మెక్సికో గుండా వచ్చిన శరణార్థులను పంపేస్తున్న అమెరికా
వాళ్లను అనుమతించమన్న మెక్సికో
సందిగ్ధంగా మారిన తరలింపు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చాలని చూస్తుంటే అందుకు మెక్సికో ససేమిరా అంటోంది. మా గడ్డ మీదుగా వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లుకాబోరని తెగేసి చెబుతోంది. అయినాసరే విమానాల్లో తరలిస్తామంటే ఆ విమానాలను ల్యాండింగ్ కానివ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈ శరణార్థులను ఎక్కడి పంపాలో, వీళ్లని ఏం చేయాలా అని అమెరికా తల పట్టుకుంది.
అసలేం జరిగింది?
చాన్నాళ్లుగా శరణార్థులుగా అమెరికాలోకి అక్రమంగా వలసవస్తున్న వారిని గత అమెరికా ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డాక్యుమెంట్లు లేకుండా శరణు కోరుతూ అక్రమంగా వస్తే ఎవ్వరినీ అనుమతించబోమని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే వచ్చిన వారినీ పంపేస్తామని ప్రకటించింది. గ్వాటెమాల నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది. ఒక్కోదాంట్లో 80 మంది శరణార్థులున్న రెండు సైనిక విమానాలు శుక్రవారమే గ్వాటెమాలకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి. ఇదే తరహాలో ‘‘మెక్సికో వాళ్లు మెక్సికోలోనే ఉండాలి.
అమెరికాలో కాదు’’అనే అర్థంలో గతంలో అమలుచేసిన ‘రిమేన్ ఇన్ మెక్సికో’విధానాన్ని ట్రంప్ యంత్రాంగం తెరమీదకు తెచ్చింది. మెక్సికో వెళ్లి శరణార్థులను వదిలేసి రావాలని ట్రంప్ ప్రభుత్వం గత వారం నిర్ణయించింది. సీ–17 భారీ సైనిక సంబంధ సరకు రవాణా విమానంలో వారిని మీ దేశానికి తీసుకొస్తున్నట్లు మెక్సికోకు అమెరికా సమాచారమిచ్చింది. ఇది తెల్సిన వెంటనే మెక్సికో ఘాటుగా స్పందించింది.
‘‘మా దేశం గుండా మీ దేశంలోకి వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లు అయిపోరు. వాళ్లలో అక్రమంగా మెక్సికోకు వచ్చి చివరకు అమెరికా సరిహద్దుదాకా వచ్చి శరణు కోరిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్లందరినీ విమానంలో మా దేశానికి పంపిస్తే ఆ విమానాన్ని ల్యాండ్ కానివ్వం. అమెరికాతో మాకు సత్సంబంధాలున్నాయి. వలస విషయంలోనూ అంతే. అయినా తప్పదనుకుంటే ఆ శరణార్థుల్లో మెక్సికో జాతీయులను మాత్రం తిరిగి పంపడానికి అనుమతిస్తాం’’అని మెక్సికో విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.
క్షీణించిన సత్సంబంధాలు
మెక్సికో సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టంచేస్తానని, ఓ యాప్ ద్వారా స్లాట్ బుక్‌చేసుకుని ఇంటర్వ్యూ తర్వాత శరణార్థి హోదాలో అమెరికాలోకి వచ్చే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లే సరిహద్దు వద్ద వేలాది మందిగా అదనపు బలగాలను మొహరించారు. మెక్సికో గుండా అత్యంత ప్రమాదకర కొత్తరకం మాదకద్రవ్యాలు అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి డ్రగ్ ముఠాలను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు.
మెక్సికో వస్తూత్పత్తులపై ఫిబ్రవరి నుంచి అదనంగా 25 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనక్కి పంపిస్తామన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తిరస్కరించారు. మూకుమ్మడి తిరుగుటపాలు ఒప్పకోబోమని, అయినా ప్రతిభ గల మెక్సికన్ శరణార్థులు అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని ఆమె హితవు పలికారు. దీంతో అమెరికా, మెక్సికో సత్సంబంధాలు క్షీణించాయి. 2021లోనూ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినప్పుడు అక్కడి వేర్వేరు దేశస్తులను తమ తమ దేశాలకు అమెరికా తమ సైనిక విమానాల్లో తరలించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment