సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: టీడీపీ గోపాలపురం నియోజవర్గ నేతల్లో విభేదాలు తారస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూండటంతో ఇరు వర్గాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ వ్యవహారాల్లో ఇద్దరికీ పొసగడం లేదు.
వరికి వారే అన్న చందంగా వేరు కుంపట్లు పెట్టారు. మద్దిపాటిని ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి ముప్పిడి కట్టబెట్టాలన్న డిమాండ్ తెర పైకి వస్తోంది. దీని కోసం ఎంతవరకై నా వెళ్లేందుకు ముప్పిడి వర్గం సిద్ధంగా ఉంది. చివరికి పార్టీ అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకై నా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దేవరపల్లి మండలం గౌరీపట్నంలో గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముప్పిడి వర్గీయులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన భేటీ అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగింది.
మద్దిపాటి వర్గాన్ని ఎదుర్కోవడం, ముప్పిడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఎలా వ్యవహరించాలన్న విషయమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. గ్రామానికి 50 మంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి, ముప్పిడికి మద్దతుగా భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని, మద్దిపాటి ఒంటెద్దు పోకడను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
వచ్చే ఎన్నికల్లో మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, ఆయనను చిత్తుగా ఓడించేందుకై నా వెనుకాడరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అనంతరం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మద్దిపాటికి టికెట్ ఇవ్వవద్దంటూ వివరించాలని తీర్మానం చేశారు. దేవరపల్లి మండల మాజీ అధ్యక్షుడు కొయ్యలమూడి చినబాబు, సుంకర దుర్గారావు, ఏలేటి సత్యనారాయణ (నల్లజర్ల), మేడ్ని సుధాకర్ (గోపాలపురం), సుంకవల్లి బ్రహ్మయ్య (ద్వారకా తిరుమల), పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆది నుంచీ అదే గతి
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో గోపాలపురం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు విసిగిపోతున్నారు. ముందు నుంచీ పార్టీ కోసం పని చేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరావును నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించి, ఈ విభేదాలకు చంద్రబాబు ఆజ్యం పోశారు. అప్పటి నుంచీ ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్‌చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును నియమించారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో అగ్గి మరింత రాజుకుంది.
తమ నేతను ఎందుకు తప్పించారో స్పష్టం చేయాలని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. ముప్పిడి వెంకటేశ్వరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు. ఈ పంచాయితీ చంద్రబాబు దృష్టికి వెళ్లింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆయన సైతం మద్దిపాటికి మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడు మొదలైన ముసలం ఇప్పటికీ సమసిపోవడం లేదు. ముప్పిడి, మద్దిపాటిది తలోదారైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలు సైతం ఎవరికి వారు నిర్వహిస్తున్నారు.
ఫలితమివ్వని బాబు యాత్ర
టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు, వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు టీపీడీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’లో కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా సైతం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు చల్లార్చే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడం తప్ప చేసిందేమీ లేదు.
కనీసం ఆయన పర్యటించిన నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ కుమ్ములాటలను చక్కదిద్దిన పాపాన పోలేదు. తమ్ముళ్ల తగవులు తీర్చలేక చేతులెత్తేశారు. కార్యకర్తలు, నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని మరీ కలసికట్టుగా ఉండాలని హితబోధ చేసినా నేతల్లో ఎలాంటి మార్పూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment