
మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
అనుకున్నదొక్కటి...అయినదొక్కటి
కొవ్వూరు నుంచి పోటీ చేయడంపై అనుమానమే...?
కొవ్వూరు: అనుకొన్నదొక్కటి...అయినదొక్కటి అన్న చందంగా తయారైంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. తాను కొవ్వూరు నియోజకవర్గం నుంచి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటా.. అంటూ జవహర్ తొడ కొట్టారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుందని తన వర్గీయులకు చెబుతూ వచ్చారు. కొవ్వూరు సీటు తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు మంగళవారం ఈ మేరకు ప్రకటన సైతం విడుదల చేశారు. దీంతో జవహర్‌కు ఇంక అసెంబ్లీ సీటు ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించారని స్పష్టమవుతోంది.
జవహర్‌కే కొవ్వూరు సీటు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన టీడీపీలోని ఆయన వర్గం నాయకులు ఇప్పుడు వ్యతిరేక వర్గంతో కలిసి పనిచేయలేని పరిస్థితి నెలకొంది. జవహర్ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును తీవ్రంగా విభేదించి, ఇన్నాళ్లూ ఆయనకు దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరైతే పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జవహర్‌కు ఆ పార్టీ అధిష్టానం ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంతో పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. నారా లోకేష్ ఇన్నాళ్లూ ఈ పదవిలో కొనసాగారు. పార్టీలో అటువంటి కీలకమైన పదవిని జవహర్‌కు కట్టబెట్టడంపై అచ్చిబాబు వర్గీయులు మండిపడుతున్నారు.
కీలక పదవి దక్కిందని జవహర్ వర్గీయులు కొందరు సంబర పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న జవహర్ ఫొటోను మాత్రం టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచార రథంపైన గానీ,ఫ్లెక్సీల్లో గానీ వేయడం లేదు. మరిప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోకి వచ్చినా ఫొటో అయినా వేస్తారా? లేదా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జవహర్ ఫొటో వేయించినా మళ్లీ ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమనే అవకాశాలున్నాయి. దళితుడైన జవహర్‌కు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టామని ఆ పార్టీ అధిష్టానం చెప్పుకోవడానికే ఇన్నాళ్లూ ఆయన పదవి ఉపయోగ పడింది. ఇక మీదటనైనా జాతీయ స్థాయి పదవికై నా ఆ పార్టీ నేతలు, వ్యతిరేక వర్గీయుల నుంచి గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరీ.