చంద్రబాబు తీరుపై ఆశావహుల మండిపాటు
కొవ్వూరు టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్
కొవ్వూరు: గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న కొవ్వూరు టీడీపీలో అభ్యర్థి ఖరారు అంశం ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. కొవ్వూరు అభ్యర్థిగా ఒక్క ముప్పిడి వెంకటేశ్వరరావు పేరుపై మాత్రమే అధిష్టానం సోమవారం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. దీనిపై స్థానికులైన ఆశావహులు తీవ్ర అసంతృప్తి, చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి తమను వాడుకుని, తమకు అవకాశం వచ్చినప్పుడు కరివేపాకుల్లా తీసి పారేస్తున్నారంటూ మండిపడుతున్నారు. కొవ్వూరులో ఆ పార్టీ ఆశావహులు ప్రత్యేకంగా సమావేశమై మీడియా ఎదుట తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి, చేతిచమురు వదిలించుకుని, ఆర్థికంగా నష్టపోయామని అన్నారు.
గత ఎన్నికల్లో స్థానికేతరులైన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టికెట్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యామని, మళ్లీ ఇప్పుడు స్థానికేతరుడైన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు పరిశీలించడంతో తాము నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. కనీసం నియోజకవర్గ ఓటరు కాని వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 45 వేల మంది ఎస్సీలున్నారని, తమలో ఏ ఒక్కరూ పని చేయరా అని ప్రశ్నించారు. స్థానికంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా సమష్టిగా పని చేస్తామని చెప్పారు.
బాదుడే–బాదుడు, బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇదే ఖర్మ రాష్ట్‌ట్రానికి, సూపర్ సిక్స్, రా.. కదలిరాతో పాటు చంద్రబాబు అరెస్ట్ సమయంలో పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ భాగస్వాములమైన తమ పేర్లు ఇప్పుడు కనీసం పరిశీలనలో కూడా లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అభ్యర్థి విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మునిసిపల్ మాజీ చైర్మన్ కొల్లి రమేష్, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ పెనుమాక జయరాజు, రాపాక సుబ్బారావు, జీజీ చలం, వేమగిరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment