సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్‌లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.
లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదే సమయంలో బండి సంజయ్‌కు ఎంపీ చామల కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎంపీ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్‌పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు.
మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్బంగా గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో గద్దర్ అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: గద్దర్‌కు పద్మ అవార్డుపై బండి సంజయ్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment