
రగులుతున్న రైతు
అద్భుతమైన కట్టడాలు నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని తల పోస్తున్న కలల బేహారుల పాలనలో తెలుగు రైతు విలవిలలాడిపోతున్నాడు.
త్రికాలమ్
అద్భుతమైన కట్టడాలు నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని తల పోస్తున్న కలల బేహారుల పాలనలో తెలుగు రైతు విలవిలలాడిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంవత్సరాలుగా వరుస కరువు. తెలంగాణలో ఈ యేడాది ఆగస్టులో అనావృష్టి, సెప్టెంబర్‌లో అతివృష్టి. రెండూ నష్టదాయకమే. ప్రభుత్వాల నుంచి సహకారం సకాలంలో అందడంలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంట బీమా వర్తించదు. రైతుపైన ముప్పేట దాడి.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 2014 సంవత్సరం నుంచి ఇంతవరకు ఆత్మహత్యలు చేసుకున్న 48 మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వమే గుర్తించి నష్టపరిహారం ఇచ్చింది. కానీ బలవన్మరణాలకు పాల్పడిన రైతుల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువేనని వార్తాకథనాల వల్ల తెలుస్తోంది. అన్ని రంగాలలో రెండంకెల వృద్ధి రేటు చూపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసా యరంగంలో వృద్ధిరేటు మైనస్‌లో ఉండటంపైన మాట్లాడటం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. అనంతపురంలో రూ. 263 కోట్ల ఖర్చుతో ‘రెయిన్‌గన్’లు ప్రయోగించి కరువు పారదోలినట్టు సగర్వంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మొన్న అనంతపురంలోని మొత్తం 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించారు.
ప్రభుత్వాల ప్రాధాన్యక్రమం వేరు
వ్యవసాయరంగంలో సంక్షోభం నెలకొని చాలా సంవత్సరాలయింది. జనా భాలో సగానికి జీవనాధారమైన ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. అన్నదాతను కాపాడుకోలేని ప్రభుత్వాలకు సార్థకత ఏముంటుంది? కానీ రెండు ప్రభుత్వాల ప్రాధాన్యక్రమంలోనూ వ్యవసాయం కనిపించదు. ప్రజాధనం ఖర్చు చేస్తున్న పద్ధతిలో కానీ, ముఖ్య మంత్రులు చేస్తున్న ప్రకటనలలో కానీ రైతులోకాన్ని పట్టిపల్లార్చుతున్న సమస్యల పరిష్కారాల ప్రస్తావన ఉండదు. నిర్మాణంలో ఒకరు, పునర్ని ర్మాణంలో మరొకరు! రైతులు సంఘటితంగా లేని కారణంగా వారి ఆగ్రహం పాలకులకు వెంటనే అగుపించకపోవచ్చు. వారు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రాలేకపోవచ్చు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులకూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విత్తన సంస్థలకూ, దయలేని దళారులకూ బక్క రైతును అప్పగించి చోద్యం చూస్తున్న పాలకులను ఏమనాలి?
ఇద్దరు ముఖ్యమంత్రులకూ క్షేత్ర జ్ఞానం ఉంది. అపారమైన అనుభవం ఉంది. ప్రజల సమస్యలు తెలుసు. గట్టిగా తలచుకుంటే సమస్యకు పరిష్కారం సాధించే నేర్పు ఉంది. సంకల్పమే లేదు. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్నం. సాగునీటి ప్రాజెక్టులు రైతుల కోసమే కదా! వేల ఎక రాల భూములకు నీరు అందించేందుకే పట్టిసీమ అయినా, పురుషోత్తపట్నం అయినా అంటారు చంద్రబాబునాయుడు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో ఉద్దేశం సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించడమే కదా! అంటారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్). ఎత్తిపోతల కోసం విద్యుదు త్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా రైతుకోసమే కదా! రైతు సంక్షేమా నికి శాశ్వత ప్రాతిపదికపైన బాటలు వేస్తున్నామని చెబుతారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగి, సాగునీరు పంటపొలాలలో పారడానికి ఎన్నేళ్ళు పడుతుందో వారికి తెలుసు. అంతవరకూ రైతుల ప్రాణాలు నిలబడాలంటే కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారాలు అమలు జరగాలి.
1. వ్యవసాయ విస్తరణాధికారులు తగినంత మంది లేరని కొన్ని సంవత్స రాలుగా అనుకుంటున్నదే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా విస్తరణాధికారులను సాధించలేకపోయారు రైతన్నలు. ఇప్పటికీ రైతులు మందులూ, ఎరువులూ విక్రయించే వ్యాపారుల తప్పుడు సలహాలు పాటించి ఏ పంట వేయాలో నిర్ణయించుకుంటున్నారు. ప్రతిగ్రామంలో ఒక నాలెడ్జి సెంట ర్‌ను నెలకొల్పి రైతులకు అవసరమైన సమాచారం అందించాలని స్వామినాథన్ కమిటీ చాలా ఏళ్ళ కిందటే సిఫార్సు చేసింది. ట్రిపుల్ ఐటీలో ఈ-సాగు ద్వారా ప్రవీణుల చేత రైతులకు సలహా చెప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రైతులకు సకాలంలో సరైన సలహా అందించగలిగితే అదే గొప్ప సాయం.
పరిశోధన పూజ్యం
2. వ్యవసాయ పరిశోధన ప్రభుత్వ రంగంలో 1980కి పూర్వం జరిగేది. ఇప్పుడు పరిశోధన జరుగుతున్నా ఫలితాలు ప్రభుత్వ రంగంలో వెలుగు చూడ టంలేదు. ప్రైవేటు విత్తన సంస్థలు లబ్ధి పొందుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేటు రంగానిది తిరుగులేని ఆధిక్యం. ‘బయో’ పేరుతో హార్మోన్లు ఉపయోగించి తయారు చేసిన వంగడాలను ముందుగా పరీక్షలు లేకుండానే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ధరపైన ఎటువంటి నియంత్రణా లేదు.
3. పెద్ద కమతాలున్న ఆసాములు భూములను కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. పల్లెల్లో ఎక్కువగా వెనుకబడిన తరగతులకు చెందిన వారూ, దళితులూ చిన్న చిన్న కమతాల యజమానులుగా, కౌలుదార్లుగా ఉన్నారు. ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం గిట్టుబాటు కాదు. సహకార వ్యవసాయం ఆలోచనగానే మిగిలిపోయింది. సహకార పద్ధతి అయితే యంత్రా లను వినియోగించడంలో కానీ మార్కెటింగ్‌లో కానీ సమష్టి కార్యాచరణకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ మార్కెటింగ్ విధానంలో భాగంగా ఈ-మార్కెట్‌నూ, ఈ-టెండర్‌నూ ప్రతిపాదించింది. కానీ తెలుగు రాష్ట్రాలలో అంతగా అమలు కావడం లేదు.
4. యువతరం వ్యవసాయరంగానికి దూరం అవుతోంది. విద్యావకాశాలు పెరిగి, అందుకు తగినట్టు ఉద్యోగావకాశాలు పెరగని నేపథ్యంలో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ, పోటీ పరీక్షలకు తయారవుతూ యువకులు పట్టణాలలోనే కాలక్షేపం చేస్తున్నారు కానీ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి వ్యవసాయం చేయాలని అనుకోవడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు అయినప్పుడు యువకులు ట్రాక్టర్ల మరమ్మతు లేదా వంగడాల తయారీ వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. అందుకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయవచ్చు.
5. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్’గా అభివర్ణించారు. కానీ విత్తన తయారీ కార్యక్రమంలో రైతులకు భాగ స్వామ్యం లేదు. ప్రైవేటు కంపెనీలదే పెత్తనం. రైతుల చేత విత్తనాలు తయారు చేయించి వాటిని విక్రయించే వ్యవస్థను ప్రభుత్వం నిర్మిస్తుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. ప్రైవేటు పారవశ్యంలో మునిగితేలుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వంపైన ఇటువంటి ఆశ కూడా లేదు. సరికొత్త విత్తన చట్టాన్ని తేవాలం టున్నారు. మంచిదే. కానీ ఉన్న చట్టాన్ని సవ్యంగా అమలు జరిపినా చాలు. కొత్త వంగడాలను మార్కెట్‌లోకి వదిలే ముందు ఆ వంగడాలను తయారు చేసిన సంస్థ పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని పాత చట్టం స్పష్టం చేసింది. విత్తనాలను పరీక్షించి, అవి ఇక్కడి నేల స్వభావానికి తగినవేనని ధ్రువీకరించిన తర్వాతనే వాటిని మార్కెట్‌లోకి అనుమతించాలి. విత్తనం వ్యాపారులకూ, రాజకీయనాయకులకూ, అధికారులకూ డబ్బు చేసు కునే సాధనంగా మారింది. రైతుకు తప్ప అందరికీ అది వరమే. రైతుకు మాత్రం శాపం. నకిలీ విత్తనాల గురించి ‘సాక్షి’లో వరుస కథనాలను ప్రచురించినా ప్రభుత్వాలు అరకొర చర్యలతో సరిపుచ్చాయి. చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.
6. రుణ సదుపాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వయంగా అంగీకరించారు. బ్యాంకులపైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కీ, రిజర్వు బ్యాంక్‌కీ ఫిర్యాదు చేస్తామంటూ పుల్లారావు శనివారంనాడు గుంటూరులో హెచ్చరించారు. రుణమాఫీ పథకం రెండు రాష్ట్రాలలోనూ సంపూ ర్ణంగానూ, సకాలంలోనూ అమలు జరగలేదు. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత బ్యాంకులలో రుణమాఫీ మొత్తాలను చెల్లించడం వల్ల రైతులు రుణాలు అవసరమైన దశలో బకాయిదారులుగా మిగిలిపోయి కొత్త రుణాలకు అనర్హు లుగా ఉండిపోయారు. బీమా సౌకర్యం కూడా పొందలేకపోయారు. ఖరీఫ్ పంట కోల్పోయిన రైతులలో అత్యధికులకు పంట బీమా సదుపాయం లేదు. బ్యాంకు అధికారుల సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి ఉద్బోధలు చేయడమే కానీ రైతు లకు ఉపశమనం లేదు. రుణమాఫీ మొత్తాన్ని ఒకే విడతలో సకాలంలో బ్యాంకు లలో ప్రభుత్వాలు జమ చేసి ఉన్నట్లయితే రైతులకు కొత్త రుణాలు దొరికేవి, పంట బీమా సదుపాయం లభించేది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు జరపాలన్న నిజాయితీ లేకపోవడం అసలు సమస్య. పైగా, అన్ని హామీ లనూ అమలు చేశామని ఒకరూ, ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేశామని మరొకరూ దబాయించడం సరికొత్త రాజకీయం. బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అప్పు చెల్లించలేక, అవమానాలు సహించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దీనగాథలు 1998 నుంచి వింటూనే ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా రాస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలకు విన్నవిస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా రైతుల బతుకుల్లో మార్పు లేదు.
మద్దతు ధర అందని ద్రాక్ష
7. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర పెట్టుబడి వ్యయం కంటే తక్కువే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్రం ప్రకటించిన ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత జోడించేది. అటువంటి చొరవ ఇప్పుడు లేకపోగా, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపా రులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు పెసర ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటల్‌కు రూ. 4,650. తెలంగాణలో రైతు లకు రూ. 2,600 నుంచి 3,300లు చెల్లిస్తున్నారని వ్యవసాయదారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ లోపెల్లి జలపతిరావు చెప్పారు. అదే గుజరాత్, మహారాష్ట్రలలో క్వింటల్ పెసరను రూ. 6,850 పెట్టి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తెలంగాణ రైతుల నష్టం కొంతవరకైనా తగ్గేదేమో.
8. ఆగస్టులో వర్షాభావం వల్ల తెలంగాణలో మొక్కజొన్న పంట దెబ్బ తిన్నది. సెప్టెంబరులో కుండపోత కారణంగా సోయా చిక్కుడు దెబ్బతిన్నది. వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం పడావ పెట్టవలసి వచ్చింది. నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. నివేదికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. కరువు మండలాలలో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 761 కోట్లు పంపించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా (మ్యాచింగ్ గ్రాంట్) రూ. 250 కోట్లు జోడించి రైతులను ఆదుకోవాలి. ఆ పని జరుగుతున్న దాఖలా లేదు.
9. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలనే అభ్యర్థన చాలాకాలంగా ఉన్నది. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే రైతుల జీవితాలకు భద్రత కల్పించవలసిన బాధ్యత దేశంపైన లేదా? హైదరాబాద్ హైకోర్టులో ఈ సమస్యపై దాఖలైన పిటిషన్‌పైన వాదనలు జరిగాయి. వ్యవసాయదారుల, వ్యవసాయ ప్రవీణుల సమావేశాలు నిర్వహించి వారి నుంచి సలహాలు స్వీకరించవలసిందిగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ రంగాన్ని దహించివేస్తున్న సంక్షోభం పరిష్కరించడంపైన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు దృష్టి కేంద్రీకరించాలి. జనాభాలో సగం మంది అసంతృప్తితో, నిరాశతో కునారిల్లుతూ ఉంటే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఎట్లా బాగుపడతాయి?
కె. రామచంద్రమూర్తి