aadinarayana reddy
-
నిరుద్యోగులను నట్టేట ముంచిన ‘ఆది’
సాక్షి, కర్నూలు : ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన సంతోషం వారికి ఎంతో కాలం లేదు. చేరినప్పటి నుంచి ఇంతవరకు వేతనాలు లేవు. ముడుపులు పుచ్చుకొని ఉద్యోగాలు ఇప్పించిన టీడీపీ మాజీ మంత్రి పత్తా లేకుండా పోయారు. పశుసంవర్ధకశాఖలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు, గోకులాలను టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకు సంబంధించి డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఏర్పడింది. తొలుత అవసరాలకు తగిన విధంగానే నియమించారు. ఎన్నికల ముందు గత ఏడాది చివరిలో మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సిఫారసులతో అవసరం లేకపోయినా అడ్డుగోలుగా టెక్నికల్ మానిటర్, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరికి ఆశచూపి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసుకొని అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా గుంటూరుకు చెందిన రెడ్డి ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం కొద్ది రోజులకే ఆవిరయ్యింది. ఆరు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే ‘బిల్లు అయితే పెట్టాము... అది ఆర్డినరీ బిల్లు కావడంతో మంజూరు అయినప్పటికీ సంబంధిత నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేము’ అని చెప్పినట్లు తెలిసింది. డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లాలో 45 మందికి పైగా ఉన్నారు. వీరిలో 30 మందికి పైగా ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. అయితే ఒక్క నెల జీతం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 13 నుంచి విధులకు హాజరు కాలేమని, సోషల్ అడిట్ నిర్వహించలేమని చేతుతెత్తేశారు. జీతాలు లేనందున ముడుపుల కింద ఇచ్చుకున్న నగదును వెనక్కి ఇచ్చే విధంగా టీడీపీ నేతపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు. -
ఆది, పీఆర్ వర్గీయుల విధ్వంసం
జమ్మలమడుగు నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు ఒకేగొడుగు కిందకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులను గ్రామాల్లో తిరగనివ్వకుండా చేయడం కోసం ఇప్పటి నుంచే అధికార పార్టీకి చెందిన నాయకులు పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఓటమి భయంతోనే కొండాపురం మండలంలోని ఏటూరు, కోడూరు గ్రామాల్లో దాడులకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే వైఎస్సార్సీపీకి లీడర్లు ఉండరంటూ అసత్య ప్రచారం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎర్రగుంట్లకు చెందిన డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డిని రంగంలోనికి దించారు. ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి సుధీర్‌రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తిరుగుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ కేడర్‌ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా సుధీర్‌రెడ్డి వెంట తిరుగుతూ భరోసా ఇస్తుండడంతో వైఎస్సార్సీపీకి భారీగా వలసలు ఊపందుకున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకులేకుండాపోయింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు, గ్రామ స్థాయి నాయకులను, కార్యకర్తలను భయపెట్టేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం ఏటూరు గ్రామానికి చెందిన అల్లం సత్యానికి చెందిన ఇన్నొవాను, టి.కోడూరు గ్రామానికి చెందిన, వైఎస్సార్ సీపీ జిల్లాకార్యదర్శి రామమునిరెడ్డికి చెందిన మామిడితోటకు ఉన్న కంచెను అదే గ్రామానికి చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు చింత దామోదర్‌రెడ్డి, ఏ. ప్రభాకర్‌రెడ్డి సోమవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే ఆది వర్గీయులు ఈదాడికి పాల్పడ్డారన్నారు. సుమారు రూ.50 వేల నష్టం వాట్లిలిందన్నారు. వారి బెదిరింపులకు భయపడమన్నారు. కారకులను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. -
ఎమ్మెల్యే టికెట్ మనకే కావాలి!
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎమ్మెల్యే టికెట్ మనకే కావాలి. దానికోసం అందరం కలిసికట్టుగా పోరా టం చేద్దాం. అవకాశం కోల్పోతే ద్వితీయశ్రేణి నాయకులుగా మిగలాల్సి వస్తోంది. ఎంపీకి పోటీచేసి చేసేదేమీ ఉండదు. ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలి’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డికి ముఖ్యకార్యకర్తలు సూచించారు. సోమవారం మంత్రి స్వగ్రామం దేవగుడిలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక మంది గ్రామ, మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే స్థానికంగా తమ వర్గం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని, దాంతో పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గంబలం పుంజుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో ఎమ్మెల్సీ వర్గానిదే పైచేయి అయ్యే అవకాశం ఉందని వాపోయారు. లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు రెండూ తీసుకుని పోటీచేస్తే తాము కూడా గట్టిగా పనిచేయడానికి అవకాశం ఉందంటూ మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. చూద్దాం.. సీఎం మాట ఆలకించాల్సిందే జమ్మలమడుగు ముఖ్య నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం మంత్రి ఆది మాట్లాడుతూ ‘‘మీరు చెప్పేదంతా వాస్తవమే. అయితే సీఎం ఎంపీగా పోటీ చేయమని ఆదేశించారు. చూద్దాం పరిస్థితి అనుకూలంగా వస్తే రెండు టికెట్లు మనమే దక్కించుకుందాం. టిక్కెట్ విషయమై ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు వద్ద చర్చ కొనసాగుతోంది. కాగా ప్రతిసారి కుటుంబ సభ్యులందరితో కలిసి సీఎం వద్దకు వెళ్లకపోవడంతో ఆ సాకు చూపెట్టి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తున్నారు. పీఆర్‌పై సుప్రీంకోర్టులో కేసు ఉంది. ముఖ్యమంత్రి పిలిపించి ఆ కేసు రాజీ కావాలని సూచించడంతో ఓప్పుకున్నా. మా కుటుంబ సభ్యులు అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు. ఇవన్నీ కాదు, ఎంపీ టికెట్‌కు పోటీచేస్తే సాధించేదేమీ లేదు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని మంత్రి ప్రసంగానికి అనుచరులు అడ్డు తగిలినట్లు సమాచారం. సమావేశానికి హాజరుకాని మంత్రి సోదరులు మంత్రి ఆదినారాయణరెడ్డి తన స్వగ్రామంలో నిర్వహించిన కార్యకర్తలతో సమావేశానికి ఆయన సోదరులు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి హాజరుకాలేదు. అందుకు ప్రధాన కారణం ఇటీవల సీఎం సమావేశం సందర్భంగా మంత్రి తన సోదరులు గురించి చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. అప్పట్లో కేసు రాజీ పడుతాం, ఎమ్మెల్సీ పదవికీ రామసుబ్బారెడ్డి రాజీనామా చేసి, ఆ పదవి తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే అభ్యర్థనను మంత్రి ప్రతిపాదించారు. అందుకు పీఆర్ అంగీకరిస్తూనే, రాజకీయంగా ప్రధాన భూమిక పోషించిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి గైర్హాజర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. రేపొద్దున మంత్రిని కాదని వారు అడ్డు నిలిస్తే చేసేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ సందర్భంగా మంత్రి ఆది తన సోదరులు కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకే మంత్రి చర్యలు, నిర్ణయాల పట్ల వారు వ్యతిరేకంగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు ఓ వైపు, సోదరులకు ప్రాధాన్యత లేకపోగా, తోడల్లుడు, కుమారుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అంశంగా పలువురు వివరిస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ముఖ్య నాయకులకు మంత్రి వివరించినా, ఆ సమావేశానికి సోదరులు హాజరు కాకపోవడం కొసమెరుపు. -
గేట్లకు తూట్లు
కడప సిటీ : టి.సుండుపల్లె మండలంలోని ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గేట్లు తుప్పుపట్టి నీళ్లు వృథాగా పోతున్నా పునరుద్ధరణ పనులు జరగక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గేట్ల లీకేజీ కారణంగా పొలాలకు ఏ మాత్రం ఉపమోగం లేకుండా నీరు పోతోంది. అధికారులు మాత్రం రూ.2.90 కోట్లతో నీరు–చెట్టు నిధుల కింద గేట్ల పునరుద్ధరణకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు చేపడుతామని చెబుతున్నారు. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. చెయ్యేరులో కలుస్తున్న నీరు ఈ ప్రాజెక్టును 1962లో నిర్మించారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిర్మాణం చేపట్టారు. నీటి సామర్థ్యం 0.327 టీఎంసీలు. మూడు వర్టికల్, రెండు స్వే్కర్ గేట్లు ఉన్నాయి. గేట్లు తుప్పు పట్టడం వల్ల రోజూ 10 క్యూసెక్కులు నీళ్లు వృథాగా పోయి చెయ్యేరులో కలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చినా.. గేట్ల లీకేజీ కారణంగా వృథాగా పోతున్నాయని వారు వాపోతున్నారు. గేట్ల పునరుద్ధరణపై జాప్యం పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు మొదటి నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ పనులకు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి శిలాఫలకం వేసి వెళ్లారు. పలు కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో సమస్య అలాగే ఉండి పోయింది. మళ్లీ గతేడాది డిసెంబర్లో ఈ గేట్ల పునరుద్ధరణకు నీరు–చెట్టు పథకం కింద రూ.2.90 కోట్లు కేటాయించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. టెండర్లను స్వప్న ఇన్ఫ్రా కంపెనీ దక్కించుకుంది. అగ్రిమెంటు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో గేట్ల పునరుద్ధరణ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం వస్తే.. టీడీపీ ప్రభుత్వం ఈ పనులను చిత్తశుద్ధితో చేపడుతుందన్న నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతోంది. అందుకు నిదర్శనం టెండర్లు పిలిచి 9 మాసాలు అయినా పనులు ప్రారంభం కాకపోవడమే. ఈ నేపథ్యంలో ఒక వేళ ఈ మధ్యలో వర్షాలు బాగా పడి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి చేరితే పనులు మొదలు పెట్టే అవకాశం ఆమడ దూరంలో ఉండక తప్పదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి త్వరలో పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు మొర పెట్టుకుంటున్నారు. పనులు చేపట్టేందుకు చర్యలు పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులను త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు– చెట్టు పథకం కింద రూ.2.90 కోట్ల నిధులు ఈ పనులకు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పూర్తయ్యాయి. స్వప్న ఇన్ఫ్రా కంపెనీతో అగ్రిమెంట్ పూర్తయింది. పనులను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం. – శ్రీనివాసులు,ఎస్ఈ, మైనర్ ఇరిగేషన్, కడప -
మంత్రి ఆదిది నీచ మనస్తత్వం
వైఎస్సార్, ప్రొద్దుటూరు : స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన మంత్రి ఆదినారాయణరెడ్డికి వ్యక్తిత్వం లేదు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారు. వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారు. నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డితోపాటు ఆయన కుటుంబం గురించి మంత్రి వ్యక్తిగతంగా దూషించే విధానం చేపల మార్కెట్లో కన్నా అధ్వానంగా ఉందన్నారు. అసలు ఆయన మంత్రేనా..ఆ భాష వింటే తనకే సిగ్గేస్తోందన్నారు. స్వార్థంతో వ్యవహరించే మంత్రి జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. ఆయన భాగవతం చెబుతున్నా వినండి అని అన్నారు. మూడు మార్లు మంత్రి సోదరుడు నారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, ఆయనను పక్కకు నెట్టినాలుగోమారు గెలిచే సమయంలో ఆది పోటీ చేశారన్నారు. మంత్రి ఆది అంతటి స్వార్థపరుడు లేడని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బీఫాంతో గెలిచి ఆయన వెంట నడవడం తన దరిద్రమా అని నిలదీశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి రూ.30కోట్లకో, రూ.40కోట్లకో అమ్ముడు పోకుండా ఆయన వెంట నడవడం దరిద్రమా అని చెప్పారు. తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన బీఫాంపై 12వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వారిని వంచించి పార్టీ మారడం దారుణమన్నారు. పదవీ వ్యామోహంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని వదలి చంద్రబాబు మోచేతి గంజినీళ్లు తాగడం ఉన్నతమా అని అన్నారు. అధికార దాహంతో కృతజ్ఞతాహీనుడిగా మిగలావన్నారు. మంత్రి వియ్యంకుడు కేశవరెడ్డి దేశమంతా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగరగొడితే కుటుంబ స్వార్థం కోసం ప్రజలను గాలికొదిలేసి జగన్‌ను విమర్శించడం సరికాదని అన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తనను విమర్శించడం ఏమిటన్నారు. రాచమల్లు చేసిన దానికి పోటీగా కార్యక్రమం చేపట్టడాన్ని బట్టి చూస్తే తన దెబ్బకు టీడీపీ నేతలు భయపడుతున్నట్లేనని అన్నారు. తన ప్రవర్తనను, తన మనస్తత్వాన్ని ఎరిగిన ప్రొద్దుటూరు ప్రజలు తిరిగి తననే ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ తన రాజకీయ వారసుడని వేలాది మంది కార్యకర్తల మధ్యన ప్రకటించిన మంత్రి ఆయనను పక్కన పెట్టి స్వార్థంతో తన కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయ వారసునిగా పరిచయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మంత్రి కుమారుడిని చేసుకోవడంలో వ్యూహం పన్నారని అన్నారు. ఆయనకు ఎప్పటి నుంచో అండగా నిలిచిన చిన్న సోదరుడు శివనాథరెడ్డిని సైతం పక్కనపెట్టి ప్రస్తుతం మంత్రి తన తోడల్లుడు రాజగోపాల్‌రెడ్డిని ముందుకు పెట్టి రాజకీయాలను నడిపిస్తున్నారన్నారు. మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడిన మాటలపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్యే అన్నారు. తన వద్ద కిరాయి హంతక ముఠా ఉందని, సీమ టపాకాయలను ఉపయోగిస్తే జగన్ పాదయాత్ర చేస్తాడా అని మంత్రి ఆది అనడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి దృష్టిలో సీమ టకాయలంటే బాంబులని అర్థం వస్తుందన్నారు. ఎండను, వానను సైతం లెక్క చేయకుండా ప్రజాభిమానంతో పాదయాత్ర సాగిస్తున్న యోధుడు జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు జగన్ భయపడే ప్రసక్తే ఉండదన్నారు. జిల్లాలో అత్యంత పిరికివాడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఇలాంటి వాళ్లు జగన్మోహన్రెడ్డి పాదయాత్రను ఆపగలరా అని విమర్శించారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరు నాగేంద్రారెడ్డి, శేఖర్, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ముస్లిం యువకులపై కేసులు పెట్టి కొట్టిస్తారా? వైస్సార్, ప్రొద్దుటూరు : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ముస్లిం యువకులపై కేసులు పెట్టించి బూటుకాలుతో తన్నించడం తగునా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో జరిగిన నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించినందుకు నిరసనగా ఎమ్మెల్యే సోమవారం ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నారా హమారా కార్యక్రమంలో వరాల జల్లులు ప్రభుత్వం కురిపించాల్సింది పోయి ప్రశ్నించిన యువకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసి సబ్ జైలుకు తరలించారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించినట్లు ముస్లింలకు ఇస్లాం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారా, వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించారా, 15 అసెంబ్లీ సీట్లు కేటాయించారా, రూ.5లక్షల రుణాలు మంజూరు చేశారా, వడ్డీ లేకుండా డ్వాక్రా రుణాలు రూ.5వేలు చొప్పున ఇచ్చారా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన వీరిని అక్రమంగా నిర్బంధించడం తగదన్నారు. ఈ ప్రభుత్వ తీరు ఎమర్జన్సీని తలపిస్తోందన్నారు. ఇదేనా ముస్లింలపై ప్రభుత్వానికి ఉండే ప్రేమ అని అన్నారు. హిందూ–ముస్లిం భాయి భాయి అని జీవిస్తున్నామని, అదే నినాదంతో వారికి అండగా నిలిచామన్నారు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం యువకులు దేశ్‌కీ నేతలా అని మంత్రి ఆదినారాయణరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాడిన గాంధీ ఆనాడు దేశ్‌కీ నేతే అని అన్నారు. మంత్రి మాట్లాడే భాషను చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఎంఎస్‌డీపీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, కేంద్ర ప్రభుత్వం పథకం అయిన దీని ద్వారా ఇక్కడి ముస్లింలకు ఏమి చేశారో చెప్పాలని మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం కింద రాయచోటి, ప్రొద్దుటూరులో కేవలం హాస్టళ్లను మాత్రమే నిర్మించారన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసుకు సంబంధించి తాను మానవ హక్కుల కమిషన్‌ను, కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వీరి తరపున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం నంద్యాలకు వెళ్లి ముస్లిం యువకులను పరామర్శిస్తామని, మరుసటి రోజు వెయ్యి మంది యువకులతో ప్రొద్దుటూరులో దీక్ష చేపడుతానన్నారు. ముస్లిం యువకులపై అన్యాయంగా కేసులు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా వారికి అండగా నిలవాల్సింది పోయి టీడీపీ నేతలతో ముక్తియార్ జత కట్టడం పద్ధతిగా లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జాఫర్ హుసేన్, దాదాపీర్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, మైనారిటీ నాయకులు మహ్మద్రఫిక్, అబ్దుల్లా, యూసఫ్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నారాయణమ్మ, కౌన్సిలర్లు పోసా వరలిక్ష్మి భాస్కర్, రాగుల శాంతి, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, గుమ్మటమయ్య, మల్లికార్జున ప్రసాద్, పార్టీ నాయకులు ఆర్సీ సుబ్రహ్మణ్యం, జాకీర్, లక్ష్మీనారాయణమ్మ, బాబుచాన్, మేరి, నాగాయపల్లె షరీఫ్, సాధక్, ఇలియాస్, నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య, వెల్లాల భాస్కర్, మైనారిటీ సెల్ మండల కన్వీనర్ ఖాదర్‌బాషా, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డి, కాకిరేనిపల్లె రామ్మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, మురళీనాథరెడ్డి, నల్లం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ కాదు మొండి దేవుడు...
జమ్మలమడుగు : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోదీ కాదని మొండిదేవుడని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో కలసి నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి ఆది విలేకరులతో మాట్లాడారు. టీడీపీ బీజేపీకి మిత్ర పక్షమైనా నాలుగు సంవత్సరాలపాటు కలిసి మెలసి ఉన్నా రాష్ట్రాభివృద్దికి ఏమాత్రం సహకరించలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలను కేంద్రం అమలు పరచడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదాను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. పట్టిసీమ పూర్తికావడంతోనే కృష్ణనది నుంచి గండికోటకు, మైలవరం జలాశయాలకు నీటిని తెచ్చుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైలవరం నాలుగు, గండికోటలో ఆరు టీఎంసీల నీరు వచ్చిందన్నారు. పెన్నానది పరివాహక 100గ్రామాలకు మూడు మున్సిపాలిటీల ప్రజలకు తాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సూచిన మేరకు నీటిని విడుదల చేయించామన్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు పెన్నానదికి విడుదల చేస్తామన్నారు. మైలవరం జలాశయానికి సంబంధించిన ఉత్తర,దక్షిణ కాలువలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
చంద్రబాబే చెప్పారు.. చెరి సగం పంచుకోమని..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అవినీతి వైరస్‌లా ఊరూరా విస్తరించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అవినీతిని కేంద్రీకృతం చేసి అక్రమాలకు ద్వారాలు బార్లా తెరిచారు. తాను రారాజు అయినట్లు, మంత్రులు, పార్టీ నేతలు సామంతులైనట్లు... భారీగా కొల్లగొడుతూ పార్టీ మంత్రులు, ముఖ్య నాయకులు, శ్రేణులను కూడా పంచుకుతినండంటూ అనుమతులు ఇచ్చేశారు. ముఖ్యమంత్రి తన ముఖ్య కోటరీతో పాటు అత్యంత నమ్మకమైన ఉన్నతాధికారుల సహకారంతో భారీ డీల్స్ ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లకు పైగా ఆర్జించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఇవన్నీ నిజమేనని మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలతో స్పష్టమైంది. వైఎస్సార్సీపీ తరఫున జమ్మలమడుగు నుంచి పోటీచేసి గెలుపొంది, పార్టీ ఫిరాయించి టీడీపీ కండువా కప్పుకుని, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వ అవినీతి విశ్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ‘‘రామసుబ్బారెడ్డి గారికి కూడా ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి భాగం ఉంది ఈడ. అర్థ రూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను మాతోపాటు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు.ఆయన అడిగిన దాంట్లో మనకు సగం వస్తాది. మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తాది. వాళ్లు నన్ను ఏమి విమర్శించినా నేను అయితే పట్టించుకోను’’అంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. గండికోట పునరావాస కాలనీల టెండర్లు దక్కించుకోవడంలోనూ వీళ్లిద్దరూ ఏకమయ్యారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ టెండర్లు తెరవకుండా అడ్డుకున్నారని ఆగ్రహించిన మంత్రి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ స్థానిక కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. ఒకే పార్టీకి చెందిన నేతలు కాంట్రాక్టులకోసం బరితెగించడం, వారి మధ్య పంపకాలు జరిపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడాన్ని బట్టి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు ప్రాజెక్టు పనుల అంచనాలను ఆకాశానికంటేలా పెంచి, తద్వారా అందుకున్న వాటాల సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని విమర్శలున్నాయి. ఇలా అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబు 23మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏకంగా రూ.30 కోట్ల వరకు నజరానాగా ముట్టచెప్పడంతోపాటు భారీగా కాంట్రాక్టులు అప్పజెప్పారని తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వ్యతిరేకించడంతో... అందరికీ న్యాయం చేస్తానంటూ చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేసినట్లు మంత్రి మాటలతో వెల్లడవుతోంది. అందులో ఐఏఎస్ అధికారులను కూడా భాగస్వాములను చేయడం బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించడం గమనార్హం. తాజాగా మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలు సైతం కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పనితీరుకు అద్దం పడుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన తొలి కలెక్టర్ల సమావేశంలోనే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు సహకరించాల్సిందేనని విస్పష్టంగా చెప్పారు. అంతేకాదు తన భారీ అవినీతి ప్రణాళికలకు అంగీకరించని సీనియర్ ఐఏఎస్ అధికారులను ఢిల్లీ బాట పట్టించారు. అవినీతికి సహకరిస్తున్న అధికారులపై ఈగ కూడా వాలనీయడంలేదు. దోచుకున్న సొమ్మును ఫిïఫ్టీ.. ఫిïఫ్టీ వాటాలు పంచుకోండంటూ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఉండరని విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. తాము అన్ని విషయాలపై నోరు విప్పితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని మిత్రపక్షం బీజేపీ నాయకులు అంటున్నారంటే ఆయన అవినీతి, అక్రమాలు వ్యవహారాలు ఏ రీతిలో ఉండి ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. -
దేశంలో గందరగోళం!
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధించడానికి తమ పార్టీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేసిన సవాల్ అధికార తెలుగుదేశం పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని, ఇందుకు చంద్రబాబు ముందుకు రావాలని జగన్ సవాల్ విసిరారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తత్తరపాటుకు గురైంది. ఈ సవాల్‌పై ఎలా స్పందించాలో అర్థం కాక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించింది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిపిన చంద్రబాబు ఆ సమావేశం పూర్తయ్యాక విలేకరులతో మాట్లాడలేదు. పైగా పార్టీ సమన్వయ సమావేశంలో చర్చించిన విషయాలను పార్టీ నేతల ద్వారా కూడా విలేకరులకు చెప్పించలేదు. కేవలం లీకులను ఇప్పించారు. వాటిలో కూడా పవన్ కల్యాణ్‌ను పార్టీ నేతలు విమర్శించవద్దని, పవన్ మనోడేనని అన్నట్లుగా చెప్పించారు. జగన్‌ను తిట్టించబోయి .. జగన్ సవాల్ విసిరిన నేపథ్యంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చేత విలేకరుల సమావేశం పెట్టించి వ్యక్తిగత దుర్భాషలతో సమస్యను పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఆదినారాయణరెడ్డిపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రానికి ఇంకా ఎన్ని రోజులు గడువు ఇస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేయబోతున్న విషయాన్ని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకురాగా కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే మార్చి5నే టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని ఆది ప్రకటించారు. అంతేకాదు పొత్తుకు అదే ఆఖరు రోజు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 19 అంశాలు కేంద్రం ముందుంచామని, వాటిలో ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరి రోజని మంత్రి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ తన ఎంపీల రాజీనామాలు చేయించడానికి ముందే తమ పార్టీ మంత్రులతో∙రాజీనామాలు చేయిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో జగన్ కంటే టీడీపీదే ముందస్తు నిర్ణయం అన్నారు. ఆయనది ఏప్రిల్ ఆరు డెడ్‌లైన్ అయితే మాది మార్చ్ ఐదు డెడ్‌లైన్ అని చెప్పారు. కేంద్రం చెప్పినదానికి, చేసిన దానికి పొంతనలేదని, కేంద్ర బడ్జెట్లో అనుకున్న మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరగలేదన్నా రు. ఈ విషయాలను చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. జగన్‌ను తిట్టాల్సింది పోయి రాజీనామాల గురించి మాట్లాడటం, అది మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో అధినేత చంద్రబాబు కంగుతిన్నా రు. గంట తిరక్కుండానే మంత్రి ఆది చేత అదే చోట మళ్లీ విలేకరుల సమావేశం పెట్టించి వివరణ ఇప్పించారు. మంత్రుల రాజీనామా అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పించారు. అలా జరుగుతుందని తాననుకుంటు న్నానని ఆది అన్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ఆది చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమ న్నారు.ఇలా టీడీపీలో ఎంత గందరగోళముం దో అర్ధమౌతోందని విశ్లేషకులంటున్నారు. -
ఆస్ట్రేలియాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
మిర్యాలగూడ అర్బన్: ఆస్ట్రేలియాలో సోమవారం సూర్యాపేట జిల్లావాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నాలుగేళ్లుగా హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసి.. ఆరునెలల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువాతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజవారిగూడానికి చెందిన కోన వెంకట్‌రెడ్డి, సరోజనమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కోన ఆదినారాయణరెడ్డి(36). హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీ తరఫున ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగానికి వెళ్లాడు. అప్పటి నుంచి అతడి భార్య శిరీష నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆమె పిన్ని వద్ద ఉంటుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదినారాయణరెడ్డి తన భార్య శిరీషకు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేసి ఒంట్లో నలతగా ఉందని చెప్పినట్లు అతని భార్య శిరీష తెలిపింది. అనంతరం రెండు గంటల తర్వాత ఫోన్ చేసినా ఎంతకూ తీయకపోడంతో అక్కడ తెలిసిన వ్యక్తికి విషయం తెలిపారు. దీంతో అతను ఆదినారాయణరెడ్డి ఉంటున్న గదికి వెళ్లి చూడగా బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపాడు. -
ఎమ్మెల్యే ఆది గన్‌మెన్ విష్ణు సస్పెండ్
వైఎస్సార్ జిల్లా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ విష్ణుకుమార్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోసం ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో విష్ణు కుమార్ పాల్గొన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు గన్‌మెన్ విష్ణుకుమార్‌ను సస్పెండ్ చేసినట్టు సమాచారం. -
ఎమ్మెల్యేపై మాజీమంత్రి రామసుబ్బారెడ్డి ఫైర్
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. వియ్యంకుడు కేశవరెడ్డి చేసిన రూ 850 కోట్ల అప్పును తప్పుదోవ పట్టించడానికే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం ద్వారా బతికిన ఆదినారాయణ ఇప్పుడు ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడుస్తున్నారని రామసుబ్బారెడ్డి విమర్శించారు.