ఇకపై ఉత్తర్వులు మౌఖికంగా ఇవ్వం
రాతపూర్వకంగానే జారీ చేస్తామని స్పష్టం చేసిన హైకోర్టు
నెల్లూరు మునిసిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టు విస్మయం
వైఎస్సార్‌సీపీ నేత భవనం కూల్చివేతపై పిటిషన్ మూసివేత
సాక్షి, అమరావతి : నెల్లూరులో వైఎస్సార్‌సీపీ నేత కె.బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో ఆ నగర మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భవనం విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప, రాతపూర్వక ఆదేశాలు కాదని, అందువల్లే భవనం కూల్చివేశామన్న కమిషనర్ వాదన హైకోర్టును ఒకింత షాక్‌కి గురి చేసింది.
ఈ కేసు తమకో గుణపాఠమని హైకోర్టు తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయబోమని, మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని, ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిట్ పిటిషన్‌లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
24 గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామంటూ నెల్లూరు మునిసిపల్ అధికారులు ఇచి్చన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబం«దీకులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. గత నెల 22న ఈ వ్యాజ్యం విచారణకు రాగా, తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ కార్పొరేషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
విచారణను గత నెల 24కి వాయిదా వేశారు. అయితే, 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల 27న ఆ భవనాన్ని కూల్చేశారు. 29న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, భవనం కూల్చివేత ఫొటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది సురేందర్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చిoది. సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దంటూ 22న కోర్టు మౌఖికంగానే ఆదేశించి, విచారణను 24కి వాయిదా వేసిందన్నారు. 23, 24 తేదీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, 27న కూల్చివేశామని చెప్పారు.
పిటిషనర్ల తరపున సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 24న పిటిషన్ విచారణకు రానందున నిర్మాణాలను తొలగించేందుకు 3నెలల సమయం కోరామని, ఆ మేర అఫిడవిట్ వేస్తామని కూడా చెప్పామని వివరించారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. 24 వరకే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారే తప్ప, రాతపూర్వక ఆదేశాలివ్వలేదని తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment