సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఊరట లభించింది. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈఓ ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేసు ఏమిటి?
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో జారీ చేసిన టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా తమ స్వర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
అయితే, హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం స్టే విధించటంతో ఊరట లభించింది.
ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్
Comments
Please login to add a commentAdd a comment