Central Drug Stores
-
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
రాష్ట్రంలో మూడు భారీ ఔషధ నిల్వ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతీయ ఔషధ నిల్వ (రీజనల్ డ్రగ్ స్టోర్స్ - ఆర్డీఎస్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్యమిషన్ రూ.10 కోట్ల వంతున నిధులు ఇస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ విస్తీర్ణంలో.. 40 వేల చదరపు అడుగుల్లో మందులు నిల్వ చేయడానికి అవకాశం ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన స్థలాల్లో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. భారీగా నిల్వలకు అవకాశం ⇔ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్) ఉన్నాయి. ⇔ దీనివల్ల మందుల నిల్వకు సరిపడా విస్తీర్ణం అందుబాటులో లేదు. ⇔ ఈ నేపథ్యంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలతో మూడు ఆర్డీఎస్ల నిర్మాణానికి రూ.10 కోట్ల వంతున నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ అంగీకరించింది. ⇔ కొత్తగా నిర్మించే ఈ కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు భారీగా మందులు నిల్వ చేసుకునే వీలుంటుంది. ⇔ మందుల్ని ఈ కేంద్రాల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిస్తారు. ⇔ ఒక్కో కేంద్రంలో కనీసం ఆరునెలలకు సరిపడా మందుల్ని నిల్వచేయవచ్చు. ⇔ మందుల నిల్వతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కోల్డ్‌చైన్ (శీతలీకరణ) అవకాశం ఉంటుంది. ⇔ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, ఖరీదైన మందుల నిల్వకు ఇబ్బందులుండవు. -
మందుల్లేవ్!
నో స్టాక్ - గుంటూరు జీజీహెచ్‌లో మందుల్లేక రోగుల ఇక్కట్లు - ఆస్పత్రి ప్రారంభించినప్పటి బడ్జెట్టే నేటికీ అమలు.. - రోగులు పెరుగుతున్నా బడ్జెట్ పెంచని ప్రభుత్వం - తక్కువ ధర మందులైతేనే.. లేదంటే బయట కొనాల్సిందే! - టెండర్లు పిలిచే వరకు రోగులకు తప్పని అవస్థ సాక్షి, గుంటూరు : అపర సంజీవనిగా పేరొందిన ఆస్పత్రిలోనే మందుల కొరత వెంటాడుతోంది. కోస్తాంధ్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో చూపించుకుని వెళ్దామని వచ్చిన వారికి కూడా మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వార్డుల్లో చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. మందుల కొనుగోలుకు ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు కేటాయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో రెట్లు రోగులు పెరిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ స్థాయిలో మందులు రాక పోవడంతో వైద్యాధికారులు సైతం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ధర తక్కువైతే ఇక్కడ.. లేదంటే బయట.. జీజీహెచ్‌కి వివిధ సమస్యలతో నిత్యం వేలాది మంది పేద రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 1175 పడకలు ఉన్నప్పటికీ అవి కూడా చాలక ఒక్కొక్క బెడ్‌కు ఇద్దరు చొప్పున రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వార్డుల్లో రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు వేయాల్సిన స్టాఫ్ నర్సులు అవి తమ వద్ద లేవని బయట కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి బంధువులు మందులు బయట కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఏవో తక్కువ ధరకు దొరికే మందులు మాత్రం ఆసుపత్రిలో ఉంటున్నాయని, అధిక ధరవైతే స్టాక్ లేవని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో మరింత తీవ్రం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా కాని మందులను హెచ్‌డీఎస్ నిధుల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. కానీ అవి టెండర్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ టెండర్లు ఏడు నెలలుగా పిలవకపోవడంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమయింది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్ వంటి విభాగాల్లో మందుల కొరత క్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే అధిక ధరలు ఉంటాయని, దీంతో పేద ప్రజలకు భారంగా మారుతుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. మందులపై పర్యవేక్షణ కరవు... మందుల స్టాక్ రూమ్ నుంచి వివిధ వార్డులకు రోజూ మందులు సరఫరా అవుతుంటాయి. ఆ మందులు ఎవరికి వేశారనేది ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆ మందులు ఏ రోగికి వినియోగించారో రోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలియజేస్తే కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించే వీలు ఉంటుంది. ఏ వార్డులో ఎన్ని మందులు ఉన్నాయి. ఏయే మందులు ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియడంలేదు. రోజూ ఎవరో ఒక ఉన్నతాధికారి వార్డులను పరిశీలించి అక్కడ ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. రోగులకు అందుబాటులేని మందులను కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంటుంది. కొరత గుర్తించి కొనుగోలు చేస్తున్నాం.. జీజీహెచ్‌లో మందుల కొరత తలెత్తుతూనే ఉంది. వాటిని గుర్తించి వెంటనే కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కొన్ని మందులు రానప్పుడు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కొన్ని నెలలుగా టెండర్లు పెండింగ్‌లో పడ్డాయ్. దీనిపై కలెక్టర్‌కు లేఖ రాస్తాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి.- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్