గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో కాలిపోయిన అల్లం సత్యానికి చెందిన ఇన్నొవా వాహనం
జమ్మలమడుగు నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు ఒకేగొడుగు కిందకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులను గ్రామాల్లో తిరగనివ్వకుండా చేయడం కోసం ఇప్పటి నుంచే అధికార పార్టీకి చెందిన నాయకులు పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఓటమి భయంతోనే కొండాపురం మండలంలోని ఏటూరు, కోడూరు గ్రామాల్లో దాడులకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే వైఎస్సార్‌సీపీకి లీడర్‌లు ఉండరంటూ అసత్య ప్రచారం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎర్రగుంట్లకు చెందిన డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డిని రంగంలోనికి దించారు. ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి సుధీర్‌రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తిరుగుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు.
అంతేకాకుండా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా సుధీర్‌రెడ్డి వెంట తిరుగుతూ భరోసా ఇస్తుండడంతో వైఎస్సార్‌సీపీకి భారీగా వలసలు ఊపందుకున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకులేకుండాపోయింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు, గ్రామ స్థాయి నాయకులను, కార్యకర్తలను భయపెట్టేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం ఏటూరు గ్రామానికి చెందిన అల్లం సత్యానికి చెందిన ఇన్నొవాను, టి.కోడూరు గ్రామానికి చెందిన, వైఎస్సార్ సీపీ జిల్లాకార్యదర్శి రామమునిరెడ్డికి చెందిన మామిడితోటకు ఉన్న కంచెను అదే గ్రామానికి చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు చింత దామోదర్‌రెడ్డి, ఏ. ప్రభాకర్‌రెడ్డి సోమవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే ఆది వర్గీయులు ఈదాడికి పాల్పడ్డారన్నారు. సుమారు రూ.50 వేల నష్టం వాట్లిలిందన్నారు. వారి బెదిరింపులకు భయపడమన్నారు. కారకులను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment