అణగారిన వర్గాల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి | CPIM Telangana Holds Editors Meet Over Mahajana Padayatra | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి

Published Mon, Oct 10 2016 2:11 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

అణగారిన వర్గాల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి - Sakshi

అణగారిన వర్గాల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రాభివృద్ధి జరిగినట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

• ‘ఎడిటర్స్ మీట్’లో  సీపీఎం నేత తమ్మినేని
• ప్రత్యామ్నాయ అభివృద్ధి  ‘నమూనా ముసాయిదా’ విడుదల


సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రాభివృద్ధి జరిగినట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన, అనుసరిస్తున్న విధానాలను చూస్తే దీనికి అనుగుణంగా లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అణగారిన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరగాలన్న దానిని వివరిస్తూ ఈ నెల 17 న పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంనుంచి  ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’పై మహాజన పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ‘ఎడిటర్స్ మీట్’ సమావేశంలో పాదయాత్రలో భాగంగా తాము ప్రచారం చేయదలచుకున్న 38 అంశాలతో కూడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ముసాయిదాను తమ్మినేని విడుదల చేశారు.

ఈ విధానాల అమలుకు నిరంతర కృషి జరిగేలా ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి పెంచేందుకు, రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎజెండా నుంచి దృష్టి మళ్లించకుండా చేసేందుకు ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. పాదయాత్రలో ఈ నమూనాపై వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి వచ్చే సలహాలు, సూచనలను క్రోడీకరించి తుది డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు. ఈ పాదయాత్ర టీఆర్‌ఎస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదని తమ్మినేని స్పష్టంచేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాల్లో లోపం ఏమిటి, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఏమిటన్నది వివరిస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో నిజమైన మార్పులు తీసుకొచ్చి వివిధ వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉందన్నారు.  

ముఖ్యమైన అంశాలను ఎంచుకోవడం  మేలు: కె.రామచంద్రమూర్తి
ఒకేసారి అనేక అంశాలు తీసుకోవడం కంటే కొన్ని ముఖ్యమైన అంశాలను ఎంచుకుని వాటిపై పోరాటం చేస్తే బావుంటుందని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సూచించారు. ప్రభుత్వం పొరపాట్లు చేస్తున్నదంటే వాటిని ఎట్లా అధిగమించాలి.., ప్రత్యామ్నాయ మార్గమేమిటి అనేది చెప్పగలగాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న టీజేఏసీ.. ఇతర శక్తులు, వర్గాలను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. సమావేశంలో పాత్రికేయులుకె.శ్రీనివాసరెడ్డి (మనతెలంగాణ ), ఎస్.వీరయ్య (నవతెలంగాణ), శ్రీధర్‌బాబు (టీవీ 10), హాష్మి (సియాసత్), సాయి (జెమిని), కప్పరప్రసాద్ (హెచ్‌ఎంటీవీ) తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు బి.వెంకట్, ఇతర నేతలు చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు, టి.సాగర్ పాల్గొన్నారు.
 
పాదయాత్రపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం:  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: తాము చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్రను ఎద్దేవా చేస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవని పేర్కొంది. సీపీఎం చేస్తున్నది ప్రభుత్వ, టీఆర్‌ఎస్ వ్యతిరేక యాత్ర కాదని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement