అనకాపల్లి జిల్లా కొమరవోలులో అప్పలకొండకు మందులు అందజేస్తున్న సీహెచ్‌వో
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది.
మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్‌లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్‌వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు.
ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది.
ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు.
తపాల శాఖ ద్వారా మందులు సరఫరా
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్‌లైన్‌లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు.
ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు.
ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు
– టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా
పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది.
వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది
– అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా
విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్‌సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్‌లైన్‌లో సూచించిన వెంటనే పోస్టల్‌లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది.
వేగంగా మందుల సరఫరా
– డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్‌ఐడీసీ
సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన ఇండెంట్‌లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment