punjab politics
-
ఆయన శాఖ మార్చేస్తా: సీఎం
రెండు పడవల మీద కాళ్లేస్తానంటున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వైఖరితో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తంటాలు పడుతున్నారు. ఒకవైపు మంత్రిగా కొనసాగుతూనే, మరోవైపు 'ద కపిల్ శర్మ షో'లో పాల్గొంటానని సిద్ధూ కచ్చితంగా చెప్పడంతో అలాగైతే ఆయన శాఖ మార్చేయాల్సి వస్తుందని కెప్టెన్ అంటున్నారు. దానికి బదులు ఆయనకు వేరే శాఖ ఇస్తామని అన్నారు. ప్రస్తుతం సిద్ధూ వద్ద పర్యాటక, సాంస్కృతిక, మ్యూజియంల శాఖలున్నాయి. వాటిలో సాంస్కృతిక శాఖతో సిద్ధూ పాల్గొనే షోకు సంబంధం ఉంటుంది. దాంతో అప్పుడు ప్రయోజనాల వైరుధ్యానికి సంబంధించిన సమస్య వస్తుంది. అయితే.. కిరణ్ ఖేర్ పార్లమెంటు సభ్యురాలిగా ఉంటూ నటిగా కూడా కొనసాగారని సిద్ధూ వాదిస్తున్నారు. కిరణ్ ఖేర్ మాత్రం తాను మూడు సినిమాలను తిరస్కరించానని, ఎంపీ అయిన తర్వాత నటించలేదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపులో సిద్ధూ పాత్ర చాలా ఉందని అందరూ అన్నారు. దాంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఖాయమని కూడా వినిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు సీఎం అమరీందర్ సింగ్ ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారు. తాను వారానికి నాలుగు రోజులు మాత్రమే, అది కూడా రాత్రిపూట తన విధి నిర్వహణ పూర్తయిన తర్వాత షో చేస్తానంటున్నానని, బాదల్ లాగ బస్సు సర్వీసులు నడపమంటారా అని అంటూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరోవైపు.. సిద్ధూ కపిల్ శర్మ షోలో పాల్గొనవచ్చా లేదా అనే విషయమై సీఎం అమరీందర్ సింగ్ న్యాయ సలహా కోరారు. -
సిద్ధూను వాడుకుని కర్వేపాకులా పారేశారా?
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు గానీ.. ఇంత భారీ విజయం సాధిస్తుందని అనుకోలేదు. ఈ విజయంలో మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూది కూడా కీలకపాత్ర అన్నది చెప్పక తప్పని విషయం. బీజేపీలో ఉండి ఎంపీ పదవి అనుభవిస్తూ.. దాన్ని వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లాలా అని ఆలోచించి చివరకు కాంగ్రెస్ పంచన చేరారు. ఇతర పార్టీల మీద గట్టిగా దుమ్మెత్తిపోయడమే కాకుండా కాంగ్రెస్ విజయానికి ఇతోధికంగా సాయపడ్డారు. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిస్తే కెప్టెన్ అమరీందర్ సింగే ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రకటించి, ఆ మాట నిలబెట్టుకున్నారు. దాంతో అంతా సిద్ధూను ఉపముఖ్యమంత్రి చేస్తారని భావించారు. కానీ.. ఆయనకు ఇచ్చిన మంత్రిత్వశాఖలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. సిద్ధూకు నెంబర్ 2 స్థానం ఇచ్చి ఆయనను ఉప ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని పంజాబ్ పీసీసీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా లాంటి వాళ్లు కూడా భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉండటంతో సిద్ధూ పదవికి ఎసరు వచ్చింది. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన సిద్ధూ ప్రస్తుతం ప్రభుత్వంలో మూడోస్థానంలో కొనసాగుతున్నట్లు అనుకోవాల్సి వస్తుంది. సహాయ మంత్రి హోదాలో ఉన్న రజియా సుల్తానా లాంటి వాళ్లకు పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటు సామాజిక భద్రత, మహిళాభివృద్ధి లాంటి కీలక శాఖలు లభించాయి. సిద్ధూకు మాత్రం పర్యాటకం, సాంస్కృతిక శాఖ, స్థానిక సంస్థల వ్యవహారాల శాఖలు మాత్రమే ఇచ్చారు. మరో సహాయ మంత్రి అరుణా చౌదరికి స్వతంత్ర హోదాతో విద్యాశాఖ ఇచ్చారు. సిద్ధూకు కీలక శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తే.. కెప్టెన్ కంటే ఎదిగిపోతారని, అది ఇబ్బందికరమని భావించడం వల్లే ఇలా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారని కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు అడ్డు పడినట్లు కూడా తెలుస్తోంది. ఇదే విషయాన్ని వాళ్లు కెప్టెన్ అమరీందర్‌తో చెప్పారని, దాంతో ఆయన పార్టీ అధిష్ఠానం వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లి, కావాలంటే ఆయనకు మూడో స్థానం ఇస్తాను తప్ప ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోనని చెప్పి దానికి ఆమోదం తీసుకున్నారని కూడా అంటున్నారు. తాను ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ ఉంటే అది తనకే దక్కాలని బ్రహ్మ మొహీంద్ర వాదిస్తున్నారు. ఇలా చాలామంది ఉండటంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు. అయితే శాఖల విషయంలో కూడా ఆయనను పట్టించుకోకుండా.. ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు తగిలించడంతో తనను కూరలో కర్వేపాకులా ఎన్నికల్లో వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారన్న భావనలో సిద్ధూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేకపోవడంతో ఊరుకున్నారంటున్నారు. -
పంజాబ్‌లో అనూహ్య ఫలితాలు!
(కె. రామచంద్రమూర్తి) ప్రతిష్టాత్మకమైన పంజాబ్ అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో రసవత్తరంగా మారిన త్రిముఖ పోటీ ప్రచారానికి గురువారం తెరపడింది. పాలకపక్ష శిరోమణి అకాలీ దళ్–బీజేపీ కూటమిని పడదోసి పాలకపగ్గాలు చేపట్టేందుకు ‘నువ్వా, నేనా’ అన్నట్టుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చివరి నిమిషం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాలకపక్ష కూటమి చతికిలపడినట్లుగానే కనిపిస్తోంది. ‘2/3 బహుమతి’ అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పదివేల బైకులు, 300 డోల్వాలాలు, 1500 కార్యకర్తల ప్రచారంతో మాల్వా ప్రాంతాన్ని అదరగొట్టింది. చివిరి నిమిషం ప్రచారానికి ఊపునిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. లుంగర్లో లంచ్ చేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని అకాలీ–బీజేపీ కూటమి అవినీతిని తూర్పారపడుతున్నారు. పాకపక్ష అకాలీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ వీధుల్లో చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత గురించి పాలకపక్షం ప్రజలకు గుర్తుచేయగా, 1980, 1990 ప్రాంతాల్లో పంజాబ్‌లో తిరుగుబాటుదారులను ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రోత్సహించి వేలాది మంది మరణానికి కారణమైన అంశాలను కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. ప్రజల మూకుమ్మడి మరణాలకు కారణమయ్యాయంటూ కాంగ్రెస్, అకాలీ పార్టీలను ఆప్ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఈ మారణ హోమాల్లో నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని, అలాగే దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆప్ నాయకులు ప్రచారంలో హామీలిచ్చారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్న బాదల్ కేబినెట్ మంత్రి విక్రమ్ సింగ్ మతీజాను జైలుకు పంపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సవాల్ చేశారు. బాదల్ ప్రభుత్వం బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని, రవాణా వ్యవస్థపై గుత్తాధిపత్యాన్ని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొని వాడి, వేడిగా ప్రసంగించడం, పార్టీ యంత్రాంగం క్రమశిక్షణతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం పాలకపక్షం పరువు నిల్పుకునేందుకు దోహదపడతాయి. ఎన్నికల సర్వేలు ఎప్పుడూ కూడా ఆప్ పట్ల సానుకూలత చూపలేదు. 2015, ఫిబ్రవరి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన ఏడు సర్వేల్లో ఐదు సర్వేలు ఆప్‌కు కాస్త ఆధిక్యం వస్తాయని అంచనా వేశాయి. యాక్సిస్ అనే ఒక్క సర్వే మాత్రమే ఫలితాలకు కాస్త దగ్గరగా అంచనా వేసింది. నాటి ఎన్నికల్లో అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 సీట్లను కైవసం చేసుకొని ఆప్ అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘ఇండియా టుడే–యాక్సిస్, ఎన్డీటీవీ’ నిర్వహించిన సర్వేలు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధిస్తుందని తేల్చాయి. కాంగ్రెస్ పార్టీకి అనుభవజ్ఞుడైన 70 ఏళ్ల అమరీందర్ సింగ్ నాయకత్వం వహించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృతసర్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై పోటీ చేసి విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో రాహుల్ గాంధీ ఆలస్యం చేసినా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని రావడంలో విజయం సాధించి తన శక్తి ఏమిటో నిరూపించుకున్నారు. ప్రజల్లో పైకి కనిపిస్తున్న మూడ్‌ను చూస్తుంటే సహజంగా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించాలి. ఆ తర్వాత స్థానంలో ఆప్ రావాలి. ప్రజల మనోభావాలను కాస్త లోతుగా చూస్తే వాతావరణం ఆప్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఆప్‌కు ఓసారి అవకాశం ఇవ్వాలని, రైతులు, గ్రామస్థులు భావిస్తున్నారు. వారికి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియదు గానీ ఆప్ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘మొహల్లా దవాఖాన’, విద్యుత్ టారిఫ్‌లను తగ్గించడం గురించి మాట్లాడుకుంటున్నారు. నా పంజాబ్ పర్యటనలో నాతో తమ మనోభావాలను వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మంది రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. మార్పు కోరుకుంటున్న వారంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించలేం. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలాగా పంజాబ్‌లో ఎన్నో సంవత్సరాలుగా అకాలీలకు ఓటేస్తూ వస్తున్నవాళ్లు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు తిరగాలంటే కష్టమే. ఎందుకంటే వారు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతోనే అకాలీలకు ఓటేస్తూ వచ్చారు. పార్టీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైనే ఏర్పడింది. అందుకే ఎన్నడూ ఆ పార్టీతో అకాలీలు పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్, అకాలీలను వ్యతిరేకిస్తున్న వారంతా ఆప్నే కోరుకుంటున్నారు. ఆ పార్టీకి ఒక్కసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు. లూధియానాలో ఓ చాయ్ వాలా మాత్రం ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్–ఆప్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాక్షించారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంపై అన్ని పార్టీలు ప్రధానంగా తమ దృష్టిని కేంద్రీకరించాయి. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉండడం అందుకు కారణం. ఈ ప్రాంతంలోనే ఆప్ తన ప్రజాదరణను పెంచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ నాలుగు సీట్లను గెలుచుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న అమరీందర్ సింగ్, భగవంత్ సింగ్ మాన్లు ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దులోని మాఝా ప్రాంతంలో ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుంది. దోవ్బాలో కాంగ్రెస్, అకాలీలు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అకాలీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోకి ఆప్ క్రమంగా చొచ్చుకుపోతోంది. పైకి కనిపించకపోయినా విజయలక్ష్మి మాత్రం ఆప్నే వరించే అవకాశం ఉంది. -వ్యాసకర్త 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ -
బీజేపీ అధ్యక్షుడి రాజీనామా.. అంతలోనే తూచ్
-
బీజేపీ అధ్యక్షుడి రాజీనామా.. అంతలోనే తూచ్
అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేని తరుణంలో పంజాబ్ బీజేపీ రాజకీయం పలు రకాల మలుపులు తిరుగుతోంది. టికెట్ల పంపిణీలో తీవ్ర అసంతృప్తికి లోనైన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయ్ సంప్లా రాజీనామా చేసినట్లు కథనాలు వచ్చినా, అంతలోనే ఆయన తన రాజీనామా వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. తాను వేరే పనిమీద వెళ్లాను తప్ప.. రాజీనామా చేయడానికి కాదని చెప్పారు. తన రాజీనామా విషయంలో వచ్చినవన్నీ రూమర్లే తప్ప ఏవీ నిజం కాదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అంతకుముందు, ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు, దాన్ని ఆయన ఆమోదించలేదని కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 117 స్థానాలున్న అసెంబ్లీకి పోటీ చేసేందుకు తాను సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పట్టించుకోకుండా తన సొంత జాబితా విడుదల చేయడంతో సంప్లా ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం అక్కడ పాలకపక్షమైన అకాలీదళ్-బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన విజయ్ సంప్లా, కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. -
సిద్ధూ మానవబాంబు లాంటివాడు: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మళ్లీ మాతృసంస్థలోకి వచ్చినట్లుందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ వ్యాఖ్యలపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన భార్య హర్సిమ్రత్ బాదల్ మండిపడ్డారు. సిద్ధూ మానవబాంబు లాంటివాడని, అతడు ఆరు నెలల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమని, కావాలంటే రాసిస్తానని కూడా అన్నారు. సిద్ధూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తన తల్లిని మార్చేస్తారని, ఆయనకు ఎంతమంది తల్లులు (పార్టీలు) ఉన్నారో అడగాలనుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ఎద్దేవా చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కావాలన్నదే ఏకైక ఎజెండా అని, దాంతోపాటు ప్రతి విషయానికీ ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తుంటారని విమర్శించారు. సిక్కులను ఊచకోత కోసిన పార్టీలోకి వెళ్లి, దాన్ని ఘర్వాప్సీ అంటూ వ్యాఖ్యానించిన సిద్ధూకు అభినందనలని సుఖ్బీర్ భార్య హర్సిమ్రత్ బాదల్ ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులు తమ కాళ్లను రెండు పడవల మీద కాకుండా మూడు పడవల మీద పెడతారని, కొన్నాళ్లు బీజేపీ.. మరికొన్నాళ్లు కాంగ్రెస్ అంటారని, ఇంకొంత దూరం వెళ్లి పాకిస్థాన్‌లో కూడా చేరొచ్చు కదా అని మండిపడ్డారు. ఇక పంజాబ్‌లో 70 శాతం మంది ఎప్పుడూ మత్తులో ఉంటారన్న రాహుల్ గాంధీయే బహుశా అందరికంటే ఎక్కువ మత్తులో ఉండి ఉంటారని తనకు అనిపిస్తోందని కూడా హర్సిమ్రత్ విమర్శించారు. -
ముఖ్యమంత్రిని ఢీకొంటా: కెప్టెన్
-
ముఖ్యమంత్రిని ఢీకొంటా: కెప్టెన్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో జరిగే ఎన్నికల్లో తాను నేరుగా ముఖ్యమంత్రితోనే పోటీ పడతానని కాంగ్రెస్ నాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. లాంబి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నానని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు. ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇద్దరినీ ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరాలని, అందుకోసం సిద్ధమవుతున్నామని, తన పోటీ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలితో పాటు ఉపాధ్యక్షుడితో కూడా మాట్లాడానని ఆయన చెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే పటియాలా, లాంబి రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తానని, అప్పుడు బాదల్లు ఇద్దరినీ ఓడించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ పంజాబ్‌కు కావల్సినంత నష్టం చేశారని మండిపడ్డారు. సిద్ధూ కాంగ్రెస్‌లోనే.. ఇక మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ నూరుశాతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని సిద్ధూ భార్య నవజోత్‌కౌర్ ఇప్పటికే చెప్పినందున ఇక ఆయన పార్టీలో చేరడం, చేరకపోవడం అన్న సమస్యే లేదని అన్నారు. -
పంజాబ్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్?
-
పంజాబ్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్?
ఇప్పటివరకు పెద్దగా చడీ చప్పుడు లేని పంజాబ్ ఎన్నికల రంగం ఒక్కసారిగా వేడెక్కింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పిలుపునిచ్చారు. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పంజాబ్‌లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా, ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద జాతీయ స్థాయిలోనే నమ్మకం కొరవడిన ప్రజలు.. అటు పంజాబ్‌లో కూడా వాళ్లు ఇంతకుముందు చేసింది, తర్వాత చేసేది ఏమీ లేదనే భావిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీని సరైన ప్రత్యామ్నాయంగా భావించడం లేదు. ఆమ్ ఆద్మీపార్టీ పంజాబ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మీద కూడా అవినీతి ఆరోపణలు రావడంతో, ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఊపు తేవాలనే అన్నారో, లేదా నిజంగానే కేజ్రీవాల్ పంజాబ్ వెళ్తారో గానీ మనీష్ సిసోదియా వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
పోటీకి సిద్ధూ సై.. ఏపార్టీయో తెలుసా?
పంజాబ్‌లో ఎన్నికల జోరు ఊపందుకుంది. గెలుపుకోసం అన్ని పార్టీలు నామినేషన్ల వేటలో పడ్డ తరణంలో... మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం అధికారికంగా తేలిపోయింది. ఇన్నాళ్ల బట్టి ఆయన ఏ పార్టీలో చేరారో కచ్చితంగా ప్రకటన రాకపోయినా.. ఇప్పుడు ఆ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. తన భార్య ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృతసర్ (తూర్పు) నుంచే సిద్ధూ పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు. క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన సిద్ధూ బీజేపీ నుంచి 2016, సెప్టెంబర్ 14న బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని వినవచ్చినా, అక్కడ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన ఉండటం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ముందుగా మాట ఇవ్వకపోవడంతో బేరం కుదరక.. కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు చెబుతున్నారు. -
పంజాబ్‌లో ఎవరికి ఎన్ని?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ - బీజేపీ కూటమి మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇన్నాళ్ల బట్టి అందరూ చెబుతున్నా.. ఎన్నికల పండితులు మాత్రం ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న సర్వేలలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వీళ్ల అంచనాలు విపరీతమైన తేడాగా కనిపిస్తున్నాయి. ఒకరు చెప్పేదానికి, మరొకరు చెప్పే ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. పంజాబ్‌లో ప్రధానమైన పోటీ ఎస్ఏడీ-బీజేపీ కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మధ్యే ఉంటుందని ఏబీపీ న్యూస్-లోక్‌నీతి-సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితం అవుతుందని అంచనా వేశారు. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలుండగా.. వాటిలో ఎస్ఏడీ-బీజేపీకి 50-58 స్థానాలు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 12-18 వస్తాయని చెప్పారు. కానీ ఇండియాటుడే-యాక్సిస్ సర్వే మాత్రం పంజాబ్‌లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ఉంటుందని అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు రావచ్చని అంటున్నారు. అయితే.. మొత్తమ్మీద ఏ సర్వే చూసినా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడంలేదు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 59 స్థానాలలో విజయం సాధించాలి. ఇన్ని సీట్లు ఏ ఒక్క పార్టీ లేదా కూటమికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటుందని ఇండియాటుడే- యాక్సిస్ సర్వే చెప్పింది. అక్కడి అసెంబ్లీలో మొత్తం 70 సీట్లుండగా, వాటిలో బీజేపీకి 35-43, కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. -
సిద్ధుకు మరో ఆఫర్
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధుకు మాంచి డిమాండ్ ఏర్పడింది. బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధుకు మరో ఆఫర్ వచ్చింది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేక డైలమాలో ఉన్న సిద్ధుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. సిద్ధు డీఎన్ఏలో కాంగ్రెస్ ఉందని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ అన్నారు. సిద్ధు తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, సిద్ధు చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అతని కోసం కాంగ్రెస్ తలుపులు ఓపెన్‌గా ఉన్నాయని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకే సిద్ధును పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధు పేరును ప్రకటించవచ్చని వార్తలు వచ్చాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిద్ధు ఇటీవల కలిసి చర్చించాడు. కాగా ఆప్‌లో చేరే విషయంలో అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని కూడా సిద్ధు పరిశీలిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సిద్ధు రెండు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన భార్య బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వడంతో పాటు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంట్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని, సిద్ధుకు స్థాయికి తగినట్టుగా ప్రాధాన్యం ఇస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు. ఇంతకీ సిద్ధు ఏ పార్టీలో చేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.