office building
-
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్‌లోనే. దాంతో భారత్‌లో జెమ్ క్యాపిటల్‌గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్‌లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్‌చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్‌కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్‌కు ఆహ్వానించగా భారత్‌కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్‌లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్‌ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్‌ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్‌కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్‌హీట్‌ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్‌చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్‌ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్‌గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరు నెలల్లో ఏసీబీకి సొంత భవనం
- డీజీ ఆర్.పి.ఠాకూర్ - భవన నిర్మాణ పనుల పరిశీలన కర్నూలు : అవినీతి నిరోధక శాఖ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆ శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ శనివారం పరిశీలించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయించి కార్యాలయానికి సొంత భవనంలోకి మారుస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సి.క్యాంప్‌లోని క్వార్టర్స్‌లో ఏసీబీ కార్యాలయ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎ.క్యాంప్‌లోని సివిల్ సప్లయ్ గోడౌన్ పక్కన ప్రభుత్వం పది సెంట్ల స్థలం కేటాయించి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసింది. జి+1 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ శనివారం సాయంత్రం హైదరబాదు నుంచి కర్నూలు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఆలస్యం జరగవచ్చునని కాంట్రాక్టర్ వివరించగా ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గంగాధర్, డీఎస్పీ జయరామరాజు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, పోలీస్ హౌసింగ్ డీఈ సత్యనారాయణ, జేఈ శ్రీహరి, సీఐలు ఖాదర్ బాషా, నాగభూషణం, శ్రీనివాసరావు తదితరులు ఠాకూర్‌కు స్వాగతం పలికారు. -
జేడీఎస్‌లో ముసలం!
సాక్షి, బెంగళూరు: ‘మనవడి సినీ రంగ ప్రవేశానికి ఖర్చు పెట్టేందుకు రూ.60కోట్లున్నాయి. కానీ, ఒక కోటి రూపాయలతో ఆఫీసును నిర్మించేందుకు మాత్రం అందరూ చందాలేయాలా?’ ఇది ప్రస్తుతం జేడీఎస్ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. దేవెగౌడ మనవడు, హెచ్.డి.కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ రూ.60కోట్లతో సినిమా తీయనున్నారనే వార్తలు జేడీఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశాన్ని రగిలిస్తున్నాయి. నిఖిల్ గౌడను శాండల్‌వుడ్‌కు పరిచయం చేస్తూ, మునుపెన్నడూ శాండల్‌వుడ్ చరిత్రలో లేని విధంగా భారీ బడ్జెట్‌తో సినిమా చేయాలని హెచ్.డి.కుమారస్వామి భావిస్తున్నారు. ఇందుకు గాను రూ.60కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇక రేస్‌కోర్సులోని భవనంలో గత కొన్ని రోజుల వరకు తమ పార్టీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన జేడీఎస్ పార్టీ, సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవలే ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోనిృకష్ణా ఫ్లోర్‌మీల్ వద్ద జేడీఎస్ పార్టీ తన తాత్కాలిక కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించింది. ఒక చిన్న పాటి రేకుల షెడ్లో ఈ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీబీఎంపీ నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించాలన్నది జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ ఆలోచన. ఇక ఈ భవనాన్ని నిర్మించేందుకు గాను తన వద్ద కానీ, తన కుమారుల వద్ద కానీ డబ్బు లేదని దేవెగౌడ ప్రకటించడం విశేషం. ఇదే సందర్భంలో పార్టీ భవన నిర్మాణానికి గాను పార్టీ శ్రేయోభిలాషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర విరాళాలు ఇవ్వాలని సైతం దేవెగౌడ కోరారు. అంతేకాదు ప్రస్తుత తాత్కాలిక కార్యాలయ భవనం వద్ద విరాళాల సేకరణకు గాను ఓ హుండీని సైతం ఏర్పాటు చేయడం కొస మెరుపు. దీంతో దేవెగౌడ ద్వంద్వ నీతిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశం చెలరేగుతోంది. ‘మనవడి సినీరంగ ప్రవేశానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూనే, మరో వైపు పార్టీ భవన నిర్మాణానికి డబ్బు లేదనడం ఎంత వరకు సమంజసం?’ అనేది పార్టీ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. ‘పార్టీ భవన నిర్మాణానికి డబ్బు అవసరమైతే విరాళాలు ఇచ్చేందుకు మేము సిద్ధమే, అయితే అదే సందర్భంలో దేవెగౌడ లాంటి రాజకీయ వేత్త ఇలా ద్వంద్వ నీతిని అనుసరించడం మాత్రం ప్రజల్లోకి పార్టీపై వ్యతిరేక సందేశాన్నే తీసుకెళుతుంది’ అని పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు.