సాక్షి, ప్రొద్దుటూరు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైఎస్సార్‌సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఆదినారాయణ రెడ్డి లాంటి వారు వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చింది. ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుంది. విజయసాయి రెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా?. సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైఎస్సార్‌సీపీ పని అయిపోయిందని కూటమి నాయకులు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ ద్వారా అత్యున్నత పదవులు అనుభవించి.. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉండగా కొంతమంది వదిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్తున్నారు. వైఎస్ జగన్ కి ద్రోహం చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది పార్టీకి, వైఎస్ జగన్‌కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.
టీడీపీ, షర్మిలకు కౌంటర్..
టీడీపీ నాయకులు, షర్మిలకు, ఆదినారాయణరెడ్డికి అందరికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ పని అయిపోతుందా?. వైఎస్ జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకే కాదు.. మళ్లీ ఇంకో జన్మ ఎత్తయినా సరే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకునే కార్యకర్తలు నాతోపాటు ఊరూరా లక్షల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బలం. వైఎస్ జగన్‌ని విమర్శించే వారంతా ఆయన పేరు వింటేనే పక్క తడుపుకునే వాళ్లు. వాళ్లకు జగన్ మీద మనసు నిండా కుట్ర, ఒళ్లంతా అసూయ ఉంది. జగన్ చనిపోలేదు.. కేవలం ఓడిపోయాడని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా కూటమి నాయకులు శత్రువు గురించి భయపడుతున్నారు.
ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే..
వైఎస్ జగన్‌కి మేమెప్పుడూ బలం కాదు.. ఆయనే మా అందరికీ బలం. పోరాటం, ధైర్యం, విశ్వసనీయత ఆయన బలం. ఆయన వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరే ఆయనకు శ్రీరామరక్ష. కార్యకర్తలే జగన్ బలం. కార్యకర్తలు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, వంటి వారు పార్టీ మారలేదా?. విశ్వసనీయత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని అలాంటి చంద్రబాబే 2024 మళ్లీ సీఎం కాలేదా? అలాంటిది జగన్ సీఎం కాలేరా?. ఆయన మళ్లీ సీఎం కావడం తథ్యమని తెలుసు కాబట్టే శత్రువులంతా భయంతో వణికిపోతున్నారు.
ఇద్దరు ముగ్గురు వదిలేసి వెళ్లినంత మాత్రాన జగన్ భయపడేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినప్పుడే మా పార్టీ కనుమరుగయ్యేది. ఆరోజే ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. వైఎస్ జగన్‌ను కాదని వెళ్లిపోయిన ఈ ఆదినారాయణ రెడ్డి మళ్లీ గెలవలేదు. ఇప్పటికే 2019-24 మధ్య ఒకసారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయణరెడ్డి.. మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి. వైఎస్సార్‌సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment