లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు..
ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 234
240 సీట్లకే పరిమితమైన బీజేపీ
హిందీ బెల్టులో భారీ ఎదురుదెబ్బ
మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ
ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిందే
పదేళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం
52 నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్
గేమ్ చేంజర్ యూపీ; బీజేపీకి కేవలం 33 సీట్లు
49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు, ఒడిశా
యూపీలో ఎస్పీకి 37, కాంగ్రెస్‌కు 6 స్థానాలు
కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను?
జేడీ(యూ) సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు!
న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది.
దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది.
233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది.
మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్‌సభ ఫలితాలను ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...!
ఆకట్టుకున్న ఇండియా కూటమి
ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్‌లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్‌బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం.
కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు
కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్‌పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్‌వీ) 5 సీట్లలో నెగ్గాయి.
2019లో క్లీన్‌స్వీప్ చేసిన రాజస్తాన్ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్‌స్వీప్ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్‌స్వీప్ చేసింది. గుజరాత్‌లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి.
తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి.
ఓట్ల శాతం ఇలా...
బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది.
హస్తినలో నంబర్‌గేమ్!
మోదీ కాళ్ల కిందకు నీళ్లు?
ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు
జాతీయ మీడియాలో వార్తలు
దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్‌లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్‌గేమ్ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.
18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు
(మొత్తం స్థానాలు 543)
ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి)
బీజేపీ 241
టీడీపీ 16
జేడీ(యూ) 12
శివసేన 7
ఎల్జేపీ (ఆర్‌వీ) 5
జనసేన 2
జేడీ(ఎస్) 2
ఆరెల్డీ 2
ఎన్సీపీ 1
అప్నాదళ్ 1
ఏజీపీ 1
యూపీపీఎల్ 1
ఏజేఎస్‌యూపీ 1
హెచ్‌ఏఎం(ఎస్) 1
ఇండియా కూటమి 233
కాంగ్రెస్ 99
ఎస్పీ 37
టీఎంసీ 29
డీఎంకే 22
శివసేన (యూబీటీ) 9
ఎన్సీపీ (ఎస్‌పీ) 7
ఆర్జేడీ 4
సీపీఎం 4
ఆప్ 3
జేఎంఎం 3
ఐయూఎంఎల్ 3
సీపీఐ 2
సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2
ఎన్‌సీ 2
వీసీకే 2
ఆరెస్పీ 1
కేసీ 1
ఆరెలీ్టపీ 1
బీఏడీవీపీ 1
ఎండీఎంకే 1
ఇతరులు 17
వైఎస్సార్‌సీపీ 4
మజ్లిస్ 1
అకాలీదళ్ 1
ఏఎస్‌పీకేఆర్ 1
వీఓటీపీపీ 1
జెడ్‌పీఎం 1
ఎస్‌కేఎం 1
స్వతంత్రులు 7
Comments
Please login to add a commentAdd a comment