ముఖ్యమంత్రిని ఢీకొంటా: కెప్టెన్
ముఖ్యమంత్రిని ఢీకొంటా: కెప్టెన్
Published Sat, Jan 14 2017 5:15 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో జరిగే ఎన్నికల్లో తాను నేరుగా ముఖ్యమంత్రితోనే పోటీ పడతానని కాంగ్రెస్ నాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. లాంబి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నానని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు. ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఇద్దరినీ ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరాలని, అందుకోసం సిద్ధమవుతున్నామని, తన పోటీ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలితో పాటు ఉపాధ్యక్షుడితో కూడా మాట్లాడానని ఆయన చెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే పటియాలా, లాంబి రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తానని, అప్పుడు బాదల్‌లు ఇద్దరినీ ఓడించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ పంజాబ్‌కు కావల్సినంత నష్టం చేశారని మండిపడ్డారు.
సిద్ధూ కాంగ్రెస్‌లోనే..
ఇక మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ నూరుశాతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని సిద్ధూ భార్య నవజోత్‌కౌర్ ఇప్పటికే చెప్పినందున ఇక ఆయన పార్టీలో చేరడం, చేరకపోవడం అన్న సమస్యే లేదని అన్నారు.
Advertisement
Advertisement