జవహర్‌కు టికెట్టు ఇవ్వొద్దంటూ ప్లకార్డులు పదర్శిస్తున్న టీడీపీ శ్రేణులు
కొవ్వూరు: వారం పది రోజుల్లో టీడీపీ టికెట్లు ప్రకటిస్తారన్న సమాచారంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు రోడ్డున పడ్డాయి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలున్నాయన్న సంకేతాలతో ఆయన వ్యతిరేక వర్గం కొన్నాళ్లుగా అసంతృప్తి గళం విప్పుతున్న విషయం తెలిసిందే.
జవహర్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు వారం రోజులుగా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం పేరిట కొవ్వూరు లిటరరీ క్లబ్ కల్యాణ మండపంలో గురువారం సమావేశం నిర్వహించారు. దీనికి అచ్చిబాబు వర్గీయులు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా జవహర్‌కు టికెట్టు ఇవ్వద్దన్న ఏకై క నినాదాన్ని తెర పైకి బలంగా తీసుకువచ్చారు.
గ్రూపులకు తెర తీశారు
ఈ సమావేశం పూర్తిగా జవహర్‌ను టార్గెట్ చేస్తూ సాగింది. ‘కేఎస్ జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తనకు టికెట్టు వచ్చినట్లు జవహర్ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులను గ్రూపులుగా విభజించి అనైక్యతకు దారి తీసేలా జవహర్ పని చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని సూర్య భాస్కర రామ్మోహన్ (చిన్ని) ఆరోపించారు.
నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకూ పార్టీని రెండు వర్గాలుగా విడదీసి భ్రష్టు పట్టించారని అన్నారు. ఈ నేపథ్యంలో 2020లో అధిష్టానం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి, గ్రూపులను సమన్వయంపరిచే ప్రయత్నం చేసిందన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ నిర్వహించినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలోను పార్టీని రెండు గ్రూపులుగా విభజించి కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.
2021లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జవహర్ బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచీ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలు, నచ్చిన వారికే పదవులు కేటాయింపు చేసుకున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడి ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాని, శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లడమే నాయకత్వంగా భావించారని చిన్ని విమర్శించారు.
ఎస్సీ విభాగం నాయకుడు మాట్లాడుతూ, గతంలో తనను ఓడించడానికి ప్రత్యర్థులకు సైతం జవహర్ సొమ్ములు సర్దుబాబు చేశారని, దళితుడినైన తన పైనే హత్య కేసు నమోదు చేయించి, వేధించారని ఆరోపించారు. నియోజకవర్గంలో జవహర్ విద్వేషాలు రెచ్చగొట్టినా పార్టీ కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని తెలుగు యువత నాయకుడు కాకర్ల సత్యేంద్ర అన్నారు. టీడీపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ అణగదొక్కేందుకు జవహర్ ప్రయత్నించారని ఆరోపించారు.
అందుకే 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పటికీ ఆయనపై ప్రత్యక్ష పోరాటం చేశామని అన్నారు. చాగల్లు మాజీ ఎంపీపీ కేతా సాహెబ్, తెలుగు యువత నాయకులు నాదెండ్ల శ్రీరామ్, ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణ తదితరులు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గారపాటి శ్రీదేవి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, తెలుగు యువత నాయకుడు సూర్యదేవర రంజిత్, పార్టీ పట్టణ అధ్యక్షుడు దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అచ్చిబాబు సూచించిన వ్యక్తికే టిక్కెట్?
నియోజకవర్గంలో అచ్చిబాబు సూచించిన వ్యక్తులకే టికెట్టు ఇస్తారని అత్యధిక నాయకులు అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఖరారులో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు తరచూ ప్రకటిస్తుండగా.. ఇక్కడ మాత్రం అచ్చిబాబు మాటే వేదమని, ఆయన చెప్పినవారికే టికెట్టు అని పలువురు చెప్పడం విశేషం. అచ్చిబాబును కాదనే వారికి నియోజకవర్గ టీడీపీలో చోటు లేదని కూడా నాయకులు మాట్లాడటం గమనార్హం.
ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం అచ్చిబాబు మాటకు విలువ ఇస్తుందా.. లేక ఐవీఆర్‌ఎస్ సర్వేల ఆధారంగా టికెట్టు కేటాయిస్తుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నియోజకవర్గ టీడీపీలో ఎనిమిదేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భగ్గుమనడం.. అందునా జిల్లా టీడీపీ అధ్యక్షుడి పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
తిరువూరు లేదు... కొవ్వూరు రాదు!
గత ఎన్నికల సమయంలో కూడా అచ్చిబాబు వర్గం జవహర్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో టీడీపీ అధిష్టానం కొవ్వూరు టికెట్టును పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఇచ్చి, జవహర్‌ను కృష్ణ జిల్లా తిరువూరు పంపించింది. అక్కడ ఓటమి పాలైన జవహర్ ఐదేళ్ల నుంచి కొవ్వూరునే కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.
ఇటీవల ఐవీఆర్‌ఎస్‌లో సర్వేలో జవహర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో ఆయనకు పొగ పెట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభమైన తాజా విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. ఇప్పుడు ఏకంగా జవహర్ వద్దనే ఏకై క నినాదంలో ప్రత్యర్థి వర్గం భారీ సభ నిర్వహించడంతో ఆయనకు టికెట్టు ఖరారు కావడం కష్టమేనని పలువురు భావిస్తున్నారు. తిరువూరు వదిలేసి కొవ్వూరుపై ఆశలు పెంచుకున్న జవహర్‌కు ఈసారి కూడా ఆశాభంగం తప్పదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment