AP: వైద్య రంగానికి చికిత్స | CM Jagan Says Radical changes in govt hospitals with Nadu Nedu | Sakshi
Sakshi News home page

AP: వైద్య రంగానికి చికిత్స

Published Wed, Sep 21 2022 3:27 AM | Last Updated on Wed, Sep 21 2022 8:03 AM

CM Jagan Says Radical changes in govt hospitals with Nadu Nedu - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా గత మూడేళ్లలో చర్యలు చేపట్టాం. ఏకంగా 45 వేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఇప్పటి వరకు 40,800 మందిని నియమించాం. మిగిలిన పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అక్టోబర్‌ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించాం. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదన్న నాన్న గారి లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేశాం.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా జబ్బు బారిన పడితే పేదలు అప్పులపాలు కాకుండా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు చేశామని చెప్పారు. శాసనసభలో మంగళవారం విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాడు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులో ఆపరేషన్‌ చేయడం వంటి ఘటనలు అప్పట్లో చూశాం. అలాంటి æపరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చాక మనసు పెట్టి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

 
మన రాష్ట్రంలో టయర్‌–1 సిటీలు లేవు..
► తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాల్లో మాదిరిగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి టయర్‌–1 సిటీలు మన రాష్ట్రంలో లేవు. ఈ కారణంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న పరిస్థితులు మన దగ్గర లేవు. దీంతో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తెస్తే ప్రజలకు మంచి చేయగలుగుతాం అని ఆలోచించి.. ఆ దిశగా వేగంగా అడుగులు వేశాం.  
► దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నిరుపేదలు పెద్ద పెద్ద జబ్బుల బారిన పడినప్పుడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు.
► ఆ మహానేత మరణం తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టే నాటికి టీడీపీ ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయింది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడానికి నెట్‌వర్క్‌ ఆస్పత్రులు విముఖత చూపే పరిస్థితి. 
► ఈ క్రమంలో డాక్టర్‌లా చికిత్స మొదలు పెట్టాను. టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.680 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాం. చెల్లింపుల్లో ఎటువంటి తారతమ్యాలకు పోలేదు. నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి ఈ రోజున బిల్లు చెల్లింపులు.. చంద్రబాబు హయాంలో కంటే చాలా వేగంగా చేస్తున్నాం. 

95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ
► వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. అంటే నెలకు రూ.40 వేల ఆదాయం ఉండే మధ్యతరగతి కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేశాం. ఫలితంగా 95 శాతానికి పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి.
► గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్లకు పథకాన్ని వర్తింప చేయబోతున్నాం. ప్రొసీజర్‌ల సంఖ్య పెంచడం, మరో వైపు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపుల ద్వారా ఈ పథకాన్ని బలోపేతం చేశాం. 
► ప్రతి ప్రభుత్ర ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ) మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

మారుతున్న ఆస్పత్రుల రూపురేఖలు
► రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో నాడు–నేడు కింద 11,888 పనులు చేపట్టగా 4,851 పనులు పూర్తయ్యాయి. 
► వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్‌), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్‌), బోధనాస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి చోటా పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నాం.
► గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు ఈ రెండూ కూడా ప్రివెంటివ్‌ కేర్‌లో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో గ్రామాల్లో రూ.1,692 కోట్ల వ్యయంతో 10,032 హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 3,673 క్లినిక్స్‌ నిర్మాణం పూర్తయింది. మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. విలేజ్‌ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం ఉంటారు. 
► ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ ఒక సీహెచ్‌సీ లేదా ఒక పీహెచ్‌సీ ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. తద్వారా ప్రతి మండలంలో నలుగురు వైద్యులు అందుబాటులోకి వస్తారు.

ప్రతి గ్రామానికి నెలలో రెండు మూడు సార్లు వైద్యుడు
► త్వరలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యుడు నెలలో రెండు, మూడు సార్లు సందర్శిస్తాడు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. పీహెచ్‌సీలో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు రోజు విడిచి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించి, అక్కడే వైద్య సేవలందిస్తారు. 
► దీంతో మెజారిటీ జబ్బులకు గ్రామాల్లోనే వైద్యం అందుతుంది. వైద్యుడితో గ్రామస్తులకు అనుబంధం ఏర్పడుతుంది. నెలలో రెండు, మూడు సార్లు గ్రామాన్ని సందర్శించడంతో ప్రజలను వైద్యుడు పేరు పెట్టి పిలిచే పరిస్థితులు ఏర్పడతాయి. ఓ వైపు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీ స్థాయిలో అడుగులు వేస్తుండగా, మరో వైపు సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ఈ ఆస్పత్రులు క్యురేటివ్‌ కేర్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.   

కొత్తగా 17 వైద్య కళాశాలలు
► రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వీటని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ.. కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలలో వైద్య, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. 
► పాత కళాశాలల అభివృద్ధి, కొత్త కళాశాలల ఏర్పాటు కోసం రూ.12,268 కోట్లు వ్యయం చేస్తున్నాం. విలేజ్‌ క్లినిక్‌ నుంచి బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు–నేడు ద్వారా విద్య, వైద్య ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు వచ్చే ఏడాది, రెండేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement