KS Jawahar
-
కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్కుమార్ప్రసాద్ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్‌లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్‌బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్‌రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ప్రసాద్, రజత్‌భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్వానం లేదు.. ఫొటోకూ చోటు లేదా!
కొవ్వూరు: ‘పదవి గొప్ప.. మర్యాద సున్నా’ అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయిన ఆయన తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఎంత చరిత్ర ఉంటేనేం.. ఎన్ని పదవులు ఉంటేనేం.. కొవ్వూరులో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయనకు కనీస ఆహ్వానం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా మూడు పార్టీలతో టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు ఆధ్వర్యాన ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి జవహర్‌కు ఆహ్వానం లేకపోగా.. ఆ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీనినిబట్టి దళిత సామాజికవర్గ నేతకు టీడీపీలో దక్కిన గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దళితులపై చిన్నచూపు కేవలం దళిత నేత కావడమే ఆయన చేసిన పాపమా? అంటూ టీడీపీ దళిత నాయకులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో దళితులపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తానెవరికీ తలవంచే ప్రసక్తే లేదని, పెత్తందార్ల పైనే తన పోరాటమని, పార్టీకి బానిసగా పని చేస్తానని పలు సందర్భాల్లో జవహర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పెత్తందార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జవహర్‌ను ఆహ్వానించలేదంటూ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి జవహర్ వర్గీయులు గైర్హాజరయ్యారు. టీడీపీలో పెత్తందార్ల హవానే నడుస్తోందని చెప్పడానికి ఈ సమావేశమే ఓ ఉదాహరణని విమర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా మరోవైపు జవహర్‌కు కొవ్వూరు టికెట్ కేటాయించాలని కోరుతూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యాన తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దళిత, ప్రజా సంఘాలు, మాదిగ దండోరా నేతలు పాల్గొని పార్టీ పెద్దలకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డప్పు కళాకారులు, చర్మకారులు, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు నియోజకవర్గ దళిత నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జవహర్‌కు టికెట్‌పై టీడీపీలో మరోసారి రచ్చ నడుస్తోంది. తాను పోటీలో ఉంటానని జవహర్ ఇప్పటికే ప్రకటించగా.. ఆయనను అచ్చిబాబు వర్గం పూర్తిగా పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించడంతో విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల వేళ టీడీపీలో విభేదాలు సద్దుమణగకపోవడం చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. -
అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్‌లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన్ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్ఈబీ కమిషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు. ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్ పిన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్‌ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా డిమాండ్‌ను యాప్‌లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
అసలుకు ఎసరు.. జాతీయ కొసరు
కొవ్వూరు: అనుకొన్నదొక్కటి...అయినదొక్కటి అన్న చందంగా తయారైంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. తాను కొవ్వూరు నియోజకవర్గం నుంచి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటా.. అంటూ జవహర్ తొడ కొట్టారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుందని తన వర్గీయులకు చెబుతూ వచ్చారు. కొవ్వూరు సీటు తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు మంగళవారం ఈ మేరకు ప్రకటన సైతం విడుదల చేశారు. దీంతో జవహర్‌కు ఇంక అసెంబ్లీ సీటు ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించారని స్పష్టమవుతోంది. జవహర్కే కొవ్వూరు సీటు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన టీడీపీలోని ఆయన వర్గం నాయకులు ఇప్పుడు వ్యతిరేక వర్గంతో కలిసి పనిచేయలేని పరిస్థితి నెలకొంది. జవహర్ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును తీవ్రంగా విభేదించి, ఇన్నాళ్లూ ఆయనకు దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరైతే పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జవహర్‌కు ఆ పార్టీ అధిష్టానం ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంతో పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. నారా లోకేష్ ఇన్నాళ్లూ ఈ పదవిలో కొనసాగారు. పార్టీలో అటువంటి కీలకమైన పదవిని జవహర్‌కు కట్టబెట్టడంపై అచ్చిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. కీలక పదవి దక్కిందని జవహర్ వర్గీయులు కొందరు సంబర పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న జవహర్ ఫొటోను మాత్రం టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచార రథంపైన గానీ,ఫ్లెక్సీల్లో గానీ వేయడం లేదు. మరిప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోకి వచ్చినా ఫొటో అయినా వేస్తారా? లేదా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జవహర్ ఫొటో వేయించినా మళ్లీ ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమనే అవకాశాలున్నాయి. దళితుడైన జవహర్‌కు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టామని ఆ పార్టీ అధిష్టానం చెప్పుకోవడానికే ఇన్నాళ్లూ ఆయన పదవి ఉపయోగ పడింది. ఇక మీదటనైనా జాతీయ స్థాయి పదవికై నా ఆ పార్టీ నేతలు, వ్యతిరేక వర్గీయుల నుంచి గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరీ. -
కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి: సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్ సైట్లన్నిటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను,ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఏశాఖనుంచైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని అన్నారు.చాలా వరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి స్పష్టత ఉండేలా ఈమార్గదర్శకాలను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్ లో నివేదిక ఇవ్వాలని అందరు కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొత్త పధకాలు ప్రకటించడానికి వీలులేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్లు మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఈవో స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో పనులు మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల ఫించన్లు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కోడ్ అమలులోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆప్రక్రియను కొనసాగించుకోవచ్చని కాని టెండర్లను ఖరారు చేయడానికి వీలులేదని సీఈవో మీనా కార్యదర్శులకు తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నిటినీ షెడ్యూల్ వెలువడిన 48గంటల్లో తొలగించాలని సీఈవో స్పష్టం చేశారు. అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు,సందేశాలు వంటివి ఉండరాదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు అత్యవసర చికిత్సల కోసం సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సద్భావనా దివస్, గాంధీ జయంతి వంటి జాతీయ ప్రాముఖ్యతా దినోత్సవాల వేడుకల్లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన వచ్చని, ఆవేడుకల్లో రాజకీయపరమైన ప్రసంగాలు ఏపచేయరాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన పలు సందేశాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,వై.శ్రీలక్ష్మి,కె.విజయా నంద్,వర్చువల్‌గా యం.టి కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, హరీశ్ కుమార్ గుప్త, ప్రవీణ్ ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీ మోహన్, పలువురు కార్యదర్శులు,కమీషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జవహర్ యూటర్న్
కొవ్వూరు: మాజీ మంత్రి కేఎస్ జవహర్ యూటర్న్ తీసుకున్నారు. కొవ్వూరు టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరువూరులోనైనా అవకాశం ఇవ్వాలంటూ అధినేతను వేడుకొంటున్నారు. టీడీపీ కొవ్వూరు టిక్కెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై ఆయన షాకయ్యారు. తాను నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటానని రెండు రోజుల క్రితం శపథం చేశారు. అది నిజమేననుకుని ఆయన వర్గీయులందరూ భ్రమ పడ్డారు. అయితే జవహర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తిరువూరుపై ఆయన కన్నెశారు. దీని భాగంగా ఆయన స్వగ్రామమైన గానుగపాడు పయనమయ్యారు. అక్కడే మకాం వేసి ఆదివారం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో ఐదేళ్లుగా కొవ్వూరులో ఆయన వర్గీయులుగా ముద్ర వేసుకున్న నాయకుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధిష్టానం కొవ్వూరు టిక్కెట్‌ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై జవహర్ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం కూడా జవహర్ విలేకరుల సమావేశం నిర్వహించి, తాను కొవ్వూరు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని వెల్లడించారు. ఇప్పుడు జవహర్ యూటర్న్ తీసుకోవడంతో ఆయన వర్గీయులకు ఏమి చేయాలో తెలియడం లేదు. ముప్పిడికి టిక్కెట్ ఇవ్వడాన్ని విభేదించిన తాము.. మళ్లీ ఆయన చెంతకు ఎలా వెళ్లతామంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల నుంచి జవహర్ కోసం ఎన్నోసార్లు తగవులు పడ్డాం, ఇప్పుడు టీడీపీలో వ్యతిరేక వర్గంతో కలిసి ఎలా పనిచేయగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జవహర్ మాత్రం మరోసారి తిరువూరు నుంచి అవకాశం ఇవ్వాలంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. -
టీడీపీలో సీనియర్లకు మొండిచేయి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు సీన్ కట్ అయ్యింది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నాయకులను పొత్తుల పేరుతో, సర్వేల పేరుతో వారి టికెట్లు గల్లంతు చేసి టీడీపీ వదిలించుకుంది. జిల్లాలో ఏకంగా ఐదుగురు సీనియర్లకు మొండిచేయి చూపి డబ్బు సంచులకే ప్రాధాన్యం ఇస్తూ ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో టికెట్లు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దళిత మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, బండారు మాధవనాయుడుకు టీడీపీ జాబితాలో సీటు గల్లంతు కాగా పార్టీ పెద్దలు నామమాత్రంగా అయినా పట్టించుకోని దుస్థితి. పక్కన పెట్టేశారు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు. సామాజిక, ఆర్థిక ప్రాబల్యం ఉండి నియోజకవర్గంలో పనిచేస్తున్నా లోకేష్‌తో సత్సంబంధాలు గొప్పగా లేవని, సంతృప్తిస్థాయి లేదనే కారణాలతో టికెట్లు గల్లంతు చేశారు. అది కూడా సామాజిక సమీకరణాలు పట్టించుకోకుండా ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి అన్ని సీట్లు ఇవ్వటం, పొత్తుల పేరుతో టీడీపీ కాపు సీట్లన్నీ పూర్తిగా వదిలించుకోవడం, బీసీలకు ఒక్క సీటు మాత్రమే కేటాయించడంపై జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజకీయం రగులుతుంది. డబ్బే ప్రామా ణికం అంటూ అడ్డగోలుగా టికెట్లు కేటాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర అసంతృప్తితో.. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ కనీసం స్పందించలేదు. శివరామరాజు అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీడీపీకి గుడ్‌బై చెబుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నరసాపురం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు మాధవనాయుడు అక్కడ క్రియాశీలకంగా పనిచేసి టికెట్ ఆశించి పొత్తుల పేరుతో భంగపడ్డారు. కనీసం పార్టీ నుంచి పిలుపు లేకపోగా అధినేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి భంగపడటంతో రాజీనామా దిశగా యోచన చేస్తున్నారు. అలాగే టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పొత్తులతో టికెట్ పొగొట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కావడంతో పార్టీ పెద్దలు ఒకటికి రెండు సార్లు బుజ్జిగించటంతో మౌనంగా ఉన్నారు. పెత్తందారులదే టీడీపీలో పెత్తనం అంటూ.. రెండు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ సొంత సామాజిక వర్గం నేతల చేతిలో అణచివేత, వేధింపులకు గురైనా.. పార్టీ వీడకుండా ఉన్న మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్‌కు చంద్రబాబు మొండిచేయి చూపారు. 2014లో జవహర్ కొవ్వూరు నుంచి, పీతల సుజాత చింతలపూడి నుంచి గెలుపొంది మంత్రులుగా పనిచేశారు. అయినా ఆయా నియోజకవర్గాల్లో బాబు సొంత సామాజికవర్గ నేతల చేతిలో రాజకీయంగా బలికావడంతోపాటు 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో కనీసం ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా కూడా వేయించుకోలేని దుస్థితి వారిద్దరిదీ. సా మాజిక కోణంలో అయినా కచ్చితంగా అవకాశం వస్తుందని రెండు జాబితాల వచ్చే వరకు వేచి చూసి భంగపడిన వారు తీవ్ర అసంతృప్తితో మాట్లాడారు. పెత్తందారులదే టీడీపీలో పెత్తనమని, దళితులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా మాట్లాడటంతో జిల్లాలో చర్చగా మారింది. -
టీడీపీకి రాజీనామా దిశగా మాజీ మంత్రి కేఎస్ జవహర్?
సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్‌ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్‌ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి జవహర్‌కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్‌కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్‌కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమన్న జవహర్ వర్గీయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్‌నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు. ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు. -
కొవ్వూరు టీడీపీలో ఇరు వర్గాల కొరకొర
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి. రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్‌కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముప్పిడిని బరిలోకి దింపే యోచన కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గతంలో జవహర్‌తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు. ఫ్లెక్సీల వివాదం తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు జవహర్‌కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్‌ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. జవహర్ వైపే అధినేత మొగ్గు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాలన్నారు. పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాన్ ఫాల్ట్ జోన్లో మరో 149 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్ రెగ్యులేటర్ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే 17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ అక్టోబర్‌కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్‌ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా పోలవరం.. ► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్‌తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ► గైడ్ బండ్లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్ బండ్లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. గైడ్ బండ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్, సిమెంట్ స్లర్రీతో నింపి గాబియన్లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్ బండ్‌ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్ బండ్‌ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్ నోట్ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అంబటి, అధికారులకు సీఎం అభినందనలు నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్ వాటర్ అవార్డ్స్–2022) ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సీఎం జగన్‌కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. -
చిరుధాన్యాల సాగుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
-
Andhra Pradesh: 57 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 57 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం కల్పించింది. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. -
AP: 14న రాష్ట్ర కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్లవి.. కుట్రపూరిత కథనాలే
సాక్షి, అమరావతి: ‘సీఎస్‌తో కలసి వెళ్లిన ఓఎస్డీ’ శీర్షికన ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దారుణమైన అబద్ధాలను ఆలంబనగా చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఆంధ్రజ్యోతి వెబ్సైట్, ఏబీఎన్ చానల్ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ అధినేత అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చులకన చేస్తూ, కుట్రపూరితంగా కట్టుకథలు అల్లాయని స్పష్టం చేశారు. ఓ అత్యున్నత స్థాయి అధికారిని, వ్యవస్థను కించపరుస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగులందరిలో అత్యున్నతస్థాయి అధికారిని టార్గెట్ చేస్తూ అవాస్తవాలను ప్రచురించడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా ఏ జర్నలిజం విలువల ఆధారంగా పని చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. తాను ఖండనలో పొందుపరిచిన అన్ని విషయాలను అంతే ప్రాధాన్యతతో, బేషరతుగా క్షమాపణలు చెబుతూ ప్రచురించాలన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సత్యదూరమైన న్యూస్ ఐటమ్‌ను ఆయా పత్రికల్లో ఏ పేజీల్లో ఎంత ప్రాముఖ్యతతో ప్రచురించారో, ఏ సమయంలో ఎంత ప్రాధాన్యతతో చానల్లో కథనాలను ప్రసారం చేశారో అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యతతో ఖండనను ప్రసారం చేస్తూ జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ న్యూస్ ఐటమ్కు బాధ్యులపై న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీట్ నంబర్ 1 డి... వెళ్లింది హైదరాబాద్ వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో రూ.5 కోట్లతో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 4వతేదీ ఉదయం 9.58 గంటలకు నిర్వహించాలని ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే 2022 అక్టోబర్ 14 నిర్ణయించారని సీఎస్ తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను ఫిబ్రవరి 2వతేదీ రాత్రి 11 గంటలకు రేణిగుంట ద్వారా కడప చేరుకున్నట్లు వివరించారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటలకు కడప కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాను చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ముద్దనూరులో విద్యార్ధులతో సమావేశం ముగియగానే 4.40కి బయలుదేరానని, సుమారు 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్, ఇతర అధికారులు తనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారని తెలిపారు. రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్ ఎస్జీ 3003 సిరీస్ ద్వారా 1 డి సీట్లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే శుక్రవారం రోజు సీఎస్‌తో కలసి ఓఎస్డీ విజయవాడ వెళ్లారని, ఒకే వాహనంలో ప్రయాణించారని ప్రచురించిన కథనాలు ఊహాజనితం, సత్యదూరమని చెప్పారు. దారుణమైన ఈ అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, అమరావతి: ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల అస్త్రం ఓటు హక్కని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారందర్నీ ఓటర్లుగా నమోదు చే యించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 3.03 లక్షల మంది ఓటర్ల నమోదుతో పాటు, మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాశాల విద్య కమిషనర్ పి.భాస్కర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదా వరి జిల్లాల కలెక్టర్లు కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎం.హరినారాయణ, ఎ.మల్లికార్జున, పి.ప్రశాంతి, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్.హరేంద్ర ప్రసాద్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్‌కుమార్‌లతో పాటు ఏఆర్వోలు, బీఆర్‌వోలకు గవర్నర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. -
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు. పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు. రేడియం టేప్ అతికించాలి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
AP: సచివాలయాల పనితీరు బాగుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటివద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు ఎప్పుడూ సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో తనిఖీలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏమైనా లోటుపాట్లు, పనితీరు సక్రమంగా లేనట్లు తేలితే వాటిని సరిచేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేలా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. 2020 అక్టోబర్ 20 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో 27,473 తనిఖీలను నిర్వహించారు. ఇందులో ఒకసారి కన్నా ఎక్కువసార్లు 2,870 సచివాలయాలను సందర్శించారు. అక్కడ సిబ్బంది, వలంటీర్ల పనితీరు, రంగాల వారీగా ప్రజలకు అందిస్తున్న సేవలను పరీశీలించడమే కాక.. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, వాటి పనితీరును మదింపు చేశారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి ఈ నెల 3 వరకు కూడా సచివాలయాల పనితీరును పరిశీలించారు. దాని ప్రకారం చూస్తే.. 80.90 శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుందని.. మరో 17.99 శాతం ఓ మోస్తరుగా ఉన్నాయని తేలింది. మిగిలిన 1.11 శాతం సచివాలయాల పనితీరు బాగోలేదని తేలింది. అలాగే, 76.59 శాతం మంది వలంటీర్ల పనితీరు బాగుందని, 21.55 శాతం వలంటీర్ల పనితీరు ఓ మోస్తరుగా ఉందని.. 1.86 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని ఆ తనిఖీల్లో తేలింది. తనిఖీలు విధిగా నిర్వహించండి : సీఎస్ ఈ నేపథ్యంలో.. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పథకాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు నెలలో తప్పనిసరిగా రెండు గ్రామ, వార్డు సచివాలాయాలను తనిఖీ చేయాలని సూచించారు. అలాగే, శాఖాధిపతులు నెలకు రెండు, కలెక్టర్లు వారంలో రెండు..జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేయాలని జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. బాగోలేని, మోస్తరు పనితీరు సచివాలయాలపై ఫోకస్ ఇక పనితీరు బాగోలేని, మోస్తరు పనితీరు మాత్రమే ఉన్న సచివాలయాలపై కారణాలు అన్వేషించి ఫోకస్ పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ తెలిపారు. మంచి పనితీరు కనబరిచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్, ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్, హీరా, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, సహారా, ప్రగతి, అవని, ఆదర్శ్ తదితర కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన కేసుల ప్రగతిపైనా సమావేశంలో చర్చించారు. కేసులను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సీఎస్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఇన్చార్జ్ అంజనీ మిశ్రా, డీజీఎం రూటా మహాపాత్ర, ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, విజయకుమార్, సత్య ప్రభాకరరావు, విజయవాడ ఏసీపీ సీహెచ్ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ అప్లికేషన్‌కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్‌ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్లో ఎన్రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు. -
Andhra Pradesh: ఈ–ఆఫీస్ @ 2023.. మార్గదర్శకాలివే..!
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పని తీరులో నూతనత్వం సంతరించుకోనుంది. కాగితాలు, ఫైళ్లతో పని లేకుండా అంతా ఈ–ఆఫీస్ పద్ధతిలో కార్యకలాపాలు జరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ–ఆఫీస్ నుంచే నిర్వహించాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, తపాల్స్ అన్నీ ఈ–ఆఫీస్, అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే జరగాలని, భౌతికంగా తీసుకోబడవని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల సీఎస్ జారీ చేశారు. ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాౖలెనా ఇంతవరకు అమలు కాలేదు. ఈ–ఆఫీస్‌కు స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ శాఖలు, సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిజికల్ విధానంలోనే జరుగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా సిబ్బంది శక్తి, ఉత్పాదకత, వనరులతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలు సమర్పిస్తున్న కొన్ని ప్రతిపాదనలు, ఏసీబీ కేసులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇ–ఆఫీస్‌ను నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. అసాధారణ కేసులకు సంబంధించి సంబంధిత కార్యదర్శి అనుమతి తీసుకుంటే తప్ప మిగతా కార్యాకలాపాలన్నీ జనవరి 1వ తేదీ నుంచి ఇ–ఆఫీస్ ద్వారానే కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూచనలను చిత్తశుద్ధిలో అనుసరించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇ – ఆఫీస్ నిర్వహణపై సాధారణ పరిపాలన శాఖ ఈ నెలాఖరు వరకు శాఖాధిపతులు, శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. ► ఆమోదిత ముసాయిదా ప్రతుల కరస్పాండెన్స్‌లన్నింటీపై (జీవోలు మినహా) తప్పనిసరిగా సంబంధి అధికారి డిజిటల్ సంతకం ఉండాలి. ఆ ప్రతులను ఎంట్రీలో సూచించిన చిరునామాకు ఇ–ఆఫీస్‌లో ఇ–డిస్పాచ్‌లోనే పంపాలి. ఆమోదించిన ముసాయిదా ప్రతులను (జీవోలు మినహా) కూడా ఇడిస్పాచ్ ద్వారానే పంపాలి. ► ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలోనే జీవో నంబర్లను జనరేట్ చేయాలి. తుది జీవోను నంబర్‌తో పాటు సంతకం చేసిన స్కాన్డ్ కాపీలను ప్రభుత్వ అధికారిక ఇ–మెయిల్స్ ద్వారా మాత్రమే పంపించాలి. ► ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు అన్ని ప్రతిపాదనలను తప్పనిసరిగా డిజిటల్ ఆకృతిలో (పీడీఎఫ్) ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యూనికేషన్ విభాగం ఇ–మెయిల్ ఐడీ, ఇ–ఆఫీస్ వ్యవస్థలోని ఇ–డిస్పాచ్ ద్వారా లేదా అధికారిక ఇ–మెయిల్ ద్వారానే పంపాలి. భౌతిక ఆకృతిలో సమర్పించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోబడవు. డిజిటల్ ఫార్మాట్లో ప్రతిపాదనను సమర్పించడంలో జాప్యానికి సంబంధిత కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారిక ఇ–మెయిల్, ఇ–డిస్పాచ్ ద్వారా డిపార్ట్మెంట్లో స్వీకరించిన అన్ని ప్రతిపాదనలు, డిస్పాచ్ విభాగంలో సంబంధిత సిబ్బంది ఇ–రశీదులుగా మార్చి, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపాలి. ► ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా నివేదికలను డిజిటల్ ఫార్మాట్లో ఏకకాలంలో ఏపీ విజిలెన్స్ కమిషన్‌కు, సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలి. రిఫరెన్స్ కోసం నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి స్థూలమైన భౌతిక నివేదికను పంపాలి. ► సచివాలయాల శాఖలన్నీ తప్పనిసరిగా అన్ని సాధారణ ఉత్తర ప్రత్యుతరాలు (కరస్పాండెన్స్‌లు) డిజిటల్ ఫార్మాట్లో ఇ–డిస్పాచ్ ద్వారా ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యునికేషన్ విభాగాల అధికారికి పంపించాలి. డీవో లేఖలతో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలను సంబంధిత అధికారి అధికారిక ఇ–మెయిల్‌కు పంపాలి. -
పోలీసు ఉద్యోగార్థులకు వయో పరిమితి పెంపుపై గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఈ మేరకు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 18 నుంచి 26 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 21 నుంచి 29 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 21 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు తాజాగా వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మరింత మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. -
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం .. ఈ–కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్
సాక్షి, అమరావతి: ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేయనున్న 13వ విడత పీఎం కిసాన్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ–కేవైసీ ప్రక్రియ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం వెల్లడించింది. నెలాఖరులోపు పూర్తిచేయాలి : సీఎస్ అర్హులైన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 49,13,283 మంది ఉండగా, వారిలో ఈ నెల 21వ తేదీ వరకు 35,16,597 రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, 13,96,686 మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లో ఉందని సీఎస్ చెప్పారు. వారికి ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందేలా వెంటనే ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు 13వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
జవహర్‌రెడ్డిపై హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యంలో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలన్న తమ ఆదేశాలను గౌరవించకపోవడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమావేశం ఉందన్న కారణంతో కోర్టు ముందు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారా..అంటూ ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలు పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ రోజులో ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారో వివరాలు తెప్పించుకోగలమని తెలిపింది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించి మహోన్నత వ్యక్తులైన మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారే కోర్టు ముందు హాజరయ్యారని, వారికన్నా మీరు గొప్ప వారా అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో మిగిలిన అధికారులు హాజరు కావడం, పిటిషనర్‌కు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లించడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణమూర్తి అనే ఉద్యోగి తనకు 2005 నుంచి 2019 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు బకాయిల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. అధికారులు అమలు చేయలేదంటూ కృష్ణమూర్తి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, ఏలూరు జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు బకాయిలు ఎందుకు చెల్లించలేదో కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రావత్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. జవహర్‌రెడ్డి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌కు బకాయిలను చెల్లించినట్లు మిగిలిన అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి దానిని రికార్డ్ చేసి కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేశారు.