గ్లాసు.. పగిలేలా ఉంది బాసూ! | - | Sakshi
Sakshi News home page

గ్లాసు.. పగిలేలా ఉంది బాసూ!

Published Sat, Feb 17 2024 3:14 AM | Last Updated on Sat, Feb 17 2024 11:09 AM

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ రాజకీయం రంజుగా సాగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే టికెట్టు కచ్చితంగా తనకే అని భావిస్తున్న జనసేన నేత బత్తుల బలరామకృష్ణకు శృంగభంగం తప్పేలా లేదు. టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి ఇటీవల చేసిన ప్రకటన బలం ఇందుకు చేకూరుస్తోంది. ఈ పరిణామం జనసేన, టీడీపీ నేతల్లో గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సీటు విషయమై ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇవ్వకపోవడం జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది.

అధినేత ప్రకటనతో..
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణ బల్లగుద్ది మరీ ప్రకటించారు. అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, సీటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనికి తోడు పవన్‌ కల్యాణ్‌ సైతం రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. టీడీపీ కేడర్‌తో సంబంధం లేకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరులో టీడీపీ నిర్వహించిన చంద్రబాబు సభలో సైతం తనదైన శైలిలో రెచ్చిపోయారు. చంద్రబాబునే ఎదిరించే స్థాయికి చేరారు. బాబు కాన్వాయ్‌ను అడ్డుకునే చర్యలకు దిగి ఆయన విసిగిపోయేలా వ్యవహరించారు. ఇదంతా తనకు టికెట్‌ ఖరారైందన్న భావనలో చేసినట్లు సమాచారం.

బొడ్డు ఎంట్రీతో షాక్‌
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న బొడ్డు వెంకట రమణ చౌదరిని కాదని జనసేనకు రాజానగరం సీటు కేటాయిస్తారన్న విషయమై ఆయన వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబుతో, రాష్ట్ర పార్టీ నేతలతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వారు వెళ్లారు. జనసేన తొందరపాటు నిర్ణయం ఫలితంగా టీడీపీకి తీరని నష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్‌లో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలి రా.. సభలో సైతం అసమ్మతి గళమెత్తారు. బొడ్డు ఆందోళనతో అవాక్కయిన చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ స్థానంలో పోటీ చేయాలన్న ప్రతిపాదన తీసుకువచ్చారు.

దీనికి బొడ్డు అంగీకరించకపోవడంతో పునరాలోచనలో పడిన చంద్రబాబు.. న్యాయం చేస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. బాబు భరోసాతో నియోజకవర్గానికి వచ్చిన బొడ్డు వెంకటరమణ చౌదరి తనదైన శైలిలో ప్రకటన చేశారు. రాజానగరంలో జనసేన పోటీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని, భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న జనసేన నేతల్లో ఉత్పన్నమవుతోంది. రాజానగరంలో టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందులో భాగంగా బొడ్డు ప్రకటన చేశారా అనే అనుమానం కలుగుతోంది. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటన చేశారంటే రాజానగరం సీటు బొడ్డుకే కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే నిజమైతే జనసేన నేత బత్తుల బలరామకృష్ణ పరిస్థితేమిటని, తమ ‘గ్లాసు’ పగిలేలా ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

అగ్నికి ఆజ్యం పోస్తున్న అధినేతల తీరు
టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల వ్యవహార శైలి ఆయా పార్టీల శ్రేణుల్లో వైషమ్యాలకు దారి తీస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి చేరింది. ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో ఇరు పార్టీల నేతలూ విడిపోయి ప్రచారాలు చేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement