PMMVY
-
ఏపీకి ఫస్ట్ ర్యాంక్
-
‘పీఎం మాతృవందన యోజన’ అమలులో ఏపీకి ఫస్ట్ ర్యాంక్
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు మూడు ర్యాంకులు దక్కాయి. ఈ మేరకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. పీఎంఎంవీవై అమలులో భాగంగా 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన మాతృ వందన సప్త్‌లో రాష్ట్రానికి మొదటి ర్యాంకు దక్కింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకు సాధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కింది. ఈ పథకం గర్భిణుల కోసం రూపొందించినది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వారిని క్రమం తప్పకుండా ఆస్పత్రులకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారికి కాన్పు అయ్యేవరకూ 3 దశల్లో రూ. 5 వేలు ఇస్తారు. గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో పేరు నమోదు చేసుకోగానే రూ.1,000, ఆరు మాసాలు అయ్యాక రూ.2,000, ప్రసవం జరిగాక బిడ్డకు మూడున్నర నెలలు వయసొచ్చాక వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత మరో రూ. 2,000 ఇస్తారు. ఈ ఐదు వేల రూపాయలతో పాటు ప్రసవం సమయంలో జననీ సురక్ష యోజన కింద మరో వెయ్యి రూపాయలు ఇస్తారు. మన రాష్ట్రంలో ఏటా 7 లక్షల ప్రసవాలు జరుగుతుండగా 3 లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు వస్తున్నారు. ఇలా ప్రభుత్వాసుపత్రులకు గర్భిణులను తీసుకొచ్చి ప్రసవాలు చేయించడంలో ఆంధ్రప్రదేశ్ విశేష ప్రతిభ కనపరిచిందని, ఇందులో కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకురాగలిగారని కేంద్రం ప్రశంసించింది. ఆరోగ్య సిబ్బంది కృషి ఫలించింది ఆశా కార్యకర్తల నుంచి ఏఎన్ఎంలు, వైద్యుల వరకు అందరూ కలిసికట్టుగా కష్టపడి పని చేశారు. వాళ్ల కృషి వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ర్యాంకులు వచ్చాయి. ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఇవన్నీ మాకు మంచి ఫలితాలనిస్తున్నాయి. రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – కార్తికేయ మిశ్రా, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
గర్భిణులకు ఆసరా.. పీఎంఎంవీవై
సాక్షి,చిల్లకూరు: పెళ్లయిన ప్రతి మహిళ తొలిసారి మాతృత్వం పొందాలని తపన పడుతుంటారు. దీంతో పలు జాగ్రత్తలు పాటించి బిడ్డకు జన్మనిచ్చి మురిసి పోతారు. అయితే నేటి కాలంలో ఎక్కువగా రక్తహీనత ఏర్పడడంతోపాటు సరైన జాగ్రత్తలు పాటించక ఎంతోమంది బిడ్డలు పురుడు పోసుకునే సమయంలో మృతి చెందుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఎంవీవై (ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన) పథకం ద్వారా తొలిసారి గర్భందాల్చిన మహిళలకు విడతల వారీగా రూ.6 వేలను అందిస్తోంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా తల్లీబిడ్డ క్షేమంగా ఉండేందుకు దోహదపడుతుంది. మండలంలో 300 మంది గర్భిణులు మండలంలోని చిల్లకూరు, చింతవరం, వల్లిపేడు, వరగలి గ్రామాలలోని పీహెచ్‌సీల పరిధిలోని 31 గ్రామ పంచాయితీలలో ఇప్పటివరకు సుమారుగా 300 మంది వరకు గర్భిణులు ప్రతినెల పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. వీరిలో తొలిసారి గర్భందాల్చిన వారు సుమారు 100 మంది వరకు ఉన్నారు. వీరికి పీఎంఎంవీవైలో లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరు తమ పేర్లను స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వద్ద నమోదు చేసుకుంటే వారికి బ్యాంకుల ద్వారా నగదు అందే ఏర్పాటును చేస్తారు. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. తొలిసారి గర్భందాల్చిన గర్భిణులు మూడవ నెలలో తమ పేర్లను ఆరోగ్య కార్యకర్తల వద్ద నమోదు చేసుకోవాలి. మొదటి విడతగా వారికి వెయ్యి అందిస్తారు. ప్రసవానికి ముందు రూ.2 వేలు, ఖాతాలో జమ చేస్తారు. ప్రసవం అనంతరం మొదటి టీకా (డోసు) వేయించుకున్న తరువాత మరో రూ.2 వేలను అందిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే గర్భిణులు తమ బ్యాంకు పుస్తకం జెరాక్స్‌తోపాటు ఆధార్ కార్డును ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వాలి. ప్రత్యేక ప్రోత్సాహం కింద ఇచ్చే ఈ నగదు విషయంలో తొలిసారి గర్భందాల్చిన వారు ఏ కారణం చేతనైనా గర్భం విచ్చిన్నమైతే రెండవసారి గర్భందాల్చిన తరువాత తొలిసారిగా ఇచ్చిన వెయ్యి నగదును మినహాయించుకుని మిగిలిన రూ.4 వేలు అందించేలా చర్యలు తీసుకుంటారు. పేద మహిళలలకు ఇలా నగదు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వారు గర్భందాల్చిన సమయంలో పౌష్టికాహారం తీసుకుని మాతా శిశుమరణాలు తగ్గించే వీలుంటుంది. ఖాతాలలోనే జమవుతుంది పీఎంఎంవీవై పథకం కింద దరఖాస్తు చేసుకున్న గర్భిణులకు రూ.5 వేలు విడతల వారీగా అందిస్తారు. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించకుంటే అదనంగా మరో వెయ్యి అందిప్తారు. దీంతో మొత్తంగా ఆరువేల నగదు గర్భిణుల ఖాతాలలోనే జమ అవుతుంది. ప్రోత్సాహంగా ఇచ్చే నగదుతో పౌష్టికాహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. – బ్రిజిత, చిల్లకూరు, వైద్యాధికారి -
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్జీవోలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రధాన కేటాయింపులు ► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు. ► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం. ► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు. ► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల. ► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల. ► అంగన్వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు. ► నేషనల్ క్రెచ్ స్కీమ్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు. ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు. ► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు. ► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ► మహిళా సాధికారత, సశక్తిత మిషన్‌కు బడ్జెట్‌ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల. ‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్‌కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్‌సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
కర్నూలు నంబర్ వన్
కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో కర్నూలు జిల్లా దక్షిణాదిన ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది. ఈ నెల ఏడోతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ఎస్.సత్యనారాయణ, డీఎంహెచ్‌వోడాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ పథకాన్ని 2017 సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించారు. దీని కింద గర్భిణిగా నమోదైన వెంటనే రూ.1000లు, ఆరో నెలలో మరో రూ.2వేలు, ఆసుపత్రిలో ప్రసవించాక రూ.1000లు, శిశువుకు మూడు విడతల రోగ నిరోధక టీకాలు అందించిన తర్వాత రూ.2వేలు కలిపి మొత్తం రూ.6వేలు ప్రోత్సాహక నగదు అందిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ పథకం పెద్దగా అమలు కాలేదు. అయితే.. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ పథకం అమలుపై దృష్టి సారించారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ మాత్రమే గాక ఐసీడీఎస్, ఆశా కార్యకర్తలు, మెప్మా సహకారంతో అర్హులైన గర్భిణులను గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయించారు. వారందరికీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ‘తల్లీబిడ్డ చల్లగా..’ అని పేరు మార్చి అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటి వరకు జిల్లాలో 38,672 మందికి రూ.9,41,81,000 నగదు అందించారు. అభినందనల వెల్లువ.. పీఎంఎంవీవై అమలులో జిల్లాకు ప్రథమ స్థానం దక్కడంతో కలెక్టర్ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో జేవీవీఆర్‌కే ప్రసాద్‌లకు మంగళవారం కలెక్టరేట్లో ఇతర శాఖల అధికారులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ శశిదేవి, డీఈవో తెహరాసుల్తానా, డీఐవో డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు. -
నమోదు నామమాత్రమే
గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన. ఈ పథకం కింద ప్రతి మహిళ మొదటి కాన్పుకు రూ.6వేలు ఇస్తారు. అయితే, వివిధ కారణాలతో గర్భిణుల నమోదు జిల్లాలో నామమాత్రంగా జరుగుతోంది. దీనికితోడు పీఎంఎంవీవై పథకం గురించి చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే సరైన అవగాహన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం కర్నూలు జిల్లాలో రెండు నెలల నుంచి అమలవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అది కూడా మొదటి కాన్పుకు మాత్రమే. మహిళ గర్భం దాల్చాక ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షకు వెళ్లిన మొదటిసారి రూ. 1000 ఇస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకు పరీక్షకు వెళ్లిన సమయంలో మరో రూ.2వేలు ఇస్తారు. ప్రసవం అయ్యాక రూ.1000 శిశువుకు 6, 10, 14వారాల వ్యాక్సిన్ పూర్తయిన తర్వాత మిగిలిన రూ.2వేలు అందజేస్తారు. గర్భిణికి పోషకాహారం అందించి మాతాశిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు జిల్లాలో గత నెల వరకు ఈ పథకం కింద 17శాతం మంది గర్భిణులు మాత్రమే నమోదు అయ్యారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ ఒత్తిడి పెంచాక ఆ మొత్తం 30 శాతం దాటింది. పరీక్ష నిమిత్తం ఆసుపత్రికే వచ్చే గర్భిణులు ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ల వివరాలను తీసుకురాకపోవడం, తెచ్చినా అందులో తప్పులు ఉండటం, ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉత్పన్నమ వుతున్నాయి. దీనికితోడు ఇప్పటి వరకు ఈ పథకం ఒకటుందని చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే అవగాహన లేకపోవడం.. సర్వర్ సమస్య వేధిస్తున్నాయి. దీంతో రోజుకు ఒక్కో పీహెచ్‌సీల్లో నలుగురు గర్భిణుల వివరాలు మించి నమోదు చేయలేకపోతున్నారు. నమోదు బాధ్యతను ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ ఆఫీసర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన ఎవ్వరైనా నమోదుచేయవచ్చు. కానీ చాలా చోట్ల వీటి నమోదు నామమాత్రంగా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ఉద్యోగుల ఆవేదన ‘అయ్యా డీపీఎంఓ ఆఫ్ డీపీఎంయూ(ఎన్‌ఆర్‌హెచ్ సెక్షన్) గారూ.. పీఎంఎంవీవై అప్లికేషన్స్ అప్లోడింగ్ విషయంలో మీరు హైరానా పడిపోతూ పీహెచ్‌సీలను కంగారు పెట్టిస్తున్నారు. సీఎఫ్‌డబ్ల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీఎం సమీక్ష ఉందంటూ ఏడాదికి సంబంధించిన మొత్త్తం లబ్ధిదారుల వివరాలన్నీ ఒక్కసారిగా అప్లోడ్ అయిపోవాలంటే పనవ్వదు. డీఈఓలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ల ముందు కూర్చున్నా సర్వర్ సమస్యతో నాలుగైదు దరఖాస్తులకు మించి అప్లోడ్ కావడం లేదు. మిమ్మలను ఎవరైతే కంగారు పెడుతున్నారో ముందు సర్వర్ కెపాసిటీ పెంచాలని చెప్పండి. ఈ సమస్య పరిష్కరించకుండా మాపై ఒత్తిడి పెంచడం న్యాయమా’..? అని ఉద్యోగులు అడుగుతున్నారు. ఈ మొర వాట్సాప్ గ్రూపుల్లో సైతం చక్కర్లు కొడుతోంది. గర్భిణుల రిజిస్ట్రేషన్ పెరిగింది ఆధార్, బ్యాంకు ఖాతాల్లో సమస్యలు ఉండటంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సమస్య ఏర్పడింది. వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్‌ను వేగంగా చేస్తున్నాము. వారం క్రితం 17 శాతం ఉన్న రిజిస్ట్రేషన్ శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. మొత్తం గర్భిణులకు రూ.18,93,000 లను పంపిణీ చేశాము. –డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్ఓ -
గర్భిణులకు వరం
వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు: మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై) గర్భిణులకు వరంగా మారింది. దీన్ని అందిపుచ్చుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో నమోదైన వారికి మూడు విడతలుగా అర్థిక సాయం అందజేస్తారు. పీఎంఎంవీవై ద్వారా లబ్ధి పొందిన వారు ఆస్పత్రులలో ప్రసవించినా.. ప్రభుత్వం ఇచ్చే జననీ సురక్ష యోజన ద్వారా రూ.వెయ్యి కూడా పొందవచ్చు. 2017 జనవరి 1 తర్వాత గర్భిణిగా నమోదు చేయించుకున్న వారు తప్పనిసరిగా గర్భిణి పరీక్షలు (కనీసం ఒక పర్యాయం) చేయించుకోవాలి. పుట్టిన బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ బిడ్డకు మొదటి విడత పోలియో చుక్కలు, పెంటా వాలెంట్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్ వేయించి ఉండాలి. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ అవుతుంది. దరఖాస్తు చేయడం ఇలా... దరఖాస్తుతోపాటు భార్యభర్తల ఆధార్‌కార్డు జిరాక్స్, దరఖాస్తుదారు బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలు జత చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఆయాలు ఈ పథకంలో నమోదు చేయించుకుని లబ్ధి పొందవచ్చు. 2017 జనవరి 1, ఆ తర్వాత నమోదు చేసుకున్న గర్భిణులలో కొందరు ప్రస్తుతం కాన్పు అయి ఉంటారు. నమోదు చేయించుకుని ప్రస్తుతం తల్లిగా ఉన్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. ప్రతి గర్భిణి తమ గ్రామ ఏఎన్ఎంతో ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. 12 అంకెల ఆర్సీహెచ్ గుర్తింపు సంఖ్య.. వారి ఎంసీపీ కార్డు మీద తప్పనిసరిగా రాయించుకోవాలి. గర్భిణి ఆధార్‌కార్డుతో ఉన్న పేరుతో బ్యాంకు అకౌంట్ ఉండాలి. గర్భిణి లేదా కుటుంబ సభ్యులలో ఫోన్ నంబరు దరఖాస్తులో నమోదు చేయాలి. గర్భిణి నమోదు సమయంలో మొదటిగా పారం–1 ఏతో పాటు, సంబంధిత డాక్యుమెంట్స్ నకలు కాపీలు ఏఎన్ఎంకు ఇచ్చి వారి నుంచి రశీదు పొందాలి. మంజూరు అధికారులు గర్భిణుల దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. బ్యాంక్ అకౌంట్లో జమ డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు 30 రోజులలో మొదట విడతగా 30 రోజులలో వెయ్యి నగదు వారి అకౌంట్లో జమ అవుతుంది. తరువాత ఆరు నెలలకు ఫారం–బీతో సంబంధిత కాపీల నకలుతో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ 30 రోజులలో వారి అకౌంట్లో రెండో విడతగా రూ.రెండు వేలు జమ చేస్తారు. ప్రసవం తర్వాత ఫారం–1సీతో దరఖాస్తు చేయాలి. 30 రోజులలో మూడో విడతగా మరో రూ.రెండు వేలు జమ అవుతాయి. అనివార్య కారణాలతో అబార్షన్ అయితే రెండోసారి గర్భం దాల్చిన తర్వాత.. రెండో ఇన్స్టాల్మెంట్ నుంచి సంబంధిత పరీక్షలు చేయించుకుని దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు