
బడ్టెట్ కేటాయింపుల్లో కోత పెడుతున్నారు
రాజ్యసభలో ప్రస్తావించిన సోనియా గాంధీ
కనీస రోజువారి వేతనాన్ని రూ.400కు పెంచాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో తెచ్చిన ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నెమ్మదిగా నీరుగారుస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జీరోఅవర్‌లో ఉపాధిహామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు, దేశవ్యాప్తంగా అమలుతీరును సోనియా ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వం 2005లో తెచ్చిన ఉపాధి హామీ చట్టం లక్షలాది మంది గ్రామీణ పేదలకు భరోసాగా నిలిచింది.
అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యంచేయడం చాలా ఆందోళనకరం. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు రూ.86,000 కోట్ల వద్దే స్తబ్ధుగా ఆగిపోయాయి. ఇది చాలా ఆందోళనకరం. ద్రవ్యోల్బణ సంబంధ సవరణల తర్వాత ఈ కేటాయింపుల్లో మరో రూ.4,000 కోట్లు తెగ్గోశారు. కేటాయించిన నిధుల్లో కేవలం 20 శాతం నిధులను మాత్రమే పాత బకాయిలు తీర్చేందుకు వినియోగించనున్నారు.
ఇంత తక్కువ కేటాయింపులతో పాత బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?’’అని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్లను అమలుచేయడం మానుకోవాలని, వేతన చెల్లింపులలో నిరంతర జాప్యాలను మానుకోవాలని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన రేట్లు పెంచాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ. 400కు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపాధి పథకాన్ని కార్యక్రమాన్ని కొనసాగించడానికి, విస్తరించడానికి నిధులను పెంచాలని ఆమె కోరారు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ మరియు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ వంటి తప్పనిసరి అవసరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి కనీసం 150 రోజుల పని దొరికేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. లక్షలాది మంది గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక భద్రతను అందించే కార్యక్రమం కోసం ఈ చర్యలు అవసరమని సోనియా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment