విశాఖపట్నం, సాక్షి: పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు..
..గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి.
.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్ వన్‌సైడ్ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు.
.. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment