సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడే
ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా
ఉదయం 8 నుంచి కౌంటింగ్ షురూ
మధ్యాహా్ననికల్లా స్పష్టత వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి.
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏకగ్రీవమైన సూరత్ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని శనివారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొనడం, విపక్ష కూటమి వాటిని తిరస్కరించడం తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయిలో ఈ దఫా పోలింగ్ అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్‌ను ‘మోదీ మీడియా పోల్’గా అభివరి్ణంచాయి.
ఎగ్జిట్ పోల్స్ ముసుగులో అసలు ఫలితాలు ఎలా ఉండాలో అధికార యంత్రాంగానికి మోదీ స్పష్టమైన సంకేతాలిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశ ఎన్నికల ప్రక్రియను న్యూనత పరిచేందుకు విపక్షాలు మతిలేని ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగియాన్న ఆరోపణలకు ఆధారాలుంటే ఇవ్వాలంటూ విపక్షాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ నిలదీశారు! దాంతో పోలింగ్ ప్రక్రియ జూన్ 1నే ముగిసినా రాజకీయ వేడి మాత్రం అలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమయ్యాయి...
హోరాహోరీ పోరు...
ఈసారి ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ప్రచారం ముందెన్నడూ లేనివిధంగా ప్రధానంగా మతం, కులాల ప్రాతిపదికగా సాగింది. వరుసగా మూడో విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సర్వశక్తులూ ఒడ్డగా, పదేళ్ల మోదీ పాలనకు తెర దించడమే లక్ష్యంగా విపక్షాలు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ అన్నీ తానై ప్రచారం చేశారు.
కాంగ్రెస్ వస్తే సంపద పన్ను తదితరాల పేరిట జనం ఆస్తులు లాక్కుంటుందని ప్రతి ఎన్నికల సభలోనూ ఆరోపణలు గుప్పించారు. చివరికి హిందూ స్త్రీల మెళ్లో పుస్తెలనూ లాక్కుంటారన్నారు. విపక్షాలు కూడా గట్టిగానే ఎదురు దాడికి దిగాయి. ముస్లింలకు మతాధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనను అందిపుచ్చుకున్నాయి.
రిజర్వేషన్లను మొత్తానికే ఎత్తేస్తారని, రాజ్యాంగాన్నే సమూలంగా మార్చేస్తారని ఊరూవాడా హోరెత్తించాయి. దాంతో ప్రచార పర్వం ఆసాంతం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది. ఎన్డీఏకు 400 పై చిలుకు, బీజేపీకి సొంతగానే 370 స్థానాలొస్తాయని మోదీ, ఆ పార్టీ నేతలు పేర్కొనగా; ఇండియా కూటమికి 295 స్థానాలు ఖాయమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మెజారిటీకి 272 సీట్లు అవసరం.
ఆ సీట్లపై ఆసక్తి...
ఈసారి పలు లోక్‌సభ స్థానాల్లో ఫలితాలపై ఎనలేని ఆసక్తి నెలకొంది. వాటిలో టాప్‌లో ఉన్నది రాహుల్‌గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీ అంటే అతిశయోక్తి కాదు. యూపీలో గాం«దీల కంచుకోట అమేథీలో 2019లో ఆయన తొలిసారి ఓటమి చవిచూడటం తెలిసిందే.
ఈసారి మరో కంచుకోట రాయ్‌బరేలీలో నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరం. సిట్టింగ్ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో కూడా సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి రాహుల్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అక్కడి ఫలితంపైనా ఉత్కంఠే నెలకొంది. మాజీ సీఎంలు భూపేశ్ భగెల్, చరణ్‌జీత్‌సింగ్ చన్నీ, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూతుళ్లు మీసా భారతి, రోహిణీ ఆచార్య, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే గెలుస్తారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment