● ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్
● చక్రం తిప్పిన యనమల, నిమ్మకాయల
● ‘మెట్ల’కు చెక్ పెట్టిన చినరాజప్ప
● భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఆశావహులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద క్యూ కట్టారు. ఎవరికి వారు పార్టీ అభ్యర్థిత్వం తమకంటే తమకు దక్కుతుందని ఆశల పల్లకీలో ఊరేగారు.
ఇందుకోసం ఆశావహులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇంతలో చంద్రబాబు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌ను ప్రకటించారు. పార్టీ గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈ ఎమ్మెల్సీ పేరు చెప్పి ఊరించి ఊరించి ఉసూరుమనిపించారని పార్టీ సీనియర్ నేతలు అధిష్టానంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం కోసం మొదటి నుంచీ రేసులో ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మకు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు.
పిల్లి సత్తిబాబు ఆశలపై నీళ్లు
బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్తిబాబు ఆశలు పెంచుకున్నారు. తనకు కాకపోయినా తన భార్య అనంతలక్ష్మికి మహిళ, బీసీ కోటాలో ప్రాతినిధ్యం కల్పిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు త్యాగం చేసి, ఆ పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కోసం మొదటి రోజు నుంచి తమ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేశారని సత్తిబాబు వర్గీయులు పేర్కొంటున్నారు. పార్టీలో బీసీలను కూడగట్టినందుకు పార్టీ అధిష్టానం తగిన ప్రాతినిధ్యం కల్పిస్తుందని లెక్కలేసుకున్నారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కూడా పలు సందర్భాల్లో స్పష్టమైన హామీ కూడా ఇచ్చారని సత్తిబాబు వర్గం చెబుతోంది.
అసెంబ్లీ నుంచి కాకున్నా మండలి నుంచి అవకాశం లభిస్తుందని భరోసా ఇచ్చి ఇప్పుడు ఇలా తమ నాయకుడిని అవమానిస్తారా అని ఆ వర్గం మండిపడుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని వెన్నంటి నిలిచినందుకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ సామాజికవర్గంలో శెట్టిబలిజలకు ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడంతో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని తాము వేసుకున్న అంచనాలు కాస్తా తల్లకిందులయ్యాయంటున్నారు. ఆ సామాజికవర్గం నుంచి పిల్లి అనంతలక్ష్మి దంపతులతో పాటు, పెంకే శ్రీనివాసబాబా వంటి నాయకులు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని చివరి వరకు ఆశించి భంగపాటుకు గురయ్యారు.
యనమలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా జత కలిసి తమకు ఎమ్మెల్సీ రాకుండా చెక్ పెట్టారని సత్తిబాబు వర్గం బలంగా నమ్ముతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చినరాజప్ప పెద్దాపురం నుంచి కాకినాడ రూరల్ స్థానానికి మారతారనే ప్రచారం జరిగింది. అప్పట్నుంచీ చినరాజప్ప, పిల్లి సత్తిబాబు మధ్య వైషమ్యాలు పొడచూపాయి. ఈ వర్గాలు పరస్పరం చేసుకున్న విమర్శలు, ప్రతి విమర్శ లు అప్పట్లో కాకినాడ రూరల్ రాజకీయాన్ని వేడెక్కించాయి. అవన్నీ మనసులో పెట్టుకునే చినరాజప్ప సీనియర్ నాయకుడు యనమలతో కలిసి ఎమ్మెల్సీ విషయంలో దెబ్బతీశారని ఆ వర్గం అనుమానిస్తోంది.
వైఎస్సార్ సీపీలోనే శెట్టిబలిజలకు ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో శెట్టిబలిజ సామాజికవర్గానికి ఒకే ఒక అసెంబ్లీ స్థానం రామచంద్రపురం కేటాయించారు. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రాతినిధ్యం కచ్చితంగా ఉంటుందని ఆ సామాజికవర్గ నేతలు ఆశించారు. అదే వైఎస్సార్ సీపీకి వచ్చేసరికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు రాజమహేంద్రవరం రూరల్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు ఇచ్చింది.
అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడిగా ఉన్న కుడుపూడి సూర్యనారాయణరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అగ్రాసనం వేసింది. అలా వైఎస్సార్ సీపీలో శెట్టిబలిజలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. టీడీపీలో మాత్రం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీలో ఆ సామాజిక వర్గీయులు తీవ్ర నిరాశతో ఉన్నారు. చంద్రబాబు మాత్రం బీసీలకే పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోతున్నారంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్‌లకు కూడా మొండిచేయి చూపించారని ఆవేదన చెందుతున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీలో తొలి తరం సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఇటీవల ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గెలుపులో కృషి చేసినప్పటికీ ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు.
అమలాపురం నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం రమణబాబుకు దక్కుతుందని ఆ వర్గం ఆశించింది. కోనసీమ జిల్లాలో మెట్ల రమణబాబుకు అవకాశం కల్పించకున్నా అదే సామాజికవర్గం నుంచే పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వం ఖరారు చేశామని పార్టీ అగ్ర నేతలు సమర్థించుకుంటున్నారు.
మెట్లతో వైరివర్గంగా ఉన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెర వెనుక రాజశేఖర్‌కు మద్దతుగా పావులు కదిపి రమణబాబుకు చెక్ పెట్టారని చర్చ జరుగుతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా చినరాజప్ప వ్యూహాత్మంగా వ్యవహరించారు. అక్కడ రమణబాబును దెబ్బతీసేందుకు రాజశేఖర్ని తెరపైకి తెచ్చి ఇటు పిల్లి సత్తిబాబును దెబ్బతీశారు.. ఇదంతా చినరాజప్ప, యనమల కలిసి ఆడిన రాజకీయ చక్రవ్యూహంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. రమణబాబు రాజకీయ ఎదుగుదలను కట్టడి చేసేందుకే చినరాజప్ప వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజశేఖర్‌కు సానుకూలంగా మద్దతు కూడగట్టారని మెట్ల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment