదీని గద్దె దింపుతామని రాహుల్ అంటున్నారు. ఎంత తీవ్రమైన ఆరోపణ ఎంత బిగ్గరగా చేస్తే అంత గొప్పగా పోరాటం చేసినట్టు మన నాయకులు భ్రమిస్తున్నారు. నిన్న ఏమి చెప్పామో, ఈ రోజు చెబుతున్నామో, నిన్నటికీ, నేటికీ పొంతన ఉన్నదో లేదో నాయకులు చూసుకోవడం లేదు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవినీతికి పెట్టినపేరు కాంగ్రెస్ అంటూ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తే బీజేపీకి అంబానీలూ, అదానీలు ముఖ్యమనీ, సామాన్య ప్రజల బాగోగులు వారికి పట్టవనీ కూటమి సభ్యులు అంటున్నారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులలో నిధుల స్వాహా చేశారని కూటమి నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా విఫలమైనదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు విమ ర్శించడం విడ్డూరం. అన్ని రంగాలలో విఫలం చెందిన ముఖ్యమంత్రిగా స్వరా ష్ట్రంలో ప్రజల విమర్శలను ఎదుర్కొంటూనే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం తీరు తెన్నులపైన చేస్తున్న వ్యాఖ్యానాలలో విశ్వసనీయత ధ్వనించదు. మోదీ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నట్టు సంకేతం ఇవ్వడానికి తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ప్రచారమే ప్రధానం నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం ఈ ఎన్ని కలలో కనిపిస్తున్న మరో ధోరణి. ప్రతి రాజకీయ నాయకుడు తనకు అంది వచ్చిన అవకాశాల మేరకు అభివృద్ధి సాధించడానికి పాటు పడతారు. మేధాశక్తి ఉన్న నాయకులు దూరదృష్టితో వ్యవహరించి భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధంగా ప్రగతికి బాటలు వేస్తారు. దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి బీజాలు వేసింది మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు అనీ, రాజీవ్ సాఫ్ట్వేర్ పార్క్‌కు హైదరాబాద్‌లో 1992లో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారనీ, చంద్రబాబు మంత్రి కావడానికి ముందే కంప్యూటర్ సంస్థలు హైదరాబాద్‌లో ఉండేవనీ చాలామందికి తెలి యదు. నేదురుమల్లి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. వారిలో చంద్రబాబు ఒకరు. తొమ్మిదిన్నర ఏళ్ల సుదీర్ఘకాలం పాలించడం వల్ల మిగిలినవారితో పోలిస్తే ఆయనకు అదనంగా అవకాశాలు వచ్చి ఉండ వచ్చు. కానీ తాను చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. వైఎస్ హయాంలో నిర్మించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, శంషాబాద్ విమా నాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు కూడా తమ ఖాతాలోనే వేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సైతం హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరిస్తోంది. బెంగుళూరులో ఐటీని శిఖరాగ్రంలో నిలపడానికి కారకుడైన ఎస్ఎం కృష్ణ ఎన్నడూ తాను బెంగుళూరు కట్టినట్టు కానీ ఐటీ తెచ్చినట్టు కానీ చెప్పుకోలేదు. తమిళనాడు నాయకులు కరుణానిధి కానీ జయలలిత కానీ ప్రచారం చేయలేదు. స్వోత్కర్ష ఒక మానసిక అవసరంగా మారి చంద్రబాబు చేత లేనిపోని మాటలన్నీ మాట్లాడిస్తున్నది. ఓటుకు కోట్ల కేసు ప్రసక్తి లేదు. ‘చంద్రబాబూ, బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు’ అంటూ హుంకరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ కేసు గురించి గట్టిగా మాట్లాడటం లేదు. నాలుగేళ్ళు బీజేపీతో టీడీపీ సహజీవనం చేసిన వైనం ప్రస్తావనకు రావడం లేదు. తొమ్మి దిన్నర సంవత్సరాలలో హైదరాబాద్‌ని కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ళలో అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా పేర్చలేక పోయారు ఎందుకని? ఈ ప్రశ్నలన్నీ అడగవలసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కూటమి కట్టారు. సమకూరిన మీడియా మద్దతు టీడీపీతో పొత్త పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఒక రకంగా నష్టం, మరో రకంగా లాభం. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా పరిగణించేవారూ, ఇతరత్రా చంద్రబాబు అంటే ఇష్టం లేనివారూ కూటమికి ఓటు వేయరు. టీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ వేస్తారు. చంద్రబాబుతో పాటు మీడియా కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున చేరింది. సోషల్ మీడియా కూడా రంగంలో దిగింది. ఇది కాంగ్రెస్‌కు విశేషంగా ఉపకరించే పరిణామం. ఇంతకాలం కేసీఆర్‌కు కొమ్ముకాసిన పత్రి కలూ, చానళ్ళూ ఇప్పుడు కాంగ్రెస్‌కు అధిక ప్రచారం ఇస్తున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో మైండ్‌గేమ్ ఆరం భించారు. కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తే టీఆర్ఎస్ పరిస్థితి నల్లేరుమీద బండి చందం కాదు. గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుంది. మాటల యుద్ధంలో ఎవరిది పైచేయి అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో టీఆర్ ఎస్కి అనుకూలించే అంశాలు అనేకం ఉన్నాయి. వృద్ధాప్య పింఛనూ, రైతు బంధు, రైతుబీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచాయి. మిషన్ భగీరథ మెయిన్ పైపులు ఇళ్ళముందుకు వచ్చి నిలిచాయి. ఇళ్ళకు పైపులు వేయడమే తరువాయి. మిషన్ కాకతీయ వల్ల మేలు జరిగింది. ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా ఒక ఘనవిజయంగా కేసీఆర్ ప్రతి సభలో చెప్పుకుంటున్నారు. వృత్తిపనివారికోసం ప్రభుత్వం తల పెట్టిన సంక్షేమ పథకాలు జనాదరణ పొందాయి. సంక్షేమ పథకాలు అన్నీ సవ్యంగా అమలు జరుగుతున్నాయనే ధీమాతోనే కేసీఆర్ ముందస్తు ఆలోచన చేశారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌లో పోలింగ్ ఈ నెల ఏడో తేదీన ఉంది. పదకొండో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంచనా. అందుకే వీటిని సెమీఫైనల్స్ అంటున్నాం. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు తెలుసు కోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పది రోజుల్లో భవిష్యత్తు చిత్రపటం దర్శనమిస్తుంది. కె. రామచంద్రమూర్తి -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి ‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్‌కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. పలు పుస్తకాల ఆవిష్కరణ అలిశెట్టి ప్రభాకర్‌పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. -
కరడుగట్టిన ‘గరుడ’
ప్రత్యర్థికి గాయమైతే బాధపడి, సానుభూతి చూపించడం ఉత్తమం. బాధ కల గకపోయినా, సానుభూతి లేకపోయినా లోకంకోసం బాధపడుతున్నట్టు, సాను భూతి చూపుతున్నట్టు నటించడం మధ్యమం. బాధపడకుండా, సానుభూతి చూపించకుండా పరిహాసం చేయడం, వెకిలిగా మాట్లాడటం అథమం. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాప్రయత్నంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు మూడవ శ్రేణి కిందికి వస్తుంది. 2003లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చిన దుర్ఘటనలో మృత్యుముఖంలోకి వెళ్ళి సురక్షితంగా బయటపడిన సందర్భం ఎవ్వరూ మరచిపోలేనిది. రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. నాటి ప్రతి పక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఫోన్ చేసి క్షేమం తెలుసుకోవడమే కాకుండా స్వయంగా తిరుపతి వెళ్ళి ముఖ్యమంత్రిని పరామర్శించారు. అంతటితో ఆగకుండా గాంధీ విగ్రహం దగ్గర శాంతి కోసం దీక్ష నిర్వహించారు. నక్సలైట్ల ఘాతుకాన్ని ఖండించారు. అంతటి ఉదాత్తమైన వైఖరి చంద్రబాబు నుంచి ఎవ్వరూ ఊహించినట్టు లేరు. కనీసం నటించకుండా బాధితుడినే తప్పు పడుతూ, ఆయనను పరామ ర్శించినవారంతా తనపైన దాడి చేస్తున్నారనీ, తన ప్రభుత్వాన్ని అస్థిరం చేయ డానికీ, రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర జరుగుతోందనీ విలేఖరుల ముందు గుండెలు బాదుకోవడం చూసినవారికి ముఖ్యమంత్రి మానసికస్థితి పట్ల అనుమానం రాకమానదు. హత్యాప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఖండించకపోగా, ఆ ఘటనను నాటకంగా అభివర్ణించడం అమానుషం. చిరునవ్వులు చిందిస్తూ, కళ్ళెగరేస్తూ, తర్జని చూపిస్తూ, ‘ఎక్కడిపోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా?’ అంటూ టీడీపీ అధినేత నాటకీయంగా మాట్లాడిన పద్ధతీ, ఆంధ్రప్రదేశ్‌లో అల జడి సృష్టించేవారిని ఉపేక్షించేది లేదంటూ అర్థరహితంగా, అసందర్భంగా మాట్లాడిన తీరూ చూసిన నా బోటి రాజకీయ పరిశీలకులకు సైతం ఆందోళన కలుగుతున్నది. నిజంగానే, ఎక్కడికి పోతున్నాం మనం? జగన్మోహన్రెడ్డిని పలకరించిన వారిలో కాంగ్రెస్ నాయకులను మినహాయించి మిగిలిన వారిని ఆయన తప్పుబట్టారు. నలభై సంవత్సరాల నుంచీ రాజకీయాలలో రాటు తేలిన వ్యక్తి, 14 సంవ త్సరాలు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన నాయకుడు ఇంత నేల బారుగా వ్యవహరించడం అసాధారణం. ముమ్మాటికీ ఆక్షేపణీయం. గురువారం రాత్రి చంద్రబాబు మాట్లాడిన తీరు ఆయన అభిమానులకూ, సానుభూతి పరులకూ, రాజకీయంగా జగన్మోహన్రెడ్డిని వ్యతిరేకించేవారికి కూడా మింగు డుపడలేదు. ఎబ్బెట్టుగా తోచింది. ఆయన పట్ల గౌరవం ఎంతో కొంత తగ్గి ఉంటుంది. ఒక రకంగా చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నారు. ఇది చాల దన్నట్టు అమరావతిలో తెలుగులో పాడిన పాటనే ఢిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఇంగ్లీషులో ఆలపించారు. ఢిల్లీలో విన్యాసాలు చంద్రబాబు అదృష్టం కొద్దీ ఒక్క ఇంగ్లీషు చానెల్ కూడా ఆయన గోష్ఠిని లైవ్‌లో చూపించలేదు. తెలుగు చానళ్ళు మాత్రమే ఆసాంతం చూపించాయి. హిందీ మీడియాకు చెందిన ఒకరిద్దరు విలేఖరులు ప్రశ్నలు అడిగారు కానీ జాతీయ టీవీ న్యూస్‌చానళ్ళ, పత్రికల ప్రతినిధులు కనిపించలేదు. లేకపోతే చంద్రబాబు బండారం బయటపడేది. ప్రతిపక్ష నాయకుడిని పలకరించినవారిని ముఖ్య మంత్రి తన శత్రువులుగా భావించడం, వారంతా కలిసి రాష్ట్రంలో అస్థిరత సృష్టిం చడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించడం, రేపో, ఎల్లుండో తనపైన ఐటీ, ఈడీ దాడి జరిగే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించడం జాతీయ మీడియా చూపించి ఉంటే చంద్రబాబు పరువు కృష్ణా, గోదావరులతో పాటు యమునా నదిలో కూడా కలిసేది. అంత పని జరగనందుకు ఆయన హితైషులు సంతోషిం చాలి. ఏదో అపరాధ భావన ఆయనను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. విమానాశ్రయంలో హత్యాప్రయత్నం జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నిందితుడు వైఎస్ఆర్సీపీకి చెందినవాడనీ, ప్రచా రంకోసం దాడి చేశాడనీ చెబుతూ అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు తేలికగా తీసిపారవేయడం చూశాం. ఎవరో ఎక్కడి నుంచో పంపిన మెసేజ్‌లు మొబైల్లో చూస్తూ ఆయన మాట్లాడటం కనిపించింది. మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ నానీ చేసిన దుర్భరమైన వ్యాఖ్యలు గమనించాం. వీరిద్దరు కానీ, కాల్వ శ్రీని వాసులు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు కానీ దాడి పైన స్పందించిన తీరు చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ మేలు చేస్తుందా? సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగిం చలేదు. ఆయనకు నిగ్రహం తక్కువ. ఆగ్రహం ఎక్కువ. 2010లో హెచ్ఎం టీవీలో ‘ఆంధ్రప్రదేశ్ దశ–దిశ’ చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లో ఆరంభించి అన్ని జిల్లా కేంద్రాలలోనూ నిర్వహించిన విషయం విదితమే. ఆ క్రమంలో నెల్లూరులో సభ జరిగింది. ఇతర రాజకీయ నాయకులతోపాటు సోమిరెడ్డి కూడా హాజరైనారు. తెలంగాణ అతిథిగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (ఇప్పుడు తెలం గాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్) నాతో నెల్లూరు వచ్చారు. సోమిరెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆవేశంగా మాట్లాడుతూ శ్రీలంకలో ఎల్టీ టీఈ ఉగ్రవాదులను కాల్చి చంపినట్టే తెలంగాణవాదులను కూడా కాల్చివేయా లంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దానికి అంతే తీవ్రంగా స్పందించిన చక్ర పాణి అరగంటకుపైగా వీరంగం వేశారు. ఈ అనూహ్యమైన పరిణామానికి సభి కులంతా అవాక్కయినారు. ఎత్తులూ, వ్యూహాలూ నాలుగున్నర సంవత్సరాలు అధికారమాయలో, నిధులయావలో గడిచిపోయిన తర్వాత టీడీపీ అధినేతను ఓటమిభయం పట్టిపీడిస్తున్నదని ఆయన వాలకం చూస్తే తెలిసిపోతుంది. ఏదో ఒక పథకంతోనో, వ్యూహంతోనో ప్రజలను దారి మళ్ళించాలనే ప్రయత్నం ఆరేడు మాసాల కిందటే ప్రారంభించారు. ఎన్డీఏ నుంచి వైదొలిగి తన వైఫల్యాలకు బాధ్యత కేంద్రానిదీ, ప్రధాని మోదీదీ అని ప్రజలను నమ్మించడం అందులో ఒకటి. ‘ఆపరేషన్ గరుడ’ మరొకటి. ప్రతి పక్షంపైన దాడిని ముమ్మరం చేయడం ఇంకొకటి. మౌలికమైన సమస్యలపైన కాకుండా పనికిమాలిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకోవలసి రావడం నిజంగా విషాదం. చంద్రబాబు రాజకీయాలు మొదటి నుంచీ ఎత్తుగ డలూ, వ్యూహాల ప్రాతిపదికపైనే సాగాయి. ‘ఆపరేషన్ చిత్తూరు జిల్లా పరి షత్’లో డాక్టర్ కుతూహలమ్మను అధ్యక్ష పీఠంపైన కూర్చోబెట్టడంతో మొదలై, ‘ఆపరేషన్ వైస్రాయ్’లో ఎన్టీఆర్ చేతుల్లో నుంచి అధికార పగ్గాలు లాక్కొని పార్టీనీ, ప్రభుత్వాన్నీ కైవసం చేసుకున్నప్పటి నుంచీ అధికారం నిలబెట్టు కోవ డానికీ, ఎన్నికలలో గెలుపొందడానికీ ఆయన చేయని అక్రమం, వేయని ఎత్తు గడ, పన్నని వ్యూహం లేదు. రాజకీయాలలో లక్ష్య సాధన కోసం ఏమి చేసినా తప్పు లేదనీ, ఎన్ని తప్పులు చేసినా తాను మాత్రం నిప్పుగానే ఉంటాననీ ఆయన నమ్మకం. కొన్ని వ్యూహాలు సఫలమైతే, కొన్ని విఫలమైనాయి. జగన్మోహన్రెడ్డిని అవినీతిపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్ అధిష్ఠానంతో కలసి అమలు చేసిన వ్యూహం ఫలించలేదు. ఆయనపై బనాయించిన కేసులలో పసలేదనీ, న్యాయ పరీక్షలో అవి నిలువజాలవనీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఎంత గొంతు చించుకున్నా నష్టమే కానీ ప్రయోజనం లేదని చంద్రబాబు గ్రహించారు. పైగా దాదాపు ఏడాదికాలంగా సాగుతున్న చారిత్రక పాద యాత్రను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తన వైఫల్యాల నుంచీ, జగన్ పాదయాత్ర నుంచీ ప్రజల దృష్టి మళ్ళించడంకోసం ‘ఆపరేషన్ గరుడ’ను శివాజీ అనే నటుడితో, ఒక టీవీ చానల్ సహకారంతో 2018 మార్చిలో అమలు చేయడం ప్రారంభించారు. ఈ ‘షో’ చూసినవారికి ఈ గరుడపురాణం రాసిన అభినవ వ్యాసుడు చంద్ర బాబేనన్న అనుమానం కలుగకమానదు. శివాజీ పేరు ప్రస్తావించి ఆయన స్క్రిప్టు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిపై ప్రాణహాని లేని దాడి కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఈ స్క్రిప్టులో ఉన్నది ఉన్నట్టు జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒక్కడి పని కాదు ఈ హత్యాప్రయత్నం కేవలం శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటరిగా చేసిన పని కాదనీ, దీని వెనుక కుట్ర ఉన్నదనీ అనుమానించడానికి ఆస్కారం ఉంది. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరావుకు కొన్ని మాసాల కిందటే విశాఖ విమానాశ్రయం క్యాంటీన్లో ఉద్యోగం వచ్చిందనీ, అతని జీతం ఏడు వేల రూపాయలనీ, అతని నివాసం కోసం అద్దె ఇంటిని క్యాంటీన్ యజమానీ, టీడీపీ నాయకుడూ హర్షవర్ధన్ ఏర్పాటు చేశారనీ సమాచారం. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులనీ, వారికి ఇళ్ళు ఇవ్వడం, రుణాలు ఇప్పించడంతో పాటు శ్రీనివాస్‌కి విశాఖలో ఉద్యోగాన్ని కూడా జన్మభూమి కమిటీ ఇప్పించిందనీ చెబుతున్నారు. కొన్ని మాసాల కిందట శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్ళి తన కష్టాలు గట్టెక్కా యనీ, ఆర్థికంగా స్థిరపడ్డాననీ చెబుతూ మిత్రులకు విందు ఇచ్చినట్టు తెలు స్తోంది. కోటి రూపాయలు పెట్టి నాలుగెకరాల భూమి కొనడానికి కూడా బేర సారాలు చేశాడని భోగట్టా. ఈ పరిణామాలు గమనిస్తే శ్రీనివాస్ వెనుక ఎవరో ఉండి ఉంటారనే అనుమానం రాకమానదు. పందెం కోళ్ళ కాళ్ళకు కట్టే పదునైన కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. ఆ కత్తి మెడకు తగిలితే అక్కడికక్కడే ప్రాణాలు పోవడం ఖాయమని కోడిపందేలతో పరిచయం ఉన్న గోదావరి జిల్లా లలోని మిత్రులు అంటున్నారు. అదృష్టం కొద్దీ జగన్మోహన్రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చి, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిం చవలసిన ప్రభుత్వాధినేత ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి తనను తాను పలచన చేసుకున్నారు. ఇది చాలదన్నట్టు ఢిల్లీ వెళ్ళి కేంద్రంపైన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవడం టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం ఎట్లా అవుతుందో మెడ మీద తల ఉన్నవారికి ఎవ్వరికీ అర్థం కాదు. చంద్రబాబుని ముఖ్య మంత్రిగా, ఆయన సహచరులను మంత్రులుగా నియమించింది గవర్నర్. గవ ర్నర్ పేరు మీదే అన్ని జీవోలూ విడుదల అవుతాయి. మంత్రివర్గం గవర్నర్ పేరు మీదే పరిపాలన సాగిస్తుంది. ఇది ‘నా ప్రభుత్వం’ అని గవర్నర్ చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి కాదు. సీజన్డ్ పొలిటీషియన్ అని ఢిల్లీ మీడియా సమావేశంలో సైతం ప్రకటించుకున్న చంద్రబాబుకి రాజ్యాంగం స్పష్టం చేస్తున్న ఇంత చిన్న విషయం తెలియదా? సర్కారియా కమిషన్‌ను 1983లో ఇందిరాగాంధీ నియ మిస్తే తాను నియమించినట్టు చెప్పుకుంటే ఢిల్లీ విలేఖరులు ఏమనుకుంటారు? గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తే 1995లో ఎన్టీఆర్ చేతిలోని అధికారం తీసి చంద్ర బాబు చేతిలో పెట్టడానికి కృష్ణకాంత్ ఉండేవారా? ప్రధాని, అధికారపార్టీ అధ్య క్షుడు ఒకే రాష్ట్రం నుంచి ఉండకూడదనే వాదన సమంజసమైనదే. ముఖ్యమంత్రి పదవీ, పార్టీ అధ్యక్ష పదవీ ఒకే వ్యక్తి చేతిలో ఉండవచ్చా? ఉన్నత స్థానాలలో అందరూ గుజరాత్‌కు చెందిన అధికారులు ఉండటం ఆక్షేపణీయమే. మరి ఒకే సామాజికవర్గానికి చెందినవారు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక పదవులలో ఉండ వచ్చా? ప్రజలు నేరుగా ఎన్నుకున్న పంచాయితీలను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలతో అవినీతి, అరాచక, పక్షపాత పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి అధికార వికేంద్రీకరణ గురించీ, సమాఖ్యస్ఫూర్తి గురించీ మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? వ్యవస్థలన్నిటినీ మోదీ భ్రష్టుపట్టిస్తున్నారన్న మాట నిజమే కావచ్చు. చంద్రబాబు నిర్వాకం ఏమిటి? గోదావరి పుష్కరాలపైన విచారించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత న్యాయవిచారణలో సైతం నిజం నిగ్గు తేలుతుం దనే నమ్మకం పోయింది. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ విశ్వసనీయత ఎప్పుడో మంటగలిసింది. ఇప్పుడు మరింత అపహాస్యం అవుతున్నది. ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఎవరితో, ఏ సంస్థతో దర్యాప్తు జరిపించాలని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంతిమంగా న్యాయం ప్రజాకోర్టులోనే జరగాలి. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
ఎటు చూస్తే అటు స్వర్గం!
ప్రజాస్వామ్య ప్రక్రియ వికృతంగా మారి ప్రాణవాయువును క్రమంగా హరి స్తోంది. ఢిల్లీ పర్యావరణం లాగానే దేశమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. కొంతకాలంగా సంభవిస్తున్న విపరిణామాలు గమనిస్తున్నవారిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించి కలవరపెడుతున్నది. ఎన్నికలు జూదంగా మారినప్పుడు, అర్థబలం, అంగబలం ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగల పరిస్థితులు దాపురించినప్పుడు, వ్యాపారులే రాజకీయవాదులూ, రాజకీయవాదులే వ్యాపారులూ అయినప్పుడు అంబేడ్కర్ ఆశించిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన, స్వాతంత్య్ర సమరయోధులు అభిలషించిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లుప్తమైనప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. కీలకమైన ఎన్నికలు తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆరు మాసాలలో లోక్‌సభకూ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకూ ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. పోటీ చేసే అభ్యర్థులలో కొంతమంది మొదటిసారి బరిలో దిగబోతున్నవారు. అనుభవజ్ఞులు మరికొందరు. శాసనసభ్యుల విధులూ, విధానాలు ఏమిటో చాలా తక్కువమంది అభ్యర్థులకు తెలుసు. భారత రిపబ్లిక్ ఏర్పడి 1952లో తొలిసారి ఎన్నికలు జరిగిన దరిమిలా తొలి రెండు తరాల ప్రజాప్రతినిధులకు తమ విధ్యుక్తధర్మం ఏమిటో తెలిసేది. ఆ తర్వాత రాజకీయాలు క్రమంగా మేధావులనూ, సామాజిక సేవకులనూ, నిజాయితీపరులనూ పక్కన పెట్టి వ్యాపారులకూ, పారిశ్రామికవేత్తలకూ, నేరచరితులకూ, అక్రమార్కులకూ పెద్దపీట వేశాయి. ప్రజలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహించవలసిన ఎంఎల్ఏలు చట్టాలు చేయడంలో, పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు కాకపోతే వారు కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్టే. ప్రజలు కూడా తమ కష్టాలకీ, సమస్యలకూ ప్రభుత్వాలు కారణమని నిరసన వెలిబుచ్చుతారు కానీ తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిని ప్రశ్నించరు. తెలంగాణవాదానికి మద్దతు ప్రకటించవలసిందిగా అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులపైనా ఉద్యమకారులు ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆందోళన ఊపందుకున్నది. కేశవరావు, నాగం జనార్దనరెడ్డి, మధుయాష్కీ వంటి నాయకులపైన ఉద్యమకారులు తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాని ఒక అస్త్రంగా వినియోగించింది. ఇతర పార్టీలు సైతం ఉద్యమబాట పట్టవలసి వచ్చింది. ప్రజాప్రతినిధుల పాత్ర అద్వితీయమైనది. వారిని ఎన్నుకునే ప్రక్రియ పవిత్రమైనది. దాన్ని భ్రష్టుపట్టకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత ప్రజలది. అలవికాని వాగ్దానాలు శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభలలో తనదైన ధోరణిలో మాట్లాడారు. ప్రతి రైతు కుటుంబానికీ రెండులక్షల రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3000 నెలసరి భత్యం చెల్లిస్తామనీ వాగ్దానం చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సైతం ఇదే తరహా వాగ్దానాలు నాలుగు రోజుల కిందట పాక్షిక ఎన్నికల ప్రణాళిక పేరుతో చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ లక్ష రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3016లు నెలనెలా చెల్లిస్తామనీ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామనీ, డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టించి ఇస్తామనీ, రాష్ట్ర ఆదాయం పెంచుతూ, దాన్ని ప్రజలకు పంచుతూ పోతామనీ వాగ్దానం చేశారు. రైతుల కోసం ప్రవేశపెట్టే 15 పథకాలలో 72 లక్షల మంది రైతులకు కనీసం మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ చెప్పారు. పకడ్బందీగా లెక్కలు వేసిన తర్వాతే వాగ్దానాలు చేస్తున్నామంటూ నాయకులు చెప్పినా ప్రజలకు వారి అనుభవం నుంచి పుట్టిన అనుమానాలు ఉంటాయి. అమలు అసాధ్యమని తెలిసినా శక్తికి మించిన వాగ్దానాలు చేస్తున్నారనే విషయం గ్రహిస్తారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు బొత్తిగా అమలు చేయని పార్టీలు ఉన్నాయి. పాక్షికంగా అమలు చేసిన పార్టీలూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాగ్దానాలు అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లు అన్నీ కలిపినా నిధులు సరిపోవని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే కేసీఆర్ నిరుద్యోగభృతి వాగ్దానం చేశారు. కేసీఆర్ 2014 నుంచి నాలుగు వాయిదాలలో రైతు రుణమాఫీ చేశారనీ, అట్లా కాకుండా కాంగ్రెస్‌ని గెలిపిస్తే మొత్తం రుణమాఫీ ఒకే విడతలో చేస్తావ«ుని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని వాగ్దానం చేసి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాలుగున్నర సంవత్సరాలు నయాపైసా చెల్లించకుండా ఇప్పుడు నెలకు రూ. 1,000 చొప్పున ఇస్తానని చెబుతున్నది. దానిలో కూడా అనేక మినహాయింపులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించవలసి వస్తున్నది. ఇది బూటకపు వాగ్దానంగానే మిగి లిపోతున్నది. రైతు రుణమాఫీ వాగ్దానం సరేసరి. ఏ పార్టీ అయినా చేస్తున్న వాగ్దానాలు అమలుకు యోగ్యమైనవా, కావా అని నిర్ణయించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం స్వీకరించాలి. ప్రజల హృదయాలను ఏదో ఒక విధంగా గెలుచుకోవాలనే ఆరాటంలో అలవికాని వాగ్దానాలు పార్టీలు చేస్తాయి. వాగ్దానాలు అమలు చేయని పార్టీలను అయిదేళ్ళ తర్వాత ప్రజలు శిక్షించవలసిందే కానీ వాగ్దానాలను అమలు చేయించే వ్యవస్థ లేదు. ఆర్థిక నిపుణులతో, సామాజికవేత్తలతో ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించి, వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమో కాదో నిర్ణయించవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించాలి. అమలు సాధ్యం కానివి ఎన్నికల ప్రణాళిక నుంచి తొలగించాలని పార్టీలను కట్టడి చేయాలి. వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఉద్యోగుల జీతభత్యాలూ, ఇతర ప్రభుత్వ ఖర్చులకు ఎంత కేటాయించాలి? మిగిలిన మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత ఖర్చు చేయాలి? అభివృద్ధి వ్యయానికీ, సంక్షేమ వ్యయానికీ మధ్య సమతౌల్యం పాటిస్తూ సంక్షేమంకోసం ఎంత ఖర్చు చేయవచ్చు? సంక్షేమం కోసం కేటాయించిన మొత్తంలో పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమేనా? వైద్య, విద్యా రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్రమించి, ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదా లేక ప్రభుత్వ ఆసుపత్రులనూ, విద్యాలయాలనూ పటిష్టం చేయడం ఉత్తమమా అనే అంశం కూడా ఎన్నికల ప్రచారంలో చర్చకు పెట్టాలి. పన్నులు పెంచుతూ, ఆదాయాన్ని సంక్షేమం పేరు మీద పంచుతూ పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం? తమ జేబులో నుంచి తీసి రైతులకూ, నిరుద్యోగులకూ ఇస్తామన్నట్టు మాట్లాడుతున్న నేతలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా వివరించడం లేదు. రాష్ట్రాల వనరులు ఏమిటో, వాటిని వినియోగించి అభివృద్ధికి సోపానాలు ఏట్లా వేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయో తెలియదు. పౌరులు తమ కాళ్ళపైన తాము నిలబడే విధంగా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కల్పించగలదో తెలియజేయడం లేదు. విదేశాలలో దాచిన నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షలు డిపాజిట్ చేస్తానంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ వాగ్దానం చేసి అభాసుపాలు కాలేదా? గెలుపు ముఖ్యం. అందుకోసం అరచేతిలో వైకుంఠం చూపిద్దాం. గెలిచిన తర్వాత చూసుకుందాం అనే ధీమా పార్టీల చేత చాంతాడంత వాగ్దానాలు చేయిస్తున్నది. ఫిరాయింపుల నిరోధం మరో అత్యంత ప్రమాదకరమైన అంశం ఫిరాయింపు. ఫిరాయింపుల నిరోధం కోసం రాజీవ్‌గాంధీ, వాజపేయి ఎంత కృషి చేసినా చట్టం చట్టుబండలై ఫిరాయింపుల వ్యాపారం నిస్సిగ్గుగా సాగిపోతోంది. రాజ్యాంగాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్నవారు ఆక్షేపించడం కూడా మానివేశారు. కొన్ని సందర్భాలలో ఉన్నత పదవులలో ఉన్నవారే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా మంత్రివర్గాలే ఫిరాయిం చడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పుకోదగిన విశేషం. ఈ ఆత్మహననం నిర్నిరోధంగా కొనసాగుతోంది. ఉదాహరణకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా అక్కడ కొత్త ముఖ్యమంత్రికి పగ్గాలు అందించాలి. అందుకు అవసరమైన మెజారిటీ అధికార బీజేపీకి లేదు. అందుకని ఒక రోజు ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఢిల్లీకి విమానంలో రప్పించుకొని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్‌గోయెల్ బీజేపీ కండువాలు దర్జాగా కప్పేశారు. ఆ విధంగా మెజారిటీ లేమి సమస్యను అధిగమించారు. ఆ క్రమంలో రాజ్యాంగాన్ని మరోసారి కుళ్ళబొడిచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి తన ఎంఎల్ఏలను ‘కొనుగోలు’ చేస్తుంటే కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రశ్నించకపోవడం, ఇది సర్వసాధారణమైనట్టు మీడియా సైతం మిన్నకుండటం దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారిందనడానికి ప్రబల నిదర్శనం. ప్రజాస్వామ్య రక్షణకు తక్షణ చర్యలు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. 1. ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉండగానే తెలంగాణలో రూ. 59 లక్షల నగదుతో వెళ్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి కరా>్ణటకకు కారులో తీసుకొని వెడుతున్న రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడకపోతే ఇది బహుశా రాయలసీమకు వెళ్ళి ఉండేది. పోలీసులు పట్టుకోలేనివి ఇంతకు అనేక రెట్లు ఉంటాయి. అసలు ఇంత నల్లధనం ఎట్లా ఉత్పత్తి అవుతున్నదో తెలుసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పార్టీలకు నిధులు ఎట్లా సమకూర్చుతున్నదో తెలుసుకోవాలి. 2. నల్లధనం వనరులలో ముఖ్యమైనవి నీటిపారుదల ప్రాజెక్టులూ, రోడ్ల నిర్మాణం, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణవ్యయాన్ని పెంచడం పారదర్శకంగా జరిగే విధంగా చూసేందుకు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి. దానికి సమాంతరంగా పౌరసమాజం తరఫున కూడా ఒక నిఘావ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇరిగేషన్, రోడ్డు నిర్మాణం వంటి పనుల కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తున్నారో పరిశీలించాలి. టెండర్లు పిలుస్తున్నారా లేక నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టపెడుతున్నారో గమనించాలి. ఇది కేవలం అధికారపార్టీకి వదిలివేయవలసిన అంశం కాదు. ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేస్తున్నారు. అవి ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలి. 4. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అడగకుండానే వివరాలు ఇచ్చే పద్ధతి (డ్యూటీ టు రిపోర్ట్) ప్రవేశపెట్టాలి. 5. గ్రామపంచాయతీలకూ, స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు విధిగా జరిపించాలి. స్థానిక సంస్థలకు విధులూ, నిధులూ వికేంద్రీకరించాలి. జన్మభూమి కమిటీల వంటి సమాంతర పక్షపాత వ్యవస్థను రద్దు చేయాలి. ఇలాంటి కమిటీలు ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం. 6. ఫిరాయింపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2003లో ఆ చట్టానికి చేసిన సవరణలు సరిపోవని తేలిపోయింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతుల నుంచి తొలగించాలి. ఒక వేళ దాన్ని మార్చకూడదనుకుంటే ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలి. స్పీకర్ నిర్ణయాన్ని పరిశీలించి తిరస్కరించే లేదా ఆమోదించే అధికారం హైకోర్టుకు ఉండాలి. గడువులోగా సభాపతి నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రుల దగ్గర ‘జోహుకుం’ అనే స్పీకర్లకు నిర్ణయాధికారాలు ఇవ్వడం, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదంటూ ఆంక్ష విధించడంతో ఫిరాయింపులు పగ్గాలు తెంచుకొని జోరుగా సాగుతున్నాయి. నైతిక విలువలు లుప్తమైన పార్టీలు అధికారంలో ఉండటంతో అవి నీతి రాజకీయానికి హద్దూపద్దూ లేకుండా పోతున్నది. ఈ విశృంఖలత్వాన్ని అరి కట్టకపోతే దేశంలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నేతిచందం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?
వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ ఆట రాజకీయనేతలు ఆడతారు. వారు ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా ఆడతారనే దానిపైనే వారి రాజకీయ ఫలాలు ఆధారపడి ఉంటాయి. చాలా సంవత్సరాలుగా గమనించడం వల్ల ఒక రాజకీయనేత పట్ల ప్రజలలో ఒక స్థూలమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని మార్చడానికి రాజకీయనాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అవి ఎంత ప్రభావవంతంగా ఉంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉంటాయి. వీటినే ‘మైండ్‌గేమ్స్’ అంటారు. ఈ క్రీడలో భాగంగా కొన్ని దృశ్యాలనూ, సన్నివేశాలనూ, వాతావరణాన్నీ పనికట్టుకొని సృష్టిస్తారు. ఒకే అభిప్రాయాన్ని అన్ని స్థాయిలలోనూ పదేపదే ప్రచారం చేస్తారు. దీన్నే ‘గ్లోబల్ ప్రచారం’ అంటున్నారు. నిజానికి ఇది ‘గోబెల్స్ ప్రచారం’. 1933 నుంచి 1945 వరకూ హిట్లర్ మంత్రిమండలిలో ప్రచార వ్యవహారాల మంత్రిగా పని చేసిన జోసెఫ్ గోబెల్స్ పేరు మీద వాడుకలోకి వచ్చిన మాట. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర బాబునాయుడు అందెవేసిన చేయి. 1995లో ముఖ్యమంత్రి పదవి హస్తగతం చేసుకున్నప్పుడూ, మరుసటి సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడూ, 2014 ఎన్నికలలో గెలుపొందినప్పుడూ ‘మైండ్ గేమ్స్’ చంద్రబాబుకు విశేషంగా దోహదం చేశాయి. ఈ క్రీడలో మీడియా సహ కారం అత్యంత కీలకం. సహచరుల తోడ్పాటూ అవసరం. నేతలపైనా, పార్టీల పైనా ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతం, సామాజిక వర్గం, వృత్తి, ప్రవృత్తి, ఆర్థికస్థాయి, సామీప్యత, మరికొన్ని ఇతర కారణాల ఆధా రంగా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ అభిప్రాయాలు అశాశ్వతం. స్వీయా నుభవం ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 2014లో కొత్త రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడికి అనుభవం ఉంటే బాగుంటుందని భావించి చంద్రబాబుకు ఓటు వేసినవారిలో చాలామంది కడచిన నాలుగున్నర సంత్సరాల అనుభవం కారణంగా తమ నిర్ణయం సరైనది కాదని గ్రహించి ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘మైండ్ గేమ్స్’ దిశలో మార్పు చేసే నేర్పు టీడీపీ అధినేతకు దండిగా ఉంది. విస్తారమైన తన అనుభవంతో (ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతాలు చేస్తానని నమ్మించారు. అవకాశం వచ్చినప్ప టికీ అన్ని రంగాలలోనూ విఫలమైనారు. అవినీతి మాత్రం విశృంఖలమై అన్ని రంగాలకూ విస్తరించింది. కథనంలో, దృశ్యంలో మార్పు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కథనం, దృశ్యం మార్చవలసిన అగత్యం ఏర్ప డింది. ప్రజలకోసం పోరాడతాననీ, అవసరమైతే ప్రధాని మోదీపైన తిరుగు బాటు చేస్తాననీ, ఆంధ్రుల ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తాననీ చంద్ర బాబు నమ్మబలుకుతున్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేం దుకు ఉద్దేశించింది ఈ వ్యూహం. ఈ దిశగా పోరాటానికి అవసరమైన ప్రాతిపది కను నిర్మించడానికి వీలుగానే ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మోదీ తన వెంట పడబోతున్నట్టూ, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించబోతున్నట్టూ వరుసగా ప్రకటనలు చేశారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని అభ్యర్థించారు. దీనికి సమాంతరంగా ఒకానొక నటుడి చేత ‘ఆపరేషన్ గరుడ’ అనే టీవీ నాటకానికి తెరలేపారు. ఏది జరిగినా ఈ ఆప రేషన్‌లో భాగమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళలో పార్టీని నడిపించడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యాపార రాజకీయ నాయకులలో సుజనాచౌదరి, సీఎం రమేష్, నారా యణ ప్రముఖులు. వీరికి రాజకీయాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, వ్యాపారా వకాశాలూ కల్పించి వారి వ్యాపారాలలో చంద్రబాబు భాగస్వామ్యం స్వీకరించా రన్నది బహిరంగ రహస్యం. వీరే కాకుండా టీడీపీ అధినేత సంకేతాలకు అను గుణంగా నిధులు సమకూర్చేవారూ, ఖర్చు చేసేవారూ అనేకమంది ఉంటారు. వారికి టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదోరకంగా లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలలోనూ అటుఇటుగా ఉంటుంది. టీడీపీలో ఇది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై బలంగా వేళ్ళూను కున్నది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే దర్యాప్తు సంస్థలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చెప్పుచేతలలోనే అవి నడుస్తాయని అత్యధికుల అభిప్రాయం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను(ఐటీ) శాఖ, కేంద్ర నిఘా సంస్థ, ఇతర కేంద్ర సంస్థలు ఏవైనా ఒకానొక సంస్థలోనో, వ్యక్తి నివా సంలోనో సోదాలు జరిపినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనుకోకుండా దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని దుయ్యపట్టడం రివాజు. రాజకీయ ప్రయోజనాలూ, అభిప్రాయాలూ, విధేయతలూ ఇటువంటి సంద ర్భాలలో అనుసరించే వైఖరిని శాసిస్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాత ఓదార్పుయాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి వైదొలిగి సొంతపార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డిపైన సీబీఐ సుదీర్ఘంగా దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు సంబరపడినవారు ఇప్పుడు రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్ళలోనూ, కార్యాలయా లలోనూ సోదాలు చేస్తే ఆంధ్రులపైన దాడి చేస్తున్నారంటూ, రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుసు కనుక దాడులు జరుగుతాయని ముందే ఊహించి దానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించారు. ఇటువంటి పరిణామాలు రాకుండా నివారించేందుకే సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా నియమించి, సీఎం రమేష్‌ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)సభ్యుడిని చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడమే కాకుండా గుజరాత్‌లోనూ, కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌కు వందల కోట్ల నిధులు టీడీపీ అధినేత పంపించారని మోదీకి సమాచారం అందిందనీ, అంతలేసి నిధులు ఎట్లా సమకూరుతున్నాయో తెలుసుకోవాలని ఆయన కుతూహలంగా ఉన్నారనీ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారసంస్థలలో ఐటీ అధికారులు సోదా చేయడం సర్వసామాన్య మనీ, ఇందుకు చంద్రబాబూ, లోకేశ్‌బాబూ భుజాలు తడుముకోవడం ఎందు కని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆ సంస్థలు వ్యవహరిం చినట్లయితే ఇప్పుడు జరుగుతున్న సోదాలు ఎప్పుడో జరగవలసింది. ఎన్డీ ఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఇసుకమాఫియా స్వైరవిహారం చేసింది. పోలవరం, పట్టిసీమ, ఇతర సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి సాగింది. ఎన్డీఏ నుంచి తప్పుకున్న కార ణంగా, ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలని వారం రోజులు దీక్ష చేసిన కారణంగా ఐటీ శాఖను ప్రధాని ప్రయోగించారన్నట్టు ధ్వనించే విధంగా ఇప్పుడు మీడి యాలో రాస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీని ధిక్కరించిన కారణంగా సీబీ ఐని ప్రయోగించారని ఇదే మీడియా రాయలేదు. హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని హాస్యాస్పదమైన ప్రకటనలకు కూడా మీడియా ప్రచారం ఇస్తోంది. అభి వృద్ధిలో గుజరాత్‌ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ముందుకు పోతుందోనన్న భయంతో, ఈర్ష్యతో, చంద్రబాబుకి తనకంటే ఎక్కువ కీర్తి వస్తున్నదనే దుగ్ధతో మోదీ కుట్రపూరితంగా ఐటీ అధికారులతో చేయిస్తున్నారంటూ ఆరోపిస్తు న్నారు. అక్షరాస్యతలో, తలసరి ఆదాయంలో, ఇతర అభివృద్ధి సూచికలలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోటీ పడుతూనే అన్నింటిలోనూ నంబర్ ఒన్ అంటూ ప్రచారం చేసుకునే వైఖరికి ఇది కొనసాగింపు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. వారికీ తెలివితేటలు ఉంటాయనీ, ఇంగితజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉంటాయనీ, ధర్మాధర్మ విచక్షణ వారి అంతరాత్మకు ప్రబోధం చేస్తుందనీ గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగున్నరేళ్ళుగా ప్రాజెక్టుల పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలు ఎంత విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌పైన ఎట్లా ఎవరికి కట్టబెడు తున్నారో ప్రజలకు రేఖామాత్రంగానైనా తెలియకపోదు. పాత కాంట్రాక్టర్లపైన 60 సి నిబంధనను ప్రయోగించి వేటు వేయడం, మిగిలిన పనుల వ్యయ అంచనాలు పెంచివేసి రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అన్ని కాంట్రాక్టులూ రమేష్‌కే దోచిపెడుతున్నారంటూ వరదరాజులురెడ్డి వంటి టీడీపీ నాయకులే బహిరంగంగా ఫిర్యాదు చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది. మొత్తం రూ. 3,658 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు ఇచ్చినట్టు చెబుతున్నారు. హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులలోనే అంచనాలు విపరీతంగా పెంచి నామినేషన్ పద్ధతిపైన రూ. 1,156కోట్ల విలువైన పనులు రమేష్‌కు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో 1980–90 మ«ధ్య కాలంలో సారా వ్యాపారం చేసిన రమేష్ చంద్రబాబుకి ఎట్లా దగ్గరైనారో, తిరుపతి దగ్గర 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఎట్లా ఇప్పించారో, ఆ భూమిని తాకట్టు పెట్టించి బ్యాంకు రుణంతో రిత్విక్ కంపెనీ ఎట్లా పెట్టించారో చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేష్, దక్షిణ కోస్తాంధ్రలో నారాయణ, తెలంగాణలో సుజనాచౌదరి ఏ విధంగా ఆర్థిక సహా యం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. కాంట్రాక్టు తీసుకోవడం, సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వడం, సబ్‌కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేయడం, వాటిని నగదు రూపంలో డ్రా చేయడం నిరవధికంగా జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు అలహాబాద్ బ్యాంక్ లావాదేవీల ద్వారా గమనించినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. బ్యాంకులో అప్పులు తీసుకొని, నిధులు దారి మళ్ళించి, అప్పులు ఎగగొట్టిన వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేశారు. ముఖ్యమంత్రి మెహర్బానీ కారణంగా నామి నేషన్ పద్ధతిపైన వేలకోట్ల రూపాయల విలువ కలిగిన పనులు సంపాదిం చుకున్న వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు చేశారు. వారు వ్యాపారరాజకీయులు. ప్రజలు నవ్వుకోరా? ఇటువంటి తనిఖీలు జరిగినప్పుడు వ్యాపారరాజకీయులను వెనకేసుకొస్తే ప్రజలు మెచ్చుతారా? ఐటీ సోదాలను ఆంధ్రులపైన దాడిగా అభివర్ణించడం ఆంధ్రులకు గౌరవప్రదమా? ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలూ, పెట్టుబడులూ రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మంత్రి పదవిలో ఉన్నవారు ఆరోపించడం శోభాయమానంగా ఉంటుందా? తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని ప్రజలు ఆలోచించరా? నిజానికి ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేసి అన్నీ సక్రమంగానే ఉన్నాయని కితాబు ఇస్తే సదరు రాజకీయవ్యాపారి ప్రతిష్ఠ పెరగదా? సోదాలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించకముందే ‘కక్ష రాజకీయాలు’ అంటూ ధ్వజమెత్తడం సమంజసమేనా? రేవంత్‌రెడ్డి ఇంటి లోనూ, ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరిగినప్పుడు చంద్రబాబు స్పందించడం ఎందుకు? ‘అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణకోసం ముందే ఎదురుదాడి చేయడం ఉత్తమం)’ అంటారు. ఇదే పద్ధతి చంద్రబాబు అవలంబించారు. కానీ ఎవరికి కొమ్ముకాస్తున్నారో, వారి గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటో గమనించడం లేదు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తెలివితేటలు పల్లెల్లో నివసించే రైతులకు కూడా ఉంటాయని మరచిపోకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని నిర్ణయాలు పారదర్శకంగా జరగాలని ప్రగతికాముకులూ, ప్రజాస్వామ్యప్రియులూ కోరుకుంటారు. సాగునీటి ప్రాజె క్టులకూ, రోడ్ల నిర్మాణానికీ, ఇతర ప్రభుత్వ పనులకూ కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ప్రాజెక్టుల వ్యయం అంచనాలను సవరించే విషయం సైతం అందరికీ సమంజసంగా కనిపించాలి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాతనే అమలు జరగాలి. వ్యాపారులే రాజకీయ నాయకులు కావడం, వ్యాపారరాజకీయ నాయకులో, కాంట్రాక్టర్లో ముఖ్యమంత్రులకు బినా మీలు కావడం, వారే ఎన్నికలలో ఖర్చులకు నిధులు సమకూర్చడం అనే విష వలయాన్ని ఛేదించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
హింసాత్మక భాషావరణం!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగారా మోగనే మోగింది. పోలింగ్ డిసెంబర్ 7న జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని సెప్టెంబర్ మొదటివారంలో సిఫార్సు చేసినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పోలింగ్ నవంబర్ రెండు లేదా మూడో వారంలో జరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల పేర్లు గల్లంతైనాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చివరకు హైకోర్టులో విచారణకు రావడం, అక్టోబర్ 8వ తేదీన సమా ధానం చెప్పాలనీ, సవరించిన జాబితా సమర్పించాలనీ హైకోర్టు ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా ప్రకటన తేదీని అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12కు వాయిదా వేశారు. ఈ కారణంగానే పోలింగ్ తేదీ అధికార పార్టీ ఊహించిన దానికంటే మూడు వారాలు వెనక్కు పోయింది. ఆ మేరకు కేసీఆర్ లెక్క తప్పింది. కాంగ్రెస్‌కు ఊపిరిపీల్చుకునే వ్యవధి దొరికింది. ఏ లక్ష్యంతో ముందస్తు ఎన్నికల ఎత్తుగడ కేసీఆర్ వేశారో అది కొంతమేరకు దెబ్బతిన్నది. పరుష పదజాలం ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. నెల రోజుల కిందటే 105మంది టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే పెద్ద బహిరంగసభ నిర్వహించారు. కొద్ది విరామం అనంతరం నిజా మాబాద్ సభతో ప్రచారం పునరారంభించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మహాకూటమి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మినహా తక్కిన పార్టీలను ఒకే తాటిమీదికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో బద్ధశత్రువుగా భావించవలసిన టీడీపీతో సైతం పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇంతవరకూ జరిగిన ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్ మాట్లాడిన తీరు గమనించినవారికి తెలం గాణలో ఎన్నికల పోరాటం ఆయనకూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడికీ మధ్య జరుగుతున్నదనే అభిప్రాయం కలుగుతుంది. మొదటి రెండు సభలలో చేసిన ప్రసంగాలలో కొంత నిగ్రహం ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత జరిగిన సభలలో కేసీఆర్ నిప్పులు కురిపించారు. భావంలో స్పష్టత, భాషలో కాఠిన్యం కేసీఆర్ ప్రత్యేకత. అంత తీవ్రంగా మాట్లాడకుండానే చెప్పదలచింది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగల నేర్పు కేసీఆర్‌కు ఉన్నది. ఓర్పు లేదు. ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రయోగించిన పరుష పద జాలం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న తొలి ఎన్నికలలో ముఖ్య మంత్రి నోట వినిన విజ్ఞులు విస్తుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం అంతే పదునైన భాషలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు కేసీఆర్‌పైన ఆయన శైలిలోనే దాడి చేశారు. రేవంత్‌రెడ్డి సంగతి చెప్ప నక్కరలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా ప్రత్యర్థులను దుర్భాషలాడారు. కేసీఆర్‌కి ఉన్న వాగ్ధాటి చంద్రబాబుకి లేదు. ఆ కొరతను ఎత్తుగడలతో, వ్యూహరచనతో, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేసే నైపుణ్యంతో భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలలో ఫలానా ప్రాజెక్టు కట్టానని కానీ ఫలానా పరిశ్రమ తెచ్చాన ని కానీ, ఫలానా వాగ్దానం నెరవేర్చాన ని కానీ చెప్పి ప్రజలను మెప్పించే అవకాశం చంద్రబాబునాయుడికి లేదు. అరచేతిలో స్వర్గం చూపించడంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. బీజే పీతో నాలుగేళ్ళు సహజీవనం చేసి సాధించింది పూజ్యం. అనవసరమైన విదేశీ యానాలూ, అస్మదీయులకూ, బినామీలకూ అక్రమంగా దోచిపెట్టారనే ఆరోప ణలూ, అవధులు లేని దుబారా, హద్దు మీరిన ఆర్భాటం, అంతులేని స్వోత్కర్ష (నేను సీజన్డ్ పొలిటీషియన్ని, సీనియర్మోస్ట్ స్టేట్స్‌మన్‌ని, మోదీ కంటే సీనియర్ని) మినహా చెప్పడానికి చేసిన మంచిపని ఏమీ లేదు. సాధించిన ఘన కార్యాలు చూపించి ఓట్లు అడిగే అవకాశం లేదు కనుక బీజేపీనీ, నరేంద్రమోదీనీ ఆంధ్రులకు పరమశత్రువులుగా అభివర్ణించి, మోదీపైన యుద్ధం చేస్తున్న తిరు గుబాటు వీరుడిగా, ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా ప్రజలను నమ్మించాలని ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పుడు తన అసమర్థ తనూ, వైఫల్యాలనూ చర్చనీయాంశాలు కాకుండా చేయవచ్చునని ప్రణాళిక. నిజానికి చంద్రబాబుకి అంతకంటే మరో మార్గం లేదు. మోదీ సహకరించి ఉంటే టీడీపీ అధినేత వ్యూహం ఫలించేది. అమరావతి భూముల కుంభకోణంపైనో, పోలవరం అవినీతిపైనో, వేలకోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టిపెట్టడంపైనో విచారణ జరిపించాలని మోదీ నిర్ణయిస్తే బాధితుడిగా అభినయించి ప్రజల సానుభూతి పొందే అవకాశం చంద్రబాబుకి ఉండేది. కోట్లకు పడగలెత్తిన నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి సన్నిహితులపైన కేసులు పెట్టినా రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టేవారు. ఆ పనులేవీ మోదీ చేయడం లేదు. మోదీ, అమిత్‌షాలు తమ శక్తియుక్తులన్నీ వింధ్యపర్వతాలకు ఆవలే వినియోగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాము చేయగలిగింది ఏమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు. కానీ మోదీని ఒక భయంకరమైన శత్రువుగా చిత్రించడం, అటువంటి బలమైన, క్రూరమైన శత్రువుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరుడిగా ప్రజలను మెప్పించడం చంద్రబాబుకి అత్యవసరం. అందుకే బాబ్లీ ప్రాజñ క్టు నిర్మాణంనాటి పాత కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంటు (ఎన్బీడబ్ల్యూ) పంపిస్తే దాన్ని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలసి కుట్ర చేసి పంపించినట్టు నానా యాగీ చేయడం. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాబాద్ కోర్టుకు వెళ్ళడమా, మానటమా అనే అంశంపైన చర్చ జరపడం నిరర్థక రాజకీయానికి నిదర్శనం. ఉత్తరతెలంగాణ మీదుగా ధర్మాబాద్‌కు కార్లలో భారీ ఊరేగింపుగా వెడితే ఎన్నికల ప్రచారం చేసినట్టు కూడా ఉంటుందని ఒక మంత్రి సలహా ఇచ్చారట. ఎవరైనా వ్యాపారి లేదా పారి శ్రామికవేత్త పన్ను చెల్లించని పక్షంలో ఆదాయంపన్ను శాఖ లేదా వాణిజ్యపన్ను శాఖ అధికారులు సోదా చేయడం సర్వసాధారణం. తెలంగాణలో టీఆర్ఎస్కు ఫిరాయించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలలోనూ, కార్యాలయాల లోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇవి మామూలుగా జరిగే సోదాలేననీ, వారికి అనుమానం వస్తే సోదా చేస్తారనీ, అనుమానాలు నివృత్తి చేస్తే సమస్య ఉండదనీ ఏ మాత్రం ఆవేశం లేకుండా ఆయన విలేఖ రులకు వివరించారు. కేసీఆర్ ఆ విషయంపైన స్పందించ లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారపక్షంతో, ప్రతిపక్షంతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తుల ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖ అయిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అనేక సందర్భాలలో ప్రభుత్వాధికారుల ఇళ్ళపైన దాడులు చేశారు. రవాణాశాఖలో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఇరవై కోట్ల విలువైన ఆస్తుల వివరాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. గాలిమరపై యుద్ధం గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కట్టలేదనే కారణంగా ఆదాయంపన్ను శాఖ నిర్వహించిన సోదాలను ‘ఐటీ పంజా’ అంటూ పత్రికలు సంచలనా త్మకమైన శీర్షికలు ఇచ్చి ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి హడావిడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంపైన ప్రధాని మోదీ పగబట్టారు. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. మూకుమ్మడి ఐటీ దాడులు ఇందులో భాగమే. కేంద్రం దుర్మార్గాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. కేంద్ర వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలి’ అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి ఉద్బో« దించారు. లేని కోటలో లేని శత్రువును ఊహించుకొని యుద్ధం చేయడం చూస్తుంటే చిన్నతనంలో చదివిన నవలలో కథానాయకుడి పాత్ర గుర్తు కొస్తున్నది. 17వ శతాబ్దం అరంభంలో స్పానిష్ రచయిత సర్వెంటెస్ (Cer-vantes) రచించిన డాన్ క్విక్జోట్ (Don Quixote) అనే నవలలో తనను తాను మహాయోధుడుగా ఊహించుకునే డాన్ క్విక్జోట్ రోజీనాంటీ (Rosinante) అనే గాడిదలాగా కనిపించే ముసలి గుర్రంపైన శాంకోపాంజా (Sancho Panza) అనే శిష్యుడితో కలసి స్వారీ చేస్తూ ఒక సత్రానికి వెడతాడు. దాన్ని కోటగా భ్రమిస్తాడు. అక్కడ ఉన్న వేశ్యలను రాచకుటుంబానికి చెందిన మహిళలుగా భావించి వారికి అర్థం కాని ఉదాత్తమైన భాషలో ప్రసంగిస్తాడు. యుద్ధం చేసి తన సత్తా నిరూపించుకోవాలి కనుక ఒక అట్టకత్తి ధరించి గాలిమరతో పోరాటం చేస్తాడు. అదే తరహాలో తనను శత్రువుగా గుర్తించడానికి నిరాకరించే మోదీతో మహాసమరం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు మీడియా సహకారంతో టీడీపీ అధినేత ఎంత హంగామా చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆదా యంపన్ను శాఖ అధికారులకు భద్రత ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు కానీ లోకేశ్ కానీ హైదరాబాద్ సందర్శిస్తే తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఇవ్వనంటే ఏమి చేస్తారు? రేపు ధర్మా బాద్ కోర్టుకు వెడితే అక్కడ చంద్రబాబునాయుడికి భద్రత కల్పించరాదని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమి చేస్తారు? ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరం లేదని దేశీయాంగ శాఖ నిర్ణయిస్తే ఏమి చేస్తారు? సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే వైఖరి ఇది. చిన్న సంస్థలపైన ఆదాయంపన్ను శాఖ అధి కారులు సోదాలు నిర్వహిస్తే దానిని రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య యుద్ధంగా, ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికీ మధ్య పోరాటంగా ఏకపక్షంగా ప్రచారం చేసు కోవడం అసాధారణమైన విషయం. దేశంలో మరే నాయకుడూ ఇటువంటి హాస్యాస్పదమైన విన్యాసాలు చేయలేదు. తెలంగాణ ఫలితం కీలకం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఆరు మాసాల వ్యవధి ఉన్నది. దానికి డ్రెస్ రిహార్సల్‌గా తెలంగాణలో ఎన్నికలు ముందుగానే ఏర్పాటు చేశారు కేసీఆర్. చంద్రబాబునాయుడు సహాయసహకారాలతో తెలంగాణలో మహాకూటమి గెలిస్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని నిలువరించవచ్చునని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశ. అందుకు చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు దోహదం చేస్తారని అంచనా. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో కేసీఆర్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లు కలిసి గబ్బర్‌సింగ్ అనో, సన్నాసులనో, దద్దమ్మలనో విమర్శించవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌వారిని తెలంగాణ ద్రోహులంటూ టీఆర్ఎస్ నేతలు నిందించినా ప్రజలు విశ్వసించరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అనే సంగతి ప్రజలకు తెలుసు. కానీ చంద్రబాబుపైన ఎన్ని బాణాలు వేసినా, ఎంత బలంగా దాడి చేసినా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకు? చంద్రబాబునాయుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు తెలంగాణలో ఏమి పని? సీలేరు ప్రాజెక్టుతో సహా ఏడు మండలాలు తెలంగాణ నుంచి ‘లాక్కున్న’ వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి అదే పనిగా లేఖలు రాసిన నేత, ‘వోటుకు కోట్ల’కేసులో ఫోన్లో మాట్లాడుతూ లడ్డూలాగా దొరికిపోయి హైదరాబాద్‌ని వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోయిన నాయకుడిని తెలంగాణ ద్రోహిగా, అవినీతిపరుడుగా నిందించడం తేలిక. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానవర్గానికీ, మరోవైపు అమరావతిలో చంద్రబాబుకీ గులాములంటూ వాక్బాణాలు సంధించడం, ప్రజలను నమ్మిం చడం సులువు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికమంటూ కేసీఆర్ దుయ్య బడతారు. కేసీఆర్, నరేంద్రమోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనీ, వారు కుట్రపన్ని తననూ, తన పార్టీనీ వేధిస్తున్నారనీ చంద్రబాబు అంటారు. అదే ఆరోపణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లు ఒకే తానులో ముక్కలంటూ టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దాడి చేస్తారు. ఏది సత్యమో, ఏది అసత్యమో చెప్పడం కష్టం. స్పష్టాస్పష్ట దృశ్యం, దబాయింపు రాజకీయం, విశృంఖల ప్రచారం సత్యాన్ని మబ్బులాగా కమ్మేసినప్పుడు సత్య దర్శనం అసాధ్యం. రెండు మాసాల తర్వాత కానీ (డిసెంబర్ 11న) జన హృదయం బోధపడదు. కె. రామచంద్రమూర్తి -
వ్రతం చెడినా ఫలం దక్కేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది: 1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్‌తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్‌తో అసద్ అనుబంధం బలమైనది. ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కాబోతున్నారని అసద్ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్‌కి రానే వచ్చారు. టీఆర్ఎస్లోకీ, కాంగ్రెస్‌లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్‌లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి ‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్‌ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం. అస్థిరతకు బాటలు దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. కాంగ్రెస్‌వారిని కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్‌ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘జన్‌మోర్చా’ను నెలకొల్పారు. దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. నేషనల్‌ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్‌ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది. బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్‌లోని సమస్తిపూర్ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్‌ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్‌కు దక్కింది. విపి సింగ్ హయాంలో కశ్మీర్ లోయనుంచి 90 వేలమంది పండిట్లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్ఫ్రంట్కు కన్వీనర్‌గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్‌ఫ్రంట్ కన్వీ నర్గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్‌సింగ్ సూర్జీత్ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్‌ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది. హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు. పొత్తుల వీరుడు దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ఫ్రంట్ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్‌సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్ఎస్ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్‌ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు. ఓట్లు బదిలీ అయ్యేనా? మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్ఎస్ని ఓడించవచ్చుననే కాంగ్రెస్ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్‌ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్ ఒంటరిగా టీఆర్ఎస్తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
నిజాయితీ నిలుస్తుంది, గెలుస్తుంది
ఈ దేశానికి ఇంతవరకూ14 మంది ప్రధానులుగా పని చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమం త్రులు. నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే ఆయన తనయ ఇందిరాగాంధీని బడుగుజనం ఆరాధించ డానికి కారణం ఏమిటి? నందమూరి తారకరామారావు సినీ నటుడుగా సుప్రసిద్ధుడు. తెలుగుదేశం పార్టీని స్థాపిం చిన తొమ్మిది మాసాలకే ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్‌ని చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని జయప్రదంగా నిర్మించారు. అసాధారణమైన నాయకుడు కనుక ఎన్టీఆర్‌ని ఇప్పటికీ అభిమానిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. అదే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డితో ఆవేశపూరితమైన అనుబంధం కలిగి నవారు రెండు తెలుగు రాష్ట్రాలలో లెక్కకు మించి ఉంటారు. ఎందుకని? ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని అర్థం చేసుకోవా లన్న అభిలాషతో రూపొందించిన ‘రచ్చబండ’ కార్యక్ర మాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు వైఎస్ హెలి కాప్టర్లో బయలుదేరారు. అకస్మాత్తుగా వాతావరణం క్షీణించింది. హెలికాప్టర్ గల్లంతైనట్టు సమాచారం అంద డంతో పోలీసులూ, అధికార యంత్రాంగంతో పాటు మీడియా సంస్థలకు చెందిన విలేఖరులు కూడా రంగంలో దిగారు. సుదీర్ఘ అన్వేషణ అనంతరంS నల్లమల అడవిలో పావురాల గుట్టపైన హెలికాప్టర్ కూలిపోయినట్టూ, వైఎస్ సహా ఐదుగురు ప్రయాణికులూ దుర్మరణం పాలైనట్టూ విషాదవార్త అశనిపాతంలాగా తెలుగు ప్రజల హృదయా లను తాకింది. ఈ ఘోరం జరిగి తొమ్మిదేళ్ళు గడిచినా వైఎస్ ప్రస్తావన వస్తే గుండెచెదిరి కన్నీరుమున్నీరయ్యేవారు ఇప్పటికీ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్య క్రమం జరిపించాలని సంకల్పించిన అనుపల్లి గ్రామానికి వైఎస్ వర్థంతి సందర్భంగా సాక్షి టీవీ చానల్ సిబ్బంది వెళ్ళారు. నాడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవలసిన వారిని ఇప్పుడు సమావేశపరచి ఆ రోజు వైఎస్ రాకకోసం ఎట్లా ఎదురు చూశారో, ఏయే అంశాలు ఆయన దృష్టికి తేవాలని అనుకున్నారో, మరణవార్త విని ఎట్లా దిగ్భ్రాంతికి గురైనారో చెప్పవలసిందిగా కోరారు. వారిలో కంటతడి పెట్టనివారు లేరు. ఒక ఇందిరాగాంధీకీ, ఒక వైఎస్కీ విశేష మైన ప్రజాదరణ ఎందుకు ఉన్నది? వారు మరణించిన తీరు వల్లనా? బతికుండగా వారు నడిచిన బాట వల్లనా? పేదల జీవితాలలో వెలుగు నింపాలనే ఆకాంక్షతో సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకున్నవారినీ, వారిలో ఆత్మవి శ్వాసం పెంచినవారినీ, వారి సంక్షేమంకోసం నిబద్ధతో కృషి చేసేవారినీ ప్రజలు విస్మరించరు. నిత్యం స్మరిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడూ ఒక ప్రత్యేక వాతావర ణంలో పనిచేస్తాడు. అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు రాజకీయవాది నిర్ణయాలపైన ప్రభావం వేస్తాయి. ప్రతి ప్రధానమంత్రికీ, ముఖ్యమంత్రికీ కొన్ని పరి మితులు ఉంటాయి. అన్ని అవరోధాలనూ అధిగమించి పేదలకు ఉపకారం చేయడానికి ప్రయత్నించేవారే ప్రజా నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఒక కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందాలనే లక్ష్యంలో వైఎస్ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు. నిరుపేదకు సైతం మెరుగైన వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’ పథకా నికీ, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఫీజు చెల్లించే (ఫీ రీయెంబర్స్‌మెంట్) బాధ్యతను ప్రభుత్వం స్వీకరించే పథకానికీ శ్రీకారం చుట్టారు. ఒక వైపు జలయజ్ఞం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే, వ్యవసాయ ఉత్ప త్తులకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సొమ్మును జోడించి రైతులను ఆదుకునే ప్రయ త్నం చేశారు. సకల సంక్షేమ కార్యక్రమాలూ ప్రాంతాలకూ, రాజకీయాలకూ, మతాలకూ, కులాలకూ అతీతంగా ప్రజ లందరికీ లబ్ధి కలిగించాలనే దీక్షతో పని చేశారు. గ్యాసు బండకు సబ్సిడీ చెల్లించడంలో ఉద్దేశం కూడా దిగువ మధ్యతరగతి ప్రజలను వీలైనంత ఆదుకోవాలనే తాప త్రయంతోనే. ఆయన చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించారు. దళితులకూ, ఆదివాసీలకూ ఇందిరాగాంధీ ఆత్మవిశ్వాసం ఏ విధంగా కలిగించారో, వైఎస్ కూడా ముస్లింలలో అదే విధంగా ఆత్మవిశ్వాసం ప్రోదిచేశారు. దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ఇందిరలో ఎంత దృఢమైన సంకల్పం ఉండేదో, ఆమె ఎంత పట్టుదలగా పని చేశారో, ముస్లింల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు వైఎస్ అంతే అంకితభావంతో కృషి చేశారు. తమ సంక్షేమం కోసం ఎవరు నిజాయితీగా పని చేస్తున్నారో, ఎవరు మాటల గారడీతో కాలక్షేపం చేస్తున్నారో బడుగువర్గాలకు తెలుసు. పట్టువీడని విక్రమార్కుడు ఉదాహరణకు ముస్లిం యువతీయువకులకు విద్యాసంస్థ లలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి వైఎస్ చేసిన కృషిని గమనిస్తే ఆయనకు మైనారిటీల హృదయంలో ఎందుకు శాశ్వత స్థానం దక్కిందో అర్థం చేసుకోవచ్చు. 2004 ఎన్నికల ప్రణాళికలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, మూడు శాతం ఇస్తామని టీడీపీ వాగ్దానం చేశాయి. ఎన్నికలలో విజయం సాధించి వైఎస్ మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మూడు మాసాలైనా తిరగకుండానే ముస్లిం యువతీయువ కులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జూలై 12న జీవో నంబర్ 33 జారీ చేశారు. రిజర్వేషన్లు వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన ముస్లింలకు విద్యాసంస్థలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలనే ప్రతిపాదన 1971 నుంచి ఉన్నది. దానికి కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్. ఈ జీవోను తయారు చేసే ముందు సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్‌ని సంప్రదించారు. మండల్ కమిషన్ నివేదిక అమలు విషయంలో అప్పటి ప్రధాని వీపీ సింగ్‌కు సల హాలు ఇచ్చిన కృష్ణన్ ముస్లింల కోటా విషయంలో ఆం్ర«దప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. అయితే, ఈ జీవో మైనారిటీల కమిషన్ సిఫార్సుల ఆధా రంగా జారీ చేశారు. 1991 జనాభా లెక్కల ప్రకారం అవి భక్త ఆంధ్రప్రదేశ్‌లో నివసించే 64 లక్షల మంది ముస్లింలలో (మొత్తం జనాభాలో 8.5 శాతం) అక్షరాస్యులు 18 శాతం మాత్రమే. ముస్లిం మహిళలలో అక్షరాస్యుల శాతం కేవలం నాలుగు. ముస్లింలలో 65 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. దుర్భర దారిద్య్రంలో, నిరక్ష రాస్యతలో మగ్గుతున్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించ డాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఇది రాజ్యాంగబద్ధం కాదని బీజేపీ వాదించింది. మత ప్రాతిపదికపైన రిజ ర్వేషన్లను రాజ్యాంగం అనుమతించని మాట వాస్తవమే. బీసీ కమిషన్ సిఫార్సులు కాకుండా మైనారిటీ కమిషన్ నివేదికపైన వైఎస్ ప్రభుత్వం ఎందుకు ఆధారపడింది? 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పుట్టస్వామి బీసీ కమిషన్ చాలా విడతల గడువు పెంచినా ఏ నివేదికా సమర్పించకుండానే 2003లో పదవీకాలం ముగించింది. 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు ఆ కమిషన్ నుంచి నివేదిక రాబట్టే ప్రయత్నం చేయలేదు. వైఎస్ అభిలషించినట్టు ముస్లింలకు ఐదు శాతం రిజర్వే షన్లు మంజూరు చేసినట్లయితే మొత్తం రిజర్వేషన్ల శాతం 51కి పెరుగుతుంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది. రాజ్యాంగబద్ధం కాదనే కారణంపైనే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం 33వ నంబరు జీవోను కొట్టివేసింది. బీసీ కమిషన్ సిఫార్సులు పాటిం చాలని చెబుతూ ఒక బీసీ కమిషన్‌ను వెంటనే నియమిం చవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఆరు మాసాలలో నివేదిక సమర్పించాలని ఏర్పాటు కాబోయే బీసీ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కోరింది. రిజర్వేషన్ల అమలును నిలిపి వేయనవసరం లేదనీ, హైకోర్టు నిర్ణయంపైన సుప్రీంకో ర్టుకు అప్పీలు చేసుకోవచ్చుననీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా నికి వెసులుబాటు కల్పించింది. మరో బీసీ కమిషన్ కొన్ని వారాలలోనే జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన బీసీ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటూ సుగ్రీ వాజ్ఞ (ఆర్డినెన్స్) జారీ చేసింది. ఆ తర్వాత సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకోసం రిజర్వేషన్లు కల్పిం చాలని కోరే బిల్లును 2007లో శాసనసభ ఆమోదించి చట్టం చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు ఆర్డినెన్స్‌పైనా, చట్టంపైనా హైకోర్టులో పిటిషన్లు వేశారు. బీసీ కమిషన్ అనుసరించిన విధానం లోపభూయిష్టమని నిర్ణయిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిలాల్ న జ్కీ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 5–2 ఆధిక్యంతో ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ముస్లింల రిజర్వేషన్ల విషయంలో వెనకంజ వేసే ప్రసక్తి లేదనీ, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటా మనీ వైఎస్ ప్రకటిస్తూ వచ్చారు. పట్టువిడవకుండా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వచ్చారు. ఇతర వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల మాదిరే ముస్లిం విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఫీజు చెల్లిస్తూ వచ్చింది. ఈ కారణంగా పది లక్షల మందికిపైగా ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్య అభ్యసించగలిగారని, వేలమంది ఉద్యోగాలు పొందగలిగా రనీ వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహమ్మద్ అలీ షబ్బీర్ ఇటీవల అన్నారు. వైఎస్ దుర్మరణం అనం తరం సుప్రీంకోర్టు 2010 మార్చి 25న నాలుగు శాతం రిజర్వేషన్లను అనుమతిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసినట్టు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోలేదు వైఎస్ సర్కార్. రిజర్వేషన్లు మాత్రమే కాకుండా మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా చిన్న వృత్తి పనులకు సహాయం చేయడం, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి రాబ ట్టుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం, మసీ దులకు మరమ్మతులు చేయించడం, షాదీ ఖానాలు నిర్మిం చడం వంటి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ ప్రభుత్వం అమలు చేసింది. నారా హమారా, పరాయా? ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలలో ముఖ్యమైన వాటిని నాలుగున్నర సంవత్సరాలు విస్మరించి ఎన్నికలు సమీపించిన తరుణంలో ‘నారా హమారా’ అంటూ బహిరంగ సభలు పెడితే ముస్లింలు విశ్వసిస్తారనుకోవడం పొరపాటు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం లేని మంత్రి వర్గం లేదు. ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం లేడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీ పెద్దలను మెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క సీటు ముస్లింకి ఇచ్చారు. అది కూడా చిత్తూరు జిల్లా పీలేరులో మిత్రుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, జైసమై క్యాంధ్ర పార్టీ అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి విజయానికి దోహదం చేయడం కోసం ఒక బలహీనమైన ముస్లిం అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్‌ని నిలబెట్టారు. అక్కడ వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మంచి మెజా రిటీతో గెలుపొందారు. ఇక్బాల్ మూడో స్థానంలో నిలి చారు. నంద్యాల ఉప ఎన్నికలలో గెలుపుకోసం అనివార్య మైన పరిస్థితులలో ఫారూక్ని శాసనమండలి అధ్యక్షుడిగా నియమించారు. అప్పటికే బీజీపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకొని ఉంటారు. ఇప్పుడు ముస్లిం మంత్రిని నియమిస్తానని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ముస్లింల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకరించలేకపోయింది. ముస్లిం బాలలకోసం సుమారు రెండు వందల గురుకుల పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దళి తులకూ, ఆదివాసీలకూ అందే సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకు వర్తింపజేస్తున్నది. ముస్లింల సంక్షేమం విష యంలో వైఎస్ స్ఫూర్తి తెలంగాణలో కొనసాగుతున్నది కానీ ఆంధ్రప్రదేశ్‌లో కొండెక్కింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే మొన్న గుంటూరు సభలో ప్రశ్నించడానికి ప్రయత్నించిన నంద్యాల యువకుల పైన ఆగ్రహం ప్రదర్శించారు. కేసులు బనాయించారు. ఇప్పుడు ఎన్ని కబుర్లు ఎంత గట్టిగా చెప్పినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. వారికి వాస్తవాలు తెలుసు. కె. రామచంద్రమూర్తి -
పాత్రికేయ శిఖరం కులదీప్ నయ్యర్
‘తన ఆత్మను తనదిగా చెప్పుకోగలిగినవాడే (One who can call his soul his own)సిసలైన జర్న లిస్టు’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఎం చలపతిరావు అన్న మాట గురువారం తెల్లవారుజామున కన్ను మూసిన జర్నలిస్టు దిగ్గజం కులదీప్ నయ్యర్‌కు నూటికి నూరు పాళ్ళూ వర్తిస్తుంది. కులదీప్ నయ్యర్ బహుముఖీనుడు. ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో చేయి తిరిగిన పత్రికారచయిత. సంపాదకుడు. కాలమిస్టు. రాజ్యసభ సభ్యుడు. జనతా ప్రభుత్వ హయాంలో లండన్‌లో భారత హైకమిషనర్‌గా పని చేసిన దౌత్య వేత్త. శాంతికాముకుడు. నికార్సయిన లౌకికవాది. నిజాయితీకీ, నిర్భీతికీ మారు పేరు. సరిగ్గా 45 సంవ త్సరాల కిందట నేను జర్నలిజం విద్యార్థిగా ఉండగా తోటి విద్యార్థులతోపాటు ఢిల్లీ, ముంబయ్, పుణే నగ రాలు సందర్శించినప్పుడు చాలామంది జర్నలిస్టు ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించింది. వారిలో ముఖ్యులు కుష్వంత్‌సింగ్, కులదీప్ నయ్యర్, రూసీ కరంజియా (బ్లిట్జ్). అప్పుడు కుల దీప్ నయ్యర్ ‘స్టేట్స్‌మన్’కి ఢిల్లీలో రెసిడెంట్ ఎడి టర్గా ఉండే వారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో ఆయనను కలుసుకున్నాను. మాట్లాడాను. హైదరా బాద్‌కి చాలా సార్లు వచ్చారు. ఎప్పుడు కలుసుకున్నా జాతీయ రాజకీయ చిత్రంపై భాష్యం చెబుతూ ఒక కొత్త కోణం ఆవిష్కరించేవారు. సకారాత్మకంగా ఆలో చించడం, తప్పు చేస్తే నిక్కచ్చిగా విమర్శించేవారు. కులదీప్ నయ్యర్కూ, కుష్వంత్సింగ్కూ చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ పాకిస్తాన్లో పుట్టారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. కుష్వంత్ సింగ్ లాహోర్‌లో కులదీప్ నయ్యర్కి కొంతకాలం గురువుగా ఉన్నారు. దేశ విభజన తర్వాత రక్తపుటేరులు పారుతున్న బాటలో భారత్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక పుస్తకం రాశారు. తర్వాత పాకి స్తాన్ నుంచి ఇండి యాకు తాము చేసిన ప్రయాణాన్ని ఇద్దరూ గ్రంథస్థం చేశారు. తన అనుభవాలను కుష్వంత్‌సింగ్ ‘ట్రైన్ టు పాకిస్తాన్’లో రాస్తే, కులదీప్ తన ఆత్మకథ ‘బియాండ్ ద లైన్స్’లో వివరిం చారు. కులదీప్ ‘ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’కు సంపాదకుడిగా పనిచేస్తే కుష్వంత్ ‘హిందుస్తాన్ టైమ్స్’కి సంపాదకత్వం వహించారు. ఇద్దరూ విలువల విషయంలో రాజీపడేవారు కాదు. ఎవరినైనా తెగడాలంటే సంకోచించేవారు కాదు. ఇద్దరి కాలమ్స్‌కీ గొప్ప పాఠకాదరణ ఉండేది. కులదీప్ ‘బిట్వీన్ ద లైన్స్’కీ, కుష్వంత్ ‘విత్ మేలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్’కీ చాలా దేశాలలో పాఠకులు ఉండే వారు. కుష్వంత్ 99వ ఏట కన్ను మూస్తే, కులదీప్ 95వ ఏట తనువు చాలించారు. ఇద్దరూ ఊపిరి ఉన్నంత వరకూ కలం దించలేదు. ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడు రాజకీయ నేతలతో పాటు కులదీప్ నయ్యర్‌ను కూడా ‘మీసా’ (మెయిన్టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ద జడ్జి మెంట్’ పేరుతో పుస్తకం రాశారు. తలుపు తాళం చెవి పెట్టే రంధ్రంలో నుంచి చూస్తూ (కీహోల్ జర్నలిజం) లోపటి విషయాలను వర్ణించినట్టు నాటకీయంగా రాసేవారు. కుట్ర సిద్ధాంతం ప్రతిపాదించేవారు. బాబరీ మసీదు విధ్వంసం విషయంలో పీవీ నర సింహారావుపైన కూడా మధులిమాయే చెప్పారంటూ అసత్యాలు రాశారు. వాటిని వాస్తవాలు అని విశ్వ సించే రాసి ఉంటారని అనుకోవాలి. 1977 ఎన్నికల అనంతరం జనతా పార్టీ అధికారంలోకి రాగానే కుల దీప్ నయ్యర్‌ను బ్రిటన్‌కు హైకమిషనర్‌గా పంపిం చారు. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో యుద్ధవార్తలు రాశారు. అంతకు ముందు దేశీయాంగమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌కూ, ప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రికీ ప్రెస్ సెక్ర టరీగా ఉండేవారు. తాష్కెంట్లో లాల్బహద్దూర్ శాస్త్రి ఆకస్మిక మరణ వార్తను ప్రపంచానికి తెలి యజేసిన మొదటి వ్యక్తి నయ్యర్. యుఎన్‌ఐలో కొంతకాలం పని చేశారు. అనేక గ్రంథాలు రచిం చారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు నెలకొనాలని తపనపడేవారు. పౌర హక్కుల ఉద్య మాలను సమర్థించేవారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రెస్ సెన్సార్షిప్ను వ్యతిరేకించినట్టే వర్తమానంలో పత్రికలూ, టీవీ చానళ్ళూ ప్రభుత్వాలకు సాగిలపడ టాన్నీ అంతే తీవ్రంగా అధిక్షేపించారు. మీడియా స్వయంగా హిందూభావజాలాన్ని (సాఫ్ట్హిందుత్వ) ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి రాజ్యాంగేతర చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉండదంటూ కరకు గానే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా అంకితమైన జర్నలిస్టు, గ్రంథకర్త, పోరాట యోధుడు కులదీప్ నయ్యర్. పాతతరం పాత్రికేయ శిఖరాలలో అగ్రగణ్యుడు కులదీప్ నయ్యర్. ఆయన మరణం పత్రికా లోకానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ తీరని లోటు. ఆయనకు ఇదే శ్రద్ధాంజలి. కె. రామచంద్రమూర్తి -
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్‌గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్‌గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్‌టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్‌స్టార్‌గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్‌గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్‌కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్‌లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్‌రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్‌ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్‌కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్‌బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్‌గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్‌కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్‌లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్‌లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్‌తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్‌కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్‌కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్‌బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్‌రెడ్డి (అర్జున్‌రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్‌బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్‌బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
ద్రవిడ ఉద్యమ దిగ్గజం
భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన అసాధారణ వ్యక్తి ఇటీవల అస్తమించిన కళైంజ్ఞార్ కరుణానిధి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక మునుపే 1910 దశకంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతర ప్రముఖులు స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ అసోసియేషన్ లక్ష్యాలలో ప్రధానమైనవి బ్రాహ్మణభావజాల ఆధిక్యాన్ని అంతం చేయడం, సమసమాజం నిర్మించడం, సామాజికన్యాయం సాధించడం. ఆ అసోసియేషన్ జస్టిస్ పార్టీగా ప్రాచుర్యం పొందింది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్య్ర సమరం చేయడం అసాధ్యమనే గాంధీజీ వైఖరితో తీవ్రంగా విభేదించిన రామస్వామినాయకర్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి జస్టిస్పార్టీలో చేరారు. ఆయన చేరికతో నాయకత్వంలో సమూలమైన మార్పు వచ్చింది. జస్టిస్ పార్టీ ఎజెండా కంటే భిన్నమైన విస్తృతమైన కార్యాచరణ అవసరమని భావించిన పెరియార్ (పెద్దాయన) రామస్వామి నాయకర్ ఆ పార్టీని రద్దు చేసి ‘ద్రవిడ కళగం’(ద్రవిడ సమాఖ్య)–డికె– నెలకొల్పారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకుడూ, అద్భుతమైన వక్త సీఎన్ అన్నాదురై పెరియార్‌కు ప్రథమ అనుచరుడిగా కుదురుకున్నారు. డికె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీలేని హేతువాదం ప్రాతిపదికగా ఉద్యమం విస్తృతంగా నిర్వహించడం సాధ్యం కాదని అయిదేళ్ళు తిరగకుండానే అన్నాదురై గ్రహించారు. హేతువాదం, సామాజికన్యాయం, నిరీశ్వరవాదం ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని పెరియార్ అభిప్రాయం. రాజకీయాల పొడ ఆయనకు గిట్టదు. రాజకీయ పార్టీ పెట్టి, గెలిచి అధికారంలోకి వచ్చి పెరియార్ చెబుతున్న లక్ష్యాలనే సాధించాలన్నది అన్నాదురై వాదన. డిఎంకె ఆవిర్భావం అన్నాదురై నాయకత్వంలో చెన్నైలో 1948 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఆవిర్భవించింది. అప్పటికే కరుణానిధికి 25 ఏళ్ళు. జస్టిస్ పార్టీ కార్యక్రమాలలో, హిందీ వ్యతిరేక ఉద్యమంలో 14వ ఏట నుంచే చురుకుగా పాల్గొన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చేశారు. తిరుచిరాపల్లిలో దాల్మియాపురం పేరును తిరిగి కళ్ళెగుడిగా మార్చే ఉద్యమంలో సాహసోపేతంగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభావంతమైన వక్తగా, సినిమా స్క్రిప్టు ద్వారా ద్రవిడ ఉద్యమ భావజాల వ్యాప్తికి అసాధారణ స్థాయిలో దోహదం చేసే రచయితగా, కార్యకర్తలను సమీకరించి ముందుకు నడిపించే సేనానిగా బహుముఖంగా రాణిస్తూ తమిళుల జీవితంతో పెనవేసుకుపోయారు. తమిళ సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివిధ రూపాలలో వినియోగించుకొని ‘ద్రవిడనాడు’ ఉద్యమస్ఫూర్తిని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర కరుణానిధిదే. సమాఖ్యస్ఫూర్తి, రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారం, సకలభాషల సమానత్వం, లౌకికవాదం డిఎంకె భావజాలంలో ప్రధానమైనవి. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కరుణానిధి పిన్నవయస్సులోనే స్వదస్తూరితో రాసిన వార్తాపత్రికను తయారు చేసి స్నేహితుల ద్వారా పంపిణీ చేయించేవారు. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’ (ఢంకా) కి అదే బీజం. ‘మురసొలి’లో కరుణానిధి పార్టీ కార్యకర్తలకోసం రాసిన లేఖలు వారికి పార్టీ విధానాలనూ, కార్యకారణ సంబంధాలనూ విశదీకరించడానికి ఉద్దేశించినవి. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సంభాషణకు ఆయన ‘మురసొలి’ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్ సైతం ‘కుడియారసు’ (రిపబ్లిక్–గణతంత్ర వ్యవస్థ) అనే పత్రిక ద్వారా తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకునేవారు. కరుణానిధి ప్రతిభావంతుడైన వక్త. ఛలోక్తులతో, వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉడికిస్తూ, సభను రక్తికట్టించే శక్తి అయన సొంతం. ఆయన ప్రసంగాల కేసెట్లు తమిళ సినిమా పాటల కేసెట్లకంటే బాగా అమ్ముడుపోయేవి. రాజకీయాలలో ఎంత సామర్థ్యం ఉన్నదో సాహిత్యంలోనూ అంతటి అధికారం ఉన్నది. సంగీతం అంటే ప్రాణం. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన రాజకీయ నాయకులు దేశంలోనే అరుదు. పురాణాలలోని, ఇతిహాసాలలోని పాత్రల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడం, పోస్టర్లూ, బ్యానర్లూ, కట్అవుట్లూ వంటి హంగులు ఉపయోగించుకోవడం భారత రాజకీయాలకు తమిళ రాజకీయం అందించిన కొత్తవిద్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు పసుపు రంగుతోసహా డిఎంకె ప్రచార ప్రక్రియలన్నిటినీ అనుకరించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అనేక రాష్ట్రాలకూ కటౌట్ల సంస్కృతి పాకింది. టీవీ చానళ్ళూ, వీడియో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం విస్తృతి, వైవిధ్యం అనూహ్యంగా పెరిగిపోయాయి. 2014 ఎన్నికలలో మోదీ విశ్వరూపం ప్రదర్శించడానికి వీడియో టెక్నాలజీ దోహదం చేసింది. కరుణానిధి ప్రస్థానం పార్టీలో అత్యంత ప్రభావశీలిగా ఎదిగిన కరుణానిధి 1957లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన సమయంలో కూడా డిఎంకె లక్ష్యాలలో స్వతంత్ర ద్రవిడనాడు ప్రధానమైనది. ఈ వేర్పాటువాదం డిఎంకె ఎజెండాలో చాలాకాలం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత జాతీయ రాజకీయాలతో మమేకమై, సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములైన తర్వాత వేర్పాటువాదం పూర్వపక్షమైపోయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన డిఎంకె అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నాదురై మంత్రివర్గంలో పబ్లిక్‌వర్క్స్ మంత్రి కరుణానిధి. రెండేళ్ళ తర్వాత కేన్సర్ కారణంగా అన్నాదురై మరణించారు. వారసత్వ పోరులో అప్పటి ఆప్తమిత్రుడు ఎంజి రామచంద్రన్ సహకారంతో నెడుంజళియన్ వంటి సీనియర్లను తోసిరాజని ముఖ్యమంత్రి పదవిని కరుణానిధి కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మురికివాడల నిర్మూలన, మనుషులు లాగే రిక్షాల నిషేధం, విద్యుదీకరణ పనులు ముమ్మరంగా చేశారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూపాయికి కిలో చొప్పున పాతిక కిలోలు బియ్యం ఇవ్వడం, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను నెలకొల్పడం, రేషన్ షాపులను నడపడం, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం, పంట రుణాలు మంజూరు చేయడం, పంట పండకపోతే రుణాలు మాఫ్ చేయడం వంటి అనేక సంక్షేమకార్యక్రమాలు కరుణానిధి, ఎంజీఆర్‌ల హయాంలోనే ఆరంభమైనాయి. అమ్మ క్యాంటీన్ వంటివి జయలలిత సృష్టి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కడచిన మూడు దశాబ్దాలలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రఘురామరాజన్ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా 2013లో చేసిన అధ్యయనంలో దేశంలోని ప్రవృద్ధ రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో (గుజరాత్, మహారాష్ట్ర తర్వాత) నిలిచింది. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కరుణానిధి పెద్దపీట వేశారు. తిరువళ్ళువార్ పేరిట వళ్ళువార్కొట్టాం నిర్మించారు. మూడు సాగరాలు– బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం ఏకమయ్యేచోట కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తు తిరువళ్ళువార్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఎంజీఆర్‌తో విభేదాలు కరుణానిధి అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ఆయనకూ, ఎంజీఆర్కీ మధ్య దూరం పెరిగింది. అధికారం కరుణానిధి తలకెక్కిందని ఎంజీఆర్ భావించారు. ఎంజీఆర్‌లో ఈర్షా్యద్వేషాలు పెరిగాయని కరుణానిధి తలపోశారు. సినిమాలలో ఎంజిఆర్‌కి పోటీగా పెద్దకొడుకు ముత్తును కరుణానిధి ప్రవేశపెట్టారు. కరుణానిధిపై ఎంజిఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. 1972లో డిఎంకె చీలిపోయింది. ఎంజీఆర్ ఏఐఏడిఎంకె స్థాపించి 1977 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తన ఆరోపణల ఆధారంగా కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇందిరాగాంధీనీ, ఆమె ఉపకారాన్నీ విస్మరించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను ఎంజిఆర్ తిరస్కరించారు. 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికలలోనూ, 1984లోనూ ఎంజీఆర్ విజయం సాధించడంతో కరుణానిధి పుష్కరకాలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉండవలసి వచ్చింది. 1989లో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్‌ను ప్రధాని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యధికశాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళ టైగర్లను సమర్థిస్తున్నారనే ఆరోపణపైన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ రద్దు చేశారు. 2006లో చివరిసారిగా, ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మూడోసారి స్వీకరించారు. 2016లోనూ ఆమే గెలిచారు. ద్రవిడ పార్టీలు జాతీయ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి. 1967–69లో ఇందిరాగాంధీకీ, నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, అతుల్యఘోష్ ఇత్యాది సీనియర్ నాయకులకూ మధ్య విభేదాలు చెలరేగి చీలిక దిశగా కాంగ్రెస్ ప్రయాణం సాగినప్పుడు కరుణానిధి ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో వి.వి. గిరిని గెలిపించడానికీ, నీలం సంజీవరెడ్డిని ఓడించడానికీ కరుణానిధి చట్టసభల సభ్యులను సమీకరించారు. 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. జార్జి ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఇందిర విరోధులకు తమిళనాడులో ఆశ్రయం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన ఇందిరాగాంధీ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలో స్టాలిన్‌ను హింసించినట్టు వార్తలు వచ్చాయి. కరుణానిధిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని 1976లో బర్తరఫ్ చేశారు. విప్లవ సంస్కరణల వెనకంజ ఈ దశలో ద్రవిడ భావజాలం పలచపడింది. అవినీతి, బంధుప్రీతి పెరిగాయి. వ్యక్తి ఆరాధన పతాకస్థాయికి చేరింది. ఈ విషయాలలో ద్రవిడ పార్టీలకీ, దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకీ పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనే డిఎంకె సైతం కేవలం కరుణానిధి కుటుంబ సభ్యుల చేతిలో ఉంది. జయలలితకు కుటుంబం లేదు కనుక ఆమె మరణించగానే ఏఐఏడిఎంకె చీలిపోయింది. డిఎంకె స్టాలిన్ సారధ్యంలో పదిలంగా ఉంది. ద్రవిడ భావజాలానికి విరుద్ధమైన బీజేపీ, కాంగ్రెస్‌లతో నిస్సంకోచంగా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ, యూపీఏ కూటములలో డిఎంకె, ఏఐఏడిఎంకెలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల అక్రమాలలో తమిళనాడేమీ తక్కువ తినలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ముందు కలర్ టీవీ సెట్లు ఉచితంగా ఓటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం కరుణానిధి హయాంలోనే అమలు జరిగింది. జయలలిత వారసుడుగా చెప్పుకుంటున్న దినకరన్ ఆర్కె పురం ఉపఎన్నికలో ఖర్చు చేసిన మొత్తం నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఖర్చుకు సమానం. ద్రవిడ పార్టీల పాలన యాభై సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న తమిళనాడు ఇతర రాష్ట్రాలతో సమానంగా అన్ని రకాలా దిగజారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు రాజకీయంగా ఎంతగా కీచులాడుకున్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే విధానం అమలు చేసేవారు. ముగ్గురూ కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన నిధులనూ, పరిశ్రమలనూ, ఇతర వనరులనూ దబాయించో, బతిమిలాడో సంపాదించేవారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడేవారు కాదు. ద్రవిడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీలో అధినేతకు పడిపడి పాదాభివందనం చేసే సంస్కృతి స్థిరపడింది. కుల నిర్మూలన కోసం పోరాడాలనే సంకల్పం సడలింది. తమిళనాడులో దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా లేదు. పెరియార్ ఆశించిన విప్లవాత్మక సంస్కరణలు ఆయన వారసుల అధికార రాజకీయ రంధిలో గల్లంతైనాయి. ఇందుకు కరుణానిధి మాత్రమే బాధ్యులు కారు. ఎంజీఆర్, జయలలిత కూడా ద్రవిడ ఉద్యమ స్ఫూర్తికి యధాశక్తి విఘాతం కలిగించారు. కె. రామచంద్రమూర్తి -
స్వేచ్ఛగా మాట్లాడటం నేడు ఒక పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : నేడు సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడటం ఒక పరీక్ష లాంటిదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం ఇక్కడి రవీంద్రభారతిలో తెలంగాణ ఎడ్యుకేషనల్, సోషల్, కల్చరల్ లిటరరీ సొసైటీ ఆధ్వర్యంలో సెక్టోరియల్ సెమినార్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ వాస్తవాలను సేకరించడం, వ్యాఖ్యలను ప్రచురించడానికే పరిమిత మైన పత్రికలు ప్రభుత్వాల నిఘాలో ఉన్న ట్లు తెలుస్తోందన్నారు. పత్రికలకు గతంలో ఉన్న స్వేచ్ఛ నేడు లేదన్న విషయం ప్రజలకూ తెలుసన్నారు. గతంలో ఇంతకంటే మంచిగా పరిశోధనాత్మక కథనాలు వచ్చేవన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన మీటింగ్ వార్తను పత్రికల్లో సింగిల్ కాలంలోనూ, మరుసటిరోజు మంత్రి హరీశ్‌రావు చేసిన ఖండనలను పతాక శీర్షికలోన్లూ వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరంపై చర్చలేకపోవడం ఆశ్చర్యకరం... రూ.84 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని రామచంద్రమూర్తి అన్నారు. ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సీఎం సమీక్ష సమావేశాలు, పర్యటనల సమాచారాన్ని సీఎం కార్యాలయంలో పని చేసోన్న బృందం పంపించే సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని, సొంతంగా ఎటువంటి అదనపు విషయాలను ప్రచురించవద్దనే సందేశాన్ని సైతం పంపడం బాధాకరమన్నారు. నేడు మీడియా సీఎం అధీనంలోకి వెళ్లడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఇటీవల పని ఒత్తిడితో 250 మంది జర్నలిస్టులు చనిపోయారని, తెలంగాణలో విలేకరుల పరిస్థితి అనే అంశంపై నివేదిక తయారు చేసి త్వరలో దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల్లో వచ్చిన వార్తల కంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకే స్పందన ఎక్కువగా ఉందన్నారు. ఆయా అంశాలపై సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఉ మా సుధీర్, పాశం యాదగిరి, కారంచేడు గోపాలం, సుమనాస్పతిరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండల్రావు, కన్వీనర్ సీహెచ్ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనాథ–సినారె–భరద్వాజ తెలుగు సాహిత్యంలో శిఖర సమానులు
తెనాలి: జ్ఞానపీఠ అవార్డులు స్వీకరించిన ముగ్గురు తెలుగు ప్రముఖులు ఆధునిక సాహిత్యంలో శిఖర సమానులని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. గడిచిన అయిదారు దశాబ్దాల్లో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం కేవలం ముగ్గురినే వరించడం ఆశ్చర్యకరమన్నారు. తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు ఇతర భాషల్లోకి అనువదించి, ఆ రచనలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు విశ్వనాథ–సినారె–భరద్వాజ సాహితీ వాహిని పేరిట శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజకీయంగా చొరవ, ప్రోత్సాహం ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటే గానీ సాహిత్యంలో అవార్డులు రావని అభిప్రాయపడ్డారు. బెజవాడ గోపాలరెడ్డి సహకారంతో విశ్వనాథ సత్యనారాయణకు, పీవీ నరసింహారావు ప్రోత్సాహంతో సి.నారాయణరెడ్డికి, చిన్ననాటి తమిళ స్నేహితుడు పట్టుబట్టడం వల్లే రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ వచ్చిందని చెప్పుకుంటారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాహితీవేత్త ఆరుద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోనే ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. విశ్వనాథ వంటి కవిలేరు.. ‘విశ్వనాథ సాహిత్య ప్రాభవం’పై ప్రముఖ సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, అజోవిభోకందాళం ఫౌండేషన్ (అమెరికా) వ్యవస్థాపకుడు డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ ఆనాడే సమకాలీయతను చొప్పించారని చెప్పారు. వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విశ్వనాథ వంటి కవి లేరని అభిప్రాయపడ్డారు. ‘డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య వైభవం’పై సాహితీ ప్రముఖులు పత్తిపాక మోహన్, ఎన్ఆర్ తపస్వి ప్రసంగించారు. తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారని అన్నారు. ‘భరద్వాజ సాహిత్య మార్దవం’పై ప్రముఖ రచయితలు జీఎస్ నాగేశ్వరరావు, రెంటాల జయదేవ మాట్లాడారు. భరద్వాజ రచనల్లో ‘జీవన సమరం’ గొప్పదన్నారు. మానవతావాదిగా కొనసాగిన రచయితగా భరద్వాజ చిరస్మరణీయుడన్నారు. అనంతరం సంజీవదేవ్ రచించిన ‘జన్ బౌద్ధం’, ఎన్ఆర్ తపస్వి ఇంగ్లిష్ అనువాదంతో సహా ద్విభాషా పుస్తకాన్ని రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఆవిష్కరించారు. మరో రచయిత శ్రీరమణకు ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు. సదస్సులో సాహితీవేత్త వెనిగళ్ల వెంకటరత్నం, మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనీకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. చిలువూరు సురేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఇప్పుడు వీస్తున్న గాలి
రాజకీయాలలో నాయకులు ఉంటారు. నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులను మేనేజర్లు అంటారు. అంతకంటే పెద్ద స్థాయి ఊహించుకున్నవారు సీఈవో అని కూడా తమను తాము అభివర్ణించుకుంటారు. నాయకుడికి ఆవేశం, సాహసం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ సహజ లక్షణాలై ఉంటాయి. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం, అందు కోసం అవసరమైతే నియమనిబంధనలను ఉల్లంఘించడం, నీతినియమాలను పక్కన పెట్టడం, ఏదో ఒక విధంగా కథ నడిపించడం పార్టీ మేనేజర్లు చేసే పనులు. ముందుండి పోరాడే స్వభావం లేనివారు నాయకత్వపాత్రకు సరిపోరు. ప్రజలకు కష్టంగా తోచినప్పటికీ యదార్థం చెప్పగలవారే సిసలైన నాయకులు. నిజం చెప్పకుండా దాటవేసేవారు కానీ, అసత్యం చెప్పేవారు కానీ, అమలు చేయలేని వాగ్దా నాలు చేసేవారు కానీ ప్రజలను మభ్యపెట్టే కపట నాయకులు. సహజ నాయకులు కొత్త పోకడలు పోతారు. ప్రజల తరఫున నిలబడి పోరాడతారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యా మ్నాయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎన్‌టి రామారావు నాయకుడు. పార్టీనీ, పార్టీ ప్రభుత్వాన్నీ హస్త గతం చేసుకొని వాటిని కాపాడుకుంటూ వచ్చిన చంద్ర బాబునాయుడు దక్షత కలిగిన నిర్వాహకుడు. పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకుడు. ప్రతిపక్షంలో మగ్గు తున్న పార్టీని గెలిపించేందుకు అహర్నిశలూ కృషి చేసి, ఆసేతుహిమాచల పర్యంతం పర్యటించి అద్భుతంగా ప్రచారం చేసి అఖండ విజయం సాధించిన నరేంద్రమోదీ నాయకుడు. కొత్త పంథాలో పార్టీ పెట్టి విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ నాయకుడు. కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి, అత్యంత శక్తిమంతురాలైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టి, కష్టనష్టాలు ఎదురైనా చలించకుండా యుద్ధ రంగంలో నిలబడిన జగన్మోహన్రెడ్డి నాయకుడు. అమలు సాధ్యం కాని వాగ్దానాలు అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, అమలు చేయ బోవడం లేదని తెలిసి కూడా మాట ఇవ్వడం మంచి నాయకుడి లక్షణం కాదు. ఈ విషయంలో మోదీ, చంద్ర బాబునాయుడూ ఒకటే. ఎన్నికలలో గట్టెక్కడానికి నోటికి వచ్చిన వాగ్దానాలు ఇద్దరూ చేశారు. స్విస్‌బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేయిస్తా నంటూ మోదీ వాగ్దానం చెయ్యడం వంచన. కోట్ల ఉద్యో గాలు కల్పిస్తాననడం కూడా అంతే. అమలు చేసే ఉద్దేశం కూడా లేకుండా జనాన్ని ఆకట్టుకోవడానికి కులానికో వాగ్దానం చేసి, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం శూన్యహస్తం చూపించడంలో చంద్రబాబు నేర్పరి. రైతు రుణాల మాఫీ వాగ్దానం చేస్తూ రుణాలు చెల్లించవద్దంటూ రైతులను ఉద్దేశించి ప్రకటనలు జారీ చేయడం, జాబు కావా లంటే జాబు రావాలంటూ బూటకపు వాగ్దానం చేయడం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పడం పనిగట్టుకొని మోసం చేయడమే. లోగడ ఏ ప్రధాని అభ్యర్థి కూడా మోదీలాగా అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయ లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాష్ట్ర స్థాయి నాయ కులు ఎవ్వరూ చంద్రబాబునాయుడిలాగా నెరవేర్చలేని హామీలు గుప్పించలేదు. యువకుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పారు. రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా ఆయనపైన ఎంతమంది పార్టీ నాయ కులూ, హితైషులూ ఎన్నిరకాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ సాధ్యం కాని హామీ ఇవ్వడం నీతిబాహ్యమనే ఉద్దేశంతో వాగ్దానం చేయలేదు. ఆ మాట ఇచ్చి ఉంటే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగలిగేది. కానీ హామీ అమలు చేయడం కష్టతరమై ఉండేది. హామీ ఇచ్చి గెలిచిన టీడీపీ హామీని పూర్తిగా అమలు చేయడంలో విఫల మైంది. పైగా అమలు చేశామంటూ దబాయిస్తోంది. అది వేరే విషయం. వర్తమానానికి వస్తే, వంద నియోజకవర్గాలను చుట్టి వచ్చిన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అమలు చేయడం సాధ్యమని విశ్వసిం చిన తర్వాతనే మాట ఇస్తున్నారు. జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టు కొని కాపు రిజర్వేషన్ల గురించి ప్రకటన చేయవలసిం దిగా కోరినప్పుడు కూడా జగన్ వాస్తవాలే మాట్లాడారు. తన చేతిలో ఉన్న పనైతే నిస్సంకోచంగా చేస్తానని చెబుతూ, సుప్రీంకోర్టు తీర్పు గురించి గుర్తు చేశారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కాపు సమా జానికి మేలు చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాననీ హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌కు టీడీపీ వెయ్యి కోట్ల రూపా యలు ఇస్తానని వాగ్దానం చేసి అందులో సగం కూడా ఇవ్వ లేదనీ, తాను అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు ఇస్తాననీ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం తన చేతిలో ఉన్న పని కనుక ఇస్తానంటూ వాగ్దానం చేయగలిగారు. ఓట్లు సంపాదించడమే పరమావధిగా చేసే బూటకపు వాగ్దానాలు రాజకీయ నాయకుడికి అపకీర్తి తెస్తాయి. మాట మీద నిల బడటం విశ్వసనీయత కలిగిన రాజకీయవాది లక్షణం. ఏమి కావాలో తేల్చుకోవాలి నాలుగున్నరేళ్ళ కిందటే రాజకీయాలలోకి వచ్చిన సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకుడికీ, నిర్వాహకుడికీ మధ్య గల వ్యత్యాసం గమనించి ఏమి కావాలో నిర్ణయించుకో వాలి. పవన్ మాటలలో నిలకడ కనిపించడం లేదు. కొన సాగింపు ఉండటం లేదు. ఉదాహరణకు ఉద్దానంలో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజల సమస్య తీసు కుందాం. అక్కడికి అమెరికా నుంచి ఒక ప్రొఫెసర్‌ను తీసు కొని వచ్చారు. కొన్ని ప్రకటనలు చేశారు. సమస్య పరి ష్కారం కాలేదు. ప్రత్యేకహోదాపైన ఉద్యమంలోనూ అంతే. పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానం వైఎస్ఆర్సీపీ పెడితే తాను ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్షాలతో మాట్లాడి మద్దతు కూడకడతానని అన్నారు. తీరా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు సరికదా మద్దతు మాటవరుసకు కూడా చెప్పలేదు. ఈ నెల 25వ తేదీన ప్రత్యేకహోదా కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్రబంద్‌కు పిలుపు ఇస్తే మద్దతు ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్‌సభ స్పీకర్ ఆమోదించకపోతే విసిగిపోయి, ఎన్డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి చివరి అస్త్రంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తే పలాయనం చిత్తగించారంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, మన్నన లేని కారణంగానూ, ప్రతిపక్ష సభ్యుల పట్ల పాలక పక్షం శత్రుభావంతో వ్యవహరిస్తున్న కారణంగానూ సమావే శాలను బహిష్కరిస్తే ముఖ్యమంత్రికి భయపడి పారిపోయా రంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులను నిందించడం రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. బద్ధ వైరం ఉన్న టీడీపీ కూడా చేయనట్టు జగన్‌పైన ఫ్యాక్షనిస్టు ముద్ర వేయడానికి ప్రయత్నించడం పవన్‌కల్యాణ్ మనసులో గూడుకట్టుకున్న అమిత్రభావానికి నిదర్శనం. రాజీనామాలూ, బహిష్కర ణలూ, బంద్‌లూ రాజకీయ పోరాటంలో భాగాలు. టీడీపీనీ, వైఎస్ఆర్సీపీనీ సమానంగా విమర్శిస్తే సమదూరం పాటిం చినట్టు కాదు. అధికారంలో ఉన్న పార్టీనీ, ప్రతిపక్షాన్నీ ఒకే గాట కట్టడంలో విజ్ఞత లేదు. టీడీపీని నిజంగా ఎండగట్టా లనే ఉద్దేశం పవన్ కల్యాణ్‌కి ఉంటే, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలనే పట్టుదల ఉంటే అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపాలి. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామంటూ చంద్రబాబు చెబుతున్నారు. అంత హడావిడిగా ఎవరో తరు ముతున్నట్టు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారని చంద్రబాబును ప్రశ్నించాలి. పదేళ్ళు హైదరా బాద్‌లో ఉండే హక్కును వదులుకుని అమరావతికి ఎందుకు వచ్చారని అడగాలి. ఓటుకు కోట్లు కేసులో ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ ఏలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పమనాలి. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టవ లసి వచ్చిందో సంజాయిషీ అడగాలి. ఎన్నికల హామీలు ఏ గాలికి కొట్టుకుపోయాయో చెప్పమంటూ నిలదీయాలి. ఇసుక మాఫియా గురించీ, కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించీ ప్రశ్నిం చాలి. రాష్ట్రం ఆర్థికంగా కష్టాలలో ఉన్నదంటూ ప్రత్యేక విమానంలో విదేశీయానాలకు రూ. 170 కోట్లకు పైగా దుబారా ఎందుకు చేశారో చెప్పమనాలి. అమరావతి నగర నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పేర్చలేదనీ, సింగపూరు గొడవ ఏమిటనీ, పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదనీ నిలదీయాలి. విజ యవాడలో దుర్గగుడి దగ్గర ఫ్లయ్‌వోవర్ ఎప్పటికి పూర్తవు తుందో చెప్పమనాలి. ఈ ప్రశ్నలు ఏవీ వేయకుండా ప్రతిపక్ష నాయకుడిని తీవ్రపదజాలంతో విమర్శించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగా లని ఆశించే జనసేనాని రాజ్యసభ సీటు ఇస్తానని బాబు అనగానే ఎన్నికలలో 50, 60 స్థానాలకు పోటీ చేయాలన్న సంకల్పాన్ని విరమించుకోకూడదు. ఎన్టీఆర్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని నాటి ముఖ్యమంత్రి అంజయ్య చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనను అటక ఎక్కించలేదు. కాంగ్రెస్ పార్టీని బలపరచలేదు. పవన్ ఆంతర్యం ఏమిటి? ఏ నాయకుడు ఏమి మాట్లాడుతున్నారనే అంశం కంటే ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ ప్రయోజనం ఆశించి మాట్లాడుతున్నారో ఆలోచించడం అవసరం. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ ప్రసంగించిన బహిరంగ సభ జరిగిన సమయంలోనే ఒంగో లులో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ధర్మపోరాట’ సభ జరి గింది. ఒంగోలులో సభికులు స్తబ్దుగా కూర్చున్నారు. బాబు పక్కనే కూర్చున్న కళావెంకటరావు, తదితరుల మొహాలలో ఉత్సాహం లేదు. ఒంగోలు సభకు హాజరైన జనం కంటే పదిరెట్లు జగ్గంపేట సభలో ఉన్నారు. అక్కడ ప్రజలు ఉత్సా హంగా కేరింతలు కొడుతూ కనిపించారు. బాబు ఎప్పటి లాగే తర్జని ఊపుతూ, ఏపీలో బీజేపీ ఆటలు సాగవంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ తప్పు తెలుసుకొని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఒకటేనంటూ ఏపీ పీసీసీ నాయకుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యా నించారు. తరచి చూస్తే అంతస్సూత్రం కనిపిస్తుంది. చంద్ర బాబు బీజేపీనీ, వైఎస్ఆర్సీపీనీ విమర్శిస్తూ ఉంటారు. రఘువీరారెడ్డీ అదే పని చేస్తారు. పవన్‌కల్యాణ్ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోదనీ, సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందనీ రఘువీరా చెప్పారు. పవన్‌కల్యాణ్ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తానం టున్నారు. వామపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా వెల్లడి కాలేదు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్, జనసేన ఉపయోగపడతాయి. కాంగ్రెస్ ముక్కు ఉన్నా, ఊడినా పెద్ద తేడా ఉండదు. జనసేనాని వ్యూహం వల్ల కాపు సామాజికవర్గం ప్రభావితం అవుతుందని చంద్ర బాబు అంచనా కావచ్చు. ఆ వర్గం టీడీపీపైన ఆగ్రహంతో ఊగిపోతోందని ముఖ్యమంత్రికి తెలుసు. కాపులు తనకు ఓట్లు వేయకపోయినా వైసీఆర్సీపీకి వేయకుండా చూడాల న్నది టీడీపీ అధినేత తాపత్రయం. కాపు సామాజికవర్గం పైన పవన్‌కల్యాణ్ ప్రభావం అంత బలంగా ఉంటే పెద్దాపు రంలోనూ, జగ్గంపేటలోనూ జగన్ సభలు అంత జయ ప్రదం అయ్యేవి కావు. రాజకీయాలలో ఎత్తుగడలూ, ఎన్ని కల మేనేజ్‌మెంటూ, డబ్బులూ, కులాలూ కొంతవరకు పని చేస్తాయన్న మాట నిజమే. కొంతవరకే పని చేస్తాయని గ్రహించాలి. నాయకుడు ఒక ప్రభంజనం సృష్టిస్తే, ప్రజలు ఒక పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుంటే ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తు అవుతాయని 2004, 2009 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో దృశ్యాలు చూసినవారికి గాలి ఎటు వీస్తున్నదో, ఎంత బలంగా వీస్తున్నదో తెలుస్తుంది. కొందరు కొన్ని కారణాల వల్ల వాస్తవాన్ని అంగీకరించకపోవచ్చు. అంత మాత్రాన ప్రజల సంకల్పం మారదు. కె. రామచంద్రమూర్తి -
‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!
శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్ రిహార్సల్స్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్ఆర్ సీపీ లోక్‌సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్డీఏ సర్కార్ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. అమిత్ షా నోట ‘జుమ్లా’ ‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా జుమ్లా స్ట్రయిక్స్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్ నంబర్ ఏక్, జుమ్లా స్ట్రయిక్ నంబర్ దో...’ అంటూ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్నాయుడు హిందీలో, ఇంగ్లిష్‌లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్ సభ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్ఆర్సీపీ పట్ల తన వైఖరిని ప్రధాని దాచుకోలేదు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్ఆర్సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్‌సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్‌సభ స్పీకర్ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్ఆర్సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు. అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్‌నాథ్‌సింగ్‌కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. జయదేవ్ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది? అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్ లోక్‌సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్ సభ్యుడు రాసిన లేఖను జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్‌ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్ మోహన్‌రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్‌లలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్ జగన్ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఏమి చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. కె. రామచంద్రమూర్తి -
చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు!
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి స్వాగతించేందుకు ఆయన నివాసానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఊమెన్‌చాందీ వెడుతున్నారని పది రోజుల కిందట మధ్యాహ్నభోజన సమయంలో విన్నప్పుడు కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. నాకేమీ అది అసాధారణ చర్యగా కనిపించలేదు. కాంగ్రెస్ సంస్కృతికి, ముఖ్యంగా సోనియాగాంధీ మనస్తత్వానికి తగినట్టుగానే ఉందనిపించింది. రాజకీయాలలో కొందరికి సెంటిమెంట్లు ఏ మాత్రం ఉండవు. కొందరు మాత్రం ఇచ్చిన మాట తప్పకూడదనీ, అసత్యాలు చెప్పకూడదనీ నియమాలు పెట్టుకొని నష్టపోతారు. కష్టపడతారు. ఏదో ఒక విధంగా గెలవడమే పరమావధి అని భావించేవారిని సెంటిమెంట్లు బాధించవు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో శుక్రవారం నాడు కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించినప్పుడు 22 సంవత్సరాల కిందట జరిగిన ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. 1996 ఎన్నికలు జరగడానికి ముందు ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాను. పీవీఆర్కె ప్రసాద్‌ని కలిసేందుకు ఆయన దగ్గరికి వెడితే ‘పీవీ గారింటికి పోతున్నా మీరూ రండి’ అంటూ తీసుకొని వెళ్ళారు. రాజకీయ నాయకులకు అయాచితంగా సలహాలు ఇచ్చే అలవాటు పెద్దగా లేదు కానీ నాకు నచ్చిన, నాకు చనువున్న రాజకీయ నాయకుల హితంకోరి వారు అడగ కపోయినా సలహా ఇచ్చే అమాయకత్వం ఉంది. మేం వెళ్ళినప్పుడు పీవీ, సుబ్రహ్మణ్యస్వామి కూర్చొని తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మేము కూడా వారితోనే కూర్చున్నాం. ‘తమిళనాడులో ఇప్పుడు డిఎంకే హవా ఉంది. జయలలితతో పొత్తు కొనసాగిస్తే మీకు ఒక్క సీటు కూడా రాదు. డీఎంకేతో పెట్టుకుంటే కనీసం 20 వస్తాయి’ అని నేను అన్నాను. ‘అదేనండీ సమస్య. డిఎంకేతో పొత్తు పెట్టుకోలేం. జయలలితే శరణ్యం’ అంటూ నిస్సహాయంగా నిట్టూర్చారు పీవీ. ఆయన అన్ని మాటలు మాట్లాడటమే విశేషం. ‘హీ ఈజ్ టూ సెంటిమెంటల్, యూ నో...,’ అన్నారు స్వామి. నేపథ్యం కాస్త వివరంగా చెప్పాలంటే, రాజీవ్‌గాంధీ హత్య కేసులో శ్రీలంక తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ పాత్ర ఉన్నదనీ, ఆ సంస్థతో డీఎంకేకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, రాజీవ్ హత్య వెనుక డీఎంకే హస్తం ఉన్నదనీ ఆ రోజుల్లో అందరినోటా వినిపించిన మాట. 1991 సార్వత్రిక ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మానవబాంబు దురంతం తమిళనాడులో ఎన్నికలు రెండో దశలో భాగం. మొదటి దశ తర్వాత తమిళనాడు శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజీవ్‌గాంధీని మానవబాంబు రూపంలో సమీపించిన ధను తనను తాను పేల్చుకొని పెద్ద విస్ఫోటనం సృష్టించింది. రాజీవ్ సహా 15 మంది ఆ దుర్ఘటనలో మర ణించారు. ఎల్టీటీఈకి రాజీవ్‌పైన అంత పగ ఎందుకు? శ్రీలంకలో తమిళుల తిరుగుబాటును అణ చివేయడానికి ఆ దేశ అధ్యక్షుడు జయవర్ధనేతో రాజీవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఇండియన్ పీస్‌కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరుతో భారత సైనికులను తమిళ పులులతో తలబడటానికి జాఫ్నాకు పంపించారు. వారిలో అత్యధికులను ఎల్టీటీఈ బలితీసుకుంది. దారుణంగా విఫలమైన ఈ దౌత్య, సైనిక వ్యూహం రాజీవ్ జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో కొలం బోలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన జెఎన్ దీక్షిత్ చెప్పినట్టు ఐపీకే ఎఫ్‌ను జాఫ్నాకు పంపించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మినహా తమిళనాడు లోని రాజకీయ పార్టీలన్నీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఏఐఏడిఎంకె అధినేత జయలలిత రాజీవ్‌కి సన్నిహితురా లుగా కనిపించినప్పటికీ తమిళ రాజకీయాలలో మనుగడ కోసం ఐపీకే ఎఫ్‌ను మాటవరుసకైనా వ్యతిరేకించక తప్ప లేదు. 1991 జనవరి 10న పార్లమెంటులో నాటి ప్రధాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘తమిళనాడులోనే కాకుండా జాఫ్నాలోని ఎల్టీటీఈ కేంద్రకార్యాలయానికి కూడా తమి ళనాడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినట్టు నాకు సమా చారం ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం (I have information that the chief minister of Tamil Nadu has gone to the LTTE headquarters not only in Tamil Nadu but also in Jaffna. This is something very serious)' అన్నారు. కరుణానిధి ప్రభుత్వాన్ని బర్త రఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దాంతో తమిళ నాడులో తమిళ పులులకు శిక్షణ కార్యక్రమాలను నిలిపి వేయవలసి వచ్చింది. అంతవరకూ యధేచ్ఛగా తిరు గుతూ, తమ కార్యక్రమాలను నిర్నిరోధంగా కొనసాగిస్తున్న టైగర్స్ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. బర్తరఫ్ చేయాలన్న నిర్ణయం చంద్రశేఖర్ స్వయంగా తీసుకున్నదేననీ, కాంగ్రె స్కు సంబంధం లేదనీ ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రట రీగా పని చేసిన ఎస్ఎన్ మిశ్రా తాను రచించిన ‘ఫ్లయింగ్ ఇన్ హై విండ్స్’ అనే పుస్తకంలో స్పష్టం చేశారు. కానీ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ మాత్రం చంద్రశేఖర్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కారణంగానే డిఎంకే ప్రభుత్వంపైన వేటు వేశారని నమ్మాడు. జయవర్దనేతో ఒప్పందం చేసుకొని ఐపీకేఎఫ్‌ను పంపడమే కాకుండా తమ మిత్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కారకుడైన రాజీవ్ 1991 ఎన్నికల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవ కాశం ఉంది. అందుకే రాజీవ్ హత్యకు ప్రభాకరన్ వ్యూహం రచించాడు. 1991లో రాజీవ్ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలకు వరుసగా 28, 11 స్థానాలు వచ్చాయి. డిఎంకే ఊసే లేదు. (ఆ రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి) అయితే 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్ని కలలో రాజీవ్ హంతకులైన ఎల్టీటీఈ నాయకులతో సంబంధాలు కలిగిన డిఎంకేతో ఎన్నికల పొత్తు పెట్టు కుంటే రాజీవ్ సతి సోనియా బాధపడిపోతారనీ, ఆగ్రహిస్తారనీ పీవీ భావించి కరుణానిధితో మాట్లాడటానికి కూడా సంకోచించారు. ఇష్టం లేకపోయినా జయలలితతోనే ఎన్ని కల పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలు తుడిచి పెట్టుకొని పోయాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. తమిళ మానిల కాంగ్రెస్–మూపనార్ (టీఎంసీ–ఎం)కి 20, డిఎంకేకి 17, సీపీఐకి రెండు స్థానాలు వచ్చాయి. తమిళనాడులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కక పోయినా పర్వాలేదు కానీ డిఎంకేతో పొత్తు పెట్టుకొని సోనియాగాంధీ మనస్సు నొప్పించకూడదని పీవీ భావిం చారు. అదే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అదే డిఎంకేతో 2004లో, 2009లో, 2016లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోరాడింది. అంటే రాజీవ్ హత్యకు సంబంధించి సోనియాగాంధీకి లేని సెంటిమెంటు పీవీకి ఉంది. కాంగ్రెస్‌పార్టీకి తీరని అపకారం చేసిన కిరణ్ కుమార్‌రెడ్డికి చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ కనబడిన రాహుల్‌గాంధీని చూసినప్పుడు ఆ సెంటిమెంటు గుర్తు కొచ్చింది. సెంటిమెంటు లేని సోనియా కుటుంబం సోనియాగాంధీకి సెంటిమెంటు ఉంటే కాంగ్రెస్ పార్టీ 2004లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికీ, 2009లో అధికారంలో కొనసాగడానికీ ప్రబల కారకుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు బనాయించి, 16 మాసాలు జైలుపాలు చేసేవారు కాదు. 2004లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలలో 29 స్థానాలనూ, 2009లో 33 స్థానాలనూ గెలిచి యూపీఏ ప్రభుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించిన వ్యక్తి కుటుంబానికి సెంటిమెంటు ఉన్నవారైతే చేతనైతే సాయం చేసే వారు కానీ కక్షకట్టి, కత్తికట్టేవారు కాదు. కాంగ్రెస్ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డి అధి కారంలోకి రాకుండా నిరోధించడానికే నాటి హోంమంత్రి చిదంబరం సలహా మేరకు కొణిజేటి రోశయ్యను తొలగించి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని సోనియాగాంధీ నియమించారు. 2014లో వైఎస్సార్సీపీ తలవెంట్రుకవాసిలో ఓడిపోవడంలో కిరణ్‌రెడ్డి పాత్ర ఇసుమంతైనా లేదు. కాంగ్రెస్ నేలమట్టం కావడంలో మాత్రం ప్రధాన భూమిక ఆయనదే. పీవీకి సన్నిహితుడైన అమరనాథరెడ్డి కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు రాజకీయాలలో అమర్నాథ్ రెడ్డికీ, చంద్రబాబుకూ పడేది కాదు. 1980లో చిత్తూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో నాటి మంత్రి అమరనాథరెడ్డి నిలబెట్టిన అభ్యర్థిని మరో మంత్రి సి దాస్‌తో భుజం కలిపి మంత్రి చంద్రబాబునాయుడు ఓడించారు. డాక్టర్ కుతూహలమ్మను అధ్యక్షురాలుగా గెలిపించారు. సీనియర్ మంత్రి, నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావుకు సన్నిహితుడూ అయిన అమరనాథ్ రెడ్డికి అది తీరని అవమానం. తన తండ్రికి ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడితోనూ, చిదంబరంతోనూ షరీకై జగన్మోహన్రెడ్డిపైన కేసులు పెట్టించడంలో కిరణ్‌కుమార్ రెడ్డికి ఏ సెంటిమెంటూ అడ్డురాలేదు. తనను మనసారా ప్రేమించి, చీఫ్‌విప్‌గా, శాసనసభాపతిగా పదోన్నతి కల్పిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అపకారం చేస్తు న్నాననే స్పృహ రవ్వంతైనా లేకుండా రాజకీయ ప్రయోజ నాలు సాధించడానికి ప్రయత్నించడం మామూలు విష యం కాదు. వ్యక్తుల సంగతి సరే. తన అభ్యున్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా రుణం తీర్చుకున్నారు? ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైఎస్ హఠాన్మరణం తర్వాత ఊపందుకున్నది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పన్నెండు రోజుల నిరశన దీక్షతో దిగివచ్చిన యూపీఏ సర్కార్ చిదం బరం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు ప్రారం భిస్తామంటూ ప్రకటన చేయించింది. ఇందుకు నిరసనగా కోస్తాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం కాలహరణం కోసం క్షేత్ర వాస్తవికత ఏమిటో కనుక్కో వాలంటూ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3న నియమించింది. 2010 నవంబర్ 24న రోశయ్య రాజీనామా చేశారు. అనంతరం నాలుగు మాసాల తర్వాత, 2011 మార్చి 12న వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. అంతకంటే ముందు 2010 డిసెంబర్లో కాంగ్రెస్ నుంచి వైదొలగడంలో భాగంగా జగన్ కడప పార్లమెంటు సీటుకూ, విజయమ్మ పులివెందుల అసెంబ్లీ సీటుకూ రాజీనామా చేశారు. 2011 మే మొదటివారంలో ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉపఎన్నికలలో జగన్ కడప లోక్‌సభ స్థానాన్ని 5,45,671 ఓట్ల ఆధిక్యం తోనూ, విజయమ్మ పులివెందుల సీటును 81,373 ఓట్ల తేడాతోనూ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జగన్‌ను నిరోధించడం రోశయ్య వల్ల కాదని తీర్మానించుకున్న పార్టీ అధిష్ఠానం ఆయనకు ఉద్వాసన చెప్పి రాయలసీమకే, రెడ్డి సామాజికవర్గానికే చెందిన యువనాయకుడు కిరణ్ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 2012 జూన్ 12న 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు రెండు వారాల ముందుగా సీబీఐ చేత జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయించారు. విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ 15 స్థానాలు గెలుచుకున్నది. నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని 2,90,000 మెజారిటీతో నిలబెట్టుకుంది. ఉపఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో వైఎస్సార్సీపీకి 46.8 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ ఓట్ల శాతం 22కి తగ్గింది. తెలుగుదేశం పార్టీ సోదిలోకి లేదు. అధికారం ఉంటే చంద్రబాబునాయుడు మాయా మర్మం చేసి ఉపఎన్నికలలో గెలవగలరు కానీ ప్రతిపక్షంలో ఉంటే ధరావత్తు సైతం దక్కించుకోలేరు. పదేళ్ళ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలోనూ గెలవలేదు. సీబీఐ ద్వారా జగన్‌పై కేసులు బనాయించి జైలుకు పంపే తెలివితేటలు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉన్నాయి కానీ ఎన్నికలలో జగన్‌ను ముఖాముఖిగా ఎదుర్కొనే శక్తి లేదని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించింది. కిరణ్ ఇన్నింగ్స్ చివరలో అంతకంటే పెద్ద మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వచ్చింది. రాష్ట్ర విభజనలో విచిత్రవిన్యాసాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఏమి జరగాలి? కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యమంత్రినీ, కేంద్ర మంత్రులనూ, పార్టీ ఎంపీలనూ, శాసనసభ్యులనూ, ఇతర ముఖ్యనాయకు లనూ కూర్చోబెట్టుకొని సమాలోచన జరపాలి. విభజన నిర్ణయానికి పార్టీ నాయకులందరినీ ఒప్పించి నిర్ణయం సజావుగా అమలు జరిగేటట్టు చూడాలి. ఆ పని చేయ కుండా ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య వాదులాటలూ, ఎత్తులూపైఎత్తులూ సాగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించింది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగులుతుంటే బాధ్యతారహితంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్ తన కార్యాలయంలో విలేఖరుల గోష్ఠి నిర్వహించి వర్కింగ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు మౌనం పాటించింది. తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ, చివరి బంతి ఇంకా బౌల్ చేయవలసి ఉన్నదంటూ ఆత్మవంచనకూ, పర వంచనకూ తమ పార్టీ ముఖ్యమంత్రి ఒడిగడుతూ ఉంటే సోనియాగాంధీ కానీ, ప్రధాని మన్మోహన్సింగ్ కానీ, ప్రధాని ఉత్తర్వులను ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధుల సమక్షంలో పరపరా చించివేసే తెగువ ఉన్న రాహుల్‌గాంధీ కానీ కిమ్మనలేదు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతుంటే ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తోంది అన్న చందంగా కేంద్ర నాయకత్వం స్పందించ కుండా మొండికేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత అందుకు నిరసనగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంత హంగామా చేసినా, ఎన్ని విలేఖరులు గోష్ఠులు నిర్వహించి ఎంత గంభీరంగా మాట్లాడినా సమైక్యవాదాన్ని గట్టిగా సమర్థించిన నాయకుడిగా ప్రజలకు అర్థమై ఉంటే 2014 ఎన్నికలలో ఆయన నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర పార్టీ’కీ, ఎన్నికల సంఘం ప్రసాదించిన చెప్పు గుర్తుకీ జనం బ్రహ్మరథం పట్టేవారు. కిరణ్‌కు పోటీ చేసే ధైర్యం లేకపోయింది. పార్టీ అభ్యర్థులకు ధరావతు రక్షించుకునే ప్రజాదరణ లేకపోయింది. తన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. ఎవరు ఎంత ప్రయత్నిం చినప్పటికీ సమీప భవిష్యత్తులో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కోలుకోలేదు. అంత దెబ్బ కొట్టారు పార్టీ నాయకులందరూ కలిసి. చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు. రాహుల్ రాజనీతికి జేజేలు! ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని అంత ప్రగాఢంగా ఆకాంక్షించి ఉంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో వాదించి ఒప్పించి ఉండవలసింది. 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోవాలని సోని యాగాంధీ, దిగ్విజయ్ సింగ్, ఇతర జాతీయ నాయకులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌తో గట్టిగా వాదించారు. పోటీ లేకుండా విజయం సాధిస్తామంటూ వైఎస్ కూడా అంతే గట్టిగా ఎదురు వాదించారు. చివరికి సోనియాగాంధీని ఒప్పించారు. ఒంటరిగానే కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. చేతనైతే అధిష్ఠానవర్గాన్ని ఒప్పించాలి. లేకపోతే అ«ధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాలి. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కిరణ్ సోనియాగాంధీ నిర్ణయాన్ని మన్నించి దాని అమలుకు సహకరించి ఉంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతటి అపారమైన నష్టం వాటిల్లేది కాదు. 2013 జూలై ప్రాంతంలో వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనపై కసరత్తు చేసినప్పుడే కిరణ్ చొరవ తీసుకొని విభజన నిర్ణయాన్ని ఆమోదించి ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య సదవగాహన సాధించడానికి ప్రయత్నం చేసి ఉంటే ఎవ్వరి సహకారం లేకుండా జైరామ్ రమేష్ ఒంటరిగా విభజన బిల్లును రూపొందించే అవసరం వచ్చేది కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనకర్తలైనా ఒక చోట సమావేశమై అన్ని అంశాలనూ సాకల్యంగా పరి శీలించి విభజనబిల్లు తయారు చేసి చట్టం చేసి ఉంటే, రాష్ట్ర విభజన ఎన్నికల కంటే ఏడెనిమిది మాసాల ముందే జరిగి ఉండేది. రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. విభజన బిల్లులోని అంశాలు అమలు జరిగితే ప్రజలలో ఏర్పడిన అపోహలు కొంతమేరకైనా తొలగి పోయేవి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సారథ్యంలో పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనేది. అటువంటి అవ కాశం ఇవ్వకుండా, ఎవ్వరినీ సంప్రదించకుండా, ఒంటరి వ్యూహంతో, ఒంటెత్తు పోకడతో కొంప ముంచిన నాయ కుడిని, రహస్యోద్యమం నడిపిన నాయకుడిని ఇంటికి వెళ్ళి పార్టీలో చేరమంటూ అభ్యర్థించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. పార్టీకి ఎనలేని ఉపకారం చేసిన వైఎస్ కుటుంబాన్ని అవమానించి, పార్టీకి అన్ని రకాలా నష్టం కలిగించి నాలుగేళ్ళుగా ఆజ్ఞాతవాసంలో ఉంటూ, తమ్ముడిని తెలుగు దేశం పార్టీలో చేరడానికి అనుమతించిన కిరణ్‌కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న రాహుల్ గాంధీ రాజనీతిని ఏమని వర్ణించాలి? ఆయన మెడలో ఎన్ని వీరతాళ్ళు వేయాలి? ‘సిగ్గులేకపోతే సరి’ అన్నట్టే రాజకీయాల్లో ‘సెంటిమెంట్ లేకపోతే సరి’! -కె. రామచంద్రమూర్తి -
కశ్మీరీ శాంతి కపోతం
మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం దాదాపు అసాధ్యం. కల్లోల కశ్మీరంలో అయితే జర్నలిజం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసమే. వస్తునిష్టంగానే రాస్తామంటే కుదరదు. ఉంటే ప్రభుత్వ పక్షాన ఉండాలి లేదా వేర్పాటువాదులకు విధేయంగా ఉండాలి. జరిగిన వాస్తవాలు మాత్రమే ప్రచురించడం అంటే అందరినీ శత్రువులను చేసుకోవడమే. ప్రభుత్వం లేదా సైనికాధికారులు చెబుతున్న సంగతులే ప్రచురిస్తే ‘సర్కారీ పత్రకార్’ అంటూ నిందిస్తారు. డబ్బు తీసుకొని ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారంటూ పాకిస్తాన్ అనుకూలవర్గాలూ, మిలిటెంట్లూ, వేర్పాటువాదులూ ఈసడించుకుంటారు. వేర్పాటువాదుల అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే ‘దేశద్రోహులు’ అంటూ హిందూత్వవాదులూ, వీర దేశాభిమానులూ ముద్రవేస్తారు. ఈ నేపథ్యంలో అటు వేర్పాటువాదుల తోనూ, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోనూ, కశ్మీర్‌లోని ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఉన్నత సైనికాధి కారులతోనూ సమాన ఫక్కీలో సత్సంబంధాలు కలిగిఉంటూ శాంతి నెలకొల్ప డానికి ప్రయత్నించడం సాహసం. అటువంటి అరుదైన సాహసి మొన్న తూటా లకు బలైన ప్రఖ్యాత జర్నలిస్టు సుజాత్ బుఖారీ. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన పత్రిక ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం బయటనే ఇఫ్తార్‌కు వెళ్ళేందుకు కారు ఎక్కబోతుండగా హంతకులు జరిపిన కాల్పులలో నేలకొరిగాడు. సుజాత్ బుఖారీ వివేకవంతుడు. సాహసి. స్నేహశీలి. ఎత్తుగా, అందంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండే బుఖారీకి అన్ని రంగాలవారితోనూ పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అందరితో మాట్లాడే చనువుంది. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌లో మిత్రులు ఉన్నారు. మనసు విప్పి మాట్లాడే ఆర్మీ జనరల్స్ ఉన్నారు. కనుకనే బారాముల్లా జిల్లాలో క్రీరీ గ్రామంలో శుక్రవారం జరిగిన బుఖారీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైనారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుఖారీ హత్యవార్త విని కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆమె సోదరుడూ, మంత్రి తస్దీఖ్ముఫ్తీ, ప్రతిపక్ష నాయకుడూ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోనే కాకుండా దేశవ్యాప్తంగా బుఖారీని అభిమానించేవారు ఉన్నారు. యావద్భారతం శోకతప్తమైన సందర్భం ఇది. బుఖారీతో పాటు ఆయన అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు ఆగంతకుల తూటాలకు నేలకొరిగారు. అంతకు కొన్ని గంటల ముందే జౌరంగజేబు అనే జవాన్ శవం పుల్వామాలో దొరికింది. రంజాన్ సెలవుపై ఇంటికి వెడుతున్న జౌరంగజేబును దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రంజాన్ మాసం సందర్భంగా దేశీయాంగ శాఖ కశ్మీర్లో స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించిన ఫలితంగా లభించిన అవకాశాన్ని ఉగ్రవాదులు పూర్తిగా వినియోగించుకున్నారు. కాల్పుల విరమణకు ముందు ఏప్రిల్ 19 నుంచి మే 16 వరకూ ఉగ్రవాద సంబంధమైన ఉదంతాలు 25 జరిగితే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి జూన్ 13 వరకూ 66 ఘటనలు జరిగాయి. కాల్పుల విరమణను పొడిగించి, చర్చల ప్రక్రియను పునరుద్ధరించకపోతే కశ్మీర్లో 1990 దశకం ఆరంభంనాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. హింసాకాండ కొనసాగి ఉగ్రవాదులది పైచేయి అయితే కశ్మీర్ అంతర్జాతీయ వివాదంగా మళ్ళీ తెరపైకి ప్రముఖంగా వస్తుంది. ఇతర దేశాల జోక్యాన్ని నివారించడం కష్టం అవుతుంది. కశ్మీరీల ఆత్మగౌరవాన్ని (అస్మితను) సుజాత్ బుఖారీ ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. కశ్మీరీ భాష అన్నా, సంస్కృతి అన్నా చెవికోసుకునేవాడు. కశ్మీరీ భాషలో వార్తాపత్రికలు రావడానికి ఉద్యమం చేశాడు. కశ్మీరీ భాషలో కవులూ, రచయితల కోసం స్థాపించిన ‘అబ్దీ మక్రజ్ కమ్రాజ్’ అనే సంస్థకు బుఖారీ అధ్యక్షుడు. ఈ సంస్థ కృషి ఫలితంగానే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2017లో కశ్మీర్ పాఠశాలల్లో పదో తరగతి వరకూ కశ్మీరీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. కశ్మీరీ భాషకు పర్షియన్–అరబిక్ లిపిని రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని ఈ సంస్థ జయప్రదంగా ఆడ్డుకున్నది. ఉర్దూ, ఇంగ్లీష్, కశ్మీరీ భాషలలో అధికారం కలిగిన రచయిత బుఖారీ. మంచి వక్త. సాహిత్యసభలలో తరచుగా పాల్గొనేవాడు. అతడు కేవలం జర్నలిస్టు కాదు. శాంతికోసం పరితపించిన∙యాక్టివిస్టు కూడా. ‘రికన్సీలియేషన్ రిసోర్సెస్’ అనే సంస్థను నెలకొల్పి కశ్మీర్లో శాంతి సాధనకు చొరవ తీసుకొని సమాలోచనలు నిర్వహించే బృందంలో బుఖారీ ముఖ్యపాత్రధారి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య సమాంతర దౌత్యం (ట్రాక్–2 డిప్లొమసీ) నిర్వహించేవారు. రెండు దేశాల ప్రభుత్వాల, పౌరసమాజాల ప్రతినిధులతో సమాలోచనలు అమెరికాలో, ఇంగ్లండ్‌లో, ఇతర దేశాలలో నిర్వహించేవారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈ రకం దౌత్యంలో ప్రముఖ సంపాదకుడు శేఖర్‌గుప్తా పాల్గొనేవారు. గత నెల దుబాయ్‌లో బుఖారీ ఆధ్వర్యంలో జరిగిన కశ్మీర్ ఇనీషియేటివ్ భేటీ వివాదాస్పదమైంది. ఇండియా, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని అనుకున్నట్టు వార్త పొక్కింది. తీర్మానం ఆమోదానికి పెట్టలేదు కానీ అందులోని అంశాలపై రకరకాల వ్యాఖ్యలూ, ప్రతిస్పందనలూ సోషల్ మీడియాలో స్వైరవిహారం చేశాయి. ఇది ఉగ్రవాదులను ఆగ్రహోదగ్రులను చేసింది. కశ్మీర్లో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగైన ప్రతిసారీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ‘కశ్మీర్లో ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నది ఉల్లిగడ్డల లేదా ఆలుగడ్డల వ్యాపారం కోసమో, కశ్మీర్‌ను శాశ్వతంగా విభజించడం కోసమో కాదు. కశ్మీర్‌కు విమోచన కలిగించడానికి. దుబాయ్‌లో జరిగిన భేటీ భారత ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు నిర్వహించింది. అటువంటి సమావేశాలు నిరర్థకమైనవి’ అంటూ భారత ఇంటెలిజెన్స్ సంస్థల తొత్తుగా సుజాత్ తదితరులను జగమెరిగిన ఉగ్రవాది సలాహుద్దీన్ నిందించాడు. హిజ్బుల్ ముజాహిదీన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్లు బుఖారీని భారత సైన్యానికీ, ఇంటెలిజెన్స్ సంస్థలకీ డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తిగా అభివర్ణించాయి. హంతకులెవరు? సుజాత్ బుఖారీని ఎవరు చంపారు? ఈ ప్రశ్నపైన సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి నివేదికపైన సుజాత్ బుఖారీ వ్యాఖ్య చేసిన కొన్ని గంటలకే అతడిని హత్య చేయడం విశేషం అంటూ పాకిస్తాన్ విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుజాత్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదంటూ పరోక్షంగా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపిస్తున్నది. బుఖారీని ఎవరు చంపారనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు. అతడిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? వేర్పాటువాదులతో, పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని కశ్మీర్ ముఖ్యమంత్రి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ గడువును పొడిగించాలనీ, అవసరమైతే వేర్పాటువాదులతో సైతం చర్చలు జరపాలనీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో శాంతికాముకుడైన బుఖారీని చంపవలసిన అవసరం కల్లోలం కోరుకునేవారికే ఉంటుంది. ముగ్గురు ఉగ్రవాదులు బైక్‌పైన వచ్చి కాల్పులు జరిపినట్టు జమ్మూ–కశ్మీర్ డీజీపీ ఎస్పి వెయిద్ అంటున్నారు. కశ్మీర్ లోయలో ప్రభుత్వానికీ, వేర్పాటువాదులకూ మధ్య, ఇండియాకూ, పాకిస్తాన్‌కూ మధ్య, ముస్లింలకూ, కశ్మీరీ పండిట్లకూ మధ్య వారధిగా ఉన్న మానవతామూర్తిని పొట్టనపెట్టుకున్నారు. కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటూ, వారిని తిరిగి కశ్మీర్‌కు రప్పించాలని కోరుకునేవారిలో బుఖారీ అగ్రగణ్యుడు. అటువంటి ఉదారవాదులకు కశ్మీర్లో స్థానం లేదనీ, భద్రత లేదనీ స్పష్టం చేయడం, ఉదారవాదంవైపు మొగ్గు చూపవద్దని ఇతరులను హెచ్చరించడం హంతకుల లక్ష్యం. ఉగ్రవాదులకు హెచ్చరిక బుఖారీ అంత్యక్రియలకు హాజరైన జర్నలిస్టులు అతడి స్ఫూర్తితో మరింత ధైర్యంగా వ్యవహరించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఓyì ంచడమే అతడికి నిజమైన నివాళి. కడచిన 15 సంవత్సరాలలో కశ్మీర్లో ఉగ్రవాదులు హత్య చేసిన మొదటి ఉదారవాది బుఖారీ. 2003లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అబ్దుల్ మాజీద్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. అంతకు పది నెలల ముందు ప్రొఫెసర్ అబ్దుల్ ఘనీ లోన్ని మీర్వాయిజ్ మౌల్వీ ఫారూఖ్ వర్థంతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో హత్య చేశారు. 12 ఏళ్ళ కిందట మౌల్వీ ఫారూఖ్ని కూడా ఉగ్రవాదులే చంపారు. ఫారూఖ్కీ, లోన్‌కీ, దార్కూ, బుఖారీకి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం– ఉదారవాదం. ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు శాంతిమంత్రం జపిస్తారు కనుక వారిని ఉగ్రవాదులు ఉపేక్షించరు. స్నేహశీలి, క్రియాశీలి సుజాత్ బుఖారీని నేను 2010లో మొదటి సారి కలుసుకున్నాను. వందమందికిపైగా యువకులు చేతుల్లో రాళ్ళు పట్టుకొని మరతుపాకుల ఎదురుగా నిలిచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పారామిలటరీ సైనికులు కాల్పులకు నేలకూలిన ఘటనలు జరిగిన తర్వాత కొన్ని వారాలకు హెచ్ఎంటీవీ తరఫున అక్కడికి వెళ్ళాను. సహచరుడు జమీల్–ఉర్–రెహ్మాన్ తోడు ఉన్నాడు. గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నాయకుడూ, పాకిస్తాన్ అనుకూలుడూ అయిన సయ్యద్ అలీ షా గిలానీనీ, మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ వంటి హురియత్ నాయకులనూ, ఇతరులనూ ఇంటర్వ్యూ చేశాను. సాధారణ ప్రజలతో మాట్లాడాను. చివరి అంశంగా శ్రీనగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అందులో సుజాత్ బుఖారీతో పాటు శ్రీనగర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ, పౌరహక్కుల నేతలూ, విద్యార్థులూ అనేక మంది చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితీ, సైన్యం నీడలో ప్రజల జీవితాలూ, కశ్మీరీ పండిట్ల వలస, ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కశ్మీరీల బతుకులూ చర్చకు వచ్చాయి. కశ్మీరీలతో సంబంధాలు లేకుండా ఈ రోజుల్లో ఢిల్లీ స్టుడియోలలో కూర్చొని దేశభక్తి వండివార్చే టీవీ యాంకర్లకు వివేకం కానీ, వినయం కానీ లేవు. విషయపరిజ్ఞానం అంతకంటే లేదు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ, పాకిస్తాన్ సహకారంతో కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ సూచించే వ్యక్తులను పాకిస్తానీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రంచే జర్నలిస్టులు ఢిల్లీలో కొన్ని చానళ్ళను శాసిస్తున్నారు. వారికి నమస్కారం. కశ్మీర్లో ఏ ఘటన జరిగినా కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే అక్కడి సంక్లిష్టమైన పరిస్థితులపైన లోతైన అవగాహన కలిగిన బుఖారీ వంటి వ్యక్తులతో మాట్లాడాలి. బుఖారీ అప్పుడు హిందూ పత్రిక ప్రతినిధిగా శ్రీనగర్‌లో పని చేస్తున్నాడు. ఆ పర్యటనలో రెండు దఫాలు అతడితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కలిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కశ్మీర్ చరిత్రను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన కలిగింది. బాలగోపాల్ అంటే బుఖారీకీ, హక్కుల నాయకులకూ, ప్రొఫెసర్లకూ ఇష్టం, గౌరవం. అప్పటికి సంవత్సరం క్రితమే కన్నుమూసిన బాలగోపాల్‌ను చాలామంది గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంపాదకుల సమావేశం సందర్భంగా ఒక సారి బుఖారీ, నేనూ కలుసుకున్నాం. ‘ది హన్స్ ఇండియా’ సంపాదకత్వం నిర్వహించిన రోజుల్లో కశ్మీర్లో ముఖ్యమైన పరిణామాలు సంభవించినప్పుడు బుఖారీని అడిగి ప్రత్యేక విశ్లేషణ తెప్పించుకొని ప్రచురించేవాడిని. హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా ఆవేశం లేకుండా, చిర్నవ్వు చెదరకుండా ఉండటం, ఏది మాట్లాడినా సాధికారంగా వ్యాఖ్యానించడం అతడి ప్రత్యేకత. బుఖారీ వంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు. అతడి మరణం కశ్మీర్ ప్రజలకు తీరని లోటు. కె. రామచంద్రమూర్తి -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్‌లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు -
గుర్రం ఎగరావచ్చు!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అందరూ కలలు కనాలి. వాటి సాకారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి 17 సంవత్సరాలైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్వప్నం గురించి మరోసారి ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాననీ, హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తాననీ స్పష్టంగా ప్రకటించారు. భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ఎలుగెత్తి చాటారు. మంచిదే. ఒక లక్ష్యం సాధించిన విజేత వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం సహజం. అసాధ్యమని చాలామంది భావించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సారథ్యం వహించిన రాజకీయ నేతకు తదుపరి లక్ష్యం దేశ రాజకీయాలపైన ప్రభావం వేయడం కావడంలో ఆశ్చర్యం లేదు. 35 సంవ త్సరాల కిందట నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సాధించిన ఘనకార్యాన్ని తానూ సాధించగలననే ఆత్మవిశ్వాసం కేసీఆర్‌కి ఉండవచ్చు. కేసీఆర్ రాజకీయ చాతుర్యం, ఎత్తుగడల విషయంలో సందేహం లేదు. కానీ కల సాకారం కావడానికి పరిస్థితులు కలిసి రావాలి. అదృష్టం కూడా అవసరం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే మహాసేనాని. సైన్య నిర్మాణంలో, రణతంత్ర రచనలో దిట్ట. ఒకానొక సమయంలో సైన్యంలో కీలకమైన స్థానంలో ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. సలహాదారులు చాలామంది అభ్యర్థులను పరీక్షించి ఒక యోధుడిని ఎంపిక చేశారు. నెపో లియన్ ఆమోదం కోరారు. పోరాట పటిమ లేదా మనోబలం లేదా గతంలో అతగాడు సాధించిన విజయాల గురించి నెపోలియన్ ప్రశ్నించలేదు. ‘అతనికి అదృష్టం కలసి వస్తుందా (ఐటజ్ఛి luఛిజుy)?,’ అని ప్రశ్నించాడట. యుద్ధాలలో విజయం సాధించాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. అదృష్టం విధిగా ఉండా లని నెపోలియన్ అభిప్రాయం. రాజకీయాలలోనూ అంతే. మర్రి చెన్నారెడ్డికి లేని అదృష్టం కేసీఆర్‌కి కలిసి వచ్చింది. జయాపజయాలు జయాపజయాలను యోధులు విశ్లేషించుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అపజయాలకు దారితీసిన కారణాలను తెలుసుకోవడం సులువే. విజయాలను అర్థం చేసుకోవడమే కష్టం. చాలా మంది రాజకీయ నాయకులు గెలుపును అపార్థం చేసుకొని అంతా తమ ఘనతే అనుకొని అహంకారం పెంచుకొని దెబ్బ తింటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ను సాధ్యం చేసిన పరిస్థితులనూ, తెలం గాణ రాష్ట్ర పాలనలో కొన్ని సత్ఫలితాలను సాధించడానికి సహకరించిన అంశాలనూ జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రధాన పాత్రను ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇతర ఉద్యమ నాయ కుల పాత్ర, ప్రజల ఉద్యమస్ఫూర్తి నిశ్చయంగా తోడైనాయి. ఉద్యమ కాలంలో వివిధ ఘట్టాలలో రకరకాల వ్యక్తులు ఆయనకు సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏ సలహా స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవలసిందీ, దాని మంచిచెడులకు బాధ్యత వహించవలసిందీ నాయకుడే కనుక ఖ్యాతీ, అపఖ్యాతీ సైతం ఆయనకే చెందుతాయి. అంతిమ విజయం సాధించిన నేతగా కేసీఆర్‌కు కీర్తి దక్కింది. అధికారం కూడా ఆయన సొంతమే అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు అనేకం జరిగాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన తరంగం. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి తెలంగాణలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలోనూ తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకున్నది. ఆ పార్టీ అదే సంవత్సరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తర్వాత రెండు సంవత్సరాలు తిరగ కుండానే ‘జైఆంధ్ర’ ఉద్యమం ఎగిసిపడింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నారు. ఉద్యమ నాయకులతో సమా లోచనలు జరిపి వారి రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చారు. ముఖ్యమంత్రులకు ఉద్వాసన చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీ ర్ఘంగా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్నన్ని పట్టింపులు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన పట్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నాయ కుడు నారా చంద్రబాబునాయుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయకపోతే 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించేవారు కాదు. నిర్ణాయక స్థానంలో సోనియాగాంధీ ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ప్రత్యర్థులకు నష్టం, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమెను సలహాదారులు నమ్మించడం, వందలమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్య చేసు కోవడం, చిన్న రాష్ట్రాలపట్ల పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి సాను కూలమైన అభిప్రాయం ఉండటంతో సహా అనేక కారణాలు రాష్ట్ర విభజనకు దారి తీశాయి. ఈ వాస్తవాలన్నిటినీ క్షుణ్ణంగా, వస్తునిష్టంగా అధ్యయనం చేసి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి. నేల విడిచి సాము తెలంగాణలో పరిపాలనపై ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పాలన కంటే మెరుగనేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతున్నారు. కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జరుగుతున్న మంచి పనులన్నిటినీ తన ఖాతాలో వేసుకొని, వెనుకబాటుతనా నికీ, రైతుల ఆత్మహత్యలకూ, నిరుద్యోగ సమస్యకూ బీజేపీనీ, కాంగ్రెస్ ప్రభు త్వాలను నిందించడం రాజకీయంగా అవసరం కావచ్చు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వక ముందే దాని ఫలం రైతులు అనుభవిస్తున్నట్టు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే వేల ఎకరాలకు నీరు అంది స్తున్నట్టు భావించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మున్ముందు రైతు ఆత్మహత్యలు ఆగిపోవచ్చునేమో. కోటి ఎకరాల భూమికి సాగునీరు అందు తుందేమో. ప్రస్తుతానికైతే అవి లక్ష్యాలే. ఆకాంక్షలే. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతే కానీ తెలంగాణ రాష్ట్రంలో చేయవలసింది అంతా చేసేశాం. కనుక ఇక జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడతాం అంటే కుద రదు. తమ అనుభవానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, పత్రికలు ఏమి రాసినా, టీవీ చానళ్ళు ఏమి చూపించినా ప్రజలు విశ్వసించరు. వారికి స్వీయానుభవం ప్రధానం. నేతలు నేల విడిచి సాము చేయకూడదు. ప్రస్తుతం కేసీఆర్‌ను నడిపిస్తున్న స్వప్నం ఫెడరల్ ఫ్రంట్. ఇది మహా జటిలమైనది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవ్యంగా ఉన్నట్లయితే, సుపరిపాలన అందించి, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఉన్నట్లయితే దేశంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో ఆయనే చొరవ తీసుకునేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి ఊపిరి సలపనీయడం లేదు. నిద్ర పోనీయడం లేదు. చంద్రబాబు సందర్భశుద్ధీ, సమయజ్ఞతా, నిగ్రహం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్వవచోఘాతం నిత్యకృత్యంగా మారింది. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ప్రజలే తనను రక్షించాలంటూ మాట్లాడు తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల రాజకీయం చేసే శక్తి ఆయనకు లేదు. అది కేసీఆర్‌కి కలసి వచ్చే మొదటి అంశం. దేశంలో నరేంద్ర మోదీ తర్వాత డొక్కశుద్ధి ఉండి, మూడు భాషలలో (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) ధాటిగా ఉపన్యసించే శక్తి, వాగ్దేవికటాక్షం ఉన్న నేత కేసీఆర్. తెలంగాణలో తాను కొన్ని రోజులు లేకపోయినా పరిపాలనకు ఢోకా ఉండదు. కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్‌రావు సమర్థులు. తనను సవాలు చేసే నాయకులు ఎవ్వరూ పార్టీలో లేరు. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటూ కథ నడిపిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఎందరినో ఊరిస్తున్న ప్రధాని పదవి నేడు ఉదయం కేసీఆర్ చెన్నై వెళ్ళి డీఎంకే నేత కరుణానిధితో, ఆయన కుమా రుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమాలోచనలు జరుపుతారు. ఇటీవల లక్నోలో సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్‌ని కేటీఆర్ కలుసుకున్నారు. అఖిలేశ్ కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మే 2న హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. మే మొదటి వారంలోనే భువనేశ్వర్ సందర్శించి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ వేయబోతున్నారు. కాంగ్రెస్ లేని భారతదేశం (కాంగ్రెస్ ముక్త్ భారత్) అంటూ మోదీ నినదిస్తే, కాంగ్రెస్, బీజేపీ లేని భారతదేశం అన్నది కేసీఆర్ నినాదం. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని ప్రతిపక్షాలకూ కలిపి 293 స్థానాలు దక్కినా అవన్నీ ఒకే తాటిపైకి రావడం, సమైక్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడం చాలా కష్టం. చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌లో డీఎంకే ఉంటే ఏఐఏ డీఎంకే బీజేపీతో ఉంటుంది. కేసీఆర్ నిర్మించే ఫ్రంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఉంటే సీపీఎం కాంగ్రెస్‌తో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మూడు మాసాల కిందటే చైన్నై వెళ్ళి స్టాలిన్‌తో సమాలోచన జరిపారు. అఖిలేశ్‌తోనూ, మాయావతితోనూ మాట్లాడారు. ఢిల్లీలో శరద్ పవార్‌నూ, సోనియాగాంధీనీ, ఇతర ప్రతిపక్ష నేతలనూ కలుసుకున్నారు. ఆమెది కాంగ్రెస్ సహిత ఫ్రంట్. కేసీఆర్‌ది బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫ్రంట్. ఈ రెండు ఫ్రంట్లలో ఏది నిలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. లెక్కలు వేసి చూస్తే మమత ప్రతిపాదించే ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతో కొంత కనిపిస్తుంది. ఆమె కలలు ఆమెకు ఉన్నాయి. శరద్ పవార్ ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ములాయంసింగ్ ప్రధాని పదవి కోసమే కొడుకుని లక్నో సింహాసనంపైన 2012లోనే కూర్చోబెట్టారు. జయలలితకి ప్రధాని కావా లనే ఆకాంక్ష బలంగా ఉండేది. అత్యున్నత పదవి తన జన్మహక్కు అని రాహుల్‌గాంధీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల భాగస్వామ్యం లేకుండా, బయటి నుంచి సైతం వాటి మద్దతు లేకుండా కేవలం ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మరోసారి కేసీఆర్‌కి దక్కుతుంది. అటువంటి ప్రభుత్వానికి సారథి కేసీఆర్ అయినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెరమీదికి వస్తారనీ, ప్రభం జనం సృష్టిస్తారనీ, అట్టహాసంగా అధికారంలోకి వస్తారనీ 2013 సెప్టెంబర్ 13వ తేదీకి పూర్వం ఎవరైనా ఊహించారా? మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ వంటి నాయకులందరూ అనూహ్యమైన పరిస్థితులలో ప్రధానులైనవారే. అటువంటప్పుడు కేసీఆర్ ఈ దేశం ముఖియా కావడం పట్ల అభ్యంతరం ఎందుకుండాలి? లక్కు ఉంటే లక్షణంగా కావచ్చు. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నది ఫెడరల్ ఫ్రంట్ భాగస్వాముల ప్రయో జనాలపైనా, నాయకుల అహంభావంపైనా ఆధారపడి ఉంటుంది. దిల్లీ బహుత్ దూర్ హై! కె. రామచంద్రమూర్తి -
స్వయంకృతం
తాము ఏది చేసినా చెల్లుతుందనీ, ఏదైనా తాము మాత్రమే చేయగలమనే భావన స్వానురాగం ఆవహించినవారిలో బలంగా ఉంటుంది. ఎదుటివారి శక్తిని వారు పరిగణనలోకి తీసుకోరు. ఎంతటివారైనా తన శక్తియుక్తుల ముందు బలాదూరని నమ్ముతారు. ఇటువంటి మానసిక స్థితిని నార్సిసిజంగా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ప్రస్తుత స్థితే ప్రధానం. అంతకు ముందు, ఆ తర్వాత స్థితిగతులు ముఖ్యం కాదు. ఎప్పటికీ తమదే పైచేయి కావాలి. ప్రతి పోరాటంలో తామే గెలవాలి. గెలుపు కోసం ఏమి చేసినా తప్పులేదు. వర్తమాన పరిస్థితిలో తాము చేసే ఆలోచనలే వారికి శిరోధార్యం. వాటినే బలంగా నమ్ముతారు. ఈ రోజుకు ముందు అదే విషయంపైన ఏమి అన్నారో పట్టించుకోరు. నిన్న చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు చెప్పి అదే సత్యమంటూ నిస్సంకోచంగా వాదిస్తారు. తమను తాము అమితంగా ప్రేమించుకుంటారు. తమ లోపాలను తాము గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇతరులను అనుకరించినప్పుడు కూడా తామే ఆ పని ప్రప్రథమంగా చేస్తున్నట్టు భావిస్తారు. అటువంటి ఆలోచన తమకి తప్ప మరెవరికీ రాజాలదని అనుకుంటారు. స్వానురాగం జీర్ణించుకున్నవారు ఎవ్వరినీ విశ్వసించరు. తమ నీడను సైతం నమ్మరు. ఎవ్వరినీ ప్రేమించరు. ప్రేమించినట్టు నటిస్తారు. వారిని ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరూ ప్రేమించరు. వాడుకోవడం, వదిలేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కోవకి చెందిన వ్యక్తి. రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తారు. అందుకే కమ్యూనిస్టులతో, బీజేపీతో విడతల వారీగా పొత్తులు పెట్టుకునే విషయంలో స్వీయప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారు. 1994లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రచార సారథి లక్ష్మీపార్వతీ సహిత ఎన్‌టి రామారావు. అప్పటికే చంద్రబాబుకి పార్టీపైన పూర్తి పట్టు వచ్చింది. చాలామంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులతో మమేకమై పనిచేశారు. 1995లో ఎన్‌టి రామారావుని గద్దె దింపి పగ్గాలు చేతపట్టిన తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంలో కమ్యూనిస్టులు సంస్కరణలకు ఆటంకమని నిందించారు. వారిని పక్కన పెట్టారు. కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ వాదించి వారిని అవమానపరిచారు. ఆ తర్వాత కమ్యూనిస్టు భావజాలానికి పూర్తి విరుద్ధమైన భావజాలం కలిగిన బీజేపీతో చెలిమికి మొగ్గు చూపించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో విజయం తర్వాత వాజపేయి ప్రాబల్యం దేశమంతటా పెరి గిందనే అంచనాతో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అఖిలపక్ష సమావేశాలకి సీపీఐ ప్రతినిధులను ఆహ్వానించేవారు కాదు. శాసనసభలో ఆ పార్టీ సభ్యులు ఎవ్వరూ లేరు కనుక పార్టీని పిలువనక్కరలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అవసరం లేదని అనుకుంటారు. మొత్తం ప్రజలందరికీ తానే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వేరే వ్యక్తులు ఎందుకని భావిస్తారు. మంత్రివర్గం అంటూ ఒకటి ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక సొంతంగా ఆలోచించలేని వారిని, విధేయులను ఎంపిక చేసి మంత్రులుగా నియమిస్తారు. అయినప్పటికీ ఐఏఎస్ అధికారులతో స్వయంగా మాట్లాడి ఏ పని చేయాలో, ఏ పని చేయరాదో చెబుతారు. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికలలో పరాజయం అనంతరం బీజేపీకి దూరంగా జరిగారు. 2009లో తిరిగి కమ్యూనిస్టు పార్టీలతో సయోధ్య కుదుర్చుకున్నారు. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ దూరంగా ఉండాలనే విధానంతో కమ్యూనిస్టులు రాజీపడ్డారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్న కమ్యూనిస్టులకు తాజా శత్రువు కాంగ్రెస్. టీడీపీతో తిరిగి భుజం కలపడానికి అభ్యంతరం లేకపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఏకైక ఎజెండా కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి సైతం మహాకూటమిలో స్థానం కల్పించారు. ఎట్లాగైనా గెలవాలనీ, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదనీ ఉద్దేశం. చిరంజీవి నాయకత్వంలోని పీఆర్పీ టీడీపీకి అవరోధంగా ఉండనే ఉన్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. పీఆర్పీ ఆశించినంతగా ఓట్లు సంపాదించలేకపోయింది. మహాకూటమి సైతం ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే చంద్రబాబు టీఆర్ఎస్కి దూరమైనారు. అవకాశవాదానికి పరాకాష్ఠ 2014 నాటికి యూపీఏ–2 అప్రతిష్ఠపాలైనదని గ్రహించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రజలను మెప్పించడం గమనించారు. కమ్యూనిస్టు సోదరులతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభదాయకం అని లెక్కకట్టారు. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీపై గెలవడం కష్టమని భావించారు. ఎందుకైనా మంచిదని సినీ హీరో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళి తనకు మద్దతుగా నిలవాలని అడిగారు. భావసామ్యం లేదు. అవకాశవాదమే నడిపించింది. మోదీ, తానూ, పవన్ కల్యాణ్ కలసి విస్తృతంగా ప్రచారం చేశారు. అడ్డూఅదుపూ లేకుండా హామీలు గుప్పిం చారు. వైఎస్ఆర్సీపీ కంటే రెండు శాతం తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు నాలుగేళ్ళూ అమరావతి నిర్మాణం పేరుతో సింగపూర్, జపాన్, ఇంగ్లండ్ వగైరా దేశాలన్నీ ప్రత్యేక విమానంలో చుట్టి వచ్చారు. మొదటి నుంచీ విదేశాల పట్ల మోజు ఎక్కువ. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎక్కడ జరుగుతుందో సన్నిహితులకు రహస్యంగా సమాచారం అందించారు (ఇన్సైడర్ ట్రేడింగ్). వారు విలువైన స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులను నయానాభయానా ఒప్పించి ముప్పయ్ వేల పైచిలుకు ఎకరాల భూమిని సేకరించారు. ప్రపంచంలోని అయిదు అద్భుత నగరాలలో అమరావతి ఒకటి కావాలన్న కలను పలవరిస్తూ పదవీ కాలంలో అయిదింట నాలుగో వంతు గడిపేశారు. పోలవరం కింద మునిగిపోయే ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని పట్టుబట్టానని తన పుట్టినరోజు ఏప్రిల్ 20న చేసిన ధర్మదీక్ష సమయంలో కూడా పునరుద్ఘాటించారు. ఇది నిజమో, కాదో నరేంద్రమోదీ మాత్రమే చెప్పగలరు. ఆయన మౌనంగా ఉంటారనే చంద్రబాబు నమ్మకం. చంద్రబాబునాయుడూ, బాలకృష్ణ గావు కేకలు పెట్టినా, తర్జని చూపుతూ హెచ్చరించినా, ఎన్డీఏ నుంచి టీ డీపీ నిష్క్రమించినా, కేంద్ర మంత్రిమండలి నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులు వైదొలిగినా మోదీ మౌనం వీడలేదు. ఈ పరిణామాలపైన అమిత్‌షా మాట్లాడారు కానీ మోదీ నోటి నుంచి ఇంత వరకూ ఒక్క మాటకూడా రాలేదు. ఏప్రిల్ 30న తిరుపతిలో నిరసన సభ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎందుకు? తిరుపతిలోనే ప్రత్యేకహోదాపైన మోదీ హామీ ఇచ్చారు కనుక. నాలుగేళ్ళ కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చాలా కాలం పాటు ప్రణాళికా సంఘం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వవలసిందిగా ప్రణాళికా సంఘాన్ని మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆదేశిం చింది. ఆ ఆదేశాలను అమలు చేయాలని ఒక్కసారి కూడా చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కానీ, దాని అధ్యక్షుడు మోదీని కానీ అడగలేదు. విదేశీ పర్యటన రంధిలోనే పుణ్యకాలం గడిచి పోయింది. అంతలో నీతిఆయోగ్ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చాయి. ప్రత్యేకహోదా అనేది ఇక మీదట ఏ రాష్ట్రానికీ ఇవ్వడం సాధ్యం కాదనీ, అందుకు ఆర్థిక సంఘం అంగీకరించదనీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2016 సెప్టెబర్ 8వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటిస్తే అదే రాత్రి చంద్రబాబు అమరావతిలో మీడియా గోష్ఠి నిర్వహించి ప్యాకేజీని స్వాగతిం చారు. ప్యాకేజీని సమర్థిస్తూ రకరకాలుగా మాట్లాడారు. ప్యాకేజీని వ్యతిరేకిస్తే, ప్రత్యేకహోదా కావాలంటూ ఉద్యమిస్తే పీడీ యాక్టు కింద జైల్లో పెడతానంటూ హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? తన శక్తి మీద తనకు అపరిమితమైన నమ్మకం ఉండటం వల్ల. అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలైనా ఇవ్వవచ్చుననీ, ఎన్ని పనులైనా చేయవచ్చుననీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయవచ్చుననీ, దేనినైనా అమలు పరచవచ్చుననీ, అమలు చేయకుండా ఎగవేయవచ్చుననీ విశ్వాసం. ఎన్నికలు కనుచూపు మేరలో లేవు కనుక ప్యాకేజీకి ప్రజలను బలవంతంగానైనా ఒప్పించవచ్చునని భావించారు. ప్రతిపక్షాలకి జవాబు చెప్పవలసిన అవసరాన్ని ఆయన ఎన్నడూ గుర్తించలేదు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడి స్వపక్షీయులతో చప్పట్లు కొట్టించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. బెడిసికొట్టిన ప్యాకేజీ ప్యాకేజీ కథ చంద్రబాబు ఆశించినట్టు జరగలేదు. ప్రజలు ప్రత్యేకహోదాను విస్మరించలేదు. ప్రతిపక్ష నాయకుడు యువభేరి పేరుతో సమావేశాలు నిర్వహించి యువతీయువకులకు ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరించారు. పాదయాత్రలోనూ అదే విషయాన్ని నిత్యం పునరుద్ఘాటిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కొత్త పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ రాష్ట్రానికి రాలేదు. ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాననీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి కింద రెండువేల రూపాయల వంతున చెల్లిస్తామనీ చేసిన ఎన్నికల వాగ్దానాలు గాలికి కొట్టుకొనిపోయాయి. పాదయాత్రలో జనసందోహం నానాటికీ పెరిగి పోతోంది. జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా గాలి వీస్తున్నదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మరో వంక దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గుజరాత్ ఎన్నికలలో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన బతుకు జీవుడా అన్నది. ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ కోల్పోయింది. మోదీకి జనాదరణ తగ్గిపోతోంది. ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్ కోలుకుంటోంది. 2019నాటి ఎన్నికలలో ప్రజలకు చూపించేందుకు తన ప్రభుత్వం సాధించిన విజయం ఒక్కటీ లేదు. ప్రత్యేక విమానంలో పర్యటనలు జరుపుతుండగానే నాలుగేళ్ళూ గడిచిపోయాయి. అమరావతి నగర నిర్మాణంలో ఒక్క ఇటుకను కూడా పేర్చలేదు. పోలవరం పేచీ పరి ష్కారం కాలేదు. రైల్వేజోన్ లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు. దిక్కు తోచలేదు. ఇంతలో ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ అధికారి జైన్ వచ్చి గంటన్నర సేపు మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందనే భయం వెంటాడుతున్నట్టు దీక్ష చివరలో చేసిన ప్రసంగం స్పష్టం చేస్తున్నది. ఈ సంగతి చంద్రబాబునాయుడికి చాలా కాలంగా అనుమానం ఉన్నది. అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినా టీడీపీ ఎంపీల చేత రాజీ నామా చేయించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నట్టు కనిపించినా కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని చిదంబరం, గులాంనబీ ఆజాద్‌తో సంబంధాలు పెట్టుకున్నట్టే బీజేపీ అగ్రనాయకులు కొందరితో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీమణికి తిరుమల తిరుపతి దేవస్థానం మండలిలో సభ్యత్వం ఇచ్చారు. స్వామికార్యం, స్వకార్యం కోసం మాజీ మంత్రి సుజనా చౌదరికి బీజేపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోక తప్పదు. ఇటువంటి గందరగోళం కారణంగా చంద్రబాబు ఒక మాట మీద నిలబడలేకపోవడం, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోవడం కనిపిస్తున్నది. లోపల పీడిస్తున్న భయాందోళనలను కప్పిపుచ్చుకోవడానికే గట్టిగా, సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడటం. అంతా స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. హెచ్చులకు పోయి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. కె. రామచంద్రమూర్తి -
కాళేశ్వర స్వప్న సాకారం
ఒక బృహత్తరమైన ప్రాజెక్టును స్వప్నించి, సకల అనుమతులూ సాధించి, కోర్టు కేసులను అధిగమించి, పొరుగు రాష్ట్రంతో వివాదం పరిష్కరించుకొని, నిధులు సమకూర్చుకొని, నిర్మాణం పూర్తి చేసి, సాగునీరూ, తాగునీరూ అందించడం అనే మహాయజ్ఞాన్ని అయిదేళ్ళ వ్యవధిలో పూర్తి చేయడం దేశంలో ఎక్కడా ఇంతవరకూ జరగలేదు. నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌కు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి పుష్కరకాలం పట్టింది. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలి ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. నర్మదానదిపైన సర్దార్ సరోవర్ డామ్‌కు నెహ్రూ 1961 ఏప్రిల్ 5న శంకుస్థాపన చేస్తే 55 సంవత్సరాల అనంతరం డామ్‌ను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భాక్రా–నంగల్ డామ్ నిర్మాణం తొమ్మిదేళ్ళలో పూర్తయింది. దానికి శంకుస్థాపన (1955), ప్రారంభోత్సవం (1963) కూడా నెహ్రూ చేతుల మీదుగా జరగడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ దేశానికి మేలు చేయలేదనీ, తీరని అపకారం చేశారనీ వాదించే కొందరు వర్తమాన రాజకీయ నాయకులు చరిత్ర తెలుసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రకు ఎక్కనున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007–08లో నిర్మాణం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకానికి అధిగమించలేని అడ్డంకులు కొన్ని ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం తమ్మిడిహట్టి (పెన్‌గంగ, వార్థా నదుల సంగమ ప్రదేశం) వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బ్యారేజి నిర్మించి 160 టీఎంసీల ప్రాణహిత నీటిని ఎల్లంపల్లి బ్యారేజికి తరలించడం. అక్కడి నుంచి మిడ్‌మానేరు, తడ్కపల్లి, పాములపర్తి, చేవెళ్లకు నీరు చేరవేయడం. ఈ ప్రాజెక్టు కింద 16. 40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుందని అంచనా. తమ భూభాగంలో ముంపును అనుమతించబోమంటూ సరిహద్దులోని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రివర్ లెవల్)ని 148 మీటర్లకు తగ్గించాలని ఉడుంపట్టు పట్టింది. ప్రాణహిత ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యంపైన కేంద్ర జలసంఘం అనుమానాలు వెలిబుచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఎగువ ప్రాజెక్టుల అవసరాలకు పోను తమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద 273.14 టిఎంసీల నీరు లభ్యం అవుతుంది. కానీ జలసంఘం లెక్కల ప్రకారం అక్కడ లభ్యమయ్యే నీటి పరిమాణం 165 టీఎంసీలకు మించదు. ఇందులో 63 టీఎంసీలు ఎగువ ప్రాజెక్టులు వాడుకుంటున్నాయని జలసంఘమే చెప్పింది. అందువల్ల తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం గురించి పునరాలోచించాలని సూచించింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సర్వేలు జరిపిన తర్వాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ఉత్తమం అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ 283 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. అందువల్ల ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టును సమూలంగా మార్చవలసి (రీడిజైనింగ్ చేయవలసి) వచ్చింది. రీడిజైనింగ్ ఆవశ్యకత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండుగా విభజించింది. ఒకటి, బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు. తమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద ప్రాజెక్టు నిర్మించి 20 టీఎంసీల నీరు తరలించి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. రెండు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఒక బ్యారేజీ నిర్మించడం, దానికి ఎగువన అన్నారం, సుందిళ్ళ గ్రామాల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించడం, 180 టీఎంసీల నీరు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయడం కొత్త ప్రణాళిక. 13 కొత్త జిల్లాలలోని 18. 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన జలాశయాలూ, టన్నళ్ళూ, పంప్హౌజ్లూ, కాలువలూ గట్రా నిర్మించాలి. ఇంత భారీ ప్రాజెక్టును నెత్తికెత్తుకోవడం ఒక సాహసం. అత్యంత క్లిష్టమైన ఈ ప్రాజెక్టు అన్ని అవరోధాలనూ దాటుకుంటూ వచ్చింది. పనులు వేగంగా, సమర్థంగా జరుగుతున్నాయి. నీటి పారుదల మంత్రి హరీష్‌రావు పరుగెడుతూ, నిర్మాణ సంస్థలనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ పరుగెత్తిస్తున్నారు. పనులను పర్యవేక్షించేందుకు ఇంతవరకూ 20 విడతల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను మంత్రి సందర్శించారు. ప్రాజెక్టు రూపశిల్పి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్). శంకుస్థాపన చేయడం, ఇటీవల గవర్నర్ నరసింహ న్‌తో కలసి ప్రాజెక్టును సందర్శించడంతో పాటు కేసీఆర్ పనుల పురోగతిని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికీ, తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కీ ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ఘనకార్యాలు. 2019 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మునుపే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలని ప్రయత్నం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మంజూ రుకు అనుసరించవలసిన విధివిధానాలను రూపొందించే కమిటీకి నాయకత్వం వహించే అవకాశం నాకు ప్రభుత్వం కల్పించింది. కమిటీ నాలుగు విడతల సమాలోచన జరిపి తయారుచేసిన నివేదికను సమర్పించేందుకు బాధ్యులమంతా కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం. నివేదికను స్వీకరించి, వివరాలు టూకీగా తెలుసుకున్న అనంతరం హాలులో రెండు పాయలుగా కుర్చీలు వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మమ్మల్ని కూర్చోమన్నారు. ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ (పునఃరూపకల్పన) ఏ విధంగా చేసిందీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్వయంగా చేస్తూ వివరించారు. తర్వాత అసెంబ్లీలోనూ కాళేశ్వరం రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయో, ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందో చెప్పారు. అసెంబ్లీలో జరిగిన చర్చను ఆలకించాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులపైన ‘స్టే’ ఇవ్వడం గమనించాం. ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013 నాటి చట్టాన్ని విధిగా పాటించాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ షరతు విధించిందని తెలుసుకున్నాం. ఈ చట్టాన్ని పూర్వపక్షం చేస్తూ 2015లో ప్రభుత్వం 123 వ నంబరు జీవో జారీ చేసింది. దాన్ని హైకోర్టు నిరుడు కొట్టివేసింది. వెంటనే కొత్త భూసేకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. గ్రీన్ ట్రిబ్యూనల్ ‘స్టే’ని ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసింది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అంతకు మునుపే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కేంద్ర జలసంఘానికి రాసిన లేఖలో పెక్కు అభ్యంతరాలను లేవనెత్తింది. ఎంత విస్తీర్ణానికి సాగునీరు అందుతుందనే విషయంలోనూ, ఎంత నీరు మళ్ళిస్తారనే అంశంలోనూ, ఎంత ప్రాంతం ముంపునకు గురి అవుతుందనే వివరాలలోనూ, అంత భారీ స్థాయిలో నీటిని పంపు చేయడానికి అవసరమైన విద్యుచ్ఛక్తి తెలంగాణలో ఉన్నదా అనే ప్రశ్నపైనా గోదావరి బోర్డు అనుమానాలు వెలిబుచ్చింది. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు భారీ ప్రాజెక్టులను వ్యతిరేకించేవారూ, భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తికరమైన పరిహారం ఇవ్వాలని వాదించేవారూ, పర్యావరణానికి హాని కలగరాదంటూ పోరాడేవారూ, అటవీప్రాంత విస్తీర్ణం తగ్గకూడదని పట్టుపట్టేవారూ అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టే తెలంగాణలోనూ ఉన్నారు. వారు ప్రజాకంటకులూ, ప్రగతి నిరోధకులూ కారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరులందరికీ ప్రశ్నించే హక్కు ప్రసాదించింది. తమ తరఫున పోరాడేవారు ఉన్నారనే ఎరుకే ప్రజలకు ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం పెంచుతుంది. సర్దార్ సరోవర్ నిర్వాసితుల తరఫున మేధాపాట్కర్ అనేక సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ ఆమెను ప్రజావ్యతిరేకిగా ఎవ్వరూ అభివర్ణించడం లేదు. అటువంటివారికీ, కేంద్ర సంస్థలకీ, న్యాయస్థానాలకీ నచ్చజెప్పి నెగ్గుకు రావడం పాలకుల బాధ్యత. ప్రగతి ఫలాలు ప్రజలకు అందివచ్చినప్పుడు నిర్మాణ క్రమంలో ఎదురైన వివాదాలను విస్మరిస్తాం. తెలంగాణ ప్రభుత్వం చాలా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించింది. కేసీఆర్ ముంబయ్ వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించి, ఆయన భయసందేహాలను తీర్చి, ఉభయతారకంగా పరి ష్కారం ప్రతిపాదించి, ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతింపజేశారు. వివిధ జాతీయ సంస్థల నుంచి అనుమతులు సంపాదించారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు ఎట్లా జరుగుతున్నాయనే విషయంలో నాబోటివారికి అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిని చూసిరావాలని అనుకుంటూనే నెలలు గడిచిపోయాయి. మసూద్ పర్యటన ‘కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్) అధ్యక్షుడూ, నేనూ హెలికాప్టర్లో కాళేశ్వరం వెడుతున్నాం. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావచ్చు. మాతో మీరూ వస్తే బాగుంటుంది,’ అని హరీష్ పిలిచారు. వారితో కలసి సోమవారంనాడు (ఏప్రిల్ 9) నేనూ, బుద్ధవనం ప్రాజెక్టు సారథి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్ళాం. కేంద్ర జలసంఘం అధ్యక్షుడు మసూద్ హుస్సేన్, మరి ఇద్దరు కేంద్ర అధికారులూ, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధరరావు, చీఫ్ ఇంజ నీర్ హరేరామ్ అధికార బృందంలో ఉన్నారు. హెలికాప్టర్ ఎక్కడానికి ముందు, ఎక్కిన తర్వాత మసూద్ హుస్సేన్ మనసులో ఏమున్నదో తెలియదు. ఏమి చూడబోతున్నారో ఊహించి ఉండరు. కేంద్ర జలసంఘం అధికారులకు ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం ప్రోత్సాహకరంగా లేదు. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించగలదా అనే సందేహం ఢిల్లీలో చాలామందికి ఉంది. మొదటి మజిలీ మేడిగడ్డలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ చకచకా జరుగుతున్న పనులు గమనిస్తుంటే ఆయనకు అడుగడుగునా విస్మయం. అనంతరం అన్నారంలో అద్భుతాలు చూసి ఆనందం. మూడో అడుగు ఎల్లంపల్లిలో. అన్నారం, ఎల్లంపల్లిలో టన్నెళ్ళ, పంపుహౌస్‌ల చూసి పరవశం. చివరగా భూగర్భంలో సబ్‌స్టేషన్ నిర్మాణం తిలకించిన తర్వాత పులకింత. మసూద్ హుస్సేన్ వంటి అనుభవజ్ఞుడైన ఇంజనీర్ పర్యటన ముగింపు దశలో రామడుగు (కరీంనగర్ జిల్లా)లో మీడియా ప్రతినిధులను కలుసుకునే సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమానాలూ నివృత్తి చేసుకొని నిర్వాహకులను మనసారా అభినందించడానికి సిద్ధమైపోయారు. మీడియా గోష్ఠిలో తెలంగాణ సర్కార్‌నూ, హరీష్‌రావునూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి ప్రాజెక్టును ఇంతకు మునుపు ఆయన ఎక్కడా చూడలేదు. ఇంత వేగంగా దేశంలో మరెక్కడా పని జరగడంలేదు. ఇంత జటిలమైన ప్రాజెక్టు, ఇంత ఎత్తుకు (మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకూ సుమారు 520 మీటర్లు ఎత్తు) నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. వివాదాలూ, అభ్యంతరాలూ, వ్యాజ్యాలూ ఒక వైపు సాగుతుంటే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం పని ఆగకుండా రహస్యోద్యమంలాగా కొనసాగింది. కలసి వచ్చిన అంశం ఏమంటే భారీ నిర్మాణాల అనుభవం కలిగిన ఎల్ అండ్ టి, నవయుగ, మెఘా, ఆఫ్కాన్స్,హెచ్ఇఎస్, సీమన్స్ వంటి కంపెనీలు కాలంతో పరుగులు తీస్తూ పనులు పూర్తి చేస్తున్నాయి. బీహెచ్ఇఎల్ పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటున్నది. తెలంగాణ ఉద్యమానికి మూలకారణమైన మూడు అంశాలు నీరు, నిధులు, నియామకాలు. సాగునీటి సమస్య పరి ష్కారానికి ఈ ప్రాజెక్టు నిశ్చయంగా దోహదం చేస్తుంది. కె. రామచంద్రమూర్తి -
నిజాలు నిగ్గు తేలాలి!
త్రికాలమ్ ‘చంద్రబాబునాయుడు 29 విడతలు ఢిల్లీ వచ్చినట్టు పదేపదే చెబుతున్నారు. ఒక్క పని కూడా కాలేదంటున్నారు. నిజమే. కానీ ఆయన వచ్చిన ప్రతిసారీ మూడే మూడు విషయాలు అడిగేవారు. ఒకటి, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్‌రెడ్డిపైన ఉన్న కేసుల విచారణ వేగం పెంచి, దోషిగా నిర్ధారించి జైలుకు పంపాలి. రెండు, శాసనసభ స్థానాల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు సత్వరం తీసుకోండి. మూడు, పోలవరం ప్రాజెక్టుకు తాను అడుగుతున్న నిధులన్నీ ఒక్క విడతలోనే ఇచ్చేయాలి. అంతే కానీ, ప్రత్యేకహోదా గురించి ఆయన ప్రస్తావించనేలేదు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనకు ఆయన ఆనందంగా అంగీకరించారు. పైగా రాష్ట్రానికి గొప్ప మేలు చేశానంటూ చెప్పుకున్నారు కూడా. అటువంటి వ్యక్తి మంత్రులను ఉపసంహ రించుకోవడం, మన ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ నోటీసు ఇవ్వడం విడ్డూరం.’ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమా వేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ మాటలు అన్నారని సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబునాయుడు చాలా సమర్థవంతంగా ‘మార్కెటింగ్’ చేశారని (ప్రజలు ఒప్పుకునే విధంగా వివరించారని) బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని రాష్ట్రాల నాయకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఎన్డీఏ కావచ్చు. యూపీఏ కావచ్చు. కేంద్ర ప్రభుత్వం కోసం పని చేసే నిఘా విభాగం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యక్రమాలపైన కూడా కేంద్రానికి అవగాహన ఉంటుంది. ప్యాకేజీతో చంద్రబాబునాయుడు సరిపుచ్చుకున్నారనే మొన్నటి వరకూ ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల అభిప్రాయం. అందుకే ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్డీఏ సర్కార్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ టిక్కెట్టుపైన గెలిచిన ముగ్గురు లోక్‌సభ సభ్యులు పార్టీ ఫిరాయించారు. వారిపైన అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్సీపీ లోక్‌సభ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకూ ఆ పిటిషన్‌పైన స్పీకర్ చర్య తీసుకోలేదు. ఓటుకు కోట్ల కేసు వివరాలు ప్రధాని నరేంద్రమోదీకీ, అమిత్‌షాకీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కొందరు అప్పుడే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది శాసన సభ్యులను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయింపజేసిన వైనం సైతం కేంద్ర నాయకత్వానికి తెలుసు. చీటికీమాటీకీ ప్రత్యేక విమానంలో విదేశాలకు చంద్రబాబునాయుడు వెళ్ళిరావడం కూడా కేంద్రం దృష్టిలో ఉంది. పోలవరం పనులలో అక్రమాలూ, అవినీతీ జరుగుతున్న సమాచారం కేంద్ర మంత్రులకు తెలుసు. మసూద్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, రాజకీయ, నైతిక విలువలకు పాతరేసినా ముఖ్య మంత్రిని కేంద్రం ఒక్క మాట అనలేదు. నిజానికి అది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. దాన్ని ‘మిత్రధర్మం’ అని పిలవడం ఆత్మవంచన, పరవంచన. మిత్రులు కలసి ప్రజలకు మేలు చేయాలి కానీ ద్రోహం చేయకూడదు. ‘కేవలం రాజకీయ కారణాల వల్ల మీరు ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు కానీ రాష్ట్ర అభివృద్ధికోసం మాత్రం కాదు,’ అంటూ అమిత్ షా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో నిష్టురమాడారు. అమిత్ షా లేఖ కలకలం సృష్టించింది. లేఖాంశాలు బట్టబయలు కాగానే చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్ స్పందించారు. అమిత్ షాకి రాష్ట్రానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం లేదంటూ ధ్వజమెత్తారు. మధ్యాహ్నం రెండున్నరకు శాసనసభలో చంద్రబాబునాయుడు ఉపన్యాసం ప్రారంభించి సుదీర్ఘంగా రెండున్నర గంటలు సాగించారు. అమిత్‌షాను ఏకిపారేశారు. మర్యాద, మన్నన లేకుండా లేఖ రాశారంటూ తప్పుపట్టారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు అసత్యాలు చెప్పరాదంటూ ప్రబోధించారు. ఎందుకోసం ఎదురుదాడి? ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ఎన్డీఏ చివరి బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో సమర్పించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యా యం జరిగిపోతోందంటూ చంద్రబాబునాయుడు హడావుడి చేయడం వెనుక ఒక గుర్తింపు ఉన్నది. ఒక పథకం ఉన్నది. తాను ఊహించని విధంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకున్నది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావి వర్గాలూ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగ ణించాయి. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం తెలుగువారిని అవమానించడమే అన్న అభిప్రాయం జనసామాన్యంలో బలపడింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యేకహోదా ప్రధానమైన నిర్ణాయకాంశం అవుతుందనే భయం పట్టుకుంది. కేంద్రంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) సర్కార్, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం (టీడీపీ) ప్రభుత్వం కలసి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఆంధ్రు లకు ద్రోహం చేశాయనే వాస్తవం ప్రజలకు అర్థమైపోయింది. వారిలో ఆవేశం, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి. తాను రూటు మార్చకపోతే వచ్చే ఎన్నికలలో దారుణంగా దెబ్బతినడం ఖాయమని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు చేయడంలోనూ, ప్రత్యేకహోదా సాధించడంలోనూ తాను విఫలమైన సంగతి గమనించారు. ఈ వైఫల్యాలు తనను వెంటాడి ఎన్నికలలో ఓడిస్తాయని గ్రహించారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం రచించారు. తన వైఫల్యాలన్నింటికీ ఎన్డీఏ ప్రభుత్వ సహాయ నిరాకరణ ధోరణి కారణమనే ఒక అభిప్రాయాన్ని సానుకూల మీడియా ద్వారా, అసెంబ్లీలో తన సుదీర్ఘ ప్రసంగాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రబలంగా నిర్మించాలని నిర్ణయించారు. తనపైనా, తనయుడిపైనా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడం కోసం విచారణ సంస్థలను పురమాయించకముందే ఎదురుదాడికి దిగడం శ్రేయస్కరమని చంద్రబాబునాయుడు భావించి ఉంటారు. ఇప్పుడు కేసులు పెడితే ఎదురు తిరిగారు కనుక కేసులు బనాయించారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతి సంపా దించవచ్చు, ఎన్నికలలో గట్టెక్కవచ్చు. కేసులు పెట్టిన తర్వాత ఎదురు తిరిగితే కేసు పెట్టారు కనుక ఎదురు తిరిగారని ప్రజలు అనుకుంటారు. అప్పుడు చంద్రబాబునాయుడికి సానుభూతి రాదు. అందుకని సమయజ్ఞత పాటించి చంద్రబాబునాయుడు కేంద్రంపైన దాడి ప్రారంభించారు. కానీ మోదీ నైజం తెలిసిన ఢిల్లీ పెద్దలు చంద్రబాబునాయుడికి హితవు చెబుతూనే ఉన్నారు. మోదీతో పెట్టుకుంటే కష్టమంటూ హెచ్చరించారు. పైకి గంభీరంగా తర్జని చూపిస్తూ గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ లోలోన భయం పీడిస్తూనే ఉంది. అందుకే తడబాటు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని అరుణ్ జైట్లీ దగ్గరికి పంపించింది ఈ కారణంగానే. అటు తానే, ఇటు తానే చంద్రబాబునాయుడికి ఒక అరుదైన లక్షణం ఉన్నది. తన ప్రత్యర్థులతో ప్రతి రోజూ పోల్చుకుంటారు. ప్రతి రోజూ ప్రత్యర్థిపైన ఆధిక్యం సాధించాలని తపి స్తుంటారు. అధికారంలో ఉంటూనే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషిం చాలని ప్రయత్నిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఏమి మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండదు. ముఖ్య మంత్రి హోదాలో మట్లాడే సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏమన్నారో మరచిపోతారు. ఉదాహరణకు ప్యాకేజీని పొగిడిన సంగతి ప్రత్యేక హోదా అడిగే సమయంలో గుర్తు ఉండదు. నాలుగేళ్ళ తర్వాత హోదా కోసం అడగడం ప్రారంభించినప్పటికీ నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాడుతున్నట్టు ప్రజలను నమ్మించాలని ప్రయత్నం. నాలుగేళ్ళుగా నిజంగా పోరాడుతున్న పార్టీ లనూ, నాయకులనూ పూర్వపక్షం చేసి తానే అగ్రగామినంటూ చాటుకోవాలన్న ఆరాటం. ఏ పాత్ర పోషించే సమయంలో ఆ పాత్రలో లీనమైపోతారు. ఆ పాత్రను పండించడానికి శతవిధాలా కృషి చేస్తారు. ప్యాకేజీని సమర్థిస్తూ ఎంత సమర్థంగా వాదించగలరో, ప్యాకేజీని వ్యతిరేకిస్తూ అంతే బలంగా వాదన విని పించగలరు. ఇటువంటి వ్యక్తులకు సత్యాసత్య విచక్షణ కానీ ధర్మాధర్మ వివేచన కానీ ఉండవు. తమ వాదనను గెలిపించుకోవడానికీ, తమ ప్రయోజనం నెర వేర్చుకోవడానికీ ఏది అవసరమో అదే చెబుతారు. తాము చెప్పిందే సత్యం. తమపైన దాడి చేస్తే యావదాంధ్రులపైనా దాడి చేసినట్టే. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పింది కనుకనే కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయిందనీ మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా గురించి మాట్లాడనే లేదని, సంఘంలో సభ్యుడిగా పని చేసిన వ్యక్తి ఈ విషయం స్పష్టంగా చెప్పారనీ ఇప్పుడు వాదిస్తున్నారు. గత మూడేళ్ళుగా ప్రతిపక్ష నాయ కుడు జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావులూ, నాబోటి పాత్రి కేయులూ చెబుతూ వస్తున్నది అదే. ఆర్థికసంఘం అధ్యక్షుడు వై. వేణు గోపాలరెడ్డి స్వయంగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో, మంథన్ వేదికపైనా ఆ విషయం స్పష్టం చేశారని కూడా చెప్పాం. ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజీత్సేన్ లిఖితపూర్వకంగా ఈ విషయం నిర్ధారించారని కూడా తెలియ జేశాం. అప్పుడు మా మాట వినిపించుకోకుండా అడ్డంగా దబాయిస్తూ, ప్రత్యేకహోదా సంజీవిని కాదని బుకాయిస్తూ, ఇప్పుడు అదే వాదన మనకు వినిపించడం అదరగండం కాకపోతే ఏమిటి? ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకూ జీఎస్టీ నుంచి మినహాయింపులను 2027 వరకూ పొడిగిస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది 2017 ఆగస్టులో. ఈ నిర్ణయాన్ని సిఫార్సు చేసిన జీఎస్టీ మండలిలో ప్రతి రాష్ట్ర అర్థిక మంత్రికీ సభ్యత్వం ఉంది. ఈ అంశంపైన చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు సభలో ఉన్నారు. ఈ నిర్ణయం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ముఖ్యమంత్రికి ఈ విషయం అప్పుడే చెప్పి ఉంటారు. 2017 ఆగస్టు నుంచి 2018 ఫిబ్రవరి వరకూ ఈ సంగతి ముఖ్యమంత్రి ప్రస్తావించనేలేదు. 2018 జనవరి 12న మోదీని కలుసుకున్నప్పుడు సైతం ఈ అంశం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడలేదు. ఇప్పుడు అదే అంశంపైన కేంద్రాన్ని నిలదీస్తున్నట్టు స్వరం పెంచి మాట్లాడుతున్నారు. నాటకీయతకేమీ కొదవ లేదు. సుదీర్ఘ ప్రసంగాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసం గానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపైన చర్చకు సమాధానం ఇస్తూ మార్చి 7న చంద్రబాబునాయుడు రెండు గంటల సేపు మాట్లాడారు. అప్పటి నుంచి దాదాపు ప్రతి రోజూ సగటున రెండు గంటల సేపు మాట్లాడుతూనే ఉన్నారు. శనివారంనాడు అమిత్‌షా లేఖను ఆసాంతం చదివి వినిపిస్తూ ప్రతి వాక్యాన్నీ ఖండించారు. లేఖలో పేర్కొన్న వాస్తవాలని సైతం అంగీకరించకుండా దాడి చేశారు. ఆ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాకుండా ఆంధ్రులందరినీ అవమానించిందనీ, చులకన చేసిందనీ ఇటీవల సంభవించిన పరిణామాలను ఉటంకిస్తూ విమర్శించారు. ఈ ఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర గంద రగోళంలో పడవేశాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వంపైన బీజేపీ నాయకుడు వీర్రాజు చేసిన ఆరోపణలూ, లోకేశ్‌పైన పవన్‌కల్యాణ్ చేసిన అవినీతి ఆరో పణలూ, ‘ఆపరేషన్ ద్రవిడ’లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్ గరుడ’ను బీజేపీ అమలు చేయబోతున్నదంటూ నటుడు శివాజీ టీవీ చానళ్ళలో చేస్తున్న హడావిడి ప్రజలను తికమకపెడుతున్నాయి. ఎవరి వెనుక ఎవరు ఉన్నారో, ఎవరి బంటు ఎవరో, ఎవరి ఎజెండా ఏమిటో తెలియక ప్రజలు అయో మయంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోపణాస్త్రాలు అన్ని వైపుల నుంచీ దూసుకొని వస్తున్న వాతావరణంలో ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక, పరిపాలన పైనా, అభివృద్ధిపైనా పాలకులు దృష్టి కేంద్రీకరించలేని అస్తవ్యస్త పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రకరకాలుగా వేలకోట్ల రూపాయల కైంక ర్యం జరిగిందనే ఆరోపణలన్నిటిపైనా విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చడం అందరికీ మంచిది. - కె. రామచంద్రమూర్తి -
చక్రబంధంలో చంద్రబాబు
త్రికాలమ్ నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అత్యంత లాఘవంగా వైదొలిగిన తీరు బీజేపీ అగ్రనేతలకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. తెలుగువారికి, ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడి రాజకీయాలను నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నవారికి, ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. రాజకీయాలలో విజయాలు సాధించేందుకే నాయకులందరూ శ్రమిస్తారు. పోటీ రాజకీయంలో, అదను చూసి ప్రత్యర్థిని దెబ్బ తీయడంలో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలూ, వ్యూహాలూ, నిర్ణయాలూ మార్చుకొని వేగంగా పావులు కదపడంలో ఆరితేరినవారు కొందరే ఉంటారు. వారిలో అగ్రగణ్యుడు చంద్రబాబు. అవకాశవాదం, తెగింపు, స్వోత్కర్ష, అసత్యాలను పదేపదే వల్లించడం, తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకొని విజయం సాధిం చడం టీడీపీ అధినేతలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. ఈ క్రీడలో రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ స్థానం లేదు. నలభై ఏళ్ళ కిందట కాంగ్రెస్ (ఐ) టిక్కెట్టు ఇప్పించిన రాజగోపాలనాయుడూ, అమరనాథరెడ్డి దగ్గరి నుంచీ, పిల్లనిచ్చిన ఎన్‌టి రామారావు, అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించడానికి తోడ్పడిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 1999లో కార్గిల్ యుద్ధానంతర సానుకూల పవనాల ఫలితంగా ఎన్నికలలో గెలిచేందుకు సహకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయి–లాల్‌కృష్ణ అడ్వాణీ ద్వయం, 2014లో టీడీపీ విజయానికి స్వీయ ప్రాబల్యంతో సాయపడిన నరేంద్ర మోదీ అందరూ చంద్రబాబు దృష్టిలో తిరస్కృతులే. అవసరం ఉన్నం తవరకూ ఉపయోగించుకున్నారు. అక్కర తీరిన తర్వాత తెగతెంపులు చేసుకున్నారు. ఇందులో సెంటిమెంటుకు తావు లేదు. అవకాశవాద రాజకీయాలలో ఇది అనివార్యం. నిష్కర్షగా ఉండాలి. గెలుపు కోసం ఏమి చేయడం అవసరమో అదే చేయాలి. చంద్రబాబులో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు నరేంద్ర మోదీలో సైతం కనిపిస్తాయి. మార్గం కంటే లక్ష్య సాధన ప్రధానం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా ప్రభంజనం వీస్తోంది. ఈ పెనుగాలులను సృష్టించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రత్యేక హోదా కావాలంటూ జగన్మోహన్రెడ్డి నిరసన ప్రకటించినప్పుడూ, నిరశన దీక్ష చేపట్టినప్పుడు, యువభేరి సమావేశాలలో ప్రసంగాలు చేసినప్పుడూ, పాదయాత్రలో జరిగిన సభలకు హాజరైన జనసందోహాలను ఉద్దేశించి ఉపన్యసించినప్పుడూ ప్రజలలో చైతన్యం రగిలింది. జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, ఉద్యమసంస్థల నేతలూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న సమయంలో చంద్రబాబు మోదీ భజన చేస్తున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటూ ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆకాశానికి ఎత్తి పొగడ్తల్లో ముంచెత్తారు. దాన్ని సుసాధ్యం చేసిన నాటి కేంద్రమంత్రి, నేటి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి సన్మానం చేశారు. తాను ఏమి చేసినా ప్రజలను ఒప్పించగలననే ఆత్మవిశ్వాసంతో బాబు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. మీడియా, సామాజిక శక్తులూ, పార్టీ సహచరులూ, కార్యకర్తల ప్రచారం ద్వారా ప్రజలను నమ్మించే శక్తియుక్తులు (మార్కెటింగ్ స్కిల్స్) తనకు దండిగా ఉన్నాయని ఆయన 1995 ఆగస్టులోనే నిరూపించారు. అయితే, రాజకీయాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. అన్ని శక్తులూ అన్ని వేళలా పనిచేయవు. ప్రత్యర్థులు మారుతుంటారు. వ్యూహాలు మారుతుంటాయి. క్షేత్ర వాస్తవికతను చప్పున గ్రహించి అందుకు తగిన చర్యలు వేగంగా తీసుకునే శక్తి వయసు పెరిగిన కొద్దీ ఎంతోకొంత మందగిస్తుంది. ఎన్‌టిఆర్‌ను గద్దె దించి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకీ, ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు పనిచేసిన వ్యక్తికీ తేడా ఉంది. 34 ఏళ్ళ క్రితం టీడీపీ శాసనసభ్యుల శిబిరాలు నిర్వహించి నాదెండ్ల భాస్కరరావు ఆట కట్టించిన బాబుకూ, 23 సంవత్సరాల కిందట అత్యంత ఉత్కంఠ భరితమైన రాజకీయ విన్యాసాలతో ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన గుండెలు తీసిన బంటుకీ, 2014 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికీ అంతరం ఉంది. కడచిన ఆరుమాసాలుగా బాబు వ్యవహరి స్తున్న తీరు ఆయనను ఎరిగిన అనేకమందికి విస్తుకొల్పుతున్నది. ఇదివరకటి వేగం లేదు. ఏకాగ్ర చిత్తం లేదు. సమయస్ఫూర్తి లేదు. కుశాగ్రబుద్ధి లేదు. రణకౌశలం లేదు. విల్లు సంధించే సమయంలో చేయి వణుకుతోంది. బాణం గురి తప్పుతోంది. ఏమున్నది గర్వకారణం? అయిదేళ్ళలో సాధించిన ఘనకార్యాలను చూపి మరో అయిదేళ్ళు తన పార్టీని ఎన్నుకోమని ప్రజలను కోరాలని అందరి కంటే ఎక్కువగా బాబుకు తెలుసు. కానీ గత నాలుగేళ్ళలో సాధించింది ఒక్కటీ లేదు. రాజధాని నిర్మాణం ఇంకా డిజైన్ల దశ దాటలేదు. పోలవరం స్వప్న సాకారం కాలేదు. రైల్వే జోన్ దరిదాపులలో లేదు. కడపలో స్టీలు ఫ్యాక్టరీ లేదు. పట్టిసీమ వంటి వ్యర్థమైన ప్రాజెక్టులూ, తాత్కాలిక శాసనసభా ప్రాంగణం, సచివాలయం మినహా ఏమున్నది? ప్రత్యేక విమానంలో ఎన్ని దేశాలు పర్యటించి వచ్చినా, ఎన్ని సదస్సులు నిర్వహించినా, ఎంత హడావిడి చేసినా ఏమిటి ప్రయోజనం? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నది ముఖ్యం. మన అభివృద్ధి రేటు 12 శాతం అని ఊదరకొట్టినా, వ్యాపారం చేయడంలో సౌలభ్యం కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నదంటూ పదేపదే చెప్పుకున్నా, ఇతరులతో చెప్పించినా ప్రజలకు అర్థం కాదు. స్వానుభవం మాత్రమే వారికి అర్థం అవుతుంది. తనకంటే సీనియర్లు కరుణానిధీ, అడ్వాణీ, ములా యం వంటి నేతలు అనేక మంది ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా తానే సీనియర్ని అంటూ పదేపదే చెప్పుకోవడం వల్ల అబద్ధం నిజం అవుతుందా? తాము చదివినదానికీ, చూసినదానికీ తమ అనుభవానికీ మధ్య సామీప్యం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. కేవలం మీడియా ప్రోత్సాహం సరిపోదనీ, ప్రజల సానుకూలత అత్యవసరమనీ దేశంలో 66 సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలు ప్రతిసారీ నిరూపించాయి. ప్రజలలో సానుకూలత లేకపోగా ఆగ్రహం ఉన్నదని జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా జరుగుతున్న సభలకు హాజరు అవుతున్న ప్రజల సంఖ్య, వారి హావభావాలు స్పష్టం చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగానైనా బాబు ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రత్యేకహోదా రాబోయే ఎన్నికలలో బలమైన అస్త్రం కాబోతున్నదని గ్రహించారు. ఎన్డీఏ సర్కార్ చివరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ప్రత్యేకంగా కేటాయించకపోవడాన్ని అవకాశంగా తీసుకొని సంకీర్ణం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మునుపు అమలు చేసినంత వేగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు. ఏవేవో అనుమానాలూ, భయాలూ. ప్రత్యర్థుల పట్ల మోదీ, అమిత్‌షాల వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో నాలుగేళ్ళుగా చూస్తూనే ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ ఎన్ని కష్టాలు పడుతున్నాడో గమనిస్తున్నారు. పైకి ఏమి బుకాయించినా తనకున్న విస్తృతమైన సంబంధాలను వినియోగించి, న్యాయవ్యవస్థలో ‘నాట్ బిఫోర్’వంటి నిబంధనలు వాడుకొని అనేక కేసులలో స్టేలు సంపాదించిన బాబుకు భయసందేహాలు ఉండటం సహజం. అందుకే ఎన్డీఏ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయం తీసుకోవడం కష్టతరమైనది. ఈ విషయం ఆలోచిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి ఎజెండా నిర్ణయించడం ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం ఫలానా తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. కేంద్రం దిగిరాకపోతే తన పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు. అంతవరకూ ప్రత్యేకహోదా సంజీవిని కాదనీ, ఆ హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు ఒరిగింది ఏమీ లేదనీ, ఉద్యమం చేస్తే పీడీ యాక్ట్ కింద జైల్లో పెడతామనీ హెచ్చిస్తూ వచ్చిన బాబు వెంటనే రూటు మార్చవలసిన అవసరాన్ని గుర్తించారు. మీడియా సహకారం ఎంత ఉన్నప్పటికీ, పవన్‌కల్యాణ్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నదని గ్రహించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడిగా జగన్మోహన్రెడ్డికి గుర్తింపు, జనామోదం నానాటికీ పెరుగుతున్నాయని గమనించారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీని తటాలున వది లేసి ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. జగన్ పైచేయి ‘మేము పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినా సరే, మీరు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మా సహకారం కోరినా సరే’ తాము సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ అధినేత ముందుకు రావడాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంలో తటపటాయింపు కనిపించింది. జగన్మోహన్రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంలో అదే డిమాండ్‌పై అశోక్గజపతిరాజునూ, సుజనాచౌదరినీ మంత్రిమండలి నుంచి రాజీనామా చేయించారు. అప్పటికీ స్పష్టత రాలేదు. ఎన్డీఏ నుంచి వైదొలగడం గురించి నిర్ణయం తీసుకోలేకపోయారు. వివిధ రాష్ట్రాల సభ్యులు తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంటులో నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న కారణంగా బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు అనుమానం రాగానే అవిశ్వాస తీర్మానాన్ని ముందే ప్రవేశపెట్టాలనే కీలక నిర్ణయం వైఎస్ఆర్సీపీ వేగంగా తీసుకున్నది. పార్టీ విప్ సుబ్బారెడ్డి నోటీసు అందజేశారు. అప్పటివరకూ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరు పోరాడినా బలపర్చుతామనీ, వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామనీ శాసనసభలో ప్రకటించారు. అంతలోనే నిర్ణయం మార్చుకొని తెల్లవారగానే పొలిట్‌బ్యూరో సభ్యులతో సమాలోచన జరిపినట్టు ప్రకటించారు. ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ఉదయం గం. 9.30 కు ప్రకటించి ఒక్క నిమిషం తర్వాత మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానానికి తోట నరసింహం చేత నోటీసు ఇప్పించారు. ప్రత్యేక హోదా ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి అదే హోదా కావాలంటూ డిమాండ్ చేయడం, అవిశ్వాసం దండగ అంటూ ప్రబోధించిన నేత అదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆదరాబాదరాగా ఎన్డీఏ నుంచి తప్పుకోవడం ఎందుకు? ఈ నాలుగేళ్ళలో చంద్రబాబు తీసుకున్నన్ని పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితం మొత్తంలో తీసుకోలేదు. చరిత్ర మారదు నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, ఎన్డీఏ నుంచి వైదొలిగిన క్షణం నుంచి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నాయకుడుగా ప్రచారం చేసుకోవడం, అంతవరకూ ప్రశంసిస్తూ వచ్చిన మోదీనే ఘాటుగా విమర్శిస్తున్నట్టు మాట్లాడటం విశేషం. చంద్రబాబుకు రాజకీయం ఒక క్రీడ. విజయ సాధనకు ఏమి చేయడానికైనా వెనుకాడరు. ఇతర ప్రతిపక్షాలు టీడీపీ తీర్మానాన్నే సమర్థిస్తున్నట్టు ప్రచారం కూడా అందుకే. నిజానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఒక రోజు ముందే జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను విపక్ష నేతలందరికీ అందించారు. సోనియాగాంధీ సహా చాలామంది ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్సీపీ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలు సుబ్బారెడ్డి, నరసింహం ఇచ్చిన నోటీసుల గురించి ప్రస్తావించగానే కాంగ్రెస్ సభ్యులందరూ చటుక్కున లేచి నిలబడ్డారు. సభలో పరిస్థితులు సవ్యంగా లేవు కనుక అవిశ్వాస తీర్మానాలని చర్చకు స్వీకరించే ప్రక్రియను పాటించడం లేదంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు. రేపు ఏమి జరుగుతుందో చూడాలి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబు స్పందిస్తూ వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తొట్టతొలి నోటీసు ఇచ్చిన పార్టీగా వైఎస్ఆర్సీపీ చరిత్రకు ఎక్కుతుంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షాలను మేల్కొలిపే ప్రక్రియకు ఊతం ఇచ్చిన నాయకుడుగా, ప్రత్యేక హోదాను జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేసిన నేతగా జగన్మోహన్రెడ్డి నిలిచిపోతారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సమకాలీన చరిత్రలోని ఈ వాస్తవాలను మాత్రం కప్పిపుచ్చలేరు. - కె. రామచంద్రమూర్తి -
‘అసాధారణ రాజకీయాలు’
ఉమ్రేదరాజ్ మాంగ్‌కర్ లాయాథా చార్‌దిన్ దో ఆర్జూమే కట్గయే, దో ఇంతెజార్‌మే ‘జీవిత పర్యంతం అల్లాహ్‌ని వేడుకొని నాలుగు రోజుల ఆయుష్షు అదనంగా సంపాదించుకున్నాను. కోర్కెలు కోరడంలో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ కోర్కెలు తీరడం కోసం ఎదురుచూడటంలో మిగిలిన రెండు రోజులూ జరిగిపోయాయి,’అంటూ వాపోయాడు జఫర్. మొఘల్ సామ్రాజ్యం ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ రంగూన్ జైలులో బందీగా ఉన్న సమయంలో ‘లగ్తానహీ దిల్మేరా, ఉజ్దే దయార్మే’(నరసంచారంలేని ఈ శూన్య ప్రదేశంలో నా మనస్సు నిలవడం లేదు) అని నిర్వేదం వెలిబుచ్చుతూ రాసుకున్న కవితలోనివి పైన పేర్కొన్న రెండు పంక్తులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితికి అవి అద్దం పడతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్ళలో సాధిం చింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడానికి కారణం ఏమిటి? ఎంత అసమర్థ ప్రభువైనా ఎన్నో కొన్ని మంచిపనులు చేస్తాడు. ‘అసాధారణ నేత’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇంత విలువైన కాలం ఎందుకు వృథా చేశారు? బీజేపీతో నాలుగేళ్ళ చెలిమి రవ్వంత మేలు చేయలేదు. ఎందుకని? తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన చంద్రబాబు కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులు సమకూర్చగలుగుతారనే విశ్వాసంతో 2014లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో, మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే పరస్పరం సహకరించుకుంటాయనీ, అభివృద్ధి పనులు నల్లేరు మీద బండిలాగా చరచరా జరిగిపోతాయని కూడా ఆశించారు. నిజానికి, చంద్రబాబు నేలమీద నడిస్తే, ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ సంప్రదించి అడుగులు వేసి ఉంటే రాజధాని సహా కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులలో అత్యధికం ఈ పాటికి సమకూరి ఉండేవి. లోగడ ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను సంప్రతించేవారు. మీడియా అనుభవజ్ఞులతో మాట్లాడేవారు. కానీ, తాను ‘అసాధారణ’ ప్రజ్ఞాశాలిననీ, అద్భుతమైన మేధావిననీ, శూన్యంలో నుంచి రాజప్రాసాదాలను సృష్టించే తెలివితేటలు తన సొంతమనీ భావించారు. చర్వితచర్వణమే అయినప్పటికీ చెప్పక తప్పదు. రాజ ధానికి అనువైన ప్రాంతం ఏదో సూచించేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ అఖిలపక్ష సభలో కానీ చర్చించకుండానే బుట్టదాఖలు చేశారు. తన బుర్రలో ఉన్న ఆలోచనలనే నివేదిక రూపంలో సమర్పించేందుకు అసమదీయులతో తన సొంత కమిటీ ఒకటి నియమించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో (శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ వద్దన్నదో అక్కడే) రాజధాని నిర్మాణం జరగాలని నిర్ణయించారు. సలహాలు పెడచెవిన ఐటీ రంగ ప్రముఖుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి ఈ సందర్భంగా ఒక సూచన చేశారు. రాజధాని నిర్మాణం అంటే ఏమిటి? శాసనసభ, మండలి నిర్వహణకు తగిన భవనాలూ, సచివాలయానికీ, హైకోర్టుకూ కావలసిన భవన సముదాయం, ముఖ్యమంత్రికీ, మంత్రులకూ, శాసనసభ్యులకూ, ఉన్నతాధికారులకూ నివాస భవనాలూ ఉంటే సరిపోతుంది. తక్కిన నగరంలో రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తే నగరం తనంతట తానే అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో మహానగరాలన్నీ విస్తరించింది ఆ విధంగానే. రాజధాని పేరుమీద 5,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక పెద్ద నిర్మాణ సంస్థకు అప్పగిస్తే, రాజధానికి అవసరమైన భవనాలను 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి లేదా రెండు సంవత్సరాల వ్యవధిలో నిర్మించి ఇస్తుందనీ, తక్కిన 2,500 ఎకరాలతో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుందనీ, ప్రభుత్వం నుంచి నయాపైసా ఆశించదనీ హనుమాన్ చౌదరి ప్రతిపాదన. సాధారణ ముఖ్యమంత్రి అయితే ఈ సలహాను పాటించేవారు. ఈ సరికి రాజధానికి కావలసిన భవనాలన్నీ (పక్కాభవనాలు. తాత్కాలికభవనాలు కాదు) సిద్ధమయ్యేవి. చంద్రబాబు సాధారణ ముఖ్యమంత్రి కాదు. కనుక ఆయనకు సాధారణ రాజధాని పనికిరాదు. ఢిల్లీని మించిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని సంకల్పించారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చి వారి భూములను పూలింగ్ పేరిట 30 వేల ఎకరాలకు పైగా సేకరించారు. తాజ్‌మహల్, చార్మీనార్, కుతుబ్ మీనార్ వంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించిన వాస్తుశిల్పుల వారసులు మన దేశంలో ఉన్నారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, నర్మదా డ్యాం వంటి మెగా ప్రాజెక్టులను నిర్మించిన ఇంజనీర్లకు కొదవ లేదు. అయినా సరే. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించాలని చంద్రబాబు తాపత్రయం. అందుకోసం కొత్త కంపెనీలు పెట్టించీ, సరికొత్త నిబంధనలు సృష్టించీ, అడ్డగోలు ఒప్పం దాలు కుదుర్చుకొనీ పడరాని పాట్లు పడుతూ, ప్రైవేటు విమానంలో ప్రపంచం అంతటా చక్కర్లు కొడుతూ రాష్ట్రం కోసం చెమటోడ్చుతున్నానంటూ, తెగ కష్టపడుతున్నానంటూ బాధపడిపోతున్నారు. ఆయనకు హితవు చెప్పే సాహసం కలిగినవారు ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరూ లేరు. ‘ఆయన సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇంతవరకూ డిజైన్లు సైతం ఖరారు చేయకుండా మమ్మల్ని నిందిస్తే మేము ఏమి చేస్తాం? అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అందుకు మాదా బాధ్యత?’ అంటూ జైట్లీ మొన్న పార్లమెంటు సెంట్రల్హాల్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రం అవతరించి నాలుగేళ్ళు పూర్తవుతున్నప్పటికీ రాజధాని స్వప్నంగానే మిగిలిపోయింది. నెరవేరని పోల‘వరం’ ఇక రెండో ముఖ్యమైన అంశం పోలవరం. కాలువల నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయింది. సాధారణ ముఖ్యమంత్రి అయితే పోలవరం బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రానిది కాబట్టి సాధ్యమైనంత త్వరలో తక్కిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయవలసిందిగా ప్రధానమంత్రిపైన ఒత్తిడి తెచ్చేవాడు. కానీ ‘అసాధారణ ముఖ్యమంత్రి’ కనుక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను స్వయంగా తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. అన్నీ తానే చేయాలనీ, అంతా తనకే కావాలనే మనస్తత్వం ఇందుకు కారణం. నిర్మాణ వ్యయం అంచనాలను 2010–11 లెక్కల ప్రకారం రూ. 16 వేల కోట్ల నుంచి తాజాగా రూ. 58 వేల కోట్లకు పెంచివేశారు. మొదట 31 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్న కాఫర్‌డ్యామ్ ఎత్తును 42 మీటర్లకు పెంచి 2018 జూన్ నాటికే ఖరీఫ్ పంటకు గురుత్వాకర్షణశక్తితో పోలవరం నీరు అందించాలనే వ్యూహం రచించారు. అదే సమయంలో తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థను పోలవరం పనుల నుంచి తప్పించాలని అనుకున్నారు. రాయపాటి ఘనాపాటి కనుక చంద్రబాబు ఎదుట సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీని కలుసుకున్నారు. క్షేత్రంలో ఏమి జరుగుతోందో, జరగడం లేదో వివరించారు. కాఫర్‌డ్యామ్‌కు గడ్కరీ బ్రేక్ వేశారు. కథ అడ్డం తిరిగింది. పనులు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం కావడానికి సమయం పడుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా. విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ పట్టుబట్టిన వ్యక్తి వెంకయ్యనాయుడు. నాటి ప్రధాని అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. అనంతరం మంత్రిమండలి సమావేశంలో దాన్ని ఆమోదించారు. ప్రత్యేక హోదా అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని మంచిపనులు చేసింది. మరికొన్ని పాడుపనులు చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టపోయినప్పటికీ తెలంగాణలో లబ్ధి పొందుతామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది. ఉద్యమ నాయకుడు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుతో నిర్లక్ష్యంగా వ్యవహరించేసరికి ఆయన అడ్డం తిరిగారు. తెలంగాణలోనూ తిరుక్షవరం తప్పలేదు. కోస్తాంధ్రలో భారీ మూల్యం చెల్లిం చింది. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా చావుదెబ్బ తిన్నది. తెలంగాణకు అభ్యంతరం లేదంటూ ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకీ, విభజన బిల్లు ఆమోదంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీజేపీకీ ఆంధ్రులు అధికారం అప్పగించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉండటం వల్ల కోస్తాంధ్రకు నష్టం కలుగుతుంది కనుక నష్టాన్ని పూడ్చేందుకు బిల్లులో కొన్ని అంశాలను యూపీఏ ప్రభుత్వం చేర్చించింది. వాటిని నాలుగేళ్ళపాటు అమలు జరపకుండా విభజన పాపం కాంగ్రెస్‌దేనంటూ బీజేపీ, తెలుగుదేశంలు ధ్వజమెత్తడం ప్రహసన రాజకీయాలకు నిదర్శనం. ‘ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు’ అంటూ చంద్రబాబు కొత్తపాట అందుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడిన మొదటి పిడుగు. ప్రత్యేక హోదా అక్కర లేదని ఒప్పుకునే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకహోదా ఇవ్వవద్దని సిఫార్సు చేసిందంటూ తాజాగా అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రకటించారు. ఇది సత్యదూరం. ఆ మాట తాము ఎక్కడా అనలేదని 14వ ఆర్థికసంఘం అధ్యక్షుడు వైవి రెడ్డి హైదరాబాద్‌లో మంథన్ నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. ఆర్థికసంఘాన్ని అడ్డంపెట్టుకొని ప్రత్యేకహోదాను ఎగగొట్టడం వంచన. ప్రత్యేకహోదా లేక, ప్రత్యేక ప్యాకేజీ రాక రెండింటా చెడిన రేవడి చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాంగ్రెస్‌పై ప్రధాని ధ్వజం విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో రైల్వే జోన్ కూడా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీని ఇంతవరకూ 29 విడతల సందర్శించారు. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ప్రతిసారీ శూన్యహస్తాలతోనే తిరిగి వచ్చారు. విభజన చట్టం హామీల అమలు కోసం తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేసిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహావేశాలతో నెహ్రూనూ, ఇందిరాగాంధీనీ, రాజీవ్‌గాంధీనీ, సోనియాగాంధీనీ రాహుల్‌గాంధీని ఉభయసభలలో కడిగిపారేశారు. ఆ హామీల గురించి ఒక్కమాట కూడా ప్రధాని నోట వెలువడలేదు. ఎన్నికల ప్రచారంలో తాను స్వయంగా చంద్రబాబు, వెంకయ్యనాయుడితో కలసి చేసిన హామీలను ప్రస్తావించడానికి సైతం ప్రధాని సిద్ధంగా లేరు. ఇది సైతం అసాధారణమే. జైట్లీ డొంక తిరుగుడు సరేసరి. అర్థంపర్థం లేని పాటను రాజ్యసభలో రెండుసార్లూ, లోక్‌సభలో ఒకసారీ పాడి వినిపించారు. ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో తెలుగుదేశం నాయకత్వానికి ఎన్‌టి రామారావునాటి ఆత్మగౌరవ నినాదం లీలగానైనా గుర్తు ఉంటే ఏమి చేయాలి? అశోక్ గజపతి రాజునూ, సుజనాచౌదరినీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి విరమించుకోవాలి. శ్రీనివాస్‌కూ, మాణిక్యాలరావుకూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించాలి. ముఖ్యమంత్రిని వేధిస్తున్న భయసందేహాలు ఏమిటో తెలియదు కానీ అటువంటి ధైర్యమైన నిర్ణయం తీసుకోలేదు. ఏమి చేశారు? ప్రచ్ఛన్నయుద్ధం చేశారు. మీడియా సహకారంతో లీకుల రాజకీయం రసవత్తరంగా నడిపించారు. ఢిల్లీతో తెగించి పోరాడుతున్నారనే భ్రాంతికి తెలుగు పాఠకులనూ, ప్రేక్షకులనూ లోను చేశారు. ఈ లోగా సరదాగా దుబాయ్ వెళ్ళి వచ్చారు. కానీ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించి పది రోజులైనా చంద్రబాబు ప్రత్యక్షంగా నిరసన వెలి బుచ్చలేదు. కేంద్ర ప్రభుత్వానికి కానీ, బడ్జెట్‌కు కానీ వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది విచిత్రమైన పరిస్థితి. మామూలు ముఖ్యమంత్రి అయితే మీడియా సమావేశంలో మాట్లాడేవారు. ఆవేదన, ఆగ్రహం వెలిబుచ్చేవారు. అన్యాయం జరిగిందని చెప్పేవారు. తాను ఏం చేయదల్చుకున్నదీ ప్రకటించేవారు. అటువంటి పనులు ఏవీ చేయకపోయినా చంద్రబాబునే పోరాటయోధుడుగా రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చిత్రించడం అసాధారణ రాజ కీయం. విభజన చట్టంలోని హామీలు నెరవేరతాయని నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రజలు మరో సంవత్సరం మాత్రమే గడువు ఇస్తారు. - కె. రామచంద్రమూర్తి -
రైతు బడ్జెట్ అంటే ఇదేనా?
త్రికాలమ్ వ్యాపార దృష్టి ఉన్నవారికి వ్యవసాయం అర్థం కాదు. వ్యవసాయదారులకు వ్యాపారం అంతుబట్టదు. వ్యవసాయంతో బొత్తిగా సంబంధం లేని వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీకీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకీ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన అవగాహన ఉన్నట్టు కనిపించడంలేదు. గుజరాత్ స్థానిక ఎన్నికలలోనూ, అసెంబ్లీ ఎన్నికలలోనూ రైతులు ఎదురు తిరిగిన ఫలితంగా గట్టి దెబ్బ తగిలిన తర్వాత మోదీకి రైతుల గోడు పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. జైట్లీ వార్షిక బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలి తాలు వెల్లడైనాయి. రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోవడమే కాకుండా వాటి పరిధిలోని మొత్తం 17 శాసనసభ స్థానాలలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీలు సాధించిందనే వార్త అధికార పార్టీ నేతలకు దిగ్భ్రాంతి కలి గించింది. 2014లో నగరజీవులతో పాటు రైతులు సైతం సమధికోత్సాహంతో ఓట్లు వేయబట్టే బీజేపీ మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలవగలిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు యూపీఏ–2 ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మిని మమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పి) చాలా తక్కువనీ, తాము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ స్వామినా«థన్ కమిటీ చేసిన సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తామనీ నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్ళు దాటినప్పటికీ వ్యవసాయదారుల పరిస్థితిలో మార్పులేదు. రుణభారం కారణంగా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. వ్యవసాయానికి పెద్దపీట? వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుం టున్నామనీ, ఖరీఫ్ తరుణంలో పంటలకు ఎంఎస్పిని స్వామినాథన్ చెప్పిన సూత్రం ప్రకారం నిర్ణయిస్తామనీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ‘హింగ్లీష్’ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది గొప్ప వరమనీ, రైతులను కష్టాల కడలి నుంచి రక్షించేందుకు ఉపకరిస్తుందనీ చెబుతూ ఉత్తరాది ప్రజలకు స్పష్టంగా, సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ భాగం మాత్రం హిందీలో చదివారు. ఎన్డీఏ బడ్జెట్ అటు స్టాక్మార్కెట్నూ, ఇటు వ్యవసాయరంగాన్నీ ఆగ్రహానికి గురి చేసింది. మధ్య తరగతినీ, ఉద్యోగ వర్గాలనూ నిరాశానిస్పృహలకు లోనుచేసింది. ఇన్ని వర్గాలకు సమానంగా మనస్తాపం కలిగించిన బడ్జెట్ ప్రతిపాదనలను జైట్లీ సమర్పించడం విశేషం. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలనే విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి బలమైన తార్కాణం 2015లో కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్టు. ఉత్పత్తి వ్యయంపైన యాభై శాతం అదనంగా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించడం సాధ్యం కాదని అందులో వాదించింది. అసలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మోదీ ఎన్నడూ ప్రస్తావించలేదంటూ కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్ 2017 మే నెలలో దబాయించారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్వయంగా ఈ నివేదిక గురించి ప్రస్తావించారు కనుక ఇప్పుడు ఎవ్వరూ కాదనలేరు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని బడ్జెట్‌కు ముందురోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయదారుల ఆదాయం పెరగడం లేదనీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదనీ, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారనీ నివేదించింది. వాతావరణంలో మార్పుల కారణంగా పంట దిగుబడి, వ్యవసాయదారుల ఆదాయం 25 శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది. రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోని రాష్ట్రం అంటూ దేశంలో ఈ రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర లోని విదర్భ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి అధికం. కానీ పంజాబ్ వంటి వ్యవసాయ విజయాలు సాధించిన రాష్ట్రంలోనూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న (భావాంతర్ భుక్తన్ యోజన) మధ్యప్రదేశ్‌లో కూడా రైతులు అప్పుల చెర నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మృత్యుముఖంలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న రైతులు ఏమి కోరుకుంటున్నారు? రైతు సంఘాలు చేస్తున్న మొదటి డిమాండ్ రుణమాఫీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పశ్చిమ యూపీలో రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రధాని ఆ రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలకు దాన్ని వర్తింపజేయలేదు. ఇతర రాష్ట్రాలలో ఆ ఊసే లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీ ఎన్నికలలో గట్టెక్కడానికి రుణమాఫీ మంత్రం ప్రయోగించారే కానీ దానిని ఒక విధానంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మోదీ సిద్ధంగా లేరు. అప్పు చేసి వ్యవసాయం చేసిన రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోతే వాటిని ఎట్లా తీర్చాలి? వ్యవసాయం గిట్టుబాటు అయ్యేవిధంగా కనీస మద్దతు ధర నిర్ణయించి, ఇంతవరకూ చేసిన రుణాలను రద్దు చేయగలిగితే బక్కౖ రెతు హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో కౌలు రైతుల సంఖ్య గణనీయం. వారికి రుణ సౌకర్యం కల్పించాలన్నది వ్యవసాయ సంఘాల రెండో డిమాండ్. ‘రుణ హామీ నిధి’ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులకు పూచీగా ప్రభుత్వం నిలవాలని వాటి అభ్యర్థన. వ్యవస్థాగతమైన రుణ సదుపాయం లేని కారణంగానే కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తున్నారనీ, బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చుననీ 1998లో ఆత్మహత్యల పరంపర మొదలైనప్పటి నుంచీ వ్యవసాయ సంఘాల నాయకులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నారు. రుణహామీ నిధిని జైట్లీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. నీతి ఆయోగ్ రూపొందించిన ‘భూమి కౌలుచట్టం’ ముసాయిదా కౌలుదారుల కంటే భూయజమానులకే అనుకూలంగా ఉంది. ఇదే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్పి నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఇందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేదు. అంత వ్యవధి ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతులను ఆదుకొని వారి ఓట్లు సంపాదించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ఎంఎస్పిని ఉదారంగా నిర్ణయించడమే కాకుండా వేగంగా, సమర్థంగా అమలు చేయాలి. నానాటికి తీసికట్టు ఎన్డీఏ హయాంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతలు నానాటికి తీసికట్టుగా ఉన్నాయనడానికి నిదర్శనం మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖ కేటాయింపుల తగ్గుదల. నిరుడు బడ్జెట్ వ్యయంలో వ్యవసాయ శాఖ వాటా 2.38 శాతం. మొన్నటి బడ్జెట్ ప్రతిపాదనలలో అది 2.3 శాతానికి పడిపోయింది. బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా రైతుల బతుకులను ఎట్లా బాగుచేస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు నిర్మిస్తామనీ, 22,000 గ్రామీణ మార్కెట్ యార్డ్‌లను అభివృద్ధి చేస్తామనీ ఆర్థికమంత్రి చేసిన ప్రతిపాదనలు స్వాగతించదగినవే. కానీ రైతులోకం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యకు ఇటువంటి అరకొర చర్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? నీరసించిపోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే పని అసంకల్పితంగానే మోదీ చేస్తున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది అందుకే. స్వామినాథన్ ఏమన్నాడు? రబీ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్పి నిర్ణయించామనీ, వచ్చే ఖరీఫ్‌కి కూడా అదేవిధంగా చేస్తామనీ జైట్లీ ప్రకటించారు. ఇంతకీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయదారుల జాతీయ కమిషన్ సర్వేలూ, చర్చలూ, సంప్రదింపులూ నిర్వహిం చింది. 2006లో మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా సాగు వ్యయం–ధరల కమిషన్ (సీఏసీపీ) పంట పండించడానికి పెట్టిన ఖర్చుకు మూడు రకాల నిర్వచనాలు ఇచ్చింది. ఒకటి ఏ2. రెండు ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడు సీ2. పంటలు పండించే క్రమంలో రైతు నగదు రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ చెల్లించిన మొత్తాలు కలిపి ఏ2 అంటారు. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, కూలీ, ఇంధనం, నీటి సరఫరా, తదితరాలపైన పెట్టిన ఖర్చుల మొత్తం ఇది. ఎఫ్ఎల్(ఫ్యామిలీ లేబర్) అంటే పొలంలో పనిచేసే కుటుంబ సభ్యుల శ్రమ విలువ. దీనిని లెక్క కట్టి ఏ2కి కలిపితే వచ్చేది ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడో పద్ధతి అత్యంత సమగ్రమైనది. రైతుకు శ్రేయస్కరమైనది. ఏ2 ప్లస్ ఎఫ్ఎల్లో కలిపినవే కాకుండా భూమిని ఎవరికైనా అద్దెకు ఇస్తే వచ్చే అద్దె మొత్తం, దాని పైన వడ్డీ మొత్తం, ఇతరత్రా ఖర్చు కూడా కలిపితే వచ్చే మొత్తం సీ2. కేంద్ర ప్రభుత్వం 2018 రబీ పంటల నిమిత్తం 2017 అక్టోబర్‌లోనే ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే స్వామినాథన్ సూచించిన సూత్రం తేలికగా బోధపడుతుంది. టన్ను వరిధాన్యం పండించేం దుకు ఏ2 నిర్వచనం కింద రూ. 840 ఖర్చు అవుతుందనీ, ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ కింద రూ. 1,117 అవుతుందనీ, సీ2 ప్రకారం రూ. 1,484 ఖర్చు కాగలదనీ సీఏసీపీ నిర్ణయించింది. ఎంఎస్పిని రూ. 1,550గా ప్రతిపాదించింది. ఖరీఫ్‌లో ఇది ఎని మిది శాతం పెరిగి రూ. 1,675 కావచ్చు. ఎంఎస్పిని ఇరవై పంటలకు నిర్ణయిం చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది బియ్యం, గోధుమలను మాత్రమే. ఇది కూడా జాతీయ ఆహార భద్రతాచట్టం అమలు చేయడం కోసం విధిగా ఆహారధాన్యాలు కొనాలి కనుక. 2015లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వెల్ల డించిన గణాంకాల ప్రకారం 5.8 శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్పి రేటుకు ప్రభుత్వానికి ఆహారధాన్యాలు విక్రయించారు. మిగిలినవారంతా దళారుల కబంధహస్తాలలో చిక్కినవారే. వ్యవసాయదారుల సంస్థలు బడ్జెట్లో ప్రస్తావించిన ఎంఎస్పిపైన ఇంకా స్పష్టత రావలసి ఉన్నదని స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉంటే ప్రభుత్వం ఎంఎస్పి రేటుకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనీ, లేదా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు మండల స్థాయిలో పరిశోధన కేంద్రాలు నెలకొల్పాలనీ, నష్ట నివారణలో నైపుణ్యం కలిగిన ఒక మహిళనూ, ఒక పురుషుడినీ ప్రతి పంచాయతీ నుంచి ఈ కేంద్రాలలో నియమించాలనీ స్వామినాథన్ సూచించారు. మధ్యదళారుల పాత్రను రద్దు చేయడం, రైతులే వినియోగదారులకు నేరుగా ఆహారధాన్యాలు విక్రయించే వ్యవస్థను నిర్మించడం ద్వారా వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని పరిష్కరించవచ్చు. 1980ల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధి రేటు సగటున 2.5 శాతానికి మించలేదు. రైతు ఆదాయాన్ని ఐదారు సంవత్సరాలలో రెట్టింపు చేయాలంటే ఏటా15–20 శాతం వృద్ధి సాధించాలి. అది అసాధ్యం. ఇతర వినిమయ వస్తువులలాగానే ఆహారధాన్యాల ధరలను కూడా ఉత్పత్తిదారులకు గణనీయమైన లాభం లభించే విధంగా నిర్ణయించినప్పుడే రైతు లోగిలిలో విషాదం తొలగి పోయి ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకు మహారాష్ట్రలో జోరందుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఇంతకాలం ఆ సంస్థలపైన విధిస్తున్న 30 శాతం పన్ను రద్దు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్మడం ఈ సంస్థల బాధ్యత. మధ్యదళారులను పూర్తిగా తొలగించి, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ఠం చేసి, వ్యవస్థీకృతమైన రుణ సదుపాయం కలిగించి, వ్యవసాయ విస్తరణ అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహించి, సాగునీరు అందించేందుకు విశేష ప్రయత్నం చేయగలిగితే రైతులూ, కౌలురైతులూ కోలుకుం టారు. వ్యవసాయం తెలిసినవారూ, వ్యాపారంలో నైపుణ్యం ఉన్నవారూ భుజం భుజం కలిపి సమష్టిగా కృషి చేస్తే వ్యవసాయం కూడా లాభసాటి వ్యాసంగం కావచ్చు. ఈ దిశగా బృహత్ ప్రయత్నం జరగాలి. - కె. రామచంద్రమూర్తి -
బహుళత్వంతోనే భవితవ్యం
త్రికాలమ్ ఈ రోజున ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. అర్ణవ్‌గోస్వామి రిపబ్లిక్ టీవీ, అరుణ్‌పురీ ఇండియా టుడే చానల్ తాజాగా నిర్వహించిన సర్వేల ఫలితాలలో కొన్ని అంకెలలో వ్యత్యాసం ఉండవచ్చును కానీ తాత్పర్యం ఒక్కటే. 2019 సార్వత్రిక ఎన్నికలలో సైతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనీ, ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగుతారనే. నిజానికి, మోదీ నాయకత్వం కారణంగానే బీజేపీకీ, దాని మిత్రపక్షాలకీ మెజారిటీ స్థానాలు లభిస్తాయన్న మాట కూడా స్పష్టమే. నేపాల్‌లోని లుంబిని గౌతమ బుద్ధుడి జన్మస్థానం. అక్కడి నుంచి లక్నో వరకూ బుధ, గురువారాలలో ముగ్గురు మిత్రులతో కలసి కారులో చేసిన ప్రయాణం ఈ రచయితకు గయ వెళ్ళి బోధివృక్షం కింద కూర్చునే అవసరం లేకుండానే ఒక రకమైన రాజకీయ జ్ఞానోదయం కలిగించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) ఈశాన్య ప్రాంతం అంతా చూశాం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్ మఠం సందర్శించాం. బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగిన కుశీనగర్లో మకాం చేశాం. వివాదాస్పదమైన అయోధ్య నగరంలో కొద్దిసేపు ఆగి తాజా సమాచారం సేకరించాం. రామ జన్మభూమి పోలీసు పర్యవేక్షణలో బ్యారికేడ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉంది. హైవేకు రెండు వైపులా కనుచూపు ఆనినంతవరకూ ఆకుపచ్చని తివాచీ పరచినట్టు వరి, జనుము, గోధుమ పొలాలు. కొద్దిగా లోపలికి వెడితే కటిక పేదరికంలో ముస్లిం గ్రామాలు. పూర్వం బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతాలలో అత్యధికంగా ముస్లింలు కనిపించారు. మ«ధ్య ఆసియా నుంచి వచ్చిన దురాక్రమణదారుల దాడుల నుంచి బౌద్ధులకు రక్షణ లేక ఇస్లాంను ఆశ్రయించారంటూ అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనను రుజువు చేసే ఆధారాలలో ఇది ఒకటి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా మదిలో మెదిలిన ఆలోచనలు మనవి చేస్తాను. యూపీ ప్రయోగం 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం యూపీలో ముస్లింలు 19.25 శాతం. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 403 నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థిని ఒక్కరిని కూడా నిలబెట్టకుండా బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంలోని రహస్యం తెలుసుకోవాలంటే యూపీ ప్రయోగం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొత్తం 19 బీజేపీ పాలిత రాష్ట్రాలలో అదే ప్రయోగం అటూఇటుగా అమలు జరుగుతోంది. రేపు కర్ణాటకలోనూ అదే వ్యూహం అమలు చేసి ఘనవిజయం సాధించేందుకు అమిత్‌షా పావులు కదుపుతున్నారు. మైనారిటీలను పూర్వపక్షం చేసి మెజారిటీ మతస్థులను ఏకం చేయడం ద్వారా అధికారం సాధించడం, ఇందుకు క్షేత్రవాస్తవికతను సవ్యంగా అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యూహం రచించడం, పకడ్బందీగా అమలు జరపడం. బ్రిటన్, ఫ్రాన్స్‌లో (అనేక ఐరోపా దేశాలలో) లాగా, పాకిస్తాన్లో అత్యధికులు ఒకే మతానికి చెందినవారూ, ఒకే భాష మాట్లాడేవారూ, ఒకే వారసత్వం ఉన్నవారూ, ఒకే సంస్కృతి కలిగినవారూ ఉండటం. ‘క్లాష్ ఆఫ్ సివిలిజేషన్స్’ రచయిత శామ్యూల్ హంటిం గ్టన్ అమెరికాను వైట్–ఆంగ్లో ప్రొటెస్టెంట్ (వాస్ప్) దేశంగా అభివర్ణించాడు. ఇండియాను ఆ విధమైన మూసలోకి మార్చడం సాధ్యమా? ప్రస్తుతానికి కాకపోవచ్చు. ఆ దిశగా ప్రయత్నానికి ఊతం మాత్రం కొంత దొరికింది. బీజేపీ జయప్రదంగా అనుసరిస్తున్న వ్యూహంలో ముఖ్యమైన అంశం దేశభక్తిని పూర్తిగా సొంతం చేసుకోవడం. దేశభక్తికీ, బీజేపీకీ అభేదం పాటించడం. బీజేపీని కానీ మోదీని కానీ విమర్శించినవారి దేశభక్తిని అడ్డంగా ప్రశ్నించడం. దీన్ని జింగోయిజంగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వంటి మేధావులు అభివర్ణిస్తున్నారు. దీనికి బదులు రాజ్యాంగబద్ధమైన దేశభక్తి (కానిస్టిట్యూషనల్ పేట్రియాటిజమ్) ఉండాలన్నది ఆయన వాదన. అందుకే గుజరాత్ దళిత నాయకుడు, అసెంబ్లీ సభ్యుడు జిగ్నేశ్ మేవానీ ఒక చేత్తో మనుస్మృతినీ, రెండో చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు ప్రదర్శనగా వెళ్ళి ప్రధాని మోదీకి సమర్పించి ఆ రెండింటిలో దేన్ని స్వీకరిస్తారో చెప్పాలని అడగబోతున్నట్టు ప్రకటించాడు. మనువాదం అంటే స్థూలంగా ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న విధానమని అతని వాదన. బీజేపీ వ్యూహం ఆరంభమైంది అడ్వాణీ అయోధ్యయాత్రతో. మలుపు తిరిగింది బాబ్రీమసీదు విధ్వంసంతో. లక్ష్యం నెరవేరింది 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయంతో. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ‘ఇండియా దటీజ్ భారత్’కూ ప్రస్తుతం బలంగా వేళ్ళూనుకుంటున్న భావజాలానికీ పొంతన లేదు. రాజ్యాంగ నిర్మాతలు ఇండియన్ రిపబ్లిక్కు షరతులు లేని ప్రజాస్వామ్యం, మత, భాషాపరమైన బహుళత్వం, కుల, లింగ సమానత్వం, పేదరికం నిర్మూలన, వివక్షను అంతం చేయడం పునాది కావాలని భావించారు. ఇప్పటి ధోరణులు ఇంతవరకూ దేశ ప్రజలు విశ్వసించిన దేశ స్వరూపస్వభావాలకు (‘ఐడియా ఆఫ్ ఇండియా’) విరుద్ధమైనవనీ బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నవారు ముక్కుమీద గుద్దినట్టు చెబుతున్నారు. యూపీలో వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరినడిగినా చెబుతారు. ఆ రాష్ట్రంలో మొన్నటి వరకూ యాదవ కులాధిపత్యం ఉండేది. ఇప్పుడు ఠాకూర్ల మాటకు విలువ పెరిగిందని అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వాశ్రమంలో ఠాకూర్. అతని ప్రమేయం లేకుండానే ఆ కుల ప్రముఖుల ప్రాబల్యం పెరుగుతుంది. ఎందుకంటే మన ప్రజలు నాయకులను ప్రేమించడంతో ఆగరు. వారినీ, వారి చుట్టూ ఉన్నవారినీ ఆరాధిస్తారు. నాయకులను పూజించే స్వభావాన్ని ప్రజలు విడనాడకపోతే, ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకోకపోతే పరిస్థితి విషమించి నియంతృత్వానికి దారి తీస్తుంది. రాజ్యాంగ పరిషత్తులో అంబేడ్కర్ చేసిన ఆఖరి ప్రసంగంలో చేసిన హెచ్చరిక గమనించండి: ‘మతం పట్ల భక్తి (వ్యక్తుల) ముక్తికి దారి తీయవచ్చు. కానీ రాజకీయాలలో భక్తి లేదా వ్యక్తిపూజ పతనానికీ, నియంతృత్వానికీ తిరుగులేని మార్గం’ ((Bhakti in religion may be a road to the salvation of the soul. But in politics, Bhakti or hero - worship is a sure road to degradation and to eventual dictatorship).). అంబేడ్కర్ హెచ్చరికను కాంగ్రెస్ నాయకులు పెడచెవిన పెట్టబట్టే ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితిని విధించే సాహసం చేశారు. ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే నినాదం చేసిన నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా ప్రమాదకరమైన పరమభక్తుడుగా నవభారత చరిత్రలో నల్లటి అక్షరాలతో నమోదై దోషిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మోదీ పట్ల, కొందరు ముఖ్యమంత్రుల పట్ల అంధభక్తుల వీరవిధేయత చూస్తే భయం కలుగక మానదు. కాంగ్రెస్ తప్పిదం స్వాతంత్య్ర యోధులలో అత్యధికులు తమ మతాన్ని ప్రేమించినవారే. స్వామి వివేకానంద వంటి వివేకవంతులైన హిందూమత ప్రబోధకులను అంగీకరించినవారే. ఆయన రచనలు చదవడం వల్ల తన దేశభక్తి వందవంతులు పెరిగిందని గాంధీ అన్నాడు. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే వివేకానందుడి రచనలను అధ్యయనం చేయాలన్నాడు టాగోర్. జాతీయోద్యమాన్ని నిర్మించిన మహానుభావులలో వివేకానంద అగ్రగణ్యుడని నెహ్రూ అంటాడు. సుభాష్‌చంద్రబోస్, రాజ గోపాలాచారి తదితరులకు కూడా ఆయనే ప్రేరణ. దేశభక్తితో పాటు వివేకానందనూ, పటేల్‌నూ, అంబేడ్కర్నూ సొంతం చేసుకోవడానికి బీజేపీ, దాని అనుబంధ సంస్థలూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆ సంస్థలకు ఇటువంటి అవకాశం ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ స్వాతంత్య్ర సమర సేనానులందరినీ విస్మరించి నెహ్రూ–ఫిరోజ్‌గాంధీ కుటుంబ వృక్షాన్ని మాత్రమే పట్టుకొని వేళ్ళాడటం ఇందుకు ప్రధాన కారణం. ఇందిరాగాంధీని పూజించినట్టు సోనియాను కాంగ్రెస్‌లో బారువా వారసులు తనివితీరా సేవించారు. 19 సంవత్సరాలు పార్టీపై ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన సోనియా మనోగతానికి భిన్నంగా మాట్లాడే సాహసం ఒక్కరికీ లేకపోయింది. ప్రధానిగా ఐదేళ్ళు పని చేసి, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతికి బాటలు వేసిన పీవీ నరసింహారావును పదవీ విరమణ తర్వాతనే కాకుండా మరణానంతరం సైతం అవమానపరచడం తప్పని చెప్పిన నాయకుడు ఒక్కడూ లేడు. ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ళు ప్రతిపక్ష స్థానంలో చతికిలబడిన కాంగ్రెస్‌ను సమరానికి సమాయత్తం చేసి 2004లో, 2009లో విజయాలు సాధించి, అధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించి, కేంద్రంలో యూపీఏ సర్కార్ ఏర్పడటానికి దోహదం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని ప్రతిపక్ష తెలుగుదేశంతో కుమ్మక్కయి సీబీఐ విచారణ పేరుతో 16 మాసాలు జైలులో ఉంచడం విశ్వాస ఘాతుకమని అధినేతకు చెప్పే గుండెగల నాయకుడు ఒక్కడూ లేకపోయాడు. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ఆ పార్టీ సారథ్యం ఆమె చేతి నుంచి పుత్రుడు రాహుల్ చేతిలోకి మారింది. అదే బీజేపీలో 1998 నుంచి ఇప్పటి వరకూ బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, అడ్వాణీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షాలు పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. సాధారణ కార్యకర్తలు బీజేపీ అధ్యక్షులుగా, ప్రధానులుగా ఎదిగారు. ముస్లింలలో ఛాందసం పెంచి పోషించడంలోనూ (షాబానో కేసు), వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవడంలోనూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీ వ్యూహం విజయం సాధించడానికి అవకాశం ఇచ్చాయి. ఇస్లామిక్ దేశాలలో కూడా లేని ‘త్రిపుల్ తలాఖ్’దురాచారాన్ని అంతం చేసే ప్రయత్నం చేయడానికి డెబ్బయ్ ఏళ్ళు ఎందుకు పట్టింది? కాంగ్రెస్ హయాంలో పెచ్చుమీరిన అవినీతి కూడా 2014లో మోదీ ప్రభంజనానికి దోహదం చేసింది. కమ్యూనిస్టు పార్టీలు నేల విడిచి సాము చేయడం, విదేశీ అనుభవాలనూ, భావజాలాలనూ అరువు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా చీలికపేలికలై కృశించి నశించడానికి సిద్ధంగా ఉండటం కూడా బీజేపీ భావజాలం బలపడటానికి దారి తీసింది. కింకర్తవ్యం? కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసినా అంబేడ్కర్, నెహ్రూ, తదితర వైతాళికులు నిర్మించిన నవభారతం సమైక్యంగా, సమగ్రంగా మనగలగడానికి కారణం ఏమిటి? దళితులకూ, ఆదివాసులకూ ఉద్యోగాలలో, చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడం. భాషాప్రాతిపదికపైన రాష్ట్రాల పునర్నిర్మాణానికి అంగీకరించడం. హిందీని రుద్దరాదన్న తమిళుల డిమాండ్‌ను ఆమోదించడం. పాకిస్తాన్ ఆవిష్కరణ జరిగిన వెంటనే జిన్నా ఢాకా వెళ్ళి ఉర్దూ నేర్చుకోవలసిందేనని తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీలకు కటువుగా చెప్పాడు. అందుకే పాతికేళ్ళకే తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. తమిళులపైన సింహళ భాషను బలవంతంగా రుద్దబట్టే శ్రీలంకలో మూడు దశాబ్దాలపాటు నరమేధం సాగింది. మన దేశంలో ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించిన కారణంగానే, ప్రజల ఆకాంక్షలను ఆలకించినందువల్లనే బహుళత్వంలో ఏకత్వం అనే ఆదర్శం ఇప్పటి వరకూ బతికి బట్టకట్టింది. ఈ ఆలోచనా విధానానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజ్యాంగ నిర్మాతల స్వప్నం భగ్నమౌతుంది. పది మంది ‘ఆసియాన్’దేశాధినేతల సమక్షంలో శుక్రవారం సగర్వంగా జరుపుకున్న రిపబ్లిక్ దినోత్సవం సార్థకం కావాలంటే భారత గణతంత్రంలోని బహుళ సంస్కృతినీ, బహుముఖీనతనూ పరిరక్షించుకోవడం తప్పనిసరి. ఇప్పుడు కలవరపెడుతున్న పెడధోరణులను అరికట్టడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటికైనా నడుంబిగిస్తే అది హృదయపూర్వకంగా ఆహ్వానించదగిన పరిణామం అవుతుంది. అటువంటి పూనిక ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. ఉదార హిందూత్వ అంటూ ‘సాఫ్ట్ హిందూత్వ’ విధానాన్ని రాజీవ్‌గాంధీ హయాం (అయోధ్యలో శిలాన్యాస్) నుంచీ అనుసరిస్తున్న కాంగ్రెస్‌కి ఇంతటి గురుతరమైన బాధ్యతను నిర్వర్తించే చిత్తశుద్ధీ, సామర్థ్యం ఉన్నాయని చెప్పలేం. న్యాయవ్యవస్థను రక్షించుకోండి అంటూ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టే అన్ని మతాలనూ, ప్రాంతాలనూ, భాషలనూ, సంస్కృతులనూ సమాదరించే అద్భుతమైన దేశంగా ఇండియాను కాపాడుకోండని ప్రజలకు పురమాయించడం వినా మరో మార్గం కనిపించడంలేదు. - కె. రామచంద్రమూర్తి -
అటు నేనే..! ఇటు నేనే..!
♦ త్రికాలమ్ ‘విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే సుప్రీంకోర్టుకు వెడతాం’ అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరవై నాలుగు గంటలు దాటకుండానే ఆ మాట తాను అనలేదని చెప్పారు. ఈ రెండు నాల్కల ధోరణి చంద్రబాబు రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించదు. అటూ, ఇటూ కూడా తానే ఆడే క్రీడలో ‘ఘనవిజయాలు’ సాధిస్తూ ముందుకుపోతున్న ఆయన ప్రస్థానం చిత్రవిచిత్రమైనది. దేశంలో చాలామంది ప్రాంతీయ పార్టీ నేతలను చూస్తున్నాం. కరుణానిధి, ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, మమతాబెనర్జీ, శరద్‌పవార్, నవీన్పట్నాయక్లలో ఎవ్వరూ ఇంతటి కపట రాజ కీయ విన్యాసాలు చేయలేదు. ఇందిరాగాంధీతో, వాజపేయితో, సోనియాగాం ధీతో రాజకీయంగా పట్టువిడుపులతో వ్యవహరించినవారు ఉన్నారు కానీ అ«ధికారంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలాగా హుంకరించడం, ఎన్నికలలో పొత్తుపెట్టుకున్న మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించడం, చేస్తున్నదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం వారిలో ఎవ్వరూ చేయలేదు. చంద్రబాబు వేదన చంద్రబాబు మనోవేదనను అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పనీ కావడం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రిని వేధిస్తున్న నాలుగు అంశాలూ చాలా కీలకమైనవి. ఒకటి–ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి. రెండు–పోలవరం ప్రాజెక్టు. మూడు– రాజధాని నిర్మాణం. నాలుగు– అసెంబ్లీ స్థానాల పెంపుదల. ప్రాధమ్య క్రమంలో తేడా ఉండవచ్చును కానీ ఈ నాలుగూ ఆయనను కుంగదీస్తున్న సమస్యలు. పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తానూ, వెంకయ్యనాయుడూ తిరుపతిలో ఒకే వేదికపైన చేసిన హామీ నీరుగారిపోయింది. తీరా ఢిల్లీలో, అమరావతిలో బీజేపీ, టీడీపీలు కలసి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యేక హోదాలో అంత ప్రత్యేకత ఏమీ లేదనీ, అది సంజీవని కాదనీ, దానితో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారనీ కేంద్రానికి వంతపాడుతూ ముఖ్యమంత్రి కొంతకాలం కాలక్షేపం చేశారు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ సైతం రాలేదంటూ తేల్చిపారేశారు. ఇతర రాష్ట్రాలతో సమానమైన స్థాయిని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలంటూ వాదిం చారు. కానీ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించడంలో దారుణంగా విఫలమైనారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య విశ్వాసరాహిత్యం కనిపిస్తోంది. ఈ సమస్యను చంద్రబాబు అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది స్వయంకృతాపరాధం. విభజన చట్టం ప్రకారం పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాల్వల తవ్వకం చాలావరకూ పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి చేయవలసిందిగా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావలసిన ముఖ్యమంత్రి తానే ప్రాజెక్టు శేషభాగాన్ని పూర్తి చేస్తానంటూ తనది కాని భారం నెత్తికెత్తుకున్నారు. అప్పుడైనా తన శక్తియుక్తులన్నీ అందుకోసమే వినియోగిస్తే ఆక్షేపించే అవసరం ఉండేది కాదు. ఆ విధంగా చేయకుండా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నెలకొల్పి గొప్ప ప్రాజెక్టు నిర్మించినట్టూ, నదుల అనుసంధానం చేసేసినట్టూ అట్టహాసంగా పదేపదే పండుగలు చేసుకున్నారు. అది చాలదన్నట్టు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా నిర్మించారు. ఈ స్కీంలు తోడే గోదావరి నీళ్ళు పోలవరం కాల్వల ద్వారానే ప్రవహిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు స్కీంల అవసరం ఉండదు. వాటిపైన ఖర్చు చేసిన రూ. 3,000 కోట్లు శుద్ధ దండగ. ఈ రెండు మైనర్ ప్రాజెక్టులు మినహా రాష్ట్రంలో తెలుగుదేశం–బీజేపీ సంకీర్ణ సర్కార్ సాధిం చిన ఘనకార్యం ఏదీ లేదు. ఇప్పుడు పోలవరం సైతం వివాదాలలో చిక్కుకుంది. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం లేదు. శ్వేతపత్రం ప్రచురించమంటే ససేమిరా అంటోంది. కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తాననీ, అన్ని నిర్ణయాలూ తీసుకుంటామనీ అంటున్నారు కానీ రావడం లేదు. వాయిదాలు వేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌ను నియమించాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు గడ్కరీ గండి కొట్టారు. ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్ళి గడ్కరీని సుముఖం చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ప్రాజెక్టు ప్రదేశంలో పూచికపుల్ల కదలడం లేదు. తిరగని చక్రం రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు విధేయవర్గం. రెండోది వ్యతిరేకవర్గం. లెక్కలు చెప్పాలనీ, అవినీతి తగ్గాలనీ వాదిస్తున్న బీజేపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకులు. విధేయవర్గం నాయకులు తెలుగుదేశం ఎంపీలను తీసుకొని ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ తర్వాతనే ఢిల్లీ రావలసిందిగా చంద్రబాబుకు ప్రధాని ఆహ్వానం అందింది. ప్రధాని–ముఖ్యమంత్రి సమావేశం అంత సంతోషదాయకంగా ముగిసినట్టు లేదు. సమావేశం జరిగి వారం రోజులు కాకముందే సుప్రీంకోర్టుకు వెడతాం అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడం దేనికి సంకేతం? అలా అనడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని మర్నాడు సంజాయిషీ చెప్పడం ఎందుకు? విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానానికి వెడితే ఎవరికి నోటీసులు అందుతాయి? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికే కదా? అంటే కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్టే కదా! అంత పని చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని వాదిస్తే ఎట్లా కుదురుతుంది? పోలవరం పీటముడి విడిపోయి ఎన్నికల లోపు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు చంద్రబాబు తనను తానే నిందించుకోవాలి. రాజధాని నిర్మాణంపై చెప్పుకోవలసింది ఏమున్నది? మూడేళ్ళపాటు సింగపూర్ చుట్టూ ప్రదక్షిణల తర్వాత డిజైన్లు ఖరారు చేశారని మాత్రం చెప్పుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదికపైన నిర్మాణం ఆరంభం కాలేదు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు తాత్కాలికమైనవే అయినా వాటి నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. అందుకు కారణాలు ఊహించుకోవలసిందే. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ‘మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను, వ్యాపారవేత్తలను చేస్తాను’అంటూ హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ రైతుల చుట్టూ తిరిగి ల్యాండ్‌బ్యాంక్ తయారు చేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ఆయన విదేశాలకు వెళ్ళి తన దగ్గర ల్యాండ్‌బ్యాంక్ ఉన్నదనీ, పరిశ్రమలు పెడితే భూమి ఉదారంగా ఇస్తాననీ చెబుతున్నారు. ఇటు భూములు ఇచ్చిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే సంకల్పంతో మూడున్నర సంవత్సరాలు ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న చంద్రబాబు పైకి గంభీరంగా కనిపించినా మనసులో బెంగటిల్లుతూ ఉండాలి. అందుకే మాటలు తూలడం. వెంటనే సర్దుకోవడం. సమతౌల్యం కోల్పోవడం ఇందుకు ప్రధాన కారణం. నయాపైస లేకుండా కేవలం తన తెలివితేటలతో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ చెప్పుకున్న బాబు చేష్టలుడిగినట్టు కనిపిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించినట్టు లేదు. ప్రతిపక్షానికి చెందిన రెండు డజన్ల శాసనసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు వచ్చే ఎన్నికలలో అసమ్మతి సెగ తగలకుండా ఉండాలంటే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకులకు టికెట్లు ఇవ్వాలి. అందుకు అదనపు స్థానాలు కావాలి. అందుకే స్థానాల పెంపు ఆ పార్టీకి ముఖ్యం. కానీ బీజేపీకి ఇది ప్రధానాంశం కాదు. దానికి పార్లమెంటు స్థానాలు ముఖ్యం. కేంద్ర పథకాలకూ, కేంద్రం సహాయంతో అమలు చేసే పథకాలకూ తన పేరూ లేదా ఎన్టిఆర్ పేరూ పెట్టుకుంటున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి నిధులు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులే వాదిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ స్థానాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇందుకోసం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి అనేక విడతలు కలుసుకున్నారు. మొన్న ప్రధానికి బాబు చేసిన వేడుకోళ్ళలో ఇది ప్రధానమైనది. మోదీ మన్నిస్తారో లేదో మరి. చంద్రబాబు 1995–2004 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఆయన శైలి ఇదే విధంగా ఉండేది కానీ ఇన్ని రకాల వైఫల్యాలు లేవు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఐకె గుజ్రాల్‌ని ప్రధాని పీఠంపైన కూర్చోబెట్టారు. చంద్రబాబు కోసం వాజపేయి తన పదవీకాలాన్ని కుదించుకొని ముందస్తు ఎన్నికలకు అంగీకరించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తర్వాత ప్రజలలో తన పట్ల సానుభూతి వెల్లువెత్తిందనే అభిప్రాయంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై వాజపేయిని సైతం ఒప్పించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఊహించగలమా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? తెలంగాణ ఇస్తే టీడీపీకి అభ్యంతరం లేదని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాసి, దమ్ముంటే రాష్ట్రాన్ని విభజించమంటూ సోనియాగాంధీని సవాలు చేసిన చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం అన్యా యంగా, అశాస్త్రీయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ వాపోతున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపైన చర్చలో తెలుగుదేశం సభ్యులు పాల్గొని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి, సవరణలు సూచించి, వాటిని ఆమోదించకపోతే యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం ఉంది. విభజన క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి రావలసిన రక్షణల కోసం పోట్లాడకుండా ఇప్పుడు యూపీఏని విమర్శించడం చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రత్యేకహోదా హామీని బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు సాధించారు కానీ తెలుగుదేశం ఎంపీలు కాదు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండాలి. గడువు ముగిసే లోగా అన్ని వసతులూ కలిగిన రాజధాని నగరం నిర్మించుకొని అక్కడికి తరలి వెళ్ళవచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందో లేదో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించి కట్టుబట్టలతో పంపించారంటూ యూపీఏని నిందించడం కపట రాజకీయం. తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అమలు చేయడానికీ, తెలంగాణలో టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడానికీ కారణం ఒకానొక భ్రమ. రెండు రాష్ట్రాలలోనూ తన ప్రాబల్యం ఉండాలనీ, తానే రాజ్యం చేయాలనే ఆకాంక్ష. ఇది అసాధ్యమని అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తెలుసుకోలేకపోవడం విచిత్రం. తాను రాజకీయ, నైతిక విలువలను తుంగలో తొక్కి, ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసి ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎంఎల్ఏలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాజేశారు. చివరికి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే మంచిదని మోత్కుపల్లి నరసింహులు సలహా ఇచ్చే వరకూ పరిస్థితి వచ్చింది. తెలంగాణ నుంచి ఆకస్మికంగా నిష్క్రమించడానికీ, ప్రధానమంత్రితో గట్టిగా మాట్లాడలేకపోవడానికీ, ఎన్ని అవమానాలు జరిగినా ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించకపోవడానికీ ఒకే ఒక కారణం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమే. ఆ దుస్సాహసం వెనుక దురాశ, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అనైతిక రాజకీయం ఉన్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఉన్నది. కానీ ధైర్యం చాలడం లేదు. అందుకే మాట తూలడం, నాలిక కరుచుకోవడం. కె. రామచంద్రమూర్తి -
దిద్దుబాటే శ్రేయస్కరం
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకుర్ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్ జనరల్ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! నలుగురూ నిష్ణాతులే ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్ గొగోయ్ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్ చలమేశ్వర్ పదవీ కాలం ఈ యేడాది జూన్ 22తో ముగుస్తుంది. జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్ లోకుర్ సైతం డిసెంబర్ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్‌కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్ చలమేశ్వర్ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్‌కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ (నెంబర్ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (నేషనల్ జుడిషియల్ అపాయంట్మెంట్స్ కమిషన్–ఎన్జెఎస్సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్ చలమేశ్వర్ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్ త్రిపుల్ తలాఖ్ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు. ముదిరిన విభేదాలు కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు నడిపే మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ని నెలకొల్పుతూ జస్టిస్ చలమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్ ఏర్పాటు చేసిన బెంచ్‌ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్‌ని నియమించారు. ‘చీఫ్ జస్టిస్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్ దీపక్‌మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్ జస్టిస్ సమానులలో ప్రథముడే (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వెల్స్) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు) చీఫ్ జస్టిస్ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్‌ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్ మిశ్రా నియమించిన బెంచ్‌లో జస్టిస్ చలమేశ్వర్ లేరు. రెండు, గుజరాత్ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్ కౌంటర్’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసు. నాగపూర్‌లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కి పోస్ట్ చేశారు. లోయా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్ నిశాంత ఆర్ కర్నేశ్వార్కర్కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్టు బీఆర్ లోన్ తరఫున ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ వకీలుగా వరీందర్ కుమార్ శర్మ మరో పిటిషన్ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్ల నాయకత్వంలోని బెంచ్‌కి అప్పచెప్పకుండా జూనియర్‌కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్’లనూ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్లే విచారించాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఎద్దేవా చేశారు. ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్పైన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన బెంచ్ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. కె. రామచంద్రమూర్తి -
విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం
సాక్షి, విజయవాడ: విజయవాడలో 29వ పుస్తక మహోత్సవం నేడు ప్రారంభమైంది. 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం ఈ ఏడాది కోత్త హంగులతో కొలువుదీరింది. ఈ సందర్భంగా స్వరాజ్ మైదాన్‌లో ‘ నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’ అనే అంశంపై సదస్సి జరిగింది. ఈ సరస్సుకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులతో వారికి నచ్చిన పుస్తకం పై మాట్లాడించాలనేది మంచి ఆలోచన. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశం ప్రేరణ కలిగిస్తుంది. ఈ ప్రేరణ తో తమ జీవనశైలిని మార్చుకునే వారే తమ లక్ష్యం సాధిస్తారు. దేశ, విదేశాల్లో అనేక ఉద్యమాలను నడిపిన వారికి పుస్తకాలే ప్రేరణ కలిగించాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మందిని ప్రభావితం చేసినవి కూడా పుస్తకాలే. సమాజాన్ని, దేశాన్ని అర్ధం చేసుకోవడానికి పుస్తకాలు దోహదం చేశాయి. ఇప్పుడు పుస్తకానికి, రాజకీయానికి మధ్య దూరం పెరుగుతోంది. పుస్తక స్పర్శ తెలియని రాజకీయ నాయకులకు, పుస్తకాల ద్వారా జ్ఞానం ఆర్జించిన నేతలకు మధ్య తేడా తెలిసిపోతోంది’ అని ఆయన అన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్షీపతి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం నేటి నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. -
మెడ మీద కత్తి వేలాడుతోంది..!
త్రికాలమ్ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది. వేటు పడుతుందనే భయం పీడిస్తూనే ఉంది. కొన్ని తలలు తెగిపడటం చూస్తూనే ఉన్నాం. మనవంతు ఎప్పుడనేదే ప్రశ్న. భయంభయంగానే జీవిస్తూ ఏడాది చివరికి క్షేమంగా చేరుకున్నాం. ఒక సంవత్సరం ఈ రోజు కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఆశలు మోసుకొని రేపు నూతన సంవత్సరం ఉదయిస్తుంది. కడచిన ఏడాది పాడవునా జీవితం నిజంగానే అంత భయంకరంగా ఉన్నదని కాదు. కొన్ని ఘనకార్యాలు జరగకపోలేదు. సంతోషం కలిగించిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఏదో ఎడతెగని బెంగ. దశాబ్దాలుగా అనుభవించిన స్వేచ్ఛ కోల్పోతున్నామనే బాధ. భయపడుతున్నదంతా నిజంగా జరిగిపోతుందేమోనన్న ఆందోళన. ఏమి అంటే ఏమి జరుగుతుందో, ఏమి ఆపాదిస్తారో, ఏ నింద వేస్తారో, ఏమని బెదిరిస్తారో అని దడ. జరగరానిది జరిగితే పరిస్థితులు ఇంకా ఎంతకి దిగజారుతాయోనన్న విహ్వలత. ఎంచిన కీడు జరగనందుకు ఒకింత ఊరట. ఏడాది పొడవునా ఇదే డోలాయమానం. ఈ సంవత్సరం ఎట్లా ఆరంభమైనదో అంతకంటే ఆందోళనకరంగానే అంతం అవుతోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైన దిగులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి భయంగా రూపాంతరం చెందింది. రాజీలేని సమర్థులైన నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇందిరాగాంధీని అందుకే ఆరాధించారు. ఇప్పుడు నరేంద్రమోదీనీ అభిమానిస్తున్నది ఆ కారణంగానే. పెద్దనోట్ల రద్దువంటి పొరబాటు నిర్ణయం తీసుకున్నా సరే, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) అమలులో తొందరపాటు ప్రదర్శించినా సరే ప్రజలు మోదీని గద్దె దింపాలనుకోవడం లేదు. రాహుల్ శైలిలో పరివర్తన రాజకీయాలకు సరిపోడనుకున్న రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన, గుజరాత్ ఎన్నికల ప్రచారం తర్వాత ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎంతో కొంత ఎదిగాడు. ప్రజల తప్పు ఎప్పుడూ లేదు. ఎవరికి తగిన గౌరవం వారికి ఇస్తారు. మధ్యతరగతి మేధావులను విశేషంగా ఆకట్టుకున్న మోదీ వారికే కొన్ని సందర్భాలలో నిద్రలేకుండా చేస్తున్నారు. ఇంతకు పూర్వం దేశాన్ని పాలించిన ప్రధానులు ఎవ్వరూ ప్రదర్శించని సాహసం మోదీలో కనిపిస్తుంది. ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేయడం ఆయనకు వినోదం. ప్రతి ఎన్నికనూ ఒక ప్రతిష్ఠాకరమైన యుద్ధంగా పరిగణించడం, పోరాటంలో గెలుపొందేందుకు ఎంతకైనా తెగించడం, సరిహద్దులను దాటడం, మెరుపుదాడులు నిర్వహించడం మోదీ ప్రత్యేకత. దశాబ్దాలపాటు అనుసరించిన మర్యాదలను ఉల్లంఘించి ప్రత్యర్థులపైన అనూహ్యమైన దాడులు చేయడం మోదీ ప్రత్యేకత. మతం మాట ఎత్తకుండా మత ప్రాతిపదికపైన ఓటర్లను చీల్చడం మోదీ విజయ రహస్యం. వికాసం అంటూ మొదలయ్యే ప్రచారం అనివార్యంగా వికారంతో ముగుస్తుంది. బీజేపీకి విజయం ప్రసాదిస్తుంది. 2017లో ఆరు రాష్ట్రాలలో ఎన్నికలను బీజేపీ గెలుచుకోవడానికి ప్రధాన కారణం మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల యుద్ధతంత్రం. ప్రతి గ్రామంలో గోరీల దొడ్డి మాత్రమే కాదు స్మశానవాటిక కూడా ఉండాలనడం, రంజాన్ రోజున విద్యుచ్ఛక్తి సరఫరా నిరంతరాయంగా ఉంటే దీపావళి పండుగనాడు సైతం ఉండాలనడం పరోక్షంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే. ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యూహంతో ఘనవిజయం సాధించిన తర్వాత అదే సూత్రాన్ని అవసరమైన చోట్ల, అవసరమైన మోతాదుల్లో వినియోగిస్తున్నారు. గుజరాత్లో ఈసారి గెలుపు అంత సులువు కాదని గ్రహించిన మోదీ సరిహద్దు అతిక్రమించి మాజీ ప్రధానిపైనా, మాజీ ఉపరాష్ట్రపతిపైనా మెరుపుదాడి చేశారు. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెచ్చిపోయారు. తనను అంతం చేయడానికి అయ్యర్ పాకిస్తాన్ వెళ్ళి ‘సుపారీ’ఇచ్చారని ఆరోపించారు. అయ్యర్ ఢిల్లీ నివాసంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కసూరీకి ఇచ్చిన విందులో పాకిస్తానీయులతో కలసి మన్మోహన్, హమీద్ అన్సారీలు గుజరాత్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలలో సత్యం లవలేశం లేదని అందరి కంటే బాగా మోదీకే తెలుసు. కానీ వీరంతా కుట్ర పన్ని సాటి గుజరాతీకి అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగించాలి. హిందువుల కోసం బీజేపీ పాటుపడుతున్నట్టు నమ్మించాలి. గుజరాత్ ఎన్నికల సమయంలోనే శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధిస్తానంటూ బయలుదేరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో చర్చలు జరిపారు. హిందూమత సంస్థలు రామాలయ నిర్మాణం గురించి వరుస ప్రకటనలు చేశాయి. ఆ ఎన్నికల తర్వాత రామాలయం ఊసు లేదు. çపద్మావతి చిత్రంపై లేనిపోని రభస సైతం గుజరాత్ కోసం ఉద్దేశించిందే. ఆ విధంగా స్థాయి మరచి ప్రధాని ప్రచారం చేయకపోతే అక్కడ ఆరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు. మధ్యతరగతిలో అసహనం నిర్హేతుకమైన మీడియా ధోరణులను మధ్యతరగతి ప్రజలు ఆమోదించడానికి సమాజంలో పెరుగుతున్న అసహసం కారణం. ఇందుకు బీజేపీని మాత్రమే నిందించడం సరికాదు. కాంగ్రెస్ దోషం చాలా ఉంది. షాబానో కేసులో ఇస్లామిక్ ఛాందసవాదులకు కొమ్ముగాసి, బాబరీ మసీదు–రామజన్మభూమి వివాదంలో శిలాన్యాస్‌ను అనుమతించి హిందువులను మెప్పించడానికి ప్రయత్నించడం వల్ల రాజీవ్‌గాంధీ కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీశారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ దేవాలయ సందర్శన, జందెం వేసుకున్న బ్రాహ్మణుడనంటూ చెప్పుకోవడం, రుద్రాక్షమాల ధరించడం ఎందుకు? తానూ హిందువునేనని చాటుకునేందుకు. అసలు హిందువు ఉండగా నకిలీ హిందూ ఎందుకని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ఇదే వైఖరి కొనసాగిస్తే హిందూత్వ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మైనారిటీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించలేరు. బీజేపీకి బి–టీమ్‌గా మారితే అది ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది? కాంగ్రెస్‌ను అటువంటి దయనీయ స్థితికి బీజేపీ నెట్టగలిగింది. సెక్యులరిజం సిద్ధాంతం వల్లించడానికి కాంగ్రెస్ నేతలు భయపడే వాతావరణం కల్పించడంలో మోదీ విజయం సాధించారు. రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులరిజం’అనే మాటను తొలగిస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నది నోరుజారి కాదు. దాని వెనుక వ్యూహం ఉంది. ఇందులో కర్ణాటక ఓటర్లకు ఒక సందేశం ఉంది. మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు. సెప్టెంబర్‌లో హత్య జరిగినప్పటికీ ఇంత వరకూ అక్కడి కాంగ్రెస్ సర్కార్ హత్య కేసును ఛేదించలేకపోయింది. రాజస్థాన్‌లో ఒక ముస్లింని వెంటాడి, నరికి, దహనం చేసినప్పుడు సైతం పెద్దలు ఎవ్వరూ పెదవి విప్పలేదు. ఇటువంటి దురంతాలను ఖండించడానికి సంకోచించే వాతావరణం కలవరపెడుతోంది. అదే సమయంలో ముమ్మారు తలాఖ్‌ను నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం మంచి పని. బిల్లులోని లోటుపాట్లను సవరించుకుంటే మంచిది. డెబ్బయ్ సంవత్సరాల స్వతంత్రం ముస్లిం మహిళలకు ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయిందన్న అపరాధ భావనను మోదీ సర్కార్ తొలగించింది. ఎగువ, దిగువ సభలలో సంఖ్యాబలం ఉన్న దశలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ సాహసం చేయలేదు. ఇందిరాగాంధీ కఠినమైన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. కానీ ఈ ఆలోచన ఆమెకు రాలేదు. ఓటు బ్యాంకు రాజ కీయం వల్లనే ముస్లిం మహిళలను నిర్లక్ష్యం చేశారంటూ బీజేపీ చేస్తున్న విమర్శను ఖండించడం కష్టం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చితే కేంద్ర సర్కార్ అవినీతి కుంభకోణాలకు దూరంగానే ఉంది. అందుకు కూడా మోదీని అభినందించాలి. లోక్‌సభలో బీజేపీ స్వయంగా మెజారిటీ కలిగి ఉండటం, మిత్రపక్షాలపైన ఆధారపడి లేకపోవడం మోదీకి కలిసి వచ్చిన అంశాలు. ఈ వెసులుబాటు వాజపేయికి కానీ మన్మోహన్‌సింగ్‌కు కానీ లేదు. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరిగే దేశంలో ప్రధాని స్వయంగా మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా విజయం సాధించగలమని భావించడమే భయం కలిగిస్తున్న ధోరణి. ముస్లిం జనాభాలో సగంమంది (మహిళలు) తలాఖ్ బిల్లు ఫలితంగా బీజేపీ మద్దతుదారులుగా మారితే మైనారిటీల పట్ల వ్యతిరేక ధోరణి రాజేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మోదీ ఎవ్వరినీ సంప్రదించరనీ, ముఖ్యమంత్రులను కలుసుకోరనీ, కలుసుకున్నా వారితో చనువుగా మాట్లాడరనీ, మంత్రిమండలి సహచరులు సైతం ఆయనతో మనసు విప్పి మాట్లాడటానికి సంకోచిస్తారనీ అంటారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశమే. తెలుగు రాష్ట్రాల అధినేతలు డిటో కొన్ని విషయాలలో మోదీ అడుగుజాడల్లోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నడుస్తున్నారు. తిరుగులేని నాయకులుగా పేరు తెచ్చుకోవాలన్న అభిలాషతో ప్రజల ప్రాథమిక హక్కులను హరించేందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. సభలు జరుపుకోవడానికీ, ఉద్యమాలు చేయడానికీ, నిరసన ప్రకటించడానికీ పోలీసు అనుమతి కావాలి. సభ తలపెడితే గృహ నిర్బంధాలూ, అరెస్టులూ, వేధింపులూ రివాజుగా మారాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనంతరం నిర్మాణం జరుగుతోంది. ఏమి జరిగినా అధినేత అభీష్టం మేరకు జరగవలసిందే. ఒకరిని సంప్రదించడం కానీ ఒకరు చెప్పిన సలహాని స్వీకరించడం కానీ లేదు. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నదే. రెండు రాష్ట్రాల అధినేతలూ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి బాహాటంగా అప్రజాస్వామిక ధోరణిని ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి విధేయంగా ఉంటూ కేసుల దర్యాప్తులో ఆగమంటే ఆగుతున్నారు. సాగమంటే ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో నోటుకు ఓటు కేసు కానీ, నయీం డైరీల ఉదంతం కానీ, డ్రగ్స్ మాఫియా కానీ, మియాపూర్ భూముల వివాదం కానీ కొలిక్కిరాలేదు. మియాపూర్‌లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నమ్మవలసిందే. డ్రగ్స్ వినియోగదారులను కాకుండా అక్రమ విక్రయదారులనూ, బ్రోకర్లనూ పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులు కొత్త సూత్రం చెబితే అంతే కామోసు అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇంత కంటే దారుణం. శేషాచలం అడవులలో కూలీలను కాల్చి చంపిన కేసులో నేరనిర్ధారణ జరగలేదు. విశాఖ భూకుంభకోణంపైన వేసిన ‘సిట్’ విచారణ అనంతంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల ఘట్టంలో ముఖ్యమంత్రి సమక్షంలో లఘుచిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో రెండు పదులకుపైగా భక్తులు చనిపోవడంపై విచారణ, నిర్ధారణ లేదు. పోలవరం సబ్–కాంట్రాక్టర్లకు వందల కోట్ల పనులు నామినేషన్‌పైన ఎందుకు ఇచ్చారంటే సమాధానం లేదు. శ్వేతపత్రం ప్రకటించాలని హితుడు పవన్‌కల్యాణ్ అడిగినా లెక్కాపత్రం లేదు. కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలు చెప్పమంటే తలాతోకా లేని లెక్కలు చెబుతున్నారు. కడచిన 42 మాసాలలో సాధించిన ఘనకార్యం లేదు. అమరావతి ఇంకా డిజైన్ల స్థాయి దాటలేదు. అసెంబ్లీ భవనం, సచివాలయం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు వగైరా నిర్మాణాలన్నీ తాత్కాలికమే. తెలంగాణలో ప్రతిపక్షం సంఘటితం కాలేదు. వాటి మధ్య బలమైన సైద్ధాం తిక విభేదాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటి వరకూ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ నాయకుడు చేస్తున్న పాదయాత్రలో ప్రజలు విశేషంగా స్పందిం చడం కనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రతికూలత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల అధినేతల వ్యవహరణ శైలి వచ్చే సంవత్సరం మారిపోతుందనీ, వారు తమకు నచ్చిన విధంగా కాకుండా ప్రజలు మెచ్చే విధంగా వ్యవహరించాలనీ, అందరినీ కలుపుకొనిపోయే రాజకీయం చేయాలనీ, రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా గౌరవించాలనీ కోరుకుందాం. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అన్న నన్నయ వాక్కు నిజం కాదని మన పాలకులు నిరూపిస్తారని ఆశిద్దాం. -- కె. రామచంద్రమూర్తి -
అంతులేని జాప్యంతో అనర్థం
త్రికాలమ్ దేశ రాజకీయాలనూ, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులనూ, వాటిపైన వివిధ రాజకీయపార్టీలు చెబుతున్న భాష్యాలనూ గమనించినవారు ‘ఇదేమి రాజ్యం?’ అంటూ విస్తుపోతారు. రాజకీయపార్టీల తీరు పట్ల దిగ్భ్రాంతి చెందు తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వాకం చూసి నివ్వెరపోతారు. రాజకీయ నాయకుడిపైన ప్రత్యర్థి ఎవరో ఒకరు ఆరోపణ చేస్తారు. ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేస్తారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతారు. న్యాయస్థా నాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆర్థికాంశాలకు సంబంధించిన కేసులైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో ప్రవేశిస్తుంది. పని ప్రారం భించి ఏళ్ళు గడిచినప్పటికీ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయదు. విచారణ ప్రారం భించిన సీబీఐ న్యాయస్థానాలు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చవు. వాయి దాలు వేస్తూపోతాయి. తీరా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు కానీ ప్రభుత్వం కానీ హైకోర్టులో సవాలు చేయడం తప్పని సరి. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఒక కేసును పరిష్కరించాలంటే దశాబ్దా లకాలం పడుతుంది. దిగువ న్యాయస్థానం నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ కేసు ఎగబాకి వచ్చే సరికి నిందితులలో కొంతమంది మరణిస్తారు. నిజం నిగ్గు తేలుతుందన్న విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత సైతం పాత ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీడియా తిరిగి తిరగమోత పెట్టి అదే వార్తను వడ్డిస్తుంది. టీవీ సమర్పకులు (యాంకర్లు) రెచ్చిపోతారు. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలనే అస్త్రాలుగా వినియోగించుకొని ఎన్నికలు గెలుస్తారు. ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆరోపణలపైన దర్యాప్తు పూర్తికాదు. ఈలోగా దర్యాప్తు జరిపిన అధికారులు ధర్మం, న్యాయం, విలువల గురించి దేశ విదేశాలలో ఉపన్యాసాలు ఇస్తారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిందంటూ ఉద్ఘాటించిన కాగ్ (వినోద్‌రాయ్) భువనేశ్వర్ నుంచి బోస్టన్ వరకూ ప్రసం గాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభియోగాలు రుజువు కాకపోతే ఆయన పూచీ లేదు. ఘాటైన విమర్శలు చేసి పాత ప్రభుత్వానికి పాతరేసినవారికి కొత్త పాలకులు పెద్దపీట వేస్తారు. న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థలపైనా, ప్రభుత్వాధినేతలపైనా ధర్మాగ్రహం వెలిబుచ్చుతారు. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియదు. అంతా అయో మయం. రాజకీయపార్టీలు వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే వాదిస్తాయి. పౌరులు సైతం వారి రాజకీయ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఏ వాదన ఆమోదిం చాలో, దేనిని తిరస్కరించాలో నిర్ణయించుకుంటారు. ఆలోచించవలసిన తీర్పులు ఒకే వారం వచ్చిన రెండు తీర్పులను పరిశీలిద్దాం. ఒకటి, 2జీ స్పెక్ట్రమ్ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. రెండు, దాణా కుంభకోణం కేసులో మరో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం. 2జీ స్పెక్ట్రమ్ కేసు మన్మోహన్ నాయకత్వంలో యూపీ ఏ–2 ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించింది. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కుంభకోణంతో పాటు 2జీ స్కాం కలసి కాంగ్రెస్‌ను గంగలో కలి పాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఈ కుంభకోణాలను అత్యంత సమ ర్థంగా వినియోగించుకొని ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. డీఎంకే మంత్రి ఏ రాజా రాజీనామా చేయవలసి వచ్చింది. జైలు ఊచలు లెక్కపెట్టవలసి వచ్చింది. డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జైలుకెళ్లారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2జీ కేసులో నిందితులందరినీ నిరపరాధులని నిర్ణయించ డంతో కాస్త ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. కానీ దీనిపై అప్పీలు చేస్తానని ఈడీ ప్రకటించింది. ఇంకా అయిపోలేదని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కూడా హెచ్చరిస్తు న్నారు. బీజేపీ ప్రవక్తలందరూ ఇదే మాటపైన నిలబడి ఉన్నారు. ఉత్తి దుష్ప్ర చారం తప్ప వేరే ఏమీ లేదనీ, అవినీతి ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేననీ మన్మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ సౌధం అసత్యం అనే పునాది పైన నిలిచి ఉన్నదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపైన తమకు విశ్వాసం ఉన్నదని ఇరు పక్షాలు నొక్కివక్కాణిస్తు న్నాయి. కానీ తమతమ ప్రయోజనాలకు తగినట్టు తీర్పును అన్వయిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదం వల్ల ఖజానాకు రూ. 1.78 లక్షల కోట్లు నష్టం వచ్చినట్టు నాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ అంచనా వేశారు. ఈ అంచనాను విశ్వసించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ నాయకత్వం లోని ఇద్దరు సభ్యుల బెంచి రాజా మంజూరు చేసిన కేటాయింపులన్నిటినీ రద్దు చేసింది. ఆ కేసులో అవినీతి లేదా కుట్ర జరిగిందా లేదా అన్న అంశం తేల్చడం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బాధ్యత అనీ, తమ కర్తవ్యం విధానం అనుసరించ కుండా ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరించడమనీ సింఘ్వీ శుక్రవారంనాడు వ్యాఖ్యానించారు. ఆక్షన్ లేకుండా కేటాయింపులు సరికాదు కనుక వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ఉల్లంఘనకు ఎంత శిక్ష వేయాలి, ఎవరికి వేయాలి అన్న విషయంలో స్పష్టత లేదు. న్యాయమూర్తుల వైఖరిని బట్టి శిక్ష ఉంటుంది. ఒక్క విధాన ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందనే అంచనా ప్రభావం కూడా జస్టిస్ సింఘ్వీ పైన విధిగా ఉండి ఉంటుంది. ఆ అంచనా గాలి లెక్క మాత్రమేనని చాలామంది ప్రవీణులు వ్యాఖ్యానించారు. ఉజ్జాయింపుగా చెప్పానని కాగ్ అన్నారు. కానీ నష్ట మెంత అనేది ఎవ్వరూ నిర్ధారించలేరు. అటువంటి ప్రయత్నం జరగడం లేదు. అంత నష్టం వచ్చిందని కానీ, రాజా, కణిమొళి తదితరులు లబ్ధిపొందారని కానీ సీబీఐ నిరూపించలేకపోయింది. లక్షల పేజీల నివేదికలు తయారు చేసిన సీబీఐ ఒక్క అభియోగం కూడా నిరూపించలేదనీ, చాలా బాధ్యతారహితంగా వ్యవహ రించిందనీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. తీర్పు తర్వాత డీఎంకే నేతలు ఆనందంతో లడ్డూలు పంచుకోగా, కాంగ్రెస్ నాయకులు సత్యమే గెలిచిందనే వ్యాఖ్యనంతో సరిపుచ్చుకున్నారు. బీజేపీ ప్రతినిధులు మాత్రం ముందున్నది ముసళ్ళ పండగ అని హెచ్చరిస్తున్నారు. ఏమీ అవినీతి, అక్రమం జరగపోతే సర్వోన్నత న్యాయస్థానం స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరిపాలనాపరమైన నిర్ణయంలో పొర పాటు జరగడం వేరు. కుట్రపూరితంగా నేరం చేయడం వేరు. 2జీలో కుట్ర లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దోషిగా తేలిన లాలూ ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వాన్ని 2జీ కుంభకోణం నిర్వీర్యం చేస్తే పట్నాలో దాణా కుంభకోణం లాలూ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి గద్దె మీది నుంచి దించింది. ఆయన భార్య రాబ్డీదేవిని గద్దెనెక్కించింది. దాణా కుంభకోణానికి బీజం 1985 లోనే పడింది. నాటి కాగ్ టీఎన్ చతుర్వేది హయాంలో బిహార్ కోశాగారం నుంచి లెక్కలు ఎప్పుడూ ఆలస్యంగా రావడాన్ని అధికారులు గమనించారు. బిహార్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి దుబే చొరవతో దర్యాప్తు జరిగింది. పశు సంవ ర్థకశాఖ అధికారులు పశువుల దాణా కొనుగోలులో అక్రమాలు చేశారనీ, దొంగ బిల్లులు పెట్టారనీ తేలింది. 1993లో ఆదాయంపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో 80 మంది అధికారుల దగ్గర అక్రమ సంపద ఉన్నట్టు తెలుసుకు న్నారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఒక అధికారి దగ్గర రాంచీ విమానాశ్ర యంలో కోటి రూపాయలు పట్టుకున్నారు. 1997లో బిహార్ బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడే మొదలైనాయి లాలూ కష్టాలు. ఇందుకు సంబంధించి మొత్తం 64 కేసులు ఉన్నాయి. 56 మంది నిందితులు. మొత్తం రూ 950 కోట్ల మేరకు ప్రభుత్వ ధనం కాజేశారన్నది ప్రధాన అభి యోగం. ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడైన వ్యక్తిపైన విచారణ జరిపించా లని కోరుతూ అధికారులు సమర్పించిన ఫైలును లాలూ 16 మాసాలు తొక్కిప ట్టారని ఆరోపణ. ఆరు కేసులలో లాలూ ప్రసాద్‌కు ప్రమేయం ఉన్నది. ఒక కేసులో రూ. 37.70 కోట్లను చాయ్‌బసా ట్రెజరీ నుంచి తీసుకున్నట్టు చేసిన ఆరో పణ రుజువై లాలూను దోషిగా నిర్ధారించి జైలుకు పంపారు. అప్పుడే రాబ్డీదేవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. రెండు మాసాలు పూర్తికాక మునుపే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూకూ, మరి 14 మంది దోషులకూ విధించే శిక్ష ఏమిటో జనవరి 3న ప్రకటిస్తారు. శనివారం రాంచీలో సాక్షుల బోనులో లాలూ, మరి 24 మంది నిలుచొని ఉండగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథమిశ్రానూ, మరి అయిదుగురినీ నిర్దోషులుగా ప్రకటించి వెళ్ళిపొమ్మన్నారు. లాలూనూ, ఇతరులనూ అక్కడే అరెస్టు చేశారు. ఈ కేసులో తాను చేసిన ఆరోపణలను సీబీఐ దిగువ కోర్టులో నిరూపించగలిగింది. బీజేపీ నాయకత్వం, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కలసి చేసిన కుట్ర ఫలితమే ఈ తీర్పు అంటూ లాలూ ద్వితీయ పుత్రుడూ, రాజకీయ వారసుడూ అయిన తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ తీర్పు వెలువడటానికి రెండు గంటల ముందే లాలూ కుమార్తె మిసాభారతిపైనా, ఆమె భర్త శైలేష్కుమార్పైనా ఈడీ కేసులు పెట్టింది. అవినీతికి పాల్పడినవారు చట్టం నుంచి తప్పించుకొని పోలేరంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ ఉద్ఘాటించారు. ఆరోపణాస్త్రాలతోనే పోరాటం సీబీఐ దర్యాప్తు పేరు మీద రాజకీయ పోరాటాలు చాలాకాలంగా సాగుతు న్నాయి. ఆరోపణలు చేసినవారికి వాటిని నిరూపించవలసిన బాధ్యత లేదు. ఆరోపణల స్థాయి దాటి సీబీఐ దర్యాప్తు మొదలైతే రాజకీయ క్రీడ ఆరంభం అవుతుంది. సీబీఐ పెట్టిన కేసులలో న్యాయస్థానం ఎదుట పరీక్ష తట్టుకొని నిలి చినవి చాలా తక్కువ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్పై వచ్చిన ఆరోపణలపైన విచారణకు గవర్నర్ విద్యాసాగర్ ఇచ్చిన అనుమతి సమంజమైన దని సీబీఐ నిరూపించలేకపోయింది. ఆరుషి, పనివాడు హత్య కేసులో ఆరోప ణలు నిరూపించడంలో సీబీఐ విఫలమెంది. రాజీవ్‌గాంధీ పదవీచ్యుతికి కారణ మైన బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి కూడా సీబీఐ సాక్ష్యాధారాలు సేక రించలేని కారణంగా వీగిపోయింది. ‘మిస్టర్ క్లీన్’ అని చెప్పుకున్న రాజీవ్‌ను ఈ కుంభకోణం జీవితపర్యంతం వెంటాడింది. చివరికి 2005లో ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తుకోసం సీబీఐ రూ. 250 కోట్లు ఖర్చు చేసిందని కూడా న్యాయమూర్తి వెల్లడించారు. రాజీవ్ హత్య కేసులో సైతం సీబీఐ దర్యాప్తు నిష్ఫలంగా అనం తంగా సాగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐని న్యాయస్థానాలు చీవాట్లు పెట్టని సందర్భాలు తక్కువ. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీబీఐని ‘పంజరంలో చిలక’ అంటూ అభివర్ణించారు. లాలూ కానీ రాజా కానీ నేరం చేయలేదని న్యాయస్థానం చెప్పలేదు. లాలూ నేరం చేసినట్టు సీబీఐ కోర్టు నిరూ పించిందనీ, రాజా నేరానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ విఫలమైందనీ న్యాయవేత్తలు అన్నారు. అందుకనే న్యాయస్థానాలు నిర్దోషులని నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు పాత ఆరోపణలనే యథావిధిగా చేస్తున్నాయి. అందుకే అవినీతి ఎన్నికలలో నిర్ణాయకాంశం కావడం లేదు. లాలూ జైల్లో ఉన్న ప్పటికీ ఆర్జేడీ ప్రాబల్యానికి నష్టం లేదు. నితీశ్‌కుమార్‌కి లాభం లేదు. దీనికి ప్రధాన కారణం కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం. లాలూపైన వచ్చిన అభియోగాలపై విచారణ తొమ్మిది మాసాలలో పూర్తి చేయా లని గతమే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది కనుకనే ఈ మాత్రం వేగంగా విచారణ జరిగింది. అమెరికా స్టాక్ ఎక్చేంజిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణపై రజత్‌గుప్తాను న్యాయస్థానాలలో విచారించారు. దర్యాప్తూ, నేరారోపణ, విచారణ, నేర నిర్ధారణ అన్నీ ఒకే ఒక సంవత్సరంలో పూర్తయినాయి. న్యాయం సకాలంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే అర్ధం (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్). న్యాయపాలనలో సంస్కరణలు అమలు చేసేంతవరకూ ఈ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ లొసుగును రాజ కీయవాదులు తెలివిగా వినియోగించుకుంటారు. ఇదే ధోరణి కొనసాగితే సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. కె. రామచంద్రమూర్తి -
పోలవరం: కాఫర్‌డ్యామ్ ‘ఎత్తు’గడ!
రాజకీయ నాయకుడు (పొలిటీషియన్) వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు (స్టేట్స్‌మన్) రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. ఈ సూక్తి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించడమే కాదు, స్వార్థపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారనడానికి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రబల నిదర్శనం. విలువలు లేని రాజ కీయం వల్ల నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నట్టే, రాబోయే ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయంతో పోలవరం అనే సుడిగుండంలో చిక్కుకున్నారు. 2018 లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ పదేపదే హామీలు ఇవ్వడం, ప్రతి పక్షం అడ్డుపడుతోందంటూ ఆరోపణలు చేయడం, పవన్ కల్యాణ్ మంచి బాలుడంటూ కితాబులు ఇవ్వడం తప్ప అసలు పోలవరంలో ఏమి జరుగుతోందో ప్రజలకు చెప్పలేదు. పోలవరంపైన శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ అడిగినా అక్కరలేదని కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు చూసి నిర్ఘాంతపోయాను. వాస్తవానికి అక్కడ పని బొత్తిగా జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు మిన్నకుండి అకస్మాత్తుగా పోలవరం పూనకం వచ్చినట్టు అదేపనిగా కలవరించడం ప్రారంభించారు చంద్రబాబు. అనేక విడతల క్షేత్ర పర్యటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రతింపులు జరిపారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పని తీరును సమీక్షిస్తూ సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఆర్భాటం గమనించినవారికి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా దూసుకుపోతోందనే అభిప్రాయం కలుగుతుంది. శుక్రవారం ఉదయం ఇద్దరు జర్నలిస్టు మిత్రులతో కలసి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తిరిగి, అన్ని విషయాలూ వివరంగా అడిగి తెలుసుకున్న తర్వాత ప్రాజెక్టు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో అర్థమైంది. మేము అక్కడ ఉన్నప్పుడే కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మండలి ప్రతినిధి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కోసం పదిహేను వాహనాలలో అట్టహాసంగా చేరుకుంది. వారి వెంట రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇంజనీర్–ఇన్–చీఫ్ నాగేశ్వరరావు, ఉన్నతాధికారి రమేష్ కేంద్ర అధికారులకు ప్రాజెక్టు ‘పురోగమనం’ గురించి వివరిస్తున్నారు. అక్కడక్కడ టిప్పర్లు కనిపిస్తున్నాయి. రెండు ప్రొక్లేన్లు పని చేస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బోర్డు వెలసిపోయి నిర్వికారంగా కనిపించింది. సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ కదులుతోంది కానీ కాంక్రీట్‌ను తయారు చేయడంలేదు. కేంద్ర అధికారులకు ఆ ప్లాంట్ ఎట్లా పని చేస్తోందో చూపించేందుకే దానిని నడిపిస్తున్నారని అక్కడున్నవారు చెప్పారు. కాఫర్ డ్యామ్ అవసరమా అని కేంద్ర అధికారులు ప్రశ్నించారనే శీర్షికతో శనివారం నాటి పత్రికలు వార్త ప్రచురించాయి. కాఫర్‌డ్యామ్ అవసరం తెలియని అమాయకులా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు? కాదు. వారు అడగడం వెనుక బలమైన కారణం ఉంది. ఎన్నికలే ప్రధానం మా ముఖ్యమంత్రిగారు 2018 జూన్ కల్లా కాఫర్‌డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి, నదీ ప్రవాహం మళ్ళించి గురుత్వాకర్షణశక్తి (గ్రావిటీ) సహాయంతో నీరు సరఫరా చేయాలని సంకల్పించారనీ, ఆ సంకల్పం సాకారం కావాలంటే కాఫర్ డ్యామ్‌ను అనుమతించాలనీ మంత్రి కోరారు. ఎర్త్ అండ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాలంటే కాఫర్‌డ్యామ్ కట్టితీరాలి. అప్పుడే నీటిని అరికట్టి డ్యామ్ నిర్మాణం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాఫర్‌డ్యామ్ అంటే తాత్కాలికమైన మట్టి కట్ట. ఎగువన ఒక వరుసలో, దిగువన మరో వరుసలో పసుపు పచ్చ జెండాలు కనిపించాయి. అదే వరుసలో ఎగువ కాఫర్‌డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగాలి. శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో అసలు డ్యామ్ నిర్మాణం ముందు కాఫర్‌డ్యామ్ కట్టారు. మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యామ్‌ను పడగొట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని తుపాకులగూడెంలో సైతం కాఫర్‌డ్యామ్ నిర్మించిన తర్వాతే మెయిన్ డ్యామ్ నిర్మిస్తున్నారు. కాఫర్‌డ్యామ్‌ను మెయిన్ డ్యామ్‌లో భాగంగా నిర్మించవచ్చుననే సూచన కూడా కేంద్ర అధికారుల నుంచి వచ్చింది. ఈ ప్రతిపాదనను ప్రారంభంలో పరిశీలించారు. అనంతరం విరమించుకున్నారు. కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచాలని ఏపీ సర్కార్ పట్టుబట్టడంతోనే పేచీ వచ్చింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రముఖ ఇంజనీరు సీతాపతి ఖరారు చేసిన డిజైన్ ప్రకారం 31 మీటర్ల ఎత్తున కాఫర్‌డ్యామ్ నిర్మించాలి. దానిని 41.5 మీటర్ల ఎత్తుకు పెంచాలని చంద్రబాబు పథకం. ఎందుకు? కుడి, ఎడమ కాలువల లోతు (స్పిల్ లెవల్) సుమారు 35 మీటర్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో కాఫర్ డ్యామ్ ఉంటే కానీ అందులో నీటిమట్టం 35 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అప్పుడే కాఫర్‌డ్యామ్ నిలువ చేసిన నీరు భూమ్యాకర్షణశక్తి ప్రభావంతో కాలువలలోకి ప్రవహిస్తుంది. కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచాలన్న ఎత్తుగడలోని ఆంతర్యం ఏమిటి? పోలవరం ప్రధాన ప్రాజెక్టు వచ్చే ఎన్నికల లోపు పూర్తికాదని రాష్ట్ర ప్రభుత్వాధినేతకు స్పష్టంగా తెలుసు. కానీ పోలవరం నీరు ఎన్నికలలోపే విడుదల చేసి శభాష్ అనిపించుకోవాలి. ఓటర్లను మెప్పించాలి. ఓట్లు సంపాదించాలి. 31 మీటర్ల ఎత్తు కాఫర్‌డ్యామ్ నిర్మించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయితే 41.5 మీటర్ల ఎత్తు కట్టడానికి కనీసం రూ. 500 కోట్లు అవుతుంది. ఇప్పటికే వ్యయం పెరిగిపోతున్నదని కేంద్రం గొడవ చేస్తోంది. దుబారాను తగ్గించాలని ఆలోచిస్తున్నది. అవినీతి జరిగినట్టు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. లెక్కలు చెప్పమని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అడుతున్నదీ, అధికారులు కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచడం అవసరమా అని అడుగుతున్నదీ అందుకే. బరువు నెత్తికెత్తుకోవడం ఎందుకు? రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ తెలంగాణకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంది. ఇందుకు పరిహారంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి, దాని నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా సరే కేంద్ర ప్రభుత్వమే భరించాలని 2014 మే 5 న మంత్రిమండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. పాత రేట్లు కాకుండా కొత్త రేట్ల ప్రకారమే వ్యయం అంచనా వేయాలని కూడా తీర్మానించింది. ఈ విషయం చంద్రబాబునాయుడు స్వయంగా శాసనసభలో చదివి వినిపించారు. దీనికి తోడుగా ప్రత్యేక హోదా కూడా మంజూరు చేయడానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంటులో అంగీకరించారు. తర్వాత మంత్రిమండలిలో నిర్ణయం చేశారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రానికి అప్పగించవలసిందిగా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందంటూ నీతి ఆయోగ్‌కు చెప్పి, దాని ద్వారా కేంద్రాన్ని ఒప్పించి బరువైన బాధ్యత తలకెత్తుకున్నారు. 2014 ఏప్రిల్ 1 నాటి రేట్ల ప్రకారం ఎంత నిర్మాణ వ్యయం అవుతుందో అంతే భరిస్తామంటూ ఎన్డిఏ ప్రభుత్వం స్పష్టం చేసినప్పుడైనా ఏపీ ప్రభుత్వం తన నెత్తి మీది బరువు దించుకొని కేంద్రం నెత్తిమీద పెట్టి ఉంటే సరిపోయేది. ఆ పనీ చేయలేదు. పని చేసే శక్తి లేని ట్రాన్స్ట్రాయ్ అనే సంస్థను మార్చాలనే ఆలోచన మూడున్నర సంవత్సరాలు రాలేదు. నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆ సంస్థ స్థాయికి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని తెలిసినా కిరణ్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారు. వైఎస్ హయాంలో ముందు సత్యం అధినేత రామలింగరాజుకు చెందిన మేటాస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థ కష్టాలపాలు కావడంతో అప్పటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీకి అప్పగించారు. ఆ సంస్థ కూడా పనులు చేయలేకపోతున్నదని గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నాగేశ్వరరావును తప్పుకోమన్నారు. ఆయన తప్పుకున్నారు. కొత్త కాంట్రక్టర్‌ను నియమించే లోపుగానే వైఎస్ హఠాన్మరణం సంభవించింది. ట్రాన్స్ట్రాయ్ సబ్–కాంట్రాక్టర్లను నియమించుకుంది. సాంబశివరావు ఎల్–1గా కాంట్రాక్టు సంపాదిస్తారు. ఆనక ఖర్చులు పెరిగాయనీ వ్యయం పెంచాలనీ ప్రభుత్వాలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. 2010లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010 కోట్లు కాగా, అది 2014 నాటికి రూ. 23,000 కోట్లు, 2017 నాటికి రూ. 58,000 కోట్లు అయింది. భూసేకరణకూ, పునరావాసానికే ఇందులో సగానికి పైగా (రూ. 33,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. కొంత కాలం తర్వాత సాంబశివరావును పక్కన పెట్టి ప్రభుత్వం నేరుగా సబ్–కాంట్రాక్టర్లతో వ్యవహారం చేయడం ఆరంభిం చింది. ప్రభుత్వం నియమించిన సబ్–కాంట్రాక్టర్లకు చెల్లింపులు టంచనుగా జరుగుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టర్ నియమించిన సబ్–కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనితో విసిగిపోయిన సాంబశివరావు గడ్కరీని కలుసుకొని తన కష్టాలు చెప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం, అవసరాల ప్రకారం నిర్ణయాలు జరిగాయి. బాబు ఆగ్రహం, సంయమనం టెండర్లను పిలిచిన విధానాన్ని తప్పుపడుతూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖ చంద్రబాబునాయుడిని ఆందోళనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. పోలవరం నిర్మాణం బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తే నమస్కారం పెట్టి అప్పగిస్తానంటూ పరుషంగా మాట్లాడారు. అంతలోనే సంభాళించుకొని సంయమనం పాటించాలంటూ తోటి మంత్రులకూ, పార్టీ సహచరులకూ హితవు చెప్పారు. కానీ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలన్న నిర్ణయం విషయంలో రాజీ పడటం లేదు. బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల మొదటి నుంచీ చంద్రబాబునాయుడికి విశ్వాసం లేదు. 2004 ఎన్నికలకు ముందు వరంగల్లులో దేవాదులకూ, తూర్పు గోదావరిలో తాడిపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకూ హడావుడిగా శంకుస్థాపన చేసి ఓటర్ల మదిలో ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. నా మనవలూ, మీ మనవలు కూడా పోలవరం చూడలేరంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్టుడు అప్పట్లో వ్యాఖ్యానించేవారు. చాలా విషయాలలో చంద్రబాబునాయుడికీ, రామకృష్ణుడికీ భావసామ్యం ఉంది. పోలవరం పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు వ్యర్థం. ఈ పథకాల కోసం తవ్విన కాల్వలు పోలవరం కాల్వలకు పిల్ల కాల్వలుగా పనికి రావచ్చు. అంతవరకే. అంతకు మించి ప్రయోజనం ఉండదు. పట్టిసీమ కోసం రూ.1500 కోట్లు, పురుషోత్తపట్నం పేరుతో రూ. 1600 కోట్లు వృ«థా చేసి సంబరం చేసుకున్న చంద్రబాబునాయుడు ఆ నిధులనే పోలవరం ప్రాజెక్టుపైన ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు ఎంతో కొంత ప్రగతి సాధించేది. ఎన్నికల ప్రయోజనాలను విస్మరించి జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాఫర్‌డ్యామ్‌ను 31 మీటర్ల ఎత్తు నిర్మించడానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరావచ్చు. ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి కాదు. కానీ ఎంతో కొంత పని జరుగుతుంది. ఆ మేరకు చంద్రబాబునాయుడికి ఖ్యాతి దక్కుతుంది. అట్లా కాకుండా ఎన్నికల కోసం మాయోపాయం చేసి హడావుడిగా పనులు చేయించినా, కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచి నీరు సరఫరా చేసి పబ్బం గడుపుకున్నా రాష్ట్ర ప్రజలకు తీరని అపకారం చేసినవారు అవుతారు. పోలవరం వంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును ఏ రకమైన లోపాలూ లేకుండా, సమున్నత ప్రమాణాలతో నిర్మించాలి. నిర్ణయాలు ఇంజనీర్లు తీసుకోవాలి. వారి పర్యవేక్షణలో పనులు జరగాలి. రాజకీయ ప్రయోజనాలను పూర్వపక్షం చేయాలి. లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాధినేతలను చరిత్ర క్షమించదు. - కె. రామచంద్రమూర్తి -
పోలవరంపై పిల్లిమొగ్గలు!
రెండు ప్రభుత్వాల మధ్యా, ఇద్దరు రాజకీయ నేతల మధ్యా పోలవరం ప్రాజెక్టు నలిగిపోతోంది. టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌కు రాసిన లేఖపై వివాదం రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతలోనే నాలిక కరుచుకున్నారు. గుక్కతిప్పుకున్నారు. మాట సవరించుకున్నారు. నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టారు. ఆ ప్రయత్నంలో సైతం పప్పులో కాలేశారు. ఇంకా సమర్పించని మంజూనాథ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించినట్టు ప్రకటించడం, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఒక తీర్మానాన్ని శాసనసభ చేత ఆమోదింపజేయడం చంద్రబాబునాయుడు మార్కు రాజకీయం. కేంద్ర వైఖరి పైన అసంతృప్తి ప్రకటించిన విషయం మరుగున పడటానికి కాపు రిజర్వేషన్ కార్డును ప్రయోగించారు. తాము నివేదిక ఖరారు చేశాము కానీ ప్రభుత్వానికి సమర్పించలేదని బీసీ కమిషన్ అధ్యక్షుడు మంజూనాథ్ శనివారం మీడియా ప్రతినిధులకు చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక తడబాటు వెల్లడైంది. ఆగ్రహం, అంతలోనే అనునయం పోలవరం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకూ ప్రయోజనం జరుగుతుంది. ఇది ఆ ప్రాంతానికి జీవధార. ప్రాజెక్టు నిర్మాణంపైన ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. నిర్మాణంలో జాప్యం జరిగితే ప్రజలు క్షమించరు. ప్రజల ఆగ్రహాన్ని ఎగదోసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు వ్యూహమని సోము వీర్రాజు వంటి బీజేపీ నాయకులు కొందరు బహిరంగంగానే అంటున్నారు. మోదీ ప్రతిష్ఠ తగ్గుముఖం పట్టిందన్న అంచనా ఇందుకు కారణం. శుక్రవారం మధ్యా హ్నం ఉత్తరప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడం, బీజేపీ ఘనవిజయం సాధించడం గమనించిన చంద్రబాబు వెంటనే మోదీకి తెల్లజెండా చూపించారు. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు ప్రదేశం సందర్శించి ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనను బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, మరి కొందరు బీజేపీ నాయకులూ కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమనీ, దానిలో జాప్యం జరిగితే బీజేపీకి చెడ్డపేరు వస్తుందనీ, పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనీ వారు మంత్రికి చెప్పారు. ‘కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లెక్క చెప్పమని మాత్రమే అడుగుతున్నాం’ అని ఆయన వివ రించారు. ‘గడ్కరీ గురించి తెలుసుకోమని చెప్పండి మీ ముఖ్యమంత్రికి. పోల వరం ప్రాజెక్టు ఆయన కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మించే సామర్థ్యం, వనరుల లభ్యత నాకుంది. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వదిలేయమని మొన్న నాగపూర్‌లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చిలక్కి చెప్పినట్టు చంద్రబాబుకు చెప్పాను. తానే చేస్తానంటారు. జమాఖర్చుల వివ రాలపైన∙కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమంటే చెప్పరు. గుడ్డిగా నిధులు ఇచ్చుకుంటూ పోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఒప్పుకున్నా నన్ను ప్రధాని లెక్కలు అడుగుతారు. ఒక సంవత్సరంలోనే అంచనాలు మూడు సార్లు మార్చారు. ఒకసారి రూ. 33 వేల కోట్లు అన్నారు. తర్వాత రూ. 40 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ. 50 వేల కోట్ల పైచిలుకు అంటున్నారు. ఇష్టం వచ్చిన అంకెలు చెప్పి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం ఎట్లా కుదురుతుంది? నేను అడిగేదల్లా పారదర్శకత పాటించమనే. అంతకీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చుకోమన్నాను. ప్రధాన కాంట్రాక్టర్‌ను మార్చవద్దని చెప్పాను. ట్రాన్స్ట్రాయ్ ఇండియా కోర్టుకు వెడితే ఇంకా జాప్యం జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారట. టెండర్ తిరకాసు టెండర్ వేయడానికి 45 రోజులు గడువు ఇవ్వాలన్నది నిబంధన. 18 రోజులు మాత్రమే ఇచ్చారు. టెండర్ నోటీసును ప్రభుత్వ వెబ్సైట్లో నవంబర్ 25 వరకూ పెట్టలేదన్నది మరో ఆరోపణ. లెక్కలు చెప్పడం చంద్రబాబుకు అల వాటు లేని పని. ఆ మాటకొస్తే ఏ ముఖ్యమంత్రి కూడా లెక్కలు చెప్పవలసిన అవసరం రావడం లేదు. కాంట్రాక్టర్లతో మాట్లాడి అధికారులకు చెప్పి ప్రాజెక్టుల అంచనాలు పెంచడం ఆనవాయితీ. నామినేషన్ పద్ధతి మీద పనులు కేటాయిం చడం, మాటవరుసకు టెండర్లు పిలిచినా తాను ఎవరికి ఇవ్వాలని సంకల్పిం చారో వారికి మాత్రమే అర్హత ఉండే విధంగా నిబంధనలను రూపొందించడం, అనుకున్న అçస్మదీయులకే కట్టబెట్టడం చంద్రబాబు మార్కు పరిపాలన. ఆయ నను లెక్కలు అడిగే సాహసం అధికార పార్టీలో ఎవ్వరికీ లేదు. ప్రశ్నించే ప్రతి పక్షాలను ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయంటూ అడ్డగోలుగా నిందించడం, అడ్డంగా దబాయించడం అలవాటు చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశాలలో ముఖ్యమంత్రి చెప్పింది వినడమే కానీ వివరాలు అడిగే తెగింపు ఎవ్వరికీ లేదు. డూడూ బసవన్నల మాదిరి తలలూపడమే. స్వప్రయోజనాలు సాధించుకునే సావకాశం అందరికీ కల్పించినప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవసరం ఎవ రికి మాత్రం ఉంటుంది? అమరావతి నిర్మాణంలో సింగపూరు మిత్రులకు పెద్ద పీట వేసినా, వేల ఎకరాలు పూలింగ్ పేరుతో సేకరించినా, తమకు ఇష్టమైన వారికి వందల ఎకరాలు కేటాయించినా అదేమని అడిగేవారు లేరు. తాను అను కున్న పనులు ఇంత సులువుగా, నిర్నిరోధంగా చేయగలుగుతున్న చంద్రబాబు కేంద్ర అధికారులు ‘క్వెరీ’లు (ప్రశ్నలు) వేస్తే సహించగలుగుతారా? తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ఈ విషయంలో ముఖ్యమంత్రికీ, ఆయన సమర్థకులకీ తత్వం బోధపరిచారు. ‘రౌతు కొద్దీ గుర్రం అంటారు. రౌతు మనసు తెలుసుకొని గుర్రం నడుచుకుంటుంది. గుర్రం అధికారి, రౌతు మంత్రి’ అని జేసీ వివరించారు. అంటే గడ్కరీ రాయ మంటేనే అమర్జిత్ లేఖ రాశారని అర్థం. మంత్రి పురమాయిస్తేనే అధికారి లేఖ రాస్తాడు. పరిపాలనా పద్ధతులు తెలిసినవారికి ఈ విషయం స్పష్టం. తెలిసి కూడా ఆఫ్ట్రాల్ అధికారి రాసిన లేఖకు విలువేముందంటూ మాట్లాడటం రాజకీయం. చంద్రబాబు వ్యవహార శైలి పట్ల ప్రధానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయనీ, ఒక ముఖ్యమంత్రి దేశప్రధానితో పోటీ పడి విదేశాలు సందర్శించడం, ప్రజాధనం ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో విదేశీ ప్రయాణాలు చేయడం ఆయనకు నచ్చడం లేదనీ బీజేపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యా నించారు. వేలకోట్ల రూపాయలు చిత్తం వచ్చినట్టు ఖర్చుపెడుతున్న ముఖ్య మంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేననీ, ఇది ప్రధానికి ఏ మాత్రం సమ్మతం కాదనీ ఆయన అన్నారు. ‘అంతమంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొను గోలు చేయడానికి బాబుకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హెరిటేజ్‌ఫుడ్స్‌లో వచ్చిన లాభాల నుంచి ఖర్చు చేస్తున్నారా?’ అని కూడా ప్రధాని చమత్కరించా రని ఆ పార్లమెంటు సభ్యుడు చెప్పారు. చంద్రబాబు పట్ల నరేంద్రమోదీకి 2002 నుంచీ అమిత్రభావమే ఉన్నది. గుజరాత్లో మత కలహాలు జరిగిన సంద ర్భంలో మోదీ ‘రాజధర్మం’ పాటించాలని నాటి ప్రధాని వాజపేయి ఉద్బోధిం చారు. మోదీని గద్దె దించాలంటూ వాజపేయికి సలహా చెప్పినవారిలో చంద్ర బాబు ఒకరని మోదీ అనుమానం. మోదీకి జ్ఞాపకశక్తి ఎక్కువనీ, ఏ విషయం కూడా మరచిపోయే ప్రసక్తి లేదనీ, ఎవ్వరినీ క్షమించే ప్రశ్న కూడా లేదనీ బీజేపీ నాయకులు చెబుతారు. వయస్సు పైబడి ఆరోగ్యం సరిగా లేని ఎన్‌టి రామా రావుపైన వ్యూహాత్మక విజయం సాధించడం తేలికే. మోదీపై గెలవగలరా? లెక్క చెబితేనే నిధులు లెక్క చెప్పకపోతే నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని గడ్కరీ స్పష్టం చేస్తున్నారు. ప్రధానిని కలుసుకునే అవకాశమే లేదు. ఏదైనా సమావేశంలో కలిసినా ప్రధాని ముభావంగా, దూరదూరంగా ఉంటారే కానీ కుశల ప్రశ్నలు సైతం అడగడం లేదు. ఈ వాతావరణం కూడా చంద్రబాబుకు కొత్తే. లోగడ వాజపేయి ప్రధా నిగా, అడ్వాణీ ఉప ప్రధానిగా, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్‌లో కూర్చొని చక్రం తిప్పారు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎర్రన్నాయుడు సైతం వాజపేయికి నేరుగా ఫోన్ చేసి ‘హౌ ఆర్ యూ సార్. ఐ కమింగ్.’ అని చెప్పేసి సరాసరి ప్రధానిని కలుసుకొని పనులు చక్కబెట్టుకొని వచ్చేవారు. వాజపేయి– అడ్వాణీకీ మోదీ–అమిత్‌షాకీ చాలా వ్యత్యాసం ఉంది. మోదీ, అమిత్‌షాలు వీధి పోరాటాలకు సైతం వెనుకాడని రాజకీయ యోధులు. వారికి లక్ష్య సాధనే ప్రధానం కానీ మార్గం ముఖ్యం కాదు. అటువంటి జోడీని ఢీకొనే సాహసం చంద్రబాబు చేస్తారా? ఈ విషయంలో ఆయనకు సైతం స్పష్టత లేదు. ఇటీవలి వరకూ వెంకయ్యనాయుడు మధ్యవర్తిగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాలపైన వేసుకొని పరిష్కరించే వారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మంత్రుల ఇళ్ళ చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేరు. ఢిల్లీలో మీడియానూ, ఇతర ప్రము ఖులనూ ‘మేనేజ్’ చేయగల మనుషులు ఉన్నారు కానీ మోదీని సుముఖం చేసు కోగల శక్తి ఎవరికున్నది? కాపులను బీసీలలో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానించింది. బోయలను ఆదివాసీలుగా పరిగణించాలని కూడా శాసనసభ తీర్మానించింది. ఈ రెండు తీర్మానాలూ కేంద్రానికి పంపుతారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చమని అడుగు తారు (తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినంత మాత్రాన రక్షణ ఏమీ ఉండదు. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవచ్చు). రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇప్పించడానికి వీలు కల్పించాలని కోరుతారు. వీలు కల్పించ కపోతే కేంద్రం తప్పు అవుతుంది. శాసనసభ తీర్మానం చేసింది కనుక తన బాధ్యత తీరిపోయిందని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికీ, కాపులకూ, బోయలకూ రిజర్వేషన్లు రాకపోవడానికీ ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని వాదించవచ్చు. ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు కానీ యుద్ధం ప్రకటించ డానికి మాత్రం సంకోచిస్తున్నారు. ఎందుకు? ఓటుకు కోట్లు కేసు మాత్రమే కాకుండా చంద్రబాబు గుట్టుమట్టులన్నీ మోదీకి తెలుసుననీ, అందుకే ఆయనంటే భయపడుతున్నారనీ తెలుగుదేశం నాయకులే అంటున్నారు. పోలవరం చాలా ఆవేశపూరితమైన అంశం. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం 2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. ముఖ్య మంత్రి ఆ విషయంలో అనూహ్యంగా రాజీపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజె క్టుగా పరిగణించాలని కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలోనే నిర్ణయించారు. అది చట్టం కూడా అయింది. అనంతరం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని యూపీఏ మంత్రిమండలి తీర్మానించింది. ఈ హామీని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు కేంద్రం నిర్వహిస్తే ఎంత ఖర్చు అయినా కేంద్రమే భరించవలసి వచ్చేది. ప్రాజెక్టు నిర్మించిన ఘనత బీజేపీకి దక్కకుండా తనకే పేరు రావాలన్న తాపత్రయంతో, తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్ల చేత పనులు చేయించి లబ్ధిపొందవచ్చునన్న ఆలోచనతో చంద్రబాబు స్వయంగా ఆ భారం నెత్తికెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడమే మంచిదంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును ఆమోదించినప్పుడే మోదీ సర్కారు ఒక షరతు విధించింది. ప్రాజెక్టు వ్యయం 2014 ఏప్రిల్ ఒకటి ధరల ప్రకారం ఎంత ఉంటుందో అంతే చెల్లిస్తాము కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వజాలమని స్పష్టంగా చెప్పింది. ధరలు పెరిగా యనీ, అంచనాలూ పెరుగుతాయనీ, 2014 నాటి అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామంటే నిర్మాణం అసాధ్యమనీ చెప్పి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటే ఈ తిప్పలు ఉండేవి కావు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఇటీవల జాతికి అంకితం చేసినట్టే పోలవరం ప్రాజెక్టును సైతం ప్రధాని ప్రారంభించేవారు. ఆ విధంగా జరగకపోవడానికి కారకులు ఎవరో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. - కె. రామచంద్రమూర్తి -
మూడు చారిత్రక సందర్భాలు
మూడు వారాల్లో మూడు ఘనకార్యాలు. ఏ ప్రభుత్వానికైనా గర్వకారణమే. ఏ పని చేసినా పతాక స్థాయిలో ‘బ్రహ్మాండంగా’ చేయాలనే మనస్తత్వం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శైలికి తగిన విధంగానే మూడు అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదీ గురువారం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో నమోదు చేయదగిన రోజు. అదేరోజు హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైలుకు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపుతారు. ఆ రోజే ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజుల సదస్సు పూర్తయిన రెండు వారాల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల అయిదు రోజుల మహోత్సవం. ఈ మూడు కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, మెట్రోరైలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీకి చెందిన సిబ్బందీ, సాహిత్య అకాడెమీ నేతృత్వంలో పని చేస్తున్న తెలుగు భాషాభిమానులూ, మేధావులూ ఊపిరి సలపని పనితో సతమతం అవుతారు. మెట్రోరైలు తెలుగు ప్రజలకు కొత్తగా అందివస్తున్న ఆధునిక వసతి. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మహానగరాల సరసన నిలబెట్టే నిర్మాణం. తెలుగు మహాసభలు తెలంగాణలో తెలుగు భాషావాఙ్మయాలు వందల సంవత్సరాలుగా అభివృద్ధి చెందాయంటూ హృదయం ఉప్పొంగేలా చాటుకునే శుభ సందర్భం. హైదరాబాద్ బ్రాండ్‌ని ప్రపంచపటంలో మరోసారి నిలబెట్టడానికీ, ఇక్కడ పరిశ్రమలు పెంపొందించేందుకు అవసరమైన వాతావరణం ఉన్నదని నమ్మించడానికీ ఈ సదస్సు అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వెంచర్ కేపిటలిస్టులు ప్రోత్సాహం అందించి పారిశ్రామిక ప్రగతికీ, ఉపాధి కల్పనకూ దారి తీస్తారని ఆశించవచ్చు. ఒక రైలు మార్గం నిర్మించడం, పరిశ్రమలను విస్తరించడం ఒక్క సంవత్సరంలోనో, ఐదు సంవత్సరాలలోనే అయ్యే పని కాదు. ఇటుకపైన ఇటుక పేర్చుకుంటూ వెళ్ళవలసిందే. ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, మరో ప్రభుత్వం ప్రారంభిస్తే, మరికొన్ని సర్కార్లు కొనసాగిస్తే కానీ ఒక కొలిక్కి రాదు. ఇది నిరంతరాయంగా జరగవలసిన ప్రక్రియ. నిజమైన కల మెట్రోరైలు ట్రాఫిక్ జామ్‌లతో, గంటల తరబడి ప్రయాణాలతో విసిగి వేసారిన హైదరాబాద్ ప్రజలకు మెట్రోరైలు కొంత ఊరట కలిగిస్తుంది. వాహనరద్దీ, వాయు, శబ్ద కాలుష్యాలూ ఎంతో కొంత తగ్గుతాయనే ఆశ. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మెట్రో ఆలోచన రూపుదిద్దుకుంది. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిం చాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఫ్లయ్వోవర్ల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎన్విఎస్ రెడ్డిని మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, రాష్ట్ర విభజన జరిగినా మెట్రోరైల్ ప్రాజెక్టు సారథిగా ఎన్విఎస్ రెడ్డి కొనసాగడం విశేషం. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజుకు చెందిన మైటాస్ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం పనులు అప్పగించారు. కానీ సత్యం సంస్థ ఆర్థికంగా దెబ్బతినడంతో మెట్రోరైలు ప్రాజెక్టుకు పెద్ద అవాంతరం ఏర్పడింది. రోశయ్య హయాంలో ఎల్ అండ్ టీ రంగంలోకి దిగింది. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పనులు కొనసాగాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వానికీ, ఎల్ అండ్ టీ సంస్థకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పటికీ ఉభయ పక్షాలూ విజ్ఞత ప్రదర్శించడంతో అవి సర్దుకున్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో 30 కిలోమీటర్ల మెట్రోలైనుకు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇది ఒక రికార్డు. ఢిల్లీ మెట్రోరైలు నిర్మాత శ్రీధరన్ ఎన్వీఎస్ రెడ్డికి గురువు. ఆయన హైదరాబాద్ మెట్రోరైల్ చూసి అత్యద్భుతం అంటూ ప్రశంసించారని సాక్షి టీవీ ఇంటర్వ్యూలో రెడ్డి చెప్పారు. తాను జీవితంలో సాధించిన ఘనవిజయంగా, పదేళ్ళ శ్రమ ఫలించినట్టుగా ఆయన భావిస్తున్నారు. ప్రారంభంలో అంచనా వ్యయం రూ. 12,132 కోట్లు. 2010లో రెండోసారి టెండర్లు ఖరారు చేసినప్పుడు సవరించిన అంచనావ్యయం రూ. 14,132 కోట్లు. అనంతరం ప్రాజెక్టులో మార్పులూ చేర్పులూ జరిగాయి కనుక అంచనా వ్యయం సైతం పెరిగింది. మెట్రో హైదరాబాద్ ప్రజలకు గొప్ప వరం. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రినీ, ఎన్విఎస్ రెడ్డినీ, ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యులనూ అభినందించాలి. శిఖరాగ్ర సదస్సు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు 170 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ నాయకత్వంలో 350 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆమె ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ. వ్యాపారరంగంలో విజయాలు సాధించడమే కాకుండా తండ్రికి సలహాదారుగా కొండంత అండ. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సులో పెద్దపీట వేస్తున్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే ఆమె కుటుంబం అంతా బాగుపడుతుందనే ఆదర్శం ఈ సదస్సుకు ప్రాతిపదిక. మహిళలు ఏ పనైనా సమర్థంగా చేయగలరనే విశ్వాసం పాదుకొల్పే ప్రయత్నం ఇది. అమెరికా నుంచి ఇవాంకాతో వచ్చే పారిశ్రామికవేత్తలలో అత్యధికులు ఇండియన్ అమెరికన్స్ ఉంటారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి గణనీయమైన సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రానున్నారు. సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవంలో తెలుగు యువతీయువకులూ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచ స్థాయి పరిగణన పొందారు. ఐటీ రంగం తెలుగు యువతకు కొత్త ఊపునిచ్చింది. ఇది కూడా కొనసాగింపు ఫలితంగా అభివృద్ధి చెందిందే. ఐటీ రంగం 1991లో ఆర్థిక సంస్కరణల ఫలి తంగా విస్తరించిందనే అభిప్రాయం బలంగా ఉంది. హైదరాబాద్‌ను తనే నిర్మిం చినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా చెప్పుకుం టారు. వాస్తవానికి ఐటీ రంగానికి బీజం వేసింది 1971 ఫిబ్రవరిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ. రక్షణ నుంచి ఆరోగ్యం వరకూ పదహారు మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్స్ కమిషన్‌ను నెలకొల్పి, దానికి అధ్యక్షుడుగా ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త ఎంజీకే మీనన్‌ను నియమించిన దార్శనికత ఆమెది. అప్పటి వరకూ మీనన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీరా) సంచాలకుడుగా ఉండేవారు. మూడు వందల మంది కంప్యూటర్ శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ, సాంకేతిక సిబ్బందినీ తయారు చేసేందుకు రూ. 10 కోట్లు కేటాయించారు. అనంతరం టెక్నాలజీ డెవలప్మెంట్ కౌన్సిల్ (టీడీసీ) స్థాపించారు. కంప్యూటర్‌రంగంలో శిఖర సమానుడైన ఆర్. నరసింహం నేతృత్వంలో ఇసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తయారు చేసిన రెండో తరం కంప్యూటర్లకు టీడీపీ బ్రాండ్ వేసేవారు. వీటిని నిర్వహించేందుకు పీపీ గుప్తా ఆధ్వర్యంలో కంప్యూటర్ మెయిన్టెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)ని నెలకొల్పారు. ఏఎస్ రావు నేతృత్వంలో ఇసిఐఎల్ ఘనవిజయాలు సాధించింది. ఆయన పేరుతోనే ఏఎస్ రావు నగర్ ఏర్పడింది. ఆ రోజుల్లో విదేశీమారక ద్రవ్యం కొరత ఉండేది. ఐబీఎం కంప్యూటర్లకు తగిన రియాద్ శ్రేణి కంప్యూటర్లను రూపాయలు చెల్లించి సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసేవారు. వీడీయూ (విజు వల్ డిస్ప్లే యూనిట్), హైస్పీడ్ లైన్ప్రింటర్ వంటి సాధనాలు రియాద్ కంప్యూటర్లలో నాసిరకమైనవి ఉండేవి. అందుకని పాశ్చాత్య యూరప్ నుంచి నాణ్యమైన విభాగాలను కొనుగోలు చేసి ఈ కంప్యూటర్లకు అమర్చేవారు. ఆ విధంగా అమర్చినవాటిని ‘ఇంటెగ్రా’ కంప్యూటర్లు అని పిలిచేవారు. ఇసీఐఎల్ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (ఈవీఎం) తయారు చేసింది. వీటినే ప్రయోగాత్మకంగా 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు. ఎన్టీ రామారావు ప్రభంజనం ఎదుర్కొని కాంగ్రెస్ అభ్యర్థి శంకరరావు గెలుపొందారు. ప్రపంచంలోకెల్లా నాలుగో పెద్ద వ్యవస్థ భారతీయ రైల్వే. రైలు ప్రయాణికుల రిజర్వేషన్లకోసం ఒక వ్యవస్థను ఇసీఐఎల్, బీఇఎల్ (భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) కలసి రూపొందించాయి. సరుకు రవాణా కోసం సూపర్ కంప్యూటర్ను తయారు చేశాయి. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్)ను 1984లో ఒక స్థాయికి తీసుకొని వచ్చాయి. ఎన్ శేషగిరి ఆధ్వర్యంలో ఏర్పడిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రపంచస్థాయి సంస్థ. అప్పటికే దేశంలో చిన్న, మధ్యతరగతి, పెద్ద కంప్యూటర్ కంపెనీలు వెయ్యికి పైగా ఉండేవి. అప్పటి దాకా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాన్ని పెంచిపోషించిన వ్యక్తి ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె హత్యానంతరం రాజీవ్‌గాంధీ ఈ పని కొనసాగించారు. 1994 నవంబర్ 19న నాటి ప్రధాని పీవీ నరసింహారావు రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను జాతికి అంకితం చేశారు. దేశం నుంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎగుమతులు సైతం ఇందిరాగాంధీ హయాంలోనే మొదలైనాయి. ఇన్ఫోసిస్, విప్రో, సత్యం, టీసీఎస్ వంటి సంస్థలు నెలకొల్పడానికి దశాబ్దం ముందే కెల్ట్రాన్ (కేరళ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్), అప్ట్రాన్ (ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్) వెలిశాయి. ఈ రంగంలో స్వావలంబన సాధించాలన్నది ఎలక్ట్రానిక్స్ కమిషన్‌ను నెలకొల్పినప్పుడే చెప్పుకున్న సంకల్పం. రైల్వేల తర్వాత కంప్యూటర్ వ్యవస్థను విద్యుచ్ఛక్తి రంగానికి అనుసంధానం చేశారు. ఆర్థిక సంస్కరణలతో కంప్యూటర్ రంగంలో నారాయణమూర్తి వంటి ఔత్సాహికులు అనేకమంది ఘనవిజయాలు సాధించేందుకు అవసరమైన పునాది అంతకు ముందే పడింది. హైదరాబాద్‌లో ఐటీ విస్తరణలో చంద్రబాబునాయుడు పాత్ర ఉంది. సైబరాబాద్ విస్తరణలో, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణంలో వైఎస్ కృషి ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా, మునిసిపల్ వ్యవహారాల మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్‌ను ఐటీ నెలవుగా అభివృద్ధి చేసేందుకు గణనీయమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారి జయేష్ రంజన్ శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు. ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడితే ఇంత పెద్ద సదస్సు నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కడం వెనుక అవిశ్రాంత శ్రమ ఉంది. ఇవాంకా, ఇతర అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు నగరాన్ని అందంగా అలంకరించడం ఆహ్వానించదగినదే. కానీ నగర డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా పునర్నిర్మించి వానలు కురిసినప్పుడు రోడ్టు ముని గిపోకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించగలిగితే అది గొప్ప విజయం అవుతుంది. ఇదంతా కొనసాగింపే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వెలుగు వచ్చిందనీ, అంతకు ముందు అంతా అంధకారమనీ చెప్పే రాజకీయ నాయకులు దాపురించారు కనుక ఇదంతా చెప్పవలసింది వచ్చింది. తెలుగు వెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆలోచన ముమ్మాటికీ కేసీఆర్‌దే. తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ డిసెంబర్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులను హైదరాబాద్‌కి పిలిపించుకొని వేడుక జరుపుకోవాలన్నది ఆయన పట్టుదల. అంతకు ముందు తెలుగుభాషను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ఒక సబ్జెక్టుగా అన్ని రకాల పాఠశాలలూ, కళాశాలలూ బోధించాలంటూ ఆదేశిం చారు. తెలుగు బోధనాభాష కావాలని కోరుకునేవారి ఆకాంక్ష నెరవేరకపోయినప్పటికీ తెలుగు అంతరించిపోతుందని బాధపడేవారికి ఊరట కలుగుతుంది. కేసీఆర్ తెలుగును అభిమానించే వ్యక్తి. తెలుగులో అనర్గళంగా ఉపన్యసించే వక్త. కనుక ఆయన తెలుగు మహాసభలు నిర్వహించడంలో ఆశ్చర్యం లేదు. లోగడ సురవరం ప్రతాపరెడ్డి చేసిన కృషికి ఇది కొనసాగింపు. తెలంగాణలో కవులే లేరంటూ కోస్తాంధ్ర కవిపండితులు వ్యాఖ్యానిస్తే కినిసి తెలంగాణ అంతటా పర్యటించి 354 మంది రచనలు, వివరాలు సేకరించి ‘గోలకొండ కవులు’ అనే ప్రామాణిక గ్రంథం ప్రచురించి సురవరం చరితార్థులైనారు. పాల్కురుకి సోమనాథుడు. బమ్మెర పోతన, సూరన, మారన, వేములవాడ భీమకవి నుంచి దాశరథి, కాళోజీ, గద్దర్, గోరటి ఎంకన్న, అందెశ్రీ వంటి వర్తమాన వాగ్గేయకారుల వరకూ తెలంగాణ సాహిత్యక్షేత్రంలో నడయాడిన కవుల ప్రశస్తిపై కొత్త వెలుగు ప్రసరింపజేయడమే ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యం కనుక అవశ్యం అభినందనీయం. - కె. రామచంద్రమూర్తి -
అసాధారణ వ్యక్తిత్వం ఆమె సొంతం
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి నేడు. నిరుడు ఇదే రోజున ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలకు ఇవాళ తెరపడుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేవి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ నెహ్రూ, ఇందిరలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. కాంగ్రెస్ హయాంలో అంతగా ప్రశస్తి దక్కనివారికి ఇప్పుడు కాస్త అధికంగానే ప్రశంస ఉంటుంది. ఏ దేశంలోనైనా అధికారంలో ఉన్న పార్టీకి ఎవరి పట్ల గౌరవం ఉంటే వారికి బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఆధిపత్యంలోనే మనుగడ సాగిస్తున్న కారణంగా, దాదాపు యాభై సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా నెహ్రూ వంశజుల ప్రభ చాలాకాలం వెలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రను సవరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వాల ప్రా«థమ్యాలు మారినా, పాలకులు ఎవరి స్తోత్రం వల్లించినా ప్రజల హృదయాలలో కొందరు నేతలు శాశ్వతంగా ఉండిపోతారు. అటువంటి నాయకులలో ఇందిర ఒకరు. సిండికేట్‌పై విజయం నలభై నాలుగు సంవత్సరాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న విద్యార్థులం ప్రొఫెసర్ బషీరుద్దీన్ నాయకత్వంలో ఢిల్లీ, ముంబయ్, పుణెలో పర్యటించాం. ఢిల్లీలో నాటి ప్రధాని ఇందిర నివాసానికి వెళ్ళి, ఆమెకు అభిముఖంగా పచ్చికపైన కూర్చొని, పత్రికారంగంపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, భవిష్య పాత్రికేయులమైన మాకు చేసిన ఉద్బోధ ఆలకించిన క్షణాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అప్పటికే ఆమె పాకిస్తాన్‌పై విజయఢంకా మోగించి, తూర్పు పాకిస్తాన్‌ను జయించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసి, విజయేందిరగా దేశ ప్రజల హారతులందుకున్నారు. 1966లో లాల్బహద్దూర్ శాస్త్రి హఠాన్మరణం అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన ఇందిరాగాంధీ సిండికేటు పెద్దల (నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, కామరాజ్ నాడార్, ఎస్కే పాటిల్ తదితరులు) ఆధిపత్యాన్ని ఛేదించారు. ఆ సందర్భంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వరాహగిరి వెంకటగిరి (వివి గిరి)ని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దించి ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయాలంటూ కాంగ్రెస్ చట్టసభల సభ్యులకు చెప్పారు. గిరిని గెలిపించారు. ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీని చీల్చడం, సిండికేటు సభ్యులను పూర్వపక్షం చేయడం అప్పటికే చరిత్ర. మేము చూసింది ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న ఇంది రని. ఒక మహిళ పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గుకు రావడం అంత తేలికకాదు. నెహ్రూ కుమార్తె అయినప్పటికీ కాకలు తీరిన నేతల వ్యూహాలను ఎదుర్కోవడం కష్టం. ప్రధాని పదవిలో ఉండటం ఆమెకు కలసివచ్చిన అంశం. 1967 ఎన్నికల సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వందల బహిరంగ సభలలో మాట్లాడారు. ఆ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆమె రాజకీయ ప్రస్థానానికి అవసరమైన మెలకువలు అప్పుడే లభిం చాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే ఆమె సమాజంలోని వ్యత్యాసాలను గమనిం చారు. భూమి ఉన్నవారికీ, భూమి లేని పేదలకూ మధ్య అగాధాన్ని అర్థం చేసుకున్నారు. దళితుల, ఆదివాసుల బతుకులలో చీకటి తొలగలేదని గుర్తించారు. ఆమె ప్రత్యర్థులందరూ సంపన్నవర్గాలకు అనుకూలమైన భావజాలాన్ని విశ్వసించేవారనే ముద్ర వేయగలిగారు. స్వయంగా వామపక్ష భావజాలాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలను రద్దు చేశారు. పత్రికలతో, ప్రాంతీయ నాయకులతో నిమిత్తం లేకుండా నేరుగా పేద, మధ్యతరగతి ప్రజలను సంబోధించడం, వారితో సంభాషించడం అలవరచుకున్నారు. పేద ప్రజలతో బంధం ఏర్పాటు చేసుకున్నారు. వారి హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తిరుగులేని జాతీయ నేతగా ఎదిగారు. సంక్షేమ విధానం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు రూపొందించడం తమిళనాడులో డిఎంకె 1967లోనే ప్రారంభించింది కానీ కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్న సందర్భం లేదు. ‘గరీబీ హఠావో’ నినాదంలో రాజకీయ పార్శ్వం ఉన్నప్పటికీ అది అవకాశవాదం మాత్రం కాదు. పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పం గుండె నిండా ఉన్నది. తమలో ఆత్మవిశ్వాసం ప్రతిష్ఠించిన అధినేతగా ఆమెను దళితులూ, ఆదివాసులూ ఎప్పటికీ మరచిపోరు. సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది ఆమె ప్రభుత్వమే. అంతకు పూర్వం ప్రభుత్వ విధానాలలో, కార్యక్రమాలలో సంక్షేమానికి ప్రాధాన్యం ఉండేది కాదు. నవభారత నిర్మాణంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా వివిధ రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నమే జరిగింది కానీ, సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరాన్ని అంతగా పట్టించుకోలేదు. షెడ్యూల్డ్ తరగతుల అభివృద్ధి కార్పొరేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అధారిటీ (ఐటీడీఎల్) ఇందిరాగాంధీ ప్రమేయంతో వెలసినవే. భూసంస్కరణలు, పేదలకు భూమి ఇవ్వడం, పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదలు పెట్టినవే. ఐఐటి వంటి జాతీయ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసింది ఆమె ప్రభుత్వమే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించింది, అణు, అంతరిక్ష పరిశోధనలో అసాధారణ ప్రగతి సాధించింది ఆమె హయాం లోనే. పర్యావరణ చట్టాలు తెచ్చింది కూడా ఆమే. శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఇందిరాగాంధీ–ఎ లైఫ్ ఇన్ నేచర్’ పేరుతో పుస్తకం రాశారు. విజయేందిర తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది శరణార్థులు వచ్చి పడటం వల్ల తలెత్తిన సమస్యను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఇందిర విస్తృతంగా పర్యటిం చారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సేవలు కూడా ఇందుకోసం వినియోగించుకున్నారు. యుద్ధ సన్నాహాల కోసం భారత సైన్యానికి అవసరమైన సమయం ఇచ్చేందుకు దౌత్యనీతిని ఆశ్రయించారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇందిరను ‘ది విచ్’(మంత్రగత్తె) అంటూ నిందించాడు. దౌత్యం వల్ల వచ్చింది ఏమీ లేదు సైన్యం అడిగిన సమయం లభించడం తప్ప. నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ యాహ్యాఖాన్ తూర్పు పాకిస్తాన్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకొని యుద్ధం ప్రకటించే సమయానికి భారత సైన్యం సరి హద్దు దాటి ఢాకా వైపు వంద కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయింది. వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్‌తో ఇరవై సంవత్సరాల మైత్రీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల నిక్సన్ పంపిన యుద్ధ నౌక అడుగు ముందుకు వేయలేకపోయింది. పదిహేను రోజుల్లో యుద్ధం ముగిసింది. జనరల్ నియాజీ నాయకత్వంలోని పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఇందిరాగాంధీ జీవితంలో అత్యున్నత విజయం. ఇంతటి ఘనకార్యం సాధించిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలకే ఆమె పతనం ఆరంభమైంది. అవినీతిని ఉపేక్షించారు. పార్టీ సహచరులలో ఎవరినైనా పదవి నుంచి తొలగించాలంటే వారిపైన ఉన్న అవినీతి ఆరోపణలను ఉపయోగించుకునేవారు. తెలంగాణ ఉద్యమం అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించేందుకు అదే అస్త్రం ప్రయోగించారు. ఆర్ కె ధవన్ చూపించిన ఫైలు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా లేఖ రాయించింది. ఇదే విధంగా ఈ అస్త్రాన్ని అనేకమందిపైన ఉపయోగించారు. జేపీ నేతృత్వంలో అవి నీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఇందిరలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ప్రతిపక్ష నాయకులంతా ఉద్యమాన్ని సమర్థించడంతో ఆమెలో అభద్రతాభావం పెరిగింది. ఎవరో తనని తరుముతున్నట్టూ, తనను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నట్టూ భయపడేవారని ఇందిరకు సన్నిహితురాలు పపుల్ జయకర్ తన పుస్తకంలో రాశారు. జేపీ ఉద్యమం ఉధృతమైంది. ప్రజలకు వ్యతిరేకమైనవిగా కనిపించిన ఆదేశాలు పాటించనవసరం లేదంటూ పోలీసులకూ, సైనికులకూ ఉద్బోధించారు. రైళ్ళు ఉద్యమకారులను చేరవేస్తూ పూటల తరబడి ఆలస్యంగా నడిచేవి. విద్యాసంస్థలు మూతపడినాయి. ప్రభుత్వం లేనట్టే లెక్క. ఇటువంటి పరిస్థితిలో అలహాబాద్ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఇందిర తరఫున నానీ పాల్కీవాలా వాదించారు. ఈ తీర్పుపైన సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. అక్కడ షరతులతో కూడిన స్టే వచ్చింది. అప్పటికే గాభరాపడిపోయిన ఇందిర తనయుడు సంజయ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్థశంకర్ రే చెప్పిన సలహా పాటించి 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది ఆమెకు తీరని మచ్చ తెచ్చిన నిర్ణయం. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో కుక్కారు. ప్రజాస్వామ్య సంస్థలనూ, సంప్రదాయాలనూ ధ్వంసం చేశారు. ఆత్యయిక పరిస్థితి విధించారు కనుక ఈ కేసులో వాదించజాలనని పాల్కీవాలా చెప్పారు. ఆయనపైన కక్షసాధింపు చర్యలు తీసుకున్నారు. టాటా కంపెనీల బోర్టుల నుంచి ఆయనను తొలగించే విధంగా ఒత్తిడి తెచ్చారు. విమర్శను తట్టుకోలేకపోవడం, ప్రత్యర్థులను అణచివేయడం. నిరంకుశంగా వ్యవహరించడం ఇందిరాగాంధీలో కొట్టొచ్చినట్టు కనిపించిన అవలక్షణాలు. తన నీడను సైతం శంకించే పరిస్థితి. ఎవ్వరినీ నమ్మలేని దౌర్బల్యం ఆమెను ఆవహించింది. సంజయ్‌పైన ఇందిర ఆధారపడటం ఎక్కువయింది. ఉత్తరాదిలో పోలీసుల జులుం పెరిగింది. ప్రెస్ సెన్సార్షిప్ విధించారు. దాదాపు అన్ని పత్రికలూ ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి ‘జో హుకుం’ అంటే, ప్రభుత్వాన్ని విమర్శించింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు పత్రికలు మాత్రమే. ఆ రోజుల్లో బెంగుళూరులో ‘ఆంధ్రప్రభ’లో పని చేస్తూ ఆత్యయిక పరిస్థితిని వ్యతిరేకించడం, అరుణ్‌శౌరీ బృందంతో కలసి తిరగడం, తరచు రిపోర్టింగ్‌కి వెళ్ళడం గర్వంగా ఉండేది. 1977లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇందిరగాంధీ ఖమ్మం సందర్శించినప్పుడు నేను సెలవుపైన అక్కడే ఉన్నాను. టాపు లేని జీపులో చేతులు జోడించి ప్రయాణం చేస్తున్న ప్రధాని మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 42 స్థానాలలో 41 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకున్నది కానీ, ఉత్తరాదిలో పార్టీ చావుదెబ్బ తిన్నది. ఇందిర సైతం ఓడిపోయారు. జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మొరార్జీ, హోంమంత్రి చరణ్‌సింగ్ చాకచక్యం లేకుండా మొండిగా వ్యవహరించడం ఆమెకు బాగా అనుకూలించింది. అంతఃకలహాల కారణంగా జనతా ప్రయోగం చతికిలపడింది. 1980 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందిరాగాంధీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగిన ఆరు మాసాలకే సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. మళ్ళీ కోలుకోలేదు. ఇదివరకటి చురుకుదనం, వ్యూహరచనా నైపుణ్యం, యుద్ధకౌశలం అదృశ్యమైనాయి. దేశంకోసం ప్రాణత్యాగం సైనిక బలగాలు స్వర్ణదేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి భింద్రన్‌వాలే, ఆయన అనుచరులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టగానే వారు లొంగిపోతారనీ, కాల్పులు జరగవనీ, మరణాలు ఉండవనీ జనరల్ వైద్య, లెఫ్టినెంట్ జనరల్ సుందర్జీ హామీ ఇచ్చిన తర్వాతనే సైనిక చర్యను ఇందిరాగాంధీ అనుమతించారు. రెండు గంటలలో పూర్తి కావలసిన పని రెండు రోజలు పట్టింది. తర్వాత స్వర్ణదేవాలయం సందర్శించి సమీపంలోని సరోవర్‌లో తేలుతున్న మృతదేహాలు చూసి ఇందిర దిగ్భ్రాంతి చెందారు. ఇందుకు ఆమే మూల్యం చెల్లించారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దేశ సమైక్యత, సమగ్రతలకోసం అత్యున్నతమైన ప్రాణత్యాగం చేశారు. నెహ్రూ నుంచి నరేంద్రమోదీ వరకూ ప్రధానులందరి పదవీకాలాలనూ, జీవితాలనూ పరిశీలిస్తే ఇందిర వ్యక్తిత్వం అర్థం అవుతుంది. ఆమె ఎదుర్కొన్న సవాళ్ళను మరెవ్వరూ ఎదుర్కోలేదు. ఆమె సాధించిన విజయాలను ఇంకెవ్వరూ సాధించలేదు. 16 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తప్పొప్పులు ఉండటం సహజం. కానీ ఆమె దేశభక్తినీ, చిత్తశుద్ధినీ శంకించడం అపచారం. - కె. రామచంద్రమూర్తి -
ఫిరాయింపులు.. దబాయింపులు!
రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేయవలసిన వ్యక్తులూ, సంస్థలూ విఫలమైనప్పుడు రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం అనివార్యం. రాష్ట్రపతి, గవర్నర్ ప్రత్యక్షంగా రాజ్యాంగ పరిరక్షకులు. ప్రధానీ, ముఖ్యమంత్రులూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు. వీరంతా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడూ లేదా ఎవరైనా రాజ్యాంగాన్ని బుద్ధిపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే తమకు సంబంధం లేనట్టు మరోవైపు చూసినప్పుడూ చట్టపాలనను అభిలషించే పౌరులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగంలోని లోపాలను వినియోగించుకొని రాజకీయక్రీడ తెలివిగా, కొంటెగా కొనసాగిస్తుంటే బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ఫిరాయించినవారిపైన ఏమి చర్య తీసుకోవాలో తాను నిర్ణయించడానికి ముందే విపక్ష సభ్యులు కోర్టుకు ఎక్కారు కనుక ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అనడంలోని గడుసుతనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు సకాలంలో చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఫిరాయించినవారిపై చర్య తీసుకోవలసిందిగా సభాపతికి, న్యాయస్థానాలకు విన్నవించుకొని దాదాపు మూడున్నరేళ్లు గడుస్తున్నా ఫలితం రానప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం కర్తవ్యం ఏమిటి? శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధికార పక్షం అవలంబి స్తున్న అప్రజాస్వామిక వైఖరిని జాతీయ స్థాయి పెద్దల, సంస్థల దృష్టికి తీసుకురావడం ఒక్కటే మార్గం. ఈ విధంగా నిరసన ప్రకటించడం ద్వారా దబాయింపు రాజకీయాలకూ, రాజ్యాంగ విరుద్ధమైన పోకడలకూ సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న పని అదే. ఇదే పని ఇంతటి బలమైన కారణం లేకుండానే చాలా స్వల్పమైన అంశాలపైన నిరసనగా ఎన్‌టి రామారావు సభకు రాకుండా ఉన్నారు. చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో ఉండగా సభను బహిష్కరించారు. వారు చేస్తే ఒప్పు అయినది ఎవరు చేసినా తప్పు కాజాలదు. పార్టీ ఫిరాయింపు అనేది తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని అయిదు దశాబ్దాలుగా పీడిస్తున్న జాడ్యం. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది 1967లో. ఆ సంవత్సరం 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తక్కిన రాష్ట్రాలలో ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అప్పుడు చట్టసభల సభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రక్రియ జోరందుకున్నది. 1967–71 మధ్య 142 మంది పార్లమెంటు సభ్యులూ, 1,900 మంది శాసనసభ్యులూ పార్టీలు ఫిరాయించారు. హరియాణా, తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయేవి. ఆయారాం గయారాం హరియాణాకు చెందిన గయాలాల్ అనే శాసనసభ్యుడు వరుసగా మూడు విడతల పార్టీలు ఫిరాయించాడు. అప్పటి నుంచీ పార్టీలు మారడాన్ని ‘ఆయారాం గయారాం’ అని పిలవడం ఆనవాయితీ. పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులూ, కార్పొరేషన్ అధ్యక్ష పదవులూ ఇచ్చేవారు. అది ఒక లాభసాటి అవినీతి వ్యాపారంగా మారింది. ఫిరాయింపుల ఆట కట్టించడానికి తొలిప్రయత్నం 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేశారు. 101, 102, 190, 191 అధికరణలలో మార్పులు చేస్తూ 52వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. ఈ సంస్కరణల అమలు కోసం పదవ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యులపైన అనర్హత వేటు వేసే అధికారం సభాపతులకు మాత్రమే ఇచ్చారు. వారి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయవ్యవస్థకు ఇవ్వలేదు. మూడింట ఒక వంతు మంది చట్టసభ సభ్యులు పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పార్టీలో విలీనం కావచ్చు. అంతకంటే తక్కువ మంది పార్టీని వీడితే అనర్హత వేటు తప్పదు. ప్రధాని పీవీ నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. భూపతిరాజు ఆధ్వర్యంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సభ్యులే చీలిపోయారు. చిన్న పార్టీలలో మూడింట ఒక వంతు మంది చేతులు కలిపి పార్టీ నుంచి నిష్క్రమించడం తేలిక. ఆ కారణంగా 52వ రాజ్యాంగ సవరణ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. 2003లో నాటి ప్రధాని వాజపేయి నాయకత్వంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిస్తేనే పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలో విలీనం కావచ్చు లేదా వేరే పార్టీగా మనుగడ సాగించవచ్చు. సభ్యత్వానికి ఢోకా లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత సైతం ఫిరాయింపులు ఆగలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఈ క్రీడలో సమధికోత్సాహంతో పాల్గొంటున్నాయి. నీతి, నిజాయితీలకు తిలోదకాలు ఇచ్చేసి నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రభుత్వాధినేతలే ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం నల్లధనం వినియోగిస్తున్నారు. పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఫిరాయింపు రాజకీయాలు ముమ్మరంగా సాగాయి. తమిళనాడులో పళ నిస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు స్పీకర్ పి. ధనపాల్ మొన్న సెప్టెంబర్ 18న టీటీవీ దినకరన్‌కు చెందిన 18 మంది ఏఐఏడీఎంకె శాసనసభ్యులపైన అనర్హతవేటు వేశారు. ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏ మాత్రం సంకోచం లేకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. రాజ్యాంగంలోని లొసుగులను అధికార పార్టీలు ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నాయో గమనిస్తే పాలకులకు రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల ఎంత పట్టింపు ఉన్నదో అర్థం అవుతుంది. కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్హూ కేసు విచారణ సుప్రీంకోర్టులో 1992లో జరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సభాపతికి పదో షెడ్యూల్ సంపూర్ణ అధికారం ఇచ్చినప్పటికీ వారు షెడ్యూల్లోని 6(1)వ పేరాలో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని చెప్పింది. సభాపతి నిర్ణయాన్ని న్యాయసమీక్ష జరిపే అధికారం హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని కూడా స్పష్టం చేసింది. సభాపతికి నిర్ణయాధికారం ఇచ్చే పదో షెడ్యూల్లోని ఏడవ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని, దాని విషయంలో పునఃపరిశీలన జరపడమో, రాజ్యాంగ సవరణ చేయడమో ఉత్తమమని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరో ఆసక్తికరమైన వివాదం కూడా ఇందుకు సంబంధించి జరిగింది. మణిపూర్ స్పీకర్ బోరోబాబూసింగ్ 1992లో ఒక శాసనసభ్యుడిపైన అనర్హత వేటు వేశారు. సదరు శాసనసభ్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు సంపాదించారు. మణిపూర్ శాసనసభ కార్యదర్శి మణిలాల్సింగ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగినట్టు శాసనసభ్యుడి పునరాగమనానికి రంగం సిద్ధం చేశారు. ఇది తెలుసుకున్న బోరోబాబూసింగ్ మణిలాల్సింగ్ను సస్పెండు చేసి ముందస్తు పదవీ విరమణకు ఆదేశించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో న్యాయవాదులు మాట వరుసకు ప్రస్తావిస్తే సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహించి మణిలాల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ధిక్కారనేరం కింది తమ ఎదుట హాజరు కావలసిందిగా స్పీకర్‌ని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రబలిన తెగులు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, నీతి బాహ్యం, అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయించిన 21 మంది శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ సభాపతికి మహజర్లు సమర్పించింది. ఆయన స్పందించలేదు. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను ఎట్లా సమర్థిస్తారో చెప్పవలసిందిగా ఫిరాయించిన శాసనసభ్యులనూ, శాసనసభ కార్యదర్శినీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, శంకర నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ 2016 నవంబర్ 14న అడిగింది. మళ్ళీ ఈ కేసు విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో విడిగా వైఎస్ఆర్సీపీ బాధ్యులు పిటిషన్ వేశారు. అమరావతిలో శాసనసభా ప్రాంగణానికి ఈ యేడాది మార్చి రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభాపతికి బహిరంగ లేఖ రాశారు. ఫిరాయించిన శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా అభ్యర్థించారు. సభాపతి ఉలకలేదు. ముఖ్యమంత్రి మాత్రం వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారు. ఫిరాయింపుదారులను వైఎస్ఆర్సీపీ సభ్యులుగా అసెంబ్లీ బులెటిన్లలో చూపించడం మరింత విడ్డూరం. వీటన్నిటినీ భరిస్తూ తాము అడిగే ప్రశ్నలకు ఫిరాయించి మంత్రి పదవులు సంపాదించినవారు సమాధానాలు చెబుతుంటే, వింటూ తలలూపుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉండాలని తెలుగుదేశం నాయకత్వం కోరుకుంటోంది. ఆ పని చేస్తే ఫిరాయింపులనూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులతో సత్కరించడాన్నీ వైఎస్ఆర్సీపీ ఆమోదించినట్టు అవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలనూ, నీతి బాహ్యమైన వైఖరినీ ఆమోదించడం ఇష్టం లేని కారణంగానే సభను బహిష్కరించామంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకున్న మరుక్షణం నుంచి హాజరు అవుతామని చెబుతున్నారు. తెలంగాణలో ప్రగతి తెలంగాణలో ఫిరాయింపుదారులపైన వ్యాజ్యం ఇంకాస్త ముందుకు జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎస్ఎ సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్కె అగర్వాల్, ఆర్ఎఫ్ నారిమన్‌తో కూడిన బెంచ్ పరిశీ లించి ఇది చాలా సున్నితమైన విషయం కనుక అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని నిర్ణయించింది. 2016 నవంబర్ 9న ధర్మాసనానికి నివేదించింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయవలసిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్ ప్రార్థించారు. ఎన్నికలలో 67 స్థానాలు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఫిరాయింపుల ధర్మమా అని 89 స్థానాలు ఉన్నాయంటూ ధర్మాసనానికి నివేదించారు. ఇదే రకమైన ప్రార్థన హై దరాబాద్ ఉమ్మడి హైకోర్టులో వేయగా 90 రోజులలోగా ఫిరాయింపుదార్లపైన చర్య తీసుకోవలసిందిగా స్పీకర్ మధుసూదనాచారిని కోరింది. ఆయన నిమ్మకునీరెత్తినట్టు మిన్నకున్నారు. పదో షెడ్యూల్లో సభాపతులకు విశేషాధికారాలు ఇచ్చినప్పుడు వారు పార్టీలకి అతీతంగా వ్యవహరిస్తారనీ, ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల బంట్లుగా కాకుండా వారి హోదాకు తగినట్టు, రాజ్యాంగం నిర్దేశించినట్టు స్వతంత్రంగా వ్యవహరిస్తారనీ భావించారు. ఈ భావనే ఘోర తప్పిదమని మూడు దశాబ్దాలలో సభాపతులే నిరూపించారు. కిహోటో హోలోహన్ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఉన్నత పదవిలో ఉన్న సభాపతిని శంకించడం ధర్మం కాదని వ్యాఖ్యానిస్తూ, ‘సభాపతి దుస్తులు ధరించిన తర్వాత ‘లోపలి మనిషి’ ఉన్నతంగా పరిణామం చెందుతారు’ అనే ఆశాభావం వెలిబుచ్చింది. రెండున్నర దశాబ్దాల అనంతరం మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభాపతి కేసులో తీర్పు ఇస్తూ ‘సభాపతి దుస్తుల లోపలి మనిషి’ పట్ల అవిశ్వాసం ధ్వనిస్తూ సభాపతిపైన పరిమితులు విధించాలని సూచించింది. సభాపతులు ప్రధానమంత్రులకూ, ముఖ్యమంత్రులకూ విధేయులుగానే ఉంటారని స్పష్టమైపోయింది. అందువల్ల వారికి పదో షెడ్యూల్లో దఖలు పరచిన విశేషాధికారాన్ని రద్దు చేసి ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే నిర్ణయం రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ తీసుకోవాలనీ, వారు సైతం ఎన్నికల కమిషన్ సలహాను విధిగా పాటించాలనీ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్, అంతకు పూర్వం దినేష్ గోస్వామి కమిటీ సిఫార్సు చేశాయి. దీని అమలుకు రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు ప్రధాని మోదీ సహకారం తప్పనిసరి. అవినీతిపైనా, నల్లధనంపైనా యుద్ధం చేస్తున్న ప్రధానికి నల్లధనం, అవినీతితో కూడిన ఫిరాయింపులనే వికృత క్రీడ సమ్మతం కాజాలదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కుహనా ప్రజాస్వామికశక్తుల ఆటకట్టించే శక్తి ప్రస్తుతం మోదీకి మాత్రమే ఉంది. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించేందుకు నడుం బిగిస్తే మోదీ చరితార్థులు అవుతారు. - కె. రామచంద్రమూర్తి -
కమలానికి కఠోర పరీక్ష
త్రికాలమ్ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అన్ని వర్గాల ఆమోదం కోసం తాను అనేకమందితో సమాలోచనలు జరుపుతున్నట్టు శ్రీశ్రీ రవిశంకర్ రెండురోజుల క్రితమే ప్రకటించారు. ఆయనకు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వంటి బీజేపీ అగ్రనాయకులు మద్దతు పలికారు. భారతదేశంలో నివసించే హక్కు హిందువులకు మాత్రమే ఉన్నదని శనివారం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉద్ఘాటించారు. ఈ పరిణామాలకూ, గుజరాత్ ఎన్నికలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? గుజరాత్ ఎన్నికలకూ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)లో సవరణలకూ లంకె ఉన్నదా? వికాస్ (అభివృద్ధి), అవినీతి రహిత పాలన అంటూ రెండు నినాదాలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ హిందూత్వను కూడా జోడిస్తే కానీ ఆశించిన ఫలితం రాదని భావించారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమా? ఎందుకంత శ్రమ? ‘రాహుల్‌గాంధీలాగా మా మోదీ సోమరి కాదు. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరి గినా శక్తివంచన లేకుండా కష్టపడతారు.’ ఇవి బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు ఒక ఇంగ్లీషు చానల్ చర్చాకార్యక్రమంలో అన్న మాటలు. మోదీ అక్టోబర్ మాసంలో గుజరాత్లో అయిదు పర్యాయాలు పర్యటించారు. గుజరాత్లో ఘనవిజయం ఖాయమనే విశ్వాసం ఉంటే ఒక ప్రధాని అన్నిసార్లు ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఎందుకనే ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో చివరి మూడు రోజులూ ఒక్క కాశీ నగరంలోనే మోదీ ప్రచారం చేయడం విస్తుగొలిపింది. గెలుపు చాలా కష్టసాధ్యమని భావిం చిన కారణంగానే ప్రధాని ఒకే నగరంలో అన్ని రోజులు ఉన్నారేమో అనుకున్నాం. ఉత్తరప్రదేశ్‌లో అంతిమంగా బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీకి యూపీలో గెలుపొందడం చాలా అవసరం. ఆ గెలుపు పార్టీకి కొత్త ఊపునిచ్చింది. దేశప్రజల దృష్టిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థాయి పెంచివేసింది. యూపీ కంటే గుజరాత్ బీజేపీ దృష్టిలో కీలకం. ఈ రాష్ట్రాన్ని మోదీ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పరిపాలించారు. గుజరాత్ తరహా అభివృద్ధి దేశవ్యాప్తంగా సాధిస్తాననే వాగ్దానంతోనే ఆయన 2014 ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ సాధించిపెట్టారు. ఆ ఎన్నికలలో గుజరాత్లో ఉన్న మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్నది. పైగా బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. షా కూడా ఆ రాష్ట్రం నుంచే ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనారు. సొంతరాష్ట్రంలో ఓడిపోతే మోదీ–అమిత్‌షా ద్వయానికి తలవంపులు. గెలిచినా ఆధిక్యం 2012లో కంటే తగ్గిందంటే అప్రతిష్ఠ. మారిన రాహుల్ 1995 నుంచీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘పప్పు’గా పేరుమోసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కత్తిలాగా మాటల తూటాలు ప్రయోగించి దేశ ప్రజల మెప్పు సంపాదిం చారు. ఆత్మవిశ్వాసంతో, జీఎస్టీని గబ్బర్‌సింగ్ టాక్స్‌గా అభివర్ణిస్తూ విసురుతున్న చలోక్తులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ‘ఇండియా టుడే’, ‘టైమ్స్ నౌ’ వంటి మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు బీజేపీకి ఈ సారి 2012లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని జోస్యం చెబుతున్నప్పటికీ మోదీకి నమ్మకం కలగడం లేదు. అందుకే అంత తరచుగా గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు ఆ రాష్ట్రంలో రూ.15,000 కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కూడా అందుకే. ‘అచ్ఛే దిన్’గురించి అంతగా ప్రస్తావించకపోవడానికీ అదే కారణం. ఈ సంవత్సరం ఆరంభంలో యూపీలో అమిత్‌షా, 1970లలో గుజరాత్లో ఇందిరాగాంధీ చేసిన ప్రయోగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్నారు. యూపీలో సుమారు 200 కుల సమావేశాలను అమిత్‌షా నిర్వహించి అన్ని కులాల మద్దతూ కూడగట్టి యాదవ కులాన్ని ఒంటరిదాన్ని చేశారు. ఇందిరాగాంధీ క్షత్రియులనూ ( గుజరాత్ జనాభాలో 37శాతం ఓబీ సీలు), దళితులనూ (6), ఆదివాసీలనూ (15), ముస్లింలనూ (10 శాతం) ఒక తాటిపైకి తెచ్చి (ఓఏఅ M‘ఖామ్’) బలమైన సంకీర్ణం నిర్మించారు. నాడు ఈ కృషిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నాయకుడు జీనాభాయ్ దర్జీది ప్రధానపాత్ర. నేడు రాహుల్‌గాంధీ చాకచక్యం వల్ల కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల 70 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల నాయకులు కాంగ్రెస్‌తో భుజం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మోదీ, షాలను బాగా కలవరపెడుతున్న పరిణామం. వ్యాపారమే ప్రధానంగా భావించే గుజరాతీయులలో అకస్మాత్తుగా ఒక చైతన్యం వెల్లువెత్తుతుంది. చినికి చినికి గాలివానగా మారుతుంది. యువత అతి వేగంగా స్పందించి తిరుగుబాటు చేస్తుంది. అహ్మదాబాద్ హాస్టళ్ళలో ఆహారం నాసిరకంగా ఉండటానికీ, మెస్ బిల్లులు పెరిగిపోవడానికీ నిరసనగా 1973 డిసెంబర్లో ఆరంభమైన విద్యార్థుల ఆందోళన క్రమంగా ఊపందుకొని నవనిర్మాణ ఉద్యమంగానూ, అనంతరం జయప్రకాశ్‌నారాయణ్ నాయకత్వంలో సంపూర్ణ విప్లవంగానూ పరిణమించింది. 1975లో ఆత్యయిక పరిస్థితికి దారితీసి, 1977లో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి కారణమై దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. విద్యార్థి ఉద్యమం గుజరాత్లో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. 43 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుజరాత్లో యువత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. మూడు బలమైన వర్గాలకు ప్రతినిధులుగా ముగ్గురు యువనేతలు– హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకుర్, జిగ్నేశ్ మెవానీ– ఎదిగారు. ముగ్గురు మరాఠీలు పతీదార్లకు ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కావాలంటూ పతీదార్ అనామత్ ఆందోళన్ సమితి (PASS )ఆధ్వర్యంలో 2015లో 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ ఆందోళన మొదలుపెట్టారు. ఆనందీబెన్ పటేల్ సర్కార్‌ను గడగడలాడిం చారు. పతీదార్లు వ్యవసాయం ప్రధానంగా జీవించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయాధార పరిశ్రమలకూ, ఇతర పరిశ్రమలకూ, రాజకీయాలకూ విస్తరించారు. కడ్వ, ల్యూవా పటేల్ ఉపకులాలవారు హార్దిక్‌పటేల్‌ను సమర్ధిస్తున్నారు. గుజరాత్ జనాభాలో కడ్వ పటేళ్ళు ఆరు శాతం, ల్యూవా పటేళ్ళు ఎని మిది శాతం, ఇతర పటేళ్ళు రెండు శాతం ఉంటారు. 1984–85 నుంచీ పటేళ్ళు మూకుమ్మడిగా బీజేపీతో ఉన్నారు. ఈ సారి తేడా వచ్చింది. కానీ నాయకులు మాత్రం ఇప్పటికీ బీజేపీతోనే ప్రయాణం చేస్తున్నారు. అల్పేశ్ ఠాకుర్ (40) ఓబీసీ నాయకుడు. కాంగ్రెస్ నేత ఖోడాభాయ్ పటేల్ తనయుడు. ఆరేళ్ళ కిందట ‘క్షత్రియ ఠాకుర్ సేన’ను అల్పేశ్ స్థాపించారు. ఆ సంస్థలో ఏడు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏక్తామంచ్ (OSS ) నెలకొల్పారు. మంచి నిర్వాహకుడిగా పేరు సంపాదిం చారు. అల్పేశ్ ప్రభావం ఉత్తర గుజరాత్‌లోని సబర్కాన్తా (3 నియోజకవర్గాలు), బనాస్కాంతా (9), ఖేడా (7), మెహసానా(7), ఆనంద్ (7), పట్నా (4), గాంధీనగర్ (5), ఆరావళీ (3) జిల్లాలలో విశేషంగా ఉంటుంది. ఉత్తర గుజరాత్‌లోని మొత్తం 33 శాసనసభ స్థానాలలో 2012 ఎన్నికలలో కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 15కే పరిమితమైంది. అప్పుడు శంకర్‌సిన్హ్ వఘేలా కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆయనకు 15 నియెజకవర్గాలలో పట్టు ఉంది. గత జులైలో వఘేలా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. ‘జనవికల్ప్’ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. 1996 లో సైతం బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా కాంగ్రెస్‌లో చేరకుండా ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ని నెలకొల్పారు. 1998 ఎన్నికలలో ఆ పార్టీ గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టి 12 శాతం ఓట్లు చీల్చుకున్నారు. ఓబీసీలలో ఠాకూర్లది పెద్ద వర్గం. దాని నాయకుడు అల్పేశ్ ఇటీవల జనాదేశ్ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి తన నాయకత్వం లోని ఓఎస్ఎస్ సంస్థను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. జిగ్నేశ్ మెవానీ 37 సంవత్సరాల యువకుడు. వృత్తిరీత్యా న్యాయవాది. పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు వేయడంలో దిట్ట. 2016లో ఉనా నగరంలో నలుగురు అర్ధనగ్నంగా ఉన్న దళిత యువకులను గోరక్షకులు విపరీతంగా కొట్టిన ఘటనపై పెద్ద ఉద్యమం నిర్మించి దళిత నేతగా ఎదిగిన వ్యక్తి జిగ్నేశ్. చాలామంది దళితులను బౌద్ధంలో చేర్పించారు. గుజరాత్ జనాభాలో దళితులు ఆరు శాతం. ముస్లింలు పది శాతం. ఈ రెండు వర్గాల మద్దతు లేకుండానే ఎన్నికలలో గెలవడం బీజేపీకి పరిపాటి. గుజరాత్‌లోని వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురు యువకులు గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలలోనూ 111 స్థానాలను ప్రభావితం చేయగలరు. వీరిని కాంగ్రెస్ అక్కున చేర్చుకోగలిగితే బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి. అల్పేశ్, జిగ్నేశ్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. తాను పోరాడుతున్నది పటేళ్ళకు రిజర్వేషన్లకోసం కనుక రిజర్వేషన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని హార్దిక్ చెబుతున్నాడు. హామీ ఇవ్వడం అంత తేలిక కాదు. పటేళ్ళకు రిజర్వేషన్లు అవసరమా, లేదా అనే విషయంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాలని పట్టుదలగా ఉన్న హార్దిక్ కాంగ్రెస్ పార్టీని సమర్థించక తప్పకపోవచ్చు. బీజేపీ నేతల్లో గుబులు ఆర్ధిక మాంద్యం గుజరాత్లో వివిధ వర్గాలను దెబ్బతీస్తున్నది. వ్యవసాయరంగం దీనావస్థలో ఉంది. ఇటీవలి వరదలలో నష్టపోయినవారిలో చాలామంది ఇంకా కోలుకోలేదు. ఆరోగ్యం, రవాణా రంగాలు కుదేలైనాయి. ఇంతవరకూ బీజేపీని బేషరతుగా బలపరిచిన అహ్మదాబాద్, సూరత్ వజ్రాలూ, జౌళి వ్యాపారులు జీఎస్టీతో దారుణంగా దెబ్బతిని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ నెల 8 వ తేదీన వదోదరా సభలో ప్రసంగిస్తున్న మోదీపైన పరిమిత వేతనాలకు వ్యతి రేకంగా పోరాడుతున్న సంస్థ అధ్యక్షురాలు చంద్రికా సోలంకీ అరడజను గాజులు విసిరి నిరసన ప్రకటించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భరత్‌సింగ్ సోలంకీ సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయం తాలూకు ఉత్సాహం పార్టీ కార్యకర్తలలో ఉంది. అయినప్పటికీ నవంబర్ 9, 14 తేదీలలో 14వ గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించగలదని చెప్పడం కష్టం. బీజేపీ చేతిలో అధికారం ఉంది. వివిధ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. అంగబలం, అర్థబలం ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దయినప్పటికీ అధికారపార్టీ చేతుల్లో నల్లధనం అపారంగా ఉంది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల క్షేత్రస్థాయి సేవలు ఉన్నాయి. 2002 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పొందిన ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు 10–11 శాతం అధికం. మోదీ ప్రధానిగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు కనుక బీజేపీకే వేయాలనే ఆలోచన చాలామందిలో ఉండవచ్చు. అయినప్పటికీ మోదీ ర్యాలీలకు జనం ఉత్సాహంగా హాజరు కాకపోవడం బీజేపీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నది. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే సరిపోదు. భారీ ఆధిక్యం సాధించాలి. లేకపోతే ఆర్ఎస్ఎస్ నాయకత్వం క్షమించదు. ప్రజల దృష్టిలో మోదీ–షా ద్వయం పలచన అవుతారు. వారి మ్యాజిక్ పనిచేయడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. అటువంటి అభిప్రాయం ప్రబలితే గుజరాత్ ఎన్నికల తర్వాత జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీకి నష్టాలూ, కష్టాలూ పెరుగుతాయి. అందుకే మోదీ అంతగా శ్రమిస్తున్నారు. కె. రామచంద్రమూర్తి -
మీడియాపై దాడులను అడ్డుకుందాం
కొరుక్కుపేట : మీడియాపై దాడులను అడ్డుకునేందుకు చెన్నైలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో దాడుల అడ్డుకట్టకు, మీడియా భద్రతకు ఐదు తీర్మానాలు చేశారు. వీటిని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై దాడులు– బెదిరింపులు – మీడియాలో నేటి పరిస్థితిపై జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ సంధానకర్తగా రెండు సెషన్లతో కార్యక్రమం జరిగింది. ఇందులో సాక్షి మీడియా తరఫున ఈడీ రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్ రామ్, నటి గౌతమి, తమిళనాడు తమిళ భాష అభివృద్ధి శాఖ మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్, తమిళ మీడియా సంపాదకులు పాల్గొన్నారు. సదస్సులో మీడియాపై దాడులు, ప్రభుత్వాల తీరు, మీడియా సంస్థల్లో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
ప్రమాదంలో టీటీడీపీ ఉనికి
త్రికాలమ్ పరిసరాల ప్రభావం మనిషిపైన తప్పనిసరిగా ఉంటుంది. పరిణామాలు మనిషి వైఖరిని మార్చివేస్తాయి. స్వాతంత్య్ర సమరం సాగిన సమయంలో సత్యం, స్వేచ్ఛ, సమానత్వం, త్యాగ భావన వంటి ఉన్నతమైన విలువలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 1960లలో వియత్నాం యుద్ధం, పౌరహక్కుల ఉద్యమాలు, జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతం ప్రపంచవ్యాప్తంగా యువతను కది లించాయి. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ఆవిష్కృతమైన తర్వాత వ్యాపార సంస్కృతికి పెద్దపీట వేశాం. అప్పుడే హైటెక్ విప్లవం యువతీయువకులను అమెరికా బాట పట్టించింది. 2014లో మితవాద ధోరణులు ప్రబలిన ఫలి తంగా నరేంద్ర మోదీ బీజేపీకి అపూర్వమైన విజయం సాధించగలిగారు. నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మితిమీరిన మితవాద భావజాలానికి ప్రతీ కగా డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. కాలానికి అనుగుణంగా విలువలు మారతాయి. అందుకే మనిషిని కాలం రూపొందిస్తుంది (Man is the pro-duct of his times)) అంటారు. వార్తలలో వ్యక్తి వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వార్తలలో ఉన్న వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి కూడా సమకాలీన విలువలకూ, రాజకీయ సంస్కృతికీ ప్రతీక. మోదీ, ట్రంప్‌లను గెలిపించిన ధోరణులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)లు పాటిస్తున్న విలువలూ, అనుసరిస్తున్న విధానాలూ, ప్రదర్శిస్తున్న వైఖ రులూ రేవంత్‌రెడ్డి రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు భావించవచ్చు. ఆర్ఎస్ఎస్ అభిమానిగా, బీజేపీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా ఎంఎల్‌సి ఎన్నికలలో గెలుపొందారు. ప్రస్తుతం కొడంగల్ శాసనసభ్యుడు (అందుకే రేవంత్ తాజా విన్యాసాల వెనుక చంద్రబాబు ఉన్నారా అంటూ ప్రజలు అనుమానిస్తున్నారు). టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా సన్నిహితుడు. భార్య, కొడుకు, కోడలు సమేతంగా రేవంత్‌రెడ్డి కుమార్తె పెళ్ళికి చంద్రబాబు హాజరైనారు. భువనేశ్వరి, బ్రాహ్మణి సాధారణంగా రాజకీయనేతల కుటుంబాలలో వివాహాలకు వెళ్ళరు. రేవంత్‌రెడ్డి మాత్రం మినహాయింపు. ‘ఓటుకు కోట్లు’ ఉదంతంలో కరెన్సీ నోట్లకట్టలతో కెమెరాకు చిక్కిన రేవంత్‌రెడ్డికి సంఘీభావం తెలపడంకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయత్నించిన సందర్భం అది. చంద్రబాబుకూ, ఆయన కుమారుడు లోకేశ్‌కూ అత్యంత సన్నిహితుడు కాగలిగిన నేర్పరి రేవంత్‌రెడ్డి. లక్ష్యం ఛేదించడం ఎట్లాగో తెలిసిన విలుకాడు. విజయంకోసం ఉపయోగించే మార్గం ఈ తరం నాయకులలో అత్యధికులకు అంత ప్రధానం కాదు. పాతతరం విలువలు పాటించేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కానీ గౌరవం కానీ లేవు. వారిని చేతగాని వాజమ్మలుగా (సన్నాసులు) పరిగణిస్తున్నారు. ఇప్పటి రాజకీయాలలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండాలన్న పట్టింపు లేదు. మాటలను తూటాలుగా పేల్చే ప్రావీణ్యం, తెగింపు ఉంటే చాలు. చేయని మంచి పనులు చేసేసినట్టూ, చేసిన తప్పులు చేయనట్టూ దబాయించే వెరపులేని మనస్తత్వం వీరి ప్రత్యేకత. గతం అంతా చీకటేననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ నిస్సంకోచంగా చెప్పగలగాలి. ఎంతటివారినైనా ఎంతమాటైనా నిస్సంకోచంగా అనాలి. అటువంటివారినే గుండెబలం ఉన్న నాయకులుగా ప్రజలు పరిగణిస్తున్నారు. నేటి వాతావరణంలో వారే మేటి నేతలు. అటువంటి నేతలనే మీడియా ప్రేమిస్తుంది. ప్రశ్నించదు. ప్రమాదంలో టీటీడీపీ ఉనికి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఇది అనివార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అనేక వైరుధ్యాల కారణంగా రెండు రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రజాదరణ పొందడం ప్రస్తుతానికి అసాధ్యం. 2014లో టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసినవారిలో 15 మంది విజయం సాధించగా 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయించవలసిందిగా ప్రోత్సహించిన చంద్రబాబుకు తెలంగాణ పరిణామాల పట్ల ఫిర్యాదు చేసే నైతికాధికారం లేదు. శ్రీనివాసయాదవ్ టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరినప్పుడు పార్టీ ఫిరాయించడం ఎంతటి సిగ్గుమాలిన వ్యవహారమో, పార్టీని ఎట్లా వంచించి మరో పార్టీలోకి దూకుతున్నారో వివరిస్తూ నిప్పులు కక్కారు చంద్రబాబు. కపట రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఫిరాయింపుల నిరోధక చట్టం అంటూ ఒకటి రాజ్యాంగంలో ఉన్నదనే స్పృహ మోదీకి కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజీవ్‌గాంధీ, వాజపేయి రూపొందించిన చరిత్రాత్మకమైన చట్టాన్ని అందరూ కలసి తుంగలో తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను బుట్టలో వేసుకున్న చంద్రబాబు రేవంత్‌రెడ్డిని చేర్చుకున్నందుకు కాంగ్రెస్‌ను తప్పు పట్టలేరు. అనేక కారణాల వల్ల ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించే స్థితిలో లేరు. ‘ఓటుకు కోట్లు’ కేసు అనంతరం సమీకరణాలు మారిపోయాయి. హైదరాబాద్ విడిచి హూటాహుటిన అమరావతికి తరలి వెళ్ళిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే సాహసం చేయడం లేదు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నాయకులనూ, కార్యకర్తలనూ కాజేస్తున్నది కేసీఆర్ అన్నది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కేసీఆర్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పగలిగిన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. కొన్ని మాసాల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడు రోజు లపాటు నల్లగొండ జిల్లాలో మకాం పెట్టి టీఆర్ఎస్ను వచ్చే ఎన్నికలలో ఓడిం చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించిన తర్వాత అంగుళం కూడా ఆ పార్టీ ముందుకు కదలలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గట్టిగా, సహేతుకంగా, ప్రభావవంతంగా విమర్శించే నాయకుడు లేడు. కొత్తవారిని తమ పార్టీలో చేర్చుకొని తమలో ఇముడ్చుకునే అలవాటు బీజేపీ నాయకులకు లేదు. తమకు బలం లేని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీని సమకూర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కి కార్యకర్తల బలం ఉంది. ముప్పయ్ శాతం ఓట్లు పది లంగా ఉన్నాయి. కానీ పార్టీ నాయకులనూ, శ్రేణులనూ ఒకే తాటిపైన నడిపించే గట్టి నాయకుడు లేడు. నల్లగొండ జిల్లాలలోనే చాలామంది నాయకులు ఉన్నారు. వారిలోనే ఐక్యత లేదు. అరడజను మందికిపైగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒకరి మాట ఒకరు వినరు. కేసీఆర్‌కు సమాధానం చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని ప్రజలు భావించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు గులాంనబీ ఆజాద్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కష్టపడుతున్నారు. జానారెడ్డికి పరిపాలనా రంగంలో విశేషానుభవం ఉన్నది. కానీ వీరిలో ఎవ్వరినీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రేవంత్‌రెడ్డికి మంచి అవకాశం ప్రసాదించాయి. కేసీఆర్ మాట్లాడినంత స్ఫుటంగా, అంతే కరకుగా, అంతకంటే పదునుగా మాట్లాడే శక్తి తనకు ఉన్నదని రేవంత్ గత మూడున్నర సంవత్సరాలలో అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాను ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడనే అపరాధ భావన రేవంత్‌రెడ్డిలో ఎక్కడా కనిపించదు. టీఆర్ఎస్ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ దొరికిపోయిన ఫలితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు రేవంత్ ముఖం దాచుకునే ప్రయత్నం చేయలేదు. మీసాలు మెలేసి తొడగొట్టి కేసీఆర్‌ను సవాల్ చేస్తూ మాట్లాడారు. అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్న వ్యక్తిని తమ పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ నాయకత్వం ఏ మాత్రం సంకోచం చూపించలేదు. ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం అక్రమమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మధ్య తరగతి ప్రజలు భావించవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఈ విషయం పట్టిం చుకోవడం లేదు. లేకపోతే రేవంత్‌ను రాహుల్‌గాంధీ కలుసుకోవడానికి అంగీకరించేవారు కాదు. రాబోయే ఎన్నికలలో రేవంత్ కాంగ్రెస్ ప్రచార సార«థిగా ఉండబోతున్నారనే వార్తలు వచ్చేవి కావు. తనతో పాటు కాంగ్రెస్‌లో ప్రవేశించే పాతికమంది నాయకులకు ఎన్నికలలో పార్టీ టెక్కెట్లు ఇవ్వాలంటూ వారి జాబితాను రాహుల్‌కి ఇచ్చారనే ప్రచారం అయ్యేది కాదు. రేవంత్ రాక పార్టీకీ, అతనికీ లాభమనీ, ఉభయతారకంగా ఉంటుందనీ కాంగ్రెస్ నాయకులు సంతోషంగా చెప్పుకునేవారు కాదు. లక్ష్యం నెరవేరేనా? రేవంత్‌రెడ్డి మంచి మాటకారి. వెలమలూ, కమ్మవారూ తెలంగాణలో ఏకం అవుతున్నారంటూ ‘వెల్కమ్’ గ్రూపుగా వారిని అభివర్ణించిన మొదటి వ్యక్తి రేవంత్. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్య వైరుధ్యాలను ఎత్తి చూపించిన నాయకుడూ ఆయనే. టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్నదనీ, దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ను తిరస్కరించిందనీ ఆయన విశ్లేషణ. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని తీర్మానం. రేవంత్ చేరితే గాంధీభవన్‌లో హడావిడి పెరుగుతుంది. కేసీఆర్‌పై విమర్శనాస్త్రాల పరంపర సంధిస్తారు. రాజకీయ ఉష్ణోగ్రత పెంచుతారు. రేవంత్ పొడ గిట్టని కేసీఆర్‌పైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ రేవంత్ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన కోరిన టిక్కెట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తుందా? వారందరినీ గెలిపించుకొని తన గ్రూపుగా నిలబెట్టుకోగలరా? ఇది పగటి కల కాదుకదా! ప్రాంతీయ పార్టీలతో ఉండే సౌలభ్యం జాతీయ పార్టీలతో ఉండదు. టీడీపీలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. టీఆర్ఎస్లో కేసీఆర్ మాట సుగ్రీవాజ్ఞ. ప్రాంతీయ పార్టీ అధినేతకు నచ్చినవారికి ఎవ్వరూ అపకారం చేయలేరు. వారికి నచ్చనివారికి ఉపకారం చేయలేరు. కాంగ్రెస్ పరి స్థితి ఇందుకు భిన్నం. అది మహాసముద్రం వంటిది. పార్టీలో చేరిన తర్వాత రాహుల్‌గాంధీ దర్శనభాగ్యం దొరకడమే కష్టం కావచ్చు. తన వెంట వస్తారనుకుంటున్న నాయకులు నిజంగా రాకపోవచ్చు. వారితో హరీష్‌రావు కానీ ఇతరులు కానీ మాట్లాడి టీఆర్ఎస్లో చేరడానికి ఒప్పించవచ్చు. కాంగ్రెస్ టిక్కెట్టు కంటే టీఆర్ఎస్ టిక్కెట్టు కానీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీటీడీపీ టిక్కెట్టు కానీ ఎన్నికలలో గెలిపిస్తుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఉన్నంత సామర్థ్యం, యుద్ధ కౌశలం రేవంత్‌కు ఉన్నట్టు ఇంతవరకూ ఎక్కడా వెల్లడి కాలేదు. ఆ స్థాయి నాయకుడిగా ఎదగలేదు. టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులలో అత్యధికులు టీఆర్ఎస్తో పొత్తు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పోవాలని వాదిస్తున్నవారు తక్కువ మంది. టీటీడీపీ నేతలను తన వైపు తిప్పుకునే అవకాశం కేసీఆర్‌కు ఉంది. బీజేపీ విడిగా పోటీ చేయాలనీ, అన్నిచోట్లా వారి అభ్యర్థులు నిలబడాలనీ, వారికి డిపాజిట్లు రావడమే కాకుండా గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చుకోవాలనీ కేసీఆర్ కోరుకుంటారు. రేవంత్ వాగ్బాణాలతో గాయపడి ఆగ్రహించిన కేసీఆర్ ప్రతీకా రేచ్ఛతో ‘ఓట్లకు కోట్లు’ కేసును తిరిగి తెర వకుండా చూడాలంటూ చంద్రబాబు వేడు కుంటారు. ప్రస్తుత దృశ్యంలో కేసీఆర్ అనే కొండను రేవంత్‌రెడ్డి అనే పొట్టేలు ఢీకొనడం చూస్తున్నాం. బలాబలాలు తారుమారై భవిష్యత్తులో దృశ్యం మారుతుం దేమో బుల్లితెరపై చూడాలి. - కె. రామచంద్రమూర్తి -
వధ్య శిలపై విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే బలవన్మరణం చెందుతున్నారు. చదువులో రాణించలేమోనన్న భయం, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయన్న ఆందోళన, తోటి విద్యార్థులతో పోల్చి అసమర్థులుగా చిత్రించడంతో న్యూనతాభావానికి లోనైనప్పుడు కలిగే మనస్తాపం విద్యార్థులను, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను ఆత్మహత్యకు పురి గొల్పుతున్నాయి. కడచిన రెండు సంవత్సరాలలో దాదాపు నలభై మంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారు. వీరిలో పాతికమంది దాకా నారాయణ, చైతన్య విద్యా సంస్థల హాస్టళ్ళలో నివసిస్తూ చదువుకుంటున్నవారే. సెప్టెంబర్ 17న కృష్ణాజిల్లా గూడవల్లిలో నారాయణ కాలేజిలో చదువుతున్న ఈశ్వరరెడ్డిపై అధ్యాపకులు చేయిచేసుకుంటే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడు నెల్లూరు జిల్లా గూడూరులో నారాయణ కళాశాలలోనే అధ్యాపకులు కొట్టినప్పుడు దిలీప్ అనే విద్యార్థి కర్ణభేరి చిట్లిపోయింది. శనివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వీటన్నిటిపైనా పత్రికలలో వార్తలు వచ్చాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా ఆ సంగతి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయకుండా వారిని ఆస్పత్రుల్లో చేర్పించి, వైద్యం చేస్తున్న సమయంలో మృతి చెందినట్టు సర్టిఫికెట్ తీసుకున్న అనంతరమే వారి మరణవార్త చేరేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారంనాడు విశాఖపట్టణంలో కార్పొరేట్ హాస్టళ్ళను తనిఖీ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు ప్రకటించారు. చాలా కార్పొరేట్ హాస్టళ్ళకు అనుమతులు లేవనీ, అటువంటి హాస్టళ్ళకు నోటీసులు ఇచ్చామనీ, అవసరమైతే మూసివేయడానికైనా ప్రభుత్వం వెనకాడదనీ ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలుగా చేసింది శూన్యం. ఇన్ని పసిప్రాణాలు నిష్కారణంగా అనంతవాయువుల్లో కలిసిపోయినప్పటికీ ఒక్క హాస్టల్ యాజమాన్యంపైన కానీ, ఒక్క కాలేజి యాజమాన్యం పైన కానీ పోలీసు కేసు నమోదు చేసిన దాఖలా లేదు. అమలు కాని సంస్కరణలు నారాయణ కళాశాల విద్యార్థులు నందిని, మనీషాలు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆత్యహత్యలు పెరగడానికి కారణాలు ఏమిటో అధ్యయనం చేయడానికి రెండేళ్ళ కిందట (2015) ఐఏఎస్ అధికారి చక్రపాణి, మాజీ వైస్‌చాన్సలర్ రత్నకుమారితో ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ యేడాది మే నాలుగో తేదీన ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను వెంటనే అమలు చేస్తే ఇన్ని అనర్థాలు జరిగేవి కావు. ప్రతి కార్పొరేట్ కళాశాలకీ ఒక కౌన్సిలర్‌ను నియమించాలని కమిటీ చెప్పింది. నియమించలేదు. విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ కలిపి ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసి అందించాలని కమిటీ చెప్పింది. ఆ పని జరగలేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు తీసుకోవచ్చునో, ఎటువంటి ఉద్యోగాల కోసం చదువుకోవచ్చునో వివరించే వ్యవస్థ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. అదీ ఏర్పాటు కాలేదు. ప్రతి సబ్జెక్టులో నెలకు ఒకే ఒక పరీక్ష ఉండాలనీ, అంతకంటే ఎక్కువ పరీక్షలు ఉండరాదనీ కమిటీ నొక్కి చెప్పింది. కార్పొరేట్ సంస్థలు తమకు తోచిన రీతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఆరుమాసాలకూ ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులతో సమాలోచన ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. నేటికీ తల్లిదండ్రులను అధ్యాపకులు దగ్గరికి రానివ్వరు. పరీక్షలలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను మాటిమాటికీ సెక్షన్లు మార్చి అవమానించవద్దని కమిటీ చెప్పింది. ఇదీ అమలుకు నోచుకోలేదు. సెక్షన్లు మార్చి, పనికిరానివారని ముద్రవేయించుకున్న విద్యార్థులు నిరాశానిస్పృహలకు లోనవుతూనే ఉన్నారు. టెస్ట్‌లలో విద్యార్థులకు వచ్చిన మార్కులను నోటీసు బోర్డులపైన పెట్టి వారిని ఆత్మన్యూనతా భావానికి లోను చేయవద్దని చక్రపాణి కమిటీ సూటిగా చెప్పింది. అది ఆగలేదు. ఉదయం ఎనిమిదిగంటల లోపూ, సాయంత్రం ఆరు తర్వాతా క్లాసులు ఉండరాదంటూ స్పష్టం చేసింది. హాస్టళ్ళలో విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకే లేపుతారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ క్లాసు ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ అల్పాహారం. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం వరకూ రుబ్బుడు. భోజనం తర్వాత అదే కార్యక్రమం రాత్రి పదిన్నర వరకూ సాగుతుంది. పదింటికి హాస్టలు గదికి చేరిన విద్యార్థులు ఏడెనిమిది మంది దాకా ఒకే గదిలో ఉండాలి. వాళ్ళు కబుర్లు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించే సరికి అర్ధరాత్రి దాటుతుంది. మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేపుతారు. బట్టీ యంత్రాలు ఈ దైనందిన చర్యలలో వేరే పుస్తకాలు చదవడం లేదు. ఆటపాటలు అసలే లేవు. విశ్రాంతి లేదు. వినోదం లేదు. బట్టీ పట్టడమే కానీ ఒక సమస్యను ఎట్లా పరిష్కరించాలో సొంతంగా ఆలోచించడం, విశ్లేషించడం నేర్పరు. రాజకీయాలు పట్టవు. సమాజం తెలియదు. ఒకే స్థాయి ప్రతిభ కలిగినవారు ఒకే బ్యాచ్‌లో ఉంటారు కనుక తమ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులతో మాట్లాడటం, వారి సంగతులు తెలుసుకోవడం సాధ్యం కాదు. యోగా, వ్యాయామం విధిగా బోధించాలని కూడా చక్రపాణి కమిటీ సిఫార్సు చేసింది. ఇది కూడా అమలు జరగడం లేదు. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆ ఊసే లేదు. ఆటస్థలం తప్పని సరిగా ఉండాలనీ, గ్రంథాలయం ప్రతి హాస్టల్లో ఉండాలనీ, రీడింగ్ రూంలు కూడా ఏర్పాటు చేయాలనీ సిఫార్సు చేసినా ఏ సంస్థ కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ కమిటీ నివేదికను అన్ని కార్పొరేట్ సంస్థలకు పంపామంటూ విద్యామంత్రి చెప్పారు కానీ ఇంతకాలం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదో వివరించలేదు. చక్రపాణి కమిటీ తన బాధ్యతను అద్భుతంగా నిర్వహించింది. యుద్ధ ప్రాతిపదికన చక్రపాణి కమిటీ సిఫార్సులను అమలు చేసి ఆత్యహత్యలు నిరోధించవలసిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. సూచనలు అమలు తీరును సమీక్షించేందుకు రెండు కమిటీలను నియమించాలని కూడా చక్రపాణి కమిటీ కోరింది. ఒకటి, మానిటరింగ్ కమిటీ. ప్రతి కార్పొరేట్ సంస్థకు చెందిన ప్రతి హాస్టల్‌కూ పర్యవేక్షక కమిటీని నియమించాలి. రెండు, ఎథికల్ కమిటీ. నైతిక విలువలను పరిరక్షించే కమిటీలో జాయింట్ కలెక్టర్, మహిళా సంక్షేమ అధికారి, ఇంటర్ విద్య ఆర్జేడీ (రీజియనల్ జాయింట్ డైరెక్టర్), ఇద్దరు పౌరసమాజం ప్రతినిధులు ఉండాలన్నారు. ఈ కమిటీలను జిల్లా కలెక్టర్లు నియమించాలి. ఇందులో కార్పొరేట్ హాస్టళ్ళు ఐచ్ఛికంగా చేసే పనులు ఏవీ లేవు. అన్నీ ప్రభుత్వం చొరవతో అమలు కావలసిన సంస్కరణలే. తల్లిదండ్రుల ఆకాంక్షలు కార్పొరేట్ విద్యా సంస్థలూ, ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల జీవితాలను నరకప్రాయం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పిల్లలకు ఎందులో ఆసక్తి ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా వారు ఎదగాలనీ, చదవాలనీ పట్టుపడుతున్నారు. వారిపైన అసాధారణమైన ఒత్తిడి తెస్తున్నారు. వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి బదులు ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలనీ, రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే మంచి ర్యాంకు వస్తుందనీ, డాక్టరో, ఇంజనీరో కావచ్చునని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హాస్టళ్ళలోని దుర్భర పరిస్థితులు తెలిసినప్పటికీ, నిర్విరామంగా చదవడం అనేది ఎంత కష్టమో ఊహించుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తే తమ ఆకాంక్ష నెరవేరుతుందని తలపోస్తున్నారు. ఖర్చుకు వెరపు లేదు. తల తాకట్టు పెట్టి అయినా సంవత్సరానికి 1.20 లక్షల ఫీజు కట్టడానికి వెనకాడటం లేదు. పరీక్షల సమయంలో విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. పిల్లల పరీక్షలప్పుడు రక్తపోటు పెరిగిన కొంతమంది తల్లిదండ్రులను తానే ఆస్పత్రిలో చేర్చిన సందర్భాలు ఉన్నాయని ముంబయ్‌కి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త అంజలి ఛబ్రియా అంటున్నారు. పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయాలంటూ యశ్పాల్, సైరస్ వకీల్ వంటి విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పద్నాలుగు సంవత్సరాల చదువు ద్వారా సాధించిన జ్ఞానాన్ని ఒకే ఒక్క పరీక్షలో తేల్చి విద్యార్థి భవి ష్యత్తును శాసించడం న్యాయం కాదని ఎంతమంది చెప్పినా ర్యాంకింగ్ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరుడు మేలో నివేదిక సమర్పించిన టీఎస్ఆర్ సుబ్రమణియన్ కమిటీ కూడా మార్కులకూ, ర్యాంకులకూ స్వస్తి చెప్పాలనీ, అన్ని స్థాయిలలోనూ గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. పదవ తరగతి స్థాయిలో గ్రేడింగ్ విధానం అమలులోకి వచ్చింది కానీ ఇంటర్లో అమలు కావడం లేదు. పదవ తరగతిలో సాధారణంగా ఉండే సిలబస్ ఇంటర్‌కి వచ్చేసరికి అసాధారణంగా పెరిగిపోతోంది. దీన్ని కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. 1966లో విద్యాసంస్కరణలను ప్రతిపాదించిన కొఠారి కమిషన్ సైతం సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పిల్లలో పెంచిపోషించాలని ఉద్ఘోషిం చింది. సాంఘిక శాస్త్రం అనవసరమని భావించే రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. విద్యార్థికి ఎటువంటి ఉద్యోగం (కెరీర్) సరిపోతుందో నిర్ణయించే క్రమంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాలుపంచుకోవాలి. విద్యార్థి అసక్తి ఎటువైపు ఉన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్లాసు రూం లోనే కాకుండా బయట విద్యార్థి పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఇతర అంశాలు అనేకం అతని ఎదుగుదలను నిర్దేశిస్తాయి. విద్యార్థికి తెలియకుండానే ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ అతడిని జాగ్రత్తగా గమనించి అతని భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది ఇంటర్ స్థాయిలో కాదు, చాలా ముందుగానే నిర్ణయం అవుతుంది. విద్యార్థి అసక్తిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు తాము పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చాలంటూ ఒత్తిడి తెచ్చినప్పుడు విద్యార్థి అలజడికి గురి అవుతాడు. ఇంటర్ పరీక్ష లేదా ఎంసెట్ పరీక్ష జీవితంలో అత్యంత ప్రధానమైనదనీ, అదే చివరి అవకాశమనీ, ఈ పరీక్షలో ర్యాంకు సాధిం చకపోతే భవిష్యత్తు లేదనీ భావించిన విద్యార్థులు విపరీతమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్యహత్యలకు ఒడిగడుతున్నారు. విద్యారంగంలో సంస్కరణల గురించి పట్టించుకోకుండా, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆత్యహత్య చేసుకున్న ఒక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా విద్యామంత్రి, ముఖ్యమంత్రి పరామర్శించి నట్టు వార్తలు రాలేదు. ఇంతమంది బలవన్మరణం చెందినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించలేదు. మంత్రివర్గ సహచరుడే కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి అయినప్పుడు, ఆయన చాలా ముఖ్యమైన మంత్రి అయినప్పుడు, విద్యామంత్రికి సమీప బంధువైనప్పుడు విద్యాశాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ తప్పు చేస్తున్న హాస్టళ్ళపైన కానీ కాలేజి యాజమాన్యాలపైన కానీ చట్టపరమైన శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి జంకుతారు. ఈ పరిస్థితిని సరిదిద్ది, కార్పొరేట్ కళాశాలల, హాస్టళ్ళను దారిలో పెట్టి, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్టవేయవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరసమాజానికి కూడా ఉన్నది. కె. రామచంద్రమూర్తి -
తూటాలే మాటలు!
త్రికాలమ్ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మీడియా గోష్ఠి ఆసాంతం విన్నాను. వంద నిమిషాలకు పైగా సవివ రంగా మాట్లాడారు. సింగరేణి సంస్థలో బొగ్గు గని కార్మికుల సంఘం గుర్తింపు కోసం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘనవిజయం సాధించింది. విజయో త్సాహంలో కేసీఆర్ కొన్ని అతిశయోక్తులు మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష కూటమిని ఎద్దేవా చేసినా తప్పుపట్టనవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగింది. ప్రతిపక్షాల తరఫున వివిధ పార్టీల అధ్యక్షులూ, అగ్రనాయ కులూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఏఐసీసీ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడూ కుంతియా సైతం ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కూటమి గెలిచి తీరుతుందనీ, తెరాస పతనం ఆరంభం ఆవుతుందనీ ఢిల్లీలో ప్రక టించారు. ముఖ్యమంత్రిని ‘దొర’ అని సంబోధిస్తూ కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగారు. తెరాస సైతం ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి స్వయంగా అనేక వరాలు ప్రకటించారు. అక్కడి ఎన్నికలకు ఇంతకు పూర్వం ఏ ముఖ్యమంత్రి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మంత్రులూ, తెరాసకు చెందిన ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఇతర నాయకులూ శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. కాకపోతే 2012లో కంటే ఓట్ల ఆధిక్యం తక్కువ. కిందటి సారి ఎన్నికలలో టీబీజీకెఎస్‌కు 6,587 ఓట్ల మెజారిటీ వస్తే ఈ సారి 4,217 ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్మిక సంఘా లతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సారి సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కూటమికి అధిక ఓట్లు లభించాయి. అయినా తెరాస మద్దతు కలిగిన సంస్థను ఓడించలేక పోయింది. దానికి రెండంటే రెండే డివిజన్లు దక్కాయి. ఒకే యూనియన్ తొమ్మిది డివిజన్లను గెలుచుకోవడం అపూర్వమైన విషయం. ఇందుకు ముఖ్యమంత్రినీ, టీబీజీకేఎస్ నాయకులనూ, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితనీ అభినందించవలసిందే. కోదండరామ్‌పై దాడి ఎన్నికలలో పోరాడి గెలవడంలో తమది తిరుగులేని రికార్డు అన్నట్టు కేసీఆర్ చెప్పు కోవడంలో తప్పులేదు. ఘనవిజయం సాధించినందుకు ఆనందం వెలిబుచ్చడం, ప్రతిపక్షాలను విమర్శించడం, ఓటర్లను అభినందించడంతో కేసీఆర్ సరిపెట్టుకొని ఉంటే ఈ వ్యాసం రాయవలసిన అవసరం ఉండేది కాదు. కేసీఆర్ ప్రత్యర్థులపైన ఒంటికాలిపై లేస్తారనీ, పరుషపదజాలం ప్రయోగి స్తారనీ తెలుగువారందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకోవడానికి దోహదం చేసిన అంశాలలో అత్యంత ప్రధానమైనది కేసీఆర్ వాగ్ధాటి. వాక్చా తుర్యంలో, వాగ్యుద్ధ కళలో ఆయనను మించిన రాజకీయ నేత రెండు తెలుగు రాష్ట్రాలలో మరొకరు లేరన్నది అందరూ అంగీకరించే విషయమే. పదిహేను సంవత్సరాలుగా కేసీఆర్ ఉపన్యాసాలు విని ఆనందించిన నాబోటివారికి సైతం నిన్నటి ప్రసంగం బాధ కలిగించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌పైన దారుణంగా దాడి చేసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామంటూ చారిత్రక ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ వరుస రాజీనామాలు చేశారు. ఈ కారణంగా యూపీఏ సర్కార్ వెనుకంజ వేసి నప్పుడు ఉద్యమాన్ని కొనసాగించడంలో కేసీఆర్‌కు కోదండరామ్, ఇతర ఉద్యమ కారులూ ఏ విధంగా దోహదం చేశారో సన్నిహితంగా గమనించిన వారికి కేసీఆర్ మాటల తూటాలలోని అన్యాయం, అసత్యం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ మలి ఉద్యమంలో కేసీఆర్‌ది అత్యంత, అనితర సాధ్యమైన పాత్ర అనడంలో రవ్వంత సందేహం లేదు. కానీ ఆయనది ఏకైక పాత్ర అంటే అంగీకరించడం అసాధ్యం. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాన్ని జయప్రదం చేశారు. 1952 నుంచే ఎన్నోరకాల ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా ప్రజల హృదయాలలో నాటాయి. ఆ ఉద్యమాల స్ఫూర్తిని కేసీఆర్ అందుకొని జైత్రయాత్ర సాగించారు. కోదండరామ్ భుజం కలిపారు. అందుకే కోదండరామ్ చేసింది ‘తొక్క’ అంటూ కేసీఆర్ తూష్ణీభావం ప్రదర్శించడం సమంజసం అనిపించలేదు. ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో గతంలో నాయకులు చేసిన ప్రసంగాలు టేపులలో ఉంటాయి. కర్నూలు నాయకుడు టీజీ వెంకటేశ్‌ను సంబోధిస్తూ కోదండరామ్ గుణగణాలను ప్రస్తుతిస్తూ గతంలో కేసీఆర్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చివరి ఘట్టంలోనే కేసీఆర్, కోదండరామ్‌ల మధ్య విభేదాలు పొడసూపిన సంగతి తెలుసు. అందుకు కారణాలు ఏమిటో ఇద్దరూ బహిరంగంగా ఎన్నడూ వివరించలేదు. కానీ శుక్రవారంనాడు కేసీఆర్ వెల్లడించారు. ఎంతోకాలంగా కడుపులో దాచుకున్న ఆగ్ర హావేశాలను కేసీఆర్ బయటపెట్టినట్టున్నారు. తెరాస అధికారంలోకి రావడం కోదం డరామ్కి ఇష్టం లేదని కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం లేదు. ఇష్టం లేక పోవడం నేరం కాదు. తెరాసను ప్రత్యక్షంగా వ్యతిరేకించిన వారూ, పరోక్షంగా వ్యతి రేకించినవారూ అనేకమంది. అది వారి ప్రజాస్వామిక హక్కు. ప్రతిపక్షాలపైన దాడి చేసే హక్కు అధికారపక్ష నాయకులకు ఉన్నప్పుడు అధికారంపక్షంపైన దాడి చేసే హక్కు ప్రతిపక్షాలకూ ఉంటుంది. ప్రతిపక్షాల తీరు అయితే, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సకారాత్మకంగా ఉన్నదా లేదా అనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనీ, కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ప్రధాన విమర్శ. ముఖ్యంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ పేరు ముఖ్య మంత్రి రెండు సార్లు ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్ల ప్రతిపాదనలలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పవచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా మెరుగైన ప్రణాళికలు ఉన్నా ప్రజలకు వివరించవచ్చు. నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు. నిర్మాణంలో అవతవకలు జరిగినా, అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు పోవచ్చు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి అవినీతికి సంబంధించినవే. సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు ఎన్టీఆర్, విజయభాస్కర రెడ్డి, జనార్దనరెడ్డి ప్రభుత్వాలపైన వ్యాజ్యాలు నడిపింది అవినీతి ఆరోపణలపైనే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేసినా, న్యాయ స్థానాలను ఆశ్రయించినా అధికారపక్షం పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపైనే కానీ ప్రాజెక్టులు నిలిపివేయాలని కాదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ప్రజలకు అత్యంత హానికరమని భావించిన అంశాలనే ఎజెండాలో చేర్చాలి. గాంధీ చంపారన్ ఉద్యమంపైన కొన్ని మాసాలు ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఉప్పు సత్యాగ్రహానికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? వలస ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను అదే పనిగా వ్యతిరేకిస్తూ, వ్యాఖ్యానిస్తూ పోలేదు ఆయన. సంకేతప్రాయంగా, సందేశాత్మకంగా ఉండే సమస్య లపైన దృష్టి పెట్టడం ద్వారా స్వాతంత్య్ర సమరం సాగించారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలన్న నిర్ణయంపైన ఉద్యమం నిర్మించవచ్చు. వాక్ స్వాతం త్య్రాన్ని హరిస్తున్నారంటూ, రాజ్యాంగ ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నా రంటూ ఉద్యమం చేయవచ్చు. వ్యవసాయదారుల సంఘాల నియామకాన్ని వ్యతిరే కించకుండా పంచాయతీరాజ్ సంస్థలను నిధులూ, విధులూ లేకుండా నిర్వీర్యం చేస్తున్నారంటూ ధర్మాగ్రహం ప్రదర్శించవచ్చు. యాక్టివిస్టా, రాజకీయవాదా? కోదండరామ్‌లో కూడా సందిగ్ధం స్పష్టంగా కనిపిస్తున్నది. టీజాక్ నాయకుడుగా, హక్కుల కార్యకర్తగానే ఉంటారో, రాజకీయాలలోకి ప్రవేశిస్తారో తేల్చుకోవాలి. రాజ కీయాలలో దిగాలనుకుంటే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇతర ప్రతి పక్షాలతో పొత్తు పెట్టుకోవచ్చు. లేదా ఏదో ఒక పక్షంలో చేరవచ్చు. సర్పంచ్‌గా ఎన్నిక కాకపోయినా పర్వాలేదు. రాజకీయం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయనను రాజకీయ నాయకుడు కారని అనగలమా? ప్రజల మేలుకోసం ఏదైనా ప్రతిపాదన చేసి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, దాని ఆమోదం కోసం ఒత్తిడి తేవడం యాక్టివిస్టు పని. అధికారపార్టీని ఓడించమని కానీ ప్రభుత్వాన్ని తొలగించమని కానీ యాక్టి విస్టులు ప్రజలను కోరరు. ప్రభుత్వం మెడలు వంచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు లేదా పిలుపునిస్తారు. (పిలుపు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి మాత్రమే ఉంటాయని అనడం సమర్థనీయం కాదు. ఆ అధికారం ప్రతివారికీ ఉంటుంది. పిలుపును ఆలకించడం, ఆలకించకపోవడం అనేది ప్రజల ఇష్టం. ఉద్య మకాలంలో కేసీఆర్ అనేక సందర్భాలలో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు సమధికోత్సాహంతో స్పందించారు. అందుకే ఉద్యమం జయప్రదం అయింది. పిలుపు ఇచ్చే అధికారం కేసీఆర్‌కి లేదని ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రీ అనలేదు). అరుణారాయ్ సమాచార హక్కుకోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేశారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను సాధించారే కానీ ప్రభుత్వాన్ని పడ గొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం సాగిన ఉద్యమం విజయం సాధించిన తీరు కూడా యాక్టివిజానికి ఉదాహరణే. అలాగే లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించమంటూ ప్రబోధించలేదు. డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ్ లోక్‌సత్తా సంస్థను హక్కుల సాధన వేదికగా నడిపి నంత కాలం ప్రభుత్వాలను దించాలని కానీ అధికార పార్టీని ఓడించాలని కానీ చెప్పలేదు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని అనిపించినప్పుడు లోక్సత్తాని రాజకీయ పార్టీగా మార్చారు. తన రాజకీయాలకు ప్రజల ఆమోదం లభించడం లేదని గ్రహించిన తర్వాత రాజకీయ పార్టీని రద్దు చేసి తిరిగి హక్కుల సంస్థగా మార్చి సుపరిపాలనకోసం ఉద్యమం చేస్తున్నారు. కోదండరామ్ సైతం ప్రత్యక్ష రాజ కీయాలలో ప్రవేశించాలని భావిస్తే అందులో తప్పేమీ లేదు. ఆ పని చేయకుండా తెరాస అనుబంధ సంస్థకు ఓటు చేస్తే సింగరేణి నాశనం అవుతుందని ప్రకటించడం సమర్థనీయం కాదు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తుందనే ఆరోపణ సైతం ఆక్షేపణీయమే. పొరుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వానికి ఉన్న ప్రైవేటైజేషన్ వ్యామోహం తెలంగాణ సర్కార్‌కు లేదు. ప్రజా జీవి తంలో తన ప్రయాణాన్ని సమీక్షించుకోవలసిన అవసరం కోదండరామ్‌కి ఉన్నది. కాంగ్రెస్ నాయకుడు దయాకర్ రాజకీయవాది కనుక కేసీఆర్‌పైన ఎదురుదాడి చేసినా ఎవ్వరూ ఆ„ó పించలేదు. ఎవరి మాటలో ఎంత ప్రామాణికత ఉన్నదో, ఎంత నిజం ఉన్నదో, ఎవరి విశ్వసనీయత ఏ పాటిదో ప్రజలు తేల్చుకుంటారు. అంతి మంగా ప్రజలే ప్రభువులు. పరుష పదజాలం ప్రయోగించినందుకు కేసీఆర్ ఒక్కరినే నిందించనక్కర లేదు. అందరూ కఠినంగానే మాట్లాడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శైలి కారణం కావచ్చు. అంత కాఠిన్యం అవసరమా? అధికార, ప్రతిపక్షాల మధ్య విభే దాలు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగు రాష్ట్రాలలో అధికం. రాజకీయ వాతావర ణాన్ని సామరస్యంగా, నిర్మాణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్మించడంలో ముఖ్య మంత్రి పాత్ర అద్వితీయమైనది. నిందాత్మక రాజకీయాలకు స్వస్తి చెప్పి సామరస్య పూరిత రాజకీయాలకు శ్రీకారం చుడితే ముఖ్యమంత్రికి ప్రజాదరణ మరింత పెరుగుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్‌లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్‌ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్‌తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్‌ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్‌లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్‌ముఖ్‌లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్‌ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్‌టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్‌లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్‌ముఖ్‌ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్‌ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్‌ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్‌లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్‌లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్‌ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్‌ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్‌వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్‌ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్‌ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
‘చంపారన్’ ఓ చుక్కాని..!
త్రికాలమ్ చర్విత చర్వణమే అయినా కొన్ని విషయాలు పదేపదే ప్రస్తావించవలసి వస్తుంది. జనాభాలో అధిక సంఖ్యాకుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సమస్య ఏళ్ళూపూళ్ళూ గడిచినా పరిష్కారానికి నోచుకోకపోతే అదే సమస్యను పాలకుల దృష్టికి మళ్ళీమళ్ళీ తీసుకురాక తప్పదు. రైతు ఆత్మహత్య వార్త లేకుండా ఒక్క రోజైనా గడవదంటే అతిశయోక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల బలవన్మరణాలకు సంబంధించిన వార్తలు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. శనివారం తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 1998 నుంచి సాగుతున్న ఈ బలవన్మరణ పరంపరను నిలువరించడానికి గట్టి ప్రయత్నం ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. ఎంత మంది ఎన్ని విజ్ఞప్తులు చేసినా పార్లమెంటులో కానీ చట్టసభలలో కానీ ఈ సమస్యను చర్చించి పరిష్కరించే కృషి జరగలేదు. అఖిలపక్ష సమావేశం జరగలేదు. వ్యవసాయదారుల ప్రతినిధులతో, శాస్త్రవేత్తలతో, సామాజిక సేవకులతో ప్రభుత్వాలు సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని చర్చకు పెట్టి అభిప్రాయాలు సేకరించలేదు. రైతు మరణ వార్తలు క్రమం తప్పకుండా రావడంతో సమాజంపైన వాటి ప్రభావం తగ్గిపోతోంది. మీడియా సైతం కలత చెందడం, ఆవేదన వెలిబుచ్చడం తగ్గుతూ వచ్చింది. విపణి ఆధారిత ఆర్థిక విధానాలను విశ్వసించే పత్రికలూ, టీవీ చానళ్ళూ రైతుల మరణాలకు సంబంధించిన వార్తలను ముట్టుకోవడం లేదు. ఓటు బ్యాంక్‌గా పరిగణించినా సరే... అయినా సరే, రైతును విస్మరించడానికి వీలు లేదు. జనాభాలో దాదాపు 60 శాతం ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఓటు బ్యాంకుగా చూసినా అది చాలా విలువైనది. ఈ సంగతి పాలకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2014లో కేంద్ర అధికార పీఠం అధిష్ఠించిన ఎన్డీఏ కానీ తెలంగాణలోని పాలకపక్షం టీఆర్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తున్న తెలుగుదేశం–బీజేపీ కూటమి కానీ రైతు సంక్షేమం కోసం ఏయే చర్యలు తీసుకున్నదీ ఏకరవు పెడుతున్నాయి. ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే కావచ్చు. ఫలితం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభం కారణంగా కాదనీ, ఇతర కారణాల వల్ల అనీ మనల్ని మనం మభ్యపెట్టుకోవడం ఆత్మవంచన. ఇతరులను దబాయించడం పరవంచన. గజం మిథ్య, పలాయనం మిథ్య అనేది వాదనకు నిలబడదు. సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం, సమస్య పరిష్కారమయ్యే వరకూ కృషిని కొనసాగించడం ఒక్కటే మార్గం. 1998 నుంచి ఇప్పటి వరకూ దేశంలోనూ, రాష్ట్రాలలోనూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంతకాలం అధికారంలో ఉన్నాయి. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలూ ప్రభుత్వాలు నిర్వహించాయి. కానీ ఎవరూ ఆయన సూచనలను అమలు చేయడానికి ప్రయత్నించలేదు. రైతులను ఆదుకోవడం కోసం రైతు సమన్వయ సమితుల (ఆర్ఎస్ఎస్)ను ఏర్పాటు చేస్తున్నామనీ, వాటికి చట్ట హోదా కల్పించే ఆలోచన కూడా ఉన్నదనీ తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నది. ఆర్ఎస్ఎస్లను తక్షణం ఏర్పాటు చేయాలని మంత్రులకూ, ఎంఎల్‌ఏలకూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సంస్థలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదనీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కమిటీలలో టీడీపీ కార్యకర్తలను నియమించి సకల సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాలు వారి సూచనల మేరకే చేస్తున్నట్టు తెలంగాణలో కూడా చేద్దామని కేసీఆర్ చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుల విమర్శ. పోటీగా రైతు రక్షణ సమితులను నియమిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇదంతా ఉపరితల రాజకీయ విన్యాసమే కానీ అసలు సమస్యను పరిష్కరించే కసరత్తు కాదు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ చరిత్రనూ, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన చంపారన్ ఉద్యమాన్ని అధ్యయనం చేస్తే ఇప్పుడు కర్తవ్యం ఏమిటో వారికి బోధపడుతుంది. నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గత మూడేళ్ళుగా విస్మృతిపథంలో పడిపోయారు. కొత్త తరాలకు నెహ్రూ అంటే తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. గాంధీకి సైతం అదే దుస్థితి పట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీని కానీ, బీజేపీ భావజాలాన్ని కానీ నిందించి ప్రయోజనం లేదు. గాంధీ, నెహ్రూల ప్రాసంగికత తగ్గిపోవడానికి ప్రధాన కారకులు ఈ తరం కాంగ్రెస్ నాయకులే. వారికే గాంధీ జీవితం తెలియదు. నెహ్రూ చరిత్ర తెలియదు. గాంధీ, నెహ్రూలను విస్మరించిన కాంగ్రెస్‌కు నిష్కృతి ఏముంటుంది? ఈ ఇద్దరూ శిఖర సమానులైన నాయకులు కనుక వారిని గుర్తు పెట్టుకోవాలని చెప్పడం లేదు. నేటి సమస్యలకు పరిష్కారాలు వారి ఆచరణలో కనిపిస్తాయి. రైతుల జీవితాలలో వెలుగు నింపడం ఎట్లాగో, కనీసం చీకటిని తొలగించడం లేదా తగ్గించడం ఎట్లాగో తెలుసుకోవాలంటే గాంధీజీ 1916–17లో నిర్వహించిన చంపారన్ ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి. ఇది చంపారన్ శతవార్షికోత్సవ సందర్భం. సరిగ్గా వందేళ్ళ కిందట గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఫలి తంగా చంపారన్ నీలిమందు రైతులకు ఊరట లభించింది. ఈ తరం యువతకు చంపారన్ ఉద్యమాన్ని పరిచయం చేసేందుకు శాసనసభ మాజీ సభ్యుడు పి. జనార్దనరెడ్డి చొరవతో చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. దానిని ఆగస్టు 15 ఆవిష్కరించారు. చంపారన్ ఉద్యమం గురించి గాంధీ, ఆచార్య కృపలానీ, ఇర్ఫాన్ హబీబ్, గాంధీ మనుమడు తుషార్గాంధీల రచనలను సేకరించి గౌరవ్ చేత అనువదింపజేశారు. స్వదేశంలో గాంధీ తొలి ఉద్యమం దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ తలపెట్టిన మొదటి పెద్ద ఉద్యమం చంపారన్ పోరాటం. ఇది రష్యా విప్లవం కంటే ముందు జరిగింది. 1916లో లక్నోలో ఏఐసీసీ సభలు జరుగుతున్న సమయంలో బిహార్ నుంచి రైతు నాయకుడు రాజ్‌కుమార్ శుక్లా గాంధీని కలుసుకొని తమ ప్రాంతంలో నీలిమందు రైతుల దుస్థితిని పరిశీలించవలసిందిగా కోరాడు. అతని కోరిక మన్నించి చంపారన్ వెళ్ళిన గాంధీ రైతుల పరిస్థితిని అధ్యయనం చేశాడు. నీలిమందును వస్త్రాల తయారీలో, అద్దకంలో ఉపయోగిస్తారు. యూరప్‌లో దీనికి గిరాకీ ఎక్కువ. బెంగాల్ బ్రిటిష్‌వారి అధీనంలోకి రాగానే నీలిమందు పండించాలని రైతులపైన ఒత్తిడి తెచ్చారు. ఇది బిహార్‌కు పాకింది. రైతుల నుంచి నీలిమందును కారు చౌకగా కొని విదేశాలకు ఎగుమతి చేసేవారు తెల్లదొరలు. కానీ 1880లో జర్మనీలో సింథటిక్ అద్దకం వృద్ధి కావడంతో నీలిమందు గిరాకీ పడిపోయింది. యజమానుల ఆదాయం తగ్గింది. రైతుల మీద సుంకాలూ, జరిమానాలూ పెంచారు. తెల్లవారు నేరుగా రైతులను హింసించకుండా జమీందారీల ద్వారా, వారు నియమించిన టేకేదార్ల ద్వారా పీడించేవారు. నీలిమందు నేల సారాన్ని పూర్తిగా పీల్చి పిప్పిచేస్తుంది. కానీ మొత్తం ఇరవై భాగాలలో మూడు భాగాలు విధిగా నీలిమందు సేద్యానికి కేటాయించాలని నిర్దేశించే ‘తీన్‌కఠియా రివాజు’ను ప్రభుత్వం రుద్దింది. ఈ నిబంధన దాదాపు వందేళ్ళుగా అమలులో ఉంది. తవాన్ పేరుతో పరిహారం వసూలు చేసేవాళ్ళు. జిరాత్ పేరుతో అధిక మొత్తంలో సుంకం విధించేవాళ్ళు. అబ్వాక్ పేరుతో అక్రమ జరిమానాలు వసూలు చేసేవారు. బిగార్ పేర రైతుల ఎడ్లనూ, వ్యవసాయ పనిముట్లనూ అప్పనంగా వినియోగించుకునేవారు. ఈ దుస్థితిపైన దాదాభాయ్ నౌరోజీ, ఆర్సి దత్‌లు పుస్తకాలు రాశారు. నీలిమందు రైతుల సమస్య పరిష్కారం అయ్యేవరకూ గాంధీ మరో పని తలపెట్టలేదు. ఆయన సమాచారం సేకరిస్తున్నానంటూ రైతుల మధ్య ఉన్నారు. తనతో పాటు అనేకమంది వలంటీర్లను రంగంలోకి దిం పారు. అనేకమంది న్యాయవాదులు ఆయనకు అనుచరులుగా మారారు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ కార్యక్రమాలు కానీ గాంధీ చేయలేదు. రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరించారు. మొత్తం 8,000 మంది నీలిమందు రైతులు తమ ఫిర్యాదులను గాంధీకి అందజేశారు. గాంధీ ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. రైతులు గాంధీ నాయకత్వంలో సంఘటితం అవుతున్నారనే అనుమానం తెల్లదొరలకు కలిగింది. జిల్లా వదిలి వెళ్ళిపోవాలని 1917 ఏప్రిల్ 16న జిల్లా అధికారి గాంధీని ఆదేశించారు. 18న జిల్లా న్యాయాధికారి ఎదుట నిందితుడుగా నిలబడిన గాంధీ ధిక్కార స్వరం వినిపించారు. తాను వచ్చిన పని పూర్తి చేయకుండా చంపారన్ వదిలి వెళ్ళేది లేదని ప్రస్ఫుటంగా చెప్పారు. దిగివచ్చిన సర్కార్ ప్రభుత్వం నీలిమందు రైతుల సమస్యను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని నియమించింది. ఇందులో గాంధీకి సభ్యత్వం ఇచ్చింది. రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాలనూ, అమానవీయమైన వేధింపులనూ వివరించే సమాచారాన్ని గాంధీ అప్పటికే సేకరించారు. ఆ సమస్త సమాచారాన్ని కమిటీ ఎదుట సమర్పించారు. ప్రభుత్వ ఉన్నతాధికారి డబ్లు్య మౌడీతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించలేదు. తాను చట్టాన్ని గౌరవిస్తున్నాననీ, నీలిమందు రైతులకు సాయపడటానికే వారి నుంచి సమాచారం సేకరిస్తున్నాననీ గాంధీ వివరించారు. ప్రభుత్వమే దిగి వచ్చింది. గాంధీకి తోడ్పడవలసిందిగా అధికారులను ఉన్నతాధికారి ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న జమీందారులు మొదట రైతులను బెదిరించారు. తర్వాత రాజీ కోసం ప్రయత్నించారు. గాంధీ సత్యాగ్రహం విరమించలేదు. రాజీకి అంగీకరించలేదు. 1917 జూన్ 5న రాంచీలో బిహార్–ఒడిశా గవర్నర్ ఎ గెయిట్‌తో గాంధీ చర్చలు జరిపాడు. అక్టోబర్ 3న తీన్‌కఠియా నిబంధనను రద్దు చేశారు. అబuŠ‡వాత్ పేరుతో వసూలు చేస్తున్న వడ్డీలు చట్ట విరుద్ధమని నిర్ధారించారు. టేకేదార్ల వ్యవస్థను నిర్మూలించారు. పంటపైన హక్కులు జమీందార్లకు కాకుండా రైతులకే ఉంటాయని అన్నారు. ఈ విజయాలన్నీ దేశంలో నిర్వహించిన తొలి అహింసాత్మక ఉద్యమం ఫలితాలు. రెండు అంశాలు గమనించాలి. ఒకటి, చంపారన్పైన గాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకనలు చేయలేదు. పత్రికలకు ఎక్కలేదు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టలేదు. ఒకటే సమస్యపైన దృష్టి పెట్టారు. అది పరిష్కారమయ్యే వరకూ అక్కడే దాన్ని పట్టుకునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ స్పందిస్తున్న కాంగ్రెస్ నాయకులు చంపారన్ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఏదో ఒక సమస్యపైన దృష్టి కేంద్రీకరించి అది పరిష్కారమయ్యేవరకూ కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయి. చంపారన్ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి. ఆ తర్వాతనే సర్దార్ పటేల్ బర్దోలీ రైతాంగ పోరాటం చేశారు. అనంతరం మాప్లా ముస్లిం రైతుల తిరుగుబాటు, మద్రాసు ప్రెసిడెన్సీ రైతు ఉద్యమం, చీరాల–పేరాల ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకూ కొమ్మారెడ్డి సూర్యనారాయణ, తలసాని వాసుదేవరావుల ఆధ్వర్యంలో ఆంధ్ర రైతాంగ యాత్ర జరిగాయి. చివరికి స్వాతంత్య్ర సమరంలో రైతుల భాగస్వాములు కావడానికి కూడా చంపారన్ తిరుగుబాటే కారణం. కాంగ్రెస్‌వారు కానీ మరో పార్టీ వారు కానీ చంపారన్ బాటలో నేటి రైతుల సమస్యను అధ్యయనం చేస్తే పరిష్కారం లభించవచ్చు. కె. రామచంద్రమూర్తి -
పాత్రికేయంపై పంజా
సందర్భం తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ దాపురించారు. ‘సామాజిక మాధ్యమాలలో మీరు వెల్లడిస్తున్న అభిప్రాయాల విషయంలో అంత తొందరపాటు వద్దు. కొంచెం ఆలోచించండి. మనం ఉన్న కాలం అంత క్షేమకరమైనది కాదు...’ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బెంగళూరులో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు ఒక మిత్రుడు ఈ సలహా ఇచ్చాడు. ఒక ఘటన గురించి విన్న తరువాత మరుక్షణం మనలో కలిగే స్పందననే మనం ఇతరులతో పంచుకోవాలి అంటూ అందుకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇదంతా జరిగి వారం కూడా గడవలేదు. ఇంతలోనే ఆమె హత్య వార్త దేశాన్ని కుదిపివేసింది. నిన్న మొన్న జరిగిన గోరక్షకుల దాడుల గురించి, తాజాగా గోరఖ్‌పూర్ శిశు మరణాలపైన తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వరకూ మిత, మతవాద రాజకీయాల మీద గౌరి నిరంతరాయంగా ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఆమె తన గురించి తనే పేర్కొన్నట్టు ఎంత వేగంగా స్పందిస్తారంటే, ప్రస్తుతం కేంద్రం, సుప్రీంకోర్టు నడుమ ఉన్న రొహింగ్యా శరణార్థుల పునరావాసం గురించి కూడా సామాజిక మాధ్యమాలలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో పాటు నక్సలైట్ ఉద్యమంలోని వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి రప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నడ వారపత్రిక ‘గౌరి లంకేశ్ పత్రికె’కు గౌరి సంపాదకురాలు. తండ్రి నుంచి ఆ పత్రికతో పాటు, ఆయన భావాలు కూడా ఆమెకు వారసత్వంగా వచ్చాయి. ఇద్దరూ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పత్రికను ఆయుధంగా చేసుకున్నవారే. రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన సాహసోపేతురాలైన జర్నలిస్టుకు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారంనాడు అంత్యక్రియలు జరగడం విడ్డూరం. గౌరి గత కొంతకాలంలో ‘హిందూత్వ’రాజకీయాలకు వ్యతిరేకంగా కలం ఝళిపిస్తున్నవారే. టీవీ చానళ్ళు నిర్వహించే చర్చలలో రాజీలేని వాదన వినిపిస్తున్నవారే. దీనితో ఆమెకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు తప్పలేదు. కానీ తనకు ఉన్న ప్రాణహాని గురించి ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. గౌరి ప్రచురించిన ఒక నివేదిక మీద బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి పరువునష్టం దావా వేశారు. అందులో గౌరిని కోర్టు దోషిగా తేల్చింది కూడా. ఆరు మాసాల శిక్ష విధించింది. ఆమె అప్పీలుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇంత జరిగినా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె ఫేస్బుక్ పేజీ తెరిస్తే రోహిత్ వేముల ఫొటో, ట్వీటర్ హెడర్ స్థానంలో కన్హయ్య కుమార్ ఫొటో కనిపిస్తాయి. కన్హయ్యను తన పెంపుడు కొడుకని సంబోధించేవారు. ఇవన్నీ సరే, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతినిధులుగా చెప్పుకోదగిన దబోల్కర్, పన్సారే, కల్బుర్గీలను హత్య చేసిన వారి ఆచూకీ ఈనాటికి కూడా తెలియడం లేదు. ఇప్పుడు గౌరి హత్య దర్యాప్తు విషయంలో అయినా ప్రభుత్వాలు స్పందన ఎలా ఉండబోతున్నదన్నదే అంతా ఎదురుచూస్తున్న అంశం. లౌకికవాదం కోసం, ప్రజాస్వామ్యం కోసం, దళితుల హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం గొంతెత్తే వారి అవసరం ఎప్పటికీ ఉంటుంది. దానిని గుర్తించి నట్టయితే ప్రభుత్వాలు గౌరి హంతకులను తక్షణం అరెస్టు చేయడానికి పాటు పడ తాయి. అప్పుడే ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది. నత్తనడకలో దర్యాప్తులు గౌరీ లంకేశ్ హత్యపై దర్యాప్తు జరిపి, వాస్తవాలు వెలికి తీయడానికి ప్రత్యేక బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్–సిట్) ఏర్పాటు చేస్తామనీ, పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఒకరు ఈ బృందానికి నాయకత్వం వహిస్తారనీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం బెంగళూరులో విలేకరులకి చెప్పారు. కానీ గౌరి దారుణ హత్యతో నిర్ఘాంతపోయిన దేశానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ సాంత్వన కలిగించదు. ఎందుకంటే 2013 నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన హత్యలపైన విచారణ నత్తనడక నడుస్తున్నది. దబోల్కర్, పన్సారీల హంతకులను పట్టుకోవడంలో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైతే కల్బుర్గీని హత్య చేసినవారి ఆచూకీని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. దేశంలో ఐటీ రాజధానిగా, కాస్మోపాలిటన్ సంస్కృతి కలిగిన నగరంగా బెంగళూరుకు మంచే పేరే ఉంది. ఈమధ్య నేరాల సంఖ్య పెరిగిపోయి నేర రాజధానిగా మారుతోంది. ఒకరిని హతమార్చాలని గట్టి పట్టుదలతో ప్రయత్నించే హంతకుల నుంచి పౌరులను రక్షించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ హత్య జరిగిన తర్వాత సంవత్సరాలు గడిచినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలకపోవడం, హంతకులను పట్టుకోలేకపోవడం వల్ల చట్టం పట్ల భయం తగ్గిపోతుంది. నేరం చేసినవారికి శిక్ష పడకపోతే నేరాలు పెరుగుతాయి. కర్ణాటక పోలీసుల దర్యాప్తు పట్ల విశ్వాసం లేకనే తన సోదరి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ గౌరీ సోదరుడు కోరాడు. దేశవ్యాప్తంగా నిరసనలు గౌరి హత్యోదంతంతో బెంగళూరులోనే కాకుండా చెన్నై, హైదరాబాద్ నగరాలలోనూ, దేశవ్యాప్తంగా మరెన్నో నగరాలనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దుర్ఘటనపై నివేదిక పంపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హంతకులను వెంటనే పట్టుకునేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన నేరం. నిబద్ధత కలిగిన వారంతా ఈ దారుణాన్ని ఖండించాలి. ఈ నలుగురి హత్యల విషయంలోనూ ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఆగంతుకులు ఒకే విధంగా ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు బృందాలుగా వచ్చారు. అతి సమీపం నుంచి పలుమార్లు కాల్పులు జరిపారు. ఒకే పద్ధతిలో నాలుగు హత్యలూ జరిగాయి. ‘సాధన’ పత్రిక సంపాదకుడు నరేంద్ర దబోల్కర్‌ను ఆగస్టు 20, 2013న కాల్చి చంపారు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుంచి నాలుగుసార్లు కాల్పులు జరిపారు. తరువాత దబోల్కర్ మిత్రుడు, హేతువాది గోవింద్ పన్సారేను హత్య చేశారు. దబోల్కర్ హత్యపై దర్యాప్తును త్వరగా ముగించి, హంతకులను పట్టుకోవలసిందని పన్సారే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 17వ శతాబ్దానికి చెందిన మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ గురించి ‘శివాజీ ఎవరు?’ పేరుతో పన్సారే ఒక పుస్తకం రాశారు. శివాజీ బలమైన లౌకికభావాలు కలిగినవాడని నిరూపించే ప్రయత్నం చేశారు. కొల్హా పూర్లో ఫిబ్రవరి 20, 2015న ద్విచక్ర వాహనం మీదే వచ్చిన దుండగులు పన్సారేను హత్య చేశారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా 2015లో వచ్చిన చట్టం ఆయన కృషి ఫలితమే. హంపీ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్చాన్సలర్, హేతువాది, ప్రముఖ కన్నడ భాషా రచయిత మల్లేశప్ప ముదివాలప్ప కల్బుర్గీ హత్య ఆగస్టు 30, 2015న ధార్వాడ్‌లో జరిగింది. అప్పుడు కూడా ద్విచక్ర వాహనం మీద వచ్చిన వారే ఆ దురాగతానికి పాల్పడ్డారు. ‘ది రిపబ్లిక్ ఆఫ్ రీజన్: వర్డ్స్ దే కుడ్నాట్ కిల్’ అనే గ్రంథాన్ని కల్బుర్గీ రచించారు. ఈ ముగ్గురి మాదిరిగానే ఆలోచించే నాలుగో వ్యక్తి గౌరీ లంకేశ్, ఆమెను కూడా అదే పద్ధతిలో హతమార్చారు. ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దబోల్కర్, పన్సారేల హత్యలు ఒకే తీరులో, పెద్ద ప్రణాళికతో జరిగినవేనని బొంబాయి హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ‘ఇవి అనూహ్యంగా, చెదురుమదురుగా జరిగిపోయిన ఘటనలు కావని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థల ధనసాయం, మద్దతు కచ్చితంగా వీటి వెనుక ఉండి ఉండాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామిక, లౌకిక, ఉదారవాద భావాలతో భారతదేశం మనుగడ సాగించాలంటే, దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించాలంటే ఇలాంటి ఉన్మాదాన్ని వెంటనే నిలువరించాలి. భావప్రకటన స్వేచ్ఛ సమాజానికి ఆక్సిజన్ వంటిది. ప్రశ్నించే తత్త్వం ప్రజాస్వామ్యానికి ఊపిరి. ప్రజాస్వామ్య ద్రోహులు తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ ఇంగ్లీషు చానళ్ళలో దాపురించారు. జర్నలిజానికి ఇటువంటి జర్నలిస్టులు కూడా హాని చేస్తున్నారు. గావుకేకలు పెట్టడం, ఇతరులను మాట్లాడనీయకుండా తామే వాగడం, తర్జని ఊపుతూ ఒక పక్షానికి చెందిన రాజకీయవాదుల గురించి కటువుగా మాట్లాడం ఈ మధ్య జాతీయ చానళ్ళలో ఎక్కువయింది. సమాచార హక్కు చాలా విలువైనది. గౌరి హత్య అనంతరం జర్నలిస్టులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగాలు చేస్తే సరైన సమాచారం సమాజానికి అందదు. జర్నలిస్టులను రక్షించుకోవలసిన బాధ్యత సమాజానిదే. జర్నలిజంలో ఎన్ని లోపాలున్నప్పటికీ, ఎన్ని అవలక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజాస్వామ్యం మనుగడకు మీడియా క్రియాశీలకంగా పనిచేయాలి. తమ వాదనతో ఏకీభవించనివారిని హత్య చేసే భయంకరమైన ధోరణిని సమాజం తిరస్కరించాలి. ఎవరి విశ్వాసాలకు తగినట్టు వారు జీవించే స్వేచ్ఛ కావాలి. గౌరీ లంకేశ్ హత్య అనంతరం సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరి హత్య పట్ల ఆనందం వెలిబుచ్చుతూ తను పెట్టిన పోస్టింగులను ప్రధాని స్వయంగా చూస్తారని ఒక వ్యక్తి గొప్పలు చెప్పుకున్నారు. అంటే తన అభిప్రాయాలకు ప్రధాని ఆమోదం ఉన్నదని ధ్వనించే విధంగా పోస్టింగ్ పెట్టాడు. ప్రముఖ న్యాయవాది ప్రశాంతభూషణ్ను సుప్రీంకోర్టులోని ఆయన కార్యాలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించి నేలమీద పడవేసి కొట్టాడు. ఆ వ్యక్తిని బీజేపీ సోషల్ మీడియాకి అధిపతిగా నియమించిందని ప్రశాంత భూషణ్ బుధవారంనాడు వెల్లడించారు. ఇటువంటి చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ప్రశాంత భూషణ్‌పై దాడిని బీజేపీ ఆమోదించినట్టు అర్థం అవుతుంది. మొత్తంమీద దేశంలో అసహన వాతావరణం ప్రబలిందన్న మాట వాస్తవం. దీనికి కారణాలు ఏమిటో, కారకులు ఎవరో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామరస్యపూరితమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. అదే గౌరీ లంకేశ్ కోరుకున్న మార్పు. దాన్ని సాధించడానికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి. కె. రామచంద్రమూర్తి -
నంద్యాల దేనికి నాంది?
త్రికాలమ్ నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా అక్కడే మకాం ఉండి నిత్యం రోడ్‌షోలు నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం చేరుకున్నారు. రెండు శిబిరాలలో ఆఖరి పోరాటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం కారణంగా జరుగుతున్న ఉపఎన్నిక తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డికి మధ్య పోరాటంలా కనిపించడం లేదు. ఇది చంద్రబాబుకూ, జగన్మోహన్రెడ్డికీ మధ్య యుద్ధం. ప్రచారంలో ప్రస్తావనగా అప్పుడప్పుడు అభ్యర్థుల పేర్లు రావచ్చు కానీ ప్రధాన యోధులు వారిద్దరే. అమరావతిలో ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ కొన్ని రోజులుగా నంద్యాలలోనే విడిది చేసింది. మరో పాతికమంది అధికారపార్టీ శాసనసభ్యులూ అక్కడే తిష్ఠ వేశారు. జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తమ అభ్యర్థి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒక ఉప ఎన్నికలో ఇంతటి తీవ్రమైన పోటీ, స్పర్థ, ప్రచారం, ఆవేశం మునుపెన్నడూ కనీవినీ ఎరగం. చంద్రబాబు ఎన్టీ రామారావును గద్దె దింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి ఉపఎన్నిక ప్రకాశం జిల్లా దర్శిలో 1996లో జరి గింది. ఆ రోజుల్లోనే అక్కడ విపరీతంగా డబ్బు ఖర్చు చేశారు. కాంగ్రెస్ దీటైన పోటీ ఇవ్వలేదు. తొమ్మిదివేల ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా కొన్ని సందర్భాలలో విజయం వరించకపో వచ్చు. అదే సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉపఎన్నికలో నందమూరి లక్ష్మీపార్వతి టీడీపీ అభ్యర్థిపైన 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి అన్ని వేళలా అధికారం, డబ్బూ, దబాయింపూ పని చేయవని నిరూపించారు. 2001లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇండి పెండెంట్ అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీ అభ్యర్థి కె శ్రీని వాసరెడ్డిపైన 52,712 ఓట్ల భారీ మెజారిటీతో ఢంకా బజాయించారు. పదవిలో ఉన్నారు కనుక ప్రతిసారీ విజయం చంద్రబాబునే వరిస్తుందనే వాదనలో పసలేదు. గట్టి ప్రతిఘటన ఉన్న సందర్భాలలో ఓటమి తప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వాధికారాన్నీ, పోలీసు బలగాన్నీ, అర్థబలాన్నీ నిస్సం కోచంగా వినియోగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద నువ్వా–నేనా అన్నట్టు సాగుతున్న సమరంలో రెండు పక్షాలూ చావోరోవో తేల్చుకునేందుకు సిద్ధమై తలపడుతున్నాయి. అందుకే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. నంద్యాల ప్రత్యేకత నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి కేంద్రం. ఈ స్థానం నుంచి ఎన్నికైన ఇద్దరు వ్యక్తులు దేశానికి రాష్ట్రపతిగా (నీలం సంజీవరెడ్డి), ప్రధాని (పీవీ నరసింహారావు)గా సేవలందించారు. దేశంలోని మరే ఇతర లోక్‌సభ స్థానానికీ ఇటువంటి ప్రత్యేకత లేదు. ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికలలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలలో ఒక్కటంటే ఒక్కటే ప్రతిపక్షానికి దక్కింది. నంద్యాలలో జనతాపార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ నీలం సంజీవరెడ్డి నలభై వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. తక్కిన 41 స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నీలం ఏకగ్రీవంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైనారు. ఆ తర్వాత మూడు మాసాలకే నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కన్నుమూశారు. 1977 జూలై 21న సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికైనారు. 1969లో రాష్ట్రపతి ఎన్ని కలలో వివి గిరిని పోటీ చేయించి కాంగ్రెస్ అధికార అభ్యర్థి సంజీవరెడ్డిని ఓడించిన ఇందిరాగాంధీ 1977లో సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నికకు సహక రించడం విశేషం. 1967–69 మధ్య మొదటిసారి స్పీకర్‌గా పని చేసిన సంజీవ రెడ్డి అప్పట్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి లోక్‌సభకు ఎన్నికై నారు. నంద్యాలనుంచి సంజీవరెడ్డి తర్వాత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఎన్నికై ఇందిర మంత్రిమండలిలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఏడేళ్ళ అనంతరం నంద్యాలకు మరోసారి మహర్దశ పట్టింది. 1991 ఎన్నికలకు దూరంగా ఉండిన పీవీ తమిళనాట శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్య జరగడంతో మైనారిటీ ప్రభుత్వ సారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నిక కావలసి వచ్చింది. ఆనాటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి నంద్యాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి చేత రాజీనామా చేయించి పీవీని అక్కడ పోటీ చేయించారు. ప్రధాని స్థాయికి చేరిన ఒక తెలుగు ప్రముఖుడికి పోటీ పెట్టకూడదని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఫలితంగా పీవీ 5.8 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 1996లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీవీ నంద్యాల నుంచి తక్కువ మెజారిటీతోనూ, బరంపురం నుంచి ఎక్కువ ఆధి క్యంతోనూ గెలిచారు. బరంపురం స్థానం ఉంచుకొని నంద్యాలను వదులు కున్నారు. అధికారం అన్నివేళలా లాభించదు దర్శి నుంచి నంద్యాల వరకూ చంద్రబాబు ఎత్తుగడలూ, వ్యూహాలూ గమ నించినవారికి కొన్ని అంశాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒకటి, ఆయనకు సెంటిమెంట్లు లేవు. రెండు, రాజకీయ విలువలు కానీ నైతిక విలువలు కానీ ఆయనకు శిరోధార్యం కాదు. మూడు, ఎన్నికలలో గెలుపే ప్రధానం. విజయం సాధించే క్రమంలో ఏమి చేసినా చెల్లుతుందనే విశ్వాసం బలంగా ఉంది. నాలుగు, ప్రజలు అమాయకులనీ, ఎన్నికలలో మాట్లాడినవన్నీ చేసితీరాలని పట్టుపట్టరనీ, ఆటలో ఆరటిపండు అనుకు ంటారనీ అభిప్రాయం. ఈ విషయంలో ఆయన నమ్మకం ఇంతవరకూ వమ్ముకాలేదు. చంద్రబాబు రాజ కీయ వ్యక్తిత్వంలో ఇది ప్రధాన పార్శ్వం. ఒకటి చెప్పడం వేరొకటి చేయడం చాలామంది రాజకీయ నాయకులకు అలవాటు. చెప్పిన దానికి పూర్తి భిన్నంగా చేయడం, చేసిన దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడటం, దాన్ని సమ ర్థించుకోవడం బాబు ప్రత్యేకత . 1994లో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్య మంత్రిగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన ఎన్టీఆర్‌ను ఎట్లా గద్దె దించిందీ తెలుగు ప్రజలు జాగ్రత్తగా గమనించారు. పదవీచ్యుతి తర్వాత అల్లుడి గురించి ఆయన ఏమి మాట్లాడారో జగద్విదితం. యూట్యూబ్‌లోకి వెడితే లెక్కలేనన్ని క్లిప్పింగ్‌లు దొరుకుతాయి. రామారావు అస్తమయం అనం తరం కొన్ని మాసాలకు ఆయనను కీర్తించడం ప్రారంభించిన చం ద్రబాబు ఆయనను అధికారం లాగివేసిన ఉదంతాన్ని పిచ్చి ప్రజలు విస్మరించి ఉంటారని భావించారు. ఆ భావనకు అనుగుణంగానే 1996 లోక్‌సభ ఎన్ని కలలోనూ, 1999 అసెంబ్లీ పోరులోనూ విజయం కట్టబెట్టారు. గెలుపొందడా నికి కారణాలు వేరే ఉండవచ్చును. కానీ రామారావును దేవుడిని చేసి పూజిం చడం ద్వారా ఆగస్టు సంక్షోభం జ్ఞాపకాలను చెరిపివేశానని బాబు నమ్ము తున్నారు. ఇదే ప్రయోగం రాష్ట్ర విభజన సమయంలోనూ చేశారు. రాష్ట్రాన్ని విభజించమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. దమ్ముంటే విభజిం చాలని సోనియాగాంధీని సవాలు చేశారు. తాను లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం ఏర్ప డేది కాదని తెలంగాణలో, అన్యాయంగా, అశాస్త్రీయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడారు. ఈ ద్విపాత్రాభినయనాన్ని రెండుచోట్లా స్వీకరించి తన విధానాన్ని బలపర్చుతారని ఆయన భావించారు. అందుకే తెలంగాణలో కూడా పట్టు కొనసాగించాలని ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ శాసనసభ్యుడిని కొనుగోలు చేసే దుస్సాహసం చేశారు. కానీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని న గదుతో సహా టేపులలో ఇరికించి తాను ఆడియాలో దొరికిపోయారు. నీతినియమాల గురించి ఆలోచించడం లేదు. ఎక్కడ పోటీ జరిగితే తాను అక్కడ ఉండాలనీ, ఎట్లాగైనా గెలిచి తీరాలనే జూదరి స్వభావం. చంద్రబాబు అదృష్టం కొద్దీ ‘ఓటుకు కోట్లు’ కేసు ముందుకు సాగడం లేదు. తప్పు చేసినా ఏదో ఒక విధంగా తప్పుకునే చాకచక్యం ఉంది. మాట వేరు, బాట వేరు విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టి, అయిదు, పది సంవ త్సరాలు సరిపోదు పదిహేనేళ్ళు ఇచ్చి తీరాల్సిందేనంటూ వాదించిన చంద్ర బాబు ఇప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారిన శిల్పా మోహన్‌రెడ్డిని శనివారం ప్రచారంలో ధనదాహం ఉన్న స్వార్థపరుడుగా అభి వర్ణించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి అధ్యక్ష పదవి ఇస్తానన్న చంద్రబాబు మాజీ మంత్రి ఫారూఖ్ వైపు మొగ్గు చూపారు. నంద్యాల నియోజకవ ర్గంలో ముస్లింలు అధికంగా ఉన్నారు కనుక ఫారూఖ్ గుర్తుకొ చ్చారు. ఇదే ఫారుఖ్‌కు ఆయన 2014లో మొండిచేయి చూపారు. ఇప్పుడు ఏకంగా శాసనమండలి చైర్మన్ పదవి వాగ్దానం చేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామాలో ఏమి జరిగిందో ఫారూఖ్‌కి తెలుసు. ఎన్టీఆర్‌కు ఎసరుపెట్టడంలో సహకరించిన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉపముఖ్యమంత్రి పదవీ, బావమరిది హరికృష్ణకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ ఇవ్వజూపారు. ఒకరి తర్వాత ఒకరికి జెల్లకొట్టారు. నెల తిరగకుండానే రామారావు దగ్గరికి దగ్గుబాటి తిరిగి వెళ్ళిపోతే, హరికృష్ణ 1999లో సొంతపార్టీ పెట్టుకొని తిరుగుబాటు ప్రకటించారు. 1996 ఎన్నికలకు కొన్ని మాసాల ముందే రామారావు మరణించడంతో చంద్రబాబుకి పెద్ద అడ్డంకి తప్పిపోయింది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినా ఫారూఖ్ ప్రలోభాలకు లొంగిపోయారు. ఆయన వాస్తవిక దృష్టిలో ఆలోచించి ఉంటారు. ఇప్పుడు ఏమీ లేని స్థితి కంటే శాసనమండలి సభ్యత్వం కొంత మెరుగు. ఆ తర్వాత కౌన్సిల్ అధ్యక్ష పదవి బోనస్. రాకపోయినా పర్వాలేదని అనుకొని ఉంటారు. అన్నగారికి సహాయం చేసేందుకు చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని వెడితే మండలి సభ్వత్వానికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ మోహన్‌రెడ్డి షరతు విధించారు. ఈ ఆదర్శప్రాయమైన ఉదంతానికి ప్రచారం రాకుడా బాబు మీడియాను కట్టడి చేయగలిగారు. 21మంది వైఎస్ఆర్సీపీ శాస నసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించిన నీతిమాలిన చర్య ప్రస్తావన కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేస్తూనే తనకు వస్తు వ్యామోహం లేదనీ, చేతికి ఉంగరం, వాచీ కూడా ఉండదనీ చెబుతారు. అఖిలప్రియ చెప్పిన అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చినా ఎన్నికల తంత్రం ఇతర నేతలకు, మంత్రులకూ అప్పగించారు. భూమా కుటుంబానికి రాజకీయ శత్రు వైన గం గుల ప్రతాపరెడ్డికి అర్జంటుగా పచ్చకండువా కప్పారు. విద్యార్థులను సర్వేయర్ల రూపంలో పంపి ఓటర్లను బెదిరిస్తున్నారు. ఇన్ని పరస్పర విరుద్ధమైన అంశాలను సమన్వయం చేసుకోవడం చాకచక్యం కావచ్చును కానీ రాజనీతి మాత్రం కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలే కాదు. నంద్యాల ఎన్నికలో ఓటమి ఎదురైతే బాబు తన వైఖరిని సమీక్షించుకొని, తప్పు తెలుసుకొని, సవరించుకునే అవకాశం ఉంటుంది. గెలిచినట్లయితే తన వైఖరికి తిరుగులేదని భావించి అదే మార్గంలో ప్రయాణిస్తారు కాబోలు. 28వ తేదీన నంద్యాల ఓటర్ల తీర్పు ఎట్లా ఉండబోతోందనేదే ఉత్కంఠ కలిగించే అంశం. కె. రామచంద్రమూర్తి -
సాక్షి ప్రధాన కార్యాలయంలో జెండా పండుగ
హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రాంచంద్రమూర్తి జాతీయ జెండాను ఎగరవేసి, స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ రెడ్డి, సాక్షి మార్కెటింగ్ డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడు పదుల్లో ఏమి సాధించాం?
త్రికాలమ్ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశం సాధించింది ఏమిటి? స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం ప్రధానమైన విజయం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడు కోవడం, గడువు ప్రకారం ఎన్నికలు జరుపుకోవడం, శాంతియుతంగా ప్రభు త్వాలు మారిపోవడం మరో ఘనవిజయం. మూడో విజయం పేర్కొనాలంటే కష్టమే. దారిద్య్రం తగ్గింది. అక్షరాస్యత పెరిగింది. జీవన ప్రమాణాలు గణనీ యంగా పెరిగాయి. వైద్యవసతి పెరిగింది. కానీ ఈ రంగాలలో సాధించవలసిన లక్ష్యాలను సాధించలేకపోయామనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ లభించక 63మంది చిన్నారులు ప్రాణాలు వదలిన ఘటన మనం ఆరోగ్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నామో సూచిస్తున్నది. మనం చేసుకున్న చట్టాలనే మనం తుంగలో తొక్కడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే. సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. కానీ ప్రభుత్వాలు సమాచార కమి షనర్లను నియమించవు. సమాచారం అందించవు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశాం. కానీ ఫిరాయింపులను నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తాం. నంద్యాల ఎన్నికల ప్రచారం చూస్తే ఎన్నికలు జరుగుతున్న విధానం తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం మాత్రమే కాదు. అది జీవనవిధానం కావాలి. 1947 ఆగస్టు 14–15 అర్ధరాత్రి భారత పార్ల మెంటులో నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ స్పూర్తి క్రమంగా ఆవిరైపోతున్నదనే ఆవేదన వెన్నాడుతోంది. పాలనాధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన నేపథ్యంలో దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న గుబులు పట్టి పీడిస్తోంది. కాలక్రమేణా ఈ భయ సందేహాలు నిరాధారమైనవనీ, నిర్హేతు కమైనవనీ తేలవచ్చు. అదే జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అట్లా జరుగుతుందా, లేదా అన్నదే ఆలోచనాపరులను అనుక్షణం వేధిస్తున్న ప్రశ్న. స్వప్నం చెదురుతోందా? ‘ది ఐడియా ఆఫ్ ఇండియా’ (భారతస్వప్నం) చెదిరిపోతోందని కొందరి ఫిర్యాదు. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ కంటే సర్వమత సమానం, సహనం ప్రాతిపదికగా ఏర్పడిన ఇండియాకు నైతికంగా ఆధిక్యం ఉన్నదనే విశ్వాసం క్రమంగా సడలుతోంది. చివరికి ఇండియా కూడా పాకిస్తాన్ బాటలోనే ప్రయాణం చేస్తున్నదా? ఇదేనా ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం సాధించింది? దేశ విభజన సృష్టించిన అది పెద్ద వివాద హేతువు కశ్మీర్ సమస్య ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకపోగా కొరకరాని కొయ్యగా తయారై రావణకాష్టంగా రగులుతోంది. ట్రిపుల్ తలాక్, 370వ అధికరణ రద్దు వంటి ప్రతిపాదనలు ముందుకు రావడంతో మైనారిటీవర్గాలలో అభద్రతా భావం పెరుగుతోంది. లౌకికవాదం అనే పదమే హాస్యాస్పదమైనప్పుడు, నిందా త్మకమైనప్పుడు ఇంతకాలం పాటించిన, విశ్వసించిన విలువలు అగ్నిపరీక్ష ఎదు ర్కోవడం అనివార్యం. రెండు భావజాలాల మధ్య సంఘర్షణను ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ రెండు భావజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పతనం– బీజేపీ ఉత్థానం ఏకకాలంలో సంభవిస్తున్న పరిణామాలు. కాంగ్రెస్ బలహీనపడినప్పుడే బీజేపీ బలపడుతుంది. ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత మండల్, కమండల్ రాజకీయాల కార ణంగా, అడ్వానీ రథయాత్ర ఫలితంగా ఉత్తరాదిలో బీజేపీకి ఆదరణ గణ నీయంగా పెరిగింది. బీజేపీకి లోక్‌సభ ఎన్నికలలో గౌరవప్రదమైన సంఖ్యాబలం లభించాక బీజేపీ నాయకులలో ఉదారవాదిగా పేరు తెచ్చుకున్న వాజపేయి నాయకత్వంలో తొలి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి బీజేపీ– సంఘపరివార్ భావజాలాన్ని రాజకీయ, సామాజిక రంగాలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించలేదు. అందరినీ కలుపుకొని పోయే విధంగా పాలన సాగింది. ఒక విధంగా నెహ్రూ బాటలోనే నడించింది. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే, ఆయన ఆచరించిన విదేశాంగ విధానాలనే కొనసాగించారు. ఇజ్రేల్‌తో దౌత్యసంబంధాలు పెట్టుకున్నది కూడా పీవీ నరసింహారావు హయాం లోనే. కాంగ్రెస్ విధానాల నుంచి వాజపేయి ప్రభుత్వం దూరంగా పోయిందని, రాడికల్‌గా వ్యవహరించిందని నిరూపించే ఉదంతం ఒక్కటీ లేదు. అందువల్ల ఆయన హయాంలో భావజాలాల మధ్య ఘర్షణ జరగలేదు. మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన తర్వాతనే కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక సమరం ప్రారంభమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను ఆవిష్కరించాలనే సంకల్పాన్ని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించినప్పుడే భావసంఘర్షణ మొదలయింది. నెహ్రూ నుంచి వాజపేయి వరకూ వాజపేయి గద్దె దిగేవరకూ దేశం ఒక మార్గంలో పయనించింది. ప్రభుత్వ పగ్గాలను మోదీ స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ సంస్కృతికంటే భిన్నమైన సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ను ఎన్ని కలలో ఓడించడంతో సరిపెట్టుకోకుండా ఆ పార్టీకి కానీ, దాని దిగ్గజాలకు కానీ ప్రాసంగికత లేకుండా చేయాలన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాఠ్యాంశాలలో మార్పులు చేయడం. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సంవ త్సరాలు నిండిన సందర్భంగా మోదీ నెహ్రూ పేరు ప్రస్తావించకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంలో నెహ్రూ ప్రసక్తి ఒకటికి రెండు సార్లు రావడం గమనార్హం. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు సమాజం కోసం పరితపించినా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించినా, ఇందిరాగాంధీ ఈ విధానాలనే కొనసాగించడంతో పాటు దళితులలో ఆత్మవిశ్వాసం పెంపొం దించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా, నిర్దిష్టమైన విధానాలు రూపొందించినా దేశం మౌలిక స్వభావంపైన వాటి ప్రభావం పడలేదు. ఈ దేశం అన్ని జాతుల, భాషల, మతాల, సంస్కృతుల, ఆచారవ్యవహారాల సమాహారం అనే భావనకు ప్రమాదం ఏర్పడలేదు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా ఈ విషయంలో అటు ఇటుగా ఒకే అభిప్రాయం కలిగినవారుగా నిర్ధారించవచ్చు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీజేపీ–ఆర్ఎస్ఎస్ భావజాలం అధికార పీఠంపైన కూర్చు న్నదనే అభిప్రాయం జనసామాన్యంలో ఏర్పడింది. ఒక దేశం గమనంలో ఏడు దశాబ్దాలు గడచిన తర్వాత ఇటువంటి పెనుమార్పు సంభవించడంలో వింతలేదు. స్వాతంత్య్ర సమరంలో అగ్రగామి పాత్ర పోషించి, స్వతంత్ర భారత నిర్మాణానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ క్రమంగా బలహీనమై, భ్రష్టుపట్టి పోయింది. ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ జాతీయ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ది గురుతరమైన బాధ్యత. అడ్వానీని పక్కన పెట్టి మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించింది ఆర్ఎస్ఎస్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా–అందరూ ఆర్ఎస్ఎస్ శాఖీయులు కావడం యాదృచ్ఛికం కాదు. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రస్తుత పాలనావ్యవస్థను నడిపిస్తున్నదనడానికి ఇది నిదర్శనం. మోదీ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాతనే ఘర్వాప్సీ, అవార్డ్ వాప్సీ, గోరక్షక్, ట్రిపుల్ తలాక్ వంటి పదాలు దక్షిణాదివారికి కూడా అర్థం అవుతున్నాయి. ఏ పౌరుడికైనా దేశభక్తిని చాటుకోవలసిన అవసరం కల గడం కంటే అవమానకరం మరొకటి లేదు. మీడియా సంస్థలు సైతం బీజేపీ– ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్టు వ్యవహరించడం విచిత్రం. మొన్న ఉపరాష్ట్రపతి అన్సారీ వీడ్కోలు సమావేశంలో ప్రధాని ప్రసంగించిన విధం కానీ , అన్సారీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నాయకులు అసం దర్భంగా ప్రచారం చేసిన పద్ధతి కానీ, దానికి వెంకయ్యనాయుడు స్పందించిన తీరు కానీ దేశంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అసహన ధోరణిని చాటు తున్నాయి. కాంగ్రెస్, ఇతర ‘సెక్యులర్’ పార్టీలు ఇంతకాలం మైనారిటీలను ఓటు బ్యాంకులుగా వినియోగించుకున్న తీరును ఖండిస్తూ బీజేపీ పరోక్షంగా అదే పని చేస్తున్నది. మైనారిటీలపైన ఒత్తిడి పెంచడం ద్వారా మెజారిటీ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో బీజేపీ సఫలమైనదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాల లోనూ ఒక్క స్థానంలోనైనా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండా ముస్లిమేతర వర్గాలను ఆకట్టుకోవడం వెనుక అమిత్‌షా పకడ్బందీ ప్రణాళిక లేకపోలేదు. మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆ కార్యక్రమాలను వీడియో తీసి ప్రభుత్వానికి సమర్పించాలన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశం బీజేపీ విధానాన్ని స్పష్టం చేస్తున్నది. బీజేపీ ఉద్దేశం ఏమిటి? సమాజాన్ని మతప్రాదిపదికపైన రెండుగా చీల్చడం అధికార బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఉద్దేశమా? 2019లో సైతం బీజేపీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని అందరూ భావిస్తున్న దశలో ఇటువంటి ప్రమాదకరమైన రాజకీయం అవస రమా? తెగేవరకూ లాగాలనే అభిప్రాయం మోదీకి లేదనే విషయంగా స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్లో అన్ని రాజకీయ పక్షాలూ 370వ అధికరణ కొనసాగవల సిన అవసరాన్ని నొక్కివక్కాణించిన తర్వాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానిని ఢిల్లీలో కలుసుకున్నారు. దాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మోదీ స్పష్టం చేశారు. గోరక్షకుల ఆగడాలను ఉపేక్షించేది లేదంటూ ప్రధాని ఒకటికి రెండు సార్లు హెచ్చరించారు. అవార్డ్ వాప్సీ సందర్భంలో సైతం మోదీ నిగ్రహం పాటించారు. 2014 వరకూ దేశంలో వ్యాప్తిలో ఉన్న కాంగ్రెస్ సంబంధ భావజాలానికి ప్రత్యామ్నాయమైన బీజేపీ–ఆర్ఎస్ఎస్ భావజాలంపై చర్చ జరగాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. చర్చలో కొన్ని ఆచరణ సాధ్యం కానివిగా తేల వచ్చు. మరికొన్ని దేశ సమైక్యతకు ముప్పు తెచ్చేవిగా కనిపించవచ్చు. ఈ పరీ క్షలో నిలబడని విధానాలను పక్కన పెట్టి, నిలబడే విధానాలను ఆచరించాలన్న సంకల్పం ఉండవచ్చు. నేటి భారతంలో మైనారిటీల స్థానం ఏమిటో చూపించా లన్న ప్రయత్నం కావచ్చు. భిన్నమతాలూ, జాతులూ, భాషావర్గాలూ, కులాలూ సహజీవనం చేయవలసిన దేశంలో ఏ మతమూ మరో మతపైన, ఏ ప్రాంతం మరో ప్రాంతంపైన, ఏ భాషావర్గం మరో భాషావర్గం పైన, ఏ కులం మరో కులంపైన ఆధిక్యం ప్రదర్శించడం సాధ్యం కాదు. అటువంటి ప్రయత్నం జరి గితే అది దేశ సమైక్యతకే ప్రమాదంగా పరిణమిస్తుంది. సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఆ స్థాయి వరకూ వ్యవహారాన్ని తీసుకొని వెళ్ళకపోవచ్చు. శతా బ్దాలుగా పరమత సహనానికీ, శాంతియుత సహజీవనానికీ అలవాటు పడిన ప్రజలు ఈ విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వడాన్ని ఆమోదించరు. కొన్ని సర్దుబాట్లకూ, సవరణలకూ అంగీకరించవచ్చు. అధికార కూటమి ప్రయత్నం ఆ దిశగానే జరుగుతున్నదని భావించాలి. ఇందుకు భిన్నంగా జరిగితే ప్రతిఘటన తథ్యం. 1975లో ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు జాతి ఒక్క తాటిపైన నిలిచి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా రక్షించుకున్నదో అదే విధంగా లౌకిక భావజాలానికి భంగం వాటిల్లినా ప్రజలు తిరగబడి తీరుతారు. అటువంటి పరిస్థితే ఏర్పడితే దేశం అనూహ్యమైన మూల్యం చెల్లించలవసి వస్తుంది. ఈ సంగతి మోదీ ప్రభృతులకు లె లుసు. అందుకే ప్రత్యామ్నాయ భావ జాలంపైన చర్చను అవధులు మీరనీయరు. చర్చ జరుగుతుంది. కానీ తెగదు. ముడిపడదు. కె. రామచంద్రమూర్తి -
విలువలే గెలవాలి!
త్రికాలమ్ నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్మోహన్రెడ్డి అనూహ్యమైన పరీక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు పైన గెలుచుకున్న శాసనమండలి స్థానానికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాదిరి నీతిలేని రాజకీయం చేయలేనని స్పష్టం చేశారు. చేతిలో ఉన్న మండలి స్థానం వదులుకోవడానికి ధైర్యం కావాలి. బాగా ఆలోచించుకున్న తర్వాత మండలి స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడానికే చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారంనాడు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తన రాజీనామా లేఖను జగన్మోహన్రెడ్డికి సమర్పించారు చక్రపాణిరెడ్డి. స్పీకర్ ఫార్మాట్లో శాసనమండలి అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను అనంతరం మండలి అధ్యక్షుడి కార్యాలయానికి పంపించారు. అరుణాచలప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భ్రష్టుపడుతున్న తీరు చూసినవారికి వైఎస్ఆర్సీపీ పాటించిన నైతికత ఆనందం కలిగించి తీరుతుంది. ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచీ చట్టసభలలో సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలనే నియమాన్ని పట్టింపుతో అమలు చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో గెలిచారు. ఢిల్లీలో, అమరావతిలో, హైదరాబాద్‌లో అధికారంలో ఉన్న పార్టీలు పాటించని నైతిక విలువలనూ, ప్రదర్శించని రాజ్యాంగ నిబద్ధతనూ యువనాయకుడు జగన్మోహన్రెడ్డి పాటించినందుకు అభినందించి తీరాలి. నంద్యాల రణక్షేత్రంలో చక్రపాణిరెడ్డి బాసట చాలా ముఖ్యమైనది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించాలంటే అతని సోదరుడు చక్రపాణిరెడ్డి సహకారం ప్రధానం. నంద్యాల విజయం వైఎస్ఆర్సీపీకీ, జగన్మోహన్రెడ్డికీ చాలా అవసరం. చావోరేవో తేల్చుకోవలసిన సందర్భం. శాసనమండలి స్థానం వదులుకోవడానికి చక్రపాణిరెడ్డి అంగీకరించకపోతే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం లేదు. నంద్యాలలో విజయావకాశాలు ఆ మేరకు దెబ్బతినేవి. ఇది తెలిసి కూడా సీటు వదులుకోవాలని జగన్మోహన్రెడ్డి షరతు విధించడం విశేషం. ఒక విధంగా నంద్యాల ఉప ఎన్నికలో విజయం కన్నా నైతికత, రాజ్యాంగ స్ఫూర్తి పాటించడమే తనకు ముఖ్యమని జగన్ చాటి చెప్పినట్టు అయింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ అంశం చర్చనీయాంశం కాకపోవచ్చు. పత్రికలూ, వార్తా చానళ్ళూ ప్రాముఖ్యం ఇవ్వకపోవచ్చు. జాతీయ స్థాయిలో చానళ్ళ, పత్రికల దృష్టి వేరే అంశాలపైన ఉండవచ్చు. స్థానిక మీడియా సంగతి సరేసరి. తగినంత ప్రచారం లభించకపోయినప్పటికీ ఇది అన్ని రాజ కీయ పార్టీలూ గమనించవలసిన పరిణామం. విలువలు పాటించే విషయంలో అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారో లేదో మరి. ఇది కారుమబ్బుల్లో తళుక్కున కనిపించిన కాంతిరేఖ. గెలుపే ప్రధానం చంద్రబాబు ఎన్నికల వ్యూహ రచనలో దిట్ట. మూడు దశాబ్దాలకు పైగా అనేక ఎన్నికలలో పోరాడిన అనుభవం ఆయనది. ముఖ్యమంత్రికి గెలుపే ప్రధానం. ఏ విధంగా గెలిచామన్నది అప్రధానం. లక్ష్యం ముఖ్యం. మార్గం కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా విజయం సాధిం చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. నైతిక విలువలతో పనిలేదు. రాజకీయ విలువలకు పాతర వేసినా పర్వాలేదు. గెలవాలి. తిమ్మిని బమ్మిని చేసైనా సరే, ఆరు నూరైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే విజయం సాధించి తీరాలి. ఉపఎన్నికలో ఒక సీటు గెలిచినా ఓడినా ప్రభుత్వ సుస్థిరతకు భంగం లేదు. చట్టసభలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉపఎన్నిక జరుగుతున్న ఒక్క స్థానం గెలుచుకోవడంపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు సర్వశక్తులూ వొడ్డి పోరాడటం చంద్రబాబు స్వభావం. ప్రత్యర్థులతో పోల్చుకొని ప్రతిరోజూ బేరీజు వేసుకోవడం, ప్రతి పోటీలో తనదే పైచేయి కావాలనుకోవడం, విజయం కోసం అన్ని రకాల నియమాలనూ ఉల్లంఘించి, అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే చూస్తున్నాం. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు ప్రణాళికలో నంద్యాల అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమర్థుడూ, స్థానికంగా విశేషమైన ప్రాబల్యం కలిగిన వ్యక్తీ కావడంతో చంద్రబాబు పని మరింత కష్టభూయిష్టౖమైపోయింది. భూమా నాగిరెడ్డి భార్య శోభ 2014 ఎన్నికల ప్రచారంలో కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన కారణంగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి (శోభ భర్త)కి స్వల్ప మెజారిటీ (3,604 ఓట్లు) లభించింది. నాగిరెడ్డికి 82,194 (46.97 శాతం) ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 78,590 ( 44.91శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష సభ్యులను వేధించారు. బెదిరించారు. ప్రలోభపెట్టారు. వారి బలహీనతలు తెలుసుకొని వారితో ఆడుకున్నారు. నాగిరెడ్డిపైన పోలీసులను ప్రయోగించారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించారు. రౌడీషీట్ తెరిపించారు. పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు. చతుర్విధ ఉపాయాలు ప్రయోగించి ఆయన చేత తప్పు చేయించారు. పార్టీ ఫిరాయించే వరకూ ఆయనను వేధిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసు కేసులతో వేధించడం, మరో వైపు మంత్రి పదవి చూపించి ఊరించడం. ఆ విధంగా నాగిరెడ్డి సహా 21 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా శాసనసభ స్థానానికి రాజీనామా చేయలేదు. నాగిరెడ్డి వ్రతం చెడినా ఫలం దక్కలేదు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది. మానసికంగా కుంగిపోయారు. మండలి ఎన్నికలలో తన అభీష్ఠానికి భిన్నంగా పని చేయాలని నాగిరెడ్డిపైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని నాగిరెడ్డిని మందలించారు. అపరాధభావంతో, అవమానభారంతో భూమా గుండెపోటు వచ్చి మరణించారు. ఆ క్షణం నుంచీ నంద్యాల స్థానం ఎట్లా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు. నువ్వా–నేనా? భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపుదారులను చంద్రబాబు తీసుకున్నారు. భూమా కుమార్తె అఖిలప్రియ వారిలో ఒకరు. నంద్యాల స్థానం తమ కుటుంబానికే చెందాలని అఖిలప్రియ కోరుకోవడం సహజం. ఆ స్థానం గెలుచుకునేందుకు టీడీపీ టికెట్టు తనకే దక్కాలని 2014లో స్వల్ప తేడాతో ఎన్నికలలో ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డి ఆశించడం ధర్మం. ఎవరినీ వదులుకోలేని డోలాయమాన స్థితిలో చంద్రబాబుని చూసిన శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీకీ బలమైన అభ్యర్థి లభించారు. పెరుగుతున్న జగన్మోహన్రెడ్డి ప్రాబల్యంతో మోహన్‌రెడ్డి సొంత బలం తోడైతే విజయం సాధ్యం. ఎట్లాగైనా నంద్యాల స్థానం నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో చంద్రబాబు తనకు తెలిసిన విద్య ప్రదర్శించడం ప్రారంభించారు. మూడేళ్ళలో నంద్యాల ప్రజలకు కనిపిం చని చంద్రబాబు తరచూ తమ మధ్యకు రావడం, అడగని వరాలు గుప్పించడం, అన్ని వర్గాల ప్రజలతో చనువు ప్రదర్శించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. నంద్యాలలో వైశ్యులు గణనీయంగా ఉన్నారు కనుక వారికి అవసరమైన భవనం కట్టిస్తానని వాగ్దానం చేశారు. అడిగినవారికీ, అడగనివారికీ రకరకాల పథకాలు మంజూరు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అన్ని వర్గాలకీ అన్ని రకాల వాగ్దానాలు చేశారు. నంద్యాల పట్టణంలో ముస్లింలు 70 వేల పైచిలుకు ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవాలంటూ మాజీ మంత్రి ఫారుఖ్‌ని పట్టుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల టిక్కెట్టు ఆశించిన ఫారుఖ్‌కి చంద్రబాబు ఇంటర్వ్యూ దొరకటం కష్టమైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రికీ, పార్టీకీ దూరంగా ఉంటున్న మాజీ మంత్రిని పిలిపించుకొని ఆయనకు శాసనమండలి సభ్యత్వమే కాకుండా శాసనమండలి అధ్యక్ష పదవి కూడా ఇస్తానంటూ వాగ్దానం చేసి ఆయనను రంగంలో దింపారు. చక్రపాణి పదవీ విరమణ అనంతరం మండలి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. ఇదే అధ్యక్ష పదవి చక్రపాణిరెడ్డికి చంద్రబాబు ఇవ్వజూపారు. అది మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరక మందు ముచ్చట. చక్రపాణిరెడ్డి టీడీపీలో కొనసాగినప్పటికీ అన్నకి వ్యతిరేకంగా ఎంత శక్తిమంతంగా పని చేయగలరనే విషయంపై తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా, నంద్యాలలో గెలవాలంటే చక్రపాణిరెడ్డి మద్దతు కంటే ఫారుఖ్ మద్దతు అవసరమని భావించిన చంద్రబాబు ఫారుఖ్‌ని మండలి అధ్యక్ష పదవి చూపించి సుముఖం చేసుకున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం లేకపోయినప్పటికీ ఫారుఖ్ యాంత్రికంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరఫున ముస్లిం సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఆరాధనాభావం ఉన్నది. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించింది వైఎస్ఆర్ అనే విషయం ముస్లింలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి నంద్యాల ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. అది ఎంతమేరకు ఉన్నదనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సాధారణ పరిస్థితులలో, 174 స్థానాలతో కలిపి నంద్యాల స్థానానికి కూడా ఎన్నిక జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. ఫిరాయించిన ఇతర ఇరవై మంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగి, వాటితో పాటుగా నంద్యాల ఉప ఎన్నిక కూడా జరిగి ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీకి విజయావకాశాలు స్పష్టంగానే ఉండేవి. కానీ ఒక్క నంద్యాలలోనే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ యంత్రాంగాన్నీ, టీడీపీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయితో చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో దింపడంతో పోటీ నువ్వా–నేనా అన్నట్టు సాగుతోంది. ఏ రోజు చూసినా నంద్యాలలో అరడజను మందికి తక్కువ కాకుండా మంత్రులు మకాం వేసి ఉంటున్నారు. శాసనసభ్యులు సరేసరి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నది. వైఎస్ఆర్సీపీ చేతిలో అధికారం లేదు. నిధులు లేవు. అయినప్పటికీ చక్రపాణిరెడ్డి చేరికతో వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలత పెరిగింది. తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నంద్యాలలోనే ఉంటానంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నంద్యాలలో పర్యటించబోతున్నారు. ఒక సార్వత్రిక ఎన్నికకు ఉండే ప్రాముఖ్యం నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకోవడం విశేషం. నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇది చారిత్రక ఉపఎన్నిక కాబోతున్నది. రాజకీయ విలువలకూ, నైతికతకూ ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఎన్నికలో నిర్ధారణ అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
♦ సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి వెల్లడి ♦ పరీక్షల కోసం నీటి నమూనాలు జీఎస్ఐకి.. నాగోలు (హైదరాబాద్): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత గ్రామాల్లో మంచినీరు కలుషితమై స్థానికులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నీటి నమూనాలను పరీక్షల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు అందజేశామన్నారు. రామచంద్రమూర్తితో పాటు సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం శ్రీకాకుళం కార్యదర్శి వంకాయల మాధవరావులు గురువారం బండ్లగూడలో జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్‌ను కలసి ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఇటీవల సేకరించిన నీటితో కూడిన 12 సీసాలను అందజేశారు. ఈ నీటిని ల్యాబ్‌లో పరీక్షించి, కిడ్నీ వ్యాధులకు మూలాలు కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని రామచంద్రమూర్తి చెప్పారు. ఈ జబ్బులు ప్రాణాలు హరిస్తున్నా ఎవ రూ స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఆ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. కేంద్రం,ఐరాస, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను కాపాడాలని కోరారు. ఉద్దానం ప్రాంత ప్రజలు నీటి కాలుష్యంతో పిట్టల్లా రాలిపోతున్నారని, సాక్షి యాజమాన్యం ఆ ప్రాంతానికి వచ్చి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకివ్వడం అభినందనీయమని మాధవరావు అన్నారు. గతంలో పవన్‌కల్యాణ్ వచ్చి హడావుడి చేశారే తప్ప పరిష్కారం చూపలేదన్నారు. వ్యాధుల మూలాలు కనుగొని సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నీటిని పరీక్షించి త్వరలో నివేదిక అందజేస్తామని జీఎస్ఐ అదనపు డీజీ శ్రీధర్ చెప్పారు. -
మంచి నడవడితోనే మనుగడ
త్రికాలమ్ రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ ఉన్నతాధికారులకూ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ప్రజాస్వామ్య దేశాలలో అనేకం కనిపిస్తాయి. సిద్ధాంతపరమైన, సూత్రప్రాయమైన అభిప్రాయభేదాలను అర్థం చేసుకోవచ్చు. అటు రాజకీయవాదీ, ఇటు అధికారీ తమ వాదనే సమంజసమైనదంటూ పట్టుదలకు పోయిన ఘట్టాలూ ఉన్నాయి. ఇవి సర్వసాధారణంగా అభివృద్ధి వ్యూహాలకో, సంక్షేమ కార్యక్రమాలకో సంబంధించినవై ఉంటాయి. జనహితంతో ప్రమేయం లేకుండా కేవలం అహంకారం ఆవహించిన సమయంలో రెండు పక్షాలూ గట్టి పట్టుపట్టినప్పుడు ప్రతిష్టంభన అనివార్యం. మంత్రులతో తగాదా వచ్చిన ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రులు వేరే శాఖలలో సర్దుతారు. ముఖ్యమంత్రితోనే పేచీ వచ్చిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్ళడం రివాజు. అది గౌరవప్రదమైన తీరు. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకూ, అధికారులకూ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు అంత గౌరవప్రదమైనవి కావు. సిద్ధాంతాలకూ, ప్రజాసంక్షేమానికీ, అభివృద్ధి ప్రణాళికకూ చెందిన అభిప్రాయాల ఘర్షణ కాదు. కేవలం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారనే దుగ్ధతో, మహిళల పట్ల సహజంగా ఉండే చులకన భావంతో దౌర్జన్యంగా, వెకిలిగా ప్రవర్తించిన సందర్భాలు. ఖమ్మం జిల్లాలో ఒక ఉదంతానికి విశేష ప్రచారం లభించింది. శ్రీనివాసన్ అనే ఐఏఎస్ అధికారికీ, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు జలగం వెంగళరావుకూ మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి జిల్లా ప్రజలు అదేపనిగా చెప్పుకునేవారు. వెంగళరావు విలక్షణమైన రాజకీయ నాయకుడు. వ్యక్తిగత ప్రయోజనం ఆశించి అధికారుల చేత ఏ పనీ చేయించే సంకుచిత మనస్తత్వం లేదు ఆయనకు. కానీ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. అధికారులను విశ్వసించి వారికి బాధ్యతలు అప్పగించడం ఆయన ముఖ్యమంత్రిగా విజయాలు సాధించడానికి దోహదం చేసిన వైఖరి. కొన్ని సందర్భాలలో మాత్రం తనదే చివరిమాట కావాలన్న పట్టింపు ఉండేది. ఏదో ప్రజాప్రయోజనం విషయంలోనే వెంగళరావుకూ, శ్రీనివాసన్కూ మధ్య మాటామాటా పెరిగింది. చివరి మాట ఐఏఎస్ అధికారిదే అయింది. ‘నేను కావాలనుకొని శ్రమిస్తే జిల్లా పరిషత్తు చైర్మన్‌ను కాగలను. కానీ మీరు ఎంత శ్రమించినా ఐఏఎస్ అధికారి కాలేరు. జిల్లా కలెక్టర్ కాజాలరు’ అని శ్రీనివాసన్ అన్నమాటకు జలగంవారి దగ్గర జవాబు లేదు. అప్పటికే ఆయనకు నలభై ఏళ్ళు. చదువు డిగ్రీ దాకా వెళ్ళలేదు. పదో తరగతితోనే ఆగిపోయింది. ఈ సంభాషణ నిజంగా జరిగిందో లేక కల్పితమో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎవ్వరూ నిర్ధారించలేదు. కానీ ఇందులో సత్యం ఉన్నది. అదేవిధంగా దళిత బాంధవుడు ఎస్ఆర్ శంకరన్కూ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డికీ మధ్య విభేదాలు వచ్చాయి. బాండెడ్ లేబర్ చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న సమయంలో మెదక్ జిల్లా నుంచి కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారు. చట్టం అమలును పర్యవేక్షిస్తున్న శంకరన్‌ను పిలిచి చూసీచూడనట్టు వ్యవహరించమని చెన్నారెడ్డి చెప్పారు. అట్లా చేయడం తన వల్ల కాదంటూ కేంద్రానికి డిప్యుటేషన్ కోరుకున్నారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఐఏఎస్ అధికారులు కళ్ళ ఎదుట అక్రమాలూ, అవినీతీ జరుగుతుంటే చూడలేక, వాటిలో భాగం కాలేక అమరావతికి దండం పెట్టి ఢిల్లీకి వెళ్ళిపోయారు. సమర్థుడైన, నిజాయితీపరుడైన అధికారిగా, కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి రిలయన్స్ సంస్థపైన సాగించిన సమరంలో విలువైన భూమిక నిర్వహించిన బ్యురాక్రాట్గా మంచిపేరు తెచ్చుకున్న గిరిధర్ వారిలో ఒకరు. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ మరొకరు. తప్పుచేసి లెంపలేసుకున్న నెహ్రూ ఆవేశపడి అధికారులపైన నోరు చేసుకున్నప్పుడో, చేయి చేసుకున్నప్పుడో నేతలు తమ పొరపాటు గ్రహించి క్షమాపణ చెప్పిన సందర్భాలూ లేకపోలేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకసారి అలహాబాద్ వెళ్ళారు. డిజీపీ స్థాయి పోలీసు అధికారి విమానాశ్రయంలో నెహ్రూకి స్వాగతం చెప్పారు. ‘పంత్జీ కహా హై’ అని నెహ్రూ అడిగారు. గోవింద వల్లభపంత్ తొక్కిసలాటలో ఇరుక్కున్నారు కనుక రాలేకపోయారని పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాధానం నెహ్రూకు కోపం తెప్పించింది. చెంప ఛెళ్లుమనిపించి, ‘ఆయన తొక్కిసలాటలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ కేకలేశారు. మర్నాడు ఢిల్లీ నుంచి పోలీసు అధికారికి ఫోన్. ప్రధాని సత్వరం రమ్మన్నారంటూ కబురు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని భయపడుతూ వెళ్ళిన పోలీసు అధికారిని నెహ్రూ పార్లమెంటు భవనానికి పిలిపించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారిని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం తినిపించి, ‘ఐ యామ్ సో సారీ. పంత్ నాకంటే ఎంతో పెద్దవారు. నేనైతే జంప్ చేయగలను. అటువంటి పెద్దమనిషి తొక్కిసలాటలో చిక్కుకున్నారని చెప్పేసరికి నాకు కోపం వచ్చింది. చేయరాని పనిచేశాను. క్షమించండి,’ అంటూ సంజాయిషీ చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు 1983లో అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి విజయ వార్త వింటూనే గుండెపోటు వచ్చి మరణించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా పర్వతనేని ఉపేంద్రను నిలబెట్టారు. ఉపేంద్ర ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన సమయంలో డెయిరీ కార్పొరేషన్ పాల ధర పెంచింది. దాని ప్రభావం ఎన్నికలపైన పడి ఉండవచ్చు. పాలధర పెంపుపైన అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు రచ్చ చేస్తున్నారు. పరాజయ పరాభవానికి తోడు ప్రతిపక్షాల పరిహాసం. ఎన్టీఆర్ ఖిన్నులైనారు. డెయిరీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి దయాచారిని అసెంబ్లీ భవనానికి పిలిపిం చారు. ‘ఏమిటి బ్రదర్! పాలధర పెంచే ముందు ప్రభుత్వానికి మాటవరుసకైనా చెప్పనక్కరలేదా?’ అని నిష్టూరమాడారు. ‘పాల ఉత్పత్తి ధర విపరీతంగా పెరి గింది సర్! పెంచక తప్పలేదు,’అని చెబుతూ ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ చూపించి, ‘ఈ బాటిల్ ధర పది రూపాయలు సర్, అంతకంటే తక్కువ ధరకి పాలు విక్రయించాలంటే ఎట్లా సాధ్యం? ఇప్పటికే కార్పొరేషన్ నష్టాలలో నడుస్తోంది’అన్నాడు. ఆ మాట విన్న ఎన్టీఆర్ ‘ఓకే బ్రదర్ వెళ్ళిరండి. యూ హేవ్ డన్ యువర్ డ్యూటీ. వియ్ విల్ మేనేజ్,’అంటూ తిరిగి సభలోకి వెళ్ళి లీటర్ పాల ధరనూ, వాటర్ బాటిల్లోని లీటర్ నీటి ధరనూ పోల్చి వాదన సమర్థంగా విని పించి ప్రతిపక్షాల వాదనను పూర్వపక్షం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కుసంస్కారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉదంతాలు అక్కడి రాజకీయ నాయకుల సంస్కారానికీ, ముఖ్యమంత్రి పనితీరుకూ అద్దం పడతాయి. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట తహసీల్దార్ వనజాక్షిపై తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడి, దాడి చేసిన వైనం అత్యంత అనాగరికమైనది. ఉద్యోగ సంఘాలు హాహాకారాలు చేసినా, రాష్ట ప్రజలంతా దిగ్భ్రాంతి చెందినా, అమె కళ్ళనీళ్ళ పర్యంతం అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసిన శాసనసభ్యుడినే సమర్థించారు. హద్దుమీరావంటూ తహసీల్దార్‌నే మందలించారు. ఈ ఘటనపైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల వనజాక్షి నిర్దోషి అని తేల్చింది. ఆమె హద్దు దాటలేదని నిర్ధారించింది. చంద్రబాబుకి నెహ్రూ లేదా ఎన్టీఆర్ వంటి సమున్నత వ్యక్తిత్వం ఉన్నట్లయితే వనజాక్షిని పిలిపించుకొని క్షమాపణ కోరేవారు. అనంతరం ఐపీఎస్ అధికారి, ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీని వాస్ (నానీ), శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్న, మరికొందరు ఈ యేడాది మార్చి 25న తిట్ల దండకంతో దాడిచేశారు. పని మీద బయటకు వెళ్ళబోతున్న కమిషనర్ కారుకు తమ కారు అడ్డంపెట్టి దౌర్జన్యం చేశారు. కమిషనర్ని చుట్టుముట్టారు. తాము వస్తుంటే ఎందుకు పోతున్నావంటూ నిలదీశారు. ఆరెంజ్ ట్రావెల్స్ పర్మిట్‌ను రద్దు చేయాలంటూ పట్టుపట్టారు. ధర్నా చేశారు. కమిషనర్‌పైన అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి తప్పు చేసిన తమ్ముళ్ళ చేత ‘సారీ’ చెప్పించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించవలసివస్తుందన్న భయంతో వారిని బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి పంపించారు. నానీ మనస్ఫూర్తిగా ‘సారీ’ చెప్పలేదనీ, ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే చెప్పారనీ అనంతరం ఆయన వ్యవహరణ తీరు స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు చెప్పిన పనులు చేసిపెట్టాలంటూ సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో ఆదేశించినప్పుడు అధికారులపైన రాజకీయులు రెచ్చిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? సభ్యతలో శిక్షణ ఈ విషయంలో తెలంగాణ వెనకబడిలేదని మహబూబాబాద్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ నిరూపించాడు. ఆదివాసీ నాయకుడు శంకర్ నాయక్‌కు చదువు వచ్చింది కానీ సంస్కారం అబ్బలేదు. వరంగల్లు రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుడైన శంకర్ రోడ్లు, భవనాల శాఖలో డిప్యూటీ ఇంజనీరుగా పనిచేశారు. ఉద్యోగం వదిలి రాజకీయాలలో ప్రవేశించిన అనంతరం మొర టుగా మాట్లాడటం, ఆధిక్యం ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారు. అధికారులను ‘ఏందిర భయ్’అంటూ ఏకవచనంలో సంబోధించడం, దబాయించి పను లు చేయించుకోవడం మామూలైపోయింది. శాసనసభ్యుడు కనుక ఏమి చేసినా చెల్లుతుందనే అహం పెరిగింది. అక్రమార్జనా వగైరా అవలక్షణాలు సరేసరి. కానీ వ్యాపార ప్రయోజనం కోసం కలెక్టర్‌పైన దాడి చేయలేదు. కేవలం ఆధిక్య భావనతో, వెకిలితనంతో బుధవారంనాడు కలెక్టర్ ప్రీతిమీనా చేతిని తాకారు. అంతక్రితం కలెక్టర్ లేని సమయంలో ఆమె చాంబర్లోకి వెళ్ళి నాయక్ కూర్చున్నారు. అప్పుడు ప్రీతీ మీనా ఎంఎల్ఏపైన మొదటిసారి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ద్వంద్వంగా ఇచ్చిన ఆదేశం మేరకు టూరిజం మంత్రి చందూలాల్తోనూ, ఎంపీ సీతారామ్ నాయక్‌తోనూ కలిసి మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. సీఎం అంటే భయంతో క్షమాపణ చెప్పారే కానీ మనస్ఫూర్తిగా మాత్రం కాదు. అరెస్టు చేసి విడుదల చేసిన తర్వాత సీఎం పట్ల గౌరవంతో క్షమాపణ చెప్పాను కానీ తప్పేమీ చేయలేదు అంటూ దబాయించారు. రాజకీయవాదులలోనూ, ఉన్నతాధికారులలోనూ నైతిక విలువలు క్రమంగా పడిపోతున్నాయి. అధికారగణంలో కంటే రాజకీయవాదులలో ఈ పతనం ఎక్కువ వేగంగా జరుగుతోంది. నిజాయితీపరులైన, సమర్థులైన, జన సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే ఉన్నతాధికారులు జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు కానీ ఈ లక్షణాలు కలిగిన రాజకీయ నాయకులు మాత్రం కలికం వేసినా కని పించరు. ఉద్యోగంలో నియమించడానికి ముందు ఐఏఎస్ అధికారులకు మసూరీలోనూ, జిల్లాలలో రెవెన్యూ శాఖలోనూ శిక్షణ ఉంటుంది. ఎవరితో ఎట్లా వ్యవహరించాలో, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో, రాజకీయ వ్యవస్థతో ఏ విధంగా మసలుకోవాలో, విలువలతో రాజీ పడకుండా ప్రజాశ్రేయస్సుకోసం ఎట్లా పని చేయాలో విశేషమైన అనుభవం కలిగినవారు నేర్పుతారు. రాజకీయ నాయకులకు నైతికాంశాలలో శిక్షణ లేదు. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వారు నేర్చుకోవడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం అందులో ప్రధానపాత్రధారులైన ప్రజాప్రతినిధులకు సభ్యతాసంస్కారం నేర్పే ప్రయత్నం జరగడం లేదు. అధికారులతో ఎట్లా వ్యవహరించాలో, ప్రజల సమస్యలను ఎట్లా తెలుసుకొని పరిష్కరించాలో, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదగాలో బోధించి, తగిన తర్ఫీదు ఇచ్చినట్లయితే విద్యాధికుడైన శంకర్ నాయక్ సంస్కారవంతుడైన రాజకీయ నాయకుడుగా ఎదిగేవారు. ఈ రోజున ఇంతగా అపహాస్యంపాలు కావలసిన దుస్థితి ఉండేది కాదు. - కె. రామచంద్రమూర్తి -
ఫిరాయింపుల క్రీడ ఇంకానా?
త్రికాలమ్ శనివారం ప్రారంభమైన వైఎస్ఆర్సీపీ రెండురోజుల ప్లీనరీకి హాజరైన ప్రతినిధులలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఆహ్వానితుల కంటే అధికంగా పార్టీ కార్యకర్తలు హాజరు కావడం పార్టీ నడుస్తున్న తీరుపట్ల సంతృప్తికి నిదర్శనం. పాలకపక్షం పట్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తికి కూడా ఇది నిదర్శనం. క్షేత్రస్థాయిలోని రాజకీయ నాయకులకు ప్రజల నాడి తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతోందంటే ప్రతిపక్షానికి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వారు గ్రహిస్తారు. అటువంటి వాతావరణం ప్రతిపక్ష కార్యకర్తలలో ఉత్సాహం నింపడం సహజం. గతంలో జరిగిన రెండు ప్లీనరీల కంటే ఈసారి ప్లీనరీ పద్ధతి ప్రకారం ప్రారంభమైనదని చెప్పవచ్చు. ప్రసంగాలు క్లుప్తంగా, సూటిగా ఉన్నాయి. తీర్మానాలు అర్థవంతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిపైనా, ఆయన కుమారుడిపైనా వ్యక్తిగత విమర్శలు చేయకుండా వక్తలు విధానాలకూ, పాలనకూ మాత్రమే పరిమితమైతే ఇంకా బాగుండేది. పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం రెండు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఒకటి, పార్టీ ఫిరాయింపుల నిరోధం. రెండు, ఎన్నికల వాగ్దానాలు చేయడంలో వాస్తవిక దృక్పథం ఉండాలనీ, చేసిన వాగ్దానాలు అమలు చేయని పాలకులపైన శిక్షాత్మక చర్యలు ఉండాలనీ తీర్మానం ప్రతిపాదించింది. ఈ రెండు రుగ్మతలూ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనవి కావు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఇటువంటి అప్రజాస్వామిక ధోరణులు మితిమీరుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధం బిల్లు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న బ్రిటన్‌లో లేదు. ఆస్ట్రేలియా, కెనడాలలోనూ లేదు. పార్టీ ఫిరాయించిన ఎంపీలు బ్రిటన్ పార్లమెంటులో విడిగా కూర్చుంటారంతే. ఫలానా పార్టీ టిక్కెట్టుపైన గెలిచారు కనుక అదే పార్టీకి అంకితం కావాలన్న నిబంధన లేదు. అవి ప్రవృద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలు కనుక డబ్బు కోసమో, పదవి కోసమో పార్టీ ఫిరాయించే సంస్కృతి అంతగా లేదు కనుక పార్టీ విధేయతకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీ కంటే ప్రజలకూ, దేశానికీ విధేయంగా చట్టసభలలోని ప్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నది ఆ సమాజాల విశ్వాసం. అందుకే అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లూ, అనుకూలంగా ప్రతిపక్షంలోని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కొందరూ ఓటు వేయడం ఆనవాయితీ. బ్రిటన్‌లోనూ ఇదే వరస. చట్టాల రూపకల్పనలోనూ, విధాన నిర్ణయాలలోనూ పార్లమెంటు సభ్యులు తమ విచక్షణాజ్ఞానం వినియోగించకపోతే, కేవలం ఓటర్ల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే అది దేశాన్ని దగా చేసినట్టు అవుతుందంటూ 1774లోనే నాటి బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడూ, రాజనీతిజ్ఞుడూ ఎడ్మండ్ బర్క్ హెచ్చరించాడు. మన దేశంలో పరిస్థితులు వేరు. డబ్బు కోసం, పదవుల కోసం పార్టీ ఫిరాయించడాన్ని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీలూ, ఫిరాయిస్తున్న ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులూ, శాసనసభ, శాసనమండలి సభ్యులూ అనేకమంది ఉన్నారు. ఫిరాయింపుల కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడటంతోపాటు ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి వల్ల 1970లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతగా అపహాస్యం పాలైనదో గమనించిన తర్వాత ఫిరాయింపుల నిరోధం తప్పనిసరి సంస్కరణ అని విజ్ఞులు నిర్ణయించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాలు రాజీవ్‌గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ వచ్చింది. రాజ్యాం గంలోని 101, 102, 190, 191 అధికరణలను సవరించి, రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్‌ని చేర్చి పార్టీ ఫిరాయించిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించారు. పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీలో మూడింట ఒక వంతు మంది సభ్యులు పార్టీని వీడితే దాన్ని పార్టీలో వచ్చిన చీలికగా గుర్తించాలని అప్పటి ఫిరాయింపుల చట్టం నిర్దేశించింది. ఆ విధంగా పార్టీని చీల్చినవారి పైన అనర్హత వేటు ఉండదు. పెద్ద పార్టీలైతే మూడింట ఒక వంతు మందిని పార్టీ ఫిరాయించడం కోసం సమీకరించడం కష్టం కానీ చిన్నాచితకా పార్టీలను చీల్చడం తేలిక. చిన్న రాష్ట్రాలలో ఫిరాయింపులను 1985 నాటి చట్టం నిరోధించలేకపోయింది. రాష్ట్రాలలో అస్థిరతనూ, అనిశ్చితినీ ఈ సవరణ చట్టం అరికట్టలేకపోయింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. 2003లో వాజపేయి సర్కార్ టెన్త్ షెడ్యూల్లో సవరణ చేసింది. మూడింట రెండు వంతుల మంది వైదొలిగితేనే పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీ చీలినట్టు పరిగణించాలంటూ కొత్తచట్టం తెచ్చారు. ఈ చట్టంలో ఒక లొసుగు వదిలివేసిన కారణంగా ఫిరాయింపులు నిస్సిగ్గుగా కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపైన అనర్హతవేటు వేయడమా లేదా అని నిర్ణయించే అధికారం సభాపతులకు చట్టం ప్రసాదించింది. ఫలానా పక్షానికి చెందిన సభ్యుడు ఫిరాయిస్తే ఆ సభ్యుడిపైన అనర్హత వేటు వేయాలంటూ ఆ పక్షం నాయకుడు సభాపతికి లేఖ ఇస్తారు. ఆ లేఖపైన సభాపతి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చట్టం నిర్దేశించలేదు. ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు. అందువల్ల స్పీకర్లు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలను నిరవధికంగా వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నారు. రాజీవ్, వాజపేయి తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాలు నిష్ఫలమై రాజ్యాంగ వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. లొసుగులను ఎందుకు తొలగించరు? చట్టాలలోని లోపం ఏమిటో స్పష్టంగా తెలుసు కదా. దాన్ని సవరించే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? ఎవరు చేయాలి ప్రయత్నం? అధికార పార్టీ చేయాలి. ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండటమే అధికారపార్టీలకు అవసరం. అందువల్ల ఈ లోపాలను సవరించాలన్న ఆతృత, ఉత్సుకత వాటికి ఉండదు. పైగా ఆ లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేంద్రంలోని పాలకపక్షాలకూ, రాష్ట్రాలలోని అధికారపక్షాలకూ సమంగా వర్తిస్తుంది. ఇదివరకు సరిపోను సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాలు స్వతంత్ర సభ్యులనో, చిన్న పార్టీల సభ్యులనో ఫిరాయింపునకు ప్రోత్సహించి అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవి. ఇప్పుడు రాజకీయం బరితెగించింది. చట్టసభలలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలను బలహీనం చేయాలనే ఉద్దేశంతో యధేచ్ఛగా ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్ష సభ్యులకు ప్రలోభాలు చూపించి వారి చేత తప్పు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రులకు పరమవిధేయులైన సభాపతులు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడంలో సహకరిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ఫిరాయించినవారిని మంత్రిపదవులతో సత్కరిస్తున్నారు. చట్టాలు చేయవలసినవారే చట్టాలను నిష్కారణంగా తుంగలో తొక్కుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రాలలోని పాలకపక్షాలు కానీ ఇందుకు సిగ్గుపడటం లేదు. పోనీ ఫిరాయించినవారు ఏదైనా సైద్ధాంతిక విభేదాల వల్లనో, సూత్రబద్ధంగానో ఆ పనిచేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. నైతిక కారణాల వల్ల అధికార పార్టీ నుంచి నిష్క్రమించిన పార్లమెంటు సభ్యులూ లేదా శాసనసభ్యులూ కలికానికైనా కని పించరు. అటువంటి ఉన్నత విలువల ప్రసక్తి లేదు. ధనం, అధికారం నిగ్రహిం చుకోలేని ప్రలోభాలుగా మారాయి. సభాపతుల మౌనం, నిష్క్రియ సరాసరి రాజ్యాంగ ఉల్లంఘనే. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కింది. ప్రతిపక్ష సభ్యులపైన కేసులు పెట్టి వేధించి, వారిపైన రౌడీషీట్లు తెరిపించి వారిని కాళ్ళ బేరానికి తెప్పించుకొని పార్టీ ఫిరాయించే విధంగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు అందరికీ తెలిసినవే. భూమా నాగిరెడ్డి ఇందుకు ప్రబలమైన ఉదాహరణ. 2011లో వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన శాసనసభ్యుల చేత సభ్యత్వానికి రాజీనామా చేయించి, మళ్ళీ ఉపఎన్నికలలో కొత్త పార్టీ టెక్కెట్టుపైన పోటీకి నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ విషయంలో అధికార పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంది. వాస్తవానికి ఇది జాతీయ స్థాయిలో చర్చించి పరిష్కరించుకోవలసిన సమస్య. అందుకే పార్టీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ఈ అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం సమంజసమే. ఆచరణసాధ్యం కాని వాగ్దానాలు ఎన్నికల వాగ్దానాలు అమలుకు నోచుకోకపోవడం దేశవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన అనేక వాగ్దానాలు మూడేళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఆ వాగ్దానాలు అమలు కాకపోయినా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం లేదు కనుక పర్వాలేదు. కానీ ముఖ్యమంత్రులు చేసే వాగ్దానాలు వివిధ వృత్తులవారిలో, సమాజంలోని అనేక వర్గాలలో ఆశలు రేకెత్తిస్తాయి. వాగ్దానాలు అమలు జరుగుతాయనే ఆశతో ఓటు వేస్తారు. వారి ఓట్లతో గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వారికే శఠగోపం పెడుతుంది. ఇది చాలా సందర్భాలలో జరిగిన తంతు. చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. రెండు ప్రధానమైన వాగ్దానాలు చేసి అంతకంటే చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ అమలు చేశారు. అన్ని కార్యక్రమాల ఫలాలూ అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల, కులాలవారికీ అందించే ప్రయత్నం చేశారు. దాన్ని ‘శాచురేషన్ లెవల్’అనేవారు. అందుకే మృత్యువాతపడి ఎనిమిదేళ్ళు కావస్తున్నా తరగని ప్రజాభిమానం. అమలుకు సాధ్యమైన ఎన్నికల వాగ్దానాలే చేయాలంటూ ఎన్నికల కమిషన్ కొన్నేళ్ళుగా పట్టుపడుతున్నది కానీ అది నెరవేరడానికి అవసరమైన వ్యవస్థ లేదు. 2014లో తెలుగుదేశం పార్టీ వాగ్దానాలను పరిశీలించవలసిందిగా ఎన్నికల కమిషన్‌ను కొంతమంది కోరారు. కానీ అందుకు తగిన యంత్రాంగం లేకపోవడం, ఫలానా వాగ్దానం ఆచరణ సాధ్యం కాదు కనుక ప్రచారంలో ఆ వాగ్దానం చేయరాదంటూ శాసించే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం వల్ల ఎన్నికల హామీలను అదుపు చేసే ప్రయత్నం ఫలించలేదు. తమ విశ్వసనీయతను కాపాడుకోవాలనే పట్టింపు కలిగిన రాజకీయ నేతలు ఒక వాగ్దానం అమలు చేసే ముందు అది సాధ్యమా, అసాధ్యమా అనే విషయాన్ని తరచి పరిశీలిస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో రైతులకు రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా జగన్మోహన్రెడ్డికి చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ అంత భారం మోయగల స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండబోదని లెక్కలు వేసుకొని ఆ వాగ్దానం చేయలేదు. పైగా తెలుగుదేశం చేసిన రుణమాఫీ వాగ్దానం అమలు సాధ్యం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పారు. కానీ ఓటర్లు ఆ వాగ్దానాన్ని విశ్వసించారు. అనంతరం ఏమి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రజలకు తెలుసు. ఆకాశమే హద్దుగా ఎన్నికల వాగ్దానాలు చేసే దురాచారానికి స్వస్తి చెప్పకపోతే అమాయక ప్రజలు ప్రతిసారీ మోసపోయి మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. ఈ బెడద నివారణ కోసం చట్టపరమైన పరిష్కారం అన్వేషించవలసిన బాధ్యత చట్టసభలపైన ఉంది. కనీసం ఫలానా హామీని ఏ విధంగా ఆచరించి చూపుతారో, ఆర్థిక వ్యవస్థలో అందుకు అవసరమైన వెసులుబాటు ఉన్నదో లేదో నిర్ణయించే అధికారాలు ఏదైనా రాజ్యాంగ వ్యవస్థకు అప్పగించకపోతే మోసకారి రాజకీయానికి ముగింపు ఉండదు. - కె. రామచంద్రమూర్తి -
జవాబుదారీతనం ఎక్కడ?
అవినీతిని అంతం చేస్తానంటూ ప్రకటించని రాజకీయ నాయకుడు కనిపిం చడు. అత్యంత అవినీతిపరుడు సైతం నీతి గురించీ, విలువల గురించీ ఢంకా బజాయించి మరీ ఉపన్యాసం ఇస్తాడు. ఈ కపటత్వం మానవ స్వభావంలోనే ఉన్నది. రాజకీయవాదులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇందుకు భిన్నంగా వ్యవ హరించాలని కోరుకోవడం అత్యాశ. మనిషి ఆలోచనే లోపభూయిష్టంగా ఉన్నది కనుక అవినీతిని అరికట్టడం అసాధ్యమని తీర్మానించుకొని చేతులు ముడుచు కొని కూర్చోనక్కరలేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ నీతిమంతంగా ఉండాలంటే రాజ్యవ్యవస్థ కొన్ని షరతులకూ, నియమాలకూ లోబడి ఉండాలి. ప్రవృద్ధ ప్రజాస్వామ్య దేశాలలో అటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలో కెల్లా అత్యంత బలశాలి అంటాం. అటువంటి పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలో రష్యా సహకారం ఉన్నదో లేదో తెలుసుకోవడా నికి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డెరెక్టర్ పదవి నుంచి జేమ్స్ కామేను ట్రంప్ తొలగించింది అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యంపైన ఆయన జరుపుతున్న దర్యాప్తును అడ్డుకోవడం కోసమేనని అమెరికన్లలో అధికసంఖ్యాకులు నమ్ముతున్నారు. అమెరికా కాంగ్రెస్ ఎదుట వాగ్మూలం చెప్పే అవకాశం కామేకు అమెరికా రాజ్యాంగం ప్రసాదిం చింది. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని కామే స్పష్టంగా చెప్పాడు. జేమ్స్ కామేను బర్తరఫ్ చేసినందుకు నాపై దర్యాప్తు జరుగుతోంది ('I am being investigated over James Comey firing') అంటూ ట్రంప్ ప్రకటిం చాడు. ‘ఎన్నికలలో రష్యా జోక్యం లేదని నేను చెబుతున్నాను. కనుక విచారణ అక్కరలేదు’ అని చెప్పే సాహసం ట్రంప్ చేయరు. ఒకవేళ చేసినా, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆమోదించవు. అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగాన్నీ, రాజ్యంగ సంస్థలనీ, విధివిధానాలనూ తప్పించుకోలేడు. వారు తప్పు చేయరని కాదు. తప్పు చేయడానికి జంకుతారు. తప్పు చేస్తే విధిగా విచారణ జరుగుతుంది. నిక్సన్, క్లింటన్ల విషయంలో నిజం నిగ్గు తేలేవరకూ వారిని దర్యాప్తు సంస్థలూ, కాంగ్రెస్ (పార్లమెంటు), న్యాయస్థానాలూ విడిచిపెట్ట లేదు. మనది ఏడుపదుల ప్రజాస్వామ్య వ్యవస్థ. పరిణతి చెందే క్రమంలో ఉంది. ఇక్కడ నాయకులు తమ తప్పులపైన దర్యాప్తు అవసరమో, కాదో వారే నిర్ణయి స్తారు. ఈ పరిస్థితి మారాలి. రాజ్యాంగ సవరణలు అవసరం మన రాజ్యాంగాన్ని మహామహులు నిర్మించారు. స్వాతంత్య్రం సాధించినవారి కంటే రాజ్యాంగం ప్రసాదించిన వారికే మనం పెద్దపీట వేస్తున్నాం. ప్రపంచం లోని అనేక రాజ్యాంగాలను కాచివడబోసి ఎంతో వివేకంతో, ముందుచూపుతో భారత రాజ్యాంగాన్ని సృష్టించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని వంద విడతలకుపైగా సవరించుకున్నాం. అయినప్పటికీ కొన్ని భయంకరమైన లోటుపాట్లు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణం చేసినవారే య«థేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఒకసారి ఎన్నికై అధికారం లోకి వచ్చిన ప్రధానులూ, ముఖ్యమంత్రులూ తమకు తోచిన విధంగా పరిపా లన చేస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్థలకు తాము జవాబుదారీ అని వారు భావిం చడంలేదు. వారు నీతి అంటే నీతి. అవినీతి అంటే అవినీతి. వారు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే సాహసం మంత్రిమండలిలో ఎవ్వరికీ ఉండదు. అటువంటివారిని మంత్రులుగా పెట్టుకోరు. చట్టసభలలో రచ్చ తప్ప చర్చ జర గదు. ఒకవేళ జరిగినప్పటికీ నిజానిజాలతో, ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా అధికార పక్షం గుడ్డిగా సమర్థిస్తుంది. చర్చ లేకుండా, సవరణలు లేకుండా ప్రతి పక్షం సభ నుంచి నిష్క్రమించాక ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అనుకున్న చట్టాలు చేయడం పార్లమెంటులోనూ, శాసనసభలలోనూ ఆనవాయితీ. సభ నుంచి నిష్క్రమించిన ప్రతిపక్షాలనూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కెమేరాల సాక్షిగా జరిగిపోతోంది. ఇది ఎన్నికల ద్వారా పాలకులకు ప్రజలు ప్రసాదించిన హక్కు కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అసలే కాదు. ప్రస్తుతం పదవులలో ఉన్నవారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గతంలో అధికారం నెరపినవారికీ, భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేవారికి కూడా ఇవి వర్తిస్తాయి. అవినీతికి అధికంగా ఆస్కారం ఉన్న రంగాలలో నీటిపారుదల ఒకటి. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఫలానా మొత్తం ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్ మార్పు పేరుతోనో, సిమెంటు, ఇసుక ధరలు పెరిగాయనో, మరే కారణంగానో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని సవరిస్తారు. ఉదాహరణకు రూ. 500 కోట్లు ఉన్నదాన్ని రూ.750 కోట్లు చేస్తారు. సాధారణంగా ముఖ్యమంత్రి, ముఖ్య మంత్రి అనుమతిస్తే ఇరిగేషన్ మంత్రి, ప్రాజెక్టు నిర్మించే కాంట్రాక్టరు కలిసి ఈ నిర్ణయం చేస్తారు. రూ. 750 కోట్లుగా ఎందుకు నిర్ణయించారో, రూ. 700 కోట్లు ఎందుకు కాదో, రూ. 800 కోట్లు ఎందుకు కారాదో వివరించే బాధ్యత తమకు ఉన్నదని ముఖ్యమంత్రులు అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర వ్యవహారం కనుక కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రాజెక్టు వ్యయం వాస్తవంగా ఎంత ఉండాలో, ఎంత ఎక్కువగా చూపిస్తున్నారో తెలుసుకునేది ఎట్లా? లోకాయక్త వ్యవస్థ ఉన్నా, తగిన అధికారాలు లేకపోవడం పెద్ద సమస్య. భూకబ్జా ఎడాపెడా భూకబ్జాల సంగతీ అంతే. విశాఖపట్టణంలో వేలకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములూ, ఎసైన్డ్ భూములూ కబ్జా అయినాయంటూ మీడియా కోడై కూస్తుంది. అయ్యన్నపాత్రుడనే మంత్రివర్యుడు స్వయంగా తమ పార్టీ నాయ కులే కబ్జా చేశారంటూ బహిరంగంగా ప్రకటిస్తారు. విద్యామంత్రి గంటా శ్రీని వాసరావుకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదంటూ మీడియా కథనాలు వెల్లడిస్తాయి. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ స్వయంగా సూత్రధారి అంటూ వార్తలు వస్తాయి. సీబీఐ చేత కానీ న్యాయమూర్తి చేత కానీ దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష నాయకులే కాకుండా స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య మంత్రికి లేఖ రాసి మీడియాకు ఆ సంగతి తెలియజేస్తారు. ముఖ్యమంత్రి మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదనీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తో దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందనీ సెలవిస్తారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వందల ఎకరాల భూమి కబ్జా అయిం దంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీకి చెందిన దిలీప్‌రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడిని అరెస్టు చేశారు. రిజిస్ట్రార్ కార్యా లయంలో పనిచేస్తున్న అధికారుల ఇళ్ళపైనా, వారి బంధువుల ఇళ్ళపైనా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయల అవినీతి బయటపడినట్టు వార్తలు వస్తాయి. ఒక టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ భూములను తమ పేర రిజిస్టర్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వస్తాయి. సదరు ఎంపీ తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ వివాదస్ప దమైన ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడా లేదని ప్రకటిస్తాడు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటానంటూ ఆ మర్నాడే మరో ప్రకటన విడుదల చేస్తారు. మియాపూర్ భూమాయలో ముఖ్యమాయావి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అని చెబుతున్నారు. రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, అధికారుల సహకారం లేకుండా ప్రసాద్ ఒక్కరే ఇంత అవినీతి చేయజాలరు. నిజాం వంశానికి చెంది నవారి పేరున ఉన్న భూములకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) తీసుకొని వాటిని తనకు కావలసినవారి పేరు మీద రిజిస్టర్ చే యించడంలో ప్రసాద్ సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. ఇంత జరిగిన తర్వాత, భూకుంభకోణం అంటూ ఏమీలేదనీ, ఒక్క గజం భూమి అన్యాక్రాంతం కాలేదనీ, ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం జరగలేదనీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తేల్చేస్తారు. ఆరోపణలపైన దర్యాప్తు జరిపించాలో, లేదో, జరిపిస్తే ఏ సంస్థతో జరిపించాలో నిర్ణయించే స్వేచ్ఛ ముఖ్యమంత్రులకు రాజ్యాంగం ప్రసాదించలేదు. ఇటువంటి ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేడు. ఈ విధమైన నిర్ణయాలు తీసు కుంటున్న ప్రధానులూ, ముఖ్యమంత్రుల విషయంలో ఏమి చేయాలో రాజ్యాంగం స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తారో ప్రధానమంత్రులు సైతం అంతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోగలరని ఇందిరాగాంధీ నిరూపిం చారు (ఇది ఆమె శత జయంతివత్సరం). ఇప్పుడు నరేంద్ర మోదీ చేసి చూపి స్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముందుగా తెలియదని వదంతులు వచ్చాయి. తనకు తెలుసునని జైట్లీ స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న ధోరణులే. ఇవి ఇప్పుడే వచ్చినవి కావు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారితో పోయేవీ కాదు. అమెరికా రాజ్యాంగం అంత పకడ్బందీగా మన రాజ్యాంగం లేకపోవడం ఈ అక్రమా లకూ, అవకతవకలకూ కారణం. చట్టం ముందు అందరూ సమానమే అన్న మాట రాతకే పరిమితమా? ప్రజాస్వామ్య సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే ఏమి చేయాలి? రాజ్యాంగం చూపుతున్న పరిష్కారం ఏమిటి? రాజ్యాంగంలో ఉన్న లోపాలను రాజకీయ నాయకులూ, న్యాయమూర్తులూ, ఉన్నతాధికారులూ వినియోగించుకొని అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతు న్నారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానం. అవినీతిని నిర్మూలించాలంటే రాజ్యాంగంలో లొసుగులు లేకుండా చేయాలి. అడ్డదారి తొక్కే అవకాశం ఉన్న ప్పుడు ఎంతటివారైనా ఆ దారిలో నడవడానికే ప్రయత్నిస్తారు. దొంగదారి మూసివేయాలి. ఆ పని ఎట్లా చేయాలో నిర్ణయించాలి. అందుకోసం దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. శాసనకర్తలు ఊహించని పరిణామాలు సంభవించినప్పుడు ఏమి చేయాలి? ఉదాహరణకు శాసనసభాపతి అధికార పార్టీ ప్రయోజనాలకు అతీ తంగా, ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యవహరించాలని ఊహించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 2003లో వాజపేయి హయాంలో సవరించినప్పుడు నిర్ణయాధికారం సభాపతికే వదిలి వేశారు. సభాపతులు ముఖ్యమంత్రి బంట్లుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమైన అనంతరం దాన్ని సవరించకపోతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఇది వర్తిస్తుంది. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే లేదా నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసే స్పీకర్ల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. అందువల్ల విచక్షణాధికారం స్పీకర్లకు లేకుండా చేయాలి. అదేవిధంగా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలను సవరించి నప్పుడు అన్ని కోణాల నుంచీ సవరణలను పరిశీలించి ఆమోదించే లేదా తిరస్క రించే అధికారం ఏదైనా రాజ్యాంగబద్ధమైన ఉన్నతస్థాయి సంస్థకు ఉండాలి. భూకబ్జా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఓటుకు నోటు వ్యవహారం కావచ్చు... ఇటువంటి అవినీతి ఆరోపణలపైన మంత్రివర్గం కానీ, శాసనసభ కానీ నిర్ణయం తీసుకోనప్పుడు ఏమిచేయాలి? ఉదాహరణకు ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ విడియోలో చిక్కిన రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వడం, రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిపైన ఒంటికాలిపై లేవడం చూసిన వారికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎటు వంటి ఒప్పందం కుదిరిందోననే అనుమానం కలుగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చాక, ప్రజలందరికీ తెలిశాక దర్యాప్తు నత్తనకడ నడిస్తే ఎవరిని నిందించాలి? ఈ ప్రశ్నలనూ, ఇటువంటి అనేక అంశాలనూ దేశ వ్యాప్తంగా చర్చించాలి. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకో వాలి. ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన మూల్యం నిరంతర నిఘా. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే పూనుకోవాలి. - కె. రామచంద్రమూర్తి -
ముగ్గురూ ముగ్గురే
మూడేళ్ళుగా మూడు ప్రభుత్వాలు మూడు ముఖ్యమైన రంగాలలో వ్యవహరిస్తున్న తీరులో సామీప్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. సైద్ధాంతిక నేపథ్యం, వ్యక్తిగత వ్యవహార శైలి వేరైనా, ప్రజాస్వామ్య స్ఫూర్తిలోనూ, ప్రతిపక్షాల పట్ల వైఖరిలోనూ, వ్యవసాయ సంక్షోభం విషయంలోనూ ఢిల్లీలో నరేంద్రమోదీ, హైదరాబాద్‌లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), అమరావతిలో నారా చంద్రబాబునాయుడు స్వల్ప వ్యత్యాసాలతో దాదాపు ఒకే విధంగా వ్యవహరిం చడం ఆశ్చర్యం. నాటకీయతకు కొదవ లేదు. ఆత్మస్తుతికీ, పరనిందకీ అంతే లేదు. వాస్తవాలు తెలుసుకోవడానికి నిరాకరిస్తూ తమది అద్భుతమైన పాలన అనీ, తామే నంబర్ వన్ అనీ చాటుకుంటున్నారు. మరో పార్శ్వం ఉందనే స్పృహ లేదు. అప్రియం ఆలకించే సహనం లేదు. ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి దారులు వారివి. కేంద్రంలో ఎన్డీఏ, హైదరా బాద్‌లో టీఆర్ఎస్, అమరావతిలో టీడీపీ–బీజేపీ కూటమి ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే పని ఒక్కటీ చేయలేదు. నీరుగార్చే పనులు మాత్రం అనేకం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి పాలకుల ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిశీలిద్దాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రాముఖ్యం తెలియనివారు వీరిలో ఎవ్వరూ లేరు. కానీ చట్టాన్ని తుంగలో తొక్కడానికి ఎవ్వరూ సంకోచించడం లేదు. రాజీవ్ హయాంలో తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం వాజపేయి నేతృత్వంలో మరోసారి సవ రించిన అనంతరం కూడా ఫిరాయింపులను నిరోధించలేకపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో, తెలంగాణలో యధేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు జరిగాయి. పార్టీకి ద్రోహం చేసినవారిని మంత్రి పదవులతో సత్కరించారు. వారిని బర్తరఫ్ చేయాలంటూ వచ్చిన విజ్ఞప్తులనూ, దరఖాస్తులనూ పట్టించుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోని శాసనసభాపతులే కాదు లోక్‌సభ స్పీకర్ సైతం సాచివేత ధోరణి ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం తెలంగాణలో పార్టీ ఫిరాయించిన తమ శాసనసభ్యులపైన చర్య తీసుకోవాలంటూ మహజర్లు సమర్పించడం విడ్డూరం. ఇంతకంటే హాస్యాస్పదమైన సన్నివేశం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కనిపించదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వడం సంస్కారం. ప్రతిపక్షాలు లేకుండా కేవలం స్వపక్షమే సర్వత్రా ఉండాలని పాలకులు అను కోవడం అప్రజాస్వామికం, నిరంకుశత్వం. ఏలినవారి ఆలోచనలూ, ఉద్ఘాట నలూ, సర్వేలూ, ఎత్తుగడలూ అన్నీ ప్రతిపక్షం పట్ల తూష్ణీభావంతోనే. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అన్నది నరేంద్రమోదీ నినాదం అయితే, ప్రతిపక్ష రహిత రాజకీయ వ్యవస్థను రూపొందించే లక్ష్యం తెలుగు ముఖ్యమంత్రులది. అఖిలపక్ష సమావేశాలూ, సమాలోచనలూ మూడేళ్ళలో ఎన్నడైనా జరిగాయా? పోలీసు కాల్పులు జరిగినప్పుడు మృతుల కుటుంబాలను పలకరించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్ళడం రాజకీయం అంటూ తెగడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజె క్టులకోసం భూసేకరణ చేస్తున్నప్పుడు నిర్వాసితుల మనోభావాలను తెలుసు కునే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సినిమా ఫక్కీలో మధ్యప్రదేశ్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌కి విమానంలో వెళ్ళి, రాష్ట్ర సరిహద్దు వరకూ బైక్ మీద ప్రయాణం చేసి, తర్వాత నయాగాంకి నడిచి, అనంతరం రైలు పట్టాల పక్కనా, పొలాలలోనూ పరుగులు తీసి, తేనె టీగలు కుట్టినా భరించి రైతులను కలుసుకునేందుకు వెడుతుంటే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. ఇంత సీను అవ సరమా? మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉండగా బిహార్ బెల్చీలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ కొంత దూరం విమానంలో, మరికొంత దూరం కారులో ప్రయాణం చేసి చివరికి ఏనుగునెక్కి కుగ్రామం చేరుకున్న ఉదంతాన్ని రాహుల్ గుర్తు చేశారు. అప్పటి మర్యాదలు ఇప్పుడు లేవు. పోల వరం ప్రాజెక్టు దగ్గరికి ప్రతిపక్షాలవారు కానీ హక్కుల కార్యకర్తలు కానీ వెళ్ళ డానికి వీలు లేకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేసి చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మల్లన్న సాగర్ సమీపానికి ప్రతిపక్ష నాయకులు కానీ, న్యాయవాదులు కానీ, హక్కుల కార్యకర్తలు కానీ వెళ్ళ కుండా కట్టడి చేస్తూ కేసీఆర్ బంగారు తెలంగాణకు తనదైన శైలిలో బాటలు వేస్తున్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం రైతుల విషయంలోనూ మూడు ప్రభుత్వాలదీ ఒకే పాట. జైజవాన్, జైకిసాన్ నినాదంతో ఎన్నికల ప్రచారం ఉద్వేగభరితంగా చేసి ముప్పయ్ ఏళ్ళలో మొదటి సారి ఒక పక్షానికి లోక్‌సభలో మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు నరేం ద్రమోదీ. రైతుల రుణ మాఫీ చేస్తానంటూ హామీ ఇవ్వటమే కాకుండా రుణాలు చెల్లించద్దంటూ ఎన్నికల ముందు పనిగట్టుకొని ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు. అదే విధమైన హామీని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన నేత కేసీఆర్. రైతులతోనూ, వ్యవసాయరంగ నిపుణులతోనూ చర్చించకుండా తమకు తోచిన విధంగా ఊహించుకొని పరిష్కారం లభించిందని సంతోషించి, పరి ష్కరించినట్టే భావించి తమను తాము అభినందించుకునే మనస్తత్వం పెరిగింది. ఈ సంవత్సరం పంట దండిగా పండినా దేశవ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో రగి లిపోతున్నారు. పల్లెలతో, వ్యవసాయంతో సంబంధం లేనివారు జాతీయ మీడి యాలో ఆధిపత్య స్థానాలలో ఉండటం, కేంద్ర మంత్రి మండలిలో సైతం వ్యవసాయం పట్ల అవగాహనలేనివారే అధిక సంఖ్యాకులు కావడంతో రైతుల పట్ల ఉపేక్ష పెరిగిన మాట వాస్తవం. వ్యవసాయ సంక్షోభం నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం పుట్టింది కాదు. కేసీఆర్ సైతం దీనికి కారకుడు కాదు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడుగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఈ పాపంలో పన్నెండేళ్ళ భాగం ఉన్నది. 1995 నుంచి 2015 వరకూ దేశంలో 3.18 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అంచనా. ఈ కాలంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, యునైటెడ్ ఫ్రంట్ నాయకత్వంలోని ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా రైతుల బతుకులలో బడబాగ్ని మాత్రం చల్లారలేదు. పంట పుష్కలంగా పండినా రైతులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో వ్యవసాయరంగం అభివృద్ధి పది శాతానికి పైమాటే. అయినా ఆ రాష్ట్రంలోని మంద్‌సౌర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ఆగ్రహించిన రైతులు విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. గుజరాత్, పంజాబ్‌లలో కూడా రైతులు కుత కుతలాడుతున్నారు. తమిళనాడు రైతులు ఇటీవలే జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా చర్యలు తీసు కోవడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. మిర్చి ధర 2015లో క్వింటాల్ రూ. 11,000 అయితే ఈ సంవత్సరం రూ. 4000 కంటే తక్కువే. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ప్రభుత్వ సేకరణ సంస్థలు కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌కు ఫలసాయం తెచ్చిన రైతులు దళారులు చెప్పిన ధరకే తెగనమ్మి ఇళ్ళకు వెళ్ళారు. వ్యవసాయ సంక్షోభం రైతులు ఉద్యమిస్తుంటే, పోలీసు కాల్పుల్లో చనిపోతుంటే రాహుల్‌గాంధీ, జేడీయూ నాయకుడు శరద్ యాదవ్ మృతుల కుటుంబ సభ్యులను పరా మర్శించే ప్రయత్నం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి ఏమి చేస్తున్నారు? బిహార్‌లో మోతిహర్లో బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాభ్యాస ప్రదర్శనలు ఇస్తున్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బాగా పట్టిం చుకున్నదో చెప్పడానికి ఈ వైఖరే నిదర్శనం. రైతులకు సానుభూతి ప్రదర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు ఉన్నదా? ఆ మాటకొస్తే దేశంలోని ఏ రాజ కీయ పక్షానికైనా ఉన్నదా? ఎందుకంటే, రైతు లోకానికి ద్రోహం చేయని పార్టీ లేదు, నాయకుడు లేడు. బీజేపీ ప్రవక్త సీవీఎల్ నరసింహారావు ఏదో చానల్లో ‘నేను రాహుల్‌గాంధీని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. రైతులను ఎవరు రెచ్చగొట్టారో నిర్ధారించే విచారణ జరుగుతోంది. నిజం నిగ్గుతేలుతుంది’ అంటూ చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఒకరు మరొకరిని నిందించవలసిన పని లేదు. అందరూ అందరే. చిత్తశుద్ధి లేనివారే. దేశ జనాభాలో 69 శాతం మంది గ్రామాలలో నివసిస్తున్నారు. పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతున్నప్పటికీ అత్యధికుల వేళ్ళు గ్రామాలలోనే ఉన్నాయి. రైతులలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు. రెండెకరాల కంటే తక్కువ కమతాలు ఉన్నవారే. పట్టా ఉన్న రైతులు పట్టణాలలో ఉంటే కౌలు చేసుకునే రైతు పొలంలో ఉంటాడు. పట్టా ఉన్న రైతుకే బ్యాంకు రుణాలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లభిస్తాయి. కౌలు రైతుకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరే అప్పు చేయాలి. అప్పుల భారం పెరిగి, తిరిగి చెల్లించలేక. వడ్డీవ్యాపారులు ఇంటికి వచ్చి భార్యాపిల్లల ఎదుటా, ఇరుగుపొరుగు సాక్షిగా అవమానిస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాతను ఆదుకోవాలనే చిత్తశుద్ధి పాలకులకు ఏ మాత్రం ఉన్నా ప్రొఫె సర్ స్వామినాథన్ నాయకత్వంలోని నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ సమర్పించిన నివేదికలపైన పార్లమెంటులో చర్చ జరిపేవారు. వ్యవసాయం గిట్టు బాటు కావడానికి ఏయే చర్యలు తీసుకోవాలో నిర్ణయించేవారు. అమలు చేసే వారు. స్వామినాథన్ మొత్తం ఐదు విడతల రిపోర్టు సమర్పించారు– మొదటి నివేదిక 2004 డిసెంబర్లో, రెండో నివేదిక 2005 ఆగస్టులో, మూడోది అదే సంవత్సరం డిసెంబర్ మాసంలో, నాలుగోది 2006 ఏప్రిల్‌లో, చివరిది అదే సంవత్సరం అక్టోబర్‌లో. ఈ నివేదికలపైన పార్లమెంటు ఒక్క గంట కూడా చర్చించలేదు. వ్యవసాయ సంక్షోభంపైన చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, సంక్షోభానికి పరిష్కారం కనుగొనే వరకూ సమా వేశం ఎన్నాళ్ళు అయినా నిర్నిరోధంగా కొనసాగాలనీ నేను సందర్భం వచ్చి నప్పుడల్లా వాదిస్తూ వస్తున్నా. రాష్ట్రాల శాసనసభలు సైతం ఇలాగే చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నవారు లేరు. రైతులను ఓటు బ్యాంకుగా వాడు కోవడానికి మాత్రం అంతా సిద్ధం. వారు సంఘటితం కానంతవరకూ, మూడో కన్ను తెరవనంత వరకూ రాజకీయ నాయకుల ఆటలు సాగుతాయి. స్వామి నాథన్ నివేదికపైన చర్చ జరగకపోగా నివేదికలో చేసిన సూచనలకు బద్ధ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత చంద్రబాబుది. ఆయన రైతుల చేత వ్యాపారం చేయిస్తానంటూ ఒక కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టి అమరావతి కోసం భూసమీకరణ సందర్భంగా అమలు జరిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వరాదన్నది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులలో ప్రధానమైనది. అమరావతి పేరు మీద వేల ఎకరాలు తీసుకున్నది కార్పొ రేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకే. అప్పుడే వితరణ ప్రారంభమై పోయింది. ముఖ్యమైన మూడు అంశాలలో మూడు ప్రభుత్వాల వైఖరి మూడేళ్ళుగా ఒకే విధంగా– ముగ్గురు అధినేతలూ ఒకే బడిలో చదివినట్టు– ఉండటం విశేషం. ఈ వైఖరి సంపూర్ణంగా మారిపోయి, పాలకులలో రైతుల పట్ల చిత్తశుద్ధితో కూడిన ఆదరణ పెరిగే వరకూ ఈ దేశానికి నిష్కృతి లేదు. - కె. రామచంద్రమూర్తి -
జోరు.. తీరు.. హుషారు..!
త్రికాలమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పని నల్లేరు మీద బండిలాగా సాగిపోతోంది. ఏది చేయాలని అనుకుంటే అది చేయగల స్థితిలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఉండే అధిష్ఠానం బెడద లేదు. ముఠాలు లేవు. తెలుగుదేశం ముఖ్యమంత్రిలాగా బెరకు లేదు. ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన లేదు. సంక్షేమ రంగంలో కేసీఆర్ చెలరేగిపోతున్నారు. ఆది వారం జరిగే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టబోయే రిజ ర్వేషన్లకు సంబంధించిన బిల్లులను శనివారం మంత్రివర్గం ఆమోదించింది. రిజర్వేషన్ల శాతాన్ని 62కి పెంచాలనీ, బీసీ–ఇ కింద ముస్లింలకు 12 శాతం రిజర్వే షన్లు ఇవ్వాలనీ, ఆదివాసీల రిజర్వేషన్లను జనాభాలో దామాషా ప్రకారం 10 శాతానికి పెంచాలనీ నిర్ణయించారు. దళితులకు కూడా ఒక శాతం పెంచితే పెంచవచ్చునంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా? న్యాయస్థానాలు ‘స్టే’ ఇవ్వకుండా మిన్నకుంటాయా? ఇటువంటి ప్రశ్నలు లేక పోలేదు. కానీ ముస్లిం మైనారిటీల పట్ల, దళితుల పట్ల, ఆదివాసీల పట్ల తనకు ఎటువంటి నిబద్ధత ఉన్నదో కేసీఆర్ చాటుకోవడానికి అందుబాటులో ఉన్న అవ కాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లను గట్టిగా వ్యతి రేకించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే అవకాశం బీజేపీకి ఉంటుంది. రిజర్వే షన్లను ప్రతిపాదించడం, శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వ హించి చారిత్రకమైన బిల్లులను ఆమోదింపజేయడంలో అసాధారణమైన చొరవ చూపించడం ద్వారా రాజకీయ లబ్ధి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్)కి ఎట్లాగూ దక్కుతుంది. కాంగ్రెస్ వ్యతిరేకించలేదు. ఉత్సాహంగా సమ ర్థించలేదు. ఆ పార్టీకి లాభం లేదు. నష్టం లేదు. రైతులకు ఎరువుల కొను గోలు కోసం ఎకరాకు రూ. 4000లు ఇస్తామనీ, ఈ నిర్ణయం 2018లో అమలు లోకి వస్తుందనీ చెప్పారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలకు ఎకరాకు రూ. 4000ల చొప్పున ఇస్తారో, దీనికి ఏదైనా సూత్రం ఉన్నదో లేకపోతే భవిష్యత్తులో రూపొందిస్తారో తెలియదు. కానీ రైతుల సంక్షేమం తాను మనసారా ఆకాం క్షిస్తున్నట్టు సందేశం పంపించగలిగారు. రైతుల రుణం మాఫీపై ఎన్నికల వాగ్దానం పూర్తిగా అమలు చేశారు. నాణ్యమైన విద్యుచ్ఛక్తి సరఫరా జరుగు తోంది. రైతుకు ఇప్పటికీ సాంత్వన కలగకపోతే ఇంకా ఏమి చేయాలో ఆలోచిం చాలి. రైతు ఆత్మహత్యలు అంతమైనప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సార్థకం. సాఫల్యవైఫల్యాలు లె లంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్స రాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజల స్థితిగతులనూ, పాలకుల పనితీ రునూ సమీక్షించుకోవడం అవసరం. మంత్రులకూ, శాసనసభ్యులకూ ముఖ్య మంత్రి ర్యాంకులు ఇస్తున్నారు. తక్కువ ర్యాంకు వచ్చిన మంత్రులూ, శాసన సభ్యులూ ర్యాంకు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. మంచి కసరత్తే. ముఖ్య మంత్రికి ర్యాంకు ఎవరిస్తారు? ప్రజలే ఇవ్వాలి. కేసీఆర్ సాఫల్యవైఫల్యాలను ప్రజలు సమీక్షిస్తారు. మంత్రుల, ఎంఎల్ఏల ర్యాంకుల నిర్ధారణకు కేసీఆర్ అను సరిస్తున్న విధానం (మెథడాలజీ) ఏమిటో మనకు తెలియదు. తమకు తెలిసిన విధానంలో ప్రజలు అంచనా వేస్తారు. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ఆరుమాసాలూ అధికారులు కుదురుకోవడానికే సరిపోయింది. అనంతరం ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు అమలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలనే కాకుండా లేనివాటిని సైతం అమలు చేసిన ముఖ్యమంత్రి తాను తప్ప మరొకరు ఎవ్వరూ దేశంలో లేరని కేసీఆర్ నిర్ద్వం ద్వంగా ప్రకటించారు. ఈ ప్రకటనపైన భిన్నాభిప్రాయాలకు తావుంది. కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్ళలో సాధించిన ముఖ్యమైన విజయాలూ, సాధించలేకపో యిన కీలకమైన అంశాలూ ఏమిటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడు అంశాలపైన నడిచింది–నీళ్ళు, నిధులు, నియామకాలు. తెలంగాణ ప్రాంతానికి చెందవలసిన కృష్ణా, గోదావరి నదీజలాలు అందకుండా పోతున్నాయనే వాదన ఉద్యమ నాయకులు బలంగా వినిపించారు. ఇప్పుడు కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాదోపవాదాలు సాగుతున్నాయి. శ్రీశైలం జలా శయం నుంచి వదిలిన నీరు నాగార్జునసాగర్ జలాశయంలోకి వచ్చి చేరినప్పటికీ కుడి కాలువలో నీరు వదలడానికి తెలంగాణ నిరాకరించడం వల్ల కృష్ణ నీరు తమకు అందడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ నాయకులు గొడవ పెడుతున్నారు. తెలంగాణ నిర్ణాయక స్థితిలో ఉన్నది. తెలంగాణలో ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ ప్రశ్నిస్తోంది. గోదావరి నీటిని వినియోగించుకునేందుకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు మార్పులు చేర్పులతో తిరిగి రూప కల్పన చేసి నిర్మాణం పనులు చేపడుతోంది. వీటన్నిటి కంటే ముఖ్యమైన పూనిక మిషన్ కాకతీయ. చెరువులలో పూడిక తీయించి, వాటి కరకట్టలు పటిష్ఠం చేసి, వాటి పక్కనే మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమానికి అధికారంలోకి రాగానే శ్రీకారం చుట్టడం అభినందించవలసిన అంశం. చెరువు పనులు ఎవరు చేస్తు న్నారు, ఎంతకి చేస్తున్నారు, అవినీతి ఎంత అనే ప్రశ్నలు అనేకం వినిపించవచ్చు. కానీ పనులు జరుగుతున్నాయనేదీ, ఫలితాలు కనిపిస్తున్నాయనేదీ కంటికి కని పిస్తున్న నిజం. అన్ని గ్రామాలకూ మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో మిషన్ భగీరథను ప్రారంభించడం కూడా గొప్ప చొరవ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకున్నదనే వాస్తవాన్ని గుర్తించి అభినందించాలి. ముమ్మరంగా సంక్షేమ పథకాలు నిధులలో అన్యాయం జరుగుతోందనే వాదనకు పరిష్కారం రాష్ట్ర విభజనే ప్రసా దించింది. ఇక మీదట అన్యాయం అంటూ జరిగితే కేంద్ర ప్రభుత్వం వల్ల జర గాలే కానీ ఆంధ్ర ప్రాంతం వల్ల కాదు. తెలంగాణ నిధులు తెలంగాణలోనే ఖర్చు అవుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం తెలంగాణలోనే వినియోగం అవు తోంది. బంగారు తెలంగాణ నినాదానికీ, కేసీఆర్ ఇటీవల ముమ్మరంగా ప్రక టిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకీ వెన్నుదన్ను హైదరాబాద్ ఆదాయమే. పెరుగు తున్న వ్యాపారం, విస్తరిస్తున్న సేవారంగం (ఐటీ, హోటల్స్ వగైరా) తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్యను పెంచడం, ముస్లిం విద్యార్థులకు సైతం రెసిడెన్షియల్ స్కూలు సౌకర్యం కల్పించడం ప్రశంసార్హమైన విధానం. కల్యాణలక్ష్మి పేరుతో పేదల పెళ్ళిళ్ళకు సహాయం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని దళితులకూ, ఆదివాసీలకూ, ముస్లింలకూ, అత్యంత వెనుకబడిన తరగతులకూ విస్తరించడం అభినందించవలసిన మరో అంశం. నియామకాల విషయంలో ప్రభుత్వం చేసినదానికంటే చేయవలసింది చాలా ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే లేదా ఇవ్వగలిగే ఉద్యో గాలు మహా అయితే లక్ష. ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య తీరదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. యువ జనులకు ఉపాధి కల్పించేందుకు ఒక ప్రణాళిక అవసరం. యువజన విధానం అంటూ ఒకటి ఈ రాష్ట్రానికి కావాలి. చదువుకీ, ఉపాధికీ మధ్య లంగరు అందడం లేదు. ఉపాధికి ఉపయోగించని చదువులు వ్యర్థం. పరిశ్రమలతోనూ, వ్యాపారాలతోనూ విద్యాసంస్థల అనుసంధానం జరగాలి. అటువంటి ప్రయ త్నం కనిపించడం లేదు. విద్యా, ఆరోగ్య రంగాలను ప్రైవేటు రంగమే శాసి స్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలకూ, ప్రభుత్వ ఆస్పత్రులకూ ఇతోధిక ప్రాధాన్య మివ్వాలి. అరవింద్ పనగారియా వంటి అమెరికా నమూనా ఆర్థిక శాస్త్రవేత్త లకూ, అమర్త్యసేన్కూ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో కేసీఆర్ ఇటీవల వివరిం చారు. అమర్త్యసేన్ విద్య, ఆరోగ్య రంగాల నుంచి ప్రభుత్వం నిష్క్రమించడాన్ని ఆమోదించరు. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవించినవారికి నగదు చెల్లించే కార్యక్ర మాలు అమలు చేస్తున్నారు కానీ ఆరోగ్య రంగంలో ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టా లంటే ఈ చర్యలు చాలవు. కేజీ టూ పీజీ ప్రభుత్వరంగంలో ఉండాలన్న ఆదర్శం ఇంకా అమలుకు నోచుకోలేదు. రెండు పడక గదుల నివాసాలను నిర్మించడానికీ వ్యవధి అవసరం. సంకల్పం ఉంది. ఆచరణకు సమయం పడుతుంది. మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ప్రకటించారు. ఇవన్నీ స్వాగతించవలసినవే. ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటే.... ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలైనా, ఎంత అభివృద్ధి సాధించినా అది ప్రజా స్వామ్యబద్ధంగా, అందరినీ కలుపుకొనిపోయే ధోరణిలో జరిగితేనే అందం. ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం విశాలమైన భవన సముదాయం నిర్మిం చారు. ఆయన ఎవరిని కలుసుకోవాలని సంకల్పిస్తే వారిని తన నివాసానికి రప్పించుకుంటారు. వారితో మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రిని కలుసుకోవా లనీ, ఆయనకు తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకోవాలనీ అనుకున్నవారు ఆయనను కలుసుకునే అవకాశం లేదు. ఇదివరకు కొందరు ముఖ్యమంత్రులు రోజులో గంటో, రెండు గంటలో సాధారణ ప్రజలను కలుసుకునేందుకు సమ యం కేటాయించేవారు. సహాయార్థులు ఇచ్చే అర్జీలు ఎవరైనా చదివి పరిష్కరిం చేవారా లేక బుట్టదాఖలయ్యేవా అన్నది వేరే విషయం. ముఖ్యమంత్రికి తన చేతులమీదుగా అర్జీని అందించాననే సంతృప్తి ఆదిలాబాద్ నుంచి వచ్చిన రైతుకో, భద్రాచలం నుంచి వచ్చిన ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికో ఉండేది. కేసీఆర్ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ప్రజల మేలు కోరే అనేక కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వడం అనేది దేశంలో మరె క్కడా లేని సంక్షేమ చర్య. వీటన్నివల్లా కేసీఆర్‌ని ‘మనసున్న మారాజు’గా ప్రజలు భావిస్తారు కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో, మంత్రులనూ, శాసన సభ్యు లనూ, వివిధ వర్గాల ప్రతినిధులనూ కలుసుకొని సంప్రదింపులు జరిపి నిర్ణ యాలు తీసుకుంటున్న ప్రజానాయకుడుగా ప్రజలకు అర్థం కారు. కేసీఆర్‌కు చాలా విషయాలు తెలుసు. ప్రజలనాడి తెలుసు. అయినా సరే ప్రజలను సంప్ర తిస్తున్నట్టు కనిపించాలి. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళరు. అందుకు కారణం ఏమిటో మనకు తెలియదు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నివాసానికి Ðð డుతున్నారు కానీ సచివాలయానికి విధిగా వెళ్ళడం లేదు. ప్రభుత్వ కార్యదర్శులు బద్ధకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపైన పర్యవేక్షణ లేదు. కొన్ని ఫైళ్ళు నెలల తరబడి అపరిష్కృ తంగా ఉంటున్నాయి. నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాలి. మంత్రులు సాహసం చేయరు. ఫైలును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడానికి అధికా రులు తటపటాయిస్తున్నారు. కొత్త చొరవలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దైనందిక పరిపాలనపైన కేసీఆర్ దృష్టి సారించలేకపోతున్నారు. సుదీర్ఘమైన ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి తమకు మరింత అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. ప్రభుత్వ దృష్టికి ప్రజాసమస్యలను తీసుకువెళ్ళడానికి ధర్నా వంటి కార్యక్రమాలను అను మతించినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ధర్నాచౌక్‌ని ఇంది రాపార్క్ నుంచి దూరంగా తరలించాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. నిరసనలూ, నిరశనలూ, నినాదాలూ, ప్రదర్శనలూ ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రి యలే. ఇవన్నీ 2001 నుంచి 2014 వరకూ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ జయప్రదంగా ఆచరించినవే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలనే అనుమతించబోమనడం అప్రజాస్వామికం. ఎవ్వరూ ఎదురు చెప్ప కుండా, ఎటువంటి శబ్దం లేకుండా, వాదన లేకుండా, అసమ్మతి లేకుండా, అలి కిడి లేకుండా, అలజడి లేకుండా సర్వజనులూ పరమ విధేయంగా మౌనంగా ఉండాలనుకోవడం ప్రజాస్వామ్య స్వభావం కాజాలదు. అనేక ప్రగతిశీల, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న క్రమంలో కేసీఆర్ వంటి ప్రజా నాయకుడు మరింత కలివిడిగా, ఉదారంగా, సౌమ్యంగా, నిరాడంబరంగా ఉండాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. ఇంతవరకూ పనితీరుకు కేసీఆర్‌కి ‘ఏ’ గ్రేడ్ ఇవ్వవచ్చు. మరింత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించి ‘ఏ+’ గ్రేడ్కోసం ప్రయత్నించవచ్చు. - కె. రామచంద్రమూర్తి -
ఆత్మ రక్షణలో అధికార పక్షం
త్రికాలమ్ మంత్రివర్గంలో మార్పులు చేసే క్రమంలో శనివారం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో, శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. అలిగేవారు అలుగుతున్నారు. బెదిరించేవారు బెదిరిస్తున్నారు. వేడుకునేవారు వేడుకుంటున్నారు. విన్నవించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్ది చెబుతున్నారు. మంత్రివర్గంలో మార్పులు జరిగిన ప్రతిసారీ ఈ తంతు అని వార్యం. పదవులు ఆశించేవారు ఎక్కువ. పదవులు తక్కువ. ఇంతవరకూ మంత్రులుగా పని చేసినవారు సాధించిన ఘనకార్యాలు ఏమిటో, ఇప్పుడు కొత్తగా చేరేవారు చేయబోయేది ఏమిటో తెలియదు. మంత్రివర్గ సభ్యులతో సమాలోచన జరిపి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక నిర్ణయం తీసుకునే ముందు చర్చ జరిగినట్టు, ముఖ్యమంత్రి అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఒక్క మంత్రి అయినా వెలిబుచ్చినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక పొరపాటు నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు వారించే సాహసం, వివేకం ఉన్న వారికి అవకాశం ఇచ్చినట్లయితే ప్రభుత్వం తప్పులు తక్కువ చేస్తుంది. ముఖ్య మంత్రి ఏది చెబితే దానికి తలలూపేవారినే చేర్చుకుంటే ప్రభుత్వం తప్పులు ఎక్కువ చేసి చిక్కులు కొనితెచ్చుకుంటుంది. విషయ పరిజ్ఞానం ఉన్న శాసనసభ్యులకు అవకాశం ఇస్తే మంత్రివర్గం పనితీరు మెరుగవుతుంది. ప్రభుత్వానికీ, అధికారపార్టీకీ, ముఖ్యమంత్రికీ మంచి పేరు వస్తుంది. రెండున్నర సంవత్సరాలుగా మంత్రులు పని చేసిన తీరును చూసిన ముఖ్యమంత్రి ఎవరికి ఉద్వాసన చెప్పాలో, ఎవరికి ముఖ్యమైన శాఖలు అప్పగించాలో నిర్ణయించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చింది. కేవలం కులాల సమతౌల్యం మాత్రమే చూడకుండా పార్లమెంటరీ సంప్రదాయాలు తెలిసినవారికీ, అధ్యయనశీలం ఉన్నవారికీ, ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయం కలిగినవారికీ మంత్రి పదవులు ఇస్తారో లేక ప్రతిభకు కాకుండా విధేయతకే ప్రాధాన్యం ఇస్తారో కొన్ని గంట లలో తెలిసిపోతుంది. వైఎస్ఆర్సీపీ టికెట్టుపై గెలిచి పార్టీ ఫిరాయించివారిని పార్టీలో చేర్చుకున్న సమయంలో వారికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయ డం ఒక సవాలు. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించడం అనైతికం. వారికి మంత్రి పదవులు ఇవ్వడం అక్రమం. తెలంగాణలో టీడీపీ టికెట్టుపైన గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ చేత మంత్రిగా ప్రమాణం చేయించినందుకు గవర్నర్‌ను తప్పుపట్టి విమర్శించిన చంద్రబాబు అదే గవర్నర్ నరసింహన్ చేత ఫిరాయింపుదారులతో ప్రమాణం చేయించడం ద్వంద్వ ప్రమాణాలకూ, విలువల పతనానికీ పరాకాష్ఠ. బాదల్ నుంచి కేసీఆర్ వరకూ అందరూ చేస్తున్నదే కనుక కుమారుడు లోకేశ్‌ను చేర్చుకోవడాన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. కానీ ఫిరాయింపుదారులకు పద వులు ఇవ్వడం మాత్రం ప్రజలు సహించరు. కేసీఆర్ చేసినా చంద్రబాబు చేసినా అది అనైతికమే, అభ్యంతరకరమే. ఒకటి ఉదాహరణ, ఒకటి హెచ్చరిక సమావేశాలు ఎట్లా జనరంజకంగా జరగాలో చెప్పుకోవాలంటే తెలంగాణ అసెం బ్లీనీ, ఎట్లా జరగకూడదో చూపించాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనీ ఉదాహరణగా చెప్పుకోవచ్చునంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు బాగా ప్రచారమైనాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు పాతరోజులను గుర్తుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు చర్చ లేకుండా సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ, కేకలూ, పొలికేకలతో అట్టుడికాయి. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లా డటానికి అవకాశం లభిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతకు మైకు దొరకడమే గగనం అవుతోంది. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు ఏదైనా చెప్పడానికి లేస్తే ప్రతిపక్ష నాయకుడు కూర్చోవడం ఆనవాయితీ. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుండగానే ఆయన మైక్ ఆగిపోయి అచ్చెన్నాయుడూ, బుచ్చయ్య చౌదరీ, కాల్వ శ్రీనివాసులూ, యనమల రామకృష్ణుడూ, అనిత తదిరులంతా ప్రతిపక్ష నాయకుడిని తనివితీరా తిట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ‘పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి మైక్ కట్ అవుతోంది అధ్యక్షా’ అంటూ తెలంగాణ శాసనసభలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అమ రావతిలో అధికారపక్షం ధోరణిలో మార్పు లేదు. చంద్రబాబు మొత్తం 13 రోజుల్లో ఎనిమిది గంటలకు పైగా మాట్లాడితే 67 మంది సభ్యులున్న (ఫిరా యించినవారి పేర్లు సైతం వైఎస్ఆర్సీపీ జాబితాలోనే ఉన్నాయి) ప్రతిపక్షానికి కేవలం 3.46 గంటల సమయం దొరికింది. నలుగురు సభ్యులున్న బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడటానికి 3.13 గంటల సేపు అనుమతించారు. సభలో చర్చ జరగకపోవడానికి బాధ్యత ఎవరిది? ప్రతిపక్షానిది అనే సమా ధానం అధికారపార్టీ నుంచి వస్తుంది. కానీ సభను సజావుగా జరిపించవలసిన బాధ్యత అధికారపక్షానిదీ, సభానాయకుడిదీ. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి అదేపనిగా ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ సంగతి విస్మరిస్తే కుదరదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు కేంద్రంగా సభ నడవడం. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో ప్రతిపక్షనేతను అదే పనిగా తిట్టించడం. తిట్ల దండకం మినహా వారి నియోజకవర్గాలను పట్టిపీడిస్తున్న సమస్యల ప్రస్తావనకు ఫిరాయింపుదారుకు అవకాశం లేదు. ప్రతిపక్ష నాయకుడు అన్ని అంశాలపైనా అధ్యయనం చేసి గణాంకాలతో సహా సవివరంగా మాట్లాడుతుంటే అధికారపక్ష సభ్యులకు ఆ అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిని తిడితే సరిపోతుంది. మంత్రులూ ఇదే పని చేస్తున్నారు. ఉత్తరోత్తరా ఎవరైనా పరిశోధకులు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలను అధ్యయనం చేస్తే ఎంత నేలబారుగా కొందరు సభ్యులు వ్యవహరించారో చూసి విస్తుపోతారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం ఒక్క బిల్లుపైన కూడా సంపూర్ణంగా చర్చ జరగని సమావేశం ఇదే. మొత్తం 21 బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ ఒక్కదానిపైన కూడా ప్రతిపక్షం అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ముఖ్యమంత్రి వ్యక్తి గతంగా దూషించడం, ప్రతిపక్ష నాయకుడు పరీక్షలు రాయలేదనీ, ఆర్థిక ఉగ్ర వాది అనీ, నేరస్థుడనీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఎవరి స్థాయి తగ్గింది? తన అభిప్రాయం చెప్పడానికి రెండు నిమిషాలు మైకు ఇవ్వమని పదేపదే ప్రతిపక్ష నాయకుడు విజ్ఞప్తి చేసినా నాలుగు రోజుల పాటు మైకు ఇవ్వని పరిస్థితి గతంలో ఎన్నడూ కనలేదు. వినలేదు. ప్రతిపక్షనేత తీరుపైన రెండు గంటలు చర్చ జరిపి ఆయన వైఖరిని నిరసిస్తూ ఒక తీర్మానం ఆమోదించిన ఘనత సైతం ఈ శాసనసభదే. ప్రతి విమర్శకీ జగన్మోహన్రెడ్డి దీటుగా సమా ధానం చెప్పారు. తన ఆస్తుల గురించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య లను సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా తన మీద సీబీఐ విచారణ వెనుక, కేసుల వెనుక ఉన్న కారణాలు ఏమిటో, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి ఎట్లా కేసులు పెట్టించారో సవివరంగా చెప్పారు. తాను ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలలో చదివిన వైనం, ప్రతి పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైన విషయం స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు చంద్రబాబు ఆంగ్లభాషా ప్రావీణ్యంపైన కూడా వ్యాఖ్యానించారు. జానెడు పోయి మూరెడు కుంగడం అంటే ఇదే. జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతలను ప్రశ్నించడం అక్కడ అనవసరం. విద్యా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి మంత్రిపదవి ఇవ్వడం, ఆ మంత్రికి విద్యామంత్రి బంధువు కావ డం వంటి లాలూచీ వ్యవహారం దేశంలో మరెక్కడా లేదు. అటువంటి వ్యక్తుల నిర్వాకాలను ముఖ్యమంత్రి వెనకేసుకొని రావడంతో ఆయనే అపఖ్యాతి పాలవు తున్నారు. మంత్రిత్వశాఖలను మార్చే సమయంలోనైనా ఇటువంటి పొర పాట్లను ముఖ్యమంత్రి సర్దుకుంటారేమో చూడాలి. ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలపైనా తొందరపాటు వ్యాఖ్యలు స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి టీడీపీ అభ్యర్థులు ఎట్లా ఎన్నికైనారో అందరికీ తెలుసు. టీడీపీకి చెందిన సభ్యుల కంటే వైఎస్ఆర్సీపీ సభ్యులు రెట్టింపు కంటే అధికంగా ఉన్న కడపలో కూడా ఓటర్లను సంపాదించి విజయం సాధించడం ఒక ఘనకార్యంగా ముఖ్యమంత్రి డంబాలు పోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పులివెందులలో సైతం గెలుస్తామంటూ, 2019 ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ఉచ్ఛస్వరంతో భీషణ ప్రతిజ్ఞ చేయడం చూశాం. టీచర్లూ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పీడీ ఎఫ్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పెద్ద మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులపై గెలిచిన ప్పుడు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు 80 రోజులకు తక్కువ కాకుండా జరగాలంటూ టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాదన విస్మరించారు. ఈ యేడు శీతాకాల సమావేశాలు జరగనే లేదు. బడ్జెట్ సమావేశాలు జరిగింది 14 రోజులు మాత్రమే. అందులో ఒక రోజు గవర్నర్ ప్రసంగానికి పోతే మిగిలినవి 13. అందులో రెండు రోజులు నారాయణ స్కూల్లో పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీపైన రచ్చ. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగి ఉంటే పద్ధతిగా ఉండేది. ప్రతిపక్షం రెండు రోజులు గొడవ చేసిన తర్వాత పరీక్ష పత్రం లీకేజీపైన చర్చ జరపక తప్పలేదు. లీకేజీ వ్యవహారంపైన నారాయణ ఒక విధంగా, విద్యామంత్రి గంటా మరో విధంగా మాట్లాడటం, ఈ సంగతి ‘సాక్షి’కి మాత్రమే ఎట్లా తెలిసిందంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించడం విడ్డూరం. ప్రశ్నపత్రం లీకైనట్టు తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి తనకు అందిన ప్రశ్నపత్రాన్ని జిల్లా విద్యాధికారికి పంపించి, లీకైన మాట వాస్తవమని, అది అసలైన ప్రశ్నపత్రమేనని అధికారి ధ్రువీకరించిన తర్వాతనే వార్తను టీవీ చానల్‌కు పంపించాడు. ఇది వృత్తిపరంగా ఉన్నతమైన ప్రమాణాలు పాటించే జర్నలిస్టులు చేసే ప్రక్రియ. ఇందుకు అభినందించవలసింది పోయి అతడిని అభి శంసించినట్టు మాట్లాడటం అన్యాయం. ఏదైనా అంశంపైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుకోవడం ఆనవా యితీ. కానీ అగ్రిగోల్డ్ వ్యవహారంపైన చర్చ ముందుకు సాగకుండా పత్తిపాటి పుల్లారావు చేత సవాళ్లు చేయించి చర్చను పక్కదారి పట్టించింది అధికారపక్షమే. అగ్రిగోల్డ్ ఖాతాదారులు బజారుపాలు కావడంలో యాజమాన్యంతో పాటు కొందరు అధికారపక్ష ప్రముఖుల పాత్ర ఏమిటో కూడా వెల్లడి కావాలి. సీబీఐ దర్యాప్తు జరిపించవలసిన వ్యవహారం ఇది. కేసీఆర్ చేసినట్టే చంద్రబాబు కూడా సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ప్రారంభించారు. సభాపతి తన ఇంట ర్వూ్యని సభలో ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుపైన ఒక ప్రజెంటేషన్, ఖరారు కాని అమరావతి న గర డిజైన్లతో మరో ప్రజెంటేషన్ చూపించారు. ప్రతిపక్షాన్ని కలుపుకొని పోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వం దేశం మొత్తంలో బహుశా ఇది ఒక్కటే. ప్రత్యేక హోదా విష యంలో కానీ పోలవరం ప్రాజెక్టు సందర్భంలో కానీ ప్రతిపక్షం ప్రస్తావనే లేదు. రాజధాని నిర్మాణంపైన కె. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు బుట్ట దాఖలు చేశారో చెప్పలేదు. ఆ నివేదికపైన శాసనసభలో కానీ వెలుపల కానీ చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ప్రతిపక్షం సరి పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయం. మొత్తంమీద బడ్జెట్ సమావేశాలు మొదటి నుంచీ అధికారపక్షానికి ప్రతి కూలంగానే సాగాయి. రోడ్డు రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపైన టీడీపీ నాయకులు కేశినేని నానీ, బోండా ఉమా తదితరుల దాడి, నారాయణ స్కూలులో ప్రశ్నపత్రం లీజేకీ, ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు వ్యాపించి నలు గురి మృతి వంటి ఘటనలు అధికారపక్షాన్ని చిరాకు పరిచాయి. చివరికి ‘కాగ్’ నివేదిక రెండున్నరేళ్ళుగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అక్షరసత్యాలంటూ ఘోషించింది. పట్టిసీమపైన అవసరానికి మించి ఖర్చు చేశారనీ, కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారనీ, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతు న్నప్పుడు పట్టిసీమ కానీ, పురుషోత్తపట్టణం, చింతలపూడి ప్రాజెక్టులు కానీ అన వసరమనీ ‘కాగ్’ స్పష్టం చేసింది. కేంద్ర అనుమతులు లేని ఈ ప్రాజెక్టులపైన ఇంత ప్రజాధనం ఎట్లా ఖర్చు చేశారంటూ ప్రభుత్వాన్ని ‘కాగ్’ నిలదీసింది. అధి కారపక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోగా ప్రతిపక్షం ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సారి సభలో ప్రతిపక్షానిదే పైచేయి అన్నది టీడీపీ నాయకులు కూడా అనుకుం టున్న మాట. సభానాయకుడే ప్రతిపక్ష నాయకుడిని కథానాయకుడిని చేసిన సన్నివేశం మనం ఈ సమావేశాలలో చూశాం. - కె. రామచంద్రమూర్తి -
అలనాటి పాటలు మధురం
‘‘కొన్ని పాటలు వినగానే మనసుకు హత్తుకుపోతాయి. అందుకు కారణం చెప్పలేకపోవచ్చు. కానీ, ‘ఆ పాత మధురం’ పుస్తకం చదివితే ఆ పాటలు ఎందుకంతగా నచ్చాయో తెలుస్తుంది. అలనాటి పాత పాటలు జలపాతంపై తేనె ఒలికించినంత మధురంగా ఉంటాయి. 1960 నుంచి 1980 వరకు అద్భుతమైన పాటలు వచ్చాయి’’ అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. 1951 నుంచి 1955 మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోని మంచి పాత పాటల సంకలనంతో పాటు వాటి గురించి విశదీకరిస్తూ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ రాజా రచించిన ‘ఆ పాత మధురం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.పారిశ్రామిక వేత్త వరప్రసాద్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రామచంద్రమూర్తికి అందించారు. డాక్టర్ రాజా మాట్లాడుతూ– ‘‘గోవిందరావు, నారాయణరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌రెడ్డిలు తనకు ఎంతో ప్రోత్సాహం అందించారు. వారి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అన్నారు. ‘‘ఇటీవల వచ్చిన పాటలపై మరో సంపుటి తీసుకొస్తే తానే ముద్రణ వేయిస్తానని’’ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ‘సినీ గీత పరిశోధక శిరోమణి’ గా వక్తలు రాజాను కొనియాడారు. కాగా, ఈ పుస్తకాన్ని మధుసూదన్ శర్మకు అంకితం ఇచ్చారు. సంగీత దర్శకులు ఆర్పీపట్నాయక్, రచయిత డాక్టర్ మృణాళిని, సినీ గేయ రచయిత చంద్రబోస్, సన్ షైన్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణమరాజు, డాక్టర్ భార్గవి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
యూపీ తెరపై యోగి
త్రికాలమ్ ఎవ్వరూ ఊహించని విధంగా సంచలనాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణ యాలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఏ రాజకీయ పండితుడూ ఊహించని విధంగా గోరఖ్‌పూర్ పార్ల మెంటు సభ్యుడు యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి భారత సమాజంపైకి ఒక సవాలు విసిరారు. ఆదిత్యనాథ్‌ను దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమోదించడమో, ప్రజల ఆమోదం పొందే విధంగా ఆదిత్యనాథ్ విశ్వాసాలు మారడమో జరగాలి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకత్వం ఎవరిని సిఫార్సు చేస్తే వారిని ముఖ్యమంత్రులుగా నియమించడానికి అభ్యంతరం లేదని మోదీ మొదటి నుంచీ తన నిర్ణయాల ద్వారా స్పష్టం చేస్తూ వచ్చారు. మహారాష్ట్ర, హరి యాణా ముఖ్యమంత్రుల విషయంలో ఆరెస్సెస్ నేపథ్యం ఉండటం అన్నది ప్రధానమైన అర్హత. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్‌ను ఎంచుకోవడంలో సైతం ఆరెస్సెస్ నేపథ్యం ప్రధానం. ఆరెస్సెస్ బాటలో నడిచి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన రాజకీయ నాయకులూ, ముఖ్యమంత్రి పద విని ఆశిస్తున్నవారూ ఉన్నప్పటికీ కరడు కట్టిన హిందూత్వవాదిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడంలోని ఆంతర్యం ఏమిటి? ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించడం మోదీలో కొట్టవచ్చినట్టు కనిపించే ప్రత్యేకత. మోదీ ఎదుగుదల గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీని బీజేపీ అధినేత లాల్‌కృష్ణ అడ్వాణీ పంపినప్పుడు మోదీ ఒక సాధారణ బీజేపీ కార్యదర్శి. గుజరాత్ ముఖ్య మంత్రిగా కుదురుకున్నాక పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకున్నారు. గోద్రా అనంతరం మత సంఘర్షణలలో ఆయన పాత్ర వివాదాస్పదం కావడంతో దేశ వ్యాప్తంగా మోదీ పేరు మారుమోగింది. తన సారథ్యంలో బీజేపీని వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించడంతో రాజకీయ వ్యూహ రచనలో, ఎన్నికల సమరంలో సాటిలేని మేటిగా గుర్తింపు పొందారు. 2014 నాటి ప్రభం జనంతో తిరుగులేని పరపతి సంపాదించి అత్యున్నత నాయకుడిగా ఎదిగారు. మతప్రాతిపదికపైన సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రమాదపుటంచు లలో పదవిన్యాసాలు చేస్తూ అక్షరతూణీరాలను ప్రయోగించడం ద్వారా హిందు వులను ఆకట్టుకునే రాజనీతిలో మోదీ అసమానుడనే విషయం అందరికీ తెలుసు. యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలన్న నిర్ణయంతో మోదీ హిందూత్వ వాదానికి ఆగ్రాసనం ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ, ఉత్త రాఖండ్లోనూ అగ్రకులాల (జనరల్ క్యాస్ట్స్)కు చెందిన ఠాకూర్లకే పెత్తనం అప్ప గించారు. లౌకికవాదులుగా తమను తాము భావించుకునేవారు ఉత్తరప్రదేశ్‌లో ఏది జరగకూడదని ఆశిస్తున్నారో, ఏది జరుగుతుందని భయపడుతున్నారో సరిగ్గా అదే జరిగింది. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళిన సమయంలో నరేంద్ర మోదీ వ్యక్తిత్వానికీ, యూపీ ముఖ్యమంత్రిగా ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్న యోగీ ఆదిత్యనాథ్ నేపథ్యానికీ చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా విఫలమైన ఉమాభారతికీ, ఆదిత్యనాథ్‌కీ సామ్యం ఉంది. యోగి సాధ్విలాగా విఫల మనోరథుడు అవుతారా లేక మోదీలాగా విజ యుడవుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. వివాదాస్పదుడు చిన్నవయస్సులోనే (26వ ఏటే) 12వ లోక్‌సభకు తూర్పు యూపీలోని గోరఖ్ పూర్ నుంచి గెలుపొందిన ఆదిత్యనాథ్ వరుసగా అయిదు విడతలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంతంలోని కొన్ని జిల్లాలలో దుందు డుకు చర్యలతో సంచలనం సృష్టించిన హిందూ యువ వాహినికి యోగి నాయ కుడు. ఆయన తండ్రి మహంత్ అవైద్యనాథ్ మహరాజ్ బాబ్రీ మసీదును కూల్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న వ్యక్తి. తన కుమారుడు అందరినీ కలుపుకొని పోతాడనీ, పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకుంటాడనీ ఆశిస్తున్నట్టు యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుసుకున్న తర్వాత అవైద్యనాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తండ్రి కోరుకున్న పేరుప్రఖ్యాతులు ఆదిత్య నాథ్‌కు దక్కాలంటే ఆయన వైఖరి పూర్తిగా మారిపోవాలి. ఇంతవరకూ ప్రపంచా నికి తెలిసిన ఆదిత్యనాథ్ లౌక్యం బొత్తిగా తెలియని హిందూత్వవాది. హిందూ, ముస్లిం యువతీయువకుల మధ్య ప్రేమను నిషేధించాలనీ, మతాంతర వివాహాలు ఆమోదం కాదనీ ‘లవ్ జిహాద్’ పేరుతో ఉద్యమం నిర్వహించిన వ్యక్తి. ఇతర మతాలు స్వీకరించిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చేందుకు ‘ఘర్వాప్సీ’ పేరుతో సమాజాన్ని ప్రభావితం చేసిన హిందూత్వ నాయకుడు. గోరక్ష ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన హిందూత్వవాది. సుమారు 1,800 మంది క్రైస్తవులను హిందువులుగా మార్చిన ఉద్యమకారుడు. గోరఖ్‌పూర్‌లో మత కలహాలు జరిగినప్పుడు ఆదిత్యనాథ్‌ను అరెస్టు చేశారు. ప్రత్యర్థులను హత్య చేయించారనే అరోపణలు ఉన్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు పార్టీ విప్‌ను ధిక్కరించిన బీజేపీ మితవాద ఎంపీలలో ఆదిత్యనాథ్ ఒకరు. సూర్యనమస్కారాలను వ్యతి రేకించేవారు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశించిన పార్లమెంటు సభ్యుడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ఖాన్ని పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో పోల్చి, దేశంలో మెజారిటీ మతం ప్రజలు షారుఖ్ఖాన్ని సూపర్ స్టార్ చేశారనీ, వారు కనుక సినిమాలు చూడటం మానివేస్తే షారుఖ్ ముంబయ్ వీధులలో రికామిగా తిరగవలసి వస్తుందనీ వ్యాఖ్యానించిన మఠాధిపతి. ఎన్ని కల ప్రచారం ప్రారంభమైన సందర్భంలో తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆదిత్యనాథ్ పట్టు పట్టారనీ, లేకపోతే హిందూ యువ వాహిని తరఫున తూర్పు యూపీలో తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపుతాననీ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. తన వర్గానికి వందకుపైగా సీట్లు కేటాయించాలంటూ వాదిం చారు. పార్టీ నాయకులు బుజ్జగించిన ఫలితంగా తిరుగుబాటుకు స్వస్తి చెప్పారు. ఏదో సర్ది చెప్పి ఉంటారని భావించారు కానీ, నిజంగానే ముఖ్యమంత్రి పదవిని ఆదిత్యనాథ్‌కు అప్పగిస్తారని ఏ వ్యాఖ్యాతా, ఏ పండితుడూ ఊహించలేదు. వారం రోజులుగా మీడియా కథనాలలో వినిపించిన నాలుగైదు పేర్లలో యోగి పేరు లేదు. కేంద్ర సహాయ మంత్రి మనోజ్‌సిన్హాను ముఖ్యమంత్రిని చేసే అవ కాశం ఉన్నదంటూ శనివారం మధ్యాహ్నం వరకూ ఊహాగానాలు సాగాయి. సిన్హా లేదా ఓబీసీ కులాలను సంఘటితం చేసి మోదీ వెనుక నిలబెట్టిన బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యకు పట్టం కడతారని అనుకున్నాం. వీరిద్దరూ కాకపోతే లక్నో మేయర్ దినేశ్ శర్మకూ లేదా లాల్బహద్దూర్ శాస్త్రి మనుమడు సిద్దార్థనాథ్ సింగ్‌కూ యూపీ పగ్గాలు అప్పజెపుతారని ఊహించాం. యోగీ ఆదిత్యనాథ్ చేతుల్లో యూపీని పెడతారని కలలో కూడా అనుకోలేదు. అనూహ్యమైన నిర్ణయాలతో విస్మయపరచడం మోదీ యుద్ధతంత్రంలో భాగం. యూపీలో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ముస్లిం అభ్యర్థిని బీజేపీ నిలబెట్టలేదు. ముస్లింలకు ప్రబల విరోధిగా పేరుమోసిన హిందూ యువ వాహిని అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేశారు. యూపీ ప్రజలకూ, దేశ ప్రజలకూ ఎటువంటి సంకేతం పంపుతున్నారు? హిందువుల సమీకరణ ఒక్క నియోజకవర్గంలో కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోయినా అద్భుత మైన మెజారిటీ సాధించింది బీజేపీ. దాదాపు వంద టిక్కెట్టు ముస్లిం అభ్యర్థు లకు ఇచ్చిన బీఎస్పీ 18 స్థానాలకు తగ్గింది. ముస్లింలను సంఘటితం చేసి తమ వెంట నిలుపుకోవాలని ఆశించిన ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి వచ్చిన స్థానాల మొత్తం 57. జానాభాలో దాదాపు 21 శాతం ఉన్న దళితులను కులాలవారీగా చీల్చి, 19 శాతం ఉన్న ముస్లింల ఓట్లు ఆశించకుండా యూపీలో ఘనవిజయం సాధించవచ్చునని మోదీ–అమిత్‌షా ద్వయం నిరూపించారు. ముస్లిం అభ్యర్థు లకు మొక్కుబడిగా టిక్కెట్లు ఇవ్వదలచుకుంటే ఉత్తర యూపీలో ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను కొన్నింటిని వారికి కేటాయించడం బీజేపీకి పెద్ద సమస్య కాదు. కానీ ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వకపోవడం అన్నది వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ముస్లిం ఓటర్లతో నిమిత్తం లేకుండా హిందూ ఓట ర్లను సంఘటితం చేయడం మోదీ–షా అనుసరించిన రణనీతి. యాదవ్‌ల పైన విమర్శనాస్త్రాలు సంధించడం ద్వారా యాదవుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న ఇతర వెనుకబడిన కులాలను బీజేపీకి సుముఖం చేయడంలో మోదీ, షా విజ యం సాధించారు. మాయావతికి చెందిన జాతవ్ కులాన్ని వదిలి ఇతర దళిత కులాలవారిని ఆకర్షించ డంలో కృతకృత్యులైనారు. ఓబీసీలలో, దళితులలో విశేషమైన ప్రాబల్యం కలి గిన మౌర్యను బీజేపీ యూపీ శాఖ అధ్యక్షు డుగా నియమించడం సత్ఫలితం ఇచ్చిన నిర్ణ యం. ఓబీసీలకు పెద్ద పీట వేస్తూనే అగ్ర కులాలు (జనరల్ క్యాస్ట్స్) తమకు దూరం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఓబీసీలను తమ గూటికి తెచ్చిన మౌర్యకూ, బ్రాహ్మణ కులానికి చెందిన దినేశ్ శర్మకూ ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయిం చారు. ఎన్నికల ముందూ, ఎన్నికల ప్రచారంలోనూ, ఫలితాలు వెలువడిన తర్వాత తీసుకున్న సకల నిర్ణయాలకూ ప్రాతిపదిక కులం కావడం యూపీ ప్రత్యే కత. అన్ని కులాలనూ సంతృప్తిపరచడానికే ప్రయత్నం. ప్రతిపక్షాలకు సవాల్ యోగి ఆదిత్యనాథ్ వంటి జగమెరిగిన మతవాదికి యూపీ పగ్గాలు ఇవ్వడం ద్వారా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత విజయోత్సవ సభ లోనూ మాట్లాడిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే నినాదం ఆచరణకు నోచు కుంటుందా? మోదీ..మోదీ అంటూ మోదీ నామస్మరణ చేసిన యూపీ ప్రజలు యోగీ.. యోగీ అంటూ ఉత్సాహం ప్రదర్శించడం టీవీలలో చూశాం. హర్‌హర్ మోదీ, హర్హర్యోగీ నినాదాలతో అన్ని కులాలనూ, అన్ని ప్రాంతాలనూ, అన్ని మతాలనూ కలుపుకొని పోవడం సాధ్యం అవుతుందా? అడ్వాణీ రథ యాత్ర బాహాటంగా జరిగిన హిందూత్వ ప్రదర్శన అయితే మోదీ ప్రచార యాత్ర నర్మగర్భంగా, పరోక్షంగా, కొండొకచో ప్రత్యక్షంగా సాగిన హిందూత్వ సమీకరణ. కబ్రస్థాన్, శ్మశాన్, దీపావళి, రంజాన్ అంటూ ముస్లింలను నెత్తిన పెట్టుకుంటూ హిందువుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో వినిపించిన విభజనవాదమే ఎన్నికల అనంతరం కొనసాగడం శోచనీయం. భారతదేశం హిందువులదే అన్న సందేశం ఇవ్వడం ఇందులోని ఉద్దేశమా? పాకిస్తాన్ ఇస్లామిక్ రాష్ట్రమైనట్టు, ఇండియా హిందూ రాష్ట్రం అవుతుందా? అదే మోదీ, తదితర నిర్ణేతల పరమోద్దేశమా? లేదా యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రజారంజకంగా పరిపాలించగల దక్షుడుగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నమా? పరిపాలనలో అనుభవం బొత్తిగా లేని, సమాజంలో కొన్ని వర్గాల పొడగిట్టని, జీవితంలో కొన్ని పార్శా్వలు తెలియని వ్యక్తిని యూపీ వంటి కీలక మైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద మెజారిటీ సాధించిపెట్టిన ప్రచారమే, భావజాలమే, వ్యూహమే 2019లో సైతం ఘనవిజ యానికి దోహదం చేస్తుందనీ, అది ఆదిత్యనాథ్ వంటి హిందూ యువ వాహని సేనాని పరిపాలనలోనే సాధ్యమనీ నరేంద్రమోదీ, అమిత్‌షా ఆలోచిస్తున్నారని భావించాలి. ఒక వైపు ప్రగతి మంత్రం జపిస్తూనే మరోవైపు సమాంతరంగా మతప్రాతిపదికపైన విభజన తంత్రం సాగించడమే యూపీ ప్రచారంలో బీజేపీ అనుసరించిన వ్యూహం. ఇదే వ్యూహం కొనసాగించి ఇదే రకంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలన్నది మోదీ సంకల్పం కావచ్చు. ఆయన ఇటీవల తర చుగా మాట్లాడుతున్న నవభారత (న్యూఇండియా) నిర్మాణానికి ఈ ధోరణి తోడ్పడుతుందా? వచ్చే రెండేళ్ళలో యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీ ప్రభుత్వం పని తీరు మీదా, ప్రతిపక్షాల పోరాట పటిమ మీదా 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆదిత్యనాథ్ నియామకం లౌకిక వాదంలో విశ్వాసం ఉంచిన సమాజానికీ, ప్రతిపక్షాలకూ చేసిన పెనుసవాలు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష. - కె. రామచంద్రమూర్తి -
మరో మోదీ ప్రభంజనం
త్రికాలమ్ భారత ఓటర్ల అంతరంగం అంత తేలికగా అర్థం కాదు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రచార సమయంలో ఎన్నిరోజులు తిరిగినా, ఎంతమందితో మాట్లా డినా ఏ పార్టీ గెలుస్తుందో, ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తుందో చెప్పడం అసాధ్యం. ఎన్నికలకు పూర్వం జరిగిన సర్వేలే కాదు ఎన్నికల అనంతరం జరిగిన ఎగ్జిట్‌పోల్స్‌లో సైతం భిన్నమైన ఫలితాలు రావడానికి కారణం ఇదే. ఓటర్ల మనసులో మాట తెలుసుకోవడం కష్టం. ఓటు వేయకముందు అసలే చెప్పరు. ఓటు వేసిన తర్వాత సైతం నిజం చెప్పరు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అత్యంత ప్రధానమైనది. తర్వాత స్థానం పంజాబ్‌ది. ఉత్తరాఖండ్ది మూడో స్థానం. గోవా, మణిపూర్‌లు బుల్లి రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంత గొప్పగా గెలిచిందో అంతే అద్భుత మైన విజయం పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ సాధించింది. పంజాబ్‌లో అకాలీ– బీజేపీ సంకీర్ణం పదేళ్ళుగా అధికారంలో ఉండటం, అకాలీ పార్టీ, ప్రభుత్వంపై ఒకే ఒక్క కుటుంబ పెత్తనం ఉండటం, అక్కడ బీజేపీ చిన్న భాగస్వామి కావడం, మత్తుపదార్థాల బెడద, అవినీతి చెద, వ్యవసాయ సంక్షోభం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అకాలీ–బీజేపీ సంకీర్ణం చిత్తు కావడం ఖాయం అనే విషయంలో అన్ని సర్వేలదీ ఏకాభి ప్రాయమే. నిజానికి సర్వేల అంచనాలు పదిలోపు స్థానా లే ఈ సంకీర్ణానికి ఇచ్చాయి. ఫలితాలు అంతకంటే మెరుగ్గానే వచ్చాయి. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఇంత అంతరం ఉంటుందని ఏ సర్వే కూడా అంచనా వేయలేదు. రెండు పార్టీలకూ చెరి 55 సీట్లు ఇచ్చిన సర్వేలే ఎక్కువ. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆప్‌కు 20, అకాలీ–బీజేపీ జోడీకి 18 స్థానాలు వచ్చాయి. ఆప్‌లో అసమ్మతి, అరాచకం ఇందుకు కొంతవరకూ కారణం. పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో జాట్ సిక్కులు అకాలీదళ్‌ను పూర్తిగా విడిచిపెట్టకపోవడం కూడా అకాలీల స్థానాలు గౌరవ ప్రదమైన స్థాయిలో రావడానికీ, ఆప్‌కు ఆశాభంగం కలగడానికీ దారితీసి ఉండవచ్చు. 2014లో పంజాబ్ నుంచి నలుగురు ఆప్ అభ్యర్థులు పార్లమెం టుకు ఎన్నికైతే, కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ సభ్యులు ముగ్గురే. కానీ నలుగురు ఆప్ లోక్‌సభ సభ్యులలో ఇద్దరిని సస్పెండ్ చేయగా, ఒక సభ్యుడు ఆరోగ్యం బాగాలేదనే మిషతో ఇల్లు కదలలేదు. ఒక్క భగవంత్ మన్ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా శాసనసభకు పోటీ చేశారు. పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరిందర్‌సింగ్ సామర్థ్యం, ప్రాబల్యం, అకాలీల పట్ల ప్రబలిన ప్రతి కూలత, ఆప్ నాయకుల అనుభవ రాహిత్యం, అనైక్యత కలిసి కాంగ్రెస్‌కు చారి త్రక విజయం సాధించిపెట్టాయి. ఇందులో పార్టీ అధిష్ఠానం పాత్ర పెద్దగా లేదు. చాలా జాప్యం తర్వాత, పార్టీ నుంచి వైదొలుగుతానంటూ సంకేతాలు పంపిన అనంతరం అమరిందర్‌సింగ్‌ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి అంగీకరిం చడం ఒక్కటే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన మేలు. మోదీ, షాలకు లక్ష్యసాధనే ప్రధానం వాజపేయి, అడ్వాణీ రాజకీయాలకీ, నరేంద్రమోదీ, అమిత్‌షా రాజకీయాలకీ మధ్య హస్తిమశకాంతరం ఉంది. లక్ష్యంతో పాటు మార్గం కూడా పరిశుభ్రంగా ఉండాలని భావించిన పాతతరం నాయకులు వాజపేయి, అడ్వాణీ. లక్ష్యం సాధించడమే పరమావధి అనీ, అందుకోసం ఏ మార్గం అనుసరించినా తప్పు లేదని భావించే కొత్తతరం నేతలు మోదీ, షా. అస్సాంలో కాంగ్రెస్‌కి చెందిన సమర్థులైన నాయకులను తమవైపు లాక్కొని ఎన్నికలలో లబ్ధి పొందినట్టే ఉత్తరాఖండ్‌లో కూడా పదిహేను మంది కాంగ్రెస్ నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహించి, వారికి టిక్కెట్లు ఇచ్చి అరువు తెచ్చుకున్న బలంతో ఘనవిజయం సాధించింది బీజేపీ. బీజేపీ నాయకులలో ఖండూరీ ఒక్కరే మాననీయుడు. విజయ్ బహుగుణ, సాక్షి మహరాజ్ వంటి ఫిరాయింపు నాయకుల ప్రాబ ల్యంతో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోవడం ఈ ఫిరాయింపు నాయకుల ధర్మమే. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ విజయాలకు కారకుడు రావత్. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఎన్డి తివారీకో, విజయ్ బహుగుణకో దక్కేది. 2013 జలవిలయం అనంతరం విజయ్‌బహుగుణ రాజీనామా చేయడం వల్ల ముఖ్యమంత్రి పదవి హరీశ్‌రావత్‌కు దక్కింది. ఆయన ప్రశాంతంగా పనిచేసిన రోజులు తక్కువ. ఫిరాయింపుదారులూ, గవర్నర్, కేంద్రమంత్రులూ ఆయనను పలు ఇబ్బందులు పెట్టారు. పైగా ఈ రాష్ట్రంలో ఎవరినీ వరుసగా రెండోసారి గెలిపించే ఆనవాయితీ లేదు. ఎప్పుడూ మార్పు కోసమే ఓటు. ఉత్తరప్రదేశ్ ఒక మినీ భారతం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే అధిక జనాభా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇంతవరకూ అయిదేళ్ళు పూర్తిగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరే. 2007–2012లో మాయావతి, 2012–2017లో అఖిలేశ్. ఒకే పార్టీని వరుసగా రెండోసారి గెలిపించిన సందర్భం ఇటీవలి కాలంలో లేదు. ఉత్తరప్రదేశ్ రాంమనోహర్ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్ వంటి సోషలిస్టు పార్టీ అగ్రనేతల రాజకీయ ప్రయోగశాల. హిందూ సమాజంలో కులాలు వాస్తవం. వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఏ ఆలోచన చేసినా అది వ్యర్థమే అన్న సిద్ధాంతం వారిది. మత రాజకీయాలకూ, కుల రాజకీ యాలకూ కార్యక్షేత్రమైన ఉత్తర ప్రదేశ్‌కు దేశ రాజకీయాలలో విశేష ప్రాముఖ్యం ఉంది. అత్యధికమంది ప్రధానులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఉత్తరాఖండ్ విభజన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 80. 1967లో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచీ అది కులాల కురుక్షేత్రమే. ములాయంసింగ్ ఎస్పీ, మాయావతి బీఎస్పీ కుల రాజకీయాలకు రాజకీయ ప్రతిపత్తిని ఆపాదించాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా ఫలానా నియోజకవర్గంలో ఏ కులంవారు అధికంగా ఉన్నారో చూసి ఆ కులాల నేతలకు టిక్కెట్లు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. కులభావన ప్రజలలో కంటే రాజకీయ నాయకులలో అధికం. కులాలు తిరుగులేని వాస్తవం అని గ్రహించిన తర్వాత కుల నిర్మూలన కంటే వాటి మధ్య సయోధ్యకూ, స్నేహబంధాలకూ ప్రయత్నించడం మంచిదనే ఎరుక కూడా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో పుట్టినదే. అంతకు ముందు తమిళనాడులో వెనుకబడిన కులాలు సమైక్యంగా తిరుగుబాటు ఉద్యమం చేసి అధికారం హస్తగతం చేసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, బిహార్లలో చర్చించిన విధంగా తమిళనాడులో కులాలపైన చర్చించరు. విజయానికి దోహదం చేసిన 4 అంశాలు శనివారం ఫలితాలు చూసి ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించినందుకు మోదీనీ, షానీ అభినందించడం, వారికి బ్రహ్మరథం పట్టడం సహజమే. తరచి చూస్తే ఆవేశరహితమైన వ్యూహరచన, సమర్థమైన రీతిలో అమలు బీజేపీ విజయం వెనుక స్పష్టంగా కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే యూపీలో బీజేపీ ఘనవిజయానికి ప్రధాన కారణాలు నాలుగు: 1. ప్రధాని మోదీ వ్యక్తిత్వ ప్రభావం. ఆయన వాగ్ధాటి, దీక్షాదక్షత, ప్రచార శైలి, ప్రమాదపుటంచుల్లో విన్యా సాలు చేసే సాహసోపేతమైన ప్రవృత్తి, వీధి పోరాట శైలి 2. తమ విజయాలను అర్థం చేసుకోవడంలో మాయావతి, అఖిలేశ్ యాదవ్‌ల వైఫల్యం 3. ఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు. కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా పోరాడక పోవడం 4. యాదవ కుటుంబంలో ముసలం. ఈ రోజున దేశంలో అత్యంత ప్రాబల్యం, ప్రజాదరణ కలిగిన అసాధారణ నాయకుడు మోదీ. ఎన్నికల రంగంలో చెలరేగే యోధుడుగా మోదీకి సాటి లేరు. ప్రగతి గురించి మాత్రమే మాట్లాడుతాను అంటూనే వ్యక్తిగత విమర్శనాస్త్రాలతో అఖిలేశ్నీ, మాయావతినీ వేధించారు. అఖిలేశ్ ప్రభుత్వం యాదవులకే ప్రాధాన్యం ఇచ్చిందంటూ నిశితంగా విమర్శించారు. మాయా వతిని సంపద కూడబెట్టిన నేతగా అభివర్ణించారు. మోదీ విమర్శలో కొంత వాస్తవం ఉన్నది కానీ అసత్యాలూ, అర్ధసత్యాలు సైతం ఉన్నాయి. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్న పంజాబ్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రధాని ప్రకటించలేదు. పశ్చిమ యూపీలో వ్యవసాయదారులు నిర్ణేతలుగా ఉన్న ప్రాం తంలో మాత్రం ఆ వాగ్దానం చేశారు. రుణాలు మాఫ్ చేయడం ఆర్థిక సంస్కర ణలకు విరుద్ధమనే అభిప్రాయం బలంగా కలిగిన ప్రధాని యూపీని గెలుచుకో వడం కోసం నియమాన్ని ఉల్లంఘించారనడానికి ఇదే నిదర్శనం. యూపీ విజయం మోదీకి అత్యవసరం. రాజ్యసభలో మెజారిటీ సాధించాలన్నా, ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలన్నా, తనకు ఇష్టమైన వారిని రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్నా, 2019 నాటికి తిరుగులేని నాయకుడిగా నిల వాలన్నా యూపీలో గెలుపు ముఖ్యం. అందుకు అవసరమైన అన్ని ఎత్తుగడలూ, వ్యూహాలూ మోదీ అనుసరించారు. బీఎస్పీ అధినేత 2007లో ఏ వ్యూహం వల్ల అధికారంలోకి రాగలిగారో విస్మరించారు. 2012లో విజయం సాధించిన విధం ఏమిటో అఖిలేశ్ సైతం మరచిపోయారు. 2007లో మాయావతి అనుసరించిన వ్యూహాన్నే తు.చ. తప్ప కుండా 2017లో అమిత్‌షా అనుసరించారు. మాయావతికి దళితులూ, అఖిలేశ్‌కి యాదవులూ వెన్నుదన్నుగా ఉంటారని తెలిసిందే. కానీ ఎన్నికలలో గెలవాలంటే ఇతరులను సైతం కలుపుకొనిపోవాలని గ్రహించిన మాయావతి 2007లో బ్రాహ్మణులకు పెద్దపీట వేశారు. యూపీ జనాభాలో పది శాతానికిపైగా ఉన్న బ్రాహ్మణులు సహకరించడంతో మాయావతి విజయం సాధించగలిగారు. బ్రాహ్మణ ఓటర్లలో 16 శాతం, యాదవులలో 7 శాతం, ఓబీసీలలో 30 శాతం, జాట్లలో 10 శాతం, జాతవ్ దళితులలో (మాయావతి కులం) 86 శాతం, జాతవేతర దళితులలో 58 శాతం, కుర్మీలలో 16 శాతం, ముస్లింలలో 17 శాతం మంది ఓటు వేసిన కారణంగా 2007లో బీఎస్పీ 202 స్థానాలు సాధించి మరే పార్టీ మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు నడపగలిగింది. 2012లో ఎస్పీకి కూడా 10 శాతం బ్రాహ్మణులు, 19 శాతం రాజపుత్రులు, 8 శాతం జాట్లు, 15 శాతం జాతవ్‌లు, 18 శాతం జాతవేతర దళితులు, 35 శాతం కుర్మీలు, 39 శాతం ముస్లింలు, యాదవ్‌లలో అత్యధిక సంఖ్యాకులు ఓటు వేసి గెలిపించి ఐదేళ్ళు అధికారంలో కొనసాగించారు. అంద రినీ కలుపుకొని వెళ్ళడం వల్లనే గెలుపు సాధ్యమైనదనే వాస్తవాన్ని విస్మరించిన మాయావతి దళితులు, ముస్లింల సంఘటన అంటూ మొదటి నుంచీ పాట ఎత్తుకున్నారు. ఆమె లెక్క ఏమిటంటే యూపీ జనాభాలో 19 శాతం ముస్లింలూ, 21 శాతానికి పైగా దళితులూ ఉన్నారు. ఇద్దరివీ కలిపి 40 శాతం. వాటిలో నాలుగింట మూడువంతుల మంది తన పార్టీకి ఓటు వేసినా గెలిచి తీరుతామన్న ధీమాతో మాయావతి 97 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి ముస్లింలు సంఘ టితం కావాలంటూ అదేపనిగా ఉపన్యాసాలు చెప్పారు. ఆమె ధోరణితో కినిసి బ్రాహ్మణులూ, ఇతర కులాలవారూ, ఓబీసీలూ బీజేపీ కౌగిలిలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌తో పొత్తు తెచ్చిన తంటా నేర స్వభావం కలిగిన నేతలు కలిగిన పార్టీగా, యాదవులకే ప్రాముఖ్యం ఇచ్చే ప్రభుత్వంగా పేరు మోసిన ఎస్పీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేసేందుకు తండ్రి ములాయంనీ, బాబాయి శివపాల్ సింగ్నీ ధిక్కరించి పోరాడి గెలిచిన అఖిలేశ్‌కి ప్రజానీకంలో మంచి పేరుంది. ఆధునిక భావాలు కలిగిన యువకుడిగా, ప్రగతి కాముకుడిగా, అవినీతి మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిం చాడు. అన్ని కులాల యువతీయువకులలో అఖిలేశ్ అంటే అభిమానం ఉంది. కానీ కాంగ్రెస్ పొత్తుతో అఖిలేశ్ దెబ్బతిన్నాడు. కాంగ్రెస్‌కు 105 సీట్లు ఇవ్వడం కేవలం ముస్లింలు మాయావతివైపు పోకుండా తనవైపు తిప్పుకోవాలనే లక్ష్యం తోనే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అంటే కులాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడనుకొని తాము అభిమానిస్తున్న అఖిలేశ్ చివరికి యాదవ్– ముస్లిం ఓటర్ల మద్దతు కోసమే రాహుల్‌తో అవగాహన కుదుర్చుకున్నారని అర్థం చేసుకున్నారు. యూపీ సర్కార్ యాదవీకరణపై నరేంద్రమోదీ చెప్పిన మాటలు యాదవేతర ఓబీసీలు అనుమానం లేకుండా సంపూర్ణంగా విశ్వసించారు. వారంతా బీజేపీ వెనుక సంఘటితమైనారు. ఇతర (అగ్ర) కులాల మద్దతు నిల బెట్టుకుంటూనే ఓబీసీల, దళితుల ఓట్లు దండిగా సంపాదించి 325 స్థానాలు బీజేపీ సంపాదించగలిగిందంటే అందుకు మాయావతి, అఖిలేశ్‌ల అసంకల్పిత సహకారం ఉంది. అమిత్‌షా కులాలవారీ బలసమీకరణ సరేసరి. దాదాపు సంవ త్సర కాలంగా అమిత్‌షా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు. అన్ని కులాల ప్రము ఖులతో రెండు వందల సమావేశాలు నిర్వహించారని భోగట్టా. ఓబీసీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యను బీజేపీ యూపీ శాఖకు అధ్యక్షుడిగా నియమించడంలోనూ కుల సమీకరణ వ్యూహం ఉంది. బహుశా అతనే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావడం ఆయనకు అదనపు అర్హత. ఎస్పీతో గట్టిగా బేరం చేసి 105 స్థానాలు సంపాదించిన కాంగ్రెస్ పూర్తి శక్తి వినియోగించి పోరాటం చేయలేదు. రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారసభలలో ప్రసంగించారు. అఖిలేశ్‌తో కలిసి సంయుక్త ర్యాలీలలో పాల్గొన్నారు. కానీ సోదరి ప్రియాంకను రంగంలో దింపలేదు. ఆమె, అఖిలేశ్ భార్య డింపుల్ కలిసి ఒకే వేదిక నుంచి ప్రచారం చేస్తే యువతులను ప్రభావితం చేస్తారనే ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. కానీ ప్రియాంక ఒకే రోజు ప్రచారం చేశారు. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలలో అత్యధికం బీజేపీకి వచ్చాయి. డింపుల్ చాలా సభలలో మాట్లాడి ప్రజ లను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రియాంక ప్రచారం చేసినా ఫలితాలు ఇదే విధంగా ఉండేవేమో కానీ కాంగ్రెస్ సర్వశక్తులూ వినియోగించలేదనే విమర్శ ఉండేది కాదు. పోరి ఓడితే ఎవ్వరూ తప్పు పట్టరు. మూడు మాసాల కిందట మీడియా అంతటా అఖిలేశ్ కనిపించాడు. ములాయం సింగ్ యాదవ్‌తో, శివపాల్ సింగ్ యాదవ్‌తో స్పర్థలూ, పార్టీలో చీలిక, అమర్‌సింగ్‌ను బహిష్కరిం చాలన్న పట్టుదల, ఎన్నికల సంఘం ఎదుట పంచాయతీ యాదవ కుటుంబంలో కలహాలను పతాకస్థాయికి తీసుకొని వెళ్ళాయి. నిర్మాణాత్మకంగా అఖిలేశ్ ప్రచారం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారం యావత్తూ నిర్మాణాత్మకంగా జరిగింది. మోదీ ఎంత రెచ్చగొట్టినట్టు ఎన్నికల సభలలో మాట్లాడినా అఖిలేశ్, డింపుల్ మాత్రం ‘కామ్ బోల్తా హై’ (పనే చెబుతుంది) అన్న నినాదంపైనే ఆధారపడ్డారు. మోదీ దాడి ఎక్కువైన ఒకానొక సందర్భంలో ‘గుజరాత్ అడవి గాడిదలకు ప్రచారం చేయవద్దని ఈ శతాబ్దపు అగ్రనటుడు అమితాబ్ బచ్చన్‌కు విన్నవించు కుంటున్నా’ అంటూ వ్యంగ్యాస్త్రం ప్రయోగించాడు. దాన్ని మరోసారి ఉపయో గించలేదు. మోదీ మాత్రం ప్రభుత్వంలో యాదవుల ఆధిక్యం గురించీ, ఉద్యోగా లన్నీ యాదవులకు ఇవ్వడం గురించీ ప్రతి సభలో నిందాత్మకంగా మాట్లాడారు. యాదవేతర ఓబీసీలలో అధికారపక్షం పట్ల అసంతృప్తి రగిలించడంలో విజయం సాధించారు. ప్రభంజనం ఏదీ పైకి కనిపించకపోయినా బీఎస్పీ, ఎస్పీ తర్వాత బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు సంకల్పించారని అనుకోవాలి. ఇది దేనికి సంకేతం? ఈ ఫలితాలు దేనికి సంకేతం? 2019లో మోదీకి ఎదురు ఉండబోదని చెప్పగ లమా? 2014 నాటి ఫలితాలనే 2019లో సైతం మోదీ నాయకత్వంలోని బీజేపీ సాధించగలదా? 2014లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మోదీ సుడిగాలి పర్యటనలు చేసి, ఎన్నికల సభలలో మన్మోహన్ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్ పార్టీని నిర్దయగా తూర్పారబట్టారు. యూపీలో ఎస్పీ ప్రభుత్వం శాంతిభద్రతల పరి రక్షణలో, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోరంగా విఫలమైనదంటూ ఎండగట్టారు. మోదీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు. ఇచ్చారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. ప్రజలు మోదీని నమ్మారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రసాదించారు. 2019లో దేశ వ్యాప్తంగా కానీ, యూపీ లాంటి ముఖ్యమైన పెద్ద రాష్ట్రంలోకానీ ప్రతికూల ప్రచారం చేసే అవకాశం మోదీకి ఉండదు. ఆ అవకాశం రాహుల్ గాంధీకీ, అఖిలేశ్ యాదవ్‌కీ, మాయావతికీ, ఇతర ప్రతిపక్ష నాయకులకూ ఉంటుంది. ఇందిర హయాంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెసేతర పక్షా లన్నీ ఒకే తాటి మీదకు వచ్చినట్టు, 1967లో చౌధరీ చరణ్‌సింగ్ నాయకత్వంలో యూపీలో సంయుక్త విధాయక్ దళ్ పేరుతో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సీపీఎం నుంచి భారతీయ జనసంఘ్ వరకూ అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి నిలబెట్టినట్టు ఉత్తరోత్తరా బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమష్టి కార్యాచరణ రూపొం దించుకునే అవకాశం ఉంది. అటువంటి సంఘటనకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో లేదా మరో పార్టీ నాయకత్వం వహిస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. పంజాబ్ విజయంతో కాంగ్రెస్‌కు కొంత గౌరవం పెరిగింది. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుంటే బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే అవకాశం కాం గ్రెస్‌కు దక్కుతుంది. ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోతున్నా మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయం కానీ చేసిన గట్టి మేలు కానీ ఇంతవరకూ ఏదీ లేదు. కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలంగా భావించవలసి వస్తున్నది. తాను ఏమి చేసిందీ అయిదేళ్ళ తర్వాత 2019లో లెక్కలు చెబుతానంటూ మోదీ చాలా సభలలో ప్రకటించారు. ఇక ప్రతిపక్షాల ప్రశ్నలకూ, సాధారణ ప్రజల సందేహాలకూ సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మోదీదే. కేంద్రంలో, ముఖ్యమైన అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు కానీ మిత్రపక్షాల ప్రభుత్వాలు కానీ ఉంటాయి కనుక ప్రతిపక్షాలను నిందించి పబ్బం గడుపుకునే అవకాశం లేదు. ఇక వచ్చేది మోదీకి పరీక్ష కాలం. - కె. రామచంద్రమూర్తి -
పోలీసు రాజ్యం
త్రికాలమ్ అమరావతిలో శాసనసభ, శాసనమండలి భవన సముదాయాన్ని ప్రారంభించిన శుభసందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా చర్చిస్తారనీ, ప్రజాభ్యుదయానికి దోహదం చేసే చట్టాలను చేస్తారనీ, ఆ చట్టాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారనీ ఆశించాలి. అధికారపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రారంభోత్సవానికి హాజరైతే బాగుండేది. ఆహ్వానం పంపిం చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామ కృష్ణుడు చెబితే ఎస్ఎంఎస్ సైతం తమకు రాలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. హైదరాబాద్‌ను వీడి వెడుతున్న సందర్భంగా కొన్నిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కొందరు సీనియర్ పాత్రికేయులను కలుసుకున్నారు. కలుపుకొని వెళ్ళే వైఖరిని కొనసాగించి స్వయంగా ప్రతి పక్ష నాయకులకు ఫోన్ చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే ఆయన ప్రతిష్ఠ పెరిగేది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తే నిర్మాణాత్మకమైన వాతావరణం ఏర్పడటానికి తోడ్పడేది. అటువంటి సద్భావన లేదనేది స్పష్టం. మొత్తం మీద ప్రారంభోత్సవం ఏకపక్షంగా జరిగింది. సభా కార్యక్ర మాలు కూడా ఏకపక్షంగా జరగబోవని కోరుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ఆహ్వానించకపోగా అదేరోజే ప్రతిపక్ష నాయకుడిని తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించడం పాలకుల అసహనానికి పరాకాష్ఠ. లోగడ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులు జలగం వెంగళరావు తీరును తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించింది. అప్రజాస్వామిక ధోరణి ఇదే వైఖరి కొనసాగితే కొత్త శాసనసభా ప్రాంగణంలో సైతం నిరర్థకమైన, అప్రజాస్వామికమైన, అసహనంతో, తిట్ల దండకంతో కూడిన పాత వైఖరే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమాలోచన జరిపి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఎటువంటి నిర్ణ యాలు తీసుకోవాలో, ఏయే చట్టాలు చేయాలో నిర్ణయించుకొని ప్రశాంత వాతా వరణంలో సభ జరిగే విధంగా వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఎవరు ఘాటుగా విమర్శిస్తారో, పరుష పదజాలం ప్రయోగిస్తారో, గొంతు చించుకుం టారో వారి వాదనలోనే పస ఉన్నదని భావిస్తే పొరపాటు. ఎవరు సమంజ సంగా, సహేతుకంగా, శాంతంగా మాట్లాడతారో వారినే ప్రజలు ఆదరిస్తారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టి వారు వాకౌట్ చేసేవరకూ వెంటబడి ఆనక సభను ఏకపక్షంగా జరుపుకొని ఆత్మస్తుతికీ, పరనిందకూ గంటల సమయం వెచ్చిం చడం ఇంతకు ముందు జరిగిన సమావేశాలలో చూశాం. కొత్త ప్రాంగణంలోనైనా ఇందుకు భిన్నంగా సభాకార్యక్రమాలు జరిగితే సభాపతికి సభ్యులందరి మన్ననా దక్కుతుంది. పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టం ఆమోదించినప్పుడే అవ మానం దిగమింగా. శపథం చేశా, చేసి చూపిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్ర బాబు చెప్పుకున్నారు. రెండేళ్ళలోనే సచివాలయం, శాసనసభా ప్రాంగణం నిర్మించినందుకు తనను తాను అభినందించుకున్నారు. మంచిదే. కానీ పాస్టర్ పార్ట్నర్స్ అనే సంస్థ అమరావతి నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ఇదంతా 2019 నాటికి పూర్తవుతుందని అంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండటానికి ఇంకా ఏడేళ్ళ సమయం ఉంది. 2019 వరకూ హైదరాబాద్‌లోనే చట్టసభల సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థలతో కొత్త రాజధానికి రూపకల్పన చేస్తున్నారు. అందులో శాసనసభా భవనానికీ చోటు కల్పించారు. ఈ లోగా తాత్కాలిక శాసనసభా భవన సముదాయం ఎందుకు? తాత్కాలిక సచివాలయం మాత్రం ఎందుకు? శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించుకుంటే వృథావ్యయం ఉండేది కాదు. ‘తాత్కా లిక దుబారా’ ఎందుకో చెప్పవలసింది ముఖ్యమంత్రి మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కరి అభద్రతా భావం కారణంగానే హడావుడిగా అందరినీ అమ రావతికి తరలిస్తున్నారు. ప్రశ్నించే అలవాటు లేదు కనుక మంత్రివర్గ సహ చరులు అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహిస్తున్నారు. ఎన్నికలలో గెలిచారు కనుక అయిదేళ్ళ వరకూ ఏమి చేసినా ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదనే అప్రజాస్వామిక ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జవాబుదారీతనం కలికానికి కూడా లేదు. మితిమీరిన అసహనం స్వీయపక్షంలోనే కాదు ప్రతిపక్షంలోనూ ఎవ్వరు ప్రశ్నించినా ముఖ్యమంత్రి సహించే పరిస్థితి లేదు. పెనుగంచిప్రోలు దగ్గర బస్సు ప్రమాదం అనంతర పరి ణామాలలో ముఖ్యమంత్రి వైఖరి, మంత్రివర్గ తీర్మానం ఇందుకు నిదర్శనం. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెడుతున్న ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సు కాలు వలో పడిపోతే పదిమంది ప్రయాణికులు మరణించారు. 32 మంది గాయప డ్డారు. ఈ వార్త విని ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కారులో అక్కడికి చేరుకునే వరకూ పాలకపక్షం ప్రతినిధులు ఎవ్వరూ రాలేదు. అక్కడికి గంటలోపు ప్రయాణ దూరంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ బాధితు లను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించే ప్రయత్నం చేయలేదు. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడికి శవాలను చుట్టివేసి తరలిస్తున్న దృశ్యం కనిపించింది. ఆసుపత్రిలో నాలుగు శవాలు మూటలు కట్టి ఉన్నాయి. వాటిలో ఒక శవంపైన డ్రైవర్ ఆదినారాయణ పేరు రాసి ఉంది. డ్రైవర్ శవానికి పోస్ట్‌మార్టమ్ చేశారా అని డాక్టర్ని జగన్ మోహన్ రెడ్డి అడిగితే అతను తడబడుతూ చేయలేదని చెప్పాడు. స్పీడ్ నియంత్రణ వ్యవస్థ లేకుండా 130 కిలోమీటర్ల వేగంతో పోతున్న బస్సు పది అడుగులు పైకి లేచి రోడ్డు పక్కన కాలువలో పడిందంటే డ్రైవర్ తాగి ఉండాలని అనుకోవడం సహజం. అది తెలుసుకోవాలంటే శవపరీక్ష ఒక్కటే మార్గం. పరీక్ష చేయకుండానే శవాన్ని పంపించివేయడానికి రంగం సిద్ధం చేశారు. రెండో డ్రైవర్ కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకొని విచారించినా వాస్తవాలు కొంత వరకూ తెలిసేవి. పోస్ట్‌మార్టం రెండు గంటలలో పూర్తి చేశామని మొదట చెప్పిన వైద్యులు తరచి డ్రైవర్ సంగతి అడిగితే శవపరీక్ష జరగలేదని చెప్పారు. డాక్టర్ దగ్గర ఉన్న కాగితాలు అడిగి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్నారు. వెనకనే నిల బడిన జిల్లా కలెక్టర్ బాబు డాక్టర్ వైపు కోపంగా చూస్తూ కాగితాలు ఇవ్వవద్దనీ, వివరాలు చెప్పవద్దనీ కళ్ళతోనే వారిస్తున్నారు. వెనక్కి తిరిగి జిల్లా కలెక్టర్‌తో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ బస్సు యజమానిని రక్షించేందుకు వాస్తవా లను మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారనీ, ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందనీ హెచ్చరించారు. ప్రమాదంలో మరణించినవారి పట్ల వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన తీరునూ, గాయపడినవారినీ చూసిన తర్వాత ఎవరికైనా వ్యవస్థ పట్ల ఆగ్రహం కలుగుతుంది. అదే ధర్మాగ్రహాన్ని ప్రతి పక్ష నేత ప్రదర్శించడం అభ్యంతరకరమంటూ వాదించడం, మంత్రివర్గం పని కట్టుకొని టేపులన్నీ చూసి ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ తీర్మానించడం చూస్తుంటే ఎంత అల్పంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదో తెలుస్తున్నది. ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయలేదు. బస్సు యాజ మాన్యంపైన కేసు పెట్టాలనీ, ప్రమాద కారణాలపైన దర్యాప్తు చేస్తామనీ తీర్మా నించలేదు. ఉత్తరోత్తరా బస్సు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తించాలని తీర్మానం చేయలేదు. రాజధాని నిర్మాణం కోసం సింగ పూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు చర్చించలేదు. వివిధ ప్రాజె క్టుల వ్యయం అంచనాలను చిత్తం వచ్చినట్టు పెంచివేసిన సందర్భాలలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యమైన అన్ని విషయాలలో ఏకపక్షంగానో, కొంతమంది ఆంతరంగికులతో చర్చించో నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి అప్రధా నమైన అంశంపైన మంత్రివర్గ సమావేశంలో సమయం వృథా చేయడం విశేషం. మీడియా అడగవలసిన ప్రశ్నలే అవి మీడియా ప్రతినిధులు అడగవలసిన ప్రశ్నలనే జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మీడియా అడిగినా, ప్రతిపక్ష నాయకుడు అడిగినా సమాధానం చెప్పవలసిన బాధ్యత డాక్టర్‌కు ఉన్నది. కలెక్టర్‌కూ ఉన్నది. ముఖ్యమంత్రి బాటలోనే అధి కారులూ నడిచి అహంకారపూరితంగా, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా, అమానవీయంగా వ్యవహరించడం దుర్మార్గం. ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడం, ప్రశ్నించిన వారిని అణచి వేయడం దేశం అంతటా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు దాష్టీకం శ్రుతి మించుతోంది. నగరి శాసనసభ్యురాలు రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానం అందుకొని గన్నవరం విమానాశ్రయంలో దిగిన శాసనసభ్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించడం ఆత్యయిక పరిస్థితిని తల పించిన దురాగతం. శుక్రవారంనాడు ఆమె కోర్టుకు వెడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అరాచకం. ప్రభు త్వాన్ని ప్రశ్నించే ధైర్యం, తెలివితేటలు ఉన్నాయి కనుక ఒక మహిళా శాసన సభ్యురాలిని ఒక సంవత్సరం పాటు శాసనసభ నుంచి బహిష్కరించడమే కాకుండా కక్షకట్టి వెంటబడి వేధించడం అమానవీయం. పోలీసులనూ, కార్య కర్తలనూ ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నించడం కంటే అప్రజాస్వామ్యం ఏముంటుంది? టీవీ చానళ్ళు వచ్చిన తర్వాత అన్న మాట అనలేదనీ, చేసిన పని చేయ లేదనీ బుకాయించడానికి ఆస్కారం లేదు. ప్రత్యేక హోదా కావాలంటూ గట్టిగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునూ, ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునూ చూపించే అవకాశం ఉంది. తాను ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఎంతమంది అధి కారులతో ఎంత అమర్యాదగా మాట్లాడారో, ఎవరి తాటవొలుస్తానన్నారో, ఎవరిని బదిలీ చేయిస్తానంటూ బెదిరించారో చూపించడానికి అనేక సంద ర్భాలూ, దృశ్యాలూ ఉన్నాయి. పార్టీ నాయకుల ఆదేశం పాటిస్తూ జెండాలు పట్టుకొని రోజాను నిందిస్తూ నినాదాలు చేసిన స్త్రీలు సైతం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోవడానికి సాటి మహిళ ప్రయత్నిస్తుంటే ఆమెకు అడ్డుతగలడం, వ్యతిరేకంగా కేకలు వేయడం ఎటువంటి సంస్కారమో వారు ఆలోచించుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులకు నియమావళి ఉంటుంది. అంతకు మించిన ఆత్మసాక్షి ఉంటుంది. వాటికి అనుగుణంగానే వ్యవహరించాలి. వారు ప్రజాసేవకులు కానీ పాలకులకు బానిసలు కాదు. మర్రి చెన్నారెడ్డితో విభేదాలు వచ్చి రాష్ట్రాంతరం వెళ్ళిపోయిన ఎస్ఆర్ శంకరన్‌ని నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడం లోనూ, ఆత్మాభిమానంతో నైతికంగా వ్యవహరించడంలోనూ, పేదప్రజలకు సేవ చేయడంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి. అధికారులు సైతం పార్టీలకు విధే యంగా ఉంటూ పార్టీల ప్రాతిపదికగా చీలిపోవడం తమిళనాడులో చూశాం. మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు నియమావళికీ, నైతికతకూ ప్రాధాన్యం ఇస్తారనే మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతా ధికారులను (కలెక్టర్ కావచ్చు, డీజీపీ కావచ్చు) ప్రతిపక్షంపైన ప్రయోగించడం చూస్తుంటే తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ కూడా నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు ప్రధానమైన అంగాలు–చట్ట సభలూ, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ. చట్టసభలు ప్రజల సమస్యల పైన చర్చ జరపకుండా ఆధిక్య ప్రదర్శనతో, ఎత్తుగడలతో నిరర్థకంగా సాగిపోతు న్నాయి. పాలకపక్షం ప్రయోజనాలు రక్షించే ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికారులూ ఉన్నారు. న్యాయవ్యవస్థలో జీవితకాలం గడిచినా తీర్పులు వెలువడవు. మీడియాకూ పరిమితులున్నాయి. ప్రజాస్వామ్య ప్రియులకు ఎటు చూసినా నిర్వేదమే కలుగుతోంది. ఈ పరిస్థితి మారాలి. - కె. రామచంద్రమూర్తి -
అసహనం అవసరమా?
త్రికాలమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వీకరించి నేటికి వెయ్యి రోజులు. పుష్కరకాలానికిపైగా ఉద్యమం నిర్వహించి సాధించు కున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే అవకాశం కూడా కేసీఆర్‌కే దక్కడం సముచితమనే అత్యధికులు భావించారు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం దండిగా ఉన్న నేతగా కొత్త రాష్ట్రానికి చక్కటి మార్గదర్శనం చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికగా పరిగణించిన మూడు అంశాలు–నిధులు, నీళ్ళు, నియామకాలు అని అందరికీ తెలుసు. తెలంగాణ నిధులు ఇక తెలంగాణవే. నీళ్ళ విషయంలో ప్రాజెక్టులను పునర్ రూపకల్పన (రీడిజైనింగ్) చేసి నిర్మించాలనీ, కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది కేసీఆర్ స్వప్నం. కొత్తగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను కళ్ళకు కట్టే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలామందికి చూపించారు. కేంద్రమంత్రి ఉమాభారతి సలహాదారు శ్రీరామ్ వెదిరె గోదావరి ప్రాజెక్టులపై రాసిన పుస్తకం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చే ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ కొన్ని రంగాలలో కలకాలం నిలిచిపోయే పనులు ప్రారంభించారు. ముఖ్యంగా రెండు: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. చెరువులలో పూడిక తీయించడం, కరకట్టలను పటిష్ఠం చేయడం కేవలం చెరువుల పునరుద్ధరణకే కాకుండా గ్రామాలలో వ్యవసాయ అను బంధ వృత్తులపై జీవించేవారికి ఉపాధి కల్పించేందుకు కూడా మిషన్ కాక తీయ ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామానికీ మంచినీరు సరఫరా చేయా లన్నది మహాసంకల్పం. శుద్ధి చేసిన నీటిని పౌరులందరికీ అందించగలిగితే దాన్ని మించిన వ్యాధినిరోధక మార్గం మరొకటి లేదు. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమే. ఈ రెండు బృహత్తర కార్యక్రమా లనూ యువకులైన ఇద్దరు మంత్రులకు అప్పజెప్పారు. వృద్ధాప్య పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచడం, యోగ్యులైనవారందరికీ పింఛన్ అందే విధంగా చూడటం చెప్పుకోదగిన సంక్షేమ చర్య. రెసిడెన్షియల్ స్కూళ్ళ విస్త రణ స్వాగతించ వలసిన మరో కార్యక్రమం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సి విద్యార్థులకు 238 రెసిడెన్షియల్ స్కూళ్ళూ, ఆదివాసీలకు 145, బీసీ లకు 161, ఇతరులకు 37 స్కూళ్ళూ ఉన్నాయంటే అందుకు కేసీఆర్ పూనికే కారణం. 201 మైనారిటీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం చరిత్రా త్మకం. భూమి లేని దళిత కుటుంబాలకు మూడున్నర ఎకరాల వంతున సాగు భూమిని కొనుగోలు చేసి ఇవ్వడం మరో గొప్ప సంస్కరణ. కల్యాణ లక్ష్మి పేరుతో నిరు పేద కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ప్రభుత్వం సాయం చేసే పథకం వంటి అనేకం అమలు చేసినందుకు అభినందించవలసిందే. లంగరు అందని ఆకాంక్షలూ, ఆచరణ వెనువెంటనే సమస్యలన్నీ పరిష్కారం కావాలని కానీ అవుతాయని కానీ ఎవ్వరూ వాదించరు. మన దేశంలో ప్రజలకు సహనం ఎక్కువ. రాజకీయ నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసి ఉల్లంఘించినా ఎదురు తిరగరు. వీధులలోకి రారు. మౌనంగా భరిస్తారు. ఎన్నికలలో తిరస్కరించడం ద్వారా తమ ఆగ్రహం ప్రదర్శిస్తారు. ఒక ఆలోచన కార్యరూపం దాల్చడంలో కొంత జాప్యం జరిగినా అర్థం చేసుకుంటారు. తమను ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయని నమ్మకం కుదిరితే చాలు, ఫలాలకోసం వేచి ఉంటారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి ప్రభుత్వాధినేత ఆలోచనలు మరో రకంగా ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకూ, ప్రభుత్వ ఆచరణకూ లంగరు అందదు. ప్రభుత్వ యంత్రాంగం మెల్లగా కదులుతుంది. పైగా దాదాపు సంవత్సరం వరకూ కీలకమైన పదవులలో సైతం అధికారులు కుదురుకోలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది ఒకటిన్నర సంవత్సరాల కిందటే. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు ప్రజలు సంతోషిస్తారు. ప్రతిపక్షాలు విమర్శించినా స్పందించరు. కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ఏవి ప్రజాహితమైనవో, ఏవి కావో గ్రహిస్తారు. చర్చించుకుంటారు. హితైషులే హితవు చెబుతారు. వందిమాగధులకు స్వప్రయోజనాలు ఉంటాయి. అధినాయకుడి కంటే అధికులమంటూ అహంకారం ప్రదర్శించేవారు ఎప్పుడూ ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇటువంటి వ్యక్తులు అధికారపీఠం చుట్టూ తిరుగుతూ ఉంటారు. పొగ డ్తలకు లొంగి భజనపరులను అందలం ఎక్కించే బలహీనత కేసీఆర్‌కు లేదు. ప్రజలతో, ప్రజాసంబంధాలు కలిగి సమాజ హితం కోసం పనిచేసే వారితో మాట్లాడి తన ప్రభుత్వం ఎట్లా పని చేస్తున్నదో, మంత్రులూ, అధికారులూ ఎంత సమర్థంగా పని చేస్తున్నారో తెలుసుకోగల తెలివితేటలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. ఎవరిని, ఎంతమందిని కలుసుకుంటున్నారనే అంశంపైనే ఆయనకు అందే సమాచారం విలువ ఆధారపడి ఉంటుంది. అధినాయకుడు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ పట్టం కడుతూ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా వెలగాలనీ, గొప్ప రాజ కీయవేత్తగా చరిత్రలో నిలిచిపోవాలనీ కేసీఆర్‌ని అభిమానించినవారు కోరుకో వడం సహజం. మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక పాలనపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను చీల్చడం ప్రారంభించినప్పుడు కేసీఆర్ తన అభిమానుల దృష్టిలో పలు^è నైనారు. ఫిరాయింపు ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో గెలిపించుకోకుండా చట్టంలో ఉన్న లొసు గును ఉపయోగించుకొని స్పీకర్ దగ్గరే వ్యవహారం నడిపించినందుకూ, తన పార్టీ అభ్యర్థులను ఓడించిన శాసనసభ్యులకు మంత్రివర్గంలో స్థానం కల్పించి నందుకూ కేసీఆర్‌ను అభిమానించినవారు బాధపడి ఉంటారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు బొత్తిగా ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విమర్శకు తావు ఇచ్చింది. కేసీఆర్ ఎట్లా అర్థం అవుతున్నారు? ఉద్యమ సమయంలో ప్రజలకు అర్థమైన కేసీఆర్‌కూ, ముఖ్యమంత్రిగా అర్థం అవుతున్న కేసీఆర్‌కూ వ్యత్యాసం ఉన్న మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఉద్యమ సారథిలాగా ప్రభుత్వ సారథి వ్యవహరించడం అసాధ్యం. కానీ అంద రినీ సంప్రదిస్తూ, అందరినీ కలుపుకొని ఉద్యమం నిర్మించిన వ్యక్తి ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక తమ అంచనాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. భాషనూ, శరీరభాషనూ జాగ్రత్తగా గమనిస్తూ తమ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రోజుకూ అత్యంత ప్రాబల్యం కలిగిన నాయకుడు కేసీఆర్ అనడంలో సందేహం లేదు. ఆయనకు ప్రత్యామ్నాయం గురించి ప్రజలు ఇప్పుడే ఆలోచించడం లేదు. ఇంత ప్రజాభిమానం కలిగి, చెప్పుకోదగిన గొప్ప నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న నాయకుడికి అభద్రతాభావం, అసహనం ఉండవలసిన అవసరం ఏ మాత్రం లేదు. హాయిగా చిరునవ్వు చెదరకుండా, నిబ్బరంగా ఉండవచ్చు. ఉద్యమం తర్వాత కూడా ఉద్యమభాషనే కొనసాగించనక్కరలేదు. అన్నట్టు, శివరాత్రినాడు కాంగ్రెస్ నేతలను దుయ్యపడుతూ ముఖ్యమంత్రి ప్రయోగించిన పదజాలం ఆయనకు శోభ చేకూర్చదు. కాంగ్రెస్ నాయకులూ తెగించి అదే స్థాయికి దిగితే అందుకు ఎవరిని తప్పు పట్టాలి? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 2009 డిసెంబర్ 9 నాటికి పతాకస్థాయికి తీసు కొని వెళ్ళిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే. ఆయనకు అండగా నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్‌కి కూడా ఈ కీర్తిలో కొంత వాటా ఉంది. ఆ తర్వాత రెండు వారాలకు ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (టీజాక్) వెలిసింది. ఇందులో ప్రధానం కేసీఆర్ చొరవ, ఆచార్య జయశంకర్ మార్గదర్శనం. అప్పటినుంచీ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ఉధృతంగా నడిపించడంలో కోదండరామ్, మల్లెపల్లి లక్ష్మయ్య, ఇంకా అనేకమంది నాయ కుల పాత్ర ఉంది. విద్యార్థుల బలిదానం విస్మరించరానిది. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ వంతు ప్రయత్నం చేశారు. అందరూ శక్తివంచన లేకుండా కృషి చేస్తేనే తెలంగాణ స్వప్నం సాకారం అయింది. సోనియాగాంధీతో, అధిష్ఠానవర్గంలోని ఇతరులతో, ఇతర పార్టీల నాయకులతో, ముఖ్యంగా బీజేపీ నాయకులతో వ్యవహరించడంలోని చాణక్యం యావత్తూ కేసీఆర్‌దే. కాంగ్రెస్‌లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు నమ్మబలికి, రాష్ట్ర విభజన బిల్లు పార్ల మెంటు ఆమోదం పొంది ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్‌లో విలీనం కాకుండా, పొత్తు సైతం పెట్టుకోకుండా, స్వతంత్రంగా పోటీ చేసి మెజారిటీ సాధించడంలో ఆయన చూపిన తెగువ, సాహసం, దీక్షాదక్షతలూ, రాజకీయ చాతుర్యం అనితర సాధ్యం. విభేదాలు ఎందుకు వచ్చాయి? ఒకానొక బహిరంగసభలో కోదండరామ్‌ను పొగుడుతూ కేసీఆర్ మాట్లాడిన సందర్భాలను గుర్తు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్యా విభేదాలు ఎందుకు వచ్చాయో, అందుకు ఎవరు కారణమో సాధారణ ప్రజలకు తెలియదు. కేసీఆర్ కానీ కోదండరామ్ కానీ ఫలానా కారణ మని బహిరంగంగా చెప్పలేదు. నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమక్షంలో మాట్లాడానికి వెళ్ళిన ప్పుడు తనతో రావడానికి కోదండరామ్ నిరాకరించిన కారణంగా కేసీఆర్ మనసు కష్టపెట్టుకున్నారని కొందరి అభిప్రాయం. తెలంగాణ ఇస్తున్న కాంగ్రెస్కీ, తెస్తున్న టీఆర్ఎస్కీ మధ్య సమదూరం పాటించాలని నాటి జేఏసీ కార్యవర్గం నిర్ణయించిందనీ, దాన్ని కోదండరామ్ అమలు చేశారనీ అంటారు. మొత్తంమీద కోదండరామ్ అధికార కేంద్రానికి దూరంగా ఉండటం ప్రజలలో చర్చనీ యాంశం అయింది. తెలంగాణ తుది ఉద్యమం ప్రారంభానికి పూర్వమే పౌరహ క్కుల కోసం పోరాడే ప్రొఫెసర్‌గా కోదండరామ్‌కు పేరుంది. ఆత్మహత్య చేసు కున్న రైతుల కుటుంబాలను పరామర్శించడం, వారికి నష్టపరిహారం ఇప్పిం చడం కోసం ఆయన స్వచ్ఛంద, ఉద్యమ సంస్థల ప్రతినిధులతో కలసి పని చేశారు. ఇప్పుడు అదే పని తిరిగి ప్రారంభించారు. రాజకీయ పార్టీ నెలకొల్పాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. ప్రస్తుతానికి పౌరసమాజం ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమంలో కోదండరామ్‌తో భుజం కలిపి నడిచిన వ్యక్తులే ఇప్పుడు పదవులలో ఉండి ఆయనను అనరాని మాటలు అంటుంటే ఎబ్బెట్టుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉండవు. ప్రైవేటురంగంలో పరిశ్రమలనూ, హోటళ్ళనూ, ఇతర సంస్థలనూ ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించే కృషి జరగాలి. ఆ పని ఇప్పటికే జరుగుతూ ఉంటే అదే సంగతి చెప్పవచ్చు. కోదండరామ్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రించాలనుకోవడం వృథా ప్రయాస. ఆయనను అర్థరాత్రి ఇంటి తలుపులు పగలకొట్టి మరీ అరెస్టు చేయాలని డీసీపీ రవీందర్ సొంత నిర్ణయం తీసుకున్నారో, సీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు చేశారో, తిరుమల వేంకటేశుడి సన్నిధానంలో ఉన్న కేసీఆర్‌కు తెలుసో తెలియదో మనకు తెలియదు. నిరుద్యోగుల ఉద్యమంలో పరిపక్వత రాకుండానే ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం ఎంత తొందరపాటు నిర్ణయమో కోదండరామ్‌నూ, ఇతరులనూ బలప్రయోగంతో అరెస్టు చేయడం, ప్రదర్శ కులపై పోలీసులు బలప్రయోగం చేయడం అంతే నిరర్థకమైన చర్య. ప్రత్యర్థి స్థాయి పెంచే కార్యక్రమం. తెలంగాణ సమాజానికి ప్రశ్నించే స్వభావం లేకపోతే, పోరాడే లక్షణం లేకపోతే ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి సిద్ధించేది కాదు. ప్రశ్నకు సమాధానం చెప్పగల శక్తి ఉన్నప్పుడు అసహనం ఎందుకు? ఆగ్రహించకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే ఉన్నత శిఖరాలకు దారి కనిపిస్తుంది. ఆత్మవిమర్శ చేసు కోకుండా ఆగ్రహిస్తే... ‘తన కోపమె తన శత్రువు...’ అంటూ సుమతీ శతక కారుడు చెప్పిన హితవచనం ఉండనే ఉంది. - కె. రామచంద్రమూర్తి -
తమిళనాట తెలుగు నాటకం!
త్రికాలమ్ తమిళనాడులో సంచలనాత్మకమైన రాజకీయ పరిణామాలు గమనిస్తున్నవారికి సుమారు రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నాటకీయ మైన సన్నివేశాలు గుర్తురాక మానవు. క్యాంపు రాజకీయాలూ, బలప్రదర్శనలూ, గవర్నర్ల పాత్రలూ, పత్రికల ధోరణీ, కేంద్ర ప్రభుత్వాల వైఖరీ కళ్ళ ఎదుట సినిమా రీలులాగా కదులుతాయి. ముఖ్యంగా మా తరం జర్నలిస్టులకు అవి మరపురాని దృశ్యాలు. శాసనసభ్యుల స్వేచ్ఛను హరిస్తూ వారిని హోటల్లోనో, మరోచోటో నిర్బం ధించడం దక్షిణాదిలో మొట్టమొదట జరిగింది హైదరాబాద్‌లోనే. 1984లో ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుపైన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసినప్పుడు రామకృష్ణా స్టూడియోలో, కర్ణాటకలోని నందీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను బందీలుగా ఉంచి క్యాంపు రాజకీయం నడిపించిన చంద్ర బాబునాయుడే పదేళ్ళ తర్వాత అదే మంత్రాంగం చేశారు. వైస్రాయ్ హోటల్లో అదే రామారావుకు వ్యతిరేకంగా అదే పార్టీ శాసనసభ్యులను నిర్బంధించి క్యాంపు రాజకీయాలను పతాకస్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు తమిళనా డులో నడుస్తున్న చరిత్ర అటువంటిదే. జయలలితకు తోడూనీడలా ఉంటూ మూడు దశాబ్దాలుగా పోయెజ్ గార్డెన్‌లోని జయనివాసం ‘వేదనిలయం’లో జీవించిన శశికళా నటరాజన్ క్యాంపు రాజకీయం నడిపిస్తున్నారు. చెన్నై దగ్గర గోల్డెన్‌బే రిసార్ట్‌లో 110 మంది ఎంఎల్ఏలు ఆమె కట్టడిలో ఉన్నారు. గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పాత్ర కీలకం. ఏఐఏడీఎంకేతో స్నేహం ఎన్డీఏ సర్కార్‌కు ప్రధానం. ఆ పార్టీకి చెందిన 135 మంది ఎంఎల్ఏ లతో పాటు 49 మంది ఎంపీల (లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి) మద్దతు రాబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అత్యవసరం. ఏఐఏడీఎంకే శాస నసభాపక్షం నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ శశికళకు ముఖ్య మంత్రి పట్టం కట్టడానికి గవర్నర్ నిరాకరించడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇచ్చిన రాజీనామాను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు శశికళ చేత ప్రమాణం చేయించడం ఒక్కటే మార్గం. తమిళ నాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కొంత నష్టం కలిగించవచ్చు. అయినా తమిళనాడును శశికళకు అప్పగిం చరాదనే మోదీ సర్కార్ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్ సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ బదనాం అవుతున్నారు. శశికళకు శాసనసభ్యులూ, పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంటే పన్నీర్ సెల్వంకు కేంద్రం అండదండలు ఉన్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగు తున్నారు కనుక ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతిలోనే ఉంది. అందుకే జయ మృతిపై న్యాయవిచారణ జరిపిస్తాననీ, ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చుతామనీ ప్రకటనలు చేయగలిగారు. ఇద్దరిదీ ఒకే నామస్మరణ పెన్నీర్సెల్వం టీ దుకాణం నడిపుతూ రాజకీయాలలోకి ప్రవేశించారు. శశికళ మైలాపూర్‌లో ‘వినోద్ వీడియో విజన్’ పేరుతో చిన్న స్థాయి వీడియో వ్యాపారం చేస్తూ, 1982లో జయలలిత రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కడలూరు బహిరంగసభలో ఆమె ప్రసంగాన్ని కలెక్టర్ చంద్రలేఖ ప్రోత్సాహంతో రికార్డు చేయించి ఆమెకు అందజేయడం ద్వారా జయ జీవితంలో ప్రవేశించారు. శశి కళతో పాటు ఆమె భర్త నటరాజన్ కూడా జయ నివాసంలో స్థిరపడ్డారు. పరి ధులు దాటి రాజకీయాలలో జోక్యం చేసుకోవడంతో నటరాజన్‌ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. తనతోనే ఉంటానన్న శశికళను అనుమతించారు. 2011 ఎన్నికల సమయంలో ఏఐఏడీఎంకే అభ్యర్థుల పేర్లను రహస్యంగా చేరవేశారనే ఆరోపణ పైన శశికళను ఇంటి నుంచి బహిష్కరించమే కాకుండా ఆమెతో పాటు 12 మంది బంధువులకు పార్టీ నుంచి ఉద్వాసన చెప్పారు. అనంతరం క్షమాపణ చెప్ప డంతో తిరిగి తన తో ఉండేందుకు అనుమతించారు. అపోలో ఆస్పత్రిలో ఉన్న 75 రోజులూ జయలలితను శశికళే కనిపెట్టుకొని ఉన్నారు. మరెవ్వరికీ ప్రమేయం కల్పించలేదు. జయ అంత్యక్రియలు సైతం ఆమే చేశారు. అందువల్ల జయకు సహజ వారసురాలినని ఆమె భావిస్తున్నారు. జయలాగానే ఆకుపచ్చరంగు చీర, జాకెట్ ధరించడం, ఆమెలాగానే నడవడం, కింద వేచి ఉన్న అభిమానులను పల కరిస్తూ భవనంపై నుంచి జయలాగానే నమస్కరించడం, చేయి ఊపడం నేర్చు కున్నారు. జయవలెనే పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడపాలని నిర్ణయించుకున్నారు. శాసన సభ్యులు ఆమోదించారు కానీ ముఖ్యమంత్రి కావాలన్న శశికళ నిర్ణయాన్ని ఏడుకోట్లమంది తమిళ ప్రజలు హర్షించలేదు. కోటిమంది ఏఐఏడీఎంకేS కార్య కర్తలు సమర్థించలేదు. సినీప్రపంచం ఆహ్వానించలేదు. ఈ ప్రతికూలతను సద్వి నియోగం చేసుకోవాలని పన్నీర్‌సెల్వం ప్రయత్ని స్తున్నారు. గవర్నర్ పరోక్ష సహ కారంతో మద్దతు కూడగట్టగలుగుతున్నారు. శశికళ, పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఒకే కులానికి (తేవర్) చెందినవారు. పేద ఇంట పుట్టిపెరిగినవారు. ఇద్దరూ అమ్మ నామస్మరణ చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమిళ రాజకీయాన్ని రక్తికట్టిస్తు న్నారు. జయలలిత ఆలోచనలలో ఇద్దరికీ వేరు వేరు పాత్రలున్నాయి. రాజకీ యంగా తనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడు, తన తరఫున తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపినవాడు పన్నీర్‌సెల్వం. 2006–2011లో ఏఐఏడీఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనే ఉన్నారు. 2001 లో మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచీ జయ మరణించే వరకూ అదే విధేయత కొనసాగించారు. సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకు న్నారు. ఇటీవల తుపాను చెలరేగినప్పుడూ, జల్లికట్టు ఉద్యమం ఎగిసినప్పుడూ సమర్థంగా పనిచేశారనే అందరూ మెచ్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా శశికళ తాను ముఖ్యమంత్రిగా ఉండలేని సందర్భాలలో జయ తన ప్రతినిధిగా పన్నీర్నే వినియోగించారు కానీ శశికళ గురించి ఆలోచించలేదు. శశికళను చెల్లెలుగా పరి గణించినా, సహాయకురాలిగా భావించినా ఆమెను రాజకీయాలలోకి తేవాలని జయ ఎన్నడూ అనుకోలేదని జయ జీవిత చరిత్ర (అమ్మ: జయలలితాస్ జర్నీ ఫ్రం మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్) రాసిన వాసంతి అంటున్నారు. వాసంతి తమిళ ‘ఇండియా టుడే’ సంపాదకురాలుగా పనిచేసిన అనుభవజ్ఞురాలైన పత్రి కారచయిత. 1996లో జయ ముఖ్యమంత్రిగా ఉండగా శశికళ, మన్నార్గుడి మాఫియాగా పేరుమోసిన ఆమె కుటుంబసభ్యులూ చేసిన అవినీతి వల్లనే జయ అప్రతిష్ఠపాలైనారని ఆమె అభిమానులు వాదిస్తారు. శశికళ మేనల్లుడు సుధాకరన్ను పెంపుడు కొడుకుగా భావించి అతని పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసిన కారణంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ప్రొఫెసర్ సుబ్ర మణియన్స్వామి కేసు పెట్టారు. ఇరవై ఏళ్ళుగా వెంటాడుతున్న ఆ కేసు కార ణంగా జయ, శశికళ జైలుకు వెళ్ళవలసి వచ్చింది. కర్ణాటక హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఇద్దరూ విడుదలైనారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన తర్వాత వాదనలు పరిశీలించిన ధర్మాసనం ఎనిమిది మాసాల కిందట తీర్పును వాయిదా వేసింది. వారంలోగా తీర్పు వెలు వరిస్తా నంటూ సోమవారం అకస్మాత్తుగా ప్రకటించడం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లనేరదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం శశికళకు తగిలిన రెండు ఎదురుదెబ్బలు. గవర్నర్ విద్యాసాగర్ వైఖరి సరేసరి. ఈ కేసు కాకుండా మరి రెండు కేసులు కూడా శశికళపైన ఉన్నాయి. మలేసియా నుంచి విదేశీ మారకద్రవ్యం తెప్పించి నీలగిరిలో తేయాకు తోట కొన్నారనే ఆరోపణ పైన విచారణ జరుగుతోంది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో కేసు ఉంది. ఈ కేసులలో నిర్దోషిగా ప్రకటించవలసిందిగా శశికళ పెట్టుకున్న అర్జీని మద్రాసు హైకోర్టు పక్షం రోజుల కిందటే తిరస్కరించింది. తనపై ఉన్న కేసుల కారణంగా ప్రమాణం చేయించడానికి గవర్నర్ సంకోచిస్తున్నారని అంటు న్నారు కనుక సెంగొట్టియన్ పేరు ప్రతిపాదించాలని శశికళ సంకల్పించినట్టు వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఉపసభాపతి తంబిదొరై బీజేపీ తరఫున సెల్వంకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు శశికళకు తెలియదు. పన్నీర్‌సెల్వంకి ఇప్పటికే 35 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని అంటున్నారు. శాసన సభ్యులను క్యాంపు నుంచి విడుదల చేయగలిగితే పన్నీర్‌సెల్వం పంట పండుతుంది. రోజులు గడిచేకొద్దీ బలపరిచే శాసనసభ్యుల సంఖ్య పెరుగుతుంది. తమిళనాడు పరిణామాలకీ గతంలో జరిగిన క్యాంపు రాజకీయాలకీ తేడా ఏమిటి? అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? నాదెండ్ల భాస్కరరావుకు ముఖ్యమంత్రిగా నెలరోజులు గడువూ, ప్రభుత్వ హంగులూ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో అత్యధికులు ఎన్టీ ఆర్ని వదిలి రాలేదు. ఎన్టీఆర్పట్ల ప్రజలలో అభిమానం వెల్లువెత్తింది. పైగా చంద్రబాబునాయుడూ, వెంకయ్యనాయుడూ, వామపక్షాలూ కలసి నిర్మించిన ప్రజాఉద్యమం ఎన్టీఆర్‌ను పదవిలో పునఃప్రతిష్ఠించింది. నాటి ప్రధాని ఇంది రాగాంధీ దిద్దుబాటు చర్యలలో భాగంగా గవర్నర్ రాంలాల్ స్థానంలో శంకర దయాళ్శర్మను హైదరాబాద్‌కు పంపించారు. శర్మ ఎన్టీఆర్ చేత ప్రమాణస్వీ కారం చేయించారు. అనంతరం ఎన్టీఆర్ శాసనసభ రద్దు చేసి మధ్యంతర ఎన్ని కలలో ఘనవిజయం సాధించారు. ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత 1994లో అద్భుతమైన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్పైన చంద్రబాబు తిరుగుబాటు చేశారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు చంద్రబాబుతో పూర్తిగా సహకరిం చారు. గవర్నర్ కృష్ణకాంత్ స్వయంగా ఆస్పత్రికి వెళ్ళి ఎన్టీఆర్ రాజీనామా స్వీకరించి చంద్రబాబు పని సులువు చేశారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకూ, బావమరిది హరికృష్ణకూ ఉపముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వజూపినట్టే కృష్ణకాంత్‌ను రాష్ట్రపతి చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చా రని అప్పుడు చెప్పుకునేవారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభా శంకర్ మిశ్రానూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్నీ చంద్రబాబు ఎట్లా ప్రసన్నం చేసుకున్నారో కథలు కథలుగా చెప్పుకునేవారు. స్పీకర్ యనమల రామకృష్ణుడు తనను పిలిచి పార్టీలోకి చేర్చుకొని టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో గెలిపించిన ఎన్టీఆర్ పట్ల ఎంత నిర్దయగా, అప్రజాస్వామికంగా వ్యవహరిం చారో ప్రజలకు తెలుసు. మొత్తం మీద నాదెండ్ల తిరుగుబాటు విఫలం కాగా చంద్రబాబు తిరుగుబాటు జయప్రదమై ఆయనను గద్దెనెక్కించింది. పదవి కోల్పోయిన తర్వాత ఆరు మాసాల లోగానే ఎన్టీఆర్ అవమాన భారంతో, గుండెపోటుతో కన్నుమూశారు. శాసనసభ రద్దు చేయాలన్న ఎన్టీఆర్ నిర్ణయం ఆత్మహత్యాసదృశమైనది. ఈ నిర్ణయాన్ని ఎన్టీఆర్ తలకు ఎక్కించింది కూడా చంద్రబాబునాయుడేనని అనుమానం. డబ్బు ఖర్చు చేసి ఎన్నికై సంవత్సరం గడవక మునుపే అసెంబ్లీ రద్దవుతే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆందోళ నతో శాసనసభ్యులలో అధిక సంఖ్యాకులు చంద్రబాబు శిబిరంలో చేరిపో యారు. లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా అభివర్ణిస్తూ ప్రచారం చేయడానికి పత్రికలు సంపూర్ణంగా సహకరించాయి. పత్రికలు చంద్రబాబు పక్షాన నిలబడ్డాయి. వాస్త వాలు రాసే అవకాశం ఉన్న ‘ఉదయం’ 1995 మే 25న మూతపడింది. సరిగ్గా ఆ తర్వాత మూడు నెలలకే వెన్నుపోటు పర్వం నడిచింది. తక్కిన పత్రికలన్నీ (ఆంధ్రభూమి మినహా) చంద్రబాబుకే వత్తాసు పలికాయి. అసెంబ్లీ రద్దు వంటి పొరబాటు పన్నీర్‌సెల్వం చేయలేదు. ఆయనకు గవర్నర్ మద్దతు ఉంది. ప్రధాని ఆశీస్సులున్నాయి. స్పీకర్ ఆయనకే సుముఖంగా ఉన్నారు. శశికళకు శాసన సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఇతర అంశాలు అనుకూలించడం లేదు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సుప్రీంకోర్టు సానుకూలంగా లేదు. 1995 ఆగస్టులో చంద్రబాబుతో సహకరించిన హైకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థల అధిపతులు కానీ, ప్రధాని, గవర్నర్, స్పీకర్ కానీ ఇప్పుడు శశికళ పట్ల సుముఖంగా లేరు. అందుకే శశికళ ముఖ్యమంత్రి స్వప్నం సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. - కె. రామచంద్రమూర్తి -
పంజాబ్‌లో అనూహ్య ఫలితాలు!
(కె. రామచంద్రమూర్తి) ప్రతిష్టాత్మకమైన పంజాబ్ అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో రసవత్తరంగా మారిన త్రిముఖ పోటీ ప్రచారానికి గురువారం తెరపడింది. పాలకపక్ష శిరోమణి అకాలీ దళ్–బీజేపీ కూటమిని పడదోసి పాలకపగ్గాలు చేపట్టేందుకు ‘నువ్వా, నేనా’ అన్నట్టుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చివరి నిమిషం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాలకపక్ష కూటమి చతికిలపడినట్లుగానే కనిపిస్తోంది. ‘2/3 బహుమతి’ అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పదివేల బైకులు, 300 డోల్వాలాలు, 1500 కార్యకర్తల ప్రచారంతో మాల్వా ప్రాంతాన్ని అదరగొట్టింది. చివిరి నిమిషం ప్రచారానికి ఊపునిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. లుంగర్లో లంచ్ చేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని అకాలీ–బీజేపీ కూటమి అవినీతిని తూర్పారపడుతున్నారు. పాకపక్ష అకాలీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ వీధుల్లో చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత గురించి పాలకపక్షం ప్రజలకు గుర్తుచేయగా, 1980, 1990 ప్రాంతాల్లో పంజాబ్‌లో తిరుగుబాటుదారులను ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రోత్సహించి వేలాది మంది మరణానికి కారణమైన అంశాలను కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. ప్రజల మూకుమ్మడి మరణాలకు కారణమయ్యాయంటూ కాంగ్రెస్, అకాలీ పార్టీలను ఆప్ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఈ మారణ హోమాల్లో నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని, అలాగే దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆప్ నాయకులు ప్రచారంలో హామీలిచ్చారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్న బాదల్ కేబినెట్ మంత్రి విక్రమ్ సింగ్ మతీజాను జైలుకు పంపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సవాల్ చేశారు. బాదల్ ప్రభుత్వం బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని, రవాణా వ్యవస్థపై గుత్తాధిపత్యాన్ని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొని వాడి, వేడిగా ప్రసంగించడం, పార్టీ యంత్రాంగం క్రమశిక్షణతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం పాలకపక్షం పరువు నిల్పుకునేందుకు దోహదపడతాయి. ఎన్నికల సర్వేలు ఎప్పుడూ కూడా ఆప్ పట్ల సానుకూలత చూపలేదు. 2015, ఫిబ్రవరి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన ఏడు సర్వేల్లో ఐదు సర్వేలు ఆప్‌కు కాస్త ఆధిక్యం వస్తాయని అంచనా వేశాయి. యాక్సిస్ అనే ఒక్క సర్వే మాత్రమే ఫలితాలకు కాస్త దగ్గరగా అంచనా వేసింది. నాటి ఎన్నికల్లో అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 సీట్లను కైవసం చేసుకొని ఆప్ అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘ఇండియా టుడే–యాక్సిస్, ఎన్డీటీవీ’ నిర్వహించిన సర్వేలు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధిస్తుందని తేల్చాయి. కాంగ్రెస్ పార్టీకి అనుభవజ్ఞుడైన 70 ఏళ్ల అమరీందర్ సింగ్ నాయకత్వం వహించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృతసర్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై పోటీ చేసి విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో రాహుల్ గాంధీ ఆలస్యం చేసినా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని రావడంలో విజయం సాధించి తన శక్తి ఏమిటో నిరూపించుకున్నారు. ప్రజల్లో పైకి కనిపిస్తున్న మూడ్‌ను చూస్తుంటే సహజంగా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించాలి. ఆ తర్వాత స్థానంలో ఆప్ రావాలి. ప్రజల మనోభావాలను కాస్త లోతుగా చూస్తే వాతావరణం ఆప్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఆప్‌కు ఓసారి అవకాశం ఇవ్వాలని, రైతులు, గ్రామస్థులు భావిస్తున్నారు. వారికి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియదు గానీ ఆప్ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘మొహల్లా దవాఖాన’, విద్యుత్ టారిఫ్‌లను తగ్గించడం గురించి మాట్లాడుకుంటున్నారు. నా పంజాబ్ పర్యటనలో నాతో తమ మనోభావాలను వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మంది రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. మార్పు కోరుకుంటున్న వారంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించలేం. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలాగా పంజాబ్‌లో ఎన్నో సంవత్సరాలుగా అకాలీలకు ఓటేస్తూ వస్తున్నవాళ్లు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు తిరగాలంటే కష్టమే. ఎందుకంటే వారు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతోనే అకాలీలకు ఓటేస్తూ వచ్చారు. పార్టీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైనే ఏర్పడింది. అందుకే ఎన్నడూ ఆ పార్టీతో అకాలీలు పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్, అకాలీలను వ్యతిరేకిస్తున్న వారంతా ఆప్నే కోరుకుంటున్నారు. ఆ పార్టీకి ఒక్కసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు. లూధియానాలో ఓ చాయ్ వాలా మాత్రం ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్–ఆప్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాక్షించారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంపై అన్ని పార్టీలు ప్రధానంగా తమ దృష్టిని కేంద్రీకరించాయి. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉండడం అందుకు కారణం. ఈ ప్రాంతంలోనే ఆప్ తన ప్రజాదరణను పెంచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ నాలుగు సీట్లను గెలుచుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న అమరీందర్ సింగ్, భగవంత్ సింగ్ మాన్లు ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దులోని మాఝా ప్రాంతంలో ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుంది. దోవ్బాలో కాంగ్రెస్, అకాలీలు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అకాలీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోకి ఆప్ క్రమంగా చొచ్చుకుపోతోంది. పైకి కనిపించకపోయినా విజయలక్ష్మి మాత్రం ఆప్నే వరించే అవకాశం ఉంది. -వ్యాసకర్త 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ -
ఇదేమి రాజ్యం?
త్రికాలమ్ అధికారంలో ఉన్నవారికి ప్రతిపక్షాల కార్యాచరణ నచ్చదు. ప్రతిపక్షంలో ఉండి ధర్నాలూ, రైలు రోకోలూ చేసినవారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను ప్రతిపక్షం చేస్తే విధ్వంసంగా కనిపిస్తుంది. ఏడు దశాబ్దాలకు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో అనేక ఉద్యమాలు చూశాం. ఉద్యమాల సమయంలో సంయమనం పాటించిన ప్రధానులనూ, ముఖ్యమంత్రులనూ చూశాం. నిగ్రహం కోల్పోయి నియంతలుగా వ్యవహరించినవారినీ చూశాం. వారికి ఎటువంటి శాస్తి జరిగిందో కూడా చూశాం. నోటికి వచ్చినట్టు వాగే మంత్రులనూ, శాసనసభ్యులనూ, అడ్డగోలుగా మాట్లాడే ముఖ్యమంత్రినీ ఇప్పుడే చూస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం, ప్రతి పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపైన ధ్వజమెత్తడం సహజమే. ప్రతిపక్ష నాయకుడి పైన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు విచక్షణ లేకుండా నేల బారుగా మాట్లాడటం చూస్తుంటే ఇది అనాగరిక ప్రభుత్వం అనిపిస్తోంది. కనీస సంస్కారం లోపించినవారు మంత్రులుగా వ్యవహరించడం, వారు మతి తప్పి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వారిని నివారించి మందలించకపోగా ఆమోదిం చడం ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలిపే వైఖరి. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అవాంఛనీయ, అప్రజాస్వామిక ధోరణులపైన వార్తలు రాసినం దుకూ, దృశ్యాలు చూపినందుకూ ముఖ్యమంత్రి మీడియాపైన కారాలు మిరియాలు నూరడం నానాటికీ పెరుగుతున్న పాలకుల నిరంకుశ ధోరణికి నిదర్శనం. తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా ప్రశ్నించకూడదు. మాటలు కోటలు దాటì , చేతలు గడప దాటకపోయినా విమర్శించకూడదు. ఓటు కోసం నోట్లు ఇస్తూ దొరికిపోయినా, కేసు విచారణకు రాకుండా నానా తిప్పలు పడినా అదేమని అడగకూడదు. నిరర్థకమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో కోట్లు వృథా చేసినా అభ్యంతరం చెప్పకూడదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటూ ప్రణాళికాబద్ధంగా రాజధాని నిర్మించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆదరాబాదరాగా అమరావతికి వెళ్ళడం ఎందుకో, తాత్కాలిక సచివాలయం పేరుతో కోట్లు తగలెయ్యడం ఎందుకో చెప్పాలని అన కూడదు. స్థానిక మీడియా సంస్థలూ, కేంద్ర ప్రభుత్వం కావాలని కళ్ళు మూసు కున్నప్పటికీ అమరావతి నిర్మాణ వ్యూహంలోని అవినీతినీ, అక్రమాలనూ వెల్ల డిస్తూ జపాన్‌కు చెందిన మకీ అండ్ అసోసియేట్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా దాని గురించి ప్రస్తావించకూడదు. మీడియా రాయదు. కేంద్ర ప్రభుత్వం అడగదు. మంత్రివర్గ సహచరులు నోరు విప్పరు. శాసనసభ్యులు ఎవరి రంధిలో వారున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేదెలా? అవినీతి రహి తంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తానంటూ విశాఖ భాగస్వామ్య సద స్సులో చంద్రబాబునాయుడు శనివారంనాడు నమ్మబలికింది ఇదేనా? ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబునాయుడు ఉన్న రోజులలో ఆయన వ్యవహరించిన తీరు ప్రజలు మరచిపోలేదు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అన్యా యమంటూ ఔరంగాబాద్ వెళ్ళి హడావిడి చేయడానికి ప్రయత్నించిన చంద్ర బాబునాయుడినీ, తెలుగుదేశం పార్టీ నాయకులనూ పోలీసులు అడ్డుకున్న ప్పుడు చంద్రబాబునాయుడు మీడియా కెమెరాల ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఆయననూ, ఆయన సహచరులనూ విమానంలో హైదరాబాద్‌కు పంప డానికి మహారాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబునాయుడు టర్మాక్ మీదనే బైఠాయించి గొడవ చేశారు. చంద్రబాబునాయుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెత్తు మాట అనలేదు. పరాయి రాష్ట్రంలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నాడని అనలేదు. దేవినేని ఉమామహేశ్వరరావులాగా మహారాష్ట్ర మంత్రులు ఎవ్వరూ నీచంగా మాట్లాడలేదు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు పెద్దగా ఆటంకం కలిగించకపోయినప్పటికీ కొద్ది అసౌ కర్యం కలిగిన సందర్భాలలోనూ ఆగ్రహం ప్రదర్శిస్తూ తాము తిరిగి అధికారం లోకి వచ్చినప్పుడు పోలీసుల సంగతి చెబుతామంటూ బెదిరించిన సంగతి మరచిపోకూడదు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారాయణ, రావెల కిశోర్‌బాబు మాదిరి చవకబారుగా మాట్లాడలేదు. కూరగాయల ధరలు పెరిగిన ప్పుడు మెడలో కూరగాయల దండ వేసుకొని సీపీఎం నాయకుడు రాఘవులుతో కలసి నిరసన తెలిపిన చంద్రబాబును ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడని కానీ, నేరస్తుడని కానీ, మానసిక రోగి అని కానీ నిందించలేదు. అదే బాట, అదే గమ్యం సరిగ్గా పదిహేనేళ్ళ కిందట నేను 'వార్త' పత్రిక మొదటి పేజీలో ఇదే శీర్షికతో(ఇదేమి రాజ్యం?) సంపాదకీయం రాశాను. విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నంలో అడ్డగోలుగా వ్యవహరించిన చంద్రబాబునాయుడి విధానాలను ఎండగడుతూ వ్యాస పరంపర ప్రచురించాను. వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో తొమ్మిది వామపక్షాల అండదండలతో సాగిన విద్యుత్ సంస్కరణల ప్రతిఘటన ఉద్యమాన్ని సంపూర్ణంగా బలపరిచాను. అయినప్పటికీ నాపైన వ్యక్తిగత విమర్శకు దిగలేదు. ఆ సంపాదకీయం ప్రచురించిన రెండున్నర సంవత్సరాల అనంతరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అలిపిరి దగ్గర నక్సలైట్లు దాడి చేయడం వల్ల వచ్చిన సానుభూతి సైతం చంద్రబాబు నాయుడిని గెలిపించలేకపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం అదే తీరులో ఉధృతమై ప్రభుత్వ అస్తిత్వాన్ని ప్రశ్నించబోతోంది. అణచివేత పర్యవసానం వేరే విధంగా ఉండదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసింది. అయినా పోలీసులు జోక్యం చేసుకొని అన్యాయంగా వ్యవహరించిన సందర్భాలు తక్కువ. అసెంబ్లీలో నవ్వుతూ చంద్రబాబునాయుడిని ఉడికించేవారే కానీ ప్రతిపక్షంలో ఉన్న వారిపైన లేనిపోని ఆరోపణలు చేయలేదు. తనపైన ఎవరైనా నిష్కారణంగా ఆగ్రహం ప్రదర్శించినా సహించేవారు. తనకు కోపం నరం తెగిపోయిందని చెప్పేవారు. బీజేపీ నాయకుడు దత్తాత్రేయ రోజుకో బహిరంగ లేఖ రాసినా 'దత్తన్నకు నామీద ప్రేమ పెరుగుతోంది' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారే కానీ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. రోశయ్య పెద్దమనిషి తరహాలోనే వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని ఆయన పదవికి ముప్పు వచ్చినప్పుడు సైతం ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావును కానీ ప్రొఫెసర్ జయశంకర్ని కానీ ఉద్యమాన్ని సమర్థించిన మేధావులను కానీ విమర్శించలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి తన తరహాలో తాను రాష్ట్ర విభజనను నివారించడానికి ప్రయత్నించారే కానీ ఉద్యమ నాయకులను తప్పుడు మాటలతో నిందించలేదు. అప్పటి వరకూ ఒక స్థాయి సంస్కారం కొనసాగింది. 2014 ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా రాజకీయ విలువలు పతనమైపోయాయి. అధికారంలోకి రాగానే నేతలను అహంకారం ఆవహించింది. ఆచితూచి మాట్లాడే సంప్రదాయం మంట కలసింది. పొరపాట్లనూ, వైఫల్యాలనూ ఒప్పుకునే నమ్రత నశించింది. మసి బూసి మారేడుకాయ చేయవచ్చుననే నమ్మకం పెరిగింది. హద్దుమీరిన అసహనం వయస్సు ప్రభావమో, "సమయం లేదు మిత్రమా" అనే అశరీరవాణి హెచ్చరిక కారణమో తెలియదు కానీ ఎవరో తరుముతున్నట్టు చంద్రబాబునాయుడి నడక పరుగులాగా సాగుతోంది. ఇప్పుడే అంతా చక్కబెట్టుకోవాలనే ఆత్రుత కనిపిస్తోంది. మాటకీ, చేతకీ పొంతన ఉండటం లేదు. స్వోత్కర్ష శ్రుతి మించుతోంది. అసత్యాలు అలవోకగా చెబుతున్నారు. అన్ని గొప్పపనులూ తానే చేశానంటూ చెప్పుకోవడం, ఎప్పుడైనా కథ అడ్డం తిరిగినప్పుడు తటాలున తప్పుకోవడం రివాజుగా మారింది. ఢిల్లీలో ప్రధానికి అత్యంత విధేయంగా ఉండటం, అమరా వతిలో నియంతగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడితో కలసి లేనివి ఉన్నట్టు భ్రమింపజేయడాన్ని విమర్శిస్తే ఏ మాత్రం తాళలేని అసహనం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. సమావేశాలు ఘనంగా నిర్వహించడం, హామీలు పొందడం, ప్రకటనలు చేయడంతో అంతా అయిపోయినట్టు రాయాలని చంద్రబాబునాయుడుగారి అభిమతం. వాగ్దానాలే కానీ వాస్తవంలో ఏమీ జరగడం లేదనే పచ్చి నిజం రాసిన వారినీ, అన్నవారినీ అభివృద్ధి నిరోధకులంటూ దుయ్యబడుతున్నారు. జరగని అభివృద్ధి జరిగినట్టు రాయాలనీ, రాని పెట్టుబడులు వచ్చినట్టు రాయాలనీ కోరిక. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు వరదలా వచ్చినట్టు రాయా లని ఆపేక్ష. ఓఎన్జీసీ, హెచ్ïపీసీఎల్ ప్రతిపాదనలు పాతవే. కొత్తగా ఎంఓయూలు కుదుర్చుకున్నవారిలో ప్రభుత్వం కేటాయించిన భూములను దఖలు పరుచు కోవాలనే ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు. కొత్తవారు వస్తారో రారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ తమకు ప్రత్యేక రాష్ట్రం అంటూ మురిపించిన వెంకయ్య నాయుడు కానీ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదంటూ అభినందించిన అరుణ్ జైట్లీ కానీ పరిశ్రమలు పెడితే ఫలానా రాయితీలు ఇస్తామంటూ స్పష్టంగా చెప్పలేదు. తియ్యటి మాటలతో కడుపు నింపాలనే ప్రయత్నమే కానీ ఆచరణలో అడుగు ముందుకు కదలడం లేదు. సదస్సులు నిర్వహించడమే ఘన కార్యం అనుకుంటే అది వేరే సంగతి. ఇదే మాట అంటే ప్రతిపక్షాలనూ, మీడియా ప్రతినిధులనూ దబాయించడం, గద్దించడం, నిందించడం, పోలీసు లను ప్రయోగించడం, నిర్బంధించడం అలవాటయింది. విశాఖ విమానా శ్రయం రన్‌వేలో బైఠాయించిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డిపై ధ్వజమెత్తే ముందు ఔరంగాబాద్‌లో చంద్రబాబునాయుడితో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తు తెచ్చుకోవాలి. జల్లికట్టు స్ఫూర్తి ఇటీవల తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయా లంటూ రైల్‌రోకో సహా అనేక రకాలుగా ఉద్యమం చేసిన డీఎంకే నాయకుడు స్టాలిన్‌ను కానీ ఇతర ప్రతిపక్ష నాయకులను కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పల్లెత్తు మాట అనలేదు. జల్లికట్టు నిషేధంపైన ప్రజాగ్రహాన్ని చూపించి ప్రధానిని ఆర్ఢినెన్స్కు ఒప్పించారు. చంద్రబాబునాయుడు పన్నీర్ సెల్వంను ఆదర్శంగా తీసుకుంటే బాగుండేది. ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని పార్టీలనూ కలుపుకొని ఉద్యమం చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలంటూ మోసపూరిత పిడివాదాన్ని కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలలో ప్రత్యేక హోదా కోసం రగులుతున్న ఉద్యమస్ఫూర్తిని వివరించి ప్రధానిని ఒప్పించడానికి ప్రయత్నిస్తే ముఖ్యమంత్రిని అభినందించే అవకాశం ఉండేది. ప్రజలు మెచ్చే దారిలో పోకుండా అడ్డదారులు తొక్కి కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచిస్తున్నారు కనుకనే తప్పుపట్టవలసి వస్తున్నది. ప్రజా వంచనకు వంతపాడుతున్న వెంకయ్యనాయుడూ, కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా చరిత్రకూ, ప్రజలకూ సమాధానం చెప్పవలసి ఉంటుంది. కేవలం పోల వరం కాంట్రాక్టుల కోసమో, సింగపూర్ కంపెనీలతో వ్యవహారం చేయడానికి కేంద్రం అభ్యంతరం చెప్పకుండా ఉండటం కోసమో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం ముమ్మాటికి రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించిన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బుట్టదాఖలు చేసినవారికి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ యూపీఏ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే నైతిక హక్కు ఉంటుందా? ప్రజలు అవివేకులు కారు. పాలకుల వింత చేష్టలకూ, అహంకారపూరిత వైఖరికీ వెంటనే స్పందించి నిరసన తెలపక పోవచ్చు. ఆత్యయిక పరిస్థితిలో సైతం నిరసన ప్రదర్శనలు లేవు. సమయం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ వంటి నేతనే చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఆత్యయిక పరి స్థితి ఉంది. వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఇతర ప్రతిపక్షాలపైన నిర్బంధం సాగు తోంది. కాపు రిజర్వేషన్లకోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంపైన పోలీసు జులుం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య సంస్థలనూ, ధోరణులనూ అణచివేసే రాజ్యాన్ని ప్రజలు హర్షించరు. ప్రతిఘటిస్తారు. ప్రజలతో సంబంధం లేకుండా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ... అభ్యంతరం చెప్పినవారిని శత్రువు లుగా పరిగణిస్తూ నియంతలాగా వ్యవహరించేవారిని ప్రజలు శిక్షించి తీరుతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. వినిపించుకోకపోతే పాలకుల ఖర్మం. కె. రామచంద్రమూర్తి -
వెల్డన్ ధోనీ!
త్రికాలమ్ అడవి నుంచి అప్పుడే వచ్చిన యోధుడిలాగా పుష్కరం కిందట మైదానంలో వెలిగి క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్న మహేంద్రసింగ్ ధోనీ భారత క్రికెట్ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్న బహుముఖ ప్రతిభా వంతుడు. వ్యక్తిత్వ వికాసం పాఠ్యాంశాలలో మొదటిశ్రేణిలో ఉండవలసిన జీవిత చరిత్ర అతనిది. కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రచిత్తంతో వ్యవహరించడం ఎట్లాగో, జయాపజయాలను సమంగా స్వీకరించడం ఎట్లాగో, విషయాన్ని సాకల్యంగా గ్రహించి లక్ష్య సాధన కోసం పరిశ్రమించడం ఎట్లాగో, ఎంత ఒత్తిడి వచ్చి నెత్తిపైన కూర్చున్నా చెక్కుచెదరకుండా, చిర్నవ్వు చెదరకుండా, తొట్రుపాటు లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంటూ విజయం వైపు అడుగులు వేయడం ఎట్లాగో, కొండంత ఆత్మవిశ్వాసంతో పకడ్బందీ వ్యూహం ప్రకారం జట్టును కదనరంగంలో ముందుకు నడిపించడం ఎట్లాగో, అవాంతరాలను అధిగమించి విజయం సాధించడం ఎట్లాగో తెలుసుకోవాలనుకునే యువతీ యువకులకు జనవరి 4న పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు నాయకత్వ పాత్ర నుంచి విరమణ ప్రకటించిన ధోనీ జీవితాన్ని అధ్యయనం చేయడం తప్పనిసరి. ‘ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా చూసినా చాలు. ఏ రంగంలోనైనా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఎప్పుడు వైదొలగాలో తెలిసినప్పుడే వారికి చరిత్రలో స్థానం దక్కుతుంది. ‘గో వెన్ ద గోయింగ్ ఈజ్ గుడ్’ అంటారు. ‘అయ్యో అప్పుడే దిగిపోయాడా, ఇంకా కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్‌గా ఉండవచ్చు కదా’ అని అభిమానులు అనుకున్నప్పుడే స్వస్తి చెప్పడం ఉత్తమం. అదే పని భారత క్రికెటర్లలో అగ్రగాములైన విజయ్ మర్చంట్, సునీల్ గావస్కర్ చేశారు. వ్యక్తిగత ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ కొన్ని మైలురాళ్ళు దాటాలనే లక్ష్యం పెట్టుకున్న సచిన్ టెండూల్కర్ విరమణ నిర్ణయం తీసుకోవడంలో కొద్ది జాప్యం చేశారు. 200వ టెస్ట్ ఆడేవరకూ ఆగారు. విజయ్ మర్చంట్ చివరి టెస్ట్‌లో శతకం సాధించిన వెంటనే టెస్ట్‌ల నుంచి విరమిస్తున్నట్టు ప్రకటించారు. ‘బాగా ఆడుతున్నారు కదా, ఎందుకు విరమిస్తున్నారు అప్పుడే?’ అని విలేకరులు అడిగితే ‘విరమణ ఎప్పుడు?’ అని అభిమానులు అడిగేవరకూ ఉండదలచుకోలేదంటూ సమాధానం చెప్పారు. సమయజ్ఞత ఉన్నవాడే ధన్యుడు ఎప్పుడు విరమించుకోవాలో తెలియక చరిత్రలో స్థాయి తగ్గించుకున్న రాజకీయ నాయకుల జాబితాలో మొదటి పేరు రెండో ప్రపంచ యుద్ధంలో వ్యూహరచనా ధురంధరుడుగా పేరు తెచ్చుకున్న బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్దే. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన వెంటనే రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉంటే బ్రిటిషర్ల హృదయాలలో ఆయనకు అత్యున్నత స్థానం ఉండేది. సము చితమైన సమయంలో చర్చిల్ తప్పుకోలేదు. సమయజ్ఞత పాటించలేదు. 1945 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం కోలుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు అసహనంగా ఎదురు చూసే విధంగా పరిపాలన అధ్వానంగా ఉండేది. మన్మోహన్సింగ్ 2009లోనే ప్రధానిగా అయిదేళ్ళ పదవీ కాలం ముగిసిన వెంటనే వైదొలిగి ఉన్నట్లయితే ఆర్థికమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆర్థికరంగాన్ని పరుగులెత్తించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేవారు. కుంభకోణాలను అనుమతించిన ప్రధానిగా పేరు దిగజారేది కాదు. పండిట్ నెహ్రూ 1957 ఎన్నికల తర్వాత లాల్బహద్దూర్ శాస్త్రినో, మరొకరినో ప్రధానిగా నియమించి విశ్రాంతి తీసుకొని ఉంటే కృష్ణమీనన్ వంటి వ్యక్తి రక్షణమంత్రి అయ్యేవారు కాదు. శక్తికి మించిన పోకడలు పోయేవారు కాదు. చైనాతో యుద్ధం వచ్చేది కాదు. పరాజయ పరాభవభారంతో నెహ్రూకి గుండెపోటు వచ్చేది కాదు. భారత క్రికెట్ చరిత్రలో మన్సూరలీ ఖాన్ పటౌడీ, కపిల్‌దేవ్, అజహ రుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప కెప్టెన్లు ఉన్నారు. గావస్కర్, టెండూల్కర్, సెహ్వాగ్ వంటి మేటి బ్యాట్స్‌మన్ ఉన్నారు. ఫారూఖ్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ వంటి మంచి వికెట్ కీపర్లు ఉన్నారు. కానీ మూడు విభాగాలలోనూ అసమాన ప్రతిభావంతుడు ధోనీ. అటువంటి వీరుడు మరొకడు లేడు. నాయకత్వ స్థానంలో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. జట్టును ఎంపిక చేసే విషయంలో అందరినీ సంతృప్తిపరచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కెప్టెన్‌కి ఇష్టాయిష్టాలు ఉండవచ్చు. అందుకే యువరాజ్ తండ్రి యోగ రాజ్ ధోనీ వైదొలుగుతున్నందుకు మిఠాయి పంచిపెట్టి సంబరం చేసుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌లో అడుతున్న మ్యాచ్ జరగడానికి ముందు రోజు టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వివిఎస్ లక్ష్మణ్ ప్రకటించడానికి ధోనీ వైఖరి కారణం కావచ్చు. వీరేంద్ర సెహ్వాగ్కీ, రవిచంద్రన్ అశ్విన్కీ, గౌతమ్ గంభీర్‌కీ ధోనీ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు. ఎవరు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ కొంతమందికి అన్యాయం జరగడం, బాధ కలగడం సహజం. 2013 నాటి స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఒక కవరు సుప్రీంకోర్టు దగ్గర ఇప్పటికీ తెరవకుండానే పడి ఉంది. కవరును తెరవవద్దనీ, అందులోని పేర్లను వెల్లడించవద్దనీ బీసీసీఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పదేపదే అభ్యర్థిం చారు. ఆ జాబితాలో రెండో పేరు ధోనీదేననే వదంతులు ఉన్నాయి. అతడు కూడా మనిషే కనుక మనిషికి ఉండే బలహీనతలు ఉండవచ్చు. ధోనీ గొప్ప క్రీడాకారుడు. అసాధారణమైన వ్యక్తి. భారత క్రికెట్‌కు అతడు చేసిన పరమా ద్భుతమైన సేవతో పోల్చితే ఈ ఆరోపణలకు అంత ప్రాధాన్యం ఉండదు. అత్యు న్నత న్యాయస్థానం దోషిగా నిర్ణయిస్తే అది వేరే సంగతి. భారత్ క్రికెట్‌కు మహర్దశ ప్రపంచ కప్‌ను కపిల్ సేన లార్డ్స్‌లో గెలుచుకొని వచ్చిన తర్వాత 28 సంవత్స రాల నిరీక్షణ ఫలించింది ధోనీ అద్భుత సారథ్యంలోనే. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టును విజయపథంలో నడిపించిన ఘనత హైదరాబాదీ స్టార్ బ్యాట్స్‌మన్ అజహరుద్దీన్ది కాగా గెలుపు ఒక అలవాటుగా మారడానికి బాటలు వేసిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. కానీ టెస్ట్ మ్యాచ్‌లలో, ఒన్డే ఇంటర్నేషనల్స్‌లో, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అలవోకగా, సాధికారికంగా విజయాలు సాధించడం ధోనీ సారథిగా పగ్గాలు చేతపట్టిన తర్వాతనే. భారత క్రికెట్‌కు మహర్దశ పట్టింది అతడి నేతృత్వంలోనే. గ్రెగ్ చాపెల్ శిక్షణలో భాతర క్రికెటర్లు గిజగిజలాడి దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ధోనీ ఆటను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. గిల్‌క్రిస్ట్ శిష్య రికంలో మెలకువలు నేర్చుకున్నాడు. 2004లో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో ధోనీకి స్థానం లభించింది. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయకుండానే రనౌటైనాడు. ఐదో వన్డేలో సెంచరీ చేశాడు. ఐదు రోజుల మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడుతున్న సమయంలో గాయమైన కారణంగా అప్పటి కెప్టెన్ కుంబ్లే తప్పుకోవడం, వైస్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ జట్టుకు నాయకత్వం వహించడం యాదృచ్ఛికం. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కుంబ్లే ప్రకటించడంతో అన్ని ఫార్మా ట్లలోనూ (టెస్ట్, ఒన్డే, టీ20) ధోనీ శకం ఆరంభమైంది. కెప్టెన్ కిరీటం పెట్టుకున్న తర్వాత ఒత్తిడి ఫలితంగా ఆటలో విఫలమైన గావస్కర్, సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలను చూశాం. నాయకత్వం స్వీకరించిన తర్వాత విజృంభించిన ధోనీనీ చూశాం. జట్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక స్కోరు (224 పరుగులు) సాధించిన ఖ్యాతి ధోనీది. అంతవరకూ రికార్డు సచిన్ టెండూల్కర్‌ది–217 పరుగులతో. వికెట్‌కీపర్‌గా ఎక్కువ మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు పంపించి శ్రీలంకకు చెందిన సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ఇంటర్నేషనల్ రెండో ఇన్నింగ్స్‌లో 183 పరుగులు (10 సిక్సర్స్, 15 ఫోర్స్) చేసి బ్రియాన్ లారా రికార్డు (153 పరుగులు)ను అధిగమించాడు. వికెట్ కీపర్‌గా ఒకే ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేసి ఆదమ్ గిల్‌క్రిస్ట్ రికార్డును సమం చేశాడు. భారత జట్టును ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో నిలబెట్టాడు. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ఇన్ని ఘనవిజయాలు సాధించిన క్రికెటర్ ప్రపంచంలో మరొకరు లేరు. కెప్టెన్‌గా ఉంటూ బ్యాట్స్‌మన్‌గా వెలిగిన పాంటింగ్ వంటి వారు ఉన్నారు. మూడు విభాగాలలో ధోనీ స్థాయిలో రాణిం చినవారు ఒక్కరు కూడా కనిపించరు. అందుకే 21 బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా రెండు చేతులా సంపాదించాడు. కంట్రాక్టుకు రూ. 200 కోట్లు తీసుకునేవాడు. 2013లో ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఉన్న క్రీడాకారుల జాబితాలో ధోనీది పదమూడో స్థానం. సచిన్, ధోనీల వైవిధ్యం సచిన్, ధోనీల తర్వాతనే మరో భారత క్రికెటర్‌ను చెప్పుకోవాలి. ధోనిలో ఉన్న వైవిధ్యం, బహుముఖీనత సచిన్‌లో లేదు. సచిన్‌లో క్రమశిక్షణ ఉంది. దీక్షా దక్షతలు ఉన్నాయి. వ్యక్తిగతంగా రాణించాలనీ, సరికొత్త రికార్డులు నెలకొల్పా లనే ఆకాంక్ష ఉంది. బ్యాటింగ్‌లో సాటిలేని మేటి స్పెషలిస్టు. ఒక బంతిని ఎన్ని రకాలుగా ఆడవచ్చునో అన్ని రకాలుగానూ ఆడగలిగిన పండితుడు. ప్రపంచ మంతా ప్రశంసించిన లిటిల్ మాస్టర్. ధోనీలో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ముందుండి జట్టును నడిపిస్తాడు. క్రికెట్‌పైన అద్భుతమైన అవగా హన ఉన్నవాడు. ప్రతి బ్యాట్స్‌మన్, బౌలర్ బలం, బలహీనత తెలిసినవాడు. వికెట్ల వెనుక నిలబడి బంతినీ, బ్యాట్‌నీ, వాటి మధ్య ఆధిక్యం కోసం జరిగే పోరాటాన్నీ చాలా జాగ్రత్తగా గమనించడం నేర్చినవాడు. బాగా ఆడిన సహ చరులను మెచ్చుకొని ప్రోత్సహించడం ద్వారా మరింత బాగా ఆడించే నేర్పున్న వాడు. రిస్కు తీసుకుంటాడు. దూకుడుగా వెళ్ళగలడు. సహచరులపైన ఒత్తిడి పడకుండా ఓటమికి బాధ్యత పూర్తిగా తనదేనంటాడు. గెలిస్తే పొంగిపోడు. ఓడితే కుంగిపోడు. ఇంకా కొంతకాలం కెప్టెన్‌గా ఉండదగినవాడు. మరెందుకు ఇప్పుడే నాయకత్వం వదులుకొని వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్‌గా మాత్రం జట్టులో ఉండమంటే ఉంటానని అంటున్నాడు? విరమణ నిర్ణయం ఆకస్మికమైనదే కానీ అనూహ్యమైనది మాత్రం కాదు. ఎప్పుడు రిటైరవబోతున్నారంటూ ప్రశ్నించిన ఆస్ట్రేలియన్ జర్నలిస్టు శామ్యూల్ ఫెర్రీపై ఆగ్రహం ప్రదర్శించిన ధోనీ తనకూ కోపం వస్తుందనీ, దాన్ని దాచు కోలేని బలహీన క్షణం ఉంటుందనీ ఆ ఒక్క సందర్భంలో వెల్లడించాడు. ‘వికెట్ల మధ్య పరుగుతీస్తున్న తీరు చూసి నేను ఆటలో కొనసాగడానికి అనర్హుడినని అనుకుంటున్నారా?’ అంటూ ఆ జర్నలిస్టుని ఎద్దేవా చేశాడు. కానీ తనకు 35 ఏళ్ళు వచ్చాయని అతడికి తెలుసు. 2019 వరల్డ్ కప్ జట్టులో ధాటిగా ఆడలేనని ధోనీ గ్రహించాడు. విరాట్ కోహ్లీ విరాట్ స్వరూపం ప్రదర్శిస్తున్న కారణంగా అతడినే భారత క్రికెట్ భాగ్యవిధాతగా అభిమానులు పరిగణిస్తున్న విషయం ధోనీ గ్రహించి ఉంటాడు. తన స్థానంలో మరొకరిని తయారు చేయడానికి క్రికెట్ బోర్డుకు అవకాశం ఇవ్వాలన్న నిస్వార్థ చింతనతో, భారత క్రికెట్ ఔన్నత్యం కాపాడాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని భావించాలి. 2014లో టెస్ట్ క్రికెట్ జట్టు నాయకత్వ హోదాను వీడినప్పుడు సైతం చివరిక్షణం వరకూ గుంభనంగానే ఉన్నాడు. అది అతడి శైలి. సృజన, సాహసం, సహనం, సారథ్య సామర్థ్యం, బహుముఖీనమైన ప్రతిభ కలిగిన నాయకుడి చేతి నుంచీ భారత క్రికెట్ పగ్గాలు అంతే అంకితభావం, ప్రతిభ, దీక్షాదక్షతలు కలిగిన విరాట్ కోహ్లీ చేతిలోకి శనివారంనాడు పూర్తిగా మారాయి. ధోనీని అభినందిస్తూ కోహ్లీని ఆహ్వానించవలసిన సన్నివేశం ఇది. -కె. రామచంద్రమూర్తి -
'సమగ్ర అభివృద్ధి'పై సమాలోచన
విజయవాడ : విజయవాడ స్వరాజ మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్లో గురువారం 'సమగ్ర అభివృద్ధి' అనే అంశంపై సమాలోచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రఘురాంరాజు, ఆచార్య గోపాల్ గురు, మాజీ సీఎస్ కాకి మాధవరావుతో పాటు పలువురి ప్రముఖులు పాల్గొని ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. -
చిన్న వయసు–పెద్ద మనసు
త్రికాలమ్ ఆగ్రా, లక్నో–రెండూ ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరాలే. రెండిటికీ మధ్య 334 కిలోమీటర్ల దూరం. లక్నోలో ఆగ్రా జరుగుతుందని భయపడినవారికి సాంత్వన చేకూర్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రీకొడుకుల మధ్య రాజీ కుది రింది. సమాజ్‌వాదీ పార్టీ చీలిక తప్పించుకొని సమైక్యంగా నిలిచింది. మొగల్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆరవ చక్రవర్తి ఔరంగజేబు తండ్రి షాజహాన్‌ను గద్దెదించి అధికార దండం చేతపట్టాడు. తండ్రిని తాజమహల్ సమీపంలోనే జైలులో నిర్బంధించాడు. కానీ హింసించలేదు. చెల్లెలు జహనారా బేగం తండ్రిని సేవిం చుకుంటానని అభ్యర్థిస్తే మన్నించాడు. పదవీచ్యుతుడిని చేసిన రోజు నుంచి 1666 జనవరి 31న షాజహాన్ మరణించేవరకూ తండ్రిని ఔరంగజేబు కలుసు కోలేదు. రాజ్యాధికారంకోసం సోదరులను చంపి, తండ్రిని నిర్బంధించిన ఔరం గజేబు రాజధాని ఆగ్రా. తండ్రిని ధిక్కరించి పార్టీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మధ్యవర్తుల మాట మన్నించి తండ్రి దగ్గరికి వెళ్ళి రాజీపడిన అఖిలేశ్ యాదవ్ రాజధాని లక్నో. ఔరంగజేబుకీ, అఖిలేశ్కీ హస్తిమశకాంతరం ఉంది. మొగల్ సమ్రాట్టుతో పోల్చితే అఖిలేశ్ మానవీయ విలువలకు పట్టం కట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు. ములాయంకు కనువిప్పు ఉత్తరప్రదేశ్‌లో అయిదారు మాసాలుగా రగులుతున్న సంక్షోభం పతాక సన్నివేశంలో కుటుంబ పెద్ద ములాయంసింగ్ పట్టువిడుపులు ప్రదర్శించారు. యువ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంయమనం పాటించారు. పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తన పట్టు నిరూపిస్తూనే ముఖియా మాట గౌరవించి రాజీకి అంగీకరించాడు. అఖిలేశ్‌నూ, రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్ళపాటు పార్టీలోనుంచి బహిష్కరించినట్టు శుక్రవారం ప్రకటించిన తర్వాత యువ ముఖ్యమంత్రి విశ్వరూపం ప్రదర్శించాడు. బహిష్కరణ వేటు పడిన క్షణం నుంచీ అభిమానుల ప్రదర్శనలూ, నినాదాలూ సాగుతూనే ఉన్నాయి. శనివా రంనాడు అఖిలేశ్, ములాయం ఇద్దరూ తమ మద్దతుదారులను కలుసు కున్నారు. అంతకు ముందు ములాయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గుర్తుపైన పోటీ చేసేందుకు 325 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దానికి పోటీగా అఖిలేశ్ 236 పేర్లు ప్రకటించాడు. రెండు జాబితా లలోనూ 175 మంది ఎంఎల్ఏల పేర్లు ఉన్నాయి. శనివారం ఉదయం అఖిలేశ్ నివాసానికి దాదాపు 190 మంది శాసనసభ్యులు వెళ్ళి మద్దతు ప్రకటించగా, ములాయంసింగ్ దగ్గరకు వెళ్ళిన శాసనసభ్యుల సంఖ్య పాతిక దాటలేదు. ఎన్ని కల వ్యూహరచనలో సిద్ధహస్తుడైన ములాయంసింగ్ క్షేత్ర వాస్తవికతను గ్రహిం చారు. పెద్దరికాన్ని గౌరవిస్తూనే తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే కుమారుడి మనస్తత్వాన్ని తెలుసుకున్నారు. సీనియర్ మంత్రి ఆజంఖాన్ దౌత్యానికి అంగీ కరించారు. ఘర్షణకు తెరదించారు. నూతన సంవత్సరం ఆరంభంలో కుటుంబ కలహాలకు స్వస్తి చెప్పి శుభం కార్డు వేశారు. చరిత్రలో సారూప్యాలు ఇటీవలి చరిత్రలో లక్నో పరిణామాలను పోలిన సందర్భాలు రెండు కనిపిస్తాయి. ఒకటి–1969లో కాంగ్రెస్ పార్టీ చీలిక. రెండు–1995లో ఎన్‌టి రామారావు పదవీచ్యుతి. అఖిలేశ్‌ను ములాయంసింగ్ పార్టీ నుంచి బహిష్కరించినట్టే నిజ లింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాటి ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించింది. ఎన్‌టి రామారావు తన చిన్నల్లుడు, ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి నారా చంద్రబాబునాయుడిని, మరి నలుగురు మంత్రులతో కలిపి పార్టీ నుంచి బహిష్కరించారు. అమర్‌సింగ్‌ని పార్టీ నుంచి తొలగించాలన్నది అఖిలేశ్ పట్టు. లక్ష్మీపార్వతిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబునాయుడి నాయకత్వంలోని వర్గం డిమాండ్. మొరార్జీ దేశాయ్‌ని ఉపప్రధానిగా పెట్టుకోవాలని కామరాజ్ ప్రభృతులు ఇందిర పైన ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. ఇంకా సామ్యాలు చాలా ఉన్నాయి. ‘పార్టీ స్థాపించింది నేను. నాలుగు సార్లు ఎన్నికలలో గెలిచాను. అఖిలేశ్‌ని ముఖ్యమంత్రి చేసింది ఎవరు? నేను కాదా? చరిత్రలో ఏ తండ్రి అయినా కొడుక్కి ఇటువంటి బహుమతి ఇచ్చాడా? అటువంటి నన్నే ధిక్కరిస్తాడా? నన్ను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? నా తమ్ముడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే వాడిని పక్కన పెట్టేస్తాడా? మిత్రుడు అమర్‌సింగ్‌ను తిరిగి పార్టీలో చేర్చుకుంటే అఖిలేశ్‌కు ఎందుకు అభ్యంతరం? ఇది నా పార్టీ, నేనే అధినాయకుడిని. నా ఇష్టప్రకారమే అన్నీ జరగాలి’ అన్నది ములాయం పంతం. ఎన్‌టి రామారావు మనస్తత్వం డిటో. ‘నేనే పార్టీ. నాతో పాటే పార్టీ అంతర్థానం అవుతుంది. నన్ను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. పూచికపుల్లను నిలబెట్టి గెలిపించాను. నన్ను ధిక్కరిస్తారా? లక్ష్మీపార్వతి విద్యావంతురాలు. వివేకవంతురాలు. నా సేవకురాలు. ఆమెను గౌరవించడం నా సంస్కారం. అందుకు అభ్యంతరం చెప్పడానికి వారెవరు?’అనే ధోరణిలో ఆయన ఆలోచించేవారు, మాట్లాడేవారు. సత్తా చాటిన ‘మూగబొమ్మ’ ‘ఇందిరాగాంధీ గూంగీగుడియా (మూగబొమ్మ). మెత్తగా ఉంటుందనుకుంటే మొత్తుతానంటోంది. సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రపతి పదవికి పోటీలో కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పేరు ప్రతిపాదించి అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా వరాహగిరి వెంకటగిరిని నిలబెట్టి ఆత్మప్రబోధం ప్రకారం ఓట్లు వేయమంటూ కాంగ్రెస్‌వారికి చెప్పింది. గిరిని గెలిపించింది. పార్టీ అభ్యర్థిని ఓడించింది. ఇది పార్టీకి ద్రోహం చేయడం కాకపోతే ఏమిటి? పార్టీ చెప్పినట్టు ప్రధాని వినాలి’ అన్నది సిండికేట్ నాయకులైన నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, కామరాజ్ నాడార్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, ఎస్కె పాటిల్ వాదన. చివరికి మూగబొమ్మ తూర్పుపాకిస్తాన్ విమోచనకు కారకురాలై దుర్గామాతగా అటల్ బిహారీ వాజపేయి వంటి వరిష్ఠ నేతల ప్రశంసలందుకున్నారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత రెండేళ్ళు పదవికి దూరంగా ఉన్నప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చి మరణించేవరకూ ప్రధానిగా కొనసాగారు. చంద్రబాబునాయుడు 1995లో రామారావును తప్పించి తొమ్మి దేళ్ళు ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించారు. అఖిలేశ్ కూడా పార్టీని చీల్చి, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో పొత్తు పెట్టుకుంటే ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎన్నికలలో ఓడిపోయినా పార్టీ యావత్తూ తన అధీనంలో ఉండేది. బాబాయి శివపాల్నీ, అతనితో ఉండే నేర చరితులనూ వదిలించుకోవడానికి ఇది మంచి అదను. కానీ అతనికి అధికారం కంటే తండ్రి ప్రధానం. శనివారం ఉదయం ఎంఎల్ఏలతో మాట్లాడుతున్న ప్పుడు కూడా అఖిలేశ్ కంట తడి పెట్టుకున్నాడు. ఎన్నికలలో విజయం సాధించి నేత (ములాయం) చేతిలో పెట్టాలంటూ ఆవేశంగా చెప్పాడు. అందుకే అమర్ సింగ్‌ను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలన్న తన డిమాండ్ వెంటనే అమలు జరగకపోయినప్పటికీ దానిపైన పట్టుపట్టలేదు. ములాయం నాయకత్వంలో, శివపాల్ యాదవ్ సాహచర్యంతో ఎన్నికల ప్రచారం చేయడానికి అంగీ కరించాడు. రెండు ‘సైకిళ్ల’ మధ్య ఎంత తేడా! మూడు ఘటనలలో పాత తరం నాయకులకూ, కొత్త తరం నాయకులకూ మధ్య స్పర్థ. కాంగ్రెస్ పార్టీ చీలికలో బంధుత్వాలు లేవు. రక్తసంబంధాలు లేవు. సిద్ధాంత వైరుధ్యాలు కూడా అంతగా లేవు. సిద్ధాంతం రంగు ఉన్నది కానీ సారంలో లేదు. ఎవరిది ఆధిపత్యం అన్నదే ప్రశ్న. రాజకీయ బలాబలాల పరీక్ష. జనాకర్షణశక్తి ఇందిరకు ఉన్నది కనుక ఆమె గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండిటి ఎన్నికల చిహ్నం సైకిలే. హైదరాబాద్‌లో, లక్నోలో జరిగినవి రెండూ కుటుంబ కలహాలే. కుటుంబ పెద్దతో యువతరానికి చెందిన వారి ఘర్షణ. అఖిలేశ్‌లో ములాయం రక్తం ఉంది. అంతకంటే ముఖ్యంగా మాన వీయమైన విలువలు ఉన్నాయి. రాజకీయంగా తన తడాఖా చూపిస్తూనే పెద్దల పట్ల వినయం ప్రదర్శించాడు. సందు దొరికింది కదా అని తండ్రి చేతిలోనుంచి పార్టీని గుంజుకోలేదు. తండ్రిని శక్తిహీనుడిని చేయలేదు. గుండె చెదరడానికి కారకుడు కాలేదు. ఇప్పుడు అఖిలేశ్‌కి 44 సంవత్సరాలు ఉంటే అప్పుడు (1995లో) చంద్రబాబునాయుడికి 45 ఏళ్ళు. పెద్ద వయస్సు కాదు. ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన లక్ష్మీపార్వతికి వివరంగా చెప్పారు. గొడవంతా ఆమె పేరుమీదనే జరుగుతోందనీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని హామీ ఇస్తే గొడవ సమసిపోయే అవకాశం ఉందనీ చెప్పారు. ఆమె కంటనీరు పెట్టుకొని విలేఖరుల గోష్ఠిలో ప్రకటన విడుదల చేశారు. తనకు స్వామి పాదాల చెంత చోటు చాలుననీ, ఆయనను సేవించుకునే అవకాశం చాలుననీ, తనకు ఎటు వంటి అధికారం అక్కర లేదనీ, అప్పటి వరకూ ఏదైనా పొరబాటు జరిగితే తన అమాయకత్వం వల్లనే జరిగింది కానీ రాజకీయాలలో ఏదో చేయాలనీ, చెందాలనే తాపత్రయంతో చేసింది కాదనీ, ఎవరైనా అపార్థం చేసుకుంటే తనను క్షమించాలని వేడుకుంటూ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన తర్వాత పోరాటం విరమిస్తే చంద్రబాబునాయుడికి చెడ్డపేరు వచ్చేది కాదు. కానీ చంద్రబాబునాయుడూ, అశోకగజపతిరాజూ, మాధవరెడ్డి, రామకృష్ణుడూ అంగీ కరించలేదు. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఇదే అదను అని భావించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఏమైనా పర్వాలేదనుకున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కరికే ఎన్‌టి రామారావుతో బంధుత్వం ఉంది. తక్కినవారికి ఆయన రాజ కీయ భిక్ష పెట్టారు. రామారావుతో రక్తసంబంధం ఉన్నవారు చంద్రబాబు నాయుడు ఇవ్వజూపిన పదవులకోసం ఆశపడ్డారు. హరికృష్ణ పార్టీ అధ్యక్షుడనీ, పెద్దల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు ఉపముఖ్యమంత్రి అనీ ఆశచూపించారు. చంద్రబాబుకు ఎన్‌టి రామారావు అంటే భయం ఉండేది కానీ భక్తి లేదు. అఖిలేశ్‌కి ములాయం సింగ్ అంటే భయం, భక్తీ రెండూ ఉన్నాయి. దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన మూడు నాటకీయ ఘట్టాలలోని పోలికలను ఎత్తిచూపడా నికే ఈ ప్రస్తావన. ఆ రెండు పార్టీలకూ ఆశాభంగం చరిత్ర పునరావృతం అవుతుందని ఆశించిన బీజేపీకీ, బీఎస్పీకీ ఆశాభంగం కలిగింది. అఖిలేశ్ ధిక్కారం కొనసాగించి పార్టీని చీల్చి, కొత్త కుంపటి ప్రారం భించి, కాంగ్రెస్, ఆర్ఎల్డీలతో పొత్తు పెట్టుకుంటే పాతతరం యాదవులకూ, కొత్తతరం యాదవులకూ మధ్య జరిగే పోరుతో విసిగిపోయి ప్రజలు బీజేపీవైపు చూస్తారని భావించారు. 2014లో యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలలో 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ విజయం తథ్యమని ఆ పార్టీ నేతలూ, ప్రవక్తలూ బల్లగుద్ది చెబుతున్నారు. సమాజ్‌వాదీ చీలికతో ఆ పార్టీ నేతలపైన విశ్వాసం కోల్పోయిన ముస్లింలు బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తారని మాయా వతి ఆశ. చీలికను నివారించగలిగారు కనుక బీజేపీ, బీఎస్పీల కొత్త ఆశలపైన నీళ్ళు చల్లినట్టు అయింది. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం పుట్టక ముందు బీఎస్ పీకి విజయావకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. బీజేపీ నాయకులు కూడా పోటీ ప్రధానంగా తమకూ, బీఎస్పీకి మధ్య మాత్రమేనని అన్నారు. నూటికి పైగా టిక్కెట్లు ముస్లిం అభ్యర్థులకు మాయావతి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించడానికి పెరిగిన ఆత్మవిశ్వాసం ఒక కారణం. సీబీఐ దర్యాప్తు భయం మరో కారణం. పెద్దనోట్ల రద్దు తర్వాత బీఎస్పీ ఖాతాలో రూ 104 కోట్లు జమచేసినట్టు ఆదాయంపన్ను శాఖ వెల్లడించినప్పటికీ దాని వల్ల ఆ పార్టీ పట్ల ప్రజలలో సాను భూతి పెరుగుతుంది కానీ వ్యతిరేకత ప్రబలదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎస్పీ పరిణామాల వల్ల బీజేపీకి ప్రయోజనం ఏమీ లేదని గ్రహించిన ప్రధాని మోదీ శనివారంనాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొత్త వరాలు ప్రసాదించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించే లోపు వాగ్దా నాలు చేయాలని ప్రయత్నం. యూపీ ఎన్నికలలో విజయం మోదీ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రధానం కనుక ఆయన ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. యూపీ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అంటున్నది అందుకే. (వ్యాసకర్త : కె. రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ) -
చేసేది చెబితేనే అందం
త్రికాలమ్ నిజమే. రాహుల్‌గాంధీ ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు. ఇంత వరకూ మూడు, నాలుగు వాక్యాలకు మించి ఆశువుగా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దనోట్ల రద్దు సృష్టించిన గందరగోళం ధర్మమా అని పావుగంట సేపు తడుముకోకుండా ప్రసంగించగలుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వాగ్ధాటి రాహుల్‌కి ఈ జీవితంలో అబ్బకపోవచ్చు. మోదీకి ఉన్న ప్రజాదరణ నెహ్రూ మునిమనుమడికి ఎప్పటికీ లభించకపోవచ్చు. ప్రధానికి ఉన్న నేపథ్యం వేరు. అనుభవం వేరు. ప్రావీణ్యం వేరు. మోదీని మించినవారు బీజేపీలో, ఆరె స్సెస్లోనూ లేరు. అంతమాత్రాన మోదీ ఎప్పటికీ అజేయుడుగా నిలబడతారనీ, ఆయనకు ఇదే ప్రజాదరణ ఎల్లకాలం కొనసాగుతుందనీ అనుకుంటే భ్రమ. 1984లో అఖండ మెజారిటీ సంపాదించిన కాంగ్రెస్ పార్టీ 1989లో ఓడి పోయింది. 1984లో అద్భుతమైన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రజాకర్షణ దండిగా కలిగిన ఎన్టీ రామారావు నాయకత్వంలోనే 1989లో ఓట మిపాలయింది. రాజీవ్, రామారావు ఇద్దరూ తమ విజయాలను అపార్థం చేసు కున్నారు. మోదీ కూడా అదే పొరపాటు చేస్తున్నారా? వారణాసి బహిరంగసభలో గురువారం మోదీ ప్రసంగిస్తూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు కాలాధన్ (నల్లడబ్బు), కాలామన్ (చెడ్డ మన స్తత్వం–చెడు ఆలోచన) ఉన్నవారనీ, వారంతా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉన్నట్టు నల్లకుబేరులకు అండగా నిలుస్తున్నారనీ అడ్డగోలుగా ఆరో పించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ గాంధీనగర్ నుంచి ఢిల్లీ వచ్చి ఎన్నికల ప్రచార రంగంలో అట్టహాసంగా ప్రవేశించేవరకూ దక్షిణాది ప్రజలకు ఆయన అంతగా పరిచయం లేదు. గోధ్రా ఉదంతం, అనంతర మారణహోమం జరిగినప్పుడు గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉండిన మోదీ ప్రస్తావన పత్రికలలో, టీవీ చానళ్ళలో వచ్చేది. ఎన్నికల ప్రచారం మొదలు ఇప్పటివరకూ మోదీ మాట్లాడే తీరు మారలేదు. అదే వాగ్ధాటి. అదే ఆత్మవిశ్వాసం. అవే ఏకపక్ష ఆరోపణలు. గతమంతా చీకటే ననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ స్వోత్కర్ష. మోదీ ధాటికి తట్టుకోలేక ప్రతి పక్షాలు 30 మాసాలపాటు దాదాపు మౌనంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసే హడావుడి మినహా మోదీని ప్రతి పక్షాలు ఇరకాటంలో పెట్టిన సందర్భమే లేదు. పవిత్రగంగ కాంగ్రెస్ పార్టీ పరిశుద్ధమైన పార్టీ అని ఎవరు ఎంత ఘోషించినా ప్రజలు నమ్మరు. అదే అభిప్రాయాన్ని మరింత బలపడే విధంగా మోదీ, బీజేపీ అధ్య క్షుడు అమిత్‌షా, వెంకయ్యనాయుడు వంటి నోరున్న మంత్రులు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌వాదులు అవినీతి పంకిలంలో కూరుకుపోయిన నాయకులనీ, తాము మాత్రం పరమ పవిత్రులమనీ చెప్పుకుంటున్నారు. గంగా నది ఎంత పవిత్రమైనదో మోదీ అంతే పవిత్రుడు అంటూ పొగిడే రవిశంకర్ ప్రసాద్ వంటి సహచరులు ఉన్నారు (గంగను శుద్ధి చేసే కార్యక్రమాన్ని సాధ్వి ఉమాభారతి అమలు చేస్తున్నారు. అవినీతికి గంగోత్రిగా కాంగ్రెస్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి అభివర్ణించారు). మీడియా సానుకూలంగా ఉంది. చేతిలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తదితర సాధనాలు ఉన్నాయి. మోదీకి ఎదురులేదు. మాయావతి సైతం బిక్కుబిక్కుమంటూ ఉండవలసిందే. యూపీఏ దుర్వినియోగం చేసినట్టే సీబీఐని ఎన్డీఏ సైతం ఆయుధంగా విని యోగించుకుంటున్నది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలపైన విచారణ అంగుళం ముందుకు కదలదు. కేంద్ర హోంశాఖ సహా యమంత్రి రిజీజూపైన∙ఆరోపణ చేసినవారిని అవహేళన చేయడమే కానీ దానిపై దర్యాప్తు ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకీ మధ్య బీజేపీ పెద్దలే రాజీ కుదిర్చి ‘ఓటుకు కోట్లు కేసు’ను నీరుగార్చారనే అభిప్రాయం ప్రజానీకంలో బలంగా ఉంది. శేషాచలం అడవులలో తమిళ కూలీల హత్యా కాండపైన కానీ అనేక ఇతర ఘటనలపైన కానీ విచారణ ముందుకు సాగదు. ఎన్డీఏ ప్రత్యర్థులపైన ఐటీ దాడులు జరుగుతాయి. నీతి, రీతి అంటూ నిత్యం జపం చేస్తున్న ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల నిరో ధక చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్షాలకు చెందిన ఎంఎల్ఏలకు ముఖ్య మంత్రులే కండువాలు కప్పి అధికార పార్టీలోకి ఆహ్వానిస్తుంటే అదేమని ప్రశ్నించరు. పంచాయతీరాజ్, నగరపాలిక చట్టాలను చట్టుబండలు చేసి ముని సిపల్ ఎన్నికలను నెలల తరబడి వాయిదా వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనరు. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నట్టే కనిపిస్తున్నది. ‘మేము గడ్డి తింటే మీరూ తక్కువేమీ తినలేదు’ అని నిరూపించడమే ధ్యేయంగా పెట్టుకు న్నది. సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలనే రాహుల్‌గాంధీ బహిరంగ సభలలో వరుసగా చేయడంలోని వ్యూహం ఇదే. ‘యువనాయకుడు’ రాహుల్ గాంధీ ప్రసంగించడం నేర్చుకుంటున్నారనీ, తనపైన ఆరోపణలు చేసి భూకం పం సృష్టిస్తానంటున్నారని అంటూ, ఏదీ భూకంపం అని ప్రశ్నిస్తూ అభినయ సహితంగా ఎద్దేవా చేసిన ప్రధానికి రాహుల్ ఏమి జవాబు చెప్పగలరు? తనను ఎంతగా ఎద్దేవా చేసినా పర్వాలేదు కానీ తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పా లన్నారు. హక్కుల నాయకుడూ, ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యంలో ప్రస్తావించిన ఆరోపణలనే రాహుల్ బహిరంగ సభలలో చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోదీకి సహారా సంస్థ నుంచీ, బిర్లా గ్రూప్ నుంచీ ముడుపులు అందాయని ఆరోపిసు ్తన్నారు. ఇవే ఆరోపణలను ప్రశాంత్‌భూషణ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు న్యాయ మూర్తి విచారణకు స్వీకరించకుండా ఈ సాక్ష్యాధారాలు సరిపోవనీ, ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలనీ చెప్పారు. మోదీపై ఆరోపణ ఏమిటి? ప్రశాంత్‌భూషణ్ చేసిన ఆరోపణలు ఏమిటి? ఆదాయపన్ను శాఖ అధికారులు 2012, 2013లలో సహారా, బిర్లా సంస్థల కార్యాలయాలపైన జరిపిన దాడులలో కొన్ని డైరీలు లభ్యమైనాయనీ, వాటిలో ఉన్న వివరాలను పరిశీలిస్తే నాటి గుజరాత్ ముఖ్యమంత్రికి సహారా నుంచి రూ 40.07 కోట్ల చెల్లింపులు దశల వారీగా జరిగాయనీ ఆరోపణ. అదే విధంగా బిర్లా కంపెనీ నుంచి రూ. 12 కోట్లు స్వీకరించినట్టు డైరీలో సంకేతప్రాయంగా ఉంది. ఇటువంటి ఆధారాలు లభిం చిన తర్వాత ఆదాయపన్ను శాఖ ఏమిచేయాలి? 1) నిజంగా చెల్లింపులు జరి గాయో, లేదో నిర్ధారించుకోవాలి. 2) సహారా, బిర్లా కంపెనీల ఉన్నతాధి కారులను పిలిపించి ప్రశ్నించాలి. 3) తనకు దొరికిన ఆధారాలను సీబీఐకీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కూ అప్పగించాలి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఈ వివరాలు సర్వోన్నత న్యాయస్థానం దృష్టిలో పెట్టాలి. విధిగా చేయవలసిన ఈ పనులేవీ ఆదాయ పన్నుశాఖ చేయలేదు. ఎందుకు చేయలేదని ఆ సంస్థ అధికారులను ప్రభుత్వం ప్రశ్నించాలి. నిజానికి ప్రధాని స్వయంగా ఈ డైరీల మూలాలు ఏమిటో తెలుసుకొని నివేదించవలసిందిగా అధికారులను ఆదేశించి నట్లయితే ఆదర్శంగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలోనే లాల్‌కృష్ణ అడ్వాణీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా జైన్ డైరీలో ఎల్.కె. అని రెండు పొడి అక్షరాలు కనిపించినందుకు, వాటి ఆధారంగా తనపైన అభియోగం వచ్చినందుకు తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకూ సభకు తిరిగి రానంటూ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో గెలుపొందిన అనంతరమే సభలో అడుగుపెట్టారు. అంతటి ప్రమాణాలను ఆశించకపోయిన ప్పటికీ తనపై వచ్చిన ఆరోపణలపైన విచారణకు ఆదేశించవలసిన ప్రధాని ఆ పని చేయకపోగా ఆరోపణలు చేసినవారిని ఆటపట్టించడం, అపహాస్యం చేయడం ప్రధాని పదవికి శోభాయమానం కాదు. ఒకవైపు ఓట్లు కొనుగోలు చేస్తూ, శాసనసభ్యులనూ, పార్లమెంటు సభ్యు లనూ ప్రలోభాలు చూపించీ, ప్రభుత్వ యంత్రాంగంతో కష్టాలూ,నష్టాలూ చవి చూపించి లొంగదీసుకుంటూ, పార్టీలో చేర్చుకుంటూ, మరోవైపు నల్లధనం మీద, అవినీతిమీద యుద్ధం చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే కపట నాటక సూత్రధారులను కట్టడి చేయవలసిందిపోయి వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రధాని స్వీయప్రతిష్ఠ మసకబారే విధంగా వ్యవహరిస్తున్నారు. సహారా, బిర్లా సంస్థలు ముడుపులు ఇచ్చింది కేవలం నరేంద్రమోదీకీ, షీలాదీక్షిత్కీ, దిగ్వి జయ్సింగ్కీ మాత్రమే కాదు. బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్(యు), ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఎస్పీ, ఎన్సీపీ, జెఎంఎం, జెవీఎం, తృణమూల్ కాంగ్రెస్ వంటి మొత్తం 18 రాజకీయ పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు చెల్లించి నట్టు ఆరోపణలున్నాయి. ఖనిజ నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన పార్టీలకు విరాళాల రూపంలో ముడుపులు పెద్ద పెద్ద కంపెనీలు చెల్లిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. గొంగడిలో కూర్చొని భోజనం చేస్తూ వెంట్రుకలను ఏరినట్టు పార్టీలకు నిధులు లెక్కాపత్రం లేకుండా సేకరిస్తూ అవే పార్టీలు నల్లధనంపైన యుద్ధం చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయడం, తమకు ప్రతిపక్షాలు అడ్డం వస్తున్నాయంటూ నిందించడం మన నేతలు బాగా రక్తి కట్టిస్తున్న ప్రహసనం. తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం, ప్రతి పక్షా లను నిందించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టవచ్చుననుకుంటే పొర పాటు. అది ప్రజల వివేకాన్ని తక్కువగా అంచనా వేయడమే. కార్పొరేట్లతో అక్రమ సంబంధం క్రోనీ కేపిటలిస్టులకూ (ఆశ్రిత పెట్టుబడిదారులకూ) ప్రభుత్వాలకూ మధ్య అక్రమ సంబంధం ఉందనేది లోకవిదితం. బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపా యల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కంపెనీలను ఏ ప్రభుత్వమూ ముట్టు కోదు. పైగా వాటి రుణాలు మాఫీ అవుతాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అదానీకి రూ. 72,000 కోట్లూ, అంబానీకి రూ. 1.13 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారని బీజేపీ పార్లమెంటు సభ్యుడు శ్రీకాంత్‌శర్మ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్డీఏని సూట్ బూట్‌కీ సర్కార్ అనీ, అంబానీ–అదానీ సర్కార్ అనీ పదేపదే చేస్తున్న ఆరోపణకు సమాధానంగా బీజేపీ ఈ వివరాలు విడుదల చేసింది. త్వంశుంఠ అంటే త్వంశుంఠ అనడం. పదివేల రూపాయల అప్పు తీర్చలేక అపరాధ భావనతో రైతు కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే వేలకోట్ల రూపాయల అప్పు ఎగవేసి ప్రభుత్వ సహకారంతో విజయ్ మాల్యా వంటి సంపన్నులు దర్జాగా విదేశాలకు చెక్కేస్తారని ప్రజలు గ్రహించారు. అక్రమ కార్పొరేట్లతో అంటకాగకపోతే, అంబానీ, అదానీ, వగైరాల బకాయిలను వసూలు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న సమ యంలో వచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం స్వాగతించేది. ఆయనను సాగనం పేది కాదు. యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా, మన్మోహన్ అయినా మోదీ అయినా ఒకే తానులో ముక్కలే. కార్పొరేట్లకు దాసులే. కాకపోతే వాగ్ధాటీ, సమయస్ఫూర్తీ, ఆర్ఎస్ఎస్ వంటి సుశిక్షితమైన సంస్థ శక్తీ, కార్యకర్తల బలం, మీడియా సహకారం అండగా ఉండటంతో బీజేపీ అజేయంగా కనిపించవచ్చు. ఓటర్ల హృదయాలను శాశ్వతంగా గెలుచుకోవాలంటే పైన చెప్పుకున్న శక్తులకు తోడుగా ఇంకో అంశం–విశ్వాసం–ఉండాలి. ప్రజల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండాలంటే మోదీపైన కానీ మరో నాయకుడిపైన కానీ వచ్చిన ఆరోపణలపైన తక్షణం విచారణ జరిపించాలి. బ్యాంకులకు వేలకోట్లలో ఉన్న బకాయీలను ఆశ్రిత పెట్టుబడిదారుల మెడలు వంచి వసూలు చేయాలి. కార్పొరేట్ సంస్థ లకూ, రాజకీయ పార్టీలకూ మధ్య వర్ధిల్లుతున్న అక్రమ సంబంధాన్ని తెగన రకాలి. ఆధారాలు లేకుండా రహస్యంగా ఏ పార్టీకీ ఎవ్వరూ చందాలు ఇవ్వ కుండా కట్టడి చేయాలి. ఎన్నికలలో అభ్యర్థులూ, పార్టీలూ చేసే ఖర్చును నిబం ధనల ప్రకారం నియంత్రించాలి. సాధారణ ప్రజలు ప్రతి లావాదేవీకీ ఆధార్ కార్డునో, పాన్ నంబరునో చూపించాలని చెబుతున్న ప్రభుత్వం రాజకీయ పార్టీలు సేకరిస్తున్న నిధులకు లెక్కలూడొక్కలూ అడగబోనంటోంది. వ్యక్తిగత విరాళాన్ని రెండు వేలకు తగ్గించాలని ఎన్నికల సంఘం సూచించింది. సభ్య త్వాల రుసుములాగానే ఈ విరాళాలనూ వేలమంది పేర రాసి సక్రమం అనిపిం చుకునే అవకాశం ఉంది. నయాపైస కూడా ఆధార్‌కార్డు కానీ పాన్ నంబరు కానీ లేకుండా ఏ పార్టీ విరాళం స్వీకరించడానికి వీలు లేకుండా నిబంధనలు పక డ్బందీగా రూపొందించడం ఉత్తమం. బినామీ చట్టాన్ని బిగిస్తున్నానంటూ చెప్పుకుంటున్న ప్రధాని ఈ బినామీ వ్యవహారాన్ని కూడా నిరోధించాలి. అప్పుడే ప్రభుత్వాలపైనా, అధికారపార్టీలపైనా, ప్రధానమంత్రులపైనా, ముఖ్యమం త్రులపైనా ప్రజలలో అవిశ్వాసం తగ్గుతుంది. (వ్యాసకర్త : కె. రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్) -
రాజకీయ భీష్ముడు రంగారెడ్డి
ఆత్మస్తుతి, పరనింద నిత్యకృత్యమైన రాజకీయాలలో మనుగడ సాగించలేక వేదిక దిగి మౌనంగా నిష్క్రమించిన నికార్సయిన పాతతరం నాయకులు అనేకమంది. గాంధీజీ ఆశయాలను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ, ఖద్దరు దుస్తులను మాత్రమే ధరిస్తూ, నిరాడంబరంగా జీవిస్తూ జనజీవన, నైతిక ప్రమాణాలు పాటిస్తూ, ప్రజల సంక్షేమమే ప్రధానంగా, ప్రగతే లక్ష్యంగా ప్రజాసేవకు జీవితాలను అంకితం చేసిన మహనీయులు క్రమంగా కనుమరుగవుతున్నారు. సేవానురక్తి కలిగిన యువరాజకీయ నాయకులూ, గుండెల్లో ఆశయాలను నింపుకొని రాజకీయాలలోకి ప్రవేశించాలన్న అభిలాష కలిగిన యువకులూ అటువంటి అనుభవజ్ఞుల సూచనలూ, సలహాలూ పాటించి విజ యాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలనీ, ఎన్ని పదవులు వరిం చినా పుట్టిపెరిగిన గ్రామాన్ని విడిచి వెళ్ళరాదనీ, నమ్ముకున్న వృత్తిని విస్మరించరాదనీ, అనుభవసారాన్ని కొత్త తరాలకు అందించాలనీ త్రికరణశుద్ధిగా విశ్వసించిన తలపండిన రాజకీయ నాయకులలో యాచవరపు రంగారెడ్డి ఒకరు. ఎనభయ్యోపడిలో కూడా ఆయన వ్యవసాయానికి స్వస్తి చెప్పలేదు. పాడీపంటకు దూరం కాలేదు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం మానలేదు. వర్తమాన రాజకీయాలను అధ్యయనం చేయడం, విశ్లేషించడం విరమించలేదు. వర్ధమాన రాజకీయ నాయకులకు సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం, మార్గనిర్దేశనం చేయడం ఆపలేదు. నిజాయితీపరుడుగా, మచ్చలేని నేతగా జీవితపర్యంతం ప్రజాసేవలో నిమగ్నమైన యాచవరపు రంగారెడ్డి (87) డిసెంబర్ 17న స్వగ్రామంలో కన్నుమూశారు. మా స్వగ్రామం తల్లాడ (ఖమ్మం జిల్లా)లోనే రంగారెడ్డి పుట్టారు. కల్లూరు సమీపంలోని కొర్లగూడెంలో మేనమామ దగ్గర పెరిగారు. మేనమామ కుమార్తెనే వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. తల్లాడలో యాచవరపు నరసింహారెడ్డి, మా నాన్నగారూ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీరంతా జలగం వెంగళరావుకు సన్నిహితులు. శీలం సిద్ధారెడ్డి వర్గానికి దూరం. వెంగళరావు సహచరులలో కొర్లగూడెం రంగారెడ్డి, కిష్టారం ఉడతనేని సత్యం ముఖ్యులు. వెంగళరావు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఎత్తి చూపే ధైర్యం ఉన్న బహుకొద్దిమంది నాయకులలో రంగారెడ్డి ఒకరు. వెంగళరావు అనుచరుడిగా ఉంటూనే కొన్ని విషయాలలో ఆయనతో పూర్తిగా విభేదించిన నేత. ఉదాహరణకు వెంగళరావు నూటికి నూరుపాళ్ళూ సమైక్యవాది. 1969 నాటి ప్రత్యేక తెలం గాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా చేరిన వ్యక్తి. రంగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నేటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో సాన్నిహిత్యం ఉంది. రంగారెడ్డి రాజకీయాలు కొర్లగూడెం సర్పంచ్ పదవితోనే ఆరంభం. 1959 నుంచి 1964 వరకూ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన తర్వాత కూడా ç2014 వరకూ కొర్లగూడెం సర్పంచ్‌లు ఏకగ్రీవంగానే ఎన్నికైనారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు. కల్లూరు సమితి అధ్యక్షుడుగా (1964 నుంచి 1974 వరకూ) రంగారెడ్డి పనిచేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రంగారెడ్డి 1974 నుంచి 1978 వరకూ ఉన్నారు. అదే కాలంలో మరెన్నో బాధ్యతలు నిర్వహించారు. జిల్లా రాజకీయాలలో భీష్మపితామహుడుగా పేరు తెచ్చుకున్న రంగారెడ్డి సామరస్యవాది. ప్రగతికాముకుడు. నీటిపారుదల, వ్యవసాయరంగాలపై అధికారం ఉన్న మేధావి. ప్రస్తుత రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు ఆయనను పెద్దదిక్కుగా భావించేవారు. ఏ సమస్య ఎదురైనా పెద్దాయన ఆలోచన ఏమిటో తెలుసుకున్న అనంతరమే నిర్ణయం తీసుకోవడం పరిపాటి. ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షుడు పిడమర్తి రవి కూడా రంగారెడ్డి సూచనలు పాటించి రాజకీయాలలో ఎదుగుతున్న యువనాయకుడే. రంగారెడ్డి, అప్పమ్మ దంపతులకు నలుగురు కుమారులు. పెద్దకుమారుడు గోవర్ధనరెడ్డి ఖమ్మంలో న్యాయవాది. విష్ణువర్ధనరెడ్డి కొర్లగూడెంలోనే వ్యవసాయం. రాజవర్ధనరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. రవివర్ధనరెడ్డి సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడు. ఏ అంశమైనా వివరంగా చెబితే అర్థం చేసుకొని సవ్యంగా రాయగల సామర్థ్యం నాకున్నదని ఆయన విశ్వాసం. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలలో ఎదురైన సమస్యల పరిష్కారాలు అన్వేషిస్తూ ఆయన నోట్స్ తయారు చేసుకొని గణాంకాలు సిద్ధం చేసుకొని నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి గంటల తరబడి కూర్చొని విసుగులేకుండా వివరించేవారు. ‘ఉదయం’, ‘వార్త’ పత్రికలలో నేను పని చేస్తున్న రోజుల్లో తరచుగా వచ్చేవారు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం రెండూ సంపూర్ణంగా కలిగిన అటువంటి రాజకీయ నాయకులు అరుదు. రంగారెడ్డి అందించిన సాధికారికమైన సమాచారం అధారంగా నేను అనేక వ్యాసాలు రాశాను. అటువైపు వెళ్ళిన ప్రతిసారీ కొర్లగూడెం వెళ్ళడం, వేడివేడి టీ తాగుతూ ఆయనతో గంటల తరబడి మాట్లాడటం ఆనవాయితీ. కిందటి నెల కొత్తగూడెం, తల్లాడ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని బాల్యమిత్రుడు డాక్టర్ ఉపేంద్ర, నేనూ ప్రయత్నించాం. కానీ సమయాభావం వల్ల విరమించుకోవలసి వచ్చింది. నేలవిడవకుండా సాము చేసే ఆశావాదినీ, వ్యవసాయదారుల సంక్షేమంకోసం పరితపించే రైతుబాంధవుడినీ కడసారి చూసే అవకాశం దక్కలేదు. రంగారెడ్డి జీవితం ఈతరం, భావి తరం రాజకీయవాదులకు ఆదర్శం కావాలని ఆకాంక్ష. రంగారెడ్డి చూపిన బాటలో కట్టుతప్పకుండా నడవడమే ఆయనకు ఘనమైన నివాళి. (డిసెంబర్ 26 ఉదయం కొర్లగూడెంలో సంతాపసభ) (వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ) -
మోదీకి అగ్నిపరీక్ష
త్రికాలమ్ ఇదివరకటి దూకుడు లేదు. అంతటి ఆత్మవిశ్వాసం లేదు. దర్పం లేదు. ప్రతి పక్షాలపై దాడి యాంత్రికంగా సాగింది. గతం తవ్వి కాంగ్రెస్‌ను దుయ్యబట్టడం, సిద్ధాంతాలతో రాజీపడి కాంగ్రెస్‌తో జతకట్టినందుకు కమ్యూనిస్టులను తప్పు పట్టడం యథావిధిగా జరిగిపోయింది. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీలో ఆవేశం కనిపించింది. దాని వెనుక ఆందోళన తొంగి చూసింది. తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రసంగిస్తూ తన స్వప్నాన్ని అనేక సందర్భాలలో వివరించినట్టు మోదీ నగదు రహిత సమాజం గురించి భావోద్వేగంతో మాట్లాడటం విశేషం. ప్రతికూల పరిస్థితిని అధిగమించే ప్రయత్నంలో ప్రదర్శించిన నాటకీయత అది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదే కానీ ఆ నిర్ణయాన్ని అమలు పర చిన తీరు సమంజసమైనదికాదని ప్రధాని గ్రహించినట్టు ఆయన హావభావాలు స్పష్టం చేశాయి. బిహార్ ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల వైఖరికి భిన్నంగా మోదీ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ దానిని పులిస్వారీగా అభివర్ణించడంలో చమత్కారం ఉంది. స్వారీ ఆపలేరు. కొనసాగించలేరు. ఇప్పుడు పరిస్థితిని తక్షణం మెరుగుపరచడానికి ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ మరెవ్వరైనా కానీ చేయగలిగింది ఏమీలేదు. రద్దు చేసిన నోట్ల విలువలో కనీసం 75 శాతం విలువచేసే కొత్త నోట్లు ముద్రించి మార్కెట్లోకి పంపేవరకూ ప్రజ లకు కష్టాలూ, ప్రభుత్వానికి అపఖ్యాతీ అనివార్యం. ఇది మోదీ తన రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష. ప్రజల స్వానుభవమే ప్రధానం పార్లమెంటులో ప్రతిపక్షాన్ని ఓడించవచ్చు. టీవీ చర్చాగోష్ఠులలో బీజేపీ ప్రతినిధులు వాదనలో గెలవలేనప్పుడు తాము దేశంకోసం పోరాడుతున్నా మంటూ దబాయించి ప్రత్యర్థుల నోరు మూయించవచ్చు. టీవీ చానళ్ళూ, పత్రికలూ వాస్తవాలను అంత వివరంగా కళ్ళకు కట్టలేకపోవచ్చు. మోదీ ప్రసంగాలను ఒకటికి రెండు విడతలు వివరంగా ప్రసారం చేయవచ్చు. కానీ ప్రజల అనుభవాన్ని కాదనలేము. తాము బ్యాంకులలో దాచుకున్న డబ్బు తీసుకోవడానికి రోజుల తరబడి క్యూలలో నిలబడి నానా తంటాలు పడుతూ ఆగ్రహంతో రగిలిపోతున్న సాధారణ ప్రజలను బీజేపీ కార్యకర్తలు లడ్డూలు పంచడం ద్వారా శాంతింపచేయలేరు. కూలీనాలీ లేక అలమటిస్తున్న పేద ప్రజ లనూ, ఉపాధి కోల్పోయినవారినీ, చేతిలో డబ్బు లేక నిత్యావసరాలు తీరక బాధలు పడుతున్నవారినీ, వంగడాలూ, ఎరువులూ కొనడానికి డబ్బు లేక నిస్సహాయంగా మిగిలిపోయిన రైతన్నలనీ, పింఛను కోసం క్యూలో నిలబడి తాళలేక మరణించిన వృద్ధులనూ ప్రధాని గమనించలేదని అనుకోలేము. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రజలతో విస్తృతమైన సంబంధాలు కలిగిన ప్రజానాయకుడిగా మోదీకి క్షేత్ర వాస్తవికత తెలియదని అనుకోవడం పొరపాటు. ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకార్‌పటేల్ ఇటీవల ‘సాక్షి’లో రాసిన వ్యాసంలో వెల్లడించినట్టు మోదీ కొందరు అధికారులపైన ఆధారపడి పెను నిర్ణయం తీసుకొని ఉండాలి. ఆకార్ గుజరాతీ. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనను ఆకార్ ఇంటర్వ్యూ చేశారు. మనసు విప్పి మాట్లాడుతూ మోదీ తాను ఫైళ్ళు చదవననీ, ఉన్నతాధికారులు క్షుణ్ణంగా ఫైళ్ళు చదివి వాటిలోని సారాంశం చెబితే దాని ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటాననీ చెప్పారు. అధికారులు పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చినా, బుద్ధి పూర్వకంగా తప్పుదారి పట్టించినా ముఖ్యమంత్రిగా మోదీ సరైన నిర్ణయాలు తీసుకోగలిగేవారు కాదు. అదే పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా జరిగి ఉంటుంది. సన్నిహితులైన అధికారులను సంప్రతించి వారి అభిప్రాయం ఆధా రంగా ఈ సంచలనమైన నిర్ణయం ప్రకటించినట్టు కనిపిస్తోంది. నవంబర్ 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని అత్యంత నాటకీయంగా, తనదైన రీతిలో పెద్ద నోట్లు (వెయ్యి, అయిదు వందల నోట్లు) మర్నాటి నుంచి చెల్లని చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రకటించిన అనంతరం మూడు రోజుల వరకూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడలేదు. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఇరవై రోజుల దాకా నోరు విప్పనేలేదు. ఇది నిజంగానే పులిస్వారీ. ముందుకు పోవలసిందే కానీ వెనకంజ వేసే అవకాశం లేదు. అందుకే తెగించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మార్కెట్లో ఉన్న డబ్బు అంతా బ్యాంకులకు చేరుతోంది. కశ్మీర్లో మరణించిన ఉగ్రవాదుల జేబుల్లో రెండు వేల రూపాయల కొత్త నోట్లు దొరికాయి. దొంగ నోట్లు మొత్తం చలా మణిలో ఉన్న నోట్లలో 0. 02 శాతమే. నల్లధనం, దొంగ నోట్లు, ఉగ్రవాదం వెనక్కుపోయి నగదురహిత లావాదేవీలు ముందుకు వచ్చాయి. మొత్తం లావాదేవీలలో కేవలం రెండు శాతమే నగదు రహితంగా జరుగుతున్న దేశంలో రెండు శాతం పది శాతం దాకా పెరగడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. నగదు రహిత లావాదేవీలు అభిలషించదగిన విధానమే. దాని వల్ల అవినీతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పన్నుల ద్వారా ప్రభుత్వాల ఆదాయం పెరిగే వీలుంది. నగదు రహిత విధానానికి ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు శ్రీకారం చుట్టవలసిందే. ఆ పని చేయడానికి పెద్ద నోట్లు రద్దు ద్వారా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. పెద్ద నోట్లను దశలవారీగా ఉపసంహ రించుకోవచ్చు. వాటి స్థానంలో కొత నోట్లను ప్రవేశపెట్టవచ్చు. కానీ నాటకీ యత, సంచలనం ఇష్టపడే ప్రధానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టించిన ప్రకం పన హృదయానికి బలంగా హత్తుకుంటుంది. దీటైన పోటీ లేకపోవడమే అదృష్టం గుడ్డిలో మెల్ల అన్నట్టు నరేంద్రమోదీకి సానుకూలంగా మూడు అంశాలు ఉన్నాయి. 1) తన పార్టీలో కానీ వెలుపల కానీ ఆయనకు దీటైన నాయకుడు లేడు. 2)ఈ సంక్షోభం మరి నాలుగు మాసాలలో సమసిపోతుంది. అంతవరకూ తట్టుకుంటే సరిపోతుంది. 3)ప్రతిపక్షాలలో ఐక్యత లేదు. అగ్రనేత అడ్వాణీ అప్పుడప్పుడు ఆగ్రహించినా ఆయన మోదీకి ఎసరు పెట్టే ప్రయత్నం చేయరు. అడ్వాణీ మనస్తత్వం అటువంటిది కాదు. మరోనాయకుడు మోదీని సవాలు చేసే ప్రసక్తి లేదు. పార్టీ, ప్రభుత్వం రెండూ మోదీ అదుపులోనే సంపూర్ణంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని ప్రశ్నించగలరు. ఇరకాటంలో పెట్టగలరు. అనూహ్యమైన వ్యాఖ్యలతో, వివాదాలతో సంచలనం సృష్టించగలరు. కానీ ఆయనకు దేశవ్యాప్తంగా ప్రాబల్యం లేదు. సొంత ఇంటి లోనే లుకలుకలు అనేకం. నేరం చేసి దొరికిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ పార్టీ పంజాబ్‌లోనూ, గోవాలోనూ (ఒక వేళ) గెలిచినప్పటికీ అది జాతీయ పార్టీ కాజాలదు. బీజేపీకి ఇప్పుడే ప్రత్యా మ్నాయం కాబోదు. ఇప్పటికీ ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ పార్టీ 2014 నాటి షాక్ నుంచి క్రమంగా కోలుకుంటోంది. 30 మాసాల కాలంగా యూపీఏ ప్రభుత్వ హయాంలోని కుంభకోణాల నిజం నిగ్గు తేల్చి శిక్షలు వేయించలేక పోయారు. కుంభకోణాలను ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీపై వాగ్దాడి చేయడమే కానీ దోష నిర్ధారణ జరగలేదు. దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పుడిప్పుడే రాజకీయాలను మనసుకు పట్టించు కొని అర్థవంతంగా మాట్లాడటం నేర్చుకుంటున్నారు. వాగ్ధాటిలో మోదీ స్థాయికి ఎప్పటికీ చేరలేకపోవచ్చును కానీ ప్రత్యర్థి తప్పిదాలు రాహుల్‌కి ఉపకరించ వచ్చు. సామాన్య ప్రజలపైన మోదీ ప్రసంగాల ప్రభావం కొత్తగా ఏమీ ఉండదు. ఆయన వాక్య విన్యాసం, అంగ విన్యాసం ప్రజలకు అలవాటైపోయింది. కాంగ్రెస్ పార్టీపైన కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలపైన కానీ ఆయన కొత్తగా చేయగలిగిన ఆరోపణలు ఏమీ లేవు. నల్లధనం ప్రతిపక్షాల దగ్గరే ఉన్నట్టు ప్రధాని మాట్లాడుతున్నారు కానీ ప్రజలు నమ్మరు. నల్లధనం అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరే ఉంటుంది. ములాయంసింగ్, మాయావతిపైన కేసులు న్నాయి. వాటిపైన చురుకుగా దర్యాప్తు చేయమంటూ సీబీఐని పురమాయించ వచ్చు. ప్రియాంక భర్త రాబర్ట్ వద్రాపైన రాజస్థాన్ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని వినియోగించుకొని ఉచ్చు బిగించవచ్చు. అంతవరకూ ఆగకుండా అరెస్టుల దాకా పోతే ప్రత్యర్థులకే ప్రయోజనం కలిగే ప్రమాదం ఉంది. కనుక సీబీఐని కొంత మేరకే వినియోగించవచ్చు. సంక్షోభం సమసి పోతుందా? పెద్దనోట్ల నిర్ణయం సృష్టించిన అలజడి సద్దుమణగడానికి 50 రోజులు పడు తుందనీ, అంతవరకూ ఓపికపట్టాలనీ ప్రధాని ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేశారు. ఆ గడువును నెలరోజులు పొడిగిస్తూ మరో అభ్యర్థన చేయవచ్చు. ప్రజలు క్యూలకు అలవాటు పడ్డారు. డిజిటల్ లావాదేవీలకూ సిద్ధపడుతున్నారు. క్రమంగా కొత్తనోట్ల రాకతో సమస్య తీవ్రత తగ్గిపోవచ్చు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే కానీ మోదీ పట్ల మోజు పూర్తిగా తగ్గిపోయిందని భావించడానికి వీలు లేదు. మోదీ ఏదో స్వార్థబుద్ధితో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకోవడం లేదు. తొందరపడి నిర్ణయం ప్రకటించి ఉంటారనీ, పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయనీ, దేశం మేలు కోరే మోదీ ఈ సాహసం చేశారనీ భావించేవారే అధికం. కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడం ప్రధానికి తోడ్పడుతోంది. నితీశ్ కుమార్ ఈ విషయంలో అగ్రగణ్యుడు. నోట్లరద్దు నిర్ణయాన్ని మొదట్లో వ్యతి రేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసిన తర్వాత పూర్తిగా మారిపోయారు. అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించినట్టు ఎంఐఎం టీఆర్ఎస్ని సమర్థిస్తుంటే టీఆర్ఎస్ బీజేపీని బలపరుస్తోంది. శనివారం శాసనమండలిని పూర్తిగా వినియోగించుకొని కేసీఆర్ మోదీకి బాగా దగ్గర కావడానికి ప్రయత్నించారు. మోదీతో తాను జరిపిన చర్చల గురించి అనేక విడ తలు ప్రస్తావించారు. గుడ్డిగా వ్యతిరేకించనక్కరలేదు, గుడ్డిగా బలపరచనక్కర లేదు అని అంటూనే, నితీశ్‌కుమార్‌లాగా 50 రోజులు వేచి చూద్దామని చెబు తూనే నోట్ల రద్దు నిర్ణయం మంచిచెడులపైన చర్చ జరగడం సభానియమాలకు విరుద్ధమంటూ ప్రతిపక్షాల ముందరి కాళ్ళకు బంధాలు వేశారు. కేంద్ర నిర్ణ యాలను శాసనసభలో చర్చించడమే కాదు వాటికి సవరణలు ప్రతిపాదిస్తూ తీర్మానాలు చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వాదించి కేసీఆర్ ప్రతిపక్షాలను విజయవంతంగా కట్టడి చేశారు. కేంద్రంపైన, ముఖ్యంగా నరేంద్రమోదీపైన ఈగ వాలనివ్వలేదు. ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రం నుంచి ఆశిస్తున్నది ఏమీ లేకపోవచ్చు. సిద్ధాంతపరంగానే నోట్లరద్దును ఆయన సమర్థించి ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్ ముందు వ్యతిరేకించి తర్వాత మద్దతు ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు మద్దతు తెలిపి ప్రజలలో నిరసన ప్రబలిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇద్దరికీ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు అవసరం. ఈ మేరకు ఇద్దరి అర్జీలూ ప్రధాని ఎదుట నిరీక్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన అవ సరం కేసీఆర్‌కు లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్‌కు చంద్రబాబు నాయుడికి ఉన్నంత ప్రైవేటు వ్యామోహం లేకపోయినప్పటికీ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యానికి (పీపీపీ) తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదు. మోదీతో సిద్ధాంతపరంగా విభేదించే పరిస్థితి లేదు. నోట్ల రద్దు అంశంపైన ప్రతిపక్షాల మధ్య ఐక్యత వర్ధిల్లినప్పటికీ పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరిరోజున ఇతర ప్రతిపక్షాలతో చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు ప్రధానిని కలసి సమైక్యతకు విఘాతం కలిగించారు. యూపీలో ఎస్పీ అధికారంలో ఉంది. బిఎస్పీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎంతకాలం ఉంటుంది? మోదీని రాహుల్ కలవడం కేవలం ఒక సాకు. ప్రతిపక్షాల మైత్రి నిలిచేది కాదు. దాని స్వభావమే అంత. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించడం, ఇతర ప్రతిపక్షాలలో ఐక్యత లేకపోవడం మోదీకి సానుకూలమైన అంశం. యూపీ ఎన్నికలలో ఘనవిజయం సాధించ నక్కరలేదు. పాస్ మార్కులు సంపాదిస్తే చాలు. పాస్ మార్కులైనా వస్తాయా, రావా అన్నదే మోదీ అనుమానం. అందుకే ఆయన వదనంలో ఆందోళన ఛాయలు. - కె. రామచంద్రమూర్తి -
కీలకమైన తీర్పు
త్రికాలమ్ ప్రజల జీవితాలను శాసించే అంశాలలో కొన్ని సామాజికమైనవి. మరికొన్ని రాజకీయమైనవి. ఇంకా కొన్ని ఆర్థికమైనవి. మిగిలినవి న్యాయపరమైనవి. ఈ నాలుగు రంగాలనూ సంవిధానం (రాజ్యాంగం) శాసిస్తుంది. మొదటి రెండు రంగాలపై సమాజంలో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, న్యాయపరమైన అంశాలపైన ఇటీవలి వరకూ అవ గాహన అంతగా లేదు. సమాలోచన లేనేలేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ధర్మమా అని ఇప్పుడు ఆర్థికాంశాలను అనివార్యంగా తెలుసుకోవలసి వస్తున్నది. గృహిణులూ, రైతులూ, కార్మికులూ అందరూ డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి డెబిట్ కార్డులూ, ఆన్లైన్ బదలాయింపులూ వగైరా ఆధునిక ప్రక్రియలలో ప్రజలందరికీ తర్ఫీదు ఇవ్వడానికి నడుం బిగించడంతో ఆర్థికాంశాలను తెలుసుకోవడం తప్పనిసరి. అంతే ముఖ్యమైన న్యాయవ్యవస్థ పైన ప్రజల పరిజ్ఞానం దాదాపు శూన్యం. ఎవరైనా తప్పని పరిస్థితులలోనే కోర్టు గడప తొక్కుతారు. న్యాయవాది చెప్పినట్టే నడుచుకుంటారు. తరాలు గడిచినా వ్యాజ్యాలు పరిష్కారం కావు. చట్టాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకునే పరి స్థితి లేదు. లోక్ అదాలత్ వంటి సంస్థలు సరిపోవు. అందుకే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రశ్నించకుండా ఆమోదించడం పౌరులకు అలవాటుగా మారింది. న్యాయస్థానాలను ప్రశ్నించకూడదనీ, తీర్పులను శిరసావహించ డమే కానీ విమర్శించడం నేరమనే అభిప్రాయం సామాన్య ప్రజలలో ఉంది. న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించకుండా తీర్పులోని మంచిచెడులను పరిశీలించవచ్చు. ప్రజలు తమ వాదనలనూ, తీర్పులనూ తరచి పరీక్షిస్తారనే స్పృహ ఉన్నప్పుడు న్యాయవాదులూ, న్యాయమూర్తులూ, న్యాయాధికా రులూ మరింత జాగ్రత్తగా ఉంటారు. వారూ మానవమాత్రులే. దైవాంశ సంభూతులు కారు. సంవిధానమే సర్వోన్నతం రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలనీ, సంవిధానం అన్నిటి కంటే ఉన్నత మైనదనీ, చట్టం ఎదుట అందరూ సమానమేననే అభిప్రాయంతో ప్రజలు న్యాయస్థానాలను విశ్వసిస్తారు. తాము కళ్ళతో చూసిన విషయం, చెవులతో విన్న అంశం కోర్టులలో నిగ్గుతేలకుండా తేలిపోతుంటే పౌరులు గందరగోళంలో పడతారు. ఇటువంటి అనుభవం తరచుగా ఎదురైతే న్యాయవ్యవస్థపైనే అవి శ్వాసం కలుగుతుంది. కేసు వాదించే న్యాయవాది లోపమో లేక చట్టాన్ని అన్వ యించడంలో న్యాయమూర్తి వైఫల్యమో తెలియదు. సాక్ష్యాధారాలు సేకరించ డంలో పోలీసు యంత్రాంగం లోపం కావచ్చు. వాటిని సవ్యంగా సమర్పించ డంలో ప్రాసిక్యూషన్ అసమర్థత కావచ్చు. అందుకే హత్య కేసులనూ, దొమ్మీ కేసులనూ సాక్ష్యాధారాలు లేవనే కారణంగా నేరస్థులను నిర్ణయించకుండానే, శిక్ష విధించకుండానే న్యాయస్థానాలు కొట్టివేస్తుంటాయి. ‘ఓటుకు నోటు కేసు’ విష యంలో ఇటువంటి పరిణామాలు చాలా సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్ సన్‌కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలు ఇవ్వజూపడాన్ని టీవీలలో ప్రేక్షకులు ఒకటికి పదిసార్లు తిలకించారు. రేవంత రెడ్డిని వలవేసి తెలంగాణ ఏసీబీ 2015 మే 31న పట్టుకుంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వరాన్ని పోలిన స్వరం ‘మావాళ్ళు బ్రీఫ్డ్ మీ...’అంటూ మాట్లాడటం టీవీ చానళ్ళే వినిపించాయి. అనంతరం ’చంద్రబాబూ... నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బహిరంగసభలో హుంకరిస్తూ తర్జని ఊపుతూ హెచ్చరించడం ప్రజలు టీవీలలోనే చూశారు. ‘యూ హావ్ పొలీస్... వియ్ హావ్ పోలీస్. యూ హావ్ ఏసీబీ...వియ్ హావ్ ఏసీబీ... ’అంటూ చంద్రబాబునాయుడు తీవ్రస్వరంతో కేసీఆర్‌ను సవాలు చేయడం విన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆరోపణలపై సత్వరం విచారణ జరుగుతుందనీ, నిజం నిగ్గు తేలుతుందనీ, ఎన్నికలలో అవినీతికి పాల్పడు తున్నవారిని న్యాయవ్యవస్థ అభిశంసిస్తుందనీ, కనీసం ఆక్షేపిస్తుందనీ ఆశించిన వారికి ఆశాభంగం మిగిలింది. శుక్రవారంనాడు హైకోర్టు న్యాయమూర్తి తాళ్ళూరి సునీల్ చౌదరి ఇచ్చిన తీర్పుతో ‘ఓటుకు నోటు కేసు’ మరింత బలహీనపడింది. శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతూ తనకు ముడుపులు ఇవ్వజూపారంటూ స్టీఫెన్సన్ ఫిర్యాదు చేశారు. ఆయన వాగ్మూలం తీసుకొని, ఇతరత్రా ఆధారాలు సేకరించి తెలంగాణ అవినీతి నిరోధక సంస్థ (యాంటీ కరప్షన్ బ్యూరో–ఏసీబీ) అభి యోగపత్రాన్ని (చార్జిషీట్) తెలంగాణ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అందులో చంద్రబాబునాయుడు పేరును 30 కంటే ఎక్కువ సార్లు పేర్కొన్నది. అన్ని సార్లు ప్రస్తావనకు వచ్చిన వ్యక్తిని ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి తీసుకొని విచారిస్తారనే ఎవరైనా భావిస్తారు. కానీ ఆ పని జరగలేదు. ఎందుకు జరగలేదో ప్రజలకు తెలియదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలి అమ రావతికి తరలివెళ్ళడంతో రాజకీయ సమీకరణలు మారాయి. ఇద్దరు ముఖ్య మంత్రుల మధ్య రాజీ కుదర్చడంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని కూడా సమాచారం ప్రచారంలో ఉంది. ప్రజలలో ఉన్న అనుమానాలు బలపడే విధంగా ఈ కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు మందగించింది. చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు ఆరోపిస్తున్న స్వరాన్ని తెలంగాణ ఏబీసీ పరీక్షకు పంపించకుండా తాత్సారం చేసింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో చంద్ర బాబునాయుడి పాత్రపై దర్యాప్తు జరపాలంటూ తెలంగాణ ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. దీన్ని చంద్రబాబునాయుడు హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ఏబీసీ కోర్టు ఆదేశంపైన హైకోర్టు 2016 సెప్టెంబర్ 2న తాత్కాలిక స్టే మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వాదనలు ఆలకించిన సుప్రీం ఈ కేసును నాలుగు వారాలలో పరిష్కరించాలంటూ హైకోర్టును ఆదేశించింది. చంద్రబాబు నాయుడు తరఫున ఢిల్లీ నుంచి దిగ్గజాలవంటి న్యాయవాదులు వచ్చారు. రామ కృష్ణారెడ్డి తరఫున సుధాకరరెడ్డి వాదించారు. నవంబర్ చివరలో వాదనలు ముగిశాయి. తీర్పు శుక్రవారం ఇచ్చారు. తీర్పు పాఠం వంద పేజీలు వచ్చింది. చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. రామకృష్ణారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రకటించారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి అనీ, ఆయనకి తెలంగాణ యంత్రాంగం, తెలంగాణ ఏసీబీపై ఎటువంటి నియంత్రణా ఉండదనీ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీని పిటిషనర్ చంద్రబాబునాయుడు ప్రభావితం చేస్తున్నారంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణ కేవలం కాల్పనికమైనది మాత్రమేనని నిర్థారించారు. ఎవరిపైన అయినా నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేయడం సులభ మంటూ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్ర పైన దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ తెలంగాణ ఏసీబీకోర్టు ఏసీబీని ఆదేశించడం న్యాయబద్ధమా, కాదా అన్నదే జస్టిస్ సునీల్ చౌదరి ఎదుట ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో సరిపుచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు నిర్దోషి అంటూ తీర్పు ఇవ్వడం విశేషం. మొత్తంమీద జస్టిస్ సునీల్ చౌదరి తీర్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ ఏసీబీలో విచారణలో ఉన్న అసలు కేసుపైన పడే అవకాశాలు ఉన్నాయి. ఏసీబీ కోర్టుకు హైకోర్టు తీర్పు మార్గదర్శనం చేస్తుంది. న్యాయమూర్తి అన్ని కోణాల నుంచీ సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరిశీలించే సుదీర్ఘమైన తీర్పు వెలువరించి ఉంటారు. సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ సాధికారికంగా తీర్పు రచించి ఉంటారు. చట్టపరమైన అంశాల జోలికి వెళ్ళకుండా కేవలం ఇంగితజ్ఞానం వినియోగించి తీర్పు చదివినవారికి కొన్ని సందేహాలు కలుగుతాయి. వాటిలో ప్రధానమైనవి ఇవి: 1) రెండో ప్రతి వాది రామకృష్ణారెడ్డికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అర్హత (లోకస్‌స్టాండీ) లేదని న్యాయమూర్తి నిర్ణయించారు. 2) రెండో ప్రతివాది సమర్పించిన స్వరనమూనాను విశ్వసించడం కష్టం అనీ, అది సేకరించిన విధం సరైనది కాదనీ, ప్రతివాది ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఏసీబీ చార్జిషీట్‌కు నకలు మాత్రమేననీ వ్యాఖ్యానించారు. 3) కక్షిదారు (పిటిషనర్) చంద్రబాబునాయుడూ, స్టీవెన్సన్ మధ్య జరిగినట్టు చెబుతున్న సంభాషణను సమగ్రంగా పరిశీలించాలి కానీ ఒకటి, రెండు వాక్యాలను చూపించి భాష్యం చెప్పకూడదని అన్నారు. తమ పార్టీకి ఓటు వేయమని కానీ ఓటింగ్ రోజున నగరంలో ఉండకుండా విదేశాలకు వెళ్ళమని కానీ స్టీఫెన్సన్కు చంద్రబాబు నాయుడు చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారు. 4) ఒక వ్యక్తికి తెలియకుండా అతని స్వరాన్ని రికార్డు చేసినట్లయితే అది న్యాయస్థానంలో చెల్లనేరదని చెప్పారు. 5) రెండో ప్రతివాది వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ వ్యాజ్యం తీసుకువచ్చారని అనుకునే అవకాశం లేకపోలేదని అన్నారు. రామ కృష్ణారెడ్డికి నిగూఢమైన లక్ష్యం (హిడెన్ ఎజెండా) ఉన్నదని ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వినియోగించుకునేవారిని ఉపేక్షించరాదంటూ ఉద్ఘాటించారు. 6) ఏబీసీ ప్రత్యేక కోర్టు మెదడు ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుపట్టారు. ఈ ఆరు అంశాలలో ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయేమో పరిశీలిద్దాం. రాజ్యానిదే బాధ్యత నేరం ఎవరు చేసినా, ఎక్కడ జరిగినా దాన్ని విచారించి దోషులను శిక్షించే బాధ్యత, హక్కు పూర్వకాలంలో రాజులకు ఉండేది. రాజ్యాంగ పాలన అమలులోకి వచ్చిన తర్వాత ఈ తరహా రాజ్యాంగ విధులు నిర్వహించడానికి న్యాయవ్యవస్థ ఏర్పడింది. నేరం జరిగినప్పుడు దాని తాలూకు సమాచారం ఎవరు న్యాయస్థానానికి అందించారన్నది ప్రశ్న కాదు. సమాచారం సరైనదా కాదా అన్నదే పరిశీలనాంశం. ఫిర్యాదు చేసినవారు ఎక్కడివారైనా, ఎవరైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ వేసే హక్కు లేదనడం చట్టం ప్రకారం సహేతుకమేమో కానీ చట్టం తెలియని సాధా రణ పౌరులకు సమంజసంగా కనిపించదు. బాధితులు మినహా తక్కినవారికి అర్హతే లేదంటే న్యాయం నిర్ణయించే క్రమానికి అది పరిమితి అవుతుంది. టూజీ స్కాం వంటి నేరాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) కారణంగా వెలుగు లోకి వచ్చినవే. కేవలం ఉత్తరం రాస్తే దాన్ని పిల్‌గా స్వీకరించిన జస్టిస్ భగవతి వంటి గొప్ప న్యాయమూర్తుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. క్రిమినల్ కేసుకూ, ప్రజాప్రయోజనాల వ్యాజ్యానికీ అంతరం ఉన్నది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ ప్రకారమే వ్యవహరించాలన్న మాట వాస్తవమే. కానీ సంబంధం లేనివారు ఫిర్యాదు చేయకూడదన్నా, పిటిషన్ దాఖలు చేయరాదన్నా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడూ, దాడులు జరిగినప్పుడూ పోలీసులకు సమాచారం అందించడా నికి ఎవ్వరూ ముందుకు రారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మను షులోయ్ అని గురజాడ చెప్పింది రాజ్యానికీ వర్తిస్తుంది. రాజ్యం (స్టేట్) అంటే పౌరులే. పౌరులు తమ సౌలభ్యం కోసం సృష్టించుకున్న రాజ్యాంగ వ్యవస్థల సమాహారమే. ప్రతి పౌరుడికీ ఏ కోర్టులోనైనా పిటిషన్ వేసే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిందనే భావన అందరిలో ఉంది. స్వరనమూనాపై విశ్లేషణ కోర్టుకు దరఖాస్తు పెట్టుకొని కోర్టు అనుమతితో స్వరనమూనాను తీసుకోవా లన్న మాట నిజమే. రెండో ప్రతివాది ఏదో ఒక విధంగా స్వరనమూనా సంపా దించి ముంబయ్‌లోని లాబ్‌లో పరీక్షించడం న్యాయస్థానానికి సాంకేతి కంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ తన ఎదుట దాఖలైన స్వర నమూనాను న్యాయస్థానంలో ఉన్న నమూనాతో పోల్చి ప్రతివాది దాఖలు చేసింది దొంగ నమూనా అని నిరూపించవచ్చు. అదే జరిగితే న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిం చినందుకు చట్టప్రకారం ప్రతివాదిని శిక్షించవచ్చు. రెండు నమూనాలూ ఒకటే అయితే దాన్ని ఆమోదించవచ్చు. ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా అంతిమంగా నిజాన్ని నిగ్గు తేల్చడమే కదా న్యాయస్థానాల కర్తవ్యం? స్వరనమూనాకు విలువ లేదంటూనే అందులోని అంశాలపై న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చంద్ర బాబునాయుడివిగా చెబుతున్న మాటలన్నిటినీ సమ్యక్ దృష్టితో చూడాలని చెబుతూ ‘ఫ్రీలీ యూకెన్ డిసైడ్’ అని చెప్పారు కదా ఎక్కడా ఒత్తిడి చేయలేదు కదా అంటూ న్యాయమూర్తి తర్కించారు (తీర్పు పూర్తి పాఠంలో 153 నుంచి 157వ పేరా వరకూ). వారి తర్కం ప్రకారమే ఆ సంభాషణను మొత్తం స్వీకరిం చాలి లేదా మొత్తం తిరస్కరించాలి. ఒక వ్యక్తికి తెలియకుండా, ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరంపైన రికార్డు చేసిన స్వరం చట్టం దృష్టిలో ఆమోద యోగ్యం కాదు (Recording voice of an individual on electronic record without his knowledge or consent cannot be treated as his admitted voice) అని తీర్పు 142వ పేరాలో (86వ పేజీ ఎగువ వాక్యాలు) స్పష్టం చేశారు. ఇదే సూత్రం సర్వత్రా అమలు జరిగితే రహస్యంగా రికార్డు చేసే స్వరాలకూ, స్టింగ్ ఆపరేషన్లకూ, తెహల్కా కథనాలకూ చట్టబద్ధత లేనట్టే భావిం చాలి. నీరా రాడియా టేపులకూ విలువ లేదనుకోవాలి. ఇవన్నీ న్యాయమూర్తి చెప్పినట్టు అవినీతి నిరోధక చట్టంలోని 12వ సెక్షన్, భారత శిక్షాస్మృతి 120–బి సెక్షన్ ప్రకారం చెల్లవు. న్యాయమూర్తులు తమ ఎదుట సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిర్ణయాలకు వస్తారు. కక్షిదారుల రాజకీయ విశ్వాసాలనూ, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులనూ పరిగణనలోకి సాధారణంగా తీసుకోరు. ప్రతి కేసు వెనుకా ఏదో ఒక ప్రయోజనమో, ఆక్రోశమో, ఆందోళనో ఉంటుంది. వాటితో నిమిత్తం లేకుండా తన ఎదుట వినిపించిన వాదనలు ఆలకించి వస్తునిష్ఠంగా న్యాయాన్యాయాలను నిర్ణయిస్తారని న్యాయస్థానాలతో పరిచయం లేనివారు భావిస్తారు. జస్టిస్ సునీల్‌చౌదరి రాజకీయ నేపథ్యాలను చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, పిటిషనర్ తెలుగుదేశం నాయకుడనీ, ప్రతివాది ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యుడనీ, పిటిషనర్‌పైన వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధించడం కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి ఉండవచ్చుననీ వ్యాఖ్యానిం చారు (130,131వ పేరా). రామకృష్ణారెడ్డి తెలంగాణ శాసనమండలి సభ్యుడు కాదనీ, తెలంగాణలో జరిగిన నేరంతో ఆయనకు సంబంధం ఏమిటనీ ప్రశ్నిం చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే ఏమిటో న్యాయస్థానానికి తెలుసుననీ, ప్రజాప్రయోజన వ్యాజ్యం ముసుగులో ఎవరైనా రహస్య ఎజెండా పెట్టుకొని వ్యాజ్యం తీసుకొని వస్తే న్యాయస్థానాలు దాన్ని అనుమతించరాదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కక్షిదారుల రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహా రాలతో నిమిత్తం లేకుండా విషయ ప్రాధాన్యం, నిజానిజాల ఆధారంగా న్యాయ స్థానాలు తీర్పు ఇవ్వాలన్న అభిప్రాయానికి ఇది విరుద్ధం. అయినప్పటికీ చట్టం ప్రకారం న్యాయమూర్తి నిర్ణయం సరైనదే కావచ్చు. పరిశోధన ఏబీసీ చేయవలసిందే ఏసీబీ విచారణ సవ్యంగా జరగడం లేదని భావించి, సజావుగా జరిగే విధంగా ఏసీబీని ఆదేశించాలంటూ అభ్యర్థిస్తూనే రెండో ప్రతివాది ఏబీసీ కోర్టును ఆశ్రయించారు. తాను స్వయంగా పరిశోధన చేస్తానంటూ రాలేదు. ఒక వ్యక్తికి అది సాధ్యం కూడా కాదు. కేసు పరిశోధన బాధ్యతను తాను స్వీకరిస్తానంటూ రెండో ప్రతివాది –రామకృష్ణారెడ్డి– ముందుకు వచ్చారని న్యాయమూర్తి అన్నారు (This clearly indicates that the second respondent came forward to showlder the responsibility of investigation-Para 127). పరిశోధ నలో పాల్గొనడానికి ప్రతివాదిని అనుమతిస్తే ఏబీసీ నైతికంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ప్రతివాది ప్రతిపాదన అది కాదు. న్యాయమూర్తి స్పష్టం చేసినట్టే అన్ని అంశాలూ సమ్యక్‌దృష్టితో చూసినప్పుడు రేవంతరెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, స్టీఫెన్సన్కు డబ్బు ఇచ్చి ఆయనను లోబరచు కోవలసిన అవసరం రేవంత్‌రెడ్డికి ఎందుకు కలిగిందో, స్టీఫెన్సన్కి డబ్బు అప్పజెప్పడం వల్ల, ఆయనను సుముఖుడిని చేసుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికో ఆలోచించాలి. ఇది చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ రచించిన వ్యూహమనీ, దీని అమలు బాధ్యత టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డికి అప్పగించారనీ, స్టీఫెన్సన్ను ‘కొనుగోలు’ చేసే ప్రయత్నం తెలుసు కొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీబీ వలలో రేవంత్‌రెడ్డి చిక్కే విధంగా వ్యవహరించారనీ చట్టం తెలియని సాధారణ పౌరులకు అర్థం అవుతుంది. టీవీలో దృశ్యాలను చూసినవారందరికీ ఇది తేటతెల్లమే. ఈ విషయాలు న్యాయ స్థానాలలో ఎప్పటికీ నిర్థారణ కాకపోవచ్చు. అది వేరే సంగతి. ఈ కేసులో న్యాయస్థానాలలో నిర్ణయాలు ఏమైనా జనాభిప్రాయం మాత్రం మారదు. - కె. రామచంద్రమూర్తి -
వ్యంగ్య ప్రహారం ‘చో’
హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించి రాజకీయ నేతలపై అక్షరాస్త్రాలు సంధించిన జర్నలిస్టు ప్రముఖులలో ‘తుగ్లక్’ వారపత్రిక సంపాద కుడు చోరామస్వామి అగ్రగణ్యుడు. బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన చో బడుగువర్గాలకు అండగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో నిద్రించిన అక్షరయోధుడు. కొంతకాలం కింద చెన్నైలో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్రమోదీని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ, ‘నేను ఇప్పుడు మృత్యుబేహారి (మర్చంట్ ఆఫ్ డెత్)ని మాట్లాడవలసిం దిగా కోరుతున్నాను’ అని చో అన్నప్పుడు మోదీ సహా సభికులం దరూ ఫక్కున నవ్వారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో మోదీనీ ‘మౌత్ కీ సౌదాగర్’ అనడం విన్నాం. గుజ రాత్ అల్లర్లలో ముస్లింలపై జరిగిన హత్యాకాండని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాంశం చేసింది. సోనియా ప్రచారాన్ని పరోక్షంగా తిప్పికొట్టడానికి చో వ్యంగ్యాన్ని వినియోగించారు. ‘ఉగ్రవాదం పట్ల మృత్యుబేహారినీ, అవినీతి పట్ల మృత్యుబేహారినీ, బంధుప్రీతి పట్ల మృత్యుబేహారినీ...’ అంటూ, ‘సకల అరిష్టాలపట్ల మృత్యు బేహారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను’ అన్నారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చో ధీరో దాత్తంగా పోరాడారనీ, తాము కూడా ఆ పోరాటంలో పాలు పంచుకున్నామనీ, అప్పుడే చో పేరు విన్నాననీ ప్రధాని చెప్పారు. చో నూటికి నూరుపాళ్ళు ప్రజాతంత్రవాది అనీ, ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా విమర్శించగలరనీ; నీతీ, నిజాయితీ కలిగిన జర్నలిస్టు అనీ అన్నారు. తాను ‘రాజగురు’ అని అంటూ తనకు పరిచయం చేసుకున్నారని మోదీ గుర్తు చేశారు. గుజరాత్ ముఖ్య మంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత మోదీని జయలలిత పోయెజ్గార్డెన్కు ఆహ్వానించడం వెనుక ఈ ‘రాజగురు’ ప్రేరణ ఉంది. చో మరణవార్త తెలిసిన వెంటనే మోదీ ఇచ్చిన ట్వీట్లో ‘చో బహుముఖ ప్రజ్ఞాశాలి. శిఖరసమానుడైన మేధావి. గొప్ప జాతీయ వాది. అందరూ గౌరవించి, అభిమానించే సాహసోపేతమైన వాణి,’ అంటూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత శవపేటిక ఉన్న వాహనం నుంచి ఎంజీఆర్ భార్య జానకి వర్గంవారు కిందికి తోసివేయగా నేలమీద పడి అవమానభారంతో మెరీనాబీచ్కి వెళ్ళకుండా ఇంటికి తిరిగి వెళ్ళిన జయలలితను ఏఐఏడిఎంకె అధినేత (జనరల్ సెక్రటరీ)గా ప్రతిష్ఠించడంలో చో పాత్ర నిర్ణాయకమైనది. అంతకు ముందు సినిమారంగంలో సైతం జయలలితకు హితైషిగా ఉండే వారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసురాలు జయలలిత మాత్రమే నని విశ్వసించి ఆమెకు తోడూనీడగా నిలిచి, రాజకీయ వ్యూహాలు రచించి, మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి చో. ఆ దక్షత కారణంగానే ఏఐఏడిఎంకె 29 సంవత్సరాలు నిలబడటమే కాకుండా నాలుగు విడతల అధికారంలోకి వచ్చింది. లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. వైద్యం చేయించుకుంటున్నవారిని ఆస్పత్రికి వెళ్ళి పరా మర్శించే ఆనవాయితీ జయలలితకు లేదు. కొన్ని మాసాల కిందట ఊపిరితిత్తుల వ్యాధి ప్రబలి ఆస్పత్రిలో చేరిన చోను పరామర్శిం చేందుకు జయ వెళ్ళారు. స్నేహభావాన్ని చాటుకునే పద్ధతి అది. మోదీ కూడా చెన్నై వచ్చినప్పుడు చోని ఆస్పత్రిలో పరామ ర్శించారు. జయ మరణించిన రెండు రోజులకే చో కూడా ఈ లోకం వీడి వెళ్ళిపోయారు. సాధారణంగా గురువును శిష్యులు అనుసరి స్తారు. చో విషయంలో శిష్యురాలు ముందు వెళ్ళిపోతే ఆమె వెంటే గురువు వెళ్ళాడు. చో అసాధారణ రచయిత. మైసూరులో న్యాయవాదుల వంశంలో 1934 అక్టోబర్ 5న పుట్టిన శ్రీనివాస్ అయ్యర్ రామ స్వామి మద్రాసులో లా చదివి కొంతకాలం ప్రాక్టీసు చేశారు. టీటీకే సంస్థల గ్రూప్ న్యాయసలహాదారుగా పనిచేశారు. కానీ చదువు కునే రోజుల్లోనే రంగస్థలంపైన మోజు మొదలై అది వ్యామో హంగా ముదిరింది. నాటకాలు రాయడం, నటించడం, దర్శకత్వం వహించడంలో తలమునకలైనారు. అనంతరం సినిమా రంగంలో హాస్యపాత్రలలోనూ, తండ్రి పాత్రలలోనూ జీవించారు. సుమారు రెండు వందల సినిమాలలో నటించారు. నాలుగు సిని మాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలకు మాటలు రాశారు. 23 నాటకాలు రాశారు. టీవీ సీరియళ్ళకు లెక్కలేదు. తన జీవిత చరిత్రను ‘ఎక్స్ప్రెషన్స్ గివెన్ బై ఫార్ట్యూన్’ (అదృష్టం అందించిన అనుభవాలు) పేరుతో వెలువరించారు. తనకు ప్రతిభ కంటే అదృష్టం అధికమంటూ చమత్కరించేవారు. 1970లో ‘తుగ్లక్’ పత్రికను స్థాపించారు. తన పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ఇందిరాగాంధీ, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లపైన కూడా నిశితమైన విమర్శలు ప్రచురించే వారు. అందరినీ సమభావంతో ఉతికి ఆరవేయడమే విధానం. రాజకీయ వ్యాఖ్యాత గానే కాకుండా రాజకీయ సూత్రధారిగా కూడా చో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు ఇష్టుడైన కామరాజ్ నాడార్ నాయ కత్వంలోని పాత కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేసే సంకల్పంతో ఇందిర, కామరాజ్‌లతో మాట్లాడి మధ్య వర్తిత్వం నెరపారు. ‘దెన్మొళియల్’పేరుతో ఒక నాటకం రచించి, అందులో చో పాత్ర పోషించి, రక్తికట్టించి ప్రేక్షకులను మెప్పించడంతో ఆయన పేరులో శ్రీనివాస్ అయ్యర్ ఎగిరిపోయి ‘చో’ వచ్చి చేరింది (జానకి ఇంటిపేరు షావుకారు అయినట్టు). చో రచించిన నాటకాలలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత జయప్రదమైనది. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తుగ్లక్ గోరీ నుంచి లేచి వచ్చి దేశానికి ప్రధాని కావడం నాటక ఇతివృత్తం. ఫిరాయింపు రాజకీయాలపైన కొరడా. ఈ నాటకంలో వ్యంగ్యం అద్భుతంగా పండింది. దీన్ని సినిమా తీయడానికి ప్రయత్నించినప్పుడు డిఎంకె ప్రభుత్వం గట్టిగా అడ్డుకున్నది. కానీ చో వెనకడుగు వేయలేదు. ఆ తుగ్లక్ పేరుతోనే పత్రిక వచ్చింది. ఇప్పుడు ఆ పత్రిక సుమారు 60 వేల కాపీలు అమ్ముతోంది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చోని రాజ్య సభకు నామినేట్ చేసింది. జర్నలిజంలో శిఖర స్థాయికి ఎదిగి నందుకు భగవాన్‌దాస్ గోయెంకా అవార్డు ప్రదానం చేశారు. ‘శంకర్స్ వీక్లీ’లో వ్యంగ్య చిత్రాలూ, శీర్షికలూ ఉండేవి. అవి చురకలు అంటించేవి. జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్, ఆడ్వాణీ, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులతో సాన్నిహిత్యం ఉండేది. దేశవ్యాప్తంగా వెతికినా అటు వంటి మేధావి మరొకరు కనిపించరు. సాటిలేని వ్యక్తిత్వం ఆయ నది. ఆయనకిదే అక్షరాంజలి. - కె. రామచంద్రమూర్తి -
మార్కెట్ మెచ్చిన సంపాదకుడు
పరుష పదజాలం ప్రయోగించకపోయినా, మెత్తగా మాట్లాడినా, రాసినా తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయనీ, వాటి విషయంలో రాజీపడ కూడదనీ విశ్వసించిన నిజాయితీపరుడైన సంపాదకుడు దిలీప్. జర్నలిజంలో కొత్త పోకడలను ఆకళింపు చేసు కొని పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూనే తనవైన విశ్వాసాలను నిలబెట్టుకోవడానికి ప్రయ త్నించిన పాతతరం సంపాదకులలో శుక్రవారం (నవంబర్ 25) పునెలో తుది శ్వాస విడిచిన దిలీప్ పాడ్గాంవ్కర్ ఒకరు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతా లలో పండితుడూ, హిందుస్థాన్ సాంప్రదాయ సంగీతంలో మేటి, సమాజ హితం కోసం కృషి చేసిన మేధావి... ఇట్లా చాలా విశేషణాలు చెప్పు కోవచ్చు ఆయన గురించి. టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంపాదకుడుగా ఉన్నప్పుడు తాను దేశంలోనే రెండవ అతిముఖ్యమైన హోదాలో ఉన్నానంటూ (మొదటి హోదా ప్రధానిది) సగర్వంగా ప్రకటించు కున్న ఆత్మవిశ్వాసం ఆయనది. ఆయనకంటే ముందు సంపాదక సారథ్యం వహించిన గిరిలాల్ జైన్, అంతకంటే ముందు సారథి శ్యామ్‌లాల్ సంగతి సరేసరి. దేశ రాజకీయాలపైనా, వ్యాపార వాణిజ్యాలపైనా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభావం గణనీయం. అశోక్‌జైన్ చేతి నుంచి పగ్గాలు సమీర్ జైన్ చేతిలోకి మారిన తర్వాత ఆ పత్రిక శరవేగంతో విస్తరించింది. సమీర్‌జైన్ ఆలోచనావిధానం విపణి ప్రధానం. తన సంపాదకుడికి బాగా రాయడం కంటే కంపెనీ విధానాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో సామర్థ్యం ఎక్కువ ఉండాలని కోరుకునే యజమాని సమీర్‌జైన్. ఒకానొక సందర్భంలో ముగ్గురు హేమాహేమీలు సంపాదకవర్గంలో ఉండేవారు– గౌతమ్అధికారి, దిలీప్‌పాడ్గాంవ్కర్, అరుణ్‌శౌరీ. ఎగ్జిక్యుటివ్ ఎడి టర్గా అరుణ్‌శౌరీని జైన్ కుటుంబం తట్టుకోలేక పోయింది. గిరిలాల్జైన్ స్థానంలో కొత్త సంపాదకు డిని నిర్ణయించే అవకాశం సమీర్జైన్కు వచ్చిన ప్పుడు తన అభిప్రాయాలతో ఏకీభవించే జర్న లిస్టు దిలీప్‌పాడ్గాంవ్కర్ అని భావించి ఆ పదవి అప్పగించారు. యజమాని మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా పత్రికను తీర్చిదిద్దడమే కర్త వ్యంగా భావించినవాడు దిలీప్. అందుకే పూర్తి స్వేచ్ఛను కోరుకునే వినోద్ మెహతా వంటి సంపా దకులకు దిలీప్‌పైన చిన చూపు. దిలీప్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడుగా ఉండగా ముంబయ్‌లో ఇండిపెండెంట్ పత్రికను నెలకొల్పి నడిపించిన వినోద్మెహతాతో సంఘర్షణ తప్పలేదు. ఆత్య యిక పరిస్థితిలో జర్నలిస్టులు వ్యవహరించిన తీరు పైన భారతీయ జనతా పార్టీ నేత లాల్‌కృష్ణ అద్వానీ వ్యాఖ్యానించిన రీతిలోనే దిలీప్‌పైన వినోద్ చురక వేశాడు. యజమాని వొంగమంటే దిలీప్ నేలపైన పాకాడంటూ ఎద్దేవా చేశాడు. దేశ ద్రోహులకు కొమ్ముకాస్తాడనీ, జిహాదీల తరఫున వాదిస్తాడనీ, నక్సలైట్లను సమర్థిస్తాడనీ, క్రైస్తవ మిషనరీలను వెనకేసుకొని వస్తాడనీ వామపక్ష భావాలున్న దిలీప్ అంటే గిట్టనివారు విమర్శిం చేవారు. వామపక్ష విరోధులు విమర్శించే వ్యక్తిని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే సమీర్‌జైన్ గౌరవించాడంటే దిలీప్లో ఎటూమొగ్గని స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నదని అర్థం చేసుకోవాలి. పరుష పద జాలం ప్రయోగించకపోయినా, మెత్తగా మాట్లా డినా, రాసినా తనకంటూ కొన్ని విలువలు ఉన్నా యనీ, వాటి విషయంలో రాజీపడకూడదనీ విశ్వ సించిన నిజాయితీపరుడైన సంపాదకుడు దిలీప్. దిలీప్పాడ్గాంవక్కర్ను నేను రెండుసార్లు మాత్రమే కలుసుకున్నాను. మొదటిసారి శ్రీనగర్‌లో. రెండోసారి హైదరాబాద్‌లో. మన్మోహన్ సింగ్ నియమించిన మధ్యవర్తుల సంఘం కశ్మీర్ లోయలో పర్యటించిన సమయంలో నేను కూడా ఆ ప్రాంతం లోనే ఉన్నా. నేనూ, మా సహచరుడు జమీల్ వీధు లలో తిరిగి ప్రజలతో కలిసి నిరాటంకంగా మాట్లా డుతుంటే దిలీప్‌పాడ్గాంవ్కర్, మరో ఇద్దరు డాక్ బంగ్లాలో కూర్చొని ప్రజా ప్రతినిధుల కోసం, సగటు పౌరులకోసం ఎదురు చూసేవారు. సర్కార్ పంపిన మేధావులు కనుక వారి ఎదుట మనసువిప్పి మాట్లా డటానికి కశ్మీరీలు సంకోచించేవారు. శ్రీనగర్ గెస్ట్ హౌస్‌లో కలిసినప్పుడు ‘మీరు నిజాయితీగా ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని సమస్య పరిష్కా రానికి తీసుకోవలసిన చర్యలు సూచించినప్పటికీ వాటిని ప్రభుత్వం అమలు చేస్తుందని నేను అను కోవడం లేదు’ అని అన్నప్పుడు ఆయన చిరునవ్వుతో ‘నాకూ పెద్దగా భ్రమలు లేవు’ అన్నారు. ఆయన భయపడినట్టే జరిగింది. ఆయన నాయకత్వంలోని త్రిసభ్య సంఘం చేసిన సిఫార్సులను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ, నరేంద్రమోదీ ప్రభుత్వం కానీ అమలు చేయడానికి ప్రయత్నించలేదు. అందుకే కశ్మీర్ రావణకాష్టంలాగా రగులుతూనే ఉంది. 2010లో కశ్మీర్‌లోయలో అల్లర్లు జరిగి వందమందికి పైగా యువకులు సాయుధ పోలీసుల కాల్పులలో మరణించిన సందర్భంలో ప్రజాగ్రహాన్ని చల్లార్చేం దుకు ఒక కమిటీని పంపించారు. అంతేకానీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్న సంకల్పం లేదు. ఈ విషయంలో దిలీప్ పాడ్గాంవ్కర్ కలత చెందారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దృఢమైన విశ్వాసం ఉంచి మెరుగైన సమాజం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన అగ్రశ్రేణి సంపాదకులలో దిలీప్‌పాడ్గాంవ్కర్ ఒకరు. -కె. రామచంద్రమూర్తి -
చంపుడు పందెం!
త్రికాలమ్ నోట్ల గందరగోళంలో దేశం యావత్తూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతోంది. ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ చెప్పిందే చట్టం. బస్తర్ రేంజి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి చేసిందే న్యాయం. రాజ్యాంగాన్ని కానీ, న్యాయవ్యవస్థను కానీ, మానవ హక్కులను కానీ అక్కడి ప్రభువులు గుర్తించరు. తమకు రాజ్యాంగంపైన నమ్మకం లేదంటూ మావోయిస్టులు ముందే ప్రకటించారు. జనతన సర్కార్ నడుస్తోంది ఆ సిద్ధాంతం ప్రాతిపదికపైనే. ఆ సర్కార్‌ను నడవనివ్వడం రాజ్యానికి అవమానకరమంటూ పాలకులు భావిస్తున్నారు. రాజ్యాంగంపైన విశ్వాస రాహిత్యాన్ని బాహాటంగా ప్రకటించిన మావోయిస్టులు ఒకవైపు. రాజ్యాంగం ధర్మమా అని అందలాలు ఎక్కి ఆ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కి తమ వ్యక్తిగత రాగద్వేషాలనే చట్టాలుగా చెలామణి చేయిస్తున్న రాజకీయ నాయకులూ, అధికారగణం మరోవైపు. రెండు పక్షాల మధ్యా నలిగిపోతున్న అమాయక ఆదివాసీ ప్రజలది దయనీయ స్థితి. ఈ రక్తచరిత్రకు శాంతియుతంగా స్వస్తి చెప్పడానికి ప్రయత్నించినవారిని శత్రువులుగా పాలకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సైతం మానవహక్కులకు రక్షణ ఉండాలని వాదిస్తున్నవారిని మావోయిస్టుల మద్దతుదారులుగా ముద్రవేసి రాజద్రోహులుగా చిత్రిస్తున్నారు. ఈ నీతిలో భాగమే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన ప్రొఫెసర్ నందినీ సుందర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, వినీత్ తివారీ, సంజయ్ పరాటే, తదితరులపైన ఐజీ కల్లూరి వ్యూహం ప్రకారం పెట్టిన కేసు. నందిని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి నాలుగువారాల వ్యవధి తర్వాతనే వారిపైన చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్హెచ్ఆర్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ధండ్నీ, ఐజీ కల్లూరినీ ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశించింది. మానవ హక్కుల కోసం వీరోచితంగా పోరాడుతున్న అధ్యాపకులపైన పోలీసులు పెట్టిన అన్యాయపు కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది జరుగుతుండగానే గత మూడు రోజులలో 11 మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌లోని భద్రతాదళాలు హతమార్చాయి. మన మేధావులకు పట్టని హక్కులు ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేసి ‘ఎన్కౌంటర్’ చేసినా, శేషాచలం అడవులలో తమిళనాడు కూలీలను దారుణంగా కాల్చి కాల్చివేసినా ఆంధ్రప్రదేశ్‌లోని పౌరసమాజం తగినంతగా స్పందించలేదు. పౌరహక్కుల సంఘాల బాధ్యతగానే పరిగణించారు కానీ పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అతిపోకడలు పోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తించి ప్రతిఘటించలేదు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకులుగా పని చేస్తున్న మేధావులు ఎవ్వరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కొన్ని దశాబ్దాల కిందట వియత్నాంపైన అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు హైదరాబాద్‌లోనూ, విజయవాడలోనూ, విశాఖపట్టణంలోనూ, ఇతర పట్టణాలలోనూ జరిగాయి. ఇప్పుడు పక్కవాడి మీద పిడుగుపడినా చలించని జడత్వం పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ వారిని అభినందించాలి. సల్వాజుడుం అరాచకాలను అరికట్టాలనీ, ఆ సంస్థను రద్దు చేయాలనీ సుప్రీంకోర్టు 2011లో ఆదేశించడానికి కారణం నందినీ సుందర్ చేపట్టిన ప్రజాప్రయోజన వ్యాజ్యమే (పిల్). బస్తర్‌లో కోయ కమాండోలు సృష్టిస్తున్న మారణహోమాన్ని సాక్ష్యాధారాలతో సహా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట నిరూపించిన కారణంగా సల్వాజుడుంకు స్వస్తి చెప్పాలన్న ఆదేశం వెలువడింది. అరుంధతీరాయ్ వంటి అగ్రశ్రేణి రచయిత నక్సలైట్ల వెంట కీకారణ్యంలో నడిచినా, నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, తదితరులు నిజనిర్ధారణ బృందం సభ్యులుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పర్యటించినా చట్టపాలన సవ్యంగా జరగాలనీ, రాజ్యాంగం ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చినవారు అదే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటించాలనీ, మానవ హక్కులను పరిరక్షించాలనీ ఉద్ఘోషించడానికే. ఈ మేధావులు మావోయిస్టులు ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా అత్యంత బలమైన రాజ్యాన్ని ఓడించి అధికారం హస్తగతం చేసుకుంటారనే విశ్వాసం ఉన్నవారు కాదు. ఆ మార్గంలో అధికారం హస్తగతం చేసుకోవాలని అభిలషిస్తున్నవారు సైతం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందరూ ఆదరించాలని తపిస్తున్నవారు. సంవిధానానికి లోబడి పనిచేయవలసిన రాజకీయ నాయకులూ, ప్రభుత్వాధికారులూ, పోలీసు అధికారులూ చట్టపాలనను గౌరవించాలని కోరుతున్నవారు. అంతులేని రక్తచరిత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి 1980లలో నక్సలైట్లు bè త్తీస్‌గఢ్ ప్రాంతానికి వలస వెళ్ళారు. 2000 నవంబర్ ఒకటిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలలో ఏడు జిల్లాలు ఐదవ షెడ్యూల్ కిందికి వచ్చే ఆదివాసీ జిల్లాలు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం 1996లోనే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియా (పెసా) చట్టాన్ని తీసుకువచ్చారు. స్వయంపాలన హక్కులను ఆదివాసీలకు ఇవ్వాలన్నది ఈ చట్టం లక్ష్యం. భారత భూభాగంలో నాలుగు శాతం విస్తీర్ణం ఛత్తీస్గఢ్ది. ఈ రాష్ట్రంలో 44 శాతం విస్తీర్ణంలో అడవులు. దేశంలోని ఖనిజ ఉత్పత్తులలో 13 శాతం ఈ రాష్ట్రం నుంచే. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ వంటి ఖనిజాలు అపారం. వజ్రాలు, బంగారు, రాగి, సీసం, జింక్, తదితర నిక్షేపాలు దండిగా ఉన్నాయి. దేశంలో ఉన్న బొగ్గులో 16 శాతం ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంది. ఇంత ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పెత్తనం కాంట్రాక్టర్లదీ, వ్యాపారులదీ, అధికారులదీ, ఆదివాసీలు కానివారందరిదీ. రమణ్‌సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మ నాయకత్వంలో నక్సలైట్లపైన పోరాటం చేయడానికి కోయతెగకు చెందిన యువకులకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ప్రైవేటు సైన్యం తయారుచేశారు. దానికి వికాస్ సంఘర్ష్ సమితి అని పేరు పెట్టారు. అదే సల్వాజుడుం. అదే సంవత్సరం ఖనిజ సంపద వినియోగానికి టాటాలతో, ఎస్సార్ కంపెనీతో రమణసింగ్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకోవడం కాకతాళీయం కాదు. దశాబ్దాలుగా ఆదివాసీలను దోచుకోవడం నిరాఘాటంగా సాగిపోతోంది. వారు న్యాయవ్యవస్థను ఆశ్రయించి హక్కులను సాధించే అవకాశం లేదు. చట్టాలున్నవి వారికి న్యాయం చేయడానికి కాదు. శాంతిసుస్థిరతలు నెలకొల్పేందుకు అసలే కాదు. హింసించే సాధనాలుగానే ఉపయోగపడుతున్నాయి. వాటివల్ల జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భద్రతాదళాల విడిది ఉంది. కొన్ని గ్రామాలలో అయితే రెండు కిలోమీటర్లకు ఒక మిలటరీ క్యాంపు ఉంటుంది. ప్రతి 45 మంది ప్రజలకు ఒక సాయుధ జవాను ఉంటాడు. మొత్తం 58,772 పారామిలటరీ జవాన్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంటి ఆదాయం నెలకు వేయి నుంచి రెండున్నర వేల వరకూ ఉంటుంది. నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకం) ఇప్పుడు అమలు జరగడం లేదు. ఏడు సంవత్సరాల కిందట ఈ పథకం కింద చేసిన పనికి ఇంతవరకూ ప్రతిఫలం ముట్టలేదు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి రోడ్లు వేయడానికి సిద్ధం. నక్సలైట్లు రోడ్లు వేయడానికి వ్యతిరేకం. అభివృద్ధి శూన్యం. సల్వాజుడుం కార్యకలాపాలకు తోడు 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలయింది. నక్సలైట్లను ఏరివేయాలని సంకల్పం. అది నెరవేరలేదు కానీ సాయుధ దళాలకూ, నక్సలైట్లకూ మధ్య జరుగుతున్న పోరాటంలో నక్సలైట్లూ, భద్రతాదళ సిబ్బందీ, అమాయక గిరిజనులూ చనిపోతున్నారు. 2013లో నక్సలైట్లు సృష్టించిన హింసాకాండలో మహేంద్రకర్మ, వీసీ శుక్లా సహా అనేకమంది కాంగ్రెస్ నాయకులు మరణించారు. మహేంద్రకర్మ కుమారుడు ఇటీవల సల్వాజుడుం–2ను ప్రారంభించాడు. వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు దిక్కుతోచని పక్షులైనారు. ఇద్దరు గ్రామీణ జర్నలిస్టులు సాయిరెడ్డి, నెమీచంద్ జైన్‌ను నక్సలైట్లు చంపివేశారు. ఇటీవల 2016 ఫిబ్రవరి 8న స్క్రోల్ డాన్ ఇన్‌కు పనిచేస్తున్న జర్నలిస్టు మాలినీ సుబ్రమణియన్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. నక్సలైట్లను సమర్థిస్తున్న కారణంగా జగదల్పూర్ వదిలి వెళ్ళాలంటూ ఆదేశించారు. బీబీసీ హిందీ విభాగంలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అశోక్ పుతుల్‌ను ‘సామాజిక్ ఏక్తా మంచ్’ సభ్యులు బస్తర్ వీడి వెళ్ళిపోవాలంటూ ఆజ్ఞాపించారు. ఐజీ, ఎస్పీలను కలుసుకునేందుకు అశోక్ ప్రయత్నిస్తే, ‘మేము జాతీయవాదులతోనూ, దేశభక్తులతోనూ మాత్రమే మాట్లాడతాం’ అంటూ అవమానించారు. ఇది కాదు పరిష్కారం సాయుధ పోరాటం పరిష్కారం కాదని రెండు పక్షాలూ గ్రహించినప్పుడే శాంతి నెలకొంటుంది. అంతవరకూ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధంలో ధర్మాధర్మ విచక్షణ ఉండదనీ, అన్నీ ఆమోదయోగ్యమే కావాలనీ పోలీసు యంత్రాంగం వాదన. పోలీసు అధికారగణం మాట కాదనే సాహసం రాజకీయ నాయకత్వానికి లేదు. అందుకే చంపుడు పందెం ఆగడం లేదు. సల్వాజుడుం అత్యాచారాలకు ప్రతిగా నక్సలైట్ల హింసాకాండ కొనసాగింది. మాజీ నక్సలైట్లకూ, లొంగిపోయిన సంఘసభ్యులకూ, నిరుద్యోగ ఆదివాసీ యువకులకూ ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు (ఎస్పీఓలు)గా పిలిచి నక్సలైట్లమీదికి పురిగొలిపే పేరుతో గ్రామాలపైకి పంపించారు. నక్సలైట్ల దళాలలోని సాయుధులలోనూ ఆదివాసీ యువతీయువకులే అధికం. ఆదివాసీలపైన ఆదివాసీలతోనే యుద్ధం చేయించడం తెలుగు పోలీసులు పాటించిన యుద్ధనీతి. నయీం వంటి నరహంతకుడు రెండు దశాబ్దాలపాటు పోలీసుల మద్దతుతో నేరసామ్రాజ్యాన్ని ఏలడానికి ఇదే నీతి కారణం. అటువంటి నీతి పాటించినందుకు రాజకీయ నాయకులు కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ పశ్చాత్తాపం చెందిన దాఖలా లేదు. ఛత్తీస్‌గఢ్‌లో అంతులేని హింసాకాండతో విసిగిపోయి సుమారు లక్షమంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నారు. ఆదివాసీ మహిళలపైన భద్రతాదళాలు చేసిన అత్యాచారాలనూ, ఇన్ఫార్మర్లంటూ ఆదివాసీలను నక్సలైట్లు హత్య చేసిన ఉదంతాలనూ నమోదు చేసి మానవాధికారాలు ఛత్తీస్‌గఢ్‌లో అడుగంటాయంటూ నందినీ సుందర్ 2007లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పనిచేస్తున్న నందిని ‘సబాల్టర్న్ అండ్ సావరీన్స్ :ఆంత్రొపొలాజికల్ హిస్టరీ ఆఫ్ బస్తర్ (1856–1996)’ పేరుతో ప్రామాణికమైన గ్రంథం రచించారు. ‘ది బర్నింగ్ ఫారెస్ట్: ఇండియాస్ వార్ ఇన్ బస్తర్’ పేరుతో తాజా పుస్తకం వెలువరించారు. ఛత్తీస్గఢ్పైన ఆమెకు పూర్తి అవగాహన ఉంది. తోటి ప్రొఫెసర్లూ, హక్కుల నాయకులూ, న్యాయవాదులతో కలిసి ఆమె మే 12 నుంచి 16 వరకూ బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మ, బస్తర్, కంకెర్ జిల్లాలలో పర్యటించారు. సామ్నాథ్ బఘెల్ అనే ఆదివాసీ యువకుడిని నక్సలైట్లు నవంబర్ నాలుగో తేదీన హత్య చేశారు. హతుడి భార్య విమల పేరు మీద ఐజీ కల్లూరి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు. నందినీ, తదితర హక్కుల కార్యకర్తలు సామ్నాథ్ను ఫోన్లో బెదిరిస్తూ ఉండేవారనీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమానికి స్వస్తి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చేవారనీ ఫిర్యాదు చేసినట్లు కల్లూరి అంటున్నారు. నందినిపైన కానీ, మరొకరిపైన కానీ తాను ఎటువంటి ఆరోపణా చేయలేదంటూ విమల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుడు జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఛత్తీస్‌గఢ్ పోలీసులనూ, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నందిని, తదితరులపైన చేసిన ఆరోపణలను నిరూపించడం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వల్ల కాని పని. కానీ హక్కుల కార్యకర్తలను కోర్టుల చుట్టూ తిప్పడం, వారికి విసుగు కలిగి పోరాటం విరమించుకునే విధంగా వ్యవహరించడం పోలీసు వ్యూహంలో భాగం. మానవ హక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్నవారిని నైతికంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించకపోతే సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించి నియంతృత్వం వైపూ, అమానవీయమైన అరాచక వ్యవస్థవైపూ ప్రయాణం అనివార్యం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
యూపీలో బాహాబాహీ
త్రికాలమ్ ఉత్తరప్రదేశ్(యూపీ)లో చారిత్రక పోరాటానికి తెరలేచింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఏడు విడతలుగా జరిగే పోలింగ్ తర్వాత వెలువడే ఫలితం 2019 ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత రెండున్నర సంవత్సరాలలో చెప్పుకోదగిన ఎన్నికల విజయం ఏదీ నమోదు చేయలేకపోయింది. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవం పూర్వ పక్షం కావాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో అసాధారణ స్థాయిలో సీట్లు గెలుచు కోవాలి. కాంగ్రెస్ అథమస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నంలో రాహుల్‌గాంధీ నెలరోజుల పాటు కిసాన్ యాత్ర సాగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమరం. ఈ ఎన్నికలలో రెండంకెల స్థానాలు సాధించకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని అధిష్ఠానవర్గానికి తెలుసు. అందుకే విశ్వ ప్రయత్నం. ప్రతిపక్ష నాయకురాలు మాయావతి అయిదేళ్ళుగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తం 403 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసు కొని అన్ని పార్టీల కంటే ముందుగానే పోరాటానికి సిద్ధమైపోయారు. అధికా రంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో అబ్బాయ్–బాబాయ్ పోరు సాగుతున్నప్పటికీ ఈ వెర్రిలో ఏదో మతలబు ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎస్పీకి సైతం ఇది ప్రతిష్ఠాత్మకమైన పోరాటం. ఈ ఎన్నికలలో నాలుగు పక్షాలూ చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. పోటాపోటీగా యాత్రలు శనివారంనాడు రెండు ప్రధాన పార్టీలూ సమరశంఖం పూరించాయి. లక్నోలో ఎస్పీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత ములాయంసింగ్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)అధినేత లాలూప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. వేదికపైన ఉన్న నాయ కులంతా కత్తులు దూశారు. ఈ సభను ఐకమత్యసాధన సభగా అభివర్ణించి నప్పటికీ అఖిలేశ్, బాబాయి శివపాల్యాదవ్ల మధ్య మాటల తూటాలు నడిచాయి. బిహార్ మాదిరిగా యూపీలో సైతం మహాకూటమిని ఏర్పాటు చేయాలన్నది ములాయం సంకల్పం. అందుకు బిహార్ ముఖ్యమంత్రి, జనతా దళ్ (యూ) నాయకుడు నితీశ్ కుమార్ అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి. నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించారంటూ అలిగి బిహార్ మహా కూటమి నుంచి ఎస్పీ వైదొలిగిన విషయం నితీశ్ విస్మరించలేదు. జనతా పరివారం అంతా ఒక్కతాటిపై నిలిచి బీజేపీని మట్టి కరిపించాలంటూ దేవెగౌడ ఆకాం క్షించారు. లక్నోలో ఎస్పీ రజతోత్సవ సంబరాలు జరిగిన రోజే సహారన్‌పుర్‌లో పరివర్తన్యాత్రను బీజేపీ అధినేత అమిత్‌షా ప్రారంభించారు. 15,000 మంది పరివర్తన సారథులను తయారు చేశారు. వీరు 50,000 గ్రామాలను సంద ర్శిస్తారు. పరివర్తన యాత్ర 1,700 కిలోమీటర్లు సాగుతుంది. ఇది గురువారం మొదలైన అఖిలేశ్ రథయాత్రకు పోటీ. పాతికేళ్ళ కిందట నాటి బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు. సంఘ్ పరివారాన్ని అధికారపీఠం వైపు నడిపించారు. ఇప్పుడు అఖిలేశ్ రథయాత్ర జనతాపరివారాన్ని సమైక్యబాటలో నడిపించి అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో సాగుతోంది. బీజేపీ పరివర్తన యాత్రకు పశ్చిమ యూపీలోని సహారన్పుర్ని ఎన్నుకోవడం వెనుక చరిత్ర ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సహారన్‌పుర్ జిల్లా జనాభాలో 51శాతం మంది హిందువులైతే 46 శాతం మంది ముస్లింలు. ఇక్కడ హిందూ ఓట్లను సంఘటితపరచుకోవడం బీజేపీకి చాలా అవసరం. అందుకే మొన్న మేలో సైతం ప్రధాని మోదీ సహారన్‌పుర్ బహిరంగసభలో ప్రసంగించారు. తాను యూపీ వాడినేననీ, యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనవాడిననీ గుర్తు చేశారు. సహారన్ పుర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. యూపీ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు ఇమ్రాన్ మసూద్ సొంత జిల్లా ఇది. 2014 నాటి ఎన్నికల ప్రచారంలో మసూద్ వీడియో క్లిప్ ఒకటి హల్చల్ చేసింది. నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికే స్తానని మసూద్ అన్నట్టు ఈ వీడియోలో ఉంది. దానివల్ల బీజేపీ ప్రాబల్యం విశేషంగా పెరిగింది. మసూద్ పోస్టర్లు విరివిగా అతికించి బీజేపీ ప్రచారం పతాక స్థాయిలో చేసింది. ఇప్పుడు రాహుల్ వ్యూహంలో మసూద్ ముఖ్యుడు. ఇక్కడ బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకొని కాంగ్రెస్‌ను తుంచవలసిన అవసరం ఉంది. పరివర్తన యాత్రలో భాగంగా ప్రధాని మోదీ ఆరు సభలలో పాల్గొంటారు. లక్నోలో ఈ యేడాది ఇప్పటికే రెండు సభలలో మాట్లాడారు. డిసెంబర్లో మూడోసారి అక్కడ ప్రసంగించబోతున్నారు. బీజేపీ ఏ అవకాశాన్నీ విడిచి పెట్టకుండా సర్వశక్తులూ వినియోగించి పోరాటం చేస్తున్నది. ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిని ముందు పెట్టుకోకపోవడం ఒక్కటే లోపం. మెజారిటీ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సైతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల అభ్యంతరంతోనే రీటా బహుగుణ బీజేపీలో చేరిపోయారు. ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేశ్ అని ములాయం స్పష్టం చేశారు. బిఎస్పీ గెలిస్తే మాయావతే ముఖ్యమంత్రి. ఇటువంటి స్పష్టత బీజేపీకి లేదు. మాయావతి ముందంజ మాయావతి ఈసారి బాగా ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ముస్లింలకూ, అగ్రవర్ణ హిందువులకూ ప్రాధాన్యం ఇవ్వడంతో కినిసి పార్టీ నుంచి కొందరు దళిత ప్రముఖులు వైదొలిగి బీజేపీ పంచన చేరారు. దళితుల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ స్థాపించిన పార్టీలో దళితులను పక్కన పెట్టి ఇతర వర్గాలకు ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటన్నది వారి ప్రశ్న. ఎస్పీలో లుకలుకలు కారణంగా, అధికారంలో ఉన్న అయిదు సంవత్సరాలూ ఆ పార్టీ ముస్లింలకు రక్షణ కల్పించడంలో విఫలమైనదనే విమర్శ సర్వత్రా వినిపిస్తున్న కారణంగా ఈసారి ముస్లింలు బీఎస్పీవైపు మొగ్గుతారని మాయావతి ఆశ. అందుకే అభ్య ర్థులను ఖరారు చేసే క్రమంలో ముస్లింలకు పెద్దపీట వేయడం. యూపీలో ఉన్న చిన్నాచితకా ముస్లిం పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ‘ఇత్తె హాద్ ఫ్రంట్’ను నెలకొల్పడం భారత రాజకీయాలలో ఒక చారిత్రక పరిణామం. మతం ఆధారంగా ఓట్లు అడగడం అవినీతి కిందికే వస్తుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫ్రంట్ ఏర్పడటం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మరి. ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పీస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్. వైద్య వృత్తి నుంచి రాజకీయాలలో ప్రవేశించి 2008లో పీస్ పార్టీని నెలకొల్పిన అయూబ్ ఖాన్ మతవాది. ముస్లిమేతరుల నాయకత్వంలో ఉన్న పార్టీలను బలపరచడం కంటే ముస్లింల నాయకత్వంలోనే కూటమి ఏర్పడి నట్లయితే ముస్లింలలో ఐకమత్యం సాధించవచ్చుననీ, ముస్లిం నేతలంతా కలసి సమష్టిగా ప్రచారం చేస్తే ముస్లిం ఓటర్లలో మనస్థయిర్యం పెరుగుతుందనీ ఇండి యన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు మతీన్ విశ్లేషణ. ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగినప్పటి నుంచి గత రెండేళ్ళలో ముస్లింలపైన దాడులు వరుసగా జరుగుతు న్నాయనీ, హింసాకాండలో ముస్లింలే అధికంగా బలి అవుతున్నారనీ మతీన్ వాదన. ‘ఇత్తెహాద్ ఫ్రంట్’ యూపీలోని ముస్లిం ఓటర్లందరికీ ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ ఫ్రంట్ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ఇది జాతీయ సమైక్యతకు ముప్పుగా పరి ణమించే అవకాశమూ లేక పోలేదు. యూపీ ఎన్నికలలో ఈ ఫ్రంట్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అఖిలేశ్ హయాంలో తమకు రక్షణ లభించలేదనే భావన ముస్లిం జనాభాలో బలంగా ఉన్నది కనుక వారు బీఎస్పీ వైపు చూసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అయినప్పుడు సీట్లు తగ్గాయని దళిత నాయకులు అలగడంలో అర్థం లేదన్నది మాయావతి వాదన. దళిత ఓట్లు సరిపోవు కనుక ఇతర వర్గాల నుంచి మద్దతు కూడకట్టుకోవలసిన అవసరాన్ని మాయావతి చాలాకాలం కిందటే గ్రహించారు. అందుకే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటి నుంచి బ్రాహ్మణ నాయ కులలో ఎక్కువమంది తిరిగి బీజేపీ శిబిరంలోకి వెళ్ళారనే అభిప్రాయం ఉంది. ఇండియా టుడే–యాక్సిస్ అభిప్రాయ సేకరణ ఫలితాల ప్రకారం ఏ ఒక్క పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ (403 స్థానా లున్న అసెంబ్లీలో 202 స్థానాలు) రాకపోవచ్చుననీ, అతి పెద్ద పార్టీగా 170 నుంచి 183 స్థానాలతో బీజేపీ (2012 ఎన్నికలలో 47స్థానాలు), రెండో స్థానంలో 115 నుంచి 124 స్థానాలతో బీఎస్పీ (2012లో 80 స్థానాలు), మూడో స్థానంలో 94 నుంచి 103 స్థానాలతో ఎస్పీ (2012లో 224 స్థానాలు) నిలుస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో 28 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి 8 నుంచి 12 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఇండియా టుడే–యాక్సిస్ సర్వే లెక్కకట్టింది. అఖిలేశ్ తిరుగుబాటు చేస్తాడా? పాతతరం నాయకులను పూర్వపక్షం చే సి యువజన మనోరథుడుగా అఖిలేశ్ బలమైన ముద్ర వేయగలిగితే, మహాకూటమి స్వప్నం సాకారమైతే ఎస్పీకి విజయావకాశాలు మెరుగు కావచ్చు. నిజలింగప్ప, ఎస్కె పాటిల్, అతుల్యఘోష్ వంటి సిండికేట్ నాయకులను తోసిరాజని 1969లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చినట్టు ఇప్పుడు అఖిలేశ్ తనదంటూ ప్రత్యేక పంథాను నిర్ణయించు కోగలిగితే యువ ముఖ్యమంత్రిగా మరో అవకాశం అతనికి లభించవచ్చు. అఖి లేశ్పైన అవినీతి ఆరోపణలు లేవు. ఆధునిక భావాలు కలిగిన యువ నాయ కుడిగా పేరున్నది. నేర చరిత్ర ఉన్నవారు పార్టీలో చేరకుండా అడ్డుతగిలిన నాయ కుడిగా పేరు తెచ్చుకున్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించే క్రమంలో మంచి రోడ్లు వేయించాలనీ, విమానాశ్రయాలు కట్టించాలనీ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెంచాలనీ తాపత్రయ పడుతున్న ముఖ్యమంత్రిగా ప్రజలలో ఒక అవగాహన ఉంది. అయితే, చిన్నాన్నలూ, మామలూ, ఇతర బంధువులూ, ములాయంసింగ్ సహచరులూ పెత్తనం చేస్తున్నారనీ, అఖిలేశ్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదనీ ప్రచారం బాగా జరిగింది. తిరుగుబాటు బావుటా ఎగర వేసిన నాయ కుడుగా పేరు తెచ్చుకుంటే అఖిలేశ్‌కి అవకాశం ఉంటుంది. అఖిలేశ్ నాయకత్వం కొనసాగించి స్వేచ్ఛ ఇస్తేనే తాము మహాకూటమిలో చేరే విషయం ఆలోచి స్తామని అజిత్‌సింగ్ (ఆర్ఎల్డి నాయకుడు), శరద్‌యాదవ్ సూచించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ఢిల్లీలో ములాయంసింగ్తోనూ, అమర్సింగ్తోనూ రెండుగంటల పాటు సమా లోచనలు జరిపినట్టు భోగట్టా. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అభి లాషను మాయావతి ఇంతవరకూ వెలిబుచ్చలేదు. కాంగ్రెస్‌తో పొత్తు కార ణంగా ఎస్పీకి కానీ బీఎస్పీకి కానీ ముస్లిం ఓట్లలో అధిక భాగం వచ్చే అవకా శాలున్నాయి. ఎస్పీ నాయకత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్ చేరితే ఆ మేరకు బీఎస్పీకి నష్టం. అదేవిధంగా బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఎస్పీకి నష్టం. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా పెద్ద ఓటు బ్యాంక్ లేకపోయినప్పటికీ ముస్లిం ఓటును ప్రభావితం చేసే శక్తి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం ఇటీవల జరిపిన మెరుపు దాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) గురించి బీజేపీ విధిగా ప్రచారం చేస్తుంది. మోదీ, షా, రాజ్‌నాథ్‌సింగ్ ఈ దాడులను ఎన్నికల ప్రచారంలో నిస్సందేహంగా వినియోగించుకుంటారు. హిందూ ఓట్లను కూడగట్టడానికి అవసరమైన అన్ని విద్యలనూ బీజేపీ ప్రదర్శిస్తుంది. ప్రజలు ఈ విద్యల ప్రభావానికి ఎంతవరకూ లోను అవుతారనే అంశం పైనా, కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపైనా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ సరళి ఆధారపడి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తే 2019లో ఆ పార్టీని పట్టుకోవడం కష్టం. బీజేపీకి యూపీలో బిహార్ ఎదురైతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. అందుకే యూపీ ఎన్నికలు ప్రభావ రీత్యా సార్వత్రిక ఎన్నికలతో సమానం. (వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ) -
'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'
-
'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'
హైదరాబాద్ : రైతు సమస్యలను పరిష్కరించడం సీఎం కేసీఆర్‌కు పెద్ద ఇబ్బందే కాదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. రైతు సమస్యలపై ప్రొ.కోదండరామ్ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తారనుకున్నాం...కానీ అలా జరగలేదన్నారు. గతంలో చాలా మంది రైతు నాయకులు ప్రభుత్వాలకు లొంగిపోయారన్నారు. కానీ కోదండరామ్ ఎవరికీ లొంగిపోయే వ్యక్తి కాదని రామచంద్రమూర్తి చెప్పారు. -
రగులుతున్న రైతు
త్రికాలమ్ అద్భుతమైన కట్టడాలు నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని తల పోస్తున్న కలల బేహారుల పాలనలో తెలుగు రైతు విలవిలలాడిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంవత్సరాలుగా వరుస కరువు. తెలంగాణలో ఈ యేడాది ఆగస్టులో అనావృష్టి, సెప్టెంబర్‌లో అతివృష్టి. రెండూ నష్టదాయకమే. ప్రభుత్వాల నుంచి సహకారం సకాలంలో అందడంలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంట బీమా వర్తించదు. రైతుపైన ముప్పేట దాడి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 2014 సంవత్సరం నుంచి ఇంతవరకు ఆత్మహత్యలు చేసుకున్న 48 మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వమే గుర్తించి నష్టపరిహారం ఇచ్చింది. కానీ బలవన్మరణాలకు పాల్పడిన రైతుల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువేనని వార్తాకథనాల వల్ల తెలుస్తోంది. అన్ని రంగాలలో రెండంకెల వృద్ధి రేటు చూపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసా యరంగంలో వృద్ధిరేటు మైనస్‌లో ఉండటంపైన మాట్లాడటం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. అనంతపురంలో రూ. 263 కోట్ల ఖర్చుతో ‘రెయిన్‌గన్’లు ప్రయోగించి కరువు పారదోలినట్టు సగర్వంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మొన్న అనంతపురంలోని మొత్తం 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించారు. ప్రభుత్వాల ప్రాధాన్యక్రమం వేరు వ్యవసాయరంగంలో సంక్షోభం నెలకొని చాలా సంవత్సరాలయింది. జనా భాలో సగానికి జీవనాధారమైన ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. అన్నదాతను కాపాడుకోలేని ప్రభుత్వాలకు సార్థకత ఏముంటుంది? కానీ రెండు ప్రభుత్వాల ప్రాధాన్యక్రమంలోనూ వ్యవసాయం కనిపించదు. ప్రజాధనం ఖర్చు చేస్తున్న పద్ధతిలో కానీ, ముఖ్య మంత్రులు చేస్తున్న ప్రకటనలలో కానీ రైతులోకాన్ని పట్టిపల్లార్చుతున్న సమస్యల పరిష్కారాల ప్రస్తావన ఉండదు. నిర్మాణంలో ఒకరు, పునర్ని ర్మాణంలో మరొకరు! రైతులు సంఘటితంగా లేని కారణంగా వారి ఆగ్రహం పాలకులకు వెంటనే అగుపించకపోవచ్చు. వారు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రాలేకపోవచ్చు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులకూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విత్తన సంస్థలకూ, దయలేని దళారులకూ బక్క రైతును అప్పగించి చోద్యం చూస్తున్న పాలకులను ఏమనాలి? ఇద్దరు ముఖ్యమంత్రులకూ క్షేత్ర జ్ఞానం ఉంది. అపారమైన అనుభవం ఉంది. ప్రజల సమస్యలు తెలుసు. గట్టిగా తలచుకుంటే సమస్యకు పరిష్కారం సాధించే నేర్పు ఉంది. సంకల్పమే లేదు. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్నం. సాగునీటి ప్రాజెక్టులు రైతుల కోసమే కదా! వేల ఎక రాల భూములకు నీరు అందించేందుకే పట్టిసీమ అయినా, పురుషోత్తపట్నం అయినా అంటారు చంద్రబాబునాయుడు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో ఉద్దేశం సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించడమే కదా! అంటారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్). ఎత్తిపోతల కోసం విద్యుదు త్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా రైతుకోసమే కదా! రైతు సంక్షేమా నికి శాశ్వత ప్రాతిపదికపైన బాటలు వేస్తున్నామని చెబుతారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగి, సాగునీరు పంటపొలాలలో పారడానికి ఎన్నేళ్ళు పడుతుందో వారికి తెలుసు. అంతవరకూ రైతుల ప్రాణాలు నిలబడాలంటే కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారాలు అమలు జరగాలి. 1. వ్యవసాయ విస్తరణాధికారులు తగినంత మంది లేరని కొన్ని సంవత్స రాలుగా అనుకుంటున్నదే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా విస్తరణాధికారులను సాధించలేకపోయారు రైతన్నలు. ఇప్పటికీ రైతులు మందులూ, ఎరువులూ విక్రయించే వ్యాపారుల తప్పుడు సలహాలు పాటించి ఏ పంట వేయాలో నిర్ణయించుకుంటున్నారు. ప్రతిగ్రామంలో ఒక నాలెడ్జి సెంట ర్ను నెలకొల్పి రైతులకు అవసరమైన సమాచారం అందించాలని స్వామినాథన్ కమిటీ చాలా ఏళ్ళ కిందటే సిఫార్సు చేసింది. ట్రిపుల్ ఐటీలో ఈ-సాగు ద్వారా ప్రవీణుల చేత రైతులకు సలహా చెప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రైతులకు సకాలంలో సరైన సలహా అందించగలిగితే అదే గొప్ప సాయం. పరిశోధన పూజ్యం 2. వ్యవసాయ పరిశోధన ప్రభుత్వ రంగంలో 1980కి పూర్వం జరిగేది. ఇప్పుడు పరిశోధన జరుగుతున్నా ఫలితాలు ప్రభుత్వ రంగంలో వెలుగు చూడ టంలేదు. ప్రైవేటు విత్తన సంస్థలు లబ్ధి పొందుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేటు రంగానిది తిరుగులేని ఆధిక్యం. ‘బయో’ పేరుతో హార్మోన్లు ఉపయోగించి తయారు చేసిన వంగడాలను ముందుగా పరీక్షలు లేకుండానే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ధరపైన ఎటువంటి నియంత్రణా లేదు. 3. పెద్ద కమతాలున్న ఆసాములు భూములను కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. పల్లెల్లో ఎక్కువగా వెనుకబడిన తరగతులకు చెందిన వారూ, దళితులూ చిన్న చిన్న కమతాల యజమానులుగా, కౌలుదార్లుగా ఉన్నారు. ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం గిట్టుబాటు కాదు. సహకార వ్యవసాయం ఆలోచనగానే మిగిలిపోయింది. సహకార పద్ధతి అయితే యంత్రా లను వినియోగించడంలో కానీ మార్కెటింగ్‌లో కానీ సమష్టి కార్యాచరణకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ మార్కెటింగ్ విధానంలో భాగంగా ఈ-మార్కెట్‌నూ, ఈ-టెండర్‌నూ ప్రతిపాదించింది. కానీ తెలుగు రాష్ట్రాలలో అంతగా అమలు కావడం లేదు. 4. యువతరం వ్యవసాయరంగానికి దూరం అవుతోంది. విద్యావకాశాలు పెరిగి, అందుకు తగినట్టు ఉద్యోగావకాశాలు పెరగని నేపథ్యంలో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ, పోటీ పరీక్షలకు తయారవుతూ యువకులు పట్టణాలలోనే కాలక్షేపం చేస్తున్నారు కానీ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి వ్యవసాయం చేయాలని అనుకోవడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు అయినప్పుడు యువకులు ట్రాక్టర్ల మరమ్మతు లేదా వంగడాల తయారీ వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. అందుకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయవచ్చు. 5. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్’గా అభివర్ణించారు. కానీ విత్తన తయారీ కార్యక్రమంలో రైతులకు భాగ స్వామ్యం లేదు. ప్రైవేటు కంపెనీలదే పెత్తనం. రైతుల చేత విత్తనాలు తయారు చేయించి వాటిని విక్రయించే వ్యవస్థను ప్రభుత్వం నిర్మిస్తుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. ప్రైవేటు పారవశ్యంలో మునిగితేలుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వంపైన ఇటువంటి ఆశ కూడా లేదు. సరికొత్త విత్తన చట్టాన్ని తేవాలం టున్నారు. మంచిదే. కానీ ఉన్న చట్టాన్ని సవ్యంగా అమలు జరిపినా చాలు. కొత్త వంగడాలను మార్కెట్లోకి వదిలే ముందు ఆ వంగడాలను తయారు చేసిన సంస్థ పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని పాత చట్టం స్పష్టం చేసింది. విత్తనాలను పరీక్షించి, అవి ఇక్కడి నేల స్వభావానికి తగినవేనని ధ్రువీకరించిన తర్వాతనే వాటిని మార్కెట్లోకి అనుమతించాలి. విత్తనం వ్యాపారులకూ, రాజకీయనాయకులకూ, అధికారులకూ డబ్బు చేసు కునే సాధనంగా మారింది. రైతుకు తప్ప అందరికీ అది వరమే. రైతుకు మాత్రం శాపం. నకిలీ విత్తనాల గురించి ‘సాక్షి’లో వరుస కథనాలను ప్రచురించినా ప్రభుత్వాలు అరకొర చర్యలతో సరిపుచ్చాయి. చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం. 6. రుణ సదుపాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వయంగా అంగీకరించారు. బ్యాంకులపైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కీ, రిజర్వు బ్యాంక్కీ ఫిర్యాదు చేస్తామంటూ పుల్లారావు శనివారంనాడు గుంటూరులో హెచ్చరించారు. రుణమాఫీ పథకం రెండు రాష్ట్రాలలోనూ సంపూ ర్ణంగానూ, సకాలంలోనూ అమలు జరగలేదు. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత బ్యాంకులలో రుణమాఫీ మొత్తాలను చెల్లించడం వల్ల రైతులు రుణాలు అవసరమైన దశలో బకాయిదారులుగా మిగిలిపోయి కొత్త రుణాలకు అనర్హు లుగా ఉండిపోయారు. బీమా సౌకర్యం కూడా పొందలేకపోయారు. ఖరీఫ్ పంట కోల్పోయిన రైతులలో అత్యధికులకు పంట బీమా సదుపాయం లేదు. బ్యాంకు అధికారుల సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి ఉద్బోధలు చేయడమే కానీ రైతు లకు ఉపశమనం లేదు. రుణమాఫీ మొత్తాన్ని ఒకే విడతలో సకాలంలో బ్యాంకు లలో ప్రభుత్వాలు జమ చేసి ఉన్నట్లయితే రైతులకు కొత్త రుణాలు దొరికేవి, పంట బీమా సదుపాయం లభించేది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు జరపాలన్న నిజాయితీ లేకపోవడం అసలు సమస్య. పైగా, అన్ని హామీ లనూ అమలు చేశామని ఒకరూ, ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేశామని మరొకరూ దబాయించడం సరికొత్త రాజకీయం. బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అప్పు చెల్లించలేక, అవమానాలు సహించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దీనగాథలు 1998 నుంచి వింటూనే ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా రాస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలకు విన్నవిస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా రైతుల బతుకుల్లో మార్పు లేదు. మద్దతు ధర అందని ద్రాక్ష 7. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర పెట్టుబడి వ్యయం కంటే తక్కువే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్రం ప్రకటించిన ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత జోడించేది. అటువంటి చొరవ ఇప్పుడు లేకపోగా, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపా రులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు పెసర ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటల్‌కు రూ. 4,650. తెలంగాణలో రైతు లకు రూ. 2,600 నుంచి 3,300లు చెల్లిస్తున్నారని వ్యవసాయదారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ లోపెల్లి జలపతిరావు చెప్పారు. అదే గుజరాత్, మహారాష్ట్రలలో క్వింటల్ పెసరను రూ. 6,850 పెట్టి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తెలంగాణ రైతుల నష్టం కొంతవరకైనా తగ్గేదేమో. 8. ఆగస్టులో వర్షాభావం వల్ల తెలంగాణలో మొక్కజొన్న పంట దెబ్బ తిన్నది. సెప్టెంబరులో కుండపోత కారణంగా సోయా చిక్కుడు దెబ్బతిన్నది. వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం పడావ పెట్టవలసి వచ్చింది. నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. నివేదికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. కరువు మండలాలలో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 761 కోట్లు పంపించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా (మ్యాచింగ్ గ్రాంట్) రూ. 250 కోట్లు జోడించి రైతులను ఆదుకోవాలి. ఆ పని జరుగుతున్న దాఖలా లేదు. 9. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలనే అభ్యర్థన చాలాకాలంగా ఉన్నది. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే రైతుల జీవితాలకు భద్రత కల్పించవలసిన బాధ్యత దేశంపైన లేదా? హైదరాబాద్ హైకోర్టులో ఈ సమస్యపై దాఖలైన పిటిషన్‌పైన వాదనలు జరిగాయి. వ్యవసాయదారుల, వ్యవసాయ ప్రవీణుల సమావేశాలు నిర్వహించి వారి నుంచి సలహాలు స్వీకరించవలసిందిగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ రంగాన్ని దహించివేస్తున్న సంక్షోభం పరిష్కరించడంపైన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు దృష్టి కేంద్రీకరించాలి. జనాభాలో సగం మంది అసంతృప్తితో, నిరాశతో కునారిల్లుతూ ఉంటే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఎట్లా బాగుపడతాయి? కె. రామచంద్రమూర్తి -
అణగారిన వర్గాల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి
• ‘ఎడిటర్స్ మీట్’లో సీపీఎం నేత తమ్మినేని • ప్రత్యామ్నాయ అభివృద్ధి ‘నమూనా ముసాయిదా’ విడుదల సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రాభివృద్ధి జరిగినట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన, అనుసరిస్తున్న విధానాలను చూస్తే దీనికి అనుగుణంగా లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అణగారిన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరగాలన్న దానిని వివరిస్తూ ఈ నెల 17 న పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంనుంచి ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’పై మహాజన పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ‘ఎడిటర్స్ మీట్’ సమావేశంలో పాదయాత్రలో భాగంగా తాము ప్రచారం చేయదలచుకున్న 38 అంశాలతో కూడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ముసాయిదాను తమ్మినేని విడుదల చేశారు. ఈ విధానాల అమలుకు నిరంతర కృషి జరిగేలా ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి పెంచేందుకు, రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎజెండా నుంచి దృష్టి మళ్లించకుండా చేసేందుకు ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. పాదయాత్రలో ఈ నమూనాపై వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి వచ్చే సలహాలు, సూచనలను క్రోడీకరించి తుది డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు. ఈ పాదయాత్ర టీఆర్ఎస్కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదని తమ్మినేని స్పష్టంచేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాల్లో లోపం ఏమిటి, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఏమిటన్నది వివరిస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో నిజమైన మార్పులు తీసుకొచ్చి వివిధ వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమైన అంశాలను ఎంచుకోవడం మేలు: కె.రామచంద్రమూర్తి ఒకేసారి అనేక అంశాలు తీసుకోవడం కంటే కొన్ని ముఖ్యమైన అంశాలను ఎంచుకుని వాటిపై పోరాటం చేస్తే బావుంటుందని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సూచించారు. ప్రభుత్వం పొరపాట్లు చేస్తున్నదంటే వాటిని ఎట్లా అధిగమించాలి.., ప్రత్యామ్నాయ మార్గమేమిటి అనేది చెప్పగలగాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న టీజేఏసీ.. ఇతర శక్తులు, వర్గాలను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. సమావేశంలో పాత్రికేయులుకె.శ్రీనివాసరెడ్డి (మనతెలంగాణ ), ఎస్.వీరయ్య (నవతెలంగాణ), శ్రీధర్‌బాబు (టీవీ 10), హాష్మి (సియాసత్), సాయి (జెమిని), కప్పరప్రసాద్ (హెచ్ఎంటీవీ) తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు బి.వెంకట్, ఇతర నేతలు చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు, టి.సాగర్ పాల్గొన్నారు. పాదయాత్రపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: తాము చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్రను ఎద్దేవా చేస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవని పేర్కొంది. సీపీఎం చేస్తున్నది ప్రభుత్వ, టీఆర్ఎస్ వ్యతిరేక యాత్ర కాదని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆ పుస్తకం చదువుతున్నంతసేపు కన్నీళ్ళాగలేదు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త భాషా సింగ్ రచించిన ‘అన్‌సీన్’ పుస్తకం తెలుగు అనువాదం ‘అశుద్ధభారత్’ను రామన్ మెగసెసె అవార్డు గ్రహీతలు బెజవాడ విల్సన్, కృష్ణన్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి శనివారం లమాకానాలో ఆవిష్కరించారు. అన్‌సీన్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సామాజిక కార్యకర్త, రచయిత సజయ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పుస్తకం చదువుతున్నంత సేపు కన్నీళ్ళాగలేదని కె.రామచంద్రమూర్తి అన్నారు. పాకిస్తాన్‌పై యుద్ధంతో ఆనందడోలికల్లో ఉన్న పాలకులకు ఈ దుర్మార్గంలో మగ్గిపోతున్న మనుషుల గురించి పట్టదన్నారు. సఫాయికర్మచారీ ఆందోళన్ ద్వారా అమానవీయ వ్యవస్థనుంచి విముక్తిని కోరుకున్న ఎస్.ఆర్.శంకరన్ జాతి మొత్తాన్ని ఉత్తేజితం చేశారన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ శంకరన్, కన్నాభిరాన్, తారకం లాంటి ఎందరో మహానుభావులు మానవ మలమూత్రాలను ఎత్తివేసే అమానవీయ వ్యవస్థ నిర్మూలనను కలగన్నారన్నారు. అయితే ఆ కల నెరవేరకుండానే వాళ్ళు మరణించారని అన్నారు. పాకీపని పచ్చి నిజం. కానీ ఈ వాస్తవాన్ని ఎవ్వరూ అంగీకరించడానికి సిద్ధంగా లేరని బెజవాడ విల్సన్ అన్నారు. ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న 2016లో కూడా ఇంకా గౌరవప్రదంగా జీవించే హక్కుకోసం పోరా>డుతున్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత కృష్ణన్ మాట్లాడుతూ ఇది దుర్మార్గమనీ, నేరమనీ తెలిసి కూడా దీన్ని అంగీకరించకుండా అత్యంత సులభంగా తప్పుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. చివరగా అన్‌సీన్ పుస్తక రచయిత భాషా సింగ్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్స్‌లో సంభవిస్తున్న మరణాలన్నీ హత్యలేనన్నారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా మానవ మల మూత్రాలను చేతులతో ఎత్తిపోసే కథనాలను సేకరించే ప్రయాణంలో నా వ్యాసాలు పుస్తకంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు. పాకీ పనిచేసే స్త్రీల అంతరాంతరాళాల్లో ఉన్న వాస్తవిక కథనాలను గుదిగుచ్చి ఈ పుస్తకాన్ని రాయడంలో ఎస్ఆర్.శంకరన్ ప్రోత్సాహమే కీలకమన్నారు. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయపనిలో మూలుగుతోన్న లక్షలాది మంది మహిళలు అనుభవిస్తోన్న యథార్థగాథే అశుద్ధ భారత్ అని సజయ అన్నారు. -
ఏదీ సవ్యంగా జరగలేదు...
-
మట్టే బంగారం విజేతలు వీరే!
మాసబ్‌ట్యాంక్: సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు ‘సాక్షి’ దినపత్రిక నిర్వహించిన ‘మట్టే బంగారం’ పోటీలకు గ్రేటర్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి... సెల్ఫీలను పంపిన వారికి ‘సాక్షి’ లక్కీ డిప్లో పాల్గొని రూ.లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 6 నుంచి 14 తేదీ వరకు పంపిన సెల్ఫీలను ‘సాక్షి’లో ప్రచురించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరైరాజు డ్రా ద్వారా విజేతను ప్రకటించారు. మొదటి విజేతగా కూకట్‌పల్లికి చెందిన హారిక, రెండో విజేతగా ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నవదీప్, మూడో విజేతగా శేరిలింగంపల్లికి చెందిన మధుబాబులు నిలిచారు. కొండాపూర్‌కు చెందిన గోవింద్ నాయక్, బోడుప్పల్‌కు చెందిన భాస్కర్ రెడ్డి, మౌలాలీకి చెందిన శ్రీనివాస్ కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి విజేతలకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో వారికి బహుమతులు అందించనున్నారు. -
ఇది ధర్మాగ్రహం!
త్రికాలమ్ ‘ప్రజలు న్యాయవ్యవస్థపైనే ఆశలు పెట్టుకున్నారు’. ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించాలనీ, అందులో ప్రభుత్వానికి లేశమాత్రమైనా ప్రమేయం ఉండరాదనే వాదనతో విభేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్‌కి లేఖ రాసిన అనంతరం సాగుతున్న మేధోమథనంలో భాగంగా జస్టిస్ లోధా తన అభిప్రాయం వెలి బుచ్చారు. ఆయన మనోగతం ఏమంటే ప్రభుత్వాలూ, చట్టసభలూ భ్రష్టు పట్టిపోయాయనీ, ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా సైతం విఫలమైందనీ, ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఇంకా ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టి ఉంచిందనీ. ఈ అంశంపైన జనాభిప్రాయం సేకరిస్తే లోధా నమ్మకం నిరాధారమని తేలవచ్చు. మూడు దశాబ్దాల కిందట ప్రజలకు అచంచల విశ్వాసం ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా పదేళ్ళుగా సంభవించిన పరిణామాలు న్యాయవ్యవస్థను సైతం తక్కిన వ్యవస్థల స్థాయికి దిగజార్చాయి. ఈ దుస్థితి మారాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి. బహిరంగ చర్చ జరగాలి. ఇందుకు తెరలేపే సాహసం చేసినందుకు జస్టిస్ చలమేశ్వర్‌ను అభినందించాలి. ఈ సమస్యను దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చేసినందుకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ ఆయనకు కృత జ్ఞతలు చెప్పాలి. సాగిలపడిన వ్యవస్థ పాలనా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ డీలా పడిన సందర్భాలు చూశాం. పాలనా వ్యవస్థ బలహీనమైనప్పుడు న్యాయవ్యవస్థ ఆధిక్యం ప్రద ర్శించడమూ కనిపించింది. ఆత్యయిక పరిస్థితిలో వొంగమంటే నేలమీద డేకారంటూ పాత్రికేయులను బీజేపీ నేత అడ్వాణీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్య న్యాయవ్యవస్థకూ చక్కగా సరిపోతుంది. ఆత్యయిక పరిస్థితి ప్రకటనకు ముందే 1973లోనే ముగ్గురు న్యాయమూర్తులను పక్కన పెట్టి వారికంటే తక్కువ అనుభవం (సీనియారిటీ) ఉన్న న్యాయమూర్తికి ప్రధాన న్యాయ మూర్తిగా పట్టం కట్టినప్పుడే ఇందిరాగాంధీ న్యాయవ్యవస్థపైన ప్రభుత్వం ఆధిక్యాన్ని చాటారు. కమిటెడ్ జుడిషియరీ (నిబద్ధత కలిగిన న్యాయవ్యవస్థ) అంటూ ప్రభుత్వ సైద్ధాంతిక ధోరణితో ఏకీభవించే న్యాయవ్యవస్థ కావాలంటూ సామ్యవాదం (సోషలిజం)వైపు మొగ్గే న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇవ్వా లన్న విధానం అమలులోకి వచ్చిన తర్వాత దానికి నిరసనగా పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన న్యాయమూర్తులను ఒక చేతి వేళ్ళపైన లెక్క పెట్టవచ్చు. కనుక ప్రజాస్వామ్య పరిరక్షణ తమకు మాత్రమే సాధ్యమని కానీ, అందుకు అవసరమైన అంకితభావం, తెగువ తమకు మాత్రమే ఉన్నాయని కానీ న్యాయనిర్ణేతలు ఎవరైనా భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. ఆ తర్వాతైనా న్యాయవ్యవస్థ నిటారుగా నిలబడలేదు. 1980ల వరకూ బిక్కుబిక్కుమంటూనే ఉంది. 1991లో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం, అనంతరం బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంలో న్యాయ వ్యవస్థది పైచేయి అయింది. సెకెండ్ జడ్జెస్ కేసును 1993లో పరిష్కరించిన న్యాయమూర్తులే ప్రభుత్వం చేతుల్లో న్యాయమూర్తులను నియమించే అధి కారం కొనసాగితే ప్రమాదమని తీర్మానించారు. న్యాయమూర్తుల నియామ కంపైన సీనియర్ న్యాయమూర్తులే నిర్ణయాలు చేయాలనీ, అందుకు ప్రధాన న్యాయ మూర్తి, మరి ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాజపేయి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (ఎన్డీఏ-1) అంత బలహీనమైనది కాకపోయినా అత్యంత ఉదార మైనది. ఆ మెతకదనాన్ని ఆసరాగా తీసుకొని 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం కొలీజియం వ్యవస్థను విస్తరించి బలోపేతం చేసింది. సభ్యుల సంఖ్యను అయిదుకు పెంచింది-ప్రధాన న్యాయమూర్తికి తోడు నలుగురు అత్యంత అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు. ప్రధాన న్యాయ మూర్తి ప్రథముడు. తక్కిన నలుగురూ సమానులే. ఇప్పటి కొలీజియంలో జస్టిస్ చలమేశ్వర్ అయిదో న్యాయమూర్తి అనడం సరి కాదు. నలుగురిదీ సమాన హోదా. కొలీజియం నిర్ణయాలపై విమర్శలు వెలువెత్తిన సందర్భాలు అనేకం. న్యాయమూర్తులు తమ బంధువులనూ, స్నేహితులనూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నారంటూ న్యాయవాద వర్గాలు గగ్గోలు పెట్టాయి. సమర్థత, నిజాయితీ, ధర్మాభినివేశం కలిగిన వారిని పక్కన పెట్టి ఇతరేతర కారణాల వల్ల అనర్హులను గద్దె(బెంచి)నెక్కించిన విషయం అందరికీ తెలుసు. న్యాయ మూర్తులుగా నియమితులైన వారంతా అనర్హులని కాదు. అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలో నిజం ఉన్నదనే అభిప్రాయం జనసామాన్యంలో బలంగా నాటుకున్నది. న్యాయవ్యవస్థ పెత్తనం అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం పాలనా వ్యవస్థపైన తన ఆధిక్యాన్నీ, ఆధిపత్యాన్నీ యూపీఏ పదేళ్ళ పరిపాలనలో అప్రతిహతంగా కొనసాగించింది. యూపీఏ నాయకత్వం సీబీఐని రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగిస్తే సీబీఐని నియంత్రించే బాధ్యత సుప్రీంకోర్టు స్వీకరించడం ఒక ముఖ్యమైన మలుపు. డోలాయమాన స్థితిలో నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు పూర్తిగా లొంగిపోయిన సన్నివేశమది. ప్రభుత్వం తీసు కోవలసిన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకున్న సందర్భం. పాలన వ్యవస్థ బలహీనపడిన మాట వాస్తవం. బాధ్యత లేని అధికారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల్లో ఉండటం, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అధికారం లేకపోవడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని న్యాయవ్యవస్థ వినియోగించుకు న్నది. వాస్తవానికి రాజకీయ వ్యవస్థలో విలువలు పతనమైన సమయం లోనే న్యాయ వ్యవస్థలోనూ ప్రమాణాలు పడిపోయాయి. న్యాయమూర్తులపైన అవినీతి ఆరోపణలు ఆత్యయిక పరిస్థితిలోనే-1976లో- నాటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ వీరాస్వామిపైన అవినీతి అరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతించారు. న్యాయ మూర్తిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించవచ్చునా, కూడదా అనే ప్రశ్నపైన న్యాయవ్యవస్థలో వాదోపవాదాలు జరిగాయి కానీ కేసు ముందుకు సాగలేదు. అనంతరం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో జస్టిస్ రామస్వామిని అభిశంసించే తీర్మానంపైన పార్లమెంటు చర్చించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు నేర ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉన్నారనే అరోపణలు వచ్చిన కారణంగా వారు పదవుల నుంచి వైదొలగవలసి వచ్చింది. ఒక న్యాయమూర్తి తాను రాయబోయే పుస్తకానికి పారితోషికం కింద ముందస్తుగా 70 లక్షలు స్వీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయనకు అడ్వాన్స్ చె ల్లించిన ప్రచురణ సంస్థకు నేరస్థ ప్రపంచంతో బంధాలు ఉన్నాయని తేలింది. 1996 నుంచి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులపైనే అవినీతి ఆరోపణలు వినిపించసాగాయి. 2003లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు బంటుగా తేలి పదవికి రాజీనామా సమర్పించారు. ఇటువంటివి అనేకం ఉన్నా న్యాయవ్యవస్థ పరువును యమునా నదిలో కలిపిన ఘటన 2009లో జరిగింది. ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత ప్రశాంత్ భూషణ్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన 16 మందిలో సగం మంది అవినీతిపరులేనంటూ ఆరోపించారు. ప్రశాంత్ భూషణ్‌పైన కోర్టు ధిక్కార నేరంపైన కేసు నమోదు చేశారు. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అల్తమస్ కబీర్ నాయకత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ప్రశాంత్ భూషణ్‌కి నోటీసు జారీ చేసింది. సరిగ్గా ఏడాదికి 2010లో ఆయన తండ్రి, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంతవరకూ ప్రధాన న్యాయ మూర్తులుగా పని చేసినవారిలో ఎనిమిదిమంది మంది కచ్చితంగా అవినీతి పరులనీ, ఆరుగురు నిశ్చయంగా నీతిమంతులనీ, తక్కిన ఇద్దరి విషయంలో కరాఖండిగా చెప్పడానికి తన వద్ద సమాచారం లేదనీ వివరించారు. నీతి మంతులైన, అవినీతిపరులైన న్యాయమూర్తుల పేర్లు కూడా శాంతిభూషణ్ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రశాంత్‌పై కేసు ఎటుపోయిందో, శాంతి భూషణ్‌పై ఏ చర్య తీసుకున్నారో తెలియదు. అసలు న్యాయమూర్తి పరిశీలన లోకి ప్రశాంత్ భూషణ్ కేసు వెళ్ళలేదని ప్రముఖ రచయిత ఎస్ గురుమూర్తి అంటున్నారు. నరేంద్రమోదీ ఘనవిజయం పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ పరువు బజారుపాలైన సందర్భంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ విరాట్ స్వరూపం ప్రదర్శించి, వందలాది సభలలో అద్భుతంగా ప్రసంగించి, ఘన విజయం సాధించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. న్యాయవ్యవస్థ జోక్యందారీ వైఖరిని కట్టడి చేసే ఉద్దేశంతో నేషనల్ జుడీషియల్ అప్పాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లును 2014 డిసెంబర్లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించి కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ, కేంద్ర న్యాయవ్యవహారాల శాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వం జోక్యంతో న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటి ల్లుతుందనీ, ఇది రాజ్యాంగ స్వభావానికి విరుద్ధమనీ అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పింది. రాజ్యాంగసమ్మతం కాదంటూ ఈ చట్టాన్ని కొట్టివేయాలని నలుగురు న్యాయమూర్తులు తీర్పు చెబితే, అయిదో న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మెజారిటీ అభి ప్రాయంతో విభేదించారు. న్యాయమూర్తుల నియామకాలతో ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రమేయం ఉండరాదనే వాదనతో చలమేశ్వర్ ఏకీభవించలేదు. ఏ ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా న్యాయవ్యవస్థ లేదని వాదించారు. ఒక వ్యవస్థపైన మరో వ్యవస్థ నిఘా ఉంచే విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధానం ద్వారా సమతౌల్యాన్ని పరిరక్షించాలనే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యానికి కొలీజియం వ్యవస్థ గండి కొట్టిందనీ, ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లేవని, నియామకాలలో బంధుప్రీతి కనిపి స్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయనీ జస్టిస్ చలమేశ్వర్ కుండ బద్దలు కొట్టారు. రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తుల నియామకాలను శాసిస్తున్న కొలీజియం వ్యవస్థపైన సూటిగా, బలంగా, ధర్మాగ్రహంతో దాడి చేసిన ఘనత జస్టిస్ చలమేశ్వర్‌కు దక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన దోహదాన్ని భావి తరాలు కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుపెట్టుకుంటాయి. రట్టయిన గుట్టు కొలీజియం సమావేశాలు రహస్యంగా జరుగుతాయనీ, అయిదుగురు సభ్యు లలో ముగ్గురు ఎవరికి అనుకుంటే వారికే అవకాశం వస్తుందనీ, తక్కిన ఇద్దరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరిగినట్టు ప్రక టిస్తున్నారనీ, సమావేశ వివరాల నమోదు, విభేదించిన సభ్యుల అభి ప్రాయాలు, ఇతర ప్రముఖుల అభిప్రాయాలు సేకరించడం, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరగడం లేదని వెల్లడించి జాతి యావత్తునూ జస్టిస్ చలమేశ్వర్ దిగ్భ్రాంతికి గురి చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో జాప్యంపై ప్రధానిని అడుగుతూ కంట తడిపెట్టిన జస్టిస్ ఠాకుర్ మొన్న స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో న్యాయమూర్తుల నియామకాల గురించి ఆయన ప్రస్తావించనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఆవేశంగా స్పందించే గుణం కలిగిన జస్టిస్ ఠాకుర్ సైతం జస్టిస్ చలమేశ్వర్ తనకు రాసిన లేఖ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ‘త్వరలోనే మేము పరి ష్కరించుకుంటాం’ అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఇది ఇద్దరి మధ్యనో, లేక కొలీజియం సభ్యుల మధ్యనో పరిష్కరించుకోవలసిన వివాదం కాదు. నిజానికి ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య రగులుతున్న చిచ్చు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. అందుకే జస్టిస్ చలమేశ్వర్ ఉద్దేశిం చినట్టు ఈ వివాదంపై బహిరంగ చర్చ జరగాలి. దాపరికాన్ని అంతం చేయాలి. సంస్కరణలకు బాట వేయాలి. చట్టపాలనకు పట్టం కట్టాలి. అమెరికా, బ్రిటన్‌లో.... ప్రభుత్వ ప్రమేయంలేని న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడా లేవు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబం ధించిన ప్రతిపాదన అధ్యక్ష భవనం నుంచి వెడుతుంది. అధ్యక్షుడు సూచించిన పేర్లను సెనేట్ కమిటీ పరిశీలించి ఆమోదించాకే న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. అధ్యక్షుడు ప్రతిపాదించినా సెనేట్ తిరస్కరించినట్లయితే ఆ నిర్ణయానికి తిరుగులేదు. అమెరికా రాజ్యాంగం రెండవ అధికరణలో రెండవ సెక్షన్ కింది సెనేట్‌కు ఈ అధికారాలు సంక్రమించాయి. అధ్యక్షుడు సెనేట్ సలహా, ఆమోదం కోరాలని ఈ సెక్షన్ స్పష్టం చేసింది. అంటే పాలన వ్యవస్థకూ, చట్ట వ్యవస్థకూ న్యాయమూర్తుల నియామకంలో ప్రమేయం ఉండేవిధంగా అమె రికా రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. అధ్యక్షుడు ప్రతిపాదించిన తర్వాత సెనేట్ తిరస్కరించిన మొట్టమొదటి అభ్యర్థి జాన్ రూట్లేజ్. 1795లో రూట్లేజ్ను ప్రతిపాదించిన అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్. అమెరికా ఆవిర్భావం తర్వాత 2005 వరకూ అధ్యక్షులు ప్రతిపాదించిన 149 మంది అభ్యర్థులలో 27 మందిని సెనేట్ తిరస్కరించింది. బ్రిటన్‌లోనూ జూడీషియల్ అప్పాయింట్మెంట్స్ కమిషన్ (జేఏసీ) ఉంది. న్యాయమూర్తి పదవికి ఏవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీ ప్రతిపాదించే అభ్యర్థుల పేర్ల జాబితాను లార్డ్ చాన్సలర్ (న్యాయ మంత్రి)కి పంపుతారు. ఆయన, ప్రధాని ఖరారు చేసిన జాబితాను రాజ్యాధినేత రాణికి పంపుతారు. కనుక ప్రభుత్వ ప్రమేయం బొత్తిగా ఉండరాదనే వాదనలో అర్థం లేదు. పైగా సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించిన పేర్లను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రపతికి పంపించాలి. ఆ జాబితాను రాష్ట్రపతికి గుడ్డిగా నివేదిం చడమే కేంద్ర న్యాయశాఖ మంత్రి పరిమితం కావాలని కోరుకోవడం న్యాయమా? వాస్తవానికి థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియంను విస్తరిస్తూ రాజ్యాంగపీఠం చెప్పిన తీర్పులోని కీలకమైన అంశాలను కొలీజియం పాటిం చడం లేదని జస్టిస్ చలమేశ్వర్ ధ్వజమెత్తిన తర్వాత వెల్లడి అవుతోంది. థర్డ్ జడ్జెస్ కేసుపై 1998 అక్టోబర్ 28 రాజ్యాంగ పీఠం ఇచ్చిన ఉత్తర్వు పాఠంలో 22వ పేరా కొలీజియం విధివిధానాలను స్పష్టంగా పేర్కొంది. సభ్యులందరి అభి ప్రాయాలనూ నమోదు చేయాలనీ, అభ్యర్థులు ఏ హైకోర్టు నుంచి వచ్చారో ఆ హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాదుల అభి ప్రాయాలను సైతం సేకరించాలనీ, వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సులతో సవివరంగా ప్రభుత్వానికి పంపాలనీ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. కొలీజియం సమావేశం తాలూకు వివరాలనూ, సభ్యుల, అసమ్మతి తెలియజేసిన సభ్యుల అభిప్రాయాలనూ వివరంగా రాసి పంపించాలన్నది అందులో ప్రధానమైన అంశం. ఇంత వివరంగా థర్డ్ జడ్జెస్ కేసులో తీర్పు వెలువడిన తర్వాత పదహారేళ్ళపాటు ఈ అంశాలను ప్రధాన న్యాయ మూర్తులు తుంగలో తొక్కారు. సమావేశ వివరాలను నమోదు చేయనేలేదు. ఫలానా కొలీజియం, ఫలానా న్యాయవాదిని ఎందుకు సిఫార్సు చేసిందో తెలుసుకోవాలంటే న్యాయ మూర్తులకు కూడా సాధ్యం కాదు. రికార్డు లేదు. అసమ్మతి తెలిపిన వైనం కానీ, అసమ్మతిని తెలిపింది ఎవరనే వివరం కానీ ఎక్కడా లేదు. ముగ్గురో, నలుగురో కూడబలుక్కొని తీసుకున్న నిర్ణయాలను దేశం మీద రుద్దే ప్రక్రియే అమల వుతోంది. ఇది రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం తప్ప వేరొకటి కాదు. ఈ దాపరికాన్నే, ఈ జవాబుదారీతనం లేని బేపర్వా వైఖరినే జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు. దీనివల్ల అర్హులైనవారికీ, ప్రతిభావంతులైన వారికీ అవకాశాలు రావడంలే దనీ, కొలీజియం సభ్యులతో సామీప్యం ఉన్నవారికీ, వారి దృష్టిలో పడిన వారికీ, వారిని మెప్పించినవారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయనీ అర్థం. దీని వల్ల న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయనీ, కొంత కాలానికి ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన. తనకి ఒకరి పట్ల వ్యతిరేకత కానీ, ఎవరినైనా మెప్పించవలసిన అవసరం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేను రెండేళ్ళలోపే(2018 జూన్)పదవీ విరమణ చేయ బోతున్నాను. ఆ తర్వాత నేను ఎటువంటి పదవినీ ఆశించడం లేదు. ఏదో ఒక కమిషన్‌కు అధ్యక్షుడుగా పనిచేసే ఆలోచన లేనే లేదు’ అంటూ సూటిగా చెప్పారు. జస్టిస్ చలమేశ్వర్‌కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదించడం వల్ల ప్రయో జనం లేదు. ఆయన అభ్యంతరంలో అర్థం లేకపోలేదని జస్టిస్ లోధా కూడా అన్నారు. న్యాయవ్యవస్థ పరువుప్రతిష్ఠలు పునరుద్ధరించాలంటే సంస్కరణలు అనివార్యం. రాష్ట్రపతి మరో సారి సుప్రీంకోర్టు సలహా కోరవలసిన సందర్భం ఆసన్నమైంది. ఇది వరకటి తొమ్మిది మంది న్యాయమూర్తుల పీఠం కంటే విస్తారమైన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని సాకల్యంగా పరిశీలిం చాలి. ప్రభుత్వ పెత్తనం లేకుండా, న్యాయమూర్తుల చేతుల్లోనే సర్వాధికారాలు పెట్టుకోకుండా చూడాలి. పారదర్శకతను పాటించాలి. ప్రతిభావంతులనే న్యాయమూర్తులుగా నియమించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. ఒక వ్యవస్థ బలహీనమైనప్పుడు మరో వ్యవస్థది పైచేయి కావడం మంచిది కాదు. అన్ని వ్యవస్థలూ బలంగా ఉన్నప్పుడే ప్రజా స్వామ్యానికి చేవ. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన ప్రధానమైన అంశాలపైన సర్వత్రా చర్చ జరగాలి. సముచితమైన సంస్కరణలు అమలు కావాలి. సమర్థులైన న్యాయమూర్తులు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో నియుక్తులు కావాలి. అప్పుడే చట్టపాలన, ప్రజాస్వామ్యం సార్థకం అవుతాయి. -
'నయీం కేసులో పెద్దల పేర్లు బహిర్గతం చేయాలి'
-టీయూడబ్ల్యూజే సెక్రటరీ జనరల్ అమర్ వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బహిర్గతం చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ప్రోగ్రామ్ కవరేజీకి వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్ ఇస్తే నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు బహిర్గతం చేసి ఎఫ్ఐఆర్లో పెడతారా ? అని అమర్ ప్రశ్నించారు. అధికారులు కావాలనే జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, నల్లగొండ ఘటనే దీనికి నిదర్శనమన్నారు. పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇప్పుడున్న యూనియన్లు సర్కారీ సంఘాలని, జర్నలిస్టుల సమస్యల పట్ల ఎదుటి సంఘానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మావోయిస్టు నేత జగన్ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారానడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ... జర్నలిస్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నేతలు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చాక శత్రువులుగా మారుతారని అన్నారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కన్వీనర్ టి.శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలు కరుణాకర్, డి.క్రిష్ణారెడ్డి, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి
త్రికాలమ్: ‘మీకు అక్కడ భూములు ఉన్నాయా? మీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా?’ ‘లేదు. పిటిషనర్లు రైతులు కాదు. జర్నలిస్టులు’ ‘మరి మీకేం సంబంధం?’ ‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విదేశీ ప్రభుత్వాలతో, విదేశాలలోని ప్రైవేటు కంపెనీలతో సంబంధాలు పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున అప్పులు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కుంటున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం’ ‘ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.’ ‘(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సారవంత మైన భూములను రైతుల నుంచి సేకరిస్తున్నది. కేంద్రం నియమించిన శివరామ కష్ణన్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసింది.’ ‘మీరు మెట్టభూములు చూపించకపోయారా? రాజధాని నిర్మించడం మీకు ఇష్టం లేదా? భూములు కోల్పోయిన రైతులు వచ్చినప్పుడు చూద్దాం. మీ పిటి షన్లో పస లేదు. అందువల్ల కొట్టేస్తున్నాం’. ప్రముఖ సంపాదకుడు ఏబికే ప్రసాద్, ‘లీడర్’ పత్రిక సంపాదకుడు రమణ మూర్తి, జర్నలిస్టు–న్యాయవాది శ్రవణ్‌కుమార్‌లు దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీఐఎల్–జనహితవ్యాజ్యం)ను పరిశీలించకుండానే కొట్టివేసే ముందు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్కూ, పిటిషనర్ల తరఫు న్యాయ వాదులకూ మధ్య జరిగిన సంభాషణ స్థూలంగా ఇది. పీఐఎల్ ఒక బెడదా? ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఖన్వీల్కర్ కూడా పీఠంపై ఉన్నారు. డివై చంద్రచూడ్ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ జనహితవ్యాజ్యాలను విశేషంగా ప్రోత్సహిం చిన న్యాయకోవిదుడు. జస్టిస్ ఠాకుర్‌కు పీఐఎల్ వేస్తున్నవారి పట్ల కొంత అసహనం ఉన్నమాట బహిరంగ రహస్యం. కుప్పలుతెప్పలుగా పేరుకుపో తున్న కేసులు ప్రధాన న్యాయమూర్తిని కలవరపెడుతున్నాయి. న్యాయమూ ర్తుల సంఖ్య పెరగడం లేదు. పీఐఎల్ వేస్తున్నవారిలో కొందరు ప్రజాప్రయో జనం కాకుండా నిగూఢమైన స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారున్నారు. వారిని నిరోధించే మార్గం సూచించవలసిందిగా సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖను కోరింది. న్యాయశాఖ ఆ పనిపైన దష్టి పెట్టింది. ఐపీఎల్‌ను వ్యవస్థీకతం చేసిన న్యాయకోవిదులలో ప్రథముడు జస్టిస్ పీఎన్ భగవతి ఈ విషయంలో న్యాయ శాఖతో సహకరిస్తున్నారు. మరో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఆర్ కష్ణ య్యర్ 2014 డిసెంబర్ 4న నిర్యాణం చెందే వరకూ సహకారం అందించారు. పీఐఎల్‌కు ప్రణబ్ బాసట జనహితవ్యాజ్యంలో అగ్రగామిగా జస్టిస్ భగవతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. లోకాయుక్త్లను సాధికారికం చేయడంలోనూ, పేదలకు న్యాయ సహాయం అందించడంలోనూ జస్టిస్ భగవతి చేసిన సేవలు విలువైనవంటూ ప్రశంసించారు. జస్టిస్ భగవతి రాసిన ‘మై ట్రిస్ట్ విత్ జస్టిస్‘ని 2012 డిసెంబర్ 13న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబీర్ రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించిన సందర్భంగా ప్రణబ్ జనహితవ్యాజ్యం పేదప్రజలకూ, అణగా రిన వర్గాలకూ, న్యాయస్థానాల గడప ఎక్కలేని అమాయకులకూ వరప్రసాద మనే రీతిలో మాట్లాడారు. సుపరిపాలనకు సైతం ఇది దోహదం చేస్తుంది. అనేక జనహితవ్యాజ్యాలలో సర్వోన్నత న్యాయస్థానం గొప్ప తీర్పులు ఇచ్చిన ఫలితంగానే సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతోంది. చట్టసభలూ, పాలనావ్యవస్థల కంటే ఎక్కువగా న్యాయవ్యవస్థ పైన జనసామాన్యానికి ఇప్పటికీ విశ్వాసం మిగిలి ఉండటానికి కారణం రాజ్యాం గాన్ని అన్వయించడంలో, ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో సామాజిక కోణాన్ని న్యాయమూర్తులు దష్టిలో పెట్టుకోవడమే. పీఐఎల్ వంటి సంస్కర ణను ప్రవేశపెట్టడమే. జస్టిస్ భగవతి, ఓ చిన్నప్పరెడ్డి, వైవి చంద్రచూడ్, వీఆర్ కష్ణయ్యర్, డీఏ దేశాయ్, జీవన్‌రెడ్డి వంటి దిగ్గజాలు అధోజగత్తులో అలమ టిస్తున్నవారికి న్యాయసహాయం అందించే పరమ లక్ష్యంతో అహరహం కృషి చేసిన కారణంగానే న్యాయవ్యవస్థలో ఇప్పటికీ కొన్ని మానవీయ విలువలు మిగిలి ఉన్నాయి. పీఐఎల్‌ను పరిశీలించకుండానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తిరస్కరించడం దిగువ కోర్టులకు ఆదర్శంగా నిలుస్తుంది. నోరులేనివారి తరఫున జనహితవ్యాజ్యం దాఖలైతే దానిని పరిశీలించడానికి సైతం హైకోర్టుల న్యాయమూర్తులు నిరాకరిస్తారు. ఇది పేదవారికి అన్యాయం, అపకారం చేసి నట్టే. సుప్రీంకోర్టు చాలా సంవత్సరాలుగా ఎంతో శ్రమించి సాధించిన సంస్క రణను నీరుగార్చడమే. వరిష్ఠ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆరు దశాబ్దాలుగా కొన్ని విలువలకు కట్టుబడి అసిధారావ్రతం చేస్తున్న వరిష్ఠ సంపాదకుడని ప్రధాన న్యాయమూర్తికి తెలియకపోవచ్చు. ఏబీకే తెలుగు పాత్రికేయుడు కావడం, ప్రధాన న్యాయమూర్తికి తెలుగు రాష్ట్రాలతో, తెలుగు జర్నలిజంతో పరిచయం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. సమాజ శ్రేయస్సే పరమావధిగా ఏబీకే సాగిస్తున్న అక్షరయానం గురించి స్పష్టంగా తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి రైతుల తరఫున ఆయన కోర్టుకు వెళ్ళడాన్ని ఉన్మాదంగా అభివర్ణిం చడం కేవలం అహంకారం. ఉన్మాదం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు. అర్ణవ్ గోస్వామి, బర్ఖాదత్ వంటి ఇంగ్లీషు టీవీ జర్నలిస్టులు పీఐఎల్ వేసి ఉంటే జస్టిస్ ఠాకుర్ నిర్ణయం ఎట్లా ఉండేదో. రైతుల పక్షాన దాఖలైన ఐపీఎల్‌ను ఒక్క క్షణం పరిశీలించినా కేసు ప్రాధాన్యం ప్రధాన న్యాయమూర్తికి తెలిసి ఉండేది. నష్టపోయిన రైతులు పిటిషన్ వేసినప్పుడు చూద్దాం అంటూ జస్టిస్ ఠాకుర్ అన్నారు. సుప్రీంకోర్టులో ఒక రోజు ప్రభావవంతంగా వాదించేందుకు అయిదు లక్షల రూపాయల దాకా పారితోషికం చెల్లించుకోవాలంటే ఎవరు భరించగలరు? జన హితవ్యాజ్యం ద్వారా ఫీజు లేకుండా వాదించే సామాజిక స్పహ కలిగిన అడ్వ కేట్ల సహకారంతో రైతుల సమస్యలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డ గోలుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలను ప్రశ్నించే ఉద్దేశంతో వేసిన పీఐఎల్‌ను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి ఉంటే ప్రజలకు కొండంత మేలు జరిగేది. జనహితవ్యాజ్యం లక్ష్యం నెరవేరేది. ఈ విషయంలో ఠాకుర్ ఒక్కరే కాదు. మాజీ ప్రధాన న్యాయమూర్తి కపా డియా సైతం బూటకపు ఐపీఎల్‌ను నిరోధించేందుకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. పీఐఎల్ విలువ జస్టిస్ కపాడియాకు బాగా తెలుసు. పీఐఎల్æ కారణంగానే 2008 నాటి స్పెక్ట్రమ్ కేటాయింపులలో (2–జీ)కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జస్టిస్ కపాడియానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కార్యాచరణను నియంత్రించారు. అమరావతి రైతుల తరఫున పీఐఎల్ వేసిన ఏబీకేకు లోకస్ స్టాండై (అర్హత) లేదని నిర్ణయించిన ప్రధాన న్యాయమూర్తి ఠాకుర్ బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పీఐఎల్‌ను ఆసరా చేసుకొని 2016 మే 12న కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు జారీ చేశారు. లా కమిషన్ సిఫార్సు చేసినట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయవలసిందిగా న్యాయ మంత్రిత్వ శాఖకూ, ఆర్థిక మంత్రిత్వ శాఖకూ నోటీసు పంపించారు. ఇది నిశ్చయంగా ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసినదే. అందుకే ప్రజలకు మేలుచేసే పీఐఎల్‌ను తిరస్కరించడం సమంజసం కాదు. పేదలకు న్యాయసహాయం సమాజంలో పేదలకూ, నోరు లేనివారికీ న్యాయం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే సుప్రీంకోర్టు పీఐఎల్‌ను వ్యూహాత్మకంగా ఆవిష్కరించింది. ఆత్య యిక పరిస్థితిలో దెబ్బతిన్న న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పునరుద్ధరించే క్రమంలో కొందరు సామాజిక స్పహ కలిగిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థను పేద లకు చేరువ చేసేందుకు నడుం బిగించారు. పేదలకు న్యాయసహాయం చేసేం దుకు సోషల్ యాక్షన్ లిటిగేషన్ (సామాజిక వ్యాజ్యం)ను ఒక సాధనంగా వినియోగించుకోవాలంటూ జస్టిస్ కష్ణయ్యర్, జస్టిస్ భగవతి 1977లోనే ఒక నివేదిక ప్రచురించారు. ఆ తర్వాత తమకు వచ్చిన లేఖలనే పిటిషన్లుగా సూమోటోగా స్వీకరించి సామాన్యుల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ టాడా ఖైదీల కష్టాలను వర్ణిస్తూ ఒక న్యాయమూర్తికి రాసిన లేఖను పీఐఎల్గా స్వీకరించారు. ఈ సమ యంలోనే న్యాయవ్యవస్థ ప్రభుత్వ చర్యలను సమీక్షించడం ద్వారా చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ స్వభా వంలో వచ్చిన మార్పు గుర్తించగలిగితే జనహితవ్యాజ్యం రూపకల్పన క్రమం అర్థం అవుతుంది. ఏ వ్యక్తి జీవితానికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ (చట్టం పరిమితులకు లోబడి) భంగం కలగకూడదని ఈ అధికరణ నిర్దేశిస్తుంది. అంటే, చట్టం అను మతించినంత వరకూ వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చునని అప్పటి వరకూ న్యాయవ్యవస్థ విశ్వసించేది. ప్రభుత్వం చట్టం తెచ్చినా, ఆర్డినెన్స్ జారీ చేసినా ముందస్తు అరెస్టు, నిర్బంధం రాజ్యాంగ సమ్మతమేనని ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ అన్వయాన్ని మేనకాగాంధీ కేసు మార్చివేసింది. రాజ్యాంగం 14, 19, 21 అధికరణలలో స్పష్టం చేసిన విధంగా 21వ అధికరణ హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో హేతు బద్ధంగా, ధర్మబద్ధంగా, సమంజసంగా వ్యవహరించవలసి ఉంటుందంటూ న్యాయస్థానాలు భాష్యం చెప్పడం ప్రారంభించాయి. 14వ అధికరణ చట్టం ఎదుట అందరూ సమానమే అన్న హామీ ఇచ్చింది. భావప్రకటనకూ, శాంతి యుత సమావేశాల నిర్వహణకూ, ఉద్యమాలు నిర్వహించడానికీ, బతుకుతెరువు కోసం పని చేయడానికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక స్వేచ్ఛలన్నీ 19వ అధికరణలో ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం క్రమంగా ఈ హక్కుల మధ్య అంతస్సూత్రాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వ చర్యల వల్ల ఈ హక్కులలో దేనికి భంగం వాటిల్లినా ప్రభుత్వం నిగ్రహం పాటించవలసి ఉంటుంది. చట్టం నిర్ణయించిన పద్ధతి (procedure established by law) అని భారత రాజ్యాంగ నిర్మాతలు అంటే దానిని అమెరికా రాజ్యాంగంలో ఉన్న సరైన పద్ధతి (డ్యూప్రా సెస్) అనే మాటను తీసుకొని నికరమైన పద్ధతి (substantiative due process) అనే మాటను న్యాయస్థానాలు 21వ అధికరణలో చేర్చాయి. ఆత్య యిక పరిస్థితిలో దేశం అనుభవాలను దష్టిలో పెట్టుకొని న్యాయవ్యవస్థ ఈ జాగ్రత్తలు అవసరమని భావించి ఉండవచ్చు. మేనకాగాంధీ కేసులో తీర్పు దరిమిలా జీవించే హక్కు, వ్వక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను ఉదారంగా అన్వయించడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా పీఐఎల్ అనే సాధనం ద్వారానే జరిగాయని గుర్తించాలి. రాజ్యాంగం మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకూ, నాలుగో భాగంలో సమకూర్చిన ఆదేశిక సూత్రాలకూ మధ్య సమన్వయం సాధిస్తూ రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూ లంగా అన్వయించే ప్రయత్నం జరిగింది. ‘రాజ్యాంగం మూడు, నాలుగో భాగా లలోని అంశాలు పరస్పర పూరకాలే కానీ పరస్పరం సంబంధం లేని అంశాలు కావు’ అంటూ ఉన్నికష్ణన్, జేపీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆదేశిక సూత్రాలను అమలు పరచడానికి ఉపకరించే సాధనాలే ప్రాథమిక హక్కులు’ అంటూ ప్రబోధించారు. పైగా సామాజిక విప్లవం సాధించడానికీ, సంకేమ రాజ్యం స్థాపించడానికీ ఆదేశిక సూత్రాలనూ, ప్రాథమిక హక్కులనూ జమిలిగా సద్వినియోగం చేసుకోవాలంటూ కేశవానంద భారతి కేసులో న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. 21వ అధికరణ పరిధిని సుప్రీం కోర్టు క్రమంగా విస్తరించింది. తిండికీ, బట్టకీ, గూడుకూ లోపం లేకుండా ఆరో గ్యంగా, గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పిస్తేనే ఆ హక్కు అమలు జరుగు తున్నట్టు అర్థమంటూ జస్టిస్ భగవతి స్పష్టం చేశారు. పీఐఎల్ వల్ల ప్రయోజనాలు వోల్గా టెల్లిస్ అనే జర్నలిస్టు బాంబే మునిసిపల్ కార్పొరేషన్‌పైన వేసిన పీఐఎల్ ఆధారంగానే రోడ్డు పక్కన పేవ్మెంట్ల మీద నివసించేవారిని భారీ నిర్మాణాల కోసం బడా కాంట్రాక్టర్లు బలవంతంగా మరో చోటికి తరలించే ప్రయత్నం ఆగిపోయింది. వోల్గా ‘లోకస్ స్టాండై’ని నాటి న్యాయస్థానం ప్రశ్నించలేదు. బిహార్ జైళ్ళలో సంవత్సరాల తరబడి మగ్గుతున్న అండర్ ట్రయిల్ ఖైదీల దుస్థితిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన వరుస కథనాలు న్యాయస్థానం దష్టికి తీసుకువెళ్ళాయి. ‘వేగంగా విచారించే హక్కు’ అండర్ ట్రయిల్స్‌కి ఆ విధంగానే సంక్రమించింది. మరో జర్నలిస్టు షీలా బర్సే ముంబయ్ మహా నగరంలోని జైళ్ళలో అష్టకష్టాలు పడుతున్న మహిళా ఖైదీల ఘోషను న్యాయ స్థానానికి పీఐఎల్ ద్వారా వినిపించారు. షీలా ‘లోకస్ స్టాండై’ని న్యాయస్థానం ప్రశ్నించలేదు. ఆమె కషి ఫలితంగానే మహిళా ఖైదీలను ప్రత్యేక గదులలో ఉంచాలనీ, వారికి కాపలాగా మహిళా గార్డులే ఉండాలనీ సుప్రీంకోర్టు ఆదేశిం చింది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సత్వరం వైద్యం చేసి తీరా లంటూ సుప్రీంకోర్టు ఆసుపత్రులనూ, ప్రభుత్వాలనూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడానికి దారి తీసింది కూడా జనహితవ్యాజ్యమే. సుప్రీంకోర్టు చొరవ ఫలితంగా పీఐఎల్ వేసే వ్యక్తుల లేదా సంస్థల అర్హత (లోకస్ స్టాండై)ని ప్రశ్నించడం తగ్గించారు. ఢిల్లీలో ఆసియా క్రీడోత్సవం (ఏసియన్ గేమ్స్)కోసం కట్టడాలను నిర్మించడానికి సంబంధించిన కార్యకలాపాలలో బాల కార్మికులను వినియోగించడాన్ని ప్రశ్నిస్తూ పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమాక్రాటిక్ రైట్స్ భారత ప్రభుత్వంపైన వేసిన పీఐఎల్ ఫలితంగా బాలకార్మికులను వినియోగిం చడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. పర్యావరణవేత్త ఎంసీ మెహతా వేసిన అనేక పీఐఎల్‌ల ధర్మమా అని గంగానది కాలుష్య నివారణకూ, తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో కాలుష్య కారకాల తొలగింపునకూ, ఢిల్లీ మునిసి పల్ కార్పొరేషన్ పరిధి నుంచి కాలుష్య కారక పరిశ్రమలను దూరంగా తరలించడానికీ దారి తీశాయి. విశాఖపట్టణం కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ సంస్థల ఆగడాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాలలో పీఐఎల్ ద్వారా నిర్విరామంగా పోరాడు తున్నారు. పర్యావరణంతో ఒక ఐఏఎస్ అధికారికి ఏమి సంబంధం అని ఆయనను ఇంతవరకూ ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించలేదు. ఉన్నత పదవులలో ఉన్న అధికారులపైనా , రాజకీయ నాయకులపైనా రోజుకు కనీసం రెండు లేఖాస్త్రాలు సంధిస్తారు ఆయన. విద్యాసంస్థలలో విద్యార్థులకు రోజూ భోజనం ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం సవ్యంగా అమలు జరగడం లేదని పీఐఎల్ వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా పథకం అమలు కావడానికి అవసరమైన ఆదేశాలను సంబంధిత అధికారులకు సుప్రీం కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యార్థులకు స్వాలర్ షిప్పులు చెల్లించే విషయంలో 1956 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినవారి పిల్లలకే చెల్లిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే 1956 నుంచి 2013 వరకూ తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలు స్కాలర్‌షిప్‌లకు అర్హులు కారు. ఈ జీవోను సవాలు చేస్తూ ఒక పీఐఎల్ దాఖలైతే హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది సత్యప్రసాద్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం జనహితవ్యాజ్యం వల్ల సమాజానికి సమకూరిన ప్రయోజనాలు ఏమిటో, వాటి ప్రాముఖ్యం ఏమిటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియదని భావించ లేము. అదే సమయంలో అసందర్భపు పీఐఎల్‌లు న్యాయాధికారుల సమ యాన్ని వధా చేస్తున్న సంగతీ నిజమే. ఉదాహరణకు మొన్న మార్చి 11న ఠాకుర్ నాలుగు పీఐఎల్‌లు తిరస్కరించారు. వాటిలో ఒకటి ఇండియా పేరును భారత్‌గా మార్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. మరొ కటి 32 సంవత్సరాల కిందట జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించింది. మూడోది ప్రవాస భారతీయుడు దినేశ్ ఠాకుర్ వేసింది. ఔషధ పరిశ్రమలను క్రమబద్ధం చేయాలంటూ ఆయన విన్నవించారు. ‘మీరు ప్రచారం కోసం ఇక్కడి వచ్చి హడావుడి చేస్తున్నారు’ అంటూ ఆయనను ప్రధాన న్యాయమూర్తి మంద లించారు. నాలుగో ‘పిల్’ కూడా ఇటువంటిదే. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీపీఐఎల్) వేసిన పీఐఎల్ పరిశీలిస్తూ ‘మీకు ఇదే పనా? (Are you a professional litigant?) అని సూటిగా అడిగారు. ఇది ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్ భూషణ్ నాయకత్వంలో పని చేస్తున్న సంస్థ. స్పెక్ట్రమ్ కేటా యింపుల (2–జీ) కుంభకోణం వెలుగు చూడటానికి ఈ సంస్థ పీఐఎల్ ద్వారా చేసిన పోరాటమే కారణం. ఈ సంస్థ ఖాతాలో అనేక విజయాలు నమోదై ఉన్నాయి. అనవసరపు పీఐఎల్‌ల పట్ల జస్టిస్ ఠాకుర్ ఆగ్రహాన్ని అర్థం చేసు కోవచ్చు. అపరిష్కతంగా మిగిలిపోతున్న కేసుల భారం పెరిగిపోతున్నదనీ, మరింత మంది న్యాయాధికారులను నియమించాలనీ ఆయన ప్రభుత్వానికి పదే పదే చెబుతున్నారు. ఒక సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఈ సమ స్యను ప్రస్తావించి కంటతడి పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావించకపోవడం పట్ల బహి రంగంగానే ఆక్షేపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచవలసిందే. న్యాయమూర్తుల నియామకాన్ని వేగవంతం చేయవల సిందే. పేదప్రజల చేతిలో ఉన్న పాశుపతాస్త్రం పీఐఎల్. మొత్తం కేసులలో పీఐఎల్ కేసులు ఒక్క శాతానికి మించి ఉండవని హిమాచల్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు మన్మత్సింగ్ అధ్యయనంలో తేలింది. అన్ని పీఐఎల్ కేసులనూ ఒకే గాట కట్టకుండా పలుకున్న కేసులను గుర్తించి వాటిని విచారణకు స్వీకరించే వడపోత వ్యవస్థను నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది. అంతేకానీ 1980ల నుంచి సుప్రీంకోర్టుకు వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులు, ప్రాతఃస్మరణీ యులు పేదప్రజల హక్కులకు రక్షణ కల్పించే మహత్తరమైన ఆశయంతో రూపొందించిన జనహితవ్యాజ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం హానికరం. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
దూకుడు దౌత్యమా ?
త్రికాలమ్ స్వతంత్ర భారతం 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో ప్రమాదపు టంచుల్లోకి దేశాన్ని తీసుకొని వెళ్ళగల ఒకానొక దౌత్య క్రీడ రూపుదిద్దు కుంటున్నది. ఇంతకాలం కేంద్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ప్రభుత్వం వచ్చినా భారత విదేశాంగ విధానం మాత్రం మారదనే విశ్వాసం ఉండేది. ప్రధాని నరేంద్రమోదీ మదిలో మెదులుతున్నట్టు కనిపిస్తున్న ఆలోచనలు కనుక కార్యరూపం ధరిస్తే మన విదేశాంగ విధానం స్వరూపస్వభావాలు సమూలంగా మారిపోతాయి. మన దేశంలోనూ, ఇరుగుపొరుగు దేశాల లోనూ పరిస్థితులు ఇప్పుడున్నట్టు ఉండవని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. శుక్రవారంనాడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఇటువంటి అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తున్నది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని జులై 8న భద్రతాబలగాలు మట్టుపెట్టిన క్షణంలో రగులుకున్న కశ్మీరం ఇంతవరకూ చల్లారలేదు. అగ్రహోదగ్రులైన సాధారణ ప్రజలకూ, సాయుధ దళాలకూ మధ్య జరిగిన ఘర్షణలలో 56 మంది మరణించి, కొన్ని వందలమంది గాయపడినా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వానీ నేలకొరిగిన తర్వాత నెలరోజులకు ఆగస్టు 9న ప్రధాని నోరు విప్పారు. శాంతి పునరుద్ధరణలో సహకరించవలసిందిగా కశ్మీరీలకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్లో జరుగుతున్నది స్వాతంత్య్ర పోరాట మనీ, స్వాతంత్య్ర సమర వీరులను భారత్ ఉక్కుపాదంతో అణచివేస్తు న్నదనీ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ యథావిధిగా మొత్తుకుం టున్నది. మొసలి కన్నీరు కార్చుతోంది. ఈ ధోరణి కొత్త కాదు. అసాధారణ చొరవ కశ్మీర్ లోయలో భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న మాట నిజం. కశ్మీరీలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న మాట కూడా వాస్తవం. పరిస్థితిని అదుపులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అసాధారణ చొరవ ప్రదర్శించవలసిన సందర్భం ఇది. అవసర మైతే వేర్పాటువాదులతోనైనా చర్చలు జరపాలనీ, వారిని శాంతింపజే యాలనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. అఖిలపక్ష సమావేశంలో నరేంద్రమోదీ ఇటువంటి చర్చల గురించిన ప్రతిపాదన చేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తి లేదనీ, దేశ భద్రత విషయంలో రాజీపడే సమస్య లేదనీ మోదీ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని (పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్-పీవోకే) భారత దేశంలో విలీనం చేయడమే దేశం ఎదుట మిగిలిన ఉన్న ఎజెండా అనీ, పీవోకేలోనూ, బలూచిస్తాన్‌లోనూ పాకిస్తాన్ సైన్యం సృష్టిస్తున్న హింసాకాండనూ, పౌరహక్కుల ఉల్లంఘనలనూ ప్రపంచం దృష్టికి తీసుకొని రావాలనీ ప్రధాని ఉద్ఘాటించారు. ‘అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్’ (ఎదురుదాడే ఆత్మరక్షణకు సరైన మార్గం) అన్న సూత్రాన్ని అమలు చేయాలని మోదీ సంకల్పించినట్టు ఆయన ధోరణి సూచిస్తున్నది. పాకిస్తాన్ పట్ల భారత్ విధానం దశాబ్దాలుగా మారలేదు. కశ్మీర్ అంశంపైన పాకిస్తాన్ మౌలిక విధానం సైతం అంతే. కశ్మీర్ లోయలో అస్థిరత సృష్టించడం, మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చి లోయలోకి పంపించడం, హింసను ప్రేరేపించడం షరా మామూలే. అంతర్జాతీయ వేదిక లపై యాగీ చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ పాకిస్తాన్ సమర్థంగా సద్వినియోగం చేసుకుంది. 1971లో తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు జరిగి బంగ్లాదేశ్‌గా స్వతంత్ర దేశం ఆవిర్భవించిన ఫలితంగా పాకిస్తాన్ రెండు ముక్కలైనప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం దౌత్యపరంగా ఆధిక్యం ఇప్పటికీ పాకిస్తాన్‌దే. భారత దౌత్యవేత్తలూ, దేశాధినేతలూ ఆత్మరక్షణ కోసం దారులు వెదకవలసిందే కానీ పాకిస్తాన్ కు దీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. భారత భద్రతా బలగాల నీడలో కశ్మీరీలు జీవిస్తున్నారనీ, వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవనీ, మానవ హక్కులు మంటగలిశాయనీ ప్రపంచ ప్రజలను నమ్మించడంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు విజయం సాధించాయి. పాక్‌లో పరిపాలనను సైనిక వ్యవస్థ శాసిస్తున్నప్పటికీ, ఎన్నికైన ప్రధానులు సైన్యాధ్యక్షుడికి జీహుకుం అంటూ దీనంగా ఉన్న ప్పటికీ, బలూచిస్తాన్‌లో, పీవోకేలో ఆజాదీ పేరు మీద అశాంతి నెలకొన్న ప్పటికీ, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పెంచి పోషించిన ఉగ్రవాదం పాకిస్తాన్నే కాటేస్తూ మారణహోమం సృష్టిస్తున్నప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం అంతర్జాతీయంగా ఇండియాను బదనాం చేయడంలోనూ, ఇండియాకు తలవంపులు తేవడంలోనూ పాకిస్తాన్ విజయం సాధిస్తూనే ఉన్నది. ఈ పరిస్థిని మార్చివేయాలనే నిర్ణయం నరేంద్రమోదీ తీసుకున్నట్ల యితే భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన, సకారాత్మకమైన మార్పు రావలసి ఉన్నది. సంజాయిషీ చెప్పుకునే దుస్థితి నుంచి పాకిస్తాన్‌ని అంతర్జాతీయ సమాజం ఎదుట దోషిగా నిలబెట్టే స్థితికి ఎదగాలి. అంతర్జా తీయ వ్యవహారాల ప్రవీణులు కొందరు ప్రతిపాదిస్తున్న విదేశీ విధానంలో దూకుడు సిద్ధాంతాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తే అమెరికాకు ఇండియా మరింత దగ్గరవుతుంది. బహుశా ‘నాటో’ (నార్త్ అంట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో సైతం చేరుతుంది. సరికొత్త వ్యూహం ఈ సిద్ధాంతం ప్రకారం కశ్మీర్ సమస్యను హద్దు మీరకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పెట్టే వ్యూహం అమలు చేయాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ సర్కార్ ఉన్న సమ యంలో విమానం హైజాక్ చేయడం, అఫ్ఘానిస్తాన్‌లోని కాంధహార్కు దారి మళ్ళించడం, వాజపేయి ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్న జస్వంత్ సింహ్ కశ్మీర్ మిలిటెంట్ల అగ్రనాయకులను వెంటబెట్టుకొని కాంధహార్ వెళ్ళి అక్కడ వారిని హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను రక్షించడం వంటి నాటకీయ పరిణామాలు సంభవించాయి. అఫ్ఘానిస్తాన్‌లో మళ్ళీ ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ విశ్వప్రయత్నం చేస్తున్నది. దాన్ని విఫలం చేయడానికి అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం, అమెరికా సైన్యం సర్వశక్తు లనూ వొడ్డుతున్నాయి. భారత్ మొదటి నుంచి అఫ్ఘానిస్తాన్‌కు దూరదూ రంగానే ఉంటూ వచ్చింది. అఫ్ఘాన్ పార్లమెంటు భవనం నిర్మాణానికి చొరవ తీసుకోవడం, అక్కడ ప్రాథమిక సౌకర్యాల నిర్మాణానికి సహకారం అందిం చడం వంటి కార్యక్రమాలు ఇండియా తరఫున ఇటీవలనే ప్రారంభమై నాయి. దూకుడు సిద్ధాంతం ప్రకారం అఫ్ఘానిస్తాన్‌కు ఇండియా మరింత సన్నిహితం కావాలి. అఫ్ఘానిస్తాన్ సైనికులను ఇండియా తీసుకొని వచ్చి శిక్షణ ఇవ్వాలి. విస్తారమైన శిక్షణ వసతులు ఇండియాలో ఉన్నాయి. అఫ్ఘాన్ సైన్యానికి తర్ఫీదు ఇచ్చి, వారికి అవసరమైన ఆధునికమైన ఆయుధాలు సమకూర్చగలిగితే వారు తాలిబాన్‌ను నిరోధించగలరు. సరిహద్దులను రక్షించుకోగలరు. అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రాబల్యం మళ్ళీ పెరగకుండా చేయడం ఇండియాకు చాలా అవసరం. పీవోకేలో కశ్మీరీలు సంతోషంగా లేరు. అక్కడా ఆజాదీ కోసం ఉద్యమం జరుగుతోంది. ఇటీవల పాక్ ప్రభుత్వం 500 మంది కశ్మీరీలను అరెస్టు చేసింది. పీవోకేలో పీడననూ, దౌర్జన్యాన్నీ భరించలేక వలస వెళ్ళిన కశ్మీరీలు అనేక దేశాలలో తలదాచుకున్నారు. వారి వివరాలు తెలుసుకొని వారిని సమీకరించాలి. పీవోకేలో అమానవీయ పరిస్థితులపైన వారి చేత ప్రపంచ దేశాలకు చెప్పించే ప్రయత్నం భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చేయవలసి ఉంటుంది. జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని ఇకమీదట నాలుగు భాగాలు-జమ్మూ, కశ్మీర్ లోయ, లద్ధాఖ్, పీవోకే-గా పరిగణించాలి. భవిష్యత్తులో అంతర్జా తీయ వేదికలపైన వాదనలన్నీ ఈ ప్రాతిపదికపైనే జరగాలి. బలూచిస్తాన్‌పై ఉక్కుపాదం బలూచిస్తాన్‌లో ఇప్పటికే భారత గూఢచారి సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) అసమ్మతి రాజేసిందని పాకిస్తాన్ అభియోగం. కశ్మీర్లో అల్లర్లు జరిగినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను నిందించిన విధంగానే బలూచిస్తాన్‌లో అశాంతికి ‘రా’ ను ఆడిపోసుకోవడం పాకిస్తాన్‌కు అలవాటు. ఉదాహరణకు వారం రోజుల కిందట (సోమవారం) క్వెట్టాలో ఉగ్రవాదుల దాడిలో 72 మంది అమాయకులు దుర్మరణం పాలైనారు. ఈ దాడి తమ పనేనంటూ ఇస్లామిక్ స్టేట్, పాకిస్తాన్ తాలిబాన్ చీలిక వర్గమైన జమాత్-ఉల్-అహ్రార్ ప్రకటించాయి. అయినప్పటికీ, ఇది ‘రా’ జరిపించిన రాక్షస క్రీడేనంటూ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సనావుల్లా జెహ్రీ ఆరోపించారు. బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త, మహిళా నాయకురాలు నాయిలా ఖాద్రీ బటూచ్ ఇటీవల ఢిల్లీ సంద ర్శించినప్పుడు తన రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో వెల్లడించారు. పదిహేను సంవత్సరాలుగా బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారని చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనలకు లెక్క లేదనీ, ఇప్పటి వరకూ 25 వేలమంది పురుషులూ, మహిళలూ, చిన్నారులూ అదృశ్యమైనారనీ, బలూచిస్తాన్‌లో గుర్తు తెలియని వందలమందిని ఖననం చేసిన సామూహిక సమాధులు అనేకం ఉన్నాయనీ ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ సైనికులు బలూచీలపైన విచక్షణారహితంగా కాల్పులు జరుపు తున్నారనీ, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారనీ ఆమె ఆగ్రహం వెలిబు చ్చారు. కశ్మీర్ విషయంలో ఇండియాపైన పాకిస్తాన్ చాలా సంవత్సరాలు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నదో అంతకంటే తీవ్రమైన ఆరోపణలనే బలూచీ హక్కుల నాయకురాలు పాకిస్తాన్‌పైన చేశారు. మోదీ సర్కార్ బలూచిస్తాన్‌కు నైతికంగా అండదండలు సమకూర్చాలని నయీలా ఖాద్రీ బలూచ్ విజ్ఞప్తి చేశారు. దూకుడు సిద్ధాంతం ప్రకారం కశ్మీర్లో భారత వ్యతిరేక ధోరణులను పాకిస్తాన్ బలపరచినట్టే బలూచిస్తాన్‌లో తిరుగుబాటు విజయానికి ఇండియా బాటలు వేయాలి. ఆ విధంగా పాకిస్తాన్‌కు కశ్మీర్ వైపు కన్నెత్తి చూసే తీరిక లేకుండా, శక్తి లేకుండా బలూచీ ఊబిలోకి నెట్టాలి. దూకుడు సిద్ధాంతం అమలు చేస్తే భారత్‌కు మేలు జరుగుతుందో, కీడు జరుగుతుందో చెప్పడం కష్టం. పాకిస్తాన్ ఉగ్రవాదం ఉచ్చులో పడి గిలగిల లాడుతూ, బలూచీ తిరుగుబాటుతో యాతనపడుతూ, పీవోకే ఆజాదీ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సైన్యాన్ని రంగంలో దింపి అణచివేతకు ప్రయత్నిస్తే హక్కులను కాలరాసినందుకు అభిశంసన తప్పదు. అంతర్జాతీ యంగా ఇప్పుడున్న కొద్దిపాటి పరువుప్రతిష్ఠలు సైతం మంటగలసి పోతాయి. దక్షిణాసియాలో తనకు అనుకూలమైన వాతావరణం సృష్టించు కునేందుకు పథకం అమలు చేస్తున్న చైనా పని కుదేలు అవుతుంది. ఇదే విధంగా జరిగితే దూకుడు సిద్ధాంతం సత్ఫలితాలు ఇచ్చినట్టే. మరో విధంగా జరిగితే? పాకిస్తాన్‌తో మరో యుద్ధం రావచ్చు. పాకిస్తాన్‌కు చైనా అండగా నిలవవచ్చు. భారత్‌కు తోడుగా అమెరికా చేరవచ్చు. అది పరస్పర హననోద్యోగానికి దారితీయవచ్చు. అణుయుద్ధం సంభవించి దక్షిణాసియా యావత్తూ శ్మశానం కావచ్చు. అందుకే దూకుడు సిద్ధాంతం అమలు చేయడం ప్రమాదపుటంచుల్లో భయానకమైన విన్యాసం. ఆచితూచి అడుగులేయకపోతే అధఃపతనమే. ఇంతటి సాహసం మోదీ చేస్తారా? వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
గుజరాత్ గుబులు
త్రికాలమ్ రుపానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగలదా? సంవత్సర కాలంలో రుపానీ మోదీ వలె బలమైన నాయకుడుగా ఎదుగుతారా? నితిన్‌కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలంటూ హార్థిక్ పటేల్ సవాలు విసిరారు. గుజరాత్ జనాభాలో 15 శాతం ఉన్న పటేళ్ళు బీజేపీని క్షమించి తిరిగి ఆ పార్టీకి సుముఖులు కావడంపైనే 2017 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కొంతకాలంగా ఓబీసీ ఏక్తా మంచ్ వేదికపైన వెనుకబడిన కులాల వారు సంఘటితం అవుతున్నారు. మోదీ వంటి బలమైన నాయకుడు లేడు. పార్టీ నేతల మధ్య కలహాలు ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో సహజంగా ఉండే విముఖత ఉన్నది. రుపానీ ఆరెస్సెస్ నేపథ్యం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి. దళితులపై దాడి ని ఆయన శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై ఏడు మాసాలు దాటిన తర్వాత నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అడుగుపెడుతున్నారు. దేశంలోని ముఖ్యమైన నగరాలలో హైదరాబాద్ ఒకటి. సాధారణంగా ఏ ప్రధానికీ హైదరాబాద్ సందర్శనకు ఇంత వ్యవధి పట్టదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఢిల్లీ నుంచి అస్సాం వరకూ అనేక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు రావడం, ఆయన విదేశీ పర్యటనలతో నిర్విరామంగా ఉండటంతో కొత్త రాష్ట్రాన్ని పలకరించడానికి ఇంతకాలం పట్టింది. మోదీ పర్యటన తెలంగాణ ప్రగతి యాత్రలో మైలురాయి. ఆయన గజ్వేల్‌లో మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు అక్కడి నుంచే ఆదిలాబాద్‌లోని జైపూర్‌లో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రిమోట్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింగరేణి థర్మల్ కేంద్రంలో మొదటి దశకు శంకుస్థాపన చేస్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రామగుండంలో నిర్మించే ఈ కేంద్రం 2020లో ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రంలో ఎన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తయినా విద్యుచ్ఛక్తి కొరత ఉండదు. ఈ సంద ర్భంగా తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్నది. అమెరికా అధ్యక్షుడి తరహాలో శనివారంనాడు ఢిల్లీలో టౌన్‌హాల్ సమావేశంలో ప్రసంగించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నరేంద్రమోదీ ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన రాజనీతిజ్ఞుడిలాగా కనిపిస్తున్నారు. అంత మాత్రాన అయన పని నల్లేరు మీద బండిలాగా ఉందని అనుకోవడం పొరబాటు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే ఎన్నికల గురించీ, ఆ తర్వాత గుజరాత్ ఎన్నికల గురించీ ఆయన నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. మోదీ రాజకీయ భవిష్యత్తు యావత్తూ గుజరాత్ ఎన్నికల ఫలితాలపైన ఆధారపడి ఉంటుం దంటే అతిశయోక్తి కాదు. అందుకే గుజరాత్లో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు అగ్ర తర ప్రాధాన్యం. ఆచితూచి నిర్ణయం తీసుకోవడం. గుజరాత్ గోదా తమది భిన్నమైన పార్టీ అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ఎంపిక ఫక్తు కాంగ్రెస్ పంథాలోనే జరిగాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్ షానూ, ఇద్దరు పరిశీలకులనూ (నితిన్ గడ్కరీ, సరోజ్ పాండే) మోదీ అహమ్మ దాబాద్ పంపించారు. శాసనసభ్యులతో రెండు రోజులు మాట్లాడి, రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అనందీబెన్తో వాదులాడి విజయ్ రుపానీని ముఖ్య మంత్రిగా నిర్ణయించారు. అనందీ మద్దతు ఇచ్చిన నితిన్పటేల్ను ఉపముఖ్య మంత్రిగా ప్రకటించారు. శాసనసభ్యులకు తమ నాయకుడిని బ్యాలట్ ద్వారా ఎన్నుకునే స్వేచ్ఛ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వనట్టే బీజేపీ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాలు కూల్చడంలో కూడా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించినట్టే బీజేపీ నాయకులు సైతం కత్తులు దూశారు. 1995లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి మొదటిసారి బీజేపీని అధికారంలోకి తెచ్చిన కేశూభాయ్పటేల్ను ఆరు మాసాలు తిరగకుండానే గద్దె దింపడంలో శంకర్‌సింహ్ వాఘేలా పాత్రధారి అయితే సూత్రధారి నేటి ప్రధాని, నాటి గుజరాత్ బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ. కేశూభాయ్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చొబెట్టిన సురేశ్ మెహతా ఏడాది కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేశూభాయ్‌కి అప కారం చేసిన వాఘేలా రెండేళ్ళలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మోదీ గుజ రాత్లో ఉండటం ముఖ్యమంత్రికి క్షేమదాయకం కాదని పార్టీ అధిష్ఠానం ఆయ నను ఢిల్లీకి బదిలీ చేసింది. ఢిల్లీలో ఉన్నప్పటికీ మోదీ మనసంతా గుజరాత్‌పైనే. సురేశ్ మెహతా రాజీనామా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అనివార్యమైనాయి. 1998లో జరిగిన ఎన్నికలలో కేశూభాయ్ పటేల్ విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లోగడ తన పదవీచ్యుతికి కారకులైన సంఘపరి వారంపైన కేశూభాయ్ ప్రతీకార ధోరణి ప్రదర్శించారు. దాంతో ఆరెస్సెస్ మోదీని భుజాన ఎక్కించుకున్నది. రెండేళ్ళు గడిచే సరికి కేశూభాయ్‌కి శాసన సభ్యులపైనా, ప్రభుత్వంపైనా పట్టు తప్పింది. మాధవ్‌పురా మర్కెంటైల్ కోఆప రేటివ్ బ్యాంక్ కుంభకోణంతోనూ, సబర్‌కాంతా లోక్‌సభ స్థానానికీ, సబర్మతీ శాసనసభ స్థానానికీ జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ ఓటమితోనూ కేశూభాయ్ పటేల్ నాయకత్వంపైన బీజేపీ అధినేతలకు విశ్వాసం సన్నగిల్లింది. మోదీ 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. అంతవరకూ ఆయనకు చట్టసభలలో సభ్యత్వం లేదు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. పట్టుదల, వ్యూహరచనా కౌశలం, చాణక్యం, యుద్ధతంత్రం మాత్రం తెలుసు. రాజ్‌కోట్ శాసనసభ్యుడు వజాభాయ్వాలా సభ్యత్వం త్యాగం చేయడం వల్ల జరిగిన ఉప ఎన్నికలో మోదీ గెలుపొందారు. 1998లో వజాభాయ్వాలాకు వచ్చిన మెజారిటీ కంటే మోదీకి తక్కువే వచ్చింది. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయింది. అదే సమయంలో గోధ్రా ఘటన సంభవించింది. అనంతరం అల్లర్లు. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పనక్కరలేదు. హిందూ, ముస్లిం విభజన ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ పరిస్థితిని మోదీ అనితర సాధ్య మైన రీతిలో వినియోగించుకొని 12 సంవత్సరాలు తిరుగులేకుండా గుజరాత్‌ను పరిపాలించారు. ప్రగతి సాధించారు. ఆర్థికాభివృద్ధి రేటు రికార్డు స్థాయిలో గుజరాత్ నమోదు చేసింది. అదే గుజరాత్ నమూనా అభివృద్ధిగా సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రచార లో ప్రధానాస్త్రంగా పని చేసింది. ఆరోపణల పరంపర కేశూభాయ్ హయాంలో ఆయన అల్లుడు మయూర్ పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తితే ఆనందీ హయాంలో కూతురు అనార్, కొడుకు సంజ య్ల హవా నడిచిందనే మాట సర్వత్రా వినిపించింది. అవినీతి పెచ్చరిల్లింది. అధికార పక్షానికి ఉండే అవలక్షణాలన్నీ కాంగ్రెస్‌కు ఉన్నట్టే బీజేపీకీ సంక్ర మించాయి. కేశూభాయ్‌కి మోదీ వల్ల కష్టాలు ఎదురైతే అనందీకి అమిత్‌షా వల్ల సమస్యలు దాపురించాయి. తనను అప్రతిష్ఠపాలు చేయడానికే పతీదార్ల ఉద్య మాన్ని కొందరు ప్రోత్సహించారంటూ ఆనందీ ఆక్రోశం వెలిబుచ్చినప్పుడు ‘దానితో నాకు సంబంధం లేదు. కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను’ అంటూ అమిత్‌షా ఘాటుగా సమాధానం చెప్పినట్టు భోగట్టా. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా తట్టుకోవచ్చును కానీ మరి 16 మాసాలలో జరగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైతే దాని ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలపైన పడితీరుతుంది. ఎన్డీఏ కూటమి కూలిపోయి కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మోదీకీ, షాకీ అనేక సమస్యలు. ఇష్రాన్ జహాన్ ఎన్కౌంటర్ కేసుతో సహా మరెన్నో కేసులను తిరగదోడే ప్రమాదం ఉంది. మోదీ బదనాం అయితే బీజేపీకి మళ్ళీ అంతటి బలమైన, జనాకర్షణ కలిగిన, సమర్థుడైన నాయకుడు దొరకడు. ఎదురుగాలి అందుకే గుజరాత్లో గెలుపు మోదీకీ, బీజేపీకీ అత్యవసరం. 2014లో ఉన్నటువంటి సానుకూల వాతావరణం ఇప్పుడు లేదు. ఆనందీ పాలనలో అపారమైన నష్టం సంభవించింది. బీజేపీకి గట్టి మద్దతుదారులైన పతీ దార్లు(పటేళ్ళు)బద్ధ శత్రువులుగా మారిపోయారు. హార్థిక్‌పటేల్ అనే 22 ఏళ్ళ యువకుడి నాయకత్వంలో రిజర్వేషన్లు కోరుతూ జరిగిన ఆందోళనను అరికట్టడంలో ఆనందీ విఫలమైనారు. రాజీ లేని ధోరణిలో కఠినంగా వ్యవ హరించి హార్థిక్‌ను నెలల తరబడి జైలులో నిర్బంధించారు. గోరక్షణ పేరుతో కొందరు హిందూత్వవాదులు ఉనాలో దళితులపై పాశవికంగా దాడి చేయడంతో ఆ వర్గం బీజేపీకి పూర్తిగా దూరమైపోయింది. దళితులపై దాడికి ముందే మే 16న ఆనందీని ఢిల్లీకి పిలిపించుకొని పదవి నుంచి తప్పుకోవలసిందిగా మోదీ చెప్పారు. కొన్ని మాసాలలో 75వ ఏట అడుగుపెట్టే సమయంలో రాజీనామా సమర్పిస్తానని ఆమె అన్నారు. కానీ దళితులపైన దాడి జరిగిన తర్వాత వెంటనే చర్య తీసుకోవలసి వచ్చింది. దళితులు గుజరాత్ జనాభాలో తొమ్మిది శాతం మంది మాత్రమే కావచ్చు. వారు కాంగ్రెస్ ఓటర్లే కావచ్చు. కానీ దళితులపైన దాడి చేసినప్పుడు ప్రధానిగా తాను ఉపేక్షిస్తే దళిత జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో, పంజాబ్‌లో దాని ప్రభావం ఉంటుంది. అందుకని వెంటనే రాజీనామా చేయవలసిందిగా ఆనందీకి కబురు పెట్టారు. అరవై ఏళ్ళ విజయ్ రుపానీ జైన్బనియా. వ్యాపారం ప్రధానమైన కులం. మృదుభాషి. కేశూభాయ్తోనూ, నరేంద్రభాయ్తోనూ, అమిత్‌షాతోనూ, ఆనం దీతోనూ సత్సంబంధాలు నెరపిన వివాదరహితుడు. నితిన్ పటేల్ చివరి నిమిషం వరకూ పదవి తనదేనన్న ధీమాతో ఉన్నారు. మిత్రులు చెప్పిన అభినం దనలను స్వీకరించారు. మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. చివరికి అమిత్‌షా రుపానీవైపు మొగ్గడం గమనించి నిరసనగా సమావేశం నుంచి నిష్ర్క మించాలని ప్రయత్నించారు. షా ఆపుచేసి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పిం చారు. పతీదార్ల ఉద్యమానికి నితీన్ సహకారం ఉన్నదని మోదీ, షాల అను మానం. నితిన్ ముందే మిఠాయి పంచితే రుపానీ ఇందుకు భిన్నం. తనకు ముఖ్యమంత్రి పదవి పట్ల మోజు లేదనీ, తనను ఎంపిక చేయకపోవచ్చుననీ మీడియాకు చెప్పారు. మోదీకీ, షాకీ ఆమోదయోగ్యుడు కావడం, పటేల్ సామాజికవర్గంతో చర్చలు జరిపి వారి హృదయాలను గెలుచుకోవాలన్న సకారాత్మక వైఖరి కలిగి ఉండటం రుపానీకి కలసివచ్చిన అంశాలు. ఆనందీ బదులు రుపానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగలదా? సంవత్సర కాలంలో రుపానీ మోదీ వలె బలమైన నాయకుడుగా ఎదుగుతారా? నితిన్‌కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలంటూ హార్థిక్ పటేల్ సవాలు విసిరారు. గుజరాత్ జనాభాలో 15 శాతం ఉన్న పటేళ్ళు బీజేపీని క్షమించి తిరిగి ఆ పార్టీకి సుముఖులు కావడంపైనే 2017 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కొంతకాలంగా ఓబీసీ ఏక్తా మంచ్ వేదికపైన వెనుకబడిన కులాల వారు సంఘటితం అవుతున్నారు. మోదీ వంటి బలమైన నాయకుడు లేడు. పార్టీ నేతల మధ్య కలహాలు ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో సహజంగా ఉండే విముఖత ఉన్నది. రుపానీ ఆరెస్సెస్ నేపథ్యం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి. దళితులపై దాడిని ఆయన శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించారు. ఆయన సౌరాష్ట్రకు చెందిన నాయ కుడు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. ఉనా సౌరాష్ట్రలోనే ఉన్నది. రుపానీ ఇంత వరకూ దళితులపైన దాడి జరిగిన గ్రామాన్ని సందర్శించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించలేదు. దళితులను సుముఖం చేసుకోవడానికి ఆరెస్సెస్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ రూపానీ వ్యవహార శైలి అందుకు భిన్నంగా కనపడుతోంది. మోదీకి ఉన్న చొరవ రుపానీకి లేదు. మోదీలాగా ఉదారంగా, సృజనాత్మకంగా వ్యవహరించలేరు. ఈ పరిమితులు ఆయన రాజకీయాలను శాసిస్తాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ గెలిచి వరుసగా నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అద్భుతమే. (వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ) -
ఎందుకీ అంతులేని సహనం?
త్రికాలమ్ రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగు తున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేక పోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానించినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో శుక్రవారం చేసిన ప్రసంగం తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందని భావించడం సహజం. ఇంతకంటే మిత్రద్రోహం మరొకటి ఉంటుందా అని అదేరోజు రాత్రి మీడియా గోష్ఠిలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమితమైన ఆవేదన వెలిబుచ్చారు కానీ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం లేదు. అవ మానం జరిగినా, వాగ్దానభంగం జరిగినా ఎందుకింత సహనం పాటిస్తున్నది? ‘ఒక రాజకీయ నాయకుడు స్వార్థచింతన లేకుండా కృషి చేస్తే ఏదైనా సాధిం చవచ్చునని వెంకయ్యనాయుడు నిరూపించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడానికి కారకుడుగా ఏ ఒక్క వ్యక్తి పేరు అయినా చెప్పవచ్చుననుకుంటే ఆ వ్యక్తి మీ జిల్లాలోనే పుట్టిన వెంకయ్యనాయుడు...’- ఎన్నికల ముందు నెల్లూ రులో జరిగిన సభలో నరేంద్రమోదీ హిందీలో చేసిన ప్రసంగానికి వెంకయ్యనా యుడు స్వయంగా తెలుగులోకి చేసిన అనువాదం ఇది. వేదికపైన కూర్చున్న చంద్రబాబునాయుడు రుమాలుతో ముఖం తుడుచుకుంటూ నాటి దృశ్యంలో కనిపించారు. తిరుపతి నుంచి విశాఖపట్టణం వరకూ మోదీ ప్రసంగించిన నాలుగు ఎన్నికల సభలలో ఇదే వరుస. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా అంతకు మించి చేస్తామంటూ వాగ్దానం. అరుణ్‌జైట్లీ స్పష్టీకరణ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపైన జరిగిన లఘు చర్చకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమా ధానం చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉన్న ఆర్థిక సమస్యలను ఏకరవు పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 42 శాతం (ఇదివరకు 32 శాతమే ఉండేది) రాష్ట్రాలకే దక్కాలంటూ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును ఆమోదించిన ఫలితంగా కేంద్రం దగ్గర నిధులు పెద్దగా మిగలవనీ, మిగిలిన నిధులతోనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు జరగాలనీ, రక్షణ అవసరాలూ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతనాతాలూ, ఇతర ఖర్చులు సకలం ఆ నిధులతోనే నిర్వహించాలనీ చెప్పుకొచ్చారు. పైగా ఈ సంవత్సరం కేంద్రం 3.9 శాతం ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నదని అన్నారు. అరుణ్‌జైట్లీ తేల్చిందేమంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు చేయడం సాధ్యం కాదని. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడూ, అరుణ్‌జైట్లీ పట్టుబడితే అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదాకు అంగీకరించారు. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదిస్తే, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. మార్చి ఒకటిన రాజపత్రం విడుదలయింది. మార్చి 2న కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదాను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. జూన్ 2న అధికారి కంగా రాష్ట్ర విభజన అమలు జరిగింది. ఎన్నికల సభలలో వెంకయ్య నాయుడు పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉండాలంటే, పదిహేనేళ్ళు ఉంటేనే ప్రయోజనం అంటూ చంద్రబాబునాయుడు వాదించారు. ఎన్నికలు జరిగాయి. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. మోదీ ప్రభంజనం సహకా రంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో గెలుపొందింది. మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసి ఇరవై ఆరు మాసాలు గడిచాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ మంత్రిమండలిలో వెంకయ్యనాయుడు ముఖ్యమైన మంత్రి. మోదీ తర్వాత స్థానం అరుణ్జైట్లీదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునా యుడు ఉన్నారు. రాజ్యసభలో రాబట్టుకున్న, ఎన్నికల సభలలో అదేపనిగా ప్రచారం చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి అభ్యంతరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారం హస్తగతం చేసుకొని రెండు సంవత్స రాలు దాటిన తర్వాత సైతం హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయక పోగా కాంగ్రెస్‌ను నిందించడంలో అర్థం ఉన్నదా? టీడీపీ ఏమి చేసింది? అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని దుయ్యపడుతూ ఇంకా ఎంత కాలం టీడీపీ, బీజేపీలు పబ్బం గడుపుకుంటాయి. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ కొన్ని సూచనలు చేసింది, కొన్ని హామీలు కావాలంటూ పట్టుపట్టింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీటీపీ ఏమి చేసింది? ‘దమ్ముంటే విభజన బిల్లు పెట్టండి. మేం సహకరిస్తాం’ అని పదే పదే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సవాలు విసరడమే కానీ బిల్లును ప్రతిపాదించిన తర్వాత సవరణలు ఏమైనా టీడీపీ ప్రతిపాదించిందా? అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను తొమ్మిది సంవత్స రాలు పరిపాలించిన విశేషానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర విభ జన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటో తెలుసు. వాటి పరిష్కారానికి బిల్లు లలో ఏయే అంశాలు పొందుపరచాలో తెలుసు. సోనియాగాందీతోనో, మన్మో హన్సింగ్తోనో, బిల్లును రూపొందించిన జైరాం రమేశ్తోనో చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ ప్రతినిధి బృందం కూర్చొని సమాలోచనలు జరిపి ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది. టీడీపీ సలహాలను తిరస్కరిస్తే నేరం కాంగ్రెస్‌ది అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేసిన ప్పుడు విభజనకు తన లేఖే కారణమంటూ చెప్పుకున్న చంద్రబాబునాయుడు తనకు బొత్తిగా ఇష్టం లేకుండానే విభజన జరిగినట్టూ, అది అడ్డగోలుగా జరిగి నట్టూ ప్రచారం చేయడంలో మర్మం ఏమిటి? విభజన చంద్రబాబునాయుడు అంగీకారంతోనే జరిగింది. విభజన బిల్లులో బీజేపీ ప్రతిపాదించిన కొన్ని సవరణలను మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. బిల్లులో లేని ప్రత్యేక హోదాపైన కూడా మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. సవరణలు సూచించకుండా, సలహాలు ఇవ్వకుండా బిల్లుపైన చర్చ జరగడానికి సహకరించకుండా రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంటూ నిందించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. నరేంద్రమోదీ స్వతంత్ర ప్రధాని. వాజపేయి లాగా సంకీర్ణధర్మం పాటించ వలసిన అవసరం మోదీకి లేదు. బీజేపీకి సొంతంగా లోక్‌సభలో మెజారిటీ ఉన్నది. అందుకే చంద్రబాబునాయుడు ఇదివరకు ఢిల్లీలో చక్రం తిప్పినట్టు ఇప్పుడు తిప్పలేక తిప్పలు పడుతున్నారు. శాసనసభ స్థానాలు పెంచుతారనే ఆశ చూపించి ప్రతిపక్షం నుంచి శాసనసభ్యులను ఆకర్షించారు. తీరా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చిచెప్పడం చంద్రబాబునాయుడికి మోదీ హయాంలో తగిలిన రెండో ఎదురుదెబ్బ. పైకి ఏమి చెప్పినా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోదనే సంకేతం చంద్రబాబునాయుడికి చాలా కాలం కిందటే అందింది. ఆయన వ్యూహాత్మకంగా అరుణ్‌జైట్లీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. అందుకే ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ, దాని వల్ల అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయను కోవడం పొరబాటంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రసంగించిన తీరు తనకు బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఖేదం వెలిబుచ్చారు. సభలో గట్టిగా మాట్లాడనందుకు టీడీపీ సభ్యులను ఆయన గట్టిగా మందలించినట్టు కూడా కొన్ని పత్రికలలో వచ్చింది. రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగుతున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేకపోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానిం చినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు. అసెంబ్లీ స్థానాలు పెంచడం లేదని స్పష్టం చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపిస్తారు. ఈ చర్యలన్నీ అమిత్ర వైఖరినే సూచి స్తున్నాయి కదా! ప్రధానమంత్రి వైఖరి అట్లా ఉంటే, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయ కులు టీడీపీ పరిష్వంగంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తున్నారు. సఖ్యతే సంజీవని కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయో జనం ఏమీలేదు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కొంత వెసులుబాటు ఉండే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తే అనేక రకాల చిరాకులు, చిక్కులు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఈసారి వ్యవహరి స్తున్న తీరు ఇదివరకటి కంటే భిన్నం. వేల ఎకరాల భూమి సేకరించడం, సింగ పూర్ ప్రభుత్వంతో, అక్కడి ప్రైవేటు కంపెనీలతో నేరుగా లావాదేవీలు పెట్టుకో వడం వంటి అంశాలపై ఎవరు కోర్టులో పిటిషన్ వేసినా, కోర్టు విచారణ జరిపి సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ నిర్ణయించినా ఇబ్బందే. నరేంద్రమోదీ రాజకీయ ప్రత్యర్థులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించినవారు ఆయ నతో సున్నం వేసుకునే సాహసం చేయరు. ఎవరు ఏమి చెప్పినా సీబీఐ స్వతం త్రంగా వ్యవహరించే మాట కల్ల. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో బలమైన ఆయుధం. సోనియా అయినా మోదీ అయినా తేడా లేదు. పైగా ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగితే ఆ స్థానం భర్తీ చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. టీడీపీ అధినేతను భ్రష్టుపట్టించాలనుకుంటే ఓటుకు నోటు వ్యవహారం ఒక్కటే చాలు. రాజ్యసభ తాజా ఉదంతం వల్ల ప్రజలకు తెలిసి వచ్చింది ఏమిటంటే బీజేపీ, టీడీపీలు మరి కొంతకాలం కలసి కాపురం చేస్తాయి. కనీసం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే వరకూ చంద్రబాబునాయుడు ఓపికపడతారు. ఢిల్లీ, బిహార్‌లో లాగా యూపీలో కూడా బీజేపీ బోర్లపడితే టీడీపీ ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే బిహార్, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాలు అడుగుతాయని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన నరేంద్రమోదీకి తెలియదా? రాజ్యసభలో మన్మోహన్సింగ్ చేత వాగ్దానం చేయించిన వెంకయ్య నాయుడికీ, అరుణ్జైట్లీకీ తెలియదా? వారిద్దరూ లోగడ కేంద్రమంత్రులుగా పనిచేసిన జాతీయస్థాయి నాయకులు. అందరికీ తెలుసు. అమలు చేయడం అసాధ్యమని తెలిసి కూడా బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు పాతర వేయడం ఆనవాయితీగా మారితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. ఆర్థిక ప్రవీణులతో ఒక సంఘాన్ని ఎన్నికల కమిషన్ నియమించాలి. అన్ని రాజకీయ పార్టీలూ తమ ఎన్నికల ప్రణాళిలలో చేసిన వాగ్దానాల సాధ్యా సాధ్యాలను ఆ సంఘం పరిశీలించాలి. సాధ్యమని భావించిన వాగ్దానాలనే ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి. సాధ్యం కావనుకున్న వాగ్దానాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయకుండా రాజకీయ పార్టీలనూ, నాయకులనూ ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి. ఈ సంస్కరణ తక్షణం జరగకపోతే ప్రజాస్వామ్యానికి పూచీ ఉండదు. ( వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్) -
ముగ్గురు కలల బేహారులే
-
కుటిల రాజకీయాలు మాను కోవాలి
-
ఇన్ని విన్యాసాలు అవసరమా?
త్రికాలమ్ అసాధారణమైన రాజధాని నగరం నిర్మించే పేరుతో ముఖ్యమంత్రి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పారదర్శకత లోపించడంతో సాధా రణ ప్రజలలో సైతం అనేక అనుమానాలు బలపడుతున్నాయి. సుప్రీం కోర్టూ, కేల్కర్ కమిటీ, వోహ్రా కమిటీలు చేసిన హెచ్చరికలు దడ పుట్టిస్తున్నాయి. రెండేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే, ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ విషయంలో ప్రజలను ఒప్పించిన తర్వాతనే అడుగు ముందుకు వేయాలి. లేకపోతే ఏకపక్షం అవుతుంది. అప్రజాస్వామికం అవుతుంది. చైనా పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆ దేశంలో జరిగిన అద్భుత ప్రగతి గురించి ప్రశంసాత్మకంగా వివరించారు. అరవై అంతస్తుల భవనాన్ని నెలరోజులలో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞానం చైనా సొంతమని వెల్లడించారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్ఎస్జీ)లో చేరడానికి ఇండియా చేసిన ప్రయత్నానికి చైనా మోకాలడ్డిన తర్వాత ఆ దేశాన్ని ముఖ్యమంత్రి స్తుతించడం విశేషం. అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధాని నగరంగా అమరావతిని నిర్మించాలన్న ఆకాంక్షతో, ఇంద్రుడి తలదన్నాలనే ఉబలాటంతో చేసే ఏకపక్ష నిర్ణయాల వల్లా, సింగపూర్ కన్సార్టియం పెట్టే షరతులన్నిటినీ ఒప్పుకోవడం వల్లా ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తపడాలి. చైనా వెళ్ళడానికి ముందు చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణంలో ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ని అమలు చేయడానికి మంత్రివర్గం ఆమో దించిందని చెప్పారు. 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సీడ్ కేపిటల్‌ను నిర్మించే నిమిత్తం 1,691 ఎకరాలను అభివృద్ధి చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వబోతున్నట్టు కూడా తెలిపారు. అద్భుతమైన శిఖరం (ఐకా నిక్ టవర్) నిర్మాణానికి 50 ఎకరాలు ఇచ్చారు. మరి 200 ఎకరాలు కన్సా ర్టియంకు అమ్మివేశారు. తక్కిన విస్తీర్ణంలో పరిశ్రమలూ, వాణిజ్య సము దాయాలూ ఏర్పాటు చేయడానికి వీలుగా భూమిని అభివృద్ధి చేస్తారు. భూమి అమ్మగా వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని కన్సా ర్టియం, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కంపెనీ (సీసీడీఎంసీ)లు 58:42 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఇదంతా స్విస్ చాలెంజ్ మెథడ్ (ఎస్సీఎం) కింద ఇచ్చే కాంట్రాక్టు ప్రకారం జరుగుతుంది. ‘స్విస్ చాలెంజ్’ అంటే? పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ (పీపీపీ) విధానం కింద ఒకానొక ప్రాజెక్టునూ, పెట్టుబడిపెట్టే ప్రైవేటు భాగస్వామినీ ఎంచుకునేందుకు కొత్తగా అమలులోకి వచ్చిన పద్ధతి ‘స్విస్ చాలెంజ్’. ఈ పద్ధతి వల్ల పనులు సకాలంలో జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉండదు. సృజనాత్మకంగా పని త్వరితగతిన, సమర్థంగా పూర్తి చేసిన ప్రైవేటు భాగస్వామికి ప్రోత్సాహకం ఇచ్చే వీలు ఈ పద్ధతి కల్పిస్తుంది. మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత ప్రైవేటు భాగస్వామిది. అందుకు అవసరమైన భూమినీ, ఇతర ప్రాథమిక సౌకర్యాలనూ అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఒక ప్రైవేట్ డెవలపర్ ఏదైనా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఫలానా విధంగా దాన్ని నిర్మిస్తానని ప్రతిపాదించవచ్చు. ఇటువంటి ప్రతిపాదనను అన్‌సాలిసిటెడ్ బిడ్ అంటారు. అంటే ప్రభుత్వం అడగకుండానే ప్రైవేటు భాగస్వామిగా పని చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు విస్తృతమైన ప్రచారం ఇచ్చి దానికి పోటీగా ఏ ప్రైవేట్ సంస్థలైనా మెరుగైన ప్రతిపాదనలు సమర్పించవచ్చునని ప్రభుత్వం ప్రకటిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేస్తానని కానీ మెరుగైన పని చేస్తానని కానీ ఏ సంస్థ అయినా ముందుకు రావచ్చు. అదే ఖర్చుతో అంతే వాసిగల పని చేస్తానని అన్‌సాలిసిటెడ్ బిడ్డర్ అంగీకరిస్తే ఆ కాంట్రాక్టు అన్సాలిసిటర్ బిడ్డర్‌కే దక్కుతుంది. ఈ క్రమంలో పాలకులు పక్షపాతంగా వ్యవ హరించే అవకాశం ఉన్నదనీ, ఆశ్రీత పెట్టుబడిదారులు (క్రోనీ కేపిటలిస్టులు) లబ్ధిపొందే వీలున్నదనీ, అవినీతికి ఆస్కారం ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ నిర్ధారించింది. కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి కేల్కర్ నాయకత్వంలోని ఈ కమిటీ నివేదికను 2015 డిసెంబర్లో ప్రభుత్వానికి సమర్పించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ‘స్విస్ చాలెంజ్’లో అక్ర మాలకు ఆస్కారం ఉన్నదనే అభిప్రాయం వెలిబుచ్చింది. పాలకులకూ, కాంట్రా క్టర్లకూ మధ్య అక్రమ సంబంధం హద్దులు మీరిన ఈ రోజుల్లో ఈ పద్ధతిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదనే అభిప్రాయం ప్రబలంగా ఉంది. సహజ వనరులనూ, ప్రభుత్వ నిధులనూ స్వార్థశక్తులు స్వప్రయోజనాలకు వినియోగిం చుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ సైతం ధ్రువీకరించింది. అన్సాలిసిటర్ బిడ్డర్‌ను సవాలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారి అర్హతలను నిర్ణయించే అధికారం ప్రభుత్వ సంస్థలదే. అక్రమాలు జరగకుండా నివారించే న్యాయపరమైన, పటి ష్ఠమైన నియంత్రణ వ్యవస్థ మన దేశంలో ఇంకా ఏర్పడలేదు. మనదేశ ప్రగతి యాత్రలో ఇంతవరకూ పీపీపీ పద్ధతి ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం కలిగిం చిన దృష్టాంతాలే ఎక్కువ. అందుకే భయాలు. అసమానమైన ఒప్పందం రాజధాని ప్రాంతంలో ఇప్పుడున్న ధరల ప్రకారం ఎకరం వెల నాలుగు లేదా అయిదు కోట్ల రూపాయలు. సింగపూర్ కన్సార్టియంకు ఎకరం నాలుగు కోట్ల రూపాయల వంతునే ప్రభుత్వం భూమిని విక్రయించింది. మొత్తం 1,691 ఎకరాలలో సింగపూర్ కన్సార్టియంకు ఇచ్చిన, విక్రయిచిన 250 ఎకరాలు తీసివేస్తే మిగిలేది 1,441 ఎకరాలు. ఎకరం నాలుగు కోట్లు అనుకుంటే 1,441 ఎకరాల విలువ రూ. 5,764 కోట్లు. ఇంత విలువైన భూమి ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, విద్యుచ్ఛక్తి, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేసిన తర్వాత సింగపూర్ కంపెనీలు చేసే వ్యయం లేదా పెట్టే పెట్టుబడి కేవలం రూ. 306 కోట్లు. ప్రాథమిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు పక్కన పెట్టినా, భూమి రూపంలో ప్రభుత్వం పెట్టుబడి రూ. 5,764 కోట్లు, సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ. 306 కోట్లు అయినప్పుడు ఆదాయాన్ని ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు 42:58 నిష్పత్తిలో పంచుకోవడంలో అర్థం ఉన్నదా? ఇది సింగపూర్ కంపెనీలకు పూర్తిగా లాభదాయకమైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా నష్టదా యకమైన ప్రతిపాదన కాదా? పైగా ఎటువంటి షరతులకు ఒప్పుకున్నారు? ఈ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం తప్పుకుంటే మొత్తం ఖర్చుకి 150 శాతం కన్సా ర్టియంకు చెల్లించాలి. విపత్తులు సంభవిస్తే వంద శాతం నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి. ఏమైనా వివాదాలు వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలి. ‘నా నోట్లో నువ్వు వేలు పెట్టు, నీ కంట్లో నేను వేలు పెడతాను’ అన్నట్టు ఉన్న టువంటి షరతులకు తలవొగ్గి సింగపూర్ కన్సార్టియంతో వ్యవహారం చేయడం అవసరమా? ఇంతకీ అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ కంపెనీలతో కూడిన కన్సార్టియం ఏమి చేస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే పని చేస్తుంది. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు వేసి విక్రయించడం. ఈ పనులూ, తర్వాత జరిగే నిర్మాణం పనులు చేసేది స్వదేశీ కాంట్రాక్టర్లే. సింగపూర్ కన్సార్టియంలో ఉన్న కంపెనీలు ఇదివరకు చైనాలో, వియత్నాంలో, ఇండియాలోని కొన్ని రాష్ట్రాలలో పనులు చేసినప్పుడు కూడా ఇదే రకమైన షరతులు విధించాయా? రాబడిలో ఇంత శాతం వాటా పొందాయా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పి ప్రజలనూ, రాజకీయ పక్షాలనూ ఒప్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రశ్నించినవారందరినీ అభివృద్ధి నిరోధకులంటూ, రాజధాని నిర్మాణానికి వ్యతి రేకులంటూ దబాయించి నోరుమూయించే ప్రయత్నం మానుకోవాలి. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ వంటి విజ్ఞులు సంధిస్తున్న లేఖాస్త్రాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ప్రత్యుత్తరాలు రాయాలి. 2001 ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్‌లోని 2(జి) సెక్షన్ ప్రకారం ప్రైవేటు భాగస్వామికి 49 శాతం ఈక్విటీ కంటే ఎక్కువ వాటా ఇవ్వకూడదు. ఏపీ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం ఇవ్వడానికి సిద్ధపడుతోంది. స్విస్ చాలెంజ్ కింద ప్రైవేటు భాగస్వాములతో సమాలోచనలు జరిపి, నిర్ణయాలు తీసుకునే అధికారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకీ, దాని తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ ఉన్నది. కానీ సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ చర్చలు జరపడం లేదు. ఆర్థికశాఖ కార్యదర్శికి ప్రమేయం లేదు. స్వయంగా ముఖ్యమంత్రే సమాలోచనలు జరుపుతున్నారు. ఎందుకీ డొంకతిరుగుడు? ఇప్పటికే సింగపూర్ కన్సార్టియం అన్‌సొలిసిటెడ్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభు త్వానికి సమర్పించింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వు (జీవో) జారీ చేస్తుంది. అన్‌సాలిసిటెడ్ ప్రతిపాదనకు పోటీగా ఎవరైనా బిడ్ చేయ వచ్చునని ప్రకటించి అందుకోసం 45 రోజులు గడువు ఇస్తుంది. రేపు సబ్ కాంట్రాక్టు తీసుకునే కంపెనీల చేత బిడ్ వేయించి, వాటికి నచ్చజెప్పి తిరిగి సింగపూర్ కన్సార్టియంకే కాంట్రాక్టు దక్కేటట్టు చంద్రబాబునాయుడు చక్రం తిప్పుతారని అభిజ్ఞవర్గాలలో నలుగుతున్న మాట. ఇంత చుట్టు ఎందుకు తిప్పు తున్నారు? సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నా మూడో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా చేసేందుకు సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్ర ప్రదేశ్ కంపెనీ అయిన సీసీడీఎంసి (దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షులు) ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇది రెండు వ్యాపార సంస్థల మధ్య ఒప్పందం. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఖరీదైన రాజధాని నగరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. పదిహేను సంవత్సరాల కిందట ఏర్పడిన చత్తీస్‌గఢ్ రాష్ట్రం నయారాయపూర్‌లో రాజధాని నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చింది వేయి కోట్ల రూపాయలే. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చే మొత్తం రూ. 2,500 కోట్లు మాత్రమేనంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ మొత్తం అండర్‌గ్రౌండ్ వైరింగ్‌కు కూడా సరిపోదంటూ చంద్ర బాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లా లకు చెరి రూ. 500 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇక మిగిలింది రూ. 1,500 మాత్రమే. ఇది ఏ మూలకూ చాలదు. అందుకే సింగపూర్ కన్సార్టియంతో కలిసి భూమి అభివృద్ధి వ్యాపారం చేసి, అందులో వచ్చే వేల కోట్ల లాభంతో రాజధాని నిర్మించాలనీ, అందుకు తన తెలివితేటలన్నీ వినియోగించాలన్నది చంద్రబాబునాయుడు వ్యూహం. డబ్బు లేకుండా, కేవలం రైతుల నుంచి సేకరించిన భూమిని (ల్యాండ్‌బ్యాంక్) వినియోగించుకొని అసాధారణమైన రాజధాని నగరం నిర్మించే పేరుతో ముఖ్యమంత్రి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పారదర్శకత లోపించడంలో సాధారణ ప్రజలలో సైతం అనేక అనుమానాలు బలపడుతున్నాయి. సుప్రీంకోర్టూ, కేల్కర్ కమిటీ, వోహ్రా కమిటీలు చేసిన హెచ్చరికలు దడపుట్టిస్తున్నాయి. రెండేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే, ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ విషయంలో ప్రజలను ఒప్పించిన తర్వాతనే అడుగు ముందుకు వేయాలి. లేకపోతే ఏకపక్షం అవుతుంది. అప్రజాస్వామికం అవు తుంది. అడ్డదారి అవుతుంది. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్, కె.రామచంద్రమూర్తి -
'నరసింహుడు' పుస్తకావిష్కరణ
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై సమగ్రమైన పుస్తకం రావడానికి 12 ఏళ్లు పట్టిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో గురువారం సాయంత్రం జరిగిన 'నరసింహుడు' పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ... పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానం, పంజాబ్ లో అశాంతిని అంతం చేసేందుకు ఆయన చేసిన కృషి గురించి ఈ పుస్తకంలో సమగ్రంగా ఉందన్నారు. అణ్వస్త్రాన్ని తయారు చేయడంలో పీవీ పాత్ర గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారని వెల్లడించారు. పీవీ నరసింహారావుపై వినయ్ సీతాపతి ఇంగ్లీషులో రాసిన 'హాఫ్ ఏ లయన్' పుస్తకాన్ని 'నరసింహుడు' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పీవీ తనయుడు రాజేశ్వరరావు, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు, హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. -
'ముఖ్యమంత్రులు ఇలాంటి పనిచేయొచ్చా?'
విజయవాడ: డబ్బుతో అధికారంలోకి రావడం.. అధికారంలోకి వచ్చాక డబ్బు సంపాదించుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. నాయకులు అధికారంలోకి వచ్చేందుకు అలివికాని హామీలు ఇస్తున్నారని చెప్పారు. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను విస్మరిస్తున్నారని ఆయన చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ రాజకీయం దళారీ వ్యవస్థగా మారడం ఆందోళనకరం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని సూచించారు. వెంకయ్యలాంటి వ్యక్తులు ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన రాజమండ్రి పరిసరాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
తెలుగుభాషకు అద్భుత భవిష్యత్తు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు బాష పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా సిలికానంధ్ర నిర్వహిస్తున్న 'మనబడి' స్నాతకోత్సవం ఆదివారం శాన్‌హూసేలోని పార్క్‌సైడ్ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనబడి విద్యార్థులకు వారు పట్టాలు ప్రదానం చేశారు. అమెరికా, కెనడా, హాంకాంగ్ మొదలైన దేశాల్లోని 1019 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారు. ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. మనబడి నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయమైందని చెప్పారు. తెలుగుభాష భవిష్యత్ గొప్పగా ఉండబోతోందని ఆయన అన్నారు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంతా అంటారని, కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలుపెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రశంసించారు. 150 మందితో మొదలుపెట్టిన నేడు ఆరువేల మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ విద్యావ్యవస్థను నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులను కొనియాడారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్థులకు తెలుగుభాషపై గల అంకితభావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007 లో ప్రారంభమైన 'మనబడి' ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. మనబడి పదికి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250కి పైగా శాఖలతో వందకు పైగా భాషా సైనికులతో భాషా ఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని మనబడి అధ్యక్షులు రాజు చామర్తి తెలిపారు. ఈ ఏడాది ఆరువేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి ముందుకు కొనసాగుతోందని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు అన్నారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి వై. రెడ్డి శ్యామల, ప్రజాసంబంధాల అధికారి జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీరాం కోట్నీ, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కరువు కనలేరా?
త్రికాలమ్ కరువు కాటకాలు మనకు కొత్త కాదు. రైతు ఆత్మహత్యలు దాదాపు ఇరవై సంవత్సరాలుగా నిత్యకృత్యమైనాయి. అధికార రాజకీయ క్రీడలో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకు అనావృష్టి, కరువు కారణంగా అల మటిస్తున్న ప్రజల గోడు వినిపించడం లేదు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు అంటీముట్టనట్టు ఉంటున్నాయి. కరువు లేనట్టూ, రైతుల ఆత్మహత్యలు జరగనట్టూ, గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టూ నటిస్తున్నాయి. పరస్పర నిందారోపణలతో, రాజకీయపుటెత్తుగడలతో రాజకీయరంగం, మీడియారంగం గమ్యం లేని పరుగులో పోటీపడుతున్నాయి. అన్నదాత ఆత్మహత్య చేసుకుంటు న్నప్పటికీ ఆ విషాదాన్ని గుర్తించకుండా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రినీ ఎవరు మందలించాలి? కరువు విలయతాండవం చేస్తున్న ప్పటికీ కరువు ఉన్నట్టు ప్రకటించని ప్రభుత్వాలను ఎవరు నిలదీయాలి? అధికా రంలోకి రాగానే మానవత్వాన్ని విస్మరించే రాజకీయ నాయకులను ఏమి చేయాలి? చలించిన న్యాయమూర్తులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ న్యాయస్థానాలు హద్దుమీరుతున్నాయంటూ వ్యాఖ్యానించిన తరుణంలో సుప్రీంకోర్టు దేశంలో సగానికిపైగా జనాభా ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యపై సుదీర్ఘ విచారణ జరపడం అభినందనీయం. జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన న్యాయపీఠం స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పైన సుమారు నలభై గంటల విచారణ జరిపింది. కరువుపైన చర్చించడానికి పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు అన్నీ కలిపి వినియో గించిన మొత్తం సమయం కంటే ఇది అధికం. గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలూ, రైతుల వెతలూ, కరువు కాటుకు సంబంధించిన అవగాహన కలిగిన న్యాయమూర్తులు కనుక వారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలనూ, ప్రభుత్వ సంజాయిషీలనూ శ్రద్ధగా ఆలకించారు. అందుకు న్యాయమూర్తులను ప్రత్యేకంగా అభినందించాలి. వ్యవసాయరంగం పట్ల నిబద్ధతనూ, ప్రభుత్వాల నిర్వాకంపై వ్యాఖ్యానించే సమయంలో ప్రదర్శిం చిన నిజాయితీనీ, నిర్భీతినీ దేశ ప్రజలు గుర్తించాలి. ఎటువంటి దారుణమైన క్షేత్ర వాస్తవికత న్యాయమూర్తులను కదిలించిందో గమనించాలి. మరాఠ్వాడాలో కరువు కరాళ నృత్యం చేస్తుంటే, తాగునీటికోసం ప్రజలు నానా యాతనా పడుతుంటే క్రికెట్ మైదానం తడిపేందుకు వేలాది గ్యాలన్ల నీరు వృథా చేయడాన్ని ప్రశ్నిస్తూ ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పైన వాద నలు జరిగినప్పుడే దేశంలో కరువు తాండవిస్తున్న వాస్తవాన్ని మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ గుర్తించాయనడం అతిశయోక్తి కాదు. పాలగుమ్మి సాయి నాథ్, యోగేంద్ర యాదవ్ వంటి వ్యక్తులు జాతీయ స్థాయిలోనూ, కోదండరాం, రామాంజనేయులు, వడ్డే శోభనాద్రేశ్వరరావు, ఎర్నేని నాగేంద్రనాథ్ వంటి ఉద్యమకారులు రాష్ట్రాలలోనూ చేస్తున్న పర్యటనలు వృథాశ్రమగా, ప్రకటనలు అరణ్యరోదనంగా మిగిలిపోయాయి. మనది సమాఖ్య వ్యవస్థ కనుక, వ్యవ సాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం కనుక రైతుల ఆత్మహత్యలపైన స్పందించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదనే విధంగా వాదించడాన్ని న్యాయమూర్తులు ఆక్షేపించారు. అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము చేయవలసినదంతా చేశామంటూ కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయ వాదులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో పోరాడవలసిన బాధ్యత రాష్ట్రాలదేనంటూ కేంద్రం తప్పుకోవడాన్ని తప్పుపట్టారు. రేషన్ దుకాణాలలో అదనపు పప్పుధాన్యాలు కానీ, నూనె కానీ, మధ్యాహ్న భోజ నంలో కోడిగుడ్డు కానీ ఇవ్వవలసిన బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వం వాదించడం న్యాయమూర్తులను నివ్వెరపరచి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నటిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, హరియాణా, బిహార్ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కరువు విలయాన్ని గుర్తించ డానికి నిరాకరించడం దారుణం. ఇందులో బీజేపీ, జేడీయూ అన్న వ్యత్యాసం లేదు. నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్ అన్న తేడా లేదు. రైతుల పట్ల అన్ని ప్రభు త్వాల వైఖరీ ఒక్కటే. యూపీఏ హయాంలో చట్టాలు మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే చట్టాలను చేయడంలో మాత్రం అది రికార్డు సృష్టించింది. సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటిదే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (2005). భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానంటూ వాగ్దానాలతో హోరెత్తించారు. ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైతం వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేస్తాననీ, రైతుల బతుకులను బాగు చేస్తాననీ వివిధ సందర్భాలలో చెప్పారు. కానీ మాటలకూ చేతలకూ పొంతన లేదు. కరువుపై యుద్ధం ప్రకటిం చకపోగా నరేగా (ఉపాధి హామీ పథకం) కింద కూలి సకాలంలో చెల్లించకపో వడం శోచనీయం. 2015-16 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఈ పద్దు కింద రూ. 12,000 కోట్లు బకాయి ఉండటం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతోంది. పైగా ఈ పథకం కింద చెల్లిస్తున్న రోజు కూలి చట్టం నిర్దేశించిన కనీస కూలి కంటే తక్కువ. వాస్తవానికి అనావృష్టిని ఎదుర్కోవడంలో ఈ పథకం ప్రధాన సాధనం కావలసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (జాతీయ విపత్తు నివారణ సంస్థ) స్వయంగా ప్రధాని అధ్యక్షతన పని చేస్తున్నప్పటికీ కరువు రక్కసి కోరల్లో ఇరుక్కున్న ప్రజలను ఆదుకోవడానికి చేసింది తక్కువ. అనావృష్టి పరిస్థితులలో ఏ విధంగా వ్యవహరించాలో వివరిస్తూ 2009లో రూపొందించిన మాన్యువల్‌ను సైతం సక్రమంగా అమలు చేయడం లేదు. ఇవన్నీ సుప్రీంకోర్టు విచారణలో నిగ్గుతేలిన నిజాలు. రాజ్యాంగం 21వ అధికరణ కింద ప్రసాదించిన జీవించే హక్కును వినియోగించి కరువు ప్రాంతాలలో డొక్కలు మాడుతున్నవారికీ, గొంతు ఎండిపోతున్నవారికీ కనీస సహాయక చర్యలు చేపట్టాలని స్వరాజ్ అభియాన్ తన పిటిషన్లో అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఆహారధాన్యాలు అందరికీ అందుబాటులో ఉండాలనీ, తమిళనాడులో మాదిరి ప్రతి కుటుం బానికీ రెండు కిలోల పప్పు, ఒక కిలో వంటనూనె అదనంగా సరఫరా చేయా లనీ, విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో రోజూ ఒక కోడిగుడ్డు కానీ ఒక గ్లాసెడు పాలు కానీ ఇవ్వాలనీ, వేసవి సెలవులలో కూడా మధ్నాహ్న భోజన పథకం ఆగిపోకుండా కొనసాగాలనీ అభియాన్ కోరింది. ఇవి ప్రభుత్వం తీసుకోవలసిన తక్షణ చర్యలు. ఇవి కాకుండా కొన్ని దీర్ఘకాలిక చర్యలను కూడా ఈ స్వచ్ఛంద సంస్థ సూచించింది. కనువిప్పు కలిగేనా? సుప్రీంకోర్టు బెంచ్ బుధవారంనాడు ఇచ్చిన తీర్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. కరువు బారి నుంచి ప్రజలను కాపాడాలన్న రాజకీయ సంకల్పం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని న్యాయస్థానం ఉద్ఘాటించింది. సమాఖ్య తరహా వ్యవస్థ సాకు చూపించి పలాయనవాదానికి కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టిందని ఆగ్రహించింది. ఇసుకలో తలబెట్టి బయటి ప్రపంచాన్ని చూడని ఉష్ట్రపక్షిలాగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలు అనావృష్టి పీడిత ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నాయంటూ అభిశంసించింది. మా రాష్ట్రంలో జీవనది గంగ ప్రవహిస్తున్నదంటూ బిహార్ సర్కార్ చేసిన వాదనను కొట్టివేసింది. నీటి లభ్యత ఒక్కటే కరువును నిరోధించజాలదనీ, నీటితో పాటు అనేక ఇతర సదుపాయాలూ అవసరమని గుర్తు చేసింది. దేశంలో జలసంపద సమానంగా లేదు. గంగ- బ్రహ్మపుత్ర- మేఘన బేసిన్లోనూ, పశ్చిమకోస్తాలోనూ నీరు పుష్కలంగా లభిస్తుంది. తక్కిన ప్రాంతాలలో చాలా భాగం వర్షాధార వ్యవసాయమే. దేశ భూభాగంలో 64 శాతం జలవనరులలో 24శాతంతో సరిపెట్టుకోవాలి. అంటే దేశంలో సగభాగం వరుణదేవుడి కటాక్షంపైనే ఆధారపడాలి. భూగర్భ జలవనరులు వేగంగా అడుగంటుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావులు వేయడం ఇందుకు ప్రధాన కారణం. వాననీటిని పరిరక్షించే కార్యక్రమాలు విస్తృతంగా జరగక పోవడం మరో కారణం. తెలంగాణలో అమలు జరుగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగితే కరువు శాశ్వత నివారణకు దోహదం చేసే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం వెంటనే ఉండదు. నదుల అనుసంధానం వంటి ప్రతిపాదనలు అమలుకు అలవికానివి. అంత కంటే స్థానిక పరిష్కారాలు అన్వేషించడం మేలు. నీటి తీరువాను జాతీయ స్థాయిలో స్థిరీకరించాలనీ, నీటిని వృథా చేయకుండా, భూగర్భ జలాలను మితిమీరి వినియోగించకుండా నివారించే జాతీయ చట్టం ఒకటి అవసరమనీ ప్రవీణుల అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం పట్ల తీవ్ర అధిక్షేపణ ప్రకటిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ కొన్ని నిర్దిష్టమైన నివారణ చర్యలను సత్వరం చేపట్ట వలసిందిగా ఆదేశించింది. విపత్తు పట్ల స్పందించేందుకు జాతీయ స్థాయిలో ఒక దళాన్ని నియమించాలనీ, విపత్తును అధిగమించేందుకు జాతీయ స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేయాలనీ, విపత్తు నివారణకూ, సంక్షోభం నుంచి గట్టెక్కటానికీ తీసుకోవలసిన చర్యలను నిర్దేశించేవిధంగా జాతీయ విధానాన్ని రూపొందిం చాలనీ న్యాయమూర్తులు ఆదేశించారు. ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఏ ప్రాంతంలోనైనా కరువు పరిస్థితులు కనిపిస్తే ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించే విధంగా ఒక చట్టం తీసుకురావాలని కూడా న్యాయస్థానం కోరింది. రైతులు వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ వాస్తవాన్ని ప్రభుత్వాలు దాచకుండా చర్యలు తీసుకోవాలి. న్యాయవ్యవస్థపైన నిందలా? స్వరాజ్ అభియాన్ పిటిషన్‌పైన సుప్రీం బెంచ్ తీర్పూ, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దు చేయించిన తీర్పూ చూసిన తర్వాత న్యాయస్థానాల జోక్యం లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం ప్రహసనంగా దిగజారుతుందేమోనన్న భయం కలుగుతోంది. న్యాయస్థానాలు హద్దు మీరుతున్నాయంటూ ఆక్షేపించిన రాష్ట్ర పతి ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫార్సుపైన ఆమోదముద్ర వేయకుండా వాపసు పంపించ వలసింది. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులను బాహాటంగా కొనుగోలు చేస్తున్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మందలించి ఉంటే న్యాయస్థానాలు పోషిస్తున్న పాత్ర పట్ల ఆయన అభిప్రాయాలకు విలువ ఉండేది. చట్టాన్ని తుంగలో తొక్కుతూ, నియ మాలను కాలరాస్తూ, విలువలకు తిలోదకాలు ఇచ్చేవారికి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? శాసనసభ్యులను అంగడిలో సరుకులాగా కొనుగోలు చేస్తుంటే, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నీరుగార్చి పడేస్తుంటే ప్రశ్నించనివారికి న్యాయస్థానాలను తప్పుపట్టే అర్హత ఉంటుందా? రైతులు బలవన్మరణం చెందుతున్న రాష్ట్రాలు కానీ దేశ పార్లమెంటు కానీ ఈ సమస్యపైన శ్రద్ధగా చర్చించిన పాపాన పోలేదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సుల దుమ్ము దులపాలి. అటువంటి ప్రయత్నమే లేదు. కేవలం వ్యవసాయ సంక్షోభంపైనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. పరిష్కారం సాధించేవరకూ పార్లమెంటు సమావేశాలను కొనసాగించాలి. మరే అంశమూ చర్చించకూడదు. అదే దీక్షను రాష్ట్రాలలో శాసనసభలూ పాటించాలి. అన్నదాతల ఆత్మహత్యలను జాతీయ సంక్షోభంగా గుర్తించి తక్షణ, దీర్ఘకాలిక నివారణోపాయాలను అమలు చేయకపోతే స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ, చట్టపాలనకూ అర్థం లేదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులూ, హామీలూ అమలు కానప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా అనిపించుకుంటుంది? - కె.రామచంద్రమూర్తి -
సాక్షి భవిత ఆవిష్కరణ
కరీంనగర్: విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా సాక్షి దినపత్రికలో నిత్యం భవిత పేజీలు ప్రారంభించటం అభినందనీయమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బుధవారం కరీంనగర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన భవిత ప్రారంభ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ 'విద్యలో డిజిటల్ విప్లవం వచ్చింది. దేశం భవిష్యత్తు యువత చేతిలో ఉంది. యువత, విద్యార్థుల సమస్యలను ఏ పత్రికలు ఉపేక్షిస్తాయో ఆ పత్రికలు ఎక్కువ కాలం నిలుస్తాయి. సాక్షి యాజమాన్యం చేసేది దీక్ష లాంటిది. ప్రతిరోజు కొత్త ఐడియాను సాక్షి ఆవిష్కరిస్తుంది. ప్రజలను భవిత వైపు మరల్చడానికి సాక్షి చేస్తున్న కృషి అభినందనీయం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం అనే కాలం పోయింది నేడు ఏడు సమాధానాల కాలం వచ్చింది. మారిన పరిస్థితులకు అనుకూలంగా విద్యారంగంలో మార్పు చేయకుంటే విద్యార్థులు వెనకబడతారు. సమస్యలకు హైదరాబాద్ లో పరిష్కారాలు దొరకవు పల్లెటూరులో దొరుకుతాయి. పత్రికలు వర్తమానం వార్తలే కాదు రేపటి వార్తలకు భూమికను పోషించాలి. సాక్షి భవితను చదువుతూ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి' అన్నారు. సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ ఈశ్వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మేలు చేయడానికే భవితను ప్రతిరోజు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటర్ వి.మురళి, కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిస్ తదితరులు ఉన్నారు. అదే విధంగా గుంటూరు లో జరిగిన కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి భవిత సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయ్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి సాక్షి భవిత మెయిన్ ఎడిషన్ లో రెండు పేజీల్లో వెలువడనుంది. -
మీ ఆదరణే ఊపిరిగా...
మీ అందరి ఆదరాభిమానాలతో ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఎనిమిదేళ్ల వ్యవధి చాలా స్వల్ప సమయమే కావొచ్చు. కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే ‘సాక్షి’ మీ అందరికీ చేరువయింది. మీలో, మీ కుటుంబసభ్యుల్లో ఒకటైంది. ‘సత్యమేవ జయతే’ మకుటాన్ని శిరోధార్యంగా స్వీకరించింది మొదలు ఆ అమృత వాక్కును ‘సాక్షి’ మనసా వాచా కర్మణా ఆచరిస్తోంది. ఒక వార్త వెనకా, ఒక కథనం వెనకా ఉండే అన్ని కోణాలనూ నిత్యం మీ ముందు పరుస్తోంది. సరైన సమాచారం అందిస్తే సముచితమైన నిర్ణయం తీసుకోగల మీ విచక్షణా శక్తినీ, వివేకాన్నీ గౌరవిస్తోంది. నాణేనికి మరోవైపు చూపించే ప్రయత్నం నిరంతరం చేస్తూ తెలుగువారి మనస్సాక్షిగా నిలిచింది. అంతర్జాతీయ డిజైన్‌తో, 23 ఎడిషన్లతో, అన్ని పేజీలూ రంగుల్లో సర్వాంగసుందరంగా ముస్తాబై మీ ముందుకొచ్చి పత్రికారంగ చరిత్రలో రికార్డు సృష్టించింది. బుడిబుడి నడకలప్పుడే సాక్షి పెనుసవాళ్లను ఎదుర్కొంది. రకరకాల ఇబ్బందుల్ని చవిచూసింది. ఒక దశలో పత్రిక గొంతు నొక్కేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా తన సంకల్పం నుంచి ‘సాక్షి’ అంగుళమైనా పక్కకు జరగలేదు. ధైర్యసాహసాలను ఇసుమంతైనా సడలనివ్వలేదు. వీటన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొనడంలో ‘సాక్షి’ పట్ల మీరు ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలు, అచం చల విశ్వాసం మాకు కొండంత అండగా నిలిచాయి. ‘సాక్షి’ ఆవిర్భావ సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న తెలుగు గడ్డ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనైనా, ఇటు తెలంగాణలోనైనా ఉన్నదున్నట్టు నిజాయితీగా, నిర్భీతిగా, నిర్మొహమాటంగా నిజాలను నిగ్గుతేల్చుతున్నదీ, ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్నదీ ‘సాక్షి’ మాత్రమే. అదే సమయంలో అభివృద్ధికి అవసరమైన సూచనలనూ, క్షేత్రస్థాయిలో లోటుపాట్లనూ పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాప్రయోజనాల పరిరక్షణకు అహరహం పాటుపడుతోంది సాక్షి. ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంపికైన గ్రామాల్లో పాలక పార్టీ పెద్దలు బినామీల మాటున వేల ఎకరాలను కబ్జా చేసిన వైనంపై సాక్ష్యాధారాలతో సహా మూడు రోజులపాటు ధారావాహిక కథనాలను ‘సాక్షి’ వెలువరించింది. రాజధాని నిర్మించే ప్రాంతంపై వదంతులు సృష్టించి, స్థానిక రైతులను తప్పుదోవ పట్టించి చవగ్గా భూములు కొట్టేసిన తీరునూ... అసైన్డ్ భూములున్న నిరుపేద రైతులను భయాందోళనలకు గురిచేసి ఆ భూముల్ని అమ్ముకునేలా చేసిన వంచననూ వెలుగులోకి తెచ్చింది. అలా నాలుగైదు లక్షల రూపాయలకు భూములు కొన్నవారు కొన్ని నెలల్లోనే కోట్లకు పడగెత్తిన వైనాన్ని పక్కా ఆధారాలతో వెల్లడించింది. సంజాయిషీ ఇచ్చుకునేందుకు కూడా తోవ దొరకని భూ రాబందులు ‘డబ్బులున్నాయి... మేం కొనుక్కున్నాం, ఇందులో తప్పేముంది’ అంటూ చట్టసభల్లోనూ, వెలుపలా దబాయింపులకు దిగాయి. ‘సాక్షి’ పాత్రికేయ బృందాన్ని బెదిరించి, భయపెట్టి మరిన్ని కథనాలు రాకుండా చూసే కుట్రలకూ తెరతీశాయి. ఎన్నడూ లేనివిధంగా పాత్రికేయులను పోలీస్స్టేషన్లకు పిలిచి ప్రశ్నించే అప్రజాస్వామ్య సంస్కృతికీ దిగజారాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీతో కుమ్మక్కయి ‘సాక్షి’ నోరు నొక్కాలనుకున్న టీడీపీ... ఇప్పుడు తమ చేతుల్లోనే అధికారం ఉన్నదన్న అహంకారంతో అవే ఎత్తుగడలను మరింత ఉధృతంగా ప్రయోగిస్తోంది. ఇటువంటి కుట్రలూ, కుహకాలకు ‘సాక్షి’ బెదిరిపోయే ప్రసక్తి లేదు. ఎంచుకున్న తోవ నుంచి కొంచెమైనా తప్పుకునే ప్రశ్న లేదు. గడిచిన 22 మాసాల్లో ఏపీ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న తీరును ఎండగడుతూ వరస కథనాలు రావడానికి కారణం ఈ సంకల్పబలమే. అయితే, మాతో విభేదించినవారి అభిప్రాయాలకు కూడా పత్రికలో చోటివ్వకుండా పోలేదు. వాస్తవాలను వక్రీకరించిందన్న ఆరోపణలకు తావుండరాదన్న దృఢ నిశ్చయంతో సకల స్వరాలనూ వినిపిస్తున్నాం. ఏ కథనం ప్రచురించినప్పుడైనా సంబంధిత వర్గాల వివరణను సైతం తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సైతం జనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్నది. ఉన్న ఊళ్లో పనులు కరువై వలసపోతున్న అభాగ్యుల గురించీ, అడ్డా కూలీలుగా మారిన రైతన్నల దైన్య స్థితి గురించీ వివరించడమే కాదు... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల్ని చెరబట్టిన జల మాఫియాల ఆగడాలనూ పతాక శీర్షికలకెక్కించాం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సవివరంగా ఇస్తూనే, అమలు చేయని కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాం. జనజీవన ప్రమాణాలను పెంపొందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఉపయుక్తమైన సమాచారాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు అదనపు శీర్షికలు ప్రారంభించి కొత్త పుంతలు తొక్కుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకూ అవసరమైన సమాచారం అందించే ప్రయత్నం విశేషంగా చేస్తున్నాం. సమాజ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో అడుగడుగునా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్న తెలుగు పాఠక మహాశయులకూ, ప్రకటనకర్తలకూ, ఏజెంట్లకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రారంభంనాడే చెప్పినట్టు సమాజహితమే మా లక్ష్యం. సత్యసంధతే మా మార్గం. మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.... అభినందనలతో -కె. రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ -
రాజ్యాంగమే సర్వోన్నతం
త్రికాలమ్ అంబేడ్కర్‌ని దార్శనికుడని ఎందుకు అభివర్ణిస్తున్నాం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న రభసని ఆయన 1949లోనే ఊహించాడు. చట్ట సభలూ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య అధికారాలు విభజించి మూడింటి మధ్యా సమతౌల్యం ఉండాలని నిర్దేశించాడు. చట్టసభలూ, ప్రభు త్వాలూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నదీ, లేనిదీ సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకే ఇచ్చాడు. రాజ్యాంగ నిర్మాతల ప్రధాన లక్ష్యం సాధారణ పౌరుల హక్కు లను కాపాడడమే. నియోజవర్గం ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉండాలన్నదే ఆర్కె రోజా కేసులో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులోని ఆంతర్యం. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు రోజా వ్యవహారంలో మొదటి నుంచీ పాలకపక్షం పట్టుదలగానే ఉంది. ఆమె అసెంబ్లీలో ప్రయోగిం చిన భాష, శరీరభాష అభ్యంతరకరంగా ఉన్నాయన్న కారణంగా సంవత్సరం పాటు సస్పెండు చేయాలని సభ తీర్మానించింది. సమావేశం (సెషన్) చివరి వరకూ సస్పెండు చేయవచ్చును కానీ ఏడాది పాటు సస్పెండు చేసే హక్కు శాసనసభకు లేదని తెలిసినా సంఖ్యాబలం ఉన్నది కనుక అడ్డంగా తీర్మానం చేశారు. రోజా మాటలూ, దృశ్యాల టేపులు మాత్రమే మీడియాకు విడుదల చేశారు కానీ ఆమెను రెచ్చగొట్టిన అధికార పక్ష సభ్యుల భాషనూ, శరీర భాషనూ పట్టిచ్చే టేపులను విడుదల చేయలేదు. కెమేరాలూ, టేపులూ అధికార పక్షం చేతుల్లోనే ఉన్నాయి మరి. రోజా సస్పెన్షన్‌ను రద్దు చేసి సభ లోకి అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వును లక్ష్యపెట్ట కుండా, ఆమెను సభలోకి అనుమతించరాదని స్పీకర్ నిర్ణయించుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుపైన అప్పీలు చేయాలని అధికార పార్టీ నిర్ణయిస్తే, హైకోర్టు ఉత్తర్వును ఖాతరు చేయనందుకు కంటెంప్ట్ పిటిషన్ వేయాలని ప్రతిపక్షం నిర్ణ యించింది. సభాపతిపైన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల గడువు విధిగా ఇవ్వాలన్న 71వ నిబంధనను తోసి రాజనడం కూడా ఏకపక్ష రాజకీయాలలో భాగమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపైన గెలిచిన ఎనిమిది మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహించి వారిని అనర్హత వేటు నుంచి కాపాడడానికి శాసనసభ నిబంధన లనూ, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మితిమీరిన మంత్రుల మాటలు ఈ అక్రమాలను క్రమబద్ధీకరించేందుకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. బుద్ధప్రసాద్ కమిటీ నివేదికను సభా హక్కుల సంఘం పరిశీలించింది. సభలో ఎవరు అసభ్యంగా, అభ్యంతరక రంగా వ్యవహరించినా చర్య తీసుకునే అధికారం సభకూ, సభాపతికీ ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడిని ‘ఖబడ్దార్... కోరలు తీస్తా’ అంటూ గర్జించిన ముఖ్య మంత్రిపైనా, ‘ఇడుపులపాయ బంకర్లలో అవినీతి డబ్బు దాచావ్’ అంటూ అర్థం లేని ఆరోపణ చేసిన సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడిపైనా, ‘నీకు కొవ్వెక్కింది, నువ్వు మగాడివైతే, రాయలసీమ పౌరుషం నీలో ఉంటే...’ అంటూ వెకిలిగా మాట్లాడిన అచ్చెన్నాయుడిపైనా, ‘మిస్టర్ జగన్మోహన్రెడ్డీ ఖబడ్దార్’ అంటూ తర్జని చూపిస్తూ బెదిరించిన దేవినేని ఉమపైనా, ఆర్థిక ఉగ్రవాదిగా ప్రతిపక్ష నాయకుడిని అభివర్ణించిన బోండా ఉమపైనా, అదే ధోరణిలో మాట్లాడిన కిమిడి కళా వెంకటరావు, త్రిమూర్తులుపైన కూడా సభా హక్కుల సంఘం విచారణ జరిపి ఉంటే ధర్మంగా, న్యాయంగా ఉండేది. చంద్రబాబు నాయుడూ, ఆయన సహచరులూ ప్రతిపక్ష నాయకుడిని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడానికి అనరాని మాటలు అంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నిగ్రహం కోల్పోరాదనీ, ఆగ్రహం ప్రదర్శించరాదనీ ప్రతిపక్ష నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉత్కంఠ భరితమైన ఈ క్రీడలో ఎవరు నిగ్రహం పాటిస్తే వారిదే విజయం. ముఖ్యమంత్రి, మంత్రులూ సభామర్యాదలను ఉల్లంఘించి ప్రతిపక్ష నాయకుడిని దుర్భాషలాడటాన్ని ఆమోదించి, ప్రతి పక్ష సభ్యులపైన మాత్రమే సస్పెన్షన్ వేటు వేయాలని బుద్ధప్రసాద్ కమిటీ నివే దించినా, సభా హక్కుల సంఘం తీర్మానించినా, అసెంబ్లీ నిర్ణయించినా అది పక్షపాత వైఖరే అవుతుంది. దానికి జనామోదం ఉండదు. మర్యాదను తుంగలో తొక్కిన అందరిపైనా చర్య తీసుకుంటే సభ స్థాయీ, సభాపతి గౌరవం పెరిగేవి. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలో కోడెల శివప్రసాద్ ఊహించి ఉండరు తాను చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నానని. ఆంధ్రప్రదేశ్ శాసనసభా పతిగా ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడానికి అధికార పార్టీ దుందుడుకు వైఖరి ప్రధానంగా కారణం. ఒక సంజీవరెడ్డిలాగానో, ఒక సోమ నాథ్ ఛటర్జీలాగానో నిష్పాక్షికంగా, నిర్భయంగా వ్యవహరించే తెగువ చూపక పోవడం. అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ నచ్చజెప్పి ఘర్షణాత్మకమైన వాతావర ణాన్ని నివారించడానికి తగిన వయస్సూ, అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, శాసనసభా వ్యవహారాల మంత్రి యన మల రామకృష్ణుడూ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్‌టి రామారావును గద్దె దించడానికి ఒక పథకం ప్రకారం వ్యవహరించిన పద్ధతిని జ్ఞప్తికి తెస్తున్నది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవడంలో అప్పటి శాసనసభాపతిగా రామకృష్ణుడి సహకారం మరువలే నిది. అదే వ్యూహంతో ఇప్పుడు ముందుకు పోదామని ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులలో చాలా వ్యత్యాసం ఉన్నది. అప్పుడు అది అధికార పార్టీలో ఆధిక్యంకోసం జరిగిన పెనుగులాట. ప్రతిపక్షం ప్రమేయం లేదు, బలమైన ప్రతిపక్షం లేదు. దాదాపు అన్ని పత్రికలూ చంద్రబాబునాయుడి పక్షానే నిలిచాయి. ఆయన కోరిన విధంగా వార్తలు మలిచాయి. ఇప్పుడు బల మైన ప్రతిపక్షం ఉంది. దానికి బలమైన యువనాయకుడు ఉన్నాడు. పత్రికలన్నీ ఒకే పక్షాన లేవు. టెలివిజన్ ఛానళ్ళు అనేకం వచ్చాయి. శాసనసభా కార్యకలా పాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దాపరికానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎవరు గుడ్లురుముతూ రంకెలు వేస్తున్నారో, ఎవరు సహనం కోల్పోయి ప్రేలా పనలు చేస్తున్నారో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. రాజ్యాంగంలో సైతం అనేక సవరణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం కంటే, చట్టసభల కంటే న్యాయవ్యవస్థదే పైచేయి అనడానికి అవసరమైన దన్ను రాజ్యాంగానికి లభిం చింది. ఈ పరిణామ క్రమం తెలుసుకుంటే చంద్రబాబునాయుడూ, యనమల రామకృష్ణుడూ దూకుడు తగ్గించుకొని ఆలోచించగలుగుతారు. న్యాయవ్యవస్థతో ఘర్షణకు శాసనసభాపతిని ప్రోత్సహించడమా లేక రాజ్యాంగ స్ఫూర్తినీ, సహజ న్యాయ పాలన ఆవశ్యకతనూ అర్థం చేసుకొని హుందాగా వ్యవహరించడమా తేల్చుకుంటారు. ఈ పెనుగులాట ఇప్పటిది కాదు చట్టసభలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఆధిక్యం కోసం పెనుగులాట ఎంతో కాలంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు కేశవ్సింగ్కూ, శాసనసభకూ మధ్య రగిలిన ఘర్షణతో ఇది మొదలైంది. ఏడు రోజుల శిక్ష పడిన కేశవ్‌సింగ్ ఉత్తర ప్రదేశ్ హైకోర్టు లక్నో బెంచిని ఆశ్రయించాడు. లక్నోబెంచ్ అసెంబ్లీ నిర్ణ యం చెల్లనేరదని తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులనూ, కేశవ్‌సింగ్ తరఫున వాదించిన న్యాయవాదిని శాసనసభ హక్కులను ఉల్లంఘిం చిన నేరానికి శిక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానించింది. ఇది క్రమంగా రెండు వ్యవస్థల మధ్య ఘర్షణగా మారిన సందర్భం (1964)లో ఈ వ్యవహారంపైన అభిప్రాయం చెప్పవలసిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ గజేంద్రగడ్కర్ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల పీఠం ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఉత్తర్వును కొట్టివేసింది. శాసనసభలో అక్రమాలు జరిగితే వాటిని పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలపైన విచారణ జరిపే అధికారం న్యాయసమీక్ష జరపవలసిన హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని నిగ్గు తేల్చింది. ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కులను హరించరాదంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 1967 నాటి గోలక్‌నాథ్ కేసు తీర్పులో స్పష్టం చేసింది. ఈ పరిమితిని అధిగమించేందుకు 1972లో పార్లమెంటు 24వ రాజ్యాంగ సవ రణ చట్టం చేసింది. ఈ చట్టాన్ని పూర్వపక్షం చేసేందుకు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పును వినియోగించుకున్నది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదనీ, ఆ క్రమంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ధ్వంసం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు లేదనీ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించిన ఇందిరా గాంధీ రెండేళ్ళపాటు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశారు. మూడు వ్యవస్థల మధ్యా సమతౌల్యం దారుణంగా దెబ్బతిన్నది. పార్లమెంటూ, న్యాయవ్యవస్థ కంటే ప్రభుత్వమే శక్తిమంతమైన వ్యవస్థగా పెత్తనం కొనసాగించింది. అత్యా చారాలు చేసింది. 1977లో ఎన్నికలు జరిగిన అనంతరం జనతా ప్రభుత్వం చొరవతో 43వ, 44వ రాజ్యాంగ సవరణల ద్వారా సమతౌల్యాన్ని పునరుద్ధ రించారు. ఈ సవరణలతో ఆత్మవిశ్వాసం పెరిగిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం నుంచి లాగివేసుకు న్నది. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయమూర్తుల కొలీజియంను ఏర్పాటు చేసి దానికి సుప్రీంకోర్టుకూ, హైకోర్టులకూ న్యాయమూర్తులను నియమించే అధికారం అప్పగించింది. దీంతో న్యాయవ్యవస్థ పార్లమెంటుతో, ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా సంపూర్ణ స్వేచ్ఛను వ్యవస్థీకృతం చేసుకు న్నది. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించిన తర్వాత యూపీఏ-2 ప్రభుత్వం న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని న్యాయ వ్యవస్థ నుంచి తీసివేసుకునే లక్ష్యంతో 99వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొం దించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్ జుడీషియల్ అపాయెంట్మెంట్స్ యాక్ట్ (2014)ను చేసి యూపీఏ ప్రారంభించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఈ చట్టం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. న్యాయ మూర్తులను నియమించే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిచినట్లయితే న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం కోల్పోతుందనీ, సుప్రీం ధర్మాసనం ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించిందనీ న్యాయకోవిదులు శ్లాఘించారు. ఇదీ తాజా పరిస్థితి. రాజ్యాంగానికి లోబడకతప్పదు చట్టపాలనలో ఇంతవరకూ సంభవించిన పరిణామాలను అర్థం చేసుకున్నవారు ఎవ్వరైనా న్యాయవ్యవస్థ అధికారాలను ప్రశ్నించరు. నిబంధనలను ఉల్లంఘిం చినా, చట్టాలను అతిక్రమించినా చట్టసభలను ప్రశ్నించే అధికారం, చట్టసభల నిర్ణయాలను తిరగదోడే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నది. బ్రిటన్‌లో అన్ని వ్యవస్థల కంటే పార్లమెంటు మిన్న. అక్కడ లిఖిత రాజ్యాంగం లేదు. మనది పకడ్బందీగా రాసుకున్న సంవిధానం. చట్టసభలూ, ప్రభుత్వాలూ, న్యాయ వ్యవస్థా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. ఈ మూడు వ్యవస్థలూ పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పుడైనా స్పర్థ వచ్చినప్పుడు ఏది రాజ్యాంగబద్ధమో, ఏది కాదో చెప్పే అర్హత సుప్రీంకోర్టుకే ఉన్నదని రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన ఫలితంగా న్యాయవ్యవస్థకు ఇతర రెండు వ్యవస్థల కంటే పిసరంత అధికారం అధికం. చట్టసభల సభ్యులలోనూ, ప్రభుత్వాధికారులలోనూ ప్రమాణాలు పడిపోతాయనీ, మందబలంతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టసభల సభ్యులు వ్యవహరించే రోజులు మున్ముందు రాగలవనీ అంబేడ్కర్, ఆయన సహచరులు అరవై ఆరేళ్ళ కిందటే ఊహించారు. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘిస్తారనీ, సంఖ్యాబలంతో ఏ అఘాయిత్యానికైనా ఒడిగ తారనీ, అందుకే చట్టసభల నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండాలనీ నాడే స్పష్టం చేశారు. అందుకే వారు దార్శనికులు. - కె.రామచంద్రమూర్తి -
ఏ విలువలకీ ప్రస్థానం?
త్రికాలమ్: ఫిరాయింపు విద్యలో చంద్రబాబునాయుడి అనుభవం ఎక్కువ. రాజకీయ ప్రవేశంతోనే ఆయన ఇందులో అభ్యాసం ప్రారంభించారు. అనైతికమైన పనులు అడ్డంగా చేసిన వెంటనే తనకంటే నీతిమంతులు ఎవ్వరూ లేరంటూ దబాయించడం చంద్రబాబు మార్కు రాజకీయం. అయిదుగురు ప్రతిపక్ష శాసనసభ్యులను బుట్టలో వేసుకున్న వెంటనే కేరెక్టరే తన బలం అంటూ నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించడం ఆయన ప్రత్యేకత. కొంతమంది శాసనసభ్యులు అధికార పార్టీలో చేరినంత మాత్రాన ప్రతిపక్షం బలహీనపడుతుందా? ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న నాదెండ్ల భాస్కరరావు ప్రాబల్యం పెరిగిందా? తెలుగు రాష్ట్రాలు కొత్త రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుడుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రజలు ఉపేక్షిస్తున్నారు. రాజ్యాంగం, రాజ్యాంగానికి మొన్నటి వరకూ చేసుకున్న వందకుపైగా సవరణలూ వెల వెలపోతున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం విలవిలలాడుతోంది. ఫిరాయింపు లను ప్రోత్సహిస్తున్నది అభివృద్ధి కోసమేనంటున్నారు నేతలు. ఫిరాయింపు తంత్రం, అభివృద్ధి మంత్రం. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ అకస్మాత్తుగా బీజేపీ ప్రభుత్వంగా మారిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం (తెదేపా) టిక్కెట్టుపైన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన సనత్‌నగర్ శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వంలో చేరి దర్జాగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులతో మాసాల తరబడి బేరసారాలు సాగించి లొంగిపోయినవారికి పచ్చ కండువా కప్పుతున్నారు చంద్రబాబునాయుడు. ఫిరాయింపుల చట్టాన్ని ఎడాపెడా ఉల్లం ఘిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నప్పటికీ గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ, ఇంగ్లీషు టీవీ న్యూస్ చానళ్ళు కానీ ఆక్షేపించడం లేదు. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జెపీ రాజ్‌ఖోవా తన పేరు మీద నడుస్తున్న ప్రభుత్వం నడ్డి విరిచారు. ముఖ్యమంత్రి నబామ్ టుకీ, స్పీకర్ నబామ్ రబియాలను సంభ్ర మాశ్చర్యాలకు గురిచేశారు. ఫిరాయించిన డిప్యూటీ స్పీకర్ నాయకత్వంలో జరిగిన పోటీ సభలో స్పీకర్‌ను బర్తరఫ్ చేసినట్టు తీర్మానించారు. అరవై మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2011 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో 47 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సజావుగా పరిపాలిస్తున్న టుకీని అస్థిరపరిచేందుకు గవర్నర్ ఒక అస్త్రంగా పనిచేశారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1995లో చేసిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నీ, ఆ చట్టానికి 2003లో వాజపేయి ప్రభుత్వం చేసిన సవరణనూ బుట్టదాఖలు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ని పాతరేశారు. ఫిరాయింపులు కొత్త కాదు ‘నాకు కేరెక్టర్ చాలా ముఖ్యం. అదే నా బలం’ అంటూ చంద్రబాబునాయుడు గురువారంనాడు ఏలూరులో ప్రకటించారు. ఇటువంటి ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. 1982లో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమ యంలో పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా ఎన్నికల బరితో దిగుతానంటూ తొడగొట్టిన యువ కాంగ్రెస్ మంత్రి ఆయన. ఎన్టీఆర్ ప్రభంజనంలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబునాయుడు కాం గ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఎన్టీఆర్ పంచన చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. శాసన సభ్యత్వం లేకపోయినా, మంత్రి కాకపోయినా కర్షక పరిషత్తు అధ్యక్షుడిగా మంత్రులకంటే అధికంగా అధికారం చెలాయించారు. క్రమంగా తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ సాక్షిగా తెదేపా ఎంఎల్ఏల చేత మూకుమ్మడి ఫిరాయింపు చేయించి పార్టీని చీల్చి తనదే అసలైన తెదేపా అని ప్రకటించుకున్నారు. అది ఫిరాయింపులకు పరాకాష్ఠ. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయననే దేవుడంటూ కొలవటం కౌటిల్యం. అప్పుడే చంద్రబాబునాయుడి కేరెక్టర్ ఏమిటో తెలుగువారికి తెలిసిపోయింది. 1978లో రోశయ్య నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ)లోకి వలస వెళ్ళిన ప్పుడూ, రోశయ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడూ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. ఆ తర్వాత వచ్చింది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించిన అనంతరం కూడా కొనసాగిన ముఖ్యమైన లొసుగు ఏమిటంటే ఫిరాయింపు దారులను అనర్హులుగా ప్రకటించాలా లేదా అని నిర్ణయించే హక్కు సభాపతికి ఉండటం, సభాపతి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు అత్యున్నత న్యాయస్థానానికి సైతం లేకపోవడం. చట్టసభల అధికారాన్ని న్యాయవ్యవస్థ ప్రశ్నించరాదనే ఉద్దేశంలో ఈ నిబంధన చేర్చారు. సభాపతులు ఏ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ పార్టీ ప్రయోజనాలకు అతీతంగా, స్వతంత్రంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తారనే విశ్వాసంతో ఆ పనిచేశారు. కానీ స్వతంత్రంగా వ్యవహరించే సభాపతులు లేరు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ అధ్య క్షుడు ఏమైనా సంకోచిస్తారేమో కానీ శాసనసభాపతులూ, శాసనమండలి అధ్య క్షులూ ముఖ్యమంత్రుల అభీష్టానికి అనుగుణంగా నదురూబెదురూ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు లేదా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతున్నారు. ఈ బలహీనతను వినియోగించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విచ్చ లవిడిగా శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హించారు. వారిపైన అనర్హత వేటు పడకుండా కొమ్ముకాస్తున్నారు. పార్టీ ఫిరా యించిన పార్లమెంటు సభ్యులపైనా, శాసనసభ్యులపైనా అనర్హులుగా ప్రకటించ కుండా అధికార పార్టీ ప్రయోజనాలు పరిరక్షిస్తున్న సభాపతులపైన ఏ చర్య ఎవరు తీసుకోవాలో పార్లమెంటు నిర్ణయించాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో సత్వరం ప్రవేశపెట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అపహస్యంపాలు కాకతప్పదు. ఎన్నికలెందుకు? రాజ్యాంగం గురించీ, రాజకీయ విలువల గురించీ విజయవాడ శాసనసభ్యుడు బోండా ఉమకు ఉన్నంత పరిజ్ఞానమే పెద్ద పదవులలో ఉన్న నాయకులూ ప్రదర్శించడం శోచనీయం. ‘అభివృద్ధికోసం పార్టీ మారితే ఉపఎన్నికలు ఎందుకు? రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది?’ అంటూ బోండా ఉమ అనడం అప్రజాస్వామికమనీ, తప్పు అనీ తెదేపా నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అనకపోవడం నైతిక విలువలకు ఏ మాత్రం విలువ ఇస్తున్నామో సూచిస్తున్నది. గురువారంనాడు ఎర్రబెల్లి దయాకరరావుకు గులాబీ కండువా కప్పుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు (కేసీఆర్) కూడా తెలంగాణ అభివృద్ధికోసం రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగమే తెదేపా శాసనసభ్యుడు తెరాసలో చేరడం అని సూత్రీకరించారు. ఏ విలువలకీ ప్రస్థానం? భారత ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోందో ఊహించు కోవచ్చు. ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలలో వివిధ పార్టీల టికెట్లపై అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతిపక్ష సభ్యులకు ఎలాగైనా సరే మంత్రులు కావాలనే ఆశలుంటాయి. ఎన్నికలలో ఖర్చు చేసిన డబ్బు తిరిగి రాబట్టుకోవాలనే ఆరాటం ఉంటుంది. తీర్చవలసిన అప్పులు వేధిస్తుంటాయి. అక్రమాలకు సంబంధించిన కేసులు ఉంటాయి. వాటి నుంచి ఏదో ఒక విధంగా బయటపడాలనే తాప త్రయం ఉంటుంది. చంద్రబాబునాయుడు వంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యుల ఆశలూ, కేసులూ, ఇబ్బందుల వివరాలు తెలుసుకుంటారు. ఆశలు తీరుస్తామనీ, కేసులు ఎత్తేస్తామనీ మాట ఇస్తారు. మూటలు పంపుతారు. ఆకలిమీద ఉన్న ప్రతిపక్ష సభ్యులు కొందరు ప్రలోభాలకు లొంగిపోతారు. తమది ఫిరాయింపు కాదనీ, అభివృద్ధి సాధించేందుకు అధికార పార్టీతో భుజం కలుపుతున్నామనీ కోరస్ వినిపిస్తారు. చట్టాలతో ప్రమేయం లేకుండా, నైతిక విలువలతో నిమిత్తం లేకుండా గెలిచిన శాసనసభ్యులందరూ అధికార పార్టీలో చేరి అధికారం పంచుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేయవచ్చుననే కొత్త సిద్ధాంతం చేసినందుకూ ఫిరాయింపుదారులకూ, సూత్రధారులకూ సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు సముచితమైన బహుమతి ఇస్తారు. అధినేతలదే అంతిమ నిర్ణయం ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే అంతిమ నిర్ణయం. తెదేపా కానీ తెరాస కానీ ఇందుకు భిన్నం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ, తెలంగాణ సర్కార్‌లో కానీ ముఖ్యమంత్రుల మాట కాదనే మంత్రులు ఎవ్వరూ లేరు. నైతికత లేదా రాజ్యాంగ నిబద్ధత గురించి ప్రశ్నించే సాహసం ఎవ్వరికీ లేదు. దాదాపు ఇదే స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు. ఆయనకు ఎదురు చెప్పే గుండెలు ఎవ్వరికీ లేవు. ఈ ముగ్గురూ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు. మోదీ, కేసీఆర్ కంటే ఫిరాయింపు విద్యలో చంద్రబాబునాయుడి అను భవం ఎక్కువ. రాజకీయ ప్రవేశంతోనే ఆయన ఇందులో అభ్యాసం ప్రారంభిం చారు. అనైతికమైన పనులు అడ్డంగా చేసిన వెంటనే తనకంటే నీతిమంతులు ఎవ్వరూ లేరంటూ దబాయించడం చంద్రబాబునాయుడు మార్కు రాజకీయం. అయిదుగురు ప్రతిపక్ష శాసనసభ్యులను బుట్టలో వేసుకున్న వెంటనే కేరెక్టరే తన బలం అంటూ నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించడం ఆయన ప్రత్యేకత. కొంతమంది శాసనసభ్యులు అధికారపార్టీలో చేరినంత మాత్రాన ప్రతి పక్షం బలహీనపడుతుందా? ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న నాదెండ్ల భాస్కరరావు ప్రాబల్యం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నెల రోజులలో పెరి గిందా? 1985లో జరిగిన ఎన్నికలలో ఆయన బలపరచిన వారికి ఎన్ని స్థానాలు దక్కాయి? 1996 నాటి పార్లమెంటు ఎన్నికల వరకూ ఎన్టీఆర్ బతికి ఉన్నట్ల యితే చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెదేపా చిత్తుగా ఓడేది కాదా? జనాదరణ కలిగిన రాజకీయ నాయకుల ప్రాబల్యం శాసనసభ్యుల సంఖ్యపైన ఆధారపడదు. 1978 శాసనసభ ఎన్నికల సమయంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. సమర్థ పాలకుడిగా పేరుంది. మంత్రులూ, శాసనసభ్యులూ, డీసీసీ అధ్యక్షులూ అందరూ జలగం వైపే. కాంగ్రెస్(ఐ) జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి ఇద్దరూ అభ్యర్థుల కోసం రాజగోపాలనాయుడి వంటి పాతతరం నాయకులపైన ఆధారపడిన రోజులు అవి. ఆ విధంగా రాజగోపాలనాయుడు సిఫార్సు చేస్తేనే చంద్ర బాబునాయుడికి చంద్రగిరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ (ఐ) టికెట్ వచ్చింది. ఇందిరాగాంధీకి ప్రజలలో ప్రాబల్యం ఉన్నది కనుక ఆమె పార్టీ ఘనవిజయం సాధించింది. శాసనసభ్యులూ, కార్యకర్తలూ రాజకీయ పార్టీలకు అవసరమే. అధి నేతకు ప్రజలలో ప్రాబల్యం లేకపోతే ఎన్నికల సమయంలో ఎంతమంది శాసన సభ్యులున్నా ప్రయోజనంలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్.టి.రామా రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రజానాయకులతో ప్రజలు అనుబంధం పెంచుకుంటారు. 2014లో నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులూ, కార్యకర్తలూ లేని చోట్ల కూడా ఓట్లు రావడానికి ఇదే కారణం. టీవీ చానళ్ళ ద్వారా ఆయన దేశ ప్రజలతో నేరుగా మాట్లాడారు. వారికి తన నాయకత్వం పట్ల విశ్వాసం కలి గించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేక, అవినీతి ఆరో పణలకు సమాధానం చెప్పలేక, ప్రతిపక్ష శాసనసభ్యులను సంతలో పశువులను కొన్నట్టు (సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ తెదేపా నుంచి తెరాసలోకి వలస పోవడాన్ని ఆక్షేపిస్తూ చంద్రబాబునాయుడు అన్నమాటలే) కొని తన బలం పెరుగుతోందనీ, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బలం క్షీణిస్తోందనీ భావించినట్లయితే అంతకుమించిన భ్రమ మరొకటి ఉండదు. ఇరవై మాసాల కిందట తెదేపాను ఆదరించిన కొన్ని వర్గాలు ఇప్పటికే ఆ పార్టీకి దూరమైనాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగు తుందే కానీ తగ్గదు. నాయకుడు చేసిన వాగ్దానాలకూ, కార్యాచరణకూ మధ్య ఉన్న అంతరం ఆయన కేరెక్టర్‌ను నిర్ణయిస్తుంది. తనకు తాను ఇచ్చుకున్న కేరెక్టర్ సర్టిఫికెట్‌కు విలువలేదు. సర్టిఫికెట్ ఇవ్వవలసింది ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారు. - కె. రామచంద్రమూర్తి (వ్యాసకర్త: సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్) -
ఎజెండా వందనం?
ఇటీవల నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) సమావేశం జరిగినప్పుడు భాగస్వామ్య పక్షాల నాయకులు ప్రధాని నరేంద్రమోదీని ఒకే కోరిక కోరారు. తమను వాజపేయి గౌరవించిన రీతిలో గౌరవించమని అడిగారు. ఈ రోజున దేశ ప్రజలు కూడా మోదీకి మౌనంగా అదే ప్రార్థన చేస్తున్నారు. వాజపేయిలాగా పరిపాలించమంటూ వేడుకుంటున్నారు. నరేంద్రమోదీ గొప్ప చాణక్యుడనీ, అభివృద్ధి ఎజెండాగా ఈ దేశాన్ని ప్రగతి పథంలో శరవేగంగా పరుగులు తీయిస్తారనీ విశ్వసించి 2014లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటు వేసినవారిలో కొంతమంది ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. బీజేపీని కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను కానీ చూసి ప్రజలు మోదీకి ఓటు వేయలేదు. యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు మోదీని ఆపద్బాంధవుడుగా పరిగణించి ఓట్లు వేసి గెలిపించారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలాగానే మోదీ నేతృత్వంలోని సర్కార్ అన్ని వర్గాలనూ కలుపుకొని పోతుందనీ, సొంత ఎజెండాను పక్కన పెడుతుందనీ ఆశించినవారికి భంగపాటు కలుగుతోంది. ఏమి సాధించాం? జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యూ)లో సంభవించిన పరిణామాలు, వాటి ప్రభావంతో పటియాలా హౌస్ కోర్టులోనూ, ఢిల్లీ వీధులలోనూ కనిపించిన వికృత దృశ్యాలూ దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనపైన కేంద్ర హోంమంత్రి, హెచ్ఆర్డీ మంత్రి, పోలీసు బలగం జోక్యం చేసుకొని గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చిన ఫలితం ఏమిటి? ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం మనకి ఒక్కటి కూడా లేదే అని అనుకుంటున్న సమయంలో ఆసియా ఖండంలో చెప్పుకోదగిన మంచి యూనివర్శిటీగా ఎదిగిన జెన్యూనూ, దేశంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా అత్యుత్తమ విశ్వవిద్యాల యంగా అవార్డు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని వివిదాల లోకి లాగి వాటి ప్రతిష్ఠను దిగజార్చాం. ఈ పరిణామాలపైన దేశీయాంగ మంత్రి, హెచ్ఆర్డీ మంత్రి, దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మాట్లాడారు. అమెరికాలో నివసిస్తున్న మేధావి నోమ్ చామ్స్కీ సైతం వ్యాఖ్యా నించాడు. ప్రపంచంలోని అన్ని పత్రికలూ సంపాదకీయాలు రాశాయి. కానీ మన ప్రధాని మాత్రం నోరు మెదపలేదు. ఆయన మన్మోహన్సింగ్ వలె మౌనీబాబా కాదు. సకల విషయాలపైనా అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. కానీ జెఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యా కుమార్‌ని అన్యాయంగా అరెస్టు చేసినా, కోర్టులో అతనిపైన న్యాయవాదులు అన్యాయంగా దాడి చేసినా, దేశం అంతా జెఎన్యూ వివాదంతో అట్టుడికిపోతున్నా ప్రధాని నోరు మెదపక పోవడం వెనుక మతలబు ఏమిటి? తప్పుడు ట్వీట్‌ను పట్టుకొని జెఎన్యూ విద్యార్థులకు లష్కరేతొయ్యబా నాయకుడు హఫీజ్ సయీద్‌తో సంబంధాలు ఉన్నాయంటూ స్వయంగా హోంమంత్రి మాట తూలడం ఏమిటి? దీని వెనుక ఏమైనా ప్రణాళిక ఉన్నదా? దైవభక్తికి దేశభక్తిని జోడించి ప్రాబల్యం పెంచుకోవాలన్నది బీజేపీ తాజా ప్రయత్నమా? అందుకేనా ఇంత రాద్ధాంతం? ఈ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో తెలియదు. కానీ ఈ తంత్రాన్ని అమలు చేసే క్రమంలో జరిగే అనర్థాలు ఏమిటో అర్థం కావడం లేదా? ఇరుగుపొరుగు దేశాల అధినేతలను తన పదవీ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించిన మోదీ ఒక రాజనీతిజ్ఞుడుగా ఎదిగే అవకాశం ఉన్న రాజకీయవాదిగా కనిపించారు. అఫ్ఘానిస్తాన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తూ లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌ను కలుసుకొని సమాలోచనలు జరిపి శభాష్ అనిపించుకున్నారు. కశ్మీర్ విషయంలోనూ వాజపేయి మార్గం అనుసరించ డాన్నీ, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్‌తో భుజం కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్నీ మేలి మలుపుగా భావించి దేశ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతించారు. కానీ ముఫ్తీ మరణం తర్వాత ఆరు వారాలు దాటినా ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానమే. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చర్చలు జరిపినా, ఆమె వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేసినా జెఎన్యూ పరిణామాల ప్రభావం కశ్మీర్ రాజకీయాలపైనా, మెహబూబా నిర్ణయంపైనా ఉండితీరుతుంది. పాకిస్తాన్‌తో సంబంధాలపైనా జెఎన్యూ దెబ్బ పడుతుంది. గోటితో పోయేదానికి... జెఎన్యూ క్యాంటీన్ దగ్గర ఇండియాకి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేసినవారిని విడియోల సహాయంతో గుర్తించి పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి చట్టప్రకారం శిక్షిస్తే ఎవ్వరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. పాత ఆడియోను కొత్త వీడియోపైకి ఎక్కించి కన్హయ్యా కుమార్‌ను రాజద్రోహిగా చిత్రించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ వివాదాన్ని ఆ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పరిష్కరించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోలేదు. అది అంతటితో సమసిపోయింది. అదే విధంగా జెఎన్యూ ఘటనపైన చర్య తీసుకునే స్యేచ్ఛ కొత్తగా నియుక్తుడైన వైస్‌చాన్సలర్‌కి ఇచ్చి ఉంటే ఆయనే పరిష్కరించేవాడు. చేతకాకపోతే హెచ్ఆర్డి మంత్రిత్వశాఖను సంప్రదించేవాడు. భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని ప్రశ్నించడం, తర్కించడం, శోధించడం అభ్యాసం చేస్తున్న విద్యార్థులపైన దేశద్రోహులుగా, రాజద్రోహులుగా ముద్ర వేయడం వల్ల ఫలితం ఏమిటి? అఫ్జల్‌గురుని ఉరి తీసిన తర్వాత ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన అతని స్మారక సభ జరుపుకోవడం, ఉరి తీయడం సరి కాదనే అభిప్రాయం కొందరు వెలిబుచ్చడం కొత్త కాదు. ఈ సంవత్సరం ఇది శ్రుతిమించి ఉండవచ్చు. ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపైన కఠినమైన చర్య తీసుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెబుతారు? ప్రభుత్వం ఏ పని చేసినా చట్టబద్ధంగా, హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. జెఎన్యూ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ వ్యవహరించిన తీరు దేశానికే కాదు బీజేపీకి సైతం నష్టదాయకం. విక్రమ్సింహ్ చౌహాన్ అనే లాయరు పోట్ల గిత్తలాగా జర్నలిస్టులపైనా, జెఎన్యూ విద్యార్థులపైనా న్యాయ స్థానంలోనే దాడి చేస్తుంటే చోద్యం చూసిన పోలీసులది అసమర్థత అనుకోవాలా లేక ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకపాత్ర వహించారని అనుకోవాలా లేదా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిష్క్రియాపరత్వాన్ని అభినయించారని అనుకోవాలా? ‘దేశభక్తుల’ స్వైరవిహారం ‘దేశభక్తులు’ జర్నలిస్టులపైనా, విద్యార్థులపైనా దాడి చేయడాన్ని అనుమతించిన ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు పంపుతున్నది? అఫ్జల్ గురు ఉరిని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సమర్థిస్తున్నారా? లేదు. ఆమెను కశ్మీర్‌కు ముఖ్య మంత్రిగా చేసి ఆమె మంత్రివర్గంలో బీజేపీ చేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జెఎన్యూలో కొంతమంది విద్యార్థులు ఉరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడాన్ని రాద్ధాంతం ఎందుకు చేయడం? ఈ విధంగా విశ్లేషించినవారినీ, వాదించినవారినీ రాజద్రోహులంటూ, దేశద్రోహులంటూ నిందించడం ఎందుకు? కశ్మీర్ లోయలో నివసిస్తున్న ప్రజలలో ఎంత శాతం మంది భారత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు? ఎన్ని సార్లు అక్కడ పాకిస్తాన్ పతాకాలను ఎగురవేయలేదు? ఎన్ని దఫాలు అక్కడ పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించలేదు? వారందరిపైనా రాజద్రోహం కేసు పెడతామా? భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడమే భారత్ గొప్పదనం అంటూ ‘మై ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్...’ అంటూ నరేంద్రమోదీ పార్లమెంటులో ఆవేశపూరితంగా చెప్పిన మాటలు ఏమైనాయి? పాకిస్తాన్ పట్ల భారత ప్రజలలో వ్యతిరేకతను పెంచడం ద్వారా ఏమి సాధిస్తారు? ఏ హిందూత్వ ఎజెండానైతే వాజపేయి అటకమీద పెట్టి దేశాన్ని సమర్థంగా పరిపాలించి అరుదైనా రాజనీతిజ్ఞుడని పేరు తెచ్చుకున్నారో అదే ఎజెండాను నెత్తికెత్తుకుంటే, అటకదించితే మోదీ పెద్ద పొరపాటు చేసినట్టు అవుతుంది. దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో మువ్వన్నెల జెండా ఎగురవేయడమని వైస్‌చాన్సలర్లకు హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ చెప్పడం వల్ల నష్టం లేదు. కార్ల ముందు జెండా కట్టుకున్న మంత్రులూ, చట్టసభల సభ్యులు ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నారో ప్రజ లకు తెలుసు. అయినా సరే, అన్ని విశ్వవిద్యాలయాలలోనూ మూడు రంగుల జెండా ఎగరవచ్చు. ఈ జెండా వల్ల ప్రమోదమే కానీ ప్రమాదం లేదు. కానీ దేశ ప్రజలపై ఒకే భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నించినా, తాము మాత్రమే దేశ భక్తులమనీ, తక్కినవారంతా దేశద్రోహులనీ అడ్డంగా వాదించినా ఈ దేశ ప్రజలు సహించరు. ఒకే భావజాలాన్ని అందరూ అంగీకరించాలనీ, తమ అభి మాతాన్నే అందరూ శిరసావహించాలని భావించేవారికి భారత సమాజం అర్థం కాలేదని అనుకోవాలి. ఇండియా భిన్నమైన అనేక జాతుల, సంస్కృతుల, వార సత్వాల సమాహారం. భిన్నత్వాన్ని ఆమోదించి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నడిపిం చేందుకు కృషి చేయాలి కానీ గత రెండు వారాలుగా కనిపిస్తున్న వికృ తమైన, అప్రజాస్వామికమైన, దౌర్జన్యపూరితమైన, నిరంకు శమైన ధోరణులను ప్రోత్స హించకూడదు. ఈ వాతావరణం కారణంగా పార్లమెంటు సమావేశా లలో చర్చ జరగకుండా రచ్చ జరగడమే కాకుండా నిరసన ప్రదర్శనలు ముమ్మ రమై అస్థిరతకూ, అశాంతికీ దారితీస్తాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చర్చకు రాకుండా అంతకంటే పెద్ద వివా దంగా జెఎన్యూ ఘటనను రగిలించినా ప్రయోజనం లేదు. రోహిత్ ఉదంతం దేశం అంతటా చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్‌లో 2014 నాటి ఎన్ని కలలో నరేంద్రమోదీకి ఓటు చేసిన దళితులలో చాలా మంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయకపోవచ్చు. రెండేళ్ళ కిందట మోదీకి బ్రహ్మరథం పట్టిన యువత మరోసారి అంత ఉత్సాహంగా ముందుకు రాకపోవచ్చు. సోషల్ మీడియాలో పోస్టింగులను చూసీ, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న అర్ణబ్ గోస్వామి వంటి జర్నలిస్టులను చూసీ అదే సకల జనాభిప్రాయం అని భావిస్తే పొరబాటు. పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావ జాలం లేని యువత అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం, జెఎన్యూ పరిణామాలు బీజేపీకి మేలు చేయవు. కశ్మీర్ ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పడానికీ దోహదం చేయవు. పాకిస్తాన్‌తో సత్సం బంధాలు పెంచుకోవడానికి సైతం ఉపయోగపడవు. మోదీని గొప్ప రాజనీతి జ్ఞుడుగా చరిత్రలో నిలబెట్టవు. ఇప్పటికైనా ఎజెండాను పక్కన పెట్టి వాజపేయి వేసిన బాటలో నడుచుకోవడం మోదీకీ, బీజేపీ, దేశానికీ శ్రేయస్కరం. ఇండియా వంటి సువిశాలమైన, వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన దేశాన్ని పరిపా లించాలంటే నెహ్రూ, వాజపేయి వేసిన బాటలే శరణ్యం. ఇందుకు భిన్నంగా ఎవరు ఎటువంటి ప్రయత్నం చేసినా దేశ సమగ్రతకూ, సమైక్యతకూ ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ‘దేవుడా నా మిత్రుల నుంచి నన్ను కాపాడు. నా శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకోగలను’ అంటూ లోగడ ఎవరో ప్రార్థించినట్టు మోదీ కాంగ్రెస్‌నూ, కమ్యూనిస్టు పార్టీలనూ కాచుకోగలరు. పరివారంతోనే ప్రమాదం. త్రికాలమ్: కె.రామచంద్రమూర్తి -
ఫలించిన ‘మహా’తంత్రం
త్రికాలమ్ పదమూడేళ్ళ ఉద్యమం అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించు కున్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించి కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అందని ద్రాక్షగా మిగిలిపోవడం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కి మింగుడు పడని వాస్తవం. శుక్రవారం నాడు వెల్లడైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ జైత్రయాత్రను పరిపూర్ణం చేశాయి. ఇక్కడ సున్నా నుంచి 99 స్థానాలకు వారు ఎదిగారు. 2014 ఎన్నికలలో తాను హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి వంద ఎన్నికల సభలలో ప్రసంగించి నిర్విరామంగా ప్రచారం చేసి సాధించిన విజయం కంటే కుమారుడు కె. తారకరామారావు (కేటీఆర్) జీహెచ్ఎంసీ ఎన్నికలలో అసాధారణమైన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి అపూర్వమైన రీతిలో నమోదు చేసిన గెలుపు ఎక్కువ విలువైనది. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం ముఖ్యమంత్రి తనయ చెప్పక ముందే అందరికీ తెలిసిపోయింది. రెండున్నర వేల సంవత్సరాల కిందట చైనీస్ యుద్ధతంత్ర నిపుణుడూ, సేనానీ సన్ జూ రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ను కేసీఆర్ చదివే ఉంటారు. 'The supreme art of the war is to subdue the enemy without fighting (యుద్ధం చేయకుండానే శత్రువుపైన ఆధిక్యం సంపాదించడం అత్యున్న తమైన యుద్ధతంత్రం)’అంటాడు సన్ జూ. 2014 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి కేవలం మూడు స్థానాలు దక్కినప్పుడే కేసీఆర్ మనస్సులో ఎట్లాగైనా సరే హైదరాబాద్‌ని జయించాలనే సంకల్పం చెప్పుకొని ఉంటారు. అప్పటి నుంచే ఆయన ఒక వ్యూహం ప్రకారం జీహెచ్ఎంసీపైన పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాల శక్తిని హరించి వాటిని చిత్తు చేయడానికి అవసరమైన అన్ని ఎత్తులూ వేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (తెదేపా)లలో పలుకున్న నాయకులకు కండువా కప్పి గులాబీ దండులో చేర్చుకున్నారు. ఉలుకున్న నాయకులు తనకు సన్నిహితులని నమ్మించి వారి పార్టీ సహచరులలో అనుమానాలు ప్రబలే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కానీ, జీవన్‌రెడ్డి కానీ, తెదేపా నేత దయాకర రావు కానీ కేసీఆర్‌పైన చీటికీమాటికీ కాలుదువ్వకపోవడానికి కారణం ఆయన వారిని శాసన సభలోనూ, బయటా గౌరవంగా సంబోధించడం, ఆత్మీయంగా ప్రస్తావించడం. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఎట్లాగూ ఉన్నాయి. దీనికి తోడు అధికారపార్టీతో కొందరు నాయకులు కుమ్మక్కు అవుతున్నారనీ, అందుకే ప్రభుత్వంపైన దాడి చేయడంలేదనే అనుమానాలు అనైక్యతను మరింత పెంచాయి. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా తెరాస నాయకత్వంతో చర్చలు జరిపి తనకు అనుకూలమైన వాతా వరణం లేని కారణంగానే పార్టీ ఫిరాయించ కుండా కాంగ్రెస్‌లో కొనసాగారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అందుకే, కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసే మానసిక స్థితిలో లేదు. సమరానికి ముందే ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్షాల చిత్తుకు వ్యూహం తెదేపా నుంచి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వెనుక వ్యూహం ఉంది. అదే విధంగా దయాకరరావును చేర్చుకోకపోవడంలోనూ ఎత్తుగడ ఉంది. తెదేపాను దెబ్బతీయడానికి కేసీఆర్‌కు కలసి వచ్చిన అంశం ‘ఓటుకు కోట్లు’ కేసు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెదేపా నిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం, జీహెచ్ఎంసీ ప్రచార బాధ్యతలను ఆయనకే అప్పగించడం, ఆయనను వెంట బెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలలో ప్రసంగించడాన్ని హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు సైతం అనైతికంగా, అవమానకరంగా భావించి ఉంటారు. ఏ మాత్రం వెరపు లేకుండా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు వారికి వెగటు కలిగించి ఉండాలి. ఎన్నికల ప్రచారం చివరి అంకంలో సికింద్రాబాద్‌లోని కవాతు మైదానంలో తెరాస బహిరంగ సభలో తెదేపా అధ్యక్షుడిని ఉద్దేశించి కేసీఆర్ ‘నీకు ఇక్కడేం పని? నీ పదమూడు జిల్లాలూ ఊడ్చుకో, పో’ అంటూ ఎద్దేవా చేసినా పల్లెత్తు మాట అనకుండా ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయిన చంద్రబాబునాయుడు యుద్ధంలో లేనట్టే లెక్క. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాస అద్భుతమైన విజయం సాధించడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. మురికివాడలలో నివసించే ప్రజలకు రెండు పడక గదుల ఫ్లాట్లు ఇస్తామనే వాగ్దానం, నాణ్యమైన విద్యుచ్ఛక్తిని నిరంత రంగా సరఫరా చేస్తామని చెప్పడం, నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామంటూ ప్రకటించడం, మరి రెండు మంచినీటి చెరువులను నగరంలో నిర్మిస్తామంటూ హామీ ఇవ్వడం, శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామంటూ నమ్మబలకడం వంటి కారణాలు చాలా కనిపిస్తాయి. మురికివాడలలో నివిసిస్తున్న ప్రజలను బస్సులలో తీసు కొని వెళ్ళి ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన రెండు పడకగదుల ఫ్లాట్లను చూపించడం ద్వారా అటువంటి ప్లాట్లు ఏదో ఒక రోజు తమకూ వస్తాయనే విశ్వాసం వారిలో కలిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేయకుండా, కొన్ని అరకొరగా అమలు చేసి, భూసేకరణ పేరు మీద రైతులను అశాంతికి గురి చేసిన చంద్రబాబునాయుడు తన సమస్యలతోనే సతమతం అవుతున్నారనీ, హైదరాబాద్‌లో ఆయన వచ్చి చేసేదేమీ ఉండదనే అభిప్రాయానికి హైదరా బాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. కేటీఆర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించడం ఒక ఎత్తు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలలో అనర్గళంగా మాట్లాడుతూ, నగరం అంతా కలియతిరుగుతూ మొత్తం 150 వార్డులనూ చుట్టి ప్రచారం చేసిన 39 ఏళ్ళ కేటీఆర్ వయస్సుకు మించిన పరిణతి ప్రదర్శించారు. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్న తీరు అభినందనీయం. టిక్కెట్టు ఆశించి భంగపడిన దాదాపు 600 మంది తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పి తన పక్షాన ఉంచుకోగలిగారు. మంచి వాచకం ఒక్కటే సరిపోదు. చెప్పదల చుకున్నది స్పష్టంగా చెప్పగలగాలి. సందర్భశుద్ధి తెలియాలి. ఉదాహరణకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండో సారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి సంఘీభావం ప్రకటించారు. రాత్రంతా వారి మధ్యే గడిపారు. మర్నాడు సభలో మాట్లాడుతూ, 'I thank Rohit's mother for inviting me for the function' (ఈ ఫంక్షన్‌కు నన్ను ఆహ్వానించినందుకు రోహిత్ తల్లికి ధన్యవాదాలు) అనడం ఎంత ఎబ్బెట్టుగా ఉన్నదో ఇంగితం ఉన్నవారికి ఎవరికైనా అర్థం అవుతుంది. భారీ బహిరంగ సభల అక్కర లేదు టెలివిజన్, సోషల్ మీడియా వర్ధిల్లుతున్న కాలంలో నాయకులు స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా మాట్లాడటం చాలా అవసరం. అధికారంలో ఉన్నవారిని అదేపనిగా నిందించడం లేదా వారిపై ధ్వజమెత్తడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరనీ, వాటిని పరిష్కరించే శక్తియుక్తులు పుష్కలంగా ఉన్నాయనే విశ్వాసం ఓటర్లలో కలిగించాలి. కేవలం వాగ్ధాటి సరిపోదు.విశ్వసనీయత చాలా అవసరం. 2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ సృష్టించిన ప్రభంజనాన్ని ఆయనే అపార్థం చేసుకున్నారు. కేవలం తన వాగ్ధాటి కారణంగా, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టినందు వల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ (భాజపా) అభ్యర్థులను గెలిపించారని ఆయన భావించారు. యూపీఏతో విసిగి పోయిన ప్రజలు మెరుగైనా పాలన వస్తుందనే ఆశతో ప్రత్యామ్నాయంగా కనిపించిన భాజపాకి ఓట్లు వేశారని ఆయన అర్థం చేసుకోలేదు. అందుకే, ఢిల్లీలో, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికల ప్రసంగాల ధోరణే కొనసాగించారు. ఆయన ఒక్కరే బిహార్‌లో విస్తృతంగా పర్యటించి అనేక ఎన్నికల సభలలో ధాటిగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీనీ, నెహ్రూ వంశాన్నీ ఘాటుగా విమర్శించారు. లాలూ ప్రసాద్‌నీ, నితీశ్ కుమార్నీ ఉతికి ఆరేశారు. ప్రయోజనం? శూన్యం. తాము ఆశించిన తీరులో ఎన్డీఏ ప్రభుత్వం పాలించడం లేదనేది ప్రజల స్వీయానుభవం. కేవలం ఉపన్యాసాలు విని మోసపోకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. బిహార్ ప్రజల నిర్ణయం సరైనదా కాదా అన్నది కాలం నిర్ధారిస్తుంది. కానీ తన చారిత్రక విజయాన్ని మోదీ అర్థం చేసుకున్న పద్ధతి సరైనది కాదని బిహార్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కేసీఆర్‌కూ, కేటీఆర్‌కూ క్షేత్రజ్ఞానం ఉంది. ప్రజలనాడి తెలుసు. ఇంతటి భారీ ఆధిక్యంతో గెలిచి అపరిమితమైన అధికారం చేతుల్లో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకుండా వివేకంగా, వినయంగా వ్యవహరించగల నాయకులకే భవిష్యత్తు ఉంటుంది. ప్రజల మనోభావాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు. వారి స్వానుభవం ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించడమే నాయకులకు రక్ష. -కె.రామచంద్రమూర్తి -
'ముద్ర' వదిలి వెళ్లిన ఏజీకే
‘నిన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు ఆయన ఆస్పత్రిలో ఉన్నట్టు. సమాచారం అంది ఉంటే ముఖేశ్ అంబానీ వచ్చి ఉండేవాడు’ అన్నారు మిత్రులు ఎమెస్కో విజయ్‌కుమార్. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు హైదరాబాద్‌లోని ‘మహా ప్రస్థానం’లో ‘ముద్ర’ కృష్ణమూర్తికి అంత్య క్రియలు జరిగినప్పుడు ఇరవైమంది కూడా లేరు. ఆయనకు హైదరాబాద్‌లో పరిచ యాలు తక్కువే. 1968లో హైదరాబాద్ వదిలి అహమ్మదాబాద్ వెళ్ళి 2009లో తిరిగి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు అహ మ్మదాబాద్తోనే అనుబంధం ఎక్కువ. ఏజీ కృష్ణమూర్తి (ఏజీకే) ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని అహమ్మదాబాద్‌లో ఆవిష్కరించినప్పుడు ఆ నగరంలో ఉన్న వివిధ కార్పొరేట్ సంస్థల అధిపతులే కాకుండా ముంబయ్ నగరం నుంచి సైతం అనేకమంది వచ్చారని ఆ పుస్తకం ప్రచురించిన విజయకుమార్ చెప్పారు. ఏజీకేకి కార్పొరేట్ ప్రపంచంలో అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అడ్వర్టయిజింగ్ రంగంలో అనేకమంది ఏజీకెని ఆరాధిస్తారు. ఆయన దగ్గర తర్ఫీదు పొంది ఆ రంగంలో రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారం రోజుల కిందట అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన కారణంగా తన అనా రోగ్యం గురించి మిత్రులు ఎవ్వరికీ సమాచారం ఇచ్చే అవకాశం లేకపోయింది. ఏజీ కృష్ణమూర్తి తెలుగుజాతి గర్వించదగిన అడ్వర్టయి జింగ్ దిగ్గజం. రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ ప్రోత్సాహంతో ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండేషన్‌ను నెలకొల్పి ఆ సంస్థకు 23 సంవత్సరాలు సేవ చేశారు. ముద్ర పేరు ప్రతిష్ఠలు సంపాదించిన తర్వాత ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్ (మైకా)ను నెల కొల్పారు. అహమ్మదాబాద్‌లో భారతీయ విద్యాభవన్ జర్న లిజం స్కూల్లో అడ్వర్టయిజ్మెంట్ పాఠాలు చెప్పేవారు. చివరికి 2002 ముఖేశ్ అంబానీ రిలయన్స్ మొబైల్స్ ప్రారం భించి ‘సారా దునియా ముట్ఠీమే’ అంటూ ప్రకటన విడుదల చేసినప్పుడు ఆయనకు సలహాదారుగా ఏజీకే ఉన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో 1942 ఏప్రిల్ 29 న జన్మించిన కృష్ణమూర్తి బాల్యం తెనాలి, బాపట్లలో గడిచింది. చిన్నతనంలోనే బాపట్ల సబ్‌మెజిస్ట్రేట్ కోర్టులో స్టెనోగా ఉద్యోగం. అనంతరం గుంటూరులో జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర అదే స్టెనో పని. అనంతరం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో గుమాస్తాగిరీ. 1962లో మద్రాసు పోర్టు మ్యూజియంలో యూడీసీగా ఉద్యోగం. అయిదేళ్ళు మద్రాసులో పనిచేసిన తర్వాత హైదరాబాద్‌కు బదిలీ. సంవత్సరం తిరగకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై కొట్టి అహమ్మదాబాద్ వెళ్ళి శిల్పి అడ్వర్టయింజింగ్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా చేరడం. ఆ సంస్థ శరాభాయ్లది. ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడు విక్రమ్ శరాభాయ్ వంశానికి చెందిన సంస్థ. క్యాలికో డెరైక్టర్ గీరాబెన్ శరాభాయ్‌తో కలసి పని చేయడం. 1967 ఫిబ్రవరి 10న రిలయన్స్‌లో చేరడం ఏజీకే జీవితాన్ని మేలిమలుపు తిప్పింది. నరోడాలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాల యంలో అడ్వర్టయిజింగ్ డెరైక్టర్‌గా చేరిన ఏజీకే అడ్వర్టయి జింగ్ రంగంలో శిఖర సదృశుడైన ఫ్రాంక్ సియాయిస్‌తో కలసి అద్భుతాలు చేశారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేసిన సిల్కు చీరలూ, ఇతర దుస్తులకూ విమల్ బ్రాండ్‌తో ప్రకటనలు తయారు చేయడంలో ఫ్రాంక్ అనేక విన్యాసాలు చేశాడు. ఆయన విమల్ కోసం తయారు చేసిన మొదటి అడ్వర్టయిజ్ మెంట్ ఇది : 'A woman expresses herself in many languages, Vimal is one of them'. దానికి ఏజీకే చేసిన తెలుగు అనువాదం ‘ఒక స్త్రీకి ఎన్నెన్నో మనోభావాలు. వాటిలో విమల్ ఒకటి.’ ఈ అడ్వర్టయిజ్మెంటు రకరకాల రూపాలు సంతరించుకొని అత్యధికంగా పత్రికలలో, రేడియోలలో వచ్చి విమల్ చీరలకు అసాధారణమైన ఆదరణ తెచ్చింది. ‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగిం చడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే. ఏజీకే చిన్నతనంలోనే కథలు రాశారు. పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కథ. అదే శీర్షికతో ఏజీకే రాసిన కథ ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో అచ్చయింది. రేడియో ఉషశ్రీతో ఏజీకే స్నేహం పెరిగిన తర్వాత ఈ కథను ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ‘ముద్ర ’ను వీడి హైదరాబాద్ వచ్చిన తరువాత ఏజీకే బ్రాండ్ కన్సెల్టెన్సీని ప్రారంభించారు. అంతకంటే ముఖ్యంగా పుస్తకాలు రాయడం, కథలు రాయడం మొదలు పెట్టారు. ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. సీనియర్ అంబానీ అంటే ఆయనకు ఆరాధనాభావం. ధీరూభాయ్ లాంటివారు పది మంది ఉంటే ఈ దేశం మరోవిధంగా ఉండేదని ఆయన విశ్వాసం. ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. సరళమైన భాషలో హాయిగా చదివించే విధంగా రాయడం ఆయన ప్రత్యేకత. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. ఏజీకేకి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. చిరునవ్వు చెదరకుండా స్నేహితులతో అనుభవాలు పంచు కుంటూ చివరి రోజులు హైదరాబాద్‌లో గడిపిన ఏజీకే ఆశావాది. మన నిర్ణయాలే మంచికైనా, చెడుకైనా కారణం అన్నది ఆయన విశ్వాసం. ‘నేను మధ్యతరగతివాడిని. ఆ విలు వలనే నమ్ముకొని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమలతో అన్నీ సాధ్యాలనే నమ్మకం. నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం’ అని ఏజీకే తన స్వభావం గురించి తాను రాసుకున్న మాటలు. వందశాతం తెలుగుతనం ఉట్టిపడే కృష్ణమూర్తి అహమ్మదాబాద్, ముంబయ్ వెళ్ళి విజయాలు సాధించిన అసాధారణ వ్యక్తి. ఎవరైనా ఏదైనా అసాధ్యం అంటే దాన్ని సాధ్యం చేసి చూపించాలనే పట్టుదలే తన శిఖరారోహణకు ప్రధాన కారణం అని ఆత్మకథలో ఏజీకే రాసుకున్నారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. జీవితంలో కష్టపడి క్రమశిక్షణతో నిజాయితీగా పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఆయన నమ్మారు. చేసి చూపించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాతనే నాకు ఏజీకేతో పరిచయం, దగ్గరగా చూసే అవకాశం కలిగింది. అడ్వర్టయిజింగ్ ప్రపంచంలో సుప్రసిద్ధుడు, సృజనశీలి, మృదుభాషి అయిన ఏజీకే లోటు తీరనిది. - కె.రామచంద్రమూర్తి -
పాలకులు నేర్వని పాఠం
త్రికాలమ్ యూనిర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దళిత విద్యార్థి రోహిత్ రాసిన ఆఖరి లేఖ చాలామందితో పాటు నన్నూ తీవ్రమైన ఆవేదనకూ, అశాంతికీ గురి చేసింది. కృష్ణాజిల్లా కంచిక చర్లలో అరికట్ల కోటేశును చెట్టుకు కట్టి సజీవదహనం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ దళితులపైన దాడులు జరిగిన అనేక సందర్భాలలో ధర్మాగ్రహం ప్రదర్శించాం. పైశాచికత్వాన్ని ఖండించాం. ఇంతవరకూ జరిగిన దారుణాలన్నిటి కంటే రోహిత్ మరణం మరింత బలంగా కదిలించింది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇందుకు కారణం కావచ్చు. నేను హైదరాబాద్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు అమెరికన్ సెంటర్లో చూసిన డాక్యుమెంటరీలలో, చదివిన పత్రికలలో కనిపించి చేయి పట్టుకొని ఆకాశవీధుల్లో తిప్పి విశ్వరహస్యాలు విప్పిచెప్పిన కార్ల్ సేగన్ కాలం చేసి రెండు దశాబ్దాలు గడిచాయి. ఈ తరం విద్యార్థిని సేగన్ అంత గాఢంగా ప్రభావితం చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. 1980లలో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (పీబీఎస్)లో 13 భాగాలుగా ప్రసారమైన కాస్మోస్ సీరీస్ తాలూకు సీడీలను ఖగోళశాస్త్రంపైన ఆసక్తి కలిగిన పీహెచ్డీ విద్యార్థి చూడటంలో ఆశ్చర్యం లేదు. సేగన్ రాసిన ‘పేల్ బూ లడాట్’ కూడా చదివే ఉంటాడు. సృష్టి పట్లా, అందులో మనిషి ఉనికి పట్లా లోతైన అవగాహన లేకపోతే రోహిత్ ఆఖరి లేఖ గుండెలను అంతగా పిండేది కాదు. తన మిత్రులనూ, శత్రువులనూ సైతం వేధించవద్దంటూ ముక్తాయింపు చెప్ప డంతో మరణంలోనూ ఎదిగాడనిపించింది. తాను ఒక వ్యక్తికి ఒక కోడి బాకీ ఉన్నాననీ, దాన్ని తిరిగి చెల్లించాలనీ సోక్రటీస్ విషం సేవించడానికి ముందు తన శిష్యులతో చెబుతాడు. దీన్ని ప్లేటో నమోదు చేశాడు. రోహిత్ సైతం తాను రామ్‌జీ అనే మిత్రుడికి నలభైవేల రూపాయలు బాకీ ఉన్నా ననీ, విశ్వవిద్యాలయం నుంచి రావలసిన రూ. 1.75 లక్షల ఉపకార వేతనం తాలూకు బకాయీలు వసూలు చేసి రామ్‌జీ బాకీ తీర్చి తక్కిన మొత్తం తన కుటుంబసభ్యులకు ఇవ్వాలని స్నేహితులను కోరాడు. ఎప్పుడూ రోహిత్ ఇంతే కవితాత్మకంగా, ఆలోచనాత్మకంగా, ఉదాత్తంగా మాట్లాడేవాడో, లేదో తెలియదు. ఆత్మహత్య చేసుకోవాలన్న కఠోరమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఉరి వేసుకోవడానికి ముందు ఇంత ప్రశాంతంగా, ఇంత సంయమనంతో, ఇంతటి క్షమాగుణంతో ఆలోచించడం చూస్తే అతడు అసాధారణ వ్యక్తి అనిపిస్తుంది. అంబేడ్కర్ నేర్పింది పోరాటం హాస్టల్ ఖాళీ చేయమని విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆదేశించినప్పుడు తన వస్తువులతో పాటు పెద్ద అంబేడ్కర్ ఫోటో పట్టుకొని రోహిత్ హాస్టల్ నుంచి బయటకు వస్తున్న చిత్రం పత్రికలో చూసినప్పుడు అంబేడ్కర్ నుంచి స్ఫూర్తి పొందిన విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకు ఒడిగట్టడం విషాదం అనిపించింది. అంబేడ్కర్‌కు ఎదురైన అవమానాలతో పోల్చితే రోహిత్ కష్టాలు తక్కువే. వందేళ్ల కిందటి హిందూ సమాజం మరింత ఛాందసంగా, మరింత నిర్దయగా ఉండేది. ఎన్ని అవమానాలూ, అవరోధాలూ ఎదురైనా అన్నిటినీ అధిగమించాడు అంబేడ్కర్. రాజ్యాంగం అనే ఒకానొక మహ త్తరమైన సాధనంతో దళితుల దాస్యశృంఖలాలను తెంచడానికీ, వారి అభ్యు న్నతికి బాటలు వేయడానికీ, అహింసాత్మకంగా సమాజంలో పెనుమార్పు సాధించడానికీ కృషి చేసి చరితార్థుడైనాడు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియే షన్ (ఏఎస్ఏ)కు నాయకత్వం వహించిన యువకుడు అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతులలో పోరాటం సాగించాలి. దళితులకు కానీ దళితేత రులకు కానీ సమస్యలను చూసి గుండె చెదిరి లేదా అవమానాలకు కుంగి పోయి చేతులారా ప్రాణాలు తీసుకునే హక్కు లేదు. వాస్తవానికి ఇది కేవలం ఒక విద్యార్థి పరాజయం లేదా పలాయనం కాదు. సమాజం యావత్తూ సిగ్గుతో తలదించుకోవలసిన అమానుషం. మొదటితరం విద్యావంతుడైన రోహిత్ ఇంత ఎత్తుకు ఎదగ గలిగితే రెండో తరం, మూడో తరం విద్యావంతులైన దళితులు ఇతర కులాలవారితో దీటుగా రాణించగలుగుతారు. మరికొన్ని దశాబ్దాలు రిజర్వేషన్లు సవ్యంగా అమలు జరిగితే ఆ తర్వాత రిజర్వేషన్ల అవసరమే ఉండదు. దళితులకూ, ఆదివాసీ లకూ రిజర్వేషన్లూ, ఇతర సౌకర్యాలూ రాజ్యాంగంలో కల్పించకపోయినట్ల యితే దేశం ఏడు దశాబ్దాలుగా సమైక్యంగా ఉండేది కాదు. అంతర్యు ద్ధాలతో చిరిగిన విస్తరై విఫల రాజ్యమయ్యేది. హిందూమతం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చూసినా తరతరాలు వస్తున్న వికారాలనూ, వివక్షలనూ వదిలించుకొని, కులాల పేరుతో కట్టుకున్న అడ్డుగోడలను కూల్చివేసుకొని సమైక్యభావన పెంపొందించుకోవాలి. ఈ భావన భావిపౌరులైన విద్యార్థులలో బలంగా నాటుకోవాలి. రాజకీయాల పేరుతో, కులాలపేరుతో, మతాల పేరుతో కుంపట్లు పెట్టి అగ్గి రాజేస్తూ పోయే కార్యక్రమానికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పకపోతే, పిడివాదాన్ని పక్కనపెట్టకపోతే ఈ జాతికి నిష్కృతి ఉండదు. భారతీయతను అర్థం చేసుకు న్నవారికి భిన్నత్వంలో ఏకత్వం, అందులోని సౌదర్యం తెలిసి తీరుతుంది. భిన్న భావాలు సంఘర్షించుకోవాలి. అప్పుడే కొత్త ఆలోచనలకూ, ప్రగతికీ తలుపులు తెరుచుకుంటాయి. యూనిర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థి సంఘాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), ఏఎస్ఏ మధ్య వివాదం దేనిపైన ? యూకూబ్ మెమెన్‌ను ఉరితీయడంపైనా, ముజఫర్‌నగర్ అల్లర్లపైనా రెండు విద్యార్థి సంఘాలకూ పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ‘రా’ అనే భారత గూఢచర్య సంస్థ ఇచ్చిన హామీల కారణంగా లొంగిపోయి స్వదేశానికి తిరిగి వచ్చిన మెమెన్ ముంబయ్ అల్లర్లపైన పరిశోధనలో సహకరించాడు. కరాచీలో దావూద్ ఇబ్రాహీం నివాసం ఎక్కడో చెప్పాడు. తన అన్న టైగర్ మెమెన్ గుట్టుమట్టులు కూడా మన ఇంటెలిజెన్స్ సంస్థలకు వెల్లడించాడు. మెమెన్‌ను ఉరితీయడం సరికాదని నా బోటి జర్నలిస్టులూ, రాజకీయ నాయకులూ, మేధావులూ అనేకమంది వాదించారు. ఉరే సరి అంటూ వాదించినవారూ ఉన్నారు. అది అంతటితో ఆగాలి. ఏఎస్ఏ విద్యార్థులను గూండాలుగా అభివర్ణిస్తూ ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఫేస్బుక్లో రాయడం, చినికి చినికి గాలివాన అయినట్టు రోహిత్ సహా అయిదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచీ, హాస్టల్ నుంచీ బహిష్కరించడం వరకూ వెళ్లింది. తక్కిన విషయాలు వారం రోజులుగా నలుగుతున్నవే. ఇక్కడ చెప్పడం చర్విత చర్వణం అవుతుంది. హెచ్‌సీయూలో ఏఎస్ఏని స్థాపించి రెండు దశాబ్దాలవుతోంది. ఈ మధ్య చెప్పుడు మాటలు చెవికి ఎక్కించుకొని చెన్నై ఐఐటీలో అంబేడ్కర్ పెరియార్ స్టడీ సర్కిల్పైన స్మృతి ఇరానీ నిషేధం విధించిన తర్వాత దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనిట్లు వెలి శాయి. బొంబాయి ఐఐటీలో అంబేడ్కర్, పెరియార్, ఫూలే సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు. అణచివేత పెరిగినకొద్దీ పోరాటం ఉధృతం అవుతుంది, విస్తరిస్తుంది. కత్తులు ఒరలో పెట్టి కరచాలనం చేయించే ప్రక్రియ ఇప్పుడు కావాలి. ఈ ప్రక్రియ అమలు చేసేవారికి నిజాయితీ అత్యవసరం. మోదీదే భారం ఇరవై మాసాల కిందట ఎన్నికల ప్రభంజనం సృష్టించిన ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారంనాడు లక్నోలో అంబేడ్కర్ యూనివర్శిటీలో రోహిత్ ప్రస్తావన తెచ్చి ‘దేశం ఒక బిడ్డను కోల్పొయింది. ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలను’ అంటూ కళ్లు వొత్తుకున్నా ఎందుకో వెలితిగానే ఉంది. ఎక్కడో ఏదో లోపం. అది ఏమిటో తెలిసినా ప్రధాని దృష్టికి తెచ్చే సాహసం ఎవరికీ ఉన్నట్టు లేదు. ఆర్థిక వ్యవస్థకు అవరమైన గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం ప్రతిపక్షంతో సయోధ్య సాధించేందుకు ప్రయత్నించవలసిన ప్రధాని ఆ పని చేయడం లేదు. పైగా ఎన్నికల ప్రచా రంలో ప్రదర్శించిన విస్ఫోటక ధోరణినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 71 సంవత్సరాల నాటి నేతాజీ రహస్య పత్రాలను విడుదల చేయ డంలో కాంగ్రెస్‌ను బదనాం చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ అమ్ములపొదిలోని ఒక అస్త్రాన్ని నిర్వీర్యం చేయడం కూడా మోదీ లక్ష్యం. ఈ రాజకీయ క్రీడల వల్ల ప్రతిపక్షాలకు నష్టం వాటిల్ల వచ్చునేమో కానీ అధికార పక్షానికి ప్రయోజనం ఉండదు. కీలకమైన బిల్లు లకు రాజ్యసభలో ఆమోదం పొంది, రెండవ తరం ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయాలని మోదీని రెండేళ్లుగా భుజాలపైన మోస్తున్న కార్పొరేట్‌రంగం అధిపతులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు జరగాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా సమాజంలో శాంతిసుస్థి రతలు ఉండాలి. ఇంతకాలం భారతీయ జనతా పార్టీ శ్రేణులలో, ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులలో పేరుకొని ఉన్న భావజాలాన్ని నవీకరించ వలసిన అవసరం ఉన్నదని మోదీకి తెలుసు. కానీ ఆయన ఆ పని చేయలేక పోతున్నారు. తన ఎజెండాను మార్చుకొని, కాంగ్రెస్‌పైన గురిపెట్టిన అస్త్రా లను సమస్యలపైనా, వివాదాలపైనా సంధిస్తే ప్రభుత్వం పట్లా, ప్రధాని పట్లా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాలను ఎంత ఘనంగా జరిపినా, అంబేడ్కర్ స్మారక భవనం ఎంత అందంగా నిర్మించినా, అంబేడ్కర్ నామస్మరణ నిత్యం చేసినా అంబేడ్కర్ ఎవరినైతే ఉద్ధరించడానికి జీవితాన్ని అంకితం చేశారో వారికి ఆత్మహత్య వినా మరో మార్గం కనిపించని పరిస్థితులు కల్పిస్తే ప్రయోజనం ఏమిటి? అంబేడ్కర్ విగ్రహ పరిష్వంగం కాదు కావలసింది. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ఆత్మగతం చేసుకోవడం. త్రికరణశుద్ధిగా అమలు చేయడం. ఇందుకు పార్టీనీ, పార్టీ అనుబంధ సంస్థలనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ సంసిద్ధం చేయడం. అప్పుడే దళితులకు హిందూమతం పట్ల వ్యతిరేక భావం తగ్గుతుంది. సమైక్యభావన బలపడుతుంది. ఈ సంగతి తెలిసిన ప్రముఖులు కొందరు ఆర్ఎస్ఎస్లోనూ, బీజేపీలోనూ ఉన్నారు. కానీ అందరినీ శాసించే స్థాయిలో కానీ ఒప్పించే స్థితిలో కానీ వారు లేరు. దళితులనూ, ఆదివాసీలనూ అక్కున చేర్చుకుంటేనే హిందూమతానికి కానీ, దేశానికి కానీ మనుగడ సాధ్యం అనే వాస్తవాన్ని గ్రహించినవారి సంఖ్య పెరిగేంత వరకూ రోహిత్ వంటి దళిత యువకులకు రక్షణ లేదు. బీజేపీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందన్న భరోసా లేదు. - కె.రామచంద్రమూర్తి -
మరాఠా యోధుడి మనోగతం
త్రికాలమ్ ‘వో లంబీ రేస్ కీ ఘోడా హోగీ’ (అది చాలా దూరం పరుగెత్తగల గుర్రం) అంటూ సోనియాకు ఆమె సలహాదారులు నూరిపోసి తనకు ప్రధానమంత్రి పదవి దక్కకుండా చేశారంటూ మరాఠా నాయకుడు శరద్‌పవార్ ఆత్మకథలో రాసుకున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న తనను కాదని, అనారోగ్యం కారణంగా ఎన్నికలలో పోటీ చేయకుండా హైదరా బాద్ వెళ్లిపోవటానికి బిస్తరు సర్దుకున్న పీవీ నరసింహారావును ప్రధాని పదవిలో నియమించడానికి కారణం స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవారికి పదవి అప్పగించడం సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. తనకు స్వతంత్ర వ్యక్తిత్వం, స్వాభిమానం దండిగా ఉన్నాయని ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం సోనియాకూ, శరద్ పవార్‌కూ, ప్రపంచానికీ నిర్ద్వంద్వంగా పీవీ నిరూపించారు. అది వేరే విషయం. 1991 నాటి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో ప్రాణాలు వదిలారు. ఇందిరాగాంధీ హత్య జరిగిన కొన్ని గంటలలోనే రాజీవ్ చేత ప్రధానిగా ప్రమాణం చేయించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెండో దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మైనారిటీ ప్రభు త్వం ఏర్పాటు చేసే అవకాశం ముందుగా సోనియాగాంధీకే ఇచ్చేవారు. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరు. కొంతకాలం మరో నాయకుడిని ప్రధానిగా నియమించాలని నిర్ణయించారు. ఈ పదవిని ఆశించినవారిలో శరద్ పవార్, అర్జున్‌సింగ్, నారాయణ్ దత్ తివారీ ముఖ్యులు. ఈ ముగ్గురినీ కాకుండా హైదరాబాద్‌లో రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ, రాసు కుంటూ కాలక్షేపం చేయాలనుకుంటున్న పీవీని పదవి వరించింది. శరద్ పవార్ ఆత్మకథ ‘లైఫ్ ఆన్ మై టర్మ్స్-ఫ్రమ్ గ్రాస్ రూట్స్ టు కారిడార్స్ ఆఫ్ పవర్’లో చెప్పినట్టు అప్పట్లో సోనియాగాంధీని ప్రభావితం చేసిన వ్యక్తులు ఫోతేదార్, ఆర్కె ధవన్, వి జార్జితో పాటు మధ్య ప్రదేశ్ ఠాకూర్ అర్జున్‌సింగ్. ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పీసీ అలెగ్జాండర్‌ది కూడా ముఖ్య భూమికే. వీరు ముందు శంకర్‌దయాళ్ శర్మను సూచించారు. ఆయన అనారోగ్యం మూలంగా పదవీ భారం మోయలేనంటూ నిరాకరించడంతో అనుభవజ్ఞుడూ, మృదుస్వభావి అయిన పీవీ నరసింహా రావును అడిగారు. అయిష్టంగానే అంగీకరించిన పీవీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శక్తివంచనలేకుండా పదవికీ, దేశానికీ న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. అర్జున్‌సింగ్ అభ్యర్థిత్వం గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఇందిరతో విభేదాలు శరద్ పవార్‌ని సోనియాగాంధీ మాత్రమే కాదు ఆమె అత్తగారు ఇందిరాగాంధీ సైతం విశ్వసించలేదు. కారణం ఏమిటి? మొదటి నుంచి బొంబాయి రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఢిల్లీ వ్యతిరేక భావజాలం ఎక్కువ. మరాఠా-మొఘల్ వైరం కొనసాగింపు కావచ్చు. తమదైన ఢిల్లీ సింహాసనాన్ని మొఘల్లూ, బ్రిటిష్ వారూ, నెహ్రూ-గాంధీ కుటుంబీకులూ ఆక్రమించుకున్నారనే భావన మరాఠా లలో బలంగా ఉండి ఉండవచ్చు. చక్కెర పరిశ్రమను గుప్పిటలో పెట్టుకున్న మరాఠాలు పశ్చిమ మహారాష్ట్రలో మహాశక్తిమంతులు. యశ్వంతరావ్ బల్వం తరావ్ (వైబీ) చవాన్ మరాఠా నాయకుడుగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణమంత్రిగా అనేక పదవులు నిర్వహించి సమర్థుడైన నేతగా పేరు తెచ్చు కున్నారు. శరద్‌కు చవాన్ ప్రోత్సాహం ఉంది. 1967లో శాసనసభకు బారా మతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్ర్కమించి జనతా పార్టీతో భుజం కలిపి 1978లో ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అతి పిన్న వయస్సులో (38 ఏళ్ళకే) ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఘనత ఆయనది. ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగానే చేసిన మొదటి పనులలో శరద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం ఒకటి. ముఖ్య మంత్రిగా ఇందిర నియమించిన అబ్దుల్ రెహమాన్ అంతూలే ఇందిరా ప్రతిభా ప్రతిష్ఠాన్ పేరుతో సంస్థను నెలకొల్పి అక్రమంగా చందాల దందా నిర్వహించి పదవిని కోల్పోయాడు (12 సంవత్సరాల విచారణ తర్వాత న్యాయస్థానాలు అంతూలేని నిర్దోషిగా తేల్చాయి). అంతూలే తర్వాత బాబాసాహెబ్ భోంస్లే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత సహమరాఠా నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడిన పవార్ తిరిగి 1987లో రాజీవ్‌గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. శంకర్రావ్ చవాన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిగా పంపించి 1988లో రెండోసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించాడు. 1990 ఎన్నికలలో కాంగ్రెస్‌కు 288 స్థానాల అసెంబ్లీలో 141 స్థానాలు దక్కాయి. 12 మంది ఇండిపెండెంట్ల సహాయంతో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగారు. 1993 మార్చి 6న నాలుగో విడత మహరాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ మరుసటి సంవత్సరమే శాసనసభకు ఎన్నికై లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి మహారాష్ట్ర రాజకీయాలలో కొనసాగారు.1991లో ప్రధాని పదవి దక్కకపోయినా పీవీ మంత్రిమండలిలో రక్షణ మంత్రిగా పనిచేశారు పవార్. తనకూ, పీవీకి మధ్య అలెగ్జాండర్ రాజీ చేసినట్టు ఆత్మకథలో రాసుకున్నారు. తనకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ పెద్దవాడైన పీవీకి పవార్ సహకరిస్తూనే ఒక ప్రత్యామ్నాయంగా ఉంటూ వచ్చారు. అపర చాణక్యుడుగా పేరు తెచ్చుకున్న పీవీ అయిదేళ్లపాటూ నిరాఘా టంగా పరిపాలించారు. 1996 ఎన్నికలలో పరాజయం తర్వాత ప్రధాని పద వికీ, పార్టీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన పీవీని పార్టీ దారుణంగా అవమా నించింది. సీతారాం కేసరిని పార్టీ అధ్యక్షుడుగా నియమించింది పీవీనే. కానీ 1998 పార్లమెంటు ఎన్నికలలో పీవీకి పార్టీ టిక్కెట్టు ఇవ్వడం లేదంటూ కేసరి ప్రకటించినప్పుడు మౌన ప్రేక్షకుడుగా మిగిలిపోయాన ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన పుస్తకం ‘ది బ్రింక్ అండ్ బ్యాక్’లో ఆవేదన వెలిబుచ్చారు. అటు అర్జున్, ఇటు శరద్ పీవీ హయాంలో హరియాణాలోని సూరజ్‌కుంద్‌లో (1993) ఏఐసీసీ సమావే శాలు జరిగాయి. ఢిల్లీలో పనిచేస్తున్న ఒక విలేకరిగా నేనూ వెళ్ళాను. ఒకవైపు శరద్ పవార్, మరోవైపు అర్జున్‌సింగ్. సభాస్థలికి వెళ్లే మార్గంలో శివశంకర్, షీలాదీక్షిత్, మొహిసినా కిద్వాయ్, నట్వర్‌సింగ్ కూర్చొని నిరసన ప్రకటిస్తు న్నారు. వీరంతా సోనియా విధేయులు. పీవీకి వ్యతిరేకులు. వేదిక మీద కూర్చున్న అర్జున్‌సింగ్ మద్దతు వీరికి ఉన్నది. అయన ప్రధానమంత్రిపైన రోజుకో లేఖాస్త్రం సంధించేవాడు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయక త్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) విజయం సాధించింది. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం తాలూకు కీర్తి ఎన్డీఏ గెలుపునకు తోడ్పడింది. బాలయోగి స్పీకర్‌గా ఉన్న లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శరద్‌పవార్. పార్లమెంటరీ కమిటీలలో కాంగ్రెస్ పక్షాన ఎవరిని సభ్యులుగా నియమించాలో సోనియాతో చర్చించి ఒక జాబితా తయారు చేసి స్పీకర్‌కు పవార్ సమర్పించారు. స్పీకర్‌కు కాంగ్రెస్ తరఫున రెండో జాబితాను పార్టీ విప్ కురియన్ అందజేశాడు. కురియన్ ఇచ్చిన జాబితాను ఉపసంహ రించుకోవలసిందిగా సోనియాను పవార్ అడిగితే ఆమె ససేమిరా అనే సరికి పవార్ హతాశుడైనారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైదొలగి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. యూపీఏలో భాగస్వామిగా వ్యవ సాయ మంత్రిత్వ శాఖను నిర్వహించారు. అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల తాకిడి తట్టుకోవడానికి పవార్ అన్ని మాయో పాయాలూ వినియోగించారు. హాజీ మస్తాన్‌తో, దావూద్ ఇబ్రహీంతో సంబం ధాలు ఉండేవని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న దశలో తన మంత్రిమండలిలో సభ్యుడుగా ఉన్న శరద్ పవార్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించారు పీవీ. 1993 మార్చి 6న నాలుగో సారి ముఖ్యమంత్రిగా పవార్ ప్రమాణం చేస్తే వారం తిరగకుండానే మార్చి 12న బొంబాయిలో పేలుళ్లు సంభవించాయి. బృహత్ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ జీఆర్ ఖైర్నార్ పవార్పైన అనేక ఆరోపణలు చేశారు. గాంధేయవాది అన్నా హజారే పవార్‌పై అవినీతి ఆరోపణలు చేసి ఉద్యమం నిర్వహించారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ- శివసేన కూటమి విజయం సాధించి మనోహర గజానన్ జోషి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో మహారాష్ట్ర స్థాయిలో పవార్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత కేంద్రంలోనే. క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా పని చేసినా, పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించినా, మంత్రిగా ఉన్నా అవినీతి ఆరోపణలు ఆయనను విడిచిపెట్టలేదు. పశ్చమ మహారాష్ట్రలో విస్తృతమైన ప్రాబల్యం కాపాడుకుంటూ పవార్ పార్టీని నిలబెట్టుకున్నారు. కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని తలపోస్తున్నారు. సోనియాగాంధీ, ఇతర రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీలు విడుదల చేసిన పవార్ ఆత్మకథలో నిజాలూ, నిష్టూరాలతో పాటు కొత్తతరం నాయకులు తెలుసుకోవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. మరాఠా యోధుడుగా, తిరుగుబాటు స్వభావం కలిగిన గండరగండ డుగా, ప్రగతిశీల రాజకీయవాదిగా, రాజనీతిజ్ఞుడు కావడానికి ప్రయత్నించి ఒక అడుగు కిందనే నిలిచిపోయిన విఫలమనోరథుడుగా శరద్ పవార్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇందిరనే ధిక్కరించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్టు) నెలకొల్పి, ఎన్టీ రామారావు విజయవాడలో నిర్వహిం చిన ప్రతిపక్ష సదస్సుకు హాజరై ప్రత్యామ్నాయ రాజకీయాలకోసం పాటుపడిన వ్యక్తి పవార్. అటువంటి రాజకీయవాదిని ఇందిర కోడలునంటూ సగర్వంగా చెప్పుకునే సోనియాగాంధీ విశ్వసించకపోవడంలో వింత ఏమున్నది? తమిళ నాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసివచ్చిన రెండు సందర్భాలలోనూ జయలలిత తన స్థానంలో పన్నీర్ సెల్వంనే నియమించారు కానీ వెన్నెముక కలిగిన రాజకీయ నాయకుడిని నిలబెట్టలేదు. వెన్నెముక లేదనుకొని భావించి బిహార్ ముఖ్యమంత్రిగా మాంఝీని నిలబెట్టిన నితీశ్ కుమార్ ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిందో చూశాం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీ నరసింహారావులో వచ్చిన మార్పు గమనించాం. ఈ నేపథ్యంలో రాజకీయాలతో ప్రమేయం లేని, ముఠాలు కట్టే తెలివితేటలు లేని మన్మోహన్సింగ్ వంటి సౌమ్యుడైన మేధావిని సోనియా నమ్ముతారు కానీ శరద్ పవార్ వంటి బలమైన రాజకీయవాదిని నమ్మి ప్రధాని పదవిని అప్పగిస్తారా? అత్యున్నత పదవిని ఆశించడం పవార్ తప్పిదం కాదు. ఆయన చేతికి పగ్గాలు అప్పగించకపోవడం సోనియా దుర్మార్గం కాదు. రాజ కీయం అంటే అదే. -కె. రామచంద్రమూర్తి -
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
త్రికాలమ్ రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ నిర్మాతలనూ, ముఖ్యంగా అంబేడ్కర్నూ ఇటీవల ఘనంగా స్తుతించినవారు సైతం రాజ్యాంగ స్ఫూర్తిని త్రికరణశుద్ధిగా అమలు చేయక పోవడం విషాదం. మాటకూ, చేతకూ పొంతన ఉండాలన్న పట్టింపు బొత్తిగా లేదు. ప్రేమలో, సమరంలో ఏదైనా చెల్లుతుందని నానుడి. ఎన్నికల పోరాటంలోనూ గెలుపే పరమావధిగా పావులు కదపవచ్చుననీ, రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ తిలోదకాలు ఇవ్వవచ్చుననీ అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులూ భావిస్తున్నారు. ఈ విషయంలో మినహాయింపులు లేవు. మోతాదులో వ్యత్యాసం ఉంటే ఉండవచ్చు. ఇదివరకు ‘ఆయారాం, గయారాం’ రాజకీయాలు హరియాణాలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలో ప్రబలంగా ఉండేవి. నరేంద్రమోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగానూ, అమిత్ షాని పార్టీ అధ్యక్షుడిగానూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నియమించిన అనంతరం విజయమే ప్రధానంగా ఎన్నికల వ్యూహాలు రచించి తెగించి అమలు చేశారు. బీజేపీ అభ్యర్థులు లేని అనేక నియోజక వర్గాలలో యూపీఏ-2లో మంత్రులుగా పని చేసినవారినీ, 2009లో కాంగ్రెస్ టిక్కెట్టుపైన గెలిచినవారినీ పిలిచి బీజేపీ టిక్కెట్లు ఇచ్చి పోటీలో నిలబెట్టారు. ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించిన తర్వాత శివసేన నాయకుడు సురేశ్ ప్రభును పార్టీలో చేర్చుకొని మంత్రిమండలిలో చోటు కల్పించారు. తెలుగు రాష్ట్రాలలో ముమ్మరం తెలుగు రాష్ట్రాలలో ఈ తెగులు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయపాటి సాంబశివరావు వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన చంద్రబాబునాయుడు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పినా పర్వాలేదంటారు. అవ సరం లేకపోయినా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నాయకులను ఏమనాలి? నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి ప్రమాణం స్వీకరించక మునుపే వైఎస్ఆర్సీపీ నుంచి వైదొలిగి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అరకు లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత తనకు టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన వైఎస్ఆర్సీపీకి దూరదూరంగా ఉంటూ టీడీపీతో అంటకాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఫలితం లేదు. స్పీకర్ ఈ అంశాన్ని పార్లమెంటు హక్కుల కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడే అపరిష్కృతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ఎంఎల్సీలను చంద్రబాబునాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నారు. టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికలలో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకోవడమే కాకుండా మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన. తీగల కృష్ణారెడ్డి (రంగారెడ్డి జిల్లా మహేశ్వరం), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం), చల్లా ధర్మారెడ్డి (వరంగల్లు జిల్లా పరకాల), రెడ్యానాయక్ (వరంగల్లు జిల్లా డోర్నకల్) టీఆర్ఎస్లో చేరిపోయారు. వైఎస్ఆర్సీపీ టిక్కెట్టుపైన ఖమ్మం జిల్లాలో గెలిచిన ముగ్గురిలో ఇద్దరు శాసనసభ్యులను కలిపేసుకున్నారు. అందరికంటే ముందు గీత దాటినవారు కాంగ్రెస్ ఎంఎల్సీలు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, రాజేశ్వరరావు. వారు టీఆర్ఎస్లోకి ఫిరాయించినప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. ఆయన రెండు విడతల పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో పలుమార్లు మంత్రిగా పని చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునే అవకాశం ఉన్న నాయకుడు. పార్టీ ఫిరాయించినవారిపైన చర్య తీసుకోవాలనీ, వారి సభ్యత్వాలు రద్దు చేయాలనీ మండలి అధ్యక్షుడు స్వామి గౌడ్‌కు శ్రీనివాస్ విజ్ఞాపన పత్రం సమర్పించారు. సినిమా పరిభాషలో ‘సీన్ కట్’ చేస్తే అదే ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని, కేసీఆర్ చేత మెడలో కండువా వేయించుకొని, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారు హోదాలో ప్రజాసేవ చేస్తున్నారు. నిజమే. ఇది ఇప్పుడే కొత్తగా ఒక్క తెలంగాణలోనే జరుగుతున్న తంతు కాదు. కానీ, కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సృజనాత్మకమైన జనహిత కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకుంటున్న విధంగానే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా శిరసావహించి, తు.చ. తప్పకుండా పాటించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని తెలంగాణ ప్రజలు ఆశించడంలో తప్పు లేదు. వరంగల్లు లోక్‌సభ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాతనైనా తలసాని చేత రాజీనామా చేయించి సనత్‌నగర్‌లో ఉప ఎన్నిక జరిపించవచ్చు. మర్రి శశిధరరెడ్డి కోరిక తీర్చవచ్చు. తలసాని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు శశిధరరెడ్డి తట్టని తలుపు లేదు. తొక్కని గడప లేదు. ఆయన వాదన సమంజసమైనదే అయినప్పటికీ అధికార రాజకీయాల దాష్టీకం ఫలితంగా అది అరణ్యరోదనగానే మిగిలింది. సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చట్టసభ వ్యవహారాలలో జోక్యం చేసుకునే వీలు లేని కారణంగా హితబోధ చేస్తున్నదే కానీ శ్రీనివాస యాదవ్ సభ్యత్వంపైన నిర్ణయం తీసుకోవాలని శాసనసభాపతిని ఆదేశించే పరిస్థితి లేదు. శాసనసభాపతి రాజ్యాంగ నిబంధనలను పాటించనప్పుడు ఏమి చేయాలో పాలుపోక అసహాయతను వ్యక్తం చేస్తున్న హైకోర్టును చూస్తున్నాం. ఎస్ఆర్ బొమ్మయ్ కేసులో గవర్నర్ నివేదికలపైన ఆధారపడి, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన రాష్ట్రపతి నిర్ణయాన్నే సుప్రీంకోర్టు తిరగదోడింది. ఆ కేసులో వెలువరించిన 300 పేజీల తీర్పు 356వ అధికరణ దుర్వినియోగాన్నే కాకుండా ఫిరాయింపుల నిరోధక చట్టంపైన కూడా సవిస్తరంగా చర్చించింది. పార్టీలే ప్రధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నమోదైన ప్రతి రాజకీయ పార్టీకీ నిర్దిష్టమైన హక్కులు ఉన్నాయి. 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ ఆదేశాన్ని (విప్‌ను) ధిక్కరించిన సభ్యుడిని పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. పార్టీలో మూడింట ఒక వంతు సభ్యులు పార్టీని వీడి వేరే పార్టీలో చేరినట్లయితే అది ఫిరాయింపు కిందికి రాదు. చీలిక వర్గం వేరే పార్టీలో విలీనమైనట్టు పరిగణిస్తారు. ఎన్నికల సంస్కరణలను సూచించిన దినేశ్ గోస్వామి కమిటీ, ఎన్నికల చట్టాలను సంస్కరించాలంటూ సిఫార్సు చేసిన లా కమిషన్, రాజ్యాంగం అమలు తీరును సమీక్షించిన జాతీయ సంఘం (నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్-ఎన్సీఆర్డబ్ల్యూసీ) వంటి సంస్థలు ఈ నిబంధన వల్ల రాజకీయ పార్టీలలో తిరుగుబాట్లు ఎక్కువై అస్థిరత చోటు చేసుకుంటుందనే ఆందోళన వెలిబుచ్చాయి. 2003లో అటల్ బిహారీ వాజపేయి హయాంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భయాన్ని కొంత వరకూ తొలగించారు. మూడింట రెండు వంతుల సభ్యులు పార్టీ వీడితేనే అది మరో పార్టీలో విలీనంగా పరిగణించాలనీ, అంతకంటే తక్కువ మంది సభ్యులు నిష్ర్కమిస్తే అది ఫిరాయింపు అవుతుందనీ కొత్త చట్టం స్పష్టం చేసింది. రెండు సవరణలలోనూ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తీసుకునే చర్యలు చట్టసభల పరిధిలోకి మాత్రమే వస్తాయనీ, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంత మాత్రం ఉండకూడదనీ స్పష్టంగా ఉన్నది. సభాపతి నిర్ణయమే అంతిమం. లోక్‌సభాపతి లేదా రాజ్యసభ అధ్యక్షుడు, శాసనసభాపతి లేదా శాసనమండలి అధ్యక్షుడు సాధారణంగా అధికార పార్టీకి చెందినవారై ఉంటారు. వారిపైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి ప్రభావం ఎంతోకొంత పరోక్షంగానైనా ఉంటుంది. అందుకే అధికార పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకొని సభాపతులు వ్యవహరిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే ఫిరాయింపులకు ఆస్కారం ఉండదు. కానీ రాజ్యాంగం ప్రసాదించిన పదవులలో ఉన్న వ్యక్తులే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రం ఏమి చేయగలదు? రాజ్యాంగం ప్రభావం దాన్ని అమలు చేసేవారి అంకిత భావంపైన ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ అందుకే చెప్పారు. రాజ్యాం గాన్ని పాటించవలసినవారిలో చిత్తశుద్ధి లోపించిందనే వాస్తవం కశ్మీర్ నుంచి కొచ్చి వరకూ సర్వత్రా కళ్లకు కట్టుతున్నది. 52, 91 రాజ్యాంగ సవరణలకు కట్టుబడి చట్టసభల వ్యవహారాలలో జోక్యం చేసుకోలేని హైకోర్టు ‘సదరు సభ్యుడి పదవీకాలం పూర్తయ్యే వరకూ సభాపతి నిర్ణయం తీసుకోరా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నది. పార్టీలో ఒక చిన్న వర్గం చీలిపోవడాన్ని మరో పార్టీలో విలీనంగా పరిగణించరాదంటూ 91వ సవరణ తెచ్చినట్టే పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సభాపతి ఎంత సమయం తీసుకోవచ్చునో నిర్దేశిస్తూ మరో సవరణ చేయవలసిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ఫిరాయింపులను నిరోధించడం సాధ్యం కాదు. జీహెచ్ఎంసీ ఎన్నికల పైనే దృష్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముగిసే వరకూ టీఆర్ఎస్ నేతలు హితవాక్యాలను స్వీకరించే స్థితిలో లేరు. ఎట్లాగైనా సరే కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందాలన్న లక్ష్యంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. వరాలు ప్రకటిస్తున్నారు. 2014 డిసెంబరు 4వ తేదీతోనే జీహెచ్ఎంసీకి ఎన్నికైనవారి పదవీకాలం ముగిసింది. అప్పుడే జరగవలసిన ఎన్నికలు ఏదో కారణంపై వాయిదా పడుతూ వచ్చాయి. జనాభా ప్రాతిపదికగా పునర్విభజన, క్రమబద్ధీకరణ చేసి మొత్తం 200 డివిజన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తీరా కోర్టు డిసెంబర్ 15 కల్లా ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలని నిర్ణయించేసరికి పాత 150 డివిజన్లే ఉంటాయని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దాదాపు సంవత్సరంపాటు వాయిదా వేయడంలోని ఆంతర్యం రాజకీయంగా బలం పుంజుకోవడానికి వెసులుబాటు కల్పించుకోవడమే. ఈ అవసరాన్ని కొందరు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండళ్లలో అధికార పార్టీలు ఆధిక్యం సంపాదించిన పద్ధతిలోనే రాజ్యసభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఎన్డీఏ సంతరించుకోగలిగితే గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం పొందలేక నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సతమతం కావలసిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీతో రాజీ ప్రయత్నాలు చేయవలసిన అగత్యమూ ఉండేది కాదు. ఎన్డీఏ నాయకత్వం అటువంటి దుస్సాహసం చేయదు. కానీ, ఎగువ సభలో ఫిరాయింపులు జరిగే ధోరణే కనుక కనిపిస్తే ఇంగ్లీషు చానళ్ళూ, ఇంగ్లీషు పత్రికలూ, సోషల్ మీడియా ఊరుకోవు. దక్షిణాది రాష్ట్రాలలో ఏమి జరిగినా పట్టించుకోవు. - కె. రామచంద్రమూర్తి -
ప్యారిస్ గుణపాఠాలు
త్రికాలమ్ అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి. ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించవలసిన అవసరాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్ వెంబ్లీ స్టేడియం మహాసభలో నొక్కివక్కాణించిన తర్వాత కొన్ని గంటలకే ప్యారిస్ నగరంపైన ఉగ్రవాదం పంజా విసిరింది. శుక్రవారం రాత్రి ప్యారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న ప్రేక్షకులపైనా, నృత్యసంగీత ప్రదర్శనలు జరుగుతున్న ఒక థియేటర్‌పైనా, మరి కొన్ని చోట్లా ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ జిహాదీలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 127 మందిని చంపివేశారు, రెండు వందలమందికి పైగా గాయపరిచారు. ఇది దిగ్భ్రాంతి కలిగించిన ఘోరకలే అయినప్పటికీ అనూహ్యమైనది కాదు. అగ్రవాదానికీ, ఉగ్రవాదానికీ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న నెత్తుటి క్రీడలో ఇది తాజా పరిణామం. ప్యారిస్‌కి లండన్ ఎంతో దూరం లేదు. అరవై వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్న సభలో రెండు దేశాల ప్రధానులూ ఉన్నారు. వెంబ్లీ స్టేడియంలో సైతం చొరబడి విధ్వంసం సృష్టించే శక్తిసామర్థ్యాలు ఉగ్ర వాదులకు పుష్కలంగా ఉన్నాయి. ఈ సారి ఫ్రాన్స్‌ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకోవడం వల్ల ఇండియా, బ్రిటన్ ప్రధానులకూ, ప్రవాస భారతీయులకూ అపకారం జరగలేదు. ఉగ్ర వాదుల దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలెండ్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఉన్నారు. భద్రతా సిబ్బంది అధ్యక్షుడిని సురక్షితంగా బయటికి తీసుకొని వెళ్ళగలిగారు. అంత వరకూ అదృష్టం. ఇది మానవాళిపైన యుద్ధమని హోలెండ్ అభివర్ణిస్తూ ఉగ్రవాదు లకు తగిన గుణపాఠం చెబుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, జర్మనీ అధినేత మార్కెల్, బ్రిటన్, ఇండియా ప్రధానులూ, ఇతర ప్రపంచ దేశాల నాయకులూ ఉగ్రవాదుల ఘాతుకాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. నిర్ఘాంతపోయిన అంతర్జాతీయ సమాజం అగ్రవాదం ప్రతిక్రియ ఎట్లా ఉండబోతున్నదోనని భయపడుతున్నది. ఎందుకు? 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వాణిజ్య కేంద్రాలైన జంట ఆకాశ హర్మ్యాలపైన అల్‌కాయిదా ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌ల ప్రతీకార చర్యల పరంపర ఐఎస్ఐఎస్ పుట్టుకకు దారి తీసింది. అఫ్ఘానిస్తాన్పైన దాడిని సమర్థించుకోవచ్చు-అక్కడ అల్‌కాయిదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ స్థావరం ఉన్నది కనుక. కానీ ఉగ్రవాదంతో సంబంధం లేని ఇరాక్‌పైన దాడి చేయడం, అందుకు సాకుగా ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్ రసాయనిక ఆయుధాలను తయారు చేసి సౌదీ అరేబియాపైనా, ఇతర అమెరికా మిత్ర దేశాలపైనా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఒక నివేదికను సృష్టించడం ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. సద్దాం హుస్సేన్‌తో పాటు వేలమంది అమాయక ఇరాకీలను అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సైనికులు చంపివేశారు. అనంతరం లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నది. గడాఫీకీ ఉగ్రవాదానికీ సంబంధం లేదు. అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్‌లు కలసి తాలిబాన్‌ను తయారు చేయడానికీ, అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ నిష్ర్కమణకూ, ఆ దేశంలో తాలిబాన్ పాలనకూ దారి తీసింది. ఇరాక్‌లో అత్యధిక భాగం ఇస్లామీయ రాజ్య వ్యవస్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్నది. చమురు నిక్షేపాలపైన ఉగ్రవాద సంస్థ ఆధిపత్యం వల్ల నిధులకు కానీ ఆయుధాలకు కానీ కొరత లేదు. ఇస్లామీయ రాజ్య విస్తరణలో భాగంగా సిరియాలో ఉగ్రవాదులు భీకర సమరం చేస్తున్నారు. అటు రష్యా, ఇటు అమెరికా సిరియాపై యుద్ధవిమానాలు ప్రయోగించడం పట్ల నిరసనగానే ప్యారిస్ దాడులు చేసినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అస్సద్ సైతం ఇదే కారణం ఎత్తి చూపించాడు. అస్సద్‌ను గద్దె దించేందుకు ఐఎస్ఐఎస్ సిరియాలో నరమేధం సాగిస్తోంది. అస్సద్ సైన్యంలో చీలిక వచ్చింది. అస్సద్‌ను రష్యా, ఇరాన్‌లు బలపర్చుతున్నాయి. అమెరికా, నేటో కూటమి ఒకేసారి అస్సద్‌నూ, ఐఎస్ఐఎస్నూ ఓడించే లక్ష్యంతో దాడులు జరుపుతున్నాయి. సిరియాలో అస్సద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లకు అమెరికా, దాని మిత్రదేశాలు సకల విధ సహాయసహకారాలూ అందిస్తున్నాయి. రష్యా విమానాలు ఈ మిలిటెంట్లపైనే దాడులను కేంద్రీకరించాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదులు దాడులు జరిపిన సమయంలో వియన్నాలో 20 దేశాల ప్రతినిధులు సమావేశమై సిరియాలో శాంతిసుస్థిరతలు సాధించడానికి ఏమి చేయాలో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సిరియా ప్రభుత్వ ప్రతినిధి లేరు. ఇరాన్, రష్యా ఒక వైపూ, అమెరికా, నేటో, అరబ్ దేశాలూ మరోవైపూ చేరి వాదులాడుకుంటున్నాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి వల్ల సిరియాలో ఫ్రాన్స్ సైనిక చర్య నిలిచిపోయే ప్రసక్తి లేదంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియన్ ఉద్ఘాటించారు. ఎవరి ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి వారు ప్రయత్నించినంత కాలం సమష్టి కార్యాచరణ కల్ల. అమెరికా, నేటో కూటమి, రష్యా, చైనా, ఇరాన్‌లు కలసి ఏదైనా వ్యూహం రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తేనే ఐఎస్ఐఎస్ ఆటకట్టించడం సాధ్యం. శక్తిమంతమైన దేశాలు ఆధిక్య భావాన్ని తగ్గించుకొని సర్దుబాటు ధోరణి ప్రదర్శించవలసిన సమయం ఇది. ఇరాక్‌పైన యుద్ధం చేయడం ఘోరతప్పిదమనీ, రసాయనిక ఆయుధాల ఉనికి గురించిన నివేదిక తమను తప్పుదారి పట్టించిందనీ టోనీ బ్లెయిర్ ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన జరిగిన నష్టం తగ్గిపోదు. బుష్ అటువంటి పశ్చాత్తాపం సైతం వెలిబుచ్చలేదు. వారిద్దరి దుందుడుకు నిర్ణయాల కారణంగానే ఈ రోజు ఇస్లామీయ రాజ్య ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్నది. ఐఎస్ఐఎస్కు ఇప్పుడు ఒక రాజ్యం, ఆదాయ వనరు, ఒక సైన్యం, మధ్య ఆసియాలో, ఐరోపాలో, భారత ఉపఖండంలో ఉగ్రవాద సానుభూతిపరులూ, మతోన్మాదాన్ని యువత మస్తిష్కంలోకి ఎక్కించే తీవ్రవాదభావజాలం ఉన్నాయి. ఇందుకు ఎవరిని నిందించాలి? తాలిబాన్‌నూ, బిన్ లాదెన్నూ సృష్టించింది ఎవరు? ఏ ప్రయోజనాలను ఆశించి అరబ్ దేశాలలో తిరుగుబాట్లను ప్రోత్సహించారు? అగ్రదేశాల ఆధిపత్యవాదమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది. సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ఉగ్రవాద భావజాల వ్యాప్తి వేగంగా, శక్తిమంతంగా సాగుతోంది. ఇటీవల జంషడ్‌పూర్‌లో కాన్వెంట్లో చదువుకుంటున్న ఒక ముస్లిం యువతి పేరుమోసిన జిహాదీ సిద్ధాంతకర్త అన్వర్ అల్ అవ్లాకీ ఉపన్యాసాలను యూట్యూబ్‌లో వింటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పు అందింది. వారు వెళ్ళి ఆ విద్యార్థిని ప్రశ్నిస్తే అతని ఉపన్యాసాలు తనకు బాగా హృదయానికి హత్తుకుంటాయనీ, తనకు నచ్చిన ఉపన్యాసాలు వినడం నేరం ఎట్లా అవుతుందనీ ఎదురు ప్రశ్నించింది. అవ్లానీ అమెరికా పౌరుడు. మంచి పేరున్న విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. జిహాదీగా మారి ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేసే ప్రావీణ్యం సంపాదించాడు. అమెరికా డ్రోన్ విమానాలు 2011 సెప్టెంబర్‌లో జరిపిన దాడిలో ఈ జిహాదీ గురువు మరణించాడు. కానీ అతని ఉద్బోధలు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ తెలిసిన ముస్లిం యువతీయువకులను జిహాదీ వైపు ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఉత్తర సిరియాలో మొన్న అమెరికా నిర్వహించిన విమాన దాడులలో బ్రిటిష్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ‘జిహాదీ జాన్’ (మహమ్మద్ ఎమ్వాజీ) మృత్యువాత పడ్డాడు. ఇందుకు ప్రతీకారం ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగే మారణహోమం కాదు. కింకర్తవ్యం? నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ పర్యటనలలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలలో ఉగ్రవాదం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, తదితర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని మట్టుపెడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అగ్రవాదంతో చేతులు కలిపినందుకే ఫ్రాన్స్ ఇప్పుడు మూల్యం చెల్లించిందని గమనించాలి. ఫ్రాన్స్ సైతం బహుళత్వానికి పెద్ద పీట వేసే దేశం. అన్ని దేశాలవారినీ, అన్ని మతాలవారినీ ఆదరించే సంస్కృతి ఆ దేశంలో ఉన్నది. ఐరోపా సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీకగా ఫ్రాన్స్‌ను పరిగణిస్తారు. అమెరికా సంపదకూ, ఆధిక్య భావానికి ప్రతీకలైన న్యూయార్క్ జంట శిఖరాల కూల్చివేత, భారత వాణిజ్య కేంద్రమైన ముంబైలో మారణహోమం, ఇప్పుడు ముంబై తరహాలోనే ప్యారిస్‌లో రక్తపాతం- ఈ మూడూ అగ్రవాదంపైన ఉగ్రవాదం చేసిన సంకేత ప్రాయమైన దాడులుగానే పరిగణించాలి. ఉగ్రవాదులు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేయగల స్థితిలో ఉన్నారు. ఉగ్రవాద భావజాలాన్ని మనసంతా నింపుకొని ఆత్మాహుతికి సిద్ధమైనవారు తాము కూలిపోయే ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపివేయడమే లక్ష్యంగా విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ప్యారిస్‌లో దాడికీ, ముంబయ్‌లో (2008 నవంబర్ 26న)దాడికీ పోలికలు ఉన్నాయని ఉగ్రవాదాన్ని అధ్యయనం చేస్తున్న జార్జిటౌన్ యూనివర్సిటీ (యూఎస్) ప్రొఫెసర్ బ్రూస్హాఫ్మన్ అన్నారు. ముంబై తరహాలో యూరప్ అంతటా దాడులు నిర్వహించాలని అయిదేళ్ళ కిందటే బిన్ లాదెన్ ఉగ్రవాద తండాలను ఆదేశించారని అమెరికా ప్రవీణుల సమాచారం. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి విదేశీ వ్యవహారాలలో ఎటువంటి నీతిని పాటించాలో, ఉగ్రవాదం వేళ్ళూనకుండా నివారించడానికి దేశంలో ఎటువంటి విధానాలు అనుసరించాలో నరేంద్రమోదీ సర్కార్ ఆలోచించాలి. ముంబై మారణకాండకు సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్‌ని కానీ ముంబై అల్లర్లకు బాధ్యుడైన దావూద్ ఇబ్రహీంని కానీ ఇండియాకు అప్పగించమని అమెరికా కానీ బ్రిటన్ కానీ పాకిస్తాన్‌పైన ఒత్తిడి తీసుకొని రాలేదు. పైగా పాకిస్తాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం చేస్తూనే ఉన్నది. న్యూయార్క్‌లో దాడికి లేదా ప్యారిస్‌లో దాడికి స్పందించినంత తీవ్రంగా ముంబైలో దాడికి స్పందించలేదు. విదేశాంగ నీతిని నిర్ణయించుకునే క్రమంలో ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకోవాలి. బహుళ మతాలూ, భాషలూ, సంస్కృతుల సమాహారమైన ఇండియా ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి. ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. మతసామరస్యానికి భంగం కలిగించే ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఖండించాలి. అందుకు బాధ్యులైనవారిని శిక్షించాలి. ప్యారిస్ ఘోరం చూసిన తర్వాతనైనా ఈ సంకల్పం చెప్పుకోకపోతే, బాధ్యతారహితంగా మాట్లాడేవారినీ, ద్వేషభావంతో వ్యవహరించేవారినీ అదుపులో పెట్టకపోతే నిప్పుతో చెలగాటం ఆడినట్టే, ఉగ్రవాదానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అదే జరిగితే ఈ దేశ సమైక్యతనూ, సమగ్రతనూ ఎవ్వరూ కాపాడలేరు. శాంతిసుస్థిరతలకు ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. - కె.రామచంద్రమూర్తి -
'నేతల నిజస్వరూపాలను బయటపెట్టారు'
హైదరాబాద్: రాజకీయ పార్టీలు, నాయకుల నిజస్వరూపాలను కె.రామచంద్రమూర్తి మనముందు సాక్షాత్కరింపజేశారని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి రచించిన అన్ విలీంగ్ తెలంగాణ స్టేట్(UNVEILING TELANGANA STATE) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను రాసిన వ్యాసాలను రామచంద్రమూర్తి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఎమ్మెస్కో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ పుస్తకం వ్యాసాల సంకలం మాత్రమే కాదని, సమకాలిన రాజకీయ వ్యవస్థపై గొప్ప సమకాలిన వ్యాఖ్యాత వ్యాఖ్యానాలు ఇందులో ఉన్నాయని అన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. చుక్కా రామయ్య, ఎం.కోదండరామ్, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, కె.నాగేశ్వర్, కె.శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డి, ఎ.కృష్ణారావు, ఎమ్మెస్కో ప్రతినిధులు ఎస్.డి.సుబ్బారెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు రక్షణ యాత్ర
త్రికాలమ్ ‘ఆత్మహత్యలు చేసుకోవద్దు. గౌరవప్రదంగా జీవించే హక్కు మీకు రాజ్యాంగం ఇచ్చింది. ఆత్మహత్య చేసుకునే హక్కు ఇవ్వలేదు. ఆత్మహత్య నేరం. ఇది పోరుగడ్డ. పోరాటం చేసి గెలవాలి కానీ గుండె చెదిరి ఆత్మహత్య చేసుకోవద్దు’. రైతు రక్షణ యాత్ర పేరు మీద శుక్రవారం హైదరాబాద్ నుంచి అయినాపూర్ వెళ్లిన హక్కుల కార్యకర్తలం రైతు సోదరీసోదరులకు విజ్ఞప్తి చేశాం. ‘ఈ రోజు మేం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సభలో మాట్లాడి వెళ్లిన తర్వాత ఒక్కరు కూడా ఆత్మహత్యకు ఒడిగట్టకూడదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ గట్టిగా చెప్పారు. ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రాజీవ్ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినాపూర్ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్యమైన కేంద్రం. నక్సలైట్ ఉద్యమంలోనూ ముందు పీటీలో ఉన్న గ్రామం. పోరాటంలో ప్రాణ త్యాగం చేయడమే కానీ ఆత్మహత్య చేసుకోవడం ఈ నేల చరిత్రలో లేదని విద్యావేత్త చుక్కా రామయ్య రైతులకు గుర్తుచేశారు. అప్పుల ఊబిలో కూరుకొని దిక్కులేని స్థితిలో మృత్యువును ఆశ్రయిస్తున్న రైతులకు ఈ ఉద్బోధ మనోధైర్యం ఇస్తుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో అయిదుగురు రైతులు బలవన్మరణం పొందారు. ‘పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలూ, వ్యాపారవేత్తలూ వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా మాఫ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పడవేసి విలాసవంతంగా జీవిస్తున్నారు. మీరేమో ఒకటి, రెండు లక్షల రూపాయల అప్పు చెల్లించడానికి నిజాయితీగా ప్రయత్నించి విఫలమై అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరేమి తప్పు చేశారు? మీరెందుకు చనిపోవాలి? మీ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేయండి’, అంటూ ప్రోత్సహించాం. సంఘీభావం ప్రకటించడం, రైతు ఒంటరి కాదనీ, సమాజం వెంట ఉన్నదనీ నమ్మబలకడం మినహా చేయగలిగింది ఏమున్నది? వ్యవసాయం రైతును బలితీసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. రైతులలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం లోగడ జరగకపోలేదు. ఆత్మహత్యల పరంపర 1995-96లో ప్రారంభమైతే 1998లోనే రైతు సహాయ కమిటీ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ట్రిబ్యూనల్’ సభ్యులుగా పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, విద్యావేత్త బూర్గుల నరసింగరావు, న్యాయమూర్తి పీఏ చౌదరి, ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్ మెదక్, వరంగల్లు, గుంటూరు, హైదరాబాద్‌లలో బహిరంగ చర్చ (జన్ సున్వాయీ) నిర్వహిం చారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే నాటి ట్రిబ్యూనల్ పర్యటనలలోనూ, నేటి రైతు రక్షణ యాత్రలోనూ రైతులను కలుసుకున్నారు. వారి వెతలు విన్నారు. రైతు ఆత్మహత్యలకి కారణాలు అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటేనని ఆమె చెబుతున్నారు. శాసనసభలో అర్థవంతమైన చర్చ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రెండు రోజులు పూర్తిగా రైతు ఆత్మహత్యలపైనే చర్చ జరిగింది. తెలంగాణ విత్తనాల కేంద్రమనీ, దాదాపు అయిదు వందలకు పైగా విత్తన కంపెనీలు ఇక్కడ ఉన్నాయనీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో చెప్పారు. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి విత్తన కంపెనీల యజమానులు ముందుకు వచ్చారనీ, వారితో సోమవారంనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక సదస్సు ఏర్పాటు చేశారనీ ముఖ్యమంత్రి అన్నారు. వంగడాలపై సంపాదిస్తున్న లాభాలలో కంపెనీలు సగం త్యాగం చేస్తే రైతులకు మహోపకారం చేసినట్టే. రైతులను పీల్చిపిప్పి చేసేవి వంగడాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాలూ, ప్రైవేటు రుణాలూ. అయినాపూర్‌లో కిలో మక్కలు (మొక్కజొన్న గింజలు) రూ. 30కి కొనుగోలు చేసిన కంపెనీలు ఇమిలాక్లోబ్రిడ్ మందు కలిపి నాలుగు కేజీల చొప్పున సంచులు తయారు చేసి సంచి ధర రూ. 1800లుగా నిర్ణయించి, 50 శాతం సబ్సిడీ (రూ. 900) ప్రభుత్వం నుంచి వసూలు చేసి రైతులకు రూ. 900లకు అమ్ముతున్నాయి. వాస్తవానికి నాలుగు కేజీల సంచీని రూ. 300లకు విక్రయించినా కంపెనీలకు న్యాయమైన లాభం మిగులుతుందని భైరాన్‌పల్లికి చెందిన రైతు ఎడవెల్లి చంద్రారెడ్డి వాదించారు. తనకున్న 25 ఎకరాలలో రెండు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. మొత్తం ఎనిమిది బోర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. ఆ ప్రాంతంలో అంతటా ఇదే పరిస్థితి. రైతులు సంఘటితం కావాలి బ్యాంకులు అప్పు ఇవ్వడమే తక్కువ. ఇచ్చినప్పుడు షరతు ఏమంటే ఒక సంవత్సరంలోపు తిరిగి చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. సంవత్సరం దాటితే వడ్డీ 12 శాతం. వడ్డీ వ్యాపారుల సంగతి సరేసరి. గ్రామాలు విధ్వంసం కావడం, సహకార వ్యవస్థ కూలిపోవడంతో సంఘీభావం కొరవడింది. ఒకరి బాధను మరొకరితో పంచుకునే పరిస్థితి లేదు. అప్పులతో సతమతం అవుతున్న రైతును వడ్డీ వ్యాపారి కానీ బ్యాంకు అధికారలు కానీ గట్టిగా నిలదీస్తే అవమాన భారంతో తల్లడిల్లిపోతున్నాడు. భార్యాపిల్లలకి కూడా చెప్పకుండా పురుగుల మందు తాగుతున్నారు లేదా ఉరి వేసుకుంటున్నారు. చావొక్కటే అతనికి కనిపించే పరిష్కారం. సంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు వేతనాలు దర్జాగా పెంచుకోగలిగారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక దీనంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అందుకే రైతులు సంఘం ఏర్పాటు చేసుకోవాలంటూ రైతు జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు యోగేంద్రయాదవ్ శనివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించి రైతుల స్థితిగతులను విచారించారు. నాలుగు రోజుల కిందట మరో ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు రైతుల ఆత్మహత్యలపై వాకబు చేశారు. రైతుల తరఫున పోరాడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. ఒంటరిగా కుమిలిపోయి ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదని హామీ ఇవ్వడమే తెలంగాణ విద్యావంతుల వేదిక, రైతు జెఏసీ సంయుక్తంగా నిర్వహించిన రైతు రక్షణ యాత్ర లక్ష్యం. అయినాపూర్ సమావేశం తర్వాత రైతు యాత్ర చేర్యాల చేరింది. అక్కడ జరిగిన రైతు సభలో విద్యావంతుల వేదిక నాయకుడు మల్లెపల్లి లక్ష్మయ్య నాలుగు సూత్రాలు ఆధారంగా ఉద్యమం నిర్మించాలని ఉద్బోధించారు. ఒకటి, నకిలీ విత్తనాలు, ఎరువులూ, మందులూ అమ్మే కంపెనీలను మూసివేయడం, ఆ కంపెనీల యజమానులను అరెస్టు చేయడం. రెండు, బ్యాంకులు రైతులను చులకనగా చూడకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించడం, రుణ సౌకర్యం కల్పించడం. మూడు, వ్యవసాయ విస్తరణాధికారుల చేత పని చేయించడం, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడం, వారి చేత భూసార పరీక్షలు చేయించడం, ఏ భూమిలో ఏ పంట వేయాలో రైతులకు సలహా చెప్పడం వంటి విధులు నిర్వర్తింపజేయడం. వేలంవెర్రిగా పత్తి పండించేందుకు రైతులు శక్తికి మించి అప్పులు చేయడం, పంట నష్టం కావడంతో కుదేలైపోవడం చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతులలో తొంభైశాతం మంది పత్తి రైతులే. 2002లో బీటీ (బయోటెక్) పత్తి వంగడాలు దేశంలో ప్రవేశించడంతో వ్యవసాయం జూదమైపోయింది. దళారులు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించి పత్తి కొనుగోలు చేస్తారు కనుక ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ పత్తి పంటే గిట్టుబాటు అవుతుందనే భ్రమలో రైతులు పడిపోయారు. విత్తనాల కంపెనీల వ్యాపార ప్రకటనలు ఈ భ్రమ కల్పించాయి. కౌలు రైతులు సర్వస్వం వొడ్డి పత్తి పండించే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. లోగడ నల్లరేగడి భూములలోనే పత్తి వేసేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ పత్తి పండిస్తున్నారు. మూల్యం చెల్లిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ లేకపోవడంతో విత్తనాల, ఎరువుల, పురుగుమందుల కంపెనీల ప్రతినిధులే రైతుల శ్రేయస్సు కాకుండా కంపెనీ లాభాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు పత్తి వేయమని సలహా ఇస్తున్నారు. నాలుగు, కరువు మాన్యువల్ తయారు చేయడం. మూడు నెలలో నమోదైన వర్షపాతం ఆధారంగా కరువు ఉన్నదీ లేనిదీ నిర్ణయించడం సరి కాదు. భారీ వర్షాలు వచ్చిన సందర్భాలలో కూడా ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఈ సంవత్సరం అదే జరిగింది. ఖరీఫ్ పంట ఎండిపోయిన తర్వాత వానలు దండిగా పడినాయి. ప్రయోజనం శూన్యం. పంట స్థితినీ, దిగుబడినీ పరిశీలించిన తర్వాత అసవరమైన సహాయసహకారాలను ప్రభుత్వం అందించే విధంగా కరువు మాన్యువల్ ఉండాలి. బ్యాంకు రుణం ఇచ్చినవారికే పంట బీమా (ఇన్సూరెన్స్) ఇస్తున్నారు. తక్కినవారికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలి. రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన తక్షణ చర్యలు ఇవి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకూ ఇది వర్తిస్తుంది. వైద్యం, విద్యలో సర్కార్ ప్రమేయం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి నిధుల కేటాయింపులు తగ్గుతు న్నాయి. మార్కెట్ స్థిరీకరణకు 2014-15లో రూ. 400 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 75 కోట్లకు కుదించారు. అధీకృత సాగుచట్టం 2011లో వచ్చిన తర్వాత కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమం మందకొడిగానే సాగుతోంది. గుర్తింపు కార్డులు కలిగిన కౌలు రైతులకు సైతం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పత్తి విస్తీర్ణం హెచ్చిన ఫలితంగా కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కనీసం పది లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వీరిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అప్పులు పెరిగి తీర్చలేక నిస్పృహకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాలూ, వాటి మాఫీ ఫలితాలూ కూడా హైదరాబాద్‌లో ఉన్న భూమి యజమానులకు అందుతున్నాయి కానీ సేద్యం చేసే కౌలు రైతులకు అందడం లేదు. రూ.4000 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలూ, రూ.400 కోట్లు పంటరుణాలు ఒక్క ఎకరం కూడా సాగు చేయని హైదరాబాద్ నగరవాసులకు దక్కుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విద్య, ఆరోగ్య రంగం నుంచి ప్రభుత్వం వైదొలగడం కూడా రైతుల ఉసురు తీస్తున్నది. పిల్లల చదువుకోసం, ఆరోగ్యం కోసం రైతు కార్పొరేట్ రంగంపైనే ఆధారపడవలసి వస్తున్నది. ఈ రెండు రంగాలలోకి ప్రభుత్వం తిరిగి రావడం, చెరువులను పునరుద్ధరించడం ద్వారా గ్రామాలకు పాత వైభవం తిరిగి తీసుకురావడం ద్వారా రైతుల బతుకులలో వెలుగు నింపే అవకాశం ఉంది. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అందుకు తగిన వ్యూహాన్ని తయారు చేసుకోవడం కష్టం కాదు. ఆకాశహర్మ్యాల గురించి కాకుండా వ్యవసాయ క్షేత్రాల గురించి ఆలోచించడం తక్షణావసరం. నేల విడిచి సాము చేయడం వివేకవంతుల లక్షణం కాదు. - కె.రామచంద్రమూర్తి -
హడలెత్తిస్తున్న హార్దిక్ పటేల్
త్రికాలమ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఘటించేందుకు తాము వీధుల్లోకి వస్తామంటూ ఎస్సీ, ఎస్టీ నాయకులూ, ఓబీసీ నాయకులూ హెచ్చిస్తున్నారు. అదే జరిగితే కల్లోలమే తరువాయి. ఇంతకీ, హార్దిక్ పటేల్ వెనుక ఎవరున్నారు? నాలుగు దశాబ్దాల కిందట కాంగ్రెస్‌లోని అసమ్మతివర్గం చిమన్‌భాయ్ పటేల్ ను గద్దె దించేందుకు నవనిర్మాణ సంఘర్షణ ఉద్యమానికి ఊతం అందించినట్టుగానే ఇప్పుడు గుజారాత్ బీజేపీలో ఆనందినీ పటేల్ ప్రత్యర్థులు హార్దిక్ పటేల్ వెనుక ఉన్నారనే అనుమానాలు లేకపోలేదు. భారత ప్రజాస్వామ్యవ్యవస్థలో రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగు తాయో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదు. ఏ ఉద్యమం ఎం దుకు పుట్టిందో ఎట్లా ముగుస్తుందో అంతుబట్టదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగించి అద్భుతమైన విజయం సాధించిన నరేంద్రమోదీకి హార్దిక్ పటేల్ అనే ఇరవై రెండు సంవత్సరాల యువకుడి అంతరంగం అంతుబట్టడం లేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి వ్యూహాలు రచిస్తూ, శక్తి మంతమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రధాని మోదీకి స్వరాష్ట్రం సింహస్వప్నమై కలవరపెడుతోంది. హార్దిక్ పటేల్ అనే కుర్రవాడు పక్కలో బల్లెంలాగా తయారైనాడు. బాబాసాహెబ్-బాలాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగం విద్యాసంస్థ లలో, ఉద్యోగాలలో దళితులకూ, ఆదివాసీలకూ ప్రసాదించిన రిజర్వేషన్లనూ, మండల్ కమిషన్ సిఫార్సులను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఆమోదించి ఏబీసీల (అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్)కు ఇచ్చిన రిజర్వేషన్లనూ వ్యతిరేకిస్తూ హార్దిక్ పటేల్ నాయకత్వంలో పెల్లుబికిన ఉద్యమం ‘గుజరాత్ నమూనాను’ సవాలు చేస్తున్నది. గుజరాత్ మోడల్ అంటే పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికం గా అభివృద్ధి సాధించి ఉద్యోగాలు సృష్టించి ప్రజలను ప్రగతి పథంలో నడిపించ డంగా ఇంతకాలం అర్థం చేసుకున్న భారతీయులను ఇప్పుడు కొత్త ప్రశ్నలు వేధిస్తున్నాయి. బాబాసాహెబ్ కు విరుగుడుగా బాలాసాహెబ్‌ను ఆరాధించే నవయువకుడి నాయకత్వంలో వేలాదిమంది పాటీదార్ (పటేళ్లు) ఉద్యమిం చడం ఒక్క మోదీకీ, బీజేపీకే కాదు, దేశం మొత్తానికీ ఆందోళన కలిగించవలసిన అంశం. పాటీదార్ వ్యవసాయంలో, వ్యాపారంలో ఆరితేరినవారు. అమెరికాలో భారత సంతతికి చెందినవారు నిర్వహించే వ్యాపారాలలో పటేళ్లదే సింహ భాగం. సంపన్న కులంగా పరిగణించే పాటీదార్లలో సైతం ఇంత అసంతృప్తి దావానలం దాగుందని బహుశా నరేంద్రమోదీ సైతం ఊహించి ఉండరు. ఏ జాతీయ నాయకుడి కి ఆకాశం అంత ఎత్తు విగ్రహం కట్టించాలని మోదీ న డుం బిగించారో ఆ నాయకుడి పేరుతో వెలసిన సర్దార్‌పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) నాయకుడు హార్దిక్ పటేల్. ఈ సంస్థకు ఒక సిద్ధాంతం లేదు. సామాజిక స్పృహ లేదు. కండబలంతో తమ కులానికి చెందినవారిలో భద్రతాభావం కలిగించడం ద్వారా ఎదిగిన ముఠా. ‘మా ఆడవారిపైన చేయి వేసినవారి చేతులు విరిచేస్తాం. అందుకే పాటీదార్లంతా మాకు మద్దతు పలుకుతున్నారు. నేను ఎంతమంది చేతులు విరిచేశానో తెలుసా?’ అంటూ ప్రగల్భాలు పలికే ఈ యువ నాయ కుడికి బాల్‌ఠాక్రే సిద్ధాంతాలు ఆదర్శం. రాజ్ ఠాక్రే పద్ధతులు అనుసరణీయం. ‘రిజర్వేషన్లు ఉంటే అందరికీ ఉండాలి లేకపోతే ఎవ్వరికీ ఉండకూడదు’ అనే సూత్రాన్ని పట్టుకొని ఉద్యమం నిర్మిస్తున్న హార్దిక్ పటేల్‌కి ఈ దేశం గురించి కానీ సమాజం గురించి కానీ అవగాహన బొత్తిగా లేదు. భగత్ సింగ్‌నూ, చంద్రశేఖర్ ఆజాద్‌నూ ఆదర్శంగా భావించేవారికి బాల్‌ఠాక్రే మార్గదర్శి కావడం విచిత్రం. ‘మీరు అడిగింది ఇవ్వకపోతే హింసాత్మకంగా వ్యవహరిస్తారా?’ అని ప్రశ్నిస్తే ‘మా హక్కు ప్రేమతో ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటాం (అగర్ హమారే హక్ ప్యార్ సే నహీ దోగే తో చీన్కే లేంగే)’ అంటాడు. గుజరాత్ నమూనా ఇదేనా? ప్రపంచజ్ఞానం అంతగా లేనివాడు, పాతికేళ్లు కూడా నిండనివాడు లక్షలమంది పాటీదార్లకు ఎట్లా నాయకుడు కాగలిగాడు? ‘మా కులంలో 40 శాతం మంది సంపన్నులు. కానీ పది నుంచి ముప్పయ్ శాతం వరకూ పిల్లల్ని చదివించా లంటే ఫీజు కట్టేందుకు భూములు అమ్ముకోవలసిన దుస్థితిలో ఉన్నవారు. ధనవంతుడైన ఓబీసీ విద్యార్థికి ఉచితంగా సీటు వస్తుంది. చదువు పూర్తి కాగానే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. మా పిల్లలు మాత్రం చదువు కోసం, ఉద్యోగం కోసం పొలాలు అమ్ముకొని ఖర్చు చేయాలి. గుజరాత్లో సెల్ఫ్ ఫినాన్స్ ఎడ్యు కేషన్ అమలులో ఉంది. మా చదువుకు అయ్యే ఖర్చు మేమే భరించాలి. ఉద్యో గాలు కావాలంటే లంచాలు ఇవ్వాలి. ఈ అన్యాయం సహించరానిది’. ఒక పత్రి కకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలివి. ‘నరేంద్రమోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి చెందింది కదా’ అని అడిగితే, ‘అంతా అబ ద్ధం. అభివృద్ధి చెందకపోగా పరిస్థితి దిగజారింది. సంపన్నులు మరింత సంప న్నులైనారు. పేదలు మరింత పేదలైనారు’ అని సమాధానం. మొన్న హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పింది సరిగ్గా ఇదే. కులం పేరుతో రాజకీయం చేస్తూ కుల రాజకీయాల ద్వారా అధికారం హస్తగతం చేసుకున్న ములాయంసింగ్, శరద్ పవార్, మాయావతి వంటి నాయకులు దేశాన్ని సర్వనాశనం చేశారని నిందిస్తాడు హార్దిక్ పటేల్. ‘వారికంటే మీరు ఎట్లా భిన్నం?’ అంటే, ‘వారు కేవలం రాజకీ యవాదులు (పొలిటీషియన్స్). అసలైన ప్రజానాయకుడు (లీడర్) బాల్‌ఠాక్రే అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను’. హార్దిక్ పటేల్ అనే యువనాయకుడి మనో గతం ఏమైనా అర్థం అవుతోందా? కాదు. ఎందుకంటే, అతనికేమి కావాలో అతనికే తెలియదు. దిశానిర్దేశం లేని క్షిపణి అతడు. సెప్టెంబరు ఆరో తేదీన ఢిల్లీలో జాట్ల మహాసభలో మాట్లాడబోతున్నాడు. పాటీదార్ల వంటి ఇతర కులాల నాయకులతో సమాలోచన జరపబోతున్నట్టు అతడు వెల్లడించారు. దేశంలోని 121కోట్ల జనాభాలో పాటీదార్లూ, వర్మ, కటియా, రెడ్డి, హూడా, గుజ్జర్లు, కూర్మీ లు, జాట్లు, మరాఠాలూ కలిపి 27 కోట్లు ఉంటారని పటేల్ అంచనా. తెలుగు సమాజం గురించి అతడికీ, అతడి మిత్రులకూ స్పష్టత ఉన్నట్టు లేదు. ఒక వైపు రెడ్డి కులం పాటీదార్ వంటిదేనని చెబుతూ హార్దిక్ పటేల్, నితీశ్ కుమార్, చంద్ర బాబు నాయుడు కలిసి నాయకత్రయంగా ఏర్పడే అవకాశం ఉన్నదంటూ హార్దిక్ మిత్రుడు చిరాగ్‌భాయ్ పటేల్ అన్నాడు. హార్దిక్ పటేల్‌కు ఇన్ని లక్షల మంది మద్దతు ఎందుకు ఇస్తున్నారో అర్థం చేసు కోవా లంటే గుజరాత్ అభివృద్ధి నమూనాను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఇటీవల గుజరాత్ వెళ్లి నప్పుడు కొన్ని గ్రామాలు సందర్శించారట. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లలో గ్రామాలకంటే హీనంగా, దీనంగా ఉన్నాయని చెప్పారు. ఈ అభి ప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో తెలియదు కానీ గుజరాత్ నమూనాను గుడ్డిగా నమ్మకుండా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని మాత్రం హార్దిక్ పటేల్ ఉత్థానం స్పష్టం చేస్తున్నది. పాటీదార్ల ఉద్యమం తాటాకు మంటలాంటిదేనా? చప్పున ఆరిపోతుందా లేక ఆనందీబెన్ పటేల్ ప్రభు త్వానికి ప్రమాదం తెచ్చిపెడుతుందా? నవనిర్మాణ ఉద్యమం బహుశా 1974 నాటి నవనిర్మాణ ఉద్యమం నరేంద్రమోదీ మనస్సులో మెదు లుతూ ఉండవచ్చు. నాటి పరిణామాలు గుర్తుకు వచ్చి కించిత్ ఆందోళనకు లోను అవుతూ ఉండవచ్చు. 1960 మే 1 వ తేదీన గుజరాత్ రాష్ట్రం అవతరిం చింది. ఆ తర్వాత పదేళ్లకే ఇందూలాల్ యాజ్ఞిక్, జీవ్‌రాజ్ మెహతా, బల్వంత రాయ్ మెహతా వంటి ఉద్దండుల తరం అంతరించి చిమన్‌భాయ్ పటేల్ హయాం వచ్చింది. అవినీతి తాండవం చేసింది. విద్యార్థులు ఉద్యమించారు. 1974 జనవరి 7 వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చారు. చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేయాలన్నది వారి ప్రధానమైన డిమాండ్. అప్పటికే అవినీతిపై పోరాట ం ప్రారంభించిన జయప్రకాశ్ నారాయణ్ నవనిర్మాణ ఉద్య మానికి మద్దతు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకుడుగా పని చేస్తూ ఉండిన నరేంద్రమోదీ నాటి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని జనసంఘ్ సమర్థించింది. విద్యార్థుల ఒత్తిడికి లొంగి 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. కాంగ్రెస్ (ఓ) నాయకుడు మొరార్జీదేశాయ్ మార్చి 12న నిరవధిక నిరశన ప్రారంభిం చారు. మొత్తం 167 మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో 95 మంది రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చిమన్‌భాయ్ రాజీనామా చేశారు. మార్చి 16న అసెంబ్లీని రద్దు చేశారు. ఉద్యమం ప్రారంభమైన నాలుగు మాసా లలోనే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న చిమన్‌భాయ్ పటేల్ రాజీనామా చేయ వలసి వచ్చింది (అనంతరం, 1990లో, బీజేపీ మద్దతులో చిమన్‌భాయ్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. అది వేరే విషయం). 1974లో ప్రభుత్వాన్ని మార్చిన విద్యార్థి ఉద్యమం సమాజాన్ని మార్చలేకపోయింది. అవినీతిని అంతం చేయ లేకపోయింది. కానీ ప్రభుత్వాన్ని కూల్చగలిగింది. అటువంటి పరిస్థితులే తిరిగి తలెత్తితే ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం మాత్రం తట్టుకోగలుగుతుందా అనే అనుమానం మోదీని నిద్రకు దూరం చేయవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఘటించేందుకు తాము వీధుల్లోకి వస్తామంటూ ఎస్సీ, ఎస్టీ నాయకులూ, ఓబీసీ నాయకులూ హెచ్చిస్తున్నారు. అదే జరిగితే కల్లోలమే తరువాయి. ఇంతకీ, హార్దిక్ పటేల్ వెనుక ఎవరున్నారు? నాలుగు దశాబ్దాల కిందట కాంగ్రెస్‌లోని అసమ్మతివర్గం చిమన్‌భాయ్ పటేల్ ను గద్దె దించేందుకు నవనిర్మాణ సంఘర్షణ ఉద్యమానికి ఊతం అందించినట్టుగానే ఇప్పుడు గుజారాత్ బీజేపీలో ఆనందీబెన్ పటేల్ ప్రత్యర్థులు హార్దిక్‌పటేల్ వెనుక ఉన్నారనే అనుమానాలు లేకపోలేదు. విశ్వహిందూ పరిషత్తు నాయకుడు ప్రవీణ్ తొగాడియా, అతని శిష్యుడు గోవర్థన్ జడాఫియాలు హార్దిక్ పటేల్‌కు పరోక్షంగా, ఉదారంగా సహకారం అందిస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రిజర్వేషన్లకు గండిగొట్టాలనే కుట్రపూరిత వ్యూహంతో ఆర్ఎస్ఎస్ నాయకత్వం హార్దిక్ పటేల్‌ను ఒక ఆయుధంగా వినియోగిస్తున్నదని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. పాటీదార్లకూ, వారిని పోలిన కులాలకూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలన్న హార్దిక్ పటేల్ ఆకాంక్ష అసమంజసమైనదీ, అసాధ్యమైనదీ కావచ్చు. నవనిర్మాణ ఉద్యమం లాగానే పాటీదార్ల ఉద్యమం సైతం పరిమితి మైన విజయాలతోనో, విజయాలు ఏమీ సాధించకుండానో చల్లారిపోవచ్చు. కానీ అది మోదీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. బిహార్‌ను గుజరాత్‌లాగా అభివృద్ధి చేస్తానంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేస్తున్న మోదీ తన పుష్కరకాల పాలనలో గుజరాత్‌ను బిహార్ చేశారా? ఈ సంశయం ప్రజల మనస్సులలో బలంగా నాటుకున్నది. గుజరాత్ నమూనాపైన అనుమానాలు బలపడుతున్నాయి. ఆ మేరకు మోదీకీ, బీజేపీకి హార్దిక్ పటేల్ నష్టం కలిగించాడు. కె.రామచంద్రమూర్తి -
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..
గుంటూరు: తెలుగు రాష్ట్రంలో రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే మాతృభాష ఉన్నత స్థితికి చేరుకుంటుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష రక్షణ, అభివృద్ధి మహాసభ, సదస్సు జరిగింది. తమిళనాట భాష రాజకీయాలను శాసిస్తున్న కారణంగా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యునెస్కో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని అన్ని దేశాలకు సూచించిన విషయాన్ని ఉటంకించారు. సమస్యకు అసలు మూలాలు గుర్తించి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టినప్పుడే తెలుగు భాషకు మహర్ధశ అని వ్యాఖ్యానించారు. గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాషను మరిస్తే పుట్టగతులుండవన్న మహాత్మగాంధీ మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోను తెలుగు వారు తమ పిల్లలకు శని, ఆదివారాల్లో తెలుగు భాష నేర్పి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతిక పదాలు తెలుగులోకి తర్జుమా చేయడం, మన భాషను పరిపుష్టం చేస్తాయని చెప్పారు. మంచి పదాలు ఇతర భాషల నుంచి, తీసుకోవడం, కొత్తపదాలు అనువదించడం, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన భాషలో అందించడానికి మీడియా కృషి చేస్తున్నదని, ఇంకా చాలా చేయాల్సిన ఉందన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తెలుగు భాషా పరిషత్ ఏర్పాటు చేసి తెలుగీకరించిన పదాలను, విషయాలను అన్ని పత్రికలకు అందించే బృహత్తర కార్యక్రమం కొన్నాళ్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషోద్యమ సమాఖ్య చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ఉపన్యసిస్తూ.. గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభ తీర్మానాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు. -
నివురుగప్పిన నిరుద్యోగం
వేలమంది నిరుద్యోగులను ఒక్కచోట చూస్తే భయం గొలుపుతుంది. ఉద్యో గాల కోసం వారు పడుతున్న ఆరాటం చూస్తే ఆందోళన కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకొని, కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్న యువతీయువకులు లక్షలలో ఉంటే ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సరీస కమిషన్ (టీపీఎస్సి) ఉద్యోగాల ప్రదాన ప్రక్రియ ప్రారంభిం చింది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఈ సారి టీపీఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలలో తెలంగాణ ఉద్యమ చరిత్రపైన ప్రశ్నలు ఉంటా యని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ కోచింగ్ సెంటర్లలో బోధించని అంశం ఇది. నోటఖ్స చదివి బట్టీయం పెట్టి పరీక్షలు రాయడం మనం యువతీ యువకులకు నేర్పించాం. జరుగుతున్న చరిత్రను కూడా గైడ్ రూపంలోనో, నోట్స్ రూపంలోనో చదివితే కానీ వారికి అర్థం కాదు. పోటీ పరీక్షలకు హాజరు కాబోయే నిరుద్యోగులకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, భౌగోళిక శాస్త్రంపైన అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ దిన పత్రిక శనివారం ఉదయం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో, సిటీ సెంట్రల్ లైబ్రరీలో సదస్సు నిర్వహించింది. రెండు చోట్లా సమావేశమైన వేలాది నిరుద్యోగ యువతీయువకులలో అసహనం స్పష్టంగా కనిపించింది. వయోపరి మితి పెంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య పెరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన వక్తలు మాట్లాడుతుంటే యువతీయువకులు ఏకాగ్రదీక్షతో వింటూ, నోటఖ్స రాసుకుంటూ ప్రతి అక్షరాన్నీ ఆస్వాదిస్తూ కనిపించారు. త్యాగరాయగాన సభలో ఆరువందల మందికే కుర్చీలు దక్కాయి. తక్కినవారంతా కిందే కూర్చు న్నారు. సిటీ లైబ్రరీలో అయితే కటిక నేలమీద వేలమంది కూర్చొని చెవులు రిక్కించుకొని మేధావుల ఉపన్యాసాలు ఆలకించారు. అయిదు వేల ఉద్యో గాలకు అయిదు లక్షల మంది పట్టభద్రులు పోటీ పడితే నూటికి ఒక్కరినే ఉద్యో గం వరిస్తుంది. నూటికి తొంభైతొమ్మిది మంది నిరాశకు గురి అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సకల సమస్యలూ తీరిపోతాయనే వెర్రి నమ్మ కం పెట్టుకున్నవారు ఆ నమ్మకం వమ్ము అయినప్చడు ఎట్లా స్పందిస్తారు? ఎట్లా సహిస్తారు? ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో మూడు అంశాలు ప్రధానమైనవి- నిధులు, నీళ్ళు, నియామకాలు. విద్యార్థులూ, యువతీయువ కులూ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్ఠ్గనడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే నియామకాలన్నీ తమకే అందుతాయనే నమ్మకం. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంలో తెలంగాణ రా? తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి తెలంగాణ రాష్ట్ర సరీస కమిషనఖ అవత రించింది. అనంతరం కొన్ని మాసాలకు ఉద్యోగాలలో నియామకాల ప్రయత్నం జరుగుతోంది. టీపీఎస్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముప్పయ్ మంది మేధావులతో సమాలోచనలు జరిపి సిలబస్, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రక్రియ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, జియాగ్రఫీ, హిస్టరీ సబ్జెక్టులు ఉండాలనీ, వాటికి 250 మార్కులు కేటాయించాలనీ తీర్మానించారు. ఈ సబ్జెక్టుపైన అనేక సంశయాలు, పరీక్షా విధానంపైన వందలాది ప్రశ్నలు నిరుద్యోగులను వేధిస్తున్నాయి. ఘంటా చక్రపాణి దాదాపు వంద ప్రశ్నలకు సదస్సులో సమాధానాలు చెప్పారు. ఇంకా అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. తెలంగాణ ఉద్యమకారుడు వి. ప్రకాశ్ తెలంగాణ చరిత్ర చెబుతుంటే యువతీయువకులూ అమితాసక్తితో విన్నారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కోదండరామ్‌ల ఉపన్యాసాలు జాగ్రత్తగా విన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి కంటే ఆ సబ్జెక్టు తెలుసుకొని పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాదించాలనే తాప త్రయమే ఎక్కువ. అన్ని ఉద్యోగాలకూ అందరూ పోటీ గ్రూప్-1 నుంచి విఏవో ఉద్యోగం వరకూ నిరుద్యోగులందరూ పోటీ పడుతు న్నారు. ఇంజనీరింగ్ చదివినవారు ఇంజనీర్లుగా పనిచేయాలనీ, ఫార్మసీ చదువు కున్నవారు ఫార్మసిస్టులుగా పని చేయాలనీ కోరుకుంటే ఇంత పోటీ ఉండదు. ఇంజనీరింగ్, వెటర్నరీ విద్య చదివినవారు కూడా విఏవో ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. అస్తవ్యస్తమైన మన విద్యావిధానానికి నిదర్శనం ఇది. జూని యర్ కాలేజీలు లేని చోట్ల సైతం ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను తయారు చేసిన ఫలితం. నేషనలఖ శాంపిలఖ సర్వే ఆఫీసు నిర్వహించిన సర్వే ప్రకారం చదువురానివారిలో కంటే చదువు కున్నవారిలోనే నిరుద్యోగం ఎక్కువ. చదువులేనివారు ఏ పని చేయడానికైనా సిద్ధం. చదువుకున్నవారు వీలైతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేటు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. లే దా నిరుద్యోగిగానే మిగిలిపోతారు. ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాలని అనుకోరు. వ్యవసాయదారుల కుటుంబాలలోనూ చదువుకున్నవారికి కూడా పొలం పని చేయడం నామోషీ. తల్లిదండులు పని చేస్తుంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ కూర్చుంటారు. మన దేశ జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసువారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో (1999-2004) దేశ వ్యాపితంగా 5.4 కోట్ల ఉద్యోగాలు సృష్టించారు. యూపీఏ పాలనలోని మొదటి ఏడు సంవత్సరాలలో (2004-11) అదనంగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 1.5 కోట్లు మాత్రమే. దేశంలో ప్రతి నెలా పది లక్షల మంది నిరుద్యోగుల జాబితాలో చేరుతున్నారు. వీరిలో సగం మంది ఉత్తరప్రదేశఖ, బిహార్, రాజస్థానఖ, మధ్యప్రదేశఖకు చెందినవారే. దక్షిణాది రా?ాలలో పరిస్థితి కొంత నయం. తెలుగు రా?ాలలో ప్రైవేటు పరిశ్రమలు విస్తరించలేదు. ?ఫ్టవేర్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ సంస్థల విస్తరణ కూడా ఒక దశకు వచ్చి నిలిచి పోయింది. జనాభాలో సగం మంది వ్యవసాయరంగంపైన ఆధారపడి జీవి స్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక 1998 నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదం టూ సుప్రీంకోర్టు మొన్న ఆదేశాలు జారీ చేసింది. రైతు సంక్షేమ కార్యక్రమాలను పునస్సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పురమాయించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు? సుప్రీం ఆదేశం నిష్ఫలం వ్యవసాయాన్ని ఎట్లా గిట్టుబాటు వ్యాసంగంగా మార్చాలో, పట్టణ ప్రాంతా లలో ఉద్యోగాలను ఎట్లా సృష్టించాలో ప్రభుత్వాలకు స్పష్టంగా తెలియదు. సబ్సిడీలు తగ్గించి ఆర్థిక సంస్కరణలను ముమ్మరం చేసి ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయాలన్న ధ్యాసే కానీ వ్యవసాయరంగం గురించి ఆలోచించినవారు లేరు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంపైకి వదిలిన నినాదా లలో ‘మేక్ ఇనఖ ఇండియా’ ఒకటి. విదేశాలు పెట్టుబడులు పెట్టి ఇండియాలో పరిశ్రమలు నెలకొల్పాలనీ, ఉత్పాదక రంగాన్ని విస్తరించాలనీ ఎనఖడీఏ సర్కార్ ఆకాంక్ష. పెట్టుబడులు పెట్టడానికీ, పరిశ్రమలు నెల కొల్పడానికీ అనువైన వాతా వరణం కల్పించే బాధ్యత రా? ప్రభుత్వాలది. ఎకనామిక్ జోనఖ్స ఏర్పాటు చేసి భూమి, నీరు, విద్యుత్తు తక్కువ రేటుకు అందజేసినట్లయితే విదేశీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం. పరిశ్రమలకూ, ప్రాథమిక సదుపాయాల కల్పనకూ భూమి అవసరం. రైతుల నుంచి భూమి సేకరించాలంటే 2013 నాటి భూసే కరణ చట్టం అడ్డువస్తోంది. ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించి ఎనఖడీఏ ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక ప్రగతి సైతం ఆశించినంత వేగాన్ని పుంజు కోవడం లేదు. పరిశ్రమలూ, వ్యాపారాలూ విస్తరించడం లేదు. ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. జాతీయ స్థాయిలో నిరుద్యోగులకు ఆశావహమైన పరిస్థితులు కనిపిం చడం లేదు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు మరీ గందరగోళం. తెలంగాణలో ప్రభుత్వ రంగంలోనే విద్యుతఖ కేంద్రాలను నెలకొల్పాలనీ, ఆసుపత్రులను పున రుద్ధరించాలనీ ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అంతా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతోంది. గోదావరి పుష్కరాలలో సమాచార శాఖ చేయ వలసిన పనులు ప్రైవేటు సంస్థ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రైవేటు మోజు బాగా ముదిరింది. సింగపూర్, జపాన్ తప్ప మరే మాటా మాట్లాడే పరిస్థితి లేదు. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిం చడం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం అనే రెండే రెండు కార్యక్రమాలపైన ఆంధ్ర ప్రదేశఖ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సింగపూరు ప్రభుత్వం, కంపెనీలు అమరావతి నిర్మాణంలో కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు ఉద్యోగాలు కల్పించదు. చంద్రబాబునాయుడు విదేశీ యాత్రలు సత్ఫలితాలు ఇచ్చి కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు విస్తరించే వరకూ నిరుద్యోగలు వేచి ఉండవలసిందే. రగులుతున్న యువత ఆంధ్రప్రదేశఖలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యా ప్రయత్నాలు జరగడం యువతలో పెరుగుతున్న అశాంతికి చిహ్నం. తెలంగాణలో ఇప్పటికే అగ్గి రగు లుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉడికిపోతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపైన ఆగ్రహించిన విద్యార్థులూ, నిరుద్యోగులూ నిరసన ప్రద ర్శనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కూడా తగులపెట్టారు. ప్రాణహిత ప్రాజెక్టు గురించీ, సరికొత్త సచివాలయ నిర్మాణం గురించీ, ఉస్మా నియా ఆసుపత్రి భవనాన్ని కూల్చి జంట టవర్ల నిర్మాణం గురించీ ఆలోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్న దాఖలా లేదు. పల్లెల్లో వృత్తులు దెబ్బతిన్నాయి. మూతబడిన పరిశ్రమలు అట్లాగే ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రాలేదు. ప్రకటనలే మినహా ప్రగతి క్షేత్రంలో కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతని అర్థం చేసుకు న్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాద సంకేతాలు గుర్తించకపోతే చాలా నష్టం జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులు సంఘటితమై వీధుల్లోకి వస్తే ఎంత బలమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నా ప్రయోజనం ఉండదు. టీపీఎస్సీ ద్వారా ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితమైనది. పరిశ్రమలూ, వాణిజ్యం విస్తరించడం ద్వారానే ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పెంపొందించాలి. చెరువుల పునరుద్ధరణ కార్య క్రమం ప్రణాళికా బద్ధంగా అమలు జరిగినా పల్లెటూళ్లలో నీటి లభ్యత పెరిగి వ్యవసాయం పుంజుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తిరిగి వృత్తులకు జీవం వస్తుంది. పట్టణాలలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికపైన బృహతఖ ప్రయత్నం జరగకపోతే యువజనం ఆగ్రహజ్వాలను పాలకవర్గం ఎదుర్కోవలసి వస్తుంది. కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియర్ డైరెక్టర్ -
సామరస్యమే సాధనం
త్రికాలమ్ - కె.రామచంద్రమూర్తి మహావక్తలుగా ప్రసిద్ధులైన రాజకీయనేతలు ఎందరో ఉన్నారు. కానీ జాతి నిర్మాతలుగా, ప్రాతఃస్మరణీయులుగా మిగిలినవారు కొందరే. మాటలు కడుపు నింపవు. చేతలు తోడుకాకపోతే మాటల విలువ శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు మొదటిసారి ఎర్రకోట నుంచి ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ సం దేశం దేశప్రజల గుండెల్లో ఆశ, విశ్వాసం నింపింది. 69వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శనివారంనాటి మోదీ ప్రసంగం ప్రజల గుండెల్లో గుబులు నింపిం ది. 85 నిమిషాలు సాగిన ఎర్రకోట ఉపన్యాసం మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్నవారికి సైతం ఆశాభంగం కలిగించింది. నిరుటి ఆత్మవిశ్వాసం, పదును, దూకుడు ఈ సంవత్సరం కనిపించలేదు. సంజాయిషీ చెబుతున్నట్టూ, దిద్దు బాటు చర్యల గురించి ఆలోచిస్తున్నట్టూ, అనుకున్నంత సాధించలేకపోయానని అంగీకరిస్తున్నట్టూ ప్రధాని ధ్వనించారు. పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఎన్నో ఆశయాలూ, వ్యూహా లూ, లక్ష్యాలూ ఉంటాయి. పదవిలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు క్రమంగా తెలిసివస్తాయి. పరిమితులు అర్థం అవుతాయి. పాలకుడు రాజనీతిజ్ఞుడు అయి తే తన పార్టీ లేదా ప్రభుత్వం ఏమేమి చేయడానికి ఏ విధంగా ప్రయత్నించిం దో, ఎంతవరకూ సఫలమైందో, ఎక్కడ విఫలమైందో ప్రజలకు పూసగుచ్చినట్టు ప్రోగ్రెస్ రిపోర్టు (ప్రగతి నివేదిక) సమర్పిస్తాడు. ఆ పని చేయకుండా మోదీ తన రెండో ఎర్రకోట ప్రసంగంలో ఒక శాఖ పేరు మార్పు ప్రకటించారు. మరో నినా దం (స్టార్ అప్ అండ్ స్టాండ్ అప్ ఇండియా) జనం మీదికి వదిలారు. తక్కింది చర్వితచర్వణమే. విధానాలను నినాదాల రూపంలో ప్రచారం చేసే పద్ధతి చైనా పాలకులు చాలాకాలంగా పాటిస్తున్నారు. మన దేశంలోనూ నినాదాలతో కార్య క్రమాలను పిలుచుకునే ఆచారం ఉంది. నినాదాలు సృష్టించడంలో ప్రతిభ కలి గిన మోదీ నిరుడు స్వాతంత్య్ర సందేశంలో ముఖ్యంగా అయిదు రంగాలపై దృష్టి సారించారు. 1) ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం. 2) జన్‌ధన్ యోజన ద్వారా ప్రజలకు నేరుగా సబ్సిడీలు ధనరూ పంలో బ్యాంకు ఖాతాలలో జమచేయడం. 3) దేశంలోనే ఉత్పత్తిని పెంచేందుకు మేక్ ఇన్ ఇండియా విధానం. 4) దేశంలోని అన్ని ప్రాంతాలనూ అనుసంధానం చేసే డిజిటల్ ఇండియా నినాదం. 5) స్వచ్ఛభారత్ అభియాన్. ఈ అయిదు కార్యక్రమాలలో జరిగిన ప్రగతిని ప్రధాని వివరించి ఉంటే సముచితంగా ఉండేది. వాస్తవానికి జరిగింది తక్కువ. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ కార్యక్రమాలలో చాలావరకూ గత ప్రభుత్వాల కార్యక్రమాల కొనసాగింపే. పేరుమార్చడం ప్రగతి కారకం అనుకుంటే విద్యామంత్రిత్వశాఖ పేరును రాజీవ్ గాంధీ మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చిన తర్వాత విద్యారంగంలో అద్భుతాలు జరిగి ఉండవలసింది. అటువంటివి ఏవీ జరగకపోగా విద్యారం గంలో ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఇదివరకు ఐఐటీలకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. ఇప్పుడు ఐఐటీలలో ప్రమాణాలు పడిపోతున్నా యంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటివారు ఆవేదన వెలిబుచ్చుతు న్నారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ పేరును రైతు సంక్షేమ శాఖగా మార్చినంత మాత్రాన దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోవు. వ్యవసాయం గిట్టుబాటు వ్యాసంగం అయిపోదు. ఆత్మరక్షణ ధోరణి వ్యవసాయరంగం గురించీ, గ్రామీణప్రాంతాల అభివృద్ధి గురించీ ప్రధాని చాలాసేపు మాట్లాడారు. భూసేకరణ బిల్లు కారణంగా తాను రైతు వ్యతిరేకిననీ, గ్రామీణ ప్రాంతాల పట్ల తనకు శ్రద్ధాసక్తులు లేవనీ చెడ్డపేరు వచ్చినట్టు గ్రహిం చిన మోదీ మచ్చ చెరుపుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపించారు. కానీ రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏమిటో, ఆత్మహత్యలు నివారించడానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలో మోదీకి తెలిసినట్టు లేదు. అటువంటి అత్యంత ప్రధానమైన అంశంపైన పార్లమెంటులో చర్చ జరపాలన్న ఆలోచనా లేదు. నీతి ఆయోగ్‌లో చేరిన ప్రముఖ మేధావులకూ ఈ అంశంపైన దృష్టి సారిం చే సమయం చిక్కినట్టు లేదు. ఇప్పటికీ సగానికి పైగా జనాభా ఆధారపడిన వ్యవసాయరంగంలో రైతు మనుగడపైన అధ్యయనం చేసి ఏదో ఒక విధానానికి రూపకల్పన చేయవలసిన అవసరాన్ని ప్రధాని గుర్తించకపోవడం ఆశ్చర్యం. ఆ పని చేయకుండా తాను వ్యవసాయదారులకు ప్రాధాన్యం ఇస్తున్నాననీ, గ్రామీ ణ వికాసానికి అగ్రతాంబూలం ఇస్తాననీ చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉం డదు. పేదవారి కోసం బ్యాంకుల ద్వారాలు మొట్టమొదటిసారి తామే తెరిపిం చామంటూ మోదీ చెప్పుకోవడం స్వోత్కర్ష. ఇందిరాగాంధీ హాయాంలో జనా ర్దన్ పూజారి ఈ పని మీదే ఉన్నారని మోదీకి ఎవరు చెప్పాలి? వంద వాగ్దానాలు చేసిన నాయకులు ఎవ్వరూ చరిత్రపుటల్లో నిలబడలేదు. పంచశీల, గరీబీ హటావో వంటి కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయి. మోదీ ‘మన్ కీ బాత్’ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ‘ఫైర్‌సైడ్ చాట్’ను పోలినదే. చరిత్రలో ఎఫ్డీఆర్ చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఒకే ఒక నినాదం-న్యూడీల్. అప్పుటి సామాజిక భద్రతా కార్యక్రమం చరిత్రాత్మ కమైనది. మోదీ అభిమానులు అటువంటి అద్భుతం ఆయన నుంచి ఆశించారు. దౌత్యం నెరపే దూత ఎవరు? మోదీకి ఆయన వ్యక్తిత్వమే బలం. అదే ఆయన బలహీనత. మోదీకి ఉన్నంత అతిశయం లేకపోవడం వల్లనే వాజపేయి, పీవీ నరసింహారావు వంటి ప్రధాను లు సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం నిర్వహించగలిగారు. పీవీ ప్రతిపక్ష నేత వాజపేయి ఐక్యరాజ్య సమితికి ప్రభుత్వ ప్రతినిధివర్గం నాయ కుడిగా పంపించారు. వాజపేయి అవసరమైతే ప్రతిపక్షంతో సంప్రతింపులు జరపగలిగేవారు. యూపీఏలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్ష బీజేపీతో సమాలోచ నలు జరిపేవారు. మోదీ స్వయంగా సోనియాగాంధీతో మాట్లాడి నిరసన మాని సరసంగా వ్యవహరించమని ఒప్పించే వాతావరణం లేదు. అది అహంకారమో, మానసిక బలహీనతో తెలియదు. ఆర్థిక సంస్కరణలకు అత్యవసరమని యూపీఏ సైతం భావించిన గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)కి పార్లమెం టు ఆమోదం కోసం సహకరించాలంటూ రాజ్యసభలో సంఖ్యాధిక్యం ఉన్న కాం గ్రెస్ పార్టీని అడిగే వెసులుబాటు లేకపోవడం మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద పరిమితి. మోదీ తరఫున దౌత్యం చేసే సహచరులు ఎవ్వరూ లేరు. వెంకయ్య నాయుడు లేదా అరుణ్‌జైట్లీ లేదా అమిత్ షా ఈ పాత్ర పోషించలేరు. ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించిన సంఘర్షణాత్మక వైఖరినే ప్రధాని హోదాలోనూ మోదీ కొనసాగించడం వల్ల ఎన్డీఏ సర్కార్కే కాదు దేశానికీ హానికరమే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నినాదాల, నిరసన వరదలో కొట్టుకొని పోవడం వల్ల అప్రతిష్ట ఎవరికి? కాంగ్రెస్‌కా, ఎన్డీఏకా? నష్టం ఎవరికి? సోనియాగాంధీకా, మోదీకా? ప్రధానిగా పగ్గాలు చేతబట్టిన వెంటనే పార్లమెంటులో ప్రవేశిస్తూ నేలను ముద్దాడిన మోదీ సభలో వేడిగా వాడిగా చర్చ జరుగుతుంటే, ప్రధాని సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉంటే పార్లమెంటు భవనంలోనే ఉండి సభకు దూరంగా ఉండటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సర్వోన్నత చట్టసభపైన గౌరవం ఉన్నట్టా? ఇటువంటి సందర్భాలలో ఇతర ప్రధానులందరూ సభలో కూర్చొనేవారు. రెండో స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో మోదీ రాజీలేని రాజకీయవాది గానే ప్రజలకు అర్థమైనారు కానీ దేశ ప్రగతిరథానికి సారథ్యం వహిస్తున్న రాజనీ తిజ్ఞుడిగా అర్థం కాలేదు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత రాగద్వే షాలకు లోనుకాకుండా, దేశ రాజకీయాలకు కొత్త ఒరవడి దిద్దే వైతాళికుడిగా మోదీ చరిత్రలో స్థానం సంపాదించుకోవాలంటే 2014 సార్వత్రిక ఎన్నికలలో సాధించిన అపూర్వమైన ఘనవిజయం ఒక్కటే సరిపోదు. అన్ని రాజకీయ పక్షా లనూ, అన్ని వాదాలనూ, అన్ని మతాలనూ, అన్ని ప్రాంతాలనూ కలుపుకొని ప్రగతిబాటలో పురోగమించగలనని నిరూపించుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. పదిహేనవ పార్లమెంటులో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకొని పార్టీ తరఫున దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉంటే, ఇకపైన సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరగాలంటూ విజ్ఞప్తి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అదుపు చేసే అవకాశం ఉండేది. బీజేపీ చేసిన తప్పు చేయకుండా వచ్చే శీతా కాలం సమావేశాలలోనైనా ప్రభుత్వంతో సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సవినయంగా విజ్ఞప్తి చేసి ఉంటే ప్రధానిగా మోదీ వ్యక్తిత్వం మరింత ఔన్నత్యాన్ని సంతరించుకునేది. బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో తానే ఒంటి చేత్తో గెలిపించాననీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తానొక్కడే నడిపించగలననీ, దేశాన్నీ తాను ఒంటరిగా అభివృద్ధి చేయగలననీ మోదీ భావిస్తున్నారని ఆరోపించడం లేదు. కానీ ఆ విధంగా ప్రజలకు అర్థం అవుతున్నారనే విషయాన్ని మోదీ గ్రహించాలి. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్‌పార్టీ లేని భారతదేశం)ను సాధి స్తానంటూ ఎన్నికల ప్రచారంలో శక్తిమంతంగా ప్రచారం చేసిన మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ రాజ్యసభ’ కోసం కనీసం 2018 వరకూ వేచి ఉండాలి. అప్పటికీ రాజ్య సభలో కాంగ్రెస్ పూర్తిగా లేకుండాపోదు కానీ ఎన్డీఏకి పూర్తి మెజారిటీ వస్తుం ది. కానీ అప్పటికి మోదీ ఐదేళ్ళ పదవీకాలం చరమాంకానికి చేరుకుంటుంది. నువ్వంటే నువ్వు క్షేత్రవాస్తవికతను విస్మరించి ఊహాలోకంలో విహరించడం ప్రధాని స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు తగదు. సుష్మాస్వరాజ్, వసుంధరారాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ప్రస్తావన లేకుండా, వారిపైన ఉన్న ఆరోపణల గురించి మాట్లా డకుండా ఉన్నంత మాత్రాన వివాదాలు సమసిపోవు. తన ప్రభుత్వంపైన అవి నీతి ఆరోపణ రాలేదంటూ గట్టిగా చెప్పినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అండర్సన్నూ, కత్రోకీని దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతించారని ఎదురుదాడి చేసినంత మాత్రాన సుస్మాస్వరాజ్‌పైన వచ్చిన ఆరోపణ వీగిపోదు. బీజేపీ నాయకులపైన ఆరోపణలు వచ్చినప్పుడల్లా కాం గ్రెస్ నాయకుల సంగతి ఏమిటంటూ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రినీ, గోవా కాంగ్రెస్ నాయకుడినీ తెరమీదికి తెస్తే సరిపోతుందా? వారిపైన వచ్చిన ఆరోపణలకూ వీరిపై వచ్చిన ఆరోపణలకూ చెల్లు అని ప్రజలు అనుకోవాలా? కాంగ్రెస్ భ్రష్టు పట్టిందనే కదా ప్రజలు బీజేపీకి పట్టం కట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే దొందూ దొందేననీ, నైతికత విషయంలో కాంగ్రెస్కీ, బీజేపీకీ భేదం లేదనీ ప్రజలు తీర్మానించుకోరా? ఎన్నికలలో వచ్చిన మెజారిటీలు ప్రభుత్వాల సుస్థిరతకు పూచీ ఇవ్వలేవు. 1984లో రాజీవ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ అసా ధారణమైనది. కానీ అయిదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపో యింది. రాజధర్మాన్నే కాదు సామరస్యతనూ, పట్టువిడుపులనూ, కార్యద క్షతనూ వాజపేయి నుంచి నరేంద్రమోదీ నేర్చుకోవాలి. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయవచ్చును. కానీ ప్రజల అనుభవంలోకి వచ్చేది పాల కుల చేతలే. భారత్ వంటి సువిశాలమైన, వైవిధ్య భరితమైన, భిన్న ధోరణు లకు ఆలవాలమైన దేశాన్ని సజావుగా, సమర్థంగా పరిపాలించాలంటే మోదీకి ఛాతి కంటే విశాలమైన హృదయం ఉండాలి. ఈ వాస్తవాన్ని నరేంద్రమోదీ ఎంత త్వరగా గ్రహించి వైఖరి మార్చుకుంటే దేశానికి అంత మంచిది. -
ఉరి సరి కాదు
దూకుడుమీద ఉన్న మీడియా ప్రభావం కావచ్చు. సమీపిస్తున్న బిహార్ ఎన్ని కలలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల ఫలితం కావచ్చు. ప్రబలిన ప్రజా స్వామ్య స్ఫూర్తి కావచ్చు. ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరిపైన చర్చ దేశ వ్యాపి తంగా, ఆవేశపూరితంగా, అర్థవంతంగా జరిగింది. వారంరోజుల పాటు ఇదే ప్రధాన చర్చనీయాంశమై దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్నది. చర్చ జరగడం సం తోషం. మెమన్ ఉరితో చర్చ ఆగిపోకూడదు. మరణశిక్ష రద్దు అవసరమా, కాదా అనే విషయంపై వాదోపవాదాలు కొనసాగాలి. అనవసరమంటూ సమాజం అంగీకరించేవరకూ తర్జనభర్జన జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపైనా, చట్టపాలనపైనా, వివక్షలేని పరిపాలనపైనా అపారమైన విశ్వాసం ఉన్నప్పుడే మరణ దండన అవసరం తగ్గిపోతుంది. అప్పుడే భారత్ ఒక నాగరిక సమాజంగా తల ఎత్తుకొని నిలబడగలుగుతుంది. మెమన్ ఉరిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. నిజంగా మరణదండనలో రాజకీయం లేదా? ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నదా? బీజేపీ చేయడం లేదా? అసలు రాజకీయ ప్రమేయం లేని విషయం అంటూ ఏదైనా ఉన్నదా? కీలకమైన పదవులలో ఉన్న వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతమైనదంటూ ఏమైనా ఉన్నదా? నిజంగానే న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకుంటూ సజావుగా సాగిపోతున్నదా? సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును విమర్శిం చడం నేరమా? ఇద్దరు జడ్టిల బెంచ్‌లోని న్యాయమూర్తులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ఎవరి వాదన రాజ్యాంగబద్ధమైనది? ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? మెమన్ వివాదం లేవనెత్తిన ఇటువంటి అనేక ప్రశ్నలకు సమంజసమైన, సంతృప్తికరమైన సమాధానాలు లభించవు. మెమన్ సమాధి అయినప్పటికీ ఈ ప్రశ్నలు సమాజాన్ని వేధిస్తూనే ఉంటాయి. నిందితుడు ఎంతటి నేరం చేసినా మరణశిక్ష విధించరాదనే వాదనను ఆమోదించిన దేశాలు ప్రపంచంలో 130కి పైగా ఉన్నాయి. ఐరోపా దేశాలలో మరణశాసనం లేదు. మనిషి ప్రాణాలు తీయరాదనీ, మరణశిక్ష అమలు జరిగిన తర్వాత న్యాయస్థానం పొరపాటుగా తీర్పు ఇచ్చిందని వెల్లడైతే? పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా? మరణదండన వల్ల నేరాలు తగ్గిన సూచ నలు లేవనీ, మరణశిక్ష అమలు జరపడం కక్ష తీర్చుకోవడమేననీ వాదించేవారికి ఆ దేశాలలో సంఖ్యాధిక్యం ఉంది. న్యాయమూర్తులూ మానవ మాత్రులే. వారికీ సొంత అభిప్రాయాలుంటాయి. వాటి ప్రభావం తీర్పులపై ఉండి తీరుతుంది. నేరాలు తగ్గలేదు మరణశిక్ష వల్ల నేరాలు తగ్గలేదని నిరూపించేందుకు కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 1980 నుంచి 1990 వరకూ పది మంది హంతకులకు భారత శిక్షాస్మృతి 302 సెక్షన్ కింద మరణశిక్ష అమలు చేశారు. ఆ దశకంలో హత్యలు 22,149 నుంచి 35,045కు పెరిగాయి. అదే విధంగా 1990-2000 దశకంలో ఎనిమిది మందిని ఉరి తీసినప్పటికీ హత్యల సంఖ్య 35,045 నుంచి 37,399కి పెరిగింది. 2000 నుంచి 2010 వరకూ ఒకే ఒక కామాంధుడైన హంతకుడిని మాత్రమే ఉరి తీశారు. ఆ దశకంలో దేశంలో హత్యల సంఖ్య 37,399 నుంచి 33,335కి తగ్గింది. సారాంశం ఏమిటి? మరణ శిక్ష నిష్ర్పయోజనమనేగా? సుప్రీంకోర్టు మరణశిక్ష విధించిన తర్వాత క్షమాభిక్ష కోరుతూ దోషులు పెట్టుకున్న అర్జీలపైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతులకు రాజ్యాంగం 72వ అధికరణ దఖలు పరచింది. మరణదండనను రద్దు చేయవచ్చు. దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు. ఇక్కడ యావజ్జీవం అంటే 14 సంవ త్సరాలు కాదు. దోషి శేష జీవితం అంతా జైలులోనే ఉండాలి. రాష్ట్రపతులం దరిలోనూ ఆర్. వెంకటరామన్ అత్యధిక క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. రాష్ట్రపతిగా పనిచేసిన 1987-92 కాలంలో ఆయన 44 అర్జీలను బుట్టదాఖలు చేశారు. కె.ఆర్.నారాయణన్ ఒక్క క్షమాభిక్ష వినతిని కూడా తిరస్కరించలేదు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఒకే ఒక మహిళ ప్రతిభాపాటిల్ కూడా అంతే. ఆమె 30 మంది హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారు. అబ్దుల్ కలాం దాదాపు పాతిక పిటిషన్లను పరిష్కరించకుండానే పదవీ విరమణ చేశారు. రెండు పిటి షన్లపైనే కలాం నిర్ణయం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ వెంకటరామన్ అడుగు జాడలలో నడుస్తున్నారు. ఇంతవరకూ 24 పిటిషన్లకు ‘నో’ అన్నారు. ఎవరి ప్రాపంచిక దృక్పథం వారిది. ఎవరి అవగాహన వారిది. మరణదండనను సమర్థించేవారి వాదనను సైతం తేలికగా కొట్టిపారవేయ డం సాధ్యంకాదు. అమాయకులనూ, అపరిచితులనూ విచక్షణారహితంగా, రాక్షసంగా చంపివేసే కరడుకట్టిన ఉగ్రవాది పట్ల కనికరం చూపించడం సమా జానికి హానికరమని నిరూపించిన ఉదంతాలూ ఉన్నాయి. బోకో హరమ్, అల్ ఖాయిదా, లష్కరే తయ్యబా, ఇండియన్ ముజాహిదీన్, అల్షహీద్, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులను జైళ్ల నుంచి విడిపించ డానికి ఎంతటి నేరానికైనా, ఘోరానికైనా వెనకాడవు. భద్రతాదళాలకు దొరికిన మౌలానా మసూద్ అజహర్, షేక్ ఒమర్‌లను హతమార్చకుండా జైలులో ఉంచి నందుకు భారత ప్రభుత్వం పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. ఉగ్రవా దులు భారత విమానాన్ని హైజాక్ చేసి అఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌కు తీసుకొని వెళ్లారు. నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ అజహర్నూ, ఇతర ఉగ్రవాద ఖైదీలను వెంటపెట్టుకొని వెళ్లి హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను రక్షిం చారు. ఇటువంటి ఘటనలు నరహంతకులకు మరణదండన విధించడం సమం జసమేన న్న వాదనకు ఊతం ఇస్తాయి. కృష్ణయ్యర్ వంటి మానవతావాది సైతం మరణదండనను పూర్తిగా నిషేధించకుండా అత్యంత అరుదుగా మాత్రమే విధించాలంటూ తీర్పు ఇచ్చారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన రాజకీయవాదిగా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు సయ్యద్ అసదుద్దీన్ ఒవైసీ పేరు తెచ్చుకున్నారు. మతం ప్రాతిపదికన మరణదండన అమలు చేయరాదంటూ వివాదం రగిలించారు. ఈ వాదనను సహజంగానే బీజేపీ ఖండించింది. మెమన్‌కు ఉరిశిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ విధానంతో విభేదించారు. శత్రుఘ్న సిన్హా, రాంజెత్మలానీ వంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు సైతం మెమన్ ఉరి అనాగరికమంటూ ఆక్షేపించారు. అఫ్జల్ ఉరి అన్యాయం? యూపీఏ ప్రభుత్వం కశ్మీర్‌కి చెందిన ప్రొఫెసర్ అఫ్జల్‌గురుని ఉరితీసినప్పుడు వ్యవహరించిన తీరు కంటే భిన్నంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించింది. అఫ్జల్ గురు ఉరికి ప్రచారం ఇవ్వడం యూపీఏ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎన్డీఏకి మెమన్ ఉరి గురించి ప్రచారం బహుశా బిహార్ ఎన్నికల దృష్ట్యా అవసరం. కుటుంబానికి సమాచారం అందించకుండా (ఒక రోజు ముందు టెలిగ్రాం పంపించామంటూ జైలు అధికారులు బుకాయించారు)అఫ్జల్‌గురుని ఉరితీయడం, శవాన్ని బంధువులకు అప్పగించకుండా తీహార్ జైలు ప్రాంగణం లోనే ఖననం చేయడం అత్యంత జుగుప్సాకరం. మెమన్ నేరం చేసినట్టు నిర్ధారించేవారు కూడా అఫ్జల్‌గురు నిరపరాధి అంటున్నారు. మెమన్‌కు మరణదండన 2007లో ఖరారైనప్పటికీ సుప్రీంకోర్టుకు విన్న వించుకోవడానికీ, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికీ, వాదప్రతివాదాలకూ ఎని మిదేళ్ళ వ్యవధి లభించింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న రెండో పిటిషన్‌ను రాష్ట్ర పతి తిరస్కరించిన తర్వాత కూడా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చొర వతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ వాదనలు విన్నారు. జూలై 30వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలోవారు పిటి షన్ కొట్టివేయడంతో ఉరిశిక్ష అరున్నర గంటల ప్రాంతంలో నాగపూర్ జైలులో అమలు జరిగింది. సర్వోన్నత న్యాయం స్థానం రాజ్యాంగంలో సమకూర్చిన అన్ని అవకాశాలనూ మెమెన్‌కు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు ను కానీ రాష్ట్రపతి నిర్ణయాన్ని కానీ ప్రశ్నించకుండా ఆమోదించాలంటే నిర్ణ యాలు నిష్పాక్షికంగా జరగడమే కాదు. అట్లా జరిగినట్టు కనిపించాలి. రాజీవ్ హంతకులకు మరణదండన విధించవద్దంటూ తమిళనాడు శాసనసభ, బియాం త్సింగ్ హంతకుడి శిక్ష యావజ్జీవ ఖైదుకే పరిమితం చేయాలంటూ పంజాబ్ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు మెమన్‌కు రాజకీయ పార్టీ అండ లేని కారణంగానే ఉరిశిక్ష విధించారంటూ వాదించడం నిర్హేతుకం కానీ కోర్టు ధిక్కారం కానీ దేశద్రోహం కానీ ఎట్లా అవుతుంది? ముం బయ్ బాంబు పేలుళ్లకు ప్రేరణ ఏమిటి? ముంబయ్ అల్లర్లు. వాటికి ప్రేరణ బాబరీ మసీదు విధ్వంసం. 1992 డిసెంబర్ 7 నుంచి 27 వరకూ, 1993 జన వరి 7 నుంచి 25 వరకూ రెండు దఫాలుగా జరిగిన అల్లర్లలో మొత్తం 900 మం ది దాకా చనిపోయారు. ఈ అల్లర్లపైన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ 15,000 పేజీల నివేదిక సమర్పించింది. అనుమానపు ముల్లు ఎటు చూపిస్తున్నదో (నీడిల్ ఆఫ్ సస్పిషన్) కమిషన్ సూచించింది. శివసేన నాయకుడు బాల్‌ఠాక్రే ప్రమేయం బహిరంగ రహస్యం. కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు శివసేన పార్లమెంటు సభ్యుడు మధుకర్ సర్పోట్దార్కు ముంబయ్ కోర్టు 2008లో ఏడాది కఠిన శిక్ష విధించింది. వెనువెంటనే ఆయనకు బెయిల్ లభించింది. శిక్ష అనుభవించకుం డానే మధుకర్ 2010లో చనిపోయాడు. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ నిఖిల్ కాప్సేను కూడా శ్రీకృష్ణ కమిషన్ దోషిగా గుర్తించింది. కానీ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. బాంబు పేలుళ్ల కేసులో 185 మందిని అరెస్టు చేసి నిందితులుగా పేర్కొంటూ అంతకు ముందు జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ నివేదికను తుంగలో తొక్కడం ఎటువంటి సంకేతాలు పంపుతుంది? అల్లర్ల వెనుక తాత్కా లిక ఆవేశం ఉంటుందనీ, బాంబు పేలుళ్ల వెనుక కుట్ర ఉంటుందనీ రాంజె త్మలానీ చెప్పిన భాష్యంలో కొంత వాస్తవికత లేకపోలేదు. కానీ న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ నిందితులందరినీ సమానంగా చూడాలి. ఒక కేసులో సాక్ష్యా ధారాలు సేకరించకుండా అభియోగాలను నీరు కార్చుతూ మరో కేసులో లోతుగా పరిశోధన చేసి, అరెస్టులు చేసి, శిక్షలు పడేవరకూ విచారణ కొన సాగించినప్పుడూ ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసం సన్నగిల్లుతుంది. మరణదండన రద్దు చేయాలి మరణదండన రద్దు చేయాలంటూ ఉద్యమం సాగిస్తూనే మరణదండన విధించే పద్ధతిలో, న్యాయస్థానాలూ, ప్రభుత్వాలూ వ్యవహరించే విధానంలో పారదర్శ కత, హేతుబద్ధత, సమన్యాయం స్పష్టంగా కనిపించాలి. మరణదండన రద్దు కోరడం ఉగ్రవాదాన్ని సమర్థించడంగా, దేశద్రోహంగా చిత్రించడం సంకుచిత మనస్తత్వం. మన సమాజం ఎంతగా చీలిపోయిందో, ఎటువంటి అతుకుల బొంతగా తయారయిందో అర్థం చేసుకుంటే భయం కలుగుతుంది. ఢిల్లీలో సిక్కుల ఊచకోతను విమర్శించేవారు గుజరాత్లో ముస్లింల హత్యాకాండను ప్రస్తావించరు. ముంబయ్ పేలుళ్ల కారకులపై మరణశిక్షను సమర్థించేవారు ముంబయ్ అల్లర్లనూ, శ్రీకృష్ణ కమిషన్ నివేదికనూ విస్మరిస్తారు. పార్లమెంటు సమావేశాలకు అడ్డుతగులుతున్నందుకు కాంగ్రెస్ పార్టీనీ, ఇతర ప్రతిపక్షాలనూ దుయ్యబడుతున్నవారు గత పార్లమెంటులో తాము అదే పని చేసిన సంగతి మరచిపోతారు. మరణదండన వద్దంటే ఉగ్రవాదాన్ని సమర్థించడం అంటారు. ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తే మావోయిస్టులకు కొమ్ముకాస్తున్నారంటారు. మైనా రిటీల ప్రాథమిక హక్కుల అమలు గురించి ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అం టారు. ఇది అన్యాయమైన ధోరణి. నీతీ, నిజాయితీ రవ్వంతైనా లేకుండా, సమాజంలో సామరస్యం సాధించే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా, సంకు చిత భావాలకూ, స్వార్థప్రయోజనాలకూ, కపట వ్యూహాలకూ, దబాయింపు రాజకీయాలకూ ప్రాధాన్యం ఇచ్చినంత కాలం ఈ దేశ సార్వభౌమత్వానికీ, సమై క్యానికీ, సమగ్రతకూ భద్రత ఉండదు. ప్రజాస్వామ్యం మేడిపండు అవుతుంది. -
'సామాజిక అంశాలను వెలుగులోకి తేవాలి'
విజయవాడ: వర్తమాన పరిస్థితులు- మీడియా అనే అంశం పై ప్రజాశక్తి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటూ పలువురు పత్రికా సంపాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో మీడియా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోందని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా అన్నారు. పత్రికా వ్యవస్థలో తమకున్న స్పేచ్ఛను ఉపయోగించుకొని పాత్రికేయులు సామాజిక అంశాలను వెలుగులోకి తీసుకురావాలని కె. రామచంద్రమూర్తి సూచించారు. -
వ్యవసాయ సంక్షోభం పట్టని పాలకవర్గం
త్రికాలమ్ నేరాలు నమోదు చేసే జాతీయ సంస్థ (నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో) లెక్కల ప్రకారం 2014లో దేశవ్యాపితంగా 12,360 మంది రైతులు ఆత్మహత్య చేసు కున్నారు. వారిలో మూడో వంతు మహారాష్ట్రలోని విదర్భలోనే ప్రాణాలు తీసు కున్నారు. తర్వాత స్థానం 1,347 రైతు ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రానిది. పంజాబ్, హర్యానా వంటి సంపన్న రాష్ట్రాలలో సైతం అన్నదాతలు బతకలేక పోతున్నారు. 1998 నుంచి 2014 వరకూ దేశం మొత్తం మీద మూడు లక్షల మందికి పైగా రైతులు చావును ఆశ్రయించారు. ప్రతి 42 నిమిషాలకూ దేశంలో ఎక్కడో ఒక చోట ఒక రైతు ప్రాణత్యాగం చేస్తున్నాడు. మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పాద యాత్ర చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులను కలుసుకున్నారు. ఆయన ప్రసంగాలలో కానీ శరీర భాషలో కానీ వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభం పట్ల ఆందోళన కనిపించలేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ప్రభుత్వా లను దుయ్యపట్టడానికి రైతు దైన్యం ఒక సాధనం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా యూపీఏ ప్రభుత్వం వాగ్దానం చేస్తే వాటిని సాధించడానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కానీ ఏమీ చేయలేదంటూ ఇందిరమ్మ మను మడు తప్పుపట్టాడు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి నిజా యితీగా వ్యవహరించి ఉంటే ఆ సంగతి ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరచవలసింది. వైఎస్ఆర్సీపీ సంవత్సరకాలంగా ఉద్యమిస్తున్నదీ, ప్రభు త్వాలను నిలదీస్తున్నదీ రైతు రుణమాఫీ అమలుతో పాటు పోలవరం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు పట్టుకొని ఎందుక వేళ్లాడుతున్నారనీ, ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదనీ ప్రశ్నిస్తూనే. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాహుల్ అనంతపురం వచ్చినప్పుడు కానీ ఈ వాస్తవాలు ఆయన చెవిన వేసి ఉండరు. పంచ్ డైలాగ్‌లే రాజకీయం కాదు రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా రాటు తేలుతున్నారు. పంచ్ డైలాగ్‌లు సంధించడం అభ్యాసం చేస్తున్నారు. కానీ రాజకీయం అంటే విమర్శనాస్త్రాలు సంధించడం ఒక్కటే కాదు. ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారాలు సూచించగలగాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇవ్వనప్పడు ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించ గలగాలి. అంతటి స్థాయికి రాహుల్ ఎదగలేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఆ దిశగా ఆలోచించడం లేదు. కంటికి కన్ను అన్నట్టు 2012 నుంచి ఎన్నికలు జరిగే వరకూ పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభాకార్యక్రమాలకు అడ్డుతగిలింది కనుక అదే విధానం ఇప్పుడు కాంగ్రెస్ అను సరిస్తోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ ఒక్క రోజుకూడా అర్ధంతరంగా వాయిదా పడదు. అమెరికాలో చట్టసభలలో అధికార పార్టీ ప్రవేశ పెట్టిన బిల్లులను ప్రతి పక్ష సభ్యులు సైతం సమర్థిస్తారు. అధికార పార్టీ సభ్యులు విభేదించిన సంద ర్భాలూ అనేకం. మన రాజకీయ పార్టీల నాయకులు అహంకారపూరిత రాజ కీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నదాత ఆత్మహత్యకు ఒడిగట్టినప్పుడు అనాథలైన కుటుంబ సభ్యులను కలుసుకోకపోవడం, ఏమీ జరగనట్టు వ్యవహరించడం, వ్యవసాయం కార ణంగా ఆత్మహత్య చేసుకోలేదని నమోదు చేయాలంటూ రెవెన్యూ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అథమం. గుండెకోతకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించి చేతనైనంత సాయం అందించడం మధ్యమం. రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కలగకుండా, వ్యవసాయం గిట్టుబాటు అయ్యే విధంగా, వీలైతే లాభసాటి వ్యాసంగంగా మారే విధంగా అనుసరించవలసిన విధానాలు ఏమిటో ఆలోచించడం, చర్చించడం, ఒక మార్గాన్ని క నుక్కోవడానికి యథాశక్తి ప్రయత్నించడం ఉత్తమం. వాస్తవానికి వ్యవసాయరంగంపైనా, నానాటికీ దిగజారుతున్న వ్యవసాయదారుల ఆదాయంపైనా చట్టసభలన్నీ ఏకాగ్రచిత్తంతో సమాలోచన చేయాలి. విశ్వవిద్యాలయాలలో అధ్యయనాలు సాగాలి. మీడియాలో చర్చోపచర్చలు జరగాలి. మేధోమథనం సాగాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న తమాషా ఏమిటి? మన ప్రజాప్రతినిధులూ, మన మేధావులూ, మన సామాజికవేత్తలూ ఏం చేస్తున్నారు? ఏయే అంశాలను చర్చిస్తున్నారు? ఎందుకోసం గొంతు చించుకుంటున్నారు? ఎవరికోసం గుండెలు బాదుకుంటున్నారు? చర్చ జరగదు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో చర్చ జరగడం లేదు. ఒక వేళ చర్చ జరి గినా వ్యవసాయరంగంపైన జరగదు. పుష్కరాల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ భక్తిపారవశ్యంతో నిన్నటి వరకూ తరించిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సహచరులతో సహా గోదావరి హారతిని నిత్యం తిలకిస్తూ దాతాత్మ్యం చెందారు. ప్రపంచంలోకెల్లా అందమైన గొప్ప నగరంగా అమరావతిని నిర్మించడానికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సహకారం కోసం ముఖ్యమంత్రి తాపత్రయపడుతుంటే, గోదావరి హారతినీ, పుష్కర జనసందోహాన్నీ చూపించి సింగపూర్ సర్కార్ ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి యాతన పడుతుంటే రైతులూ, రైతు కూలీలూ, వారి ప్రాణాలూ అంటూ సణగడంలో అర్థం ఉన్నదా? అమరావతి కల సాకారం కావడానికి ముందే హైదరాబాద్‌కి మరిన్ని హంగులు సమకూర్చి, ఆకాశమార్గాలు నిర్మించి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చి దిద్దడానికి అహర్నిశలూ పరిశ్రమిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ సంక్షోభం గురించి ఆలోచించే సమయం ఉన్నదా? ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు రైతుల రుణాలు మాఫీ చేయడానికి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కానీ విదర్భ తర్వాత రైతుల బలిపీఠంగా తెలంగాణ పేరుమోస్తున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వమే ఉన్న దుస్థితే. కానీ అధికార పార్టీగా తెరాస ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం బాధ్యతారాహిత్యం. భూసేకరణ చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రైతుల జీవితాలలో వెలుగు నిండిపోతుందంటూ ప్రధాని మోదీ ఉద్ఘోషిస్తున్నారు. అందులోని మర్మం ఏమిటో బోధపడటం లేదు. భూమి లేకపోతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి నగరానికి వలస వెళ్లి కూలీనాలీ చేసుకొని బతుకుతారనీ, ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం రాదనీ మోదీ మనోగతం కావచ్చు. ప్రేమవ్యవహారమో, నపుంసకత్వమో రైతుల ఆత్మహత్యలకు కారణమంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత కూడా మంత్రిగా కొనసాగుతున్నారంటే రైతుల పట్ల ఎన్డీఏ సర్కార్‌కు ఎంత సానుభూతి ఉన్నదో, వ్యవసాయరంగం పట్ల ఎంతటి అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాధామోహన్‌సింగ్ వంటి మంత్రిమండలి సహచరులూ, సాక్షీ మహరాజ్ వంటి పార్టీ ఎంపీలూ ఉన్నప్పుడు మోదీకి వేరే శత్రువులు అక్కరలేదు. మీడియా ఏం చేస్తున్నది? కేజ్రీవాల్‌కీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్కీ మధ్య జగడం, జంగ్ వెనుక మోదీ హస్తం ఇంగ్లీషు చానళ్ళకూ, పత్రికలకూ చాలా ముఖ్యమైన అంశాలు. సరిహద్దులో చిన్న ఘటన జరిగినా భారత్, పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతున్నట్టు గావుకేకలు పెడుతూ, పాకిస్తాన్‌నూ, ఆ దేశం సైనిక వ్యవస్థనూ, రాజకీయ నాయకులనూ, దౌత్యవేత్తలనూ శాపనార్థాలు పెడుతూ తమ దేశభక్తిని చాటుకునే పనిలో ప్రఖ్యాత టీవీ జర్నలిస్టులు తలమునకలై ఉంటారు. సరిహద్దు నిశ్శబ్దంగా ఉంటే మమతా బెనర్జీ మేనల్లుడో, వసుంధరారాజే త నయుడో, సోనియాగాంధీ అల్లుడో, మేనకాగాంధీ కొడుకో ఏదో ఒక పిచ్చి పని చేసి చానళ్లకు దొరికిపోతారు. ఆ పిచ్చిపనిపైనా దృష్టి పెట్టి అరడజను మంది ప్రవీణులు పచ్చిపచ్చిగా తిట్టుకుంటూ, పరస్పరం అరచుకుంటూ సాగే రచ్చలను న్యూస్ అవర్లూ, ప్రైమ్షోల పేరుతో నిర్వహిస్తాయి. రైతుల గురించి చచ్చినా చర్చించరు. ఇంగ్లీషు పత్రికల ఎడిట్ పేజీలలో వస్తున్న వ్యాసాలను పరిశీలించినా వ్యవసాయరంగంపైన వచ్చే విశ్లేషణలు కనిపించవు. రైతు పత్రికా పాఠకుడు కాదు కనుక అతని గురించి పట్టించుకోవడం వ్యర్థం. వ్యవసాయ సంక్షోభంపైన తన అధ్యయన ఫలితాలను ప్రచురించే పత్రిక లేక పాలగుమ్మి సాయినాథ్ వంటి ప్రసిద్ధుడు స్వయంగా వెబ్సైట్ పెట్టుకోవలసి వచ్చింది. తెలుగు మీడియా రెండు రాష్ట్రాల రాజకీయాలతో సతమతం అవుతున్నది. రోజుకు ముగ్గురు రైతుల వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మొదటి పేజీలోకి వార్త రావడంలేదు. చానళ్లు వివాదాలతో, వినోదంతో కాలక్షేపం చేస్తున్నాయి. అగ్రతర ప్రాధాన్యం మోదీ, చంద్రబాబు నాయుడూ, కేసీఆర్ వంటి నాయకులు పట్టించు కోవడం లేదని నిందిస్తున్నాము కానీ వారంతా పట్టించుకున్నా వ్యవసాయరంగ సంక్షోభం సమసిపోతుందన్న నమ్మకం లేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేయడం చైనా ప్రభుత్వం వల్ల కాలేదు. అయితే చైనా ప్రభుత్వం రైతులు పస్తు పడుకోకుండా చూడవలసిన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరి స్తున్నది. మన దేశంలో 53 శాతం మంది రైతులు ఆకలితోనే నిద్రపోతారని సర్వేలు చెబుతున్నాయి. సంపన్న దేశాలు వ్యవసాయరంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. పరిశ్రమలూ, సేవారంగ సంస్థలూ విస్తరించినప్పుడు, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు మెలకువలు నేర్పడం (స్కిల్ డెవలప్ మెంట్) ద్వారా వ్యవసాయరంగం నుంచి యువకులనూ, యువతులనూ ఇతర రంగాలకు మళ్లించవచ్చు. తప్పులేదు. కానీ ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకుండా వ్యవసారంగానికి ఇస్తున్న సబ్సిడీలలో కోత విధించాలని వాదించడం దారుణం. వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలను వ్యవసాయేతర కార్యక్రమాలపై ఖర్చు చేసినట్టు ఇటీవల రిజర్వ్‌బ్యాంకు చేయించిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రుణాలపైన ఏడు శాతం వడ్డీనే వసూలు చేయాలనీ, గడువులోగా రుణం తిరిగి చెల్లించినవారికి ప్రోత్సాహకంగా మూడు శాతం వడ్డీ తగ్గించాలనీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం నాలుగు శాతానికే వ్యవసాయ రుణాలు అందుతాయి. రుణాలు అందుకునే భూమి యజమానులు నగరాలలో స్థిరపడి ఉద్యోగాలలోనో, వ్యాపారాలలోనో ఉన్నారు. క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నవారు కౌలు రైతులు. వారికి రుణసహాయం అందినప్పుడు కొంత ఊరట లభించవచ్చు. ఇది ఒక్కటే చాలదు. వ్యవసాయరంగానికి కాయకల్ప చికిత్స అవసరం. సమూలమైన మార్పులు తెచ్చే సంస్కరణలు ప్రవేశపెట్టాలి. మార్కెంటింగ్ సదుపాయాల కల్పన నుంచి పరిశోధన, అభివృద్ధి రంగం వరకూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్ణయించేందుకు కూలంకషంగా చర్చ జరగాలి. పార్లమెంటు ఉభయ సభలూ, రాష్ట్రాల శాసనసభలూ వ్యవసాయ సంక్షోభం పైన చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మంచిదే. రాజకీయ ప్రయోజనాలనూ, సిద్ధాంతరాద్దాంతాలనూ పక్కన పెట్టి వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి సమష్టిగా ప్రయత్నించాలి. అప్పుల ఊబి నుంచి రైతులనూ, కౌలురైతులనూ బయటపడవేయాలి. ఇది జాతి యావత్తుకూ ప్రథమ ప్రాధమ్యం కావాలి. వేలమంది రైతులు నేలరాలి పోతుంటే స్పందించని సమాజానికి నిష్కృతి ఉంటుందా? కె రామచంద్రమూర్తి -
జాతీయ మీడియా పారదర్శకంగా ఉండాలి: రామచంద్ర మూర్తి
తిరుపతి: దేశంలోని అన్ని ప్రాంతాల వార్తల ప్రసారంలో నేషనల్ మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన వర్కింగ్ కమిటీ మీట్‌కు రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘటనలు, పరిస్థితులపై నేషనల్ మీడియా సరైన స్థాయిలో ఫోకస్ చేయలేకపోతోందని అన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్ కేసులోనూ, తెలంగాణలో మొన్నటి ఓటుకు కోట్లు కేసులోనూ సరిగా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపం కుంభకోణం అంశంలో నేషనల్ మీడియా బాగా శ్రద్ధ కనబరుస్తోందన్నారు. దీన్నిబట్టి నేషనల్ మీడియా ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నంత ప్రాధాన్యతను దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తేటతెల్లమవుతోందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా విధి నిర్వహించినపుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా కృషి చేయాలని యువ జర్నలిస్టులకు సూచించారు. అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షుడు బాలభాస్కర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున జర్నలిస్టులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పెన్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనూ కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన యూనియన్ సభ్యులను సమావేశపరిచి చర్చించడ మే ఈ సమావేశం ముఖ్య ఉద్ధేశమన్నారు. సాక్షి ఈడీకి ఘన సన్మానం సమావేశం చివరలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తిని యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ శర్మ, అజయ్రావత్, సుభాష్‌గౌడ్, స్థానిక జర్నలిస్టు నాయకుడు రమణమూర్తితో పాటు తమిళ, తెలుగు మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
BREAD ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు
-
స్వయంకృతం
త్రికాలమ్ ఒక గీత చిన్నది కావాలంటే దాని పక్కనే పెద్ద గీత గీయాలి. తన సమస్యపై నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ప్రత్యర్థులకు పెను సమస్య సృష్టించాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం అదే. టేపూ, ట్రాపూ కాదు ట్యాపు అంటూ టాపు లేపాలన్నది ఎత్తుగడ. యువనాయ కుడు రేవంత్‌రెడ్డిని నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్ శాసనసభ్యుడు స్టీవెన్సన్, ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కలసి ట్రాప్ చేసిన సంగతి వాస్తవం. స్టీవెన్సన్ స్మార్ట్ ఫోన్లో సంభాషణలను రికార్డు (టేపు) చేసిన మాట నిజం. చంద్రబాబు నాయుడు స్టీవెన్సన్తో మాట్లాడారనడానికి సాక్ష్యంగా నిలుస్తుందని భావించిన ఆడియోను టీవీ చానళ్ళు వినిపించాయి. చంద్రబాబునాయుడి స్వరం, మరొ కరి స్వరం ఎంఎల్ఏ స్టీవెన్సన్ ఫోన్లో రికార్డయినాయి. గొంతు తనది కాదన కుండా ట్యాప్ ఎట్లా చేస్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి పెద్దలం దరికీ ఫిర్యాదు చేసి వచ్చారు. ట్యాప్ చేశారనడం అబద్ధం. చంద్రబాబు నాయుడి ఫోన్ ట్యాప్ చేసి ఉంటే మాటల వరుస మరో విధంగా ఉండేది. ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఖాన్ చెబుతున్నది అదే. ట్యాప్ చేయలేదనే ఆయన స్పష్టంగా చెప్పారు. టేపు కాకుండా ట్యాప్ గురించి గగ్గోలు పెట్టడం ద్వారా, హైదరా బాద్‌లో తమకు భద్రత లేదనీ, స్వేచ్ఛ లేదనీ ఢిల్లీలో మొరపెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టి ఎంఎల్ఏ ‘కొనుగోలు’ ఉదంతంపై నుంచి మరో వైపు మరల్చాల న్నది చంద్రబాబునాయుడు ఎత్తుగడ. పది రోజులుగా టీవీ న్యూస్ చానళ్ళలో మనం చూస్తున్న దృశ్యాలు రోగ లక్షణాలు మాత్రమే. డబ్బురాజకీయం అనే అసలు రోగం మూడు దశాబ్దాలుగా బాగా ముదిరింది. అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమా లిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పు లాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం. సమర్థనీయంకాని విషయాన్ని సమర్థించవలసి వచ్చిన ప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. రేవంత్‌రెడ్డి ఎంఎల్ఏతో బేరం చేస్తూ, నగదు అందజేస్తూ వీడియోలో పట్టుబడిన తర్వాత ఆ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ప్రకటిస్తారని అనుకుంటున్న దశలోనే స్టీవెన్సన్తో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టు ఆరోపణ వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా చంద్రబాబునాయుడి స్వరం కలిగిన టేపును టీవీ చానళ్ళు వినిపించాయి. రేవంత్‌రెడ్డిని తప్పు పట్టకుండా, తన తప్పు ఒప్పుకోకుండా హైదరాబాద్‌లో శాంతిభద్రతలంటూ, విభజన చట్టంలో ఎనిమిదో సెక్షనంటూ దబాయించడం ద్వారా, సమాం తరంగా మరో పెద్ద సమస్యను తెరమీదికి తీసుకురావడం ద్వారా ఎంఎల్ఏ కొనగోలు అంశానికి ప్రాధాన్యం తగ్గించాలని వ్యూహం. రేవంత్‌రెడ్డిపైన చర్య తీసుకుంటే యువనాయకుడు అప్రూవర్‌గా మారే అవకాశం ఉంది. గుట్టు రట్టు చేసే ప్రమాదం ఉంది. అందుకే కుటుంబ సహితంగా, మంత్రివర్గ సభ్యులం దరితో కలసి రేవంత్ కుమార్తె నిశ్చితార్థం శుభకార్యానికి ముఖ్యమంత్రి హాజరై నారు. ఆత్మరక్షణకోసం పాటుపడటం కంటే ఎదురుదాడే మంచి వ్యూహమని నిర్ణయించుకొని ఉంటారు. అందుకే, ఎన్నికలలో 63 సీట్లు మాత్రమే గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అయిదుగురు అభ్యర్థులను ఎందుకు పోటీకి పెట్టిందంటూ చంద్ర బాబునాయుడు ప్రశ్నించారు. టీ డీపీ, బీజేపీ సభ్యులు కలిసి 16 మంది మాత్రమే ఉన్నప్పుడు, గెలుపొందడానికి 17 మంది సభ్యులు అవసరమై నప్పుడు పోటీకి టీడీపీ అభ్యర్థిని నిలపడం ఎందుకనే ప్రశ్నకు ఆయన సమా ధానం చెప్పరు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 63 మాత్రమే అయినప్పటికీ, బీఎస్పీ టిక్కెట్టుమీద గెలిచిన ఇద్దరూ, కాంగ్రెస్ సభ్యులు ఐదుగురూ, టీడీపీ సభ్యులు ఐదుగురూ, వైఎస్సార్సీపీ సభ్యులు ఇద్దరూ పార్టీలు ఫిరాయించడంతో మొత్తం సభ్యులు 77 మంది అయ్యారు. వీరుగాక వైఎస్సార్సీపీ సభ్యుడు ఒకరూ, ఎంఐఎం సభ్యులు ఏడుగురూ మద్దతు ఇచ్చారు. ఫలితంగా టీఆర్ఎస్ పక్షాన 85 మంది సభ్యులు నిలిచారు. అయిదుగురు అభ్యర్థులు గెలవగలిగారు. టీడీపీ చేస్తున్న మరో విమర్శ తమ పార్టీ ఎంఎల్ఏను టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఎట్లా చేర్చుకుంటారన్నది. ఇది ముమ్మాటికీ అనైతికమే. ఆక్షేపణీ యమే. పధ్నాలుగు మంది సభ్యులను ఇతర పార్టీల నుంచి ఆకర్షించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లో చేరే ముందు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండవలసింది. టీఆర్ఎస్ టిక్కెట్టు మీద ఉప ఎన్నికలో తిరిగి ఎన్నిక కావడం ఆయనకు కష్టం కాదు. టీడీపీ టిక్కెట్టు మీద గెలిచి టీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరడం రాజ్యాంగవిరుద్ధం. నీతిబాహ్యం. ఇందుకు శాసనసభాపతి సమాధానం చెప్పవలసి ఉంటుంది. శ్రీనివాస యాదవ్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్ సైతం నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎదురుదాడి బెడిసికొడుతుంది ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని టీఆర్ఎస్ ఉల్లంఘించింది కనుక అవినీతి నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘిస్తామనే వాదనలో పసలేదు. ఒకదానికి మరొకటి చెల్లు కాదు. ఇది రెండు పార్టీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది చట్టానికీ, నైతికతకీ సంబంధించింది. ఈ చిక్కు నుంచి బయట పడటం కోసం హైదరాబాద్‌లో శాంతిభద్రతలు లేవంటూ ప్రశాంతంగా జీవి స్తున్నవారిలో అభద్రతా భావం సృష్టించడం ధర్మం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గొడవలేమీ జరగ లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సర్కార్ మూడు, నాలుగు రోజులపాటు కొనసాగించింది. ఈ నిర్మాణాల యజమాను లలో అన్ని ప్రాంతాలవారూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనికట్టుకొని ఆం ధ్రప్రాంతానికి చెందినవారిపైన శత్రుభావం ప్రదర్శించిన సందర్భం లేకపోగా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న కారణంగానో, మరే కారణంగానో కేసీఆర్ అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొనిపోయే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కష్టాలు కూడబలుక్కొని వచ్చినట్టు రాజకీయ అపభ్రంశాలు సైతం వరుసగా జరుగుతాయి. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతినీ, ప్రధానినీ, దేశీయాంగమంత్రినీ కలసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 8వ సెక్షన్ అమలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపైన ఫిర్యాదు చేసినంత మాత్రాన రేవంత్‌రెడ్డి సమస్య సమసిపోదు. గవర్నర్ నరసింహన్ ద్వారా మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సమాచారం అందుతుంది. ఢిల్లీలో పెద్దలందరినీ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబునాయుడులో అసహనం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఏసీబీ పకడ్బందీగా వలవేసి (ట్రాప్ చేసి) వీడియోలో రేవంత్‌రెడ్డి నిర్వాహకం దృశ్యాలను బంధించిన తర్వాత ప్రధాని సైతం చేయగలిగింది ఏమీ ఉండదు. అందరూ చేస్తున్న పనే కావచ్చు. కానీ వీడియోలో దొరికిన తర్వాత నేరం రుజువు కాక తప్పదు. తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల పార్టీ నిధి నగదు రూపంలో స్వీకరిస్తూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ పదవీచ్యుతుడై, జైలుపాలై భ్రష్టుపట్టారు. 50 లక్షల రూపా యల నగదు ఇస్తూ పట్టుబడిన రేవంత్ తప్పించుకోవడం కష్టం. రాజకీయాలలో చాలా వేగంగా పైకి వచ్చిన యువకుడు రేవంత్‌రెడ్డి. బెయిలుపైన వచ్చి కూతురి నిశ్చితార్థానికి హాజరు కావలసి రావడం నిజంగానే బాధాకరం. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత ప్రధానంగా రాజకీయాలలో డబ్బు పాత్రను పెంచిపోషించినవారిదే. రాజకీయాలను జూదంగా పరిగణించి గెలుపే ప్రధానంగా వ్యవహరించడం వల్ల విలువలు లుప్తమవుతున్నాయి. ఎన్నికలలో పార్టీలూ, అభ్యర్థులూ పెడుతున్న ఖర్చు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగునాట చాలా రెట్లు ఎక్కువ. సార్వత్రిక ఎన్నికలు జరిగి, ఎన్నికైనట్టు సర్టిఫికెట్ చేతికి అందగానే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పార్టీ ఫిరాయించిన ఘటన కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. నిప్పులాంటి రాజకీ యం చేశాను అంటూ గొంతు చించుకొనే చంద్రబాబునాయుడే ఈ ఫిరాయిం పును ప్రోత్సహించారు. చంద్రబాబునాయుడు అయినా, చంద్రశేఖరరావు అయినా, మరే రాజ కీయ నాయకుడైనా ఏ విత్తనం విత్తితే ఆ పంటే పండుతుంది. అధినాయకులు ఆదర్శవంతంగా, పారదర్శకంగా రాజకీయం చేస్తే ఇతర నాయకులు అనుసరి స్తారు. ఎన్నికలలో కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ, ఎన్నికలు కాగానే పార్టీ ఫిరాయింపులకు తెగబడుతూ, అవసరమైతే ఎంఎల్‌ఏలనూ, జెడ్పీటీసీలనూ, ఎంపీటీసీలనూ ప్రలోభపెడుతూ అగ్రనాయకులు అవినీతికి పాల్పడుతుంటే వారి అనుచరులు సైతం అదే బాటలో నడుస్తారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమై, అవినీతిమయమై అరాచకానికి దారితీస్తుంది. ఘర్షణాత్మకవైఖరి వద్దు రాష్ట్ర విభజనకు పూర్వం ఉద్యమకాలంలో ఇరు ప్రాంతాల నాయకులూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారంటే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి నాటి కపట నాటక రాజకీయమే నేటి అనర్థాలకు మూలం. విభజన చట్టంలో లొసుగులుం డటానికి కారణం పార్లమెంటులో చర్చకు సమైక్యవాదులు సహకరించకపో వడమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి రాష్ట్రంలో వారు అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేయడంపైన దృష్టి సారించాలి కానీ ఒకరి కంటే ఒకరు అధికు లమని నిరూపించుకోవడానికి అప్రజాస్వామ్యంగా, ప్రజాప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరించకూడదు. తెలంగాణలో కొన్ని మంచి పథకాల అమలు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టుతో సహా అన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. సంవత్సరం గడిచినా ప్రభుత్వం గాడిలో పడినట్టు కనిపించలేదు. ముఖ్యమంత్రి మళ్ళీ విదేశీ పర్య టనకు సమాయత్తం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పనిభారం ఉన్న ప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు? ఎంఎల్సీ సీటు ఒకటి గెలవాలన్న తాపత్రయం ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమం త్రులూ, ఇతర మంత్రులూ, ఉన్నతాధికారులూ పరస్పరం గౌరవించుకుంటూ సహకరించుకోవాలి. ముఖ్యమంత్రిని మరో ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శిం చడం, ఒక ముఖ్యమంత్రిని పొరుగు రాష్ట్రంలోని జూనియర్ మంత్రి శాస్తి చేస్తా నంటూ హెచ్చరించడం సంస్కార రాహిత్యానికి పరాకాష్ట. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులనూ కట్టడి చేయడంలో గవర్నర్ నిర్ణాయక పాత్ర పోషించాలి. కేంద్రం సైతం ప్రేక్షక పాత్ర కాకుండా విభజన చట్టం అక్షరాలా అమలు జరిగే విధంగా మధ్యవర్తిత్వం నిర్వర్తించాలి. తెలుగువారు శాంతినే కోరుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం ఇరు వైపులా నాయకులు రెచ్చిపోయి దుమ్మెత్తిపోసుకున్నా ప్రజలు సంయమనం ప్రదర్శిం చారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడం క్షమార్హం కాని నేరం. రేవంత్‌రెడ్డి ఉదంతంలో చట్టం పరిధిలో ఉంది. ఆ గీత అంత సులభంగా చెరగదు. దాని కంటే పెద్ద గీత గీయడానికి చేసే ప్రయత్నం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. చట్టప్రకారం నడుచుకోవడమే క్షేమదాయకం. అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమాలిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పులాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం. కె.రామచంద్రమూర్తి -
మన్మోహన్సింగ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు మోదీజీ పిలిస్తే వెళ్లాను. పిలిస్తేనే వెళ్లాను. సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని నా పూర్వపు నివాసంలో ఆయన అపరిమితమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తూ కనిపించారు! చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కుని ఉన్నారు. గలగల మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తుళ్లుతున్నారు. ఎవరి అనుమతులు, ఆదేశాల కోసం చూడకుండానే నా రాకను ఆశ్చర్యంతో కూడిన ఒక భారీ కేరింతతో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు! ఒక ప్రధానికి ఇంత పెద్ద సౌండుతో కూడిన స్వేచ్ఛ ఉంటుందా?! ‘‘మన్మోహన్జీ, చాయ్ తాగడం కోసమైనా మీరు పెదవి విప్పుతారా?’’ అని ఘొల్లున నవ్వారు మోదీజీ. ఆ వెంటనే స్నేహపూర్వకంగా ఒక కప్పులో ఒడుపుగా చాయ్‌ని ఒంపి, నా చేతికి అందించి, ‘‘మన్మోహన్జీ, మీరు నాకు ఎకనమిక్స్, ఫారిన్ పాలసీ... ఈ రెండు సబ్జెక్టులూ టీచ్ చేయగలరా?’’ అని ఎంతో విధేయంగా అడిగారు. ఆ విధేయత నాకు విధేయతలా అనిపించలేదు. ఎక్కడైనా రోగే డాక్టరు దగ్గరికి వెళ్తాడు. శిష్యుడే గురువు దగ్గరికి వెళతాడు. కానీ, మోదీజీ నన్ను తన దగ్గరికి పిలిపించుకుని మరీ ట్యూషన్ చెప్పమని అడుగుతున్నాడు! ‘‘ముందు మీకు మర్యాద, మన్నన పాఠాలు అవసరం’’ అన్నాను. నిజంగానే అన్నానా? ఏమో అనే ఉండొచ్చు. అనకపోయీ ఉండొచ్చు. అని వుంటే నా వాయిస్ నాకు వినిపించి ఉండదా? ఒకవేళ వినిపించిందేమో. నేనే వినిపించుకోలేదేమో!ట్యూషన్ చెప్తానని కానీ, చెప్పనని కానీ చెప్పకుండా మోదీజీ చేతిలోని నా చెయ్యిని విడిపించుకున్నాను. ‘‘అర్థం చేసుకోగలను మన్మోహన్జీ. మీ మాట మీది కాదు. మీ మౌనం... అది కూడా మీది కాదు. అందుకే మీరు మమ్మల్ని ఏం అన్నా, అనకపోయినా ఒకటే మాకు’’ అని నవ్వుతూ వీడ్కోలు పలికారు మోదీజీ.వరండాలో అమిత్‌షా ఎదురొచ్చాడు. ఒక నవ్వు లేదు. నమస్కారం లేదు. పైగా నన్నంటాడు, నా ముఖంలో ఫీలింగ్సేమీ ఉండవని! నాది స్ట్రెయిట్ ఫేస్ అట. తప్పేంటి? స్ట్రెయిట్‌గా ఉండే మనుషుల ముక్కు, ముఖం స్ట్రెయిట్గానే ఉంటాయి. ఇంతకీ అతడికి నా ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కావాలి? ఇకిలించాలా? సకిలించాలా? కనుసైగ చేయాలా? కింది పెదవిని మునిపంటితో కొరుకుతూ కనిపించాలా? అయినా ఒక మగాడికి ఇంకో మగాడి ఫీలింగ్స్‌తో పనేంటి? ఎలనార్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి గుర్తుకొస్తోంది. గొప్పవాళ్లు గొప్పగొప్ప ఆలోచనలు చేస్తార ట. సగటు మనుషులు సంఘటనల గురించి మాట్లాడుకుంటారట. అల్పులు సాటి మనుషులపై దుమ్మెత్తిపోస్తారట. అల్పుల కన్నా అధమం అమిత్‌షా. అతడు నా ముఖాన్ని కామెంట్ చేస్తున్నాడు! మోదీజీకి పాఠాలు చెప్పినా చెప్పకపోయినా, అమిత్‌కి మాత్రం గుణపాఠం చెప్పి తీరాలి. -
మాట, బాట మార్చుతున్న మోదీ
త్రికాలం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మహర్జాతకుడు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయరంగంలో అంచలంచలుగా ఎదిగి శిఖరాగ్రంలో నిలిచిన మోదీకి స్వయంకృషితో పాటు అదృష్టం కలసి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా భీష్మాచార్యుడు అద్వానీ ఆశీస్సులతో మోదీ రాజకీయ సోపానం అధిరోహించడంలో ఆశ్చర్యం లేదు. అద్వానీ చాలా మంది యువనాయకులకు ఆపాటి అవకాశాలు ప్రసాదించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పదవి స్వీకరించిన కొద్ది మాసాలకే సంభవించిన సంక్షోభం నుంచి కోలుకున్న తీరు మాత్రం అద్వితీయం. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికీ ఇన్ని ఒడిదుడుకులు ఎదురై ఉండవు. ఇంతటి ఘనవిజయం లభించి ఉండదు. గోధ్రా అనంతరం మతకలహాలలో ‘రాజధర్మం’ నెరవేర్చలేదంటూ మోదీని నాటి ప్రధాని వాజపేయి ఆక్షేపించడమే కాకుండా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలన్నీ ఆయనను వెలివేశాయి. వీసా నిరాకరించాయి. ఆయన మంత్రివర్గ సహచరులు కేసులలో నిందితులుగా బోనెక్కవలసి వచ్చింది. ఒక మహిళా మంత్రికి జైలు శిక్ష అమలు జరుగుతోంది. మరో మంత్రి అమిత్ షా జైలుకు వెళ్లడం ఖామయంటూ న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెప్పారు. అనేక మంది ఉన్నతాధికారులు జైలుపాలైనారు. అటు వంటి స్థితి నుంచి భాజపా ప్రధాని అభ్యర్థిగా నియుక్తుడు కావడం, దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరపడం, అధ్భుతమైన రీతిలో ఎన్నికల ప్రచారం చేయడం, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీ (భాజపా)కి లోక్‌సభలో మెజారిటీ సాధించడం మోదీ పేరుతో నమోదైన ఘన చరిత్ర. అధఃపాతాళం నుంచి హిమాలయ పర్వతం స్థాయికి మోదీ అమాంతంగా పెరిగిన తీరు అపూర్వమైనది. విదేశీయానాల పరంపర అరుదైన విజయం సాధించి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రధానిగా మోదీ జయాపజయాలను సమీక్షించినప్పుడు మిశ్రమానుభూతి కలుగుతుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు ఇవ్వడం అన్యా యమైతే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నూటికి నూరు మార్కులు ఇవ్వడం మితిమీరిన ఔదార్యం. మోదీ దేశంలో సాధించిన ఘనకార్యాలకంటే విదేశీ పర్యటనలలో సాధించిన ఫలితాలే గణనీయమైనవి. పన్నెండు మాసాలలో పద్దెనిమిది దేశాలు పర్యటించి 52 రోజులు దేశం వెలుపలే గడిపిన మోదీ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. మోదీ విదేశీయానాల ఖర్చు రూ. 317 కోట్లు. విదేశీ పర్యటనలలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మోదీని ప్రపంచ దేశాధినేతలు స్వాగతించారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను పూర్వపక్షం చేసే విధంగా మోదీ పర్యటనలు సాగాయి. మన్మోహన్‌సింగ్‌కు ఒక ఆర్థికవేత్తగా ఇతర దేశాల అధ్యక్షులూ, ప్రధానులూ గౌరవిస్తే మోదీని ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన ప్రజానా యకుడిగా ఆదరించారు. విదేశీ పర్యటనల ఫలితంగా ప్రధాని దేశానికి ఎటు వంటి ప్రయోజనం సమకూర్చారో కాలక్రమంలో కానీ తేలదు. తక్షణం ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. కలసివచ్చిన అదృష్టం జాతీయ స్థాయిలో మోదీకి కలసి వచ్చిన అంశాలు అనేకం. అమెరికా దౌత్య విధానం కారణంగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచిన ఫలితంగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్‌కు గొప్ప మేలు జరిగింది. ఆర్థిక పురోగతి నిరాఘాటంగా సాగుతోంది. ద్రవ్యోల్బణం తగ్గింది. బ్యాంకు రుణాల రేట్టు తగ్గాయి. రూపాయి దాదాపు నిలకడగా ఉంది. ద్రవ్యలోటు తగ్గింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయి. ప్రభుత్వ స్థాయిలో అవినీతి అంతగా కనిపించడం లేదు. సర్కారు గణాంకాల ప్రకారం దేశ ప్రగతి రేటు 7.5 శాతం వరకూ ఉండవచ్చు. అంటే ఇది చైనా ప్రస్తుత ప్రగతి రేటు కంటే అధికం. ప్రపంచంలో ఈ రోజు అత్యంత వేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. ఆశించినంత మేరకు కాకపోయినా మొత్తం మీద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి. మోదీ పరివారంలో కొందరు ఉన్మత్త ప్రకటనలు చేసినప్పటికీ, వారిని ఆయన పూర్తిగా అదుపులో పెట్టలేకపోయి నప్పటికీ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సకాలంలో ఖండించడం ద్వారా తాను రాజనీతిజ్ఞుడుగా స్థాయిని పెంచుకోగలనని అప్పు డప్పుడు నమ్మకం కలిగించగలిగారు. పేద ప్రజలకు వంటగ్యాస్‌పైన సబ్సిడీ, చౌక రేషన్ ఇవ్వడానికి బదులు నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. పనితీరును మెరుగు పరచడం ద్వారా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం సానుకూలమనే సంకేతాలు పంపగలిగారు. కేంద్ర ప్రభుత్వో ద్యోగులు సకాలంలో కార్యాలయాలకు హాజరు కావాలనీ, రోజుకు కనీసం ఎనిమిది గంటల పనిచేసి తీరాలనీ నిబంధనలు విధించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద మూల్యమే చెల్లించారు. ప్రభుత్వం క్రమశిక్షణతో పని చేస్తు న్నట్టు ఒక అభిప్రాయం జనసామాన్యంలో కలిగింది. కానీ సంవత్సర కాలంలో మోదీ మార్కు సంస్కరణ కానీ, పథకం కానీ చెప్పుకోవడానికి లేదు. ప్రతి రోజూ ఐదారుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ వ్యవ సాయరంగాన్ని ఆదుకోవాలన్న ఆరాటం లేదు. అసాధారణమైన చొరవ ప్రదర్శించకుండానే కొన్ని మంచి ఫలితాలు కనిపించడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ విపణిలో చమురు ధరల భారీ పతనం. అందుకు దామాషాగా దేశంలో పెట్రోలు ఉత్పత్తుల ధరలు తగ్గించకుండా సబ్సిడీలకు గణనీయంగా కోత విధించారు. యూపీఏ ప్రభుత్వాలూ, అంతకు ముందు పీవీ, వాజపేయి ప్రభుత్వాలూ వేసిన పునాదులు పటిష్ఠమైనవి కనుకనే నేటి ఆర్థిక విజయాలు సుసాధ్యం అవుతున్నాయి. ఆర్థిక సంస్కరణల విషయంలో మోదీ ఇప్పటికీ నత్తనడకే నడుస్తున్నారనీ, ముందు రాజకీయంగా స్థిరపడిన తర్వాతనే సంస్కరణల జోలికి వెళ్ళాలనే తప్పుడు అంచనాతో పని చేస్తున్నారనీ ‘ఎకనమిస్ట్’ వంటి మితవాద మీడియాతో పాటు కార్పొరేట్ రంగ ప్రము ఖులూ, ఆర్థిక విశ్లేషకులూ ఆక్షేపిస్తున్నారు. భూసేకరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకపోవడం ఇన్ఫ్రా రంగం (మౌలిక వసతుల నిర్మాణరంగం) అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నదంటూ హెచ్చరిస్తున్నారు. పట్టువిడుపులు తెలిసిన నేత మోదీ బయటికి కనిపించినంత మొండి కాదు. లక్ష్య సాధన కోసం పట్టువి డుపులు అవసరమనే స్పృహ కలిగినవాడు. వాజపేయి నుంచి సంయమనం నేర్చుకోవలసిన అవసరం గమనించాడు. చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగి పోయింది. సమయం మించిపోతున్నదని మోదీకి తెలుసు. రెండవ తరం ఆర్థిక సంస్కరణలను వాయిదా వేసినట్లయితే ఆశించిన స్థాయిలో సంపద సృష్టిం చడం, భారత్‌ను అమెరికా, చైనాల సరసన మూడవ ఆర్థిక శక్తిగా నిలపడం సాధ్యం కాదనీ తెలుసు. కానీ 245 స్థానాలున్న రాజ్యసభలో భాజపాకి 47 మాత్రమే ఉన్నాయనీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 68 ఉన్నాయనీ, ఈ అంకెల తూకం మారే వరకూ సంస్కరణల బిల్లులకు ఆమోదం లభించదనీ స్పష్టంగా తెలుసు. 2013 నాటి భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకురావడం విష యంలో మోదీకి రెండో ఆలోచన లేదు. రైతులకు అన్యాయం జరుగుతుందనే సంకోచం లేదు. కాంగ్రెస్‌కు ఒక ఆయుధం అందిస్తున్నామనే వెరపు లేదు. రాజ్యసభలో బలం ఎట్లా పెంచుకోవాలన్నదే మోదీ ఆరాటం. అందుకే ఇద్దరు బలమైన మహిళా నాయకులతో రాజీకి సిద్ధమైనాడు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో, మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్‌ను గంగలో కలిసేస్తానంటూ అమిత్ షా గర్జించినప్పటి ఆలోచన మారిపోయింది. వ్యూహాత్మకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఒకే వేదిక నుంచి మాట్లాడమే కాకుండా రెండుసార్లు మమతాతో మోదీ ప్రత్యేకంగా ముఖాముఖి సమాలోచనలు జరిపారు. పశ్చిమ బెంగాల్ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజి సాధించాలని మమతా దీదీ వ్యూహం. తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్న 12 రాజ్యసభ స్థానాలను వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించాలని మోదీ సంకల్పం. ప్రతిపక్షాలను ఓడించడానికి కేవలం దీదీ మద్దతు మాత్రమే చాలదు. దక్షిణాది అమ్మ సహకారం కూడా కావాలి. అందుకే ఏఐఏడిఎంకే అధినేత నిర్దోషి అంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మోదీ నుంచి జయలలితకు శుభాభినందనలు ఫోన్ ద్వారా అందాయి. భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామిలో మునుపటి జోరు కనిపించలేదు. తగ్గవలసిందిగా స్వామికి మోదీ ఆదేశం అందిందనే అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఆ భరోసాతోనే జయ శనివారంనాడు అయిదో విడత ముఖ్య మంత్రిగా ప్రమాణం చేశారు. మోదీ మిత్రుడు, అగ్రశ్రేణి తమిళ నటుడు రజనీ కాంత్‌తో పాటు ఇళయరాజా సైతం జయ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం వెనుక చాలా కథ ఉంది. ఏఐఏడిఎంకేకి రాజ్యసభలో 11 సీట్లున్నాయి. పశ్చిమబెంగాల్లో, తమిళనాడులో భాజపాను విస్తరించాలనే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టి రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలతో స్నేహం చేయడమే ప్రాప్తకాలజ్ఞత అని గ్రహించగల వివేకం మోదీకి ఉన్నది. అసాధ్యమైన లక్ష్యాలు సాధించాలన్న మొండిపట్టుకు స్వస్తి చెప్పి వాస్తవిక దృష్టితో, వాజపేయి స్ఫూర్తితో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించాలన్న స్పృహ మోదీ తాజా కార్యాచరణలో స్పష్టంగా కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ, శివ సేన, అకాలీదళ్ వంటి మిత్రపక్షాలతో పాటు జయ, మమత, వీలైతే మాయా వతిని సుముఖం చేసుకుంటే భూసేకరణ బిల్లును సులభంగా గట్టెక్కిం చవచ్చుననే చాణక్యం మోదీది. బహుశా మోదీ రెండో సంవత్సరాన్ని సంస్క రణల బాటలో ఉన్న అవ రోధాలను అధిగమించడంకోసం వినియోగిస్తారు కాబోలు. ఒక్కడి వల్ల, ఒకే పార్టీ వల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశాన్ని పాలించడం వీలు కాదనీ, భావసారూప్యం గల శక్తుల అవకాశవాద కలయిక ద్వారానే అది సాధ్యమనీ గ్రహించిన మోదీ తన పంథా మార్చుకుంటున్న దృశ్యం రెండో సంవత్సరం ప్రారంభంలో కనిపిస్తున్నది. -
నిక్సన్ మ్యాజిక్ మోదీకి సాధ్యమా?
త్రికాలమ్ భారత్ కోసం పాకిస్తాన్‌ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్‌తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. నరేంద్రమోదీ కంటే ముందు చైనా సందర్శించిన భారత ప్రధాన మంత్రులు న్నారు. కానీ వారందరికంటే మోదీ భిన్నం. మోదీ చైనా యాత్ర జయప్రదం అవుతుందా; శుభప్రదం అవుతుందా లేక ఇదివరకటి ప్రధానుల పర్యటనల లాగే యథాతథ స్థితి కొనసాగడానికే పరిమితం అవుతుందా? అమెరికా అధ్య క్షుడుగా ఉన్న కాలంలో రిచర్డ్ నిక్సన్ అమెరికా-చైనా సంబంధాలలో నవశకం ప్రారంభించినట్టు మోదీ భారత్-చైనా సంబంధాలలో అడ్డుగోడలను ఛేదించి శాశ్వత మైత్రికి బాటలు వేయగలరా? ప్రధాని నరేంద్రమోదీ రాజీవ్‌గాంధీ లాగా యువకుడు కాదు. పీవీ నరసింహారావులాగా వయోవృద్ధుడూ కాదు. రాజీవ్ ఆశాభావం, పీవీ విషయ పరిజ్ఞానం మోదీలో ఉన్నాయి. 64 సంవత్సరాల వయస్సులో 53 అంగుళాల ఛాతీని చాటుకుంటూ ఎన్నికల గోదాలో కలబడి ఘనవిజయం సాధించిన రాజ కీయ మల్లుడుగా గాంధీనగర్ నుంచి ఢిల్లీకి ప్రస్థానం చేసినవాడు మోదీ. చైనా అధ్యక్షుడు సి జిన్‌పింగ్ కూడా శరీర దారుఢ్యంపైన శ్రద్ధ చూపిస్తారు. సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించరు. ఇద్దరూ ప్రయోగశీలురు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పుట్టినవారు. దేశ రాజకీయా లలోనూ, విదేశీ వ్యవహారాలలోనూ అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తూ ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి కలిగినవారు. నిరుడు సెప్టెంబర్‌లో చైనా అధ్య క్షుడు ఇండియా వచ్చినప్పుడు మొదట గుజరాత్ (మోదీ స్వరాష్ట్రం) సందర్శిం చిన అనంతరం ఢిల్లీ చేరుకున్నారు. మోదీ సైతం సి జిన్‌పింగ్ తండ్రి, మావో జెడాంగ్ సహచరుడు పుట్టిన షాన్సీ పట్టణం దర్శించిన తర్వాతనే బీజింగ్ చేరుకున్నారు. చైనా అంటే ఇష్టం మోదీ హృదయంలో చైనాకు ప్రత్యేక స్థానం ఉంది. హిందీ-చీనీ భాయ్భాయ్ అంటూ, పంచశీల సూత్రం అంటూ చైనా ప్రధాని చౌఎన్లైని మనస్పూర్తిగా విశ్వసించి, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించి నెహ్రూ భంగపడ్డాడు. 1961-62 సరిహద్దు యుద్ధంలో ఘోరపరాజయం నుంచి పూర్తిగా కోలుకో కుండానే 1964 మే 27న గుండెపోటుతో మరణించాడు. అప్పుడు రెండు దేశాల మధ్య ఘనీభవించిన మంచు కరగడానికి కొంత వ్యవధి అవసరమైంది. జనతా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి చైనా పర్యటన ఇందుకు కొంత దోహదం చేసింది. రాజీవ్‌గాంధీ చైనా పర్యటన చారిత్రక మైనది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు కృషి చేయాలని రెండు దేశాల ప్రధానులూ నిర్ణయించారు. అనంతరం పీవీ నరసింహారావు సందర్శన వాస్తవికతకు దగ్గరగా రెండు దేశాలనూ నడిపిం చింది. ఇప్పటికీ చైనాను మిత్రదేశంగా భారత్ భావించజాలదు. భారత్‌ను శత్రు దేశంగా భావిస్తున్న పాకిస్తాన్‌తో చైనాకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. మోదీ పర్యటిస్తున్న సమయంలో సైతం చైనా విడుదల చేసిన భారత దేశ పటంలో అరుణాచల్ ప్రదేశ్ లేదు. కశ్మీర్ కూడా లేదు. పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్లో నివసిస్తున్నవారికి చైనా గౌరవప్రదమైన వీసాలు ఇస్తుంది. భారత దేశంలో ఉన్న కశ్మీర్వాసులకు మాత్రం షరతులతో కూడిన (స్టీపుల్డ్) వీసాలు ఇస్తుంది. నాలుగు వేల కిలోమీటర్ల వివాదాస్పదమైన సరిహద్దుపైన చర్చలు నామ మాత్రంగానే సాగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న సంక ల్పం లేదు. ఇంతవరకూ పొరుగు దేశాలలో 17 సరిహద్దు వివాదాలను చైనా పరిష్కరించుకున్నది. వాటిలో 15 వివాదాల పరిష్కారానికి తానే చొరవ తీసు కొని కొంత భూభాగాన్ని వదులుకున్నది. భారత్‌తో రాజీకి మాత్రం ససేమిరా అంటున్నది. 1962లో భారత్‌ను చిత్తుగా ఓడించిన చైనాను 1979లో బుల్లి వియత్నాం నిలువరించి నియంత్రించలిగింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మెడలు వంచిన ధీరచరిత్ర వియత్నాంది. భారత్ చైనాతో సమఉజ్జీ అని చాటుకోజాలదు. చైనా కంటే బలహీనమైన దేశం అని ఒప్పుకోజాలదు. తగ్గి ఉండలేదు. హెచ్చులు ప్రదర్శించలేదు. సరిహద్దు సమస్యను సైనికంగా పరిష్కరించుకోజాలదు. దక్షిణ టిబెట్ అని చైనా పిలుచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌పై కన్నువేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించనూలేదు. మరో యుద్ధానికి కాలు దువ్వలేదు. చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉండగానే చైనా సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగితే సన్నాయి నొక్కులు నొక్కడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. (నాటి కవ్వింపు చర్య చైనా అధ్యక్షుడికి కూడా ఇబ్బందికరంగా పరిణమించిందనీ, ఆయన స్వదేశం తిరిగి వెళ్ళిన తర్వాత సరిహద్దులో సైనిక చర్యను ప్రేరేపించిన కమాండర్పైన వేటు వేశారనీ దౌత్యవర్గాల కథనం). చైనా ఆధిక్య ప్రదర్శనలనూ, అమిత్ర వైఖరినీ మౌనంగా భరిస్తూ, సహిస్తూ, దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పావులు కదపడం ఒక్కటే మార్గం. సరిహద్దు వివాదంపైన రచ్చ చేయకుండా చైనాకు అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంపైన యాగీ చేయవచ్చు. జనవరి చివరివారంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీ సంయుక్తంగా ఢిల్లీ మీడియా గోష్టిలో చేసిన ప్రకటనలో సౌత్ చైనా సీ ప్రస్తావన ప్రస్ఫుటంగా ఉంది. ఆ సముద్ర ప్రాం తంలో నౌకాయానంపై ఎవరి ఆంక్షలనూ అంగీకరించేది లేదంటూ అమెరికా, భారత్ స్పష్టం చేసిన సందర్భం అది. అదే సమయంలో చైనా సరిహద్దు పొడవునా భారత సైనికుల సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్టు భారత ప్రభు త్వం ప్రకటించింది. ఒక వేళ చైనా మరో దురాక్రమణ తలపెడితే తిప్పికొ ట్టడానికి అవసరమైన సన్నాహాలు చేస్తూనే మరో వైపు అమెరికా, జపాన్ వంటి చైనా ప్రత్యర్థులతో జత కడుతూనే ఇంకోవైపు చైనాతో సత్సంబంధాలకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపడం మోదీ ప్రభుత్వం చేస్తున్న పని. స్నేహా నికైనా, సమరానికైనా సిద్ధమేనంటూ విన్యాసాలు చేయడమే ప్రస్తుత దౌత్యనీతి. అమెరికా, జపాన్‌లతో అంటకాగకుండా ఉండటం భారత్‌కే క్షేమదాయక మంటూ చైనా అధికార ఆంగ్ల పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ హితవచనం చెప్పడం ఈ నేపథ్యంలోనే. చైనా అభివృద్ధి అధ్యయనం ఇతర భారత ప్రధానులకంటే అధికంగా మోదీకి చైనా పట్ల ఆసక్తి ఉంది. గుజ రాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చైనాలో పలుమార్లు పర్యటించారు. చైనాలో హిందూ దేవాలయాలను సందర్శించడంతో పాటు అక్కడ జరుగు తున్న అభివృద్ధినీ, అందుకు అనుసరిస్తున్న వ్యూహాలనూ అధ్యయనం చేశారు. గుజరాత్లో గోధ్రా అనంతర మారణకాండ కారణంగా అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలు వీసా ఇవ్వకుండా మోదీని అవమానించిన సమ యంలో చైనా హార్దిక స్వాగతం పలికి విశేషంగా గౌరవించింది. మోదీకి చారిత్రక స్పృహ ఉంది. చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ గుజరాత్లో మోడీ జన్మస్థలంలో కొంత కాలం నివసించాడు. అక్కడి నుంచి సి జిన్‌పింగ్ పుట్టిన ఊరు వెళ్ళాడు. వేల సంవత్సరాల నాగరికత వారసత్వం రెండు దేశాలను కలుపుతున్నదని మోదీకి తెలుసు. జనచైనా పట్ల సగటు భారతీయులలో సదభిప్రాయం ఉన్న దనీ, రెండు దేశాల ప్రజలూ స్నేహసంబంధాలు కోరుకుంటున్నారనీ తెలుసు. ఆసియా దిగ్గజాలు రెండూ భుజం భుజం కలిపితే ప్రపంచ శాంతికి పూచీ పడవచ్చుననే అవగాహన ఉంది. ఆతిథ్యం ఇచ్చిన దేశాధినేతలు ఏమనుకుం టారోనన్న వెరపు లేకుండా మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భారత సంతతి యువతీయువకుల సమావేశాలను ఏర్పాటు చేసి ఆవేశపూరితంగా, ఆలోచనాత్మకంగా, అద్భుతంగా ప్రసంగాలు చేయడం అంతర్జాతీయ సంబం ధాలలో ఒక కొత్త ఒరవడి. న్యూయార్క్‌లో, ఇతర నగరాలలో చేసిన విధంగానే షాంఘై మహానగరంలో కూడా యువతీయువకులను ఉద్దేశించి మోదీ ఉత్తేజ కరమైన ప్రసంగం చేశారు. ‘మోదీ... మోదీ’ అంటూ యువత హంగామా చేశారు. ఈ వేషాలు చూసే ఒబామా ఢిల్లీ వచ్చినప్పుడు మోదీకి బాలీవుడ్ స్టార్ గ్లామర్ ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. దాన్ని చురకగా కాకుండా అభినందనగా మోదీ స్వీకరించినట్టున్నారు. ఆయన ఏ విధంగా పరిగణించి నప్పటికీ ఈ అభిభాషణల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటోంది. మోదీ షాంఘై వచోవిన్యాసం వల్ల భారత్-చైనా సంబంధాలకు మేలు జరుగుతుందే కాని కీడు మాత్రం జరగదు. ఈ సభలో కూడా ఆత్మస్తుతి కొనసాగించినా పరనిందకు పాల్పడలేదు. యూపీయే ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కుంభ కోణాల ప్రస్తావన లేదు. ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత సంవత్సరంలోగా చైనాలో పర్యటిస్తానని ప్రకటించిన మోదీ అన్నట్టుగానే ప్రధాని పద విలో ఏడాది పూర్తయిన సందర్భాన్ని షాంఘైలో భారత సంతతి యువజనుల హర్షధ్వానాల మధ్య ఆనందంగా గడిపారు. మూడు రోజుల చైనా పర్యటనలో రెండు విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల సభలలో మాట్లాడారు. ఇటువంటి విస్తృతి, అవకాశం, వాక్చాతుర్యం లోగడ చైనా సందర్శించిన ప్రధానులకు లేదు. అందుకే మోదీ విభిన్నమైన రాజకీయనేత అనీ, చైనా-అమెరికా సంబంధాలలో సమూలమైన మార్పులు సాధించిన నిక్సన్ మాదిరే రెండు ఆసియా దేశాల మధ్య సంబంధాలను పునర్ నిర్వచించే శక్తియుక్తులు మోదీకి ఉన్నాయంటూ ‘గ్లోబల్ టైమ్స్’ శుక్రవారం సంచిక సంపాదకీయ వ్యాసం వ్యాఖ్యానించింది. నిక్సన్‌ను విశ్వనాథ సత్యనారాయణ ‘నిక్షణుడు’ అంటూ అభివర్ణించాడు. బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా ఇందిరాగాంధీని అవమానించినందుకూ, అమెరికా సప్తమ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినందుకూ నిరసనగా కవిసమ్రాట్టు ఆగ్రహం ప్రదర్శించారు. వాటర్‌గేట్ కుంభకోణం కారణంగా నిక్సన్ నిజంగానే అభిశంసనకు గురికావలసి వచ్చింది. కానీ చైనా-అమెరికా సంబంధాలను పెంపొందించడంలో నిక్సన్ది క్రియాశీలకమైన పాత్ర. ఆయనకు అండగా అప్పటి విదేశాంగమంత్రి కిసింజర్ ఉన్నాడు. సోవియెట్ యూనియన్‌కూ, చైనాకూ మధ్య రగులుతున్న వైరాన్ని అమెరికా వినియో గించుకొని చైనాను చేరదీసింది. చైనాలో 1978లో డెంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల చైనాతో పాటు అమెరికా కూడా ప్రయోజనం పొందింది. అటువంటి వాతావరణం ఇప్పుడు చైనా, భారత్ మధ్య లేదు. భారత్ కోసం పాకిస్తాన్‌ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవా దానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్‌తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. చైనా నుంచి భారత ఇన్ఫ్రా (రోడ్లు, విద్యుచ్ఛక్తి వగైరా)రంగంలో పెట్టుబడులు ఒక మోస్తరుగా రావచ్చు. వాణిజ్యం అసమానతలను తొలగించేందుకు భారత్ నుంచి దిగుమతులు పెంచడానికి చైనా సమ్మతించవచ్చు. అంతకంటే ఎక్కువ ఫలితాలు ఆశించనక్కరలేదు. ఈ మాత్రం సత్ఫలితాలైనా సాధ్యం కావడానికి మోదీకి చైనాతో ఉన్న విశేష సంబం ధాలూ, ఆయన ప్రాపంచిక దృష్టి కారణం. కె.రామచంద్రమూర్తి -
ఉన్నత విద్య విలవిల
త్రికాలమ్ ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుం దోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు. ఒక రాష్ట్రాన్ని ఎట్లా విభజించకూడదో యూపీఏ ప్రభుత్వం ‘ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్’ ద్వారా చేసి చూపిస్తే, రాష్ట్రం చీలిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలూ ఎట్లా వ్యవహరించకూడదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ, కేంద్రం ఎట్లా నిర్లిప్తంగా ఉండకూడదో ఎన్డీఏ సర్కారూ నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నినాదాలైన నీరూ, నిధులూ, నియామకాలు వివాదాలుగా వర్థిల్లడమే కాకుండా అనేక ఇతర అంశాలలో సైతం అగ్గి రగులుతూనే ఉంది. రెండు రాష్ట్రాల పాలకులు పరస్పరం సహకరించుకోకుండా, గౌరవించు కోకుండా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించకుండా గట్టు పంచాయితీలు పెట్టుకొని కోర్టులకు ఎక్కి, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రజల జీవితాలను కష్టభూయిష్టం చేస్తున్నారు. గోటితో పోయే వాటిని రోకలికి కూడా లొంగకుండా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నలిగి విపరీతంగా నష్టపోతున్నవారిలో ఏ పాపం ఎరుగని విద్యార్థులది ప్రథమస్థానం. ఉమ్మడి వ్యవస్థలుగా ఉంటూ రెండు రాష్ట్రాలకూ సేవ చేయవలసిన సంస్థలలో అన్నిటికంటే అధికంగా భ్రష్టపట్టింది ఉన్నత విద్యామండలి. పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని 27వ అంశం ఉన్నత విద్యా మండలికి సంబంధించింది. అంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల మంత్రులనూ, అధికారులనూ సంప్రదిస్తూ ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలు పెంపొందించడానికి ప్రయత్నించాలి. విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అనే పేరున్నది కనుక విభజన తర్వాత కూడా పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అది జవాబుదారీగా ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే సరిపోతుందనీ, తెలంగాణ ప్రభు త్వం, ప్రజలు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విధిగా నడుచుకోవాలనే తప్పుడు అవగాహనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వ్యవహరించారు. పేచీ మొదలయింది ఇలా... జగదీశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి హోదాలో కబురు పెడితే ఆయనను కలుసుకోవడానికి వేణుగోపాలరెడ్డి నిరాకరించినప్పుడే విభజన చట్టాన్ని అపార్థం చేసుకున్నారనీ, పెడార్థం తీస్తున్నారనీ అర్థమైపోయింది. ఇవి వేణుగోపాలరెడ్డి ఆలోచనలో లేక ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి గంటా శ్రీనివాస రావు పట్టింపో లేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిశ్చయమో తెలియదు కానీ తెలంగాణ మంత్రితో, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాలు విభజన చట్టం ఆం.ప్ర. ఉన్నత విద్యామండలికి ఇచ్చిందని చట్టాన్ని తప్పుగా అన్వయిం చుకున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఒక ఉన్నత విద్యామండలిని ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసింది. కనీసం ఆ మండలితో సమన్వయం చేసుకున్నా విద్యార్థులకు నష్టం జరిగేది కాదు. తెలంగాణ విద్యామండలిని గుర్తించడానికి ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి నిరాకరించింది. ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు. ఉన్నతాధికారుల పంపిణీ పూర్తి కాని కారణంగా, రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల దృష్ట్యా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుపుకోవడానికి వీలుగా గడువును అక్టోబరు 31 వరకూ పొడిగించాలంటూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేసి సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది. ఇందుకు మినహాయింపు కావాలంటూ 2013లో ఆంధ్రప్రభుత్వం చేసిన అభ్యర్థనకు అత్యున్నత న్యాయ స్థానం అంగీకరించింది. అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం, ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేస్తానంటూ చెప్పడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. ఇంటర్ బోర్డు ఆదర్శం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా రామశంకర్‌నాయక్ ఉన్న కాలంలో ఆయన రెండు ప్రాంతాల విధులనూ, నిధులనూ రాష్ట్ర విభజనకు పూర్వమే పంచారు. ఆయన దూరదృష్టి కారణంగా విభజన అనంతరం కూడా ఎటువంటి ఇబ్బందులూ, సమస్యలూ, పేచీలూ లేకుండా ఇంటర్ విద్య కొనసాగుతున్నది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఇంటర్ బోర్డును నెలకొల్పి శైలజారామయ్యర్‌ను కార్యదర్శిగా నియమించినప్పటికీ ఉన్నత విద్య చవిచూసిన ఒడిదుడుకులు ఇంటర్ విద్యకు ఎదురుకాలేదు. రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు రామశంకర్‌నాయక్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించాయి. నిధుల విషయంతోనే వివాదం ముదిరింది. ఉమ్మడి మండలి ఖాతాలో ఉన్న రూ. 120 కోట్లలో 42 శాతం వాటా ఇవ్వాలంటూ లేఖలు రాసింది. జవాబు లేదు. రోజువారీ కార్యక్రమాలు జరుపుకోవడానికి తాత్కాలికంగానైనా రెండు కోట్ల రూపాయలు కావాలంటూ అభ్యర్థించినా కుదరదంటూ సమాధానం వచ్చింది. చివరికి ఆంధ్రప్రదేశ విద్యామండలి ఖాతాను స్తంభింప జేయాలంటూ ఆంధ్రాబ్యాంకును తెలంగాణ ప్రభుత్వం కోరింది. బ్యాంకు యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. సమాధానం లేదు. ఆం.ప్ర. ఉన్నత విద్యాశాఖ మాత్రం ఇది ఉమ్మడి మండలి అనీ, దీన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందనీ, తెలంగాణ మండలిని గుర్తించజాలమనీ సమాధానం చెప్పింది. అందువల్ల ఖాతాను స్తంభింపజేయడం సాధ్యం కాదంటూ ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పింది. బ్యాంకులు కూడా ప్రాంతీయ ధోరణితోనే వ్యవహరించినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ఇదే రకమైన అభ్యర్థన తెలంగాణ ప్రభుత్వం నుంచి అందితే అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ మండలికి కానీ నోటీసులు ఇవ్వకుండానే మండలి ఖాతాను ఎస్బీహెచ్ స్తంభింపజేసింది. సిబ్బంది జీతాలు ఈ ఖాతా నుంచే చెల్లించాలి కనుక మండలి అధికారులు లబోదిబో అన్నారు. మరోసారి హైకోర్టుకు వెళ్లారు. తెలంగాణ సర్కార్ చొరవ తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, అడ్వకేట్ జనరల్ సమష్టిగా వ్యవహరించి లక్ష్యం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. విద్యామంత్రికీ పట్టలేదు. మండలి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, విద్యామంత్రి చుట్టూ తిరిగి అలసిపోయారు. అడ్వకేట్ జనరల్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 75వ సెక్షన్ గురించీ, పదో షెడ్యూల్ గురించీ, 27వ అంశం గురించీ మాట్లాడటానికి బదులు విభజన చట్టంపై విభేదాలు వస్తే కోర్టు పరిష్కరించాలంటూ బండవాదనకు పరిమితమైనారు. ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి పిటిషన్ పరిశీలనలో ఉన్నప్పుడే న్యాయమూర్తి ఎస్వి భట్టి సానుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర విభజన చట్టం కింద విచారణకు వచ్చే అంశాలన్నిటినీ సింగిల్ జడ్డి కాకుండా డివిజన్ బెంచి పరిశీలిస్తే సమంజసంగా ఉంటుందంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అంతటితో ఆగకుండా పదో షెడ్యూల్ కింద పేర్కొన్న ఉమ్మడి సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి కనుక వాటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండకూడదనీ, ఇందుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ను వేరే న్యాయమూర్తి విలాస్ అఫ్జల్పూర్కర్తో దాఖలు చేసింది. అన్ని అభ్యర్థనలనూ పరిశీలించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా తన పదవీ విరమణకు ముందు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందంటూ తీర్పు ఇచ్చారు. వెంటనే తెలంగాణ విద్యామండలి అధికారులు మసాబ్ ట్యాంకు దగ్గరున్న ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా 1958లో ఉన్నతాశయాలతో ఏర్పడిన ఉన్నత విద్యా మండలి వివాదాలపాలై నవ్వులపాలయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి ఎక్కడికి పోవాలన్నది ఒక్కటే ప్రశ్న కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014, లోని పదో షెడ్యూల్లో పేర్కొన్న 108 ఉమ్మడి సంస్థలలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సేన్‌గుప్తా తీర్పు ప్రకారం ఆ సంస్థలన్నిటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే కావాలి. కానీ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్ నగరంలో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉన్నట్టు చెప్పడం వివాదాస్పదం అవుతుంది. సేన్‌గుప్తా తీర్పు పదో షెడ్యూల్ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. ఇందుకు కారణం ఏపీ అడ్వకేట్ జనలర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలోపం కావచ్చు. ప్రభుత్వ వైఖరి కావచ్చు. రెండు రాష్ట్రాలూ సమన్వయంతో నడుచుకోవాలనీ, పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల నిర్వాహకులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమాలోచన చేసి రెండు రాష్ట్రాల ప్రజలకూ సేవలందించాలనీ చెప్పవలసింది పోయి, సంస్థ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందంటూ తీర్పు చెప్పడం తర్కానికి అందడం లేదు. ఇది విపరీతమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలలో ఏవి ఏ రాష్ట్ర పరిధిలో పని చేయాలో చట్టంలోనే స్పష్టం చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినా ఈ పాటికి స్పష్టత వచ్చేది. సంవత్సరంలోగా రెండు రాష్ట్రాలూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనీ లేదా కేంద్రం పరిష్కరించాలనీ చట్టంలోని 76వ షెడ్యూలు స్పష్టం చేసింది. కేంద్రం పట్టించుకోకపోయినా సరే, రెండు రాష్ట్రాల విద్యామంత్రులూ, ఉన్నత విద్యా మండళ్ల సంచాలకులూ ఒక చోట కూర్చొని ఉన్నత విద్యను ఎట్లా ఉద్ధరించాలో ఆలోచించాలి.