నవరత్నాల లబ్దిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 95 శాతం జనాభాను పథకం పరిధిలోకి తెచ్చామని తెలిపారు.
ఈ క్రమంలో పథకం కింద రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పథకం, నాడు–నేడు, వైద్య శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు.
17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కొత్త కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు మంచి స్పందన వచ్చిందన్నారు.
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు పొందడానికి ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ఇప్పటికే పోస్టులను కొత్తగా సృష్టించిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2025–26లో మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
సమగ్ర వివరాలతో బుక్‌లెట్
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్ మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చి ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచాం. నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా మనవారికి ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ క్రమంలో వచ్చే నెల 15 నుంచి ప్రారంభించే ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి పథకం గురించి సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందజేయాలి.
ఆ బుక్‌లెట్‌ను చూస్తే పథకం సేవలను ఎలా పొందాలి? ఏ సేవలు ఉంటాయి? లాంటి అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ గురించి సవివరంగా తెలియజేయాలి. అనారోగ్యం బారినపడినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్న దానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి.
ప్రజలు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స పొందాలో వివరించాలి. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పథకం సేవలపై యాప్ తీసుకొచ్చాం. ఒక్క యాప్ ద్వారానే కాకుండా కాల్ సెంటర్ల ద్వారా కూడా సేవలు పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి.
► సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డా.మంజుల, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, సీఈవో హరేందిరప్రసాద్, సలహాదారు గోవిందహరి, ప్రత్యేకాధికారి అశోక్‌బాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, డీఎంఈ డాక్టర్ నరసింహం, నాడు–నేడు డైరెక్టర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమర్థంగా నిర్వహణ
వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం, పరికరాలు సమకూర్చడం ఎంత ముఖ్యమో వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలి. నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఒక విధానం తీసుకురావాలి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకుగాను ప్రభుత్వం నుంచి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతి తీసుకురావాలి.
ఇలా చేయకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తేవాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఏర్పాట్ల పనులు పూర్తి కావాలి. పాలకొల్లు, పార్వతీపురం కళాశాలల పనులను మరింత వేగవంతం చేయాలి.
ఫిర్యాదులు చేయడంపై అవగాహన ఉండాలి
ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫిర్యాదులకు సంబంధించిన నెంబర్లను కూడా ప్రజలకు తెలియచెప్పాలి. నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఈ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలి.
డిశ్చార్జ్ అయిన రోజే ‘ఆసరా’
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నాం. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలి. దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించండి.
Comments
Please login to add a commentAdd a comment