సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్‌గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి..
ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి.
అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి.
పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్‌పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి.
ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్‌పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి.
రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు
గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి.
ఎమర్జెన్సీ సీపీఆర్‌పై శిక్షణ
విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్‌వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్‌ను సిద్ధం చేయాలి. సీహెచ్‌వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి.
వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్‌టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి.
5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు
ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు.
నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు.
పూర్తిగా అదుపులో కోవిడ్
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు.
సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
Published Tue, May 2 2023 4:03 AM | Last Updated on Tue, May 2 2023 9:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment