సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య అనుబంధాన్ని బలపరచడం ద్వారా మెరుగైన వైద్య సంరక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మక ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది.
ఏమిటీ విధానం?
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం.
ఇలా నిర్వహిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.
104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.
14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు
గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు.
ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు.
కొత్తగా 260 ఎంఎంయూ వాహనాలు
పీహెచ్‌సీ వైద్యులు తమకు కేటాయించిన గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మండలానికి ఒక 104 ఎంఎంయూను సమకూర్చి సేవలను బలోపేతం చేసింది. అయితే ప్రతి గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉన్నందున ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా కొత్తగా 260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
నాలుగేళ్లలో 48,639 వైద్య పోస్టుల భర్తీ
ఫ్యామిలీ డాక్టర్ విధానం సమర్థంగా అమలయ్యేందుకు ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులతోపాటు మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్‌సీలకు అదనంగా 151 పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఎవరైనా వైద్యుడు సెలవుపై వెళితే ఫ్యామిలీ డాక్టర్ సేవలకు అంతరాయం కలగకుండా అదనపు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఏడు పీహెచ్‌సీలకు ఒకరు, జిల్లాకు నలుగురు చొప్పున 285 మంది అదనపు వైద్యులను సమకూర్చారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ పథకం కోసం కొత్తగా వైద్య పోస్టులు సృష్టించడంతోపాటు అప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసి మొత్తంగా 2,875 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు.
వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగలకుండా గత నాలుగేళ్లలో 48,639 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
వైద్యులకు ఫోన్లు
వైద్యులు గ్రామాలను సందర్శించని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు.
గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు
– గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్
– హిమోగ్లోబిన్ టెస్ట్
– ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్)
– మలేరియా టెస్ట్
– హెచ్‌ఐవీ నిర్ధారణ
– డెంగ్యూ టెస్ట్
– మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్)
– అయోడిన్ టెస్ట్
– వాటర్ టెస్టింగ్
– హెపటైటిస్ బి నిర్ధారణ
– ఫైలేరియాసిస్ టెస్ట్
– సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్
– విజువల్ ఇన్‌స్పెక్షన్
– స్పుటమ్ (ఏఎఫ్‌బీ)
ట్రయల్ రన్‌లో 69 లక్షల మందికి వైద్య సేవలు
– ఓపీ సేవలు– 25,80,599
– యాంటెనేటల్(గర్భిణులకు వైద్య సేవలు)– 4,03,500
– పోస్ట్‌నేటల్(బాలింతలకు వైద్య సేవలు)– 2,20,835
– మధుమేహం బాధితులు– 15,79,962
– రక్తపోటు బాధితులు– 20,98,028
– క్యాన్సర్ రోగులు– 33,635
నిరంతర సంరక్షణతో మంచి ఫలితాలు
బీపీ నియంత్రణలో లేకపోవడంతో 20 శాతం పెరాలసిస్ కేసులు నమోదవుతున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో పలు రకాల జబ్బుల బారినపడుతున్నారు. గ్రామాల్లో జీవన శైలి జబ్బులు పెరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో నివసించే బీపీ, మధుమేహం, ఇతర సమస్యల బాధితులు తరచూ 5 నుంచి 10 కి.మీ ప్రయాణించి ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను కలసి మందులు తీసుకోవడం ఇబ్బందికరం. వైద్యుడే గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం వాకబు చేయడం ప్రజారోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది.
– డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ
అనుబంధంతో మానసిక బలం
ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావడం మంచి పరిణామం. గర్భిణులు, బాలింతలు, బీపీ, మధుమేహం బాధితులను తరచూ పరామర్శించడం ద్వారా వైద్యులు వారిని గుర్తు పట్టి పేరుతో పలకరిస్తారు. తద్వారా వైద్యుడు, ప్రజలకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అది రోగికి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్
ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చిన సీఎం జగన్
దేశ వైద్య రంగ చరిత్రలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇది ప్రజారోగ్య వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసింది. వైద్యుల కోసం ఆస్పత్రులకు వెళ్లి పడిగాపులు కాసే పరిస్థితులు తొలగిపోయి డాక్టర్లే గ్రామాల బాట పట్టడం సాధారణ విషయం కాదు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
ఒక్క ఫ్యామిలీ డాక్టర్ విధానమే కాకుండా వైద్య ఆరోగ్య రంగంపై రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చిస్తూ నాడు – నేడుతో ఆస్పత్రుల ఆధునికీకరణ, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చారు. ఆరోగ్య రంగంలో ఏపీ ఈ రోజు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
– విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు
– జనరల్ ఔట్ పేషెంట్ సేవలు
– బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్
– గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు.చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు.
– రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు
– ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం.
– పాలియేటివ్ కేర్.. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ
Comments
Please login to add a commentAdd a comment