సాక్షి, బెంగళూరు: ‘మనవడి సినీ రంగ ప్రవేశానికి ఖర్చు పెట్టేందుకు రూ.60కోట్లున్నాయి. కానీ, ఒక కోటి రూపాయలతో ఆఫీసును నిర్మించేందుకు మాత్రం అందరూ చందాలేయాలా?’ ఇది ప్రస్తుతం జేడీఎస్ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. దేవెగౌడ మనవడు, హెచ్.డి.కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ రూ.60కోట్లతో సినిమా తీయనున్నారనే వార్తలు జేడీఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశాన్ని రగిలిస్తున్నాయి. నిఖిల్ గౌడను శాండల్‌వుడ్‌కు పరిచయం చేస్తూ, మునుపెన్నడూ శాండల్‌వుడ్ చరిత్రలో లేని విధంగా భారీ బడ్జెట్‌తో సినిమా చేయాలని హెచ్.డి.కుమారస్వామి భావిస్తున్నారు.
ఇందుకు గాను రూ.60కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇక రేస్‌కోర్సులోని భవనంలో గత కొన్ని రోజుల వరకు తమ పార్టీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన జేడీఎస్ పార్టీ, సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవలే ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోనిృకష్ణా ఫ్లోర్‌మీల్ వద్ద జేడీఎస్ పార్టీ తన తాత్కాలిక కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించింది.
ఒక చిన్న పాటి రేకుల షెడ్‌లో ఈ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీబీఎంపీ నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించాలన్నది జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ ఆలోచన. ఇక ఈ భవనాన్ని నిర్మించేందుకు గాను తన వద్ద కానీ, తన కుమారుల వద్ద కానీ డబ్బు లేదని దేవెగౌడ ప్రకటించడం విశేషం. ఇదే సందర్భంలో పార్టీ భవన నిర్మాణానికి గాను పార్టీ శ్రేయోభిలాషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర విరాళాలు ఇవ్వాలని సైతం దేవెగౌడ కోరారు. అంతేకాదు ప్రస్తుత తాత్కాలిక కార్యాలయ భవనం వద్ద విరాళాల సేకరణకు గాను ఓ హుండీని సైతం ఏర్పాటు చేయడం కొస మెరుపు.
దీంతో దేవెగౌడ ద్వంద్వ నీతిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశం చెలరేగుతోంది. ‘మనవడి సినీరంగ ప్రవేశానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూనే, మరో వైపు పార్టీ భవన నిర్మాణానికి డబ్బు లేదనడం ఎంత వరకు సమంజసం?’ అనేది పార్టీ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. ‘పార్టీ భవన నిర్మాణానికి డబ్బు అవసరమైతే విరాళాలు ఇచ్చేందుకు మేము సిద్ధమే, అయితే అదే సందర్భంలో దేవెగౌడ లాంటి రాజకీయ వేత్త ఇలా ద్వంద్వ నీతిని అనుసరించడం మాత్రం ప్రజల్లోకి పార్టీపై వ్యతిరేక సందేశాన్నే తీసుకెళుతుంది’ అని పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
జేడీఎస్‌లో ముసలం!
Published Tue, Mar 31 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement
Advertisement