ఎమ్మెల్యే టికెట్‌ మనకే కావాలి! | TDP Leaders Trying to MLA Ticket For Aadhinarayan Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే టికెట్‌ మనకే కావాలి!

Published Tue, Jan 15 2019 12:34 PM | Last Updated on Tue, Jan 15 2019 12:34 PM

TDP Leaders Trying to MLA Ticket For Aadhinarayan Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎమ్మెల్యే టికెట్‌ మనకే కావాలి. దానికోసం అందరం కలిసికట్టుగా పోరా టం చేద్దాం. అవకాశం కోల్పోతే ద్వితీయశ్రేణి నాయకులుగా మిగలాల్సి వస్తోంది. ఎంపీకి పోటీచేసి చేసేదేమీ ఉండదు. ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్‌ తీసుకోవాలి’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డికి ముఖ్యకార్యకర్తలు సూచించారు. సోమవారం మంత్రి స్వగ్రామం దేవగుడిలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక మంది గ్రామ, మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే టికెట్‌ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్‌ రాకపోతే స్థానికంగా తమ వర్గం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని, దాంతో పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గంబలం పుంజుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో ఎమ్మెల్సీ వర్గానిదే పైచేయి అయ్యే అవకాశం ఉందని వాపోయారు. లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు రెండూ తీసుకుని పోటీచేస్తే తాము కూడా గట్టిగా పనిచేయడానికి అవకాశం ఉందంటూ మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.

చూద్దాం.. సీఎం మాట ఆలకించాల్సిందే
జమ్మలమడుగు ముఖ్య నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం మంత్రి ఆది మాట్లాడుతూ ‘‘మీరు చెప్పేదంతా వాస్తవమే. అయితే సీఎం ఎంపీగా పోటీ చేయమని ఆదేశించారు. చూద్దాం పరిస్థితి అనుకూలంగా వస్తే రెండు టికెట్లు మనమే దక్కించుకుందాం. టిక్కెట్‌ విషయమై ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు వద్ద చర్చ కొనసాగుతోంది. కాగా ప్రతిసారి కుటుంబ సభ్యులందరితో కలిసి సీఎం వద్దకు వెళ్లకపోవడంతో ఆ సాకు చూపెట్టి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తున్నారు. పీఆర్‌పై సుప్రీంకోర్టులో కేసు ఉంది. ముఖ్యమంత్రి పిలిపించి ఆ కేసు రాజీ కావాలని సూచించడంతో ఓప్పుకున్నా. మా కుటుంబ సభ్యులు అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు. ఇవన్నీ కాదు, ఎంపీ టికెట్‌కు పోటీచేస్తే సాధించేదేమీ లేదు, ఎమ్మెల్యే టికెట్‌ తీసుకోవాలని మంత్రి ప్రసంగానికి అనుచరులు అడ్డు తగిలినట్లు సమాచారం.

సమావేశానికి హాజరుకాని మంత్రి సోదరులు
మంత్రి ఆదినారాయణరెడ్డి తన స్వగ్రామంలో నిర్వహించిన కార్యకర్తలతో  సమావేశానికి ఆయన సోదరులు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి హాజరుకాలేదు. అందుకు ప్రధాన కారణం ఇటీవల సీఎం సమావేశం సందర్భంగా మంత్రి తన సోదరులు గురించి చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. అప్పట్లో కేసు రాజీ పడుతాం, ఎమ్మెల్సీ పదవికీ రామసుబ్బారెడ్డి రాజీనామా చేసి, ఆ పదవి తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే అభ్యర్థనను మంత్రి ప్రతిపాదించారు. అందుకు పీఆర్‌ అంగీకరిస్తూనే, రాజకీయంగా ప్రధాన భూమిక పోషించిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి గైర్హాజర్‌ అయిన విషయాన్ని ప్రస్తావించారు. రేపొద్దున మంత్రిని కాదని వారు అడ్డు నిలిస్తే చేసేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ సందర్భంగా మంత్రి ఆది తన సోదరులు కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకే మంత్రి చర్యలు, నిర్ణయాల పట్ల వారు వ్యతిరేకంగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు ఓ వైపు, సోదరులకు ప్రాధాన్యత లేకపోగా, తోడల్లుడు, కుమారుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అంశంగా పలువురు వివరిస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ముఖ్య నాయకులకు మంత్రి వివరించినా, ఆ సమావేశానికి సోదరులు హాజరు కాకపోవడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement