ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు
చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పారు
తదుపరి చర్యలకు ముందు చట్టాన్ని అనుసరించాలని వారికి హైకోర్టు చెప్పింది
మా న్యాయవాది కోర్టు ఆదేశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు
అయినా పట్టించుకోకుండా దౌర్జన్యపూరితంగా కూల్చేశారు
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ కోర్టు ధిక్కార పిటిషన్
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా..
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్‌డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్‌సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.
క్రిమినల్ చర్యలు కూడా..!
ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment