
గర్భిణులకు ఆర్థిక సాయం అందించాలి
రాజ్యసభలో సోనియా గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)కు నిధులు ఇవ్వడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆమె బుధవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. గర్భిణులకు ప్రయోజన కరమైన పథకానికి నిధులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
లబ్ధిదారుల సంఖ్య నానాటికీ పడిపోతోందని గుర్తుచేశారు. 2022–23లో 68 శాతం మంది గర్భిణులు కనీసం ఒక దఫా ప్రయోజనాలు అందుకున్నారని, 2023–24లో ఇది 12 శాతానికి పడిపోయిందన్నారు. ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఎంవీవైని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ప్రతిఏటా కనీసం రూ.12,000 కోట్లు అవసరమని సోనియా గాంధీ వివరించారు. 2025–26 బడ్జెట్‌లో మాత్రం అరకొర నిధులే కేటాయించారని విమర్శించారు.
అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: రాజ్యసభలో సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లు–2024పై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోకేవలం ఒక్క కుటుంబమే అధికారం చెలాయించిందని, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు(సోనియా గాంధీ) కూడా ఆ కుటుంబంలో ఉన్నారని చెప్పారు. దీనిపై జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు నోటీసు అందశేశారు.