మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైఎస్సార్, ప్రొద్దుటూరు : స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన మంత్రి ఆదినారాయణరెడ్డికి వ్యక్తిత్వం లేదు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారు. వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారు. నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబం గురించి మంత్రి వ్యక్తిగతంగా దూషించే విధానం చేపల మార్కెట్‌లో కన్నా అధ్వానంగా ఉందన్నారు. అసలు ఆయన మంత్రేనా..ఆ భాష వింటే తనకే సిగ్గేస్తోందన్నారు.
స్వార్థంతో వ్యవహరించే మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. ఆయన భాగవతం చెబుతున్నా వినండి అని అన్నారు. మూడు మార్లు మంత్రి సోదరుడు నారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, ఆయనను పక్కకు నెట్టినాలుగోమారు గెలిచే సమయంలో ఆది పోటీ చేశారన్నారు. మంత్రి ఆది అంతటి స్వార్థపరుడు లేడని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బీఫాంతో గెలిచి ఆయన వెంట నడవడం తన దరిద్రమా అని నిలదీశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి రూ.30కోట్లకో, రూ.40కోట్లకో అమ్ముడు పోకుండా ఆయన వెంట నడవడం దరిద్రమా అని చెప్పారు. తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన బీఫాంపై 12వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వారిని వంచించి పార్టీ మారడం దారుణమన్నారు. పదవీ వ్యామోహంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని వదలి చంద్రబాబు మోచేతి గంజినీళ్లు తాగడం ఉన్నతమా అని అన్నారు. అధికార దాహంతో కృతజ్ఞతాహీనుడిగా మిగలావన్నారు. మంత్రి వియ్యంకుడు కేశవరెడ్డి దేశమంతా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగరగొడితే కుటుంబ స్వార్థం కోసం ప్రజలను గాలికొదిలేసి జగన్‌ను విమర్శించడం సరికాదని అన్నారు.
ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తనను విమర్శించడం ఏమిటన్నారు. రాచమల్లు చేసిన దానికి పోటీగా కార్యక్రమం చేపట్టడాన్ని బట్టి చూస్తే తన దెబ్బకు టీడీపీ నేతలు భయపడుతున్నట్లేనని అన్నారు. తన ప్రవర్తనను, తన మనస్తత్వాన్ని ఎరిగిన ప్రొద్దుటూరు ప్రజలు తిరిగి తననే ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ తన రాజకీయ వారసుడని వేలాది మంది కార్యకర్తల మధ్యన ప్రకటించిన మంత్రి ఆయనను పక్కన పెట్టి స్వార్థంతో తన కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయ వారసునిగా పరిచయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మంత్రి కుమారుడిని చేసుకోవడంలో వ్యూహం పన్నారని అన్నారు. ఆయనకు ఎప్పటి నుంచో అండగా నిలిచిన చిన్న సోదరుడు శివనాథరెడ్డిని సైతం పక్కనపెట్టి ప్రస్తుతం మంత్రి తన తోడల్లుడు రాజగోపాల్‌రెడ్డిని ముందుకు పెట్టి రాజకీయాలను నడిపిస్తున్నారన్నారు.
మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా
మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడిన మాటలపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్యే అన్నారు. తన వద్ద కిరాయి హంతక ముఠా ఉందని, సీమ టపాకాయలను ఉపయోగిస్తే జగన్ పాదయాత్ర చేస్తాడా అని మంత్రి ఆది అనడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి దృష్టిలో సీమ టకాయలంటే బాంబులని అర్థం వస్తుందన్నారు. ఎండను, వానను సైతం లెక్క చేయకుండా ప్రజాభిమానంతో పాదయాత్ర సాగిస్తున్న యోధుడు జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు జగన్ భయపడే ప్రసక్తే ఉండదన్నారు. జిల్లాలో అత్యంత పిరికివాడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఇలాంటి వాళ్లు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను ఆపగలరా అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరు నాగేంద్రారెడ్డి, శేఖర్, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు.
ముస్లిం యువకులపై కేసులు పెట్టి కొట్టిస్తారా?
వైస్సార్, ప్రొద్దుటూరు : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ముస్లిం యువకులపై కేసులు పెట్టించి బూటుకాలుతో తన్నించడం తగునా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో జరిగిన నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించినందుకు నిరసనగా ఎమ్మెల్యే సోమవారం ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నారా హమారా కార్యక్రమంలో వరాల జల్లులు ప్రభుత్వం కురిపించాల్సింది పోయి ప్రశ్నించిన యువకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసి సబ్ జైలుకు తరలించారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించినట్లు ముస్లింలకు ఇస్లాం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారా, వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించారా, 15 అసెంబ్లీ సీట్లు కేటాయించారా, రూ.5లక్షల రుణాలు మంజూరు చేశారా, వడ్డీ లేకుండా డ్వాక్రా రుణాలు రూ.5వేలు చొప్పున ఇచ్చారా, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన వీరిని అక్రమంగా నిర్బంధించడం తగదన్నారు. ఈ ప్రభుత్వ తీరు ఎమర్జన్సీని తలపిస్తోందన్నారు. ఇదేనా ముస్లింలపై ప్రభుత్వానికి ఉండే ప్రేమ అని అన్నారు. హిందూ–ముస్లిం భాయి భాయి అని జీవిస్తున్నామని, అదే నినాదంతో వారికి అండగా నిలిచామన్నారు.
ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం యువకులు దేశ్‌కీ నేతలా అని మంత్రి ఆదినారాయణరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాడిన గాంధీ ఆనాడు దేశ్‌కీ నేతే అని అన్నారు. మంత్రి మాట్లాడే భాషను చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఎంఎస్‌డీపీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, కేంద్ర ప్రభుత్వం పథకం అయిన దీని ద్వారా ఇక్కడి ముస్లింలకు ఏమి చేశారో చెప్పాలని మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం కింద రాయచోటి, ప్రొద్దుటూరులో కేవలం హాస్టళ్లను మాత్రమే నిర్మించారన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసుకు సంబంధించి తాను మానవ హక్కుల కమిషన్‌ను, కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వీరి తరపున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం నంద్యాలకు వెళ్లి ముస్లిం యువకులను పరామర్శిస్తామని, మరుసటి రోజు వెయ్యి మంది యువకులతో ప్రొద్దుటూరులో దీక్ష చేపడుతానన్నారు. ముస్లిం యువకులపై అన్యాయంగా కేసులు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా వారికి అండగా నిలవాల్సింది పోయి టీడీపీ నేతలతో ముక్తియార్ జత కట్టడం పద్ధతిగా లేదన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జాఫర్ హుసేన్, దాదాపీర్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, మైనారిటీ నాయకులు మహ్మద్‌రఫిక్, అబ్దుల్లా, యూసఫ్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నారాయణమ్మ, కౌన్సిలర్లు పోసా వరలిక్ష్మి భాస్కర్, రాగుల శాంతి, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, గుమ్మటమయ్య, మల్లికార్జున ప్రసాద్, పార్టీ నాయకులు ఆర్సీ సుబ్రహ్మణ్యం, జాకీర్, లక్ష్మీనారాయణమ్మ, బాబుచాన్, మేరి, నాగాయపల్లె షరీఫ్, సాధక్, ఇలియాస్, నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య, వెల్లాల భాస్కర్, మైనారిటీ సెల్ మండల కన్వీనర్ ఖాదర్‌బాషా, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డి, కాకిరేనిపల్లె రామ్మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, మురళీనాథరెడ్డి, నల్లం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment