YSR Village Health Clinic
-
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'
పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్: ఈ ఫొటోలోని షేక్ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు. వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్‌నకు తీసుకెళ్లింది. వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్‌లో వైద్యులు చెప్పారని జీజీహెచ్‌కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు. నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్‌ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్సీ డాక్టర్ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది. సీఎం జగన్ సర్కార్ ఆరోగ్య భరోసా అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్ టెస్ట్‌లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం సురక్ష క్యాంప్‌లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం, సీహెచ్‌వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్ అందించారు. అడ్మిషన్ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు. గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్‌సీకి రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్‌కు రెఫర్ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని. నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్‌నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు. ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేశారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్‌లో స్పెషలిస్ట్ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్‌లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్ చెకప్ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్‌లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్‌కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్‌లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. – మొగల్ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్లతో క్యాంప్ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్ వస్తున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. – ఎస్.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా పెద్ద ఊరట కల్పించారు వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్ పెట్టారని వలంటీర్ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. – కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పీహెచ్సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి రెఫరల్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్‌ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. – డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్సీ, పల్నాడు జిల్లా నెలలో మండలంలో నాలుగు చోట్ల నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
ఇంటికే ‘ఆరోగ్యం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 95 శాతం జనాభాను పథకం పరిధిలోకి తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలో పథకం కింద రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పథకం, నాడు–నేడు, వైద్య శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కొత్త కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు పొందడానికి ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ఇప్పటికే పోస్టులను కొత్తగా సృష్టించిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2025–26లో మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సమగ్ర వివరాలతో బుక్లెట్ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్ మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చి ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా మనవారికి ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ క్రమంలో వచ్చే నెల 15 నుంచి ప్రారంభించే ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి పథకం గురించి సమగ్ర వివరాలతో బుక్లెట్ అందజేయాలి. ఆ బుక్‌లెట్‌ను చూస్తే పథకం సేవలను ఎలా పొందాలి? ఏ సేవలు ఉంటాయి? లాంటి అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ గురించి సవివరంగా తెలియజేయాలి. అనారోగ్యం బారినపడినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్న దానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ప్రజలు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స పొందాలో వివరించాలి. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పథకం సేవలపై యాప్ తీసుకొచ్చాం. ఒక్క యాప్ ద్వారానే కాకుండా కాల్ సెంటర్ల ద్వారా కూడా సేవలు పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. ► సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డా.మంజుల, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, సీఈవో హరేందిరప్రసాద్, సలహాదారు గోవిందహరి, ప్రత్యేకాధికారి అశోక్‌బాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, డీఎంఈ డాక్టర్ నరసింహం, నాడు–నేడు డైరెక్టర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమర్థంగా నిర్వహణ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం, పరికరాలు సమకూర్చడం ఎంత ముఖ్యమో వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలి. నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఒక విధానం తీసుకురావాలి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకుగాను ప్రభుత్వం నుంచి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతి తీసుకురావాలి. ఇలా చేయకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తేవాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఏర్పాట్ల పనులు పూర్తి కావాలి. పాలకొల్లు, పార్వతీపురం కళాశాలల పనులను మరింత వేగవంతం చేయాలి. ఫిర్యాదులు చేయడంపై అవగాహన ఉండాలి ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫిర్యాదులకు సంబంధించిన నెంబర్లను కూడా ప్రజలకు తెలియచెప్పాలి. నెట్వర్క్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఈ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలి. డిశ్చార్జ్ అయిన రోజే ‘ఆసరా’ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నాం. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలి. దీనికి కావాల్సిన ఎస్ఓపీని రూపొందించండి. -
ఏపీ వైద్య శాఖ విధానాలపై తమిళనాడు ఆసక్తి
సాక్షి, అమరావతి: ‘కార్పొరేట్’కు ధీటుగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ల క్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం వైద్యశాఖలో అనేక రకాల సంస్కరణలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ అమలుచేస్తున్న కార్యక్రమాలు పలు రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి అధికారులు ఇక్కడి కొచ్చి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్య యనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో మహారాష్ట్ర వైద్య బృందం రాష్ట్రానికి వచ్చి మన కార్యక్రమాలపై అధ్యయనం చేసి, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలును ప్రశంసించారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఏపీ విధానాలపై ఆసక్తి కనబరుస్తోంది. దేశంలోనే ఎక్కడాలేని రీతిలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరహా కార్యక్రమాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేప థ్యంలో.. తమిళనాడు హెల్త్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఎం. గోవిందరావు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించారు. గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెం గ్రామంలోని డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను సందర్శించారు. ఈ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, హెల్త్ క్లినిక్ సేవలను పరిశీలించారు. పేపర్ రహిత వైద్యసేవల కల్పనకు అవలంబిస్తున్న విధానాలను తెలుసుకు న్నా రు. విజయవాడ జీజీహెచ్, మంగళగిరి ఇందిరా నగర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఏబీడీఎం) అమలును పరిశీలించారు. ప్రజల వద్దకే డాక్టర్ వెళ్లడం బాగుంది తన పర్యటనలో ఏపీలోని ఆరోగ్య కార్యక్రమాల పరిశీలన అనుభవాలను గోవిందరావు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ అమలు విధానం చాలా బాగుందన్నారు. నెలలో రెండుసార్లు పీహెచ్సీ వైద్యులు గ్రామాల్లో ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించడం మంచి పరిణామమన్నారు. గామస్థాయిలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని కితాబిచ్చారు. మరోవైపు.. ఏబీడీఎం అమ ల్లో భాగంగా ఇక్కడి వైద్యశాఖ అనుసరిస్తున్న విధా నాలనూ తెలుసుకున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహా కార్యక్రమం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని వివరించారు. -
వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ తో ప్రజలకు ఆరోగ్య భరోసా
-
పల్లె చెంతకు వైద్యం
ఆ గుండెకు ధైర్యం.. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కె.సరోపరాణి హృద్రోగ బాధితురాలు. రెండున్నరేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి ప్రాణాన్ని కాపాడారు. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ బీపీ, షుగర్ పరీక్షించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. గతంలో ఐదు కి.మీ ప్రయాణించి కంకిపాడు లేదా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామంలోనే డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో సొంతూరిలోనే వైద్య సేవలు అందడం ఆమెకు ఎంతో ఊరటనిస్తోంది. ‘గుండె జబ్బు బారిన పడ్డాక నేను కూలికి వెళ్లట్లేదు. మా అబ్బాయి సంపాదనే ఆధారం. వ్యయ ప్రయాసలకు భయపడి గతంలో వైద్య పరీక్షలకు వెళ్లకుండా చాలాసార్లు నిర్లక్ష్యం చేశా. ఇప్పుడు గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. డాక్టర్ వచ్చి పరామర్శిస్తున్నారు’ అని సంతోషం వ్యక్తం చేసింది. (వడ్డే బాలశేఖర్ – వణుకూరు, బోళ్లపాడు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నెలకొల్పిన పది వేలకుపైగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా వై ద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రోగుల చెంతకే చేర్చింది. పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. చాపకింద నీరులా గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టే లక్ష్యంతో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున మండలానికి నలుగురు డాక్టర్లను నియమించి గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది. జీవన శైలి వ్యాధులను ఆదిలోనే గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చు. రక్తపోటు లాంటి వాటికి సకాలంలో చికిత్స చేయకుంటే నరాల జబ్బులు, కార్డియాక్ అరెస్టు, పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంది. డయాబెటిస్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుంటే కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. గ్రామీణులకు సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఇలాంటి వాటిని నియంత్రించడం సులభం అవుతుంది. ఇప్పుడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థలు సరిగ్గా అదే పని చేస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించడంతో స్థానికులతో మంచి అనుబంధం ఏర్పడుతోంది. అందరినీ గుర్తు పట్టి పేరుతో పిలిచేంత సన్నిహితంగా మసలుకుంటున్నారు. వారు సూచించిన విధంగా ఆహార అలవాట్లను మార్చుకోవడం, తగిన వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు పొందాలంటే గతంలో ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించాల్సి వచ్చేది. దూరాభారం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తోడుగా రావాల్సిందే! ఇప్పుడా కష్టాలు లేవు. టెలీమెడిసిన్ ద్వారా గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను సైతం గ్రామంలోని క్లినిక్స్ నుంచే పొందగలుగుతున్నారు. వారి సూచనల మేరకు మందులను సైతం ఉచితంగానే ఇస్తున్నారు. ఈ–సంజీవని ఓపీ యాప్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు టెలీమెడిసిన్ సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం రానివారు, విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, మంచానికే పరిమితం అయిన వారికి ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటి వద్దకే వెళ్లి మొబైల్ ద్వారా టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా వృద్ధులు, మహిళలకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ప్రకటించడం గమనార్హం. కృష్ణా జిల్లా వణుకూరు, బోళ్లపాడు గ్రామాల్లో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వణుకూరు విలేజ్ క్లినిక్–2 పరిధిలో 3,412 జనాభా ఉండగా 148 మంది బీపీ, 152 మంది షుగర్ బాధితులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ రెండు సమస్యలున్న బాధితులు 70 మంది ఉన్నారు. గర్భిణులు 18 మంది, బాలింతలు 10 మందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ రవికుమార్ గ్రామానికి వస్తున్నారు. మంచానికే పరిమితం అయిన 12 మంది బాధితులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. బోళ్లపాడులో 1,600 మందికిపైగా వైద్య సేవలు అందుతున్నాయి. 12 రకాల వైద్య సేవలు.. 14 పరీక్షలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పింది. వీటిల్లో వైద్య సేవలు అందించేందుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకం చేపట్టి సీహెచ్‌వో హోదా కల్పించింది. వీరితో పాటు సచివాలయాల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నారు. క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,692 కోట్లు వెచ్చించింది. ప్రతి విలేజ్ క్లినిక్‌కు శాశ్వత భవనాలను సమకూర్చారు. గ్రామ స్థాయిలో పటిష్ట వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులో విలేజ్ క్లినిక్‌లే కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్ యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యులు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. విలేజ్ క్లినిక్‌లోనే ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 10,032 విలేజ్ క్లినిక్స్‌ను ఇప్పటివరకూ 2.05 లక్షల సార్లు వైద్యులు సందర్శించారు. 1.70 కోట్లకు పైగా సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నమోదు అయ్యాయి. గ్రామ స్థాయిలోనే వైద్య సేవల కల్పనకు ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో చాలా వరకు ఆరోగ్య సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం లభిస్తోంది. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించగలుగుతున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సేవలు ఇలా ► గర్భిణులు, చిన్నారుల సంరక్షణ ► నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ ► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సేవలు ► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు ► జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ ► అంటువ్యాధుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ► సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ ► ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యలపై జాగ్రత్తలు ► దంత ఆరోగ్య సంరక్షణ ► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు ► కాలిన గాయాలు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు ► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన 7.12 కోట్ల ఓపీలు నమోదు 2020లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకూ 7,12,08,533 ఓపీ సేవలు నమోదు అయ్యాయి. వివిధ సమస్యలతో క్లినిక్స్‌కు వచ్చిన బాధితులకు డాక్టర్ సలహాల కోసం 3 కోట్ల టెలీ కన్సల్టేషన్లు నిర్వహించారు. ప్రస్తుతం ఒక్కో క్లినిక్‌లో రోజుకు సగటున 30 నుంచి 40 వరకూ ఓపీలు, 10 వైద్య పరీక్షలు, 10 టెలీ కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి. రోజంతా సరిపోయేది... నాకు బీపీ, షుగర్ సమస్య ఉంది. గతంలో 15 రోజులకు ఒకసారి విజయవాడ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. ఒక రోజంతా సరిపోయేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. గ్రామంలోనే క్లినిక్‌కు రెండు వారాలకు ఒకసారి వెళ్తున్నా. అక్కడ ఇచ్చే మందులు బాగా పనిచేస్తున్నాయి. – ఎం.రాణి, వణుకూరు, కృష్ణా జిల్లా వ్యయప్రయాసలు తొలిగాయి వయసు మళ్లడంతో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వారాలకు ఒకసారి విలేజ్ క్లినిక్‌కు వస్తుంటా. బీపీ, షుగర్ చెక్ చేయించుకుని దగ్గుకు మందులు తీసుకుంటున్నా. గతంలో పీహెచ్‌సీకి వెళ్లాలంటే ఆటో, బైక్‌లపై వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామానికే పీహెచ్సీ డాక్టర్ వస్తున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటుతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. అవసరమైతే కంప్యూటర్లో పెద్ద డాక్టర్‌తో మాట్లాడిస్తున్నారు. – కె. మధు, వణుకూరు, కృష్ణా జిల్లా రోజుకు 40 ఓపీలు గ్రామస్తులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ప్రస్తుతం విలేజ్ క్లినిక్కే వస్తున్నారు. ఇక్కడ రోజుకు 40 వరకూ ఓపీలు నమోదవుతుంటాయి. 30 ఏళ్లుపైబడిన వారందరికీ జీవనశైలి జబ్బుల స్క్రీనింగ్ చేశాం. బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వారికి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా రెగ్యులర్ హెల్త్ చెకప్ జరిగేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. – యామిని, సీహెచ్‌వో వణుకూరు–2 వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా నైపుణ్యాలపై శిక్షణ.. ఇంజెక్షన్లు ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, కుట్లు వేయడం, కట్లు కట్టడం లాంటి ప్రాథమిక చికిత్స విధానాల్లోని నైపుణ్యాలపై మాకు ఇటీవలే శిక్షణ ఇచ్చారు. పీహెచ్సీ వైద్యుడి సూచన మేరకు సెలైన్, ఇంజెక్షన్లు చేయడం లాంటి విధులను నేను ప్రధానంగా నిర్వహిస్తున్నా. – శివకృష్ణ, సీహెచ్‌వో బోళ్లపాడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా సీహెచ్‌వోలకు ప్రత్యేక శిక్షణ గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులోకి వచ్చాయి. సీహెచ్వోల్లో నైపుణ్యాల పెంపు ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా వైద్య సంరక్షణ అందించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి వారికి శిక్షణ ఇచ్చాం. ఇంజెక్షన్ చేయడం, కుట్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, పాము కాట్లు, గుండె పోటు సందర్భాల్లో అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాం. జబ్బులు రాకముందే నివారించడం ఎంతో కీలకం. ప్రపంచాన్ని వేధిస్తున్న జీవన శైలి జబ్బులతోపాటు ఇతర రుగ్మతలను నివారించడంలో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబమంతా.. గ్రామంలోనే వైద్యం గతంలో వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కాటూరు, ఉయ్యూరు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఆర్ఎంపీలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ప్రతి నెల ఒకటో శుక్రవారం, మూడో శనివారం పీహెచ్సీ డాక్టరమ్మ మా ఊరికే వస్తోంది. నాకు బీపీ, గ్యాస్ సమస్య ఉంది. ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా క్లినిక్కే వెళ్తున్నాం. – వీర వెంకటేశ్వరరెడ్డి, బోళ్లపాడు, కృష్ణా జిల్లా ఇంటి పక్కనే నిశ్చింతగా.. ఉయ్యూరు మండలం బోళ్లపాడుకు చెందిన వి.శ్రీదేవి కొన్నేళ్లుగా బీపీ, గ్యాస్ సమస్యతో బాధపడుతోంది. 1,624 మంది జనాభా నివసించే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు కావడంతో శ్రీదేవి రెండున్నరేళ్లుగా అక్కడే వైద్యం, మందులు ఉచితంగా అందుకుంటోంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) బీపీ, షుగర్ పరీక్షలు చేసిన తరువాత టెలీ మెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుడితో ఆన్లైన్లో మాట్లాడుతోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కాటూరు పీహెచ్ డాక్టర్ నెలకు రెండు సార్లు విలేజ్ క్లినిక్‌కు వస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ‘గతంలో హెల్త్ చెకప్, మందుల కోసం వెళ్లాలంటే ఓ ప్రహసనమే. కుటుంబ సభ్యుల్లో ఎవరో కచ్చితంగా తోడుండాల్సిందే. ఇప్పుడా సమస్య లేదు. మా ఇంటి పక్కనే విలేజ్ క్లినిక్ ఉంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక భయం లేదు’ అని శ్రీదేవి నిశ్చింతగా చెబుతోంది. -
విలేజ్ క్లినిక్ లలో ఏఎన్ఎంల సేవలు మరువరానివి
-
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 105 రకాల మందులు
సాక్షి, అమరావతి: ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ), లెప్రసీ, థైరాయిడ్ సహా పలు వ్యాధులతో బాధపడేవారు మందుల కోసం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల కోసం వెళ్లాల్సిన తిప్పలు తప్పనున్నాయి. ఈ తరహా వ్యాధులకు వాడే మందులను ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులో ఉండే మందుల రకాలను 67 నుంచి 105కు పెంచింది. పెంచిన రకాల మందులను అన్ని విలేజ్ క్లినిక్స్‌కు పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామీణులకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తూ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 10,032 విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)ను ప్రతి క్లినిక్‌లో నియమించారు. ఈ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లోనే 12 రకాల వైద్య, 14 రకాల నిర్ధారణ పరీక్షలను అందబాటులోకి తెచ్చారు. టెలీమెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, పీహెచ్సీ వైద్యుడి కన్సల్టేషన్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో రోజుకు సగటున ఒక్కో క్లినిక్‌లో 20 నుంచి 30 ఓపీలు నమోదవుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పల్లె ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రతి విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండుసార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. రోజంతా ఆ గ్రామంలో ఉండి ఓపీలు నిర్వహించడంతో పాటు, మంచానికే పరిమితమైన వారికి కూడా వైద్యం చేస్తున్నారు. చదవండి: జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు దీంతోపాటు మిగిలిన రోజుల్లో టెలీమెడిసిన్ కన్సల్టేషన్‌లో వైద్యులు వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలున్న వారికి మందులను ప్రిస్క్రెబ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మందులు క్లినిక్స్‌లో అందుబాటులో లేకపోతే బాధితులు ప్రత్యేకంగా మందుల కోసం 5–10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ, అంతకంటే దూరంలో ఉండే ఏపీవీవీపీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడానికి విలేజ్ క్లినిక్స్‌లోనే అదనంగా 38 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. -
క్షేత్రస్థాయిలో విజయవంతంగా ఫామిలీ ఫిజీషియన్ పథకం
-
Andhra Pradesh: ఆందోళన వద్దు.. ఇక మీ ఇంటికే డాక్టర్ వస్తాడు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ఘట్టానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈ నెల 15వ తేదీ తరువాత పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రిఫరల్ సేవలను భాగం చేయండి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి ఇబ్బంది, సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కార్డులపై నెంబర్ ఉంచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కార్డులపై ముద్రించాలన్నారు. రక్తహీనత బాధితుల వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు అనుసంధానించి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల అదనపు నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక డాక్టర్ల స్వల్పకాలిక సెలవుల సందర్భాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకు ఒక వైద్యుడిని అదనంగా నియమించామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. మరిన్ని ఔషధాలు.. టెస్టింగ్ కిట్లు.. రిజర్వు వాహనాలు రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకుగానూ ప్రతి చోటా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అధికారులు చెప్పారు. విలేజ్ క్లినిక్స్, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ)లో మందుల సంఖ్యను 67 నుంచి 105కి పెంచామన్నారు. విలేజ్ క్లినిక్స్‌లో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలకు అందించే వైద్య సేవలను రియల్ టైమ్‌లో నమోదు చేసేందుకు టూల్స్ సిద్ధం చేశామన్నారు. 104 ఎంఎంయూలు ప్రస్తుతం 676 ఉండగా కొత్తగా 234 వాహనాలతో కలిపి మొత్తం 910 ఎంఎంయూలతో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి జిల్లాకు బ్యాక్ అప్ కింద మరో 104 ఎంఎంయూ వాహనాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు.. ఫ్యామిలీ డాక్టర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు. జనరల్ ఓపీ, జీవన శైలి జబ్బులు, గర్భవతుల ఆరోగ్య సంరక్షణ, అంగన్వాడీ, పాఠశాలల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యులు దృష్టి పెడతారని చెప్పారు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడంతో పాటు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ లాంటి విధులన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ నిర్వహిస్తారన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి జబ్బుల బాధితుల డేటా వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటాయన్నారు. వీరికి ఫాలో అప్ వైద్య సేవలను అందించడం కోసం ఈ డేటాను వినియోగిస్తామన్నారు. 108 అంబులెన్స్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కండిషన్లో లేని వాహనాలను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 146 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే ఎన్ఎంసీ అనుమతులు లభించాయని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 35.42 లక్షల మందికి వైఎస్సార్ కంటి వెలుగు సచివాలయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మూడో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 24,65,300 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంటి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తాజా సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి చికిత్స అందించే సంకల్పంతో కంటి వెలుగు కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 అక్టోబరు 10న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభమైంది. తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,58,227 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షల నిర్వహణ, చికిత్స ప్రారంభించారు. 24,65,300 మందికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేసి 8 లక్షల మందికిపైగా వృద్ధులకు కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో మూడో విడతలో మిగిలిపోయిన 35.42 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 376 బృందాలతో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడతారు. వచ్చే ఆగస్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం.. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గ్లూకోమా, డయాబెటిక్ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు, సిబ్బందికి శిక్షణ కోసం ఎల్.వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ను భాగస్వామిగా చేసుకున్నారు. సీఎం సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ప్రత్యేకాధికారి డాక్టర్ అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆరోగ్య సేవలు సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు వంద శాతం 24 గంటలపాటు పనిచేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఆ తరువాత స్థానంలో సిక్కిం నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహాలో నూటికి నూరు శాతం పీహెచ్‌సీలు నిరంతరం సేవలందించడం లేదని ఇటీవల తెలిపింది. ఏపీలో 100 శాతం.. దేశంలో 45.1 శాతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా అవన్నీ నూటికి నూరు శాతం 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సిక్కింలో 24 పీహెచ్సీలుండగా 24 గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 24,935 పీహెచ్సీలుండగా 11,250 పీహెచ్‌సీలు మాత్రమే (45.1 శాతం) 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచేందుకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్– 2022ను నిర్దేశించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, మందులు తదితరాలకు సంబంధించిన నిబంధనలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మూడున్నరేళ్లలో పెను మార్పులు.. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లలో ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 – 20 నుంచి 2021 – 22 మధ్య మూడేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున ఆస్పత్రులు ఏర్పాటైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 11,480 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20,781 సబ్ హెల్త్ సెంటర్లు ఉండగా రాజస్థాన్‌లో 13,589 సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఇక ఏపీలో మూడున్నరేళ్లలో కొత్తగా 304 పీహెచ్‌సీలు ఏర్పాటు కాగా మరో 179 కేంద్రాల పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. 47 వేలకుపైగా పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్ల సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ లేకుండా రికార్డు స్థాయిలో 47 వేలకుపైగా పోస్టులను వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేశారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న వైద్య కళాశాలల ఆధునికీకరణ చేపట్టారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,222.85 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రజలకు ఆరోగ్య ధీమాను కల్పిస్తున్నారు. -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ క్లినిక్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్‌వోల) పనితీరును ప్రతినెలా సమీక్షించనున్నారు. ఇందుకు అనుగుణంగా సూచీలను ఖరారు చేశారు. ఆయా సూచీల్లో సీహెచ్‌వోలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరును అంచనా వేస్తారు. గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని సీహెచ్‌వోలుగా నియమించింది. 14 అంశాల ఆధారంగా.. సీహెచ్‌వోలు ప్రజలకు అందించే సేవలతోపాటు వారి పనితీరును అంచనా వేయడానికి 14 అంశాలను ఖరారు చేశారు. ఈ అంశాల్లో నెల రోజుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా వేస్తారు. సాధారణంగా సీహెచ్‌వోలకు వైద్య శాఖ నెలకు రూ.15 వేల వరకూ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకం అందించడానికి పనితీరు అంచనాలను ప్రామాణికంగా తీసుకుంటారు. విలేజ్ క్లినిక్ పరిధిలోని ప్రజలకు ఓపీ, టెలీ మెడిసిన్ సేవల కల్పన, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, వీరికి కౌన్సెలింగ్ చేయడం, ఆర్సీహెచ్ పోర్టల్‌లో చిన్నారుల రిజిస్ట్రేషన్, ఏడాదిలోపు పిల్లలకు ఫుల్ ఇమ్యూనైజేషన్, ఎన్సీడీ సర్వే పురోగతి వంటి 14 అంశాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా ఉంటుంది. 12 రకాల వైద్య సేవలు విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు 12 రకాల వైద్య, 14 రకాల పరీక్షల సేవలు అందిస్తోంది. 67 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. టెలీ మెడిసిన్ ద్వారా పీహెచ్సీ వైద్యుడితోపాటు హబ్‌లోని జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలు ప్రజలకు అందుతున్నాయి. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు విలేజ్ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. -
Andhra Pradesh: టెలీమెడిసిన్‌లో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి వెనువెంటనే నాణ్యమైన వైద్య సేవలందించాలన్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టెలీమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేశారు. ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో టెలీమెడిసిన్ సేవల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. టెలీమెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరుకి దేశవ్యాప్తంగా 6.03 కోట్ల మంది రోగులకు టెలీమెడిసిన్ సేవలందిస్తే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1.86 కోట్ల మంది రోగులకు ఈ సేవలందినట్లు ఆ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. అంటే దేశం మొత్తం అందించిన టెలీమెడిసిన్ సేవల్లో 30.84 శాతం ఒక్క ఏపీలోనే అందించినట్లు. పశ్చిమబెంగాల్లో 86.69 లక్షల మందికి, తమిళనాడులో 67.22 లక్షల మందికి ఈ సేవలందించినట్లు పేర్కొంది. అత్యున్నతం.. ఏపీ టెలీమెడిసిన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టెలీమెడిసిన్ విధానాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోగులకు స్పెషలిస్టు సేవలు అందుతున్నాయి. హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు. పీహెచ్‌సీలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. వైద్యులు ఆడియో, వీడియో కాల్లో రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. ఏ మందులు వాడాలో కూడా సూచిస్తారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు, మరో వైపు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ –సంజీవని (ఓపీడీ)యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్య సేవలను పొందుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 42వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలీమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. ప్రసూతి వేళ అందిన సేవలు మరువలేనివి నాకు ప్రసూతి వేళలో టెలీమెడిసిన్ విధానంలో అందిన సేవలు మరువలేనివి. స్థానిక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ సింగంపల్లి సంధ్య ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఆమె నేరుగా వీడియోకాల్ ద్వారా గైనకాలజిస్టును అనుసంధానం చేసేవారు. గైనకాలజిస్టు నిండిన నెలల ఆధారంగా నాకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు సూచించేవారు. తీసుకోవలసిన ఆహారం, వేసుకోవలసిన మందులు చెప్పేవారు. పరీక్షల కోసం ఎంఎల్‌హెచ్‌పీ స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్ళేవారు. టెలీమెడిసిన్ సహకారంతో డిసెంబర్లో పండంటి ఆడ శిశువును కన్నాను. మాది మధ్య తరగతి కుటుంబం. కార్పొరేట్ వైద్యాన్ని భరించే స్థోమత లేదు. టెలీమెడిసిన్ ద్వారా అంతకుమించిన నాణ్యమైన వైద్యాన్ని అందుకున్నాను. ఈ సేవలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. –కుడుపూడి నాగశ్రీ, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్ -
ముంగిటకే వైద్యం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ప్రారంభమయ్యాక వైద్యుడితోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్స్‌ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో మందులు, ర్యాపిడ్ కిట్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించేలా ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్ కిట్లు సమకూరుస్తున్నారు. -
ప్రజారోగ్యం బలోపేతం.. మూడు కీలక కార్యక్రమాల అమలుకు సన్నద్ధం
సచివాలయ సిబ్బంది తరహాలోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. విలేజ్ క్లినిక్స్ ఆవశ్యకత, సిబ్బంది అందుబాటులో ఉంటున్న తీరు, సేవలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కలగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాలకు మార్చి నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సందర్శన.. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు వారంలో మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ.. ఇలా ఈ మూడు కార్యక్రమాలను మార్చి నెలలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండు సార్లు వైద్యులు సందర్శిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 4 వేలు పైబడి జనాభా ఉన్న క్లినిక్‌లను నెలలో మూడు సార్లు సందర్శించేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో (ఎస్ఓపీ) పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం అంశాలను చేర్చామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి బాధితులకు వైద్యం అందించడంలో భాగంగా స్క్రీనింగ్, చికిత్సలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మార్చి 1 నుంచి ఆస్పత్రులను సందర్శించడం ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ ఆధీకýృత మందులు, సర్జికల్స్ మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ఇప్పటికే కొనసాగుతోంది. ఇందులో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిదిద్దుకుని మార్చి 1వతేదీ తరువాత పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసేలా సన్నద్ధం కావాలి. సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత గుర్తింపు గ్రామ సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత బాధితులను గుర్తించి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్తహీనత నివారణకు వైద్యం, పౌష్టికాహారపరంగా అన్ని చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. డేటా అనుసంధానాన్ని సమర్థంగా చేపట్టాలి. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు పరస్పరం అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు బీ–12 సబ్ లింగ్యువల్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య అంశాలు పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కాలుష్యం తదితరాలకు సంబంధించి విలేజ్ క్లినిక్స్ సిబ్బంది సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండల స్థాయి అధికారులు, జేసీ, జిల్లా కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ దీనిపై సమీక్షించాలి. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. ఎన్సీడీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) నియంత్రణ, నివారణ, చికిత్సలపై దృష్టి సారించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నారో లేదో ఆరా తీయాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన పేషెంట్లు డిశ్చార్జి అనంతరం ఇంటికి చేరుకున్నాక ఏఎన్ఎంలు వారిని పరామర్శించి ఆస్పత్రి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఉద్దానం కిడ్నీ జబ్బులకు శాశ్వత పరిష్కారాలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బుల నివారణలో భాగంగా తాగునీటి కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పాలకొండ ప్రాంతంలో తాగునీటికి సుమారుగా రూ.265 కోట్లు వ్యయం చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండూ మార్చి కల్లా పూర్తవుతాయని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపుతోంది. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య నివారణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతమున్న, కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో ఈ ప³రికరాలు, చికిత్సలు ఉండాలి. గుండె జబ్బుల చికిత్స కేంద్రాలుండాలి. అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త బోధనాస్పత్రుల్లో ఇవి ఏర్పాటు కావాలి. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో క్యాన్సర్, కార్డియాక్ సదుపాయాలు ఉండాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె స్పెషాలిటీల్లో మరిన్ని పీజీ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారు. దంత సంరక్షణపై చిన్నారులు, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స అందించడంపై ఆలోచన చేయాలి. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ ఐదు అవార్డులు సాధించినట్లు వైద్య, ఆర్యోగ్యశాఖ మంత్రి విడదల రజని, అధికారులు తెలియచేయగా సీఎం జగన్ వారిని అభినందించారు. రాష్ట్రీయ కిషోర స్వాస్త్యా కార్యక్రమం (ఆర్కేఎస్కే)–స్కూల్, వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఇటీవల వైద్య శాఖకు లభించిన రెండు అవార్డులను సీఎం పరిశీలించారు. సమీక్షలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
విలేజ్ క్లినిక్స్ కేంద్రంగా కరోనా కట్టడి.. సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కేంద్రంగా గ్రామ స్థాయిలోనే సమర్థంగా కరోనా నివారణ, నియంత్రణ, చికిత్స చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట నిర్వహణ విధానాలు (ఎస్వోపీ) రూపొందించాలని అధికారులకు సూచించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, మెడికేషన్, ఇతర సేవలు విలేజ్ క్లినిక్‌ల స్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు ముందస్తు సన్నద్ధత, ఇతర అంశాలపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. విస్తృత అవగాహన.. సదుపాయాల తనిఖీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్‌లు పని చేయాలి. వీటిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, ఇతర కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు మళ్లీ విస్తృత అవగాహన కలిగించాలి. కరోనా అనుమానిత లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం, ఇతర సమస్యలున్న వారికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృత తనిఖీలు చేపట్టాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సన్నద్ధత అవసరం. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ సామర్థ్యంపై మరోసారి సమీక్షించాలి. అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో ఉంచాలి. కోవిడ్ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్‌కు రిఫర్ చేసేలా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు చర్యలు తీసుకోవాలి. జనవరి 26 నాటికి అన్ని చోట్లా పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పుతున్నాం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలి. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన పార్వతీపురం కళాశాల సహా ఇంకా ప్రారంభం కాని చోట్ల పనులను వెంటనే ప్రారంభించాలి. వచ్చే జనవరి 26వతేదీ నాటికి పార్వతీపురంతో సహా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా చేపడుతున్న అన్ని వైద్య కళాశాలల నిర్మాణ పనులు మొదలవ్వాలి. జనవరి 26 నాటికి అన్ని విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కావాలి. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండేలా ఎస్‌వోపీలు రూపొందించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలి. 104 ఎంఎంయూ సేవల తనిఖీ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కోసం అవసరమైన అదనపు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ) వాహనాలను జనవరి 26 నాటికి సిద్ధం చేసుకోవాలి. 104 సేవలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్‌కు సంబంధించిన యాప్ ఏఎన్ఎం, ఆరోగ్యమిత్రతో సహా అందరికీ అందుబాటులో ఉండాలి. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో ఫాలో అఫ్ మెడిసిన్ అందుతుందా లేదా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏఎన్ఎంలు ఫీడ్ బ్యాక్ తీసుకునే సమయంలో దీన్ని తెలుసుకోవాలి. కోవిడ్ కట్టడికి సన్నద్ధత ఇలా... కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 కేసులేవీ ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదు కాలేదని సమీక్ష సందర్భంగా అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్లు, మందులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం 13 ల్యాబ్‌లు అందుబాటులో ఉండగా అన్ని చోట్లా సిబ్బంది ఉన్నారని వివరించారు. వీటి ద్వారా రోజుకు 30 వేల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. మరో 19 చోట్ల టెస్టింగ్ ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని అవి కూడా అందుబాటులోకి వస్తే రోజుకు 60 వేల నుంచి 80 వేల వరకూ పరీక్షలు నిర్వహించే వీలుంటుందన్నారు. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని చెప్పారు. వైద్యులు, సిబ్బంది భర్తీ, ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ అమలు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నాడు – నేడు కార్యక్రమం పురోగతి తదితరాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరోనాపై అప్రమత్తం.. రాష్ట్రంలో అదుపులోనే వైరస్
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కోవడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేస్తున్నారు. గడచిన 50 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,440 నమూనాలను పరీక్షించగా.. కేవలం 130 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన పాజిటివ్ రేటు 0.42 శాతంగా ఉంది. విలేజ్ క్లినిక్‌లలోనే పరీక్షలు గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలోనే ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 10 టెస్టింగ్ కిట్స్‌ను వైద్య శాఖ అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 29 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. వేరి యంట్ల గుట్టురట్టు చేసే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సౌకర్యం కూడా మన వద్ద ఉంది. 34 వేల ఆక్సిజన్ బెడ్స్ రెడీ కరోనా కేసులు ఎక్కువగా నమోదైనా ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రుల్లో బెడ్స్ నిరంతరం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,292 జనరల్ బెడ్స్, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ, 54 వేల క్వారంటైన్ పడకలు ఉన్నాయి. దీంతోపాటు 5,813 వెంటిలేటర్లు, 5,610 పీడియాట్రిక్, 297 నియోనటల్ వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆక్సిజన్ సరఫరాకు ఎటువంటి కొరత లేదు. 170 పీఎస్ఏ ప్లాంట్లు, డీ–టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ ద్వారా ఆస్పత్రుల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అందించేలా వసతులు ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికీ రెండు డోసులు పూర్తి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రి య పూర్తయింది. మరోవైపు హెల్త్‌కేర్ వర్కర్లకు 100 శాతం, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 93 శాతం మందికి, 60 ఏళ్లు పైబడిన జనా భాలో 73 శాతం, 18 నుంచి 59 ఏళ్ల వారిలో 33 శాతం మందికి ప్రికాషన్ డోసు కూడా అందింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ మొదటి డోసు పూర్తవగా, మొదటి డోసు వేసుకున్న 15 నుంచి 17 ఏళ్ల వారికి 99.7 శాతం, 12 నుంచి 14 ఏళ్ల వారిలో 98.17 శాతం మందికి రెండో డోసు కూడా వేశారు. ఆందోళన అవసరం లేదు కరోనా వ్యాప్తిపై వార్తలను చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. కావాల్సిన వైద్య సదుపాయాలు, టెస్టింగ్, క్వారంటైన్ వసతులు మన దగ్గర మెరుగ్గా ఉన్నాయి. క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి ఇలా వరుసగా సెలవు దినాలు, పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే చాలు. –జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం -
Family Doctor: పల్లె తలుపు తట్టి.. ప్రజల నాడి పట్టి..
(చిట్యాల, వేములపల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) ‘‘ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి మందులు వాడుతున్నారా?’’ ‘‘బాగానే ఉంది..’’ సైగల ద్వారా కోటేశ్వరరావు సమాధానం. ‘‘పెద్ద డాక్టర్ రాసిచ్చిన మందులతో పాటు పోయినసారి మీరిచ్చిన బీపీ మందులు సమయానికి ఇస్తున్నామమ్మా.. ఫర్వాలేదు.. నా బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది’’ ఇదీ.. తమ ఇంటికే వచ్చి పరామర్శిస్తున్న డాక్టర్‌తో ఆనందంగా కోటేశ్వరరావు తల్లి నాగమ్మ సమాధానం. ‘‘సరే.. గుండె కొట్టుకోవడం, పల్స్ రేట్, బీపీ, షుగర్.. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న మందులు అలానే కొనసాగించండి. ఏదైనా సమస్య వస్తే సిబ్బందిని సంప్రదించండి. లేదంటే నాకు ఫోన్ చేయండి. ధైర్యంగా ఉండండి..’’ డాక్టర్ భరోసా. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో ఉన్న ఊరికే వైద్యులు వచ్చి ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగాయని గ్రామీణ ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓపీ (అవుట్ పేషంట్) సేవలు అందించి, ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే సరికొత్త కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ 21న వైద్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ సుష్మ ప్రియదర్శిని చిట్యాల గ్రామంలో నివసించే పక్షవాత బాధితుడు కోటేశ్వరరావు ఇంటిని నెలకు ఒకసారి సందర్శిస్తున్నారు. ‘గతంలో బీపీ, షుగర్ పరీక్షల కోసం ఆస్పత్రికి ప్రత్యేకంగా ఆటోలో వెళ్లాల్సి రావడంతో డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు’ అని ఆ కుటుంబం చెబుతోంది. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వి.కృష్ణ గత ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కాలు విరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి ఉచితంగా మందులతో పాటు మూడు నెలల విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.12,500 ఆర్థిక సాయం చేసింది. పీహెచ్సీ డాక్టర్ ఇంటికే వెళ్లి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కె.లక్ష్మి ఐదు నెలల గర్భిణి. గతంలో వైద్య పరీక్షల కోసం ప్రతి నెల 9వ తేదీన పెండ్యాల పీహెచ్‌సీకి వెళ్లేది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా అవసరమైతే గ్రామంలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌కు వెళ్లేది. అయితే ప్రస్తుతం నెలలో రెండు రోజులు పీహెచ్సీ వైద్యురాలు గ్రామానికే వస్తున్నారు. ఆమెకే కాకుండా విలేజ్ క్లినిక్ పరిధిలోని 21 మంది గర్భిణులకు వైద్య సేవలు ఇంటి వద్దే అందుతున్నాయి. తొలగిన వ్యయ ప్రయాసలు దాదాపు 1,800 మంది నివసించే చిట్యాలలో 2019కి ముందు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం ఆరు కి.మీకి పైగా ప్రయాణించి వత్సవాయి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వచ్చేది. స్పెషలిస్ట్ డాక్టర్ కోసం 30 కి.మీ పైగా దూరంలో ఉండే నందిగామ లేదంటే 80 కి.మీ పైనే ఉన్న విజయవాడకు వెళ్లక తప్పదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 67 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తుంది. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామానికే వస్తున్నారు. గ్రామంలో 239 మంది బీపీ, షుగర్ బాధితులున్నారు. 13 మంది గర్భిణులు, ఏడుగురు బాలింతలు, 18 మంది అనీమియా బాధితులకు డాక్టర్ సేవలు అందుతున్నాయి. వేములపల్లిలో 220 మంది బీపీ, షుగర్ బాధితులు, 21 మంది గర్భిణులు, 9 మంది బాలింతలకు పీహెచ్సీ డాక్టర్ నెలలో రెండు దఫాలు గ్రామానికే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వేములపల్లిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులు అంగన్వాడీలు, స్కూళ్లకు కూడా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులకు ఆయా పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. ఒక్కో సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు సందర్శించి గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 104 ఎంఎంయూతో పాటు వెళ్లి విలేజ్ క్లినిక్‌లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ గ్రామంలో మంచానికే పరిమితం అయిన వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాత బాధితులు, ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించి అవసరమైన సేవలు అందచేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 12.72 లక్షల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ అక్టోబర్ 21న ప్రారంభం కాగా ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 7,166 విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండుసార్లు, 2,866 క్లినిక్‌లను నెలలో ఒకసారి సందర్శిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 12,72,709 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు. ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర ధీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్‌బీ) పెద్ద భారం తప్పింది నాకు 72 ఏళ్లు. నడుము నొప్పి ఉంది. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలను. బీపీ, షుగర్‌కు నెల నెలా డాక్టర్‌కు చూపించుకునేందుకు నా కుమార్తె పట్ణణానికి తీసుకెళ్లేది. ఇప్పుడు వేములపల్లెకు ప్రభుత్వ డాక్టర్ నెలకు రెండు సార్లు వస్తున్నారు. డాక్టరమ్మ బాగా చూస్తోంది. మందులు రాసిచ్చింది. దగ్గరే కాబట్టి ఒక్కదాన్నే వస్తున్నా. పెద్ద భారం తొలగింది. లేదంటే నా కుమార్తె రోజంతా తన పని వదులుకోవాల్సి వచ్చేది. – వసంత నాగేంద్రమ్మ, ఎస్.అమరవరం, ఎన్టీఆర్ జిల్లా బాలింతకు వైద్య సేవలు.. ఇటీవల పాప పుట్టింది. నాకు పుట్టుకతోనే ఫిట్స్ సమస్య ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవానికి నిరాకరించడంతో వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ విజయవాడకు రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు కాన్పు చేశారు. ఫిట్స్ సమస్యకు కూడా వైద్యం చేశారు. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాక వైద్యులు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అవసరమైన మందులిస్తున్నారు. – అద్దంకి మౌనిక, చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా కొత్త అనుభూతి.. నెలలో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్లాలో మాకు ముందుగానే టైమ్ టేబుల్ నిర్దేశించారు. ఉదయమే 104 ఎంఎంయూతో పాటు గ్రామానికి వెళ్తాం. ముందు రోజే సంబంధిత గ్రామ ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సమాచారం ఇస్తారు. ప్రజల వద్దకే వెళ్లి సేవ చేస్తుండటం ఓ కొత్త అనుభూతి. – డాక్టర్ సుష్మ ప్రియదర్శిని, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా నిరంతరం సమీక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ విజయవంతంగా నడుస్తోంది. నిరంతర సమీక్షతో క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం. మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నాం. రోగులు, వైద్యం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర ‘ఆయుష్మాన్ భారత్’ డిజిటల్ ఖాతాల్లో నిక్షిప్తం అవుతుంది. – ఎం.టి.కృష్ణ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైద్య రంగంలో సమూల మార్పులు ఒకప్పుడు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ వైద్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఆ పరిస్థితులను సీఎం జగన్ సమూలంగా రూపుమాపారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది, మందులు ఉండేవి కాదు. ఇప్పుడు విలేజ్ క్లినిక్‌ల ద్వారా 67 మందులు, 14 వైద్య పరీక్షలు, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాం. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైంది. త్వరలో ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు.. టాప్‌లో ఏపీ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది. విలేజ్ క్లినిక్స్‌లో వివరాలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని సచివాలయాలను విభజిస్తున్నారు. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యను వివరించి సలహాలు, సూచనలు పొందవచ్చు. విలేజ్ క్లినిక్‌కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులను తీసుకోవచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు అవసరమైనవారు విలేజ్ క్లినిక్‌లో సంప్రదిస్తే టెలీ మెడిసిన్ ద్వారా ఆయా వైద్యులతో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) మాట్లాడిస్తారు. ప్రత్యేక యాప్ ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తోంది. సచివాలయాల వారీగా వలంటీర్ల క్లస్టర్ల ప్రాతిపదికన ప్రజల వివరాలను యాప్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (జీవన శైలి జబ్బులు) సర్వేలో భాగంగా వైద్య శాఖ ప్రజలను స్క్రీనింగ్ చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానిస్తున్నారు. యాప్‌లో వైద్యాధికారులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఎంఎల్‌హెచ్‌పీలు, సచివాలయ ఏఎన్ఎంలు.. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లాగిన్ ఉంటుంది. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు రోగి ఏ క్లస్టర్ పరిధిలో ఉంటారో చెబితే చాలు దాని ఆధారంగా ఎన్సీడీ సర్వేతో సహా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు. ఆ వివరాలతో పాటు అవసరమైన మందులను కూడా యాప్‌లో నమోదు చేస్తారు. మందుల ప్రిస్క్రిప్షన్ ఎంఎల్‌హెచ్‌పీ లాగిన్‌కు వెళుతుంది. దాని ఆధారంగా రోగికి ఎంఎల్‌హెచ్‌పీ మందులను అందిస్తారు. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ సంబంధిత వ్యక్తి డిజిటల్ హెల్త్ ఐడీలో అప్లోడ్ చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వైద్యుడే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసే ఆప్షన్‌ను కూడా యాప్‌లో కల్పిస్తున్నారు. ఇబ్బందులు ఎదురవకుండా.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను ఇద్దరు వైద్యులకు విభజిస్తారు. రోజు మార్చి రోజు పీహెచ్సీ వైద్యుడు తనకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాలి. వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో ఉండి వైద్యసేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో వారికి సచివాలయాల్లోనే హాజరు నమోదుకు వీలు కల్పిస్తున్నారు. వైద్యుడితో పాటు ఏఎన్ఎంలు గ్రామంలో సేవలు అందించేలా ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ నమోదు చేసుకునేలా పనివేళలు మార్పు చేయనున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేరువే లక్ష్యం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను అందిస్తున్నాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పీహెచ్సీ, సీహెచ్‌సీలకు వెళ్లలేనివారు వైద్యుడికి ఫోన్ చేయవచ్చు. గ్రామాల్లో పాము కాట్లు, గర్భిణులకు పురిటి నొప్పులు తదితర సందర్భాల్లో 108 అంబులెన్స్ చేరుకునేలోపు పీహెచ్సీ వైద్యుడిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రాథమిక చికిత్స చర్యలను సూచిస్తారు. తద్వారా బాధితుల విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మెరుగైన సేవల కోసమే.. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మెరుగైన సేవలందించేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇలా అన్ని వివరాలను వ్యక్తిగత డిజిటల్ హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేస్తాం. బయోమెట్రిక్ ద్వారా సంబంధిత వ్యక్తి అంగీకారంతో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చే ఏడాది జనవరిలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు ప్రణాళిక రూపొందించాం. వైద్యులకు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పించడంతో పాటు ఏఎన్ఎంల హాజరు వేళల్లో మార్పుపై సచివాలయాల శాఖకు లేఖ రాశాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు ఎంతో మేలు.. పీహెచ్సీ వైద్యులకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ల పంపిణీ, శాశ్వత ఫోన్ నంబర్ కేటాయింపు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. అత్యవసర సమయాల్లో పీహెచ్సీ వైద్యుడికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. వైద్యులు బదిలీపై వేరే చోటకు వెళ్లినా ఫోన్ నంబర్లు మారవు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, జీజీహెచ్ కర్నూలు నిరంతర ఫాలోఅప్.. మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న వారి ఆరోగ్యం గురించి నిరంతరం వాకబు చేసేందుకు యాప్‌లో మరో ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక జబ్బులు) బాధితుల వివరాలు సచివాలయాల వారీగా ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో ఉంటాయి. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు యాప్‌లో నమోదైన వివరాలను పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. అనారోగ్య సమస్యలతో శిశువు జన్మిస్తే వెంటనే నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తారు. ఆ వివరాలు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. గర్భిణులు, బాలింతలకు చెకప్‌లు, విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర అంశాలనూ యాప్ పరిధిలోకి తెస్తున్నారు. -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి భారీగా ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు. చదవండి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. సెపె్టంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్టికెట్లలో తెలియజేస్తారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అర్హతలు అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. పరీక్ష ఇలా.. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (మూడు గంటలు)లుగా నిర్ణయించారు.