న్యూడిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ సాధ్యం కాదని, అందుకోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు.
సోమవారం ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగం సవరణలు చేయాలని వాటిని లోక్ సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు మోదీకి మెజారిటీ సంఖ్య లేదని అన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పారు. జమిలీ ఎన్నికలు అసాధ్యమని, ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
అయితే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మాటలకు ఖండించారు. తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము. వాటిని ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటామని అన్నారు. తాము కేవలం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మాత్రమే చెబుతున్నామని తెలిపారు. కుల గణన కోరేది మేమే.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం.. ప్రధాని చెప్పేవన్నీ నమ్మొద్దు’ అని వెల్లడించారు.
ఇదిలా ఉండగా గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలపై గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment