సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు మూడు ర్యాంకులు దక్కాయి. ఈ మేరకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. పీఎంఎంవీవై అమలులో భాగంగా 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన మాతృ వందన సప్త్‌లో రాష్ట్రానికి మొదటి ర్యాంకు దక్కింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకు సాధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కింది.
ఈ పథకం గర్భిణుల కోసం రూపొందించినది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వారిని క్రమం తప్పకుండా ఆస్పత్రులకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారికి కాన్పు అయ్యేవరకూ 3 దశల్లో రూ. 5 వేలు ఇస్తారు. గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో పేరు నమోదు చేసుకోగానే రూ.1,000, ఆరు మాసాలు అయ్యాక రూ.2,000, ప్రసవం జరిగాక బిడ్డకు మూడున్నర నెలలు వయసొచ్చాక వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత మరో రూ. 2,000 ఇస్తారు.
ఈ ఐదు వేల రూపాయలతో పాటు ప్రసవం సమయంలో జననీ సురక్ష యోజన కింద మరో వెయ్యి రూపాయలు ఇస్తారు. మన రాష్ట్రంలో ఏటా 7 లక్షల ప్రసవాలు జరుగుతుండగా 3 లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు వస్తున్నారు. ఇలా ప్రభుత్వాసుపత్రులకు గర్భిణులను తీసుకొచ్చి ప్రసవాలు చేయించడంలో ఆంధ్రప్రదేశ్ విశేష ప్రతిభ కనపరిచిందని, ఇందులో కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకురాగలిగారని కేంద్రం ప్రశంసించింది.
ఆరోగ్య సిబ్బంది కృషి ఫలించింది
ఆశా కార్యకర్తల నుంచి ఏఎన్‌ఎంలు, వైద్యుల వరకు అందరూ కలిసికట్టుగా కష్టపడి పని చేశారు. వాళ్ల కృషి వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ర్యాంకులు వచ్చాయి. ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఇవన్నీ మాకు మంచి ఫలితాలనిస్తున్నాయి. రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
– కార్తికేయ మిశ్రా, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ
Comments
Please login to add a commentAdd a comment