మీడియాతో మాట్లాడుతున్న తమ్మినేని. చిత్రంలో భట్టి విక్రమార్క, వీరయ్య, జూలకంటి
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి
సీపీఎంకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదన
కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న తమ్మినేని
కానీ భువనగిరి స్థానంలో తమకు మద్దతివ్వాలని వినతి
అది కూడా కాంగ్రెస్‌కే ఇవ్వండి.. పదవులిస్తామన్న భట్టి
నేడు తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పారీ్టకి మద్దతిస్తే సీపీఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ఈ మేరకు భట్టి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు.
సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించిన మీదట ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పారీ్టలు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని చెప్పారు. ఇరు పారీ్టల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరు వురి అభిప్రాయాలపై సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి శనివారం ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని అన్నారు.
భువనగిరి స్థానంలో మద్దతు ఇమ్మన్న సీపీఎం
భువనగిరి స్థానానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
భట్టి రావడం హ్యాపీ.. కానీ రేవంత్ అలా మాట్లాడకూడదు: తమ్మినేని
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలంటూ కోరడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు, మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి చర్చించినపుడు తుది నిర్ణయానికి వస్తామన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తమ్మినేని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment