పంజాబ్‌లో అనూహ్య ఫలితాలు! | aam admi party, a dark horse in punjab elections | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో అనూహ్య ఫలితాలు!

Published Fri, Feb 3 2017 5:12 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

aam admi party, a dark horse in punjab elections

(కె. రామచంద్రమూర్తి)


 
ప్రతిష్టాత్మకమైన పంజాబ్‌ అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో రసవత్తరంగా మారిన త్రిముఖ పోటీ ప్రచారానికి గురువారం తెరపడింది. పాలకపక్ష శిరోమణి అకాలీ దళ్‌–బీజేపీ కూటమిని పడదోసి పాలకపగ్గాలు చేపట్టేందుకు ‘నువ్వా, నేనా’ అన్నట్టుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు చివరి నిమిషం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాలకపక్ష కూటమి చతికిలపడినట్లుగానే కనిపిస్తోంది. 
 
‘2/3 బహుమతి’ అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆఖరి నిమిషంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పదివేల బైకులు, 300 డోల్‌వాలాలు, 1500 కార్యకర్తల ప్రచారంతో మాల్వా ప్రాంతాన్ని అదరగొట్టింది. చివిరి నిమిషం ప్రచారానికి ఊపునిచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు. లుంగర్‌లో లంచ్‌ చేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ ఆరవింద్‌ కేజ్రీవాల్‌ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని అకాలీ–బీజేపీ కూటమి అవినీతిని తూర్పారపడుతున్నారు. పాకపక్ష అకాలీ కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ వీధుల్లో చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత గురించి పాలకపక్షం ప్రజలకు గుర్తుచేయగా, 1980, 1990 ప్రాంతాల్లో పంజాబ్‌లో తిరుగుబాటుదారులను ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రోత్సహించి వేలాది మంది మరణానికి కారణమైన అంశాలను కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేశారు. ప్రజల మూకుమ్మడి మరణాలకు కారణమయ్యాయంటూ కాంగ్రెస్, అకాలీ పార్టీలను ఆప్‌ నేతలు విమర్శిస్తూ వచ్చారు. 
 
ఈ మారణ హోమాల్లో నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని, అలాగే దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆప్‌ నాయకులు ప్రచారంలో హామీలిచ్చారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్న బాదల్‌ కేబినెట్‌ మంత్రి విక్రమ్‌ సింగ్‌ మతీజాను జైలుకు పంపిస్తానని  అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వయంగా సవాల్‌ చేశారు. బాదల్‌ ప్రభుత్వం బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని, రవాణా వ్యవస్థపై గుత్తాధిపత్యాన్ని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొని వాడి, వేడిగా ప్రసంగించడం, పార్టీ యంత్రాంగం క్రమశిక్షణతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం పాలకపక్షం పరువు నిల్పుకునేందుకు దోహదపడతాయి. 
 
ఎన్నికల సర్వేలు ఎప్పుడూ కూడా ఆప్‌ పట్ల సానుకూలత చూపలేదు. 2015, ఫిబ్రవరి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన ఏడు సర్వేల్లో ఐదు సర్వేలు ఆప్‌కు కాస్త ఆధిక్యం వస్తాయని అంచనా వేశాయి. యాక్సిస్‌ అనే ఒక్క సర్వే మాత్రమే ఫలితాలకు కాస్త దగ్గరగా అంచనా వేసింది. నాటి ఎన్నికల్లో అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 సీట్లను కైవసం చేసుకొని ఆప్‌ అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘ఇండియా టుడే–యాక్సిస్, ఎన్డీటీవీ’ నిర్వహించిన సర్వేలు పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ లీడ్‌ సాధిస్తుందని తేల్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి అనుభవజ్ఞుడైన 70 ఏళ్ల అమరీందర్‌ సింగ్‌ నాయకత్వం వహించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృతసర్‌ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై పోటీ చేసి విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో రాహుల్‌ గాంధీ ఆలస్యం చేసినా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని రావడంలో విజయం సాధించి తన శక్తి ఏమిటో నిరూపించుకున్నారు. ప్రజల్లో పైకి కనిపిస్తున్న మూడ్‌ను చూస్తుంటే సహజంగా కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించాలి. ఆ తర్వాత స్థానంలో ఆప్‌ రావాలి. ప్రజల మనోభావాలను కాస్త లోతుగా చూస్తే వాతావరణం ఆప్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఆప్‌కు ఓసారి అవకాశం ఇవ్వాలని, రైతులు, గ్రామస్థులు భావిస్తున్నారు. వారికి ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియదు గానీ ఆప్‌ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘మొహల్లా దవాఖాన’, విద్యుత్‌ టారిఫ్‌లను తగ్గించడం గురించి మాట్లాడుకుంటున్నారు. 
 
నా పంజాబ్‌ పర్యటనలో నాతో తమ మనోభావాలను వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మంది రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. మార్పు కోరుకుంటున్న వారంతా కాంగ్రెస్‌ పార్టీకే ఓటేస్తారని భావించలేం. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలాగా పంజాబ్‌లో ఎన్నో సంవత్సరాలుగా అకాలీలకు ఓటేస్తూ వస్తున్నవాళ్లు ఒక్కసారిగా కాంగ్రెస్‌ వైపు తిరగాలంటే కష్టమే. ఎందుకంటే వారు కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకతతోనే అకాలీలకు ఓటేస్తూ వచ్చారు. పార్టీ కూడా కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపైనే ఏర్పడింది. అందుకే ఎన్నడూ ఆ పార్టీతో అకాలీలు పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్, అకాలీలను వ్యతిరేకిస్తున్న వారంతా ఆప్‌నే కోరుకుంటున్నారు. ఆ పార్టీకి ఒక్కసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు. లూధియానాలో ఓ చాయ్‌ వాలా మాత్రం ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌–ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాక్షించారు.
 
పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంపై అన్ని పార్టీలు ప్రధానంగా తమ దృష్టిని కేంద్రీకరించాయి. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉండడం అందుకు కారణం. ఈ ప్రాంతంలోనే ఆప్‌ తన ప్రజాదరణను పెంచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ నాలుగు సీట్లను గెలుచుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న అమరీందర్‌ సింగ్, భగవంత్ సింగ్‌ మాన్‌లు ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని మాఝా ప్రాంతంలో ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్‌ పార్టీ కాస్త ముందుంది. దోవ్‌బాలో కాంగ్రెస్, అకాలీలు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అకాలీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోకి ఆప్‌ క్రమంగా చొచ్చుకుపోతోంది. పైకి కనిపించకపోయినా విజయలక్ష్మి మాత్రం ఆప్‌నే వరించే అవకాశం ఉంది.


 
-వ్యాసకర్త 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement