సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్‌కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.
ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.
మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్‌కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.
బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్‌కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment