ఆ లక్ష కోట్ల అప్పు.. తీర్చేది ఎవరు?
ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోంది. మిగిలిన నాలుగు చోట్లా కమలనాథులు రాజ్యం ఏలుతారు. అయితే, పంజాబ్‌లో అధికారం దక్కిందన్న ఆనందం కూడా ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు లేకుండా పోతోంది. ఎందుకంటే, ఇప్పటికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా లక్షా పాతిక వేల కోట్ల మేరకు పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ అప్పులన్నింటినీ ఎవరు తీరుస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒకప్పుడు 'సువర్ణ రాష్ట్రం'గా పేరొందిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు సగటు ఒక్కో పౌరుడి మీద రూ. 38,536 చొప్పున తలసరి అప్పు ఉంది.
117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 77 చోట్ల విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఖాళీ ఖజానాతో రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలియక సతమతం అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలంటే తగిన మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. దాంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ తప్పనిసరిగా నిధుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. మోదీ ప్రభుత్వం తమకు తప్పనిసరిగా సాయం చేస్తుందన్న ఆశాభావంతోనే కెప్టెన్ ఉన్నారు. త్వరలోనే తాను ప్రధానమంత్రిని కలుస్తానని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయనకు వివరిస్తానని అమరీందర్ అన్నారు. గతంలో తాను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండేవారని, అప్పట్లో బీజేపీతో తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. ఈసారి కూడా తాను మోదీని కలిసి రాష్ట్రానికి కావల్సిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చిస్తానన్నారు.
రుణమాఫీ సం'గతేంటో'
తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఇవి పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో.. వాటిని మాఫీ చేయడానికి నిధులు ఎక్కడినుంచి తెస్తారన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా ఉండబోతోంది. దాంతో పాటు ప్రతి కుటుంబానికి ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల 4జీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం అంత సులభం ఏమీ కాదు. ఏడాది పాటు ఉచిత డేటా, కాలింగ్ సదుపాయంతో 50 లక్షల స్మార్ట్ ఫోన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.