తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. పంట దిగుబడి సరిగ్గా రాక, చేసిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనోవేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.
సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో చేసిన అప్పులు తీర్చే దారిలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. పుణ్యబోయిన నారాయణ అనే రైతు తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. సరిగ్గా వర్షాలు లేకపోవడంతో అది కాస్తా ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన నారాయణ చేసిన అప్పులు రూ.2 లక్షలకు చేరుకోవడంతో తీర్చలేనేమోనన్న ఆందోళనతో గురువారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వినుకొండ: గుంటూరు జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో నక్కా రాజశేఖర్ రెడ్డి (26) అనే యువరైతు తెల్లవారుజామున ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం చేసిన అప్పుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆలూరు: కర్నూలు జిల్లాలో అప్పుల భారంతో సతమతమైన ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఆస్పరి మండలానికి చెందిన గొల్ల తిప్పన్న(45) తనకున్న 5 ఎకరాల పొలంలో పత్తి, వేరుశెనగ పంటలను సాగు చేశాడు. ఇంటి ఖర్చులు, సాగు కోసం రూ.5.50 లక్షల వరకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చే శాడు. పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో గత కొంతకాలంగా తిప్పన్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశాడు.