సచివాలయ సిబ్బంది తరహాలోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. విలేజ్ క్లినిక్స్ ఆవశ్యకత, సిబ్బంది అందుబాటులో ఉంటున్న తీరు, సేవలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కలగాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాలకు మార్చి నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సందర్శన.. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు వారంలో మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ.. ఇలా ఈ మూడు కార్యక్రమాలను మార్చి నెలలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండు సార్లు వైద్యులు సందర్శిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 4 వేలు పైబడి జనాభా ఉన్న క్లినిక్‌లను నెలలో మూడు సార్లు సందర్శించేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో (ఎస్‌ఓపీ) పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం అంశాలను చేర్చామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి బాధితులకు వైద్యం అందించడంలో భాగంగా స్క్రీనింగ్, చికిత్సలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం
ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మార్చి 1 నుంచి ఆస్పత్రులను సందర్శించడం ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ ఆధీకýృత మందులు, సర్జికల్స్ మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ఇప్పటికే కొనసాగుతోంది. ఇందులో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిదిద్దుకుని మార్చి 1వతేదీ తరువాత పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసేలా సన్నద్ధం కావాలి.
సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత గుర్తింపు
గ్రామ సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత బాధితులను గుర్తించి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్తహీనత నివారణకు వైద్యం, పౌష్టికాహారపరంగా అన్ని చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. డేటా అనుసంధానాన్ని సమర్థంగా చేపట్టాలి. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు పరస్పరం అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు బీ–12 సబ్ లింగ్యువల్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలి.
పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య అంశాలు
పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కాలుష్యం తదితరాలకు సంబంధించి విలేజ్ క్లినిక్స్ సిబ్బంది సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండల స్థాయి అధికారులు, జేసీ, జిల్లా కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ దీనిపై సమీక్షించాలి. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పర్యవేక్షించాలి.
ఎన్‌సీడీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ
గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) నియంత్రణ, నివారణ, చికిత్సలపై దృష్టి సారించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నారో లేదో ఆరా తీయాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన పేషెంట్లు డిశ్చార్జి అనంతరం ఇంటికి చేరుకున్నాక ఏఎన్‌ఎంలు వారిని పరామర్శించి ఆస్పత్రి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
ఉద్దానం కిడ్నీ జబ్బులకు శాశ్వత పరిష్కారాలు
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బుల నివారణలో భాగంగా తాగునీటి కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పాలకొండ ప్రాంతంలో తాగునీటికి సుమారుగా రూ.265 కోట్లు వ్యయం చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండూ మార్చి కల్లా పూర్తవుతాయని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపుతోంది. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య నివారణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.
బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతమున్న, కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో ఈ ప³రికరాలు, చికిత్సలు ఉండాలి. గుండె జబ్బుల చికిత్స కేంద్రాలుండాలి. అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త బోధనాస్పత్రుల్లో ఇవి ఏర్పాటు కావాలి. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో క్యాన్సర్, కార్డియాక్ సదుపాయాలు ఉండాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె స్పెషాలిటీల్లో మరిన్ని పీజీ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారు. దంత సంరక్షణపై చిన్నారులు, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స అందించడంపై ఆలోచన చేయాలి. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి.
జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు
జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ ఐదు అవార్డులు సాధించినట్లు వైద్య, ఆర్యోగ్యశాఖ మంత్రి విడదల రజని, అధికారులు తెలియచేయగా సీఎం జగన్ వారిని అభినందించారు. రాష్ట్రీయ కిషోర స్వాస్త్యా కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)–స్కూల్, వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఇటీవల వైద్య శాఖకు లభించిన రెండు అవార్డులను సీఎం పరిశీలించారు. సమీక్షలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment