
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యంలో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలన్న తమ ఆదేశాలను గౌరవించకపోవడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమావేశం ఉందన్న కారణంతో కోర్టు ముందు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారా..అంటూ ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలు పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ రోజులో ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారో వివరాలు తెప్పించుకోగలమని తెలిపింది.
న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించి మహోన్నత వ్యక్తులైన మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారే కోర్టు ముందు హాజరయ్యారని, వారికన్నా మీరు గొప్ప వారా అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో మిగిలిన అధికారులు హాజరు కావడం, పిటిషనర్‌కు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లించడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణమూర్తి అనే ఉద్యోగి తనకు 2005 నుంచి 2019 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు బకాయిల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. అధికారులు అమలు చేయలేదంటూ కృష్ణమూర్తి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, ఏలూరు జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు బకాయిలు ఎందుకు చెల్లించలేదో కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రావత్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. జవహర్‌రెడ్డి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌కు బకాయిలను చెల్లించినట్లు మిగిలిన అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి దానిని రికార్డ్ చేసి కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment