AP CM YS Jagan Mohan Reddy To Launch Family Doctor Programme On March 15 - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఫ్యామిలీ డాక్టర్లు రెడీ

Published Tue, Mar 7 2023 2:22 AM | Last Updated on Tue, Mar 7 2023 10:12 AM

CM Jagan High level review With Medical Health Department - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ఘట్టానికి సన్నాహాలు జరుగుతు­న్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి­ష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ఈ నెల 15వ తేదీ తరువాత పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేం­దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సోమ­వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌ రన్‌ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్‌ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌ రన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. 

రిఫరల్‌ సేవలను భాగం చేయండి     
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సేవలను ఫ్యామిలీ డాక్టర్‌ విధుల్లో భాగంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి ఇబ్బంది, సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కార్డులపై నెంబర్‌ ఉంచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కార్డులపై ముద్రించాలన్నారు.

రక్తహీనత బాధితుల వివరాలను వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు అనుసంధానించి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. 

పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం
ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల అదనపు నియామకాలు చేపట్టామని వివరించారు.

ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక డాక్టర్ల స్వల్పకాలిక సెలవుల సందర్భాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకు ఒక వైద్యుడిని అదనంగా నియమించామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. 

మరిన్ని ఔషధాలు.. టెస్టింగ్‌ కిట్లు.. రిజర్వు వాహనాలు
రాష్ట్రంలో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లకుగానూ ప్రతి చోటా ఒక కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో), ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అధికారులు చెప్పారు. విలేజ్‌ క్లినిక్స్, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల (ఎంఎంయూ)లో మందుల సంఖ్యను 67 నుంచి 105కి పెంచామన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు.

ప్రజలకు అందించే వైద్య సేవలను రియల్‌ టైమ్‌లో నమోదు చేసేందుకు టూల్స్‌ సిద్ధం చేశామన్నారు. 104 ఎంఎంయూలు ప్రస్తుతం 676 ఉండగా కొత్తగా 234 వాహనాలతో కలిపి మొత్తం 910 ఎంఎంయూలతో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి జిల్లాకు బ్యాక్‌ అప్‌ కింద మరో 104 ఎంఎంయూ వాహనాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు.

ఉదయం 9 నుంచి 4 గంటల వరకు.. 
ఫ్యామిలీ డాక్టర్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు. జనరల్‌ ఓపీ, జీవన శైలి జబ్బులు, గర్భవతుల ఆరోగ్య సంరక్షణ, అంగన్‌వాడీ, పాఠశాలల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యులు దృష్టి పెడతారని చెప్పారు.

మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడంతో పాటు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ లాంటి విధులన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్‌ నిర్వహిస్తారన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి జబ్బుల బాధితుల డేటా వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటాయన్నారు.

వీరికి ఫాలో అప్‌ వైద్య సేవలను అందించడం కోసం ఈ డేటాను వినియోగిస్తామన్నారు. 108 అంబులెన్స్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కండిషన్‌లో లేని వాహనాలను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా 108 అంబులెన్స్‌ వాహనాలు 146 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే ఎన్‌ఎంసీ అనుమతులు లభించాయని చెప్పారు.
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

మరో 35.42 లక్షల మందికి వైఎస్సార్‌ కంటి వెలుగు
సచివాలయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు
డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం మూడో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 24,65,300 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంటి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహించే  కార్యక్రమాన్ని తాజా సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు.

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి చికిత్స అందించే సంకల్పంతో కంటి వెలుగు కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 అక్టోబరు 10న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభమైంది. తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.

వీరిలో 1,58,227 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షల నిర్వహణ, చికిత్స ప్రారంభించారు. 24,65,300 మందికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేసి 8 లక్షల మందికిపైగా వృద్ధులకు కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు.

ఈ క్రమంలో మూడో విడతలో మిగిలిపోయిన 35.42 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కంటి స్క్రీనింగ్‌ పరీక్షలు  నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 376 బృందాలతో స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని చేపడతారు.  వచ్చే ఆగస్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

ఉచితంగా అత్యాధునిక వైద్యం..
వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గ్లూకోమా, డయాబెటిక్‌ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు, సిబ్బందికి శిక్షణ కోసం ఎల్‌.వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ను భాగస్వామిగా చేసుకున్నారు.  

సీఎం సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ప్రత్యేకాధికారి డాక్టర్‌ అశోక్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement