టీడీపీ ప్రచార కరపత్రాలు దగ్ధం చేస్తున్న టీడీపీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు
పార్టీ శ్రేణుల నిర్ణయం మేరకే ముందుకు వెళ్తానంటున్న నల్లమిల్లి
సానుభూతి కోసమే కొత్త డ్రామాలు
అనపర్తి ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది.
చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు.
నాలుగు రోజులుగా రచ్చ
వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు.
పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు.
ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు.
నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి
అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి
పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు.
మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment