అయితే వెయిటింగ్‌! | CPM took a step back on Wednesday | Sakshi
Sakshi News home page

అయితే వెయిటింగ్‌!

Published Thu, Nov 2 2023 2:54 AM | Last Updated on Thu, Nov 2 2023 2:54 AM

CPM took a step back on Wednesday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీతో మంగళవారం కటీఫ్‌ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్‌ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. 

సోనియా అనారోగ్యంతో చర్చలు జరగలేదట 
తమ్మినేని వీరభద్రం గత ఆదివారం కాంగ్రెస్‌కు రెండ్రోజుల గడువు విధించారు. గడువు ముగిసినా కాంగ్రెస్‌ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది మీడియాలో ప్రచారం కావడంతో భట్టి విక్రమార్క తమ్మినేని వీరభద్రానికి ఫోన్‌ చేసి వేచి చూడమన్నారు. తమ పార్టీ అధిష్టానం పొత్తు విషయంపై చర్చిస్తుందని చెప్పారు. దీంతో తాము మరోసారి గడువు విధించినట్లు సీపీఎం తెలిపింది.

బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ అనారోగ్యం రీత్యా వారితో సమావేశం జరగలేదని భట్టి చెప్పారని గురువారం ఉదయానికి కబురు చెప్తామని అన్నారని వెల్లడించారు. అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు భట్టి తెలిపారన్నారు. 

సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయి 
సీపీఐతో తాము గురువారం ఉదయం మాట్లాడతామని తమ్మినేని తెలిపారు. వైరా, మిర్యాలగూడ కేటాయించకపోతే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అంచనాలు, సీపీఐ నిర్ణయాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. అఖిల భారత స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాల మేరకే పొత్తులుంటాయే కానీ, ఎవరి పంచనో చేరడానికి కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయని, ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్‌ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరిపోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు. అయితే సీపీఐ అభ్యర్థులున్న స్థానాల్లో మాత్రం తాము పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. 

కాంగ్రెస్‌ ప్రకటించే వరకు సీపీఐ ఎదురుచూపు... 
మరోవైపు సీపీఐ కూడా బుధవారం రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తమతో భట్టి విక్రమార్క ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. పొత్తుల విషయంపై సానుకూల నిర్ణ యం ఉంటుందని చెప్పారని వివరించారు.

కాంగ్రెస్‌ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూసిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పొత్తు ధర్మం పాటించకపోయినా తాము పాటిస్తామన్నారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్‌తో అవగాహనలో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని పేర్కొందనీ, అందులో మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామన్నారు. 

పొత్తు కుదిరినా ఆ స్థానాలు ఇస్తారా? 
కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్‌ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది.  

నేతల తీరుపై రెండు పార్టీల్లో గరంగరం... 
ఇదిలావుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం  శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం.
 
సీపీఎం పోటీ చేయాలనుకుంటున్న స్థానాలివే 
కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సీపీఎం సింగిల్‌గానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏయే స్థానాల్లో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో బలం ఉందనే వివరాలను బుధవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సేకరించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటతోపాటు ఇల్లందులో బరిలోకి దిగాలని భావిస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేటతో పాటు మరో స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంతోపాటు మరోస్థానం, హైదరాబాద్‌లో ముషీరాబాద్, కార్వాన్‌ స్థానాలతోపాటు సంగారెడ్డి, పటాన్‌ చెరు బరిలో ఉండాలని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కొల్లాపూర్‌ సహా మరో రెండు స్థానాల్లో పోటీకి దిగాలని నిర్ణయించినట్టు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement