సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో నాణ్యతను మరింతగా పెంపొందించడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) సొమ్మును నేరుగా వైద్యులు, వైద్య సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావులేకుండా పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, అన్ని ప్రభుత్వాస్పత్రులను నెట్‌వర్క్ ఆస్పత్రులుగా నోటిఫై చేయడం వంటి ప్రభుత్వ చర్యలతో ఆరోగ్యశ్రీ సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు భారీగా పెరిగాయి. మొత్తం క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని ఇంకా పెంచడం ద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు రాబట్టి, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది.
ఇందులో భాగంగానే ప్రోత్సాహకాల జమలోనూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్ చేస్తే.. దానికి వచ్చే క్లెయిమ్ మొత్తంలో 25 శాతం ప్రోత్సాహకం కింద హెల్త్ కేర్ స్టాఫ్‌కు వస్తుంది.
ఈ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఈ సొమ్మును ఆస్పత్రుల సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనంతరం వాటిని వైద్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు.
ఈ విధానంలో కాలయాపన జరుగుతోంది. దీంతో నేరుగా, వైత్యులు, సిబ్బంది ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ నెల నుంచి డీఎంఈలో ప్రారంభం
ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు నేరుగా సిబ్బంది ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ఈ నెల నుంచి డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నాం. అనంతరం ఏపీవీవీపీ ఆస్పత్రులకూ విస్తరిస్తాం. జనవరి వరకు పాత విధానంలో చెల్లింపులు ఉంటాయి.
ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకాలు నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో ట్రస్టు నుంచి జమ అవుతాయి. ఈ విధానంతో వైద్యులు, సిబ్బందిలో నూతనోత్తేజం వస్తుందని భావిస్తున్నాం. తద్వారా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం.
– డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ
Comments
Please login to add a commentAdd a comment